ఏలూరు, న్యూస్‌లైన్ : విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమని కలెక్టర్ సిద్ధార్థజైన్ అన్నారు. మహాత్మా జ్యోతీరావుపూలే జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం జ్యోతీరావుపూలే చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అనాది నుంచి బాలికల విద్యపై వివక్షత వల్లే సమాజంలో ఆశించిన ఫలితాలు సాధ్యపడడం లేదన్నారు. అభివృద్ధి సాధిస్తున్న ప్రస్తుత సమాజంలో కూడా పదో తరగతి తర్వాత బలవంతంగా చదువుమానిపించి బాలికలకు వివాహాలు జరిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బాలికలు చదువు మానడం వల్ల సమాజానికి ఎంతో నష్టమన్నారు. ముఖ్యంగా బాలికలకు పెళ్లి చేయడం వల్ల ఆమె ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతందన్నారు. తల్లిదండ్రులు ఆలోచించి స్త్రీ విద్యను ప్రోత్సహించాలని, అదే పూలేకు నిజమైన నివాళి అన్నారు. సభకు అధ్యక్షత వహించిన బీసీ సంక్షేమాధికారి పెంటోజీరావు మాట్లాడుతూ అంటరానితనం నిర్మూలనకు పూలే నిరంతరం పోరాటం చేసి సామాజిక విప్లవానికి బాటలు వే శారన్నారు.
రజక సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ పూలే జీవితం అందరికీ ఆదర్శమని స్త్రీ చదువుకుంటేనే సమాజం అభివృద్ధి సాధిస్తుందని చెప్పి ఆచరణలో చూపిన గొప్ప సంస్కర్త పూలే అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు తెంటు సూర్యనారాయణ, సుదర్శన్, కన్నబాబు, మణిసింగ్, సామాజిక కార్యకర్త ఆర్‌ఎస్‌ఆర్, ఏఎస్‌డబ్ల్యూవో కె.భాను సాధన పాల్గొన్నారు.
విద్యతోనే మహిళా సాధికారత
Published Sat, Apr 12 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 AM
Advertisement