ఖమ్మం : పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని చెబుతున్న విద్యాహక్కు చట్టానికి జిల్లా అధికారులు తూట్లు పొడిచారు. విద్యార్థులకు సరిపడ టాయిలెట్స్, తాగునీరు, బల్లలు, ర్యాంపులు, పక్కా భవనాలు నిర్మించాలనే ఆదేశాలను పెడచెవిన పెట్టారు. దీంతో జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్, తాగునీరు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
ఇప్పటికే పలు పాఠశాలల్లో నిర్మించిన మరుగుదొడ్లకు సరైన నిర్వహణ లేక, శుభ్రపరిచేందుకు ఉద్యోగులు, నిధులు, నీటి వసతి లేక కంపుకొడుతున్నాయి. దీంతో నిర్మించిన మూణ్నాళ్లకే అవి నిరుపయోగంగా మారుతున్నాయి. దీనికితోడు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మురుగుదొడ్లు, తాగునీటి వసతుల కల్పనకు నిధులు మంజూ రు చేసి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు అప్పగిం చినా.. వారికి, విద్యాశాఖ(రాజీవ్‌విద్యామిషన్) అధికారులకు మధ్య సమన్వయం లోపించడంతో పనులు ముందుకు సాగడం లేదు.
1867 మరుగుదొడ్లు తక్షణ అవసరం..
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉండాలి. ఈ లెక్క ప్రకారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1867 మరుగుదొడ్లు అవసరమని జిల్లా అధికారులు తేల్చి చెప్పారు. విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో వసతులు లేవంటూ పలువురు తల్లిదండ్రులు సుప్రింకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం తక్షణమే విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా మురుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పించాలని ఆదేశించడంతో విద్యాశాఖ అధికారుల్లో చలనం వచ్చింది.
ప్రతి పాఠశాలలో బాలురకు, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించాలని, ప్రతి 40 మంది బాలికలకు ఒకటి, 80 మంది బాలురకు ఒకటి చొప్పున విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు ఉండాలని కోర్టు సూచించింది. దీంతో అధికారులు కసరత్తు చేసి, జిల్లాలో ఇప్పటి వరకు 161 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని, 46 పాఠశాలల్లో శిథిలావస్థకు చేరుకున్నాయని నిర్దారించారు. 1294 పాఠశాలల్లో బాల, బాలికలకు కలిపి ఒక్క మరుగుదొడ్డి మాత్రమే ఉందని అధికారులు తేల్చారు.
ఇంకా జిల్లాలోని 3337 ప్రభుత్వ పాఠశాలలను పరిశీలిస్తే.. బాలురకు 1252, బాలికలకు 615 మొత్తం 1867 మురుగుదొడ్లు అత్యవసరమని తేలింది. పాఠశాలల్లో టాయిలెట్స్ లేకపోవడంతో తమ పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, జిల్లాలో 238 పాఠశాలలకు తాగునీటి సౌకర్యం లేదు. తమకు తాగడానికే నీరు లేక ఇబ్బంది పడుతున్నామని, ఈ పరిస్థితుల్లో టాయిలెట్స్ శుభ్రం చేసే వీలులేక వాటిని వినియోగించుకోలేక పోతున్నామని విద్యార్థులు అంటున్నారు.
విద్య, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల మధ్య సమన్వయ లోపం..
జిల్లాలో పలు పాఠశాలకు మంజూరైన మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సకాలంలో పూర్తి చేయడం లేదు. ఆర్వీఎం, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో పనులు ముందుకు సాగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మురుగుదొడ్లు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు రూ. 5.44 కోట్లు మంజూరయ్యాయి. వీటితో 1077 మరుగుదొడ్లు, 1,159 తాగునీటి వసతుల యూనిట్లు నిర్మించే పనులను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు అప్పగించారు.
అయితే 15 నెలలు కావస్తున్నా నేటికీ 802 మరుగుదొడ్లు, 850 తాగునీటి యూనిట్లు మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన పనులు నిలిచిపోయాయి. ఆ రెండు శాఖల అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఎన్నాళ్లీ ఇక్కట్లు
Published Sat, Aug 9 2014 4:19 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement