సుంకాల యుద్ధం | India to Raise Duties on 29 Goods from US | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 23 2018 1:19 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

India to Raise Duties on 29 Goods from US - Sakshi

అమెరికా ప్రారంభించి స్వపర భేదం లేకుండా ఎడాపెడా సాగిస్తున్న సుంకాల రణం రోజులు గడుస్తున్నకొద్దీ ముదిరే సూచనలు కనబడుతున్నాయి. తమ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న అద నపు సుంకాలకు ప్రతీకారంగా చైనా అదే భాషలో జవాబివ్వడం మొదలుపెట్టింది. 28 సభ్య దేశా లున్న యూరొపియన్‌ యూనియన్‌ కూడా అమెరికా ఉత్పత్తులపై అదనపు సుంకాల విధింపును ప్రకటించింది. తాజాగా మన దేశం కూడా ఈ రణ రంగంలోకి దూకింది. అమెరికా నుంచి దిగుమ తయ్యే పప్పులు, ఉక్కు, ఇనుము తదితర 29 ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచుతూ నోటి ఫికేషన్‌ విడుదల చేసింది. మనం ఎగుమతి చేసే ఉక్కుపై 25 శాతం, అల్యూ మినియం ఉత్పత్తు లపై 10శాతం చొప్పున అమెరికా సుంకాలు పెంచినందుకు ప్రతిగా మన దేశం ఈ నిర్ణయం తీసు కుంది. అమెరికాలో డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడి మొదలైనప్పటినుంచీ ఇతర దేశాలతోపాటు మన దేశంపై కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు.

ముఖ్యంగా హార్లే–డేవిడ్‌సన్‌ మోటార్‌ సైకిళ్లపై అధిక సుంకాలు విధించడాన్ని ప్రస్తావిస్తున్నారు. అమెరికాకు నష్టం కలిగిస్తున్న ఈ ధోరణిని విడ నాడాలని చెప్పినా ప్రధాని నరేంద్ర మోదీ వినిపించుకోవడంలేదని ఒక సందర్భంలో ఆయన్ను హేళన చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడారు. మన దేశం ఇచ్చే సబ్సిడీలపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ముందు అమెరికా  ఫిర్యాదులు చేస్తూనే ఉంది. నిజానికి అమెరికా పౌల్ట్రీ ఉత్పత్తులపై మన దేశం నిషేధం విధించినప్పుడు, ఇక్కడి సోలార్‌ ప్యానెల్స్‌ ఉత్పత్తిదారు లకు సబ్సిడీలిచ్చి నప్పుడు అప్పటి ఒబామా ప్రభుత్వం డబ్ల్యూటీఓ ముందు పంచాయతీ పెట్టింది. ఆ రెండు కేసుల్లోనూ మన దేశం వాదన వీగిపోయింది. అనంతరకాలంలో మన దేశం కూడా అమెరికా అను సరిస్తున్న విధానాలపై ఫిర్యాదు చేసింది. అదింకా తేలవలసి ఉంది. కేంద్ర వాణిజ్యమంత్రి సురేశ్‌ ప్రభు నెలాఖరులో అమెరికా పర్యటించినప్పుడు సుంకాల పెంపు అంశంపై రెండు దేశాల మధ్యా చర్చలు జరిగే అవకాశం ఉంది. బహుశా అందుకే కావొచ్చు... హార్లే–డేవిడ్‌సన్‌ మోటార్‌ సైకిళ్లపై ఉన్న సుంకాలను కూడా పెంచబోతున్నట్టు డబ్ల్యూటీఓకు మన దేశం తెలియజేసినా నోటిఫికేష న్‌లో దాని ప్రస్తావన లేదు. 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా, భారత్‌లపైన మాత్రమే కాదు... పొరుగునున్న మెక్సికో, కెనడా, యూరప్‌లోని వివిధ దేశాలనూ లక్ష్యంగా చేసుకుని సుంకాలు పెంచారు. వారూ తమకు చేతనైన రీతిలో ఎదురు దాడులు చేస్తున్నారు. హార్లే–డేవిడ్‌సన్‌ మోటార్‌ సైకిళ్లతోసహా  కొన్ని అమెరికా ఉత్పత్తులపై శుక్రవారం నుంచి 25 శాతం అదనపు సుంకాలు విధిస్తామని యూరొపియన్‌ కమిషన్‌ రెండురోజులక్రితం ప్రకటించింది. ఒకప్పుడు ఇదే అమెరికా స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతాన్ని తలకెత్తుకుని, తన ప్రయోజనాలకు అనుగుణంగా ఇతర సంపన్న రాజ్యాలను కూడగట్టి ప్రపంచీకరణ మత్తులో ముంచెత్తితే వర్థమాన దేశాల అధినేతలందరూ దానికి సాగిల బడ్డారు. ప్రపంచీకరణ పేదరికాన్ని పారదోలుతుందని, ప్రతి ఒక్కరూ సంపన్నులు కావడానికి దోహదపడుతుందని ప్రజానీకాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ అందుకు విరుద్ధంగా దేశదేశాల్లోని సంపద అగ్రరాజ్యాల వద్ద పోగుబడింది. చెప్పాలంటే అగ్రరాజ్యాల్లోని కార్పొరేట్‌ సంస్థల ఖజానాలకు చేరింది. సాధారణ కార్మికులు, చేతివృత్తులవారు, మధ్యతరగతి ప్రజానీకం పూటగడవడమెలాగో తెలియక అవస్థలకు లోనయ్యారు. కనీవినీ ఎరుగని రీతిలో ఆర్థిక అసమా నతలు పెరిగిపోయాయి. పర్యావరణం దెబ్బతింది. సామాజిక సంబంధాలు, కుటుంబ సంబం ధాలు విచ్ఛిన్నమయ్యాయి. ప్రభుత్వాలు సామాజిక భద్రత పథకాలను క్రమేపీ తగ్గించుకుంటూ పోతున్నాయి. ఇంతకాకపోయినా అమెరికాతో సహా సంపన్నదేశాల్లోనూ కింది స్థాయి ప్రజానీకం ఇబ్బందులకు లోనయ్యారు. వారి ఆగ్రహావేశాలే డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి నేతలను అధికార పీఠా నికెక్కించాయి.

అందుకే చైనా, భారత్, కొన్ని యూరప్‌ దేశాల ఉక్కు ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించి స్వదేశీ పరిశ్రమలకు ఊపునివ్వాలని ట్రంప్‌ భావిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో భాగంగానే తాను వివిధ దేశాలతో అమెరికాకున్న వాణిజ్య లోటును సరిచేయడానికి ప్రయత్నిస్తున్నానని, అందుకు సిద్ధపడని దేశాలకు సంబంధిం చిన ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్నానని ట్రంప్‌ చెప్పుకుంటున్నారు. కానీ ఈ చర్యల పర్యవసానంగా ఆ దేశాలనుంచి ఎదురయ్యే ప్రతిఘటన అమెరికాను కూడా దెబ్బతీస్తుందన్న సంగతిని ఆయన గుర్తించడం లేదు. ఇంతవరకూ ట్రంప్‌ చైనాకు చెందిన 1,102 ఉత్పత్తులపై 5,000 కోట్ల డాలర్ల మేర సుంకాలు పెంచారు. అందుకు ప్రతీకారంగా చైనా కూడా అదే స్థాయిలో సుంకాలు పెంచగా, దానికి జవాబుగా మరికొన్ని చైనా ఉత్పత్తులపై 20,000 కోట్ల డాలర్లమేర సుంకాలు పెంచడానికి ట్రంప్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఈ సుంకాల పెంపు వ్యవహారం పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధంగా వెనువెంటనే మారక పోయినా ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను క్రమేపీ మాంద్యంలోకి దించే ప్రమాదం ఉంది. ప్రపంచాన్ని ప్రస్తుతం అనిశ్చితి అలుముకుంది. యూరొపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడం, ఇతర సభ్య దేశాలు కూడా ఊగిసలాడటం, యూరో కరెన్సీ సంక్షోభం, వచ్చిపడుతున్న వలసలు పాశ్చాత్య ప్రపం చానికి కునుకులేకుండా చేస్తున్నాయి.  తనను గెలిపించిన వర్గాలకు ఎంతో కొంత ప్రయోజనం కలి గించి అమెరికా రాజకీయ రంగంలో తన స్థానాన్ని సుస్థిరపరుచుకోవాలని ట్రంప్‌ ఉబలాటపడుతు న్నారు. రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మలచు కునే ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి ఇన్నేళ్లుగా రాజ్యమేలుతున్న నయా ఉదారవాద విధానాలు పెను కుదుపునకు లోనవుతున్నాయి. పర్యవసానంగా వెంటనే కాకపోయినా దేశాలన్నీ మున్ముందు తమ తమ వాణిజ్యబంధాలను పునర్నిర్వచించుకుని, కొత్త దోవలు వెదుక్కోక తప్పకపోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement