ఉద్యమాలకు పుట్టిల్లు.. క్రీడలకు మెట్టినిల్లు | Achanta constituency | Sakshi
Sakshi News home page

ఉద్యమాలకు పుట్టిల్లు.. క్రీడలకు మెట్టినిల్లు

Published Sat, Apr 5 2014 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM

ఆచంటలో ఆచంటేశ్వరాలయం

ఆచంటలో ఆచంటేశ్వరాలయం

 ఆచంట, న్యూస్‌లైన్ : పచ్చని పంట పొలాలు.. పుడమి తల్లికి వింజామరలు పట్టినట్టుండే కొబ్బరి తోటలు.. గలగల పారే గోదావరి.. దీవుల్లాంటి లంక గ్రామాలు.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు.. ఆహ్లాదకర వాతావరణాల కలబోత ఆచంట నియోజకవర్గం. పల్లె ప్రాంతమైనా ఇక్కడి ప్రజలు మాత్రం పట్టణ వాసులకు దీటుగా రాజకీయ చైతన్యంతో వ్యవహరిస్తుంటారు. జిల్లాలోనే అత్యధికంగా కమ్యూనిస్టుల ప్రభావం కలిగిన నియోజకవర్గం ఇది.

 
 ఉద్యమాలకు పుట్టినిల్లుగా.. క్రీడలకు మెట్టినిల్లుగా భాసిల్లుతోంది. చరిత్రలో ప్రసిద్ధికెక్కిన కాళీపట్నం పోరాటం.. వ్యవసాయ కూలీ ఉద్య మం.. ఆకలి యాత్ర తదితర పోరాటాలలో ఈ ప్రాంతవాసులు ప్రధాన భూమికను పోషించారు. ఉద్యమాల్లో అమరులైన ప్రేరేప మృత్యుంజయుడు, ఒక తాళ్ల బసవ మల్లయ్య వంటి ధీరులెందరో పుట్టిన గడ్డ ఇది. రిజర్వుడు నియోజకవర్గమైన ఆచంట 1962లో ఏర్పడింది. 2009 పునర్విభజనలో జనరల్ కేటగిరీకి మారింది. పునర్విభజన అనంతరం నియోజకవర్గ స్వరూపమే మారిపోయింది.

 
 పెనుగొండ నియోజకవర్గం రద్దయి పెనుగొండ, పెనుమంట్ర, ఆచంట మండలాలతోపాటు పోడూరులో సగభాగంతో ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. ఇప్పటివరకూ  నియోజవర్గంలో 11సార్లు ఎన్నికలు జరగ్గా, అన్ని ప్రధాన పార్టీలను గెలిపించి ఆచంట ఓటరు తమ విలక్షణతను చాటుకున్నారు. ఇప్పటివరకూ ఒకసారి ఉభయ కమ్యూనిస్టు పార్టీ, మూడుసార్లు సీపీఎం, మూడుసార్లు టీడీపీ, నాలుగుసార్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందాయి. 286 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గానికి తూర్పున వశిష్ట గోదావరి, పడమర తణుకు నియోజకవర్గం, ఉత్తరాన ఎన్‌హెచ్-5 జాతీయ రహదారి, దక్షిణాన పాలకొల్లు నియోజకవర్గం సరిహద్దులుగా ఉన్నాయి.

 
 
 పెనుగొండలో ప్రసిద్ధి గాంచిన ఎస్‌వీకేపీ డిగ్రీ, పీజీ కళాశాలలు, ఆచంటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రైవేట్ డిగ్రీ కళాశాల, పోడూరులో కల్నల్ డీఎస్ రాజు పాలిటెక్నిక్ కళాశాల, పెనుమంట్ర మండలంలో రెండు ప్రైవేటు డిగ్రీ కళాశాలు, డైట్, బీఈడీ, పీఈటీ కళాశాలలు ఉన్నాయి. మార్టేరులోని వరిపరిశోధనా కేంద్రం రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. దేశంలోనే ప్రసిద్ధి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం, వాసవీధామ్, ఆచంటలోని జైన దేవాలయం, పెదమల్లంలో మాచేనమ్మ ఆలయం, ఆచంటలో ఆచంటేశ్వరస్వామి ఆలయం, పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలో నత్తా రామేశ్వరస్వామి, జుత్తిగలోని సోమేశ్వర ఆలయాలు పురాణ ప్రాశస్త్యం పొందారుు.
 
 క్రీడలకు స్ఫూర్తి
 
 క్రీడలకు, క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చే నియోజవర్గంగా ఆచంట వెలుగొందుతోంది. పరుగుల రాణి సత్తి గీత ఈ ప్రాంతానికి చెందినవారే. మార్టేరులో బాస్కెట్‌బాల్, ఆచంటలో వాలీబాల్ పోటీలను రాష్ట్రస్థారుులో నిర్వహిస్తుంటారు. అంతర్జాతీయ వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీల్లో నియోజకవర్గానికి చెందిన పలువురు క్రీడాకారులు విజేతలుగా నిలిచారు.
 
 ప్రస్తుత పరిస్థితి
 
 వైస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంది. పలువురు నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు వైఎస్సార్ సీపీలో చేరారు. పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన తాజా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆ పార్టీని వీడి టీడీపీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. పితాని చేరికతో టీడీపీలో వర్గపోరు మొదలైంది. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా వెలుగొందిన ఈ నియోజకవర్గంలో క్రమంగా ఆ పార్టీ పట్టు కోల్పోరుుంది. ప్రజా సమస్యలపై పోరాటాల ద్వారా ఆ పార్టీ ఉనికిని చాటుకుంటోంది.


 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో వెనుకబడిన తరగతులకు చెందిన పితాని సత్యనారాయణకు జనరల్ నియోజకవర్గమైన ఆచంట టికెట్ ఇచ్చి సుదీర్ఘ విరామం తరువాత తెలుగుదేశం కంచు కోటను బద్దలు కొట్టించారు. అంతే కాకుండా పితానికి తన మంత్రి వర్గంలో చోటు కల్పించారు.
 అంతకు ముందు 1967లో ఇక్కడి నుంచి గెలుపొందిన దాసరి పెరుమాళ్లు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement