siddharth jain
-
నేడు జిల్లాకు సీఎం రాక
–వి కోట మండలంలో రెయిన్ గన్స్ వినియోగం పరిశీలన –సాయంత్రం బస్టాండులో బహిరంగ సభ –అధికారులు ఏర్పాట్లు పూర్తి చిత్తూరు (కలెక్టరేట్) వి కోట: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం జిల్లాకు రానున్నారు. జిల్లా కలెక్టర్ సిద్దార్థ్‌జైన్ శనివారం ఓ ప్రకటనలో ఈవిషయం తెలిపారు. మధ్యాహ్నం 1.15 గంటలకు అనంతపురం జిల్లా నుంచి సీఎం హెలికాప్టర్లో బయలుదేరి 2 గంటలకు రామకుప్పం మండలం మిట్టపల్లికి చేరుకుంటారు. అక్కడ నుంచి వి కోట మండలం కె.పత్తూరు గ్రామం చేరుకుని బెండుగాని చెరువు పరిధిలో నీరు – చెట్టు, పంటసంజీవని పనులు పరిశీలిస్తారు. 2.25 గంటలకు రెయిన్‌గన్స్ ద్వారా పంటను తడపడం చూస్తారు. పంట సంజీవని వినియోగాన్ని పరిశీలిస్తారు. 3.05 గంటలకు గుమ్మిరెడ్డిపల్లెకు చేరుకుని వేరుశనగ పంటలో బిందు సాగునీటి పద్ధతిని పరిశీలిస్తారు. 3.25 గంటలకు సీఎం బైరుపల్లెలో రెయిన్‌గన్స్ ఉపయోగాన్ని పరిశీలించనున్నారు. 3.35 గంటలకు అదే గ్రామంలో ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలించి, రైతులతో చర్చిస్తారు. 3.55 గంటలకు వి.కోట ఆర్టీసీ బస్టాండు జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత హెలికాఫ్టరులో విజయవాడ వెళతారు. సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. హెలీపాడ్‌ను ఆయన పరిశీలించారు. బందోబస్తుకోసం వచ్చిన పోలీసులకు డ్యూటీలను కేటాయించారు. -
నేడు తిరుమలకు శ్రీలంక అధ్యక్షుడు రాక
చిత్తూరు (కలెక్టరేట్): శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కుటుంబసభ్యులతో కలిసి శనివారం తిరుమలకు విచ్చేయనున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన శనివారం సాయంత్రం బెంగళూరులో బయలుదేరి రోడ్డుమార్గాన రాత్రి 8.30 గంటలకు తిరుమల చేరుకుంటారు. 08.45 గంటలకు అక్కడి శ్రీకృష్ణ వసతి గృహానికి చేరుకుని రాత్రికి బసచేస్తారు. 21వ తేదీ ఉదయం 2.15 గంటలకు వసతి గృహం నుంచి బయలుదేరి 3 నుంచి 4 గంటల వరకు స్వామివారిని సుప్రభాత సేవలో పాల్గొంటారు. అక్కడి నుంచి వసతి గృహానికి చేరుకుని 9 గంటలకు రోడ్డు మార్గాన బెంగళూరు వెళతారని ఆయన ఆ ప్రకటనలో తెలియజేశారు. కాన్వాయ్ ట్రై ల్ జిల్లాకు శనివారం శ్రీలంక అధ్యక్షుడు విచ్చేస్తున్నందున పోలీసులు శుక్రవారం కాన్వాయ్ ట్రై ల్ నిర్వహించారు. కర్ణాటక సరిహద్దు నుంచి నేండ్రగుంట వరకు చిత్తూరు పోలీసులు 22 వాహనాలతో కాన్వాయ్ ట్రై ల్ నిర్వహించారు. -
బీడీ కట్ట చూస్తే పింఛను నిలిపేస్తా
చిత్తూరు : తాతయ్యా నేను కలెక్టర్‌ని, మీకు పింఛను ఇస్తున్నారా ? వెయ్యి రూపాయిలు కరెక్టుగా ఇస్తున్నారా ? పిల్లలు ఎంత మంది ? ఏమీ చేస్తున్నారు ? అంటూ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ఓ వృద్ధుడిని ఆప్యాయంగా పలుకరించారు. సోమవారం కార్వేటినగరంలో ఓ కల్వర్టుపై కూర్చుని ఉన్న వృద్ధుడు చెంగయ్య వద్దకు కలెక్టర్ వెళ్లారు. కుశల ప్రశ్నలు వేశారు. అతని జేబులో ఉన్న బీడీల కట్టను తీసుకున్నారు. పింఛను ఇచ్చేది బీడీలకు కాదు' అని కలెక్టర్ అనడంతో అక్కడే ఉన్నవారంతా నవ్వేశారు. అలవాటైంది. వదులుకోలేకపోతున్నా సార్ అంటూ బదులుచ్చాడు. అయితే పింఛనుకు బదులు బీడీలు ఇస్తామని కలెక్టర్ అనగానే... వద్దు సార్ వెయ్యి రూపాయిలు లేదంటే ప్రాణాలు వదులుకోవాల్సిందేనన్నారు. దాంతో కలెక్టర్ 'ఎప్పుడైనా ఈ దారిలో వస్తా, జేబులో బీడీ కట్ట చూస్తే పింఛను నిలిపేస్తానని నవ్వుతూ హెచ్చరించారు. -
'చిత్తూరు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
చిత్తూరు : భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ సిద్దార్థ్ జైన్ మంగళవారం చిత్తూరులో సూచించారు. పీఆర్ కండ్రిగ, నేచనూరు వద్ద నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని తెలిపారు. జిల్లాలో ఎక్కడ ఎటువంటి విపత్తు సంభవించిన సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్దంగా ఉంచినట్లు చెప్పారు. అలాగే సహాయక చర్యల కోసం రేణిగుంట విమానాశ్రయంలో హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచామన్నారు. జిల్లాలోని నాగులాపురం, విజయపురం, తొట్టంబేడు మండలాల్లో కొన్ని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని సిద్దార్థ్ జైన్ చెప్పారు. -
కస్తూర్బా లో ఫుడ్ పాయిజన్ పై విచారణ
తిరుపతి: చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెంలోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఫుడ్‌పాయిజన్ ఘటనపై చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ గురువారం స్పందించారు. ఈ ఘటనపైన సమగ్ర విచారణకు ఆయన ఆదేశించారు. గురుకుల పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సుజాతను విధుల నుంచి తొలగించారు. అలాగే జిల్లా బాలిక సంరక్షణాధికారి విజయకుమారి, ఎంఈవో బాల సుబ్రహ్మణ్యంలకు నోటీసులు జారీ చేశారు. కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఫుడ్‌పాయిజన్ ఘటనలో బాధితుల సంఖ్య గురువారానికి 50కి చేరింది. -
ఏపీలో పలు శాఖలు, విభాగాలకు ఇంచార్జ్‌ల నియామకం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న పలువురు అఖిల భారత సర్వీసు అధికారులు ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీలో తెలంగాణకు వెళ్లడంతో ఏపీ సర్కారు పలు శాఖలు, విభాగాలకు ఇంచార్జులను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీలో తెలంగాణకు కేటాయించిన ఐదుగురు ఐఏఎస్‌లను, ఒక ఐపీఎస్ అధికారిని, నలుగురు ఐఎఫ్ఎస్ అధికారులను మినహాయించి మిగిలిన వారిని ఆదివారం రిలీవ్ చేసింది. అజయ్ సహాని, సిద్దార్ధ జైన్, అజయ్ జైన్, ఆర్.వి. కర్ణన్, అనిల్ కుమార్ సింఘాల్‌ను ఏపీలో కొనసాగించాలని కేంద్రాన్ని కోరినందున వారిని రిలీవ్ చేయలేదు. అలాగే సస్పెన్షన్‌లో ఉన్న వై. శ్రీలక్ష్మిని, అలాగే ట్రిబ్యునల్ స్టే ఆర్డర్ ఉన్న ఎ. విద్యాసాగర్, సి. హరికిరణ్, జి. శ్రీజనలను రిలీవ్ చేయలేదు. మిగిలిన 44 మంది ఐఏఎస్‌లను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోపక్క ఐపీఎస్‌లలో ప్రస్తుతం ఏపీ ఇంటిలిజెన్స్ అదనపు డీజీగా ఉన్న ఎ.ఆర్. అనురాధను భార్య, భర్తల కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని కేంద్రాన్ని కోరినందున ఆమెను మినహాయించి మిగిలిన 23 మంది ఐపీఎస్‌లను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా తెలంగాణకు కేటాయించిన ఐఎఫ్ఎస్ అధికారుల్లో నలుగురిని మినహాయించి మిగిలిన 30 మంది ఐఎఫ్ఎస్లను రిలీవ్ చేశారు. వీరందరినీ తెలంగాణ ప్రభుత్వంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇక, సస్పెన్షన్‌లో ఉన్న ఐఎఫ్ఎస్లు రాజేశ్ మిట్టల్, ఎ. కృష్ణను తెలంగాణకు కేటాయించినప్పటికీ వారిని రిలీవ్ చేయలేదు. అలాగే తెలంగాణకు కేటాయించినా భార్యా, భర్తల కేసు ఆధారంగా రాహుల్ పాండే. సి. శెల్వం ఐఎఫ్ఎస్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీవ్ చేయలేదు. ఏపీ, తెలంగాణకు కేటాయించిన అఖిల భారత సర్వీసు అధికారులతో కూడిన గెజిట్ నోటిఫికేషన్ కూడా ఏపీ ప్రభుత్వం ఆదివారం జారీ చేసింది. కొందరికి అంతర్గత సర్దుబాట్ల కింద కొన్ని బాధ్యతలు అప్పగించారు. ఇలా బి. ఉదయ లక్ష్మి బీసీ సంక్షేమ కమిషనర్, అంతర్గత సర్దుబాటు కింద రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, మార్కెటింగ్ శాఖ కమిషనర్, సహకార శాఖ కమిషనర్ బాధ్యతలు. మహ్మద్ ఇక్బాల్ మైనారిటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి. అంతర్గత సర్దుబాటు కింద సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ ఎండీ, వాణిజ్య పన్నుల కమిషనర్ కార్యదర్శి, సర్వే సెటిల్మెంట్ డెరైక్టర్. కోన శశిధర్ ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీ. అంతర్గత సర్దుబాటు కింద యువజన, పర్యాటక డిప్యుటీ కార్యదర్శి, శాప్ వైస్ చైర్మన్, ఎండీ, సహాయ పునరావాస సంయుక్త కార్యదర్శి. జి. వీరపాండ్యన్ ఉపాధి హామీ డెరైక్టర్, అంతర్గత సర్దుబాటు కింద మహిళా శిశు సంక్షేమ డిప్యూటీ కార్యదర్శి, మెప్మా డెరైక్టర్, ఏపీ మున్సిపల్ అభివృద్ధి ప్రాజెక్టు పీడీ. ఎం.వి.ఎస్.ఎ. సోమయాజులు సాధారణ పరిపాలన శాఖ డిప్యుటీ కార్యదర్శి. అంతర్గత సర్దుబాటు కింద అదనపు ముఖ్య ఎన్నికల అధికారి, గృహనిర్మాణ సంస్థ ఈడీ. లింగరాజు పాణిగ్రాహి ఆర్ఐఎడీ ముఖ్యకార్యదర్శి. వి. శివశంకరరావు సాధారణ పాలన(సర్వీసెస్), అధికార భాష ఉప కార్యదర్శి. -
ఆ ఆరుగురినీ రిలీవ్ చేయం
ఐదుగురు ఐఏఎస్‌లు, ఐపీఎస్ అనురాధపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కేటాయించిన ఐదుగురు ఐఏఎస్ అధికారులతో పాటు ఐపీఏస్ అధికారి, అదనపు డీజీ అనురాధను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు బుధవారం కేంద్ర వ్యక్తిగత సిబ్బంది శిక్షణ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి భాస్క ర్ కుల్బేకు లేఖ రాశారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సిద్ధార్థ జైన్‌ను తెలంగాణకు కేటాయించగా ఏపీ ప్రభుత్వానికి ఆయన సేవలు అవసరమని,ఆంధ్రాలోనే కొనసాగించాలని సీఎస్ లేఖలో వివరించారు. అలాగే సీఎం ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న అజయ్ సహానీని తెలంగాణకు కేటాయించారు. అజయ్‌నూ ఏపీలోని కొనసాగించాలని సీఎస్ ఆ లేఖలో కోరారు. మదనపల్లి డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆర్.వి. కర్ణన్, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ కార్యదర్శి అజయ్‌జైన్, ఏపీ.భవన్లో రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఏకే సింఘాల్‌ను ఐఏఎస్‌ల పంపిణీలో తెలంగాణకు కేటాయించారు. వారి సేవలు ఆంధ్రప్రదేశ్‌కు అవసరముందని, ఈ నేపథ్యంలో ఈ ఐదుగురు ఐఏఎస్‌లను రిలీవ్ చేయబోమని, ఇందుకు అనుమతించాల్సిందిగా సీఎస్ రాసిన లేఖలో కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా పనిచేస్తున్న అనురాధను ఐపీఎస్‌ల పంపిణీలో తెలంగాణకు కేటాయించారు.అమె సేవలు ఏపీలోఅవసరం ఉన్నందున ఆమెను కూడా రిలీవ్ చేయబోమని, ఇందుకు అనుమతించాలని సీఎస్ లేఖలో కోరారు. తెలంగాణకు కేటాయించిన 50 మంది ఐఏఎస్ అధికారులను ఈ నెల 2వ తేదీన కేబినెట్ భేటీ ముగిసేవరకూ రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా డిసెంబర్ నెలాఖరులోగా రిలీవ్ చేసినట్లైతే వేతనాలు సమస్య ఉండదనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమైంది. మంత్రివర్గ సమావేశం వల్ల రిలీవ్ చేయడాన్ని వాయి దా వేశారు. కొత్త పారిశ్రామిక విధానం... సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 2వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో కొత్త పారిశ్రామిక విధానాన్ని అమోదించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో కన్నా అత్యధిక రాయితీలతోపాటు విద్యుత్ రాయితీలతో కూడిన పారిశ్రామిక విధానాన్ని రూపొందించారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించనున్నారు.అత్యధిక రాయితీలతో పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా విధానం ఉండనుందని తెలుస్తోంది. -
కొత్త కలెక్టర్.. గిరిజాశంకరా.. యువరాజా?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఐఏఎస్‌ల విభజన లో సిద్ధార్థ్‌జైన్‌ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బాధ్యతల నుంచి నేడో రేపో సిద్ధార్థ్‌జైన్ రిలీవ్ కానున్నారు. ఆయన స్థానంలో కలెక్టర్‌గా ఎవరిని నియమిస్తారన్నది చర్చనీ యాంశంగా మారింది. గతంలో జిల్లాలో మదనపల్లె సబ్ కలెక్టర్‌గా పనిచేసిన గిరిజాశంకర్, తిరుమల జేఈవోగా పనిచేసిన ఎం.యువరాజు పేర్లను కలెక్టర్‌గా నియమించడానికి ప్రభుత్వం పరిశీలిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గిరిజాశంకర్‌నే కలెక్టర్‌గా నియమించే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐఏఎస్‌ల విభజన అనివార్యమైంది. కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌ను ప్రత్యూష కమిటీ తెలంగాణకు కేటాయిస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇది పసిగట్టిన సిద్ధార్థ్‌జైన్ తనను ఆంధ్రప్రదేశ్ కేడర్‌కే కేటాయించేలా చూడాలని సీఎం చంద్రబాబును పలు సందర్భాల్లో కోరా రు. చంద్రబాబు మనసు గెలుచుకునేందుకు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు అధికారవర్గాల నుంచే వ్యక్తమవుతున్నాయి. ఆర్నెల్లలో ఆయన పనితీరే అందుకు తార్కాణమని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు చెబుతున్నాయి. సిద్ధార్థ్‌జైన్‌ను ఆంధ్రప్రదేశ్‌కే కేటాయించేలా చంద్రబాబు చేసిన సూచనను కేంద్రం ఖాతరు చేయలేదు. తెలంగాణకే కేటాయిస్తున్నట్లు కేంద్రం తెగేసి చెప్పడంతో సిద్ధార్థ్‌జైన్ జిల్లా కలెక్టర్‌గా రిలీవ్ కాక తప్పని పరిస్థితి నెలకొంది. సిద్ధార్థ్‌జైన్‌ను తెలంగాణకు కేటాయించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌గా ఎవరిని నియమిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. 2001 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన గిరిజాశంకర్ గతంలో మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. గిరిజాశంకర్‌ను కేంద్రం మన రాష్ట్రానికి కేటాయించింది. సమర్థుడైన అధికారిగా పేరున్న గిరిజాశంకర్‌ను జిల్లా కలెక్టర్‌గా నియమించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. తిరుమల జేఈవోగా పనిచేసి.. ప్రస్తుతం విశాఖపట్నం కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎన్.యువరాజు పేరు జిల్లా కలెక్టర్‌గా తెరపైకి వచ్చింది. హుద్‌హుద్ తుఫాను సహాయక చర్యల్లో ఎం.యువరాజు సమర్థవంతంగా పనిచేశారనే అభిప్రాయంతో ఉన్న సీఎం చంద్రబాబు.. జిల్లా కలెక్టర్‌గా ఆయనను నియమించే దిశగా ఆలోచిస్తున్నారనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. గతంలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన 2004 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కె.ప్రద్యుమ్న పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. జిల్లా పరిస్థితులపై సమగ్రంగా అవగాహన ఉన్న గిరిజాశంకర్‌నే కలెక్టర్‌గా నియమించే అవకాశం ఉందని అధికారవర్గాలు వెల్లడించాయి. జిల్లా కలెక్టర్‌గా ఎవరిని నియమిస్తారన్నది ఒకట్రెండు రోజుల్లో తేలనుంది. -
జిల్లా కలెక్టర్‌గా గిరిజాశంకర్
సిద్ధార్థ్‌జైన్ తెలంగాణకు కేటాయింపు నేడో రేపో ఉత్తర్వులు జారీ సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లా కలెక్టర్‌గా ఎం.గిరిజాశంకర్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ర్టం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన్ను కమలనాథన్ కమిటీ ఏపీకి, చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తోన్న సిద్ధార్థ్‌జైన్‌ను తెలంగాణకు కేటాయించిన విషయం విదితమే. ఐఏఎస్‌ల విభజన పూర్తయిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లోనూ ఐఏఎస్‌ల మార్పుల చేర్పులకు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్‌గా ఎం.గిరిజాశంకర్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2001 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన మదనపల్లె సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. విశాఖపట్నం, కడప జిల్లాల్లో జాయింట్ కలెక్టర్‌గా ఆయన పనిచేశారు. జూలై 6, 2012 నుంచి మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ నేడో రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయని అధికారవర్గాలు వెల్లడించాయి. -
పంచాయతీ కార్యదర్శుల ద్వారా పింఛన్ల పంపిణీ
చిత్తూరు(సెంట్రల్): జిల్లాలో వికలాంగుల పింఛన్లకు సంబంధించి బయోమెట్రిక్ విధానంలో వేలిముద్ర లురాని వారిని గుర్తించి వారికి పంచాయతీ సెక్రటరీల ద్వారా ప్రతినెలా పింఛన్ డ్రా చేసి పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆదేశిం చారు. సోమవారం జరిగిన ప్రజావాణిలో పలువురు వికలాంగుల వేలిముద్రలు సరిపోవడం లేదని పింఛన్ ఇవ్వలేదని కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ వేలిముద్రలు సరిపోని వికలాంగులకు పింఛన్లు సంబంధిత సెక్రటరీలు సొంత బాధ్యత తీసుకుని అందించాలన్నారు. ప్రజావాణిలో సరిగా ఎదుగుదల లేని రమేష్ కుమార్తె గంగామాతకు గతంలో రిలీ జైన ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.25వేలను వెంటనే చెల్లిం చాల్సిందిగా సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మీ- సేవ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి జిల్లాలో మీ-సేవ ద్వారా వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలకోసం వచ్చిన దరఖాస్తులు 33వేల వరకు పెండింగ్‌లో ఉన్నాయని, సంబంధిత ఆర్డీవోలు, తహశీల్దార్లు సత్వరమే చర్యలు తీసుకుని పరిష్కరించాలని చెప్పారు. ప్రజావాణిలో రెవెన్యూకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా వస్తున్నాయని, వీటి పరిష్కారానికి అనుభవం కలిగిన రెవెన్యూ అధికారులతో టాస్క్ఫోర్సు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జేసీ భరత్‌గుప్తా, ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
58 మండలాల్లో కరువు!
చిత్తూరు (సెంట్రల్): కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆదేశాల మేరకు జిల్లాలోని 58 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకున్నాయని, వీటిని కరువు మండలాలుగా ప్రకటించి రైతులకు, ప్రజలకు సహకారం అందించాలని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదికలు అందించారు. కరువు మండలాల వివరాలు ఇలా ఉన్నాయి.. పీటీఎం, ములకలచెరువు, బి.కొత్తకోట, కలకడ, పెద్దపంజాణి, పెద్దమండ్యం, తంబళ్లపల్లె, రామకుప్పం, పులిచెర్ల, గుడుపల్లె, నిమ్మనపల్లె, పూతలపట్టు, కుప్పం, వి.కోట, బెరైడ్డిపల్లె, సదుం, శాంతిపురం, పలమనేరు, గంగవరం, కురబలకోట, గుర్రంకొండ, మదనపల్లె, యాదమరి, వాల్మీకిపురం, గుడిపాల, జీడీనెల్లూరు, ఐరాల, తవణంపల్లె, కలికిరి, రొంపిచెర్ల, బంగారుపాళెం, చిన్నగొట్టిగల్లు, చిత్తూరు, సత్యవేడు, ఏర్పేడు, ఎస్ఆర్పురం, తొట్టంబేడు, పాకాల, రామసముద్రం, పుంగనూరు, పుత్తూరు, చౌడేపల్లె, పిచ్చాటూరు, సోమల, నారాయణవనం, నగరి, పెనుమూరు, శ్రీకాళహస్తి, నిండ్ర, కార్వేటినగరం, చంద్రగిరి, పాలసముద్రం, వెదురుకుప్పం, కేవీబీపురం, రామచంద్రాపురం, ఎర్రావారిపాళెం, పీలేరు, కేవీపల్లె మండలాలున్నాయి. వీటిన్నింటిలోనూ సాధారణ వర్షపాతం కన్నా 10 నుంచి 50 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదైందని వీటిన్నింటినీ కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని అధికారులు శుక్రవారం రెండు విడతలుగా ప్రభుత్వానికి నివేదికలు పంపారు. -
రాజకీయ ‘పిడి’కిలి
శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని కొల్లగొడుతున్న స్మగ్లర్లపై ‘పిడి’కిలి బిగించడంలో కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ దాటవేత ధోరణి అవలంబిస్తుండడంలో ఆంతర్యమేమిటన్నది అంతుచిక్కడం లేదు. గతంలో తొమ్మిది మంది అంతర్జాతీయ స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించే ఫైలుపై ఆయన సంతకం చేయకపోవడం గమనార్హం. ఆ ఫైలుపై ఇన్చార్జ్ కలెక్టర్ హోదాలో శ్రీధర్ సంతకం చేసి ప్రభుత్వానికి పంపడంతో.. ఆ తొమ్మిది మంది స్మగ్లర్లపై శుక్రవారం పీడీ చట్టాన్ని ప్రయోగించింది. కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ తాజాగా ఐదుగురు ‘ఎర్ర’ స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించే ఫైలుపై సంతకం చేయకుండా నాన్చుతుండడంపై పోలీసు వర్గాల్లో అసహనం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసిన విషయం విదితమే. ఆ టాస్క్‌ఫోర్స్, పోలీసుల నేతృత్వంలో ఇప్పటిదాకా 191 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఈ స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించాలని జిల్లా మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్‌కు ఎస్పీ ప్రతిపాదనలు పంపితే, కలెక్టర్ సంతకం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలి. పీడీ చట్టం అమలుపై రాష్ట్ర స్థాయిలో ఏర్పాటుచేసిన సలహా మండలి సమావేశమై.. ఆ నివేదికపై చర్చించి, ఆమోదముద్ర వేయవచ్చు.. లేదా తిరస్కరించవచ్చు. రాష్ట్ర సలహా మండలి ఆదేశాల మేరకే పీడీ చట్టాన్ని స్మగ్లర్లపై ప్రయోగిస్తారు. కానీ.. ‘ఎర్ర’ స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించాలని ఎస్పీ పంపిన ఫైలుపై కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సంతకం చేసి, ప్రభుత్వానికి పంపడంలో దాటవేత వైఖరిని అనుసరిస్తున్నారు. తాజాగా ఐదుగురు ‘ఎర్ర’ స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించాలని ఎస్పీ జి.శ్రీనివాసరావు పంపిన ఫైలుపై సంతకం చేయకపోవడం అందుకు తార్కాణం. సంతకం చేయరెందుకో... వైఎస్ఆర్ కడప జిల్లా సుండుపల్లి మండలం అప్పయ్యగారిపల్లెకు చెందిన గట్టుబాబు అలియాస్ శివప్రసాద్‌నాయుడు 20 ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడు. చిత్తూరుకు చెందిన టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి వసంతనాయుడుపై 11 కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రానికి చెందిన పుల్లకుమార్పై 13, విజయ్‌కుమార్‌పై 13 స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. రాయచోటికి చెందిన రెడ్డెప్పరెడ్డిపై తొమ్మిది కేసులు ఉన్నాయి. ఈ ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు ఎస్పీ జి.శ్రీనివాసరావు ద్వారా వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగించాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌కు 20 రోజుల క్రితం ఫైలు పంపారు. ప్రభుత్వ కార్యాకలాపాల్లో జిల్లా అధికారయంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తోన్న కలెక్టర్.. తాను మాత్రం ఆ ఫైలుపై సంతకం చేయకుండా నాన్చుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో తొమ్మిది మంది అంతర్జాతీయ ఁఎర్ర* స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించే ఫైలు కూడా కలెక్టర్ సంతకం చేయడంలో వెనుకంజ వేశారు. శ్రీధర్ చొరవతో తొమ్మిది మందిపై పిడికిలి.. అంతర్జాతీయ స్మగ్లర్లు ఆయిల్ రమేష్, రియాజ్ ఖాన్, హమీద్ ఖాన్, లక్ష్మణ్ నాయక్, లక్ష్మణన్, మహ్మద్ రఫీ, అసిఫ్ అలీ ఖాన్, విక్రమ్ మెహందీ, శరణన్లను జూలై 15న పోలీసులు అరెస్టు చేశారు. ఆ తొమ్మిది మంది అంతర్జాతీయ స్మగ్లర్లపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించేందకు అనుమతి ఇవ్వాలని అప్పటి చిత్తూరు ఎస్పీ రామకృష్ణ జూలై 16న కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌కు ప్రతిపాదించారు. దీనిపై కలెక్టర్ దాటవేత ధోరణి అవలంబించారు. అనంతరం కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సింగపూర్ పర్యటనలో ఉన్న వారం రోజుల్లో అప్పటి జాయింట్ కలెక్టర్ శ్రీధర్ ఇన్చార్జ్ కలెక్టర్‌గా వ్వయహరించారు. ఆ తొమ్మిది మంది స్మగ్లర్లపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించేందుకు ఆగస్టు 27న ఈయన అనుమతి ఇచ్చారు. శ్రీధర్ అప్పట్లో పంపిన నివేదికను సెప్టెంబర్ 19న పరిశీలించిన పీడీ చట్టం సలహా మండలి ఇన్చార్జ్ కలెక్టర్ ప్రతిపాదనపై ఆమోదముద్ర వేసింది. ఆ తొమ్మిది మంది అంతర్జాతీయ స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. శ్రీధర్ చొరవ వల్లే ఆ తొమ్మిది మందిపై ప్రభుత్వం పీడీ చట్టాన్ని ప్రయోగించిందని పోలీసులు స్పష్టీకరిస్తున్నారు. -
సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి
చిత్తూరు (సెంట్రల్) : ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరిచేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలోని సమావేశమందిరం లో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజావాణి పోర్టల్ యూజర్ నేమ్, పాస్‌వర్ట్‌లను అన్ని శాఖలకు అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం సమావేశంలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో చర్చించారు. ప్రభుత్వం జారీ చేసిన నూతన ఇసుక పాలసీని అనుసరించి జిల్లాలో ఎంతమేర ఇసుక నిల్వలున్నాయి? నిర్మాణంలో ఉన్న భవనాలెన్ని ? వాటికి ఎంత ఇసుక అవసరం ? అనే అంశాలపై చర్చించారు. ఇసుక తవ్వకం ద్వారా భూగర్భజలాలకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయూ ? అని గనులు, నీటిపారుదల, భూగర్భజలశాఖ, డీఆర్డీఏ, డ్వామా సమన్వయంతో పరిశీలించి కొనుగోలుదారులతో ఎంఓయూలను రూపొందించాలన్నారు. అర్హమైన మహి ళా సంఘాలను గుర్తించి వాటి ద్వారా ఇసుక అమ్మకాలను ప్రారంభించే పనిని అక్టోబర్ 1 నుంచి చేపట్టాలన్నారు. జిల్లాలో మీ-సేవ, తహశీల్దార్ కార్యాలయం, ఎన్‌ఐసీల ద్వారా రేషన్‌కార్డుల నిమిత్తం వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించాలని పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి, ఆ సంస్థ జిల్లా మేనేజర్ ను ఆదేశించారు. రేషన్‌కార్డుల్లో మార్పు లు, చేర్పులు, సవరణ, సౌకర్యాల కార్యక్రమాలపై, ఎన్టీఆర్ ఆరోగ్య సేవలపై జిల్లాలోని కేబుల్ టీవీల్లో ప్రచారం చేపట్టాలన్నారు. ఆధార్ సీడింగ్ ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి పెన్షన్లు, ఇంటి మంజూరు, రేషన్‌కార్డు జారీకి అర్హులను గుర్తించాలన్నారు. ఈ నెల 19న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జిల్లాపర్యటనకు వస్తున్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని డీఎంఅండ్‌హెచ్‌ఓను ఆదేశించారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శస్త్రచికిత్సలు, ఇతర చికిత్సలు ఎక్కడ బాగా జరుగుతాయో గుర్తించి అక్కడ డాక్టర్ పోస్టుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఈ నెల 27న కేంద్ర వికలాంగుల మంత్రి జిల్లాకు వస్తున్నారని, తిరుపతి ఇందిర మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వికలాంగులకు అవసరమైన పరికరాలను పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వికలాంగుల శాఖ ఏడీ, జిల్లా విద్యాశాఖాధికారి, ఎస్ఎస్ఏ పీఓ, డీఆర్డీఏ, డ్వామా, మెప్మా పీడీలు సమన్వయం చేసుకుని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో ఎన్టీఆర్ సుజల స్రవంతిని ఎక్కడెక్కడ ప్రారంభించనున్నారో నివేదికలు సమర్పించాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
చిత్తూరు జేసీగా భరత్‌గుప్తా
కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్,టీటీడీ ఈవో గోపాల్ తెలంగాణకే... జీఏడీకి రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా జేసీ శ్రీధర్‌కు ఉత్తర్వులు ఎస్పీలు శ్రీనివాస్,గోపినాథ్ జట్టీలు జిల్లాలోనే జిల్లాకు త్వరలో కొత్త కలెక్టర్ సాక్షి, చిత్తూరు: చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా మదనపల్లె సబ్‌కలెక్టర్ భరత్‌గుప్తాను ప్రభుత్వం నియమించింది. చిత్తూరు జేసీ, ప్రస్తుత ఇన్చార్జి కలెక్టర్ శ్రీధర్‌ను జీఏడీకి రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా ఈ ఏడాది మార్చి 10న శ్రీధర్ బాధ్యతలు తీసుకున్నారు. ఎన్నికల సమయంలో గట్టిగా పనిచేశారు. రాజం పేట పార్లమెంట్ రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వహించారు. ప్రజలు ఏదైనా సమస్యతో తన వద్దకు వస్తే తక్షణమే స్పందిస్తారనే మంచి పేరు తెచ్చుకున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో కూడా దూకుడుగా వ్యవహరించారు. ముఖ్యంగా ఎర్రచందనం అంతర్జాతీయ స్మగర్లపై దాదాపు రెండు నెలలుగా పీడీయాక్టు నమోదు చేయకుండా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ తాత్సారం చేశారు. ఈ అంశంలో కలెక్టర్‌పై పలు విమర్శలు, ఆరోపణలు కూడా వచ్చాయి. కలెక్టర్‌ను తెలంగాణకు కేటాయించడం, సింగపూ ర్ పర్యటనకు వెళ్లడంతో ఇన్చార్జి కలెక్టర్‌గా శ్రీధర్ ఈ నెల 24న బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న వెంట నే ఏడుగురు అంతర్జాతీయ స్మగ్లర్లపై పీడీయాక్టు నమోదు చే సి ‘శభాష్’ అనిపించుకున్నారు. తక్కిన వారిపై పీడీ నమోదు చేసేందుకు ఫైళ్లు సిద్ధం చేయాలని పోలీసులను ఆదేశించారు. సబ్‌కలెక్టర్‌గా సక్సెస్ చిత్తూరు జేసీగా నియమితులైన భరత్‌గుప్తా మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా 2013 అక్టోబర్ 27న బాధ్యతలు తీసుకున్నారు. అతిపెద్ద రెవెన్యూ డివిజన్ అయిన మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా సక్సెస్ అయ్యారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని, తన వరకూ వచ్చిన విషయాలకు వీలైనంత వరకూ తక్షణ పరిష్కారం చూపిస్తారని పేరు తెచ్చుకున్నారు. ఒకే స మస్యపై పలుసార్లు తన వద్దకు ప్రజలు వస్తే తీవ్రంగా స్పందించేవారు. జిల్లా పరిస్థితులపై భరత్‌గుప్తాకు పూర్తిగా అవగాహన ఉండటంతో జాయింట్ కలెక్టర్‌గా తన బాధ్యతలు మరింత సులువు కానున్నాయి. తెలంగాణకే కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ తెలంగాణకే వెళ్లనున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, టీటీడీ ఈవో గోపాల్ తెలంగాణ కేడర్‌కు, జేసీ శ్రీధర్, మదనపల్లె సబ్‌కలెక్టర్ భరత్‌గుప్తా ఆంధ్రాకు కేటాయించబడ్డారు. ఈ నెల 2 వరకూ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం స్వీకరించింది. ఈ క్రమంలో ఐఏఎస్, ఐపీఎస్‌ల అభ్యంతరాలను పూర్తిగా తోసిపుచ్చింది. ఇదివరకే జరిగిన బదలాయింపులే ఫైనల్ అని తేల్చి చెప్పింది. దీంతో సిద్ధార్థ్‌జైన్, గోపాల్ తెలంగాణకు వెళ్లడం అనివార్యమైంది. చిత్తూరు, తిరుపతి ఎస్పీలు జిల్లాలోనే కొనసాగనున్నారు. జూలై 12న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ్‌జైన్ దూకుడుగా పాలన అందించేందుకు ప్రయత్నించారు. అయితే పూర్తిగా కుప్పంపైనే దృష్టి సారించి విమర్శల పాలయ్యారు. అలాగే అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి మోపి ఇబ్బంది పెట్టారని కూడా అధికార వర్గాలు చెబుతున్నాయి. మదనపల్లెను మరువలేను దేశంలో అతి పెద్ద రెవెన్యూ డివిజన్ కేంద్రమైన మదనపల్లెను జీవితంలో మరువలేను. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ శుభాలే జరిగాయి. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఇక్కడ చాలా మధురానుభూతులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడి వాతావరణం, రాజకీయ నాయకులు, ప్రజల సహకారం మరువలేను. జాయింట్ కలెక్టర్‌గా శుక్రవారం బాధ్యతలు చేపడతా. - భరత్ గుప్తా చిత్తూరు చాలామంచి జిల్లా : శ్రీధర్, ఇన్చార్జి కలెక్టర్ చిత్తూరులో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా మంచి జిల్లా. వీలైనంత వరకూ ప్రజలకు ఉపయోగపడేలా పాలన సాగించాననే తృప్తి ఉంది. ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్లు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లకూడదనే నిర్ణయంతోనే ఇన్చార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పీడీయాక్టుపై తక్షణ నిర్ణయం తీసుకున్నా. జిల్లా ప్రజలు, అధికారులు కూడా నాపై మంచి ప్రేమ చూపారు. అందరికీ కృతజ్ఞతలు. -
కలెక్టర్ ‘పిడి’కిలి సడలించారు..
9 మంది స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు సుముఖత చూపని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ పోలీసుశాఖ ప్రతిపాదనను నెలన్నర రోజుల పాటు తొక్కిపెట్టడంలో మర్మమేమిటో...? ఆ తొమ్మిది మందిపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇన్చార్జ్ కలెక్టర్ పేరుమోసిన తొమ్మిది మంది అంతర్జాతీయ ఎర్రదొంగలపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ విముఖత చూపారు. ఆయన అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్ వెళ్లిన నాలుగు రోజులకే ఇన్చార్జ్ కలెక్టర్ ఆ తొమ్మిది మందిపై ‘పిడి’కిలి బిగించారు. కలెక్టర్ పిడికిలి సడలిస్తే.. ఇన్చార్జ్ కలెక్టర్ బిగించడం చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. ఆ టాస్క్‌ఫోర్స్, పోలీసుల నేతృత్వంలో ఇప్పటిదాకా 179మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. అందులో పేరుమోసిన తొమ్మిది మంది అంతర్జాతీయ స్మగ్లర్లు ఉన్నారు. ఆయిల్ రమేష్, రియాజ్‌ఖాన్, హమీద్ ఖాన్, లక్ష్మణ్ నాయక్, లక్ష్మణన్, మహ్మద్ఫ్రీ, అసిఫ్అలీఖాన్, విక్రమ్మెహందీ, శరణన్లను జూలై 15న పోలీసు లు అరెస్టు చేశారు. ఆ తొమ్మిది మంది అంతర్జాతీయ స్మగ్లర్లపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించేందుకు అనుమతి ఇవ్వాలని అప్పటి చిత్తూరు ఎస్పీ రామకృష్ణ కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌కు జూలై 16న ప్రతిపాదించారు. సాధారణంగా ఎస్పీ చేసిన ప్రతిపాదనపై రెండు మూడు రోజుల్లో కలెక్టర్ ఆమోదముద్ర వేయడం.. ఆ తర్వాత పీడీ చట్టాన్ని ప్రయోగించడం రివాజు. కలెక్టర్ రాంగోపాల్ హయాంలో ఇదే రీతిలో పీడీ చట్టాన్ని ప్రయోగించేవారు. కానీ.. సిద్ధార్థ్‌జైన్ మాత్రం తద్భిన్నంగా వ్యవహరించారు. ఆ తొ మ్మిదిమందిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించడానికి సంబంధించిన ఫైలుపై సంతకం పెట్టేందుకు ఆసక్తి చూపలేదు. ఎర్రచందనం టెండర్లలో తక్కువ ధరకు ఎర్రచందనాన్ని కొట్టేసి.. ఆ తొమ్మిది మంది స్మగ్లర్ల సహకారంతో అధిక ధరలకు అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకోవడానికి ఇద్దరు టీడీపీ కీలక ప్రజాప్రతినిధులు వ్యూహం రచించారు. ఆ వ్యూహంలో భాగంగానే ఆ తొమ్మిది మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించకుండా కలెక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు అప్పట్లో ఆరోపణలు వ్యక్తమయయ్యాయి. నెలన్నర పాటు తొమ్మిది మందిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించే ఫైలుపై కలెక్టర్ ఆమోదముద్ర వేయకపోవడం ఆ ఆరోపణలకు బలం చేకూరింది. ఐఏఎస్‌ల విభజనలో కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌ను తెలంగాణకు కేటాయిస్తూ ఆగస్టు 21న ప్రత్యూష కమిటీ ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. ఆ మరుసటి రోజే కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్‌కు వెళ్లారు. సింగపూర్ పర్యటన ముగించుకుని ఈనెల 2న జిల్లాకు రానున్నారు. కలెక్టర్ సింగపూర్ వెళ్లిన నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ శ్రీధర్ ఇన్చార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తొమ్మిది మంది స్మగ్లర్లపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించేందుకు ఆగస్టు 27న ఇన్చార్జ్ కలెక్టర్ శ్రీధర్ అనుమతి ఇచ్చారు. ఒత్తిళ్లకు తలొగ్గకుండా తొమ్మిది మంది స్మగ్లర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు అనుమతి ఇచ్చిన ఇన్చార్జ్ కలెక్టర్ శ్రీధర్‌ను అటు పోలీసు, అటవీ అధికారులు.. ఇటు ప్రజాసంఘాలు ప్రశంసిస్తున్నాయి. ఈ క్రమంలోనే కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ వ్యవహరించిన తీరుపై సందేహాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. -
ఆఖరి పోరాటం
బ్రహ్మోత్సవాల వరకు ఉంచండి : ఎంజీ గోపాల్ ఏపీ కేడర్‌కే కేటాయించండి : సిద్ధార్థ్‌జైన్ చంద్రబాబుకు ఐఏఎస్‌ల వినతి చేతులెత్తేసిన ముఖ్యమంత్రి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎంజీ.గోపాల్, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆఖరి పోరాటానికి సిద్ధమయ్యారు. ఐఏఎస్‌ల విభజనలో ఎంజీ.గోపాల్, సిద్ధార్థ్ జైన్‌ను ప్రత్యూష్ కమిటీ తెలంగాణకు కేటాయించింది. ఈ నేపథ్యంలో తనను బ్రహ్మోత్సవాలు ముగిసేవరకు టీటీడీ ఈవోగా కొనసాగించాలని ఎంజీ.గోపాల్.. తనను ఆంధ్ర కేడర్‌కే కేటాయించేలా చేసి, జిల్లా కలెక్టర్‌గా కొనసాగించాలని సిద్ధార్థ్‌జైన్ సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: అఖిల భారత సర్వీసు అధికారుల విభజనకు కేంద్రం ప్రత్యూష్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన ఎంజీ.గోపాల్ 1983 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. స్థానికతను ప్రాతిపదికగా తీసుకున్న ప్రత్యూష్ కమిటీ ఎంజీ.గోపాల్‌ను తెలంగాణకు కేటాయించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సిద్ధార్థ్‌జైన్ 2001 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. సరిగ్గా 43 రోజుల కిత్రం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. సిద్ధార్థ్‌జైన్‌ను ప్రత్యూష్ కమిటీ తెలంగాణకు కేటాయించింది. ఐఏఎస్‌ల విభజనపై ఈనెల 29 వరకు కమిటీ అభ్యంతరాలను స్వీకరిస్తుంది. సెప్టెంబరు 2న తుది జాబితాను ప్రకటించనుంది. నాలుగు రోజుల క్రితమే ఐఏఎస్‌ల విభజన ప్రతిపాదనలు బయటకు పొక్కడంతో ఎంజీ.గోపాల్, సిద్ధార్థ్‌జైన్ అప్రమత్తమయ్యారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 26న ప్రారంభమై అక్టోబరు 4వ తేదీ ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు టీటీడీ ఈవోగా కొనసాగించాలని ఎంజీ.గోపాల్ సీఎం చంద్రబాబును కోరారు. కానీ ఐఏఎస్‌ల విభజన పూర్తయిన నేపథ్యంలో తానేమీ చేయలేనని సీఎం చేతులెత్తేయడంతో ఎంజీ.గోపాల్ డీలాపడ్డారు. తెలంగాణకు కేటాయించిన నేపథ్యంలో తనకు స్థానభ్రంశం తప్పదనే నిర్ణయానికి వచ్చారు. ప్రత్యూష్ కమిటీ ఈనెల 29 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్న నేపథ్యంలో తనను ఆంధ్రకే కేటాయించాలని సిద్ధార్థ్‌జైన్ ఇప్పటికే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. తనను ఆంధ్రకే కేటాయించేలా చూడాలని సీఎం చంద్రబాబును ఆయన కోరినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. కానీ సిద్ధార్థ్‌జైన్ అభ్యంతరాన్ని ప్రత్యూష్ కమిటీ పరిగణనలోకి తీసుకునే అవకాశాలు తక్కువ అని అధికారవర్గాలు వెల్లడించాయి. సీఎం కార్యాలయం అధికారులను ఆంధ్ర కేడర్‌కు కేటాయించేలా ప్రత్యూష్ కమిటీపై ఒత్తిడి తెచ్చిన చంద్రబాబు అప్పట్లోనే సిద్ధార్థ్‌జైన్ అంశాన్ని కూడా తెరపైకి తెచ్చారు. కానీ సిద్ధార్థ్‌జైన్‌ను ఆంధ్రకు కేటాయించడానికి ప్రత్యూష్ కమిటీ అంగీకరించలేదన్నది ఐఏ ఎస్‌ల విభజనతో తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎం చంద్రబాబు ఒత్తిడి.. సిద్దార్థ్‌జైన్ ప్రతిపాదనను ప్రత్యూష్ కమిటీ తోసిపుచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనే అభిప్రాయం అధికారవర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. ఏదిఏమైనా సెప్టెంబరు మొదటి వారంలో టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్‌కు స్థానభ్రంశం తప్పదని అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. -
సారూ మరిచారా?మీరు జిల్లాకు కలెక్టరు కదా !
ఫోకస్ మొత్తం కుప్పంపైనేనా ? ఐదుగురు ఆర్డీవో స్థాయి అధికారుల నియామకం డెప్యుటేషన్‌పై 26మంది టీచర్ల బదలాయింపు వైద్యశాఖలోనూ 48 మందిని పంపిన వైనం అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి కంకణం కలెక్టర్ పనితీరుపై జిల్లాలో జోరుగా చర్చ కుప్పం నియోజకవర్గం చాలా వెనుకబడింది...కచ్చితంగా అభివృద్ధి చేయాల్సిందే ! ఇది ఎవరూ కాదనలేని సత్యం. అయితే ఫోకస్ మొత్తం కుప్పంపైనే ఉంచి తక్కిన నియోజకవర్గాలను విస్మరిస్తే...అది కూడా సరికాదనేది విశ్లేషకుల అభిప్రాయం. అచ్చం ఇదే తంతుతో ముందుకెళుతున్నారు కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్. విధుల్లో చేరినప్పటి నుంచి ‘కుప్పం’పై కలెక్టర్ అనుసరిస్తున్న పాలన, విధానపరమైన నిర్ణయాలపై అధికారులతో పాటు, విశ్లేషకుల్లో జోరుగా చర్చసాగుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే జిల్లా కలెక్టర్లా కాకుండా కుప్పం ఆర్డీవోగా సిద్ధార్థ్‌జైన్ వ్యవహరిస్తున్నారని చర్చించుకుంటున్నారు. సాక్షి, చిత్తూరు: జిల్లా కలెక్టర్‌గా సిద్ధార్థ్‌జైన్ గత నెల 12న బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో చేరినప్పటి నుంచి దూకుడుగా పాలన సాగిస్తున్నారు. అధికారులను పరుగెత్తిస్తున్నారు. తనదైన ‘మార్క్’ను చూపించి పాలనను గాడిలో పెట్టాలని యత్నిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా సమగ్రాభివృద్ధిపై కాకుండా కుప్పం నియోజకవర్గంపైనే కలెక్టర్ ఫోకస్ పెట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెలరోజుల్లో కుప్పంపై కలెక్టర్ మార్క్ ఇది బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐదు రోజులకే కలెక్టర్ కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు నలుగురు ఆర్డీవో స్థాయి అధికారులను నియమించారు. ఆధార్ సీడింగ్‌తో పాటు అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యత వారికి అప్పగించారు. వీరితో పాటు అమలాపురం ఆర్డీవో ప్రియాంకను కుప్పం ప్రత్యేకాధికారిగా రప్పించడంలో కూడా కలెక్టర్ చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రితో చర్చించి ప్రత్యేకాధికారిగా రప్పించారని తెలిసింది. దీంతో కుప్పం నియోజకవర్గాన్ని ఐదుగురు ప్రత్యేకాధికారులు పర్యవేక్షిస్తున్నారు. తొలి గ్రీవెన్స్ సెల్ చిత్తూరులో నిర్వహించి, రెండో గ్రీవెన్స్‌డేను కుప్పంలో నిర్వహించారు. తాజాగా కుప్పంలో ఉపాధ్యాయులు, వైద్య, ఆరోగ్యశాఖల్లో ఖాళీల భర్తీపై దృష్టి సారించారు. ఇటీవల 26మంది ప్రభుత్వ టీచర్లను జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కుప్పం నియోజకవర్గానికి డెప్యుటేషన్‌పై పంపించారు. అలాగే 48మంది వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందిని కుప్పానికి పంపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం డెప్యుటేషన్‌పై ఎవరినీ ఎక్కడా నియమించకూడదు. పైగా కౌన్సెలింగ్ ద్వారా కాకుండా ప్రత్యేకంగా కలెక్టర్ చొరవ తీసుకుని కుప్పం ఖాళీల భర్తీకి ఉపక్రమించారు. జిల్లా వ్యాప్తంగా 2629 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కుప్పం నియోజకవర్గంలో 510 ఖాళీలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఇతర నియోజకవర్గాలపై దృష్టి సారించకుండా కుప్పం వెళ్లేందుకు టీచర్ల నుంచి వినతిపత్రాలు తీసుకుని పంపించారు. ఇదే తరహాలో పూతలపట్టు, గంగాధర నెల్లూరు, మదనపల్లెలోని మారుమాల ప్రాంతాల్లో ఖాళీలపై కలెక్టర్ ఎందుకు దృష్టిసారించడం లేదని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఏలుబడిలో పాతికేళ్ల నిర్లక్ష్యం: చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గ వాసి అయినప్పటికీ కుప్పం ప్రజలు పాతికేళ్లుగా చంద్రబాబును ఆరాధిస్తున్నారు. అందలం ఎక్కిస్తున్నారు. తొ మ్మిదేళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్షనేతగా కూడా ‘కుప్పం’ నుంచే ప్రాతినిథ్యం వహించారు. అయితే ఇన్నేళ్లు ఆదరించిన కుప్పం వాసులను చంద్రబాబు మాత్రం పూర్తిగా విస్మరించారు. కుప్పంలోని వలసలను నివారించడం, ఉపాధి కల్పనపై దృష్టిసారించడం, వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. కుప్పం కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైంది. గంగాధర నెల్లూరు, పూతలపట్టు, నగరి, సత్యవేడు, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలు కూడా అభవృద్ధిలో వెనుకబడి ఉన్నాయి. జిల్లా కలెక్టర్‌గా వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి పాటుపడాల్సిన బాధ్యత కలెక్టర్‌పై ఉంటుంది. అయితే తాగునీటికి కటకటలాడుతున్న పూతలపట్టు లాంటి నియోజకవర్గాలతో పాటు జిల్లా అభివృద్ధిపై పాక్షిక దృష్టి పెట్టి, కుప్పంపై మాత్రం పూర్తి దృషి సారిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కూడా ఇదే దోవలో వెళుతున్నారు. దీంతో ప్రజాప్రతినిధులు బయటపడకపోయినా లోలోపల కలెక్టర్ వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారు. బాధ్యత లు తీసుకున్న నెలరోజుల్లోనే కలెక్టర్ తన మనసులోని ‘లక్ష్యాన్ని’ బయట పెట్టారని చెబుతున్నారు. అధికారపార్టీ నేతలు కూడా కలెక్టర్ తీరుపై నిరుత్సాహాంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు కూడా కలెక్టర్ వైఖరిపై నేరు గా మాట్లాడకున్నా, కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరుపై అధికారుల అంతర్గత చ ర్చల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి నెలరోజులు ‘పాలనబండిని’ కు ప్పంవైపు నడిపిన కలెక్టర్ ఇప్పుడైనా దారి మారుస్తారో లేదో చూడాల్సిందే! -
కుప్పమా.. మజాకా
మీరంతా వెంటనే ‘కడా’కెళ్లండి! వైద్యశాఖలో 53 మందికి ఆకస్మిక బదిలీలు నేడు విధుల్లో చేరాలంటూ కలెక్టర్ ఆదేశాలు కౌన్సెలింగ్ లేకనే బదిలీలా అంటూ ఆవేదనలో ఉద్యోగులు రంగంలోకి దిగిన ఉద్యోగ సంఘ నాయకులు పలమనేరు: సీఎం నియోజకవర్గంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండరాదనే ఉద్దేశంతో జిల్లాలోని పలువురు వైద్య సిబ్బందిని బదిలీ చేస్తూ కలెక్టర్ సిద్ధార్థజైన్ హుటాహుటిన ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది మంగళవారం సంబంధిత ఆస్పత్రుల్లో విధు ల్లో చేరాలని ఆయన డీఎంఅండ్‌హెచ్‌వో దశరథరామయ్యను ఆదేశించారు. ముందస్తు సమాచారం లేకుండా, కనీ సం కౌన్సెలింగ్ కూడా నిర్వహించకుం డా ఉన్న ఫలానా బదిలీలు చేయడమేంటని వైద్యశాఖకు చెందిన పలువురు పెదవి విరుస్తున్నారు. మొత్తం మీద సీఎం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి సారిస్తుందనేందుకు ఇదే నిలువెత్తు నిదర్శనం. జిల్లాలోని నలు మూలలకు చెందిన ఐదుగురు డాక్టర్లు, 29 మంది ఏఎన్ఎంలు, పలువురు ల్యాబ్ టెక్నీషియన్లు, కొందరు మైక్రో స్కోపిస్ట్లు వెంటనే కుప్పంకు వెళ్లాలని కలెక్టర్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఇది జరిగి మూడు రోజులైనా సంబంధిత శాఖలో బదిలీ చేసే అవకాశమున్న జాబితాను తయా రు చేసే పనిలో డీఎంఅండ్‌హెచ్‌వో బిజీగా ఉండడంతో అమలు చేయడం కాస్త ఆలస్యమైంది. దీనిపై తిరిగి కలెక్టర్ నుంచి సోమవారం మరోసారి డీఎంఅండ్‌హెచ్‌వోకు సమాచారమందినట్టు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం లోపు కడాలో విధుల్లో చేరాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలి సింది. బదిలీ అయిన వారు జిల్లాలోని తిరుపతి, చంద్రగిరి, చిత్తూరు, మదనపల్లె, తంబళ్లపల్లె ప్రాంతాలకు చెందిన వారని తెలిసింది. విద్యా సంవత్సరం ప్రారంభమై పిల్లలు పాఠశాలలకెళ్తున్న తరుణంలో ఈ బదిలీలతో ఇబ్బందులు తప్పవని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న పలువురు ఉద్యోగులు సోమవారం డీఎంఅండ్‌హెచ్‌వోను కలసి తమ ఆవేదన వెళ్లబోసుకున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాల్సిందేనని ఆయన తేల్చి చెప్పినట్టు సమాచారం. కనీసం ఓ జీవో కూడా విడుదల చేయకుండా యుద్ధప్రాతిపదికన ఈ ఆదేశాలు ఏంటంటూ ఇప్పటికే వైద్య ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయమై వీరు కలెక్టర్‌ను కలసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరనున్నట్లు తెలిసింది. ఈ విషయమై డీఎంఅండ్‌హెచ్‌వో దశరథరామయ్యను వివరణ కోరగా వాస్తవమేనన్నారు. వీరంతా రెండు రోజుల్లో కుప్పంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుం దని తెలిపారు. -
కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ తెలంగాణకు కేటాయింపు ?
చిత్తూరు (సెంట్రల్): జిల్లా కలెక్టర్‌గా నెల రోజుల క్రితం విధుల్లో చేరిన సిద్ధార్థ్‌జైన్‌ను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించినట్లు నగరంలో వార్త హల్చల్ చేసింది. కేంద్రం ఐఏఎస్, ఐపీఎస్‌లను తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు కేటాయించే విషయూనికి సంబంధించి మొదటి ప్రాధాన్యతను లాటరీ పద్ధతిలో తెలంగాణకు కేటాయించింది. ఈ క్రమంలో సీనియారిటీ లిస్టు ప్రకారం చిత్తూరు కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ తెలంగాణ రాష్ట్రానికి వెళ తారని ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ఆయన కుప్పం నుంచి నేరుగా హైదరాబాద్‌కు వెళ్లారని, సీఎం చంద్రబాబును కలిసి ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగేందుకు ప్రయత్నాలు చేస్తారని విశ్వసనీయ సమాచారం. -
ప్రజావాణికి నూతన సాఫ్ట్వేర్
పర్యావరణానికి హాని లేకుండా చర్యలు సంక్షేవు హాస్టళ్లలో రూపాంతరంతో అభివృద్ధి కలెక్టర్ సిద్ధార్థజైన్ కుప్పం : ప్రతి సోవువారమూ నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి నూతన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. ఆదివారం కుప్పం ఆర్అండ్బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సవూవేశంలో ఆయున వూట్లాడారు. సంక్షేవు హాస్టళ్లలో సవుస్యల పరిష్కారానికి రూపాంతరం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. హాస్టళ్ల అభివృద్ధికి తగు చర్యలు చేపట్టనున్నామన్నారు. వుంచినీరు సరఫరా చేసే ట్యాంకర్లకు ఇదివరకు కేటాయించే నగదును వురింత పెంచినట్లు తెలి పారు. వేరుశెనగ సాగు చేస్తున్న రైతులు పంట బీవూకు సెప్టెంబర్ 15లోగా ప్రీమియం చెల్లించవచ్చన్నారు. నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నావుని వివరించారు. కుప్పం డిగ్రీ కళాశాలకు తరగతి గదులు లేకపోవడంతో స్థానికంగా ఉన్న ఏపీవీవీపీకి చెందిన భవనాలు అనువుగా ఉంటాయుని తవు దృష్టికి తెచ్చారని, ప్రస్తుతం ఈ భవనాలు ద్రవిడ వర్సిటీ వినియోగించుకుంటుండడంతో వారికి సైతం తగిన సవూచారం అందించామని పేర్కొన్నారు. ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సవూవేశంలో వుదనపల్లె సబ్ కలెక్టర్ నారాయుణ భరత్‌గుప్త, కడ ప్రత్యేకాధికారి ప్రియూంక పాల్గొన్నారు. -
సీఎం సమావేశానికి ప్లానింగ్‌తో పయనం
-
25న కలెక్టర్ సింగపూర్ పయనం
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఈనెల 25 నుంచి సెప్టెంబర్ 2 వరకూ సింగపూర్‌లో ‘సెవెన్త్ లీడర్స్ ఇన్ గవర్నెన్స్ ప్రోగ్రామ్’ పేరుతో నిర్వహించే అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కలెక్టర్ సిద్ధార్థజైన్ పాల్గొననున్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కీలక భూమిక పోషించే ప్రతినిధులతో ఈనెల 25 నుంచి సింగపూర్‌లో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు మన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా సిద్ధార్థజైన్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్.కృష్ణారావు ఎంపిక చేశారు. సింగపూర్ సదస్సులో పాల్గొనడానికి ఈ నెల 24న కలెక్టర్ చెన్నైకి చేరుకోనున్నారు. అక్కడి నుంచి సింగపూర్‌కు వెళ్లి.. సదస్సు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 4న జిల్లాకు చేరుకుంటారని అధికారవర్గాలు వెల్లడించాయి. -
సీఎం సమావేశానికి ప్లానింగ్‌తో పయనం
విజయవాడలో కలెక్టర్లతో నేడు ముఖ్యమంత్రి సమావేశం ఐదేళ్ల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికతో వెళ్లిన కలెక్టర్ సిద్ధార్థజైన్ ఐఐటీ, తిరుపతి స్మార్ట్‌సిటీ,కుప్పం అభివృద్ధిపై ప్రధాన దృష్టి తాగునీటి సమస్య, వ్యవసాయాభివృద్ధిపైనా.. జిల్లాలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మౌలిక సదుపాయాలను ఎలా సమకూర్చాలి? పారిశ్రామిక, వ్యవసాయాభివృద్ధి దిశగా ఎలాంటి అడుగులు వేయాలి? ఇలా సమగ్ర అభివృద్ధికి సంబంధించిన నిర్ధిష్ట ప్రణాళికతో కలెక్టర్ సిద్ధార్థజైన్ విజయవాడకు పయనమయ్యారు. జిల్లాల అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్లతో గురువారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. సాక్షి, చిత్తూరు: విజయవాడలో జరిగే సమావేశానికి కలెక్టర్ సమగ్ర నివేదికతో వెళ్లారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో నివేదిక తయారీపై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ముఖ్య శాఖలకు సంబంధించిన అధికారులతో బుధవారం సమావేశమయ్యారు. అభివృద్ధి పనులు, తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి భాస్కరశర్మ నివేదిక సిద్ధం చేశారు. పారిశ్రామిక, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు జిల్లాలో పరిశ్రమలు, విద్యాసంస్థల స్థాపనకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలో పొందుపరిచారు. శ్రీకాళహస్తి, ఏర్పేడులో 12వేల ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని, ఇందులో ఐఐటీతోపాటు ఐబీఎం లాంటి విద్యాసంస్థలను ఏర్పాటు చేయవచ్చని సూచించారు. కలికిరిలోనూ పరిశ్రమలు స్థాపించవచ్చని సూచించారు. పరిశ్రమల స్థాపనకు నీటి సమస్య ప్రధాన అడ్డంకి కానుందని, దీనికోసం హంద్రీ-నీవాను పూర్తి చేయడమేగాక జిల్లాలోని ప్రాజెక్టుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కండలేరు పరిస్థితి ఏంటో తేల్చండి? జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దీన్ని శాశ్వతంగా నివారించేందుకు గత ప్రభుత్వం కండలేరు నుంచి నీటిని తెచ్చేందుకు ఉపక్రమించిందని సూచించారు. టెండర్ల ప్రక్రియ వరకూ వచ్చి ఆగిపోయిన ఈ పథకాన్ని పూర్తి చేస్తే జిల్లాలో మంచినీటి సమస్యను నివారించవచ్చని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ప్రణాళికలు సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. చిత్తూరులో మెడికల్ కాలేజీ చిత్తూరులో వైద్య కళాశాల ఏర్పాటుపైనా నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. దీనికి సంబంధించి చిత్తూరు ఎమ్మెల్యే డీఏ.సత్యప్రభ సీఎం వద్ద హామీ కూడా పొందినట్టు తెలిసింది. చిత్తూరు, సమీప ప్రాంత వాసులకు మెరుగైన వైద్యం కోసం మూడేళ్లలో దీన్ని పూర్తి చేయాలని కూడా నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. చిత్తూరులో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటునూ సూచించారు. వ్యవసాయ, పాడి పరిశ్రమ అబివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలనూ పొందుపరిచినట్లు తెలిసింది. కుప్పం అభివృద్ధిపై ప్రత్యేక నివేదిక కుప్పం అబివృద్ధి కోసం ప్రత్యేకంగా నియమితులైన నలుగురు అధికారులతో సమగ్ర నివేదికను తెప్పించుకున్న కలెక్టర్, కుప్పం కోసం ప్రత్యేక నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. హౌసింగ్, పింఛన్లు, విద్యుత్, మరుగుదొడ్లు, ఆధార్ తదితర అంశాలపై నివేదికను సిద్ధం చేశారు. కుప్పంలో హార్టికల్చర్ అభివృద్ధి, విమానాశ్రయం ఏర్పాటుపై కూడా పేర్కొన్నారు. తిరుపతిని స్మార్ట్‌సిటీగా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి అప్‌గ్రేడ్ చేయడం లాంటి అంశాలను కూడా నివేదికలో పొందుపరిచారు. నివేదిక ప్రకారం అభివృద్ధికి దాదాపు రూ.27 వేల కోట్లు అవసరమని అధికారవర్గాలు చెబుతున్నాయి. మరి ఇన్ని నిధులను వెచ్చించి చంద్రబాబు తన సొంత జిల్లాను ఏ మేరకు అభివృద్ధి చేస్తారో వేచి చూడాల్సిందే. -
అధికారుల హాస్టల్ నిద్ర
చిత్తూరు(సిటీ) : జిల్లాలోని 124 సాంఘిక సంక్షేమ, 68 బీసీ సంక్షేమ, 16 గిరిజన సంక్షేమ ప్రీమెట్రిక్ వసతిగృహాల్లో(హాస్టళ్లు) అధికారులు శుక్రవారం రాత్రి నిద్ర చేశారు. రాత్రి 7 గంటలకు విద్యార్థులకు పెట్టే భోజన మెనూ, ఇతర మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. పరిసరాల పరిశుభ్రత, వసతి గృహాల్లో సిబ్బంది పనితీరు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు బాలుర వసతిగృహం-2 లో జాయింట్ కలెక్టర్ శ్రీధర్, పెనుమూరు వసతిగృహంలో జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్‌రెడ్డి, చిత్తూరు బాలికల వసతిగృహంలో జిల్లా పౌరసరఫరాల అధికారిణి విజయరాణి, జీడీ నెల్లూరు వసతిగృహంలో బీసీ సంక్షేమశాఖాధికారి డీ రామచంద్రరాజు, పూతలపట్టు వసతిగృహంలో డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి, చిత్తూరు బాలుర వసతిగృహం-1లో డ్వామా పీడీ గోపీచంద్ బస చేశారు. కార్వేటినగరం సాంఘిక సంక్షేమ వసతిగృహంలో జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, దామల్చెరువు వసతిగృహంలో సాంఘిక సంక్షేమశాఖ డెప్యూటీ డెరైక్టర్ కే ధనంజయరావు, కేవీ పల్లె బాలికల వసతి గృహంలో డీపీఆర్వో లీలావతి, మదనపల్లెలో తెలుగు గంగ ప్రాజెక్టు స్పెషలాఫీసర్, వీ కోట వసతిగృహంలో డీటీసీ బసిరెడ్డి, కల్లూరు వసతి గృహంలో ఆర్టీవో సత్యనారాయణమూర్తి రాత్రి నిద్ర చేశారు. వీరితో పాటు మిగిలిన వసతి గృహాల్లో మిగిలిన జిల్లా స్థాయి అధికారులు, దిగువ శ్రేణి అధికారులు హాస్టల్ నిద్ర చేసి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. -
జనంతో మమేకం
కుప్పంలో జిల్లా కలెక్టర్ ప్రజావాణి ఉదయుం నుంచి సాయుంత్రం దాకా జనంతోనే.. అర్జీలతో బారులు తీరిన ప్రజలు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ సోమవారం రోజంతా జనంతో మమేకమయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. జిల్లాలో మొదటిసారి కలెక్టర్ సిద్ధార్థజైన్ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం కుప్పంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసుకునేందుకు నియోజకవర్గం నలువుూలలనుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. కుప్పం: కుప్పంలో కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో సోవువారం ఉదయుం 11గంటలకు ప్రారంభమైన అర్జీల స్వీకరణ సాయుం త్రం ఆరు గంటల వరకు కొనసాగింది. వుండల సచివాలయు సవూవేశ వుందిరంలో అన్ని శాఖల ఉన్నతాధికారులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశా రు. తవు సవుస్యలు పరిష్కరించుకునేందుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులతో కలెక్టర్ నేరుగా వూట్లా డి అర్జీలు స్వీకరించారు. మొదటగా రేషన్‌కార్డులు, పింఛన్లు, హౌసింగ్ శాఖల వారీగా ఫిర్యాదులు తీసుకున్నారు. శాఖలవారీగా విభజించి జిల్లాస్థాయి అధికారులకు అందజేసి అప్పటికప్పుడే పరిష్కరించాల ని ఆదేశించారు. వీటిలో సాంకేతిక ఇబ్బందులు ఉన్న వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి వచ్చిన ఫిర్యాదుపై తక్షణం స్పందించిన కలెక్టర్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ను సవుస్య పరిష్కరించాలని ఆదేశించారు. భారీగా వచ్చిన ప్రజల సౌకర్యార్థం కుర్చీ లు, షామియూనాలు ఏర్పాటుచేశారు. పోలీసులు ఫిర్యాదుదారులను వరుసక్రవుంలో కలెక్టర్ వేదిక వద్దకు పంపించారు. ప్రజావాణి నిర్వహిస్తున్న సవూవేశ వుందిరంలో కేవలం జిల్లాస్థాయి అధికారులను వూత్రమే అనువుతించారు. నియోజకవర్గ స్థారుు అధికారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రవుంలో వుదనపల్లె సబ్ కలెక్టర్ నారాయుణ భరత్ గుప్త, జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.