ఆయన జీవితం ఒక అద్భుతం. ఆయన పోరాటం అనన్యం. ఏకైక తెలుగు ‘గదర్’ వీరుడు. వ్యవసాయ శాస్త్రం చదవడానికని విదేశాలకు వెళ్ళి సమాజంలో అసమాన తలు చూసి చలించిపోయి విప్లవాన్ని విలక్షణంగా అధ్యయనం చేసిన ధీరుడు. తెలుగులోనే కాదు, యావత్ దేశంలోనే ప్రప్రథమ అరాచకవాద (అనార్కిస్ట్) తత్వవేత్తల్లో ఒకరు. విస్తృతమైన జీవితాను భవాలను అక్షరీకరించి ‘నేనూ–నా దేశం’ పేరిట అద్వితీయమైన ఆత్మకథను తెలుగు ప్రజకి అందించాడు. ఆయనే దరిశి చెంచయ్య.
సామాన్య సంప్రదాయ కుటుంబంలో జన్మించి అసామాన్య యోధుడిగా ఎదిగిన ఆయన జీవితం ఎప్పటికీ నిత్య పఠనీయం. యావత్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి రాజకీయ డిటెన్యూగా దేశంలో ఆనాడు ఆయన్ని ఉంచని జైలు లేదంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్య్రోద్యమంలో అతివాద టెర్రరిస్టు కార్యకలాపాలలో పాల్గొనడమే కాక కాంగ్రెస్ నాయకుడిగా, గాంధేయవాదిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. సోషలిస్టుగా, కమ్యూనిస్టుగా, మానవతావాదిగా, సాహిత్యకారుడిగా, సామా జిక వేత్తగా, సంఘ సంస్కర్తగా, సాంస్కృతిక ఉద్యమకారుడిగా చెంచయ్య ప్రజ్ఞ బహుముఖం.
చెంచయ్య ఆత్మకథ... అనేకమంది విప్లవ వీరులూ, స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రల సమాహారం. ఒక విధంగా చెప్పాలంటే సమకాలీన చరిత్రను రికార్డు చేసిన గ్రంథం. అందుకే తెలుగులో వచ్చిన ఆత్మకథల్లో అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా ఇది నిలుస్తుంది. సరిగ్గా 70 ఏళ్ళ క్రితం... 1952 సెప్టెంబర్‌లో మొదటిసారిగా ప్రచురించబడిన ‘నేను–నా దేశం’ గ్రంథాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఉరి కొయ్యలకు బలైపోయిన తన పంజాబ్ మిత్రుడు సర్దార్ బలవంత్ సింగుకూ, ఆయన భార్యకీ అంకితం ఇచ్చారు. నాకు తెలిసి తెలుగులో ఒక పంజాబ్ విప్లవ దంపతులకు అంకితమిచ్చిన ఏకైక తెలుగు స్వీయచరిత్ర ఇదే. అందుకే నార్ల ఈ పుస్తకానికి పీఠిక రాస్తూ, ‘‘శ్రీ చెంచయ్య గారి ‘నేనూ – నా దేశం’ నిస్సంశయంగా ఉత్తమ శ్రేణికి చెందిన ఆత్మకథ. నిజానికి అది ఆయన ఆత్మకథ కాదు; మన దేశ చరిత్ర. పోయిన అర్ధ శతాబ్దిలో మన దేశంలో ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో వచ్చిన ప్రతి మహోద్యమం చెంచయ్య జీవిత దర్పణంలో తన ప్రతిబింబాన్ని మిగిల్చింద’’ని అంటారు.
స్వాతంత్య్ర సమరయోధుడు, ‘ప్రభవ’ పత్రిక వ్యవస్థాపకులు గద్దె లింగయ్య మొదటిసారి ముద్రించిన నాలుగొందల పుటల ఈ స్వీయచరిత్ర అద్భుతమైన విప్లవకారులు జితేంద్ర నాధ లాహిరీ నుండి మొట్టమొదటి భారతీయ అనార్కిస్టు, గొప్ప బౌద్ధ, భౌతికవాద రచయిత లాలా హర్ దయాళ్ వరకూ; జోధ్ సింగ్, చిదంబరం పిళ్లై, నీలకంఠ బ్రహ్మ చారి... వంటి అనేకమందీ మనకి పరిచయం అవుతారు. మొదటి వైశ్య వితంతు వివాహం మొదలు కొని వితంతు శిశు శరణాలయాల స్థాపన దాకా; ‘మా భూమి’ నాటక ప్రదర్శనలు, అమెరికా, జపాన్, చైనా, రష్యా, సింగపూర్ దేశాలలోని పరిస్థితులు, విప్లవ రాజకీయాల్ని కూడా ఇందులో మన కళ్ళకు కడతారు.
ఇదంతా ఒక ఎత్తయితే మహామేధావి డాక్టర్ కేబీ కృష్ణతో చెంచయ్యకి ఉన్న అమితమైన స్నేహం ఒక్కటీ ఒకెత్తు. జైలులో ఉన్న సమయంలో కేబీ కృష్ణ మార్క్స్ ‘కేపిటల్’ గ్రంథం మీద అందరికీ క్లాసులు చెప్పే వారంటూ, ‘ఆయన శక్తి మాకు ఆశ్చర్యం కలిగించింది... ఆయన రాజకీయ ఆర్థిక శాస్త్రాలలో పారంగతుడు; వేదాంత శాస్త్రంలో అసమాన పాండిత్యం కలవాడు.. వారి సహాయంతో డిటెన్యూల క్యాంపు ఒక సర్వకళాశాలగానూ, విప్లవ కళాశాలగానూ మారిందని’ అంటారు చెంచయ్య. ‘నేను కమ్యూనిస్టు కావడానికి ముఖ్య కారణం స్త్రీల కష్టాలను తొలగించడానికి ప్రయత్నాలు చేసి, చేసి పూర్తిగా సాధించలేక పోవడం వల్ల కలిగిన అసంతృప్తి..’ అని రాసుకున్నారాయన.
పది సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీలో ఉన్నప్పటికీ కమ్యూనిస్టు కాలేకపోయానని నిజాయితీగా రాసుకున్న నిజమైన కమ్యూనిస్టు ఆయన. బీడీ కార్మికులు, చుట్ట కార్మికులు, స్పెన్సర్ కంపెనీ కార్మికులు, కార్పొరేషన్ కార్మికులు, ఇంకా పారిశుద్ధ్య కార్మికులు వంటివారు చేసిన పోరాటాలు అన్నిం టిలోనూ క్షేత్ర స్థాయిలో పాల్గొన్న ఆయన ‘అభ్యుదయ రచయితల మహాసభ’ మొదలు ‘ప్రజానాట్యమండలి’ వరకూ అనేక ప్రజా సంఘాలతో మమేకమై పని చేశారు. వాటిల్లోని లోపాలను కూడా చాలా సూటిగా చెప్పారు, రాశారు. కనుకనే స్వీయచరిత్ర ముగిస్తూ ఈ దేశానికి, మన సమాజానికి, ‘ఒక మహత్తర సంస్కృతీ ఉద్యమము’ అవసరం అని ప్రత్యేకంగా నొక్కి వక్కాణించారు. (చదవండి: భరత జాతికి ఒక ఆంగ్ల నాడి)
చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులకు తాళలేక, ఎవరి దగ్గరా చేయి చాచలేక ఇంట్లో సామానులు అమ్ముకున్న వైనం మనల్ని కదిలిస్తుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి చెంచయ్యకు తెలుగు నేలపై ఇప్పటికీ తగిన గుర్తింపు రాలేదనడం అవాస్తవం కాదు. 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆయన స్వీయ చరిత్ర ‘నేనూ– నా దేశం’ లోని కొంత భాగాన్నయినా విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టే దిశగా ప్రభుత్వం యోచన చేయాలి.
- గౌరవ్
చెంచయ్య సాంస్కృతిక వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు
(దరిశి చెంచయ్య స్వీయచరిత్ర ‘నేనూ – నా దేశం’తెలుగు లోకానికి అంది 70 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా)
Comments
Please login to add a commentAdd a comment