
భారత్‌కు ‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’ అనే బిరుదును తెచ్చిపెట్టిన ఇండియా ఫార్మా రంగానికి అమెరికా పరస్పర సుంకాల ముప్పు పొంచి ఉందని హెటిరో గ్రూప్ వ్యవస్థాపకులు, రాజ్యసభ సభ్యుడు బి.పార్థసారధిరెడ్డి పార్లమెంటులో ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఔషధాలపై భారత్ ప్రస్తుతం 10 శాతం దిగుమతి సుంకం విధిస్తుండగా, అమెరికాలోకి దిగుమతి అయ్యే భారతీయ ఔషధాలపై ఎలాంటి సుంకాలు విధించడం లేదు. యూఎస్ ప్రభుత్వం ఈ అంతరాన్ని పూడ్చేందుకు సుంకాలు విధిస్తే భారత్‌కు నష్టం కలుగుతుందన్నారు.
2023-24లో భారత మొత్తం ఫార్మా ఎగుమతుల్లో అమెరికా 31 శాతం లేదా 9 బిలియన్ డాలర్లు (రూ.74,000 కోట్లు) వాటాను కలిగి ఉందని పార్థసారధిరెడ్డి తెలిపారు. అమెరికా ఏవైనా పరస్పర సుంకాలు భారతీయ ఫార్మా ఉత్పత్తులపై విధిస్తే పోటీతత్వాన్ని తగ్గించడంతోపాటు అభివృద్ధి చెందుతున్న ఈ పరిశ్రమకు నష్టం చేకూరుతుందన్నారు. దీని వల్ల ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. ధరల పెరుగుదల భారత ఫార్మా కంపెనీలకు, ముఖ్యంగా తక్కువ ధరలకు లభించే జనరిక్ మందుల మార్కెట్ వాటాను కోల్పోవడానికి దారితీస్తుందని చెప్పారు. దీనివల్ల లాభాల మార్జిన్లు తగ్గుతాయని, అనేక పెట్టుబడులు లాభసాటిగా ఉండవన్నారు.
సామరస్య పరిష్కారానికి చర్యలు
‘భారత ఫార్మా రంగం విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు గణనీయంగా దోహదం చేస్తోంది. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులకు అంతరాయం ఏర్పడితే విదేశీ ఇన్వెస్టర్ల ఆదాయాలు తగ్గుతాయి. ఫార్మా పరిశ్రమతో ముడిపడి ఉన్న తయారీ, పరిశోధన, పంపిణీ, ఇతర రంగాల్లో చాలామంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలి. అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవాలి. ప్రపంచ పోటీతత్వాన్ని కొనసాగించడానికి, ప్రపంచవ్యాప్తంగా సరసమైన మందులను సరఫరా చేయడంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. ఫార్మా కంపెనీలకు సబ్సిడీలు, పన్ను మినహాయింపుల ద్వారా భారత ప్రభుత్వం ఆర్థిక మద్దతును అందించాలి’ అని తెలిపారు.
ఇదీ చదవండి: భారత్‌పై యూఎస్ దూకుడుగా వ్యవహరిస్తుందా..?
బడ్జెట్‌లోనే కీలక నిర్ణయం
అమెరికా నుంచి ఏటా ఫార్మా దిగుమతులు ప్రస్తుతం 800 మిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నందున అమెరికా ఫార్మా ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను సున్నాకు తగ్గించాలని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయెన్స్ (ఐపీఏ) ఇప్పటికే ప్రతిపాదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలి బడ్జెట్‌లో ఇప్పటికే అనేక కీలక ఔషధాలపై దిగుమతి సుంకాన్ని తొలగించారు.