empowerment of women
-
సెల్ఫ్ ఎంపవర్మెంట్
కోల్‌కతాకు చెందిన దీప్తి ఘోష్ ఇంజనీరింగ్ చదువుకుంది. తండ్రి చనిపోవడంతో కుటుంబ బరువు బాధ్యతలు తనపై పడ్డాయి. ఉద్యోగాల వేటలో పడింది. అయితే వచ్చిన ఒకటీ రెండు ఉద్యోగాలు ‘ఔట్ ఆఫ్ కోల్‌కతా’ వచ్చాయి. తల్లి, చెల్లిని విడిచి దూరంగా ఉండలేని పరిస్థితి. సిటీలో ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందో ఏమో అనుకునే పరిస్థితుల్లో ఖాళీగా ఉండడం ఎందుకని క్యాబ్ డ్రైవర్‌గా మారింది. మంచి ఆదాయాన్ని అర్జిస్తూ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా నిలుస్తోంది. దీప్తి క్యాబ్‌లో ప్రయాణించిన దిల్లీకి చెందిన పరమ్ కల్యాణ్‌సింగ్ ఆమె స్టోరీని పోస్ట్ చేస్తే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘సెల్ఫ్ ఎంపవర్మెంట్ అంటే ఇదే’ ‘చదువుకు తగ్గ ఉద్యోగం దొరకడం లేదని బాధపడుతూ కూర్చోవడం కంటే ఇది ఎంత గొప్ప పని!’ ‘దీప్తి తన వృత్తిని గౌరవిస్తుంది. శ్రమజీవుల లక్షణం ఇది. స్త్రీ సాధికారతకు తిరుగులేని ఉదాహరణ దీప్తి’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. -
వేతన వివక్ష
జెండర్ ఈక్వాలిటీ కోసం సమాజంలో దశాబ్దాలుగా ఒక నిశ్శబ్ద ఉద్యమం సాగుతూనే ఉంది. కానీ మహిళ అయిన కారణంగా వేతనంలో వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. వేతనంలో అసమానతలకు బీజాలు అడుగడుగునా పడుతూనే ఉన్నాయి. ఈ విషయంలో పాశ్చాత్య దేశాల పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని, మనదేశంలో సమానత సాధనలో అంతరం పెరుగుతోందని, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్వో) నివేదికను ఉదహరించారు సామాజిక కార్యకర్త మమతా రఘువీర్. ఆమె తన అధ్యయన వివరాలను సాక్షితో పంచుకున్నారు. ఐటీలోనూ ఉంది! ‘‘చదువులో సమానత్వసాధనలో లక్ష్యానికి దగ్గరకు వస్తున్నట్లే చెప్పాలి. కానీ ఉద్యోగాల దగ్గరకు వచ్చేటప్పటికి సమానత్వం చాలాదూరంలోనే ఉంది. అలాగే ఉద్యోగంలో వేతనాలు కూడా. ఐఎల్వో గ్లోబల్ రిపోర్ట్ 2020–21లో విడుదల చేసిన నివేదిక అతిపెద్ద ఆశనిపాతం. 1993–94లో మగవాళ్లకు ఆడవాళ్లకు మధ్య వేతన దూరం 48 శాతం ఉండేది. 2018–19 నాటికి ఆ దూరం తగ్గి 28 శాతానికి చేరింది. అయితే కరోనా కుదుపుతో మహిళల వేతనాల తగ్గుదల ఏడు శాతం పెరిగింది. ఇప్పుడు మగవాళ్లకు మహిళలకు మధ్య వేతన అసమానత 35 శాతం. వ్యవసాయరంగం, భవన నిర్మాణరంగం వంటి అవ్యవస్థీకృత రంగాల్లోనే ఈ అసమానత అనుకుంటాం. కానీ ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో కూడా తేడా ఉంటోందని లింక్డ్ ఇన్ చేసిన సర్వేలో వెల్లడైంది. వేతనంలో కనిపిస్తున్న జెండర్ గ్యాప్, జెండర్ డిస్క్రిమినేషన్తోపాటు హెరాస్‌మెంట్‌ను కూడా ప్రస్తావించింది లింక్డ్ ఇన్. మెటర్నిటీ లీవులేవీ! వేతనంలో జెండర్ డిస్క్రిమినేషన్‌కు గురి కానిది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే. కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు ఈ వివక్షకు గురవుతూనే ఉన్నారు. మరో విషయం ఏమిటంటే. ఒకేసారి ఉద్యోగంలో చేరిన మగవాళ్లకు ఆడవాళ్లకు మధ్య ఏళ్లు గడిచేకొద్దీ వేతనంలో తేడా పెరుగుతూనే ఉంటోంది. ఇందుకు కారణం కుటుంబ బాధ్యతలు, తల్లి అయినప్పుడు తీసుకునే విరామం. చాలా కంపెనీలు మహిళలకు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవు ఇవ్వడం లేదు. గర్భిణి అనగానే ఏదో ఓ కారణంతో ఉద్యోగం నుంచి తొలగించడంతోపాటు ఒకవేళ సెలవు ఇచ్చినా వేతనం ఇవ్వని కంపెనీలు కొల్లలు. ఇక కాంట్రాక్టు ఉద్యోగంలో ఉన్న మహిళలకు జరిగే అన్యాయం మీద దృష్టి పెట్టే సమయం ప్రభుత్వాలకు ఉండడం లేదు. ఏడేళ్లే ఉంది! యూఎన్ఓ సూచించిన లక్ష్యాల్లో ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్ నంబర్ 8’ ఒకటి. దీని ప్రకారం 2030 నాటికి సమాన వేతన సాధన అనే లక్ష్యాన్ని సాధించాలి. ఆ గడువు ముగియడానికి ఏడేళ్లే ఉంది. లక్ష్య సాధనలో మనం మరింత దూరం జరుగుతున్నాం తప్ప దగ్గరకు చేరడం లేదు. నాకు తెలిసిన ఐఐటీ , ఐఐఎమ్‌లో చదివిన మహిళలు కూడా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ వరకు వెళ్ల గలుగుతున్నారు. ఆ తర్వాత స్థానాలకు వెళ్లడం లేదు, వెళ్లడం లేదు అనేకంటే వెళ్లనివ్వడం లేదు అనడమే కరెక్ట్. సంఖ్యాపరంగా మహిళా ఉద్యోగులు దాదాపు సమానంగా ఉన్న కంపెనీల్లో కూడా ప్రెసిడెంట్, డైరెక్టర్ స్థానాల్లో మహిళలను చూడలేం. ఆశావహంగా అనిపించే విషయం ఏమిటంటే... మునుపటి తరం కంటే ఈ తరం అమ్మాయిలు గట్టిగా నిలబడగలుగుతున్నారు. రాబోయే తరం ఇంకా గట్టి మనో నిబ్బరంతో ముందడుగు వేస్తారని నా ఆకాంక్ష’’ అన్నారామె. అవకాశాల్లోనే హంసపాదు పబ్లిక్ సెక్టార్‌లోనూ, ప్రభుత్వ రంగంలోనూ అనేక ఆఫీసుల్లో వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ కమిటీల్లో మెంబర్‌గా ఉన్నాను. మగ అధికారులు ఉద్యోగినులతో ‘నీకు ఇవన్నీ రావు, పక్కన ఉండు’ అంటారని తెలిసింది. ఐటీ రంగంలో అయితే కంపెనీ ప్రతినిధిగా బయటి నగరాలకు, విదేశాలకు వెళ్లి ప్రాజెక్టు నిర్వహించే అవకాశాలు మహిళలకు కాకుండా జూనియర్ అయిన మగవాళ్లకు దక్కుతున్న సందర్భాలే ఎక్కువ. చాలెంజింగ్ ప్రాజెక్టుల్లో తమను తాము నిరూపించుకునే అవకాశాల దగ్గరే వెనక్కు లాగుతుంటే... ‘ఒకే సీనియారిటీ – ఒకే వేతనం’ అనే సమానత్వం ఎక్కడ నుంచి వస్తుంది? – మమతారఘువీర్ ఆచంట, ఫౌండర్, తరుణి స్వచ్ఛంద సంస్థ, టెక్నికల్ డైరెక్టర్, భరోసా, తెలంగాణ – వాకా మంజులారెడ్డి -
Darshi Chenchaiah: ఆయన జీవితమే ఒక సందేశం
ఆయన జీవితం ఒక అద్భుతం. ఆయన పోరాటం అనన్యం. ఏకైక తెలుగు ‘గదర్’ వీరుడు. వ్యవసాయ శాస్త్రం చదవడానికని విదేశాలకు వెళ్ళి సమాజంలో అసమాన తలు చూసి చలించిపోయి విప్లవాన్ని విలక్షణంగా అధ్యయనం చేసిన ధీరుడు. తెలుగులోనే కాదు, యావత్ దేశంలోనే ప్రప్రథమ అరాచకవాద (అనార్కిస్ట్) తత్వవేత్తల్లో ఒకరు. విస్తృతమైన జీవితాను భవాలను అక్షరీకరించి ‘నేనూ–నా దేశం’ పేరిట అద్వితీయమైన ఆత్మకథను తెలుగు ప్రజకి అందించాడు. ఆయనే దరిశి చెంచయ్య. సామాన్య సంప్రదాయ కుటుంబంలో జన్మించి అసామాన్య యోధుడిగా ఎదిగిన ఆయన జీవితం ఎప్పటికీ నిత్య పఠనీయం. యావత్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి రాజకీయ డిటెన్యూగా దేశంలో ఆనాడు ఆయన్ని ఉంచని జైలు లేదంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్య్రోద్యమంలో అతివాద టెర్రరిస్టు కార్యకలాపాలలో పాల్గొనడమే కాక కాంగ్రెస్ నాయకుడిగా, గాంధేయవాదిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. సోషలిస్టుగా, కమ్యూనిస్టుగా, మానవతావాదిగా, సాహిత్యకారుడిగా, సామా జిక వేత్తగా, సంఘ సంస్కర్తగా, సాంస్కృతిక ఉద్యమకారుడిగా చెంచయ్య ప్రజ్ఞ బహుముఖం. చెంచయ్య ఆత్మకథ... అనేకమంది విప్లవ వీరులూ, స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రల సమాహారం. ఒక విధంగా చెప్పాలంటే సమకాలీన చరిత్రను రికార్డు చేసిన గ్రంథం. అందుకే తెలుగులో వచ్చిన ఆత్మకథల్లో అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా ఇది నిలుస్తుంది. సరిగ్గా 70 ఏళ్ళ క్రితం... 1952 సెప్టెంబర్‌లో మొదటిసారిగా ప్రచురించబడిన ‘నేను–నా దేశం’ గ్రంథాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఉరి కొయ్యలకు బలైపోయిన తన పంజాబ్ మిత్రుడు సర్దార్ బలవంత్ సింగుకూ, ఆయన భార్యకీ అంకితం ఇచ్చారు. నాకు తెలిసి తెలుగులో ఒక పంజాబ్ విప్లవ దంపతులకు అంకితమిచ్చిన ఏకైక తెలుగు స్వీయచరిత్ర ఇదే. అందుకే నార్ల ఈ పుస్తకానికి పీఠిక రాస్తూ, ‘‘శ్రీ చెంచయ్య గారి ‘నేనూ – నా దేశం’ నిస్సంశయంగా ఉత్తమ శ్రేణికి చెందిన ఆత్మకథ. నిజానికి అది ఆయన ఆత్మకథ కాదు; మన దేశ చరిత్ర. పోయిన అర్ధ శతాబ్దిలో మన దేశంలో ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో వచ్చిన ప్రతి మహోద్యమం చెంచయ్య జీవిత దర్పణంలో తన ప్రతిబింబాన్ని మిగిల్చింద’’ని అంటారు. స్వాతంత్య్ర సమరయోధుడు, ‘ప్రభవ’ పత్రిక వ్యవస్థాపకులు గద్దె లింగయ్య మొదటిసారి ముద్రించిన నాలుగొందల పుటల ఈ స్వీయచరిత్ర అద్భుతమైన విప్లవకారులు జితేంద్ర నాధ లాహిరీ నుండి మొట్టమొదటి భారతీయ అనార్కిస్టు, గొప్ప బౌద్ధ, భౌతికవాద రచయిత లాలా హర్ దయాళ్ వరకూ; జోధ్ సింగ్, చిదంబరం పిళ్లై, నీలకంఠ బ్రహ్మ చారి... వంటి అనేకమందీ మనకి పరిచయం అవుతారు. మొదటి వైశ్య వితంతు వివాహం మొదలు కొని వితంతు శిశు శరణాలయాల స్థాపన దాకా; ‘మా భూమి’ నాటక ప్రదర్శనలు, అమెరికా, జపాన్, చైనా, రష్యా, సింగపూర్ దేశాలలోని పరిస్థితులు, విప్లవ రాజకీయాల్ని కూడా ఇందులో మన కళ్ళకు కడతారు. ఇదంతా ఒక ఎత్తయితే మహామేధావి డాక్టర్ కేబీ కృష్ణతో చెంచయ్యకి ఉన్న అమితమైన స్నేహం ఒక్కటీ ఒకెత్తు. జైలులో ఉన్న సమయంలో కేబీ కృష్ణ మార్క్స్ ‘కేపిటల్’ గ్రంథం మీద అందరికీ క్లాసులు చెప్పే వారంటూ, ‘ఆయన శక్తి మాకు ఆశ్చర్యం కలిగించింది... ఆయన రాజకీయ ఆర్థిక శాస్త్రాలలో పారంగతుడు; వేదాంత శాస్త్రంలో అసమాన పాండిత్యం కలవాడు.. వారి సహాయంతో డిటెన్యూల క్యాంపు ఒక సర్వకళాశాలగానూ, విప్లవ కళాశాలగానూ మారిందని’ అంటారు చెంచయ్య. ‘నేను కమ్యూనిస్టు కావడానికి ముఖ్య కారణం స్త్రీల కష్టాలను తొలగించడానికి ప్రయత్నాలు చేసి, చేసి పూర్తిగా సాధించలేక పోవడం వల్ల కలిగిన అసంతృప్తి..’ అని రాసుకున్నారాయన. పది సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీలో ఉన్నప్పటికీ కమ్యూనిస్టు కాలేకపోయానని నిజాయితీగా రాసుకున్న నిజమైన కమ్యూనిస్టు ఆయన. బీడీ కార్మికులు, చుట్ట కార్మికులు, స్పెన్సర్ కంపెనీ కార్మికులు, కార్పొరేషన్ కార్మికులు, ఇంకా పారిశుద్ధ్య కార్మికులు వంటివారు చేసిన పోరాటాలు అన్నిం టిలోనూ క్షేత్ర స్థాయిలో పాల్గొన్న ఆయన ‘అభ్యుదయ రచయితల మహాసభ’ మొదలు ‘ప్రజానాట్యమండలి’ వరకూ అనేక ప్రజా సంఘాలతో మమేకమై పని చేశారు. వాటిల్లోని లోపాలను కూడా చాలా సూటిగా చెప్పారు, రాశారు. కనుకనే స్వీయచరిత్ర ముగిస్తూ ఈ దేశానికి, మన సమాజానికి, ‘ఒక మహత్తర సంస్కృతీ ఉద్యమము’ అవసరం అని ప్రత్యేకంగా నొక్కి వక్కాణించారు. (చదవండి: భరత జాతికి ఒక ఆంగ్ల నాడి) చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులకు తాళలేక, ఎవరి దగ్గరా చేయి చాచలేక ఇంట్లో సామానులు అమ్ముకున్న వైనం మనల్ని కదిలిస్తుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి చెంచయ్యకు తెలుగు నేలపై ఇప్పటికీ తగిన గుర్తింపు రాలేదనడం అవాస్తవం కాదు. 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆయన స్వీయ చరిత్ర ‘నేనూ– నా దేశం’ లోని కొంత భాగాన్నయినా విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టే దిశగా ప్రభుత్వం యోచన చేయాలి. - గౌరవ్ చెంచయ్య సాంస్కృతిక వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు (దరిశి చెంచయ్య స్వీయచరిత్ర ‘నేనూ – నా దేశం’తెలుగు లోకానికి అంది 70 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా) -
Srishti Bakshi: గ్రేట్ ఛేంజ్మేకర్
కొన్ని సంవత్సరాల క్రితం...‘ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో తల్లీకూతుళ్లు సామూహిక అత్యాచారానికి గురయ్యారు’ అనే వార్త చదివిన తరువాత శ్రీష్ఠి బక్షీ మనసు మనసులో లేదు. కళ్ల నిండా నీళ్లు. బాధ తట్టుకోలేక తాను చదివింది కుటుంబసభ్యులు, స్నేహితులతో పంచుకుంది. ‘ఇలాంటివి మన దేశంలో సాధారణం’ అన్నారు వాళ్లు. ఈ స్పందనతో శ్రీష్ఠి బాధ రెట్టింపు అయ్యింది. ఇలా ఎవరికి వారు సాధారణం అనుకోవడం వల్లే పరిస్థితి దిగజారిపోతుంది. ఒక దుస్సంఘటన జరిగితే దానిపై ఆందోళన, ఆవేదన వ్యక్తం అవుతుంది తప్ప నిర్దిష్టమైన కార్యాచరణ మాత్రం కనిపించడం లేదు’ అనుకుంది. ఆరోజంతా శ్రిష్ఠి అదోలా ఉంది. ఈ నేపథ్యంలోనే తన వంతుగా ఏదో ఒకటి చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. మహిళలకు సంబంధించిన భద్రత, హక్కుల గురించి అవగాహన కలిగించడానికి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకుంది. దీనికి ముందు రకరకాల కేస్‌స్టడీలు, పరిశోధన పత్రాలు చదివింది. ఆధునిక సాంకేతిక జ్ఞానంతో అపూర్వ విజయాలు సాధించిన సాధారణ మహిళల గురించి అధ్యయనం చేసింది. బెంగాల్‌లోని ఒక పనిమనిషి సరదాగా యూట్యూబ్‌లో వంటలకు సంబంధించిన రకరకాల వీడియోలను పోస్ట్ చేసేది. కొద్దికాలంలోనే ఆమె యూట్యూబ్ స్టార్‌గా ఎదిగి ఆర్థికంగా బాగా సంపాదించడాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. ఆశీర్వాదం తీసుకుంటూ... తమిళనాడు గ్రామీణ ప్రాంతానికి చెందిన తల్లీకూతుళ్లు వాట్సాప్ కేంద్రంగా దుస్తుల వ్యాపారం మొదలుపెట్టి ఘన విజయం సాధించారు... ఇలాంటి ఎన్నో స్ఫూర్తిదాయక విజయాల గురించి తెలుసుకుంది. ఇలాంటి ఎన్నో విజయగాథలను తన పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనుకుంది. ‘టెక్నాలజీతో సులభంగా అనుసంధానం అయ్యే ఈరోజుల్లో చాలామంది మహిళలు దానికి దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం డిజిటల్ నిరక్షరాస్యత. వారికి డిజిటల్ నాలెడ్జ్‌ను దగ్గర చేస్తే ఎన్నో అద్భుతాలు సాధించగలరు’ అనుకుంది శ్రిష్ఠి బక్షీ. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల గుండా 3,800 కి.మీల పాదయాత్ర చేసింది. ఈ యాత్రలో ఎంతోమంది మహిళలు ఎన్నో సమస్యలను తనతో పంచుకున్నారు. పరిష్కార మార్గాల గురించి లోతైన చర్చ జరిగిదే. ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. తాజా విషయానికి వస్తే... హక్కుల నుంచి సాధికారత వరకు వివిధ విషయాల్లో విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన శ్రిష్టి బక్షీని ఐక్యరాజ్యసమితి ప్రతిష్ఠాత్మక ‘ఛేంజ్మేకర్’ అవార్డ్ వరించింది. 150 దేశాలకు చెందిన 3000 మంది మహిళల నుంచి ఈ అవార్డ్‌కు శ్రిష్ఠిని ఎంపికచేశారు. ‘యూఎన్ ఎస్డీజీ యాక్షన్ అవార్డ్‌ల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సోషల్ ఛేంజ్మేకర్స్తో మాట్లాడే అవకాశం లభిస్తుంది. వారి అనుభవాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. వ్యక్తిగతంగానే కాదు సమష్టిగా కూడా సమాజం కోసం పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది’ అంటుంది శ్రిష్ఠి. ‘సమీకరణ, స్ఫూర్తి, ఒకరితో ఒకరు అనుసంధానం కావడం ద్వారా సుందర భవిష్యత్‌ను నిర్మించుకోవచ్చు. మనం ఎలా జీవిస్తే మంచిది అనే విశ్లేషణకు ఇవి ఉపయోగపడతాయి. పునరాలోచనకు అవకాశం ఉంటుంది’ అంటుంది ఎస్డీజీ యాక్షన్ క్యాంపెయిన్ కమిటీ. ఇ–కామర్స్ స్ట్రాటజిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న శ్రిష్ఠి హాంకాంగ్‌లో పెద్ద ఉద్యోగం చేసేది. ‘నా జీవితం ఆనందమయం’ అని ఆమె అక్కడే ఉండి ఉంటే ‘ఛేంజ్మేకర్’గా యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేది కాదు. టెక్నాలజీతో సులభంగా అనుసంధానం అయ్యే ఈరోజుల్లో చాలామంది మహిళలు దానికి దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం డిజిటల్ నిరక్షరాస్యత. వారికి డిజిటల్ నాలెడ్జ్‌ను దగ్గర చేస్తే ఎన్నో అద్భుతాలు సాధించగలరు. ఆ వార్త చదివిన తరువాత తన కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. ‘నేనేం చేయలేనా!’ అని భారంగా నిట్టూర్చింది. అంతమాత్రాన శ్రిష్ఠి బక్షీ బాధలోనే ఉండిపోలేదు. బాధ్యతతో ముందడుగు వేసింది... -
విద్యతోనే మహిళా సాధికారత
ఏలూరు, న్యూస్‌లైన్ : విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమని కలెక్టర్ సిద్ధార్థజైన్ అన్నారు. మహాత్మా జ్యోతీరావుపూలే జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం జ్యోతీరావుపూలే చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అనాది నుంచి బాలికల విద్యపై వివక్షత వల్లే సమాజంలో ఆశించిన ఫలితాలు సాధ్యపడడం లేదన్నారు. అభివృద్ధి సాధిస్తున్న ప్రస్తుత సమాజంలో కూడా పదో తరగతి తర్వాత బలవంతంగా చదువుమానిపించి బాలికలకు వివాహాలు జరిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికలు చదువు మానడం వల్ల సమాజానికి ఎంతో నష్టమన్నారు. ముఖ్యంగా బాలికలకు పెళ్లి చేయడం వల్ల ఆమె ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతందన్నారు. తల్లిదండ్రులు ఆలోచించి స్త్రీ విద్యను ప్రోత్సహించాలని, అదే పూలేకు నిజమైన నివాళి అన్నారు. సభకు అధ్యక్షత వహించిన బీసీ సంక్షేమాధికారి పెంటోజీరావు మాట్లాడుతూ అంటరానితనం నిర్మూలనకు పూలే నిరంతరం పోరాటం చేసి సామాజిక విప్లవానికి బాటలు వే శారన్నారు. రజక సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ పూలే జీవితం అందరికీ ఆదర్శమని స్త్రీ చదువుకుంటేనే సమాజం అభివృద్ధి సాధిస్తుందని చెప్పి ఆచరణలో చూపిన గొప్ప సంస్కర్త పూలే అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు తెంటు సూర్యనారాయణ, సుదర్శన్, కన్నబాబు, మణిసింగ్, సామాజిక కార్యకర్త ఆర్ఎస్ఆర్, ఏఎస్‌డబ్ల్యూవో కె.భాను సాధన పాల్గొన్నారు. -
మహిళా సాధికారత ఎక్కడ!
సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్: మహిళా సాధికారత సాధిస్తున్నామని అనేక మంది వేదికలెక్కి ఉపన్యాసాలు చేస్తున్నా వాస్తవానికి మహిళలు ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారు. చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ మహిళలకు నానాటికీ రక్షణ లేకుండాపోతోంది. జిల్లాలో ఏ మూల చూసినా ప్రతిరోజు ఏదో ఒక చోట మహిళపై లైంగిక దాడులు, హత్యలు, వేధింపుల పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. పాలు తాగే పసి పాప మొదలుకొని స్కూలుకు వెళ్లే బాలిక, కళాశాలకు వెళ్లే యువతి, ఉద్యోగానికి వెళ్లే మహిళ వరకు బయటకు వెళ్లి తిరిగి వచ్చే వరకు నమ్మకం లేకుండా పోతోంది. ఇక అత్తవారింట్లో మహిళలపై భర్త, అత్తామామల వేధింపులు సర్వసాధారణం. ఇలా జిల్లాలో ఏదో ఒక చోట మహిళలపై ఏదో ఒక రూపంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సంఘటనలు పోలీస్‌స్టేషన్ మెట్లెక్కినప్పటికీ మరికొన్ని మరుగునే ఉంటున్నాయి. గత రెండేళ్లలో జిల్లాలో మహిళలపై చోటు చేసుకున్న సంఘటనలను పరిశీలిస్తే సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. 2013 సంవత్సరంలో వరకట్నం కోసం 25 మంది మహిళలు హత్యలకు గురయ్యారు. అలాగే వరకట్న కేసులు 476, అత్యాచారా కేసులు 64, రెండో పెళ్లి చేసుకున్నారంటూ నమోదైన కేసులు 52, వెకిలి చేష్టలు, ఇతర వేధింపులకు సంబంధించి 169 కేసులు నమోదయ్యాయి. చట్టాలను సక్రమంగా అమలైనప్పుడే మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, వేధింపులను అరికట్టేందుకు అవకాశం ఉంటుందని మహిళా సంఘాలు పేర్కొంటున్నాయి. నిర్భయ తదితర చట్టాలు ఉన్నప్పటికీ మహిళలపై లైంగిక దాడి పెరుగుతోందంటున్నారు. శిక్షలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మహిళల కోసం ఏర్పాటైన చట్టాల్లో కొన్ని.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి దౌర్జన్యానికి పాల్పడితే సెక్షన్ 354 ప్రకారం ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. లైంగిక దాడి చేసిన వారిపై నిర్భయ చట్టం కిందకేసు నమోదవుతుంది. చిన్నపిల్లలను లైంగికంగా వేధిస్తే ప్రివెన్షన్ యాక్టు ఫర్ చిల్డ్రెన్ సెక్సువల్ అఫెన్సెస్ కింద కేసు నమోదు చేస్తారు. వరకట్నం కోసం భార్యను వేధిస్తే 304(బి) సెక్షన్ కింద భర్తకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష అమలువుతుంది. మహిళలను ఆత్మహత్యకు కారణమైన వారికి ఐపీసీ సెక్షన్ 306 కింద పదేళ్ల వరకు జైలు విధించే అవకాశం ఉంది. వివాహిత మహిళలను వేధింపులకు గురిచేస్తే ఐపీసీ 498 ప్రకారం మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. రెండో వివాహం చేసుకున్న భర్తకు సెక్షన్ 494 కింద కేసు నమోదవుతుంది.