
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) టారిఫ్ వార్‌లో కాస్త వెనక్కి తగ్గారు. మెక్సికోతో పాటు కెనడాపై విధించిన దిగుమతి సుంకాలను ఏప్రిల్ 2వ తేదీ దాకా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని ఉత్పత్తులపై మాత్రం ఈ నిర్ణయం యధావిధిగా కొనసాగుతుందని, ప్రతీకార సుంకాలు విధించే ప్రణాళికలో ఎటువంటి మార్పు లేదని అన్నారాయన.
కెనడా, మెక్సికోతోపాటు చైనాపై డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించడం ఆయా దేశాలతో వాణిజ్య యుద్ధానికి కారణమైంది. ఈ ప్రభావం.. అమెరికా ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణంపైనా ప్రతికూల ప్రభావం చూపెట్టవచ్చనే హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే తన నిర్ణయంపై మార్కెట్ కుదేలు ప్రభావమేమీ లేదని ఆయన అంటున్నారు. కేవలం అమెరికా కార్ల తయారీదారుల కోసమేనని చెప్పారాయన. అయితే ఒకవైపు కెనడా వాణిజ్య ప్రతినిధులతో చర్చలు.. మరోవైపు మెక్సికో ప్రెసిడెంట్‌తో మాట్లాడిన తర్వాతే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.
ఉత్తర అమెరికా వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా.. అమెరికా-మెక్సికో-కెనడా మధ్య ఒప్పందం(USMCA) అమలులో ఉంది. తాజా నిర్ణయంతో ప్రస్తుతానికి ఆ రెండు దేశాల ఆటోమేకర్స్‌కు ట్రంప్ ఊరట ఇచ్చారు. మరోవైపు కెనడా నుంచి దిగుమతి అయ్యే 62 శాతం ఉత్పత్తులు కొత్త సుంకాలను ఎదుర్కొనాల్సిందేనని వైట్‌హౌజ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే ఎనర్జీ ప్రొడక్ట్స్‌కు మాత్రం 10 శాతమే వర్తిస్తుందని తెలిపారు.
కెనడా కూడా అమెరికాపై విధించిన సుంకాల విషయంలో వెనక్కి తగ్గింది. సుమారు 125 బిలియన్ డాలర్ల అమెరికా ఉత్పత్తులపై విధించిన రెండో దశ సుంకాల అమలును ఏప్రిల్ 2వ తేదీ దాకా వాయిదా ేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే.. అన్ని టారిఫ్‌లను ఎత్తేసే దిశగా ప్రయత్నాలుకొనసాగిస్తామని తెలిపింది.
రాజకీయ దుమారం
అధికారంలోకి వచ్చిన వెంటనే.. ట్రంప్ పలు దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పొరుగు దేశాలతో ట్రేడ్‌వార్‌కు బీజం వేశారు. అయితే ఇది క్రమంగా రాజకీయ మలుపు తిరిగింది. ట్రంప్‌తో చర్చలు నిర్మాణాత్మకంగా జరిగినప్పటికీ.. కెనడా-అమెరికాలు భవిష్యత్తులో వాణిజ్య యుద్ధంలో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ట్రూడోకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కౌంటర్ ఇచ్చారు.
అధికారంలో కొనసాగడానికి సుంకాల వివాదాన్ని ట్రూడో వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. కెనడా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయాన్ని తెలుసుకోవాలని తాను ప్రయత్నించినప్పటికీ.. అక్కడ నుంచి ఎటువంటి సమాధానం రాలేదన్నారు. అయితే ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలు మళ్లీ దుమారం రేపాయి. 51వ రాష్ట్ర గవర్నర్‌గా కొనసాగేందుకు ట్రూడో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారాయన. దీంతో కెనడా మండిపడింది. కెనడా ఏనాటికీ అమెరికాలో కలవబోదని కౌంటర్ ఇచ్చింది. కెనడాను అమెరికాలో విలీనం చేసి.. 51వ అమెరికా రాష్ట్రంగా మార్చకుంటామని.. అవసరమైతే ఆర్థిక-సైనిక శక్తులను ఉపయోగిస్తామని ట్రంప్ గతకొంతకాలంగా చెబుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment