communist
-
లంక కామ్రేడ్ల నుంచి స్ఫూర్తి పొందాలి!
భారత్ పొరుగు దేశమైన శ్రీలంకలో మార్క్సిస్టు నాయకులైన అనూర కుమార దిస్సనాయకే దేశ అధ్యక్షుడుగానూ, హరిణి అమరసూర్య ప్రధానమంత్రిగానూ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆసియా రాజకీయాల్లో పెను ఆసక్తికర, ఆహ్వానించదగిన పరిణామాలకు ఆస్కారం ఏర్పడింది. భారత దేశంలోని ఎన్డీయే– ఆరెస్సెస్ వినాశకర కూటమి ప్రభుత్వం శ్రీలంకలోని మితవాద పక్ష పాలకులతో ‘జోడీ’ కట్టి చిరకాలంగా వర్ధిల్లుతున్న భారత్–శ్రీలంక స్నేహ పూర్వక సంబంధాలలో ‘చిచ్చు’ పెట్టింది. ఈ విషమ పరిణామానికి సకాలంలో విరుగుడుగా వచ్చిందే సింహళంలో వామపక్ష పరిపాలన.శ్రీలంక సమగ్రాభివృద్ధిని కాంక్షించి, పాక్షిక ధోరణుల్లో గాక శ్రీలంక ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికారాన్ని చేపట్టారు మార్క్సిస్టు నాయకులు. అలాంటి పరిణామాన్నే భారతదేశంలోనూ ఆవిష్కరించగల అవకాశం ఉన్నా... చీలికలు పీలికలుగా ఉన్న వామపక్షాలు ఒకే తాటిపైకి రాలేకపోతున్నాయి. నాయకులు తమ పదవులను త్యజించి విస్తృత ప్రాతిపదికన ఒకే ఒక పార్టీగా ఆవిర్భవించడానికి కృషి చేయడంలేదు. ఎన్టీయే కూటమి దుష్ట ఇజ్రాయెల్‌తో కలిసి దేశంలోని ప్రగతివాద శక్తులపై నిఘాపెట్టి నానా ఇబ్బంది పెట్టిన చరిత్ర తెలియంది కాదు. ఈ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించుకోవాలంటే దేశంలోని వామ పక్షాలన్నీ ‘చిల్లర తగాదాలు’ మానుకుని ఐక్య వామపక్ష ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. ఇందుకు శ్రీలంక చూపిన ‘ఐక్య ఉద్యమ స్ఫూర్తి’ని భారత వామపక్షాలన్నీ తక్షణం పొందాల్సిన అవసరం ఉంది.ఇదే సందర్భంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దేశంలో ఆచరణలో నిజమైన ఫెడరల్ వ్యవస్థను పాదుకొల్పడానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య సమతులమైన అధికారాల పంపిణీ నొక్కి వక్కాణించారు. ఫెడరల్ వ్యవస్థ సూత్రాల ప్రకారం, కేంద్రం ఇప్పుడు రాష్ట్రాలనుంచి వసూలు చేస్తున్న సెస్‌లు, ఇతర పన్నులను అదే దామాషా ప్రకారం రాష్ట్రాలకు పంచి తీరాల్సిందేనని భట్టి కోరారు. దీన్నిబట్టి చూస్తే, ఇరుగు–పొరుగైన శ్రీలంకలో అంతటి భారీ స్థాయిలో వామపక్ష నేతల ఆధ్వ ర్యంలో క్రమానుగతంగా సాగక తప్పని పరిస్థితులు ఎందుకు వచ్చాయో భారత వామపక్షాల నేతలు కేవలం గుర్తించడమేగాదు, ఆచరణలో దేశంలో ఐక్య ఉద్యమ నిర్మాణానికి పునాదుల్ని పటిష్టం చేసుకొనక తప్పదు. ఇటాలియన్ మాఫియా నుంచి, ఇజ్రాయెల్ గూఢచారుల నుంచి భారతదేశ తక్షణ రక్షణకు దేశంలోని వామపక్షాలన్నీ సిద్ధం కావాలి. నిరుపేదలైన షెడ్యూల్డ్ తరగతులకు చెందిన అట్టడుగు వర్గాల ప్రజలపైనే 13 రాష్ట్రాలలో దారుణమైన అత్యాచారాలు నమోదయ్యా యని తాజా నివేదికలు సాధికారికంగా ప్రకటించాయి. వీటన్నింటికి ముగింపు ఎప్పుడు? ఫెడరల్ వ్యవస్థ పునరుద్ధరణ ద్వారానేనని ఆ నివేదికలు తెలియజేస్తున్నాయి.చదవండి: ఆంగ్లం లేకుండా ఎదగ్గలమా?ఎన్డీయే – ఆరెస్సెస్ కూటమి ప్రభుత్వ నాయకులు ఈ దశలో, ముఖ్యంగా చైతన్యశీలి అయిన ప్రస్తుత సుప్రీం ప్రధాన న్యాయమూర్తి 2025 నాటికి గానీ పదవీ విరమణ చేసే అవకాశం లేదు కాబట్టి, ఆ లోగా ‘ఒక దేశం, ఒకే ఎన్నిక, ఒకే ప్రధాని’ అన్న నినాదంతో ప్రస్తుత కేంద్ర పాలకులు ఏ అఘాయిత్యం చేసే అవకాశం లేదు. ఈలోపు దేశీయ వామపక్షాలు, సంబంధిత వర్గాలన్నీ ఒక్క తాటిపై కదిలి రాగల కార్యాచరణ వ్యూహానికి శ్రీకారం చుట్టాలి.శ్రీలంకలో కమ్యూనిస్టు – మార్క్సిస్టుల అను భవం సుదీర్ఘ కాలంలో నేటి అమూల్యమైన దీర్ఘకాలిక ఫలితాన్ని శ్రీలంక ప్రజలకు ప్రసాదించగల్గింది. లంక పరిణామం ఆసియాలోని చుట్టు పట్ల దేశాల ప్రజాబాహుళ్యానికి సహితం ఆదర్శంగా పరిణమించింది. భారత వామపక్షాలు ఈ అవకాశాన్ని అంది పుచ్చుకుని ఏకం కావాలి. శ్రీలంక వామపక్షాలు సాధించి ఆదర్శనీయమైన విజయం నుంచి భారత ప్రజల భవిష్యత్తుకు అనువైన ఉమ్మడి వ్యూహ రచనకు నడుం బిగించాలి. ఇందుకు మొదటి షరతుగా నాయకత్వం రూపకల్పనకు అవసరమైన వ్యూహాన్ని సమష్టిగా రూపొందించుకోవాలి. ఇది తప్ప మరో మార్గం లేదు. ఈ సందర్భంగా శ్రీలంకలో భారత మాజీ హైకమిషనర్‌గా పనిచేసిన గోపాలకృష్ణ గాంధీ శ్రీలంక పరిణామాల్ని సమీక్షిస్తూ... విప్లవాత్మక భావాలు మార్చుకోకుండానే ప్రజాస్వామిక ధోరణులు కూడా బలపడటానికి అనువుగా రాజకీయ పక్షాల సిద్ధాంత ధోరణులు కూడా ఉండాలనీ, ఈ ధోరణుల్ని శ్రీలంక వామపక్షాలు పెంచుకుంటూ మార్పునకు అనుగుణమైన వ్యూహరచనను ఆశ్రయించాయనీ అన్నారు. భారత్–శ్రీలంక సంబంధాలలో కూడా పెను మార్పులకు అవకాశం ఉందని గోఖలే ఆశాభావం వెలిబుచ్చారు.- ఏబీకే ప్రసాద్సీనియర్ సందకులు abkprasad2006@yahoo.co.in -
అంతులేని అనిశ్చితి!
అయిదేళ్ళలో అయిదో ప్రధానమంత్రి వచ్చారు. పొరుగున నేపాల్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ఇదే దర్పణం. అనుభవజ్ఞుడైన కమ్యూనిస్టు రాజకీయ నేత ఖడ్గ ప్రసాద్ (కె.పి) శర్మ ఓలీ నూతన ప్రధానిగా సోమవారం ప్రమాణస్వీకారం చేయడంతో... కష్టాల్లో ఉన్న తమ దేశానికి మంచి రోజులు రావచ్చేమో అని నేపాలీయులు ఆశగా చూస్తున్నారు. దేశంలోకి పెట్టుబడులు, దరిమిలా కొత్తగా ఉద్యోగాలొస్తాయని నిరీక్షిస్తున్నారు. అయితే ఓలీకి ఇది కత్తి మీద సామే. 2018లో లాగా ఆయనేమీ శక్తిమంతమైన కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి సారథ్యం వహించట్లేదు. ఇప్పుడాయన సంకీర్ణ ప్రభుత్వ సారథి. పైగా, సంకీర్ణంలో ఆయన పార్టీ మైనారిటీ. అది మరో బలహీనత. సైద్ధాంతికంగా పరస్పర విరుద్ధ భావాలున్న నేపాలీ కాంగ్రెస్ (ఎన్సీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్–యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్–యూఎంఎల్)లు రెండూ 2027లో ఎన్నికల వరకు ప్రధాని పదవిని సమాన కాలం పంచుకోవాలన్న అవగాహనతో అనైతికంగా జట్టు కట్టాయి. ఇది ఏ మేరకు ఫలిస్తుందో తెలీదు. అది నేపాల్ సమస్యనుకున్నా, చైనా అనుకూల ఓలీ గద్దెనెక్కడం భారత్‌కు ఇబ్బందికరమే! నేపాల్‌లో 239 ఏళ్ళ రాచరికాన్ని 2008లో రద్దు చేశారు. అదేమి శాపమో రాజరిక వ్యవస్థ రద్దయి రిపబ్లిక్‌గా మారినప్పటి నుంచి దేశం రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటూనే ఉంది. ఇప్పటికి 13 ప్రభుత్వాలు మారాయి. ఏణ్ణర్ధ కాలంలో నాలుగుసార్లు సభలో బలపరీక్షను తట్టుకొని బయట పడ్డ ప్రధాని, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ – మావోయిస్ట్ సెంటర్ (సీపీఎన్–ఎంసీ) నేత పుష్ప కమల్ దహల్ ప్రచండ శుక్రవారం జూలై 12న మాత్రం ఓడిపోయారు. అధికార సంకీర్ణ భాగస్వామి అయిన మితవాద సీపీఎన్– యూఎంఎల్ మద్దతు ఉపసంహరణతో ఆయనకు ఓటమి తప్పలేదు. 72 ఏళ్ళ ఓలీ నాయకత్వంలో కొత్త సంకీర్ణ సర్కార్ గద్దెనెక్కింది. ఇప్పుడొచ్చింది 14వ ప్రభుత్వం. ప్రధాని పదవి ఓలీకి కొత్త కాదు. ఆయన పగ్గాలు పట్టడం ఇది నాలుగోసారి. ఏ ప్రభుత్వం వచ్చినా నేపాల్‌లో వెంటాడే పాత సమస్యలు ఓలీకీ తప్పవు. మరో రెండు నెలల్లో పార్లమెంట్లో మెజారిటీ నిరూపించుకోవాల్సిన ఆయన పరస్పర విరుద్ధ సిద్ధాంతాలతో నిండిన కూటమితో ప్రభుత్వాన్ని ఎలా నడపగలరో చూడాలి. ప్రచండ ప్రభుత్వాన్ని కూల్చి, కొత్త కూటమి కట్టి దేశంలోని రెండు పెద్ద పార్టీలు ఎన్సీ, యూఎంఎల్ సాహసమే చేశాయి. సుపరిపాలన, రాజకీయ సుస్థిరతలో ఈ సంకీర్ణం విఫలమైతే అది మొత్తం రాజ్యాంగం, వ్యవస్థల వైఫల్యమేనని ప్రజలు భావించే ప్రమాదం ఉంది. నిజానికి, ప్రపంచంలోని అత్యంత నిరుపేద దేశాల్లో నేపాల్ ఒకటి. రాజకీయ అనిశ్చితి కారణంగా అక్కడ పెట్టుబడులు పెట్టేవారు కరవయ్యారు. ఫలితంగా ఆర్థికాభివృద్ధి కుంటుపడింది. లక్షలాది యువకులు ఉద్యోగం, ఉపాధి నిమిత్తం మలేసియా, దక్షిణ కొరియా, మధ్యప్రాచ్యం దారి పట్టారు. పరిస్థితి ఎంతదాకా వెళ్ళిందంటే, గద్దెనెక్కిన ప్రభుత్వాలేవీ దేశాభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేర్చ లేదు గనక మళ్ళీ రాచరికాన్నే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జనం అడపాదడపా నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. భారత్‌తో పాటు పొరుగున ఉన్న మరో పెద్ద దేశం చైనా సైతం నేపాల్ లోని రాజకీయ పరిణామాలను ఆది నుంచి ఆసక్తిగా గమనిస్తూ వస్తున్నాయి. ఈ హిమాలయ దేశాభి వృద్ధికి ఆర్థిక సాయం అందించి, ప్రాథమిక వసతి సౌకర్యాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ ప్రాంత భౌగోళిక రాజకీయాల్లో ప్రాబల్యం సంపాదించాలని సహజంగానే ఢిల్లీ, బీజింగ్‌ల యత్నం. భౌగోళికంగా భారత, చైనాల మధ్య చిక్కుకుపోయిన నేపాల్‌కు మొదటి నుంచి మనతో స్నేహ సంబంధాలు ఎక్కువే. కానీ గత దశాబ్ద కాలంలో ఆ పరిస్థితి మారుతూ వచ్చింది. కమ్యూనిస్ట్ నేత ఓలీ తొలివిడత నేపాల్ ప్రధానిగా వ్యవహరించినప్పుడు 2015–16లో చైనాతో ప్రయాణ, సరుకు రవాణామార్గ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫలితంగా, నేపాల్ విదేశీ వాణిజ్యంపై అప్పటి దాకా భారత్‌కు ఉన్న ఆధిపత్యానికి తెర పడింది. తాజాగా పడిపోయిన ప్రచండ సర్కార్ సైతం చైనా వైపు మొగ్గింది. నిన్న గాక మొన్న పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే ముందు ఆయన నేపాల్‌తో చైనాను కలిపే రైలు మార్గానికి పచ్చజెండా ఊపడం గమనార్హం. ఇది అనేక వందల కోట్ల డాలర్లతో డ్రాగన్ చేపట్టిన ప్రతిష్ఠాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్ట్స్ కింద కొస్తుంది. దీంతో నేపాల్ – చైనా సరిహద్దు వెంట వసతులు పెరుగుతాయని పైకి అంటున్న మాట. నిజానికి సరిహద్దులో చైనాకు పట్టు పెంచే ఈ చర్య భారత్‌కు తలనొప్పి!అసలు బీఆర్ఐ ప్రాజెక్టుల వెనక చైనా వ్యూహం వేరు. చిన్న చిన్న దేశాలకు పెద్దయెత్తున అప్పులిస్తూ, ఋణ దౌత్యం ద్వారా ఆ యా ప్రాంతాల్లో భౌగోళిక రాజకీయాల్లో పైచేయి సాధించడం డ్రాగన్ ఎత్తుగడ. అందుకే, ప్రపంచ దేశాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీర్ఘకాలంలో ఈ ప్రాజెక్ట్‌లు సంబంధిత చిన్నదేశాలకు భరించలేని భారమవుతాయి. చివరకు ఆ దేశాలు చైనా మాటకు తలూపాల్సి వస్తుంది. గతంలో చైనా ఇలాగే శ్రీలంకలో హంబన్‌తోట పోర్ట్‌కు ఋణమిచ్చింది. బాకీలు తీర్చడంలో విఫలమైన సింహళం చివరకు బాకీకి బదులు ఈక్విటీలిచ్చి, 2017లో ఆ పోర్ట్‌ను 99 ఏళ్ళ లీజుకు చైనాకు అప్పగించింది. ఇలాంటి కారణాల వల్లే బీఆర్ఐ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలున్నాయి. అలాగే బీఆర్ఐ కింద చైనా–పాక్ ఆర్థిక నడవా ప్రాజెక్ట్ అంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా దాన్ని చేపట్టడాన్ని భారత్ నిరసించింది. ఇప్పుడు భారత్ కన్నా చైనాకు మరింత సన్నిహితుడైన ఓలీ వల్ల నేపాల్ కూడా చైనా గుప్పిట్లోకి జారిపోవచ్చు. మనం తక్షణమే అప్రమత్తం కావాలి. మనతో సన్నిహిత సంబంధాలు కీలకమని ఓలీ గుర్తించేలా చేయాలి. ఓలీ సంకీర్ణంలో అధిక సంఖ్యాబలమున్న ఎన్సీ చిరకాలంగా భారత అనుకూల పార్టీ కావడం ఉన్నంతలో కొంత ఊరట. -
శ్రామిక వర్గ మహోపాధ్యాయుడు
ప్రపంచాన్ని మలుపుతిప్పిన ఘటనల్లో ఒకటి కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త కారల్ మార్క్స్ జననం. జర్మనీ (ప్రష్యా)లో పుట్టిన ఆయన విద్యాభ్యాసం అనంతరం పాత్రికేయ వృత్తిని ఎంచుకున్నారు. కొంతకాలం తర్వాత ఫ్రాన్స్ వెళ్ళారు. అక్కడే ఆయన జీవితకాల ఉద్యమ సిద్ధాంత మిత్రుడు ఫ్రెడరిక్ ఏంగిల్స్ను కలుసు కున్నారు. ఫ్రాన్స్ ఆయన్ని దేశం నుంచి బహిష్కరించడంతో ముందు బెల్జియం ఆ తర్వాత ఇంగ్లండ్ (లండన్) వెళ్లి మిగిలిన జీవితమంతా తన భార్యాబిడ్డలతో అక్కడే గడిపారు. మార్క్స్ తన జీవితకాల మిత్రుడు, సహచరుడు, సిద్ధాంతకర్త అయిన ఫ్రెడరిక్ ఏంగిల్స్‌తో కలిసి ‘కమ్యూ నిస్టు లీగు’ ఏర్పాటు చేసి 1848లో ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను ఏంగిల్స్‌తో కలిసి రాశారు. 1867లో ‘దాస్ క్యాపి టల్’ మొదటి వాల్యూమ్‌ను ప్రచురించారు.మానవ సమాజ సమూహ సంబంధాలు అన్నిటినీ కార్ల్ మార్క్స్ ‘ఫ్రెడరిక్ ఏంగిల్స్‌లు శాస్త్రీయంగా నిరూ పించారు. ఆదిమ కమ్యూనిస్టు సమాజం నుండి బానిస సమాజం, బానిస సమాజం నుండి ఫ్యూడల్ సమాజం, ఫ్యూడల్ భూస్వామ్య సమాజం నుండి పెట్టుబడిదారీ సమాజం, పెట్టుబడిదారీ సమాజం నుండి సోషలిస్టు సమాజానికి మానవ సమాజం ఎలా పరిణామం చెందు తుందో... సోషలిస్టు సమాజం నుండి అంతిమంగా కమ్యూనిస్టు సమాజం వైపు వర్గహిత సమాజం వైపు ఎలా మానవ సమాజం ప్రయాణిస్తుందో శాస్త్రీయంగా మార్క్స్–ఏంగెల్స్‌లు నిరూపించారు, సిద్ధాంతీకరించారు. మానవ సమాజ పరిణామ క్రమంలో శ్రమ పాత్రనూ, శ్రమ ఔన్నత్యాన్నీ, సర్వసంపదలకు శ్రమే మూలం అన్న విషయాన్నీ మొట్టమొదటిసారిగా ప్రపంచంలో సిద్ధాంతీకరించిన తత్వవేత్తలు కారల్ మార్క్స్, ఏంగెల్స్‌లు. కార్మికుని అదనపు శ్రమే ‘పెట్టుబడి’ అనే విషయాన్ని బహుముఖ కోణాల నుంచి పరిశోధన చేసి ‘దాస్ క్యాపిటల్’ను ప్రపంచానికి అందించారు. గతి తర్కాన్ని, చారిత్రిక భౌతిక వాదాన్నీ, తలకిందులుగా ఉన్న హెగెల్ తత్వ శాస్త్రాన్నీ, అందులోని భావవాదాన్నీ సరిదిద్ది భౌతిక వాదం తన కాళ్ళ మీద తను నిలబడే టట్లుగా రూపొందించారు మార్క్స్. అభివృద్ధి నిరోధకమైన పాత వ్యవస్థ, అభివృద్ధి కరమైనటువంటి కొత్త వ్యవస్థను అనుమతించదు. అందుచే బల ప్రయోగం ద్వారా పాత అభివృద్ధి నిరోధక వ్యవస్థను నెట్టివేయాలనీ, కూలదోయాలనీ మార్క్స్ శాస్త్రీయంగా వివరించారు. మార్క్స్ తదనంతరం పెట్టుబడిదారీ వ్యవస్థ సామ్రాజ్యవాద రూపం తీసుకున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నత రూపమే సామ్రాజ్యవాదం అని లెనిన్ సిద్ధాంతీకరించారు. మార్క్సిజాన్ని రష్యా పరిస్థితులకు అన్వయించి కార్మిక వర్గ నాయకత్వాన, కర్షకవర్గం మైత్రితో లెనిన్ సోషలిస్ట్ విప్లవాన్ని విజయవంతం చేశారు.– మన్నవ హరిప్రసాద్, సీపీఐ (ఎమ్ఎల్) రెడ్ స్టార్ పాలిట్ బ్యూరో సభ్యుడు(నేడు కారల్ మార్క్స్ జయంతి) -
అచ్యుతానందన్‌కు 100 ఏళ్లు
అలప్పుజ: కమ్యూనిస్టు కురువృద్ధుడు, కేరళ మాజీ సీఎం వెలిక్కకత్తు శంకర్ అచ్యుతానందన్ శుక్రవారంతో 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 2006–11 సంవత్సరాల్లో ఆయన సీఎంగా చేశారు. 1991 నుంచి 2016 దాకా మూడుసార్లు విపక్ష నేతగా ఉన్నారు. వీఎస్గా ప్రసిద్ధుడైన ఆయన 82 ఏళ్ల వయసులో సీఎం పదవి చేపట్టిన నేతగానూ రికార్డు సృష్టించారు. స్ట్రోక్ నేపథ్యంలో ఐదేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. చివరికి 2016 ఎన్నికల్లో కూడా కేరళలో వామపక్ష కూటమి వీఎస్నే ముందు పెట్టుకుని ప్రచారం చేసింది. కాంగ్రెస్‌ను ఓడించి అధికారం చేపట్టింది. అభిమానులు ఆయన్ను ఫిడెల్ క్యాస్ట్రో ఆఫ్ కేరళ అని పిలుచుకుంటారు. అలప్పుజ జిల్లా పున్నప్ర గ్రామంలో 1923లో జన్మించిన వీఎస్ 11 ఏళ్లప్పుడే కన్నవారిని పోగొట్టుకున్నారు. మరుసటేడే స్కూలు మానేసి అన్న టైలరింగ్ షాపులో పనికి కుదురుకున్నారు. 15 ఏళ్ల వయసులో కాంగ్రెస్‌లో చేరారు. రెండేళ్ల తర్వాత సీపీఐలోకి మారి పారీ్టలో చకచకా ఎదిగారు. 1964లో సీపీఐ నుంచి బయటికొచ్చి సీపీఎంను ఏర్పాటు చేసిన 32 మంది నేతల్లో వీఎస్ ఒకరు. పుట్టినరోజు సందర్భంగా పలువురు నాయకులు, ప్రముఖులు వీఎస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
కమ్యూనిస్టుల ఆశ తీరుతుందా?
-
Darshi Chenchaiah: ఆయన జీవితమే ఒక సందేశం
ఆయన జీవితం ఒక అద్భుతం. ఆయన పోరాటం అనన్యం. ఏకైక తెలుగు ‘గదర్’ వీరుడు. వ్యవసాయ శాస్త్రం చదవడానికని విదేశాలకు వెళ్ళి సమాజంలో అసమాన తలు చూసి చలించిపోయి విప్లవాన్ని విలక్షణంగా అధ్యయనం చేసిన ధీరుడు. తెలుగులోనే కాదు, యావత్ దేశంలోనే ప్రప్రథమ అరాచకవాద (అనార్కిస్ట్) తత్వవేత్తల్లో ఒకరు. విస్తృతమైన జీవితాను భవాలను అక్షరీకరించి ‘నేనూ–నా దేశం’ పేరిట అద్వితీయమైన ఆత్మకథను తెలుగు ప్రజకి అందించాడు. ఆయనే దరిశి చెంచయ్య. సామాన్య సంప్రదాయ కుటుంబంలో జన్మించి అసామాన్య యోధుడిగా ఎదిగిన ఆయన జీవితం ఎప్పటికీ నిత్య పఠనీయం. యావత్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి రాజకీయ డిటెన్యూగా దేశంలో ఆనాడు ఆయన్ని ఉంచని జైలు లేదంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్య్రోద్యమంలో అతివాద టెర్రరిస్టు కార్యకలాపాలలో పాల్గొనడమే కాక కాంగ్రెస్ నాయకుడిగా, గాంధేయవాదిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. సోషలిస్టుగా, కమ్యూనిస్టుగా, మానవతావాదిగా, సాహిత్యకారుడిగా, సామా జిక వేత్తగా, సంఘ సంస్కర్తగా, సాంస్కృతిక ఉద్యమకారుడిగా చెంచయ్య ప్రజ్ఞ బహుముఖం. చెంచయ్య ఆత్మకథ... అనేకమంది విప్లవ వీరులూ, స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రల సమాహారం. ఒక విధంగా చెప్పాలంటే సమకాలీన చరిత్రను రికార్డు చేసిన గ్రంథం. అందుకే తెలుగులో వచ్చిన ఆత్మకథల్లో అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా ఇది నిలుస్తుంది. సరిగ్గా 70 ఏళ్ళ క్రితం... 1952 సెప్టెంబర్‌లో మొదటిసారిగా ప్రచురించబడిన ‘నేను–నా దేశం’ గ్రంథాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఉరి కొయ్యలకు బలైపోయిన తన పంజాబ్ మిత్రుడు సర్దార్ బలవంత్ సింగుకూ, ఆయన భార్యకీ అంకితం ఇచ్చారు. నాకు తెలిసి తెలుగులో ఒక పంజాబ్ విప్లవ దంపతులకు అంకితమిచ్చిన ఏకైక తెలుగు స్వీయచరిత్ర ఇదే. అందుకే నార్ల ఈ పుస్తకానికి పీఠిక రాస్తూ, ‘‘శ్రీ చెంచయ్య గారి ‘నేనూ – నా దేశం’ నిస్సంశయంగా ఉత్తమ శ్రేణికి చెందిన ఆత్మకథ. నిజానికి అది ఆయన ఆత్మకథ కాదు; మన దేశ చరిత్ర. పోయిన అర్ధ శతాబ్దిలో మన దేశంలో ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో వచ్చిన ప్రతి మహోద్యమం చెంచయ్య జీవిత దర్పణంలో తన ప్రతిబింబాన్ని మిగిల్చింద’’ని అంటారు. స్వాతంత్య్ర సమరయోధుడు, ‘ప్రభవ’ పత్రిక వ్యవస్థాపకులు గద్దె లింగయ్య మొదటిసారి ముద్రించిన నాలుగొందల పుటల ఈ స్వీయచరిత్ర అద్భుతమైన విప్లవకారులు జితేంద్ర నాధ లాహిరీ నుండి మొట్టమొదటి భారతీయ అనార్కిస్టు, గొప్ప బౌద్ధ, భౌతికవాద రచయిత లాలా హర్ దయాళ్ వరకూ; జోధ్ సింగ్, చిదంబరం పిళ్లై, నీలకంఠ బ్రహ్మ చారి... వంటి అనేకమందీ మనకి పరిచయం అవుతారు. మొదటి వైశ్య వితంతు వివాహం మొదలు కొని వితంతు శిశు శరణాలయాల స్థాపన దాకా; ‘మా భూమి’ నాటక ప్రదర్శనలు, అమెరికా, జపాన్, చైనా, రష్యా, సింగపూర్ దేశాలలోని పరిస్థితులు, విప్లవ రాజకీయాల్ని కూడా ఇందులో మన కళ్ళకు కడతారు. ఇదంతా ఒక ఎత్తయితే మహామేధావి డాక్టర్ కేబీ కృష్ణతో చెంచయ్యకి ఉన్న అమితమైన స్నేహం ఒక్కటీ ఒకెత్తు. జైలులో ఉన్న సమయంలో కేబీ కృష్ణ మార్క్స్ ‘కేపిటల్’ గ్రంథం మీద అందరికీ క్లాసులు చెప్పే వారంటూ, ‘ఆయన శక్తి మాకు ఆశ్చర్యం కలిగించింది... ఆయన రాజకీయ ఆర్థిక శాస్త్రాలలో పారంగతుడు; వేదాంత శాస్త్రంలో అసమాన పాండిత్యం కలవాడు.. వారి సహాయంతో డిటెన్యూల క్యాంపు ఒక సర్వకళాశాలగానూ, విప్లవ కళాశాలగానూ మారిందని’ అంటారు చెంచయ్య. ‘నేను కమ్యూనిస్టు కావడానికి ముఖ్య కారణం స్త్రీల కష్టాలను తొలగించడానికి ప్రయత్నాలు చేసి, చేసి పూర్తిగా సాధించలేక పోవడం వల్ల కలిగిన అసంతృప్తి..’ అని రాసుకున్నారాయన. పది సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీలో ఉన్నప్పటికీ కమ్యూనిస్టు కాలేకపోయానని నిజాయితీగా రాసుకున్న నిజమైన కమ్యూనిస్టు ఆయన. బీడీ కార్మికులు, చుట్ట కార్మికులు, స్పెన్సర్ కంపెనీ కార్మికులు, కార్పొరేషన్ కార్మికులు, ఇంకా పారిశుద్ధ్య కార్మికులు వంటివారు చేసిన పోరాటాలు అన్నిం టిలోనూ క్షేత్ర స్థాయిలో పాల్గొన్న ఆయన ‘అభ్యుదయ రచయితల మహాసభ’ మొదలు ‘ప్రజానాట్యమండలి’ వరకూ అనేక ప్రజా సంఘాలతో మమేకమై పని చేశారు. వాటిల్లోని లోపాలను కూడా చాలా సూటిగా చెప్పారు, రాశారు. కనుకనే స్వీయచరిత్ర ముగిస్తూ ఈ దేశానికి, మన సమాజానికి, ‘ఒక మహత్తర సంస్కృతీ ఉద్యమము’ అవసరం అని ప్రత్యేకంగా నొక్కి వక్కాణించారు. (చదవండి: భరత జాతికి ఒక ఆంగ్ల నాడి) చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులకు తాళలేక, ఎవరి దగ్గరా చేయి చాచలేక ఇంట్లో సామానులు అమ్ముకున్న వైనం మనల్ని కదిలిస్తుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి చెంచయ్యకు తెలుగు నేలపై ఇప్పటికీ తగిన గుర్తింపు రాలేదనడం అవాస్తవం కాదు. 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆయన స్వీయ చరిత్ర ‘నేనూ– నా దేశం’ లోని కొంత భాగాన్నయినా విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టే దిశగా ప్రభుత్వం యోచన చేయాలి. - గౌరవ్ చెంచయ్య సాంస్కృతిక వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు (దరిశి చెంచయ్య స్వీయచరిత్ర ‘నేనూ – నా దేశం’తెలుగు లోకానికి అంది 70 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా) -
కమ్యూనిస్టు ప్రణాళిక ఘనత
విశ్వమానవ విముక్తి కోరే శక్తులంతా ఒక్కటై విప్లవోద్యమానికి పునరంకితమయ్యే దిశగా జరుగుతున్న ప్రయత్నం ప్రపంచ అరుణ గ్రం«థోత్సవం. ప్రపంచ గతిని మార్చిన కమ్యూనిస్టు ప్రణాళిక తొలిసారి పుస్తకరూపంలో విడుదలైన రోజు 1848 ఫిబ్రవరి 21. విశ్వవిపణిలో శ్రమ అమ్ముకోవటం తప్ప మరో జీవనాధారం లేని కోట్లాదిమందికి గొంతుకనిచ్చిన రచన మార్క్స్, ఏంగెల్స్ రాసిన కమ్యూనిస్టు ప్రణాళిక. ఈ ప్రణాళిక విడుదల దినోత్సవాన్ని ప్రపంచ అరుణ గ్రంథ దినోత్సవంగా ఇక నుంచి ప్రతి ఏటా ప్రపంచ ప్రజాతంత్ర విప్లవ శక్తులు జరుపుకోనున్నాయి. దాదాపు 170 ఏళ్లు దాటిన తర్వాత కూడా కమ్యూనిస్టు ప్రణాళికను ప్రపంచం ఎందుకు గుర్తు పెట్టుకుంది? ఇంతవరకు ప్రపంచానికి అందుబాటులోకి వచ్చిన కోటానుకోట్ల గ్రంథాల్లో వేల సంవత్సరాల ప్రజల చరిత్రను ప్రజల భాషలో వివరించిన ఏకైక గ్రంథం కమ్యూనిస్టు ప్రణాళిక. ప్రపంచంలో ఏ రోజైనా ఏ ఖండంలోనైనా పరీక్షకు నిలవగల సామాజిక చలన సూత్రాలను ప్రపంచానికి 34 పేజీల నిడివిలో అందించిన గ్రంథం ఇది. చారిత్రక భౌతికవాదం, గతితార్కిక భౌతికవాదం, రాజకీయ అర్థశాస్త్రం. ఈ మూడింటి సమాహారమే మార్క్సిజం. ఈ మూడు సూత్రాలు విశ్వవిజ్ఞానానికి తలుపులు తెరిచే తాళం చేతులు. ఈ తాళం చేతులు ఏ దేశ ప్రజలు ఒడిసి పట్టుకుంటారో వారే ఆ సమాజంలో జరుగుతున్న మాయలు, మర్మాలు, కుట్రలు, కుతంత్రాలు, మతం పేర ప్రాంతం పేర జరిగే అణచివేతలు, సంపద కేంద్రీకరణ వంటి అనేక దైనందిన సమస్యలకు మూలాలను గుర్తించగలుగుతారు. పిడికెడుమందికి ప్రపంచ సంపద కట్టబెట్టటానికి కోటానుకోట్లమందిని అదుపులో ఉంచాలన్న ప్రయత్నంలో వచ్చిందే రాజ్యం. పొత్తిళ్లలో ఉన్న దశ నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థ తన ప్రయోజనాలు కాపాడుకోవటానికి అడ్డువచ్చిన అన్నింటినీ దునుమాడుకుంటూ వెళ్లింది. సామ్రాజ్యవాదం, ప్రపంచీకరణ, స్వేచ్ఛావాణిజ్యం ఈ పెట్టుబడి ప్రయోజనాలు కాపాడేం దుకు పుట్టుకొచ్చిన వ్యవస్థలు. ఆయుధాలు. వీటి మాటున పెట్టుబడి సాగిస్తున్న దాడిని గుర్తించిన రోజున ప్రజలు తమ చరిత్రను తామే రాసుకుంటారు. ప్రతి సమాజంలోనూ విప్లవానికి అనుకూలమైన పరిస్థితులు ఆ సమాజపు గర్భంలోనే దాగి ఉంటాయి. వాటిని వెలికితీసి ప్రజల ముందుంచటమే విప్లవోద్యమాల కర్తవ్యం. పెట్టుబడిదారీ దోపిడీ మర్మాన్ని, ఈ దోపిడీ నుండి విముక్తి పొందే మార్గాన్ని విప్పి చెప్పే కమ్యూనిస్టు ప్రణాళికను లక్షన్నర కాపీలు ముద్రించి ప్రజలకు అందించటం ద్వారా ప్రపంచ అరుణ గ్రంథోత్సవాన్ని జరుపుకుంటున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని విముక్తి శక్తులు. తెలుగు సాహితీ చరిత్రలో ఓ పుస్తకం ఒకేసారి లక్షన్నర ప్రతులు అచ్చు కావటం ఇదే తొలిసారి. అటువంటి చరిత్రాత్మక గ్రం«థాన్ని ప్రజలకు తేలికపాటి భాషలో అందుబాటులో తెచ్చేందుకు జరుగుతున్న చారిత్రక ఉద్యమాన్ని ఆదరిస్తున్న తెలుగు పాఠకలోకానికి నమస్సుమాంజలులు. వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ‘ 98717 94037 కొండూరి వీరయ్య -
రాష్ట్రంలో టీడీపీ దుకాణం బంద్
సాక్షి, హన్మకొండ అర్బన్: రాష్ట్రంలో టీడీపీ దుకాణం బంద్ అయిందని, రానున్న రోజులు దేశంలో, రాష్ట్రంలో కమ్యూనిష్టులవే అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం హన్మకొండ వడ్డేపల్లి రోడ్డులోని విద్యుత్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీపీఎం ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి యువజన సమ్మేళనానికి వీరభద్రం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ధన బలంతో అధికారంలోకి వచ్చిందన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. సచివాలయం కూల్చివేతను అన్ని వర్గాలవారు వ్యతిరేకించాలని కోరారు. ముఖ్యంగా యువత మేల్కొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాములు, జిల్లా కార్యదర్శి సారంపెల్లి వాసుదేవరెడ్డి, నాయకులు జగదీష్, విజయ్, కోట రమేష్, బీరెడ్డి సాంబశివ, టి.ఉప్పలయ్య, తిరుపతి, రాగుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయం చూపాలి.. ప్రత్యమ్నాయం చూపకుండా దళితుల భూముల్ని లాక్కోవడం అన్యాయమని తమ్మినేని అన్నారు. హన్మకొండ న్యూశాయంపేటలోని దళితుల భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పడుక గదుల ఇళ్ల నిర్మాణానికి తీసుకోవడాన్ని నిరసిస్తూ, తమ భూమి తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ బాలసముద్రంలోని జయశంకర్ స్మృతి వనం వద్ద దళితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాలుగో రోజుకు చేరుకుంది. ఈ దీక్షలకు వీరభద్రం సంఘీభావం తెలిపారు. అప్పటి ప్రభుత్వం పేదల క్షేమం కోరి వారి అభ్యున్నతికి భూములు ఇస్తే ఆ భూమిని ఎలాంటి చర్చలు జరుపకుండా వారికి ప్రత్యమ్నాయ మార్గం చూపకుండా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు కేటాయించడంత ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాజీపేట మండల కార్యదర్శి యు.నాగేశ్వర్రావు, గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం జిల్లా కార్యదర్శి కాడబోయిన లింగయ్య, ప్రజా సంఘాల నాయకులు ఎండీ ఖాసీం, రమేశ్, సారంగపాణి, రవికుమార్ సంఘీభావం తెలిపారు. బాధితులు ఎం.కుమార్, కె.భిక్షపతి, వి.మల్లేశం, కె.శివ, బి.దయాకర్, సి.హచ్.శివశంకర్, జి.పద్మ, వి.మేరి, కళావతి, కె.సరిత, ఎం.రాజమణి, ఎం.వనమాల పాల్గొన్నారు. -
అనితరసాధ్యుడు.. కోదాటి రాజమల్లు
చెన్నూర్: మహాత్ముడి భావజాలానికి ఆకర్షితుడైన ఓ బాలుడు.. ఇంటిని వదిలి పోరుబాట పట్టాడు. స్వశక్తితో చదివి తిరిగి స్వస్థలానికి చేరుకొని స్థానికంగా కొనసాగుతున్న ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించాడు. సింగరేణి కార్మికుల హక్కుల సాధనోద్యమంలో కీలకంగా వ్యవహరించిన అతడు.. ఒకసారి ఎంపీగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించి అనితరసాధ్యుడిగా గుర్తింపు పొందాడు. చరిత్రే తన పేరును సగౌరవంగా ఉచ్ఛరించేలా చేసుకున్న ఉత్తమ ప్రజాప్రతినిధి ‘కోదాటి రాజమల్లు’ గురించి సంక్షిప్తంగా.. బాల్యం.. నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి తాలుకా అలిపురం చెందిన కోదాటి రాజయ్య, రాజవ్వ దంపతులకు 1924లో కోదాటి రాజమల్లు జన్మించారు. అప్పట్లో గ్రామంలో ప్లేగు వ్యాధి విజృంభించడంతో రాజమల్లు కుటుంబం ఖమ్మం జిల్లాలోని పునరావాస కేంద్రానికి వెళ్లిపోయి, కొంతకాలం అక్కడే ఉండిపోయింది. రాజమల్లు ఏడాది వయసున్నప్పుడు తండ్రి రాజయ్య ఉపాధి నిమిత్తం కొత్తగూడెంలోని ఇల్లంతకుంటకు వలసవచ్చారు. అక్కడ కూడా ఉపాధి దొరక్కపోవడంతో బెల్లంపల్లి ప్రాంతానికి చేరుకున్నారు. బెల్లంపల్లి బొగ్గు గనుల్లో రాజమల్లు తండ్రి రాజయ్య, తల్లి రాజమ్మ కలిసి పని చేశారు. కొంతకాలానికి రాజయ్యకు సింగరేణి గనిలో ఫోర్‌మన్‌గా ప్రమోషన్ రావడంతో రాజమ్మను పని మాన్పించి, కొడుకు రాజమల్లు బాగా చదివించాలని నిర్ణయించుకున్నారు. పోరాట ప్రస్థానం.. చిన్ననాటి నుంచే రాజమల్లు పరాయి పాలనను వ్యతిరేకించేవాడు. నిజాంకు వ్యతిరేకంగా ప్రచారం చేసేవాడు. ఈ క్రమంలో మహాత్మగాంధీ వార్ధా ఆశ్రమానికి వెళ్తున్నప్పుడు బెల్లంపల్లి స్టేషనులో రైలు ఆగినప్పుడు కాసేపు అక్కడ ప్రసంగించారు. ఆ ప్రసంగంతో ఉత్తేజితుడైన రాజమల్లు తర్వాతి కాలంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలను చైతన్యపర్చడంలో ఎక్కువ సమయం గడిపేవాడు. ఆయా సంఘాల నాయకులతో కలిసి రహస్యంగా సమీప అడవుల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ రూపొందించేవాడు. ఇదంతా రాజమల్లు తండ్రి రాజయ్యకు తెలియడంతో, ఆయన కొడుకు మందలించాడు. దీంతో తన ఉద్యమానికి కుటుంబం అడ్డురాకూడదని భావించిన రాజమల్లు ఎవరికీ చెప్పకుండా ఇంటిని వదిలి నేటి పాకిస్థాన్‌లోని లాహోర్‌కు వెళ్లిపోయాడు. అక్కడే కూలీనాలీ చేస్తూ బతకడమే కాకుండా బీఏ కూడా పూర్తి చేశాడు. ఆ తర్వాత తిరిగి బెల్లంపల్లిలోని సొంతింటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో తన చిన్ననాటి మిత్రుల ద్వారా సింగరేణి కార్మికుల కష్టాల గురించి తెలుసుకున్నాడు. అప్పుడే కార్మికుల హక్కుల కోసం పోరాడేందుకు ఓ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. సింగరేణి కార్మికులు యాజమాన్యాన్ని వ్యతిరేకించేలా వారిని చైతన్యపర్చాడు. రాజమల్లు చేస్తున్న తిరుగుబాటుకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి, అతన్ని నిర్భంధించేందుకు పూనుకోవడంతో నిరంతరం నిలకడలేని ప్రయాణాలు చేస్తూ వివిధ వేషాల్లో తలదాచుకున్నాడు. ఈ క్రమంలోనే రాజమల్లును మహారాష్ట్ర ప్రాంతంలో గుర్తించి అక్కడి ఔరంగబాద్ జైలులో నిర్బంధించారు. అనంతరం అండమాన్ జైలుకు తరలిస్తుండగా రాజమల్లు తప్పించుకొని కొంతకాలం రహస్య జీవనం సాగించాడు. 1948లో నిజాం పాలన అంతమవడంతో రాజమల్లు తిరిగి తన తోటి ఉద్యమకారులైన కేశవరావు, అర్జునరావు, వెంకటరావు, పాపయ్య, ఎ.రామిరెడ్డి, కేవీ మీన, పి.మాధవరెడ్డి, విశ్వనా«థ్, సోది రామయ్యతో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. అక్కడి నుంచి బెల్లంపల్లి చేరుకొని సింగరేణిలో టైమ్ కీపర్‌గా పని చేశాడు. రాజకీయ పథంలో.. 1952లో రాజకీయ ప్రవేశం చేసిన రాజమల్లు అదే ఏడాది కాగజ్‌నగర్, చెన్నూర్ ఉమ్మడి నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ నుంచి పోటీ చేసి ఎస్సీ రిజర్వేషన్‌తో రాజమల్లు, జనరల్ కోటాలో విశ్వనాథసూరి గెలుపొందారు. అనంతరం 1962, 1967, 1972 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వరుస ఘన విజయాలతో హ్యాట్రిక్ సాధించారు. తర్వాత 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పోటీ భారీ మెజార్టీతో గెలుపొందారు. రాజమల్లు చెన్నూర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పని చేసి.. చెన్నూర్, బెల్లంపల్లిలో ప్రాంతాల్లో పలు ప్రభుత్వ ఆసుపత్రుల ఏర్పాటుకు కృషి చేసి ప్రజల మన్ననలు అందుకున్నారు. కార్మికులకు కొండంత అండగా.. ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధితోపాటు బొగ్గు గని కార్మికుల హక్కుల కోసం కూడా రాజమల్లు కృషి చేశారు. బొగ్గు గని కార్మిక చరిత్రలో నిలిచిపోయేలా 1956లో ఆయన నేతృత్వంలో ఓ సుదీర్ఘ పోరాటం కూడా జరిగింది. రాజమల్లు ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు తమ హక్కుల కోసం 57 రోజులపాటు సమ్మె చేశారు. కార్మికులకు వేతనం పెంపు, మృతి చెందితే నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతోపాటు 47 డిమాండ్లు నెరవేర్చాలని రాజమల్లు నిరహార దీక్షకు దిగారు. సమ్మె కొనసాగుతున్నా యాజమాన్యం స్పందించకపోవడంతో కార్మికులు రెచ్చిపోయి సింగరేణి సంస్థకు చెందిన పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పోలీసులు కార్మికులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్‌లు చేసినా రాజమల్లు సైన్యం దీక్షను విరమించకపోవడంతో సింగరేణి యాజమాన్యమే 21 రోజుల తర్వాత దిగివచ్చి 37 డిమాండ్లను అంగీకరించింది. ఇలా తన జీవితమంతా పోరాట పథంలో గడిపిన కోదాటి రాజమల్లు ఎంపీగా కొనసాగుతుండగానే 1983లో ఫిబ్రవరి 20న గుండెపోటుతో ఆకస్మికంగా తనువు చాలించారు. ఆయనకు భార్యతోపాటు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. -
సీపీఎం నేత జక్కా వెంకయ్య కన్నుమూత
-
సీపీఎం సీనియర్ నేత జక్కా వెంకయ్య కన్నుమూత
నెల్లూరురూరల్: సీపీఎం సీనియర్ నేత, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ వ్యవస్థాపక నేతల్లో ఒకరైన జక్కా వెంకయ్య (88) అనారోగ్యంతో మంగ ళవారం కన్నుమూ శారు. ఐదు రోజుల క్రితం ఆయనకు గుండె సమస్య తలెత్తడంతో స్థానిక సింహపురి స్పెషాలిటీ ఆస్ప త్రిలో సీపీఎం నాయకులు వైద్యం కోసం చేర్పిం చారు. పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం 10 గంటలకు తుది శ్వాస విడిచారు. దక్షిణభారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్యకు వరుసకు సోదరుడయిన జక్కా వెంకయ్య ఆయన సహచరుడిగా అనేక ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు. సీపీఎం కేంద్ర కమిటీలో పనిచేశారు. జిల్లాలో భూపోరాటాలకు కేంద్రబిం ధువుగా నిలిచారు. పేదలకు వేలాది ఎకరాలు భూములు దక్కేందుకు కారణమయ్యారు. రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన సారా వ్యతిరేక ఉద్యయంలో కీలకపాత్ర పోషించారు. జక్కా వెంకయ్య రాసిన రాజకీయ ‘అర్ధశాస్త్రం, అదనపు విలువ–శ్రమ దోపిడీ’ అనే పుస్తకాలు విస్తృత పాఠకాదరణ పొందాయి.ఉద్యమకారులకు కరదీపికలుగా ఉపయోగపడ్డాయి. జక్కా వెంకయ్య నెల్లూరు జిల్లా దామరమడుగులో జక్కా రమణయ్య, శంకరమ్మ దంపతులకు 1930 నవంబర్ 3వ తేదీన జన్మించారు.1948 నుంచి 1951 వరకు కమ్యూనిస్టు పార్టీ నిషేధ సమయంలో రహస్యంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. దామరమడుగు గ్రామంలో పార్టీ నేతలకు రక్షణ కల్పించారు. అప్పటి ప్రభుత్వం ఆయనను 15 రోజులు జైలుకు పంపించింది. 1956లో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.1964లో కమ్యూనిస్టు పార్టీ చీలికతో సీపీఎంలో చేరారు. 1965లో డిటెన్యూగా రాజమండ్రి జైలులో సంవత్సరం ఐదునెలల జైలు జీవితం గడిపారు. 1975 ఎమెర్జెన్సీలో డిటెన్యూగా 17 నెలలు నెల్లూరు జైలులో ఉన్నారు. అక్కడ గౌతు లచ్చన్న, సత్యనారాయణరెడ్డి తదితరులకు రాజకీయ తరగతులు బోధించారు. 1985,1994లో అల్లూరు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995 నుంచి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా దీర్ఘకాలం పనిచేశారు. 2002లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పలువురి సంతాపం సీపీఎం సీనియర్ నేత జక్కా వెంకయ్య మృతికి సీపీఎం రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఆయన మృతి పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని నివాళులు అర్పించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు విజయవాడలో ఓ ప్రకటన విడుదల చేశారు.జక్కా వెంకయ్య మృతికి సంతాప సూచకంగా రాష్ట్ర కార్యాలయంపై అరుణపతాకాన్ని అవనతం చేసినట్టు తెలిపారు.పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు తమ సంతాపాన్ని తెలియజేశారు. సీపీఐ రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది.పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఓ ప్రకటనలో నివాళులు అర్పించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్‌రెడ్డితో పాటు వివిధ పార్టీకు చెందిన నాయకులు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
నాడూ నేడూ రేపూ మార్క్సిజం అజేయమే
అమెరికాలో పొడసూపుతున్న తాజా ఆర్థిక సంక్షోభం పాశ్చాత్య దేశాల్లోని ఆర్థికవేత్తలు మార్క్సిస్ట్ ఆర్థికవ్యవస్థను పునరావిష్కరించేలా పురిగొల్పింది. పైగా, మార్క్సిజం నేపథ్యంలోనే కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం కింద నేపాల్ నూతన రిపబ్లిక్‌గా పరిణమించింది. మార్క్సిజం మార్గదర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు స్ఫూర్తిదాయకంగా అన్యాయాలు, దోపిడీకీ వ్యతిరేకంగా పోరాడుతున్న ఘటనలు మార్క్సిజం నేటికీ ప్రాసంగికమే అనే అంశాన్ని తిరుగులేనివిధంగా రుజువు చేస్తున్నాయి. కార్ల్‌మార్క్స్ జన్మించిన 200 సంవత్సరాల తర్వాత కూడా మార్క్సిజం ప్రాసంగికత గురించి మనం నేటికీ చర్చిస్తున్నామంటేనే ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సిద్ధాంతంగా మార్క్సిజం ప్రాసంగికత తిరుగులేని విధంగా రుజువవుతోందని మనం చెప్పవచ్చు. మార్క్సిస్ట్ సిద్ధాంతం ప్రాతిపదికన ఏర్పడిన తొలి సోషలిస్టు దేశం సోవియట్ యూనియన్ ప్రపంచ పటం నుంచి మాయం కావడం, పోలెండ్, తూర్పుజర్మనీ వంటి తూర్పు యూరప్‌కి చెందిన సోషలిస్టు దేశాలు విచ్ఛిన్నమైపోవడం వంటి పరిణామాలతో కమ్యూనిజం వ్యతిరేకులు మార్క్సిజాన్ని కించపర్చడమే కాదు.. దాని ప్రాసంగికతనే తోసిపుచ్చేంతవరకు వెళ్లారు. వియత్నాం, క్యూబా వంటి దేశాలు ఇంకా సోషలిస్టు దేశాలుగా కొనసాగుతున్నప్పటికీ మార్క్సిజంపై దుష్ప్రచారం కొనసాగించారు. ఈ దేశాలు కూడా వ్యక్తిగత ఆస్తి విషయంలో కాస్త సడలింపు నిచ్చి, సొంత ఆస్తిని అట్టిపెట్టుకోవడాన్ని కొంతమేరకు అనుమతించడమే కాకుండా అక్కడ చేపట్టిన కొన్ని సంస్కరణలు కూడా అవి ఇక ఏమాత్రం స్వచ్చమైన సోషలిస్టు దేశాలు కావనే అభిప్రాయం కలిగించి మార్క్సిజాన్ని, దాని ప్రాసంగితను తృణీకరించడానికి కారణమయ్యాయి. ప్రపంచంలోని పలు దేశాల కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు అంగీకరించకపోయినప్పటికీ, ప్రస్తుత చైనాను కూడా సోషలిస్టు దేశంగానే చాలామంది భావిస్తున్నారు. అదేసమయంలో సోషలిస్ట్ శిబిరమే ఉనికిలో లేదని, మార్క్సిజం ఒక సిద్ధాంతంగా కాలం చెల్లిపోయిందని చెబుతుండటం సరైంది కాదు. మరోవైపున మార్క్సిజం, సోషలిజంలకు ప్రాసంగికతే లేదని, అవి గతించిన చరిత్రలో భాగమైపోయాయని మార్క్సిజం విమర్శకులు ప్రచారం సాగిస్తున్నారు. దీనికి భిన్నంగా మార్క్సిస్ట్ గతితార్కిక పంథాలో చారిత్రక భౌతిక అభివృద్ధి క్రమం సరైందేనని సోషలిస్టు దేశాలు ఆవిర్భవించినప్పటినుంచి రుజువు చేస్తూ వచ్చాయి. పైగా నెలలు నిండకముందే బిడ్డ పుట్టినట్లుగా సోషలిజానికి కావలసిన ముందస్తు షరతులు ఉనికిలోకి రాకముందే ఏర్పడిన సోషలిస్టు దేశాల అభివృద్ధి మొత్తంమీద ఉత్తమంగానే కొనసాగిందని అంచనా వేయవచ్చు. కమ్యూనిస్టు విప్లవాన్ని సమాజం సంపూర్ణ అభివృద్ధి సాధించిన అనంతరం ఉనికిలోకి వచ్చే అంశంగా మార్క్స్ ప్రతిపాదించారు. కానీ తమ దేశాల్లో భూస్వామ్య సమాజాన్ని ఇంకా కూలదోయక ముందే సోషలిస్టు దేశాలు ఉనికిలోకి వచ్చాయి. ఈ పరిమితుల్లో కూడా ఈ దేశాలు మానవులకు ఉత్తమమైన భౌతిక జీవన సంస్కృతిని ప్రపంచం ముందు ప్రదర్శించి చూపాయి. ప్రత్యేకించి సోషలిస్టు దేశాల కూటమి వల్లే ప్రపంచం ఫాసిజం, నాజీయిజం బారి నుంచి తప్పించుకుంది. అమెరికాలో పొడసూపుతున్న తాజా ఆర్థిక సంక్షోభం పాశ్చాత్య దేశాల్లోని ఆర్థికవేత్తలు మార్క్సిస్ట్ ఆర్థిక వ్యవస్థను మళ్లీ కనుగొనేలా పురిగొల్పింది. పైగా, మార్క్సిజం నేపథ్యంలోనే కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం కింద నేపాల్ నూతన రిపబ్లిక్‌గా పరిణమించింది. మార్క్సిజం మార్గదర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు స్ఫూర్తిదాయకంగా అన్యాయాలు, దోపిడీకీ వ్యతిరేకంగా పోరాడుతున్న ఘటనలు మార్క్సిజం నేటికీ ప్రాసంగికమే అనే అంశాన్ని తిరుగులేనివిధంగా రుజువు చేస్తున్నాయి. మన దేశం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటి పలు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల్లో వెనకపట్టు పట్టినా, త్రిపురలో తాజాగా కమ్యూనిస్టు వ్యతిరేకులు అంతర్జాతీయ కమ్యూనిస్టు నేతలైన లెనిన్ వంటి వారి విగ్రహాలను కూలదోసి పైశాచికానందం పొందినా దేశాభివృద్ధి దిశగా జరుగుతున్న ఏ ప్రగతిశీల కార్యాచరణ లేక చర్చలోనైనా సరే మార్క్సిజం తనదైన ప్రభావం కలిగిస్తూనే ఉంది. మార్క్సిజం ఇప్పటికీ అవసరమేనన్నది నిజం.దేశంలోని కొన్ని ప్రత్యేక పరిస్థితులకు చెందిన భౌతిక వాస్తవికతను లోతుగా అధ్యయనం చేయడంలో మార్క్సిజం నేటికీ ప్రాధాన్యతను సంతరించుకోవడం విశేషం. మార్క్సిజం ఇప్పటికీ భారత్‌లో మూలాల్లో బలపడకపోవడానికి దేశ వస్తుగత, భౌతిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితిని అంచనా వేయలేక పోవడమే కారణమని చెప్పవచ్చు. ఈ శతాబ్ది తొలి రెండు దశాబ్దాల్లో మార్క్సిస్ట్ నాయకుల పరిమితులను మనం అర్థం చేసుకోవచ్చు కానీ అదే సమయంలో మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని వ్యాప్తి చెందించడంలో వారి అమూల్యమైన దోహదాన్ని తప్పక పరిగణించాల్సి ఉంటుంది. దేశరాజకీయాల్లో మొదటినుంచి బలమైన ప్రభావం వేస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ వంటి నేతలు సైతం యుఎస్ఎస్ఆర్ కమ్యూనిజంచే ప్రభావితులయ్యారు. హింసతో పని లేకుండా శాంతి యుతంగా కమ్యూనిజాన్ని సాధించగలిగితే దాన్ని రెండు చేతులతోనూ ఆహ్వానిస్తానని గాంధీ సైతం ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు.మార్క్సిజాన్ని విజయవంతంగా అమలు చేయడంలో కీలకమైన అంశం కార్మికవర్గ ఐక్యత. ప్రపంచ కార్మికులారా ఏకం కండి. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అంటూ మార్క్స్ ఇచ్చిన నినాదం కూడా కార్మిక వర్గం బలానికి ఆధారం ఐక్యతే అని తేల్చి చెబుతోంది. ఈ ఐక్యత సాధించనిదే కమ్యూనిస్టు విప్లవాన్ని గెలుచుకోలేం. చివరగా కమ్యూనిస్టు ప్రణాళికలో మార్క్స్ చేసిన వ్యాఖ్యను మనం తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. అభివృద్ధి చెందిన పశ్చిమ యూరప్‌ను దృష్టిలో పెట్టుకుని మార్క్స్, ఏంగెల్స్ కమ్యూనిస్టు ప్రణాళికను రూపొందించారు. నిర్దిష్ట సమాజ భౌతిక వాస్తవికతను బట్టి కమ్యూనిస్టులు తమ ఆచరణలో మార్పులు చేసుకోవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా మన దేశ సామాజిక నిర్మాణం ఇప్పటికీ కుల వ్యవస్థ రూపంలో ఘనీభవించిన సామాజిక సంబంధాలతో కూడి ఉంది. భాష, పర్యావరణం, ఆర్థికాభివృద్ధి, సాంప్రదాయాలు, సంస్కృతుల వంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్న జాతుల కలయికే భారతదేశం. భారత కమ్యూనిస్టు గ్రూపులతో కలిసి పోరాడుతున్న ప్రజానీకంలోని అనైక్యత కారణంగా సహజంగానే మార్క్సిజం ప్రాసంగికమైనది కాదని ఎవరికైనా అనిపించవచ్చు. అందుకే ఐక్య కమ్యూనిస్టు ఉద్యమం భారత విప్లవాన్ని ఐక్యపర్చడమే కాకుండా, భారత జాతీయ లక్షణాలకు చెందిన వాస్తవికతను కూడా పరిగణిస్తుందని ఆశిస్తున్నాను. మన దేశంలో మార్క్సిజానికి ప్రాసంగికత ఉంటుందని రుజువు చేయడంలో భారతీయ కమ్యూనిస్టులు విజయం పొందుతారని భావిస్తున్నాను. కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఇదే సరైన సమాధానంగా ఉంటుంది. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్ : 98480 69720 -
200 నాట్ అవుట్
నేడు మార్క్స్‌ను తలుచుకోవలసిన సందర్భం. సరిగ్గా రెండు వందల ఏళ్ల క్రితం 1818 మే 5న మార్క్స్ జన్మించారు. ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి. పోరాడితే పోయేదేమీ లేదు సంకెళ్లు తప్ప’ అనే మాట వినే ఉంటారు. అది మార్క్స్‌దే! ‘నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అనే మాట కూడా! నిజానికి ఈ మాట శ్రీశ్రీదే కానీ.. 1848లో మార్క్స్ రాసిన ‘కమ్యూనిస్టు మ్యానిఫెస్టో’లో తొలి వాక్యంలోని భావన ఇదే. ‘ఇప్పటి వరకు నడిచిన సమాజ చరిత్ర అంతా వర్గ సంఘర్షణల చరిత్రే’ అన్నారు అందులో మార్క్స్. డబ్బుల్లేని తండ్రికి కొడుకు కార్ల్ మార్క్స్‌ది జర్మనీ. తండ్రి న్యాయవాది. కేసులైతే వచ్చేవి కానీ, డబ్బులు వచ్చేవి కాదు. అలా పేదరికంలో పెరిగిన మార్క్స్ తన భార్యా పిల్లలకూ పేదరికాన్నే వారసత్వంగా ఇవ్వగలిగారు. మార్క్స్ చదివింది కూడా న్యాయశాస్త్రమే. కానీ హెగెల్, ఫ్యూయర్‌బాక్‌ల సిద్ధాంతాలు ఆయన్ని ‘సోషల్ ఫిలాసఫీ’వైపు దారి మళ్లించాయి. 1841లో మార్క్స్ జెనా విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. తర్వాత 1843లో కొంతకాలం కోలోన్లోని ఒక వార్తాపత్రి కకు సంపాదకత్వం వహించారు. అనంతరం భార్య జెన్నీతో కలసి విప్లవభావాలకు నెలవై వున్న పారిస్‌ను చేరుకున్నారు. అక్కడే మార్క్స్ అతివాద కమ్యూనిస్టుగా మారారు. ఆ క్రమంలోనే ఏంగెల్స్‌తో ఆయనకు పరిచయం అయింది. మార్క్స్ భావజాలాన్ని ప్రమాదకరమైన ధోరణిగా భావించిన ఫ్రాన్సు అతడిని దేశం నుంచి బహిష్కరించింది. అక్కడి నుంచి మార్క్స్ బ్రస్సెల్స్ చేరుకున్నారు. తర్వాత 1849లో లండన్ వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. దిగులుతో కుంగిపోయిన భర్త చివరి దశలో మార్క్స్ అనేక ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఏంగెల్సే మార్క్స్‌ని ఆదుకున్నాడు. 1881లో భార్య మరణించాక మార్క్స్ బాగా కుంగిపోయారు. తర్వాత మళ్లీ కోలుకోలేదు. లండన్‌లో ఆయనకు అంత్యక్రియలు జరిపిస్తున్న సమయంలో ఏంగెల్స్ ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. ‘‘ఈ మధ్యాహ్నం వేళ ఒక గొప్ప ఆలోచనాశీలి ఆలోచించడం మానేశాడు. మేము ఆయన చెంతన లేని రెండు నిమిషాల్లోనే మా నుంచి సెలవు తీసుకున్నారు. కుర్చీలో కూర్చున్న మనిషి, కూర్చున్నట్లుగానే ఈ లోకాన్ని వీడిపోయారు’’ అని ఏంగెల్స్ గద్గద స్వరంతో అన్నారు. శక్తిమంతుడైన స్నేహితుడు మార్క్స్, ఏంగెల్స్ ఇద్దరూ మంచి మిత్రులు, ఆలోచనాశీలురు. మార్క్స్ ప్రభావం ఏంగెల్స్‌పై ఎంతగా ఉండేదంటే ఏంగెల్స్ జీవితాంతం మార్క్స్ అనుచరుడిగానే ఉండిపోడానికి ఇష్టపడ్డాడు. అందుకే చూడండి. మార్క్సిజం ఉంది కానీ, ఏంగెలిజం లేదు. వాస్తవానికి కూడా ఏ ఇజాన్నైనా, ఏంగెలిజాన్నయినా తనలో కలుపుకునే శక్తి మార్క్సిజంలో ఉంది. అందుకే మార్క్స్ సైద్ధాంతికంగా బలవంతుడయ్యాడు. భౌతికంగా కూడా అతడు బలిష్టుడే. దృఢకాయంతో, పెద్దగా ఛాయలేని శరీరంతో మొరటు మనిషిలా ఉండేవారట మార్క్స్! -
కేసీఆర్‌ను కమ్యూనిస్టు అనడం హాస్యాస్పదం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అసలైన కమ్యూనిస్టు అని మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత పేర్కొనడం హాస్యాస్పదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. సమస్యలపై నిరసనలు తెలిపే అవకాశం లేకుండా ఇందిరా పార్క్ ధర్నాచౌక్ ను ఎత్తేసి ప్రజాస్వామ్యం గొంతు నులిమారని ధ్వజమెత్తారు. బీసీలకు గొర్రెలిస్తే కమ్యూనిస్టు అవుతారా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు మావోయిస్టుల ఎజెండానే తమ ఎజెండా అని ప్రకటించి ఆ తర్వాత వారిని ఎన్కౌంటర్ చేయడమే కమ్యూనిస్టు లక్షణమా అని నిలదీశారు. ధర్నాచౌక్ తరలింపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. -
‘కేసీఆర్ అసలైన కమ్యూనిస్టు నేత’
-
ఎరుపెక్కిన వెలుగోడు
- చండ్ర పుల్లారెడ్డి శత జయంతి ఉత్సవాలు ప్రారంభం - వేడుకలకు హాజరైన కమ్యూనిస్టు అగ్రనాయకులు వెలుగోడు: విప్లవ సేనాని, కమ్యూనిస్టు అగ్రనేత చండ్ర పుల్లారెడ్డి శత జయంతి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణంలో ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన కమ్యూనిస్టు నాయకులతో పట్టణంలో సందడి నెలకొంది. అరుణోదయ కళాకారుల విప్లవ గీతాలు, నృత్య ప్రదర్శనలతో పట్టణ ప్రజలు మంత్రముగ్ధులయ్యారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు, అరుణోదయ కళాకారులు భారీ ప్రదర్శన చేపట్టారు. పురవీధుల గుండా విప్లవ గీతాలు ఆలపిస్తూ, నృత్యాలు చేస్తూ ఆత్మకూరు రోడ్డులోని చండ్ర పుల్లారెడ్డి స్థూపం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించి, సీపీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చండ్ర పుల్లారెడ్డి అమర్హై..జోహార్ సీపీ అంటూ నినదించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శత జయంతి సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) న్యూ డెమెక్రసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టాన్యా మాట్లాడుతూ వెలుగోడులో జన్మించిన చండ్ర పుల్లారెడ్డి జాతీయోద్యమంలో కీలకపాత్ర పోషించడం గర్వించదగ్గ విషయమన్నారు. తన జీవితాన్ని ప్రజా సేవకు, పోరాటాలకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. చండ్ర పుల్లారెడ్డి శత జయంతి ఉత్సవాలు ఏడాది పాటు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చిట్టిపాడు వెంకటేశ్వర్లు, ప్రగతిశీలా మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ, రాష్ట్ర నాయకులు సాగర్, ప్రసాద్, మోజేష్, ఉరుకుందరావు, రామకృష్ణ, గనిబాబు తదితరులు పాల్గొని చండ్ర పుల్లారెడ్డి పోరాటాలను కొనియాడారు. -
ధిక్కారానికి ప్రతీక..ఉడుకు రక్తానికి ఉత్తేజం
కాలపరీక్షకు నిలిచి గెలిచిన శిఖరం కాలంతోపాటే మార్పులు సహజం. ఇరవయ్యో శతాబ్దంలోనే ఉచ్ఛస్థితికి చేరిన కమ్యూనిజం ప్రపంచవ్యాప్తమై... అదే శతాబ్దంలో ప్రభావం కోల్పోయే దశకు చేరింది. కమ్యూనిస్టుల కంచుకోటలు కూలిపోయారుు. సోవియట్ ముక్కలైంది. చైనా సైతం కమ్యూనిస్టు పంథా నుంచి ఓపెన్ మార్కెట్ వైపు మళ్లింది. రెండు కమ్యూనిస్టు ప్రబల శక్తులు ప్రపంచీకరణ ప్రభంజనంలో మనుగడ సాగించడానికి తమ సిద్ధాంతాలను వదులుకొన్నా... పెట్టుబడిదారుల పెద్దన్న, అగ్రరాజ్యం అమెరికాకు పక్క నుంచే సవాలు విసురుతూ.. ఐదు దశాబ్దాల సుదీర్ఘకాలం కమ్యూనిజాన్ని శ్వాసించిన ధీశాలి! గుబురు గడ్డం, ఆలివ్‌గ్రీన్ మిలటరీ దుస్తులు, నోట్లో సిగార్... ఆ రూపం ధిక్కారానికి ప్రతీక! తిరగబడే ఉడుకురక్తానికి ఒక ఉత్తేజం!! అంతా తానే అనుకునే అమెరికా గుండెల్లో దశాబ్దాలుగా మోగుతున్న ‘ఫిరంగి’. ఆయనే ఫిడెల్ క్యాస్ట్రో. పాశ్చాత్యదేశాల్లో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని నెలకొల్పి.. కాల పరీక్షకు నిలబడి గెలిచాడు. - సాక్షి నాలెడ్‌జ సెంటర్ మిత్రులతో కలిసి మిలటరీ స్థావరంపై దాడి 1952 మార్చి 10న దేశాధ్యక్షుడు కార్లోస్ ప్రియో ప్రభుత్వంపై సైనిక తిరుగుబాటు జరిగింది. ఫుల్జెన్షియో బటిస్టా అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. అమెరికాకు సన్నిహితంగా ఉంటూ సోషలిస్టు సంస్థ, ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడం మొదలుపెట్టాడు. సాయుధ తిరుగుబాటు ద్వారానే మిలటరీ పాలకులను దించగలమని భావించిన ఫిడేల్.. ఒరియెంటే ఫ్రావిన్సలోని మోంకాడా మిలటరీ స్థావరంపై అనుచరులతో కలిసి దాడి చేశాడు. మిలటరీ సాయుధ సంపత్తిని కొల్లగొట్టి ప్రభుత్వంపై తిరుగుబాటుకు ఆయుధాలను సమకూర్చుకోవాలనేది ఆయన ఆలోచన. అరుుతే ఈ ప్రయత్నంలో అతని బృందం విఫలమైంది. ఫిడేల్ ప్రభుత్వ బలగాలకు పట్టుబడ్డాడు. 15 ఏళ్ల శిక్ష..19 నెలలకే విడుదల ప్రభుత్వ బలగాలకు పట్టుబడిన క్యాస్ట్రోను విచారించారు. 15 ఏళ్ల జైలుశిక్ష విధించారు. అరుుతే విచారణ సందర్భంగా సైన్యం అరాచకాలను ఎలుగెత్తి చాటడం, దానికి విదేశీ మీడియా మంచి ప్రాధాన్యం ఇవ్వడంతో ఫిడేల్ ప్రాచుర్యంలోకి వచ్చాడు. 19 నెలల జైలు జీవితం తర్వాత 1955లో ప్రభుత్వ క్షమాభిక్ష ద్వారా విడుదలయ్యాడు. జైల్లో ఉన్నకాలంలోనే భార్య బలార్ట్కు విడాకులిచ్చాడు. మార్క్సిజాన్ని లోతుగా అధ్యయనం చేశాడు. విడుదలయ్యాక మెక్సికో వెళ్లాడు. అక్కడే యువ పోరాటయోధుడు ఎర్నెస్టో చేగువెరాను కలిశాడు. బటిస్టా ప్రభుత్వాన్ని కూల్చే లక్ష్యంతో జూలై ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. 1956 డిసెంబరు 2న 82 మందితో చిన్న నౌకలో బయలుదేరి క్యూబాలోని ఒరియెంటే ఫ్రావిన్సకు చేరుకున్నాడు. బటిస్టా సైన్యంతో జరిగిన పోరాటంలో ఫిడేల్ క్యాస్ట్రో, చేగువెరా, రౌల్ క్యాస్ట్రోలతోపాటు మరో 9 మంది మాత్రమే ప్రాణాలతో మిగిలారు. మిగతా వారు దొరికిపోవడమో లేదా ప్రాణాలు కోల్పోవడమో జరిగింది. తోటి విప్లవకారులతో కలిసి సైన్యం కంటపడకుండా ఫిడేల్... సియర్రా మాయెస్ట్రా పర్వతశ్రేణిలో ఆశ్రయం పొందాడు. అక్కడి నుంచే రెండేళ్లపాటు బటిస్టా ప్రభుత్వంపై గెరిల్లా దాడులు కొనసాగించాడు. ఈ క్రమంలో బటిస్టాను వ్యతిరేకించే శక్తులు, సంస్థలకు ఫిడేల్ తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. ఆయన జీవితం ఓ దర్పణం క్యాస్ట్రో జీవితం...20వ శతాబ్దంలో చోటుచేసుకున్న ఎన్నో పరిణామాలకు దర్పణం. విప్లవోద్యమాలు, ప్రజా తిరుగుబాట్లు, ప్రచ్చన్న యుద్ధం, పాశ్చాత్య-తూర్పు దేశాల మధ్య అంతరాలు, ఉత్తర అమెరికా-దక్షిణ అమెరికా మధ్య వైరం, కమ్యూనిజం- పెట్టుబడిదారీ విధానం మధ్య ఘర్షణ... ఇలా ఎన్నో పరిణామక్రమాలు. వీటన్నింటినీ చూశాడాయన. కాలగమనంలో ఎన్నో ఆటుపోట్లు.. కుట్రలు కుతంత్రాలు.. కానీ క్యాస్ట్రోలో మార్పులేదు. నేటికీ ఆయన తిరుగుబాటు ప్రతీక. కమ్యూనిజం పతనమైనా.. తట్టుకొని నిలబడ్డ కమ్యూనిస్టు. వలసొచ్చిన స్పానిష్ రైతు బిడ్డ స్పెరుున్ నుంచి వలస వచ్చిన ధనిక రైతు ఏంజెల్ మరియా బౌటిస్టా క్యాస్ట్రో క్యూబాలోని ఓరియెంటే ఫ్రావిన్సులోని బిరాన్ సమీప ప్రాంతంలో స్థిరపడ్డాడు. లీనా రుజ్ గొంజాలెజ్ ఇతని తోటల్లో పనిచేసేది. ఈమెకు ఏంజెల్ మరియాతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఫలితంగా 1926 ఆగస్టు 13న ఫిడేల్ అలెజాండ్రో క్యాస్ట్రో రుజ్ (ఫిడేల్ క్యాస్ట్రో) జన్మించాడు. ఫిడేల్ పుట్టాక అతని తల్లిదండ్రులు పెళ్లిచేసుకున్నారు. క్యాస్ట్రో చదువుల్లో చురుకుగా ఉండేవాడు.. మంచి అథ్లెట్ కూడా. బేస్‌బాల్‌పై అమితాసక్తి. 1945లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించడానికి హవానా యూనివర్సిటీలో చేరాడు. అక్కడే యువ క్యాస్ట్రోకు పలు రకాల భావాజాలాలతో, సిద్ధాంతాలతో పరిచయం ఏర్పిడింది. కమ్యూనిజంపై వర్సిటీ ప్రాంగణంలో విసృ్తత చర్చలు జరిగేవి. లా చదువును మధ్యలోనే వదిలేసి 1948లో కొలంబియాలో అమెరికాకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో పాల్గొన్నాడు. కొలంబియా అధికారుల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో క్యూబా విద్యార్థులు కొలంబియాలోని తమ దేశ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు. అనంతరం క్యాస్ట్రో హవానాకు తిరిగి వచ్చి ‘లా’ కోర్సును కొనసాగించాడు. ఆర్టాడోక్సో పార్టీకి చెందిన జనాకర్షక నేత ఎడ్యురాడో చిబాస్కు అభిమానిగా మారాడు. ఆర్థిక స్వాతంత్య్రం, రాజకీయ స్వేచ్ఛ, సామాజిక న్యాయం, అవినీతి నిర్మూలన చిబాస్ పార్టీ ప్రధాన ఆశయాలుగా ఉండేవి. న్యాయశాస్త్రం చదువుతుండగానే క్యాస్ట్రో ఫిలాసఫీ విద్యార్థిని మిర్టా డియాజ్ బలార్ట్ను పెళ్లాడాడు. ఈమె సంపన్న రాజకీయవేత్త కూతురు. ఉన్నతవర్గాలతో పరిచయం ఏర్పడినా... అటువైపు కాకుండా క్యాస్ట్రో కమ్యూనిజం వైపు మళ్లాడు. దేశ ఆర్థిక సమస్యలన్నింటికీ విశృంఖల పెట్టుబడిదారీ వ్యవస్థే కారణమని విశ్వసించేవాడు. లా కోర్సు పూర్తయ్యాక ప్రాక్టీసు ప్రారంభించినా పెద్దగా నడవలేదు. క్యాస్ట్రోపై అప్పుల భారం ఉండేది. అరుునా ఏ దశలోనూ రాజకీయ కార్యకలాపాలను వదల్లేదు. హింసాత్మకంగా మారిన పలు నిరసన ప్రదర్శనల్లో క్యాస్ట్రో పాల్గొన్నాడు. తిరుగుబాటుతో అధికారం హస్తగతం 1959 జనవరి 2న క్యాస్ట్రో నేతృత్వంలో 9 వేల మందితో కూడిన తిరుగుబాటు దళాలు రాజధాని హవానాలోకి ప్రవేశించారుు. అధికారాన్ని హస్తగతం చేసుకున్నారుు. బటిస్టా పారిపోగా... వందల కొద్దీ అతని మద్దతుదారులకు మరణశిక్ష పడింది. క్యాస్ట్రో ప్రధానమంత్రి అయ్యారు. 1976లో రాజ్యాంగాన్ని మార్చి ఫిడేల్ అధ్యక్షుడయ్యారు. 1959 ఫిబ్రవరి 15న తన తమ్ముడు రౌల్ క్యాస్ట్రోను సైనికదళాల చీఫ్ కమాండర్‌గా నియమించాడు. అత్యంత జనాకర్షక నేతగా, అనర్గళంగా ఉపన్యాసాలిచ్చే ఫిడేల్... ప్రజలకు భూమిని తిరిగి ఇచ్చేస్తానని, పేదల హక్కులు కాపాడతానని హామీ ఇచ్చాడు. బటిస్టా అనుచరులు చట్టవిరుద్ధంగా కూడబెట్టిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1960లో క్యూబాలోని అమెరికా వ్యాపారాలన్నింటినీ జాతీయం చేశాడు. ప్రతిచర్యగా 1961 జనవరి 3న అప్పటి అమెరికా అధ్యక్షుడు ఐసన్‌హోవర్ క్యూబాపై ఆంక్షలు విధించారు. అమెరికాకు కొరకరాని కొయ్యలా.. 1961లో ప్రవాస క్యూబన్లతో తిరుగుబాటు సైన్యాన్ని ఏర్పరచి ఫిడేల్ క్యాస్ట్రో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అమెరికా ప్రయత్నించి విఫలమైంది. ఇక అప్పటినుంచి క్యాస్ట్రో అగ్రరాజ్యానికి కొరకరాని కొయ్యగా మారాడు. బటిస్టాకు వ్యతిరేకంగా పనిచేసిన సాయుధ గ్రూపులు, సంస్థలన్నింటినీ క్యాస్ట్రో ఏకం చేశాడు. ఇవన్నీ కలిసి 1965లో ‘కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ క్యూబా’ ఏర్పడింది. ఏకపార్టీ వ్యవస్థ నెలకొంది. మరోవైపు అమెరికా ఆంక్షల నేపథ్యంలో క్యూబా ఇతర దేశాలతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. సోవియట్ యూనియన్ అధ్యక్షుడు కృశ్చేవ్తో క్యాస్ట్రో బంధం బలపడింది. 1962లో రష్యా ... కూబ్యా గడ్డపై క్షిపణులను మొహరించడంతో 13 రోజుల పాటు ప్రపంచం అణుయుద్ధం భయంతో వణికిపోరుుంది. మూడో ప్రపంచయుద్ధం వస్తుందనే ఆందోళన నెలకొంది. అరుుతే అమెరికాతో కుదిరిన రహస్య సయోధ్య కారణంగా రష్యా మిస్సైల్స్‌ను ఉపసంహరించడంతో ఉద్రిక్తలు తగ్గారుు. అరుుతే ప్రపంచ రాజకీయ చిత్రపటంపై కమ్యూనిస్టు యోధుడిగా క్యాస్ట్రో ప్రతిష్ట పెరిగింది. అలీనోద్యమంలో ముఖ్య పాత్ర చక్కెర పరిశ్రమలను జాతీయం చేయడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, ముఖ్యంగా ప్రజలందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడంతో క్యూబన్లలో క్యాస్ట్రో ప్రతిష్ట ఇనుమడించింది. మరోవైపు సోవియట్‌తో సన్నిహితంగా ఉంటూనే అలీనోద్యమంలో క్యూబా ముఖ్యపాత్ర పోషించింది. లాటిన్ అమెరికా దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని తిరుగుబాట్లకు మద్దతు ఇవ్వకుండా 1964 తర్వాత రష్యా కొంతవరకు క్యూబాను కట్టడి చేసింది. అరుుతే క్యాస్ట్రో ఇతర ఖండాల్లో విప్లవోద్యమాలకు మద్దతును ఆపలేదు. 1966లో ఆసియా- ఆఫ్రికా, లాటిన్ అమెరికా సాలిడారిటీ ఆర్గనైజేషన్‌ను ప్రారంభించారు. బొలీవియాలో 1967లో చేగువెరా తిరుగుబాటు విఫలమైంది. చే హతమయ్యాడు. క్యాస్ట్రో తన పంథా వీడలేదు. అంగోలాలో మార్క్సిస్టు గెరిల్లాలకు మద్దతుగా 15 వేల మంది సైన్యాన్ని పంపాడు. 1977లో ఇథియోపియాకు సైనికులను పంపాడు. పలుదేశాలకు వైద్యులను పంపి సాయం చేశాడు. అండగా సోవియట్ అమెరికా ఆంక్షల నేపథ్యంలో సోవియట్ యూనియన్ 1960ల నుంచే క్యూబాకు దన్నుగా నిలిచింది. ఆర్థిక సహాయం చేయడమే కాకుండా... క్యూబా ఉత్పత్తి చేసిన చక్కెరలో (దేశానికి ఇదే ప్రధాన ఆదాయవనరు) సింహభాగాన్ని కొనుగోలు చేసింది. అమెరికా మిత్రదేశాల వ్యాపార ఆంక్షల వల్ల ఇబ్బందిపడుతున్న క్యూబాకు కావాల్సిన ఆహారపదార్థాలు, వస్తువులు అందజేసింది. దీంతో రగిలిపోయిన అమెరికా హత్యాయత్నాలకు తెగించింది. సోవియట్ పతనం తర్వాత.. గోర్బచేవ్ సమయానికి సోవియట్ పరిస్థితి తారుమారైంది. క్యూబా నుంచి చక్కెర కొనుగోలును నిలిపివేసింది. సోవియట్ పతనం తర్వాత క్యూబా ఆర్థిక పరిస్థితి దిగజారింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోయారుు. దీనికి అమెరికా ఆంక్షలే కారణమని క్యాస్ట్రో విమర్శించేవాడు. క్యాస్ట్రో పాలన ముగిస్తే తప్ప ఆంక్షల ఎత్తివేత ఉండదని అమెరికా స్పష్టం చేసింది. 2000 జూలైలో అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా క్యాస్ట్రో క్యూబా చరిత్రలోనే పెద్ద ర్యాలీ తీశారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకులు లేకుండా చూసు కోవడంలో క్యాస్ట్రో నిర్దయగా వ్యవహరించారు. క్యూబా పర్యటనకు వెళ్లిన పోప్ జాన్‌పాల్-2 మానవ హక్కుల ఉల్లంఘటనపై క్యాస్ట్రో సమక్షంలోనే విమర్శలు సంధించారు. తర్వాత క్యూబా మనుగడ కోసం క్యాస్ట్రో కొన్ని రంగాల్లో సంస్కరణలను ప్రవేశపెట్టారు. అమెరికా ‘పక్కలో బల్లెం’ ఆదిలోనే బెడిసికొట్టాయి.. క్యూబాలో అంతర్భాగమైన గాంటనామా బేను అమెరికాకు శాశ్వతంగా లీజుకు అద్దెకిచ్చాక.. దాదాపు 50 ఏళ్లపాటు అమెరికా ప్రభుత్వం, కంపెనీలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి, తిరుగుబాట్లు రాకుండా చూశారుు. 1946లో అరుుతే అమెరికా నేర సామ్రాజ్య నేతలు క్యూబా రాజధాని హవానాలో సమావేశాలు జరిపేవారు. 1959లో క్యూబా నియంత ఫల్జెన్సియో బటిస్టా ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చిన క్యాో్ట్ర సర్కారును మొదట అమెరికా గుర్తించింది. క్యాస్ట్రో కమ్యూనిస్టు పోకడలు, 500 మందికి పైగా బటిస్టా మద్దతుదారులను విప్లవకారులు కాల్చి చంపడంతో అమెరికాకు అనుమానాలు ఎక్కువయ్యారుు. అప్పట్లోనే అధికార పీఠమెక్కిన క్యాస్ట్రో అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆయన్ను కలవడానికి అగ్రరాజ్య నేత ఐసెన్‌హోవర్ నిరాకరించారు. చివరికి ఉపాధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌ను కలిసి క్యాస్ట్రో హవానాకు వెనుదిరిగివచ్చారు. అలా ఆదిలోనే మంచి సంబంధాలకు పునాదులు పడలేదు. అమెరికా ఆస్తుల జాతీయం! 1960లో అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత క్యాస్ట్రో సర్కారు.. క్యూబాలోని ప్రైవేటు భూములను హస్తగతం చేసుకుంది. అమెరికా బడా కార్పొరేషన్ల అనుబంధ కంపెనీలు సహా వందలాది ప్రైవేటు కంపెనీలను జాతీయం చేసింది. దాంతో 1961లో క్యూబాతో అమెరికా అన్ని దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకుంది. ఐసెన్‌హోవర్ తర్వాత అధ్యక్షుడైన జాన్ కెన్నడీ1962 ఫిబ్రవరిలో క్యూబాపై ఆంక్షలు విధించారు. బే ఆఫ్ పిగ్స్ లో దెబ్బపడింది! 1961 జనవరి 20న అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన వెంటనే జాన్ ఎఫ్ కెన్నడీ సీఐఏ తోడ్పాటుతో జరిపిన ‘బే ఆఫ్ పిగ్స’ దాడి ఘోరంగా విఫలమైంది. 1961 ఏప్రిల్ 17న ‘బ్రిగేడ్ 2506’ పేరుతో క్యూబా నుంచి గతంలో పారిపోరుు వచ్చిన సాయుధులతో ఓ పారామిలటరీ దళాన్ని సీఐఏ ఏర్పాటు చేసింది. ఆ దళాన్ని క్యూబాలోని బే ఆఫ్ పిగ్స ప్రాంతంలో దింపి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. అరుుతే క్యూబా దళాలు మూడు రోజుల్లో ఈ కిరారుు సేనలను ఓడించాయి. తప్పిన అణుయుద్ధం సోవియట్ యూనియన్ క్యూబాలో క్షిపణుల మోహరింపు పరిణామాల తర్వాత 13 రోజులపాటు రెండు అగ్రరాజ్యాలు, క్యూబా ప్రజలేగాక యావత్ ప్రపంచం తీవ్ర ఉత్కంఠకు గురైంది. రెండు అగ్ర రాజ్యాల మధ్య అణు యుద్ధం తప్పదని అందరూ భయపడ్డారు. క్యూబాలోకి మరిన్ని సోవియట్ క్షిపణులు ప్రవేశించకుండా అమెరికా యుద్ధనౌకలు క్యూబాను చుట్టుముట్టారుు. మోహరించిన క్షిపణులను కమ్యూనిస్ట్ రష్యాకు తిరిగి పంపేయాలని అమెరికా షరతు పెట్టింది. క్యూబా నుంచి క్షిపణులు తొలగిస్తే.. టర్కీ, ఇటలీ నుంచి అమెరికా క్షిపణులు తొలగిస్తామన్న కెన్నడీ ప్రతిపాదనను సోవియట్ నేత నికితా క్రుశ్చేవ్ అంగీకరించడంతో అణుయుద్ధ ప్రమాదం తప్పింది. చివరికి 2008లో అమెరికాలో రిపబ్లికన్ల పాలనకు తెరపడి ఒబామా అధ్యక్షుడవ్వడంతో అమెరికా, క్యూబాల మధ్య మామూలు సంబంధాలకు మార్గం సుగమమైంది. ఒబామా క్యూబా గడ్డపై అడుగుపెట్టారు. దీంతో రెండు దేశాల మధ్య దశాబ్దాల వైరానికి తెరపడింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో మనం విన్న మాటలు.. అమెరికా పక్కలో బల్లెం క్యూబా. అమెరికా అట్లాంటిక్ తీర రాష్ట్రం ఫ్లోరిడాకు 90 మైళ్ల దూరంలో క్యూబా ఉండడం ఇందుకు కారణం. 50 ఏళ్లపాటు ఈ కరీబియన్ ద్వీప దేశాన్ని పాలించిన ఫిడెల్ క్యాస్ట్రో అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే అమెరికా శత్రువుగా మారారు. అంటే 1961 ఆరంభంలో రెండు దేశాల మధ్య తెగిన దౌత్య సంబంధాలు 2015 జూలై 20 వరకూ మళ్లీ అతుక్కోలేదు. అరుుతే ఈ రెండు పరిణామాలూ క్యాో్ట్ర బతికుండగానే జరిగాయి. అనారోగ్యం.. సోదరుడికి పగ్గాలు 2006 జూలైలో క్యాస్ట్రో పేగులకు అత్యవసర శస్త్రచికిత్స అవసరమైంది. అప్పుడే తన సోదరుడు రౌల్ క్యాస్ట్రోకు తాత్కాలికంగా దేశాధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పారు. ఆరోగ్యం సహకరించని కారణంగా తాను అధ్యక్ష బాధ్యతలు చూడలేనని స్పష్టం చేయడంతో 2008లో రౌల్ పూర్తిస్థారుు అధ్యక్షుడయ్యారు. తదనంతరం ప్రజాజీవితం నుంచి పూర్తిగా తెరమరుగైన ఫిడేల్ క్యాస్ట్రో అనారోగ్యం పాలైన నాలుగేళ్ల తర్వాత తొలిసారి సాధారణ ప్రజానీకానికి కనిపించారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. జాతీయ అసెంబ్లీలోనూ మాట్లాడారు. తర్వాత అప్పుడప్పుడు మీడియాకు ఆయన వీడియోలు, ఫోటోలను క్యూబా ప్రభుత్వం విడుదల చేసింది. క్యాస్ట్రో పరిస్థితి విషమంగా ఉందని పలుమార్లు వదంతులు వ్యాపించారుు. చివరకు ఈ కమ్యూనిస్టు యోధుడు శుక్రవారం సాయంత్రం (భారతకాలమానం ప్రకారం శనివారం ఉదయం) తుదిశ్వాస విడిచారు. -
కోల్డ్‌క్రీమ్‌లో విషపు గుళికలు దాచి..
దాదాపు ఐదు దశాబ్దాలు (1959 నుంచి 2008 దాకా). ఫిడెల్ క్యాస్ట్రోపై ఎన్నెన్ని కుట్రలు చేసినా.. ఎంత గింజుకున్నా అమెరికా ఏమీ చేయలేకపోరుుంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది. ప్రపంచ గతి మారింది. 10 మంది అమెరికా అధ్యక్షులూ మారారు. కానీ క్యాస్ట్రో ఎదురు నిలిచాడు. అగ్రరాజ్యం కుట్రలకూ, కుతంత్రాలకు ఎదురునిలిచాడు. ఫిడెల్ క్యాస్ట్రో ప్రేయసి మారిటా లోరెంజ్. ఆమె గర్భం దాల్చినపుడు అమెరికాకు వెళ్లింది. అక్కడ సీఐఏ ఏజెంట్లు ఆమెను సంప్రదించి.. అమెరికా కోసం క్యాస్ట్రోను నిర్మూలించాల్సిందేనని ఆమెను ఒప్పించారు. కోల్డ్‌క్రీమ్‌లో విషపు గుళికలను దాచి పంపారు. వాటిని ఆమె రహస్యంగా క్యాస్ట్రో గదిలోకి తీసుకెళ్లి అతను తీసుకునే డ్రింక్‌లో కలపాలి. ఈ కుట్ర గురించి తెలిసిన క్యాస్ట్రో... లోరెంజ్ను చూసి ‘నన్ను చంపడానికి వచ్చావా?’ అంటూ గన్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. గట్టిగా సిగార్‌ను పీల్చి వదిలి షూట్ చేయమన్నట్లుగా చూశాడు. అంతే ఆమె గన్‌లోంచి బుల్లెట్లను తీసేసి.. కన్నీళ్లతో క్యాస్ట్రోపై వాలిపోరుుంది. ‘ఫిడెల్కు తెలుసు నేనతన్ని కాల్చలేనని.. ఎందుకంటే నేనతన్ని ప్రేమించాను. ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను. అతనూ అంతే..’ అని లోరెంజ్ స్వయంగా ఈ ఘటనను తర్వాతి కాలంలో వెల్లడించింది. శంఖంలో బాంబు... క్యాస్ట్రోకు స్కూబా డైవింగ్ అంటే ఎంతో ఇష్టం. కాబట్టి డైవ్ చేసినపుడు సముద్ర గర్భంలో ఆకర్షణీయమైన శంఖం పెడితే... దాని దగ్గరకు వెళతాడని, పేలి చనిపోతాడని ప్లాన్ వేసింది సీఐఏ. తను తరచుగా స్కూబా డైవింగ్‌కు వెళ్లే ప్రదేశంలో దీన్ని ప్లాన్ చేసింది. అరుుతే అమలులో ఇబ్బందులతో దీన్ని ప్రయత్నించలేదు. అలాగే స్కూబా డైవింగ్ సూట్‌కు విషపూరిత రసాయనాలు పూసి ఓ మిత్రుడి ద్వారా దాన్ని ఫిడెల్ క్యాస్ట్రోకు అందించే ప్రయత్నం చేసింది. కానీ క్యూబా అధ్యక్షుడితో మంచి సాన్నిహిత్యమేర్పడిన ఆ లాయర్ విషపూరితమైన సూట్‌కు బదులు మామూలు సూట్‌ను అందజేశాడు. -
ఇందిర.. నా సోదరి!
అలీనోద్యమం జోరుగా నడుస్తున్న రోజులవి.. భారత రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ ఏడో అలీనోద్యమ సదస్సుకు వేదికగా నిలిచింది. వందకు పైగా దేశాధినేతలు, పరిశీలకులు పాల్గొన్న ఈ సదస్సులో ఫిడెల్ క్యాస్ట్రో చర్య.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఇరుకున పెట్టేసింది. అప్పటివరకూ అలీనోద్యమానికి చైర్మన్‌గా వ్యవహరించిన క్యాస్ట్రో... ఢిల్లీ సదస్సులో ఆ బాధ్యతలను ప్రధాని ఇందిరాగాంధీకి అప్పగించాలి. ‘‘నా సోదరికి ఈ బాధ్యతలు అప్పగించడం నాకు ఆనందం కలిగిస్తోంది’’ అని క్యాస్ట్రో ప్రకటించారు. వేదికపైనే ఉన్న ఇందిర అధికార దండం (న్యాయమూర్తుల వద్ద ఉండే కలప సుత్తి లాంటిది)ను అందుకునేందుకు దగ్గరకు వచ్చారు. చేయి చాచారు. కానీ క్యాస్ట్రో వైపు నుంచి అసలు కదలిక లేదు. చేతిలో దండం అలాగే ఉంది. రెండోసారి చేయి చాచినా.. స్పందన లేదు. క్యాస్ట్రో ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది కానీ దండం మాత్రం చేతులు దాటి రావడం లేదు. ఏం చేయాలబ్బా అని ఇందిర తటపటాయిస్తున్న సమయంలో క్యాస్ట్రో హఠాత్తుగా ముం దుకు కదిలారు. ఇందిరను రెండు చేతులతో గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. అదే సమయంలో అధికార దండాన్ని ఆమె చేతుల్లో పెట్టాడు. ఈ పరిణామంతో ఇందిర ఒకింత షాక్‌కు గురైనా... ఆ వెంటనే తేరుకుని... చిరునవ్వులు చిందిస్తూ నిలబడిపోరుుంది. ఈలోపు... విజ్ఞాన్ భవన్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోరుుంది. అలిగిన అరాఫత్ 1983లో ఢిల్లీలో జరిగిన అలీనోద్యమ సదస్సులో మరో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. పాలస్తీనా విమోచనోద్యమ నేత యాసర్ అరాఫత్ ఏదో ఒక విషయమైన అలక వహించారు. సదస్సు నుంచి వాకౌట్ చేసేందుకు సిద్ధమయ్యారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి నట్వర్ సింగ్‌కు ఆ విషయం తెలిసింది. ఆతిథ్య దేశంగా భారత్‌కు చెడ్డపేరు వస్తుందని, వెంటనే ఆ విషయాన్ని ప్రధాని ఇందిరకు తెలియజేశారు. అరాఫత్‌ను సముదారుుంచాలని సూచించారు. వెంటనే ఇందిర రంగంలోకి దిగారు. క్యాస్ట్రోను వెంటబెట్టుకుని అరాఫత్ దగ్గరకు వచ్చారు. ఆ తర్వాత సంభాషణ ఇలా సాగింది... క్యాస్ట్రో: మిత్రమా.. ఇందిర నీ స్నేహితురాలేనా? అరాఫత్: మిత్రమా... ఇందిరాగాంధీ నా పెద్దక్కతో సమానం. ఆమె కోసం ఏమైనా చేస్తా క్యాస్ట్రో: అరుుతే మంచి తమ్ముడి మాదిరిగా... సదస్సులో పాల్గొను అంతే... అరాఫత్ తన వాకౌట్ ఆలోచనలన్నింటినీ పక్కనబెట్టేశారు. సదస్సులో పాల్గొన్నారు. నెహ్రూ మెచ్చిన సాహసి.. 1960లో ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధాని నెహ్రూ న్యూయార్క్ వెళ్లారు. ఆ సందర్భంలో క్యాస్ట్రోను స్వయంగా వెతుక్కుంటూ వెళ్లి మరీ కలిశారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని.. ‘ప్రపంచంలోనే అత్యంత సాహసిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. అప్పుడు క్యాస్ట్రో 34 ఏళ్ల కుర్రాడు!! -
కమ్యూనిస్టులను విమర్శించే స్థాయి లేదు
కేసీఆర్‌పై తమ్మినేని ధ్వజం వికారాబాద్ టౌన్: కమ్యూనిస్టులను విమర్శించే స్థారుు కేసీఆర్‌కు లేదని, ఆయన పుట్టక ముందే తెలంగాణ ఆకాం క్ష ఉందని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాద యాత్ర వికారాబాద్‌కు చేరుకుంది. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్, తెలుగు యువత రాష్ర్ట అధ్యక్షుడు వీరేందర్‌గౌడ్, హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ యాత్రకు మద్దతు పలికారు. తమ్మినేని మాట్లాడుతూ.. నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్టులేనన్నారు. 10 లక్షల ఎకరాలను ప్రజలకు పంచిన చరిత్ర తమ పార్టీకి ఉందన్నారు. ఇందుకోసం 4 వేల మంది కమ్యూనిస్టులు ప్రాణాలర్పించారని స్పష్టంచేశారు. 700 కిలోమీటర్లు సాగిన తమ యాత్రలో అన్ని గ్రామాల్లోనూ సమస్యలు తాండవిస్తున్నాయని తెలిపారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఎంకు లేఖ రాశారు. మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో పేద ప్రజలే ఇబ్బందులు పడుతున్నారన్నారు. -
కమ్యూనిస్టుల కుట్రల్ని అడ్డుకోవాలి
ఏబీవీపీ మాజీ జాతీయ అధ్యక్షుడు మురళీ మనోహర్ సిద్దిపేట రూరల్: కమ్యూనిస్టులు దళితులను అడ్డుపెట్టుకుని దేశద్రోహ కుట్రలు పన్నుతున్నారని ఏబీవీపీ మాజీ జాతీయ అధ్యక్షుడు మురళీ మనోహర్ తెలిపారు. ఆదివారం మండలంలోని తడ్కపల్లి ఆవాస విద్యాలయంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మెదక్ విభాగ్ అబ్యాస వర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల మద్య విద్వేశాలు రెచ్చగొట్టేందుకు కమ్యూనిస్టులు కులాల పేరుతో చిచ్చుపెడుతున్నారన్నారు. దళితులను అడ్డుపెట్టుకుని అగ్రవర్ణాలే రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహాం వ్యక్తం చేశారు. అదే విధంగా దేశంలో విష సంస్కృతులైన భీప్ ఫెస్టివల్, కిస్ ఆఫ్ లవ్‌తో పాటు మంగళసూత్రాలు తంపే విష సంస్కృతిని ప్రజల్లోకి తీసుకోస్తున్నారని మండిపడ్డారు. కమ్యూనిజం అనేది తియ్యటి విషపుగుళిక అని పెరియార్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న కమ్యూనిస్టు కుట్రలను ఆరికట్టేందుకు ఏబీవీపీ కార్యకర్తలే ముందుండాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో మనుషుల మధ్య ఉండేది కులాలు కాదని, ప్రతి ఒక్కరు భారతీయుడని చెప్పుకునే రోజులు రావాలన్నారు. అంతకు ముందు సమావేశంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బీఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి కలాల్ శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు, సిద్దిపేట పట్టణ కౌన్సిలర్ దూది శ్రీకాంత్‌రెడ్డి, నగర అధ్యక్షులు చంద్రోజు శ్రీనివాస్, ఏబీవీపీ నాయకులు గంగాడి మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, విష్ణు, మధు, ఆవాస విద్యాలయ నిర్వహకులు కొమురవెళ్లి చంద్రశేఖర్, పాఠశాల ప్రధానాచార్యులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
అణుప్లాంట్ వద్దంటూ సంతకాల సేకరణ
ద్వారకానగర్: ఆంధ్రాలో అణు విద్యుత్ కర్మాగారం ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రాన్ని బుగ్గిపాలు చేయడమేనని కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సహయ కార్యదర్శి జె.వి. సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. ఈ మేరకు జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద శనివారం ప్రజల వద్ద నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు అభివద్ధి చెందిన అమెరికా దేశాల్లాంటివి విడిచిపెట్టాయని అన్నారు. అమెరికాలో అణువిద్యుత్ కర్మాగారానికి సంబంధించిన పరికరాలు వథాగా వున్నాయని భారత్‌కు వాటిని అమ్మేప్రయత్నంలో ఈ కర్మాగారం ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమ్ముడుపోయాయని పేర్కొన్నారు. ఇందులో భాగం గానే కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సన్నాహలు చేస్తోందన్నారు. గుజరాత్లో ప్రజలు అక్కడ వ్యతిరేకిస్తే దానిని తీసుకొచ్చి ఆంధ్రాలో నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వీటితో పాటు మరో నాలుగు కర్మాగారాలకు ఒప్పందం చేసుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు దీనిని పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఆందోళనను మరింత ఉద్ధతం చేసేందుకు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం శ్రీకారం చుట్టామన్నారు. జపాన్‌లో జరిగిన అణుబాంబు సంఘటన వల్ల ఇప్పటికీ అక్కడి ప్రజలు సమస్యలు ఎరుర్కొంటున్నారని చెప్పారు. ఈ కేంద్రం ఏర్పాటు వల్ల ఉత్తారాంధ్ర ప్రజలు అంగవైకల్యం బారిన పడే ప్రమాదముందని అవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి డి. మార్కండేయులు, ఎం. పైడిరాజ్, ఎ.విమల, వామనమూర్తి, బేగం, ఎస్. కుమారి, బేగం తదితరలు పాల్గొన్నారు. -
భవిష్యత్తు అంతా కమ్యూనిస్టులదే..
ఎంసీపీఐ(యూ) జాతీయ కార్యదర్శి ఎండీ. గౌస్ రేబల్లె(దుగ్గొండి) : భవిష్యత్తు అంతా కమ్యూనిస్టులదేనని ఎంసీపీఐ(యూ) జాతీయ కార్యదర్శి ఎండీ. గౌస్ అన్నారు. ఈ నెల 5న విజయవాడలో జరిగిన జాతీయ స్థాయి సమావేశంలో గౌస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. అనంతరం తొలిసారి రేబల్లెకు వచ్చిన ఆయన అమరవీరుల స్తూపాల వద్ద నివాళులర్పించారు. అనంతరం గౌస్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు చేయడానికి కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయమన్నారు. దీనిపై కమ్యూనిస్టులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు గాదెగోని రవి, సింగతి సాంబయ్య, భూమయ్య, నాగెల్లి కొమురయ్య, హంసారెడ్డి, కుసుంబ బాబురావు, తదితరులు పాల్గొన్నారు. -
ఒకే జెండాకు అంకితం
కొత్త కోణం చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి, చండ్ర పుల్లారెడ్డి, పైలా వాసుదేవరావు, తరిమెల నాగిరెడ్డి వంటి వారు తమ కుటుంబం, ఆస్తి, ఐశ్వర్యాలకన్నా పార్టీకీ, ప్రజలకూ, ఉద్యమాలకూ అంకితమై పనిచేశారు. గత కొంతకాలంగా ఈ అంకిత భావం కొరవడిన ఫలితంగానే పశ్చిమ బెంగాల్, కేరళ వంటి కమ్యూనిస్టు కంచుకోటల నుంచి బీజేపీకి వలసలు పెరుగుతున్నాయి. ఇక్కడే ఏబీ బర్ధన్‌ను, ఆయన నిబద్ధతను, ప్రజలపై ఆయనకున్న విశ్వాసాన్ని స్మరించుకోవడం సముచితం. గతకాలపు అనుభవసారానికీ, మనకూ మధ్య దూరం పెరుగుతోందని తొలి తరం కమ్యూనిస్టు సిద్ధాంత నిబద్ధుడు, నిరాడంబరుడు ఎ.బి.బర్ధన్ మరణం గుర్తుచేస్తోంది. పదిహేనేళ్ల బాల్యం మినహా, ఏడున్నర దశాబ్దాల జీవితంలో తను నమ్మిన కమ్యూనిజాన్ని తుచ తప్పకుండా ఆచరించిన వ్యక్తి ఆయన. కమ్యూనిజాన్నీ, దాని ఆచరణలో కచ్చితత్వాన్నీ కూడా పాటించారు. ప్రజలే జీవితంగా బతికిన వ్యక్తి బర్ధన్. వ్యక్తిగత జీవితమే లేని వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ప్రజలంటే కేవలం మైదానప్రాంతాల్లో అన్ని అవకాశాలతో బతికేవారే కాదని, వారు మాత్రమే చరిత్ర గతిని మార్చారనుకోవడం తప్పని, అడవిబిడ్డల పోరాటాలను, ఉద్యమాలను మినహాయించరాదని ఆయన బలంగా విశ్వసించారు. తరతరాలుగా కులం పేరుతో వెలివేతకు గురవుతోన్న దళితుల త్యాగాలను మరువరాదని కూడా అభిప్రాయపడ్డారు. అందులో భాగంగానే ‘ఈ దేశ స్వాతంత్య్రం కోసం ప్రజలందరితోపాటు అడవుల్లో నివసించే ఆదివాసీలు కూడా రాజీలేని పోరాటం చేశారు. దేశంలోని సహజ వనరులు, జాతీయ సంపదగా ఉన్న బడ్జెట్లలో దళితులకూ, ఆదివాసులకూ వాటా కల్పించడం ప్రభుత్వాల బాధ్యతగా ఉండాలి. అంతేకానీ, దళితుల, ఆదివాసీల జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ, వారిని మరింత దీనస్థితికి నెట్టివేస్తూ, దేశ ప్రగతి గురించి మాట్లాడటం వంచన తప్ప మరొకటి కాదు.’ ఆగస్టు 22-23; 2012 తేదీల్లో నాగ్‌పూర్‌లో జరిగిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సమావేశాన్ని ప్రారంభిస్తూ బర్ధన్ అన్న మాటలివి. ఆయన అప్పటికే భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి వైదొలగి సురవరం సుధాకర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న దశ. అయినప్పటికీ జాతీయ స్థాయిలో సబ్ ప్లాన్ చట్టం కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి అనారోగ్యాన్ని సైతం లెక్కచేయక ఆయన ఢిల్లీ నుంచి నాగ్‌పూర్ వచ్చారు. ఆ సమావేశాలకు నేను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన కాకి మాధవరావు కూడా హాజరయ్యాం. సబ్‌ప్లాన్ ఆశయంగా... అప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కోసం జరుగుతున్న పోరాటం ఫలించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆ సంవత్సరం డిసెం బర్‌లోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు కోసం చట్టాన్ని రూపొందించింది. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుపై ఒక జాతీయ సదస్సును కూడా నిర్వహించింది. ఆ సదస్సుకు ఆయన హాజరవుతారని ఎవరూ ఊహించ లేదు. ఆ సదస్సులో బర్ధన్ మాట్లాడిన తీరు, వెలిబుచ్చిన అభిప్రాయాలు, హాజరైన వారికి ఆయన అందించిన స్ఫూర్తి మరువలేనివి. ముఖ్యంగా మహా రాష్ట్రలో ఆదివాసీల ఉద్యమాల గురించీ, ఆ ఉద్యమాల్లో పాల్గొన్న ఆదివాసీ నాయకుల గురించీ ఆయన అందించిన వివరాలు ఉత్తేజాన్ని కలిగించాయి. దళితుల, ఆదివాసీల అభివృద్ధిలో సబ్‌ప్లాన్ పాత్ర ఎంత కీలకం కాగలదో ఆనాడే చాలా చక్కగా వివరించారు. జీవితం, రాజకీయాలు, ఉద్యమం ఇవి వేర్వేరు కావనీ, ఒకదానికొకటి ముడివడివున్న అంశాలనీ ఆయన జీవితాన్ని అధ్యయనం చేస్తే అర్థమవుతుంది. భారత కమ్యూనిస్టుల తొలితరంలో చివరి వాైరైన అర్ధేంద్ భూషణ్ బర్ధన్ 91 సంవత్సరాలు అర్థవంతమైన, ప్రజలతో మిళితమైన జీవితాన్ని గడిపారు. జనవరి 1, 2016న కన్నుమూయడంతో నూతన సంవత్సరంలోకి అడుగిడిన రోజునే ఈ విషాదం చోటుచేసుకుంది. కార్మికనేత ఈరోజు బంగ్లాదేశ్‌లో భాగమైన సెల్హట్లో సెప్టెంబర్ 25, 1925న హేమేంద్ర కుమార్, సరళాదేవిలకు జన్మించిన బర్ధన్, 15 ఏళ్ల వయస్సులో నాగ్‌పూర్‌లో ఉండగా కమ్యూనిస్టు పార్టీలో చేరారు. నాటి బెంగాల్, మహారాష్ట్రలు సామా జిక, రాజకీయ ఉద్యమాలకు పుట్టినిళ్లు. అటువంటి ప్రాంతంలో పుట్టి పెరిగిన బర్ధన్‌ను ఆ ఉద్యమాలు బాగా ప్రభావితం చేశాయి. అందువల్లనే 1940లోనే అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్ఎఫ్)లో చేరారు. విద్యార్థి ఉద్య మంలో ఉన్న సమయంలోనే బర్ధన్ నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘానికి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆర్థికశాస్త్రంలో, న్యాయశాస్త్రంలో పట్టాలు పొందారు. ఆ తర్వాత ఆయన పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా ఉండాలని భావించారు. నాగ్‌పూర్‌లోని విద్యుత్, రైల్వే, వస్త్ర, రక్షణ రంగ పరి శ్రమల్లోని కార్మికులను ఉద్యమంలోకి సమీకరించారు. అయితే బర్ధన్ పూర్తి కాలం కార్యకర్తగా చేరే నాటికి పార్టీ మీద నిషేధం కొనసాగుతున్నది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు బర్ధన్‌ను అరెస్టు చేసి రెండున్న రేళ్లు జైలులో ఉంచారు. అంతకు ముందు ఆయన రహస్య జీవితాన్ని గడి పారు. 1957లో నాగ్‌పూర్ పశ్చిమ నియోజకవర్గం నుంచి శాసన సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. 1968లో జాతీయ కౌన్సిల్ సభ్యునిగా, 1978లో పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు స్వీకరించారు. 1982 నాటి వారణాసి మహాసభలో కేంద్ర కార్యదర్శివర్గంలో ప్రవేశించారు. అప్పటినుంచి తన కార్య క్షేత్రాన్ని ఢిల్లీకి మార్చారు. 1996లో పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై 2012 వరకు కొనసాగారు. ఆ వెంటనే నాగ్‌పూర్‌లో జరిగిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సదస్సులో ఎన్నో ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. పార్టీ దళి తుల, ఆదివాసీల పట్ల అనుసరించాల్సిన వైఖరిపై ఎన్నో సూచనలు చేశారు. ఎస్సీ, ఎస్టీల సమస్యల పట్ల పార్టీ దృష్టి సారించకపోతే అర్థం లేదని తేల్చి చెప్పారు. అక్కడే కమ్యూనిస్టు పార్టీ అవసరం ఉందని స్పష్టం చేశారు. దళిత, ఆదివాసీ పక్షపాతి 1973లో బర్ధన్ రాసిన ‘‘ట్రైబల్ ప్రాబ్లం ఇన్ ఇండియా’’ అన్న పుస్తకం ఎంతో విలువైన సమాచారాన్ని, ఆదివాసీల పోరాటాలకు ఎంతో నైతిక స్థైర్యాన్ని అందించింది. సరిగ్గా ఆ సమయంలోనే నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి లోయ పోరాటాలు ఉధృతంగా సాగుతున్నాయి. ఈ పుస్తకంలో శ్రీకాకుళం గిరిజన రైతాంగపోరాటం ప్రస్తావన ఉండడం గమనార్హం. అన్ని ప్రభుత్వా లూ చట్టాలనూ, రాజ్యాంగాన్నీ సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల, గిరిజ నుల సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ఉద్యమాలు సాయుధ పోరాటం వైపు వెళుతున్నాయని ఆ పుస్తకంలో ఆయన పేర్కొన్నారు. ఆది వాసీల పట్ల, ఉద్యమం పట్ల కమ్యూనిస్టు పార్టీలు తన కర్తవ్యాలను రూపొం దించుకోవాలని అందుకోసం ఈ పుస్తకం ఉపకరించాలని చెప్పారు. ఆనాటికి ఆయన పార్టీలో ముఖ్యమైన నాయకులు కూడా కాదు. కానీ ఆదివాసీల సమ స్యల పట్ల ఆయన పార్టీ విధానాన్ని నిర్దేశించే బాధ్యతను తీసుకున్నారు. ఆయన దళితులు, ఆదివాసీల పక్షపాతి అనడానికి మరొక ఉదాహరణ ఉంది. 1980 దశకం మధ్యభాగం నుంచి కులపరంగా రిజర్వేషన్ల సమస్యపై, ప్రత్యేకించి వెనుకబడిన కులాల రిజర్వేషన్లపై వివాదం చెలరేగింది. ఎమర్జెన్సీ అనంతరం వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెసేతర ప్రభుత్వాలు వెనుకబడిన కులాలకోసం రిజర్వేషన్లు ప్రకటించాయి. అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకటి. మురళీధర్‌రావు కమిషన్ సిఫారసుల ఆధారంగా 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు బీసీల కోసం ప్రకటించిన రిజర్వేషన్లు వివాదాస్పదం అయ్యాయి. ఏపీ నవ సంఘర్షణ సమితి పేరుతో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనను కొందరు ప్రారంభించారు. అదే సమ యంలో గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్ వ్యతిరేక ఆందో ళనలు తలెత్తాయి. బర్ధన్ ఈ సందర్భంగా ‘కులం-వర్గం-రిజర్వేషన్లు’ పై రెండు వ్యాసాలను ప్రచురించారు. కులం వికృత రూపాన్ని ఇందులో ఆయన ఎండగట్టారు. ‘మార్క్స్, ఎంగెల్స్ రాసిన కమ్యూనిస్టు ప్రణాళిక నా జీవి తాన్ని మలచింది. అదేవిధంగా కమ్యూనిస్టు, మార్క్సిస్టు మూల సిద్ధాంత గ్రంథాలు, గోర్కీ రాసిన అమ్మ లాంటి నవలలు నన్ను నిరంతరం మేల్కొనే విధంగా చేశాయి.’ అని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం న్యూఢిల్లీలోని అజయ్ భవన్లో బర్ధన్‌ను నేను మూడుసార్లు కలుసుకున్నాను. ఆయన కూర్చునే గది కానీ, ఆయన నివసించే ఇల్లు కానీ అతి సాధారణంగా ఉండేవి. ఆయన సహచరి పద్మా బర్ధన్ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేసి 1986లో మరణించారు. బర్ధన్ స్ఫూర్తి నేటి అవసరం గతంలో మనరాష్ట్రంలో కమ్యూనిస్టు నాయకులు చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, నక్సలైట్ నాయకులైన కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి, చండ్ర పుల్లారెడ్డి, పైలా వాసుదేవరావు, తరిమెల నాగిరెడ్డి వంటి వారు తమ కుటుంబం, ఆస్తి, ఐశ్వర్యాలకన్నా పార్టీకి, ప్రజలకు, ఉద్యమాలకు అంకితమై పనిచేశారు. గత కొంతకాలంగా ఈ అంకితభావం కొరవడిన ఫలితంగానే పశ్చిమ బెంగాల్, కేరళ లాంటి కమ్యూనిస్టు కంచుకోటల నుంచి బీజేపీకి వలసలు పెరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో వామపక్ష పార్టీలు ఓడిపోయిన తరువాత ఈ వలసలు మరింత పెరిగాయి. కేరళలో కూడా ఇదే ధోరణి. 1980-90 తర్వాత వచ్చిన నాయకత్వంలో ఎక్కువ మందికి సొంత కుటుంబాలు, వ్యాపారాభివృద్ధే లక్ష్యం కావడం వల్ల కింది స్థాయి కార్య కర్తలకు వారు స్ఫూర్తిదాయకంగా నిలవలేకపోయారు. కనీసం సైద్ధాంతిక నిబద్ధతను సైతం కార్యకర్తల్లో నింపలేని పరిస్థితి నెలకొన్నది. అంతేకాకుండా మత, సంప్రదాయ సంకెళ్ల నుంచి నాయకత్వం బయటపడకపోవడంతో ఇతర పార్టీలకు, కమ్యూనిస్టు పార్టీలకు మధ్యనున్న అంతరాన్ని కార్యకర్తలు అర్థం చేసుకోలేకపోయారు. అందువల్లనే కమ్యూనిస్టు పార్టీల నుంచి బీజేపీలోకి వలస వెళ్ళడం కార్యకర్తలకు ఇబ్బందికరంగా తోచలేదు. సరిగ్గా ఇక్కడే ఏబీ బర్ధన్‌ను, ఆయన నిబద్ధతను, ప్రజలపై ఆయనకున్న విశ్వాసాన్ని స్మరించుకోవడం అర్థవంతం, సందర్భోచితం. మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213 -
పార్టీలో విప్లవ లక్షణాలు తగ్గాయ్!
♦ సీపీఎంలో అంతర్మథనం ♦ ఇకపై ఉద్యమ నేపథ్యం ఆధారంగానే సభ్యత్వం ♦ ప్రస్తుత సభ్యుల వడపోత ♦ తెలంగాణలో ఎదగడానికి ఎక్కువ అవకాశం సాక్షి, హైదరాబాద్: పార్టీలో కమ్యూనిస్టు, విప్లవ లక్షణాలు తగ్గిపోవడం, కేడర్‌లో క్రమశిక్షణారాహిత్యం చోటుచేసుకోవడంపై సీపీఎంలో అంతర్మథనం సాగుతోంది. సంస్థాగత లోపాలు, లోటుపాట్లను అధిగమించడంతో పాటు ప్రజల పక్షాన నిలిచి పోరాడే పార్టీగా సభ్యులకు వామపక్ష భావాలు ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తించింది. పార్టీకి, కార్యకర్తలు, నాయకులకు అలవడిన అవలక్షణాలు, గత 25 ఏళ్లలో బూర్జువా పార్టీలతో పొత్తుకారణంగా అంటిన మకిలిని వదిలించుకోవాలని నిర్ణయించింది. జాతీయ, రాష్ట్రస్థాయిల్లో బలపడేందుకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం ఒక్కటే మార్గమని.. ఇటీవల ముగిసిన కోల్‌కతా ప్లీనంలో పార్టీ నాయకత్వం అంచనాకు వచ్చింది. ఇకపై ప్రజాసమస్యలు, ఇతరత్రా అంశాలపై పాల్గొన్న ఉద్యమ నేపథ్యం, క్రమశిక్షణ ప్రాతిపదికన ప్రాథమిక స్థాయిలో పార్టీ సభ్యత్వాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న సభ్యులను కూడా ఆయా అంశాల ప్రాతిపతికన జల్లెడపట్టాలని తీర్మానించింది. 2017 నాటికి పార్టీ మొత్తం సభ్యత్వాన్ని ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పార్టీ సభ్యత్వం తగ్గినా ఫరవాలేదని భావిస్తోంది. తెలంగాణలో బలపడేందుకు... రాజకీయంగా ఎదగడానికి ఎక్కువ అవకాశాలున్న రాష్ట్రంగా తెలంగాణను సీపీఎం జాతీయ నాయకత్వం గుర్తించింది. రాష్ట్రంలో బలపడేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలనే రాష్ట్ర నాయకత్వం ఆలోచనలకు ఆమోదముద్ర వేసింది. హైదరాబాద్‌లోనే నాలుగోవంతుకు పైగా రాష్ట్ర జనాభా ఉండటంతో ఇక్కడ వేళ్లూనుకోవడం కీలకమనే అంచనాకు వచ్చింది. గతంలో చేపట్టిన బీసీ సబ్‌ప్లాన్, మైనారిటీ రిజర్వేషన్లు ఇతర సామాజిక ఉద్యమాలను మరింత విస్తరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అత్యంత వెనుకబడిన వర్గాల (ఎంబీసీ)ను బలోపేతం చేయాలనే రాష్ట్ర పార్టీ ఆలోచనను జాతీయ నాయకత్వం బలపరిచింది. అదేవిధంగా క్రైస్తవ మైనారిటీల కోసం ప్రత్యేకంగా సంఘం లేదా కమిటీని ఏర్పాటుచేయాలని భావిస్తోంది.ఇప్పటికే పార్టీ బలంగా ఉన్న ఖమ్మం, నల్లగొండ జిల్లాలు, కొంతమేర బలంగా ఉన్న వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో పార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలని జాతీయ నాయకత్వం ఆదేశించింది. కాగా, బడ్జెట్లో బలహీన వర్గాల సంక్షేమానికి తగిన కేటాయింపులు చేయాలని, బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లో భారీ ర్యాలీని నిర్వహించాలని రాష్ర్ట పార్టీ నిర్ణయించింది. -
వినువీధికి విప్లవ తార
కడదాకా నిరాడంబర జీవితం బాధిత కుటుంబాలకు బాసట కన్నుమూసిన కమ్యూ‘నిస్టాగరిష్టుడు’ చలసాని ప్రసాద్ నేడు ఎంఎంసీకి భౌతికకాయం సమర్పణ నిత్యనూతన యవ్వనుడు నిదురించాడు. అలసట మాటే తెలియని చైతన్య సమన్వితుడు ఇక సెలవని చిరునవ్వుతో నిష్ర్కమించాడు. కళ్లు తెరిచింది మొదలు కమ్యూనిస్టు ఉద్యమాన్నే తిలకించి, వామపక్ష భావజాలాన్ని మనసారా విశ్వసించి, సకలలోక కల్యాణమే సమ్మతమని, అదే తన మతమని మనసావాచా నమ్మిన కమ్యూనిస్టాగరిష్టుడు... చలసాని ప్రసాద్ శనివారం కన్నుమూశారు. నవ్య సాహిత్యసేవకు నిబద్ధుడై, మహామహుల అమూల్య అక్షర రత్నాలను సంకలనాల మాలగా వెలువరించి తెలుగు తల్లిని అలంకరించిన ఆ అవిశ్రాంత శ్రామికుడు, ఇంకా చేయాల్సిన పని చాలా ఉందంటూనే శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. విప్లవ యోథులు ఎక్కడ నేలకొరిగినా, అడవిబిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నాననే ఆ సమరోత్సాహవంతుడు పడమటి కొండల దిశగా సాగిపోయాడు. సాహితీరథాన్ని విప్లవ మార్గం పట్టించి, విరసం అవతరణలో కీలక పాత్ర ధరించి, సముద్రమంత ఉత్సాహానికి ప్రతిరూపమన్న ఖ్యాతి గడించిన ఆ పుస్తకాల ఆస్తిపరుడు విశాఖకు తుది వీడ్కోలు పలికా డు. ఎనిమిది పదుల చలసాని చివరికంటా హేతువాదానికే కట్టుబడడంతో ఆదివారం ఆయన భౌతిక కాయాన్ని ఆంధ్ర మెడికల్ కళాశాలకు సమర్పించనున్నారు. విప్లవ శిఖరం వినువీధికి ఎగసింది. ఏడున్నర దశాబ్దాలకు పైగా అలుపెరగని ఉద్యమ నేతకు శాశ్వత విరామం దొరికింది. తాను నమ్మిన సిద్ధాంతం కోసం కడదాకా రాజీపడకుండా ఉద్యమించారు చలసాని ప్రసాద్. తన ఎనిమిది పదుల ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూశారు. చిన్నప్పుడే నీతిచంద్రికను బట్టీపట్టిన ఆయన చివరిదాకా నీతి, నిరాడంబరతకే కట్టుబడ్డారు. ఉద్యమ పథంలో తుపాకీలకు, పోలీసులకు, ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచారు. బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఉద్యమించారు. ముదిమి మీద పడుతున్నా లెక్కచేయకుండా నిజనిర్ధారణ కమిటీలతో అడవుల్లోకి వెళ్లి ఎన్కౌంటర్ ఘటనలపై బాహ్య ప్రపంచానికి తెలిపేవారు. విప్లవ ఉద్యమంలో అరెస్టయి జైళ్ల పాలయిన వారికి అండగా ఉంటూ వారు బెయిల్‌పై విడుదలయ్యేందుకు పాటుపడేవారు. బాధిత కుటుంబాలకు బాసట గా నిలిచేవారు. సామాజిక స్పృహతో రచనలు, సాహిత్య వ్యాసాలు రచించారు. అధ్యాపకునిగా పాఠాలు చెప్పారు. అన్యాయాలు, అక్రమాలపై జాతిని మేల్కొలిపే లా ఉపన్యాసాలిచ్చారు. మనుషులతో పాటు పుస్తకాలను అమితంగా ప్రేమించారు. శ్రీశ్రీ, రావిశాస్త్రికి ప్రసాద్ అంటే పంచప్రాణాలు! కాళోజీ, కొడవటిగంటి, కారా మాస్టారు, అబ్బూరి, గోపీచంద్ వంటి ప్రముఖ సాహితీవేత్తలకు ఆప్తునిగా మెలిగారు. చలం, గోపీచంద్, విశ్వనాథ సత్యనారాయణ, కుటుం బరావు, తాపీ ధర్మారావు రచనలు, ఆధునిక ప్రాచీన సాహిత్యమన్నా ఎంతో ఇష్టపడేవారు. కృష్ణాజిల్లాలోని ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన చలసాని ప్రసాద్ బాల్యం నుంచి కమ్యూనిస్టు ఉద్యమాన్ని చూస్తూ, ఆస్వాదిస్తూ పెరిగారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన కుటుంబం ప్రత్యక్షంగా పాలుపంచుకుంది. ఉద్యమంలో ఆయన కుటుంబ సభ్యులు ముగ్గురు నేలకొరిగారు. ఏయూలో ఎమ్మే చేసిన తర్వాత జీవిక కోసం రకరకాల ఉద్యోగాలు చేశారు. కొంతకాలం సినీమాయాజగత్తులో సహాయ దర్శకుడిగా, రచయితగా కొనసాగారు. చివరికి ఏవీఎన్ కళాశాలలో అధ్యాపకుడిగా స్థిరపడ్డారు. విప్లవయోధుల సరసన కలం యోధునిగా... ఉత్తరాంధ్రలో విప్లవోద్యమ కార్యకారణ పరిణామాలు ఏవి చోటు చేసుకున్నా చలసాని మద్దతు ఉండేది. ప్రజా సాహిత్య సంబంధమైన రచనా వ్యాసంగంతోనో, పుస్తకాల ప్రచురణతోనో ఆయన ఆగిపోకుండా విప్లవ యోథుల సరసన కలం యోథుడిగా దీటుగా నిలిచారు. విప్లవోద్యమానికి సంబంధించి ఏ ఉద్యమకారుడు కారాగారం పాలైనా, ఏ అమాయకులు పోలీసుల దమనకాండకు గురైననామొదటి పరామర్శ చలసానిదే అయి ఉండేది. ఏ కీకారణ్యంలో కూంబింగ్ వేటలో ఏ విప్లవకారుడు నేలకొరిగినా రాలే తొలి కన్నీటి బొట్టు చలసానిదే. బూటకపు ఎన్కౌంటర్ల పట్ల నిరసన గళం వినిపించేవారు. ఎక్కడ పోరు పాట వినపడ్డా, ఎక్కడ సమర శంఖం పూరించినా ఆయన పరుగున తరలి వెళ్లారు. ఉద్యమానికి, సాహిత్యానికి వంతెనలా అనంతమైన భారాన్ని మోసారు. అందరాని లోకాలకు వెళ్లిపోయారు. హాస్యప్రియుడు కూడా: చలసాని విప్లవ నేతగాను, రచయితగాను, సంకలనకర్తగానే చాలామందికి తెలుసు. కానీ ఆయనో హాస్యప్రియుడని ఎంతమందికి తెలుసు? నగరంలోని క్రియేటివ్ కామెడీ క్లబ్ నిర్వహించే నెలవారీ కార్యక్రమాలకు హాజరయ్యే వారు. తనకు అనుభవంలోకి వచ్చిన జోక్స్‌ను చెబుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విం చేవారు. ఇతరుల జోక్‌లనూ ఆస్వాదించేవారు. సినిమాల పట్ల ఒకింత ఆసక్తి చూపిన ఆయన సహాయ దర్శకునిగా కొన్నాళ్లు పనిచేశారు. ఇద్దరు కుమార్తెలు : చలసానికి నవత, మమత అనే ఇద్దరు కుమార్తెలు. వారిలో మమత ఏవీఎన్ కాలేజీలో లెక్చరర్. భార్య విజయలక్ష్మి కొన్నేళ్ల క్రితం మరణించారు. నగరంలోని సీతమ్మధార హెచ్‌బీ కాలనీలోని స్వగృహంలోనే నిరాడంబర జీవితాన్ని గడిపారు. చలసాని. ఎక్కడో కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రు నుంచి వచ్చిన ప్రసాద్‌కు విశాఖ అన్నా, శ్రీశ్రీ, రావిశాస్త్రిలన్నా ఎంతో ఇష్టం. అందుకే విశాఖలో స్థిరపడ్డారు. ఇక్కడే కన్నుమూశారు. -
ద్విముఖ పోరాటమే నేటి అవసరం
ఈ నెల 9న జరిగే పది వామపక్షాల సమావేశం గురించి సీపీఎం ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి మధు పత్రికలకు వెల్లడించిన వివరాలు విని సంతోషించిన కమ్యూనిస్టు శ్రేయోభిలాషులలో నేనూ ఒకడిని. ఆంధ్ర రాజధాని ప్రాంత రైతుల, కూలీల, వ్యవసా యాధారిత వృత్తుల వారి సమస్యల గురించి చర్చిం చి, వాటి పరిష్కారం కోసం లక్షమంది మహిళలతో త్వరలో చేపట్టబోయే ఉద్యమం గురించి చర్చించ డమే ఆ సమావేశం ఉద్దేశం. ఆ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీయాలన్నది వామపక్షాల లక్ష్యం. సమస్య తీవ్రమైనది. అందుకు తగ్గట్టు ఉద్యమాన్ని ఉధృత స్థాయిలో నిర్వహించాలన్న వామపక్షాల నిర్ణయం కూడా అభినందనీయమే. ప్రతిపక్షాలకే కాదు, అసలు ప్రజానీకానికే జవాబుదారులం కాదన్నట్టు వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఈ ఉద్యమం తగిన గుణపాఠం నేర్పాలని కూడా కోరుకుందాం. దిగజారిన చంద్రబాబు ప్రతిష్ట చంద్రబాబు నేడున్నంత ఆత్మరక్షణ పరిస్థితిలో గత ఏడాదికాలంలో ఎన్నడూ లేరు. ఎన్నికల హామీలలో ఒక్కటీ నెరవేర్చక పోవడంతో చంద్రబాబుపై విశ్వ సనీయత అంతంత మాత్రంగా మిగిలింది. రేవంత్‌రెడ్డిని అడ్డం పెట్టుకుని జరి పిన ఓటుకు కోట్లు కుంభకోణంతో ఆ కాస్త విశ్వసనీయత అధ ఃపాతాళానికి పడిపోయింది. రేవంత్ పాత్రధారిగా, తానే సూత్రధారిగా సాగించిన ఈ బాగోతం వీడియోలను, ఆడియోలను తెలుగు ప్రజలు చూశారు. దీనితో ఒక విధమైన ఆత్మన్యూనతా భావం చంద్రబాబును ఆవరించింది. అదంతా విశ్వామిత్ర సృష్టి అని చెప్పడం సాధ్యం కాక, తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందనీ, సెక్షన్ 8ని గుర్తించడం లేదనీ, ఏపీ ప్రయోజనా లను అడ్డుకుంటూ కేసీఆర్ అహంకార ధోరణితో ఉన్నారనీ చంద్రబాబు ఎదు రుదాడికి దిగుతున్నారు. తనతోపాటు తన అనుచరగణాన్ని కూడా ప్రోత్స హించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అశాంత వాతావరణానికి దోహదం చేస్తున్నారు. చంద్రబాబు ఎదురుదాడిలో ఏదో మేర వాస్తవం ఉండవచ్చు. స్వచ్ఛమైన ప్రజాస్వామికవాది అని కేసీఆర్‌ను ఎవరూ అనలేరు. కానీ ఆ ఎదు రుదాడితో చంద్రబాబును ఆవరించిన ఓటుకు కోట్లు అవినీతి వ్యవహారం మరుగునపడదు. వామపక్షాలు చేపట్టబోయే మహోద్యమాన్ని స్వాగతించే సమయంలో ‘ఓటుకు కోట్లు’ ప్రస్తావించడానికి కారణం ఉంది. మార్క్సిస్ట్ తత్వశాస్త్రం ప్రకారం ఆర్థిక పునాదికి అనుగుణంగా ఉపరితలం మీద రాజకీయాలు, కళలు, మతం, సంస్కృతి వంటి అంశాలు ఉంటాయి. అలాంటి ఆర్థిక అంశం మీదనే వామపక్షాలు ఉద్యమించనున్నాయి. నిజానికి రాజధాని ప్రాంతంలో వ్యవసాయం మీద ఆధారపడిన జనం పరిస్థితి జీవన్మరణ సమస్యగా పరిణ మించింది. దీని మీద గతంలోనూ వామపక్షాలు ఉద్యమాలు నడిపాయి. ఇప్పటి మహోద్యమం ఆలోచన వాటి నుంచి ఉద్భవించి ఉండవచ్చు. అలాం టి ప్రజా ఉద్యమాన్ని ఓటుకు కోట్లు వ్యవహారం మీద కూడా వామపక్షాలు నడిపి ఉండవలసింది. ఉపరితల అంశాలూ ముఖ్యమే అదలా ఉంచుదాం! ఏంగిల్స్ పునాది ఉపరితలం గురించి వివరణ ఇస్తూ, నేనూ, మార్క్స్ చెప్పింది అంతిమంగా ఆర్థిక పునాదే నిర్ణయాత్మకమవుతుం దని మాత్రమే. అంతమాత్రాన ఉపరితలంలో ఉండే రాజకీయాలు, మతం, కళలు, సంస్కృతి ఇత్యాది అంశాల ప్రభావమేమీ ఉండదని అర్థంకాదు! పైగా ఆర్థిక పునాదికి సంబంధించిన అంశాలకంటే చాలా సందర్భాలలో ఉపరిత లంలోని అంశాలపైనే త్వరితగతిన విస్తృతస్థాయిలో ప్రజలు స్పందిస్తారని అన్నారు. మన అనుభవం కూడా అదే! రాజకీయ అవినీతి ఉపరితల అంశ మే! బహుశా అందుకే దానిపై ప్రజలలో అంత ఆసక్తి, వ్యతిరేకతలతో చర్చ జరుగుతున్నది. ఎన్నో ప్రజావ్యతిరేక, రైతు వ్యతిరేక చర్యలు చేపట్టినా సాధారణ ప్రజానీకంలో ప్రభుత్వంపై కలగనిఏహ్యభావం ఈ ఓటుకు కోట్లు బాగోతం వల్ల కలిగింది! అదే సమయంలో టీడీపీ నేతల గళాలు గతంలో కంటే హె చ్చుస్థాయిలో ఎదురుదాడితోనూ, ఆ పరిస్థితిని అనుకూలంగా మలుచుకుం టాయేమోనన్న భయంతో వైఎస్సార్ సీపీపైన, కాంగ్రెస్‌పైన వ్యర్థంగానూ విరుచుకుపడుతున్నాయి. జగన్మోహన్రెడ్డి, కేసీఆర్‌తో కుమ్మక్కయాడట! సరే అలాగే అనుకున్నా, రేవంత్‌రెడ్డిని లోబరుచుకుని, ఈ ఓటుకు కోట్లు బాగోతాన్ని సృష్టించి, టీడీపీ పరువును చంద్రబాబు పలుకుబడిని దిగజార్చ మని జగన్ ప్రోత్సహించారా? ఇలాంటి ప్రశ్నలూ, వింత వింత సమాధా నాలు ప్రజల దృష్టిని బాగా ఆకర్షించి, తెలుగుదేశం, చంద్రబాబు ప్రతిష్టలను బాగా మసకబారుస్తున్నాయి. రాజధాని ప్రాంత సమస్యలకూ, ‘ఓటుకు కోట్లు’ రగడకీ మూలం - అవి నీతే. దొడ్డిదారినో అడ్డదారినో ఆర్జించిన ధనంతో పదవిలో కొనసాగాలన్న అధికార దాహం చంద్రబాబుది. రాజధాని ప్రాంతంలో భూసమీకరణ, ఒప్పు కోకుంటే భూసేకరణ పేరుతో బెదిరింపులు, పర్యాటక కేంద్రాలు, హోటళ్లు, రిసార్టులు, గోల్ఫ్ పార్కులు ఇవన్నీ, అదీ ప్రైవేట్ రంగంలో విదేశీ స్వదేశీ గుత్తాధిపతులకు కట్టబెట్టి తద్వారా తనకు, తన అనుయాయులకు తరతరా లకు తరగని ఆస్తి సమకూర్చాలన్న తపన తప్ప ఏముంది? అవినీతితో ఈ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో వ్యవహరిస్తున్న దళారి స్వభావంలో ఉంది. ఆ నైజాన్ని బహుళ అంతస్తుల భవనాలు, సింగపూర్, జపాన్ తరహాలో మెట్రో రైళ్లు, అత్యాధునిక విమానాశ్రయాలు, 1000 సంవత్సరాలు సైతం చరి త్రలో నిలబడే రాజధాని పేరిట రంగుల కలలతో కప్పిపెట్టుకుంటున్నారు చంద్రబాబు, తెలుగుదేశం ప్రభుత్వం! అదీ ఈ ఓటుకు కోట్లు బాగోతం ప్రాధాన్యం. ఆర్థిక పునాది అంతిమ నిర్ణయాత్మకమని కమ్యూనిస్టు పార్టీలు గుర్తుంచుకోవాలి! ఈ లోపల ఉపరి తలంలో ఉంటున్న విష సంస్కృతిపై పోరాడాలి! రాజకీయ అవినీతితో పాటు, నిచ్చెన మెట్లలాంటి వర్ణవ్యవస్థ, దళితులు, ఆదివాసీ గిరిజనులు బాగా వెనుకబడిన కులాల వారిపై అగ్ర పెత్తందారీ కులాలు జరుపుతున్న దోపిడీ దౌర్జన్యాలు, మైనారిటీలలో అభద్రత, మహిళల జీవితాలను ధ్వంసం చేస్తున్న మనుస్మృతి భావజాలం ఇవన్నీ మన వ్యవస్థ ఉపరితలంలోని విష సంస్కృతి భాగాలే! ఈ ద్విముఖ పోరాటం జరపకుండా మన ప్రత్యేక పరిస్థి తిలో సామాజిక పురోగమనం అసాధ్యం. కనుక ఈ క్షణాన ఇటు రాజధాని ప్రాంత ప్రజా సమస్యలపై ఆర్థిక పోరాటం, మరోవంక రాజకీయ అవినీతికి నిలువుటద్దం పట్టిన చంద్రబాబు ఓటుకు కోట్లు బాగోతం రెంటినీ సమన్వ యపరచి, వామపక్షాలు సమైక్య సమరశీల మహోద్యమం చేయాలి. ఈ వామ పక్ష ఐక్యత, ప్రజా ఉద్యమాల నిర్మాణం కోసమే! (వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ నం: 98480 69720) - ఏపీ విఠల్ -
మూడు నూర్ల కోడూరు ఫ్యామిలీ
- వాకా మంజులారెడ్డి అది కృష్ణా జిల్లాలో ఎ.కొండూరు మండలం, కోడూరు గ్రామం. ఆ ఊరికి దార్శనికుడు యెలినేని వెంకయ్య. వీరి పూర్వీకులు చిత్తూరు నుంచి ఖమ్మం జిల్లాకు వలస వెళ్లారు. ఆ తర్వాత ఆరు తరాలకు కొంతమంది కృష్ణాజిల్లాకు వచ్చి స్థిరపడ్డారు. భూమిని నమ్ముకుని ‘వ్యవసాయమే నా తల్లి’ అని చాటిన వెంకయ్య 104 సంవత్సరాల పాటు ఆరోగ్యంగా జీవించారు. ఆయనకు 13 మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు. అంతా జీవించి ఉన్నారు. ఇప్పుడాయన కుటుంబం మనుమలు, మనుమరాళ్లు, ముని మనుమలతో కలిసి మూడు వందలకు దగ్గరైంది. వారిలో ఎక్కువమంది అమెరికా, టాంజానియా, సింగపూర్, ఆస్ట్రేలియాలకు విస్తరించారు. వీరంతా 1998, జనవరిలో వెంకయ్య నూరవ పుట్టినరోజు వేడుకలకు కోడూరు వచ్చినప్పుడు ఊరు ఊరంతా కదిలి వచ్చినట్లనిపించింది. అలాంటిదే మరో వేడుక ఈ రోజు (ఫిబ్రవరి 28) జరగనుంది. వెంకయ్య భార్య చిట్టెమ్మ తొలి వర్ధంతి సందర్భంగా వీరంతా మరోసారి కోడూరులో కలుస్తున్నారు. ‘‘మా నాన్నగారు అన్నేళ్లపాటు ఆరోగ్యంగా జీవించడానికి ఆయన పాటించిన ఆహారపు అలవాట్లు ప్రధాన కారణం. మితంగా తినేవారు, మజ్జిగ మాత్రమే తాగేవారు. ఊరి కోసం... పేద ప్రజల జీవితాలు బాగు పడడానికి పాలసహకార సంఘం, రైతు సహకార సంఘం స్థాపించారు. ఊళ్లో ఎయిడెడ్ పాఠశాలను పెట్టించారు. జొన్న, సజ్జ, కొర్రలు పండే మా ఊరిలో తన సొంత పొలంలో చెరువు తవ్వి వరి సాగు చేసి చూపించారు. ఊరి బాగు కోసం కాలువ తవ్వడం నుంచి అనేక పనుల్లో భాగస్వామి అయ్యారు. కమ్యూనిస్టు ఉద్యమమే జీవితంగా... మా ఇంటికి పుచ్చలపల్లి సుందరయ్య నుంచి చండ్ర రాజేశ్వరరావు వంటి మేధావులు వస్తుండేవారు. వారి ఆచూకీ కోసం పోలీసులు ఇంటి మీద దాడి చేసినప్పుడు వారిని మా నాన్న మా ఇంటి వెనుక ఉన్న జొన్నచేలలో దాచేవారు. ఇక మా అమ్మ శాంతమ్మ తండ్రి, మరో అమ్మ చిట్టెమ్మ తండ్రి కూడా కమ్యూనిస్టు కార్యకర్తలే కావడంతో మా నాన్న ఉద్యమంలో కీలకంగా పనిచేయడానికి వారి సహకారం బాగా ఉండేది. మేము నలుగురం పుట్టిన తర్వాత మా అమ్మ పోవడంతో చిట్టెమ్మను వివాహమాడారు నాన్న’’ అని చెప్పారు వెంకయ్య పెద్దకొడుకు సత్యనారాయణ. జమీందారుల ఏలుబడిలో అన్యా యాన్ని ఎదిరించిన యెలినేని వెంక య్య ప్రస్థానం ఓ ఉద్యమకారుని జీవితాన్ని తలపిస్తుంది. చిట్టెమ్మ కూడా ఆయన బాటలోనే నడిచారు. ఆ దంపతులను స్మరిస్తూ... ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులంతా నేడు కోడూరులో సమావేశం అవుతున్నారు. -
సాహసానికి మారుపేరు
హైదరాబాద్ ప్రభవించిన స్వాతంత్య్ర సమరయోధుల్లో రావి నారాయణరెడ్డి హీరో! సాహసం, ఆత్మసౌందర్యం ఆయన సొత్తు. నల్లగొండ జిల్లా, బొల్లేపల్లి గ్రామంలో సమృద్ధ జాగీర్దారీ కుటుంబంలో 1908లో జూన్ 4వ తేదీన రావి జన్మించారు. హనుమాన్ టేక్డిలోని రెడ్డిహాస్టల్ విద్యార్థి. ఆటలు-స్కౌటింగ్-నాటకాల్లో ముందువరసలో ఉండేవాడు. ఓసారి ఫుట్‌బాల్ ఆడుతుండగా వెన్నెముకకు గాయమైంది. జీవితాంతం ఆ దుర్ఘటన ఫలితం కలుక్కుమనేది. బ్రిటిష్ పాలనకు సహాయ నిరాకరణ చేయండి అనే గాంధీగారి పిలుపునకు హైదరాబాద్‌లో స్పందించిన తొలితరం యువకుడు నారాయణరెడ్డి. ఇంటర్మీడియట్ చదువుకు స్వస్తి చెప్పారు! 1929లో రావి వార్ధా వెళ్లారు. గాంధీగారిని కలిశారు. 1929లో మరణించిన తన శ్రీమతి నగలను తీసుకెళ్లారు. ‘హరిజనా(దళిత)భ్యుదయ’ కార్యక్రమాలకు వినియోగించాలని విరాళంగా ఇచ్చారు. 1932లో తక్కర్ బాబా అఖిల భారత హరిజన సేవక్ సంఘ్‌ను స్థాపించాడు. హైదరాబాద్ విభాగానికి సరోజినీనాయుడును అధ్యక్షురాలిగా, కార్యదర్శిగా రావి నారాయణరెడ్డిని నియమించారు. అనారోగ్యకారణాలతో మరుసటి సంవత్సరం సరోజినీనాయుడు ఆ పదవికి రాజీనామా చేశారు. దానికి అధ్యక్ష బాధ్యతలు ఆయనే ఆరేళ్లు నిర్వర్తించారు. 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌ను స్థాపించిన వారిలో రావి ముఖ్యులు. నిజాం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై విధించిన నిషేధం ఎత్తేయాలని అక్టోబర్ 24న తొలిబ్యాచ్ సభ్యుడిగా సత్యాగ్రహం చేశారు. గాంధీయన్ కమ్యూనిస్ట్! తెలుగు ప్రజల సాంఘిక జీవితం మెరుగుపరచడం లక్ష్యంగా 1928లో ఆంధ్రమహాసభ అనే సాంస్కృతిక సంస్థ ఏర్పడింది. 1941-44-45ల్లో మూడుసార్లు రావి అధ్యక్షునిగా పనిచేశారు. వితంతు వివాహాలు, అక్షరాస్యతా కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఆంధ్రమహాసభను క్రియాశీల రాజకీయ సంస్థగా మలిచారు. తమ పార్టీ సభ్యులు 20 ఎకరాల భూమిని మించి కలిగి ఉండరాదు అని కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానించింది. ఆ స్ఫూర్తిని గాంధేయవాది అయిన రావినారాయణరెడ్డి స్వీకరించారు. తనకు సంక్రమించిన భూమిలో 20 ఎకరాలను మాత్రమే ఉంచుకుని 500 ఎకరాలను రైతుకూలీలకు పంచిపెట్టారు. 1934లో మహాత్మాగాంధీ సికింద్రాబాద్ మీదుగా పర్యటించినప్పుడు ఆయన కార్యక్రమాలకు సహాయంగా 50 తులాల బంగారాన్ని సమర్పించారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ పనితీరు నిస్సారమైన వాతావరణంలో 1939లో రావి కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. తెలంగాణ సాయుధపోరాటానికి వీరోచితంగా నాయకత్వం వహించారు. అజ్ఞాతం లేదా జైలు! 1947 పంద్రాగస్ట్న ఢిల్లీలో ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగిరింది. కమ్యూనిస్ట్ పార్టీ సాయుధపోరాట విరమణ చేస్తుందని, చేయాలని రావి నారాయణరెడ్డి భావించారు. మగ్దూం మొహియుద్దీన్, రాజ్ బహదూర్ గౌర్ కూడా అదే భావనలో ఉన్నారు. అయితే కొందరు అలా భావించలేదు. 1948 ఫిబ్రవరిలో కోల్‌కతాలో జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ రెండవ కాంగ్రెస్ ‘సాయుధ పోరాటాన్ని కొనసాగించాల్సిందే’ అని ఆదేశించింది. ఈ ప్రకటన వెలువడిన మూడు రోజులకు పార్టీపై ప్రభుత్వం నిషేధం విధించింది. అజ్ఞాతవాసం నుంచి వెలుపలకు రావాలని భావించిన రావి నారాయణరెడ్డి తదితరులు నిషేధం నేపథ్యంలో మళ్లీ అజ్ఞాతవాసానికి వెళ్లాల్సి వచ్చింది. నో అదర్ గో! అజ్ఞాతం లేదా చెరశాల! 1948 సెప్టెంబర్‌లో హైదరాబాద్ స్టేట్‌పై పోలీసు చర్య జరిగింది. నిజాం బేషరతుగా లొంగిపోయాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను రాజప్రముఖ్‌గా సంతృప్తిపరచింది. కమ్యూనిస్ట్‌లు జైళ్లల్లోనే. 1951 అక్టోబర్‌లో కమ్యూనిస్ట్ పార్టీ సాయుధపోరాటాన్ని విరమించింది. 1952లో భారత ప్రభుత్వం తొలి సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం తొలిగిపోలేదు. ఈ నేపథ్యంలో పీపుల్స్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) తరఫున కమ్యూనిస్ట్‌లు పోటీ చేశారు. నల్లగొండలో క్లీన్‌స్వీప్.. ఎన్నికల ముందు జైలు నుంచి విడుదలైన రావి, లోక్‌సభ, శాసనసభ స్థానాలు రెండింటికీ పీడీఎఫ్ తరఫున పోటీ చేశారు. రెండుచోట్లా దిగ్విజయం సాధించారు. భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కంటే రావి అత్యధికంగా ఓట్లు పొందడం అందరికీ తెలిసిందే. నల్లగొండ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలుండేవి. పార్టీ అన్నిటినీ గెలుచుకుంది నల్లగొండ జిల్లాలోనే! రావి రెండు నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేశారు! రావి ప్రభావక్షేత్ర విస్తృతికి ఇదొక ఉదాహరణ! 1957 ఎన్నికలొచ్చాయి. గత ఎన్నికల్లో పీడీఎఫ్ అధికారంలోకి వచ్చే అవకాశాలను విఫలం చేసిన కాంగ్రెస్‌పై ఎలాగైనా పైచేయి సాధించాలని భావించాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఇతర మిత్రపక్షాలు. ఆ క్రమంలో రావి నారాయణరెడ్డిని అసెంబ్లీకి పోటీకి నిలిపాయి. ఆయన ప్రత్యర్థి ఎవరు? వి.రామచంద్రారెడ్డి! ఆయన త్యాగం చేసిన నూరెకరాలతోనే వినోభావే భూదానోద్యమానికి పోచంపల్లిలో శ్రీకారం చుట్టారు. రావి భార్యకు రామచంద్రారెడ్డి స్వయానా అన్న! ప్రజాదరణలో ఎవరు తీసిపోతారు?! రావి ఎనిమిదివేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడేందుకు ఉదాత్త భావనలతో గట్టిగా కృషిచేసిన వ్యక్తి రావి నారాయణరెడ్డి. పెన్షన్లు ఎప్పుడు.. రావి నారాయణరెడ్డి పదహారణాల నాస్తికుడు. కుటుంబసభ్యులు మందిరానికి వెళ్తే కాదనని ప్రజాస్వామ్యవాది. రావి తన వివాహానంతరం ఒక విల్లు రాశారు. తాను మరణిస్తే తన భార్య వైధవ్య ప్రతీకలను ఆమోదించరాదని, కట్టూబొట్టులతో సలక్షణంగా ఉండాలని కోరారు! తర్వాత మార్చారు. ఆదర్శాన్నయినా రుద్దాలా? అనుకున్నారు. అది తన అభిప్రాయం మాత్రమేనని ఆమె తన అభీష్టానుసారం జీవించవచ్చనీ సవరించారు. భార్య మరణించిన అరవై ఏళ్లకు 1991 సెప్టెంబర్ 7న రావి మరణించారు. తన అస్తికలను గంగానదిలో కలపవద్దని పొలంలో చల్లితే చాలని అన్నారు. ఆ మేరకు వారసులు పచ్చని పొలాల్లో రావి ‘విభూది’ని చల్లారు. భూస్వామిగా జన్మించి ఆ వ్యవస్థను భూస్థాపితం చేయడమే లక్ష్యంగా జీవించిన రావి నారాయణరెడ్డి, తన సహచరుడు చెన్నమనేని రాజేశ్వరరావుతో అన్న చివరి మాటలు ఏమిటో తెలుసా? ‘తెలంగాణ పోరాటయోధులకు పెన్షన్లు ఎప్పటిలోగా వస్తాయి?’ ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి -
సమస్యలపై నిరంతర పోరాటం
సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నర్సాపూర్: ప్రతి ప్రజా పోరాటంలోనూ కమ్యూనిస్టులే ముందుంటారని, ఇతర పార్టీలన్నీ కేవలం ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకే ప్రజలను ఉపయోగించుకుంటాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సీపీఎం మెదక్ జిల్లా 12వ మహాసభలు శుక్రవారం నర్సాపూర్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభకు పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఏ.మల్లేశం అధ్యక్షత వహించగా, తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ, చట్టసభల్లో సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నప్పటికీ కమ్యూనిస్టులు ప్రజల గొంతుక వినిపిస్తున్నారన్నారు. సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నారన్నారు. ఇటు ప్రజాక్షేత్రంలోనూ రాజీలేని పోరాటం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే ఏం చేయాలన్నది కేవలం కమ్యూనిస్టులకే తెలుసునన్నారు. బంగారు తెలంగాణే లక్ష్యమంటున్న టీఆర్ఎస్... తన ఆరు నెలల పాలనలో చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల హామీని అమలు చేయడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. కనీసం రైతు ఆత్మహత్యల నివారణకు కూడా చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. అందువల్లే కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లోనూ రైతుల బలవనర్మణాలు చోటు చేసుకున్నాయన్నారు. ఇక కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తామన్న కేసీఆర్.. ఇంతవరకు ఆ దిశగా కనీసం ప్రయత్నించలేదన్నారు. ప్రజలను మోసం చేస్తున్న పార్టీలన్నీ అంతమైపోయి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న కమ్యూనిస్టులను ప్రజలు గెలిపించే రోజులు వస్తాయని తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజల సమస్యలను విస్మరించిన పాలకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి చుక్కరాములు ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారన్నారు. కార్మిక హక్కులను కాలరాసేందుకు సైతం ప్రయత్నిస్తున్నారని, కార్మిక వ్యతిరేక చర్యలను కమ్యూనిస్టులు ఎప్పుడూ ఒప్పుకోరన్నారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలే ఎజెండాగా తమ పార్టీ 12వ మహాసభలు కొనసాగుతాయన్నారు. రెండు రోజుల పాటు పార్టీ ప్రతినిధుల సమావేశం కొనసాగుతుందని ఆయన తెలిపారు. బహిరంగ సభలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ నాయకులు, ఇతర నాయకులు ఏ. మల్లేశం, రాజయ్య, లక్ష్మిభాయి, యదవరెడ్డి, రాంచందర్, మల్లికార్జున్, మల్లేశ్,నందం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు నేసిన కండువాలతో తమ్మినేని వీరభద్రం, చుక్కరాములును సన్మానించారు. భారీ ర్యాలీ సీపీఎం 12వ జిల్లా మహాసభల సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభ నేపథ్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. పార్టీ జిల్లా కార్యదర్శి చుక్కరాములు ఆధ్వర్యంలో స్థానిక ఎడ్లబజారు నుంచి ర్యాలీ ఆరంభమై సభ వేదిక వరకు కొనసాగింది. ర్యాలీలో మహిళలు బతుకమ్మలు, బోనాలు ఎత్తుకుని పాల్గొన్నారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో డోలు దెబ్బ కళాకారులు న ృత్యం చేస్తూ పాల్గొన్నారు. దుబ్బాక చేనేత సంఘం కార్మికులు ట్రాక్టర్‌పై మగ్గం ఏర్పాటు చేసి బట్టలు నేస్తూ పాల్గొనడం అందరిని ఆకట్టుకుంది. గంగపుత్రులు తమ వలతో పాటు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో కార్మికులు, మహిళలు, ఆయా వర్గాల వారు సీపీఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో నర్సాపూర్ మార్మోగింది. -
చెన్నమనేనికి అస్వస్థత
వేములవాడ: సీని యర్ కమ్యూనిస్టు నాయకుడు, సిరి సిల్ల మాజీ ఎమ్మె ల్యే సిహెచ్.రాజేశ్వర్‌రావు తీవ్రఅస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బాత్రూమ్లో జారిపడ్డారు. కుటుంబసభ్యులు సోమాజీగూడలోని యశోధ ఆసుపత్రికి తరలించారు. కుడికాలు తుంటి ఎముక విరగటంతో శస్త్రచికిత్స చేయాల్సిఉంటుందని వైద్యులు వెల్లడించినట్లు బంధువులు తెలిపారు. ప్రస్తుతం రాజేశ్వర్‌రావుకు షుగర్, బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉండటంతో వాటికి చికిత్స చేస్తున్నారని, సాధారణ స్థితికి రాగానే శస్త్రచికిత్స నిర్వహించనున్నారని చెప్పారు. సమాచారం అందుకున్న ఆయన కుమారుడు, వేములవాడ ఎమ్మెల్యే సిహెచ్.రమేశ్‌బాబు జర్మనీ నుంచి హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారం. -
వామపక్షాలన్నీ ఐక్యంగా ముందుకు పోవాలి
వామపక్ష మేధావులు హైదరాబాద్: నాటి ఉద్యమ స్ఫూర్తితో వామపక్ష పార్టీలన్నీ ఐక్యంగా ముందుకు సాగాలని పలువురు వామపక్ష మేధావులు, సానుభూతిపరులు సూచించారు. బూర్జువా పార్టీలతో కలసి పోటీ చేయడంతో కమ్యునిస్టు పార్టీలపై ప్రజల్లో న మ్మకం పోయిందని వారు అన్నారు. 2019 ఎన్నికలు మావే అన్న లక్ష్యంగా అన్ని కమ్యునిస్టుపార్టీలు ఐక్యకార్యచరణతో ముందుకు పోవాలని వారు సూచించారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 10 వామపక్ష పార్టీల మేధావులు, ఆలోచనా పరులతో సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య అధ్యక్షతన చర్చా గోష్టి జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, ప్రొఫెసర్స్ హరగోపాల్, ఘంటా చక్రపాణి, రమా మెల్కోటే, భాంగ్య భూక్య, ప్రొఫెసర్ కె.ఆర్.చౌదరి తదితరులు పాల్గొని ప్రసంగించారు. చుక్కా రామయ్య మాట్లాడుతూ నాటి కమ్యునిస్టు నాయకుల స్ఫూర్తి నేడు కరువైందని అన్నారు. నేటి ఉద్యమాలు అట్టడుగు ప్రజలకు ఉపయోగపడే విధంగా లేకుండా కొన్ని స్వార్ధ శక్తుల ప్రయోజనాల కోసం ఏర్పడుతున్నాయుని, ఇది కమ్యునిస్టుల దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ 1964కు ముందు అంతా ఒకే కమ్యునిస్టు భావాలతో పని చేశారని, ఆ తర్వాత ఎందుకు విడిపోయారని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణలో 240 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. దీనిపై రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీసు వద్ద బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారని, మీరెందుకు వెనకబడ్డారని ప్రశ్నించారు. కమ్యునిస్టులంగా ఏకతాటి పైకి రావాలని సూచించారు. హరగోపాల్ మాట్లాడుతూ బీజేపీ లాంటి పార్టీలు వినాయకచవితి, జై శ్రీరాం దేవతల పేర్లతో ప్రజల్లో మమేకం అవుతున్నారని, మీకెందుకు పండుగలు లేవని అన్నారు. మీరు ఆ దిశగా ఆలోచించాలని సూచించారు. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ వామపక్షాలు ఉద్యమం చేయటంలో ముంద ంజలో ఉన్నాయని.. ఎన్నికల సమయంలో తమ స్వార్ధ ప్రయోజనాలకోసం ఒకటి, రెండు కమ్యునిస్టు పార్టీలు బూర్జువా పార్టీలతో పొత్తు పెట్టుకోవటం వల్ల ప్రజల్లో క మ్యూనిస్టులపై నమ్మకం పోయిందని అన్నారు. రమా మెల్కోటే మాట్లాడుతూ వామపక్ష పార్టీలు ఎన్నికల్లో ఒకే వేదికపైకి వచ్చి నిలబడితే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. కమ్యునిస్టు పార్టీలో కూడ కమ్మ, రెడ్డిలే రాష్ట్ర, జాతీయ స్థాయిలో పని చేస్తున్నారని, ఎస్సీ, ఎస్టీలు ఎందుకు ఆ స్థాయిలో లేరని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణ, సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, సీపీఐ నాయకులు చాడ వెంకట్ రెడ్డి, గుండా మల్లేష్, ఆర్ఎస్పీ నాయకులు జానకిరాములు, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కె.గోవర్ధన్, సూర్యం, వివిద పార్టీల నాయకులు భూతం వీరన్న, జూలూరి గౌరీశంకర్, ఎస్.వెంకటేశ్వర్ రావు, గడ్డం ఝాన్సీ, ప్రదీప్, మురారి, జీవన్ కుమార్‌లతో పాటు అనేక మంది మేధావులు, సానుభూతిపరులు పాల్గొన్నారు. -
నేలకొరిగిన ఉద్యమ కెరటం
పౌరహక్కుల నేత ఎంటీ ఖాన్ మృతితో విషాదఛాయలు ఉద్యమ నేతగా,జర్నలిస్టుగా సుపరిచితం సంతాపం తెలిపిన పలువురు నేతలు సాక్షి, సిటీబ్యూరో: తొలితరం కమ్యూనిస్టు నేత, పౌరహక్కుల ఉద్యమ సంస్థ వ్యవస్థాపకుడు, ప్రముఖ రచయిత, సీనియర్ పాత్రికేయుడైన ఎంటీ ఖాన్ మృతి ఆయన అభిమానుల్లో విషాదాన్ని నింపింది. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన ఖాన్ అనేక చారిత్రక పరిణామాలకు కేంద్రబిందువుగా నిలిచారు. ఎంతోమంది ఉద్యమకారులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేశారు. జీవించే హక్కు ప్రశ్నార్థకమైన ప్రతి సందర్భంలో ఆయన ఒక ఉద్యమ కెరటమై ఎగిసారు. మగ్దుం మొహియొద్దీన్ రచించిన ‘సుర్ఖ్‌సవేరా’ (అరుణోదయం) ఆయన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. చదువుకునే రోజుల్లోనే ఉద్యమ బాట పట్టించింది. ఉద్యమకారుడిగానే కాకుండా ‘న్యూస్‌టైమ్,‘ సియాసత్’ వంటి దినపత్రికల్లో జర్నలిస్టుగా సేవలందించారు. ఎంటీ ఖాన్‌గా సుపరిచితులైన మహ్మద్ తాజుద్దీన్ ఖాన్ మరణంతో పౌర హక్కుల నేతలు ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. ఉద్యమ ప్రస్థానం... వైభవోపేతమైన నిజాం పరిపాలనకే కాదు. దళిత, అణగారిన వర్గాలు, హిందూ-ముస్లింల సహజీవనానికి కేంద్రమైన పురానాఫూల్‌లో ఎంటీఖాన్ జన్మించారు. తల్లి మతిస్థిమితాన్ని కోల్పోవడంతో చిన్నప్పటి నుంచి దళితుల ఇళ్లల్లోనే పెరిగారు. ‘అందుకే జన్మతహా ముస్లిం అయినా పెంపకం రీత్యా తెలుగువాడినే’ అంటారాయన. సిటీ కాలేజీ హైస్కూల్లో చదువుకున్నారు. ఆ రోజుల్లో మగ్దుం మొహియొద్దీన్ అక్కడ ఉపాధ్యాయుడు. ఆయన చెప్పే పాఠాలు విద్యార్థులను బాగా ప్రభావితం చేసేవి. మగ్దుం రాసిన ‘సుర్ఖ్‌సవేరా’ గ్రంథాన్ని ప్రభుత్వం నిషేధించింది. మగ్దుం సాహిత్య పరిమళాలు నగర వాసుల్లో ఉద్యమ చైతన్యాన్ని నింపాయి. అలా మగ్దుం నుంచి స్ఫూర్తి పొందిన ఎంటీ ఖాన్ ఆయన చూపిన బాటలోనే నడిచారు. ఆ రోజుల్లో కమ్యూనిస్టులు ‘కామ్రేడ్స్ అసోసియేషన్’ పేరుతో సంఘటితమయ్యారు. పదోతరగతి చదివే రోజుల్లోనే ఖాన్ ఆ పార్టీలో సభ్యత్వం పొందారు. గులాంహైదర్, శ్రీనివాస్ లహూటి, పి.లక్ష్మీరాజ్, జి.రాంచందర్, పొన్నయ్య, పరమేశ్వర్, శంకర్‌దాస్ వంటి నగర ప్రముఖులు అప్పటి కమ్యూనిస్టు పార్టీ సభ్యులు. క్రియాశీల కార్యకర్తగా పని చేశారు. ఆ తరువాత పార్టీలో అనేక చీలికలు చోటుచేసుకున్నాయి. ఏడో దశాబ్దం నాటి నక్సల్బరీ వసంత మేఘగర్జన ఆయన్ను ప్రభావితం చేసింది. ఆ రోజుల్లో నారాయణగూడలోని వైఎంసీఏ హాల్ విప్లవకారుల సమావేశాలకు కేంద్ర బిందువుగా ఉండేది. తరిమెల నాగిరెడ్డి, కొండపల్లి సీతారామయ్య వంటి ప్రముఖుల పరిచయం, ప్రసంగాలు ఖాన్ జీవితాన్ని మలుపు తిప్పాయి. 1972లో కొండపల్లి నేతృత్వంలో వెలువడిన ‘పిలుపు’ పక్షపత్రిక నిర్వహణలో ఖాన్ కీలక భూమికను పోషించారు. శ్రీకాకుళ ఉద్యమం నుంచి స్ఫూర్తిని పొందారు. నగరంలో జరిగిన ప్రతి సాహిత్య, చారిత్రక ఉద్యమాలన్నింటిలోనూ పాల్గొన్నారు. చెరబండరాజు, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ వంటి దిగంబర కవులు, శ్రీశ్రీ, సత్యమూర్తి వంటి విప్లవ రచయితలతో బాగా ప్రభావితమయ్యారు. సికింద్రాబాద్ కుట్ర కేసులో అరెస్టు కాగా ఏడాదికిపైగా జైలు జీవితం గడిపారు. ఆ తరువాత ఎమర్జెన్సీ రోజుల్లోనూ జైలు శిక్షను అనుభవించారు. ఎమర్జెన్సీ అనంతరం జైలు నుంచి బయటకు వచ్చాక ఏపీసీఎల్సీలో చురుగ్గా పాల్గొన్నారు. రెండేళ్లపాటు ఆ సంఘానికి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ బుక్ ట్రస్టులో పని చేశారు. ఉర్దూ, ఇంగ్లిష్ దినపత్రికల్లో పాత్రికేయుడిగా విధులు నిర్వహించారు. ఉద్యమానికి తీరని లోటు.. ఎంటీ ఖాన్ మరణం పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఏపీసీఎల్సీ మాజీ అధ్యక్షుడు ఖాన్ మరణం హక్కుల ఉద్యమానికి తీరని లోటు అని మానవ హక్కుల వేదిక రాష్ర్ట అధ్యక్షులు ఎస్.జీవన్‌కుమార్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హక్కుల ఉద్యమకారుడిగా, కమ్యూనిస్టుగానే కాకుండా రచయితగా, పాత్రికేయుడిగా సుపరిచితులైన ఖాన్‌తో అనుబంధం ఎప్పటికీ మరిచిపోలేనిదని ప్రముఖ కవి నిఖిలేశ్వర్ పేర్కొన్నారు. విలువల కోసం పనిచేసిన మేధావి ఎంటీ ఖాన్ కల్లోల దశాబ్దంలో పాతనగరంలో వికసించిన ఎర్రయోధుడు ఎంటీ ఖాన్ అని ప్రముఖ కవి, పరిశోధకుడు జయధీర్ తిరుమలరావు అన్నారు. ఖాన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన జీవితం తెరిచిన పుస్తకమని, ప్రగతిశీల రంగంలో ఉన్నత విలువలతో పనిచేసిన మేధావి అని కొనియాడారు. -
ఉద్యమాలకు పుట్టిల్లు.. క్రీడలకు మెట్టినిల్లు
ఆచంట, న్యూస్‌లైన్ : పచ్చని పంట పొలాలు.. పుడమి తల్లికి వింజామరలు పట్టినట్టుండే కొబ్బరి తోటలు.. గలగల పారే గోదావరి.. దీవుల్లాంటి లంక గ్రామాలు.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు.. ఆహ్లాదకర వాతావరణాల కలబోత ఆచంట నియోజకవర్గం. పల్లె ప్రాంతమైనా ఇక్కడి ప్రజలు మాత్రం పట్టణ వాసులకు దీటుగా రాజకీయ చైతన్యంతో వ్యవహరిస్తుంటారు. జిల్లాలోనే అత్యధికంగా కమ్యూనిస్టుల ప్రభావం కలిగిన నియోజకవర్గం ఇది. ఉద్యమాలకు పుట్టినిల్లుగా.. క్రీడలకు మెట్టినిల్లుగా భాసిల్లుతోంది. చరిత్రలో ప్రసిద్ధికెక్కిన కాళీపట్నం పోరాటం.. వ్యవసాయ కూలీ ఉద్య మం.. ఆకలి యాత్ర తదితర పోరాటాలలో ఈ ప్రాంతవాసులు ప్రధాన భూమికను పోషించారు. ఉద్యమాల్లో అమరులైన ప్రేరేప మృత్యుంజయుడు, ఒక తాళ్ల బసవ మల్లయ్య వంటి ధీరులెందరో పుట్టిన గడ్డ ఇది. రిజర్వుడు నియోజకవర్గమైన ఆచంట 1962లో ఏర్పడింది. 2009 పునర్విభజనలో జనరల్ కేటగిరీకి మారింది. పునర్విభజన అనంతరం నియోజకవర్గ స్వరూపమే మారిపోయింది. పెనుగొండ నియోజకవర్గం రద్దయి పెనుగొండ, పెనుమంట్ర, ఆచంట మండలాలతోపాటు పోడూరులో సగభాగంతో ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. ఇప్పటివరకూ నియోజవర్గంలో 11సార్లు ఎన్నికలు జరగ్గా, అన్ని ప్రధాన పార్టీలను గెలిపించి ఆచంట ఓటరు తమ విలక్షణతను చాటుకున్నారు. ఇప్పటివరకూ ఒకసారి ఉభయ కమ్యూనిస్టు పార్టీ, మూడుసార్లు సీపీఎం, మూడుసార్లు టీడీపీ, నాలుగుసార్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందాయి. 286 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గానికి తూర్పున వశిష్ట గోదావరి, పడమర తణుకు నియోజకవర్గం, ఉత్తరాన ఎన్‌హెచ్-5 జాతీయ రహదారి, దక్షిణాన పాలకొల్లు నియోజకవర్గం సరిహద్దులుగా ఉన్నాయి. పెనుగొండలో ప్రసిద్ధి గాంచిన ఎస్వీకేపీ డిగ్రీ, పీజీ కళాశాలలు, ఆచంటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రైవేట్ డిగ్రీ కళాశాల, పోడూరులో కల్నల్ డీఎస్ రాజు పాలిటెక్నిక్ కళాశాల, పెనుమంట్ర మండలంలో రెండు ప్రైవేటు డిగ్రీ కళాశాలు, డైట్, బీఈడీ, పీఈటీ కళాశాలలు ఉన్నాయి. మార్టేరులోని వరిపరిశోధనా కేంద్రం రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. దేశంలోనే ప్రసిద్ధి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం, వాసవీధామ్, ఆచంటలోని జైన దేవాలయం, పెదమల్లంలో మాచేనమ్మ ఆలయం, ఆచంటలో ఆచంటేశ్వరస్వామి ఆలయం, పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలో నత్తా రామేశ్వరస్వామి, జుత్తిగలోని సోమేశ్వర ఆలయాలు పురాణ ప్రాశస్త్యం పొందారుు. క్రీడలకు స్ఫూర్తి క్రీడలకు, క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చే నియోజవర్గంగా ఆచంట వెలుగొందుతోంది. పరుగుల రాణి సత్తి గీత ఈ ప్రాంతానికి చెందినవారే. మార్టేరులో బాస్కెట్‌బాల్, ఆచంటలో వాలీబాల్ పోటీలను రాష్ట్రస్థారుులో నిర్వహిస్తుంటారు. అంతర్జాతీయ వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీల్లో నియోజకవర్గానికి చెందిన పలువురు క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. ప్రస్తుత పరిస్థితి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంది. పలువురు నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు వైఎస్సార్ సీపీలో చేరారు. పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన తాజా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆ పార్టీని వీడి టీడీపీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. పితాని చేరికతో టీడీపీలో వర్గపోరు మొదలైంది. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా వెలుగొందిన ఈ నియోజకవర్గంలో క్రమంగా ఆ పార్టీ పట్టు కోల్పోరుుంది. ప్రజా సమస్యలపై పోరాటాల ద్వారా ఆ పార్టీ ఉనికిని చాటుకుంటోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో వెనుకబడిన తరగతులకు చెందిన పితాని సత్యనారాయణకు జనరల్ నియోజకవర్గమైన ఆచంట టికెట్ ఇచ్చి సుదీర్ఘ విరామం తరువాత తెలుగుదేశం కంచు కోటను బద్దలు కొట్టించారు. అంతే కాకుండా పితానికి తన మంత్రి వర్గంలో చోటు కల్పించారు. అంతకు ముందు 1967లో ఇక్కడి నుంచి గెలుపొందిన దాసరి పెరుమాళ్లు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు. -
ఏ బురఖానూ వేసుకోకుండానే ప్రజాకళాకారుణ్ణయాను : వరంగల్ శ్రీనివాస్
పాట ఎక్కడ ఉంటే శ్రీనివాస్ అక్కడ ఉంటాడు. అతనికి ప్రాంతంతో పనిలేదు. కులమతజాతి వివక్ష అసలే లేదు. శ్రీనివాస్ లక్ష్యం ఒక్కటే.. ఎక్కడ అన్యాయం జరిగితే.. అక్కడ పాటతో ప్రతిఘటించడం. అలాగని తను కమ్యూనిస్ట్ కాదు, మావోయిస్ట్ అంతకన్నా కాదు. అతనో హ్యూమనిస్ట్. పాటతో జనహృదయాల్లో ఎర్రగులాబీలు పూయిస్తున్న ప్రజాకళాకారుడు వరంగల్ శ్రీనివాస్ సినిమాల్లో కూడా రచయితగా తనదైన ముద్రను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయనతో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ... *** మీ అసలు పేరేంటి? బొడ్డు శ్రీనివాస్. దాసరిగారు ‘వరంగల్ శ్రీనివాస్’ అని పిలిచేవారు. ఇక అందరూ అలాగే పిలవడం మొదలుపెట్టారు. మాది వరంగల్ జిల్లా. నా జిల్లా పేరు నా పేరు ముందుండటం గర్వకారణమే కదా. అందుకే అలాగే కొనసాగుతున్నా. *** కమ్యూనిస్ట్ కాని మీకు వామపక్ష భావజాలం ఎలా అలవడింది? మాది ఆత్మకూరు మండల్, తక్కెళ్లపాడు. పల్లె జానపదాలకు మా ఊరు పేరెన్నికగన్నది. మా అమ్మ, మా మేనత్తలు కూడా జానపదాలను చక్కగా ఆలపించేవారు. దుక్కి దున్నేటప్పుడూ నారు పోసేటప్పుడూ వడ్లు దంచేటప్పుడూ తిరగలి తిప్పేటప్పుడూ జోల పాడేటప్పుడూ.. ఇలా పని జరుగుతున్న ప్రతి చోటా మా ఊళ్లో పాట వినిపిస్తూ ఉండేది. అలాంటి వాతావరణంలో పెరిగాను నేను. పాట వినడమే కాదు, వాళ్లతో పాటు చిన్నప్పట్నుంచే గొంతు కలిపేవాణ్ణి. అలా పాట అనేది నా జీవితంలో భాగం అయిపోయింది. నా ఏడోతరగతిలోనే సొంతంగా పాట రాశాను. రాసిన తొలిపాటకే ప్రథమ బహుమతి వచ్చింది. అప్పట్నుంచి నా రచనా ప్రస్థానం మొదలైంది. పల్లె జానపదాల బాణీలను తీసుకొని ప్రస్తుత సమస్యలపై సొంతంగా పాటలు రాసేవాణ్ణి. అలా 93 అణగారిన జాతులపై పాటలు రాశాను. కమ్యూనిస్ట్, మావోయిస్ట్, సోషలిస్ట్... ఇలా ఏ బురఖా వేసుకోకుండానే... నేను కూడా ప్రజాకళాకారుణ్ణి అయ్యాను. *** మొత్తం ఎన్ని భాషల్లో పాటలు రాశారు? తెలుగు, బెంగాలీ, అస్సామీ, ఒరియా, లంబాడీ, కోయ, గొండు భాషల్లో ఎన్నో పాటలు రాయడమే కాదు, సొంతంగా పాడేవాణ్ణి కూడా. *** సినీ గీతరచయిగా తొలి అవకాశం ఎలా వచ్చింది? వరంగల్ నెహ్రూగారు.. నన్ను దర్శక, రచయిత సంజీవిగారికి పరిచయం చేశారు. ఆయన ద్వారానే దాసరిగారికి దగ్గరవ్వగలిగాను. సినీ రచయితగా నేను తొలి అడుగు వేసింది దాసరిగారి ద్వారానే. ‘అడవి చుక్క’ చిత్రంలో ‘తయ్యుందత్తై.. తయ్యుందత్తై నేను రాసిన తొలి పాట. అదే సినిమాలో నేను రాసిన ‘ఎవరు అన్నారమ్మ మేమూ... గరీబోళ్లనీ’ పాటైతే పెద్ద హిట్. అలాగే దాసరిగారి ‘చిన్నా’ చిత్రంలో నేను రాసిన ‘గువ్వా గువ్వా ఎగిరేటి గువ్వా ఏడికే సిరిసిరి మువ్వా’ పాట విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆర్.నారాయణమూర్తి కూడా నన్నెంతో ప్రోత్సహించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన చలో అసెంబ్లీ, వేగుచుక్కలు, ఊరు మనదిరా, అడవిబిడ్డలు, వీరతెలంగాణ, పోరు తెలంగాణ, అమ్మమీద ఒట్టు చిత్రాలతోపాటు రేపు రాబోతున్న ‘నిర్భయభారతం’ చిత్రానికి కూడా పాటలు రాశాను. ఇందులో అడవిబిడ్డలు, వీరతెలంగాణ చిత్రాల్లో నటించాను కూడా. ఎర్ర సినిమాలే కాక, ఫూల్స్, ఆయుధం, ఈ వయసులో, రెండేళ్ల తర్వాత, రఘుపతి లాంటి వాణిజ్య చిత్రాలక్కూడా పాటలు రాశాను. *** ఓ కళాకారునిగా మీ లక్ష్యం? గీత రచయితగా అన్ని రకాల పాటలు రాయాలనుంది. డ్యూయెట్స్, ఐటమ్ సాంగ్స కూడా నేను రాయగలను. అవకాశం వస్తే నేనేంటో రుజువు చేసుకుంటా. అలాగే... సంగీత దర్శకత్వం వహించాలని ఉంది. గతంలో ఓసారి అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. త్వరలో నా కోరిక తీరబోతోంది. -
ఒక్కటైన ఐదు కమ్యూనిస్టు పార్టీలు