హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగానికి కొత్త ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాన్ని ప్రవేశపెట్టడంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ) తయారీకి అవసరమైన కీలక రసాయనాల ఉత్పత్తిని దేశీయంగా పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తద్వారా కీలక రసాయనాల ఉత్పత్తుల కోసం భారతీయ కంపెనీలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్ధేశం.
ఫార్మాతో ముడిపడి ఉన్న అన్ని విభాగాలు ప్రస్తుత పీఎల్‌ఐ కింద కవర్ కాలేదు. దీని కారణంగా ఈ రసాయనాలు ఇప్పటికీ చైనా నుండి పెద్దమొత్తంలో భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. అయితే కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రమే నూతన పీఎల్‌ఐ కార్యరూపంలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే తదుపరి కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదిత పథకం భాగం కావచ్చు.
ప్రస్తుత పథకానికి సవరణ..
భారత్‌కు దిగుమతి అవుతున్న ఫార్మా ముడిపదార్థాల్లో 55–56 శాతం వాటా చైనాదే. 2013–14లో దిగుమతైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్‌లో చైనా వాటా విలువ పరంగా 64 శాతం, పరిమాణం పరంగా 62 శాతం వృద్ధి నమోదైంది. 2022–23 వచ్చేసరికి ఇది వరుసగా 71 శాతం, 75 శాతానికి ఎగబాకింది. చైనా నుంచి ముడిపదార్థాల (బల్క్ డ్రగ్) దిగుమతులు 2013–14లో 2.1 బిలియన్ డాలర్లు, 2018–19లో 2.6 బిలియన్ డాలర్లు, 2022–23 వచ్చేసరికి 3.4 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి.
చైనాలో ఈ రసాయనాల తయారీ వ్యయాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీని కారణంగా ఏపీఐల ఉత్పత్తికై భారతీయ తయారీ సంస్థలు చైనా నుంచే వీటిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ రసాయనాలు కాలుష్యకారకాలు. ఈ రసాయనాలను పీఎల్‌ఐ పరిధిలోకి చేర్చేందుకు ప్రస్తుత పథకాన్ని సవరించడాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించవచ్చని తెలుస్తోంది.
జాప్యాలకు దారితీయవచ్చు..
ప్రస్తుతం ఉన్న ఫార్మా పీఎల్‌ఐ పథకం కింద పరిశ్రమకు కీలక స్టారి్టంగ్ మెటీరియల్స్, డ్రగ్ ఇంటర్మీడియట్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్‌ను స్థానికంగా తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఫార్మా సరఫరా వ్యవస్థ మొత్తాన్ని ప్రస్తుత పీఎల్‌ఐ పథకం కవర్ చేయడం లేదు. అయితే ఏపీఐల తయారీలో వాడే రసాయనాల ధరలను చైనా తగ్గించింది.
పీఎల్‌ఐ పథకంలో భాగం కాని కంపెనీలు చైనా నుంచి ఈ రసాయనాలను తక్కువ ధరకు దిగుమతి చేసుకుంటున్నాయి. కీలక ఔషధ ముడి పదార్ధాల కోసం ఒకే దేశంపై ఎక్కువగా ఆధారపడటం భారత ఫార్మా పరిశ్రమకు ప్రమాదం కలిగించే అవకాశమూ లేకపోలేదు. దీనికి కారణం ఏమంటే సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడినట్టయితే మందుల కొరత, తయారీ జాప్యాలకు దారితీయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment