
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో భాగంగా ప్రకటించిన పలు నిర్ణయాలపై భాగస్వాములతో ప్రధాని వెబినార్లు నిర్వహించనున్నారు. గురువారం గ్రీన్ గ్రోత్ పై తొలి వెబినార్ జరగనుంది. ఇందులో వ్యవసాయం, కోపరేటివ్ రంగాల భాగస్వాములతో ప్రధాని మాట్లాడనున్నారు. బడ్జెట్ తర్వాత ప్రధాని 12 వెబినార్లను నిర్వహించనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ నెల 23 నుంచి మార్చి 11 వరకు ఇవి జరుగుతాయని తెలిపింది.
మౌలిక సదుపాయాలు, ఆర్థిక సేవల రంగం, ఆరోగ్యం, వైద్య పరిశోధనలు, మహిళా సాధికారత, ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ (పీఎం వికాస్) అంశాలపై ఈ వెబినార్లు నిర్వహించనున్నట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది. పలు మంత్రిత్వ శాఖలు, విభాగాలు వీటి నిర్వహణ బాధ్యతలు చూడనున్నాయి. బడ్జెట్‌లో ప్రకటించిన సప్షర్తి ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. బడ్జెట్ ప్రకటనలను సమర్థవంతంగా అమలు చేసేందుకు, భాగస్వాములు అందరి మధ్య సమన్వయం, ఏకతాటిపైకి తీసుకురావడంలో భాగంగా ఈ వెబినార్ల నిర్వహణకు ప్రధాని ఆమోదం తెలిపినట్టు ఆర్థిక శాఖ తెలిపింది.