ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న చివరి బడ్జెట్ ఇది. దీంతో.. బడ్జెట్ అంచనాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా తయారీ రంగానికి కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి..? అన్న చర్చ జరుగుతోంది. తయారీ రంగం అభివృద్ధి పథంలో వేగంగా అడుగులు వేసేలా.. భారీ కేటాయింపులు ఉండొచ్చనే అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు.
దీర్ఘకాలిక అభివృద్ధి, ఉద్యోగ,ఉపాధి అవకాశాల కల్పనలో తయారీ రంగానిది కీలక పాత్ర. PLI పథకాన్ని మరింత విస్తరించి, దీని పరిధిలోకి మరిన్ని సెక్టార్‌లను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. 14 రంగాలకు రూ. 1.97 లక్షల కోట్లతో ఈ పథకం రూపొందించబడింది.
ప్రస్తుతం PLI స్కీమ్ లో ఆటోమొబైల్స్, దాన్ని అనుబంధ వస్తువులు, గృహోపకరణాలు, టెక్స్ టైల్స్, ఆహార పదార్థాలు, సోలార్ పీవీ మాడ్యూల్స్, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్, స్టీల్ తదితర ఉత్పత్తుల పరిశ్రమలు ఉన్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్ లో బొమ్మలు, సైకిళ్లు, లెదర్, ఫుట్‌వేర్ తయారీ పరిశ్రమలను కూడా PLI స్కీమ్ పరిధిలోకి తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం.
దేశ ఆర్థిక వ్యవస్థకు PLI పథకం ఎంతో ముఖ్యమైనది. ప్రాదేశీయ తయారీని ప్రపంచవ్యాప్తంగా పోటీగా మార్చడంతో పాటు తయారీరంగంలో గ్లోబల్ ఛాంపియన్‌లను సృష్టించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. 2022 సెప్టెంబర్ నాటికి PLI పథకం ద్వారా భారీ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో రూ.4,784 కోట్లను ఆకర్షించింది. రూ. 2,03,952 కోట్ల విలువైన ఉత్పత్తిని సాధించింది. రూ.80,769 కోట్ల ఎగుమతులు జరిగాయి.
PLI పథకంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యం గణనీయమైనది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. 2022 డిసెంబర్ 16 నాటికి 13 పథకాలకు అనుమతులు లభించగా.. వీటిలో 100కు పైగా MSMEలకు లబ్ది చేకూరింది.
Comments
Please login to add a commentAdd a comment