నేలకొండపల్లి : చిన్నోళ్ల బడంటే చిన్నచూపే.. ఒకటి, రెండుకు వెళ్లాలంటే ప్రమాదమైనా రోడ్డు దాటక తప్పడంలేదు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేక.. ఉన్నవి శిథిలావస్థకు చేరి గర్భిణులు, బాలింతలు ఇబ్బంది పడుతున్నారు. జిల్లా యంత్రాంగం వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని.. బహిరంగ మల విసర్జన రహిత(ఓడీఎఫ్) గ్రామాలుగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నా.. అంగన్‌వాడీ కేంద్రాలను మాత్రం ‘చిన్న’చూపు చూస్తున్నాయి. కేంద్రాలకొచ్చే చిన్నారులకు చిన్నతనం నుంచే మరుగుదొడ్లకు వెళ్లే అలవాటు నేర్పితే బాగుంటుందని, ఈ విషయాన్ని అధికారులు గ్రహించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంగన్‌వాడీల్లో స్వచ్ఛభారత్ లేదా..?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమం జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు చేయటం లేదు. పిల్లలకు బాల్యంలో ఏ అలవాటు నేర్పుతారో దానినే జీవితాంతం పాటిస్తారు. ఈ చిన్నపాటి విషయాన్ని కూడా అధికారులు గుర్తించటం లేదు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలపై దృష్టి సారించటం లేదు. జిల్లాలో ఉన్న 1,896 కేంద్రాల్లో చాలా వరకు కేంద్రాల్లో మరుగుదొడ్లు లేవు. దీంతో చిన్నారులు బహిరంగ మల, మూత్ర విసర్జన కోసం రోడ్డు ఎక్కుతున్నారు. పౌష్టికాహారం కోసం వచ్చే బాలింతలు, గర్భిణులు అత్యవసర పరిస్థితుల్లో చెప్పుకోలేని పరిస్థితి. కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు నిర్మించినా నీటి సరఫరాలేక నిరుపయోగంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న 369 కేంద్రాల్లో మాత్రం చిన్నారులు పాఠశాల మరుగుదొడ్లను వినియోగించుకుంటున్నారు.
చాలా అద్దె భవనాల్లో ఉన్న కేంద్రాల్లో చిన్నారులు రహదారులు వెంట కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. పిల్లలు రోడ్లపైకి వెళ్తుండడంతో ఎప్పుడు ఏమవుతుందోనని తల్లిదండ్రులు, కార్యకర్తలు, ఆయాలు ఆందోళన చెందుతున్నారు. 922 మరుగుదొడ్లు కావాలని ఐసీడీఎస్ జిల్లా అధికారులు నివేదిక కూడా అందించారు. సౌకర్యాలు లేకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని పలువురు అంటున్నారు.
కలెక్టర్‌కు నివేదించాం
మరుగుదొడ్లు లేని అంగన్‌వాడీ కేంద్రాలను గుర్తించి కలెక్టర్‌కు నివేదించాం.అత్యవసరంగా జిల్లాలో 922 కేంద్రాల్లో మరుగుదొడ్లు నిర్మించాలి. ప్రభుత్వం సానుకూలంగా స్పం దించింది. త్వరలోనే చర్యలు తీసుకుంటుంది.
– రాయపూడి వరలక్ష్మి, ఐసీడీఎస్, పీడీ
మరుగుదొడ్లు నిర్మించాలి
అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేక చి న్నారులు, కార్యకర్తలు, ఆయాలు తీవ్ర ఇబ్బ ందులు పడుతున్నారు. బాల్యం నుంచే పిల్లలకు మరుగుదొడ్ల వినియోగం గురించి వివరిస్తే జీవితాంతం అలవాటు మరిచిపోరు.
– కోటేశ్వరి, చెరువుమాధారం,
అంగన్‌వాడీ టీచర్
కేంద్రాలపై నిర్లక్ష్యం
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉండేది అంతా నిరుపేదలు, కార్మికుల పిల్లలే. అందుకే ప్రభుత్వానికి నిర్లక్ష్యం. రోడ్ల వెంట మల విసర్జన వదంటారు. మరి చిన్నారులు ఎక్కడికి పోవాలి. వెంటనే మరుగుదొడ్లు నిర్మించాలి.
– కాశిబోయిన అయోధ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు
Comments
Please login to add a commentAdd a comment