Union Budget 2023-24
-
కేంద్రం పన్నుపోటు.. ఇన్సూరెన్స్ కంపెనీల అంచనాలు తలకిందులు
న్యూఢిల్లీ: అధిక ప్రీమియం కలిగిన జీవిత బీమా ఉత్పత్తులకు ఏమంత డిమాండ్ కనిపించలేదు. ఏప్రిల్ 1 నుంచి తీసుకునే జీవిత బీమా పాలసీల వార్షిక ప్రీమియం రూ.5,00,000కు మించి ఉంటే పన్ను చెల్లించాలంటూ నిబంధనలను బడ్జెట్లో ప్రకటించడం తెలిసిందే. కాకపోతే మార్చి 31 వరకు కొనుగోలు చేసే పాలసీలకు ఈ నిబంధన వర్తించదు. దీంతో అధిక ప్రీమియం ప్లాన్లను మార్చి ఆఖరులోపు కంపెనీలు పెద్ద ఎత్తున విక్రయిస్తాయని నిపుణులు భావించారు. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. అనుకున్న విధంగా వీటి విక్రయాలు ఏమీ పెరగలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రూ.5,00,000కు పైగా ప్రీమియం చెల్లించే ప్లాన్లకు సంబంధించి గడువు తీరిన తర్వాత అందే మొత్తం కూడా పన్ను పరిధిలోకి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో భాగంగా ప్రకటించారు. అధిక పన్ను పరిధిలోని వారు ఈ ప్లాన్లను తీసుకోవడం ద్వారా ఆ మేరకు పన్ను ప్రయోజనం పొందే అవకాశం సెక్షన్ 10(10డి) కింద ఉంది. బడ్జెట్లో ప్రకటన తర్వాత చాలా బ్రోకరేజీ సంస్థలు అధిక ప్రీమియంతో కూడిన నాన్ పార్టిసిపేటరీ గ్యారంటీడ్ ఉత్పత్తులకు ఫిబ్రవరి, మార్చిలో అనూహ్య డిమాండ్ ఉంటుందనే అంచనాను వ్యక్తం చేశాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ అవకాశం లేనందున చాలా మంది ముందుకు వస్తారని భావించాయి. సాధారణ అమ్మకాలే.. ఫిబ్రవరి నెలలో అధిక ప్రీమియం బీమా ఉత్పత్తుల అమ్మకాలు పెద్దగా పెరగలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మార్చిలో పెద్ద ఎత్తున అమ్ముడుపోవచ్చని బీమా కంపెనీలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నాయి. -
మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం: 7.5 శాతం వడ్డీరేటు, ఎలా అప్లై చేయాలి?
సాక్షి, ముంబై: 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్', మహిళా సాధికారత,భాగంగా ప్రకటించిన 2023-24 కేంద్ర బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మహిళా పెట్టుబడిదారుల కోసం కొత్త చిన్న పొదుపు పథకాన్ని ప్రకటించారు. ఆ పథకమే మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం.కేవలం ఆడపిల్లలు, మహిళలు మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టేలా పోస్టాఫీసుల్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2025 ఏప్రిల్ వరకూ స్థిర వడ్డీరేటును అందిస్తుంది. (షాకింగ్ న్యూస్: యాపిల్ ఉద్యోగుల గుండెల్లో గుబులు) మహిళల పెట్టుబడిలో భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి చిన్న పొదుపు పథకం కింద కేంద్రం మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్‌ను అందిస్తోంది. ఇందులో మహిళలకు తక్కువ సమయంలో ఎక్కువ రాబడి రానుంది. మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2 సంవత్సరాలలో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్‌పై 7.5 శాతం వడ్డీ అందిస్తోంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ ప్రయోజనాలు: మహిళలకు, బాలికలకు మాత్రమే ఖాతా తెరిచే అవకాశం. ఒక్క ఖాతా మాత్రమే తెరవవచ్చు. మహిళలు లేదా బాలికల రూ.1000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ రెండేళ్ల కాలపరిమితి పథకం ఆకర్షణీయమైనయు స్థిరమైన వడ్డీని 7.5 శాతం వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన ఖాతాకు వడ్డీ బదిలీ ఉదా: రెండేళ్ల కాలానికి రెండు లక్షలు డిపాజిట్ చేస్తే.. 7.5 శాతం వడ్డీ ప్రకారం రెండు లక్షలకు రెండేళ్లకు రూ.30వేలు వడ్డీ రూపంలో అందుతుందన్నమాట. ఎలా నమోదు చేయాలి స్థానిక బ్యాంక్ లేదా పోస్టాఫీసు నుండి మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన ఫారమ్ తీసుకోవాలి దరఖాస్తులో ఆధార్ కార్డ్ ,పాన్ కార్డ్ , నామినీ లాంటి వివరాలను నమోదు చేయాలి అవసరమైన డాక్యుమెంటేషన్‌తో దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి నగదు లేదా చెక్ రూపంలో సంబంధిత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి ఈ ప్రక్రియ పూర్తైన తరువాత పప్రూఫ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికెట్ మీ చేతికి వస్తుంది డిపాజిట్ చేసిన తేదీ నుండి రెండేళ్లు పూర్తయిన తర్వాత డిపాజిట్ మెచ్యూర్ అవుతుంది ఒక సంవత్సరం గడువు ముగిసిన తర్వాత కానీ మెచ్యూరిటీకి ముందు, బ్యాలెన్స్‌లో గరిష్టంగా 40 శాతం వరకు ఒకసారి విత్‌డ్రా చేసుకోవవచ్చు. చిన్న పొదుపు వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా పోస్టాఫీసుల ద్వారా, గ్రామీణ ప్రాంతాలలోని బాలికలు, మహిళా రైతులు, కళాకారులు, సీనియర్ సిటిజన్లు, ఫ్యాక్టరీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న వ్యాపారులకు చిన్న మెత్తంలో పెట్టుబడితో మంచి రాబడిని పొందుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. (ఇదీ చదవండి: స్టార్ బ్యాటర్ కోహ్లీ అరుదైన ఘనత: గిఫ్ట్‌గా అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్) -
టాప్ గేర్‌లో మౌలికాభివృద్ధి
న్యూఢిల్లీ: ఆర్థికవ్యవస్థకు చోదక శక్తి అయిన మౌలిక వసతుల అభివృద్ధిని శరవేగంగా కొనసాగించాలని ప్రధాని మోదీ అభిలషించారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టాక కొనసాగిస్తున్న వెబినార్ పరంపరలో శనివారం మోదీ ‘ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్: ఇంప్రూవింగ్ లాజిస్టిక్ ఎఫీషియెన్సీ విత్ పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్’ అనే అంశంపై వర్చువల్‌గా మాట్లాడారు. ‘ దేశ ఆర్థికరంగ ప్రగతికి పటిష్ట మౌలిక వసతులే చోదక శక్తి. మౌలికాభివృద్ధి టాప్‌గేర్‌లో కొనసాగితేనే 2047 సంవత్సరంకల్లా భారత్ సంపన్న దేశంగా అవతరించగలదు’ అని ఈ రంగం కోసం కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలను ఆయన ప్రస్తావించారు. ‘ 2013–14 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే ఈసారి ఈ రంగం అభివృద్ధికి ఐదు రెట్లు ఎక్కువగా నిధులు కేటాయించాం. భవిష్యత్తులో రూ.110 లక్షల కోట్ల నిధులు కేటాయిస్తాం. ఈ రంగంలోని ప్రతీ భాగస్వామ్య పక్షం కొత్త బాధ్యతలు, కొత్త సానుకూలతలు, దృఢ నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణమిది. రోడ్లు, రైల్వేలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాల్లో అధునాతన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. దీంతో వ్యాపార అవకాశాలు ఊపందుకుంటాయి. రవాణా ఖర్చు దిగొస్తుంది. ఈ దేశమైనా వృద్ధిలోకి రావాలంటే మౌలికవసతుల కల్పన చాలా కీలకం. ఈ రంగంపై అవగాహన ఉన్నవారికి ఇది బాగా తెలుసు’ అంటూ పలు భారతీయ నగరాల విజయాలను ఆయన ప్రస్తావించారు. రెట్టింపు స్థాయిలో రహదారుల నిర్మాణం ‘2014తో చూస్తే ఇప్పుడు సగటున ఏడాదికి నిర్మిస్తున్న జాతీయ రహదారుల పొడవు రెట్టింపైంది. 600 రూట్ల కిలోమీటర్లలో ఉన్న రైల్వే విద్యుదీకరణ ఇప్పడు 4,000 రూట్ల కిలోమీటర్లకు అందుబాటులోకి వచ్చింది. 74 ఎయిర్‌పోర్టులుంటే ఇప్పడు 150కి పెరిగాయి. నైపుణ్యాభివృద్ధి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఆర్థిక నైపుణ్యాలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మరింతగా పెరగాలి’’ అని మోదీ సూచించారు. ప్రగతి పథంలో భారత్ బిల్‌గేట్స్ ప్రశంసల వర్షం ఆరోగ్యం, అభివృద్ధి, వాతావరణం తదితర రంగాల్లో భారత్ సాధించిన ప్రగతిని కుబేరుడు, భూరి దాత బిల్ గేట్స్ పొగిడారు. భారత ప్రభుత్వం నూతన ఆవిష్కరణల కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులను కేటాయిస్తే భవిష్యత్తులో భారత్ మరింతగా సర్వతోముఖా భివృద్ధిని సాధించగలదని ఆయన అభిలషించారు. ‘సురక్షిత, ప్రభావవంతమైన, అందుబాటు ధరలో వందలకోట్ల వ్యాక్సిన్ డోస్‌లు తయారుచేసే సత్తాను భారత్ సాధించడం గొప్పవిషయం. కోవిడ్ విపత్తు కాలంలో కోవిడ్ టీకాలను అందించి ప్రపంచవ్యాప్తంగా లక్షల జీవితాలను భారత్ కాపాడగలిగింది. పలు రకాల వ్యాధుల బారిన పడకుండా ఇతర వ్యాక్సిన్లనూ సరఫరాచేసింది. ‘శుక్రవారమే ప్రధాని మోదీని కలిశాను. సుస్థిర జగతి కోసం ఆయన చేస్తున్న కృషి కనిపిస్తోంది. సృజనాత్మకతో నిండిన భారత్‌లో పర్యటించడం ఎంతో ప్రేరణ కల్గిస్తోంది’ అని బిల్‌గేట్స్ ట్వీట్‌చేశారు. ‘కోవిడ్ సంక్షోభ కాలంలో 30 కోట్ల మందికి భారత్ అత్యవసర డిజిటల్ చెల్లింపులు చేసింది. సమ్మిళిత ఆర్థికవ్యవస్థకు పెద్దపీట వేసింది. 16 కేంద్ర ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ గతి శక్తి కార్యక్రమం ద్వారా రైల్వే, జాతీయరహదారులు వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షిస్తూ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలతో క్రియాశీలకంగా పనిచేయించడం డిజిటల్ టెక్నాలజీ వల్లే సాధ్యమైంది. కో–విన్, ఆధార్ సహా పలు కీలక ఆవిష్కరణలతో సాధించిన పురోగతిని ప్రపంచానికి చాటే అద్భుత అవకాశం భారత్‌కు జీ20 సారథ్య రూపంలో వచ్చింది. తృణధాన్యాలపై అవగాహన కోసం తీసుకుంటున్న చొరవ, చిరుధాన్యాల ఆహారం అమోఘం’’ అని గేట్స్ అన్నారు. -
కొత్త శిఖరాలకు మన పర్యాటకం
న్యూఢిల్లీ: విభిన్నంగా ఆలోచించడం, దీర్ఘకాలిక దార్శనికత(విజన్) మన పర్యాటక రంగాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ రంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని వ్యాఖ్యానించారు. మన దేశంలోని మారుమూల గ్రామాలు సైతం ఇప్పుడు పర్యాటక పటంలో కొత్తగా చోటు సంపాదించుకుంటున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ‘మిషన్ మోడ్‌లో పర్యాటకాభివృద్ధి’ పేరిట శుక్రవారం నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత భాషల్లో, ఐక్యరాజ్యసమితి గుర్తించిన భాషల్లో మన పర్యాటక ప్రాంతాల సమాచారాన్ని అందించేలా అప్లికేషన్లు(యాప్‌లు) తయారు చేయాలని సూచించారు. టూరిస్ట్ సైట్ల వద్ద బహుళ భాషల్లో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కలిసి పనిచేస్తే అనుకున్నది సాధ్యమే ‘నూతన పని సంస్కృతి’తో మన దేశం ముందుకు సాగుతోందని నరేంద్ర మోదీ వివరించారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌కు ప్రజల నుంచి మంచి ప్రశంసలు దక్కాయని అన్నారు. బడ్జెట్ అనంతరం వెబినార్లు నిర్వహించడం గతంలో ఎప్పుడూ జరగలేదని గుర్తుచేశారు. ఆ ప్రక్రియకు ఈ ఏడాదే శ్రీకారం చుట్టామని చెప్పారు. బడ్జెట్‌కు ముందు, బడ్జెట్ తర్వాత కూడా ప్రజలందరినీ ఇందులో భాగస్వాములను చేస్తున్నామని, వారితో కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. వెబినార్లలో ప్రజల నుంచి ఎన్నో సలహాలు సూచనలు అందుతున్నాయని తెలిపారు. అందరం చేతులు కలిపి పనిచేస్తే అనుకున్న ఫలితాలు సాధించడం కష్టమేమీ కాదని సూచించారు. మన పర్యాటకాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలంటే దీర్ఘకాలిక ప్రణాళికతో పని చేయాలన్నారు. కోస్టల్ టూరిజం, బీచ్ టూరిజం, మాంగ్రూవ్ టూరిజం, హిమాలయన్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వైల్డ్‌లైఫ్ టూరిజం, ఎకో–టూరిజం, హెరిటేజ్ టూరిజం, ఆధ్యాత్మిక టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్స్, స్పోర్ట్స్ టూరిజం అభివృద్ధికి మన దేశంలో ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. యాత్రలతో దేశ ఐక్యత బలోపేతం మతపరమైన చరిత్రాత్మక ప్రాంతాలు, కట్టడాలకు సరికొత్త హంగులు అద్ది, పర్యాటకులకు అమితంగా ఆకర్షించవచ్చని ప్రధానమంత్రి వెల్లడించారు. వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్‌ను బ్రహ్మాండంగా తీర్చిదిద్దామని అన్నారు. గతంలో ఏడాదికి 80 లక్షల మంది పర్యాటకులు వారణాసికి వచ్చేవారని, గత ఏడాది 7 కోట్ల మందికిపైగా వచ్చారని తెలిపారు. పునర్నిర్మాణానికి ముందు కేదార్‌నాథ్‌కు ఏటా 5 లక్షల మంది వచ్చారని, ఇప్పుడు 15 లక్షల మంది సందర్శిస్తున్నారని పేర్కొన్నారు. టూరిజం అనేది సంపన్నులకు మాత్రమేనన్న అభిప్రాయం కొందరిలో ఉందని, అది సరైంది కాదని మోదీ చెప్పారు. మన దేశంలో యాత్రలు చేయడం సంప్రదాయంగా కొనసాగుతోందన్నారు. చార్ధామ్ యాత్ర, ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర, 51 శక్తిపీఠాల యాత్రను ప్రధాని ప్రస్తావించారు. లోటుపాట్లు సవరించుకోవాలి విదేశీ యాత్రికులు భారత్‌కు క్యూ కడుతున్నారని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. వారు మన దేశంలో సగటున 1,700 డాలర్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. అమెరికాలో విదేశీ యాత్రికుల సగటు వ్యయం 2,500 డాలర్లుగా, ఆస్ట్రేలియాలో 5,000 డాలర్లుగా ఉందన్నారు. అధికంగా ఖర్చు చేయడానికి సిద్ధపడే విదేశీయులకు మన దేశంలోని వసతులను పరిచయం చేయాలన్నారు. భారత్ అనగానే గుర్తొచ్చేలా కనీసం 50 పర్యాటక ప్రాంతాలను అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ రంగంలో లోటుపాట్లను సరిదిద్దుకోవాలని చెప్పారు. -
చక్కని ప్రణాళిక, మెరుగైన నగరాలు
న్యూఢిల్లీ: చక్కని ప్రణాళికతో నిర్మితమైన నగరాలే దేశ భవితను నిర్దేశిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో అలాంటి కనీసం 75 నగరాలను నిర్మించుకున్నా ప్రపంచ వేదికపై భారత్ ఎప్పుడో గొప్ప స్థాయికి చేరి ఉండేదన్నారు. కేంద్ర బడ్జెట్‌పై చర్చా పరంపరలో భాగంగా బుధవారం ‘పట్టణ ప్రణాళిక, అభివృద్ధి, పారిశుధ్యం’పై వెబినార్‌లో ఆయన మాట్లాడారు. దేశం శరవేగంగా పట్టణీకరణ చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్తుపై దృష్టిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమని నొక్కిచెప్పారు. ‘‘రాబోయే పాతికేళ్లలో దేశ ప్రగతి పట్టణ ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ‘‘మన నగరాలు వ్యర్థ, నీటి ఎద్దడి రహితంగా, అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఉండటం చాలా ముఖ్యం. చక్కని ప్రణాళిక అందుకు కీలకం. కొత్త నగరాల అభివృద్ధి, ఉన్నవాటి ఆధునికీకరణ కూడా పట్టణాభివృద్ధిలో కీలకమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల్లో పట్టణ ప్రణాళిక వ్యవస్థ బలోపేతం, ప్రైవేట్ రంగంలో నైపుణ్యాన్ని అందుకు సమర్థంగా వినియోగించుకోవడం, పట్టణ ప్రణాళికను అత్యున్నతంగా తీర్చిదిద్దే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మాణానికి ఏం చేయాలో దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రణాళిక సరిగా లేకున్నా, దాని అమలులో విఫలమైనా పెను సమస్యలకు దారి తీయడం ఖాయం’’ అని సూచించారు. పట్టణాభివృద్ధికి ఈ బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. టైర్–2, టైర్–3 నగరాల ప్రణాళిక, అభివృద్ధిలో పెట్టుబడులు పెరగాల్సిన అవసరముందన్నారు. -
వివాద్ సే విశ్వాస్ను ఆకర్షణీయంగా మార్చాలి
న్యూఢిల్లీ: బడ్జెట్లో భాగంగా ప్రకటించిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్పులు చేయాలని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు) ప్రభుత్వాన్ని కోరాయి. రీయింబర్స్మెంట్, వడ్డీ రేట్ల పరంగా ఆకర్షణీయంగా మార్చాలని ఎంఎస్ఎంఈలు కోరినట్టు ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. అంతేకాదు, బలమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఆన్లైన్లో ఉండాలని డిమాండ్ చేశాయి. బడ్జెట్ అనంతరం డీపీఐఐటీ ఏర్పాటు చేసిన వెబినార్‌లో భాగంగా ఈ అంశాలను ఎంఎస్ఎంఈలు లేవనెత్తాయి. టెక్నాలజీ వినియోగంతో వ్యాపార సులభతర నిర్వహణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. 2023–24 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎంఎస్ఎంఈలకు వివాద్సే విశ్వాస్ పథకాన్ని ప్రకటించారు. -
బడ్జెట్ ప్రకటనలపై ప్రధాని మోదీ వెబినార్లు
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో భాగంగా ప్రకటించిన పలు నిర్ణయాలపై భాగస్వాములతో ప్రధాని వెబినార్లు నిర్వహించనున్నారు. గురువారం గ్రీన్ గ్రోత్ పై తొలి వెబినార్ జరగనుంది. ఇందులో వ్యవసాయం, కోపరేటివ్ రంగాల భాగస్వాములతో ప్రధాని మాట్లాడనున్నారు. బడ్జెట్ తర్వాత ప్రధాని 12 వెబినార్లను నిర్వహించనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ నెల 23 నుంచి మార్చి 11 వరకు ఇవి జరుగుతాయని తెలిపింది. మౌలిక సదుపాయాలు, ఆర్థిక సేవల రంగం, ఆరోగ్యం, వైద్య పరిశోధనలు, మహిళా సాధికారత, ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ (పీఎం వికాస్) అంశాలపై ఈ వెబినార్లు నిర్వహించనున్నట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది. పలు మంత్రిత్వ శాఖలు, విభాగాలు వీటి నిర్వహణ బాధ్యతలు చూడనున్నాయి. బడ్జెట్లో ప్రకటించిన సప్షర్తి ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. బడ్జెట్ ప్రకటనలను సమర్థవంతంగా అమలు చేసేందుకు, భాగస్వాములు అందరి మధ్య సమన్వయం, ఏకతాటిపైకి తీసుకురావడంలో భాగంగా ఈ వెబినార్ల నిర్వహణకు ప్రధాని ఆమోదం తెలిపినట్టు ఆర్థిక శాఖ తెలిపింది. -
ధరల స్పీడ్‌ను నిలువరిస్తున్నాం..
జైపూర్: ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, ఈ అంశంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం అన్నారు. ఉదాహరణకు, దేశీయ ఉత్పత్తిని పెంచే దిశలో పప్పుధాన్యాలు పండించడానికి ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోందని తెలిపారు. అలాగే స్థానిక లభ్యతను మెరుగుపరచడానికి కొన్ని పప్పుధాన్యాలపై దిగుమతి సుంకాన్ని కూడా తగ్గించినట్లు పేర్కొన్నారు. వివిధ వర్గాలతో 2023 బడ్జెట్ తదుపరి చర్చాగోష్టి నిర్వహించడానికి ఇక్కడికి వచ్చిన ఆర్థిక మంత్రి విలేకరులతో ఇంకా ఏమన్నారంటే.. ‘‘గత మూడేళ్లుగా వంట నూనెల దిగుమతిపై దాదాపు పన్ను విధించడంలేదు. దీని కారణంగా పామ్ క్రూడ్, పామ్ రిఫైన్డ్ ఆయిల్ అందుబాటులో విఘాతం కలగడం లేదు. వంట నూనెల సరఫరా సులభతరం కావడంతోపాటు, డిమాండ్‌ను దేశం తేలిగ్గా ఎదుర్కొనగలుగుతోంది. ధరల స్పీడ్ ఇదీ... టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2023 జనవరిలో 4.73 శాతంగా (2022 ఇదే నెలతో ధరతో పోల్చి) నమోదయ్యింది. గడచిన రెండు సంవత్సరాల్లో ఇంత తక్కువ స్థాయి టోకు ధరల స్పీడ్ నమోదుకావడం ఇదే తొలిసారి. సూచీలో మెజారిటీ వెయిటేజ్ కలిగిన తయారీ, ఇంధనం, విద్యుత్ ధరలు తగ్గినా, ఫుడ్ ఆర్టికల్స్ బాస్కెట్ మాత్రం పెరిగింది. టోకు ధరల సూచీ వరుసగా ఎనిమది నెలల నుంచి తగ్గుతూ వస్తుండడం సానుకూల అంశమైనా, ఆహార ధరల తీవ్రతపై జాగరూకత వహించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరించారు. 10 నెలల అప్‌ట్రెండ్ తర్వాత నవంబర్, డిసెంబర్లో ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం లోపు ఉన్న వినియోగ ధలర సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో మళ్లీ 6.52 శాతం పైబడిన విషయాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు. ఈ సూచీలో ఒక్క ఫుడ్ బాస్కెట్ ధరల స్పీడ్ 5.94 శాతంగా ఉంది. ఆర్బీఐ ద్రవ్య, పరపతి విధానాలకు ముఖ్యంగా రెపోపై నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపది క అయిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4% గా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు), మే 4న మొదటిసారి 0.40% పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అర శాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఈ నెల మొదట్లో వరుసగా ఆరవసారి పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగినట్లయ్యింది. దీనితో రెపో మొత్తంగా 6.5 శాతానికి చేరింది. జనవరి రిటైల్ ధరల స్పీడ్ నేపథ్యంలో ఏప్రిల్‌లో జరిగే పాలసీ సమీక్షలో మరో పావు శాతం రెపో ఖాయమన్న విశ్లేషణలు ఉన్నాయి. రాష్ట్రాలకు ఎన్పీఎస్ నిధులు బదిలీ చేయలేం కాగా, నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) కోసం డిపాజిట్ అయిన నిధులను ప్రస్తుత చట్టాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు బదలాయించలేమని అటు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి వివేక్ జోషి కూడా స్పష్టం చేశారు. ‘‘ఏదైనా రాష్ట్రం ఎన్పీఎస్ కోసం డిపాజిట్ చేసిన నిధులను వారికి తిరిగి ఇవ్వవచ్చని ఆశించినట్లయితే అది అసాధ్యం’’ అని వారు స్పష్టం చేశారు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ఇటీవల భారీ పతనాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఉటంకిస్తూ, జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్) పెట్టుబడి పెట్టే షేర్ మార్కెట్ దయాదాక్షిణ్యాలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను వదిలివేయలేని పేర్కొన్నారు. ఎన్‌పీఎస్‌లో డిపాజిట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నిధులను రాష్ట్రాలకు కూడా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)కు నిధులను బదిలీ చేయకపోతే రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ మంత్రి, ఆ శాఖ సీనియర్ అధికారి నుంచి వచ్చిన ప్రకటనలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, పాత పెన్షన్ స్కీమ్‌కు తిరిగి వెళ్లడానికి కొన్ని రాష్ట్రాలు నిర్ణయించడం, ఇతర రాష్ట్రాల్లో ఈ డిమాండ్ పుంజుకోవడం మంచి పరిణామం కాదని ఆర్థిక కార్యదర్శి జోషి ఈ సందర్భంఆ స్పష్టం చేశారు. ‘‘కొత్త పెన్షన్ పథకంలోని డబ్బు ఉద్యోగులకు సంబంధించినది. ఇది ఉద్యోగి– ఎన్పీఎస్ ట్రస్ట్‌కు మధ్య ఒప్పందం. ఉద్యోగి మెచ్యూరిటీకి ముందు లేదా పదవీ విరమణ వయస్సు రాకముందే నిష్క్రమిస్తే, అప్పుడు అనుసరించాల్సిన విధానాలపై పలు నియమ నిబంధనలు అమల్లో ఉన్నాయి’’ అని ఆయన ఈ సందర్బంగా పేర్కొన్నారు. -
‘అదానీ’పై అదే దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ తొలి విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ముగిశాయి. రెండో విడత సమావేశాలు మార్చి 13న ప్రారంభం కానున్నాయి. అదానీ వ్యవహారంపై సోమవారం కూడా రాజ్యసభలో విపక్ష ఆందోళనలు కొనసాగాయి. సభ ప్రారంభానికి ముందే 14 విపక్ష పార్టీలు సమావేశమై దీనిపై చర్చించాయి. కాంగ్రెస్ సహా డీఎంకే, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, జేడీయూ తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. జేపీసీ గానీ సుప్రీం న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ కమిటీకి డిమాండ్ చేయాలని నిర్ణయించాయి. అనంతరం బీఆర్ఎస్ సహా పలు విపక్ష పార్టీల ఎంపీలు సభలో వాయిదా తీర్మానాలిచ్చారు. సభ ప్రారంభమైన వెంటనే ఈ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. జేపీసీకి డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దీనిపై ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ అభ్యంతరం తెలిపారు. జేపీసీ వేయాలని నినాదాలు చేస్తున్న 8 మంది సభ్యుల పేర్లను సైతం చదివి వినిపించారు. అయితే, వారిపై ఎలాంటి చర్యలను ప్రకటించలేదు. సభను నడిపేందుకు ఇది మార్గం కాదని, ఇప్పటికే చాలా సమయం వృథా అయిందని, సభ్యులు సహకరించాలని కోరారు. విపక్ష ఎంపీలు ఆందోళన విరమించకపోవడంతో సభను 11.50 గంటలకు వాయిదా వేశారు. సభ ఆరంభం అయ్యాక సైతం విపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో చివరికి మార్చి 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అదానీ గ్రూప్‌లో అవకతవకలు జరిగాయంటూ హిండెన్‌బర్గ్ సంస్థ ఇచ్చిన నివేదికపై ప్రతిపక్షాల ఆందోళనలతోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి భాగమంతా గడిచిన విషయం తెలిసిందే. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం, ఆ తర్వాత బడ్జెట్, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, సాధారణ బడ్జెట్‌పై చర్చ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం మినహా ఇతర కార్యకలాపాలేవీ జరగలేదు. -
బడ్జెట్లు మనుషుల కోసం కాదా?
కేంద్ర బడ్జెట్లో పరిశ్రమలు, పనిముట్లు, యంత్రాలు, కార్లు, ఇతర ప్రాణంలేని వస్తువుల ప్రస్తావనే అత్యధికం. ఈ ‘అమృత్ కాల్’ బడ్జెట్లో అమృతం ఉంది. అది మనుషులను బతికించేందుకు కాదు. మనుషులను నిరుపయోగంగా మార్చేసే సాంకేతిక విప్లవానికీ, ఆధునికీకరణ యంత్రాలకూ. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందు పార్లమెంటులో ఉంచే ఎకనామిక్ సర్వే ఉద్దేశ్యం మంచిదే. 2014–15 వరకు ‘సోషల్ సెక్టార్’ పేరుతో ఒక చాప్టర్ ఉండేది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, పిల్లలు, వారి సమస్యలు... పాత విధనాల సమీక్ష, కొత్త పథకాల రూపకల్పన ఆలోచనలు సంక్షిప్తంగా నైనా ఉండేవి. 2015–16 నుంచి ప్రకటిస్తున్న ఎకనామిక్ సర్వేలలో ఈ ‘సోషల్ సెక్టార్’ అధ్యాయం గల్లంతయ్యింది. ‘‘గత సంవత్సరం వందేళ్ళ భారత్’ పేరుతో ప్రవేశపెట్టిన బడ్జెట్ పునాదుల మీద ఆధారపడి ఈ ఏడాది బడ్జెట్ రూపొందింది. అభివృద్ధి ఫలాలను అన్ని ప్రాంతాలు, అందరు పౌరులకు ప్రత్యేకించి యువత, మహిళలు, రైతులు, వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు అందిస్తూ సంపన్న సమ్మిళిత పురోగతిని సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.’’ ఫిబ్రవరి ఒకటవ తేదీన పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అన్న మాటలివి. ఇవి మాటలే. బడ్జెట్ ప్రసంగం మొదటి పేరాలోని పలుకులివి. మిగతా ప్రసంగంలో ఎక్కడా ఆ మాటలకు సంబంధించిన ప్రస్తావనా లేదు; నిధుల కేటాయింపు అంతకన్నా లేదు. బడ్జెట్ ప్రసంగంలో ఎక్కువ భాగం పరిశ్రమలు, పనిముట్లు, యంత్రాలు, కార్లు, ఇతర ప్రాణంలేని వస్తు వుల ప్రస్తావనే అత్యధికం. ‘అమృత్ కాల్’ బడ్జెట్ అని పేరుపెట్టుకున్న ఈ బడ్జెట్లో అమృతం చాలా ఉంది. అయితే అది మనుషులను బతికించేందుకు కాదు. మనుషులను నిరుపయోగంగా మార్చేసే సాంకేతిక విప్లవానికీ, ఆధునికీకరణ యంత్రాలకూ. అంటే ప్రాణంలేని వస్తువులకు నిరుపయోగ, నిష్ఫలామృతం. ప్రభుత్వాలుగానీ, సంస్థలుగానీ, ఏదైనా బడ్జెట్ తయారు చేసు కునేటప్పుడు ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితులను అంచనా వేసుకొని, భవిష్యత్ బాగుకోసం పథకాలు రాసుకుంటారు. మనవాళ్ళు కూడా గతంలో ఆ సాంప్రదాయాన్ని పాటించారు. దానికే ‘ఎకనామిక్ సర్వే’ అని పేరుపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందు దీనిని పార్లమెంటు ముందుంచుతారు. ఎకనామిక్ సర్వే ఉద్దేశ్యం మంచిదే. అయితే 2014 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న సర్వే ఫార్మాట్ వేరు. ఆ తర్వాత దాని దారే వేరు. 2014–15 వరకు ‘సోషల్ సెక్టార్’ పేరుతో ఒక చాప్టర్ ఉండేది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, పిల్లలు, వారి సమస్యలు... ప్రగతి, పాత విధనాల సమీక్ష, కొత్త పథ కాల రూపకల్పన ఆలోచనలు సంక్షిప్తంగానైనా ఉండేవి. ఆశ్చర్యమేమి టంటే, 2015–16 నుంచి భారత ప్రభుత్వం ప్రకటిస్తున్న ఎకనామిక్ సర్వేలలో ఈ ‘సోషల్ సెక్టార్’ అధ్యాయం గల్లంతయ్యింది. దీనిని చాలా మంది ఆర్థిక వేత్తలు, బడ్జెట్ విశ్లేషకులు, ప్రతిపక్షాల పెద్దలతో సహా ఎవ్వరూ పట్టించుకున్నట్టు లేదు. అందరూ ఏదో లోకంలో ఉన్నారు. ‘అమృత్ కాల్’లో తేలియాడుతున్నారు. ఇది కేవలం అధ్యాయం గల్లంతు కావడం కాదు, ఆలోచనా సరళిలో లోపం. అందుకే ఈ బడ్జెట్లో గానీ, 2022 ఎకనామిక్ సర్వేలో గానీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలు, పిల్లలు కూడా దూరమయ్యారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం, సమాజ స్థితిగతులు పట్టినట్టు కనిపించదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ దృష్టి కోణం భిన్నమైనది. సైద్ధాంతికంగానే వీళ్ళు ఈ దేశంలో కులమనే ఒక వ్యవస్థ ఉన్నట్టుగానీ, దానివల్ల ఏర్పడిన, కొనసాగుతున్న అసమానతలు, వివక్ష, అణచివేత ఉన్నట్టుగానీ భావించరు. అందరూ హిందువులే అనే భావన వారికి. అందుకే ఎస్సీ, బీసీల ఉనికి, వారి గురించిన ప్రత్యేక సామాజిక స్థితిగతులు వాళ్ల ఎన్నికల ప్రణాళికల్లో, బడ్జెట్లో అంతగా ప్రస్తావనకు రావు. గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఈ వర్గాల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టిన దాఖలా లేదు. ప్రస్తుతం ఉన్న పథకాలను చాలా వాటిని నిర్వీర్యపరిచే పనికి కూడా పూనుకున్నారు. కేంద్రంలో ఎస్సీలు, బీసీలు, అనాథలు, దివ్యాంగుల కోసం కలిపి ఇప్పటికే ఒక మంత్రిత్వ శాఖ ఉన్నది. చాలామంది ప్రస్తుతం ఉన్న సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖను ఎస్సీల కోసమే ననుకుంటున్నారు. అది నిజం కాదు. అది ఎస్సీ, బీసీలకు కూడా. ఈ రెండు వర్గాలు కలిస్తే దాదాపు 65 శాతానికిపైగా ఉన్న సంగతిని కూడా ప్రభుత్వాలు మరచిపోయాయి. ఎస్సీ, బీసీలు కూడా మరిచి పోయారు. ఎస్సీ, బీసీలు కలిసి ఉన్న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కోసం ఇప్పటి వరకు బడ్జెట్లో కేటాయించిన నిధులను చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. 2015–16లో మొత్తం బడ్జెట్ 16 లక్షల 63 వేల కోట్లు కాగా, అందులో ఈ మంత్రిత్వ శాఖకు కేటాయించింది కేవలం 5,380 కోట్లు. అంటే ఇది 0.32 శాతం మాత్రమే. అదేవిధంగా 2016–17లో 17 లక్షల 90 వేల కోట్ల మొత్తం బడ్జెట్లో కేటాయించింది 5,752 కోట్లు మాత్రమే. ఇది కూడా 0.32 శాతం దాటలేదు. అట్లా 2017–18లో 0.33 శాతం, 2018–19లో 0.31 శాతం. అదేవిధంగా 2020–21లో 35 లక్షల 90æవేల కోట్ల బడ్జెట్లో ఈ మంత్రిత్వ శాఖకు కేటాయించింది కేవలం 8,065 కోట్లు. ఇది 0.23 శాతం. ప్రతి సంవత్సరం పెరగాల్సింది. కానీ దారుణంగా పడిపోయింది. ప్రతి ఏడాది ఆ మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు పెరుగుతున్నట్టు కనిపిస్తున్నది. కానీ దేశ బడ్జెట్ పెరుగుదలలో దానిశాతం పెరుగుతున్న దాఖలా లేదు. రాజ్యాంగం అందించిన హక్కు ప్రకారం ప్రారంభించిన– ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా కేటాయించిన నిధుల వినియోగం కూడా దారుణంగా ఉంది. గతంలో దీనిని ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌గా పిలిచే వాళ్ళు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్‌ను తొలగించి, దాని స్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పరిచారు. బడ్జెట్లో కూడా ప్లాన్, నాన్ ప్లాన్ పేర్లను తొలగించి రెవెన్యూ, క్యాపిటల్ అనే పదాలను మాత్రమే కొనసాగిస్తున్నారు. ప్లాన్, నాన్ ప్లాన్ లేనందువల్ల ఎస్సీ, ఎస్టీల కోసం ప్లాన్ నిధుల నుంచి కేటాయించాల్సిన వాటిని ఎస్సీ కాంపోనెంట్గా, ఎస్టీ కాంపో నెంట్‌గా పిలుస్తున్నారు. అయితే జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి నిధులను కేటాయించాలి. వాటి వివరాలను చూస్తే కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దళిత, ఆదివాసీ వ్యతిరేకత అర్థం కాగలదు. గత ఎనిమిదేళ్ళలో ఎస్సీ కాంపోనెంట్ కింది కేటాయించిన నిధులు సగానికి పైగా దారి మళ్ళినట్టు వారి లెక్కల్లోనే కనిపిస్తున్నది. ఇప్పటికే సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలు, సామాజిక వివక్షలు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీలను బాధిస్తున్నాయి. పేదరికం, ఆరోగ్యం, విద్య విషయంలో మిగతా సమాజానికీ ఎస్సీ, ఎస్టీలకూ మధ్య అగా«థం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకీ కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, యాంత్రీకరణ, ఆధునికీకరణ విధా నాలు ఈ వర్గాలను మొత్తంగానే సమాజ ప్రగతి నుంచి దూరం నెడు తున్నాయి. ఈ బడ్జెట్లో కొత్తదేమీ లేదుకానీ, కోట్లాది మంది యువతకు నైపుణ్యాల శిక్షణ ఇస్తామని ప్రకటించారు. ఈ నైపుణ్యాల శిక్షణ గురించిన గత అనుభవాలు అంత మంచి ఫలితాలను ఇచ్చినట్టు లేవు. సాంకేతిక, వృత్తిపరమైన నైపుణ్యాలతో కూడిన విద్యలు ప్రైవేట్ రంగంలో ఉంటాయి. ఇందులోకి ఎస్సీ, ఎస్టీ యువత వెళ్ళలేరు. ఎందుకంటే, అందులో రిజర్వేషన్లు లేవు. అందుకే బడ్జెట్లో భారత దేశ సమాజం కనిపించాలి. దేశంలో ఉన్న అసమానతలను తొలగించడానికి పూనుకోవాలి. కానీ ఆ ప్రయ త్నాలను ప్రభుత్వం చేస్తున్నట్టు కనిపించడం లేదు. నా ఉద్దేశ్యంలో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం ప్రత్యేకమైన పథకాలను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా లేదు. మొదట్లో చెప్పినట్లు దీనిని వాళ్లు అసలు సమస్యగానే చూడడం లేదు. ఇప్పుడు తమను తాము తరచి చూసుకోవాల్సింది ఆయా వర్గాలే. ప్రభుత్వాలు తమను పట్టించుకోకపోతే, ప్రజలు ఎందుకు ప్రభుత్వా లను పట్టించుకోవాలి? ఇదే ఇప్పుడు అందరూ ప్రశ్నించుకోవాల్సిన కీలకమైన సందర్భం. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
కోరమ్ లేక వాయిదా
న్యూఢిల్లీ: సభలో కోరమ్ లేకపోవడంతో లోక్‌సభ బుధవారం సాయంత్రం మరుసటి రోజుకు వాయిదా పడింది. కేంద్ర బడ్జెట్‌పై డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు మాట్లాడిన తర్వాత సభలో కోరమ్ లేదన్న విషయాన్ని అదే పార్టీ ఎంపీ దయానిధి మారన్ లేవనెత్తారు. దీనిపై స్పీకర్ ఓంబిర్లా స్పందించారు. కోరమ్ బెల్లు మోగించాలని సిబ్బందికి సూచించారు. తగిన సంఖ్యలో సభ్యులను సమీకరించడంలో ప్రభుత్వ ఫ్లోర్ మేనేజర్లు విఫలమయ్యారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. కోరమ్ అంటే? లోక్‌సభలోని మొత్తం సభ్యుల్లో కనీసం 10 శాతం మంది ఉంటేనే సభను నిర్వహించాలి. అంటే కనిష్టంగా 55 మంది సభ్యులు సభలో ఉండాలి. దీన్నే కోరమ్ అంటారు. -
ఏనాడో గాడితప్పిన కేంద్ర బడ్జెట్లు!
2023 సంవత్సర కేంద్ర బడ్జెట్ తీరుతెన్నుల్ని పరిశీలిస్తే– ‘అన్నం మెతుకునీ/ ఆగర్భ శ్రీమంతుణ్ణీ వేరు చేస్తే/ శ్రమ విలువేదో తేలిపోదూ?’ అని కవి అలిశెట్టి ప్రభాకర్ అంటించిన చురక జ్ఞాపకం వచ్చింది. దేశ ప్రజాబాహుళ్యం స్థితిగతుల్ని పాలకులు పరిశీలించకపోబట్టే శ్రమ విలువను 75 ఏళ్లుగా గణించలేకపోయారు. ప్రణాళికలకూ, ఆచరణలో అమలు చేయని అతిశయోక్తులకూ మాత్రం తక్కువేమీ లేదు! భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దేశీయ ప్రైవేటు సంస్థల పరం చేసి, లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ‘శంకరగిరి మాన్యాలు’ పట్టించడానికి అన్ని రకాలా సిద్ధమయింది పాలకవర్గం! ఇదే అదునుగా గాంధీజీ పేరిట ప్రారంభించిన ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని’ కాస్తా నీరు కార్చడానికి పాలకులు నడుం కట్టారు. దేశ తొలి ప్రధానమంత్రి పదవిలోకి రాక ముందు, దేశానికి స్వాతంత్య్రమనేది ఏ పరిస్థితుల్లో ‘నామమాత్రపు స్వాతంత్య్రం కూడా కాదో’ ఇలా స్పష్టం చేశారు: ‘‘ప్రత్యేక హక్కులనూ, స్వార్థ ప్రయోజనాలనూ అనుభవిస్తున్న ఏ ప్రత్యేక సంపన్న వర్గమూ తమ హక్కుల్ని తాముగా వదులుకున్నట్టు చరిత్రకు దాఖలాల్లేవు. సాంఘిక మార్పులు రావా లంటే ఒత్తిడి, లేదా బల ప్రయోగం అవసరం. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడమంటే అర్థం, ఈ స్వార్థ ప్రయోజనాలకు భరతవాక్యం పలకడమనే. విదేశీ ప్రభుత్వ పాలన తొలగి దాని స్థానంలో స్వదేశీ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఈ స్వార్థ ప్రయోజనాలను ముట్టకుండా అలాగే అట్టిపెడితే ఇక అది నామమాత్రపు స్వాతంత్య్రం కూడా కాదు’’. ఇంతకన్నా మరో గొప్ప సత్యాన్ని 1992లో సుప్రసిద్ధ అమెరికన్ పత్రిక ‘టైమ్’ ప్రకటించింది: ‘‘కమ్యూనిజం పతనం కావొచ్చు. కానీ క్యాపిటలిజమూ, ప్రజాస్వామ్యమూ శాశ్వతంగానూ, ప్రపంచ వ్యాప్తంగానూ జయప్రదం కాగలగవన్న గ్యారంటీ ఏమీ లేదు’’! ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం నాటికి పెరిగి పెద్ద మహమ్మారి రూపం దాల్చిన అమెరికా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ‘చిట్కా వైద్యాల’తో ఉపశమింప జేసుకోవడమే గానీ ఆ సంక్షోభ లక్షణాలు ఈ రోజుకీ సమసిపోలేదు. కనుకనే అమెరికా ఆశీర్వాదాలతోనే నెలకొన్న ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలలో అత్యున్నత స్థాయి అధికారిగా, సలహాదారుగా ఈ సంస్థలను విశ్వసించి రంగంలోకి దిగి ఎలాంటి దారుణానుభవం చూడవలసి వచ్చిందో వివరించారు డేవిసన్ బుధూ. ఇప్పటికీ అమెరికా, ప్రపంచబ్యాంకు సంస్థలను నమ్ముతున్న భారత నాయకులు డేవిసన్ బుధూ అనుభవాల నుంచి గుణపాఠం తీసుకోలేక పోతున్నారు. చివరికి ఆంగ్లో – అమెరికన్ సంస్థలే భారత ఆర్థిక వ్యవస్థను పాలకులు నిర్వహిస్తున్న తీరుపై వ్యంగ్యాస్త్రాలు వదులు తున్నా ‘మనసూ, చర్మం’ మందబారిపోయి దులిపేసుకునే దశలో ఉన్నారు. ఆసియా, ఆఫ్రికాలలో తన దారుణానుభవాలను డేవిసన్ ఇలా గుండె బరువుతో ప్రపంచం కళ్లముందుంచారు (బుధూ 1988లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ మైకేల్ కామ్డెసెస్కు రాసిన సుదీర్ఘ రాజీనామా): ‘‘మీరు లాటిన్ అమెరికా, కరేబియన్, ఆఫ్రికా దేశాల ప్రభుత్వాలకూ, ప్రజలకూ అందించమని నా చేతికి అందించిన వరల్డ్ బ్యాంక్ – ఐ.ఎం.ఎఫ్ సంస్కరణల ఔష ధాన్నీ, రకరకాల చిట్కాలనూ (బ్యాగ్ ఆఫ్ ట్రిక్స్) సంవత్సరాల తర బడిగా అందజేస్తూనే వచ్చాను. కానీ ఏళ్ల తరబడిగా ఈ దేశాల్లో గడించిన అనుభవం దృష్ట్యా నా పదవికి రాజీనామా చేస్తున్నాను. ఎందు కంటే, ఆకలితో అలమటిస్తున్న కోటానుకోట్ల సామాన్య ప్రజల రక్తంతో నా చేతులు రక్తసిక్తమయ్యాయి. మలినమై పోయిన ఈ నా చేతుల్ని కడుక్కోవడానికి నేను తీసు కున్న మంచి నిర్ణయమే ఈ రాజీ నామా. అయ్యా! కామ్డెసెస్ గారూ! ఈ దేశాల్లో మనం చేస్తున్న పనుల వల్ల పేదల రక్తం నదులై పారుతోంది. ఒక్కోసారి నాలో నేననుకుంటాను – ఐఎంఎఫ్ బ్యాంకుల తరఫున మీ పేరిట, మీకు ముందు పని చేసిన అధిపతుల పేరిట లేదా మీ అధికార ముద్రల చాటున నేను చేయ వలసి వచ్చిన పాపాలను కడిగేసుకోవడానికి మొత్తం ప్రపంచంలో దొరికే సబ్బులు కూడా ఏ మూలకూ చాలవని.’’ (ఎనఫ్ ఈజ్ ఎనఫ్: 1988). కాగా, కడిగి పారేసిన ఆ ‘సబ్బుల్ని’ ఇండియాలో మొదటగా పీవీ నరసింహారావు హయాంలో అందుకుంటే, వాటిని ఆంధ్రప్రదేశ్‌లో వాడి ప్రజలకు ‘టోపీ’ పెట్టడానికి ప్రయత్నించినవాడు ప్రపంచ బ్యాంక్ ‘పెంపుడు బిడ్డ’ చంద్రబాబు! ఇక భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దేశీయ ప్రైవేటు సంస్థల పరం చేసి, లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ‘శంకరగిరి మాన్యాలు’ పట్టించడానికి అన్ని రకాలా సిద్ధమయింది బీజేపీ పాలకవర్గం! ఇదే అదునుగా గాంధీజీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని’ నీరు కార్చడానికి పాలకులు నడుం కట్టారు. ఆ పథకం కింద కేటాయింపులన్నీ దారి మళ్లుతున్నాయి. పైగా 2023 బడ్జెట్ ఏడాది కాలపరిమితికి మించకపోయినా, దేశ స్వాతంత్య్రం వందేళ్లు పూర్తి చేసుకునే సమయానికి అంటే 2047 నాటి ‘లక్ష్యాల దిశగా ఈ బడ్జెట్ ఉంద’ని స్వయంగా ప్రధానమంత్రి ‘కోత’ కోయడాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఇండియా లాంటి వర్ధమాన దేశాలలోని కారుచౌక కూలీరేట్ల ఫలితంగా విదేశీ కంపెనీలు పోటీ మీద ఇండియాలో ప్రవేశించి, ఉద్యోగుల్ని తొలగించడం ఆనవాయితీగా మారింది. ఈ పరిస్థితిని అదుపు చేయకపోగా ఆ విధానాలనే ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు ఎసరు పెట్టడంలో పాలకులు అనుసరిస్తూ, ప్రైవేటు వారికి ‘ఆదర్శం’గా నిలుస్తున్నారు. దీన్ని ఎవరో కాదు, స్వయానా ‘అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్’ డైరెక్టర్ సి.ఫ్రెడ్ బెర్గ్స్టెన్ ఎదురు తన్నిన ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్ బ్యాక్లాష్) అని వర్ణించాల్సి వచ్చింది. ‘వ్యవస్థాగతమైన సర్దుబాట్లు అంటే, ‘ఖర్చులు తగ్గించుకుని ఉద్యోగాల నుంచి పౌరుల్ని తొలగించేయడమేనని బెర్గ్స్టెన్ స్పష్టం చేశాడు. స్విస్ బ్యాంకులు, తదితర విదేశీ బ్యాంకుల్లోకి దొంగ చాటుగా ప్రవేశించిన డబ్బును తిరిగి దేశంలోకి తెచ్చి దేశ ప్రజలకు కుటుంబం ఒక్కింటికి రూ. 15 లక్షల చొప్పున పంచుతామన్న పాల కులు ఆచరణలో మొండి చేయి చూపించడం మరపురాని అనుభవంగా మిగిలి పోయింది. ‘కోవిడ్’ వల్ల ప్రజా బాహుళ్యానికి కల్గిన నష్టం కన్నా దాని పేరిట జరిగిన మిలాఖత్ వ్యాపార లావాదేవీల వల్ల ప్రజ లకు వాటిల్లిన నష్టం ఎక్కువ. పోతన భాగవత కథల్లో ‘రహూగణుడ’నే ఒక అహంకారి ఉంటాడు. అతడెక్కిన పల్లకీ ఈ దేహమే. కానీ, దాన్ని మోసే బోయీలు ‘ఓంకారాన్ని’ వల్లిస్తూ నడుస్తారు, అలసట తెలియకుండా ఉండటం కోసం. పల్లకీలో కూర్చున్నవాడి ప్రయాణం మాత్రం సుఖంగానే సాగుతుంది. నేడు మన దేశ ప్రజల్ని పాలకులు పల్లకీ బోయీలుగా మార్చారు. నేటి దేశ వ్యవసాయ సంక్షోభానికి పాలకుల విధానాలు ఎలా దోహదం చేస్తున్నాయో ఆంత్రోపాలజిస్ట్ గ్లెన్ డేవిస్స్టోన్ వెల్లడించాడు: ‘‘పాలకులు వ్యవసాయం పేరిట వెచ్చిస్తున్న డబ్బంతా రైతాంగ శ్రేయస్సుకు కాదు, వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుతున్న పారిశ్రామిక వేత్తల శ్రేయస్సు కోసం’’.క్రీ.పూ. 2100 సంవత్సరంలోనే సుమేరియా ఏలికలు ఆర్థిక వ్యవస్థను ప్రజాపరం చేసి ఎలా ప్రజా బాహుళ్యాన్ని కరువు కాటకాలు లేకుండా కాపాడుతూ వచ్చిందీ చరిత్ర నమోదు చేసింది. బాబిలో నియా, ఈజిప్టులలో సహితం రాచరిక పాలనల్లోనూ ప్రజలు సుఖంగా జీవించారన్న చరిత్ర దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ భారత ప్రజలకు మసకబారని ఉషోదయాన్ని 75 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా పాలకులు ప్రసాదించగల స్థితిలో లేకపోవడం విషాదకరం. కరెన్సీ సంక్షోభం వల్లనే దేశ పరిస్థితులు ఒడుదొడుకుల్లో పడ్డా యని పాలకులు చెప్పే మాటలు విని సుప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారుడు ఆర్.కె. లక్ష్మణ్ గతంలో ఓ కార్టూన్ వేశాడు. ఆ కార్టూన్లో ఉన్న పేద లంతా పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ‘ఇది మనం పుట్టినప్పటి నుంచీ నోరు మూసుకుని అనుభవిస్తున్నదే కదరా’ అనుకుంటారు. ఆ తంతే 75 ఏళ్ల స్వతంత్ర భారతంలోనూ కొనసాగుతూండటం సిగ్గుచేటు. abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు -
టైర్–2, 3 నగరాలకు ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: ‘దేశంలోని టైర్ 2, టైర్ 3 నగరాలకు రూ. 10 వేల కోట్లు కేటాయింపు’.. బుధవారం కేంద్రం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఇది. దేశంలోని నగరాలను మహా నగరాలు, మెట్రో నగరాలు, మెగా సిటీలు, చిన్న సిటీలు అంటూ రకరకాలుగా పిలుస్తుంటాం. వీటిలో ఈ టైర్ 1, 2, 3.. ఇలా విభజన ఏమిటి?.. ఇదీ ఇప్పుడు జరుగుతున్న ఆసక్తికర చర్చ. అదేమిటో మనమూ ఓసారి చూద్దాం.. దేశంలో మహా నగరాలు, నగరాలు, పట్టణాలు చాలా ఉన్నాయి. వీటిలో ఏవి టైర్ 1, ఏవి టైర్ 2, టైర్ 3? వీటిని ఎలా విభజన చేస్తారన్న విషయంపై ఇప్పుడు అందరికీ ఆసక్తి నెలకొంది. ఈ ‘టైర్’ విధానం మొదట రియల్ ఎస్టేట్ రంగంలో 2007లో మొదలైంది. పది లక్షలు మించిన జనాభా ఉన్న నగరాలను టైర్ 1 గా, 5 లక్షల నుంచి 10 లక్షల మధ్య జనాభా ఉన్న సిటీలను టైర్ 2 సిటీలుగా, అంతకంటే తక్కువ జనాభా ఉన్న వాటిని టైర్ 3 గా పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ సైతం 5 వేల నుంచి లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాలు, నగరాలను ఆరు విభాగాలు (టైర్)గా ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో టైర్ 1 విభాగంలో 8 నగరాలు ఉన్నాయి. టైర్ 2 విభాగంలో 104 నగరాలు చేరాయి. మిగిలినవి టైర్ 3 కేటగిరీలో ఉన్నాయి. టైర్ 2, 3 నగరాల అభివృద్ధిపై దృష్టి కరోనా సమయంలో అనుసరించిన వర్క్ ఫ్రం హోం విధానంలోని ప్రయోజనాలను పరిశ్రమలు గ్రహించాయి. టైర్ 1 సిటీలుకంటే తమ పెట్టుబడులకు టైర్ 2 సిటీలు మేలని, వీటిలో జీవన వ్యయం తక్కువగా ఉండడంతోపాటు వర్క్–లైఫ్ మధ్య సమతుల్యత మెరుగ్గా ఉన్నట్టు గుర్తించాయి. పైగా, అనువైన ధరల్లో అద్దె ఇళ్లు లభ్యమవడం, ఖర్చులు కూడా బడ్జెట్లో ఉండటంతో ఈ సిటీలపై ఆసక్తి చూపుతున్నాయి. దాంతో టైర్ 2 సిటీల్లో మౌలిక వసతులు కల్పించడం ద్వారా మరిన్ని పెట్టుబడులు ఆకర్షించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. రాష్ట్రంలోని టైర్ 2 సిటీలైన విశాఖపట్నం, నెల్లూరులో పలు సాఫ్ట్వేర్ కంపెనీలు, అంతర్జాతీయ పరిశ్రమలు సైతం తమ వ్యాపారాలకు కేంద్రంగా ఎంచుకున్నాయి. టైర్ 2, 3 నగరాల్లో ప్రాధాన్యత రంగాలను ప్రోత్సహించేందుకు రూ.10 వేల కోట్లతో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (యూఐడీఎఫ్) ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రకటించారు. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉండే ఈ ఫండ్‌ను పట్టణ మౌలిక సదుపాయాల కోసం స్థానిక పట్టణ సంస్థలు ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రకారం రాష్ట్రాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రేడ్ 2 మున్సిపాలిటీలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. టైర్ 1 నగరాలివీ.. అధిక జనాభా, ఆధునిక వసతులతో ఉన్నవి టైర్ 1 (జెడ్ కేటగిరీ) విభాగంలోకి వస్తాయి. వీటిని మెట్రోపాలిటన్ నగరాలుగా పిలుస్తారు. భారతదేశంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మదాబాద్, పూణే టైర్ 1 విభాగంలో ఉన్నాయి. ఈ నగరాల్లో అధిక జనసాంధ్రతతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయాలు, పరిశ్రమలు, టాప్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, విద్య, పరిశోధన సంస్థలు ఉంటాయి. ఈ నగరాల్లో జీవన వ్యయమూ అధికంగా ఉంటుంది. వీటిని బాగా అభివృద్ధి చెందిన నగరాలుగా చెప్పవచ్చు. టైర్ 2 సిటీలు భారతదేశంలో 104 నగరాలు టైర్ 2 విభాగంలో ఉన్నాయి. ఇవి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు. అయితే, టైర్ 1, టైర్ 2 నగరాల మధ్య పెద్దగా తేడా లేదని అర్బన్ ప్లానర్లు, ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ నగరాల్లో జీవన శైలి, అభివృద్ధి వేగంగా జరుగుతుందని, జీవన వ్యయం మాత్రం టైర్ 1 సిటీలతో పోలిస్తే తక్కువగా ఉంటుందని అంచనా. పెట్టుబడులకు, అంతర్జాతీయ వ్యాపార సంస్థలకు ఈ నగరాలు అనువైనవిగా ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు, కర్నూలు టైర్ 2 సిటీలుగా ఉన్నాయి. టైర్ 3 నగరాలు అంటే.. టైర్ 2 ఉన్నవి తప్ప మిగిలిన నగరాలు, పట్టణాలను టైర్ 3 విభాగంలో చేర్చారు. ఒకవిధంగా చెప్పాలంటే గ్రేడ్ 2, 3 మున్సిపాలిటీలు వీటి పరిధిలోకి వస్తాయి. ఈ పట్టణాల్లో వసతులను మెరుగుపచడం ద్వారా పెట్టుబడులు ఆకర్షించవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. -
కారుణ్య బడ్జెట్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2023–24 బడ్జెట్ సకల జనుల బడ్జెట్‌గా ప్రశంసలందుకుంది. ఆర్థిక ఉత్పాతాలకు లోనయ్యే ఆదివాసీ బృందాలు, మహిళలు, యువత కోసం అనేక చర్య లను ప్రతిపాదించింది. కళాకారులకూ, హస్తకళాకారులకూ నిపుణతలు నేర్పించే పీఎం – వికాస్ వంటి పలు పథకాలను పేర్కొని తీరాలి. ఇవి 2047 నాటికి వికాస్ భారత్ లక్ష్యసాధనకు పునాది వేస్తాయి. 2023–24 కేంద్ర బడ్జెట్ దాని ఆదర్శాలకు సంబంధించి సాహసో పేతమైనదే, కానీ దాని గణన విధానంలో సాంప్రదాయికమైనది. దాని వ్యూహాల్లో ఆశావహమైనది, అయినప్పటికీ అది వాస్తవంలో బలమైన పునాదిని కలిగిఉంది. ఇది ప్రపంచ సూక్ష్మ ఆర్థిక ముఖ చిత్రం చుట్టూ ఉన్న అనిశ్చితత్వాలను విజయవంతంగా సంగ్రహించింది. భారత ఆర్థిక వ్యవస్థ అమృత్ కాల్ వైపు గమనం సాగిస్తున్నందున దానికి అవసరమైన దృఢత్వాన్ని పెంపొందించి, వృద్ధిని వేగవంతం చేయడానికి రోడ్ మ్యాప్‌ని అందించింది. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ (ప్రతి ఒక్కరితో, అందరి అభి వృద్ధి కోసం) అనే పంక్తులను అనుసరించిన ఈ బడ్జెట్ సకల జనుల బడ్జెట్‌గా ప్రశంసలందుకుంది. సమాజంలోని అన్ని వర్గా లకూ ఇది ఏదో ఒక అవకాశాన్ని ప్రతిపాదించింది. బడ్జెట్ అనే ఈ డాక్యుమెంట్ 2047లో భారత్ ఆకాంక్షిస్తున్న తరహా సమాజం గురించి ప్రధాని మోదీ ఇచ్చిన స్పష్టమైన దార్శనికతను వ్యక్తపరు స్తోంది. ఇండియా ఎట్ 100 (వందేళ్ల భారత్) సమగ్రత, సంపద్వంతం అనే స్తంభాలపై నిలబడుతుంది. అప్పుడు అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకు ప్రత్యేకించి మన యువత, మహిళలు, రైతులు, ఓబీసీలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలతో పాటు దేశంలోని పౌరులందరికీ చెందుతాయి. సమీకృత అభివృద్ధి, చివరి మైలురాయిని కూడా చేరుకోవడం అనే రెండు తొలి ప్రాధాన్యాల ద్వారా ఈ దార్శనికత ప్రతిఫలిస్తుంది. ఆర్థిక ఉత్పాతాలకు సులభంగా లోనయ్యే దుర్బలమైన ఆదివాసీ బృందాలు, మహిళలు, యువత కోసం; సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా వ్యాపారసంస్థల సాధికారత కోసం తాజా బడ్జెట్ చర్య లను ప్రతిపాదించింది. సాంకేతికతను, ఆర్థికాన్ని సమ్మిళితం చేయడం ద్వారా వ్యక్తులకు, స్థానిక పరిశ్రమలకు సాధికారత కల్పించడంపై తాజా బడ్జెట్ గట్టిగా దృష్టి పెట్టింది. మన యువతకు సాధికారత కల్పిస్తూ, అమృత్ పీఢీ (బంగారు తరం) తన శక్తిసామర్థ్యాలను వెలికితీయడంలో సహాయం చేసేందుకు తగిన విధానాలను అది రూపొందించింది. యువతకు, మహిళలకు, హస్తకళాకారులకు, స్వయం సహాయక బృందాలకు విస్తృతంగా ఉద్యోగాల కల్పన కోసం తగిన నైపుణ్యాల ప్రాధాన్యతపై అది దృష్టి పెట్టింది. సాంప్రదాయిక కళాకారులకు, హస్తకళా కారులకు నిపుణతలు నేర్పించడం కోసం ప్రధాన మంత్రి విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్ (పీఎమ్–వికాస్) వంటి పథకాలను ప్రత్యేకంగా పేర్కొ నాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని యువ పారిశ్రామికవేత్తల ద్వారా వ్యవసాయాధారిత అగ్రిస్టార్టప్లను ప్రోత్స హించడానికి అగ్రికల్చర్ ఆక్సిలేటర్ ఫండ్ కల్పన, ‘దేఖో అప్నా దేశ్ ఇనిషి యేటివ్’ కింద పర్యాటక రంగం కోసం ప్రత్యేక నైపుణ్యాలు, పారిశ్రామిక తత్వాన్ని పెంపొందించడానికీ బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చింది. 2023–24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 ద్వారా, అమృత్ పీఢీ కార్యక్రమం ద్వారా యువశక్తికి, ఆధునిక నైపుణ్య అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ పథకం కోడింగ్, కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి అంశాల్లో యువతకు నైపుణ్యాలను కల్పిస్తుంది. అంతేకాకుండా నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ ద్వారా ఉపకార వేతనాలు కూడా అందిస్తోంది. ఇలా రూపొందిన నిపుణ కార్మిక శక్తి నుండి పర్యాటక రంగం ప్రయోజనం పొందుతుంది. ఇక యువ పారిశ్రామికవేత్తలయితే ఒక జిల్లా, ఒక ఉత్పత్తి కార్యక్రమం ద్వారా ప్రతిపాదిత ‘యూనిటీ మాల్స్’ గుండా మార్కెటింగ్ మద్దతు కూడా పొందుతారు. బాహ్య ఎదురుగాలులను తట్టుకునేందుకుగాను బడ్జెట్ ఆశిస్తున్న శక్తి గుణకాల్లో ఇవి ఓ భాగం. అనిశ్చితమైన బాహ్య వాతావరణం ద్వారా ఎదురయ్యే సవాళ్లను బడ్జెట్ గుర్తించడమే కాదు, వృద్ధి పెంపుదలలో దేశీయ చోదకశక్తులు ఎంత కీలకమో ఎత్తి చూపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ భారత్ ఆర్థిక ప్రమా దాల నుంచి బయటపడటమే కాకుండా, 2023లో 7 శాతం, 2024 ఆర్థిక సంవత్సరంలో 6.6 లేదా 6.8 శాతం వృద్ధి రేటు అంచనాను నిలబెట్టుకునేలా ఆర్థిక వ్యవస్థను నడిపించింది. అంతర్జాతీయ ఉపద్రవాల నేపథ్యంలో కూడా, ఇప్పటికీ దృఢంగా ఉంటూ, దూసుకెళుతున్న దేశీయ చోదక శక్తుల ద్వారా ఆర్థిక వృద్ధి సాగుతోంది. కోవిడ్ అనంతర కాలంలో ప్రైవేట్ విని యోగం పెరగడం కూడా దీనికి తోడయింది. బహుముఖంగా సాగిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వల్ల కాంట్రాక్ట్ ఇన్సెంటివ్ సర్వీసు లపై వ్యక్తులు ఖర్చుపెట్టడం సాధ్యమైంది. ఇళ్లకు వెళ్లిపోయిన వలస కార్మికులు నగరాలకు తిరిగి రావడం, అధిక స్థాయిలో మూలధన వ్యయం (33 శాతం పెరుగుదలతో 10 లక్షల కోట్లకు పెరిగింది) పెరగడం, కార్పొరేట్ల ఆదాయ, వ్యయ సమాచార నివేదికలు బలపడటం వంటివి వీటిలో కొన్ని. దీనికి అనుగుణంగా వ్యవసాయం, టూరిజం, మౌలిక వ్యవస్థాపన వంటి వాణిజ్యేతర రంగాలపై బడ్జెట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. పైగా పర్యా వరణం, గ్రీన్ ఎకానమీ వంటి క్రాస్ కటింగ్ థీమ్‌లు (ప్రధాన లక్ష్యంపై గురి తప్పకుండానే అనుబంధ అంశా లపై దృష్టి పెట్టడం) కూడా బడ్జెట్ లోకి వచ్చాయి. ప్రభుత్వ విధాన రోడ్ మ్యాప్‌లో సుస్థిరాభివృద్ధికి కేంద్ర స్థానం. అదేవిధంగా ‘పంచామృత్’ (అయిదు ప్రతి జ్ఞలు), ‘మిషన్ లైఫ్’ (పర్యావరణ అనుకూల జీవన శైలి), నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, (రూ.19,700 కోట్ల బడ్జెట్ కేటాయింపులు), కాలం చెల్లిన వాహనాల తొలగింపు విధానం, చెత్త నుంచి సంపదను సృష్టించే 500 వందలకు పైగా నూతన ప్లాంట్లను నెలకొల్పే గోవర్ధన్ స్కీమ్ (10,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు), తీరప్రాంత నివాసాల రక్షణ కోసం మడ అడవుల పెంపకం, ప్రత్యక్ష ఆదాయ పథకం వంటి వాటి గురించి 2023–24 బడ్జెట్లో నొక్కి చెప్పడమైనది. సొంత చొరవ, కార్యకలాపాల ద్వారా నీతి ఆయోగ్ లక్ష్యాల సాధన కోసం ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ గణనీయ స్థాయిలో మార్గదర్శకత్వాన్ని అందజేస్తుంది. స్టేట్ సపోర్ట్ మిషన్ ద్వారా నీతి ఆయోగ్ మరింత నిర్మాణాత్మక, సంస్థాగత పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాలతో తాను వ్యవహరించే తీరును మరింత మెరుగుపర్చుకోవడాన్ని కొనసాగిస్తుంది. మరోవైపున నీతి ఆయోగ్ నేతృత్వంలోని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ (ఆకాంక్ష జిల్లాలు) ప్రోగ్రామ్ విజయం గురించి, ఇటీవలే ప్రారంభించిన ఆస్పి రేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్లలోని సామర్థ్యం గురించి కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నొక్కి చెప్పారు. ఈ పరివర్తనా కార్య క్రమం ద్వారా నీతి ఆయోగ్ దేశవ్యాప్తంగా 500 బ్లాక్‌ల లోని(సమితులలోని) పౌరుల జీవన నాణ్యతను పెంపొందించడానికి పాలనను మెరుగుపర్చ డంపై కూడా దృష్టి పెడుతుంది. ఇవి, మరికొన్ని కార్యకలాపాలు... 2047 నాటికి వికాస్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యసాధన వైపుగా... మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలతో సహకా రాత్మక చర్యకు పునాది వేస్తాయి. సుమన్ బెరీ వ్యాసకర్త నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ -
సీతమ్మా.. దయ ఏదమ్మా!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు అరకొర కేటాయింపులతో కేంద్ర బడ్జెట్ ఉసూరుమనిపించింది. ప్రధానంగా పలు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు దండిగా నిధులు వస్తాయనే ఆశలపై నీళ్లు చల్లింది. కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారమే పార్లమెంటులో ప్రవేశపెట్టినా.. రైల్వే కేటాయింపులపై శుక్రవారం రాత్రికి కానీ స్పష్టత రాలేదు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పలు కీలక డిమాండ్లకు ఈ బడ్జెట్లో మోక్షం లభించలేదు. కొన్నింటిని అరకొర కేటాయింపులతో సరిపెట్టారు. కీలకమైన కోటిపల్లి – నర్సాపురం రైల్వే లైను నిర్మాణానికి ఈ బడ్జెట్లో రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే ఈ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్లో కనీసం నాలుగైదు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తారని ఆశ పడ్డారు. 22 ఏళ్ల క్రితం రూ.645 కోట్లతో మొదలైన ఈ రైల్వే లైన్ అంచనా వ్యయం ప్రస్తుతం రూ.2,892 కోట్లకు పెరిగింది. దీనికి తగినట్టుగా కేటాయింపులు లేవని కోనసీమ వాసులు పెదవి విరుస్తున్నారు. కేటాయింపులు ఎక్కువగా ఉంటాయని, 57 కిలోమీటర్ల రైల్వే లైను కోసం గౌతమి, వశిష్ట, వైనతేయ గోదావరి పాయలపై నిర్మాణంలో ఉన్న మూడు వంతెనల పనులు వేగం అందుకుంటాయని అందరూ ఆశించారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కేటాయించిన రూ.100 కోట్లు ఏ మూలకు వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఆశించిన స్థాయిలో కేటాయింపులు చేస్తే వైనతేయపై బోడసకుర్రు – పాశర్లపూడి మధ్య మందకొడిగా జరుగుతున్న తొమ్మిది పిల్లర్ల పనులు ఊపందుకునేవని అంటున్నారు. పెండింగ్‌లో ఉన్న 528 ఎకరాల భూసేకరణకు కూడా ఈ కేటాయింపులు సరిపోవనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వాసులను దశాబ్దాలుగా ఊరిస్తున్న కాకినాడ – పిఠాపురం మెయిన్ లైన్ ఊసే బడ్జెట్లో లేకుండా పోయింది. ఈ రైల్వే లైను కోసం నాలుగు దశాబ్దాలుగా అలుపెరగని ప్రయత్నం చేస్తున్నా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కనికరించ లేదు. కాకినాడ మెయిన్ లైన్ నిర్మాణానికి రూ.40 కోట్లతో 22 ఏళ్ల క్రితమే గ్రీన్ సిగ్నల్ లభించింది. కాకినాడ పోర్టు ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు భారీ ఆదాయం వస్తున్నా మెయిన్ లైన్ నిర్మాణం అంశాన్ని బడ్జెట్లో ప్రస్తావించకుండా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని పలువురు అంటున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజలు రాములోరి సన్నిధికి వెళ్లేందుకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొవ్వూరు – భద్రాచలం రైల్వే లైనుకు కేవలం రూ.20 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులిపేసుకున్నారు. 151 కిలోమీటర్ల నిడివి కలిగిన ఈ ప్రాజెక్టును 2012–13లో రూ.1,445 కోట్లతో ఆమోదించారు. అనంతరం అంచనాలు రూ.2,154.83 కోట్లకు చేరాయి. దీనికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడంపై ఈ ప్రాంత వాసులు కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్త రైళ్లకు హాల్టులు సహా పలు ప్రాజెక్టులపై ఈ బడ్జెట్లో ఎటువంటి స్పష్టతా కనిపించలేదు. -
సాక్షి కార్టూన్ 03-02-2023
-
Union Budget 2023-24: కొత్త పన్ను విధానం ఆకర్షణీయం
న్యూఢిల్లీ: నూతన పన్ను విధానం 2023–24 బడ్జెట్‌తో ఆకర్షణీయంగా మారినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు ఇది ప్రయోజనకరమని, తక్కువ పన్ను రేటును వారు ఆస్వాదిస్తారని చెప్పారు. బడ్జెట్ అనంతరం ఓ వార్తా సంస్థతో గుప్తా మాట్లాడారు. తగ్గింపులు, మినహాయింపులను క్రమంగా దూరం చేయడం కోసమే నూతన పన్ను విధానంలో (మినహాయింపుల్లేని) కొత్త శ్లాబులు, రేట్లు ప్రకటించడానికి కారణంగా పేర్కొన్నారు. దీని ద్వారా వ్యక్తులు, సంస్థలపై పన్ను రేట్లు తగ్గించాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌ను చేరుకోవడం సాధ్యపడుతుందన్నారు. ‘‘నూతన పన్ను విధానాన్ని రెండేళ్ల క్రితం (2020–21 బడ్జెట్లో) ప్రతిపాదించాం. అయినప్పటికీ తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం శ్లాబులను మార్చింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు రేట్లు, శ్లాబులు ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతాయి’’అని చెప్పారు. కార్పొరేట్ విభాగంలో పన్ను చెల్లింపుదారులకు ఇదే మాదిరి చర్యలను కొంత కాలం క్రితం ప్రకటించగా, వారికి ప్రయోజనకరంగా మారినట్టు గుప్తా తెలిపారు. నూతన పన్ను విధానంతో లబ్ధి పొందని వర్గాలు చాలా తక్కువన్నారు. దీనిలో స్టాండర్డ్ డిడక్షన్ కల్పించినందున, అది పాత విధానంలోని ప్రయోజనాలకు ఏ మాత్రం తీసిపోదన్నారు. పన్ను చెల్లింపు దారుల ఇష్టమే.. నూతన పన్ను విధానం డిఫాల్ట్ (ప్రమేయం లేని)గా ఉంటున్నందున, పాత పన్ను విధానంలో ఉన్నవారిపై ప్రభావం పడుతుందా? అన్న ప్రశ్నకు.. ఏ విధానం అయినా ఎంపిక చేసుకుని రిటర్నులు దాఖలు చేసే స్వేచ్ఛ పన్ను చెల్లింపుదారులకు ఉంటుందని నితిన్‌గుప్తా చెప్పారు. కావాలంటే పాత పన్ను విధానానికి కూడా మారిపోవచ్చన్నారు. ‘‘డిఫాల్ట్ అంటే ఫైలింగ్ పోర్టల్ స్క్రీన్‌పై ముందు కనిపిస్తుంది. కానీ, అక్కడ ఏ పన్ను విధానం అనే ఆప్షన్ ఉంటుంది. కావాల్సిన విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు’’అని గుప్తా వివరించారు. ఏ వర్గం పన్ను చెల్లింపుదారులను కూడా నిరుత్సాహపరచబోమన్నారు. నూతన పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు పన్ను చెల్లించే అవకాశం లేకుండా రిబేట్ కల్పించడం తెలిసిందే. దీనికి అదనంగా రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కూడా ప్రకటించారు. పాత విధానంలో అయితే రూ.5 లక్షలకు మించిన ఆదాయంపై 20% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే వివిధ సెక్షన్ల కింద తగిన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతిమంగా కొత్త విధానమే తక్కువ పన్ను రేట్లతో, మినహాయింపుల్లేని, సులభతర పన్నుల విధానానికి (నూతన పన్ను విధానం) మళ్లడమే ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు. రెవెన్యూ శాఖ నిర్వహించిన విశ్లేషణ ప్రకారం ఏటా రూ.15 లక్షలు ఆర్జించే వ్యక్తి పాత పన్ను విధానంలో రూ.3.75 లక్షల వరకు క్లెయిమ్‌లు పొందొచ్చని.. కానీ, తక్కువ పన్ను రేట్లతో దీనికి ప్రత్యామ్నాయ పన్నుల విధానాన్ని ప్రతిపాదించినట్టు చెప్పారు. నూతన పన్ను విధానం తప్పనిసరి చేయడానికి ఎలాంటి గడువు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. -
వామ్మో..రికార్డు స్థాయికి బంగారం ధర, కారణాలేంటో తెలుసా?
సాక్షి, ముంబై: బంగారం ధర మరోసారి రికార్డు హైకి చేరింది.యూనియన్ బడ్జెట్లో దిగుమతి సుంకం పెంపునకు తోడు యూఎస్ ఫెడ్ నిర్ణయం కూడా బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తోంది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంపు, ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యల నేపథ్యంలో అంతర్జాతీయంగా పసిడి ధరలు రివ్వున దూసుకెళ్లి గురువారం తాజా రికార్డులను తాకాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో గోల్డ్ ధర రూ. 58,826 వద్ద ట్రేడవుతోంది. బుధవారం నాటి ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్లను 25 బీపీఎస్ పాయింట్ల మేర పెంచింది. ఫలితంగా అమెరికా కరెన్సీ డాలర్ 9 నెలల కనిష్టస్థాయికి దిగజారింది. దీని ఫలితమే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల ర్యాలీకి కారణమని బులియన్ పండితులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో, స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1,951.79 డాలర్ల స్థాయి కి పెరిగింది, ఏప్రిల్ 2022 నుండి ఇదు అత్యధిక స్థాయి. దేశీయంగా హైదరాబాద్ మార్కెట్లో 600 రూపాయలు ఎగిసిన 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 53, 600 గాను, 8 గ్రాముల బంగారం ధర రూ. 42,880 గాను ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 650 పెరిగి రూ. 58,470 గా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర రూ. 58,470గా, 8 గ్రాముల బంగారం ధర రూ. 46,776 గాను, బడ్జెట్ 2023లో బంగారం, ప్లాటినం డోర్, బార్లతో సమానంగా సిల్వర్ డోర్, బార్లు,వస్తువులపై సుంకాన్ని పెంచాలని ప్రతిపాదించింది. వెండిపై దిగుమతి సుంకం, 7.5 నుంచి 10 శాతానికి పెంపు, అలాగే 5 శాతం వ్యవసాయం, మౌలిక సదుపాయాల సెస్‌తో పాటు, మొత్తంగా 15శాతం నికర సుంకాన్ని వసూలు చేయనున్నారు. అలాగే దిగుమతి చేసుకున్న బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాలు, వస్తువులపై దిగుమతి సుంకం 20శాతం 25 శాతానికి పెరిగింది. -
కేంద్ర బడ్జెట్: చదివింపులు 1.12 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఈసారి విద్యా రంగానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.1,12,898.97 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు విద్యాశాఖకు ఇవే అత్యధిక కేటాయింపులు కావడం గమనార్హం. పాఠశాల విద్యకు రూ.68,804.85 కోట్లు కేటాయించగా ఉన్నత విద్యకు రూ.44,094.62 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో విద్యా రంగానికి రూ.1,04,277.72 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాలు ఉన్నత విద్యకు రూ.40,828.35 కోట్లు, పాఠశాల విద్యకు రూ.59,052.78 కోట్లుగా ఉన్నాయి. మేక్ ఏఐ ఇన్ ఇండియా, మేక్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా కలను సాకారం చేసే లక్ష్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి మూడు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలు అత్యున్నత విద్యాసంస్థల్లో ఏర్పాటు కానున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, రవాణా రంగాల్లో మెరుగైన సేవలు అందించేలా ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో వంద ల్యాబ్‌లు ఏర్పాటవుతాయి. నేషనల్ డిజిటల్ లైబ్రరీని నెలకొల్పి నాణ్యమైన పుస్తకాలను అందుబాటులోకి తెస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జాతీయ నూతన విద్యావిధానాన్ని (ఎన్ఈపీ 2020) చిత్తశుద్ధితో అమలు చేసే లక్ష్యంతో కేంద్ర పరిధిలోని అత్యుత్తమ విద్యాసంస్థలు, యూనివర్సిటీలకు ఈసారి రూ.4,235.74 కోట్లు అదనంగా కేటాయించనున్నారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి 12.8 శాతం నిధులు అదనంగా కేటాయించారు. యూజీసీకి గ్రాంట్లను రూ.459 కోట్లు పెంచారు. సెంట్రల్ యూనివర్సిటీలకు 17.66 శాతం, డీమ్డ్ యూనివర్సిటీలకు 27 శాతం గ్రాంట్లు పెరిగాయి. గతేడాది బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఐఐటీలకు 14 శాతం, ఎన్ఐటీలకు 10.5 శాతం పెరిగాయి. మెరుగ్గా ఉపాధ్యాయ శిక్షణ వినూత్నంగా పెడగాగి అంశాలు, కరిక్యులమ్‌లో మార్పులు, నిరంతర నైపుణ్యాల అభివృద్ధి తదితరాలతో ‘డైట్’కేంద్రాలను సరికొత్తగా ఆవిష్కరించి టీచర్ శిక్షణను మరింత మెరుగ్గా తీర్చిదిద్దనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 38,800 ఉపాధ్యాయ, సహాయ సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. రానున్న మూడేళ్లలో 740 ఏకలవ్య స్కూళ్లలో 3.5 లక్షల మంది ఆదివాసీ విద్యార్థులకు మెరుగైన బోధన అందించేలా నియామకాలు చేపట్టనున్నారు. ఏకలవ్య రెసిడెన్సియల్ స్కూళ్లకు బడ్జెట్లో రూ.5,943 కోట్లు కేటాయించారు. వజ్రాల తయారీ రీసెర్చ్‌కు గ్రాంట్ ల్యాబ్‌ల్లో వజ్రాల తయారీ (ఎల్జీడీ) టెక్నాలజీకి ఉన్న విస్తృత ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని దేశీయంగా ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఓ ఐఐటీకి ఐదేళ్ల పాటు రీసెర్చ్ గ్రాంట్ అందచేస్తామని ప్రకటించారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 విద్యా రంగంలో డిజిటల్ విధానాలను ప్రోత్సహిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు పెద్దపీట వేయటాన్ని ఎడ్టెక్ సంస్థలు స్వాగతిస్తున్నాయి. డిజిటల్ విప్లవం దిశగా దీన్ని కీలక చర్యగా అభివర్ణిస్తున్నాయి. డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు ఎడ్టెక్ రంగానికి సరికొత్త ఊపునిస్తుందని జడ్ఏఎంటీ సంస్థ వ్యవస్థాపకుడు ఆరుల్ మాలవీయ పేర్కొన్నారు. విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యతకు బడ్జెట్లో గుర్తింపు లభించిందని చెప్పారు. ఎడ్టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యేందుకు తాజా చర్యలు దోహదం చేస్తాయన్నారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకునేందుకు మానవ వనరులపై నిధులు వెచ్చించాల్సిన అవసరాన్ని బడ్జెట్ చాటి చెప్పిందని కూ ఇండియా, కీ బ్రిడ్జి గ్లోబల్ ఎడ్యుకేషన్ సహ వ్యవస్థాపకుడు అమోద్ దని చెప్పారు. నిత్య జీవితంలో భాగంగా మారిపోయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలను పెంపొందించే దిశగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు కృషి చేస్తాయని ఫిజిక్స్‌వాలా కో ఫౌండర్ ప్రతీక్ మహేశ్వరి పేర్కొన్నారు. మహిళా, శిశు సంక్షేమమే ధ్యేయం న్యూఢిల్లీ: కీలకమైన మహిళా, శిశు సంక్షేమ శాఖకు తాజా బడ్జెట్లో కేంద్రం రూ.25,448.75 కోట్లు కేటాయించింది. గత ఏడాది కంటే ఇది రూ.267 కోట్లు అధికం కావడం విశేషం. మహిళా, శిశు సంక్షేమమే ధ్యేయంగా కేటాయింపులను పెంచినట్లు తెలుస్తోంది. 2022–23లో ఈ శాఖకు రూ.25,172.28 కోట్లు కేటాయించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో మహిళల కోసం ముఖ్యమైన ప్రకటన చేశారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్’ను ప్రతిపాదించారు. దీనికింద పొదుపు చేసిన మొత్తంపై రెండేళ్ల కాలానికి రూ.7.5 శాతం వడ్డీరేటు చెల్లిస్తారు. మహిళ లేదా ఆడ శిశువు పేరిట డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.2 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. పాక్షికంగా ఉపసంహరించుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇదొక చిన్న తరహా పొదుపు పథకం. మహిళ ఆర్థిక సాధికారత కోసం ‘దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన–నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్’కింద గ్రామీణ మహిళలతో 81 లక్షల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఒక్కో సంఘంలో వేలాది మంది మహిళలు ఉంటారని తెలిపారు. ఉత్పాదక సంస్థల ద్వారా ఆర్థిక సాధికారత సాధించడమే ఈ సంఘాల లక్ష్యమని వివరించారు. మహిళా రైతులకు రూ.54,000 కోట్ల లబ్ధి పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి కింద చిన్న, సన్నకారు రైతులకు రూ.2.25 లక్షల కోట్లు బదిలీ చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. ఇందులో 3 కోట్ల మంది మహిళా రైతులు రూ.54,000 కోట్ల మేర లబ్ధి పొందుతారని తెలియజేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖకు బడ్జెట్లో రూ.25,448.75 కోట్లు కేటాయించగా, ఇందులో సాక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0 పథకాలకు రూ.20,554.31 కోట్లు, మిషన్ వాత్సల్యకు రూ.1,472 కోట్లు, మిషన్ శక్తికి రూ.3,143 కోట్లు కేటాయించారు. అలాగే సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ(సీఏఆర్ఏ), నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్(ఎన్సీపీసీఆర్), నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ తదితర స్వయం ప్రతిపత్తి కలిగిన విభాగాలకు రూ.168 కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే ఇది రూ.4 కోట్లు అధికం. పెట్టుబడి పరిమితి రెట్టింపు సీనియర్ సిటిజెన్ సేవింగ్ పథకం(ఎస్సీఎస్ఎస్)లో గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉండగా, ఈ పరిమితిని రూ.30 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాగే పోస్టల్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ సింగిల్ అకౌంట్లో ఇకపై గరిష్టంగా రూ.9 లక్షలు (ప్రస్తుతం రూ.4.5 లక్షలు) పెట్టుబడి పెట్టొచ్చని అన్నారు. జాయింట్ అకౌంట్లో గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చని సూచించారు. ఇవి పెట్టుబడికి ఎలాంటి రిస్క్ లేకుండా వడ్డీ అందించే పథకాలు. -
సోషల్ మీడియాను ముంచెత్తిన బడ్జెట్ మీమ్స్
2023–24 బడ్జెట్‌పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పోస్టు చేసిన మీమ్స్ అందరినీ నవ్వుల్లో ముంచెత్తాయి. ముఖ్యంగా మిడిల్ క్లాస్, వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితి, సిగరెట్లపై వా రు చేసిన మీమ్స్ ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్‌గా ని లిచాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ న్ బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టే ముందే మొదలైన మీమ్స్ హడావుడి... మధ్యతరగతికి ఆదాయపరిమితి పెంపు ప్రతిపాదనతో పతాక స్థాయికి చేరాయి. అలాగే సిగరెట్లపై 16% పన్ను పెంపు ప్రతిపాదనతో నిరాశ చెందిన పొగరాయుళ్లు పెట్టి న మీమ్స్ కూడా ట్రెండ్ అయ్యాయి. అయితే ఐటీ పరిమితి పెంపు కొత్త పన్ను విధానానికి వర్తిస్తుందని నిర్మల ప్రకటించడంపై చాలా మంది నెటిజన్లను అయోమయానికి గురిచేసింది. ఈ పన్ను విధానంపై కొందరు హర్షం వ్యక్తం చేస్తూ మీమ్స్ పెట్టగా మరికొందరు మాత్రం తమకు ఏమీ అర్థం కాలేదన్న సంకేతాన్ని మీమ్స్ రూపంలో పోస్టు చేశారు. -
బడ్జెట్లో మధ్యతరగతి కుటుంబానికి ఒరిగిందిదే..!
కేంద్ర బడ్జెట్ మీద గంపెడాశలు పెట్టుకున్న ఓ సగటు మధ్య తరగతి కుటుంబానికి దక్కింది చాలా తక్కువే. ఒకట్రెండు హామీలు తప్పితే మిగతావన్నీ చేదుగుళికలే. ‘‘నేనూ మధ్యతరగతి వ్యక్తినే. ఈ వర్గం ప్రజలపై ఉండే ఒత్తిళ్లు నాకూ తెలుసు. వాటిని అర్థం చేసుకోగలను’’ అని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలతో బడ్జెట్లో మిడిల్ క్లాస్ మెలోడీస్ విని పిస్తాయని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే ఆదాయ పన్ను మినహాయింపు, కాసింత సేవింగ్స్, కూసింత ఎంటర్టైన్మెంట్ తప్ప మిగిలిన వాటిల్లో నిరాశే మిగిలింది. – సాక్షి, నేషనల్ డెస్క్ ఉద్యోగి కరోనా తర్వాత బతుకు భారమైపోయింది. ఆదాయాన్ని మించిపోయేలా ఖర్చులు తడిసిమోపెడయ్యాయి. సగటు వేతన జీవి ఆదాయ పన్ను పరిమితివైపే ఆశగా చూశాడు. ఈ విషయంలో కాస్తో కూస్తో ఊరట కలిగింది. ఏడాదికి రూ.7 లక్షలు అంటే నెలకి రూ.60 వేల సంపాదన ఉన్నవారు ఆదాయ పన్ను కట్టాల్సిన పని లేదు. ఈ కొత్త బడ్జెట్ ద్వారా వారికి నెలకి రూ.2800 వరకు మిగులుతుంది. పెరిగిపోతున్న ధరాభారానికి అదేమంత పెద్ద మొత్తం కాదని అందరూ పెదవి విరుస్తున్నారు. ఒక కుటుంబం కొనుగోలు శక్తిని మరింత పెంచకుండా దేశ ఆర్థిక వృద్ధి రేటుపై మోయలేని లక్ష్యాలు పెట్టుకొని ఏం ప్రయోజనమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీనియర్ సిటిజన్ సీనియర్ సిటిజన్లకి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ స్కీమ్ పరిమితిని ఒకేసారి రెట్టింపు చేస్తూ నిర్ణయం ప్రకటించారు. సీనియర్ సిటిజన్లు తమ పేరు మీద ఇన్నాళ్లూ రూ.15 లక్షల డిపాజిట్లు చేసుకోవచ్చు. ఇప్పుడు దానిని రూ.30 లక్షలకు పెంచారు. కరోనా సమయంలో రైలు ప్రయాణంలో సీనియర్ సిటిజన్లకి 50శాతం కన్సెషన్ ఉండేది. దానిని ఎత్తేస్తారని ఆశగా ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది. నిర్మలక్క ఆ ఊసు కూడా ఎత్తలేదు. సొంతిల్లు సొంతిల్లు అనేది మధ్య తరగతికి కల. ఏదున్నా లేకున్నా తలదాచుకోవడానికి ఒక గూడు ఉండాలని అనుకుంటారు. ఈ మధ్య కాలంలో ఆర్బీఐ రెపో రేట్లు సవరించిన ప్రతీసారి గృహ రుణాల వడ్డీ రేటు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ సారి బడ్జెట్లో వడ్డీ రేట్లు తగ్గింపు వంటి వాటిపై ఏమైనా ప్రకటనలుంటాయేమోనని, ఆదాయ పన్ను మినహాయింపులో గృహ రుణాలు తీసుకున్న వారి పరిమితిని పెంచుతారని ఆశపడ్డారు. కానీ ఆర్థిక మంత్రి ఆ ఊసే ఎత్తలేదు. అయితే నిరుపేదల కోసం నిర్మించే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకానికి 66% నిధుల్ని పెంచుతూ మొత్తంగా 79 వేల కోట్లు కేటాయించారు. మహిళ ఆదాయాన్ని పొదుపుగా వాడుకుంటూ ఇల్లు నడిపే మహిళల కోసం ప్రకటించిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఒక వరం. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు నానాటికీ తీసికట్టుగా మారిపోతున్న నేపథ్యంలో మహిళలకి 7.5% స్థిర వడ్డీరేటుని కల్పిస్తారు. ఈ సర్టిఫికెట్ కింద రెండు లక్షల వరకు డిపాజిట్ చేసే అవకాశం ఉంది. ఆర్థిక కష్టాలు వస్తే బంగారం ఆదుకుంటుందన్న నమ్మకం బడ్జెట్లో గల్లంతైంది. గోల్డ్ బార్స్ దిగుమతి సుంకాన్ని 12.5 శాతానికి పెంచడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన వెంటనే 10 గ్రాముల బంగారం రూ. 58 వేలకి చేరుకోవడం మహిళలకి షాక్ తగిలినట్టైంది. విద్యార్థి కోవిడ్–19 చదువుల్ని చావు దెబ్బ తీసింది. బడిముఖం చూడకుండా ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లలో పాఠాలు విన్న పిల్లలు చదువుల్లో కొన్నేళ్లు వెనకబడిపోయారు. 2012 నాటి స్థాయికి చదువులు పడిపోయాయని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఈ సారి బడ్జెట్లో ఎన్నడూ లేని విధంగా రూ.1.12 లక్షల కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యకి 8 శాతం నిధులు పెరిగినా పిల్లల్ని బడి బాట పట్టించే చర్యలు శూన్యం. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తాననడం కంటితుడుపు చర్యగా మారింది. నిరుద్యోగి ఇది లే ఆఫ్‌ల కాలం. పని సగంలో ఉండగా మీ సేవలు ఇంక చాలు అంటూ పింక్ స్లిప్ చేతికిచ్చి ఇంటికి పంపేస్తున్నారు. దీంతో నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కల్పనకి అవసరమైన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సారి బడ్జెట్ సప్తరుషుల్లో ఒకటిగా యువశక్తికి పెద్ద పీట వేసింది. యువతలో నైపుణ్యం పెంచడానికి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) 4.0 ప్రారంభించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, 3డీ ప్రింటింగ్, డ్రోన్లు వంటి వాటిలో శిక్షణ ఇస్తుంది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 38,800 ఉపాధ్యాయులను నియమించనుంది. టూరిజం రంగంలో ఉద్యోగాల కోసం యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపడతామని చెప్పినా ఎన్ని కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న దానిపై స్పష్టత లేదు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇవాళ రేపు ఎవరింట్లో చూసినా ఎవరి తీరాన వారు మొబైల్ ఫోన్లలో తలదూర్చేస్తున్నారు. వాట్సాప్‌లోనే పలకరింపు, ముచ్చట్లు కలబోసుకుంటున్నారు. వినోదమైనా, విజ్ఞానమైనా అంతా మన అరచేతిలోనే. ఇప్పుడు ఆ మొబైల్ ధరలైతే తగ్గనున్నాయి. టీవీలు, మొబైల్ ఫోన్లలో వాడే విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతో టీవీ, మొబైల్ రేట్లు తగ్గుతాయి. ఇవి తగ్గుతాయి బానే ఉంది కానీ, వినోదం కోసం బయట సినిమాకి వెళ్లారంటే ఇక్కడ మిగిలింది కాస్త అక్కడ ఖర్చైపోతుంది. మొత్తంగా లెవలైపోతుంది. హళ్లికీ హళ్లి సున్నాకి సున్నా. ఫ్యామిలీ పార్టీల్లో బ్రాడెండ్ దుస్తులు వేసుకోవాలన్నా మధ్యతరగతికి ఇప్పుడు అది భారమైపోయింది. -
‘ఇంటి’పై ఎల్టీసీజీ పరిమితి రూ.10 కోట్లే
ఇల్లు లేదా ఇతర క్యాపిటల్ అసెట్స్ కొనుగోలు చేసి విక్రయించగా వచ్చే దీర్ఘకాల మూలధన లాభాలపై (ఎల్టీసీజీ) పన్ను మినహాయింపునకు ఆర్థిక మంత్రి సీతారామన్ పరిమితి తీసుకొచ్చారు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54, 54ఎఫ్ కింద గరిష్టంగా 10 కోట్ల మొత్తానికే పన్ను మినహాయింపు పరిమితం చేశారు. అంటే ఒక ఇల్లు లేదా ఇతర క్యాపిటల్ పెట్టుబడులను విక్రయించినప్పుడు వచ్చే దీర్ఘకాల మూలధన లాభాన్ని, మరో ఇంటిని కొనుగోలు చేయడం ద్వారా పన్ను లేకుండా చేసుకోవచ్చు. కాకపోతే ఈ మూలధన లాభం రూ.10కోట్లకు మించి ఉంటే ఆ మొత్తంపై ఇక మీదట పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మరీ ఖరీదైన ఆస్తుల కొనుగోలుపై పన్ను మినహాయింపులు తగ్గించేందుకే ఇలా చేశారు. పన్నుల్లో రాయితీలు, మినహాయింపులను మరింత మెరుగ్గా మార్చే లక్ష్యంతో రూ.10 కోట్లకు పరిమితం చేసినట్టు మంత్రి చెప్పారు. ఇందులో సెక్షన్ 54 అన్నది ఒక ఇంటిని అమ్మగా వచ్చే దీర్ఘకాల మూలధన లాభాన్ని తీసుకెళ్లి మరో ఇంటి కొనుగోలు చేయడం ద్వారా మినహాయింపునకు సంబంధించినది. చదవండి: డిజిటల్ సీతారామం.. సూపర్ హిట్! -
ఆయిల్ కంపెనీలకు ఉపశమనం.. రూ.30,000 కోట్లు కేటాయింపు
ప్రభుత్వరంగ చమురు విక్రయ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. 10 నెలలుగా పెట్రోల్, డీజిల్ విక్రయ ధరలను సవరించకుండా నష్టపోయిన బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ కోసం రూ.30,000 కోట్లను ఆర్థిక మంత్రి కేటాయించారు. అంతర్జాతీయంగా ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ, 2021 ఏప్రిల్ 6 నుంచి ఈ సంస్థలు ధరలను సవరించకుండా విక్రయిస్తున్నాయి. బ్యారెల్ చమురు ధర 116 డాలర్లకు వెళ్లిన సమయంలో వాటికి ఎక్కువ నష్టం వచ్చింది. ఆ తర్వాత చమురు ధరలు తగ్గడంతో పెట్రోల్‌పై లాభం వస్తుండగా, డీజిల్‌పై ఇప్పటికీ నష్టపోతున్నాయి. 2022–23లో ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి ఈ మూడు ఉమ్మడిగా రూ.21,200 కోట్ల నష్టాలను ప్రకటించడం గమనార్హం. పైగా వీటికి రెండేళ్లుగా ఎల్పీజీ సబ్సిడీ చెల్లింపులు కూడా చేయలేదు. దీంతో రూ.50,000 కోట్లను ఇవ్వాలని అవి కోరగా, ప్రభుత్వం రూ.30,000 కోట్లను కేటాయించింది. చదవండి: ఆ కార్ల కొనుగోలుదారులకు షాక్.. పెరగనున్న ధరలు! -
డిజిటల్ సీతారామం.. సూపర్ హిట్!
‘ఈ జగమంతా రామమయం’ అన్నాడు ఆనాటి రామదాసు! ఈ నాటి నిర్మలా సీతారామమ్మ బడ్జెట్ పాట కూడా ఇదే. కాకపోతే.. జగము స్థానంలో భారత్ అని.. రాముడికి బదులు డిజిటల్ అని మార్చుకోవాలి! కేంద్ర ప్రభుత్వం ఏళ్ల క్రితం మొదలుపెట్టిన డిజిటలీకరణకు ఈ ఏడాది బడ్జెట్లోనూ మంచి మద్దతు లభించింది. దేశ పురోగతికి కృత్రిమ మేధను వాడుకోవడం మొదలు.. రైతన్న సమస్యలన్నింటికీ ఒక్క చోటే పరిష్కారాలు దక్కేలా చేయడం వరకూ పలు ప్రతిష్టాత్మక డిజిటల్ కార్యక్రమాలకు ఈ ఏడాది బడ్జెట్లో శ్రీకారం చుట్టారు. ఒక్కొక్కటి వివరంగా చూద్దాం.. వ్యవసాయానికి డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఈ ఏడాది బడ్జెట్లో ‘వ్యవసాయం’కోసం డిజిటల్ రూపంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. నాణ్యమైన ఇన్పుట్స్ (విత్తనాలు, ఎరువులు తదితరాలు) రైతులకు లభించేందుకు మాత్రమే కాకుండా... పండిన పంటకు జరిగే నష్టాలను నివారించేందుకు అవకాశాలు మెరుగు అవుతాయి. తగిన సమాచారం అందుబాటులో లేని కారణంగా రుణాలిచ్చేందుకు తటపటాయించే బ్యాంకులు కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రైతులకు అవసరమైనంత స్థాయిలో రుణా లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. పంటల ఆరోగ్యంపై, ఇన్పుట్ల ఖర్చు, నేల సారం, ధరలు, ఉత్పత్తుల నాణ్యత వంటి అనేక అంశాల సమాచారం ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా బ్యాంకర్లకు అందుతుందని అంచనా. వీటి ద్వారా రైతుల రుణ అర్హతలనూ నిర్ణయించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. జన్‌ధన్ ఖాతాలు, డిజిటల్ పేమెంట్ల కారణంగా ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నేరుగా నగదు రూపంలోనే సాయం అందిస్తున్న విషయం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. రైతులకు ఉపయోగపడే అనేక ప్లాట్‌ఫామ్‌లు ఇప్పటికే కొన్ని కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నాయి. ఐటీసీ ‘ఈ–చౌపాల్’ ‘దేహాత్’, ‘ఆర్య’, ‘రేష మండి’, ‘అనిమాల్.ఇన్’, ‘ఆక్వా–కనెక్ట్’’ వంటివి మరికొన్ని కూడా ఉన్నాయి. కేంద్రం వీటిలోని మేలి అంశాల మేళవింపుగా కొత్త ప్లాట్‌ఫామ్‌ను రూపొందించవచ్చు. డిజిటల్ లైబ్రరీ పుస్తకం హస్తభూషణమన్న పాత పాటకు పాతరేసి.. పుస్తకాలను ఇప్పుడు డిజిటల్ రూపంలో అందించేందుకు ప్రయత్నం మొదలైంది. జాతీయ స్థాయిలో అన్ని భాషల్లో, ప్రాంతాల్లో స్థాయిల్లోనూ యువతీ యువకులకు, బాలబాలికలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన పుస్తకాలను ఈ డిజిటల్ లైబ్రరీ ద్వారా అందించనున్నారు. కోవిడ్ కారణంగా చదువుల్లో డిజిటల్ టెక్నాలజీ అవసరం పెరిగిపోయిన నేపథ్యంలో ఈ లైబ్రరీ ఏర్పాటు కానుండటం విశేషం. స్మార్ట్ ఫోన్లు మొదలుకొని, డెస్్కటాప్ల వరకూ అన్నింటి ద్వారా ఈ లైబ్రరీ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో రాష్ట్రాల్లో పంచాయితీల స్థాయి లో భౌతిక గ్రంథాలయాల ఏర్పాటునూ ప్రోత్సహిస్తామని వాటిల్లోనే డిజిటల్ లైబ్రరీ కూడా అందుబాటులో ఉండేలా చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ‘‘ఆర్థిక అంశాల్లో అక్షరాస్యత కల్పించేందుకు, పుస్తక పఠనాన్ని అలవాటు చేసేందుకు ఈ ల్రైబరీలు ఉపయోగపడతాయి.’’అని సీతారామన్ తెలిపారు. అక్షరాస్యత కార్యక్రమాలను కూడా స్వచ్ఛంద సంస్థల సాయంతో ఈ డిజిటల్ లైబ్రరీ ప్రాజెక్టుకు అనుసంధానిస్తామన్నారు. దేశం కోసం.. దేశంలోనే.. కృత్రిమ మేధ కృత్రిమ మేధ వినియోగాన్ని మరింత విస్తృతం చేసేందుకు దేశంలో మూడు అత్యున్నత నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలు మూడింటిలో వీటి ఏర్పాటు జరుగుతంది. వ్యవసాయం, ఆరోగ్యం, సస్టెయినబుల్ సిటీస్ రంగాల్లో పరిశోధనలు తద్వారా ఆయా రంగాల్లోని సమస్యలకు అత్యాధునిక టెక్నాలజీ పరిష్కారాలు కనుక్కునేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడతాయి. ఇందుకు పరిశ్రమ వర్గాలు తమవంతు తోడ్పాటునందిస్తాయి. ‘‘కృత్రిమ మేధ రంగంలో మానవ వనరులను అభివృద్ధి చేసేందుకు, దేశంలో సమర్థమైన కృత్రిమ మేధ వ్యవస్థ ఒకటి ఏర్పాటయ్యేందుకు’ఈ మూడు కేంద్రాలు ఉపకరిస్తాయి’’అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ కేంద్రాల ఏర్పాటు వల్ల విద్యార్థులు మరింత ఎక్కువ మంది కృత్రిమ మేధ కోర్సులకు మొగ్గు చూపుతారని, దేశ అభివృద్ధికి మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. గూగూల్‌కు చెందిన ‘ఇండియ రీసెర్చ్ ల్యాబ్ కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్‌ల సాయంతో ఆరోగ్య రంగాన్ని మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా.. ప్రజా ఆరోగ్య రంగం, వన్యప్రాణి సంరక్షణ, వ్యాధుల నివారణ వంటి అనేక అంశాల్లో కృత్రిమ మేధను వాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 5జీ కోసం వంద ల్యాబ్‌లు.. డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా కేంద్రం గత ఏడాది దేశంలో 5జీ సర్వీసులను మొదలుపెట్టింది. వేగవంతమైన నెట్‌వర్క్‌తోపాటు అనేక ఇతర లాభాలు తెచ్చిపెట్టగల ఈ 5జీ టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకునేందుకు దేశంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో వంద ల్యాబ్ లు ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తాజాగా ప్రకటించారు. స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, ప్రిసిషన్ ఫారి్మంగ్, తెలివైన రవాణా వ్యవస్థలతోపాటు ఆరోగ్య రంగంలో ఉపయోగపడే అప్లికేషన్లను తయారు చేయడం వీటి లక్ష్యం. బ్యాంకులు, వివిధ నియంత్రణ సంస్థలు, ఇతర వ్యాపార వర్గాలు కూడా ఈ ల్యాబ్ కార్యకలాపాల ద్వారా లాభపడే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం సుమారు 225 ప్రాంతాల్లో ఈ 5జీ టెక్నాలజీ అందుబాటులో ఉంది. 5జీ టెక్నాలజీలపై పరిశోధనలకు గాను ఈ ఏడాది రూ. 5.56 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఈ కేటాయింపులు రూ.7.74 కోట్లు. టెలి కమ్యూనికేషన్స్, 5జీ టెక్నాలజీల్లో గత ఏడాది డిమాండ్ 33.7 శాతం వరకూ పెరిగింది. 2022–23లోనే ఈ రంగాల్లో 1.3 లక్షల ఉద్యోగాలకు డిమాండ్ ఉండగా.. ఏటికేడాదీ ఇది పెరుగుతోంది. 5జీ రంగంలో కొత్తగా ఏర్పాటయ్యే ల్యాబ్‌ల వల్ల యూనివర్సిటీల్లో పరిశోధనలు మరింత ఊపందుకుంటాయి. మరిన్ని ఉద్యోగావకాశాలను సృష్టించనున్నాయి. నైపుణ్యాల వృద్ధికి భారీ ఊతం రేపటి తరం కొత్త టెక్నాలజీల్లో దేశ యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఈ ఏడాది బడ్టెట్‌లో ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇందులో భాగంగా వివిధ రకాల నైపుణ్యాలను అందించనున్నారు. కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ ఇవ్వడంతోపాటు, శిక్షణ పొందిన వారిని, కంపెనీలను ఒకచోటకు చేర్చడమూ ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా జరుగుతాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకూ ప్రాధాన్యం లభించనుంది. నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్‌లో భాగంగా రానున్న మూడేళ్లలో 47 లక్షల మంది యువతకు నేరుగా ఆన్లైన్ పద్ధతిలో స్టైఫండ్ అందించనున్నారు. అంతేకాకుండా.. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0లో భాగంగా కోడింగ్, కృత్రిమ మేధ, మెకట్రానిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, త్రీడీ ప్రింటింగ్ డ్రోన్స్ ఇతర సాఫ్ట్ స్కిల్స్‌ను అందిస్తారు. అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దేశం మొత్తమ్మీద 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ కేంద్రాల ఏర్పాటు జరుగుతుంది. స్కిల్ ఇండియా కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 1.0 పేరుతో 2015లో మొదలైన విషయం తెలిసిందే. దాదాపు 20 కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు స్కిల్ ఇండియాలో భాగంగా పలు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నాయి. అవసరమైన సందర్భాల్లో వాటిని మరింత ఆధునికీకరించడం కూడా చేస్తున్నాయి. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 2.0 2017లో, మూడో దఫా 2021లోనూ మొదలయ్యాయి. నేషనల్ డేటా గవర్నెన్స్ పాలసీ ఆర్థిక రంగ సంస్థలకు భారీగా ఉపయోగపడేలా కేంద్రం ఈ ఏడాది నేషనల్ డేటా గవర్నెన్స్ విధానం ఒకదాన్ని తీసుకు రానుంది. ఈ విధానం వల్ల స్టార్టప్ కంపెనీల్లో మరింత అధిక సంఖ్యలో సృజనాత్మక ఆవిష్కరణలు జరుగుతాయని, విద్యా సంస్థల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇప్పటివరకూ అందుబాటులో లేని సమాచారం డేటా గవర్నెన్స్ పాలసీ కారణంగా నిర్దిష్ట సంస్థలకు అందుబాటులోకి వస్తుందని, వివిధ సంస్థలు ‘నో యువర్ కస్టమర్’లేదా కేవైసీ కోసం ఎక్కువ ప్రయాస పడాల్సిన అవసరం లేకుండా పోతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కేవైసీలో భాగంగా అందరూ ఆధార్ వంటి వివరాలు మాత్రమే అడుగుతున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే కంపెనీలు, బ్యాంకులు తమకు ఎదురయ్యే రిస్క్ ఆధారంగా ఇతర డాక్యుమెంట్లను కూడా కోరవచ్చు లేదా డిజిలాకర్ నుంచి తీసుకోవచ్చు. వ్యక్తులు డిజిలాకర్‌లో ఉంచుకున్న డాక్యుమెంట్లను కూడా అవసరాలకు తగ్గట్టుగా కొన్ని నియంత్రణ, ఆర్థిక సంస్థలకు అందుబాటులోకి తేనున్నారు. డిజిలాకర్‌లో ప్రస్తుతం మనం పలు రకాల డాక్యుమెంట్లను స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. ఆధార్, పర్మనెంట్ అకౌంట్ నెంబరు (పాన్)లతోపాటు డ్రైవింగ్ లైసెన్స్, విద్యార్హతల డాక్యుమెంట్లను ఇక్కడ నిక్షిప్తం చేసుకోవచ్చు. ఇప్పటివరకూ వీటిని చూడగలిగే అవకాశం కొన్ని సంస్థలకు మాత్రమే ఉండగా.. కొత్త డేటా గవర్నెన్స్ పాలసీ కారణంగా మరిన్ని ఎక్కువ సంస్థలు అవసరాన్ని బట్టి చూడగలిగే అవకాశం ఏర్పడుతుంది. డిజిటల్ కేటాయింపుల తగ్గింపు? ఈ ఏడాది బడ్జెట్లో డిజిటల్ ఇండియా కార్యక్రమాలకు మొత్తం రూ.4,785 కోట్లు కేటాయించారు. అయితే ఇది గత ఏడాది కేటాయింపుతో పోలిస్తే 37 శాతం తక్కువ. గత ఏడాది మొత్తం రూ.7603.5 కోట్ల కేటాయింపులు డిజిటల్ ఇండియా కార్యక్రమానికి జరిగింది. ముందుగా రూ.10,676 కోట్ల కేటాయింపులు జరిగినా సవరణల తరువాత ఈ మొత్తం తగ్గింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ డిజిటల్ ఇండియా కార్యకలాపాలను చేపడుతుందన్న విషయం తెలిసిందే. ప్రతి పౌరుడికి హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకు రావడం, జీవితాంతం పనిచేసే ఐడెంటిటీ (ఆధార్, యూపీఐ, పాన్ వంటివి) అందించడం ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగం. అలాగే.. ప్రభుత్వ సేవలను డిజిటల్ టెక్నాలజీల సాయంతో అందివ్వడం, అన్ని భాషల్లోనూ ఈ టెక్నాలజీ ఫలాలు అందుబాటులో ఉండేలా చేయడం కూడా ఇందులో భాగంగానే చేస్తున్నారు. మౌలికం.. పెట్టుబడితో.. దేశ అభివృద్ధి వేగం పుంజుకునేలా భారీగా పెట్టుబడులు పెడతామని.. రోడ్లు, రైల్వే, విమాన, నౌకా రవాణా తదితర మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిపెడతామని నిర్మల తెలిపారు. బడ్జెట్లో మూలధన పెట్టుబడులకు కేటాయింపులను 10 లక్షల కోట్లకు (గతం కంటే 33% అదనం) పెంచుతున్నామని, ఇది దేశ జీడీపీలో 3.3% శాతానికి సమానమని పేర్కొన్నారు. -
ఆ కార్ల కొనుగోలుదారులకు షాక్.. పెరగనున్న ధరలు!
న్యూఢిల్లీ: విదేశాల్లో పూర్తిగా తయారై (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్/సీబీయూ) భారత్‌లోకి దిగుమతి అయ్యే ఎలక్ట్రిక్ కార్లు సహా అన్ని రకాల కార్లపై కస్టమ్స్ డ్యూటీ పెంచారు. విదేశాల్లో పూర్తిగా తయారైన వాటిని ‘సీబీయూ’లుగా చెబుతారు. 40,000 డాలర్ల కంటే తక్కువ ధర (ఇన్వాయిస్ వ్యాల్యూ) ఉన్నవి లేదంటే ఇంజిన్ సామర్థ్యం 3,000 సీసీ కంటే తక్కువ ఉన్న పెట్రోల్ కార్లు, 2,500 సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న డీజిల్ ఇంజిన్ కార్లపై కస్టమ్స్ డ్యూటీని 60% నుంచి 70%కి పెంచారు. ఎలక్ట్రిక్ కార్లు 40,000 డాలర్లకు పైన ధర ఉంటే వాటిపై కస్టమ్స్ డ్యూటీని 60% నుంచి 70%కి పెంచారు. సెమీ నాక్డ్ డౌన్ (ఎస్కేడీ/పాక్షికంగా తయారైన) కార్లపై (ఎలక్ట్రిక్ సహా) కస్టమ్స్ డ్యూటీని 30% నుంచి 35%కి పెంచారు. ప్రస్తుతం విదేశాల్లో తయారై దిగుమతి అయ్యే కార్లు 40,000 డాలర్లు లేదా ఇంజిన్ సామర్థ్యం 3,000 సీసీ కంటే ఎక్కువ ఉన్న పెట్రోల్ కార్లు, 2,500 సీసీ మించిన∙డీజిల్ కార్లపై 100% కస్టమ్స్ డ్యూటీ ఉంది. 2 శాతం వరకు పెరగనున్న ధరలు ప్రభుత్వం కస్టమ్స్ సుంకం పెంపు ప్రతిపాదనలతో కార్ల ధరలు 2 శాతం వరకు పెరుగుతాయని లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన బీఎండబ్ల్యూ, మెర్సెడెజ్ బెంజ్, లెక్సస్ ప్రకటించాయి. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ప్రభుత్వం సవరించడంతో, ఎస్ క్లాస్ మేబ్యాచ్, జీఎల్బీ, ఈక్యూబీ ధరలపై ప్రభావం పడుతుందని మెర్సెడెజ్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. భారత్‌లోనే ఎక్కువ తయారీ చేస్తున్నందున 95 శాతం మోడళ్ల ధరలపై ప్రభావం ఉండదని చెప్పారు. చదవండి: Union Budget 2023-24 బీమా కంపెనీలకు షాక్, రూ. 5 లక్షలు దాటితే!