బంగారం దిగుమతి సుంకం తగ్గించండి
ఆభరణాల ఎగుమతులు పెరుగుతాయ్ వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: పుత్తడి దిగుమతులపై సుంకాన్ని తగ్గించే విషయాన్ని ఆర్థిక శాఖ పరిశీలించాలని వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. సుంకం తగ్గిస్తే అది రత్నాలు, ఆభరణాల ఎగుమతులకు ఊపునిస్తుందని వివరించారు. పుత్తడి దిగుమతులపై ప్రస్తుతమున్న 10 శాతం సుంకం కారణంగా మన రత్నాలు, ఆభరణాల పరిశ్రమ అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడలేకపోతోందని పేర్కొన్నారు. అందుకే పుత్తడి దిగుమతులపై సుంకాలు తగ్గించాలని ప్రారంభం నుంచే అడుగుతున్నామని వివరించారు. ఈ ఏడాది అక్టోబర్‌లో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 13 శాతం తగ్గి 348 కోట్ల డాలర్లకు పడిపోయాయి.
ఎగుమతుల జోరు పెంచడానికి 3 శాతం వడ్డీ సబ్సిడీ పథకాన్ని అందుబాటులోకి తెచ్చామని, డ్యూటీ డ్రాబాక్ రేట్లను పెంచామని నిర్మలా సీతారామన్ వివరించారు. ఎగమతులు పెంచడానికి అన్ని రాష్ట్రాల పరిశ్రమల ప్రతినిధులతో వాణిజ్య కార్యదర్శి చర్చలు జరుపుతున్నారని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్-అక్టోబర్ కాలానికి ఎగుమతులు 18 శాతం క్షీణించి 15,429 కోట్ల డాలర్లకు తగ్గాయని వివరించారు. వాణిజ్య లోటు 8,626 కోట్ల డాలర్ల నుంచి 7,776 కోట్ల డాలర్లకు తగ్గిందని తెలిపారు.