ముగ్గురు మృతి... నలుగురికి గాయాలు
పల్నాడు జిల్లాలో ఘటన
వేర్వేరు ప్రమాదాల్లో మరో ముగ్గురు మృతి
వినుకొండ (నూజెండ్ల): పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై కేవలం గంటల వ్యవధిలో జరిగిన ఈ ప్రమాదాలతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం..
చెట్టును ఢీకొన్న వాహనం
రూరల్ పరిధిలోని కొత్తపాలెం సమీపంలో టయోటా వాహనం అదుపు తప్పిచెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గుంటూరుకు చెందిన టీటీడీలో పనిచేసి పదవీ విరమణ చేసిన బ్రహ్మశ్రీ సోమాసి బాలగంగాధర్ శర్మ (69), ఆయన భార్య యశోద (67), డ్రైవర్ కట్టా నిర్మలరావు (45) అక్కడికక్కడే మృతి చెందారు.
అదే కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు హెచ్.వై.శర్మ, అతని భార్య సంధ్య తీవ్రంగా గాయపడగా, ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. వీరందరూ కర్ణాటకలోని బళ్లారి నుంచి శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకుని గుంటూరు వెళుతుండగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్వగ్రామానికి వెళ్తూ..
బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో నూజెండ్ల మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మీరావలి (25) స్వగ్రామం వెళుతుండగా మినీలారీ ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మీరావలి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు.
తండ్రీ కొడుకులు మృతి
అదే రహదారిలో వినుకొండ రూరల్ మండలం వద్ద.. ప్రకాశం జిల్లా ఉమ్మడివరం గ్రామానికి చెందిన మాలెపాటి పెదరామ కోటేశ్వరరావు(45) తన కుమారుడు అంజిబాబుతో (25) కలిసి వినుకొండ రూరల్ మండలం కొతపాలెం వస్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కోటేశ్వరరావు మృతి చెందగా కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. అంజిబాబును మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించగా చికిత్స పొందుతూ గుంటూరులో మృతిచెందాడు.
Comments
Please login to add a commentAdd a comment