Pharma sector
-
ఫార్మాకు ‘భూ’ గ్రహణం!
సాక్షి, హైదరాబాద్: ఫార్మా రంగంలో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా నిరుద్యోగ సమస్య తగ్గించవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సమీకృత గ్రీన్‌ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ల (ఫార్మా విలేజ్‌లు) ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ సవాలుగా మారుతోంది. భూ సేకరణకు జారీ చేస్తున్న నోటిఫికేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం అవు తున్నాయి. తమ గ్రామాల్లో ఫార్మా చిచ్చు పెట్టొద్దంటూ రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా రు. వ్యవసాయమే జీవనోపాధిగా బతుకుతున్న తాము భూములు అప్పగించేది లేదని తేల్చి చెబుతున్నారు.ఫార్మా కంపెనీల ఏర్పాటుతో గాలి, భూ గర్భ జలాలు విషతుల్యమవుతాయని, తాము కాలుష్యం కోరల్లో చిక్కుకుంటామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ విలువైన భూములకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏ మూలకూ సరిపోదని కూడా అంటున్నారు. బహిరంగ మార్కెట్లో భూమి ధరలతో పోలిస్తే ప్రభుత్వం ఇవ్వజూపుతున్న మొత్తం చాలా తక్కువగా ఉందని పేర్కొంటున్నారు. తమ పిల్లల భవిష్యత్తును ఫణంగా పెట్టే ప్రతిపాదనలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.భూముల పరిశీలనకు, అభిప్రాయ సేకరణకు వస్తున్న అధికారులను అడ్డుకుంటుండటంతో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. అయితే దీనికంతటికీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీయే కారణమని, రైతులను రెచ్చగొడుతూ అభివృద్ధిని, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఫార్మాసిటీకి బదులుగా ఫార్మా విలేజ్‌లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల ప్రాంతంలో 19 వేల ఎకరాల్లో ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎనిమిదేళ్ల క్రితం భూ సేకరణ ప్రారంభించి సుమారు 14 వేల ఎకరాలు సేకరించింది. మౌలిక వసతులు కల్పించాల్సి ఉండగా.. గత ఏడాది డిసెంబర్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని స్థానంలో సకల వసతులతో కూడిన ఫోర్త్ సిటీని నిర్మిస్తామని, ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పది ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ధి వికేంద్రీకరణ ఫార్మా రంగాన్ని రాష్ట్రమంతటా విస్తరించడం ద్వారా ఎక్కడికక్కడే విద్యావంతులకు, పరోక్షంగా అంతగా చదువుకోని వారికి కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని చెబుతోంది. చిన్నచిన్న క్లస్టర్ల ద్వారా కాలుష్య రహితంగా వీటిని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. తొలిదశలో నాలుగు ఫార్మా విలేజ్‌లు తొలిదశలో నాలుగు ప్రాంతాల్లో ఫార్మా విలేజ్ల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహలు ప్రారంభించింది. ‘ఫార్మా సిటీ’ఏర్పాటుకు ఇప్పటికే సేకరించిన భూముల్లో రెండు ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. వీటితో పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలో ఒకటి, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాలకల్ మండలంలో మరో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.కొడంగల్ ఫార్మా విలేజ్ ఏర్పాటుకు 1,358.38 ఎకరాలు, జహీరాబాద్‌లో ఫార్మా విలేజ్‌కు 2,003 ఎకరాలు అవసరమని లెక్కలు వేశారు. భూ సేకరణ కోసం నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. పట్టా, అసైన్డ్ భూములు అనే తేడా లేకుండా ఒక్కో ఎకరానికి రూ.15 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. కలెక్టర్లు భూముల పరిశీలనకు, ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టారు. అయితే బహిరంగ మార్కెట్లో తమ భూముల ఎకరం ధర రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతోందని రైతులు చెబుతున్నారు. దీనితో పాటు కాలుష్యం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఫార్మా విలేజ్ల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు.తమకు జీవనాధారమైన భూముల్ని ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్‌ను వ్యతిరేకిస్తూ కలెక్టర్ తదితర ఉన్నతాధికారులపై లగచర్లలో దాడికి దిగారు. దాడి చేసిన వారితో పాటు దాడికి కుట్ర పన్నినట్లుగా అనుమానిస్తున్న కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు సంగారెడ్డి జిల్లాలోనూ రైతులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఫార్మా విలేజ్‌లకు భూ సేకరణ కష్టంగా మారుతుందనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. నోటికాడి కూడు తీసుకుంటారా?తరాలుగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నమాకు భూములే జీవనాధారం. వ్యవసాయం తప్ప మరో పని చేయడం మాకు తెలియదు. ఇప్పుడు ఫార్మా విలేజ్ పేరిట మానోటి కాడ కూడును తీసుకుంటామంటున్నారు. అదే జరిగితే మా కుటుంబాలు రోడ్డు మీద పడి ఆగమవుతాయి. మూడు పంటలు పండే బంగారం లాంటి భూములను ప్రభుత్వానికి ఇచ్చేదిలేదు. ఇక్కడ ఉన్న ధరలతో పోలిస్తే ప్రభుత్వం ఇస్తామంటున్న పరిహారం ఏ మూలకూ సరిపోదు. – బేగరి విఠల్, రైతు, డప్పూర్, సంగారెడ్డి జిల్లాఎన్ని పైసలు ఇచ్చినా భూమి ఇవ్వం మా కుటుంబానికి ఉన్న రెండున్నర ఎకరాలే జీవనాధారం. ఈ భూమిలో 15 ఏళ్లుగా పుదీనా పండిస్తూ నారాయణఖేడ్ మార్కెట్లో అమ్ముకుంటున్నాం. ఇప్పుడు ఫ్యాక్టరీల ఏర్పాటు కోసం మా భూములను లాక్కుంటే మేం ఎక్కడికి పోవాలి? ఎన్ని డబ్బులు ఇచ్చినా మా భూములు అప్పగించం. పచ్చటి భూముల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలి. – అజీమొద్దీన్, రైతు, మల్గి, సంగారెడ్డి జిల్లా -
నాలుగో స్థానంలో ఫార్మా ఎగుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా ఎగుమతులు భారత్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్–ఆగస్ట్ మధ్య 11.9 బిలియన్ డాలర్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 8.1 శాతం అధికం. ఎగుమతుల పరంగా జెమ్స్–జువెల్లరీ, కెమికల్స్ విభాగాలను దాటి ఫార్మా రంగం నాల్గవ స్థానంలో నిలిచింది. 2023లో ఫార్మా రంగం ఆరవ స్థానంలో ఉంది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఔషధ పరిశ్రమ 8–10% ఆదాయ వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. అమె రికా, యూరప్ వంటి రెగ్యులేటెడ్ మార్కెట్లకు బలమైన ఎగుమతులు, ఆఫ్రికా, ఆసియాతో సహా సెమీ–రెగ్యులేటెడ్ మార్కెట్లలో రికవరీ, అలాగే స్థిరమైన దేశీయ డిమాండ్‌తో 2024–25లో ఈ స్థాయి ఆదాయ వృద్ధిని సాధిస్తుందని క్రిసిల్ అంచనా వేస్తోంది. స్థిర నగదు ప్రవాహాలు.. 2023–24లో భారత ఔషధ పరిశ్రమ సుమారు 10 శాతం వృద్ధిని సాధించింది. యూఎస్ జెనరిక్స్ మార్కెట్లో ధరల ఒత్తిడి తగ్గడం, నిర్వహణ వ్యయాలు మెరుగవడం.. వెరశి ఆపరేటింగ్ మార్జిన్లు 70–80 బేసిస్ పాయింట్లు పెరిగి సుమారు 22.5 శాతానికి చేరే అవకాశం ఉందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. ఫార్మాస్యూటికల్ కంపెనీలు సముచిత చికిత్సా విభాగాల్లో కొనుగోళ్లను కొనసాగించినప్పటికీ.. స్థిర నగదు ప్రవాహాలు, తక్కువ ఆర్థిక పరపతి నుండి కూడా ఈ రంగం ప్రయోజనం పొందుతుందని అంచనా. గత ఏడాది రూ.4.1 లక్షల కోట్ల మార్కెట్లో సగానికి బాధ్యత వహించే 190 ఔషధ తయారీ కంపెనీల ఆదాయాల ఆధారంగా క్రిసిల్ నివేదిక రూపొందించింది. ఆదాయం దాదాపు సమానం.. దేశీయ విక్రయాలు, ఎగుమతుల మధ్య ఆదాయం దాదాపు సమానంగా ఉందని క్రిసిల్ వెల్లడించింది. దేశీయ ఆదాయంలో అధికంగా దీర్ఘకాలిక, తీవ్ర చికిత్సా విభాగాల ద్వారా సమకూరుతోంది. ఎగుమతుల ఆదాయం ప్రధానంగా ఫార్ములేషన్స్ 80 శాతం, బల్క్ డ్రగ్స్ 20 శాతం నమోదవుతోంది. 2024–25లో ఫార్ములేషన్ ఎగుమతులు రూపాయి పరంగా 12–14 శాతం పెరుగుతాయని అంచనా. యూఎస్, యూరప్ వంటి నియంత్రిత మార్కెట్లు 13–15 శాతం వృద్ధిని సాధిస్తాయి. కొనసాగుతున్న ఔషధాల కొరత, కొత్త ఉత్పత్తుల లాంచ్‌లు, ప్రత్యేక ఉత్పత్తుల వైపు మళ్లడం ఇందుకు కారణం. సెమీ–రెగ్యులేటెడ్ మార్కెట్లకు ఎగుమతులు 8–10 శాతం పెరగవచ్చు. విదేశీ మారక నిల్వలను మెరుగవడం, ఆఫ్రికన్, లాటిన్ అమెరికా దేశాలలో కరెన్సీల స్థిరీకరణ ఇందుకు సహాయపడుతుంది. దేశీయంగా మార్కెట్ ఇలా.. ఫార్మా పరిశ్రమ ఆదాయం దేశీయంగా 7–9 శాతం పెరుగుతుందని అంచనా. ముఖ్యంగా నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (ఎన్ఎల్ఈఎం) ఉత్పత్తులలో ధరల పెరుగుదల ఇందుకు దోహదం చేయనుంది. అయితే గత ఆర్థిక సంవత్సరం టోకు ధరల సూచీలో జరిగిన కొద్దిపాటి మార్పుల కారణంగా ఎన్ఎల్ఈఎం పోర్ట్‌ఫోలియో వృద్ధి తగ్గుతూనే ఉంటుంది. పెరుగుతున్న జీవనశైలి సంబంధిత వ్యాధులు, మహమ్మారి అనంతర ఆరోగ్య అవగాహన అధికం కావడం వంటి కారణంగా దీర్ఘకాలిక చికిత్సల విభాగం దేశీయ ఆదాయ వృద్ధికి కీలకంగా దోహదపడుతుందని క్రిసిల్ భావిస్తోంది. -
ఫార్మాకు కొత్త పీఎల్ఐ పథకం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగానికి కొత్త ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని ప్రవేశపెట్టడంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ) తయారీకి అవసరమైన కీలక రసాయనాల ఉత్పత్తిని దేశీయంగా పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తద్వారా కీలక రసాయనాల ఉత్పత్తుల కోసం భారతీయ కంపెనీలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్ధేశం. ఫార్మాతో ముడిపడి ఉన్న అన్ని విభాగాలు ప్రస్తుత పీఎల్ఐ కింద కవర్ కాలేదు. దీని కారణంగా ఈ రసాయనాలు ఇప్పటికీ చైనా నుండి పెద్దమొత్తంలో భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. అయితే కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రమే నూతన పీఎల్ఐ కార్యరూపంలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే తదుపరి కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదిత పథకం భాగం కావచ్చు. ప్రస్తుత పథకానికి సవరణ.. భారత్‌కు దిగుమతి అవుతున్న ఫార్మా ముడిపదార్థాల్లో 55–56 శాతం వాటా చైనాదే. 2013–14లో దిగుమతైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్‌లో చైనా వాటా విలువ పరంగా 64 శాతం, పరిమాణం పరంగా 62 శాతం వృద్ధి నమోదైంది. 2022–23 వచ్చేసరికి ఇది వరుసగా 71 శాతం, 75 శాతానికి ఎగబాకింది. చైనా నుంచి ముడిపదార్థాల (బల్క్ డ్రగ్) దిగుమతులు 2013–14లో 2.1 బిలియన్ డాలర్లు, 2018–19లో 2.6 బిలియన్ డాలర్లు, 2022–23 వచ్చేసరికి 3.4 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి. చైనాలో ఈ రసాయనాల తయారీ వ్యయాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీని కారణంగా ఏపీఐల ఉత్పత్తికై భారతీయ తయారీ సంస్థలు చైనా నుంచే వీటిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ రసాయనాలు కాలుష్యకారకాలు. ఈ రసాయనాలను పీఎల్ఐ పరిధిలోకి చేర్చేందుకు ప్రస్తుత పథకాన్ని సవరించడాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించవచ్చని తెలుస్తోంది. జాప్యాలకు దారితీయవచ్చు.. ప్రస్తుతం ఉన్న ఫార్మా పీఎల్ఐ పథకం కింద పరిశ్రమకు కీలక స్టారి్టంగ్ మెటీరియల్స్, డ్రగ్ ఇంటర్మీడియట్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్‌ను స్థానికంగా తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఫార్మా సరఫరా వ్యవస్థ మొత్తాన్ని ప్రస్తుత పీఎల్ఐ పథకం కవర్ చేయడం లేదు. అయితే ఏపీఐల తయారీలో వాడే రసాయనాల ధరలను చైనా తగ్గించింది. పీఎల్ఐ పథకంలో భాగం కాని కంపెనీలు చైనా నుంచి ఈ రసాయనాలను తక్కువ ధరకు దిగుమతి చేసుకుంటున్నాయి. కీలక ఔషధ ముడి పదార్ధాల కోసం ఒకే దేశంపై ఎక్కువగా ఆధారపడటం భారత ఫార్మా పరిశ్రమకు ప్రమాదం కలిగించే అవకాశమూ లేకపోలేదు. దీనికి కారణం ఏమంటే సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడినట్టయితే మందుల కొరత, తయారీ జాప్యాలకు దారితీయవచ్చు. -
సరైన ‘నియంత్రణ’తోనే దివ్యౌషధం
భారత్‌లో తయారైన మందులు తీసుకోవడం వల్ల గాంబియా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల్లో కొంతమంది మరణించినట్లు గత ఏడాది వార్తలొచ్చాయి.ఈ నేపథ్యంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ దేశ ఫార్మా రంగంలో నాణ్యతా ప్రమాణాలపై సర్వే ప్రారంభించింది. విమర్శకులు చాలాకాలం నుంచి చేస్తున్న ఆరోపణలు కఠిన వాస్తవమని ఈ సర్వే ద్వారా ప్రభుత్వానికీ స్పష్టంగా తెలిసింది. దీనివల్ల వాస్తవ పరిస్థితులపై ప్రభుత్వ సంస్థల కళ్లు విచ్చుకున్నాయని చెప్పాలి. లేదా చాలాకాలంగా తెలిసిన విషయాలను వీరు అసలు పట్టించుకోలేదని అయినా అనుకోవాలి. సర్వే చెప్పిన అంశాల్లో ఒకటి – దేశంలో నాణ్యత ప్రమాణాలను పాటించడంపై అస్సలు శ్రద్ధ లేదు అన్నది. నిబద్ధత, తగిన శిక్షణ లేకపోవడం అన్నవి సరేసరి. నాణ్యతా ప్రమాణాల లోపాల ఫలితంగానే నాసిరకం ఔషధాలు భారత్‌లో పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నాయి. మందులు చౌకగా లభిస్తాయన్న ఢంకా బజా యింపునకూ ఇవే కారణాలయ్యాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు ఇంకా మొదలు కావాల్సి ఉన్నా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సర్వే జరపడమే కొంత ప్రభావం చూపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ సంస్థలు ఇప్పుడు ఒక్కతీరుగా ఆలోచించడం మొదలుపెట్టాయి. చేయాల్సిన పనులు, చేపట్టాల్సిన చర్యలపై స్పష్టతా ఏర్పడింది. మితిమీరిన జోక్యం... దేశ ఫార్మా రంగాన్ని పట్టిపీడిస్తున్న అంశం ఏదైనా ఉందీ అంటే అది మితిమీరిన ప్రభుత్వ జోక్యమనే చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలకు చెందిన పలు సంస్థలు ఫార్మా రంగంలో జోక్యం చేసుకుంటూంటాయి. ఈ క్రమంలో ఎవరికి వారు తమ ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తూంటారు. తద్వారా అసలు ప్రయోజనం దెబ్బతింటూ ఉంటుంది. స్థానికంగా తయారయ్యే మందులకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు లైసెన్సులు జారీ చేస్తూంటాయి. దీనివల్ల చాలా మందుల నాణ్యత అనేది రాష్ట్రాన్ని బట్టి మారిపోతూంటుంది. ఫార్మా రంగంపై నియంత్రణ సుస్పష్టంగా ఉన్నప్పుడే నాణ్యతను కాపాడేందుకు అవకాశం ఉంటుంది. నాణ్యమైన మందులు లేకపోతే ఈ ఆధునిక యుగంలో మరింత ఎక్కువ కాలం జీవించడం అసాధ్యం. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలోనూ ఫార్మా రంగం ప్రాముఖ్యత ఏమిటన్నది కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరమూ లేదు. భారత్‌కు ప్రపంచ ఫార్మా రాజధాని అనే పేరుంది. జెనెరిక్ మందులతో అన్ని దేశాల్లోనూ అవస రార్థులకు మందులు (పేటెంట్ హక్కులు లేనివి) అందుబాటులో ఉండేందుకు కారణమైంది భారత్! ప్రాణాంతక హెచ్ఐవీ నియంత్రణలో ఈ జెనెరిక్ ఔషధాలది చారిత్రాత్మక పాత్ర. భారతీయ ఫార్మా కంపెనీల జెనెరిక్ ఉత్పత్తుల్లేకపోతే ఈ రోజు అమెరికా సహా పలు దేశాల్లో పరిస్థితులు భిన్నంగా ఉండేవి. చరిత్రను తరచి చూస్తే... భారతీయ ఫార్మా రంగం సాధించిన ఘన విజయాలకు ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది. 1970లలో ప్రాసెస్ పేటెంట్లకు కట్టుబడుతూనే... ప్రాడక్ట్ పేటెంట్లకు భారత్ ‘నో’ చెప్పిన విషయం తెలిసిందే. ఈ ఏర్పాటు వల్ల పశ్చిమ దేశాల్లో పేటెంట్ హక్కులున్న ఖరీదైన మందులను కూడా ప్రత్యా మ్నాయ మార్గాల ద్వారా చౌకగా తయారు చేసే వీలేర్పడింది. ఫలితంగానే భారత్ మోతాదుల పరంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఫార్మా పరిశ్రమగా అవతరించగలిగింది. విలువ ఆధారంగా చూస్తే మాత్రం మనది 14వ స్థానం. భారత ఫార్మా రంగం మార్కెట్ విలువ 5,000 కోట్ల డాలర్లు కాగా ఇందులో సగం ఎగుమతుల ద్వారా లభిస్తోంది. ప్రపంచ టీకా డిమాండ్‌లో 60 శాతాన్ని భారత్ పూరిస్తోందంటే పరిస్థితి ఏమిటన్నది తెలుస్తుంది. అమెరికా జెనెరిక్ మందుల డిమాండ్‌లో 40 శాతం భారత్ ద్వారా తీరుతోంది. యూకే ఔషధా లన్నింటిలో 25 శాతం ఇక్కడి నుంచే వెళుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్‌లో తయారయ్యే మందుల నాణ్యతపై ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నం కారాదు. ఈ రకమైన నమ్మకం ఉన్నందునే గాంబియాలో మన మందుల వాడకం వల్ల పిల్లలు కొందరు మరణించారన్న వార్త కలకలం రేపింది. ఆ వెంటనే ఉజ్బెకిస్తాన్,శ్రీలంక... చివరకు అమెరికా నుంచి కూడా ఇదే రకమైన ఆరోపణలు రావడం పరిస్థితిని మరింత దిగజారేలా చేసింది. మనకు మాత్రం నష్టం లేదా? మందుల కంపెనీల్లో చాలా సందర్భాల్లో కల్తీలను గుర్తించేందుకు అవసరమైన పరికరాలు, తగిన అర్హతలున్న సిబ్బంది కొరత ఉంటుంది. డైఎథిలీన్ గ్లైకాల్ వంటివి అంధత్వానికి కారణమవుతాయి. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఎగుమతుల కోసం ఉద్దే శించిన అన్ని దగ్గుముందులను ప్రభుత్వ పరిశోధన శాలల్లో పరీక్షించాలని ఒక ఆదేశం జారీ చేసింది. కానీ ఇదేమంత సత్ఫలితాలు చూపలేదు. ఎందుకంటే ఫార్మా విషయాలను వాణిజ్య శాఖ పర్యవేక్షించే పరిధి లేకపోవడం. అంతేకాకుండా... వాణిజ్య శాఖ ఇంకో ప్రశ్న కూడా లేవనెత్తింది. అదేమిటంటే, ఇలాంటి కల్తీ దగ్గు మందుల కారణంగా భారతీయ రోగులకు హాని జరగడం లేదా అని! జమ్మూలో అదే జరిగింది. 2019 డిసెంబరు 2020 జనవరి మధ్య కాలంలో కల్తీ దగ్గుమందు వేసుకోవడం వల్ల దాదాపు 12 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది ఇంకో చిత్రమైన ఘటన జరిగింది. 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ స్థానంలో డ్రగ్స్, మెడికల్ డివైజెస్ అండ్ కాస్మోటిక్స్ బిల్ 2023ను ప్రవేశపెట్టాలని ప్రయత్నించారు. ఇప్పు డున్న వివాదాస్పద అంశాలు వేటికీ ఇందులో చోటు లేకుండా పోయింది. ఫార్మా రంగం సంస్కరణలు లక్ష్యంగా తీసుకొచ్చే ఏ కొత్త చట్టమైనా లైసెన్సింగ్ ప్రక్రియను కేంద్రీకృతం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే దేశవ్యాప్తంగా ఔషధ నియంత్రణ ఏకరీతిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం 28 రాష్ట్రాల్లో డ్రగ్ రెగ్యులేటర్స్ ఉన్నారు. జాతీయ స్థాయిలో ఒకే ఒక్క డ్రగ్ రెగ్యులేటింగ్ వ్యవస్థ... ఈ వ్యవస్థకు సలహా సూచనలు అందించేందుకు రెండు స్టాట్యుటరీ వ్యవస్థలు ఉంటే సరిపోతుంది. డ్రగ్ కంట్రోలర్ కార్యాలయం కూడా స్వతంత్ర సంస్థగా ఉండాలి. దీనివల్ల మంత్రుల ఆమోదం లేకుండానే డ్రగ్ కంట్రోలర్ అవసర మైనప్పుడు నిపుణులను నియమించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే వ్యతిరేక పవనాలు... ఫార్మా రంగానికి సంబంధించి ఇప్పటికే కొన్ని వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఫార్మా దిగుమతుల విషయంలో అమెరికా కొన్ని కఠిన మైన చర్యలకు సిద్ధమవుతోంది. భారతీయ ఫార్మా కంపెనీలకు నాణ్యత విషయంలో ఇప్పటికే అగ్రరాజ్యం బోలెడన్ని సార్లు హెచ్చ రికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం కీలకం కానుంది. ఆఫ్రికా దేశాలు కొన్ని కూడా అమెరికా మాదిరిగానే ఆలోచిస్తూండటం గమనార్హం. ఇంకో ముఖ్య విషయం... ఫార్మా రంగ పరీక్షలకు సంబంధించి అందరికీ అందుబాటులో ఉండేలా ఒక ఐటీ వేదిక సృష్టి వెంటనే జరగాలి. గత సమాచారం, ప్రస్తుత పరిణామాలన్నింటికీ ఈ వేదిక ఒక రెఫరెన్ ్స పాయింట్లా ఉండాలి. పరిశ్రమ వర్గాలతోపాటు నియంత్రణ సంస్థలు, ఈ అంశంపై పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఈ వేదికను ఉపయోగించుకుని తమ సామర్థ్యాన్ని మెరుగుపరచు కోవచ్చు. ఆన్ లైన్ ప్రభుత్వ సేవల రంగంలో భారత్‌కు ఉన్న అను భవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇదేమంత పెద్ద సంగతి కానేకాదు. ఫార్మా రంగ సంస్కరణల విషయంలో వాంఛనీయమైన పరిణామం ఏదైనా ఉందంటే అది ఇటీవలి కాలంలో సంబంధిత మంత్రి చేసిన ఒక ప్రకటన. ‘‘ఫార్మా రంగ నియంత్రణ అనేది సహ కార సమాఖ్య తీరులో సాగాలి’’ అన్న ఆయన మాటలు ఆచరణలోకి వస్తే వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుకోవడమే కాకుండా... ఒకరికి ఒకరు ఆసరాగా నిలవడం ద్వారా మరింత బలోపేతం కావచ్చు కూడా. పార్టీల మధ్య తీవ్రమైన వైరం నెలకొన్న... త్వరలోనే పార్లమెంటరీ ఎన్నికలు ఇంకో ఆరు నెలల్లో జరగబోతున్న నేపథ్యంలో ఈ మాత్రం మార్పు ఆహ్వానించదగ్గదే! సుబీర్ రాయ్ వ్యాసకర్త సీనియర్ ఆర్థిక విశ్లేషకులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
200 బిలియన్ డాలర్లకు ఫార్మా రంగం - 2030 నాటికి..
న్యూఢిల్లీ: ప్రస్తుతం దాదాపు 50 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఫార్మా పరిశ్రమ 2030 నాటికి విలువపరంగా 4–5 రెట్లు వృద్ధి చెందనుంది. తయారీని, ఎగుమతులను పెంచుకోవడం ద్వారా 200 బిలియన్ డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందన్న అంచనాలు నెలకొన్నాయి. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఫార్మాస్యూటికల్స్ విభాగం కార్యదర్శి అరుణిష్ చావ్లా ఈ విషయాలు తెలిపారు. 2030 నాటికి 200 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాలంటే ఫార్మా పరిశ్రమ ఏటా రెండంకెల స్థాయిలో వృద్ధి చెందాలని, దిగుమతులను తగ్గించుకుని.. ఎగుమతులపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ‘ఇందుకోసం మనం దిగుమతులపై ఆధారపడుతున్న నిర్దిష్ట రంగాలను ఎంపిక చేసుకోవాలి. వచ్చే పదేళ్లలో ఆయా విభాగాలన్నింటిలోనూ మనం ఎగుమతిదార్లుగా ఎదిగేలా విధానాలను రూపొందించుకోవాలి’ అని చావ్లా పేర్కొన్నారు. ‘కొత్తగా స్మార్ట్ ఔషధాల తరం వస్తోంది. వచ్చే 20–30 ఏళ్లలో ఎంతో సంక్లిష్టమైన అనారోగ్యాలకు కూడా స్మార్ట్‌గా చికిత్సను అందించగలిగే కొత్త థెరపీలు రాబోతున్నాయి. దాని కోసం మనం అంతా సంసిద్ధంగా ఉండాలి’ అని ఆయన చెప్పారు. ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాలతో పాటు పరిశ్రమకు ప్రభుత్వం విధానపరంగా అన్ని రకాల తోడ్పాటు అందిస్తోందని చావ్లా వివరించారు. భారత్ ఇప్పటికే చాలా విభాగాల్లో ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు. కొత్త టెక్నాలజీలు వస్తుండటంతో పాటు పరిశోధనలకు సంబంధించి విద్యా సంస్థలు, ప్రయోగశాలలు, పరిశ్రమ కలిసి పని చేస్తున్న నేపథ్యంలో కీలకమైన దాదాపు అన్ని మెడికల్ టెక్నాలజీ ఉత్పత్తులను ఎగుమతి చేయగలిగే స్థాయికి ఎదగగలమని చావ్లా ధీమా వ్యక్తం చేశారు. ఫార్మా రంగంలో ప్రపంచ దిగ్గజంగా ఎదిగేందుకు సాంకేతిక వనరులు, నిపుణులు, పురోగామి ప్రభుత్వ విధానాలు మొదలైన వాటన్నింటినీ సమర్ధవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. -
ఈ చట్టంతో సాధించేదేమిటి?
ఎంతోకాలంగా అటు ఔషధ పరిశ్రమలవారూ, ఇటు ప్రజారోగ్యరంగ కార్యకర్తలూ ఎదురు చూస్తున్న జనవిశ్వాస్ బిల్లు గత నెల 27న లోక్‌సభలో, ఈ నెల 2న రాజ్యసభలో ఆమోదం పొందింది. మణిపుర్‌పై అట్టుడుకుతున్న కారణంగా పార్లమెంటులో తీవ్రగందరగోళం ఏర్పడిన నేపథ్యంలో ఎలాంటి చర్చా లేకుండా మూజువాణి ఓటుతో గట్టెక్కిన ముఖ్యమైన బిల్లుల్లో ఇది కూడా చేరిపోయింది. 19 మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 42 చట్టాలకు ఈ బిల్లు సవరణలు ప్రతిపాదించింది. ఇప్పుడు అమల్లో ఉన్న 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఔషధ రంగ పరిశ్రమలు ఎప్పటినుంచో చెబుతున్నాయి. అయితే ఆ చట్టంలోని లొసుగుల వల్ల నాసిరకం ఔషధ తయారీదారులపై కఠిన చర్యలు సాధ్యం కావటం లేదన్నది ప్రజారోగ్యరంగ కార్యకర్తల విమర్శ. తాజా సవరణ బిల్లు దాన్ని మెరుగుపరచకపోగా మరింత నీరుగార్చిందని వారి వాదన. ఈ బిల్లు మొత్తం 180 స్వల్ప నేరాలకు జైలు శిక్ష బదులు జరిమానాతో సరిపెట్టింది. చిన్న చిన్న సమస్యలను సైతం భూతద్దంలో చూపి జైలుకు పంపుతున్న ధోరణి సరికాదనీ, ప్రతి చిన్న అంశంలోనూ అధికారులకు వివరణ ఇవ్వాల్సి రావటం, కేసుల్లో ఇరుక్కుంటే న్యాయస్థానాల చుట్టూ తిరగటం ఉత్పాదకతకు అవరోధమవుతున్నదనీ ఔషధరంగ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. వారి కోణంలో ఈ సవరణలు మంచివే కావొచ్చుగానీ, రోగుల కోణం నుంచి దీన్ని పరిశీలించారా అన్నది సందేహమే. ఫార్మారంగంలో మన దేశం అంతర్జాతీయంగా ముందంజలో ఉంది. కానీ కొన్ని ఫార్మా సంస్థలు నాసిరకం మందులు ఎగుమతి చేసి దేశం పరువుప్రతిష్ఠలను దెబ్బతీస్తున్న ఉదంతాలు తక్కువేం కాదు. మన దేశంనుంచి ఎగుమతైన దగ్గుమందు సేవించి ఆఫ్రికా ఖండ దేశం గాంబియాలో నిరుడు 70 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఆమధ్య ఉజ్బెకిస్తాన్‌లో కూడా 19 మంది పిల్లలు చనిపోయారు. ఇక్కడి నుంచి అమెరికాకు ఎగుమతైన కంటికి సంబంధించిన మందు వికటించి నిరుడు మే నెల నుంచి ఈ ఏడాది జనవరి వరకూ 55 మందికి సమస్యలు తలెత్తాయి. అందులో ఒకరు మరణించారు కూడా. పాత చట్టం కఠినంగా ఉన్నదని ఫార్మారంగం మొత్తుకుంటున్న కాలంలోనే ఇలాంటి ఉదంతాలు జరిగితే దాన్ని నీరుగార్చటం సమస్యను మరింత పెంచదా అన్న సందేహం ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు అమల్లో ఉన్న చట్టం కల్తీ మందులు, నకిలీ మందులు, తప్పుదోవ పట్టించే పేర్లతో మందుల చలామణీ, నాణ్యతా ప్రమాణం కొరవడిన మందులు అని నాలుగు రకాలుగా వర్గీకరించింది. ఆ మందులు వాడినవారికి ఎదురయ్యే సమస్య తీవ్రతను బట్టి ఆ నేరాలకు శిక్షలున్నాయి. కల్తీ, నకిలీ మందులవల్ల రోగి మరణం సంభవించిన పక్షంలో అందుకు కారకులని గుర్తించినవారికి పదేళ్ల నుంచి యావజ్జీవ శిక్ష వరకూ ఉన్నాయి. తప్పుడు అభిప్రాయం కలిగించే బ్రాండ్లతో మందులు చలామణి చేస్తే రెండేళ్ల వరకూ శిక్ష ఉంది. ప్రామాణిక నాణ్యత లేని మందుల (ఎన్ఎస్క్యూ) తయారీకి రెండేళ్ల వరకూ శిక్ష, రూ. 20,000 వరకూ జరిమానా విధించవచ్చు. వీటన్నిటికీ తాజా బిల్లు అయిదు లక్షల వరకూ జరిమానాలతో సరిపెట్టింది. జైలు శిక్షలు తొలగించింది. ఇతర నేరాల మాటెలావున్నా ఎన్ఎస్క్యూ కేటగిరీ కిందకొచ్చే కేసులకు జైలు శిక్ష బెడద లేకుండా చేయటాన్నే ప్రధానంగా ప్రజారోగ్య రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆఖరి కేటగిరీ 27(డి) కిందే దేశంలో ఎక్కువ కేసులు నమోదవుతుంటాయి. ఔషధంలో వినియోగించిన పదార్థాలు అనుమతించిన మోతాదులో కాకుండా వేరేవిధంగా ఉంటే ఆ ఔషధం రోగికి నిరుప యోగమవుతుంది. కానీ కొన్నిసార్లు జబ్బు ముదిరి మరణానికి దారితీసే ప్రమాదం ఉంటుందన్నది నిపుణుల వాదన. అలాంటి కేటగిరీని సైతం చిన్న తప్పిదంగా పరిగణించి జరిమానాలతో సరిపెడితే ఔషధ నాణ్యత దెబ్బతినదా... ప్రజారోగ్యం ప్రమాదంలో పడదా అని వారు ప్రశ్నిస్తున్నారు. నిజానికి నిరుడు ఈ బిల్లు ముసాయిదాను ప్రకటించి అన్ని వర్గాల నుంచీ అభిప్రాయాలు కోరినప్పుడు ప్రజారోగ్య నిపుణులు ప్రధానంగా దీనిపైనే అభ్యంతరం తెలిపారు. అసలు ఫార్మా కంపెనీలు నిబంధన ప్రకారం రిజిస్టరయిన ఫార్మాసిస్టులను నియమించు కోవాల్సి వుండగా చాలా సంస్థలు దాన్ని ఉల్లంఘిస్తున్నాయి. అకారణంగా వేధించటాన్ని ఎవరూ సమర్థించరు. కానీ రోగుల ప్రాణాలతో ఆడుకునే విధంగా, కేవలం లాభార్జనే ధ్యేయంగా ఉండే సంస్థల విషయంలో కఠినంగా ఉండొద్దా? అసలే తరచు బయటి కొచ్చే ఉదంతాల వల్ల విదేశాల్లో మన ఫార్మా ఉత్పత్తులపై చిన్నచూపు పడుతోంది. మన చట్టాలు చాలా ఉదారంగా ఉండటంవల్లే, తగిన తనిఖీలు లేనందువల్లే ఇదంతా జరుగుతోందన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు తీసుకొచ్చిన బిల్లు ఆ అభిప్రాయాన్ని పోగొట్టే విధంగా లేకపోగా మరింత సరళంగా మార్చిందని ప్రజారోగ్య కార్యకర్తల ఆరోపణ. కేవలం కఠిన శిక్షలు, తనిఖీలు మాత్రమే సమస్యకు పరిష్కారం కాకపోవచ్చు. కానీ కల్తీ, నకిలీ మందుల కారణంగా రోగి ప్రాణం కోల్పోయినా, తీవ్రమైన వైకల్యం సంభవించినా ఆ రోగి కుటుంబానికి భారీయెత్తున పరి హారం చెల్లించే నిబంధన ఉంటే ఔషధ తయారీ సంస్థ దారికి రాదా? దీనికి బదులు రూ. 5 లక్షల జరిమానాతో సాధించేదేమిటి? ఈమాత్రం జరిమానా చెల్లించలేని స్థితిలో ఏ సంస్థయినా ఉంటుందా? పటిష్టమైన పర్యవేక్షణ, పారదర్శకత, నేరం చేస్తే కఠిన శిక్ష, భారీ పరిహారం చెల్లింపు తప్పదన్న భయం ఉంటేనే పరిస్థితి చక్కబడుతుంది. ఇవేమీ లేకుండా చట్టం తెచ్చి ప్రయోజన మేమిటి? -
పల్లెపల్లెకూ ఫార్మసీ స్టోర్!
న్యూఢిల్లీ: మారిన జీవనశైలి, ఆహార నియమాలతో పట్టణం, పల్లె అని వ్యత్యాసం లేకుండా ప్రజలు పలు రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ తదితర జీవనశైలి వ్యాధులు పెరిగిపోయాయి. దీనికితోడు వైద్య వసతులు పెరగడంతో పల్లెల్లోనూ ఔషధ విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. దీంతో ఫార్మసీ స్టోర్లు జోరుగా తెరుచుకుంటున్నాయి. ముఖ్యంగా కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్యం పట్ల ఏర్పడిన అవగాహన సైతం ఔషధ వినియోగాన్ని పెంచింది. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం, ఏటా మార్కెట్లోకి పెద్ద సంఖ్యలో ఫార్మాసిస్టులు రావడం కూడా ఔషధ దుకాణాల సంఖ్య విస్తరణకు మద్దతుగా ఉంటున్నాయి. ఏటా 4,50,000 మంది ఫార్మసీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తుంటే, ఇందులో 40,000–45,000 వరకు సొంతంగా దుకాణాలను తెరుస్తున్నట్టు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ జనరల్ సెక్రటరీ రాజీవ్ సింఘాల్ తెలిపారు. దేశంలో 12 లక్షల మంది ఫార్మాసిస్టులకు ఈ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘‘ఫార్మాసిస్టులు పల్లె బాట పడుతున్నారు. కశీ్మర్ నుంచి కన్యాకుమారి వరకు కనీసం 1,000–2,000 మంది జనాభా ఉన్న ప్రతి ఊరులోనూ ఫార్మసీ స్టోర్ ఉంది’’అని సింఘాల్ వెల్లడించారు. కరోనా మహమ్మారి తర్వాత ప్రజలు తమ ఆరోగ్య సమస్యల విషయంలో శ్రద్ధ చూపిస్తున్నారని, క్రమం తప్పకుండా ఔషధాలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం పల్లెలు, చిన్న పట్టణాల్లో ఔషధ విక్రయాలు పెరగానికి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కీలకంగా పనిచేస్తోంది. ఈ పథకం కింద 26,055 నెట్వర్క్ ఆస్పత్రుల్లో 4.3 కోట్ల మంది చేరి వైద్యం పొందినట్టు 2022–23 ఆర్థిక సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 1,54,070 ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ కేంద్రాలు ప్రిస్కిప్షన్‌ను జారీ చేస్తే ఔషధాలను ప్రభుత్వ చానళ్ల ద్వారా లేదంటే ప్రైవేటు ఫార్మసీ స్టోర్లలో కొనుగోలు చేసుకుంటున్నట్టు సింఘాల్ తెలిపారు. దీంతో మారుమూల ప్రాంతాల్లోనూ ఔషధాలకు డిమాండ్ ఏర్పడినట్టు చెప్పారు. భారత ఫార్మా మార్కెట్లో టైర్–2 నుంచి టైర్–6 వరకు పట్టణాల వాటా 21 శాతంగా ఉంటుందని అంచనా. ఔషధాలకు డిమాండ్ ఏర్పడడంతో ఫార్మసీ కంపెనీలు సైతం మార్కెటింగ్ సిబ్బందిని చిన్న పట్టణాల్లోనూ మోహరిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సిబ్బందిని పెంచుకుంటున్నాయి. తమకున్న విస్తృత నెట్‌వర్క్‌తో దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రాంతాల్లో అందుబాటు ధరలకే నాణ్యమైన ఔషధాలను అందిస్తున్నట్టు సన్‌ఫార్మా ప్రతినిధి తెలిపారు. ‘‘నేను దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ప్రజలు, మా కంపెనీ స్టాకిస్టులు, అమ్మకాల సిబ్బందితో మాట్లాడాను. రహదారులు, ఆస్పత్రులు, విద్యుత్ తదితర సదుపాయాల విస్తరణతో ప్రజలు తమ స్వస్థలాల్లోనే ఉండాలనుకుంటున్నారు. మెట్రో పట్టణాలకు రావాలని అనుకోవడం లేదు. కరోనా తర్వాత సొంత గ్రామాల్లోనే ఉండాలన్నది వారి అభీష్టంగా ఉంది’’అని మ్యాన్ కైండ్ ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ రాజీవ్ జునేజా వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకం సైతం అమ్మకాలు పెరగడానికి తోడ్పడుతున్నట్టు తెలిపారు. చిన్న పట్టణాల్లోనూ వైద్యుల అందుబాటు పెరిగినట్టు ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి కృష్ణకుమార్ పేర్కొన్నారు. ‘‘మాకు 140 పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ ఉన్నాయి. ఒక్కోటీ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల పరిధిని కవర్ చేస్తుంది. ఈ పాయింట్లను 300కు పెంచుతున్నాం. దేశంలో 85 శాతం ప్రాంతాలను చురుకోగలం’’అని వివరించారు. -
రూ. లక్షన్నర కోట్ల ఎగుమతులు
సాక్షి, అమరావతి: వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. 2019–20లో తొలిసారిగా రూ.లక్ష కోట్ల మార్కును చేరుకున్న రాష్ట్ర ఎగుమతులు నాలుగేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల మార్కును అధిగమించాయి. 2019–20లో రాష్ట్రం నుంచి రూ.1,04,829 కోట్ల ఎగుమతులు జరగగా 2022–23 నాటికి రూ.1,59,368.02 కోట్ల మార్కును చేరుకోవడం గమనార్హం. నాలుగేళ్లలో ఎగుమతులు దాదాపు రూ.55 వేల కోట్ల మేర పెరిగాయి. రాష్ట్రాల వారీగా ఎగుమతుల వివరాలను కేంద్ర వాణిజ్య శాఖ తాజాగా విడుదల చేసింది. అత్యధికంగా ఆక్వా 2022–23లో దేశవ్యాప్తంగా రూ.36,20,630.9 కోట్ల విలువైన ఎగుమతులు జరగగా 4.41 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో నిలిచింది. రూ.12,00,001.94 కోట్ల ఎగుమతులతో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఏపీ నుంచి అత్యధికంగా రూ.19,872.82 కోట్ల విలువైన ఆక్వా ఎగుమతులు జరగగా రూ.9,919 కోట్ల ఎగుమతులతో ఫార్మా రంగం రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలవారీగా చూస్తే ఉమ్మడి విశాఖ రూ.48,608.59 కోట్ల విలువైన ఎగుమతులతో అగ్రభాగాన ఉంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రూ.31426.23 కోట్ల ఎగుమతులతో ఆ తర్వాతి స్థానం దక్కించుకుంది. 10 శాతం మార్కెట్ వాటాపై దృష్టి దేశీయ ఎగుమతుల్లో 2030 నాటికి 10 శాతం వాటాను సాధించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా 2025–26 నాటికి రాష్ట్రంలో అదనంగా 110 మిలియన్ టన్నుల అదనపు సామర్థ్యం అందుబాటులోకి తెచ్చే విధంగా ఏకకాలంలో నాలుగు పోర్టులను నిర్మిస్తున్నారు. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ సెజ్‌ల్లో కొత్తగా నాలుగు పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.18,897 కోట్లను వ్యయం చేస్తోంది. రామాయపట్నం పోర్టు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానుండగా మిగిలిన పోర్టులు 18 నుంచి 24 నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. వీటికి అదనంగా రూ.3,700 కోట్లతో మరో పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోంది. వీటి చెంతనే ఫుడ్ పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. నాలుగు ఫిషింగ్ హార్బర్లు ఈ సంవత్సరాంతానికి అందుబాటులోకి రానుండగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. కొత్తగా ని ర్మించే నాలుగు పోర్టుల ద్వారా అదనంగా లక్ష మందికి ఉపాధి లభించడంతో పాటు రాష్ట్ర జీడీపీ, ప్రజల తలసరి ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదవుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో.. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విస్తరించడంతో జిల్లాల వారీగా ఎగుమతి అవకాశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఎగుమతిదారులకు చేయూతనందించేలా తగినంత మంది అధికారులు అందుబాటులోకి వచ్చారు. విదేశాలకు ఇతర ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలతోపాటు కొత్త దేశాల్లో అవకాశాలను గుర్తించి స్థానిక అవకాశాలను పరిశీలిస్తున్నాం. సుదీర్ఘ తీరప్రాంతాన్ని వినియోగించుకుంటూ సముద్ర ఆధారిత వాణిజ్య అవకాశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాం. నాలుగు పోర్టులతో పాటు పోర్టులకు ఆనుకుని పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. – ప్రవీణ్ కుమార్, సీఈవో, ఏపీమారిటైమ్ బోర్డు. -
ఫార్మా అమ్మకాలు భేష్
న్యూఢిల్లీ: దేశీ ఫార్మా రంగం గత నెల(మార్చి)లో పటిష్ట వృద్ధిని సాధించింది. 2022 మార్చితో పోలిస్తే 13 శాతం పురోగతిని అందుకుంది. వెరసి వరుసగా రెండో నెలలోనూ రెండంకెల అమ్మకాలు నమోదయ్యాయి. ఇందుకు ప్రధానంగా మూడు రకాల చికిత్సలు దోహదపడ్డాయి. నిజానికి గతేడాది మార్చిలో ఫార్మా అమ్మకాలు 2 శాతం నీరసించాయి. కాగా.. పరిశ్రమ వర్గాల వివరాల ప్రకారం ఈ ఫిబ్రవరిలో 20 శాతంపైగా జంప్‌చేశాయి. దీంతో 2022–23లో మొత్తం ఫార్మా విక్రయాల్లో 9.3 శాతం పురోభివృద్ధి నమోదైంది. అంతక్రితం ఏడాది 14.6 శాతం పుంజుకోగా.. 2020–21లో అమ్మకాలు 2.1 శాతమే బలపడ్డాయి. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రయివేట్ వెల్లడించిన వివరాలివి. యాంటీఇన్ఫెక్టివ్స్, శ్వాససంబంధ(రెస్పిరేటరీ), నొప్పి నివారణ(పెయిన్ మేనేజ్మెంట్) విభాగాల నుంచి 30% ఆదాయం నమోదైనట్లు ఇండియా రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ కృష్ణనాథ్ ముండే పేర్కొన్నారు. ఇతర విభాగాలు అంతంతమాత్ర అమ్మకాలు మాత్రమే సాధించినప్పటికీ టాప్–10 థెరపీల నుంచి పరిశ్రమ ఆదాయంలో 87 శాతం లభించినట్లు వివరించారు. రానున్న రెండేళ్లలోనూ 10–11 శాతం వృద్ధికి వీలున్నట్లు ఈ సందర్భంగా అంచనా వేశారు. జూన్ నుంచీ స్పీడ్ గతేడాది(2022) జూన్ నుంచి ఫార్మా రంగంలో రికవరీ ఊపందుకున్నట్లు ఇండియా రేటింగ్స్ పేర్కొంది. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో ప్రతికూల అమ్మకాలు నమోదుకాగా.. 2022 జూన్ నుంచి 2023 మార్చి కాలంలో 12.6 శాతం పురోగతిని సాధించాయి. అక్టోబర్, జనవరిల్లో అమ్మకాలు కొంతమేర మందగించినప్పటికీ పటిష్ట వృద్ధి నమోదైంది. పరిమాణంరీత్యా అమ్మకాలు 4.5 శాతం పుంజుకోగా.. ధరలు 5.6 శాతం మెరుగుపడ్డాయి. కొత్త ప్రొడక్టుల విడుదల 2.9 శాతం మెరుగుపడింది. విభాగాలవారీగా ఏఐవోసీడీ గణాంకాల ప్రకారం 2023 మార్చిలో రెస్పిరేటరీ విభాగం 50 శాతం జంప్‌చేయగా.. యాంటీఇన్ఫెక్టివ్స్ అమ్మకాలు 32 శాతం ఎగశాయి. పెయిన్ మేనేజ్మెంట్ 18 శాతం వృద్ధి చూపింది. ఈ బాటలో గ్యాస్ట్రోఎంటరాలజీ, విటమిన్ల విభాగాలు 8 శాతం చొప్పున బలపడ్డాయి. గుండెసంబంధ(కార్డియాలజీ), మెదడు, నాడీసంబంధ(సీఎన్ఎస్) థెరపీ అమ్మకాలు 6 శాతం, చర్మవ్యాధులు 4 శాతం, స్త్రీసంబంధ ప్రొడక్టుల విక్రయాలు 3 శాతం చొప్పున పెరిగాయి. అయితే యాంటీడయాబెటిక్ విక్రయాలు 2 శాతం వృద్ధికే పరిమితమయ్యాయి. కంపెనీల జోరిలా ఏఐవోసీడీ వివరాల ప్రకారం మార్చిలో కొన్ని ఫార్మా కంపెనీలు మార్కెట్‌ను మించి వృద్ధిని చూపాయి. ఇండొకొ రెమిడీస్ 28 శాతం, సిప్లా, ఎఫ్డీసీ 27 శాతం, అలెంబిక్ ఫార్మా 24 శాతం, గ్లెన్‌మార్క్ 22 శాతం చొప్పున పురోగతిని సాధించాయి. ఇక అబాట్ ఇండియా, ఆల్కెమ్ లేబొరేటరీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, జీఎస్కే ఫార్మా అమ్మకాల్లో 14–18 శాతం మధ్య వృద్ధి నమోదైంది. ఇతర సంస్థలలో ఇప్కా ల్యాబ్ 13 శాతం, టొరెంట్ ఫార్మా, లుపిన్ 9 శాతం, ఎరిస్ లైఫ్‌సైన్సెస్ 7 శాతం, అజంతా ఫార్మా, జేబీ కెమ్, జైడస్ లైఫ్‌సైన్సెస్ అమ్మకాలు 4–5 శాతం స్థాయిలో బలపడ్డాయి. సన్ ఫార్మా, ఫైజర్ అమ్మకాలు 3–2 శాతం పుంజుకోగా, గతేడాది మార్చితో పోలిస్తే సనోఫీ ఇండియా అమ్మకాలు వార్షికంగా 9 శాతం నీరసించాయి. -
ఔషధాల రక్షణ కీలకం
సాక్షి, విశాఖపట్నం: ఫార్మా పరిశ్రమలు కేవలం ఔషద ఉత్పత్తులపైనే కాకుండా... వాటి రక్షణ, నిల్వలపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) సీనియర్ పాలసీ అడ్వైజర్ బ్రూకీ హెగిన్స్ చెప్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏయూ ఫార్మశీ కళాశాల, యూఎస్ ఎఫ్‌డీఏ ఆధ్వర్యాన రెండు రోజులపాటు నిర్వహించిన వర్క్‌షాప్ శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బ్రూకీ హెగిన్స్... ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఫార్మా రంగానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.... నిరంతర పరిశీలన ► ఆహార ఉత్పత్తులే కాదు, ఔషధాల తయారీ, నిల్వల విషయంలో సరైన పద్ధతుల్లో నాణ్యత, భద్రత ప్రమాణాలను పరిశీలిస్తున్నాం. ► మందులు, వైద్య పరికరాల పరిరక్షణకు ఎఫ్‌డీఏ గైడ్‌లైన్స్ పాటించాల్సిందే. ► ఫార్మా పరిశ్రమలు క్లీన్ రూమ్ ప్రమాణాలను పాటించాలి. ముఖ్యంగా స్టెరైల్గా భావించే ఔషధాలను ఉత్పత్తి చేసిన అనంతరం సూక్ష్మజీవుల బారినపడకుండా భద్రపరచాలి. లేదంటే వాటిని వినియోగించేవారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ►అసెప్టిక్ ప్రాసెసింగ్ (సూక్ష్మ కణాలు చేరకుండా భద్రపరచడం) అనేది ఫార్మా ఉత్పత్తుల కార్యకలాపాల్లో అత్యంత ముఖ్యమైనది. ప్రమాదకరమైనది కూడా. ► సాధారణంగా ఒక మనిషి శరీరం నుంచి రోజూ లక్షలాది బ్యాక్టీరియాలు విడుదలవుతుంటాయి. వీటి ద్వారా మందులు తయారుచేసే సమయంలోనే కొన్నిసార్లు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. అందుకే డ్రగ్స్ తయారీలో గ్లోవ్ లెస్ రోబోటిక్స్ అసలైన ప్రత్యామ్నాయంగా భావించవచ్చు. ► డ్రగ్స్ తయారీ, భద్రత విషయంలో భారత్‌లోని ఫార్మా పరిశ్రమలు అద్భుతంగా వ్యవహరిస్తున్నాయి. ► జనరిక్ ఔషధాల తయారీ, సరఫరాలో భారత్ నంబర్ వన్‌గా ఉంది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద డ్రగ్ పరిశ్రమగా, విలువ ప్రకారం పదో స్థానంలో భారత్ ఉంది. ఫార్మారంగంలో అమెరికాతో సత్సంబంధాలు మెరుగుపడుతున్నాయి. -
ఔషధ రంగంలో డీఎఫ్ఈ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’
సాక్షి, హైదరాబాద్: ఫార్మా రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరొందిన డీఎఫ్ఈ ఫార్మా హైదరాబాద్‌లో కొత్తగా ‘క్లోజర్ టు ది ఫార్ములేటర్’ (సీ2ఎఫ్) పేరిట నైపుణ్య కేంద్రాన్ని (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను మంత్రి కేటీ రామారావు సోమవారం ప్రారంభించారు. జీనోమ్ వ్యాలీ సహకారంతో సీ2ఎఫ్ మరింత బలోపేతమై అభివృద్ధి చెందుతుందని కేటీఆర్ అన్నారు. ఔషధాల అభివృద్ధిలో నూతన ఆలోచనలు వాణిజ్య ఉత్పత్తి రూపాన్ని సంతరించుకునేందుకు పట్టే సమయాన్ని సీ2ఎఫ్ తగ్గిస్తుంది. సీ2ఎఫ్ ప్రారంభోత్సవంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్‌సైన్సెస్, ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్, డీఎఫ్ఈ ఫార్మా సీఈవో మార్టి హెడ్మన్ పాల్గొన్నారు. -
‘కాకినాడ’లో.. బల్క్ డ్రగ్ పార్క్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాకినాడ జిల్లా తొండంగి మండలం కేపీ పురం, కోదాడ గ్రామాల పరిధిలో ఇది ఏర్పాటు కానుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ఎస్ఎస్సీ (స్కీమ్ స్టీరింగ్ కమిటీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్) 90 రోజుల్లోగా ప్రాజెక్టు మేనేజ్మెంట్ ఏజెన్సీ అయిన ఐఎఫ్సీఐ(ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కు పంపాలని కేంద్రం కోరింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ పరిధిలోని ఫార్మాసూటికల్స్ విభాగం సంయుక్త కార్యదర్శి ఎన్.యువరాజ్ మంగళవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బల్క్ డ్రగ్స్ పార్క్‌ల ప్రోత్సాహక పథకం ద్వారా దీన్ని చేపట్టేందుకు అంగీకరిస్తూ వారం రోజుల్లోగా తమకు లేఖ పంపాలని అందులో కోరారు. రూ.వేల కోట్ల పెట్టుబడులు.. బల్క్ డ్రగ్ పార్కుల ఏర్పాటును ప్రోత్సహించేందుకు 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద దేశంలో మూడు ప్రాంతాల్లో బల్క్ డ్రగ్ పార్క్‌లను ఏర్పాటు చేస్తామని, అందుకోసం ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కాగా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం 2020–23 ప్రకటించింది. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా తొండంగి మండలం కేపీ పురం, కోదాడ గ్రామాల పరిధిలో రెండు వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిద్వారా రూ.6,940 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. రానున్న ఎనిమిదేళ్లలో పార్క్ ద్వారా రూ.46,400 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని, 10 వేల నుంచి 12 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. కేంద్రం ప్రకటించిన పథకం కింద బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదన పంపాలని, ఒకవేళ ఆమోదించకుంటే సొంతంగా చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. తీవ్ర పోటీలో రాష్ట్రం విజయం.. కేంద్రం ప్రకటించిన పథకం కింద తొండంగి మండలం కేపీ పురం, కోదాడలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం 2020 అక్టోబర్ 15న ప్రతిపాదనలు పంపింది. బల్క్ డ్రగ్ పార్క్‌ను దక్కించుకునేందుకు మనతోపాటు తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు తీవ్రంగా పోటీ పడ్డాయి. దేశంలో అత్యాధునిక ఫార్మా సిటీని విశాఖకు సమీపంలోని పరవాడ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఫార్మా వ్యర్థాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ను సీఎం వైఎస్ జగన్ అగ్రగామిగా నిలిపారు. ఈ రెండు అంశాలు రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదముద్ర వేయడంలో కీలక పాత్ర పోషించాయి. ఫార్మాలో అగ్రగామిగా రాష్ట్రం.. కాకినాడ జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ డీపీఆర్‌ను కేంద్రం ఆమోదించాక రాష్ట్ర ప్రభుత్వం వేగంగా మౌలిక సదుపాయాలను కల్పించనుంది. తద్వారా భారీ పరిశ్రమలు ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. ఫార్మా రంగంలో పెద్ద పరిశ్రమలను ఏర్పాటు చేయడంతోపాటు చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వద్ద ఎంఎస్ఎంఈ ఫార్మా పార్క్‌ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అటు బల్క్ డ్రగ్ పార్క్.. ఇటు ఎంఎస్ఎంఈ ఫార్మా పార్క్‌ల ద్వారా ఫార్మా రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుందని పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. -
ఆశలపల్లకీలో 2022
పారదర్శకత, సమాన అవకాశాలు ఉన్న ఏ రంగమైనా సక్సెస్ అవుతుంది. రియల్టీ పరిశ్రమకూ ఇదే వర్తిస్తుంది. గతేడాది ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వెంటాడితే.. హైదరాబాద్ రియల్టీ మార్కెట్‌ను మాత్రం యూడీఎస్ భూతం మింగేసింది. అనధికారిక విక్రయాలతో ఆరోగ్యకరమైన మార్కెట్ దెబ్బతిన్నది. సిండికేట్‌గా మారిన కొందరు డెవలపర్లు.. నగర రియల్టీ మార్కెట్‌ను ప్రతికూలంలోకి నెట్టేశారు. ప్రభుత్వంతో పాటూ డెవలపర్ల సంఘాలు, స్టేక్ హోల్డర్లు, నిపుణులు ఒక్క తాటిపైకొస్తేనే హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి నూతన సంవత్సరం! సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మాలతో పాటూ బ్యాంకింగ్, సర్వీసెస్ రంగాలన్నీ బాగున్నాయి. కరోనా కాలంలోనూ ఆయా పరిశ్రమ లలో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. స్థిరౖ మెన ఆదాయ వృద్ధి నమోదవుతుంది. మరోవైపు ఇతర నగరాల కంటే హైదరాబాద్‌లో జీవన వ్యయం తక్కువ. అందుబాటు ధరలు, కాస్మోపాలిటన్ సిటీ, ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలతో వ్యక్తిగత ఇన్వెస్టర్లతో పాటు గ్లోబల్ కంపెనీలు హైదరా బాద్ వైపు ఆసక్తిగా ఉన్నాయి. ఇలాంటి శుభ పరిణామంలో సిండికేట్ డెవలపర్లు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తున్నారు. రాష్ట్రంలో ల్యాండ్ టైటిల్ దొరుకుతుందనే విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి తెలిపారు. లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ మార్కె ట్ను సృష్టిస్తేనే హైదరాబాద్ రియల్టీ మార్కెట్ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని అభిప్రాయపడ్డారు. 2022 రియల్టీ మార్కెట్‌కు గృహ రుణ వడ్డీ రేట్లు కీలకం కానుందని.. ప్రస్తుతం ఉన్న 6.5 శాతం ఇంట్రెస్ రేటే కొనసాగితే ఈ ఏడాది మార్కెట్‌ను ఎవరూ ఆపలేరని వివరించారు. 2 లక్షల యూనిట్ల వరకు అవసరం.. అర్బన్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టిసారించింది. ఓఆర్ఆర్తో జిల్లా కేంద్రాలకు, మెట్రో రైల్‌తో ప్రధాన నగరంలో కనెక్టివిటీ పెరిగింది. సిటీలో పెద్ద ఎత్తున ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గింది. దీంతో అందుబాటు ధరలు ఉండే శివారు ప్రాంతాలలో సైతం గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆఫీస్‌లు పునఃప్రారంభం కావటంతో ఇప్పటికే ఉన్న కంపెనీలతో పాటూ కొత్తవి విస్తరణ చేపట్టాయి. దీంతో ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీ పెరిగింది. ఇది రానున్న రోజుల్లో గృహాల డిమాండ్‌ను ఏర్పరుస్తుందని ఎస్ఎంఆర్ బిల్డర్స్ సీఎండీ రాంరెడ్డి అభిప్రాయపడ్డారు. సాధారణంగా హైదరాబాద్‌లో ఏటా 30–40 వేల గృహాలు డెలివరీ అవుతుంటాయి. మరో 70–75 వేల యూనిట్లు వివిధ దశలో నిర్మాణంలో ఉంటాయి. అయితే ఈ ఏడాది అదనంగా 1.5 – 2 లక్షల యూనిట్ల అవసరం ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం నగరంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న యూనిట్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపారు. దీంతో నాణ్యమైన నిర్మాణం, పెద్ద సైజు యూనిట్లకు డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ హైదరాబాద్‌తో పాటూ షాద్‌నగర్, శంకర్పల్లి, చేవెళ్ల, ఆదిభట్ల, నాగార్జున్ సాగర్ రోడ్, శ్రీశైలం జాతీయ రహదారి మార్గంలో డిమాండ్ కొనసాగుతుందని వివరించారు. మేడ్చల్, శామీర్‌పేట మార్గంలో ప్రక్క జిల్లాల పెట్టుబడిదారులు చేపట్టే విక్రయాలే ఉంటాయని తెలిపారు. యాదాద్రిని చూపించి వరంగల్ రహదారి మార్కెట్‌ను పాడుచేశారని పేర్కొన్నారు. సగం ధర అంటే అనుమానించండి.. కరోనా తర్వాత నుంచి నైపుణ్య కార్మికుల కొరత ఏర్పడింది. స్టీల్, సిమెంట్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు, లేబర్ చార్జీలు రెట్టింపయ్యాయి. దీంతో నిర్మాణ వ్యయం చ.అ.కు రూ.300–400 వరకు పెరిగింది. రెగ్యులర్ డెవలపరే నిర్మాణాన్ని పూర్తి చేయడమే సాహసంగా మారిన తరుణంలో.. మార్కెట్ రేటు కంటే 40–50 శాతం తక్కువ ధరకు విక్రయిస్తున్నారంటే ఆ డెవలపర్‌ను అనుమానించాల్సిందే. నిర్మాణ అనుమతులు లేకుండా, రెరాలో నమోదు చేయకుండానే విక్రయిస్తున్నారంటే ప్రాజెక్ట్‌ను ఎలా పూర్తి చేయగలుగుతారనేది కొనుగోలుదారులే విశ్లేషించుకోవాలి. ►నిర్మాణ సంస్థలు ఒకరిని మించి మరొకరు ఆకాశహర్మ్యాలు అని ఆర్భాట ప్రచారానికి వెళ్లకూడదు. అంత ఎత్తులో ప్రాజెక్ట్‌ను చేపట్టే ఆర్థిక స్థోమత, సాంకేతికత, సామర్థ్యం ఉన్నాయా అనేది విశ్లేషించుకోవాలి. అంతే తప్ప పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు తొందరపాటు గురైతే తనతో పాటూ కొనుగోలుదారులూ నిండా మునిగిపోతారని ఆర్క్ గ్రూప్ సీఎండీ గుమ్మి రాంరెడ్డి తెలిపారు. నిర్మాణ అనుమతులు వచ్చాక ప్రాజెక్ట్‌లను లాంచింగ్, విక్రయాలు చేయాలి. దీంతో డెవలపర్, కస్టమర్, బ్యాంకర్, ప్రభుత్వం అందరూ హ్యాపీగానే ఉంటారు. బిల్డర్ ప్రొఫైల్‌ను పరిశీలించకుండా, తక్కువ ధరని తొందరపడి కొనొద్దు. ఒమిక్రాన్ ప్రభావం ఉంటుందా? కరోనా తర్వాత ఇంటి అవసరం పెరిగింది. సొంతిల్లు ఉంటే బాగుంటుందనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో చాలా మంది గృహాల కోసం ఎంక్వైరీలు చేస్తున్నారు. ఇంటి ఎంపికలోనూ మార్పులు వచ్చాయి. వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ విధానం, ఆన్లైన్ క్లాస్‌ల నేపథ్యంలో ఇంట్లో ప్రత్యేకంగా గది ఉండాలని కోరుకుంటున్నారు. ప్రశాంత వాతావరణం, గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ప్రాజెక్ట్‌లు, పెద్ద సైజు గృహాలను ఎంపిక చేస్తున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉంటుందే కానీ తీవ్రత పెద్దగా ఉండదని ప్రభుత్వం చెబుతుంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావటంతో నమ్మకం ఏర్పడింది కాబట్టి ఒమిక్రాన్ ప్రభావం మానసికంగా ఉంటుందే తప్ప రియల్టీ మార్కెట్‌పై పెద్దగా భౌతిక ప్రభావం చూపించకపోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అగ్రిమెంట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దు 100, 200 గజాలను కూడా డెవలప్మెంట్ అగ్రిమెంట్ల కింద రిజిస్ట్రేషన్ చేయకూడదని క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి సూచించారు. వేరే దేశంలోని వ్యాపారస్తులు తక్కువ ధరకు వస్తువులను మన దేశానికి ఎగుమతి చేసి విక్రయిస్తుంటే యాంటీ డంప్ డ్యూటీ ఎలాగైతే చెల్లిస్తారో.. అలాగే యూడీఎస్, ప్రీలాంచ్ డెవలపర్ల నుంచి కూడా అధిక పన్నులు వసూలు చేయాలని అభిప్రాయపడ్డారు. యూడీఎస్, ప్రీలాంచ్ డెవలపర్లను కూడా రెరా పరిధిలోకి తీసుకురావాలని కోరారు. -
ప్రపంచ ఔషధశాల భారత్.. 100 దేశాలకు కరోనా టీకా
న్యూఢిల్లీ: ఈ ఏడాది దాదాపు 100 దేశాలకు 6.5 కోట్లకుపైగా కరోనా టీకా డోసులను ఎగుమతి చేశామని ప్రధాని మోదీ చెప్పారు. భారత ఆరోగ్యసంరక్షణ రంగం ప్రపంచ దేశాల నమ్మకాన్ని చూరగొన్నదని తెలిపారు. భారత్‌ను ప్రపంచ ఔషధశాలగా (ఫార్మసీ) పరిగణిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని టీకా డోసులను విదేశాలకు ఎగుమతి చేయబోతున్నామని వెల్లడించారు. ఫార్మాస్యూటికల్ రంగానికి సంబంధించి తొలి ‘ప్రపంచ ఆవిష్కరణల శిఖరాగ్ర సదస్సు’ను గురువారం ప్రారంభించారు. మనదేశంలో వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకు సానుకూల వాతావరణం కల్పిస్తున్నామని, ప్రోత్సాహం అందిస్తున్నామని మోదీ గుర్తుచేశారు. దీనివల్ల కొత్త ఔషధాల అభివృద్ధి, వినూత్న వైద్య పరికరాల తయారీలో భారత్ అగ్రగామిగా ఎదగడం ఖాయమని చెప్పారు. వైద్య రంగాన్ని గొప్ప స్థాయికి చేర్చగల సామర్థ్యం ఉన్న సైంటిస్టులు, సాంకేతిక నిపుణులు మన దేశంలో ఎంతోమంది ఉన్నారని తెలియజేశారు. ఇండియాను స్వయం సమృద్ధ దేశంగా(ఆత్మనిర్భర్) మార్చడానికి దేశంలోని 130 కోట్ల మంది కంకణం కట్టుకున్నారని ప్రధాని పేర్కొన్నారు. టీకాలు, ఔషధాల అభివృద్ధి, ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలను దేశీయంగానే తయారు చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పుడు ఇదే స్ఫూర్తిని చాటిచెప్పామని ఉద్ఘాటించారు. 150కిపైగా దేశాలకు ప్రాణరక్షక ఔషధాలు, వైద్య పరికరాలు అందజేశామని వివరించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఫార్మా రంగం ఎంతగానో దోహదపడుతోందని ప్రశంసించారు. డిజిటల్ విప్లవంతో కొత్త సవాళ్లు ఆస్ట్రేలియా డైలాగ్‌లో ప్రధాని మోదీ క్రిప్టోకరెన్సీ వాడకం ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరుగుతోందని, ఇది దుష్ట శక్తుల చేతుల్లో పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని∙మోదీ చెప్పారు. డిజిటిట్ విప్లవంతో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు భావ సారుప్యం కలిగిన దేశాలన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ‘ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇనిస్టిట్యూషన్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులతో గురువారం నిర్వహించిన సదస్సులో(సిడ్నీ డైలాగ్) మోదీ ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. ఆధిపత్యం చెలాయించడానికి టెక్నాలజీ ఉపయోగించుకొనే అవకాశం ఉందని గుర్తుచేశారు. ఫ్యూచర్ టెక్నాలజీలో పరిశోధనలు, అభివృద్ధి కోసం ప్రజాస్వామ్య దేశాలు ఉమ్మడిగా పెట్టుబడులు పెట్టాలని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేసే యత్నాలను అడ్డుకొనేందుకు కృషి చేయాలని చెప్పారు. రాజకీయాలు, ఆర్థిక, సామాజిక రంగాలను డిజిటల్ యుగం పునర్నిర్వచిస్తోందని తెలిపారు. డిజిటల్ విప్లవంతో దేశాల సార్వభౌమత్వం, పరిపాలన, విలువలు, హక్కులు, భద్రత విషయంలో కొత్త ప్రశ్నలు ఉదయిస్తున్నాయని వెల్లడించారు. క్రిప్టోకరెన్సీ విషయంలో అప్రమత్తత అవసరమని ఉద్ఘాటించారు. ఇది మన యువతను నాశనం చేసే ప్రమాదం ఉందన్నారు. భారత్‌లో డేటాను ప్రజల సాధికారత కోసం ఒక వనరుగా ఉపయోగిస్తున్నామని గుర్తుచేశారు. డిజిటల్ విప్లవంతో అభివృద్ధికి నూతన అవకాశాలే కాదు, కొత్త సవాళ్లు సైతం ఎదురవుతున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బ్రాడ్‌బ్యాండ్‌తో భారత్‌లో 6 లక్షల గ్రామాలను అనుసంధానించామని తెలిపారు. -
సరైన జీర్ణ వ్యవస్థకు లీ హెల్త్ ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా రంగంలో ఉన్న లీ హెల్త్ డొమెయిన్ సరైన జీర్ణ వ్యవస్థ కోసం ఎంజైమ్యాక్ట్ పేరుతో ఔషధాన్ని ప్రవేశపెట్టింది. శాఖాహార పదార్థాల నుంచి సేకరించిన ఎంజైమ్స్‌తో ఈ ఉత్పాదనను రూపొందించినట్టు కంపెనీ డైరెక్టర్ లీలా రాణి తెలిపారు. ‘ప్యాంక్రియాటిక్ ఎక్సోక్రిన్ లోపం ఉన్న వ్యక్తులకు డైజెస్టివ్ ఎంజైమ్‌లు లేకపోవడం, సిస్టిక్ ఫైబ్రోసిస్, ప్యాంక్రియాస్ తొలగించడం, దీర్ఘకాలిక ప్యాంక్రియాటిటిస్ వల్ల ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోలేరు. మార్కెట్లో ఉన్న జంతు కణ ఆధారిత ప్యాంక్రియాటిన్ ఔషధాల వాడకంతో సమస్యలొస్తున్నాయి. అలాగే వీటిలో మందుల అవశేషాలు స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ ఉండే అవకాశం ఉంది. అందుకే శాఖాహార ఆధారిత ప్యాంక్రియాటిన్ తో ఎంజైమ్యాక్ట్ తయారు చేశాం’ అని తెలిపారు. -
హైదరాబాద్ నుంచే కేన్సర్ నకిలీ మందులు!
సాక్షి, హైదరాబాద్: ముంబైలోని కళ్యాణ్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన కేన్సర్ నకిలీ మందుల తీగ లాగితే హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి డొంక కదిలింది. వీటిని విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుని సరఫరా చేస్తున్నట్లు తేలింది. దీంతో ముంబై ఎకనమికల్ ఆఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) అధికారులు గత వారం వ్యాపారి రాఘవేంద్రరెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఉన్నత విద్య అభ్యసించిన ఇతను హైదరాబాద్ కేంద్రంగా మూడు ఫార్మా సంస్థలను నిర్వహిస్తుండటంతో ఇక్కడా ఆ నకిలీ మందుల విక్రయాలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరానికి చెందిన రాఘవేంద్రరెడ్డి చెన్నైలోని ఐఐటీ నుంచి బీటెక్, అహ్మదాబాద్‌లోని ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. కొన్నాళ్లు లండన్‌లోని ఓ ప్రముఖ కంపెనీలో పని చేసి ఆపై హైదరాబాద్‌కు వచ్చేశారు. ఫార్మా రంగంలో అడుగుపెట్టి.. ఓ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మూడు ఫార్మా సంస్థలను నిర్వహిస్తున్నారు. వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా రష్యా, చైనా, ఈజిప్ట్, టర్కీకి వెళ్లి వచ్చారు. టర్కీకి చెందిన ఓ సంస్థ ప్రతినిధులు ఇతడిని ముగ్గులోకి దింపాయి. కేన్సర్ చికిత్సలో వాడే యాడ్సెట్రస్ ఇంజెక్షన్, ఐక్లూజిగ్ టాబ్లెట్లను జపాన్‌కు చెందిన కంపెనీ తయారు చేస్తుంటుంది. అదే ఫార్ములాతో ఔషధాలను తాము తయారు చేసి తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పారు. అనుమతి లేకున్నా దిగుమతి.. జపాన్ కంపెనీ సరఫరా చేసే ఇంజెక్షన్ ధర రూ.5.8 లక్షలు ఉండగా.. తాము రూ.1.1 లక్షలకే ఇస్తామని, ట్యాబ్లెట్లు కూడా అతి తక్కువ ధరకు సరఫరా చేస్తామని టర్కీ కంపెనీ చెప్పడంతో రాఘవేంద్రరెడ్డి అంగీకరించారు. ఇతడి సంస్థల్లో దేనికీ ఎగుమతి–దిగుమతుల లైసెన్స్ లేదు. అయినా వాటిని దిగుమతి చేసుకుంటున్నారు. ఇలా వచ్చిన వాటిని వివిధ నగరాల్లోని ఔషధ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ముంబైలోని కళ్యాణ్ ప్రాంతానికి చెందిన పూజ రాణా అక్కడి శాంతక్రుజ్లో ప్రైమ్ ఫార్మా పేరుతో ఓ దుకాణం నిర్వహిస్తున్నారు. ఈమెకు రాఘవేంద్రరెడ్డి టర్కీ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న ఔషధాలు పంపుతున్నారు. ఆమె వద్ద తక్కువ ధరకు కేన్సర్ మందులు లభిస్తున్నాయని ప్రచారం జరిగింది. ఈ విషయం జపాన్ సంస్థకు తెలియడంతో వాళ్లు ముంబైకి చెందిన ఓ సంస్థను సంప్రదించారు. తమ ఉత్పత్తుల పేరుతో కొన్ని నకిలీవి మార్కెట్లో ఉన్నాయని, వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధీకృత అధికారాలు ఇచ్చారు. దీంతో ఆ సంస్థ సెప్టెంబర్ చివరి వారంలో ముంబై ఈఓడబ్ల్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. కొనుగోలుదారుల మాదిరిగా... నేరుగా వెళ్లి దాడి చేస్తే ఆధారాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు.. ఈ నెల 1న కొనుగోలుదారుల మాదిరిగా ప్రైమ్ ఫార్మాకు వెళ్లారు. టర్కీ నుంచి వచ్చిన ఔషధాలను ఖరీదు చేసి, బిల్లు తీసుకుని పూజను అరెస్టు చేశారు. ఈమె వద్ద భారీ మొత్తంలో లభించిన కేన్సర్ ఔషధాలు నకిలీవిగా తేల్చారు. వీటిని హైదరాబాద్‌కు చెందిన రాఘవేంద్రరెడ్డి సరఫరా చేస్తున్నారని విచారణలో వెల్లడైంది. దీంతో గత వారం ఇక్కడకు వచ్చిన స్పెషల్ టీమ్ ఆయన్ను అరెస్టు చేసి తీసుకువెళ్లింది. ముంబై న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. ఈఓడబ్ల్యూ పోలీసులు ఈ కేసును కాపీ రైట్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్పోటిక్స్ యాక్ట్‌లోని సెక్షన్ల కిందే నమోదు చేశారు. అయితే, తన వ్యాపారంపై ఎలాంటి ఆధారాలు చిక్కండా ఉండటానికి రాఘవేంద్రరెడ్డి తన సెల్‌ఫోన్ ధ్వంసం చేశారు. దీంతో ఆధారాల మాయం చేయడానికి ప్రయత్నించాడని.. ఆ సెక్షన్‌ను జోడించారు. హైదరాబాద్‌లోనూ ఈ మందులు సరఫరా చేసి ఉంటారని ఈఓడబ్ల్యూ అధికారులు అనుమానిస్తున్నారు. తదుపరి విచారణ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి తెలంగాణ పోలీసులు, ఔషధ నియంత్రణ సంస్థలకు సమాచారం ఇవ్వనున్నారు. రాఘవేంద్రరెడ్డి చేసిన నేరంపై పూర్తి ఆధారాలు లభించే వరకు ఆయనతో పాటు సంస్థలకు చెందిన పూర్తి వివరాలు వెల్లడించలేమని ఈఓడబ్ల్యూ అధికారులు పేర్కొన్నారు. -
కరోనా చికిత్సకు ‘హెటెరో’ బూస్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా రంగంలో ఉన్న హైదరాబాద్ సంస్థ హెటెరో తాజాగా టోసిలిజుమాబ్ ఔషధం అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి పొందింది. కోవిడ్–19 చికిత్సలో ఈ మందును వాడతారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్దల్లో స్టెరాయిడ్స్ పనిచేయని, ఆక్సిజన్ అవసరమయ్యే రోగులకు వైద్యులు ఈ ఔషధాన్ని సిఫార్సు చేస్తారు. బయోసిమిలర్ వర్షన్ టోసిలిజుమాబ్‌ను హెటెరో అనుబంధ కంపెనీ హెటెరో హెల్త్‌కేర్ టోసిరా పేరుతో విక్రయించనుంది. 20 మిల్లీలీటర్ల వయల్ రూపంలో కంపెనీ రూపొందించింది. రోషె తయారీ యాక్టెమ్రా ఔషధానికి ఇది జనరిక్ వెర్షన్. హెటెరోకు చెందిన బయోలాజిక్స్ విభాగం హెటెరో బయోఫార్మా హైదరాబాద్ సమీపంలోని జడ్చర్ల వద్ద ఉన్న ప్లాంటులో టోసిరాను ఉత్పత్తి చేస్తోంది. సెపె్టంబర్ చివరి నుంచి ఇది మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ‘ప్రపంచవ్యాప్తంగా టోసిలిజుమాబ్ ఔషధం కొరతను పరిగణనలోకి తీసుకుంటే భార త్లో సరఫరా భద్రతకు డీసీజీఐ ఆమోదం చాలా కీలకం. నిష్పక్షపాతంగా ఔషధం పంపిణీకి ప్రభు త్వంతో కలిసి పని చేస్తాం. కంపెనీ సాంకేతిక సామర్థ్యానికి, కోవిడ్–19 ముఖ్యమైన ఔషధాలను తీసుకురావడానికి సంస్థకు ఉన్న నిబద్ధతకు తాజా అను మతి నిదర్శనం’ అని ఈ సందర్భంగా హెటెరో గ్రూప్ చైర్మన్ బి.పార్థ సారధి రెడ్డి తెలిపారు. -
హైదరాబాద్‌లో జరగనున్న ఏడో ఎడిషన్ ఫార్మాలిటికా ఎక్స్పో
హైదరాబాద్: ఫార్మలిటికా ఎక్స్పో ఏడో ఎడిషన్ హైదరాబాద్‌లో జరగనుంది. ఆగస్టు 13 న హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఫార్మాలైటికా ఎక్స్పోను ఇన్ఫార్మా మార్కెట్స్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు లైవ్ ఇన్-పర్సన్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమం ఆగస్టు 20 వరకు వర్చ్యువల్‌గా జరిగేట్లు ఇన్ఫార్మా ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సులో ఫార్మా రంగానికి చెందిన నిపుణులతో పాటు విశ్లేషకుటు, ల్యాబ్ కెమికల్స్, ఫార్మా మిషనరీ, ప్యాకింగ్ సెక్టార్‌కి చెందిన సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. ఫార్మలిటికా ఎక్స్పో బీటూబీ ఫార్మా కంపెనీలకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ ఎక్స్‌పోలో భాగంగా ఫార్మా రంగంలోని లీడింగ్ కంపెనీలు పాల్గొననున్నాయి. ఫార్మాస్యూటికల్ రంగంలో నాణ్యత హమీ సాంకేతికత, నాణ్యత, రెగ్యులేటరీ, కాంప్లియెన్స్ ప్రమాణాలకు సంబంధించి తాజా ధోరణులను ఫార్మాలిటికా ప్రదర్శించనుంది.ఈ సందర్భంగా ఇన్ఫార్మా మార్కెట్స్ మేనేజింగ్ డైరక్టర్ యేగేష్ ముద్రాస్ మాట్లాడుతూ.. ఫార్మాలిటికా ఎక్స్పోను సరికొత్తగా హైబ్రిడ్ (ఆన్లైన్, ఆఫ్‌లైన్ )రూపంలో ఈ సంవత్సరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఫార్మా రంగంలోని పలు అంశాలను చర్చించేందుకు ఒక వేదికగా ఫార్మాలిటికా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
కుబేరులు డబ్బుల్!
దేశంలో పారిశ్రామిక బిలియనీర్లు (బిలియన్ డాలర్లు/రూ.7,300 కోట్లు అంతకుమించిన సంపద కలిగిన వారు) రోజురోజుకీ మరింత బలపడుతున్నారు. ఏటేటా వీరి సంఖ్య కూడా పెరుగుతూ వెళుతోంది. దేశంలో అగ్రగామి 15 రంగాలకు చెందిన బిలియనీర్ల ఉమ్మడి సంపద గత ఐదేళ్లలో ఏకంగా 60 శాతం పుంజుకుని 2020 డిసెంబర్ చివరికి రూ.37.39 లక్షల కోట్లకు చేరుకున్నట్టు హురూన్ ఇండియా నివేదిక తెలిపింది. 2016లో ఈ 15 పరిశ్రమల్లోని బిలియనీర్ల ఉమ్మడి సంపద విలువ రూ.23.26 లక్షల కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. 2016లో టాప్–15 రంగాల్లో 269 మంది బిలియనీర్లు ఉంటే 2020 నాటికి ఈ సంఖ్య 613కు విస్తరించింది. ముఖ్యంగా ఫార్మా రంగం అత్యధిక సంపద పరులతో ఈ జాబితాలో ముందుంది. 2020లో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను అమలు చేసిన కాలంలోనూ ఫార్మా రంగం ఎటువంటి ఆటంకాల్లేకుండా పనిచేసిన విషయాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. తిరుగులేని ఫార్మా... దేశీయంగా సంపదపరుల జాబితాలో ఫార్మా రంగం 2016 ఏడాది నుంచి ఏటా మొదటి స్థానంలోనే ఉంటూ వస్తోంది. 2016 నాటికి ఈ రంగంలో 39 మంది బిలియనీర్లు ఉండగా.. 2020 చివరికి వచ్చేసరికి ఈ సంఖ్య 121కు వృద్ధి చెందింది. అలాగే, 2016 నాటికి ఉన్న ఉమ్మడి సంపద రూ.5,20,800 కోట్ల నుంచి రూ.8,12,800 కోట్లకు విస్తరించింది. కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ రంగంలోని 55 మంది బిలియనీర్ల ఉమ్మడి సంపద రూ.3.43 లక్షల కోట్లుగా ఉంది. ఎక్కువ మంది బిలియనీర్లతో 2016లో రెండో స్థానంలో ఉన్న ఎఫ్ఎంసీజీ రంగం.. ఐదేళ్లు తిరిగేసరికి 11వ స్థానానికి పడిపోయింది. సంఖ్యా పరంగా దిగువకు వచ్చినప్పటికీ.. ఈ రంగంలోని బిలియనీర్ల సంపద రూ.2.45 లక్షల కోట్ల నుంచి రూ.3.55 లక్షల కోట్లకు పెరిగింది. టెక్నాలజీయే ముందుకు తీసుకెళ్లేది.. ‘‘భారత కంపెనీలు దేశ చరిత్రలో అత్యంత వేగంగా విలువను వృద్ధి చేసుకున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. టెక్నాలజీ ఆధారిత సంపద సృష్టి పూర్తి సామర్థ్యాన్ని అందుకుంటే అప్పుడు బిలియనీర్ల విషయంలో అమెరికాను భారత్ వెనక్కి నెట్టేస్తుంది’’ అని హురూన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనాస్ రెహమాన్ పేర్కొన్నారు. 2020 చివరికి సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ రంగం 50 మంది బిలియనీర్లను కలిగి ఉండగా, వీరి ఉమ్మడి సంపద రూ.5,70,300 కోట్లుగా ఉంది. 2016లో ఈ రంగం 21 మంది బిలియనీర్లతో, రూ.2,42,800 కోట్లతో మూడో స్థానంలో ఉండడం గమనార్హం. ఐదేళ్ల తర్వాత కూడా ఈ రంగం అత్యధిక బిలియనీర్ల పరంగానూ అదే స్థానాన్ని కాపాడుకుంది. ముంబైలో బిలియనీర్ల సంఖ్య 217కు చేరుకుంది. ఇదే నగరంలో 2016 చివరికి 104 బిలియనీర్లు ఉన్నారు. 129 మందితో ఢిల్లీ రెండో స్థానంలోనూ, 67 మంది బిలియనీర్లతో బెంగళూరు, 50 మంది బిలియనీర్లతో హైదరాబాద్, 38 మంది బిలియనీర్లతో అహ్మదాబాద్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. బిలియనీర్ల సంఖ్య విషయంలో ఈ ఐదు నగరాలు గత ఐదేళ్లలోనూ టాప్–5లోనే కొనసాగాయి. చెన్నైలో 37 మంది, కోల్‌కతాలో 32 మంది బిలియనీర్లు ఉన్నారు. -
ఫార్మాకు ని‘బంధనాల’ తగ్గింపుపై కసరత్తు
న్యూఢిల్లీ: దేశీయంగా వ్యాపారాల నిర్వహణను మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ తెలిపారు. ఇందులో భాగంగా ఫార్మా రంగానికి అనేకానేక నిబంధనల పాటింపు భారాన్ని తగ్గించడంపై కసరత్తు చేస్తోందని వివరించారు. ’ది ఇండియా ఫార్మా 2021, ఇండియా మెడికల్ డివైజ్ 2021’ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ‘2030 నాటికి 130 బిలియన్ డాలర్ల టర్నోవరు లక్ష్య సాధనకు అవసరమైన సామర్థ్యాలు దేశీ ఫార్మా పరిశ్రమకు పుష్కలంగా ఉన్నాయి. అలాగే, 2025 నాటికి వైద్య పరికరాల పరిశ్రమ 50 బిలియన్ డాలర్ల స్థాయికి వృద్ధి చెందగలదు‘ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో సంస్కరణలు అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఫార్మా రంగంపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ సందర్భంగా తెలిపారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 145వ స్థానం నుంచి 79వ స్థానానికి వచ్చాం. ఫార్మాలోనూ మన ర్యాంకింగ్ మెరుగుపడి 63వ స్థానానికి చేరాము. సంస్కరణల అమలుకు ఇదే నిదర్శనం‘ అని ఆయన పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో ఔషధాలు అందించాలి .. వృద్ధి సాధనతో పాటు సామాన్యులకు అందుబాటు ధరల్లో ఔషధాలను అందించే ఉన్నత లక్ష్యాలకు కూడా పరిశ్రమ కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నట్లు గౌడ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఫార్మా రంగానికి ఇప్పటికే రూ. 6,564 కోట్ల ప్రోత్సాహకాలిచ్చే ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేసిందని, అలాగే మరో రూ. 15,000 కోట్ల మద్దతుతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) స్కీమును కూడా ఆమోదించిందని ఆయన చెప్పారు. తయారీ రంగ సంస్థలు అంతర్జాతీయ దిగ్గజాలుగా ఎదిగేందుకు తోడ్పాటు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని గౌడ పేర్కొన్నారు. బయోఫార్మా, సంక్లిష్టమైన జనరిక్ ఔషధాలు వంటి స్పెషలైజ్డ్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన సామర్థ్యాలను దేశీయంగా రూపొందించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని వివరించారు. స్వావలంబన భారత్ నినాదంలో భాగంగా రూ. 3,400 కోట్లతో బల్క్ డ్రగ్, మెడికల్ డివైజ్ పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అనుమతులు సులభతరం చేయాలి .. నియంత్రణ వ్యవస్థ విధానాలను మరింత సరళతరం చేయాలని .. ముఖ్యంగా ఔషధాలకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాలని జైడస్ గ్రూప్ చైర్మన్, ఫిక్కీ ఫార్మా కమిటీ మెంటార్ పంకజ్ ఆర్ పటేల్ కోరారు. కొత్తగా ట్యాక్స్ రీఫండ్ స్కీమును ప్రవేశపెట్టాలని కోరారు. వివిధ శాఖలు, విభాగాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఫార్మా రంగ అవసరాలన్నింటి కోసం ఒకే శాఖ, ఒకే డిపార్ట్మెంటు విధానాన్ని అమలు చేయాలన్నారు. -
మార్కెట్ల పతనం- ఫార్మా షేర్ల జోరు
ముంబై, సాక్షి: మళ్లీ యూరోపియన్ దేశాలను కరోనా వైరస్ వణికిస్తుండటంతో తాజాగా హెల్త్‌కేర్ రంగం వెలుగులోకి వచ్చింది. సెకండ్‌వేవ్‌లో భాగంగా ఇప్పటికే యూస్, యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా బ్రిటన్‌లో వైరస్ కొత్త రూపంలో విస్తరిస్తున్నట్లు వెలువడిన వార్తలు ఓవైపు మార్కెట్లను దెబ్బతీస్తుంటే.. మరోపక్క ఔషధ కంపెనీలకు డిమాండ్‌ను పెంచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఓవైపు కోవిడ్-19 కట్టడికి కొత్త ఏడాది(2021)లో పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నప్పటికీ మరికొంత కాలం వైరస్ సంక్షోభం కొనసాగనున్నట్లు ఫార్మా వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా హెల్త్‌కేర్, ఫార్మా కౌంటర్లు జోరందుకున్నాయి. వెరసి బీఎస్ఈలో హెల్త్‌కేర్ ఇండెక్స్ 21,644 వద్ద, ఎన్ఎస్ఈలో ఫార్మా రంగం 12,870 సమీపంలోనూ సరికొత్త గరిష్టాలు చేరాయి. అయితే ప్రస్తుతం సెన్సెక్స్ 300 పాయింట్లు పతనమై 46,660కు చేరగా.. నిఫ్టీ 98 పాయింట్లు క్షీణించి 13,662 వద్ద ట్రేడవుతోంది. (మెడ్‌ప్లస్‌పై వార్బర్గ్ పింకస్ కన్ను!) షేర్ల జోరిలా ఎన్ఎస్ఈలో ప్రస్తుతం సిప్లా 2 శాతం బలపడి రూ. 810 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 817కు ఎగసింది. తొలుత రూ. 905ను తాకిన అరబిందో ప్రస్తుతం 1.2 శాతం పుంజుకుని రూ. 896 వద్ద కదులుతోంది. ఈ బాటలో లుపిన్ 1 శాతం పెరిగి రూ. 983 వద్ద, సన్ ఫార్మా 1 శాతం బలపడి రూ. 580 వద్ద ట్రేడవుతున్నాయి. ఇంట్రాడేలో లుపిన్ రూ. 992 వద్ద, సన్ ఫార్మా రూ. 586 వద్ద గరిష్టాలకు చేరాయి. కాగా.. ఎక్స్‌బోనస్ నేపథ్యంలో వేలియంట్ ఆర్గానిక్స్ 3 శాతం పురోగమించి రూ. 3400 వద్ద కదులుతోంది. తొలుత రూ. 3,488 వరకూ బలపడింది. ఇక బీఎస్ఈలో నెక్టార్లైఫ్, సువెన్ ఫార్మా, జూబిలెంట్, మెట్రోపోలిస్, మార్క్సాన్స్, ఇండొకో, గ్లెన్‌మార్క్, లాల్‌పాథ్, ఆస్ట్రాజెనెకా, లారస్ ల్యాబ్స్ 10-1 శాతం మధ్య జంప్‌చేశాయి. -
ఫార్మాకు ‘విటమిన్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 ప్రభావం భారత్‌లో అన్ని రంగాలపైనా చూపిస్తోంది. ఇందుకు ఫార్మా మినహాయింపు ఏమీ కాదు. అయితే ఈ రంగంలో విభిన్న వాతావరణం నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొన్ని మందుల వినియోగం తగ్గితే, మరికొన్నిటి వాడకం పెరిగింది. ప్రధానంగా గ్యాస్ట్రో, న్యూరో, ఆప్తల్మాలజీ, డెంటల్, గైనిక్ సంబంధ ఔషధాల వినియోగం గణనీయంగా తగ్గింది. వైరస్ ఎక్కడ తమకు సోకుతుందోనన్న భయంతో ఆసుపత్రులకు రోగు లు వెళ్లకపోవడం, చికిత్సలు వాయిదా వేసుకోవడమే ఇందుకు కారణం. కార్డియో, డయాబెటిక్ వంటి మందుల అమ్మకాల్లో పెద్దగా మార్పులేదు. కోవిడ్ చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్, ఫావిపిరావిర్ తదితర ఔషధాల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు ఈ మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకునే పనిలో ప్రజలు నిమగ్నమయ్యారు. విటమిన్ల అమ్మకాలు ఎన్నడూ లేనంతగా జరుగుతున్నాయి. విటమిన్లపైనే ఫోకస్.. దాదాపు అన్ని ఫార్మా కంపెనీల పోర్ట్‌ఫోలియోలో విటమిన్లు కూడా ఉంటున్నాయి. మొత్తం ఫార్మా విక్రయాల్లో కోవిడ్ ముందు వరకు విటమిన్ల వాటా కేవలం 5–10 శాతమే. ఇప్పుడిది 30–40 శాతానికి చేరిందని ఆప్టిమస్ ఫార్మా డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘మల్టీ విటమిన్లు, బి, సి, డి, జింక్ ట్యాబ్లెట్ల అమ్మకాలు గతంలో లేనంతగా పెరిగాయి. కంపెనీలు మొదట శానిటైజర్లు, ఆ తర్వాత విటమిన్ల తయారీ వైపు మొగ్గుచూపాయి. అయితే వీటికి డిమాండ్ అధికమవడంతో ధర 20 శాతం దాకా పెరిగింది. ఇతర ఔషధాల అమ్మకాలు తగ్గినా.. కంపెనీలను విటమిన్లు ఆదుకుంటున్నాయి’ అని అన్నారు. కాగా, కోవిడ్ కారణంగా ఫార్మా రంగంలో ఉద్యోగుల తీసివేతలు జరగలేదని, కొత్త నియామకాలు కొనసాగుతూనే ఉన్నాయని ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ అభ్యర్థుల కోసం పరిశ్రమ ఎదురుచూస్తోందన్నారు. రెండేళ్లలో రూ.1,000 కోట్లు.. యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్, జనరిక్స్, ఇంజెక్టేబుల్స్ తయారీలో భారత్‌లో తొలి స్థానంలో ఉన్న హైదరాబాద్‌లో సుమారు 1,500 దాకా కంపెనీలు ఉన్నాయి. 5 లక్షల పైచిలుకు ఉద్యోగులు ఈ రంగంలో ఉన్నారు. ఎగుమతి మార్కెట్లతోపాటు దేశీయంగా ఔషధాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఒకట్రెండేళ్లలో 25 దాకా కంపెనీల నుంచి కొత్త యూనిట్లు వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. మిగిలిన కంపెనీలు అన్నీ ఇప్పటికే ఉన్న ప్లాంట్లలో విస్తరణకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఈ కంపెనీలు రెండేళ్లలో రూ.1,000 కోట్ల దాకా పెట్టుబడి చేసే అవకాశం ఉంది. తద్వారా కొత్తగా 50,000 మందికి ఉపాధి లభించనుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని బద్దిలో ప్లాంట్లను నిర్వహిస్తున్న కొన్ని కంపెనీలు తదుపరి విస్తరణ హైదరాబాద్‌లో చేపట్టనున్నాయని ఫ్యూజన్ హెల్త్‌కేర్ ఎండీ మధు రామడుగు తెలిపారు. భాగ్యనగరి సమీపంలో ప్రతిపాదిత ఫార్మా సిటీ సాకారం అయితే పెద్ద ఎత్తున కొత్త ప్లాంట్లు ఏర్పాటవుతాయని చెప్పారు. ఏపీలోనూ కంపెనీల విస్తరణ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్న ప్లాంట్లలో విస్తరణ కోసం ఎదురుచూస్తున్నాయని బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఈడీ ఈశ్వర్ రెడ్డి వెల్లడించారు. అయితే పరిమితులు ఇందుకు అడ్డంకిగా ఉన్నాయని అన్నారు. ‘ఫార్మా సిటీ సాకారమయ్యే వరకు వీటి విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. చాలా ప్లాంట్లు యూఎస్ఎఫ్డీఏ అనుమతి ఉన్నవే. కొత్తగా ఎఫ్‌డీఏ నుంచి అనుమతి తీసుకోవాలంటే కనీసం మూడేళ్లు పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు బల్క్ డ్రగ్ పార్క్‌లలో ఒకటి తెలంగాణలో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే రెండేళ్లలో 50–60 యూనిట్లు కొత్తగా వచ్చే అవకాశం ఉంది. బల్క్ డ్రగ్ పరిశ్రమ ఈ ఏడాది 15–20 శాతం వృద్ధి నమోదు చేయనుంది’ అని వివరించారు. ఎగుమతులతో కలుపుకుని భారత ఫార్మా మార్కెట్ విలువ సుమారు రూ.3 లక్షల కోట్లు ఉంది. -
ఫార్మాకు కలిసొచ్చిన ఉత్తర అమెరికా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19, లాక్డౌన్ అడ్డంకులు ఉన్నప్పటికీ భారత్ నుంచి ఔషధ ఎగుమతులు ఏప్రిల్–జూన్‌లో వృద్ధి చెందాయి. ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) గణాంకాల ప్రకారం గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఎగుమతులు 7.16 శాతం అధికమై రూ.37,875 కోట్ల నుంచి రూ.40,590 కోట్లకు చేరాయి. డ్రగ్ ఫార్ములేషన్స్, బయాలాజిక్స్ ఒక్కటే వృద్ధికి తోడైంది. ఇతర విభాగాలన్నీ నిరాశపరిచాయి. డ్రగ్ ఫార్ములేషన్స్, బయాలాజిక్స్ విభాగం 15.14 శాతం వృద్ధితో రూ.31,042 కోట్లు నమోదైంది. మొత్తం ఎగుమతుల విలువలో ఈ విభాగం వాటా ఏకంగా 76.48 శాతం ఉండడం గమనార్హం. వ్యాక్సిన్స్ 30 శాతం, ఆయుష్ 25, సర్జికల్స్ 15.8, బల్క్ డ్రగ్స్, డ్రగ్ ఇంటర్మీడియేట్స్ 8 శాతం, హెర్బల్ ప్రొడక్ట్స్ 2.5 శాతం తిరోగమన వృద్ధి సాధించాయి. ఎగుమతులకు ఊతమిచ్చే బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియేట్స్ ఈ త్రైమాసికంలో మాత్రం 8.38 శాతం మైనస్‌లోకి వెళ్లాయని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ ఆర్.ఉదయ భాస్కర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. దేశీయంగా ఫార్మా రంగం తిరోగమనంలో ఉన్నప్పటికీ ఏప్రిల్–జూన్‌లో ఎగుమతుల వృద్ధి సాధించడం విశేషమన్నారు. కొన్ని ప్రాంతాలు మినహా..: ఎగుమతుల్లో కొన్ని ప్రాంతాలు (రీజియన్లు) మినహా మిగిలినవన్నీ వృద్ధిని నమోదు చేశాయి. మధ్యప్రాచ్య మినహా ఆసియా, లాటిన్ అమెరికా దేశాలు, దక్షిణాసియా, కొన్ని యూరప్ దేశాలు నిరాశపరిచాయి. అయితే 2020 ఏప్రిల్–జూన్‌లో ఉత్తర అమెరికా మార్కెట్ ఎగుమతులకు ఊతమిచ్చింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ రీజియన్ 15.67 శాతం వృద్ధితో రూ.15,450 కోట్ల ఎగుమతులను నమోదు చేసింది. మొత్తం ఎక్స్‌పోర్ట్స్‌లో ఉత్తర అమెరికా వాటా అత్యధికంగా 38 శాతం ఉంది. వృద్ధి పరంగా మధ్య ప్రాచ్య దేశాలు 14 శాతం అధికమై రూ.2,220 కోట్లు, ఆసియాన్ ప్రాంతం 10.5 శాతం హెచ్చి రూ.2,580 కోట్లు సాధించాయి. పరిమాణంలో రెండో స్థానంలో ఉన్న ఆఫ్రికా మార్కెట్లు 0.4 శాతం పెరిగి రూ.6,510 కోట్లు, మూడో స్థానంలో ఉన్న యురోపియన్ యూనియన్ 6.9 శాతం అధికమై రూ.6,000 కోట్ల ఎగుమతులను నమోదు చేశాయి. -
ఫార్మాలో స్వయం సమృద్ధి..
న్యూఢిల్లీ: దేశీయంగా బల్క్ డ్రగ్స్, వైద్య పరికరాల తయారీని మరింతగా ప్రోత్సహించడంపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా బల్క్ డ్రగ్, మెడికల్ డివైజ్ పార్క్‌లను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన నాలుగు స్కీముల మార్గదర్శకాలను కేంద్రం సోమవారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఫార్మా రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించే విధంగా ఈ స్కీమ్‌లను రూపొందించినట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ విలేకరుల సమావేశంలో తెలిపారు. 53 కీలకమైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ), వైద్య పరికరాల తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధించాలన్నది లక్ష్యమని ఆయన వివరించారు. వీటికి సంబంధించి భారత్ ప్రస్తుతం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి పరిణామాలతో అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతిని, దేశీయంగా వైద్యంపై ప్రతికూల ప్రభావాలు పడే పరిస్థితి నెలకొందని మంత్రి చెప్పారు. అయితే, ఫార్మా రంగం, జాతీయ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ క్రియాశీలకంగా వ్యవహరించి ఔషధాల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో లాక్డౌన్ సమయంలోనూ ఇబ్బందులు పడే అవసరం రాలేదన్నారు. ఈ నేపథ్యంలోనే దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని దేశీయంగా ఆయా ఔషధాలు, డివైజ్‌ల ఉత్పత్తిని మరింత పెంచుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోందని మంత్రి చెప్పారు. ‘ప్రస్తుతం దేశీ ఫార్మా రంగ పరిమాణం సుమారు 40 బిలియన్ డాలర్లుగా ఉంది. సరైన తోడ్పాటు అందిస్తే 2024 నాటికి ఇది 100 బిలియన్ డాలర్లకు చేరగలదు. తద్వారా 2025 నాటికల్లా భారత్‌ను 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్య సాధనకు తోడ్పడగలదు‘ అని గౌడ తెలిపారు. ఫార్మా విభాగం రూపొందించిన ఈ స్కీములకు కేంద్ర క్యాబినెట్ ఈ ఏడాది మార్చిలో ఆమోదముద్ర వేసింది. అర్హత ప్రమాణాలను బట్టి ఎంపిక.. పరిశ్రమవర్గాలు, రాష్ట్రాల ప్రభుత్వాలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన మీదట స్కీముల మార్గదర్శకాలు రూపొందించినట్లు గౌడ చెప్పారు. మార్గదర్శకాల్లో పొందుపర్చిన అర్హతా ప్రమాణాల్లో ఆయా ఉత్పత్తి సంస్థలకు వచ్చే మార్కుల ఆధారంగా తయారీ ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) స్కీమునకు ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో ఏర్పాటయ్యే ఈ ఉత్పత్తి పార్కుల్లో అధునాతన ఇన్ఫ్రా, మెరుగైన కనెక్టివిటీ, తక్కువ ధరలకు స్థలం, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు అవసరమైన పటిష్టమైన వ్యవస్థ మొదలైనవన్నీ ఉంటాయని పేర్కొన్నారు. దీనివల్ల కొత్త తయారీ యూనిట్ల ఏర్పాటులో సమయం, పెట్టుబడి వ్యయాలు తగ్గుతాయని వివరించారు. ‘ఈ స్కీములపై కంపెనీల నుంచి సానుకూల స్పందన ఉంటుందని భావిస్తున్నాం. అధునాతన టెక్నాలజీ, పెట్టుబడులను ఈ పార్కులు ఆకర్షించగలవు. కార్యకలాపాలు ప్రారంభమైన రెండు, మూడేళ్లలో ఇవి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల కొద్దీ ఉద్యోగాలను కల్పించగలవు, అలాగే దిగుమతులపై ఆధారపడటం తగ్గించగలవు. గ్లోబల్ ఫార్మా హబ్‌గా భారత్ ఎదిగేందుకు ఉపయోగపడగలవు‘ అని గౌడ చెప్పారు. స్వాగతించిన పరిశ్రమ.. దేశీయంగా బల్క్ డ్రగ్, మెడికల్ డివైజ్‌ల తయారీకి ఊతమిచ్చేందుకు ఉద్దేశించిన స్కీముల మార్గదర్శకాలను పరిశ్రమ స్వాగతించింది. స్కీములు సక్రమంగా అమలైతే 8–10 ఏళ్ల కాలంలో ఏపీఐల తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధించగలదని ఇండియన్ డ్రగ్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐడీఎంఏ) ఈడీ అశోక్ కుమార్ మదన్ తెలిపారు. -
ఆశావహంగా ఫార్మా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికాలో జనరిక్స్ వ్యాపారంపై ధరలపరమైన ఒత్తిళ్లు తగ్గడం, నాణ్యతపరమైన వివాదాలు పరిష్కారమవుతుండటం తదితర అంశాల నేపథ్యంలో ఫార్మా రంగం ఆశావహంగా కనిపిస్తున్నట్లు యూటీఐ ఎంఎఫ్ ఫండ్ మేనేజర్ అమిత్ ప్రేమ్చందాని వెల్లడించారు. తమ పోర్ట్‌ఫోలియోలో దీనిపై ఓవర్‌వెయిట్‌గా ఉన్నట్లు వివరించారు. గడిచిన రెండేళ్లుగా ఆటోమొబైల్ రంగం క్షీణత నమోదు చేసినప్పటికీ ..పరిస్థితి మెరుగై డిమాండ్ పెరిగే కొద్దీ ఈ పరిశ్రమ కూడా కోలుకోగలదని వివరించారు. ఆటో రంగంలో చాలా మటుకు కంపెనీల దగ్గర పుష్కలంగా నిధులున్నందున ప్రస్తుత సంక్షోభం నుంచి బైటపడగలవని, వేల్యుయేషన్లు సముచిత స్థాయిలో ఉన్నాయని అమిత్ తెలిపారు. మరోవైపు, కరోనా వైరస్ పరిణామాల కారణంగా ఆర్థిక సంస్థలకు రుణాల వసూళ్లు దెబ్బతింటున్న దాఖలాలు కనిపిస్తున్నాయ న్నారు. రిజర్వ్ బ్యాంక్ కొంత తోడ్పాటు ఇస్తున్నప్పటికీ, మందగమన మూల్యాన్ని ఆర్థిక సంస్థలు కూడా ఎంతో కొంత చెల్లించుకోవాల్సి రా వచ్చన్నారు. ఫైనాన్షియల్ రంగం మరింత జాప్యం తర్వాత కోలుకోవచ్చని అమిత్ పేర్కొన్నారు. క్రమంగా అనిశ్చితి తగ్గవచ్చు..: కరోనా భయాలతో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతోందని, లాక్డౌన్ ఎత్తివేతను బట్టి క్రమంగా అనిశ్చితి తగ్గవచ్చని అమిత్ తెలిపారు. వచ్చే కొన్ని నెలల పాటు వెలువడే ఆర్థిక గణాంకాలు బలహీనంగానే ఉండొచ్చని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయన్నారు. కరెక్షన్ అనంతరం షేర్లు సముచితంగా, చౌకైన వేల్యుయేషన్‌తో లభ్యమవుతున్నాయని అమిత్ వివరించారు. ఇన్వెస్టర్లు తమ రిస్కు సామర్థ్యాన్ని బట్టి మళ్లీ క్రమంగా పెట్టుబడులు పెట్టవచ్చని పేర్కొన్నారు.