ఖమ్మం, న్యూస్లైన్ : సార్లకు తీరిక లేదనే నెపంతో సంవత్సర కాలంగా పాలేరు, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలో అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు, మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు భర్తీకి నోచుకోలేదు. దీంతో అర్హులైన పలువురు మహిళలు ఉద్యోగం కోసం ఏడాదిగా ఎదురుచూడాల్సి వస్తోంది. అంగన్వాడీ పోస్టులు భర్తీకాకపోవడంతో ఆయా ప్రాంతాల్లో పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ కావడం లేదు. ఈ పోస్టుల భర్తీలో కీలక పాత్ర పోషించే ఎమ్మెల్యేలకు తీరికలేకనే ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదని, దీంతో భర్తీ ప్రక్రియ ఆలస్యం అయిందని అధికారులు చెపుతున్నారు.
శిశు మరణాలు తగ్గించడం, ఆస్పత్రుల్లోనే ప్రసవం జరిగేలా చూడటం, తల్లీ బిడ్డల సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం అందించడంతోపాటు పాఠశాల పూర్వదశలో ఉన్న పిల్లలను బడికి పంపించేలా సన్నద్ధం చేసేందుకు మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఆయా ప్రాంతాల్లో ఉన్న జనాభాకు అనుగుణంగా ప్రతి ఏటా కొత్తగా మరికొన్ని అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గత సంవత్సరం నోటిఫికేషన్ జారీ చేశారు. జిల్లాలోని పది నియోజకవర్గాల పరిధిలో 74 మంది అంగన్వాడీ వర్కర్లు, 168 మంది ఆయాలు, 602 మంది మినీ అంగన్వాడీ వర్కర్ల కోసం 2012 ఆగస్టు 5న నోటిఫికేషన్ విడుదలైంది. ఏజెన్సీ ప్రాంతంలోని పోస్టులకు గత అక్టోబర్ 29 నుంచి 31 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి పోస్టింగ్లు ఇచ్చారు. ఖమ్మం డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో కూడా గత సంవత్సరం డిసెంబర్ 27, 28 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి పోస్టింగ్లు ఇచ్చారు. కానీ పాలేరు, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలతో పాటు వైరా నియోజకవర్గంలోని పలుచోట్ల నేటికీ ఇంటర్వ్యూలు నిర్వహించలేదు.
ఎమ్మెల్యేలకు తీరకనే జాప్యం...
అంగన్వాడీ ఉద్యోగుల నియామక కమిటీలో ఐసీడీఎస్ పీడీ, స్థానిక ఆర్డీవో, జిల్లా వైద్యాధికారితోపాటు స్థానిక ఎమ్మెల్యే సభ్యులుగా ఉంటారు. వీరి సమక్షంలో ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేస్తారు. పాలేరు, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు తీరకపోవడంతో పాలేరు నియోజకవర్గంలోని 3 అంగన్వాడీ వర్కర్లు, 5 ఆయాలు, 36 మినీ అంగన్వాడీ వర్కర్ల పోస్టులకు, మధిర నియోజకవర్గంలోని ఒక అంగన్వాడీ వర్కర్, ఏడు ఆయా పోస్టులు, 28 మినీ అంగన్వాడీ వర్కర్లు, సత్తుపల్లి నియోజకవర్గంలోని 6 అంగన్వాడీ వర్కర్లు, 18 ఆయాలు, 38 మినీ అంగన్వాడీ వర్కర్ల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించలేదు. ఇక వైరా ఎమ్మెల్యే విశ్రాంతిలో ఉండటంతో ఏన్కూరు, జూలూరుపాడు, సింగరేణి మండలాలకు చెందిన 4 అంగన్వాడీ వర్కర్లు, 8 అయాలు, 45 మినీ అంగన్వాడీ వర్కర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఆయా కేంద్రాలు ప్రారంభానికి నోచుకోలేదు.
అనుచరులకు దక్కడం లేదనే..!
ఈ పోస్టులను తమ అనుచరులకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు చూడడం, గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్ సిద్ధార్థజైన్ అందుకు సహకరించకపోవడంతో కావాలనే ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఆసక్తి చూపలేదనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అర్హులైన అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఇప్పటికైనా ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు స్పందించి అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని, అర్హులైన వారినే ఎంపిక చేయాలని పలువురు కోరుతున్నారు.
భర్తీకి నోచుకోని అంగన్వాడీ ఉద్యోగాలు
Published Mon, Nov 4 2013 2:32 AM | Last Updated on Sat, Jun 2 2018 8:39 PM
Advertisement
Advertisement