Infrastructure
-
బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లకు మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర విద్యుత్ శాఖ బ్యాటరీ చార్జింగ్ మౌలిక సదుపాయాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లు (బీసీఎస్), బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల (బీఎస్ఎస్) ఓనర్లు, మార్చుకోతగిన బ్యాటరీలను చార్జ్ చేసేందుకు ప్రస్తుతమున్న విద్యుత్ కనెక్షన్‌నే ఉపయోగించుకోవచ్చు. కనెక్టెడ్ లోడ్‌ను పెంచుకున్నా, పెంచుకోకపోయినా ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. మెరుగైన స్వాపింగ్, చార్జింగ్ కోసం ట్రక్కులు, బస్సులు లాంటి భారీ వాహనాలు లిక్విడ్–కూల్డ్ స్వాపబుల్ బ్యాటరీలను వినియోగించవచ్చు. -
సరైన బట్టల్లేక.. దుప్పట్లు లేక..
యుద్ధంతో అతలాకుతమైన గాజాను ఇప్పుడు చలి పులి చంపేస్తోంది. ముఖ్యంగా చలి నుంచి దాచుకోవడానికి వెచ్చని దుస్తులు లేక, కప్పుకోవడానికి దుప్పట్లు లేక గాజా స్ట్రిప్‌లో చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ఆహారం, ఇంధనం, మందులు, మౌలిక సదుపాయాలు లేక గాజాలోని కుటుంబాలు వణికిపోతున్నాయి. కళ్లముందే పిల్లలు ప్రాణాలు కోల్పోతుండటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. డెయిర్ అల్–బలాహ్: ఓవైపు యుద్ధంతో విధ్వంసమైన గాజాను ఇప్పుడు చలి వణికిస్తోంది. చలి తీవ్రత బాగా పెరగడంతో రక్షించుకోవడానికి సరైన బట్టలు, దుప్పట్లు లేకపోవడంతో వారం రోజుల వ్యవధిలో ఎనిమిది మంది పిల్లలు చనిపోయారు. బాంబు దాడుల నుంచి తప్పించుకుని వచ్చామని, ఇక్కడ చలికి పిల్లల ప్రాణాలు పోతున్నాయని తన నవజాత శివువును పోగొట్టుకున్న యహ్యా అల్–బత్రాన్ రోదిస్తున్నాడు. కొద్దిరోజుల కిందే చనిపోయిన తన చిన్నారి దుస్తులను చూపిస్తూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం కారణంగా పూర్తిగా నిరాశ్రయులైన బత్రాన్ కుటుంబం పదేపదే కొత్త ప్రాంతాలకు వలసపోతూ చివరకు డేర్ ఎల్–బాలాహ్లోని చిరిగిపోయిన దుప్పట్లు, బట్టలతో చేసిన తాత్కాలిక గుడారానికి చేరింది. అతని భార్య నెలలు నిండకుండానే కవల పిల్లలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒకరు జుమా దక్షిణ గాజాలోని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతుండగా.. అలీ కొంత ఆరోగ్యంగా ఉండటంతో ఇంక్యుబేటర్ నుంచి బయటకు తీశారు. ప్రస్తుతం ఖర్జూరం తోటలో నివసిస్తున్న వందలాది మంది మాదిరిగానే, వారు భారీ వర్షాలు, ఎనిమిది డిగ్రీ సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతల మధ్య పిల్లలను వెచ్చగా ఉంచడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా దుప్పట్లు లేవు. తగిన దుస్తులు లేవు. ‘‘చలికి తట్టుకోలేక నా బిడ్డ శరీరం మొత్తం గడ్డకట్టడం, అతని చర్మం నీలం రంగులోకి మారింది. నా కళ్లముందే చలిపులి అతని ప్రాణాలుతీసింది’’అంటూ ఆ తల్లి కంటతడి పెట్టుకుంది. వర్షంలో తడిసిన చాపపై కూర్చొని చిరిగిపోయిన దుప్పట్లును కప్పి దగ్గరకు పట్టుకుని తన ఇద్దరు పిల్లలను కాపాడుకుంటున్నాడు బత్రాన్. ఎండిపోయిన రొట్టె, స్టవ్ మీద చిన్న కుండలో ఉన్న వేడి నీళ్లు. ఒక రోజుకు వాళ్లకవే ఆహారం. 20 లక్షల మంది భద్రతకు ముప్పు గాజా స్ట్రిప్‌లో వేలాది ఇతర కుటుంబాల ఆహారం, ఇంధనం, ఔషధాల తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఉంటున్న మహమూద్ అల్–ఫాసిహ్ మూడు వారాల వయసున్న తన కూతురును కోల్పోయాడు. వారి కుటుంబం అల్–మవాసి బీచ్ సమీపంలోని చిన్న గుడారంలో ఉంటుండగా చలికి శిశువు గడ్డకట్టుకుపోయింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు చెప్పారు. తీవ్రమైన హైపోథెరి్మయా వల్ల చిన్నారి గుండె హఠాత్తుగా కొట్టుకోవడం ఆగిపోయిందని నాజర్ ఆసుపత్రి అత్యవసర, పిల్లల విభాగం డైరెక్టర్ అహ్మద్ అల్ ఫరా తెలిపారు. చలితో మరో 20 రోజుల పసికందు ఆయేషా అల్ ఖాస్సాస్ మృతి చెందింది. ‘‘మీరు ఇంకా గాజా స్ట్రిప్‌లో ఉన్నారంటే ఇజ్రాయెల్ బాంబుదాడులతో మరణించాలి లేదంటే ఆకలితోనో, చలికో చచ్చిపోతారు’’అంటూ దుఃఖిస్తున్నారు ఆయేషా తల్లిదండ్రులు. రాబోయే రోజుల్లో మరింత కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సిన దారుణ పరిస్థితి దాపురిస్తుందని గాజాలోని హమాస్ ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఇది నిర్వాసితులైన 20 లక్షల మంది భద్రతకు ముప్పు. ఈ వాతావరణ తీవ్రతకు శిశువులు, వృద్ధులు మరణించే అవకాశం ఉందని డాక్టర్ ఫరా హెచ్చరించారు. -
పంట ‘లాస్’ చాలా ఎక్కువే..
సాక్షి, అమరావతి: మౌలిక సదుపాయాలు, ప్రాసెసింగ్ వంటి సౌకర్యాల కొరత కారణంగా దేశంలో పంట కోత అనంతరం భారీ నష్టం కలుగుతోంది. ఈ నష్టం విలువ 2022లో ఏకంగా సుమారు రూ.1,57,787 కోట్లుగా నాబార్డు కన్సల్టెన్సీ సర్వీసెస్ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు, పశు ఉత్పత్తుల్లో ఎక్కువ నష్టం కలుగుతున్నట్లు కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ లోక్‌సభలో వెల్లడించింది. అత్యధికంగా పశు ఉత్పత్తుల్లో నష్టం వస్తుండగా, ఆ తరువాత పండ్లు, కూరగాయలు ఎక్కువగా పాడైపోయి నష్టం వాటిల్లుతున్నట్లు నివేదిక పేర్కొంది. తృణ ధాన్యాల ఏడాది సగటు ఉత్పత్తి 281.28 మిలియన్ టన్నులు ఉండగా.. కోత అనంతరం 12.49 మిలియన్ టన్నులు నష్టపోతున్నట్లు చెప్పింది. అదే విధంగా కూరగాయల సగటు ఉత్పత్తి 164.74 మిలియన్ టన్నులకుగాను 11.97 మిలియన్ టన్నులు వృథా అవుతున్నట్లు వివరించింది. అత్యధికంగా పశువుల ఉత్పత్తుల (డెయిరీ, మాంసం, ఫిష్ తదితరమైనవి) నష్టం విలువ రూ. 29,871 కోట్లు అని పేర్కొంది. ఈ నష్టాలను తగ్గించేందుకు అవసరమైన మౌలిక, ప్రాసెసింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. తద్వారా పంటల విలువను పెంచడంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ – సంరక్షణ సామర్ధ్యాల విస్తరణవిస్తరణ, ఆపరేషన్ గ్రీన్స్ సదుపాయాల కల్పనకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో క్రెడిట్ లింక్ ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపింది. ఆహార ప్రాసెసింగ్, సంరక్షణకు, హార్వెస్ట్ నష్టాలను తగ్గించడానికి కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.మౌలిక సదుపాయాల కల్పనకు పీఎంకేఎస్‌వై కింద 1,187 ప్రాజెక్ట్‌లు ఆమోదించినట్లు వివరించింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ నిధి ద్వారా శీతల గిడ్డంగులు, గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్లు, కమ్యూనిటీ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు పేర్కొంది. వీటి ద్వారా పంట వృధాను తగ్గించడం, విలువ పెంచడం లక్ష్యమని తెలిపింది. -
ఏడేళ్లలో 600 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు
దేశవ్యాప్తంగా వచ్చే ఏడేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి సుమారు 600 పబ్లిక్ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పనున్నట్లు హ్యుందాయ్ మోటార్స్ ఇండియా వెల్లడించింది. 2024 డిసెంబర్ నెలాఖరు నాటికి 50 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. 2030 నాటికి భారత ఈవీ మార్కెట్ భారీ స్థాయిలో వృద్ధి చెందే అవకాశం ఉందని కంపెనీ ఫంక్షన్ హెడ్ (కార్పొరేట్ ప్లానింగ్ విభాగం) జేవాన్ రియూ తెలిపారు.చార్జింగ్ మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వల్ల కస్టమర్లు జాతీయ రహదారులపై సుదీర్ఘ ప్రయాణాలు చేయడానికి సంకోచిస్తున్నట్లుగా తమ అధ్యయనాల్లో వెల్లడైందని ఆయన వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాన నగరాలతో పాటు కీలక హైవేలపై కూడా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు రియూ తెలిపారు.ఇదీ చదవండి: యూజర్ మాన్యువల్ మిస్సింగ్.. రూ.5 వేలు జరిమానాఇదిలాఉండగా, ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) చార్జింగ్కు ప్రత్యామ్నాయంగా బ్యాటరీలను స్వాపింగ్(మార్పిడి) చేసే విధానం మనదేశంలోనూ అందుబాటులోకి రానుంది. ఇకపై బ్యాటరీ పూర్తిగా చార్జింగ్ అయ్యే వరకు గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. చార్జింగ్ పూర్తిగా లేకపోయినా, తక్కువ చార్జింగ్ ఉన్నా.. ఆ బ్యాటరీల స్థానంలో పూర్తి చార్జింగ్ ఉన్న బ్యాటరీలను చార్జింగ్ స్టేషన్లలో క్షణాల్లో స్వాపింగ్ చేసుకోవడానికి వీలు కల్పించింది. ఈమేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను ఇప్పటికే ప్రకటించింది. -
రూ.21 లక్షల కోట్లకు ఇన్విట్స్ ఏయూఎం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మరింతగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో 2030 నాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌ల (ఇన్విట్స్) నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 21 లక్షల కోట్లకు చేరగలదని అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇది రూ.5 లక్షల కోట్లుగా ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్స్) పోర్ట్‌ఫోలియోలోని 125 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్ వచ్చే కొన్నేళ్లలో 4 రెట్లు పెరిగి 400 మిలియన్ చ.అ.లకు చేరనుంది.బుధవారమిక్కడ ఈ సాధనాలపై రిటైల్ ఇన్వెస్టర్ల కోసం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో రీట్స్, ఇన్విట్స్ అసోసియేషన్ల ప్రతినిధులు ఈ విషయాలు తెలిపారు. సాధారణంగా రియల్టీ, ఇన్ఫ్రాలో పెట్టుబడులు పెట్టాలంటే పెద్ద మొత్తం అవసరమవుతుందని, కానీ రీట్స్, ఇన్విట్స్ ద్వారా చాలా తక్కువ మొత్తాన్నే ఇన్వెస్ట్ చేసి మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చని వివరించారు. రీట్స్‌లో కనిష్టంగా రూ. 100–400కి కూడా యూనిట్లను కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు. మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ సీఎఫ్‌వో ప్రీతి ఛేడా, హైవే ఇన్ఫ్రా ట్రస్ట్ సీఎఫ్‌వో అభిషేక్ ఛాజర్, నెకస్స్ సెలెక్ట్ ట్రస్ట్ సీఈవో రాజేష్ దేవ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. దేశీయంగా 26 ఇన్విట్స్ ఉండగా, లిస్టెడ్ రీట్స్ నాలుగు ఉన్నాయి. -
తుది దశకు ‘అమృత్’ పనులు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు మౌలిక సదుపాయా లు కల్పించేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ (ది అటల్ మిషన్ ఫర్ రిజెనువేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్) కింద రాష్ట్రంలోని 12 పట్టణాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. దేశంలోని ఎంపిక చేసిన పట్టణాల్లో తాగునీటి సరఫరాతోపాటు సీవరేజీ పైప్లైన్ల వ్యవస్థ, పట్టణ రవాణా, పచ్చదనం పెంపు, వరదనీటి కాలువల అభివృద్ధి ప్రధాన అంశాలుగా 2015 జూన్ 25న ‘అమృత్’ పథకం ప్రారంభమైంది. తొలి దశలో ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 500 నగరాలను కేంద్రం ఎంపిక చేయగా అందులో రాష్ట్రం నుంచి హైదరాబాద్ (జీహెచ్ఎంసీ), వరంగల్ (జీడబ్ల్యూఎంసీ), కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం నగరాలతోపాటు ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, సిద్దిపేట, సూర్యాపేట పట్టణాలను ఎంపిక చేశారు. ఈ 12 పురపాలికల్లో తాగునీరు, సీవరేజీ, పార్కుల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పనులు ప్రారంభించింది. కేంద్రం, రాష్ట్రం 50:50 ప్రాతిపదికన చేపట్టే ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ. 1,663.08 కోట్లు కాగా.. అందులో కేంద్ర సాయం రూ. 832.6 కోట్లు. 66 ప్రాజెక్టులు... తాగునీటికి అధిక మొత్తం...అమృత్ పథకం కింద 12 పురపాలికల్లో 66 ప్రా జెక్టులు ప్రారంభమయ్యాయి. రూ. 1,663.08 కోట్ల అంచనాతో ప్రారంభించిన ఈ పనులకు కేంద్రం తన వాటాగా రూ. 832.6 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అందులో రూ. 831.52 కోట్లను కేంద్రం విడుదల చేయగా రాష్ట్రం తన వాటాతోపాటు కేంద్రం వాటా లో రూ.806.21 కోట్లు వినియోగించుకుంది. తాగు నీటికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ పట్టణాల్లో 27 నీటి సరఫరాల ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందుకోసం 4,336.54 కిలోమీటర్ల పొడవైన నీటి సరఫరా పైప్లైన్లను నిర్మించారు. వాటి విలువ రూ. 1,424.09 కోట్లు. అందులో అత్యధికంగా వరంగల్‌కు రూ. 341.3 కోట్లు వెచ్చించడం విశేషం. ఈ పథకం కింద నిజామాబాద్, సిద్దిపేటల్లో రూ. 203.3 కోట్ల విలువగల నాలుగు మురుగునీటి శుద్ధి, సెప్టిక్ ట్యాంకు వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు లను చేపట్టారు. ఈ రెండు పురపాలికల్లో 278.53 కి.మీ. పొడవైన మురికినీటి పారుదల పైప్లైన్లను ఏర్పాటు చేశారు. 5.54 లక్షల నల్లా నీటి కనెక్షన్లు, 0.87 లక్షల మురుగునీటి పారుదల కనెక్షన్లను అ మృత్, కన్వర్జెన్సెస్లో భాగంగా సమకూర్చారు. రాష్ట్రంలోని 12 పురపాలికల్లో రూ. 35.69 కోట్లతో 35 హరిత స్థలాలు, పార్కులను అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టులన్నీ దాదాపు పూర్తయినట్లు రాష్ట్ర ప్రభు త్వం కేంద్రానికి తెలిపింది. దీనికి అదనంగా రాష్ట్రంలో 18.25 ఎంఎల్డీ సామర్థ్యంగల సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు (ఎస్టీపీ)ను, 442.45 ఎకరాల విస్తీర్ణంలో హరిత క్షేత్రాలను ‘అమృత్’ కింద అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అమృత్ 2.0 కింద కొత్త ప్రతిపాదనలు కేంద్రానికి చేరాయి.సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చాలని కోరిన సీఎం రేవంత్2021లో మొదలైన అమృత్–2.0 (పథకం రెండో దశ)లో భాగంగా హైదరాబాద్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ఇటీవల విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ప్రతిపాదించిన సమగ్ర సీవరేజీ మాస్టర్‌ప్లాన్ (సీఎస్ఎంపీ)ని చేర్చాలని కోరారు. అమృత్ తొలి విడత ప్రాజెక్టులో జీహెచ్ఎంసీలో పచ్చదనం కోసం కేవలం రూ. 3.3 కోట్లు మాత్రమే కేటాయించిన నేపథ్యంలో సీఎస్ఎంపీని అమృత్లోకి తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌తోపాటు సమీప పురపాలక సంఘాలతో కలుపుకొని 7,444 కి.మీ. మేర రూ. 17,212.69 కోట్లతో సీఎస్ఎంపీకి డీపీఆర్ రూపొందించినట్లు ఖట్టర్‌కు సీఎం తెలిపారు. సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక సాయం చేయడం లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులివ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. -
ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీ
కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు, పర్యాటక ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు పెంచితే.. పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. తద్వారా కొత్త ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల మంత్రి 'నితిన్ గడ్కరీ' (Nitin Gadkari) పేర్కొన్నారు. గోవాలో ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FHRAI) నిర్వహించిన సదస్సులో గడ్కరీ ఈ విషయాలను వెల్లడించారు.ఆర్థికాభివృద్ధికి ఆతిథ్య రంగం ఎంతో కీలకమని నితిన్ గడ్కరీ సూచించారు. వ్యాపార కార్యకలాపాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచాలని మంత్రి హాస్పిటాలిటీ రంగానికి తమ బలమైన మద్దతును వ్యక్తం ప్రకటించారు. ఇది విస్తారమైన ఉద్యోగ అవకాశాలను అందిస్తుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: రూ.80 లక్షల జీతం: సలహా ఇవ్వండి.. టెకీ పోస్ట్ వైరల్కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నవాటితో పాటు మరో 18 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టులు త్వరలోనే పూర్తవుతాయి. ఇది పర్యాటకాన్ని మరింత మెరుగుపరుస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం చాలామంది ప్రజలు పుణ్యక్షేత్రాలను సందర్శించాడని మాత్రమే.. ఆధునిక నగరాలు, ప్రత్యేకమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి సుముఖత చూపిస్తున్నారని ఆయన అన్నారు. -
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో జీఎంఆర్ వాటా పెంపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో (డీఐఏఎల్) మరో 10 శాతం వాటాను జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (జీఐఎల్) దక్కించుకుంది. డీఐఏఎల్‌లో తనకున్న 10 శాతం వాటాను ఫ్రాపోర్ట్ ఏజీ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ సరీ్వసెస్ వరల్డ్‌వైడ్ విక్రయించింది. డీల్ విలువ 126 మిలియన్ డాలర్లు. డీల్ తదనంతరం డీఐఏఎల్‌లో జీఐఎల్ వాటా 74 శాతానికి చేరింది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 26 శాతం వాటా ఉంది. వాటా కొనుగోలు ప్రక్రియ 180 రోజుల్లో పూర్తి అవుతుందని జీఎంఆర్ గ్రూప్ సోమవారం తెలిపింది. -
‘పూర్’.. పాలికలు!
పెద్ద కార్పొరేషన్ల నుంచి చిన్న మునిసిపాలిటీల వరకు అదే దుస్థితి రూ.1,000 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో.. చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు.. కొత్త పనులు చేపట్టేందుకు ససేమిరా కార్మీకులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో పలు మునిసిపాలిటీలు అయోమయంలో అధికారులు..కార్యాలయాలకు రాని చైర్మన్లు, మేయర్లుస్మార్ట్ రోడ్డు పనులూ సగం వరకే!⇒ వరంగల్ అభివృద్ధిలో భాగంగా రూ.44.50 కోట్లతో మునిసిపల్ ప్రధాన కార్యాలయం నుంచి భద్రకాళి నాలా వరకు, భద్రకాళి ఆర్చి నుంచి కాపువాడ వరకు, అక్కడి నుంచి ములుగు రోడ్డు వరకు, హనుమకొండ చౌరస్తా నుంచి పద్మాక్షి గుట్ట, న్యూ శాయంపేట రోడ్డు వరకు స్మార్ట్ రోడ్లను ప్రతిపాదించారు. వీటికి 2017 నవంబర్‌లో శంకుస్థాపన చేశారు. నాలుగు పనుల్లో మూడు పనులు 90% మేరకు పూర్తయ్యాయి. హనుమకొండ పద్మాక్షి గుట్ట నుంచి న్యూ శాయంపేట వరకు స్మార్ట్ సిటీ రోడ్డు పనులు 50 శాతం మాత్రమే పూర్తయ్యాయి. కాంట్రాక్టర్‌కు చేసిన పనులకు డబ్బులు చెల్లించకపోవడంతోనే రోడ్లు అసంపూర్తిగా మిగిలాయి.సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం లేదు. మౌలిక సదుపాయాల ముచ్చటే లేదు. చిన్న చిన్న పనులు కూడా జరగట్లేదు. కనీసం వర్షాకాలంలో పొంగిపొర్లే వరదనీటి కాలువలు, డ్రైనేజీల మరమ్మతులకు, పాడైన రోడ్ల రిపేర్లకు కూడా దిక్కులేదు. కార్మీకులకు వేతనాల్లేవు. పాత బిల్లులు కోట్లలో పేరుకుపోయాయి. దీంతో చేస్తున్న పనులను కాంట్రాక్టర్లు మధ్యలో ఆపేశారు. ఇక కొత్త పనులు చేపట్టేందుకు ససేమిరా అంటున్నారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధికారులుండగా, చైర్మన్లు, మేయర్లు కార్యాలయాలకు రావడం మానేశారు. ఇదీ రాష్ట్రంలోని దాదాపుగా అన్ని పురపాలికల పరిస్థితి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యవేక్షణలో ఉన్న మునిసిపల్ శాఖకు నిధులు కరువవడమే ఇందుకు కారణం. అన్ని పురపాలికలదీ అదే పరిస్థితి మునిసిపల్ సాధారణ నిధులు, 14, 15 ఆర్థిక సంఘం నిధులు, ప్రభుత్వ గ్రాంట్లతో పాటు తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీయూఎఫ్ఐడీసీ) ద్వారా చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపు రూ.1,000 కోట్లకు పైగా బకాయిలు ఆయా మునిసిపాలిటీలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నట్టు సమాచారం. దీంతో స్మార్ట్ సిటీలు వరంగల్, కరీంనగర్‌లతో పాటు పలు పెద్ద మునిసిపల్ కార్పొరేషన్లలో సైతం చిన్న చిన్న పనులు కూడా జరగడం లేదు. ఇక కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీల్లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. కాగా కరీంనగర్ నగరపాలక సంస్థలో సాధారణ నిధులు, పట్టణ ప్రగతి తదితర నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి రూ.50 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉండగా.. ఆగస్టు 15వ తేదీ నాటికి బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామంటూ మున్సిపల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ కరీంనగర్ శాఖ హెచ్చరించింది. మరోవైపు బకాయిలు చెల్లించని కారణంగా రూ.2.46 కోట్లతో చేపట్టాల్సిన వనమహోత్సవానికి సంబంధించిన టెండర్, రూ.2 కోట్ల సాధారణ నిధులతో చేపట్టాల్సిన ఇతర పనుల టెండర్లను ఇక్కడి కాంట్రాక్టర్లు బహిష్కరించారు. ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో.. గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 129 మునిసిపాలిటీలు.. మునిసిపల్ పరిపాలన డైరెక్టర్ (సీడీఎంఏ) పరిధిలో ఉండగా, కేవలం మునిసిపాలిటీలకు సంబంధించి గత నెలాఖరు నాటికి ఆర్థిక శాఖలో రూ.508.90 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో రూ.345 కోట్లు రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఎస్ఎఫ్సీ) ద్వారా ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలలకు రావలసిన నిధులు కావడం గమనార్హం. ఒక్కో నెలకు రూ.115 కోట్ల చొప్పున కమిషన్ ద్వారా రావలసిన నిధులను ఆర్థిక శాఖ నిలిపివేసింది. మరోవైపు 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి 122 మునిసిపాలిటీలకు రావలసిన రెండో వాయిదా నిధులు రూ.60.65 కోట్లు ఆర్థిక శాఖ వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. మెడికల్, జీపీఎఫ్, ఎలక్రి్టసిటీ, ఎడ్యుకేషన్, ఔట్సోర్సింగ్ బిల్లులతో పాటు ఈఈఎస్ఎల్ (విద్యుత్ సంబంధిత) పద్దు కింద 49 మునిసిపాలిటీలకు సంబంధించిన బిల్లులు కూడా రూ.కోట్లలోనే ప్రభుత్వం బకాయి పడింది. ఇవి కాకుండా పట్టణ ప్రగతి కింద వైకుంఠధామాల నిర్మాణం పనుల పెండింగ్ బిల్లులు రూ.19.56 కోట్లు, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ల బిల్లులు రూ.34.37 కోట్లు, కంటోన్మెంట్ బోర్డు ట్రాన్స్ఫర్ డ్యూటీకి సంబంధించి రూ 34.12 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పట్టణ ప్రగతి, ఎస్సీ సబ్ ప్లాన్, జనరల్ ఫండ్, 14, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు రూ.180 కోట్లు కూడా నిలిచిపోయాయి. ఇక రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో టీయూఎఫ్ఐడీసీ ద్వారా గత రెండేళ్ల నుంచి సుమారు రూ.400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులు జరిగాయి. వీటి బిల్లులు కూడా చెల్లించలేదు. ఇవి కాకుండా మరో రూ.800 కోట్లకు సంబంధించిన పనులకు టెండర్లు పిలిచినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. వేతనాలు చెల్లించని మునిసిపాలిటీలు ప్రభుత్వం నుంచి నిధులు రాక, సొంతంగా సమకూర్చుకోలేక కొన్ని ముసినిపాలిటీలు చివరకు కార్మీకుల వేతనాలు సైతం చెల్లించడం లేదు. డోర్నకల్ మునిసిపాలిటీలో 2023 ఏప్రిల్, ఆగస్టు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి కార్మీకులకు చెల్లించాల్సిన వేతనాలు రూ.20.43 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. మహబూబాబాద్‌లో 2023 జనవరి, మే నెలలతో పాటు 2024కు సంబంధించి జనవరి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన వేతనాలు ఏకంగా సుమారు రూ.68 లక్షలు పేరుకుపోయాయి. కామారెడ్డి మునిసిపాలిటీకి సంబంధించి గత మే నెల బాపతు రూ.3.48 లక్షలు కార్మీకులకు చెల్లించాల్సి ఉండగా, జూన్ నెల వేతనాలు సుమారు రూ.21 లక్షల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఆత్మకూర్, నందికొండ, చండూర్, నర్సంపేట, మెట్పల్లి, సత్తుపల్లి, వైరా, పాల్వంచ, మణుగూరు, ఆదిలాబాద్ మునిసిపాలిటీల్లో కూడా కార్మీకులకు వేతనాలు చెల్లించలేదు. మొత్తంగా రూ.2.60 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. పాత బకాయిల కింద ప్రభుత్వం ఎగ్గొడుతుందేమోనని కార్మీకులు ఆందోళన చెందుతున్నారు. గ్రేటర్కూ నిధుల షార్టేజీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కొత్త పనులకు నిధుల్లేవు. ఇటీవలి రాష్ట్ర బడ్జెట్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మూసీ, మెట్రో రైలు, వాటర్ బోర్డు తదితరాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినా అందులో జీహెచ్ఎంసీకి దక్కేది రూ.3,065 కోట్లే. జీహెచ్ఎంసీలో ఇప్పటికే చేసిన పనులకు గాను కాంట్రాక్టర్లకు రూ.1,200 కోట్ల మేర బకాయిలున్నాయి. దీంతో వారు కొత్త పనులకు ముందుకు రావటం లేదు. ఏవైనా కొత్త రుణాలు తీసుకోవాలన్నా నిబంధనలు అనుమతించేలా లేవు. కేంద్రం నుండి ఇప్పటికే నాలాల అభివృద్ధి (ఎస్ఎన్డీపీ కింద) కోసం రావాల్సిన సుమారు రూ.500 కోట్ల నిధులపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. దీంతో వర్షాకాలం కంటే ముందు పూర్తి చేయాల్సిన నాలాల విస్తరణ, డీసిలి్టంగ్ పనులు పూర్తవలేదు. వానాకాలంలో ప్రారంభించాల్సిన మొక్కల పెంపకానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించిన నిధులు వస్తేనే కొన్ని పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పరిస్థితి అధ్వానంగా ఉంది గత పాలకులు ప్రణాళిక లేకుండా మునిసిపాలిటీల్లో ఇష్టానుసారంగా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. పాత పనుల బిల్లులు రావనే భయంతో సొంత డబ్బులు ఖర్చు చేసి కొందరు కాంట్రాక్టర్లు కొత్త పనులు చేశారు. కానీ బిల్లులు మాత్రం రాలేదు. ట్రెజరీలను ఫ్రీజ్ చేశారు. దీంతో ఇప్పుడు మునిసిపాలిటీల్లో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. నిధులు లేక, పనులు సాగక పాలకమండళ్లు ఆందోళన చెందుతున్నాయి. – వెన్‌రెడ్డి రాజు, మునిసిపల్ కౌన్సిల్స్ చైర్మన్ కాంట్రాక్టర్ల బిల్లులు వెంటనే విడుదల చేయాలి రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు సుమారు రూ.1,000 కోట్లకు పైగా బిల్లులు రావలసి ఉంది. అవి వెంటనే విడుదల చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి చొరవ చూపాలి. అప్పులు తెచ్చి పనులు పూర్తిచేసిన చిన్న, మధ్యతరగతి కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలి. – భూక్యా రాము నాయక్, మునిసిపల్ కౌన్సిల్ ఫోరం చైర్మన్ మధ్యలో ఆగిన ‘సీఎం హామీ’రోడ్డు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని కోతిరాంపూర్ నుంచి కట్టరాంపూర్ వరకు (1.2 కిలోమీటర్లు) రూ.4.5 కోట్ల ముఖ్యమంత్రి హామీ పథకం (సీఎంఏ) నిధులతో అధునాతన రోడ్డు, డ్రైనేజీ, వాటర్ పైప్‌లైన్ పనులను గత ఏడాది శంకుస్థాపన చేశారు. కొత్త రోడ్డు కోసం ఉన్న పాత రోడ్డును తవ్వారు. కొత్త రోడ్డు నిర్మాణం దాదాపు 35 శాతం పూర్తి చేశారు. గత డిసెంబర్లో అకస్మాత్తుగా కాంట్రాకర్ పని నిలిపివేశారు. దీంతో 8 నెలలుగా ప్రజలు నరకయాతన పడుతున్నారు. మధ్యలో కల్వర్టులు, డ్రైనేజీలు అసంపూర్తిగా వదిలేయడంతో ప్రమాదాలు కూడా చోటుచేసుకొంటున్నాయి. ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లు రాకపోవడంతోనే కాంట్రాక్టర్ పనులు ఆపేశాడని అధికారులు చెబుతున్నారు. రూ.100 కోట్లు మంజూరుతోనే సరి నిజామాబాద్ కార్పొరేషన్లో ప్రధాన రోడ్ల అభివృద్ధి కోసం రెండేళ్ల క్రితం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున రూ.100 కోట్లు మంజూరు చేశారు. గత సంవత్సరం మార్చి నుంచి సెప్టెంబర్ వరకు కాలనీల్లో రోడ్ల మరమ్మతు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణానికి నాటి ఎమ్మెల్యే గణేష్ గుప్తా శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా కాంట్రాక్టర్లు రూ.2.30 కోట్ల పనులు చేయగా, వీటికి సంబంధించిన బిల్లులు ఇప్పటివరకు విడుదల చేయలేదు. దీంతో కాంట్రాక్టర్లు ఈ పనులు మాకొద్దంటూ వెళ్లిపోయారు. గతంలో విడుదల చేసిన నిధులను కూడా ప్రస్తుత సర్కారు నిలిపివేసింది. -
Russia-Ukraine war: క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా
కీవ్: దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. సోమవారం ఉదయం నుంచి పలు నగరాల్లోని మౌలిక వనరులు, విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా వివిధ రకాలైన 40 వరకు క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో కనీసం 31 మంది చనిపోగా మరో 154 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కీవ్‌లోని చిన్నారుల ఆస్పత్రి సహా పలు నివాస ప్రాంతాలపై క్షిపణులు పడటంతో భారీగా పేలుళ్లు సంభవించాయి. పలు చోట్ల మంటలు వ్యాపించాయి. రాజధాని కీవ్‌లోని 10 జిల్లాలకు గాను ఏడు జిల్లాల్లో జరిగిన దాడుల్లో 14 మంది చనిపోగా పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. మూడంతస్తుల నివాస భవనం పూర్తిగా ధ్వంసమైంది. మరో నగరం క్రివ్యి రిహ్‌లో 10 మంది ప్రాణాలు కోల్పోగా మరో 47 మంది గాయపడ్డారు. కీవ్‌లోని రెండంతస్తుల చిన్నారుల ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఆపరేషన్ థియేటర్, ఆంకాలజీ విభాగం దెబ్బతిన్నాయి. ఆస్పత్రిలోని పదంతస్తుల ప్రధాన భవనం కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. ఘటన నేపథ్యంలో ఆస్పత్రిలో వారందరినీ ఖాళీ చేయిస్తున్నారు. ఆస్పత్రిపై దాడిలో ఏడుగురు చిన్నారులు సహా 16 మంది గాయపడినట్లు మేయర్ విటాలి క్రిట్్చకో చెప్పారు. ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉందని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రష్యా ప్రయోగించిన క్షిపణుల్లో ధ్వని కంటే 10 రెట్లు వేగంగా ప్రయాణించగల హైపర్సోనిక్ కింఝాల్ మిస్సైళ్లు కూడా ఉన్నాయని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. మొత్తం 40 క్షిపణుల్లో 30 వరకు కూల్చి వేశామని, వీటిలో కింఝాల్ రకానివి 11 ఉన్నాయని పేర్కొంది. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించేందుకు గల అవకాశాల్ని పరిశీలించేందుకు వాషింగ్టన్లో నాటో దేశాలు మంగళవారం భేటీ అవుతున్న వేళ రష్యా భారీ దాడులకు పూనుకుందని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, ఆస్పత్రిపై దాడిని జర్మనీ, చెక్ రిపబ్లిక్ తీవ్రంగా ఖండించాయి. అయితే, తాము ఉక్రెయిన్ రక్షణ, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపామని రష్యా ఆర్మీ పేర్కొంది. ఉక్రెయిన్ క్షిపణి రక్షణ వ్యవస్థల వల్లే ఆస్పత్రికి నష్టం వాటిల్లినట్లు తెలిపింది. -
రూ. 20,000 కోట్ల ఇన్ఫ్రా బాండ్ల జారీ
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారీ స్థాయిలో నిధుల సమీకరణకు తెరతీయనుంది. ఇందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లను జారీ చేయనుంది. ఈ బాటలో మరో పీఎస్‌యూ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రమోట్ చేసిన పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ సైతం బాండ్ల జారీ ద్వారా పెట్టుబడులను సమకూర్చుకోనుంది. రూ. 20,000 కోట్లు బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీని చేపట్టనుంది. తద్వారా ఈ ఏడాది తొలిసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీకి తెరతీయనుంది. ఈ ఆరి్థక సంవత్సరం(2024–25)లోగా బాండ్ల విక్రయాన్ని నిర్వహించేందుకు ఎస్బీఐ బోర్డు తాజాగా అనుమతించింది. పబ్లిక్ ఇష్యూ లేదా ప్రయివేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ. 20,000 కోట్లవరకూ సమీకరించేందుకు బోర్డు ఆమోదించింది. వెరసి దీర్ఘకాలిక బాండ్ల జారీకి జులై మొదటి వారంలో బిడ్స్‌ను ఆహా్వనించవచ్చని మర్చంట్ బ్యాంకర్లు తెలియజేశారు. ఇప్పటికే ఎస్బీఐ మార్కెట్ వర్గాలతో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం 10–15 ఏళ్ల కాలావధితో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీ యోచనలో ఉంది. జనవరిలో పెర్పెట్యువల్ బాండ్ల జారీ ద్వారా రూ. 5,000 కోట్లు అందుకున్న సంగతి తెలిసిందే. వీటికి కూపన్ రేటు 8.34 శాతంకాగా.. ఇంతక్రితం 15ఏళ్ల కాలపరిమితితో గతేడాది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీని చేపట్టి రూ. 20,000 కోట్లు సమీకరించింది. ఎస్బీఐలో కేంద్ర ప్రభుత్వం 57.49 శాతం వాటాను కలిగి ఉంది.పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా..మారి్పడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు)ను జారీ చేయనున్నట్లు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ పేర్కొంది. ఇందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చనట్లు వెల్లడించింది. ప్రయివేట్ ప్లేస్మెంట్ పద్ధతిలో ఒకేసారి లేదా దశలవారీగా ఎన్సీడీల జారీని చేపట్టనున్నట్లు పేర్కొంది. నిధులను బిజినెస్ వృద్ధికి వినియోగించనున్నట్లు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ తెలియజేసింది. ఈ మారి్టగేజ్ సంస్థ అందుబాటు ధరల గృహ విభాగంపై దృష్టిపెట్టడం ద్వారా ఈ ఏడాది లోన్‌బుక్‌లో 17 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది(2023–24)లో లోన్‌బుక్ రూ. 63,000 కోట్లకు చేరింది. బీఎస్ఈలో ఎస్బీఐ షేరు 1 శాతం బలహీనపడి రూ. 836 వద్ద నిలవగా.. పీఎన్బీ హౌసింగ్ షేరు 1 శాతం నీరసించి రూ. 784 వద్ద ముగిసింది. -
ఏడాదిలోగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాదిలోగా పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎల్రక్టానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన శనివారం ఉండవల్లి నివాసంలో విద్యా శాఖ, ఉన్నత విద్యా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజనం రుచిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూళ్లలో పారిశుద్ధ్యం నిర్వహణకు సంబంధించి ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు స్కూళ్లకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి, కారణాలేమిటో తెలియజేయాలన్నారు. బెజూస్ కంటెంట్, ఐఎఫ్‌పీ వినియోగం మీద సమగ్ర నోట్ ఇవ్వాలన్నారు. సీబీఎస్ఈ పాఠశాలలపై సమగ్ర వివరాలివ్వాలని చెప్పారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయనున్న 82 వేల మంది విద్యార్థులకు ఇచ్చే శిక్షణపై సమగ్ర నోట్ ఇవ్వాలని చెప్పారు. ఈ నెలాఖరులోగా స్టూడెంట్ కిట్ల పంపిణీ పూర్తిచేయాలన్నారు. ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వచ్చే నెల 15 నాటికి పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాక్ ప్యాక్ (బ్యాగ్) అందించాలని ఆదేశించారు. ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని తెలిపారు. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిల వివరాలివ్వండి విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలు ఇవ్వాలని మంత్రి లోకేశ్ ఉన్నత విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. 2018–19 నుంచి ఇప్పటి దాకా ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల వివరాలు, ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులు ఎంత ఉండాలో వివరాలు సమర్పించాలన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య తగ్గడంపైనా నివేదిక ఇవ్వాలన్నారు. వివాదాస్పద వీసీలు, యూనివర్సిటీల్లో అవినీతి ఆరోపణలపైనా సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు, కమిషనర్ పోలా భాస్కర్, ఆర్జేయూకేటీ రిజి్రస్టార్ ఎస్ఎస్వీ గోపాలరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు. త్వరలో నూతన ఐటీ పాలసీఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించే విధంగా త్వరలో నూతన ఐటీ పాలసీని విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేశ్ ప్రకటించారు. శనివారం ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలపై మంత్రి ఉండవల్లిలోని నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలను రప్పించడానికి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు, ఇప్పటికే ఉన్న కంపెనీలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాల బకాయిల వివరాలను సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలన్నారు. విశాఖను ఐటీ హబ్‌గా, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మార్చడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని, ఈ రంగాల్లో పేరుగాంచిన కంపెనీలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించాలని అధికారులను కోరారు. -
Fact Check: గ్రామాల్లో అభివృద్ధిపైనా ‘పచ్చ’పాతమే
సాక్షి, అమరావతి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా వేల కోట్ల నిధులు విడుదల చేస్తుంటే.. రామోజీ మాత్రం కడుపు మంటతో అబద్ధాలు అచ్చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రజలకు అవసరమైన ప్రాధాన్యత పనులను చేస్తున్నా.. అక్కసుతో అడ్డమైన రాతలు రాస్తున్నారు. ‘గడప గడపకు బోల్తా’ అంటూ పచ్చి అవాస్తవాలతో ఈనాడులో అవాస్తవాలను ప్రచురించారు. చంద్రబాబు హయాంలో గ్రామాలు, వార్డుల్లో ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనను ఏ మాత్రం పట్టించుకోకపోయినా రామోజీ ఒక్క కథనం రాయలేదు. ఆరోపణ: రూ. 3 వేల కోట్ల పనుల్లో మొదలైనవి రూ.వెయ్యి కోట్ల పనులే.. వాస్తవం: వైఎస్ జగన్ సర్కారు గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా ఆ పరిధిలోని ఇళ్లకు మంత్రులు, ఎమ్మెల్యేలను పంపించి వారి సమస్యలు తెలుసుకుంది. అక్కడి ప్రజలకు అవసరమైన అత్యంత ప్రాధాన్యత పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఒక్కో గ్రామ, వార్డు సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులను కేటాయించారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు అసలు గ్రామాలు, వార్డుల ముఖం చూసిన పాపాన పోలేదు. ప్రజలకు అవసరమైన పనులు చేపట్టకుండా నీరు–చెట్టు పేరుతో నామినేషన్‌పై వేల కోట్లు పచ్చ నేతలు జేబులు నింపుకున్నారు. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో వేల సంఖ్యలో పనులు జరుగుతున్నా ఈనాడు రామోజీ అక్కసు వెళ్లగక్కారు. రూ.1000 కోట్ల విలువైన పనులు కూడా ప్రారంభం కాలేదని అవాస్తవలు ప్రచురించారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో గుర్తించిన అత్యంత ప్రాధాన్యత పనుల్లో ఇప్పటికే రూ.1100.78 కోట్ల విలువైన 30,025 పనులు పూర్తయ్యాయి. మరో 1978.46 కోట్ల విలువైన పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆరోపణ: 65 వేల పనుల్లో 25 వేల పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు.. వాస్తవం: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 11,753 సచివాలయాల పరిధిలో 65,857 పనులను మంజూరు చేశారు. వాటిలో చాలా పూర్తి కాగా.. మరికొన్ని కొనసాగుతున్నాయి. స్థానికంగా ఆయా సచివాలయాల పరిధిలో ప్రజలకు అవసరమైన అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత పనులను మంత్రులు, ప్రజాప్రతినిధులు గుర్తించిన వెంటనే ఆ పనుల వివరాలను గడప గడపకు మన ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత పనుల పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ చేసిన పనుల తక్షణ మంజూరు నిరంతరంగా కొనసాగుతోంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత పనుల కోసం ఒక్కో గ్రామ, వార్డు సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున రూ.3000 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. పూర్తయిన పనులకు బిల్లులు చెల్లింపు చేస్తున్నారు. అత్యంత ప్రాధాన్యత పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత పనుల పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సిందిగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎంపీడీవోలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పూర్తి అయిన పనుల బిల్లులను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్లోడ్ చేసి నిబంధన ప్రకారం చెల్లింపులు చేయాలని డీడీఓలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పనులు పూర్తయిన వాటికి ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లింపు చేస్తున్నారు. పనులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్ జైన్ తెలిపారు. -
నయా ఆతిథ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆతిథ్య రంగం బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దేశ, విదేశీ పర్యాటకుల అభిరుచులకు తగ్గట్టుగా ‘ఆతిథ్య’ మౌలిక వసతులను కల్పిస్తోంది. ఇందులో భాగంగా పర్యాటకాభివృద్ధి సంస్థ హరిత హోటళ్లను ఆధునికీకరించేందుకు కార్యాచరణ రూపొందించింది. సుమారు రూ.140 కోట్లతో తొలి దశలో 16 హోటళ్ల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది. నిర్మాణ రంగంలో అనుభవజు్ఞలైన అర్కిటెక్చర్లతో హోటళ్లకు హంగులు అద్దుతోంది. విశాఖ నుంచి ప్రారంభం.. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఈ–టెండరింగ్ ప్రక్రియ ద్వారా హరిత హోటళ్ల అప్‌గ్రేడ్, పునర్నిర్మాణ పనులు చేపడుతోంది. ఇప్పటికే 16 హోటళ్ల పనులకు పరిపాలన అనుమతులు వచ్చాయి. విశాఖలోని యాత్రీనివాస్ హోటల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. అరకులోని హరిత వ్యాలీ రిసార్టు, నెల్లూరు, ద్వారకాతిరుమలలోని హోటళ్ల పనులు చేపట్టేందుకు టెండర్లు ఖరారయ్యాయి. ఒకట్రెండు రోజుల్లో ఒప్పంద ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించనున్నారు. మరో వారంలోగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని టైడా జంగిల్ బెల్స్ రిసార్టు, విజయపురిసౌత్, శ్రీశైలం, సూర్యలంక, కడప, అరకులోని మయూరి, హార్సిలీహిల్స్, కర్నూలు, గండికోట హోటళ్లతో పాటు నెల్లూరు మైపాడు బీచ్ రిసార్టు, దిండి కోకోనట్ రిసార్టు, అనంతగిరి హిల్ రిసార్టులకు టెండర్లు పిలవనుంది. అత్యాధునిక సౌకర్యాలతో.. ఆతిథ్య రంగంలోని ప్రైవేటు హోటళ్లకు దీటుగా ఏపీటీæడీసీ హరిత హోటళ్లను తీర్చిదిద్దుతోంది. ప్రతి హోటల్లో లగ్జరీ ఫర్నీచర్ నుంచి గోడలకు పెయింటింగ్, ఇంటీరియర్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. రెస్టారెంట్, స్పా, మోడ్రన్ జిమ్, స్విమ్మిగ్ పూల్, సావనీర్ షాపు, మినీ బ్యాంకెట్/సమా వేశ మందిరం, టెర్రాస్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, టీవీ యూనిట్, హై స్పీడ్ ఇంటర్నెట్, ఉడెన్ ర్యాక్స్, టేబుల్ విత్ మిర్రర్, లైటింగ్, డ్రై–వెట్ ఏరియా ఉండేలా టాయిలెట్ల నిర్మాణం చేపడుతోంది. పార్కింగ్ సౌకర్యం, ల్యాండ్ స్కేపింగ్, పచ్చదనాన్ని పెంచనుంది. పులివెందులలో 4స్టార్ హోటల్ పులివెందులలో రూ.23.50 కోట్లతో 4స్టార్ హోటల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మధ్యలో నిర్మాణం నిలిచిపోయిన 1.71 ఎకరాల్లోని ఓ భవనాన్ని గుర్తించి కొనుగోలు చేసింది. ఇందులో వసతి గదులు, కన్వెన్షన్ సెంటర్ (క్లబ్ హౌస్), జిమ్, పిల్లల ఆటస్థలం, ఎలివేటర్స్, సరై్వలెన్స్ సిస్టమ్, సౌర విద్యుత్ స్టేషన్‌తో పాటు ఇతర ముఖ్యమైన మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయనుంది. సౌకర్యాల కల్పనలో రాజీపడం పర్యాటకుల అభిరుచులకు తగ్గట్టుగా సేవలందించేందుకు చర్యలు చేపడుతున్నాం. తొలుత హరిత హోటళ్లను అప్‌గ్రేడ్ చేస్తున్నాం. అత్యధిక పర్యాటకులు వచ్చే హోటళ్లను ఎంపిక చేసి పనులు ప్రారంభిస్తున్నాం. దశల వారీ అన్ని హోటళ్లలో మార్పులు చేస్తాం. నాణ్యమైన సౌకర్యాల కల్పనలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదు. స్టార్ హోటళ్లకు దీటుగానే మా రిసార్టులు, హోటళ్లను తీర్చిదిద్దుతాం – కె.కన్నబాబు, ఎండీ, పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్ణీత కాల వ్యవధిలో.. హోటళ్ల ఆధునికీకరణలో భాగంగా ఈ–టెండర్ల ద్వారా ఎంపిక చేసిన కాంట్రాక్టర్లు, అనుభవం కలిగిన ఆర్కిటెక్చర్ల సమన్వయంతో పని చేస్తున్నాం. సుదీర్ఘ అధ్యయనం తర్వాతే ప్రణాళిక ప్రకారం పనులు చేపట్టాం. పర్యాటక సీజన్ ప్రారంభమయ్యే లోగా పనులు పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నాం. అనుకున్న కాల వ్యవధిలో పూర్తి స్థాయిలో హోటళ్లను అప్‌గ్రేడ్ చేసేలా పర్యవేక్షిస్తున్నాం. – మల్రెడ్డి, ఈడీ (ప్రాజెక్ట్స్), పర్యాటకాభివృద్ధి సంస్థ -
రీట్, ఇన్విట్.. పెరుగుతున్న ఆకర్షణ
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతున్న కొద్దీ.. వీటిల్లోకి మరిన్ని పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఇందుకు గతేడాది గణాంకాలే నిదర్శనం. 2023లో రీట్, ఇన్విట్లలోకి రూ.11,474 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2022లో వచి్చన రూ.1,166 కోట్లతో పోలిస్తే పది రెట్ల వృద్ధి గతేడాది నమోదైనట్టు తెలుస్తోంది. సెబీ తీసుకున్న చర్యలు, ఆకర్షణీయమైన రాబడులు ఈ సాధనాల దిశగా ఇన్వెస్టర్లను ఆలోచింపజేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది కూడా ఈ సాధనాలు భారీగా పెట్టుబడులను ఆకర్షించొచ్చన్న అంచనాను వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ రేట్ల కోత అంచనా, విధానాల్లో వచి్చన మార్పులను ప్రస్తావిస్తున్నారు. ‘‘ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో వడ్డీ రేట్లను తగ్గించే చర్యలు చేపట్టొచ్చు. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసే వారికి రీట్, ఇన్విట్లు ఆకర్షణీయంగా మారతాయి’’అని క్లారావెస్ట్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు మనకి పరులేకర్ పేర్కొన్నారు. రీట్, ఇన్విట్ సాధనాల్లోకి భారీగా 2020లో రూ.29,715 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. 2021లో రూ.17,641 కోట్లు వచ్చాయి. రీట్,ఇన్విట్‌లను ఏడెనిమిదేళ్ల క్రితం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దేశంలో 23 రిజిస్టర్డ్ ఇన్విట్లు, ఐదు రీట్లు ఉన్నాయి. వీటి నిర్వహణలో మొత్తం రూ.30,000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. రీట్ల ద్వారా వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో, ఇన్విట్ల ద్వారా ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో పెట్టుబడుల అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. -
మెరుగైన సదుపాయాలు కల్పించండి
న్యూఢిల్లీ: దేశీ స్టార్టప్‌లు మరింతగా రాణించేందుకు సరఫరా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని గ్రామీణ ప్రాంతాల అంకుర సంస్థలు కేంద్రాన్ని కోరాయి. అలాగే నిధుల లభ్యత పెరిగేలా తగు చర్యలు తీసుకోవాలని బడ్జెట్ కోర్కెల చిట్టాలో విజ్ఞప్తి చేశాయి. దీనితో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలకు ఊతం లభించగలదని పేర్కొన్నాయి. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెలలో కేంద్రం ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టనుండగా, ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. పాతబడిన పరికరాలు, బలహీన సరఫరా వ్యవస్థలు, మౌలిక సదుపాయాల లేమి, నిధుల కొరత వంటి సమస్యలతో దేశీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ సతమతమవుతోందని క్రిని స్పైసెస్ వ్యవస్థాపకుడు ప్రదీప్ కుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయగలిగేలా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలకు అనుసంధానం అవడంలో ప్రభుత్వం తమకు తోడ్పాటు కలి్పంచాలని ఆయన కోరారు. వ్యవసాయ ఆధారిత స్టార్టప్‌లను ప్రారంభించే గ్రామీణ ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ (ఏఏఎఫ్)కి రాబోయే బడ్జెట్లో కేంద్రం అదనంగా మరిన్ని నిధులు కేటాయించగలదని ఆశిస్తున్నట్లు యాదవ్ చెప్పారు. 2017లో ఏర్పాటైన క్రిని స్పైసెస్ ప్రత్యక్షంగా 22 మందికి, పరోక్షంగా 100 మందికి ఉపాధి కలి్పస్తోంది. 2022–23లో రూ. 4 కోట్ల పైచిలుకు ఆదాయం నమోదు చేసింది. ఎగుమతి నిబంధనలు సడలించాలి.. ఎగుమతి నిబంధనలను సడలించాలంటూ ప్రభుత్వాన్ని పలు అంకుర సంస్థలు కోరుతున్నాయి. ముడి వస్తువుల దిగుమతి, ఫినిష్డ్ ఉత్పత్తుల ఎగుమతి సులభతరమయ్యేలా అంతర్జాతీయ సరఫరా, సేల్స్ వ్యవస్థకు అంకుర సంస్థలు అనుసంధానమయ్యేందుకు కేంద్రం సహాయం అందించాలని ఐరిస్ పాలిమర్స్ వ్యవస్థాపకుడు ఎ. అరుణ్ కోరారు. అంతర్జాతీయంగా 3.82 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న మల్చింగ్ మెటీరియల్స్ మార్కెట్ ఏటా 7.6 శాతం వృద్ధితో 2032 నాటికి 7.96 బిలియన్ డాలర్లకు పెరగవచ్చనే అంచనాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం గనుక ఎగుమతి వ్యవస్థను సరళతరం చేస్తే ఈ విభాగంలో భారత్ భారీ తయారీ హబ్‌గా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. వ్యవసాయ ఫిల్మ్‌లు, పారిశ్రామిక ప్యాకేజింగ్ ఫిల్మ్‌లు తయారు చేసే పుణె కంపెనీ ఐరిస్ పాలిమర్స్.. ప్రత్యక్షంగా 53 మందికి, పరోక్షంగా 200 మందికి ఉపాధి కలి్పస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 34 కోట్ల ఆదాయం నమోదు చేసింది. మరిన్ని సబ్సిడీలు కావాలి.. మరోవైపు, అంకుర సంస్థల లాభార్జనకే కాకుండా వాటి ప్రయోజనాలు రైతులకు కూడా అందేలా చూసేందుకు నిర్దిష్ట రంగాలకు ప్రభుత్వ సబ్సిడీలు మరింతగా అవసరమని నియో ఫార్మ్‌టెక్ వ్యవస్థాపకుడు యోగేష్ గవాండే చెప్పారు. ‘మాది ఒక అంకుర సంస్థ. మేము దేశ, విదేశ దిగ్గజాలతో పోటీపడుతున్నాం. ప్రభుత్వం గానీ మా ఉత్పత్తికి సబ్సిడీలు ఇస్తే.. మేము మా లాభాలను తగ్గించుకుని, ఆ ప్రయోజనాలను రైతులకు బదలాయించగలుగుతాము‘ అని గవాండే చెప్పారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 12,000 మంది రైతులకు తాము స్ప్రే పంపులను సరఫరా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ సరఫరా, సేల్స్ వ్యవస్థకు అనుసంధానమవడం అనేది అతి పెద్ద సవాలుగా ఉంటోందని గవాండే చెప్పారు. వ్యవసాయ స్ప్రే పంపులను తయారు చేసే నియో ఫార్మ్టెక్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 100 మంది ఉపాధి పొందుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 1.12 కోట్ల ఆదాయం నమోదు చేసింది. వ్యవసాయ రంగంలో ఆధునీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అంకుర సంస్థలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తోందని భారతీయ యువ శక్తి ట్రస్టు (బీవైఎస్టీ) వ్యవస్థాపకురాలు లక్ష్మీ వెంకటరామన్ వెంకటేశన్ తెలిపారు. ఏఏఎఫ్ ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాల్లోని అంకురాలకు ఆర్థిక సహాయం అందుతోందని వివరించారు. లక్షల కొద్దీ గ్రామీణ స్టార్టప్‌లు మరింతగా విస్తరించేందుకు, యూనికార్న్‌లుగా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల సంస్థలు) ఎదిగేందుకు కూడా అవకాశం ఉందని లక్ష్మి చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఎంట్రప్రెన్యూర్లకు బీవైఎస్టీ గత మూడు దశాబ్దాలుగా సలహాలు, సూచనలు అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు పది లక్షల పైచిలుకు యువతకు కౌన్సిలింగ్ చేశామని, వారు 48,000 పైగా అంకుర సంస్థలను ఏర్పాటు చేయడంలో సహాయపడ్డామని చెప్పారు. ఈ సంస్థలు రూ. 6,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయని, ప్రత్యక్షంగా.. పరోక్షంగా 3,50,000 మందికి ఉపాధి కలి్పస్తన్నాయని ఆమె పేర్కొన్నారు. -
పొలం నుంచి మార్కెట్‌కు..
సాక్షి, అమరావతి: పండించిన పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించేందుకు రైతన్నలు పడుతున్న వెతలకు చెక్ పెట్టే లక్ష్యంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల పరిధిలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. మార్కెట్ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయంలో ఏఏంసీల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాల కోసం ఖర్చుచేయగా.. మిగిలిన కొద్దిపాటి సొమ్ములను మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేసే వారు. దీంతో ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన ఏఎంసీలకు కొత్తరూపునివ్వడంతో పాటు.. రైతు క్షేత్రాల నుంచి మార్కెట్లకు అనుసంధానించే రోడ్లను నిర్మించాలని సంకల్పించింది. ఇదే లక్ష్యంతో మార్కెటింగ్ సెస్‌ను కాస్త సవరిస్తూ ధాన్యంపై 2శాతం, రొయ్యలపై 1 శాతం, చేపలపై రూ.0.50 శాతం, మిగిలిన అన్నిరకాల నోటిఫైడ్ వ్యవసాయ, లైవ్‌స్టాక్ ఉత్పత్తులపై ఒక శాతం చొప్పున సెస్ పెంపును ప్రతిపాదించింది. ధాన్యం మినహా ఇతర ఉత్పత్తులపై ప్రతిపాదించిన సెస్ వసూలుకు హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతర్గత రహదారులకు పెద్దపీట మరోవైపు వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను యార్డులు, మార్కెట్లకు తరలించుకునేందుకు వీలుగా రైతు క్షేత్రాల నుంచి ఏఏంసీలకు, ఏఎంసీల నుంచి మండల, నియోజకవర్గ కేంద్రాలను అనుసంధానిస్తూ అనుబంధ రహదారుల నిర్మాణం, ఏఎంసీలు, యార్డులు, మార్కెట్లు, చెక్ పోస్టులు, యార్డులు, రైతు బజార్లను ఆధునికీకరించడం, కొత్తగా ఏర్పడిన ఏఎంసీలకు భవనాలతో పాటు కొత్త జిల్లాలకు అనుగుణంగా కార్యాలయ భవనాలు నిర్మించాలని సంకల్పించారు. ఈ మేరకు ఏపీ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు(ఏపీఎంఐడీపీ)లో భాగంగా రూ.1072.93 కోట్లతో 11,088 కి.మీ. మేర అంతర్గత రహదారుల నిర్మాణం, మరో 9,123 కి.మీ.మేర రహదారుల మరమ్మతులు, రూ.527 కోట్లతో ఏఎంసీలు, యార్డులు, రైతు బజార్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ప్రభుత్వం పరిపాలనామోదం ఇచ్చింది. నాబార్డు ద్వారా రూ.1,003.94 కోట్ల రుణం మార్కెట్ సెస్ రూపంలో ఏటా రూ.550 కోట్ల ఆదాయం వస్తుండగా, ధాన్యంపై సెస్ పెంపు వల్ల గతేడాది రూ.648 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది రూ.708 కోట్లు వసూలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.400 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఈ మొత్తం ఏమాత్రం సరిపోదన్న ఆలోచనతో ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందాలని నిర్ణయించింది. ఆ బా«ధ్యతలను నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు అప్పగించింది. ఇటీవలే ఈ ప్రాజెక్టు కోసం గిడ్డంగుల సంస్థకు నాబార్డు రూ.1,003.94 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ మొత్తంలో రూ.861.53 కోట్లతో అనుబంధ రహదారుల నిర్మాణం, రూ.197.76 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు కింద 2024–24 ఆర్థిక సంవత్సరంలో రూ.446.20 కోట్లు, 2025–26లో రూ.669.29 కోట్లతో చేపట్టనున్న ఈ పనులు పంచాయతీ రాజ్ శాఖకు అప్పగించారు. రైతు సంక్షేమం కోసమే.. పండించిన వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను కల్లాల నుంచి మార్కెట్లకు తరలించేందుకు అనువైన రహదారుల నిర్మాణంతో పాటు మార్కెట్ కమిటీల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఇందుకోసం రూ.1599.92 కోట్ల అంచనాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ఇటీవలే నాబార్డు రూ.1003.94 కోట్ల రుణం మంజూరైంది. ఈ నిధులతో 2024–26 ఆర్థిక సంవత్సరాల్లో చేపట్టనున్న పనులకు పరిపాలనామోదం ఇచ్చాం. త్వరలో టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నాం. మౌలిక వసతుల కల్పన కోసం రుణం తీసుకుంటున్నామే తప్ప, ఈ రుణం కోసం రైతులపై పన్నుల భారం మోపుతున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. – రాహుల్ పాండే, కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
నవంబర్‌లో ‘మౌలికం’ పురోగతి 7.8 %
న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం గ్రూప్ నవంబర్‌లో 7.8 శాతం పురోగతి సాధించింది. అధికారిక గణాంకాల ప్రకారం క్రూడ్ ఆయిల్, సిమెంట్ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాలు మంచి పనితీరును కనబరిచాయి. బొగ్గు, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, ఎలక్ట్రిసిటీ రంగాలూ ఈ గ్రూప్‌లో భాగంగా ఉన్నాయి. ఇక 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ ఎనిమిది నెలల కాలంలో ఎనిమిది రంగాల పురోగతి 8.6 శాతం. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 8.1%. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ గ్రూప్ వాటా దాదాపు 42 శాతం. -
2 బిలియన్ డాలర్లపై బ్లాక్ బాక్స్ గురి
న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ బ్లాక్ బాక్స్ వచ్చే మూడేళ్లలో ఆదాయాన్ని మూడింతలు పెంచుకోవాలని నిర్దేశించుకుంది. 2 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కీలకమైన టెక్నాలజీ మౌలిక సదుపాయాలకు డిమాండ్ పెరుగుతుండటం ఇందుకు దోహదపడగలదని సంస్థ ప్రెసిడెంట్ సంజీవ్ వర్మ తెలిపారు. డిజిటల్ ఇన్ఫ్రా, కనెక్టివిటీ, నెట్వర్కింగ్, సైబర్‌సెక్యూరిటీ మొదలైన వాటిపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు బ్లాక్ బాక్స్ సేవలు అందిస్తోంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 6,233 కోట్ల ఆదాయం నమోదు చేసింది. బ్లాక్ బాక్స్ ఆదాయంలో 70 శాతం వాటా అమెరికాది కాగా యూరప్ వాటా 15 శాతంగా ఉంది. 4,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. 2 బిలియన్ డాలర్ల లక్ష్యానికి చేరుకునే క్రమంలో ఉద్యోగుల సంఖ్య 7,000–8,000కు చేరే అవకాశం ఉందని, అత్యధికంగా హైరింగ్ భారత్‌లోనే ఉంటుందని వర్మ వివరించారు. -
డేటా సెంటర్లపై 21 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్ధంలో (జనవరి–జూన్) దేశీ డేటా సెంటర్ (డీసీ) మార్కెట్లోకి 21.4 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచి్చనట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ ఒక నివేదికలో తెలిపింది. డిజిటలీకరణ వేగవంతం అవు తుండటం, టెక్నాలజీ మౌలిక సదుపాయాలు మెరుగుపడుతుండటం, 5జీ..కృత్రిమ మేథ.. బ్లాక్‌చెయిన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అధునాతన టెక్నాలజీల వినియోగం పెరుగుతుండటం తదితర అంశాల కారణంగా భారత్‌లో డేటా సెంటర్ల పరిశ్రమ పురోగమనం కొనసాగుతోందని వివరించింది. డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపడుతుండటం, టెక్నాలజీ వినియోగం పెరుగుతుండటంతో పాటు నియంత్రణపరమైన తోడ్పాటు వంటి అంశాల కారణంగా భారత్‌లోని డేటా సెంటర్లు పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారాయని తెలిపింది. 2020 –2023 మధ్య కాలంలో భారతీయ డీసీ సామర్ధ్యం రెట్టింపయ్యిందని, ఈ ఏడాది ప్రథమార్ధంలో 880 మెగావాట్లకు చేరిందని పేర్కొంది. 2023 ఆఖరు నాటికి ఇది 1,048 మెగావాట్లకు చేరగలదని సీబీఆర్ఈ నివేదిక వివరించింది. 2018 – 2023 ప్రథమార్ధం మధ్యకాలంలో భారత డీసీ మార్కెట్లోకి మొత్తం 35 బిలియన్ డాలర్ల విలువ చేసే పెట్టుబడుల ప్రతిపాదనలు వచి్చనట్లు పేర్కొంది. ఇందులో హైపర్‌స్కేల్ డీసీల వాటా 89 శాతంగా ఉండగా, కో–లొకేషన్ డీసీల వాటా 11% ఉంది. రాష్ట్రాలవారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్‌కి పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. -
రేపటి నగరాలను నిర్మించేదెలా?
ప్రపంచవ్యాప్తంగా జీడీపీలో దాదాపు 80 శాతం వాటా సమకూరుస్తూ నగరాలు ప్రధాన ఆదాయ సముపార్జన కేంద్రాలుగా మారుతున్నాయి. భారతదేశంలో కూడా ఇందుకు భిన్నమైన పరిస్థితులు లేవు. దేశంలోని ముంబై, ఢిల్లీ వంటి నగరాలు ప్రపంచంలోని కొన్ని దేశాల కంటే అధికంగా జీడీపీని సమకూరుస్తున్నాయి. మన నగరాలను అభివృద్ధి పథంలో నిలపడానికి కొత్తగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంతోపాటు ఇప్పటికే ఉన్న సదుపాయాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. పట్టణ మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడంలో ప్రభుత్వాలకున్న పరిమితుల దృష్ట్యా ప్రైవేటు పెట్టుబడులను సమీకరించడం నేడు అనివార్యంగా మారింది. విశాఖపట్నం లాంటి నగరాలు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవడానికి వినూత్న ఆదాయ నమూనాలను విజయవంతంగా వినియోగించుకుంటున్నాయి. 2036 నాటికి భారతదేశంలోని నగరాల్లో నివసించే జనాభా 60 కోట్లకు చేరుకుంటుందని ఒక అంచనా. ఈ స్థాయిలో జనాభా పెరుగుదల మంచి అవకాశాలను సృష్టించడంతో పాటు లక్షలాది మంది జనాభాకు అనుగుణంగా పౌర సేవలు విస్తరించడం, పౌరులకు మెరుగైన జీవనానికి అనువైన పరిస్థితులను కల్పించడం ప్రభుత్వానికి ఒక సవాలు కానుంది. అందువల్ల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పట్టణ మౌలిక సదుపాయాలను సిద్ధం చేయడానికి మనం గణనీయంగా వనరులను కేటాయించాల్సిన అవసరం ఉంది. ఈ అవసరాన్ని గుర్తించిన భారత జీ20 అధ్యక్షత ‘ఫైనాన్సింగ్ సిటీస్ టుమారో: సస్టెయినబుల్, ఇంక్లూజివ్ అండ్ రజిలెంట్’ అనే థీమ్‌ను ఎంపిక చేసుకుంది. అందుకనుగుణంగా నగరాల్లో స్థిరమైన మౌలిక సదుపాయాల పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య పరస్పర అవగాహనను పెంపొందించడానికి న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ పేరుతో ‘ఫైనాన్సింగ్ సిటీస్ ఆఫ్ టుమారో’ ఆవిర్భావానికి కొన్ని సూత్రాలను ఆమోదించారు. పట్టణ మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడంలో ప్రభు త్వాలకున్న పరిమితుల దృష్ట్యా ప్రైవేటు పెట్టుబడులను సమీకరించడం నేడు అనివార్యంగా మారింది. ఇందుకనుగుణంగా స్థిరమైన, సమ్మిళిత మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చు కోవడానికి నగరాలకు మార్గనిర్దేశం చేసే విధంగా భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 కొన్ని నివేదికలను ప్రకటించింది. ఈ వ్యూహంలో పట్టణ ప్రణాళిక సంస్కరణలు, సొంత ఆదాయ వనరులను పెంచుకోవడం, పెట్టు బడి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, నగరాల రుణ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం, గ్రీన్, సోషల్ మరియు సస్టెయినబుల్ బాండ్లు వంటి వినూత్న ఫైనాన్సింగ్ సాధనాలను ఉపయోగించుకుని స్థిరమైన పెట్టుబడి ప్రాజెక్టులను నిర్విరామంగా సాధించడం, నియంత్రణా వాతావరణాన్ని అందుబాటులో ఉంచడం, ఏఐ, సామర్థ్యాల పెంపు, సంస్థాగత సంసిద్ధత వంటి సాధనాలను ఉపయోగించు కోవడం వంటివి ప్రధానాంశాలుగా ఉన్నాయి. భారతదేశంలోని అనేక నగరాలు వినూత్న ఆదాయ వనరుల సృష్టి, పెట్టుబడి అవకాశాలు సుసాధ్యమని నిరూపించాయి. మధ్య ప్రదేశ్‌లోని రేవా మునిసిపల్ కార్పొరేషన్ (ఆర్ఎంసీ) మౌలిక సదు పాయాల కోసం సగటున ఏటా రూ. 350 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందులో కేవలం 34 శాతం మాత్రమే మున్సిపాలిటీ సొంత ఆదాయ వనరుల నుండి వస్తుంటే, మిగిలినది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వివిధ పథకాలు మరియు గ్రాంట్ల ద్వారా సమకూరుతోంది. మౌలిక వసతులకు సొంత ఆదాయం నుండి ఇంత తక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నప్పటికీ, పట్టణ భూభాగపు రీ–డెన్సిఫికేషన్ ఆధారంగా వ్యూహ్మాత్మక పట్టణ ప్రణాళికతో న్యూ రేవా బస్ స్టాండ్ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పీపీపీ(ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) విధానం ద్వారా విజయవంతంగా అమలు చేసింది. న్యూ రేవా బస్ స్టాండ్ ప్రాజెక్టులో 3.5 ఎకరాల ఖాళీ ప్రదేశాన్ని వాణిజ్య సము దాయంతో కూడిన బస్ స్టాండ్‌గా తీర్చిదిద్దడం ద్వారా, మున్సిపా లిటీకి రూ. 10.5 కోట్ల ప్రీమియంతో పాటు, ఏడాదికి రూ. 35 లక్షల అద్దె లభిస్తోంది. భారతదేశంలోని ఇతర నగరాలు కూడా పట్టణ మౌలిక సదు పాయాలను అభివృద్ధి చేసుకోవడానికి వినూత్న ఆదాయ నమూనా లను విజయవంతంగా వినియోగించుకుంటున్నాయి. గ్రేటర్ విశాఖ పట్నం మున్సిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) వ్యర్థ జలాలను శుద్ధి చేసి ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో పరిశ్రమల వినియోగానికి నీటిని సరఫరా చేయడం ద్వారా ఏటా సుమారు రూ. 30 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రాజెక్టు నిధుల కోసం జీవీఎంసీ పన్నుల వసూళ్లు, సేవా పంపిణీ ప్రమాణాలను స్థిరంగా ప్రదర్శించడం ద్వారా రుణ అర్హతలను మెరుగుపరుచుకుని ‘ఏఏ’ క్రెడిట్ రేటింగ్‌ను సాధించింది. అదే విధంగా సూరత్ నగరం కూడా పారిశ్రామిక పునర్వి నియోగం కోసం శుద్ధి చేసిన వ్యర్థ నీటిని విక్రయించడం ద్వారా 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.140 కోట్ల కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంది. స్థిరమైన ఆర్థిక వనరుల సేకరణలో పేరుగాంచిన ఘజియాబాద్ భారతదేశంలో రూ. 150 కోట్ల మున్సిపల్ గ్రీన్ బాండ్లను విడుదల చేసిన మొదటి యూఎల్బీ (అర్బన్ లోకల్ బాడీ)గా నిలిచింది. మెరుగైన పట్టణ ప్రణాళిక, వినూత్న ఆర్థిక నమూనాల ద్వారా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకుని తమ పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి చిన్న నగరాలు కూడా ప్రైవేటు పెట్టుబడిదారులను ఆకర్షించ గలవని పైన పేర్కొన్నవి ఉదాహరణగా నిలుస్తున్నాయి. జీ20 వెలువరించిన పత్రాలు నాణ్య మైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవడానికి మన నగరాలకు మార్గ దర్శకంగా ఉపయోగపడుతుంటే, భారత దేశ అనుభవాలు ప్రపంచ మౌలిక సదు పాయాల ఎజెండాను నిర్దేశించడానికి ఇతోధికంగా దోహదపడుతున్నాయి. అటల్ మిషన్ ఫర్ రీజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ (అమృత్), స్మార్ట్ సిటీస్ మిషన్, హౌసింగ్ ఫర్ ఆల్ (పీఎంఎవై), మెట్రో రైల్ ప్రాజెక్టులు, ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్, స్మార్ట్ సిటీ మిషన్ లో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్లు, వివిధ నగరాలు జారీ చేసిన మునిసిపల్ బాండ్లు, 2018లో రూపొందించిన భారతదేశ నేషనల్ అర్బన్ పాలసీ ఫ్రేమ్‌వర్క్ (ఎన్యూపీఎఫ్) అమలు నుండి నేర్చుకున్న పాఠాలు... గ్రూపు ఆలోచనలను సుసంపన్నం చేశాయి. అలాగే వాటిని పరస్పరం పంచుకోవడం వివిధ దశలలో అభివృద్ధిలో ఉన్న నగరాల ఆకాంక్షలకు అనుగుణంగా సుస్థిర ఆర్థిక వనరుల సమీకరణకు ఇతర మార్గాలను ఉపయోగించుకునేందుకు మార్గదర్శకంగా నిలిచాయి. సుస్థిర ఆర్థిక వనరుల సమీకరణకు ఇతర మార్గాలను ఉపయోగించుకునే దిశగా ముందుకు వెళ్లడానికి భారతీయ నగరాలు తమ సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, డిజిటైజ్డ్ అకౌంటింగ్ వ్యవస్థను అవలంబించడం, పెట్టుబడి పెట్టదగిన ప్రాజెక్టుల పైప్ లైన్‌ను కలిగి ఉండటం, వాటి విశ్వసనీయత, ఆదాయ సేకరణ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం అత్యవసరం. పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వైపు ప్రైవేట్ మూలధనాన్ని ఆకర్షించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడంలో ఈ పరివర్తన కీలకం. సోలమన్ ఆరోక్యరాజ్ వ్యాసకర్త జాయింట్ సెక్రటరీ, కేంద్ర ఆర్థిక శాఖ, భారత ప్రభుత్వం (వ్యాసంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం) -
Chhattisgarh elections 2023: సంక్షేమం X మౌలికం
ఛత్తీస్‌గఢ్‌లో ఈసారి అసెంబ్లీ ఎన్నికలను పాలక కాంగ్రెస్ సంక్షేమ పథకాలకు, బీజేపీ మౌలిక సదుపాయాల వాగ్దానాలకు మధ్య పోరుగా భావిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా స్వీప్ చేసిన కాంగ్రెస్, మళ్లీ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. దక్షిణాదిలో కీలకమైన కర్ణాటకలో ఇటీవలే బీజేపీ నుంచి అధికారాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకోవడం తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఛత్తీస్‌గడ్‌తో పాటు రాజస్తాన్‌లో కూడా ఆ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ కాస్త కష్టమేనన్న అంచనాల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ను ఎలాగైనా నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది. అందుకే ఇప్పటికే అమల్లో ఉన్నవాటికి తోడుగా మరెన్నో సంక్షేమ పథకాలను సీఎం భూపేశ్ భగేల్ ప్రకటిస్తున్నారు. మరోవైపు చిరకాలం పాటు తమ పాలనలో ఉన్న రాష్ట్రాన్ని గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కోల్పోయిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ పట్టుదలగా ఉంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ కొంతకాలంగా తరచూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పుంఖానుపుంఖాలుగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారు. వాటితో రాష్ట్ర భాగ్యరేఖలే మారతాయని, యువతకు భారీగా ఉపాధి దొరుకుతుందని చెబుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు పారీ్టల ప్రచారంలో ఓటరు దేనికి జై కొడతాడో చూడాలి... బీజేపీ బలాలు... ► ఇతర అంశాలు ఎన్నున్నా అన్నింటి కంటే ప్రధానమైనది ఎప్పట్లాగే హిందుత్వ కార్డే. కాకుంటే ఈ విషయంలో గ్రామీణ ఓట్లను ఈ మేరకు సంఘటితం చేస్తుందన్నది ఈసారి కీలకం కానుంది. ► 15 ఏళ్ల వరుస పాలనలో చేసిన అభివృద్ధిని కూడా కమలదళం బాగానే ప్రచారం చేస్తోంది. ► కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలో అవినీతిలో కూరుకుపోయిందని గట్టిగా ప్రచారం చేస్తోంది. ► అయితే గతంలో రమణ్‌సింగ్‌లా ఈసారి బీజేపీ సీఎం అభ్యరి్థగా ఎవరినీ ప్రచారం చేయడం లేదు. ఇది కాస్త ప్రభావం చూపే అంశమేనని అంటున్నారు. అభివృద్ధే కాంగ్రెస్ మంత్రం ► బీజేపీ హిందూత్వ వాదానికి కౌంటర్‌గా రాష్ట్ర కాంగ్రెస్ కొంతకాలంగా ఉదారవాద హిందూత్వ గళం వినిపిస్తోంది. ఇది కొంతవరకు కలిసొస్తుందని భావిస్తోంది. ► సీఎం భగేల్ ఓబీసీ నేత కావడం ఆ సామాజికవర్గంలో తమ ఓట్లను మరింత సంఘటితపరుస్తుందని ఆశిస్తోంది. ► పేదలకు, రైతులకు అనుకూలంగా అమలు చేస్తున్న పలు పథకాలు ఈసారి కచి్చతంగా గట్టెక్కిస్తాయని భగేల్ నమ్ముతున్నారు. ► వీటికి తోడు ఛత్తీస్‌గఢ్ ఆత్మగౌరవాన్ని ఇటీవలి కాలంలో పదేపదే తెరపైకి తెస్తున్నారు. తద్వారా ఓటర్లను ఆకట్టుకోజూస్తున్నారు. ► అయితే అవినీతి ప్రచారం, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారేలా కనిపిస్తున్నాయి. బరిలోకి గిరిజన పార్టీ ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీ సంఘాల సమాహారమైన సర్వ ఆదివాసీ సమాజ్ ఇటీవలే హమార్ రాజ్ పేరుతో రాజకీయ పారీ్టగా మారింది. ఒకనాటి కాంగ్రెస్ నేత అరవింద్ నేతం సారథ్యంలో ఎన్నికల బరిలో దిగుతోంది. ఫక్తు గిరిజన ఆచార వ్యవహారాలకు కట్టుబడి పని చేస్తామనే హామీతో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో సంఖ్యాధికులైన గిరిజనుల్లో ఇది గట్టిగా ప్రభావం చూపితే అది బీజేపీ, కాంగ్రెస్‌ల్లో దేన్ని దెబ్బ తీస్తుందన్నది ఆసక్తికరం. కీలకాంశాలు ► వరికి సరైన మద్దతు ధర కావాలని రైతులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు. క్వింటాలుకు రూ.2,500 మద్దతు ధర చెల్లిస్తామన్న 2018 నాటి హామీని భగేల్ సర్కారు నెరవేర్చలేదని ఆగ్రహంగా ఉన్నారు. ► కాంగ్రెస్ తరఫున సీఎం భగేల్ అన్నీ తానై నడిపిస్తున్నారు. అయితే పారీ్టలో అసమ్మతులు ఆయనకు తలనొప్పిగా మారారు. ► డిప్యూటీ సీఎం కేపీ సింగ్‌దేవ్ రూపంలో భగేల్‌కు సొంత పారీ్టలోనే గట్టి ప్రత్యర్థి పొంచి ఉన్నారు. ► ఇక బీజేపీకి ఇప్పటికీ మాజీ సీఎం రమణ్ సింగే రాష్ట్రంలో ఏకైక పెద్ద దిక్కు. 15 ఏళ్లు పాలించిన నేతగా ఈసారి తన అనుభవాన్నంతా రంగరిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘నిర్మాణ పరికరాల’ ఆదాయం 15 శాతం అప్
న్యూఢిల్లీ: దేశీయంగా నిర్మాణ పరికరాల రంగం ఆదాయం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 14–15 శాతం మేర వృద్ధి చెందనుంది. మౌలికరంగంపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతుండటం ఇందుకు దోహదపడనుంది. అలాగే, రియల్ ఎస్టేట్, మైనింగ్ రంగాల్లో కార్యకలాపాలు పుంజుకోవడం కూడా తోడ్పాటు అందించనుంది. క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో ఈ మేరకు అంచనా వేసింది. ‘‘గత ఆర్థిక సంవత్సరంలో అధిక బేస్ (29 శాతం) ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీ నిర్మాణ పరికరాల రంగం ఆదాయం 14–15 శాతం మేర వృద్ధి చెందవచ్చు. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ)తో పాటు రహదారులు, మెట్రోలు, రైల్వేలు మొదలైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ఇందుకు దోహదపడనుంది’’ అని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. సాధారణంగా నిర్మాణ పరికరాల వినియోగంలో రహదారుల వాటా 40 శాతం వరకు ఉంటుంది. రోడ్ల నిర్మాణం పనులు వేగవంతం అవుతుండటం పరిశ్రమ వృద్ధికి సహాయకరంగా ఉండనుంది. వంతెనలు.. విమానాశ్రయాలూ.. రియల్ ఎస్టేట్, మైనింగ్ రంగాలతో పాటు వంతెనలు, విమానాశ్రయాలు, మెట్రో కారిడార్లు మొదలైన వాటి కాంట్రాక్టర్ల నుంచి తయారీ సంస్థలకు ఆర్డర్లు బాగా ఉంటున్నాయని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ్ తెలిపారు. 2024 ఏప్రిల్ 1 నుంచి పరిశ్రమ స్టేజ్–వీ2 ఉద్గార ప్రమాణాలకు మళ్లనుండటం వల్ల పరికరాల ధరలు పెరగనుండటంతో ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పరికరాలను ముందుగానే కొంత కొని పెట్టుకునే ధోరణులు కూడా కనిపించవచ్చని వివరించారు. పరిమాణంపరంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో 1.1 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదు కాగా .. ఈ ఆర్థిక సంవత్సరం ఆల్ టైమ్ గరిష్టంగా 1.2 లక్షల యూనిట్ల స్థాయిలో విక్రయాలు నమోదు కావచ్చని అంచనా వేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం అమ్మకాల పరిమాణంలో ఎర్త్‌మూవింగ్ పరికరాల వాటా 70 శాతంగా, కాంక్రీట్ పరికరాల వాటా 22 శాతంగా ఉండగా.. మిగతాది మెటీరియల్ ప్రాసెసింగ్ పరికరాలది ఉన్నట్లు వివరించింది. -
రూ.1,712.21 కోట్ల ప్రాధాన్యత పనులు మంజూరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్తించిన ప్రాధాన్యత పనుల్లో ఇప్పటికే రూ.537.77 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోని 15,004 సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మౌలిక సదుపాయాల అంతరాలను గుర్తించి ప్రాధాన్య పనులుగా చేపడుతున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గ పరిధిలోని సచివాలయాలను సందర్శిస్తున్న సందర్భంగా ఒక్కో సచివాలయ పరిధిలో అత్యంత ప్రాధాన్యత గల పనుల కోసం రూ.20 లక్షల చొప్పున రూ.3000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పూర్తయిన పనులకు బిల్లులూ చెల్లిస్తోంది. ఇప్పటి వరకు 9,381 సచివాలయాల పరిధిలో గుర్తించిన రూ.1,876.20 కోట్ల విలువైన 50,117 పనులను పోర్టల్‌లో అప్లోడ్ చేశారు. ఇందులో ఇప్పటికే 8,562 సచివాలయాల పరిధిలో రూ.1,712.21 కోట్ల విలువైన 43,685 ప్రాధాన్యత పనులు మంజూరు చేయగా.. 7,702 సచివాలయాల పరిధిలో 39,089 పనులను ప్రారంభించారు. పనులను పోర్టల్‌లో అప్లోడ్ చేయడం, వాటిని వెంటనే మంజూరు చేయడం, అనంతరం వాటిని ప్రారంభించడం నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. ఈ విషయంలో వెనుకబడిన జిల్లాల్లో కలెక్టర్లు సమీక్షించి త్వరగా పనులు మంజూరు చేయించి, ప్రారంభింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. అత్యంత ప్రాధాన్యత పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎంపీడీవోలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
ఏపీ బాటలో కేంద్రం..
సాక్షి, అమరావతి: ఏపీలో మాదిరిగానే గ్రామస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం కూడా నడుంబిగించింది. ఆర్బీకేలకు అనుబంధంగా గోదాములతో పాటు పెద్దఎత్తున మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నట్లుగానే కేంద్రం కూడా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)కు అనుబంధంగా వసతుల కల్పనకు కార్యాచరణ సిద్ధంచేసింది. ఇందులో భాగంగా సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టు (వరల్డ్స్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు)కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు కింద తొలిదశలో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 12 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)ను ఎంపిక చేసింది. ఈ ప్రాజెక్టు కింద పీఏసీఎస్ స్థాయిలో గోదాముతో పాటు అత్యాధునిక రైస్‌మిల్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించనుంది. ఇందుకోసం రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలోని మృత్యుంజయ సహకార సమితి పీఏసీఎస్‌ను ఎంపిక చేశారు. సొసైటీ ఆదాయ, వ్యయాల ఆధారంగా ఈ పీఏసీఎస్‌కు అన్ని విధాలుగా వయబులిటీ ఉందని గుర్తించి దీనిని ఎంపిక చేశారు. డీపీఆర్ తయారీ.. ఇక జాతీయస్థాయిలో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న నాబ్‌స్కాన్ ఈ ప్రాజెక్టు కోసం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారుచేసింది. ఈ బృందం ఇటీవలే ఆచంట పీఏసీఎస్‌ను సందర్శించి సంతృప్తి కూడా వ్యక్తంచేసింది. ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన రెండెకరాల భూమిలో సాయిల్ టెస్టింగ్ చేశారు. ఇక ఈ ప్రాజెక్టు కింద.. ► రూ.2.14 కోట్ల అంచనాతో ఆహార ధాన్యాల నిల్వకోసం అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పించబోతున్నారు. ► రూ.86.20 లక్షల అంచనా వ్యయంతో.. 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన గోదాము నిర్మిస్తారు. ► రూ.1,12,86,000 అంచనా వ్యయంతో గంటకు రెండు టన్నుల సామర్థ్యంతో కూడిన అత్యాధునిక కలర్ సార్టెక్స్ రైస్‌మిల్‌ను నిర్మిస్తారు. ► ఏన్సలరీ, సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద రూ.14.06 లక్షల అంచనాతో విద్యుత్, అగ్నిమాపక సౌకర్యాలు కల్పిస్తారు. ► అంతేకాక.. పీఏసీఎస్‌కు ప్రత్యేకంగా కస్టమ్ హైరింగ్ సెంటర్ కింద రూ.1.18 లక్షల అంచనాతో డ్రోన్‌ను కూడా సమకూరుస్తారు. ► ఈ ప్రాజెక్టు కింద చేపట్టే వ్యయంలో 20% (రూ.42.86 లక్షలు) సొసైటీ సమకూర్చుకుంటే, మిగిలిన 80% (రూ.171.44 లక్షలు) ఆప్కాబ్ ద్వారా ప్రభుత్వం రుణం సమకూరుస్తుంది. ► ఈ ప్రాజెక్టుకు ఆగస్టు మూడో వారంలో శంకుస్థాపన చేస్తారు. నవంబరు నెలాఖరుకల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఏపీ బాటలోనే.. ఏపీ బాటలోనే పీఏసీఎస్ స్థాయిలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించాలన్న సంకల్పంతో కేంద్రం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీనికి∙ఆచంట పీఏసీఎస్‌ను ఎంపిక చేసింది. ఇక్కడ రూ.2.14 కోట్లతో గోదాము, రైసుమిల్లు, ఇతర వసతులు కల్పిస్తారు. – అహ్మద్ బాబు, కమిషనర్, సహకార శాఖ