Import duty
-
ఆయిల్ ఫెడ్లో అక్రమ దందా?
సాక్షి, హైదరాబాద్: ఆయిల్‌ఫెడ్‌లో నూనె దందా నడుస్తోందని, కేంద్రం నూనెపై దిగుమతి సుంకం పెంచిన తర్వాత, కేంద్రం ఆదేశాలను పట్టించుకోకుండా నెలన్నర కాలంలోనే ఏకంగా 12 సార్లు ధరలను పెంచడం ద్వారా వినియోగదారులపై పెద్దయెత్తున భారం మోపిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కేంద్రం దిగుమతి సుంకం పెంచడాన్ని అవకాశంగా తీసుకుని కొందరు అధికారులు అక్రమార్జనకు తెరలేపారని, కోట్ల రూపాయల కమీషన్లు దండుకున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సుంకం పెంచిన తర్వాత అప్పటికే నిల్వ ఉన్న వంట నూనెలను పాత ధరకే ప్రైవేట్ డీలర్లకు ఇచ్చి.. వారు పెరిగిన ధరల ప్రకారం వినియోగదారులకు అమ్ముకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వంటనూనెల ధరలన్నీ భారీగా పెంపు కేంద్రం సెప్టెంబర్ 14వ తేదీన వంట నూనెల దిగుమతి సుంకాన్ని భారీగా పెంచింది. సన్‌ఫ్లవర్, సోయాబీన్, రిఫైన్డ్ పామాయిల్, వేరుశనగ నూనెపై 12.5 శాతం నుంచి 32.5 శాతం వరకు పెంచింది. ఇది దేశవ్యాప్తంగా నూనెల ధరల పెరుగుదలకు కారణం అయ్యింది. అయితే పాత నిల్వలను పాత ధరకే అమ్మాలని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పాత నిల్వలు నెలన్నర రోజులకు పైగా సరిపోతాయని, ఆ తర్వాత కొత్త నిల్వలకు కొత్త ధరలు అమలు చేయాలని పేర్కొంది. కానీ ఆయిల్ ఫెడ్ కేంద్రం నిర్ణయాన్ని పెడచెవిన పెట్టి, దిగుమతి సుంకం పెంచిన రోజునే సంస్థ పరిధిలోని నూనె ధరలను పెంచేసింది. అలా పలుమార్లు ధరలు పెంచుకుంటూ పోయింది. అలా ఈనెల ఐదో తేదీలోగా పామాయిల్ లీటర్ ధరను రూ.96 నుంచి ఏకంగా రూ.131కు పెంచింది. అంటే ధర రూ.35 పెరిగిపోయిందన్న మాట. అలాగే సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరను రూ.104 నుంచి రూ.138కి, రైస్ బ్రాన్ ధరను రూ.105 నుంచి రూ.136కు పెంచింది. దీపం ఆయిల్ ధరను కూడా రూ. 31 పెంచేసింది. కేంద్రం చెప్పినట్టు కాకుండా దిగుమతి సుంకం పెంచిన రోజు నుంచే ఆయిల్‌ఫెడ్ ఇలా ధరలు పెంచుతూ పోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అంటున్నారు. ధరలు స్థిరీకరించాల్సింది పోయి బహిరంగ మార్కెట్లో నూనెల ధరలు పెరిగే సమయంలో వాటిని స్థిరీకరించాల్సిన బాధ్యత ఆయిల్‌ఫెడ్‌పై ఉండగా, అందుకు భిన్నంగా, కేంద్రం ఆదేశాలను ఉల్లంఘించి నూనె ధరలను పెంచేసింది. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచిన రోజున ఆయిల్‌ఫెడ్ వద్ద, దాని డీలర్ల వద్ద దాదాపు 5 వేల మెట్రిక్ టన్నుల నిల్వ నూనె ఉన్నట్లు అంచనా. కాగా తన వద్ద ఉన్న నిల్వ నూనెను పాత ధరకు ఇచ్చి, కొత్త ధరకు అమ్ముకోవాలని కొందరు డీలర్లకు కొందరు ఆయిల్‌ఫెడ్ అధికారులు సూచించారు. అంతేకాకుండా డీలర్ల వద్ద అప్పటికే ఉన్న నిల్వ నూనెను కూడా కొత్త ధరకే అమ్ముకోవాలని చెప్పారు. ఇప్పటివరకు 12 సార్లు ధరలను పెంచిన నేపథ్యంలో పెంచిన ప్రతిసారీ పాత నిల్వ నూనెలను కొత్త ధరకే అమ్ముకునేలా వెసులుబాటు కల్పించారు. ఇలా నిల్వ నూనెలు కొత్త ధరకు విక్రయించడం వల్ల ప్రైవేట్ డీలర్లు అక్రమంగా దాదాపు రూ.10 కోట్ల అదనపు లాభం పొందినట్లు అంచనా. కాగా అందులో సగం అంటే సుమారు రూ.5 కోట్ల మేరకు ఆయిల్‌ఫెడ్‌లోని కొందరు కీలకమైన అధికారులకు డీలర్లు కమీషన్లుగా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పలుమార్లు ధరల పెంపుపై వినియోగదారుల నుంచి విమర్శలు వచ్చినా ఆయిల్‌ఫెడ్ అధికారులు కమీషన్ల మత్తులో ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. దీపావళికి ముందు రోజు ధర పెంపుపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చినా ఆయిల్‌ఫెడ్ ఖాతరు చేయలేదని అంటున్నారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరిపిస్తే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై వివరణ కోసం ఫోన్లో సంప్రదించడగానికి ‘సాక్షి’ప్రయత్ని0చగా ఆయిల్‌ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషా స్పందించలేదు. -
ఆయిల్‌పామ్ రైతుల ఖుషీ
సాక్షి, అమరావతి: ఆయిల్‌పామ్ ధరలు పతనమవుతున్న దశలో కేంద్రం తీసుకున్న నిర్ణయం రైతులకు ఊరటనిస్తోంది. మూడేళ్ల తర్వాత క్రూడ్ పామాయిల్ (సీపీవో)పై ఇకనుంచి 20 శాతం దిగుమతి సుంకం వసూలు చేస్తామని కేంద్రం ప్రకటించడంతో ఆయిల్‌పామ్ రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 45 శాతం మంది పామాయిల్‌నే వంటనూనెగా వినియోగిస్తుండగా.. మన దేశంలో ఉత్పత్తి అయ్యేది స్వల్పమే. దేశీయ అవసరాలు తీర్చేందుకు నెలకు సుమారు 6,84,000 టన్నుల పామాయిల్‌ను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. 2022కు ముందు క్రూడ్ పామాయిల్‌పై 49 శాతం దిగుమతి సుంకం ఉండేది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని పూర్తిగా ఎత్తివేయడంతో ధరలు పడిపోయాయి. దీంతో ఆయిల్‌పామ్ తోటలను సాగు చేసే రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చి0ది. సాగు, దిగుబడుల్లో నంబర్ వన్‌గా ఎదిగిన ఏపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా గడచిన ఐదేళ్లలో ఆయిల్‌పామ్ సాగు, దిగుబడుల్లో ఆంధ్రప్రదేశ్‌లో అగ్రస్థానం సాధించి దేశంలోనే నంబర్ వన్‌గా ఎదిగింది. క్రమం తప్పకుండా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో(ఓఈఆర్)ను ప్రకటించడంతో ఓ దశలో ఫ్రెష్ ఫ్రూట్ బెంచ్ (ఎఫ్‌ఎఫ్‌బీ)కు టన్ను రూ.24 వేల వరకు పొందిన ఆయిల్‌పామ్ రైతులు.. 2022లో దిగుమతి సుంకాన్ని ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సాగుదారులు ఒక్కసారిగా కుదేలయ్యారు. ఈ నేపథ్యంలో పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా ఉప ఉత్పత్తుల (గింజల) విలువను చేరుస్తూ వయబిలిటీ ధరను సవరిస్తూ రైతుకు లాభదాయకమైన ధరను ప్రకటించాలని, దిగుమతి సుంకాన్ని తక్షణమే పునరుద్ధరించాలంటూ ఆయిల్‌పామ్ రైతులు ఉద్యమబాట పట్టారు. వీరికి బాసటగా నిలిచిన వైఎస్ జగన్ పలుమార్లు లేఖలు రాయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటీవల రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను జాతీయ ఆయిల్‌పామ్ రైతుల సంఘ ప్రతినిధులు కలిసి కేంద్రం ఆదుకోకపోతే ఆయిల్‌పామ్ సాగుదారులు సంక్షోభంలో కూరుకుపోతారనే విషయాన్ని వివరించారు. గతంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన కృషి, ఆయిల్‌పామ్ రైతులు ఆందోళన ఫలించడంతో ఎట్టకేలకు సీపీవోపై దిగుమతి సుంకాన్ని పునరుద్ధరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టన్ను రూ.13,950 పలుకుతున్న ఆయిల్‌పామ్ గెలల ధర కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో టన్ను రూ.16 వేలకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కనీసం రూ.20 వేలు ఉండాల్సిందే పెరిగిన ఎరువుల ధరలు, పెట్టుబడి ఖర్చుల నేపథ్యంలో టన్నుకు రూ.20 వేలు వస్తే కానీ ఆయిల్‌పామ్ రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితి. దిగుమతి సుంకం పునరుద్ధరించిన కేంద్రం వయబిలిటీ ధరను కూడా సవరించి, డైనమిక్ డ్యూటీ మెకానిజం ఏర్పాటు చేయాలి. దిగుమతి సుంకాన్ని పునరుద్దరించిన కేంద్రానికి రుణపడి ఉంటాం. – బొబ్బ వీరరాఘవరావు, అధ్యక్షుడు, ఏపీ ఆయిల్‌పామ్ రైతుల సంక్షేమ సంఘంఆయిల్పామ్ రైతులకు ఊరట కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సంక్షోభంలో ఉన్న ఆయిల్‌పామ్ రైతులకు ఎంతో ఊరటనిస్తుంది. రైతు అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించి దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించేందుకు సహకరించిన కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఆయిల్‌పామ్ రైతుల తరఫున కృతజ్ఞతలు. క్రూడ్ పామాయిల్‌పై దిగుమతి సుంకం విధించడం వల్ల దేశీయంగా ఆయిల్‌పామ్ సాగు మరింత విస్తరించేందుకు దోహద పడుతుంది. – కె.క్రాంతికుమార్, ప్రధాన కార్యదర్శి, జాతీయ ఆయిల్‌పామ్ రైతుల సంఘం -
ఉక్కు ఉత్పత్తుల దిగుమతి సుంకం పెంపు
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్టీల్ ఉత్పత్తులపై సుంకాలు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చైనా, వియత్నాం నుంచి దిగుమతి చేసుకునే కొన్ని ఉక్కు ఉత్పత్తులపై 12-30% మధ్య సుంకం విధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న చైనా, వియత్నాం ఎగుమతి చేసే వెల్డెడ్ స్టెయిన్లెస్ స్టీల్ పైపులు, ట్యూబ్‌లకు ఈ సుంకం వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. వచ్చే ఐదేళ్లపాటు ఈ పన్ను నిబంధన అమలులో ఉంటుందని పేర్కొంది. దేశీయ స్టీల్ కంపెనీల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దిగుమతి సుంకం అధికంగా ఉంటే ఖర్చులు పెరిగి విదేశాల నుంచి కొనుగోలు చేసే ఉక్కును తగ్గిస్తారని ప్రభుత్వ ఉద్దేశమని తెలిపాయి.ఇదీ చదవండి: దేశంలో భద్రత గుర్తింపు పొందిన తొలి కంపెనీఇండియా ప్రపంచంలోనే స్టీల్ ఉత్పత్తిలో రెండో స్థానంలో నిలిచింది. 2023 ఆర్థిక సంవత్సరంలో 12.5 కోట్ల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసింది. 2024లో అది 14.4 కోట్ల టన్నులకు చేరుతుందని అంచనా. 2029 నాటికి దీని ఉత్పత్తి 20.9 కోట్ల టన్నులు అవుతుందని మార్కెట్ భావిస్తుంది. వచ్చే ఐదేళ్లలో ఈ పరిశ్రమ ఏటా 9.18 శాతం మేర వృద్ధి నమోదు చేస్తుందని అంచనా. -
కేంద్రం కీలక నిర్ణయం.. స్మార్ట్‌ఫోన్ కొనుగోలు దారులకు శుభవార్త!
పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర వసూలు చేస్తున్న ఇంపోర్ట్ డ్యూటీని తగ్గిస్తూ అధికారికంగా ఉత్వరులు జారీ చేసింది. భారత్‌లో ఆయా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు స్థానికంగా ఫోన్లను తయారు చేయాలంటే.. అందుకు అవసరమయ్యే విడి భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అలా దిగుమతి చేసుకున్నందుకు స్మార్ట్ ఫోన్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి 15 శాతం ఇంపోర్ట్ డ్యూటీని చెల్లించాలి. అయితే, తాజాగా ఈ ఇంపోర్ట్ డ్యూటీని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. ఇంకా, ఎల్సీడీ ప్యానెల్ల డిస్ప్లే, అసెంబ్లీ భాగాలపై దిగుమతి సుంకాలు 10శాతానికి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా యాపిల్, శాంసంగ్ కంపెనీలు ఎగుమతులు పెంచడంలో సహాయపడుతుందని, తద్వారా స్మార్ట్‌ఫోన్ తయారీ మార్కెట్లో కీలక పాత్రపోషిస్తున్న చైనా, వియాత్నాం వంటి దేశాలతో భారత్ పోటీపడేందుకు అవకాశంగా మారుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇక దిగుమతి సుంకం తగ్గింపుతో భారత్‌లో స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొబైల్ విడి భాగాలపై మొబైల్ తయారీ పరిశ్రమలో భారత్‌ను అగ్రగామిగా నిలిచేందుకు కేంద్రం మొబైల్ ఫోన్ విడి భాగాలపై ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించింది. సిమ్ సాకెట్, బ్యాటరీ కవర్, మెయిన్ కవర్, స్క్రూలు, జీఎస్ఎం, యాంటెన్నా వంటి మెకానికల్, ప్లాస్టిక్ ఇన్పుట్ భాగాలతో పాటు ఇతర మొబైల్ ఫోన్ విడి భాగాలపై దిగుమతి సుంకం తగ్గనుంది. -
బంగారం కొనుగోలుదారులకు కేంద్రం భారీ షాక్!
బంగారం,వెండి వినియోగదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. పుత్తడి, వెండితో పాటు విలువైన లోహాలకు సంబంధించిన నాణేలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం దిగుమంతి సుంకం 10శాతం ఉండగా.. దాన్ని 15శాతానికి పెంచింది. పెంచిన దిగుమతి సుంకం నిన్నటి నుంచి అమలులోకి వచ్చినట్లు పేర్కొంది. ఇందులో పదిశాతం బేసిక్ కస్టమ్ డ్యూటీ , మరో ఐదుశాతం వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ ఉంటుంది. తాజాగా సోషల్ వెల్ఫేర్ సర్‌ఛార్జి నుంచి మినహాయింపు ఇవ్వనున్నది. బంగారం, వెండిలో వినియోగించే హుక్, పిన్, స్క్రూ వంటి చిన్న భాగాలు ఈ సోషల్ వెల్ఫేర్ సర్‌ఛార్జి కిందకు వస్తాయి. కాగా, కేంద్రం నిర్ణయంతో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ పండితులు పేర్కొంటున్నారు. -
గుడ్ న్యూస్.. తగ్గనున్న సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు..
వంట కోసం సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుతున్న వారికి శుభవార్త. టారిఫ్ రేట్ కోటా (TRQ) విధానం కింద ముడి సోయా బీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ సీడ్ ఆయిల్ దిగుమతులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ మినహాయింపు మే 11 నుంచి జూన్ 30 వరకు అమలులో ఉంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ రేట్ కోటా లైసెన్స్ ఉన్న దిగుమతిదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇదీ చదవండి: జీఎస్టీ నిబంధనల్లో మార్పులు.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్! టారిఫ్ రేట్ కోటా అనేది కోటా చేరుకున్న తర్వాత అదనపు దిగుమతులపై సాధారణ సుంకాలు వర్తింపజేయడంతో పాటు, తగ్గింపు లేదా జీరో-డ్యూటీ రేటుతో భారతదేశంలోకి నిర్దిష్ట పరిమాణంలో దిగుమతులను అనుమతించే వ్యవస్థ. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు 2 మిలియన్ టన్నుల టారిఫ్ రేట్ కోటా కేటాయింపు కోసం 2022 మేలో ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే సన్‌ఫ్లవర్ ఆయిల్, సోయా బీన్ ఆయిల్ ఉత్పత్తిలో పెరుగుదల కారణంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ రేట్ కోటా కేటాయింపును ఉపసంహరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి టారిఫ్ రేట్ కోటా కింద ముడి పొద్దు తిరుగుడు విత్తన నూనె దిగుమతులను నిలిపివేయాలని ప్రభుత్వం మార్చిలో నిర్ణయించింది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ముడి పొద్దుతిరుగుడు విత్తన నూనెను దిగుమతి చేసుకోవడానికి టారిఫ్ రేట్ కోటా కేటాయింపులు ఉండవని తెలిపింది. క్రూడ్ సోయాబీన్ ఆయిల్ విషయంలో కూడా ఈ ఏడాది జనవరిలో ఇదే విధమైన నిర్ణయం తీసుకుంది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ముడి సన్‌ఫ్లవర్ సీడ్ ఆయిల్, ముడి సోయాబీన్ ఆయిల్‌కు సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల సుంకం రహిత దిగుమతి వర్తిస్తుంది. ఇక ముడి పొద్దుతిరుగుడు నూనె కోసం టారిఫ్ రేట్ కోటా ఈ సంవత్సరం జూన్ 30 వరకు అమలులో ఉంటుంది. ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు! -
పన్ను పోటు: భవిష్యత్తులో పసిడి ధర ఎంత పెరగనుంది?
సాక్షి, ముంబై: కేంద్ర ప్రభుత్వం బంగారంపై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 5 శాతం పెంచడంతో బంగారం ధరలు పెరగడం ఖాయమని మార్కెట్ వర్గాలు తేల్చి చెబుతున్నారు. ఇటీవలి కాలంలో బంగారం దిగుమతులు పెరగడం, పసిడి అక్రమ రవాణా నిరోధించే లక్ష్యం, అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి రికార్డు కనిష్టాలకు పడిపోతుండటం, కరెంట్ ఖాతాపై ఒత్తిడి లాంటి అంశాల నేపథ్యంలో ఆర్థికశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో బంగారం ధరలు కనీసం ఐదు శాతం పెరుగుతుందని అంచనాలు నెలకొన్నాయి. భారతదేశంలో బంగారంపై విధించే మొత్తం దిగుమతి సుంకం మూడు భాగాలను ఉంటుంది. బేస్ డ్యూటీ, వ్యవసాయ సెస్, సోషల్ సర్వీస్ సర్ఛార్జ్. వ్యవసాయ సెస్ 2.5 శాతం ఉండగా, సర్‌చార్జ్ రద్దయింది. అయితే దిగుమతి సుంకం పెంపుపై ఐబీజేఏ సురేంద్ర స్పందించారు. ఆయన అంచనా ప్రకారం భవిష్యత్తులో పసిడి 10 గ్రాములకు రూ. 2500 మేర పెరగనుంది. డాలర్‌తో రూపాయి పడి పోతున్న తీరు, బంగారం దిగుమతుల నేపథ్యంలో తాజా పెంపును ఊహించినప్పటికీ ప్రభుత్వం ఇంత త్వరగా ప్రకటిస్తుందని ఊహించ లేదన్నారు. మరోవైపు కేంద్రం బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచిన మరుసటి రోజే పసిడి ప్రియులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఊహించినట్టుగానే దేశవ్యాప్తంగా శనివారం ఉదయం బంగారం ధరలు పుంజుకున్నాయి. -
దేశంలో భారీగా తగ్గనున్న సిమెంట్, స్టీల్ ధరలు!
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రో ధరల భారీ తగ్గింపుతో ఊరట ఇచ్చిన కేంద్రం.. నిర్మాణ రంగానికి గుడ్ న్యూస్ సంకేతాలు అందించింది. సిమెంట్ ధరలను భారీగా తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు శనివారం సాయంత్రం కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటనలో తెలిపారు. సిమెంట్ లభ్యతను మెరుగుపరచడంతోపాటు మెరుగైన లాజిస్టిక్స్ ద్వారా సిమెంట్ ధరను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే దిగుమతి ఆధారిత ఎక్కువగా ఉన్న.. ప్లాస్టిక్ ఉత్పత్తులకు ముడి పదార్థాలు మధ్యవర్తులపై కస్టమ్స్ సుంకాన్ని కూడా తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మరోవైపు ఐరన్, స్టీల్‌పైనా.. సంబంధిత కొన్ని ముడి పదార్థాలపై దిగుమతి సుంకం తగ్గించినట్లు తెలిపారు. అయితే కొన్ని ఉక్కు ఉత్పత్తులపై ఎగుమతి సుంకం విధించబడుతుందని ఆమె స్పష్టం చేశారు. Measures are being taken up to improve the availability of Cement and through better logistics to reduce the cost of cement: Union Finance Minister Nirmala Sitharaman — ANI (@ANI) May 21, 2022 -
సామాన్యులకు కేంద్రం గుడ్‌న్యూస్.. దిగుమతి సుంకంలో కోత.. దిగి రానున్న ధరలు
సామాన్యులకు ఊరటను కల్పించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. క్రూడ్ పామాయిల్ ధరలపై దిగుమతి సుంకాలను తగ్గించింది. ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా వంటనూనె ధరలను నియంత్రిచడంతో పాటుగా, దేశీయ ప్రాసెసింగ్ కంపెనీలకు మద్దతును అందిస్తోందని కేంద్రం పేర్కొంది. 8.25 శాతం నుంచి.. కేంద్ర ప్రభుత్వం శనివారం ముడి పామాయిల్ దిగుమతిపై సుంకాన్ని 8.25 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గించింది. . ఇక ముడి పామాయిల్ (CPO)పై ప్రాథమిక కస్టమ్స్ సుంకం శూన్యం. ప్రస్తుతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (CBIC) నోటిఫికేషన్ ద్వారా అగ్రి ఇన్ఫ్రా డెవలప్మెంట్ సెస్‌ను ఫిబ్రవరి 13 నుండి 7.5 శాతం నుండి 5 శాతానికి తగ్గించింది. అగ్రి డెవలప్మెంట్ సెస్ అండ్ సోషల్ వెల్ఫేర్ సెస్‌లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత క్రూడ్ పామాయిల్‌పై ఎఫేక్టివ్ దిగుమతి సుంకం ఇప్పుడు 8.25 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గుతుంది. సీబీఐసీ ఒక నోటిఫికేషన్లో...క్రూడ్ పామాయిల్, ఇతర క్రూడ్ నూనెలపై తగ్గించిన దిగుమతి సుంకాన్ని సెప్టెంబర్ 30 వరకు ఆరు నెలల పాటు పొడిగించినట్లు పేర్కొంది. క్రూడ్ పామాయిల్, రిఫైన్డ్ పామాయిల్ మధ్య ప్రభావవంతమైన సుంకం వ్యత్యాసాన్ని పరిశ్రమల సంఘం ఎస్ఈఏ డిమాండ్ చేస్తోంది. ఇక ప్రస్తుతం శుద్ధి చేసిన పామాయిల్‌పై ఎఫెక్టివ్ ఇంపోర్ట్ డ్యూటీ 13.75 శాతంగా ఉంది. డ్యూటీ వ్యత్యాసాన్ని మరింత పెంచాలి: ఎస్ఈఏ గత ఏడాది పొడవునా ఎడిబుల్ ఆయిల్ ధరలు అధికంగా ఉండటంతో..దేశీయ లభ్యతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్‌ఇఎ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిబి మెహతా మాట్లాడుతూ...‘క్రూడ్ పామాయిల్‌పై అగ్రి సెస్‌ను 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. కాబట్టి క్రూడ్ పామాయిల్, ఆర్బీడీ పామోలిన్ మధ్య ప్రభావవంతమైన డ్యూటీ వ్యత్యాసం 8.25 శాతంగా ఉంటుంది. ప్రస్తుత సుంకం సెప్టెంబర్ 30 వరకు కేంద్రం పొడిగించింది. క్రూడ్‌పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్‌పై డ్యూటీ 5.5 శాతం సెప్టెంబరు 30 వరకు ఉండనుంద’ని ఆయన చెప్పారు. కాగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే..దేశీయ రిఫైనర్లు ఆర్థికంగా ఆయా రిఫైనర్లను నిర్వహించడానికి ఆయా నూనెల మధ్య కనీసం 11 శాతం డ్యూటీ వ్యత్యాసాన్ని ఉంచాలని ఎస్ఈఏ అభ్యరించిందని తెలిపారు. చదవండి: ‘అన్ని ఉద్యోగాలు నాన్ లోకల్స్‌కేనా..? మా పరిస్థితి ఏంటి..!’ చైనా కంపెనీకి భారీ షాక్..! -
టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ప్రియులకు తీపికబురు
టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ప్రియులకు కేంద్రం తీపికబురు అందించనున్నట్లు తెలుస్తుంది. గత నెల జూలైలో ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా తమ కార్లపై దిగుమతి సుంకాలను తగ్గించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసిన సంగతి అందరికీ తెలిసిందే. టెస్లా విజ్ఞప్తిపై కేంద్రం ఇప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, తాజాగా ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకాలను 40% వరకు తగ్గించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు ఇద్దరు సీనియర్ ప్రభుత్వ అధికారులు రాయిటర్స్ తో పేర్కొన్నారు. కారు ఖర్చు, బీమా, సరుకు రవాణాతో సహా $40,000 కంటే తక్కువ విలువ కలిగిన దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)పై ప్రభుత్వం పన్ను రేటును ప్రస్తుతం ఉన్న 60 శాతం నుంచి 40 శాతానికి తగ్గించడం గురించి చర్చిస్తున్నట్లు అధికారులు తెలిపారు. $40,000 కంటే ఎక్కువ విలువ కలిగిన ఈవీ కార్లపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని 100% నుంచి 60%కి తగ్గించాలని చూస్తోందని వారు తెలిపారు. సుమారు 3 మిలియన్ వాహనాల వార్షిక అమ్మకాలతో భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద కార్ల మార్కెట్ గా ఉంది. కానీ, విక్రయించిన కార్లలో ఎక్కువ భాగం $20,000 కంటే తక్కువ ధర కలిగి ఉన్నాయి. మొత్తం అమ్మకాలలో లగ్జరీ ఈవీ అమ్మకాలు స్వల్పంగా ఉన్నాయని పరిశ్రమ అంచనాలు చెబుతున్నాయి. ఈవీలపై దిగుమతి సుంకాలను 40 శాతానికి తగ్గించడం వల్ల అవి మరింత సరసమైనవిగా మారడంతో అమ్మకాలను పేరుగుతాయని టెస్లా పేర్కొంది. ఈవీ కార్లపై విధిస్తున్న దిగుమతి సుంకం తగ్గించడాన్ని దేశంలో సరసమైన ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే టాటా మోటార్స్, ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తున్న ఓలా ఎలక్ట్రిక్ వ్యతిరేకిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ఈ దిగుమతి సుంకలపై కేంద్రం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. -
ఎర్ర కందిపప్పుపై దిగుమతి పన్ను రద్దు
న్యూఢిల్లీ: దేశీయంగా సరఫరా పెంచేందుకు, పెరుగుతున్న ధరలకు చెక్ పెట్టేందుకు ఎర్ర కందిపప్పుపై దిగుమతి సుంకాన్ని కేంద్రం రద్దు చేసింది. దీంతోపాటు, ఎర్ర కందిపప్పుపై అగ్రికల్చర్ ఇన్ఫ్రాక్చర్ డెవలప్మెంట్ సెస్‌ను 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించినట్లు తెలిపింది. ఈ నిర్ణయం మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ఉభయసభలకు తెలిపారు. ఏప్రిల్ ఒకటో తేదీనాటికి బహిరంగ మార్కెట్లో ఎర్ర కందిపప్పు ధర కిలో రూ.70 ఉండగా, అది ప్రస్తుతం 21 శాతం మేర పెరిగి కిలో రూ.85కు చేరుకున్నట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ పేర్కొంది. ముసాయిదా రూపకల్పనలో ఉన్నత విద్యా కమిషన్ బిల్లు హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఈసీఐ) ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లు ముసాయిదా రూపకల్పన ప్రక్రియ కొనసాగుతోందని లోక్‌సభలో విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)–2020లో ప్రతిపాదించిన విధంగానే నాలుగు స్వతంత్ర వ్యవస్థలను ఒకే గొడుగు కిందికి తెస్తూ ముసాయిదా రూపకల్పన చేస్తున్నామని ప్రధాన్ పేర్కొన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) వంటి వ్యవస్థల స్థానంలో హెచ్ఈసీఐ రానుంది. -
Edible oil: వినియోగదారులకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: భారీగా పెరిగిన వంట నూనెల ధరలతో ఇబ్బందులుపడిన వినియోగదాడులకు ఊరట లభించింది. వంట నూనెల ఇంపోర్ట్స్‌పై డ్యూటీ తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వంట నూనెల రేట్లు ఇటీవల రికార్డు స్థాయికి చేరడంతో డ్యూటీ తగ్గింపు నిర్ణయం తీసుకుంది. దాదాపు 20 శాతం వరకు ధరల తగ్గింపు ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర పరోక్ష పన్నులు , కస్టమ్స్ బోర్డు దిగుమతి తగ్గింపు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. కొత్త రేట్లు 2021 జూన్ 17 వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్లో పేర్కొంది. ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని టన్నుకు 87 డాలర్లు తగ్గి 1136 కు తగ్గించగా, ముడి సోయా చమురు దిగుమతి సుంకం టన్నుకు 37 డాలర్లు తగ్గించింది. దీంతో ప్రస్తుతం దీని ధర టన్నుకు 1415 డాలర్లుగా ఉంది. అటు ఆర్బిడి పామాయిల్ పై టన్నుకు 1148 డాలర్లకు దిగివచ్చింది. తాజా తగ్గింపుతో దేశీయంగా ఆవాలు, సోయాబీన్, వేరుశనగల రేట్లు కూడా దిగిరానున్నాయి. వంట నూనెల ధరలు కిలోకు పామాయిల్ రూ.115, (పాత ధర142, 19 శాతం తగ్గింది) పొద్దుతిరుగుడు నూనె రూ. 157 (పాత ధర రూ .188, 16 శాతం తగ్గింది) సోయా నూనె రూ.138 ( పాత ధర రూ. 162 , 15 శాతం తగ్గింది) ఆవ నూనె రూ.157 (పాత ధర రూ. 175 , 10 శాతం తగ్గింపు) వేరుశనగ నూనె రూ. 174,(పాత ధరరూ.190, 8 శాతం తగ్గింపు) వనస్పతి రూ. 141 (పాత ధర 184, 8 శాతం తగ్గింపు) -
471 శాతం ఎగిసిన బంగారం దిగుమతులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉన్నభారత్‌లో మార్చి నెలలో రికార్డు దిగుమతులనునమోదు చేసింది. గత నెలలో భారతదేశ బంగారు దిగుమతులు 471 శాతం ఎగిసి రికార్డు స్థాయిలో160 పుంజుకున్నాయని ప్రభుత్వ వర్గాలు గురువారం రాయిటర్స్‌తో చెప్పాయి. దిగుమతి పన్నుల తగ్గింపు, పుత్తడి ధరలు రికార్డు స్థాయినుంచి దిగి వచ్చిన నేపథ్యంలో రీటైల్ కొనుగోలుదారులు, జ్యుయల్లర్ల నుంచి డిమాండ్ ఊపందుకోవడమే దీనికికారణమని పేర్కొంది. 2020 ఆగస్టులో ఆల్-టైమ్ హై దాదాపు 17శాతం పసిడి ధరలు దిద్దుబాటునకు గురైనాయి. పసిడి దిగుమతుల పెరుగుదల భారతదేశ వాణిజ్య లోటును పెంచుతుంది. అలాగే డాలరు మారకంలో రూపాయి విలువనుప్రభావితం చేస్తుంది. మార్చి త్రైమాసికంలో భారత్ రికార్డు స్థాయిలో 321 టన్నులు బంగారాన్ని దిగుమతి చేసుకుంది. అంతకుముందు ఏడాది ఇది 124 టన్నులు. ఏడాది క్రితం 1.23 బిలియన్ డాలర్ల నుంచి ప్రస్తుతం బంగారం దిగుమతులు 8.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి వెల్లడించారు. రిటైల్ డిమాండ్ పెంచేందుకు, దేశంలోకి అక్రమ రవాణాను తగ్గించడానికి ఫిబ్రవరిలో బంగారంపై దిగుమతి సుంకాలను 12.5శాతం నుండి 10.75శాతానికి కేంద్రం తగ్గించింది. అధిక ధరల కారణంగా చాలా మంది వినియోగదారులు కొనుగోలును వాయిదా వేసుకున్నారనీ, ధరలు బాగా దిగిరావడంతో కొనుగోళ్లకుఎగబడ్డారని కోల్‌కతా నగరంలోని హోల్‌సేల్ వ్యాపారి జెజె గోల్డ్ హౌస్ యజమాని హర్షద్ అజ్మెరా అన్నారు. మార్చిలో, స్థానిక బంగారు ఫ్యూచర్స్ 10 గ్రాములక పుత్తడి ధర రూ. 43,320 వద్ద ఏడాది కనిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలో రెండోదశలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్‌లో భారత బంగారం దిగుమతులు 100 టన్నులకంటే తక్కువగానే ఉండనున్నాయని ఆభరణాల వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాను అదుపుచేసేందుకు ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తే దిగుమతులు ప్రభావితం కానున్నాయని ఒక డీలర్ అభిప్రాయపడ్డారు. కాగా దేశంలో శుక్రవారం (ఏప్రిల్ 2) వెలువరించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు ప్రకారం ఒక్కరోజులోనే 72,330 కొత్త కేసులు నమోదయ్యాయి. -
సోలార్ మాడ్యూల్స్ ‘దేశీయ తయారీ’కి ఊతం!
న్యూఢిల్లీ: దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడం, దేశీయ తయారీకి ప్రాధాన్యత ఇవ్వడం ప్రధాన లక్ష్యాలుగా సోలార్ మాడ్యూల్స్, సెల్స్ విషయంలో కేంద్ర నూతన, పునరుజ్జీవ ఇంధన మంత్రిత్వశాఖ (ఎంఎన్ఆర్ఈ) కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచీ సోలార్ మాడ్యూల్స్ దిగుమతులపై 40 శాతం బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని (బీసీడీ) విధించనున్నట్లు వెల్లడించింది. సెల్స్ విషయంలో ఈ సుంకం 20 శాతంగా ఉండనుంది. ఈ మేరకు తన ప్రతిపాదనకు ఆర్థికశాఖ ఆమోదం వేసినట్లు వెల్లడించింది. ఎంఎన్ఆర్ఈ విడుదల చేసిన మెమోరాండం ప్రకారం, 2022 మార్చి 31 వరకూ సోలార్ మాడ్యూల్స్ అలాగే సెల్స్‌పై ‘జీరో’ బీసీడీ అమలవుతుంది. అటుపై వీటిపై సుంకాలు వరుసగా 40 శాతం, 20 శాతాలుగా ఉంటాయి. ఇక మీదట వేసే బిడ్ల విషయంలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆర్ఈ (పునరుత్పాదక ఇంధనం) అమలు సంస్థలు, సంబంధిత ఇతర వర్గాలకు మంత్రిత్వశాఖ సూచించింది. 2030 నాటికి గిగావాట్ల లక్ష్యం... 2022 నాటికి 100 జీడబ్ల్యూ (గిగావాట్ల) సౌర విద్యుత్‌సహా 175 జీడబ్ల్యూ వ్యవస్థాగత పునరుత్పాదక ఇంధన (ఆర్ఈ) సామర్థ్యానికి చేరుకోవాలన్నది భారత్ ప్రధాన లక్షంగా ఉంది. 2030 నాటికి ఈ సామర్థ్యాన్ని 450 జీడబ్ల్యూకి పెంచాలన్నది కూడా దేశం లక్ష్యం. సోలార్ రంగంలో పరికరాలకు ప్రస్తుతం దేశం ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందుకు సంబంధించి అసలే అంతంతమాత్రంగా ఉన్న దేశీయ సోలార్ పరికరాల పరిశ్రమ దేశీయ దిగుమతుల నేపథ్యంలో మరింత పతనం అవుతోంది. స్వావలంభన భారత్ దిశలో భాగంగా సోలార్ ఇన్వర్టర్లు, ల్యాంప్లపై దిగుమతి సుంకం పెంపును ఆర్థికమంత్రి సీతారామన్ ఫిబ్రవరి బడ్జెట్లో ప్రతిపాదించారు. ‘‘సౌర ఇంధనం భారత్‌కు ఎంతో విశ్వసనీయమైనదిగా ఇప్పటికే గుర్తించాము. సోలార్ సెల్స్, సోలార్ ప్యానెళ్ల దశల వారీ దేశీయ తయారీ ప్రణాళికను నోటిఫై చేస్తాము. ప్రస్తుతానికి దేశీయ తయారీని ప్రోత్సహించేం దుకు సోలార్ ఇన్వర్టర్లపై డ్యూటీని 5 శాతం నుంచి 20 శాతానికి, సోలార్ ల్యాంటర్న్లపై 5 శాతం నుంచి 15 శాతానికి పెంచుతున్నాము’’అంటూ బడ్జెట్లో భాగంగా మంత్రి ప్రకటించారు. అయితే ఈ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని సోలార్ పవర్ డెవలపర్స్ అసోసియేషన్ డిమాండ్ చేయడం గమనార్హం. ఆయా అంశాల నేపథ్యంలోనే సోలార్ మాడ్యూల్స్ దిగుమతులపై సుంకాన్ని విధించాలన్న ప్రతిపాదనకు ఆర్థికశాఖ అమోదముద్ర గమనార్హం. ప్రస్తుతం భారత్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 136 గెగావాట్లు. -
‘తీరా’ కోసం రూ. 6 కోట్లు మాఫీ చేసిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: తీరా కామత్.. ఈ చిన్నారి గుర్తుందా.. ‘స్పైనల్ మస్య్కులర్ అట్రోఫీ’ అనే జన్యుపరమైన లోపంతో పుట్టింది. పాపను బ్రతికించుకోవాలంటే జీనీ థెరపీ తప్పని సరైంది. మన దేశంలో ఈ చికిత్స లేదు. అమెరికా నుంచి 16 కోట్ల రూపాయల విలువైన ‘జోల్జెన్స్మా’ అనే ప్రత్యేక ఇంజెక్షన్ తెప్పిస్తే కొంతవరకు ప్రయోజనం ఉండొచ్చని డాక్టర్లు తెలిపారు. జీవితాంతం కష్టపడినా.. తీరా తల్లిదండ్రులు ఈ మొత్తాన్ని సమకూర్చలేరు. ఈ క్రమంలో తమ బిడ్డను ఆదుకోవాల్సిందిగా కోరుతూ.. ఆ తల్లిదండ్రులు క్రౌడ్ ఫండింగ్ మొదలు పెట్టారు. దేవుడి దయ వల్ల అనుకున్న మొత్తాన్ని జమ చేశారు. భారీ మొత్తంలో ట్యాక్స్ డబ్బు జమ అయ్యింది.. ఇక ఇంజక్షన్ తెప్పించడమే తరువాయి అనుకుంటుండగా మరో షాకింగ్ విషయం తెలిసింది. ఇంత భారీ మొత్తం ఖర్చు పెట్టి అమెరికా నుంచి తెప్పించే ఈ ఇంజక్షన్‌ను మనం దిగుమతి చేసుకోవాలంటే జీఎస్టీ, దిగుమతి సుంకం అన్ని కలిపి 6.5 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఇంజక్షన్‌కు అవసరమ్యే మొత్తాన్నే క్రౌడ్ ఫండింగ్ ద్వారా సమకూర్చారు. అలాంటిది ఇంత భారీ మొత్తంలో పన్ను చెల్లించలేమని ‘తీరా’ తల్లిదండ్రులు వాపోయారు. ట్యాక్స్ తగ్గించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం మానవతా దృక్పథంతో ఇంజక్షన్‌పై అన్ని రకాల పన్నులను మాఫీ చేసింది. మోదీపై ప్రశంసలు... ఈ విషయాన్ని బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'చిన్నారి తీరా కామత్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత మానవతా దృక్పథంతో వ్యవహరించి జోల్జెన్స్మా డ్రగ్‌పై కస్టమ్స్ డ్యూటీని మినహాయించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అంటూ ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోదీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ముంబై ఆస్పత్రిలో చికిత్స చిన్నారి తీరాకు ప్రస్తుతం ముంబైలోని ఎస్ఆర్సీసీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వెన్నెముక కండరాల క్షీణత వల్ల తలెత్తే సమస్యలతో ఈ చిన్నారి బాధపడుతోంది. ఇప్పటికే తీరా ఊపిరితిత్తులలో ఒకటి పని చేయడం మానేసింది. దీంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే వెంటిలేటర్‌పై ఎక్కువ కాలం ఉంచితే ట్యూబ్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. ఈ నేపథ్యంలో చిన్నారికి వీలైనంత త్వరగా ఆ ఇంజెక్షన్ అందించాల్సి ఉంది. జోల్జెన్స్మా ద్వారా ఆ చిన్నారిలో బలహీనంగా ఉన్న కండరాలు మళ్ళీ మెదడు నుండి సంకేతాలను పొందే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. చదవండి: ఈ పాప బ్రతకాలంటే 16 కోట్లు కావాలి -
ఇక టెలివిజన్ల ధరల మోత మోగనుందా?
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త టీవీ కొనుగోలు చేయాలని చూస్తున్నవారికి ఇకపై అదనపు భారం తప్పదా? వచ్చే నెల నుంచి టెలివిజన్ ధరలు మోత మోగనున్నాయా? తాజా అంచనాలు ఈ అనుమానాలను రేకెత్తిస్తు్నాయి. టీవీ ప్యానెల్స్‌పై ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఈ నెలాఖరుతో నిలిచిపోనుంది. దీంతో ఆయా కంపెనీలు టీవీల ధరలు పెంచేందుకు సిద్ధపడుతున్నాయి. సెప్టెంబరు 30 తరువాత డ్యూటీ రాయితీని పొడిగించకపోతే వినియోగదారులకు అదనపు భారం తప్పదని పలు టీవీ కంపెనీలు ప్రకటించాయి. ఎల్జీ, పానాసోనిక్, థామ్సన్, సాన్సుయ్ కంపెనీలు ఈ వరుసలో ముందున్నాయి. గడువు పెంచకపోతే ధరలను పెంచడం తప్ప మరో మార్గం లేదని ఎల్జీ ఇండియా సీనియర్ డైరెక్టర్ రవీందర్ అన్నారు. 32 అంగుళాల టెలివిజన్‌కు 4 శాతం లేదా కనిష్టంగా 600 రూపాయలు, 42 అంగుళాల టీవీలపై 1,200-1,500 రూపాయల మేర ధరలు పెరిగే అవకాశం ఉంది. (ఈజీ టు ఇన్స్టాల్ : శాంసంగ్ బిజినెస్ టీవీలు) అయితే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రాయితీని మరికొంత పెంచే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. శాంసంగ్ తన ఉత్పత్తిని వియత్నాం నుండి భారతదేశానికి తరలించిన నేపథ్యంలో టీవీ తయారీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగుమతి సుంకం రాయితీని గడువు పెంచేందుకు సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. దీనిపై తుది నిర్ణయం ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకోనుంది. గతేడాది ఓపెన్ సెల్ ప్యానెళ్లపై ప్రభుత్వం 5 శాతం దిగుమతి సుంకం రాయితీ ఇచ్చింది. అదనంగా, టీవీని తయారు చేయడానికి అవసరమైన పూర్తిగా నిర్మించిన ప్యానెళ్ల రేట్లు 50 శాతానికి పైగా పెంచింది. టెలివిజన్ ఖర్చులో దాదాపు 60 శాతంగా ఉన్న ఒపెన్ సెల్ ప్యానెళ్లపై దిగుమతి సుంకం విధించే బదులు, ప్రభుత్వం దశలవారీగా-ఉత్పాదక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని స్థానిక తయారీదారులు అంటున్నారు. ఇండస్ట్రీ బాడీ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయనెన్స్ తయారీదారుల సంఘం, బిజినెస్ ఛాంబర్ ఫిక్కీ ఈ విషయాన్ని ప్రభుత్వంతో చర్చిస్తున్నట్టు సమాచారం. (షావోమి కొత్త స్మార్ట్ టీవీ: హారిజన్ ఎడిషన్) -
టీవీ ధరలు దిగొస్తాయ్!
న్యూఢిల్లీ : దేశీయంగా టీవీల తయారీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఓపెన్ సెల్ టీవీ ప్యానెళ్లపై 5 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని ఎత్తివేసింది. దీంతో వీటి దిగుమతుల ఆధారంగా దేశీయంగా తయారీ మరింత పెరుగుతుందని కేంద్రం అంచనా. దిగుమతి సుంకం రద్దుతో టీవీ తయారీ ఖర్చులు 3 శాతం వరకు తగ్గుతాయి. అలాగే, ఓపెన్ సెల్ టీవీ ప్యానెళ్ల తయారీలో వినియోగించే చిప్ ఆన్ ఫిల్మ్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (పీసీబీఏ), సెల్ (గ్లాస్‌బోర్డు/సబ్‌స్ట్రేట్)పైనా దిగుమ తి సుంకాన్ని రద్దు చేస్తు్నట్టు ఆర్థిక శాఖ ప్రకటించింది. డిమాండ్ తగ్గడంతో దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలని పరిశ్రమ కొంత కాలంగా కోరుతోంది. 15.6 అంగుళాలు అంతకుమించిన కూడిన ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీ ప్యానళ్లలో ఓపెన్ సెల్‌లపై ప్రస్తుతం 5% దిగుమతి సుంకం అమల్లో ఉండగా, ఇకపై ఉండదని బుధవారం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రముఖ జపనీస్ కంపెనీ ప్యానాసోనిక్ మాత్రం ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తామని ప్రకటించింది. 3–4% వరకు ధరలు తగ్గుతాయని ప్రకటించింది. ఎల్ఈడీ టీవీల తయారీ వ్యయంలో 60–70% ఓపెన్‌సెల్ ప్యానళ్లకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. దేశంలోని టీవీ తయారీ కంపెనీలు చాలావరకు వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. 2017 జూన్‌లో టీవీ ప్యానెళ్లపై కేంద్రం ఈ దిగుమతి సుంకాన్ని ప్రవేశపెట్టింది. దేశీ టీవీ మార్కెట్ రూ.22,000 కోట్లుగా ఉంటుంది. సానుకూల ఫలితాలు.. కేంద్రం నిర్ణయం సానుకూలమైనదిగా నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ ఎల్రక్టానిక్స్ గతేడాది భారత్‌లోని తన టీవీల తయారీ యూనిట్‌ను మూసేసి, వియత్నాంకు తరలిపోయింది. దీనికి ప్రధాన కారణం ఓపెన్ సెల్ ప్యానెళ్లపై కస్టమ్స్ డ్యూటీయే. దేశీయంగా తగ్గిన వినియోగ డిమాండ్ టీవీ సెట్లపైనా ప్రభావం చూపిస్తోంది. ఒకవైపు మందగమనం, మరోవైపు పెరిగిన పోటీ, పెద్ద టీవీలపై జీఎస్టీ రేటు ప్రతికూలతలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం తయారీదారులకు ఉపశమనం ఇచ్చేదే అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. పరిశ్రమ హర్షాతిరేకం సరిగ్గా పండుగల సీజన్‌కు ముందు టీవీ ప్యానెళ్లపై దిగుమతి సుంకాన్ని కేంద్రం తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం పరిశ్రమను సంతోషానికి గురి చేసింది. ప్రభుత్వ నిర్ణయం టీవీల తయారీ వ్యయాన్ని తగ్గించడంతోపాటు దేశీయ తయారీని పెంచేందుకు సాయపడుతుందని పేర్కొంది. ‘‘పరిశ్రమ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తోంది. టీవీ తయారీపై ఒత్తిళ్లను ఇది తగ్గిస్తుంది. ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేసినట్టయితే పరిశ్రమలో డిమాండ్ పుంజుకుంటుంది. గతేడాది టీవీల అమ్మకాలు ఫ్లాట్‌గా నమోదైన తర్వాత సరైన సమయంలో ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వచి్చంది. టీవీల తయారీ వ్యయంలో అధిక భాగం ఓపెన్ సెల్స్‌పైనే వెచి్చంచాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా పరిశ్రమ వినియోగదారులకు ఈ ప్రయోజనాన్ని బదిలీ చేయగలదు. ధరలు 3–4 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది’’ అని ప్యానాసోనిక్ ఇండియా దక్షిణాసియా ప్రెసిడెంట్, సీఈవో మనీష్ శర్మ పేర్కొన్నారు. ప్రభుత్వం టీవీల ధరలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 32 అంగుళాలపైన టీవీలపై జీఎస్టీ రేటును ప్రస్తుతమున్న 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని మనీష్ శర్మ కోరారు. అయితే, పండుగల సమయానికి రేట్ల తగ్గింపు అందుబాటులోకి రాకపోవచ్చన్నారు. పండుగల కోసం ఇప్పటికే స్టాక్స్ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. నూతనంగా దిగుమతి చేసుకునే వాటిపైనే దీని ప్రభావం 3 శాతం వరకు ఉంటుందన్నారు. మేకిన్ ఇండియాకు ఊతం.. ప్రభుత్వ నిర్ణయం భారత్‌లో తయారీని పెంచుతుందని ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా పేర్కొంది. ‘‘ఇది ఎంతో సానుకూల పరిణామం. ఇది భారత్‌లో తయారీ (మేకిన్ ఇండియా)కి ఎంతో ప్రోత్సాహంగా నిలుస్తుంది’’ అని ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా డైరెక్టర్ యూంచల్పార్క్ అన్నారు. ప్రభుత్వం దిగుమతి సుంకాలను తొలగించడం భారత్‌లో టీవీల తయారీని పెంచాలన్న తమ ప్రయత్నాలకు సాయపడుతుందని సోనీ ఇండియా సైతం అభివరి్ణంచింది. ‘‘ప్రభుత్వ మేకిన్ ఇండియా కార్యక్రమానికి సోనీ ఇండియా చాలా కాలంగా కట్టుబడి ఉంది. టీవీ ఓపెన్‌సెల్ ప్యానళ్లపై దిగుమతి సుంకాన్ని ఉపసంహరించడం స్థానిక తయారీకి బలమైన ఊతమిస్తుంది. ఈ దిశగా మేం మరిన్ని చర్యలు తీసుకునేందుకు వీలు పడుతుంది’’ అని సోనీ ఇండియా ఎండీ సునీల్ నయ్యర్ తెలిపారు. పరిశ్రమ ఈ నిర్ణయం కోసం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నట్టు హయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్బ్రగంజ అన్నారు. వృద్ధిని ప్రోత్సహించే ఏ చర్య అయినా స్వాగతించతగినదేనన్నారు. -
సుంకాల బాదుడు
దాదాపు ఏడాదిన్నర నుంచి భారత్–అమెరికాల మధ్య సాగుతున్న సుంకాల వివాదంలో మంగళ వారం కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 50 ఏళ్లుగా మన దేశానికి సాధారణ ప్రాధాన్య తల వ్యవస్థ(జీఎస్పీ)కింద కల్పిస్తున్న వెసులుబాట్లను రద్దు చేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతినిధుల సభకు లేఖ రాశారు. తన మార్కెట్లలో అమెరికాకు సమానమైన, సహేతుకమైన ప్రాధాన్యతనివ్వడానికి భారత్ ముందుకు రాకపోవడం వల్ల ఈ చర్య తీసుకోవాలని ట్రంప్ కోరారు. కానీ మన దేశం వాదన వేరేలా ఉంది. మనం విధిస్తున్న దిగుమతి సుంకాలు ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలకు లోబడే ఉన్నాయని చెబుతున్నది. వాస్తవానికి ఈ విషయంలో తనకేమైనా ఫిర్యాదులుంటే అమెరికా డబ్యూటీఓలో తేల్చుకోవాలి. కానీ అక్కడికెళ్తే తమ వాదన వీగిపోతుందన్న భయంతో కావొచ్చు... అమెరికా ఇలా సొంత నిర్ణయాలు తీసుకుం టోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జరిగినప్పుడే ప్రపంచ దేశాల చేతుల్లో అమెరికా ఎలా మోసపోతున్నదో, ఎంత నష్టపోతున్నదో ట్రంప్ ఏకరువు పెట్టేవారు. తాను అధ్యక్ష పీఠం అధిష్టిం చిన వెంటనే దీన్నంతటినీ సరిచేస్తానని చెప్పేవారు. ఏడాదిన్నరగా ట్రంప్ ఈ సుంకాల రణం తీవ్రతను పెంచారు. నిరుడు చైనాపైనా, 28 సభ్య దేశాలున్న యూరప్ యూనియన్(ఈయూ) పైనా ట్రంప్ అదనపు సుంకాలు విధించగా... దానికి ప్రతీకారంగా అటు చైనా, ఇటు ఈయూ కూడా అమెరికాకు అదే భాషలో జవాబిచ్చాయి. నిరుడు జూన్‌లో మనం ఎగుమతి చేసే ఉక్కుపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం చొప్పున అమెరికా సుంకాలు పెంచిన ప్పుడు...ఆ వెంటనే మన దేశం కూడా అమెరికా నుంచి వచ్చే పప్పులు, ఇనుము, ఉక్కు, యాపిల్స్ తదితర 29 ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పెంచుతామని ప్రకటించింది. కానీ అలా ప్రకటించ డమే తప్ప మన దేశం ఇంతవరకూ ఆ నిర్ణయాన్ని అమలు చేయలేదు. సుంకాలు పెంచే నోటిఫికే షన్ అమలును తరచు వాయిదా వేస్తూ పోతోంది. గత నెలాఖరునే ఈ నిర్ణయం మరోసారి వాయిదా పడింది. అయినా అమెరికా ఎక్కడా సంతృప్తి పడింది లేదు. మన ఉక్కు, అల్యూమి నియం ఉత్పత్తులపై ఆ దేశం పెంచిన సుంకాల అమలు అప్పట్లోనే మొదలైంది. ఇప్పుడు తాజా ప్రతిపాదన సైతం రేపో మాపో అమల్లోకి రావడం ఖాయం. స్వేచ్ఛా వాణిజ్యం పేరిట, ప్రపంచీ కరణ పేరిట ప్రపంచ దేశాలను నయానా భయానా లొంగదీసుకున్న అమెరికా నుంచి ఇలాంటి పరిణామాలను ఎవరూ ఊహించరు. కానీ డోనాల్డ్ ట్రంప్ వచ్చాక ఇది రివాజుగా మారిపోయింది. ఇప్పుడు జీఎస్పీ కింద భారత్‌కు కల్పిస్తున్న వెసులుబాట్లు రద్దు చేయాలన్న ట్రంప్ సూచన అమల్లోకొస్తే మన దేశం నుంచి అక్కడి మార్కెట్‌కు ఎగుమతయ్యే దుస్తులు, యంత్ర పరికరాలు, ఇతర వస్తువులు వేరే దేశాల ఉత్పత్తుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొనవలసి ఉంటుంది. మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే సరుకుల్లో దాదాపు 12 శాతం ఈ జీఎస్పీ కిందికి వస్తాయి. ఇది దాదాపు 560 కోట్ల డాలర్లు ఉండొచ్చునని అమెరికా అంచనా వేస్తుంటే...మన అధికారులు మాత్రం 19 కోట్ల డాలర్లు మించదని చెబుతున్నారు. మన దేశానికి నష్టం కలిగించి దారికి తెచ్చుకోవడమే ట్రంప్ నిర్ణయాల సారాంశం గనుక ఇవి ఇంతటితో ఆగవు. అనుకున్న స్థాయిలో భారత్‌కు నష్టం చేకూర్చలేకపోతున్నామనుకుంటే వాటిని మరింత పెంచడానికి ట్రంప్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక వాణిజ్య లోటు 2,000 కోట్ల డాలర్లు ఉందని ఆయన ఎప్ప టినుంచో చెబుతున్నారు. దీన్ని గణనీయంగా తగ్గించడమే ధ్యేయమంటున్నారు. ఆయన తాజా నిర్ణయం వెనక అమెరికాకు చెందిన రెండు లాబీలు గట్టిగా పనిచేశాయని కథనాలు వినిపిస్తు న్నాయి. వైద్య పరికరాల పరిశ్రమ, పాడి ఉత్పత్తుల సంఘాలు మన దేశంపై చేస్తున్న ఫిర్యాదుల ఫలితంగానే ట్రంప్ భారత్‌పై తరచు కారాలు మిరియాలూ నూరుతున్నారు. గుండె రక్త నాళాల్లో ఏర్పడే అవరోధాలకు వాడే స్టెంట్లు, మోకాళ్లలో వాడే ఇంప్లాంట్స్ వగైరాల ధరల్ని గణనీయంగా తగ్గించడం అమెరికా వైద్య పరికరాల పరిశ్రమలకు కంటగింపుగా ఉంది. పశువులకు దాణా బదులు మాంసాహారాన్ని అందించి రాబట్టే పాడి ఉత్పత్తుల్ని అనుమతించకూడదని పదేళ్లనాడు మన దేశం విధించిన నిబంధన పాడి పరిశ్రమకు ఆగ్రహం కలిగిస్తోంది. ఈ రెండింటి విషయంలో సడ లింపులు ఇవ్వడానికి మన దేశం నిరాకరించడంతోపాటు అమెజాన్, వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ తదితర సంస్థల్ని ప్రభావితం చేసే ఈ–కామర్స్ కొత్త నిబంధనలు అమెరికాకు నచ్చడం లేదు. అలాగే మాస్టర్‌కార్డ్, వీసా తదితర సంస్థలు తమ డేటా సర్వర్లను భారత్‌కు తరలించాలని మన ప్రభుత్వం కోరడం ఆ దేశానికి ఆగ్రహం తెప్పిస్తోంది. వెరసి ఇవన్నీ ట్రంప్ తాజా ప్రతిపాదనలకు దారితీశాయి. అయితే ఏ దేశమైనా తనకు అనువైన, లాభదాయకమైన వాణిజ్య విధానాలు రూపొం దించుకుంటుంది. వాటిపై అభ్యంతరాలుంటే తగిన వేదికలపై ఫిర్యాదు చేయాలి తప్ప ఇష్టాను సారం వ్యవహరిస్తానంటే చెల్లదు. 90వ దశకానికి ముందు మన సుంకాలు బాగా అధికంగా ఉండేవి. అయితే ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక అవి క్రమేపీ తగ్గడం మొదలుపెట్టాయి. 1991–92లో వ్యవసాయేతర ఉత్పత్తులపై అత్యధికంగా 150 శాతంమేర సుంకాలుంటే... అవి 1997–98నాటికి 40 శాతానికి పడిపోయాయి. 2004–05 నాటికి 20 శాతానికి వచ్చాయి. ఆ తర్వాత మరో మూడేళ్లకు 10 శాతానికి చేరుకున్నాయి. వాస్తవానికి డబ్ల్యూటీఓ గణాంకాలనుబట్టి మన సగటు సుంకం 13శాతం మించడం లేదు. అమెరికా ప్రారంభించిన ఈ సుంకాల రణం అనూహ్య పరిణామాలకు దారితీస్తుంది. ప్రభావిత దేశాలు తమ వంతుగా ప్రతీకార చర్యలకు దిగితే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుంది. కనుక ట్రంప్ విజ్ఞతతో మెలగి సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. -
రుపీ దెబ్బ: బంగారం ధరలకు రెక్కలు?
సాక్షి,న్యూఢిల్లీ: త్వరలోనే బంగారం ధరలకు రెక్కలు రానున్నాయా? తాజా అంచనాల ప్రకారం బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం పసిడిపై వసూలు చేస్తున 10 శాతం దిగుమతి సుంకానికి అదనంగా మరో రెండు నుండి మూడు శాతం పెంచే అవకాశం ఉందని అంచనా. ముఖ్యంగా దేశీయ కరెన్సీ రోజురోజుకీ చారిత్రక కనిష్టానికి పడిపోతున్న తరుణంలో బంగారం ధరలపై ప్రభావ పడనుందని మార్కెట్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి. తద్వారా కరెంట్ అకౌంట్ లోటు (CAD) నియంత్రణకు ఉంచడానికి కేంద్రం యోచిస్తోందని భావిస్తున్నాయి. కాగా ఆగస్టు నెలలో బంగారం దిగుమతి బిల్లు దాదాపు రెట్టింపై 3.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కాగా భారత ఆర్థిక మంత్రిత్వశాఖ గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కరెంటు ఖాతా లోటు మార్చి 2018 నాటి 1.9 శాతం నుంచి 2.4 శాతానికి పెరిగింది. అలాగే రూపాయి విలువ క్షీణత, అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా విలావస్తువులపై దిగుమతి సుంకం పెంచేందుకు ప్రభుత్వ మొగ్గు చూపవచ్చు. దిగుమతి సుంకాన్ని 2 శాతానికి పెంచుకోవడమే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఉత్తమ మార్గమని సుశీంద్ర మెహతా, ఇండియా బులియన్ అండ్ జ్యూయలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) అభిప్రాయపడింది. 2013 లో, రూపాయి విలువ క్షీణించిన నేపథ్యంలో బంగారంపై ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 10 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. -
శాంసంగ్ కీలక నిర్ణయం : టీవీల తయారీ క్లోజ్
చెన్నై : ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ ఇటీవలే నోయిడాలో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్లాంట్‌ను ఆవిష్కరించిన కొన్ని నెలల్లోనే శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో టీవీల ఉత్పత్తిని ఆపివేయాలని శాంసంగ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. చెన్నైలో ఉన్న తన ఒకేఒక్క టీవీల ఉత్పత్తి సౌకర్యాన్ని వేరే ప్రాంతానికి తరలించాలని శాంసంగ్ ప్రణాళికలు రచిస్తున్నట్టు రిపోర్టులు వెలువడుతున్నాయి. దీంతో వియత్నాం నుంచి టీవీలను దిగుమతి చేసుకోవడం ప్రారంభించాలని యోచిస్తోందని రిపోర్టులు తెలిపాయి. వియత్నాంలో ఉన్న టీవీల ఉత్పత్తి సౌకర్యం శాంసంగ్ అత్యంత పెద్ద ప్రొడక్షన్ హబ్. ఈ విషయంపై ఇప్పటికే కంపెనీ స్థానికంగా ఉన్న సప్లయర్స్‌ను అలర్ట్ చేసినట్టు తెలిసింది. చెన్నైలో ఉన్న టీవీల తయారీ ప్లాంట్ ఏడాదికి 3 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసేది. అయితే శాంసంగ్ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ ప్లాంట్‌ను మన దేశంలో ఏర్పాటు చేయడంతో, మేకిన్ ఇండియాకు బిగ్ బూస్ట్ వచ్చింది. కానీ కొన్ని నెలల్లోనే శాంసంగ్ మరో కీలక నిర్ణయం తీసుకుని, మేకిన్ ఇండియాకు షాకిచ్చింది. టీవీ ప్యానల్స్‌ను తయారు చేయడంలో ఉపయోగపడే పరికరాలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం విధించడంతో, శాంసంగ్ ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది. అయితే టీవీల ఉత్పత్తిని శాంసంగ్ ఆపివేస్తుందని వస్తున్న రిపోర్టులపై ఆ కంపెనీ ప్రతినిధి స్పందించారు. దేశీయంగా తయారు చేసేందుకే తాము కట్టుబడి ఉన్నామని, టీవీల యూనిట్ల ప్రొడక్షన్‌ను తరలించే ప్లాన్లపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. -
వారికి ఊరట : దిగుమతి సుంకం రెట్టింపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ వస్త్ర ఉత్పత్తులకు, ఉత్పత్తిదారులు, ఊరట నిచ్చేలా కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టెక్స్టైల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేసింది. భారీ సంఖ్యలో ఈ ఉత్పత్తులపై 20 శాతం దిగుమతి సుంకం విధించింది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్‌ను మంగళవారం ప్రభుత్వం లోక్‌సభకు సమర్పించింది. 328 రకాల వస్త్ర ఉత్పత్తులపై 20 శాతం పన్ను విధిస్తున్నట్టు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పోన్ రాధాకృష్ణన్ లోకసభకు చెప్పారు. దిగుమతి చేసుకునే వస్త్ర ఉత్పత్తులపై ప్రస్తుతం పన్ను తక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కస్టమ్స్ యాక్ట్ (1962) సెక్షన్ 159 ప్రకారం రెట్టింపునకు నిర్ణయించినట్టు తెలిపారు. తద్వారా దేశీయ తయారీదారులకు మంచి ప్రోత్సాహం లభించడంతోపాటు, ఈ రంగంలో భారీగా ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. అయితే దిగుమతి చేసుకున్న వస్త్రాల ధరలుమాత్రం మోత మోగనున్నాయి. అలాగే కేంద్రం నిర్ణయంబ చైనా ఉత్పత్తులనే ఎక్కువగా ప్రభావితం చేయనుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. కాగా గత నెలలో ప్రభుత్వం 50రకాల వస్త్రాల ఉత్పత్తులపై దిగుమతి సుంకం రెండింతలు చేసింది. జాకెట్లు, సూట్లు, కార్పెట్లపై 20 శాతం దిగుమతి సుంకం విధించిన సంగతి తెలిసిందే. -
సుంకాల యుద్ధం
అమెరికా ప్రారంభించి స్వపర భేదం లేకుండా ఎడాపెడా సాగిస్తున్న సుంకాల రణం రోజులు గడుస్తున్నకొద్దీ ముదిరే సూచనలు కనబడుతున్నాయి. తమ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న అద నపు సుంకాలకు ప్రతీకారంగా చైనా అదే భాషలో జవాబివ్వడం మొదలుపెట్టింది. 28 సభ్య దేశా లున్న యూరొపియన్ యూనియన్ కూడా అమెరికా ఉత్పత్తులపై అదనపు సుంకాల విధింపును ప్రకటించింది. తాజాగా మన దేశం కూడా ఈ రణ రంగంలోకి దూకింది. అమెరికా నుంచి దిగుమ తయ్యే పప్పులు, ఉక్కు, ఇనుము తదితర 29 ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచుతూ నోటి ఫికేషన్ విడుదల చేసింది. మనం ఎగుమతి చేసే ఉక్కుపై 25 శాతం, అల్యూ మినియం ఉత్పత్తు లపై 10శాతం చొప్పున అమెరికా సుంకాలు పెంచినందుకు ప్రతిగా మన దేశం ఈ నిర్ణయం తీసు కుంది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ఏలుబడి మొదలైనప్పటినుంచీ ఇతర దేశాలతోపాటు మన దేశంపై కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా హార్లే–డేవిడ్సన్ మోటార్ సైకిళ్లపై అధిక సుంకాలు విధించడాన్ని ప్రస్తావిస్తున్నారు. అమెరికాకు నష్టం కలిగిస్తున్న ఈ ధోరణిని విడ నాడాలని చెప్పినా ప్రధాని నరేంద్ర మోదీ వినిపించుకోవడంలేదని ఒక సందర్భంలో ఆయన్ను హేళన చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడారు. మన దేశం ఇచ్చే సబ్సిడీలపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ముందు అమెరికా ఫిర్యాదులు చేస్తూనే ఉంది. నిజానికి అమెరికా పౌల్ట్రీ ఉత్పత్తులపై మన దేశం నిషేధం విధించినప్పుడు, ఇక్కడి సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తిదారు లకు సబ్సిడీలిచ్చి నప్పుడు అప్పటి ఒబామా ప్రభుత్వం డబ్ల్యూటీఓ ముందు పంచాయతీ పెట్టింది. ఆ రెండు కేసుల్లోనూ మన దేశం వాదన వీగిపోయింది. అనంతరకాలంలో మన దేశం కూడా అమెరికా అను సరిస్తున్న విధానాలపై ఫిర్యాదు చేసింది. అదింకా తేలవలసి ఉంది. కేంద్ర వాణిజ్యమంత్రి సురేశ్ ప్రభు నెలాఖరులో అమెరికా పర్యటించినప్పుడు సుంకాల పెంపు అంశంపై రెండు దేశాల మధ్యా చర్చలు జరిగే అవకాశం ఉంది. బహుశా అందుకే కావొచ్చు... హార్లే–డేవిడ్సన్ మోటార్ సైకిళ్లపై ఉన్న సుంకాలను కూడా పెంచబోతున్నట్టు డబ్ల్యూటీఓకు మన దేశం తెలియజేసినా నోటిఫికేష న్లో దాని ప్రస్తావన లేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా, భారత్‌లపైన మాత్రమే కాదు... పొరుగునున్న మెక్సికో, కెనడా, యూరప్‌లోని వివిధ దేశాలనూ లక్ష్యంగా చేసుకుని సుంకాలు పెంచారు. వారూ తమకు చేతనైన రీతిలో ఎదురు దాడులు చేస్తున్నారు. హార్లే–డేవిడ్సన్ మోటార్ సైకిళ్లతోసహా కొన్ని అమెరికా ఉత్పత్తులపై శుక్రవారం నుంచి 25 శాతం అదనపు సుంకాలు విధిస్తామని యూరొపియన్ కమిషన్ రెండురోజులక్రితం ప్రకటించింది. ఒకప్పుడు ఇదే అమెరికా స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతాన్ని తలకెత్తుకుని, తన ప్రయోజనాలకు అనుగుణంగా ఇతర సంపన్న రాజ్యాలను కూడగట్టి ప్రపంచీకరణ మత్తులో ముంచెత్తితే వర్థమాన దేశాల అధినేతలందరూ దానికి సాగిల బడ్డారు. ప్రపంచీకరణ పేదరికాన్ని పారదోలుతుందని, ప్రతి ఒక్కరూ సంపన్నులు కావడానికి దోహదపడుతుందని ప్రజానీకాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ అందుకు విరుద్ధంగా దేశదేశాల్లోని సంపద అగ్రరాజ్యాల వద్ద పోగుబడింది. చెప్పాలంటే అగ్రరాజ్యాల్లోని కార్పొరేట్ సంస్థల ఖజానాలకు చేరింది. సాధారణ కార్మికులు, చేతివృత్తులవారు, మధ్యతరగతి ప్రజానీకం పూటగడవడమెలాగో తెలియక అవస్థలకు లోనయ్యారు. కనీవినీ ఎరుగని రీతిలో ఆర్థిక అసమా నతలు పెరిగిపోయాయి. పర్యావరణం దెబ్బతింది. సామాజిక సంబంధాలు, కుటుంబ సంబం ధాలు విచ్ఛిన్నమయ్యాయి. ప్రభుత్వాలు సామాజిక భద్రత పథకాలను క్రమేపీ తగ్గించుకుంటూ పోతున్నాయి. ఇంతకాకపోయినా అమెరికాతో సహా సంపన్నదేశాల్లోనూ కింది స్థాయి ప్రజానీకం ఇబ్బందులకు లోనయ్యారు. వారి ఆగ్రహావేశాలే డోనాల్డ్ ట్రంప్ వంటి నేతలను అధికార పీఠా నికెక్కించాయి. అందుకే చైనా, భారత్, కొన్ని యూరప్ దేశాల ఉక్కు ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించి స్వదేశీ పరిశ్రమలకు ఊపునివ్వాలని ట్రంప్ భావిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో భాగంగానే తాను వివిధ దేశాలతో అమెరికాకున్న వాణిజ్య లోటును సరిచేయడానికి ప్రయత్నిస్తున్నానని, అందుకు సిద్ధపడని దేశాలకు సంబంధిం చిన ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్నానని ట్రంప్ చెప్పుకుంటున్నారు. కానీ ఈ చర్యల పర్యవసానంగా ఆ దేశాలనుంచి ఎదురయ్యే ప్రతిఘటన అమెరికాను కూడా దెబ్బతీస్తుందన్న సంగతిని ఆయన గుర్తించడం లేదు. ఇంతవరకూ ట్రంప్ చైనాకు చెందిన 1,102 ఉత్పత్తులపై 5,000 కోట్ల డాలర్ల మేర సుంకాలు పెంచారు. అందుకు ప్రతీకారంగా చైనా కూడా అదే స్థాయిలో సుంకాలు పెంచగా, దానికి జవాబుగా మరికొన్ని చైనా ఉత్పత్తులపై 20,000 కోట్ల డాలర్లమేర సుంకాలు పెంచడానికి ట్రంప్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సుంకాల పెంపు వ్యవహారం పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధంగా వెనువెంటనే మారక పోయినా ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను క్రమేపీ మాంద్యంలోకి దించే ప్రమాదం ఉంది. ప్రపంచాన్ని ప్రస్తుతం అనిశ్చితి అలుముకుంది. యూరొపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం, ఇతర సభ్య దేశాలు కూడా ఊగిసలాడటం, యూరో కరెన్సీ సంక్షోభం, వచ్చిపడుతున్న వలసలు పాశ్చాత్య ప్రపం చానికి కునుకులేకుండా చేస్తున్నాయి. తనను గెలిపించిన వర్గాలకు ఎంతో కొంత ప్రయోజనం కలి గించి అమెరికా రాజకీయ రంగంలో తన స్థానాన్ని సుస్థిరపరుచుకోవాలని ట్రంప్ ఉబలాటపడుతు న్నారు. రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మలచు కునే ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి ఇన్నేళ్లుగా రాజ్యమేలుతున్న నయా ఉదారవాద విధానాలు పెను కుదుపునకు లోనవుతున్నాయి. పర్యవసానంగా వెంటనే కాకపోయినా దేశాలన్నీ మున్ముందు తమ తమ వాణిజ్యబంధాలను పునర్నిర్వచించుకుని, కొత్త దోవలు వెదుక్కోక తప్పకపోవచ్చు. -
అమెరికాకు షాక్ : దిగుమతి సుంకం పెంపు
సాక్షి,న్యూఢిల్లీ: ట్రేడ్‌వార్‌తో ప్రపంచ వాణిజ్య రంగాన్ని వణికిస్తున్న అమెరికాకు షాకిచ్చేలా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమెరికానుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచింది. సుంకం పెంపు ఆగస్టు 4 నుంచి అమలులోకి వస్తుందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ నుంచి దిగుమతయ్యే ఉక్కు, అల్యూనిమియం ఉత్పత్తులపై అమెరికా భారీగా సుంకాలను పెంచిన నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ముందు ప్రకటించినట్టుగా గాకుండా మొత్తం 29 వస్తువులపై సుంకాలను పెంచుతున్నట్టు వెల్లడించింది. 800 సిసి పైన మోటారు బైక్‌లను మినహాయించి, ప్రస్తుతం 29 వస్తువులపై అదనపు కస్టమ్స్ సుంకం విధిస్తున్నట్టు తెలిపింది. ఇందులో కొన్ని రకాల నట్స్, యాపిల్స్, ఇనుము, స్టీలు, అల్లోయ్ ఉత్పత్తులు, బోరిక్ యాసిడ్, బోల్టులు, నట్లు, స్క్కూలు తదితరాలు ఉన్నాయి. చిక్కుళ్లు, శనగల దిగమతిపై సుంకాన్ని 60శాతానికి పెంచింది. ఇతర గింజధాన్యాలపై 30 శాతానికి, బోరిక్‌యాసిక్, ఫౌండరీ మౌల్డ్స్ బైండర్ల 7.5 శాతం పెంచింది. రొయ్యలు ఇతర సీ ఫుడ్‌పై 15 శాతం సుంకం పెంచింది. ప్రపంచ వాణిజ్య సంస్థ డాక్యుమెంట్‌కు లోబడి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు పెంచే అధికారం ఉందని ఈ ఏడాది మే 18న భారత్ తెలియచేసింది. మార్చి 9న అమెరికా సుంకాలు పెంచడం వల్ల మన దేశానికి చెందిన స్టీలు ఎగుమతిదార్లపై రూ.1198.6 మిలియన్ డాలర్లు, అల్యూమినియం ఎగుమతిదార్లపై 42.4 మిలియన్ డాలర్ల ప్రభావం పడింది. అలాగే దీనివల్ల భారత్‌పై 241 మిలియన్ డాలర్ల ప్రభావం పడిన సంగతి తెలిసిందే. కాగా ప్రతి ఏడాది 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. 2016-17లో భారత్ ఎగుమతులవిలువ 42.21 బిలియన్ డాలర్లుగాను, దిగుమతులు 22.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
ట్రంప్ షాక్: ప్రపంచ మార్కెట్లు కుదేలు
స్టీల్, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్‌లను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చైనా దిగుమతులపైన 25శాతం సుంకాల విధింపునకు సంతకం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. తగిలింది. వాణిజ్య యుద్ధానికి దారితీస్తుందన్న ఆందోళనలు చెలరేగడంతో గురువారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. గత ఆరువారాల్లో అతి పెద్ద పతనం నమోదైంది. డోజౌన్స్ ( 2.93 శాతం) దాదాపు 724 పాయింట్లు కుప్పకూలింది. ఎస్అండ్పీ 68 పాయింట్లు(2.5 శాతం) పతనమై 2,644 వద్ద స్థిరపడింది. ఇక నాస్డాక్ 179 పాయింట్లు(2.4 శాతం) తిరోగమించి 7,167 వద్ద ముగిసింది. వెరసి ఫిబ్రవరి 8 తరువాత అత్యధిక స్థాయిలో నష్టపోయాయి. ఇదే ట్రెండ్ షాంఘై, తైవాన్ ఇండెక్స్ తదితర ఆసియా మార్కెట్లలో కూడా కనిపిస్తోంది. ఈ నెగిటివ్ సెంటిమెంట్ కొనసాగే అవకాశాలున్నాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఆసియా మార్కెట్లుకూడా ఇదే బాటలో ఉన్నాయి. దేశీయ స్టాక్‌మార్కెట్లకు కూడా ట్రంప్ సెగ తగలనుంది. ముఖ్యంగా శుక్రవారం ఉదయం ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 150 పాయింట్ల పతనం దీనికి సంకేతంగా కనిపిస్తోంది. దీంతో నిఫ్టీ 10వేల స్థాయికి కిందికి పడిపోవచ్చనే ఆందోళన మార్కెట్ వర్గాల్లో నెలకొంది. -
మోదీకి మళ్లీ ట్రంప్ ఝలక్!
వాషింగ్టన్: హ్యార్లీ డేవిడ్సన్ మోటారుబైకులపై భారత్ దిగుమతి సుంకం విధించడంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని అనుకరిస్తూ.. ఆయనను ఎద్దేవా చేశారు. అమెరికాకు చెందిన హ్యార్లీ డేవిడ్సన్ బైకులపై భారత్ భారీగా దిగుమతి సుంకం విధిస్తున్నదని ట్రంప్ రగిలిపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత్ ఈ బైకులపై సుంకాన్ని 100శాతం నుంచి 50శాతానికి తగ్గించినా ట్రంప్‌లో అసంతృప్తి చల్లారడం లేదు. ‘ప్రధానమంత్రి అద్భుతమైన వ్యక్తి.. అతను నాకు ఇటీవల ఫోన్ చేసి 50శాతం సుంకం తగ్గిస్తున్నట్టు చెప్పారు. కానీ దీనివల్ల మనకు వస్తున్నది ఏమీ లేదు’ అని వైట్‌హౌస్‌లో అమెరికా సంయుక్త రాష్ట్రాల గవర్నర్ల సమావేశంలో ట్రంప్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ తరహాలో రెండు చేతులు జోడించి.. ఆయనను అనుకరిస్తూ.. ఎద్దేవా చేసే ప్రయత్నం చేశారు. ‘అతను ఈ విషయాన్ని అందంగా చెప్పాడు. అతనో అందమైన వ్యక్తి. మొదట సుంకాన్ని 75శాతానికి తగ్గించాం.. ఇప్పుడు 50శాతానికి తగ్గించామని మీకు చెప్తున్నానని అతడు అన్నాడు. నేను హు అని నిటూర్చాను. ఇంతదానికి నేను సంతోషపడాలా?’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. గత జనవరిలో ప్రధాని మోదీని ఎద్దేవా చేస్తూ.. ఆయన మాటతీరును ట్రంప్ మిమిక్రీ చేసేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే.