Editorials
-
జాతికి జవాబు కావాలి!
దేశం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఘటన అది. ప్రధాని సహా పార్లమెంటరీ ప్రజాప్రతినిధులందరూ సమావేశమయ్యే ప్రాంగణంలోని పెను భద్రతా వైఫల్యాలను బుధవారం టీవీల సాక్షిగా కళ్ళకు కట్టిన ఉదంతమది. 2001 నాటి చేదు జ్ఞాపకాలను ఈ దురంతం మళ్ళీ గుర్తుచేసింది. అప్పట్లో పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు మన పార్లమెంట్‌పై తుపాకులతో దాడికి తెగబడితే, ఈసారి సందర్శకులుగా వచ్చిన ఇద్దరు భారతీయ సాధారణ యువకులు పదుల అడుగుల ఎత్తులోని లోక్‌సభ ప్రేక్షకుల గ్యాలరీ పై నుంచి సభాంగణంలోకి దూకి, రహస్యంగా తెచ్చిన పొగగొట్టాలతో అలజడి రేపారు. సభ వెలుపల రంగుల పొగతో మరో ఇద్దరు నిరసన పూర్వక నినాదాలు చేశారు. నలుగురినీ అరెస్ట్ చేసి, కఠినమైన ‘ఉపా’ చట్టం కింద కేసు పెట్టి పోలీస్ కస్టడీకి పంపారు. సూత్రధారుల కోసం గాలింపు సాగుతోంది. ప్రస్తుతానికి 8 మంది భద్రతా సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు కానీ, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఇదేదో అప్పటికప్పుడు ఈ యువతీ యువకులు సృష్టించిన హంగామా కాదు. ఇరవై రెండేళ్ళ క్రితం పార్లమెంట్‌పై పాక్ తీవ్రవాదులు దాడి జరిపిన డిసెంబర్ 13నే... తమ దుశ్చర్యకు వారు ఎంచుకున్నారంటే ఎంత ఆలోచన, ప్రణాళిక ఉండివుంటుంది! ఒక్కపక్క అమెరికా గడ్డ మీద నుంచి హూంకరిస్తున్న ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్‌వంత్ సింగ్ పన్నూ ఈ నెలాఖరులోగా పార్లమెంట్‌పై దాడి చేస్తామని చాలా రోజుల క్రితమే హెచ్చరించారు. మరోపక్క పార్లమెంట్‌పై మునుపటి దాడిలో పలువురు బలైన ఘటనకు 22వ వార్షిక సంస్మరణ దినం. ఈ నేపథ్యంలో బుధవారం పార్లమెంట్ వద్ద ఎంత పారాహుషార్‌గా ఉండాలి! అంచెలంచెల తనిఖీని దాటుకొని, ఆ నలుగురూ కాలిజోళ్ళలో పొగగొట్టాలు పెట్టుకొని, లోపలికి వచ్చారంటే మన తనిఖీ, నిఘా వ్యవస్థలు నిద్రిస్తున్నట్టేగా! ప్రాథమిక సమాచారం మేరకు... పార్లమెంట్లో అలజడి రేపిన నలుగురిలో ఎవరూ తీవ్ర వాదులు కారు. మధ్య, దిగువ తరగతి నిరుద్యోగులు. భగత్ సింగ్ అభిమానులంటున్న వీరంతా దేశంలోని వేర్వేరు భౌగోళిక ప్రాంతాల నుంచి ఫేస్బుక్ పేజీ ద్వారా ఎలా ఒక్కటయ్యారు, ఎలా ఈ నిరసన దుశ్చర్యకు దిగారన్నది ఇంకా లోతుగా ఆరా తీయాలి. ఆరు డిగ్రీలు చేసి, లెక్చరర్ ఉద్యోగా నికి ‘నెట్’ సైతం పాసైన నిరుద్యోగ హర్యానా యువతి నీలమ్. కంప్యూటర్ ఇంజనీరైన నిరుద్యోగ మైసూరీ మధ్యవయస్కుడు మనోరంజన్. ఆర్మీలో చేరాలని ఆరాటపడి విఫలమైన కుర్రాడు అమోల్. లక్నోకు చెందిన ఇ–రిక్షా కార్మికుడు సాగర్ శర్మ. ఇలాంటి సామాన్యులు ఏ నిస్పృహలో, ఎవరి ప్రేరేపణతో చెడుదోవ పట్టి ఇంతటి దుస్సాహసానికి దిగినట్టు? వీరిని ఆడించిన అసలు నాయకుడు ఎవరు? ఇంటి దొంగలా, లేక దేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేస్తున్న విదేశీ శక్తులా? ఏడాదిగా ఈ పథకరచన సాగుతోందట. ఈ మార్చి, జూలైల్లోనూ పార్లమెంట్లో భద్రతపై రెక్కీ నిర్వహించారట. ఇది దిగ్భ్రాంతికరం. ప్రజాస్వామ్య దేవాలయంలో జరిగిన దుస్సాహసంపై ప్రజా ప్రతినిధులంతా ఏకమై పిడికిలి బిగించాల్సిన వేళ దురదృష్టవశాత్తూ రాజకీయాలు రేగుతున్నాయి. అధికారపార్టీ ఎంపీ నుంచి ఈ నిరసనకారులకు పాసులు జారీ కావడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడు తున్నాయి. పార్లమెంట్ సహా ఢిల్లీ భద్రత మొత్తం చేతిలో ఉండే హోమ్ మంత్రి ఈ మొత్తం ఘటనపై సభలో ప్రకటన చేయాలని కోరుతున్నాయి. జవాబివ్వాల్సిన అధికార పక్షం మొండికేయడం, రచ్చ పెరగడంతో ప్రతిపక్షానికి చెందిన 14 మందిని లోక్‌సభ నుంచి, ఒకరిని రాజ్యసభ నుంచి శీతకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం దీనికి పరాకాష్ఠ. సభలోనే కాదు ఢిల్లీలోనే లేని ఓ ప్రతిపక్ష ఎంపీ పేరు సైతం సస్పెండైన వారి పేర్లలో పేర్కొనడం విడ్డూరం. ఆ వాస్తవం రచ్చకెక్కేసరికి ‘అది క్లరికల్ మిస్టేక్’ అని సింపుల్‌గా తేల్చేస్తూ, 13మందే సస్పెండయ్యారని గురువారం పొద్దుపోయాక వివరణ నిచ్చుకోవాల్సి వచ్చింది. భద్రత విషయంలోనే కాదు... చివరకు సభా నిర్వహణలోనూ సర్కారీ నిర్లక్ష్యాన్ని ఇది చెప్పకనే చెబుతోంది. నిరసన తెలిపే ప్రతిపక్షాలను పరోక్షంగా వెక్కిరిస్తూ, వచ్చి అరెస్టయినవారు ‘ఆందోళన్ జీవు’లంటూ అధి కారపక్షం తేలిగ్గా ముద్ర వేస్తోంది. ఒకవేళ వచ్చింది ‘ఆతంకవాదులై’ ఉంటేనో? వారు పొగగొట్టాలు కాక గ్రెనేడ్లు, ఐఈడీలు తేగలిగితేనో? ఏమై ఉండేది? భీతిగొలిపే ఆలోచన అది. అందుకే సర్వోన్నత పార్లమెంట్‌లోనే సభ్యుల రక్షణను వెక్కిరిస్తున్న ఘటనను ఆరోపణలపర్వంగా మారిస్తే లాభం లేదు. తీవ్రమైన ఈ భద్రతా వైఫల్యంపై జాతీయ భద్రతా ఏజెన్సీ సహా అత్యున్నత వ్యవస్థలతో దర్యాప్తు జరిపించాలి. సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ)తోనూ పరిస్థితిని మదుపు చేయిస్తే, భద్రతా ఏర్పాట్లను పునస్సమీక్షిస్తే సభ్యులకు భరోసా కలుగుతుంది. దుర్భేద్యమని పదేపదే చెప్పిన కొత్త పార్లమెంట్ భవనంలోనే ఇంతటి ఘటన జరిగినందున అందరూ ఒకే గేటు నుంచి రాకపోకలు సాగించడం లాంటి పద్ధతులు మార్చాలి. మెటల్ డిటెక్టర్లతో ప్లాస్టిక్‌ను గుర్తించలేనందున తనిఖీ విధానాల్ని ఆధునికీకరించి, పటిష్ఠపరచాలి. పార్లమెంటరీ సెక్యూరిటీలో నేటికీ వందకు పైగా ఉద్యోగ ఖాళీలున్నాయట. అదీ పట్టించుకోక కళ్ళు తెరిచి నిద్రపోతే నష్టం దేశానికి! అలాగే, ప్రభుత్వ గుర్తింపున్న పాత్రికేయుల్ని సైతం పార్లమెంట్‌లోకి రానివ్వని పాలకులు మహిళా రిజర్వేషన్ లాంటి కీలక బిల్లుల వేళ బస్సుల్లో జనాన్ని తరలించుకొచ్చి, గ్యాలరీ నుంచి నినాదాలిప్పిస్తున్న సంస్కృతిని విడ నాడాలి. పార్లమెంట్ ప్రాంగణం ప్రజాపాలనకై తప్ప, ప్రచార ఆర్భాటానికి కాదని గుర్తించాలి. మణి పూర్ మొదలు జాతీయ భద్రత దాకా ప్రతిదానిపైనా ప్రభుత్వ జవాబు కోసం, జవాబుదారీతనం కోసం ఇంతగా పట్టుబట్టాల్సి రావడం మాత్రం ప్రజాస్వామ్యానికి వన్నె తీసుకురాదని గ్రహించాలి. -
బహిష్కరణకూ ఓ పద్ధతుంది!
పార్లమెంట్ సభ్యురాలు మహువా మోయిత్రాను సభా సభ్యత్వం నుండి డిసెంబర్ 8న లోక్‌సభ బహిష్కరించింది. ఆమెను లోక్‌సభలో ప్రసంగించడానికి అనుమతించలేదు. ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. అయినా మొయిత్రాను 17వ లోక్‌సభ నుండి బహిష్కరించే తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఉనికిలో లేని నీతి నియమావళితో ఆమెను దోషిగా నిర్ధారించారు. పార్లమెంటు తనను తానే నియంత్రించుకుంటుంది కాబట్టి, ఎంపికైన ప్రజా ప్రతినిధి సభ్యత్వాన్ని రద్దు చేయడం అనే తీవ్రమైన చర్యను నిందకు తావులేని ప్రక్రియ ద్వారా చేయాలి. చట్టసభలకు ఎన్నికైన ప్రతినిధుల దుష్ప్రవర్తన, నైతిక ఉల్లంఘనల ప్రశ్నలను ఎదుర్కోవటానికి రెండు ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, బ్రిటన్ ఉదాహరణలు మనకు ఉన్నాయి. మహువా మొయిత్రాను బహిష్కరించే తీర్మా నాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ ప్రవేశపెట్టారు. మొయిత్రా ప్రవర్తన (ఆమె తన పార్ల మెంటరీ లాగిన్ వివరాలను పంచుకోవడం, వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుండి నగదును, సౌకర్యాలను స్వీకరించడం) పార్ల మెంట్ సభ్యురాలికి తగదని ఆ తీర్మానం పేర్కొంది. బహిష్కరణ ప్రక్రియను వెంటాడి వేధించడంగా అభివర్ణించారు మొయిత్రా. తనపై ఆరోపణకు సంబంధించి డబ్బు మార్పిడికి ఎలాంటి రుజువు లేదనీ, నైతిక కమిటీలో తనకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యం ప్రేరేపితమైనదనీ, ఇది వైరుద్ధ్యపూరితంగా ఉందనీ అన్నారు. తనపై నిందమోపిన వారిని ఎదురు ప్రశ్నించడానికి ఆమెను అనుమతించలేదు. మన పార్లమెంట్ పనితీరుకు సంబంధించినంత వరకు ఈ మొత్తం అధ్యాయం వివాదాస్పదమైంది. రాజకీయాలు, వ్యక్తిత్వం ఈ ప్రక్రియను కప్పివేశాయి. పార్లమెంట్ తన వ్యవహారాల నిర్వహణకు సొంత నిబంధనలను రూపొందించుకునే అధికారాన్ని మన రాజ్యాంగం ఇచ్చింది. దుష్ప్రవర్తన కారణంగా దాని సభ్యులను బహిష్కరించే అధికారం దీని పర్యవసానమే. పార్లమెంటు తనను తానే నియంత్రించుకుంటుంది కాబట్టి, ఎంపికైన ప్రజా ప్రతినిధి సభ్యత్వాన్ని రద్దుచేయడం అనే తీవ్రమైన చర్యను నిందకు తావులేని ప్రక్రియ ద్వారా చేయాలి. చట్టసభలకు ఎన్నికైన ప్రతినిధుల దుష్ప్రవర్తన, నైతిక ఉల్లంఘ నల ప్రశ్నలను ఎదుర్కోవటానికి రెండు ప్రజాస్వామ్య దేశాలైన అమె రికా, బ్రిటన్ల ఉదాహరణలు మనకు ఉన్నాయి. అమెరికన్ కాంగ్రెస్‌తో మొదలుపెడదాం: డిసెంబర్ 1న అమెరికా ప్రతినిధుల సభ, న్యూయార్క్ రిపబ్లికన్ గెరోజ్ శాంటోస్‌ను తన సభ్యత్వం నుండి బహిష్కరించింది. ఎన్నికల ప్రచారంలో వంచన, ఆర్థికపరమైన అవక తవకలు, ఉల్లంఘనలు, లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలపై సుమారు తొమ్మిది నెలల విచారణ తర్వాత ఈ బహిష్కరణ ఆదేశం వచ్చింది. రిపబ్లికన్ పార్టీ ప్రతినిధిపై వచ్చిన ఫిర్యాదులను రెండు వేర్వేరు కార్యాలయాలు పరిశీలించాయి. ఒకటి... కాంగ్రెషనల్ ఎథిక్స్ కార్యా లయం (ఓసీఈ). నైతిక చట్టంలో నైపుణ్యం కలిగిన న్యాయవాదులు, పరిశోధకులతో కూడిన స్వతంత్ర, పక్షపాతం లేని ఈ సంస్థను 2008లో స్థాపించారు. ఇది హౌస్ సభ్యులపై, కాంగ్రెస్ సిబ్బందిపై ఫిర్యాదులను స్వీకరిస్తుంది, పునఃపరిశీలిస్తుంది. ఒక వివరణాత్మక పరీక్ష తర్వాత, ఇది తన సిఫార్సును ఎథిక్స్ కమిటీకి పంపుతుంది. ఇది స్వీకరించే ఫిర్యాదులు, వాటిపై తీసుకునే చర్యల గురించి వివరణా త్మక గణాంకాలను కూడా ప్రచురిస్తుంది. శాంటోస్‌పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన రెండో కార్యా లయం హౌస్ ఎథిక్స్ కమిటీ. ఇది ఇతర సభ్యుల నుండి ఫిర్యాదులను స్వీకరించింది. ‘ఓసీఈ’ నుండి సూచనను, శాంటోస్ వ్యవహారాన్ని విచారించిన ప్రతినిధుల సభ నుండి తీర్మానాన్ని హౌస్ ఎథిక్స్ కమిటీ పరిశీలించి ఒక పరిశోధనాత్మక సబ్ కమిటీని నియమించింది. ఇది 40 మంది సాక్షులను ఇంటర్వ్యూ చేసింది. 72,000 పేజీల పత్రాలను అందుకుంది. సబ్‌కమిటీకి తన వివరణను ఇవ్వడానికి ఎథిక్స్ కమిటీ శాంటోస్నూ అనుమతించింది. కాని దాన్ని ఆయన తిరస్కరించారు. శాంటోస్ ‘తన వ్యక్తిగత ఆర్థిక లాభం కోసం, ప్రతినిధుల సభకు తన అభ్యర్థిత్వంలోని ప్రతి అంశాన్నీ మోసపూరితంగా ఉపయోగించు కోవాలని చూసినట్లు’ పరిశోధనాత్మక కమిటీ కనుగొంది. ఎథిక్స్ కమిటీ నివేదికలోని బహిష్కరణ ప్రతిపాదనను ప్రతినిధుల సభ పరి గణనలోకి తీసుకుంది. కాంగ్రెస్ సభ్యుడిని తొలగించడానికి అమెరికా రాజ్యాంగం ఒక భారీ అడ్డంకిని ఉంచింది. అలాంటి తొలగింపు ప్రతి పాదనకు సంబంధిత సభలోని మూడింట రెండొంతుల మంది సభ్యులు అంగీకరించాలి. అతడిని తొలగించడానికి చేసిన మొదటి రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. మూడవ ప్రయత్నంలో, అతని రిపబ్లికన్ పార్టీకి చెందిన 105 మంది సభ్యులు కూడా 206 మంది డెమోక్రాట్లతో కలిసి శాంటోస్‌ని బహిష్కరించారు. ఎంపీల ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండేలా పర్యవేక్షించ డానికి బ్రిటన్ పార్లమెంట్ కూడా విస్తృతమైన యంత్రాంగాన్ని కలిగి ఉంది. ఇది ప్రయోజనాలకు సంబంధించిన పబ్లిక్ రిజిస్టర్ని నిర్వ హిస్తుంది. ఎంపీలు తమ పార్లమెంటరీ విధుల సమయంలో పొందిన ఆదాయాలు, ఆతిథ్యం, బహుమతులను తప్పనిసరిగా ప్రకటించాలి. పార్లమెంటరీ ప్రమాణాల కమిషనర్ అని పిలిచే ఒక స్వతంత్ర అధికారి ఈ రిజిస్టర్‌ను నిర్వహిస్తారు. ఎంపీలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలి స్తారు. కమిషనర్ పనిని ఎంపీల స్టాండర్డ్స్ కమిటీ సమీక్షిస్తుంది.ఎంపీలపై ఎలాంటి చర్య తీసుకోవాలో సిఫారసు చేస్తుంది. 2009లో, ఖర్చుల కుంభకోణం (హౌస్ ఆఫ్ కామర్స్ ఎంపీలు పార్లమెంట్ నుండి వ్యక్తిగత ఖర్చులను రీయింబర్స్ చేయడం) తర్వాత, ఎంపీలు, వారి సిబ్బంది వేతనాలు, పింఛన్లను నియంత్రించేందుకు స్వతంత్ర పార్లమెంట్ ప్రమాణాల సంస్థను ఏర్పాటు చేయడానికి బ్రిటన్ ఒక చట్టాన్ని కూడా ఆమోదించింది. ఫిర్యాదులను స్వీకరించడానికి, దర్యాప్తు చేయడానికి స్వతంత్ర యంత్రాంగాలతో పాటు, అమెరికా, బ్రిటన్ పార్లమెంటులు, వారి సభ్యులు అనుసరించ డానికి వివరణాత్మక మార్గదర్శకాలను కూడా అందించాయి. ఉదాహ రణకు అమెరికాలో ఈ సంవత్సరం ప్రారంభంలో, కాంగ్రెషనల్ ఎథిక్స్ కార్యాలయం ఒక విషయాన్ని హౌస్ ఎథిక్స్ కమిటీకి సూచించింది; ప్రతినిధుల సభకు చెందిన అలెగ్జాండ్రియా ఒకాసియో– కోర్టెజ్, 2021లో ఛారిటీ మెట్ గాలాలో ధరించేందుకు మేకప్ సేవలు, హ్యాండ్‌బ్యాగ్, ఆభరణాలు, దుస్తులను అంగీకరించడం ద్వారా బహు మతి నియమాలను ఉల్లంఘించి ఉండవచ్చంది. భారతదేశంలో రాజ్యసభ ఎథిక్స్ కమిటీ తన ఎంపీలకు ప్రవ ర్తనా నియమావళిని నిర్వచించింది. రాజ్యసభ ఎంపీలు తమ పార్ల మెంటరీ వ్యవహారాల కోసం ఎలాంటి ప్రయోజనాలనూ అంగీకరించకూడదని కోడ్ నిర్దేశిస్తుంది. వారి వ్యక్తిగత ప్రయోజనాలకూ, ప్రజా ప్రతినిధిగా వారి విధినిర్వహణకూ మధ్య వైరుద్ధ్యం ఏర్పడిన సంద ర్భాల్లో, వారు తమ ప్రభుత్వ కార్యాలయానికి బాధ్యత వహించాలని కూడా ఇది పేర్కొంది. రాజ్యసభ ఎంపీలు తప్పనిసరిగా బ్రిటన్ పార్లమెంట్ పద్ధతిలో వలే సభ్యుల ప్రయోజనాల రిజిస్టర్‌ను కూడా పూరించాలి. ప్రత్యక్షంగా ఎన్నికైన సభ ఇంకా ఈ నిబంధనలను తన నియమాలలో పొందుపరచనందున ఈ కోడ్, రిజిస్టర్ రాజ్యసభ ఎంపీలకు వర్తిస్తుంది తప్ప లోక్‌సభ సభ్యులకు కాదు. 1951లో నాటి మన తాత్కాలిక పార్లమెంటు తన సభ్యులలో ఒకరైన హెచ్‌జి ముద్గల్ సభా గౌరవాన్ని కించపరిచేలా ప్రవర్తించిన మొదటి కేసును ఎదుర్కొంది. ఈ కేసులో ముద్గల్‌ను సమర్థించుకోవ డానికి అనుమతించారు. ఆ తర్వాత సభ తనను బహిష్కరించే ముందు ఆయన రాజీనామా చేశారు. ఆయన ప్రవర్తనను పరిశీలించిన కమిటీ, ఎంపీలకు ప్రవర్తనా నియమావళిని విధించాలని కోరింది. ఏ సభ్యుడైనా సంబంధిత పార్టీల నుండి ద్రవ్య లేదా ఇతర పరిగణనలను అంగీకరించడంపై నిర్దిష్ట కారణాలను, ప్రయోజనాలను సమర్థించు కోవడం అనేది ప్రజాస్వామ్యానికి విషం అవుతుంది. 72 ఏళ్ల తరువాత, ఇదే విధమైన ప్రశ్నపై బహిరంగ చర్చ కేంద్రీకృతమై ఉన్నందున, ఎంపీల నైతిక నిబంధనల ఉల్లంఘనలను నిర్ణయించడానికి పార్లమెంటుకు పటిష్ఠమైన విధానం ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఇటువంటి ప్రక్రియ పార్లమెంటు గౌరవాన్ని నిలబెట్టి, దాని శాసన సమగ్రతను కాపాడే సాధనంగా మారుతుంది. దాని నిర్ణ యాల గురించి ఎలాంటి అనుమానాలనైనా తొలగించివేస్తుంది. వ్యాసకర్త, చక్షూరాయ్, లెజిస్లేటివ్ అండ్ సివిక్ ఎంగేజ్మెంట్ హెడ్, పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
దానం-ధర్మం
ప్రతి మనిషి కష్టపడి తన బతుకును తాను బతకాలి. తనపై ఆధారపడిన వారిని కూడా పోషించాలి. వారి ఆలన పాలన సరిగా చూసుకోవాలి. దీనంతటికీ డబ్బు కావాలి. న్యాయమైన మార్గంలో డబ్బు సంపాదించాలి. అలా సంపాదించిన సొమ్ములో కొంతైనా దానధర్మాలకు వెచ్చించాలి. తర తరాలుగా ఇది పెద్దలు చెబుతూ వస్తున్న మాట. తాను కష్టపడి సంపాదించుకొన్న సొమ్ము అయినప్పటికీ, అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి,చేసే పని సఫలం చెంది, సంపాదన తనది కావడం మాత్రం దైవ కృప లేకుండా జరుగదన్నది ఆ మాటల వెనక దాగి ఉన్న పరమార్థం. అందుచేతనే, భాగ్యవశాన సమకూడిన దైవకృపకు కృతజ్ఞతగా, సంపాదించుకున్న సొమ్ములో తన శక్తి మేరకు దానధర్మాలకు వెచ్చించడ మన్నది నియమంగా పెట్టుకొనడం మంచిదని పెద్దలు చెప్పారు. అలా కాకుండా సంపాదించినదంతా ‘నా సొంతకష్టంతోనే కాబట్టి, మొత్తాన్ని నేనే అనుభవిస్తాను, నా పొట్ట నేనింపుకుంటాను తప్ప దాన ధర్మాలకు ఖర్చు చేయను’ అని అనుకుంటే, ఆ అలోచన సరైనది కాదని, అలా ఆలోచించి తదనుగుణంగా నడుచుకునే వ్యక్తి కంటె కాయకష్టం చేసి మనిషికి సహాయపడే మూగజీవాలు మేలైనవనే ఆలోచన కొన్ని శతాబ్దాల క్రితం నుండి ప్రజల మనసులలో ఆమోదం పొంది ఉంది. ఆ ఆలోచననే క్రీ.శ. 15–16 శతాబ్దాలకు చెందిన కవి కొఱవి గోపరాజు తాను రచించిన ‘సింహాసన ద్వాత్రింశిక’ కావ్యం, షష్ఠాశ్వాసంలోని ఈ కింది ఆటవెలది పద్యంలో చెప్పాడు. దానధర్మములకు బూనక తన పొట్ట నినుపుకొన దలంచు జనుడె పశువు పసరమైన మెఱుగు బండియీడుచు దున్ను నంతకంటె గష్టుడండ్రు బుధులు. ‘దానం, ధర్మం అనే ఆలోచన ఏమాత్రం చేయకుండా, ఎప్పుడూ తన పొట్టను మాత్రమే నింపుకోవాలనే ఆలోచన చేసే వాడ... బండి లాగుతూ వ్యాపారస్థుడికీ, సగటు మనిషికీ, పొలం దున్నుతూ వ్యవసాయదారుడికీ ప్రతి రోజూ సాయపడే గోమహిష జాతిదైన మూగజీవి కంటె తక్కువైన వాడని పెద్దలు చెబుతారు’ అని పై పద్యం భావం. – భట్టు వెంకటరావు -
రెండేమిటి మూడు ఎన్నికలైనా జరపవచ్చు..
కేంద్ర, రాష్ట్ర చట్ట సభలకే కాదు, వాటికి స్థానిక సంస్థలను కలిపి మూడింటికీ ఒకేసారి ఎన్నికలు జరుపుకోవచ్చు. తద్వారా, స్థానిక అభివృద్ధి, నియోజక వర్గాల వారీ అభివృద్ది పట్ల ఆయా పార్టీల వైఖరికి ప్రాధాన్యత పెరుగుతుంది. వికేంద్రీకృత అభివృద్ధి, సమాన అభివృద్ధి దృష్టి పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయనే మాట రీత్యా, స్థానిక, రాష్ట్ర, కేంద్ర పరిపాలన సమ ప్రాధాన్యత రీత్యా ఆలోచించినపుడు మూడింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అన్ని విషయాలపై సమగ్ర అవగాహన కలుగుతుంది. ప్రజలు మూడు విధాల పనికి వచ్చే, పని చేసే నాయకత్వాన్ని ఎన్నుకునే అవ కాశం కలుగుతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నికయ్యాక ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే వారి ఎన్నికకు అడ్డుకట్ట పడుతుంది. అయితే ఇటువంటి ఎన్నికల విధానం కోసం కొన్ని పనులు ముందుగా నిర్వర్తించాలి. అందులో ముఖ్యమైనది రాజ్యాంగ సవరణ. జమిలి ఎన్నికలు ఫెడరలి జానికి విరుద్ధం. రాష్ట్ర ప్రయోజనాలకు, స్వేచ్ఛకు, అధికారాలకు విరుద్ధం. అందరు అంగీకరిస్తేనే జమిలి ఎన్నికల ఆలోచనకు కార్యరూపం ఇవ్వాలి. కొత్త ఎన్నికల విధానం ప్రవేశపెట్టడానికి ప్రస్తుత వ్యవస్థలో కొన్ని మార్పులు చేయాలి. ప్రభుత్వాల పదవీకాలం ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించి ప్రజల తీర్పు మరోసారి తొందరగా పొందడానికి, అవకాశం కల్పించాలి. 200 ఏళ్ల క్రితం నిర్ణయించుకుని 4 ఏళ్లకోసారి అమెరికా ఎన్నికలు జరుపుకొంటున్నది. మనం మూడేళ్లకొకసారి ఎన్నికలు జరుపుకొంటూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఆదర్శంగా నిలవాలి. రెండవసారి గెలి స్తేనే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పెన్షన్లుంటాయనే నిబంధన పెట్టాలి. ఇలాగైతేనే మొదటిసారి ఎన్నికైనపుడు ప్రజలకు ప్రజా ప్రతి నిధులు తమ సేవలతో అందుబాటులో ఉంటారు. రాజకీయ పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యానికి కట్టుబడి పార్టీలో అన్ని స్థాయుల్లో ఎన్నికలు జరిపేలా చర్యలు తీసు కోవాలి. ఆయా దేశాల జనాభాను బట్టి చట్ట సభల్లో సీట్ల సంఖ్య నిర్ణయమవుతోంది. ఆ మేర ప్రజా ప్రతినిధులు ఎన్నికవు తున్నారు. కానీ మనదేశంలో జనాభా పరంగా చూసినప్పుడు ప్రాతినిధ్యం వహించే ప్రతినిధులు తక్కువనే చెప్పాలి. జనాభా పరంగా చూసినప్పుడు భారత్‌లో 3,200 మంది పార్లమెంటు సభ్యులు (2,600 లోక్‌సభ సభ్యులు, 600 రాజ్యసభ సభ్యులు) ఉండాలి. చైనా, అమెరికా, గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రే లియా, జపాన్ చట్ట సభల్లో ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రతినిధుల సంఖ్యతో పోల్చినప్పుడు... మన చట్ట సభల్లో ప్రజా ప్రతినిధుల సంఖ్య పెంచవలసిన అవసరం బోధపడుతుంది. భారతదేశ జనాభా ప్రకారం సభ్యుల సీట్లే కాదు, ఇప్పటి అసెంబ్లీల సీట్లకు నాలుగైదు రెట్లు పెరగాలి. ఇదేవిధంగా స్థానిక సంస్థల సీట్లూ పెంచాలి. 3,200 పార్లమెంట్ సీట్లలో మహిళలకు సగం, బీసీలకు 27 శాతం, ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 7 శాతం ప్రాతినిధ్యం కోసం రాజ్యాంగాన్ని సవరించాలి. వీలైతే అందరి సమ్మతితో ఆధార్ కార్డుతో ఓటర్ కార్డు, పాన్ కార్డు, వృత్తి, మొత్తం ఆస్తిపాస్తుల రికార్డు అనుసంధానించాలి. ఏ నియోజక వర్గంలో ఓటు వేశారో తెలిపే ఒక ‘కాలమ్’ చేర్చు కోవడం ద్వారా రెండు మూడు చోట్ల ఓటర్ల లిస్టులో పేరుంటే ఏదో ఒక చోట మాత్రమే ఓటు వేసే విధంగా ఎన్నికల సంఘం సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసుకోవాలి. అపుడే కరెక్టుగా అన్ని ప్రాంతా లకూ, వర్గాలకూ ప్రాతినిధ్యం లభిస్తుంది. మరీ ముఖ్యంగా ప్రాథమిక హక్కుల్లో ఓటు హక్కును చేర్చాలి. అలాగే పౌర బాధ్యతల్లో ఎన్నికల్లో ఓటుహక్కును విని యోగించుకోవడాన్నీ చేర్చాలి. సంక్షేమ పథకాలు, ప్రణాళికలు నియోజక వర్గాలవారీగా రూపొందించుకోవడం అవసరం. బ్యాంకింగ్, సైనిక, రైల్వే వంటి రంగాలకు నియోజక వర్గాల వారీగా ప్రాతినిధ్యం ఉన్నపుడే అన్ని రంగాలవారి ప్రాతినిధ్యంతో సమంగా ప్రజాస్వామ్యం అందుబాటులోకి వస్తుంది. ఆదాయ పన్ను ఇతర దేశాలలో వలె రాష్ట్రాలకే చెందడం అవసరం. ఈ విధానం అనుసరిస్తే లోక్‌సభ నియోజక వర్గం నుండి ఏటా ఇద్దరు చొప్పున పదేళ్లలో 20 మంది ఐఏఎస్‌లూ, ఐపీఎస్‌లూ ఎన్నికవుతారు. వారు ఎక్కడున్నా తమ ప్రాంత అభి వృద్ధిని పట్టించుకుంటారు. అలాగే జడ్జీలు, ఇతర అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సైనికులు అన్ని నియోజక వర్గాల నుండి సమంగా ఎదుగుతారు. గ్రామ సభల వలె నాలుగు నెలలకోసారి అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల సభలు ఏర్పాటు చేసి, నిర్వహించే విధంగా రాజ్యాంగంలో మార్పులు చేయాలి. అసెంబ్లీ, పార్లమెంట్ సమా వేశాలకు ముందు ఈ సభలు నిర్వహించి స్థానిక అభివృద్ధి, సంక్షేమం, ప్రణాళికలపై చర్చించాలి. ఎంపీ లాడ్స్ ఫండ్స్ దేనికి ఖర్చు చేయాలో ఈ సభల్లో చర్చించి అనుమతి పొందాలి. అప్పుడే ఎక్కడ నిధుల కొరత ఉందో అక్కడికి నిధులను మళ్లించవచ్చు. ఇటువంటి ఏర్పాట్లు చేసిన తర్వాత జమిలి ఎన్నికలే కాదు, మూడు ఎన్నికలు ఒకేసారి జరుపుకోవచ్చు. బి. ఎస్. రాములు వ్యాసకర్త తెలంగాణ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్, సామాజికవేత్త -
చేజేతులా తలవంపులు!
విశ్వవేదికపై భారతదేశానికి కీర్తి, పతకాలు తెచ్చిపెట్టిన ఒక క్రీడ... ఇప్పుడు అంతర్జాతీయంగా నలుగురిలో నగుబాటుకు కారణంగా మారిందంటే తప్పెవరిది? గడచిన నాలుగు ఒలిపింక్స్‌లోనూ వరుసగా మన దేశానికి పతకాలు సాధించి పెట్టిన రెజ్లింగ్‌లో ఆటగాళ్ళు ఇప్పుడు కనీసం భారత జాతీయ పతాకం నీడన అధికారికంగా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే వీలు లేకుండా పోయిందంటే ఆ పాపం ఎవరిది? మన అగ్రశ్రేణి రెజ్లర్లు ఈ ఏడాది మొదట్లో వీధికెక్కి, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లు్యఎఫ్‌ఐ) అప్పటి అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై ఆరోపణలు చేసినప్పటి నుంచి గత ఎనిమిది నెలల్లో రోజుకో వివాదం మన రెజ్లింగ్‌ను చుట్టుముడుతూనే ఉంది. ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణలతో సతమతమవుతున్న భారత సమాఖ్యను అంతర్జాతీయ రెజ్లింగ్ పర్యవేక్షక సంఘం ‘యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్’ (యుడబ్లు్యడబ్లు్య) తాజాగా సస్పెండ్ చేసింది. నిర్ణీత గడువు లోగా ఎన్నికలు జరపనందుకు పడ్డ ఈ సస్పెన్షన్ వేటు మన రెజ్లింగ్ భవితపై నీలినీడలు పరిచింది. ఈ సస్పెన్షన్ మరీ ఊహించనిదేమీ కాదు. కొన్ని నెలలుగా అంతర్జాతీయ రెజ్లింగ్ సంఘం పదే పదే హెచ్చరిస్తూనే ఉంది. వివాదాల్లో కూరుకుపోయిన భారత రెజ్లింగ్ సమాఖ్యను చక్కదిద్దుకోవా ల్సిందిగా మన క్రీడాయంత్రాంగ పెద్దలను అభ్యర్థిస్తూనే ఉంది. దోవకు రాకుంటే సస్పెన్షన్ వేటు వేయక తప్పదని జూన్‌లో హెచ్చరించింది. జూలైలోనూ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. భారత రెజ్లింగ్ సమాఖ్యలో అంతర్గత వర్గ పోరాటాలు సాగు తూనే ఉన్నాయి. మరోపక్క సమాఖ్య ఎన్నికల్ని వివిధ కోర్టులు నిలిపివేశాయి. చివరకు సహనం నశించిన అంతర్జాతీయ సంఘం అన్నంత పనీ చేసింది. భారత రెజ్లింగ్ సమాఖ్యపై వేటు వేసింది. సమస్యను ఆదిలోనే పరిష్కరించని మన క్రీడా అధికారుల అసమర్థత ఇక్కడి దాకా తెచ్చింది. ఈ సస్పెన్షన్ వల్ల ఆటగాళ్ళపై వ్యక్తిగతంగా ప్రభావమేమీ ఉండకపోవచ్చు. కానీ, దేశానికి మాత్రం తీరని తలవంపులు. ఎలాగంటే, ఈ సెప్టెంబర్ 16 నుంచి బెల్గ్రేడ్లో జరగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మన రెజ్లర్లు తటస్థ అథ్లెట్లుగానే పోటీలో పాల్గొనాల్సిన పరిస్థితి. ఇలా మన కుస్తీయోధులు అన్ని రకాల పోటీల్లో పాల్గొనవచ్చు. పతకాలు సాధించవచ్చు. కానీ, జాతీయ పతాకం ధరించడానికి లేదు. సాక్షాత్తూ బంగారు పతకం సాధించి, పోడియమ్పై నిలబడినప్పటికీ ప్రాంగణంలో మన జాతీయ గీతాన్ని వినిపించరు. వారి ప్రతిభా ప్రదర్శన, గెలిచే పతకాలు... ఇలా ఏవీ భారతదేశపు లెక్కలోకి రావు. అదీ ఈ సస్పెన్షన్‌తో దాపురించే దుఃస్థితి. ఒకవేళ ఇంత జరుగుతున్నా సరే ఇప్పుడిప్పుడే ఎన్నికలు నిర్వహించకుంటే, దరిమిలా సస్పెన్షన్‌ను ఎత్తివేయ కుంటే... అప్పుడిక మన భారత రెజ్లర్లు రానున్న ఒలింపిక్స్ సహా ఏ అంతర్జాతీయ పోటీలోనూ దేశం తరఫున పోటీ చేసే వీలుండదు. ఇది దేశ ప్రతిష్ఠకే మాయని మచ్చ. ఇందుకు నిందించాల్సింది మన భారత రెజ్లింగ్ సమాఖ్యను, మన పాలకులనే! లైంగికంగా వేధించినట్టు సాక్ష్యాధారాలు లభించినప్పటికీ, దేశానికి పతకాల పంట పండించిన రెజ్లర్లు న్యాయం కోసం రోడ్డున పడి ధర్నాలు చేసినప్పటికీ ఇవాళ్టికీ మన ఏలికలకు చీమ కుట్టినట్టయినా లేదు. సమాఖ్య మాజీ అధ్యక్షుడు, పాలక బీజేపీ పార్లమెంట్ సభ్యుడైన బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవ డానికి ఇప్పటికీ మన పాలకులకు చేతులు రావడం లేదు. పేరుకు పదవిలో నుంచి పక్కకు తప్పు కున్నప్పటికీ, తన వారినే మళ్ళీ పీఠంపై కూర్చోబెట్టి కథ నడిపించాలని చూస్తున్న నిందితుడిని అడ్డుకొనేందుకు మన ప్రభుత్వాలకు మనస్కరించడం లేదు. బాధిత రెజ్లర్లకూ, చక్రం తిప్పాలని చూస్తున్న బడాచోర్లకూ మధ్య చిక్కుకున్నది కేవలం రెజ్లింగ్ కాదు... దేశ పరువు ప్రతిష్ఠలు! లైంగిక ఆరోపణల వ్యవహారంతో ఇప్పటికే దేశం పరువు పోగా, తాజా సస్పెన్షన్‌తో తలకొట్టేసినట్టయింది. రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన క్రీడా సంఘాలు గనక రాజకీయ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకుంటే ఇలాగే ఉంటుంది. ఆటలు, ఆటగాళ్ళ ప్రయోజాల పరిరక్షణ వెనక్కి పోయి, క్రీడలతో సంబంధం లేని అంశాలు ముందుకు వస్తాయి. దేశంలోని అనేక ఇతర క్రీడా సంఘాల్లోనూ ఇదే జరిగింది. సమయానికి ఎన్నికలు జరపలేదంటూ నిరుడు ప్రపంచ ఫుట్‌బాల్ పర్యవేక్షక సంఘం ‘ఫిఫా’ మనదేశ ఫుట్‌బాల్ సమాఖ్యను సస్పెండ్ చేసింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, హాకీ ఫెడరేషన్లు సైతం ఈ కారణాలతోనే మన సంఘాల్ని నిషేధిస్తామని హెచ్చరించాయి. క్రీడా నియమావళిని పాటించట్లేదంటూ సాక్షాత్తూ భారత సర్కారే 2020 జూన్‌లో 54 జాతీయ క్రీడా సమాఖ్యల గుర్తింపును ఉపసంహరించింది. నియమాల ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ ఢిల్లీ హైకోర్ట్ గత ఏడాది దాదాపు పాతిక క్రీడాసంఘాలకు అక్షింతలు వేసింది. అయినా పరిస్థితి మారలేదు. రాజకీయాలకు బలవుతున్న సంఘాల్లో ఒకటిగా మన రెజ్లింగ్ సైతం నిలిచింది. విచిత్రంగా కొందరు ప్రస్తుత పరిస్థితికి ఆటగాళ్ళను తప్పుబడుతున్నారు. లైంగిక వేధింపుల అంశాన్ని బయటకు చెప్పడమే వారి నేరమన్నట్టుగా, వారిని ‘ధర్నా జీవులు’ అంటూ బ్రిజ్‌భూషణ్ నిస్సిగ్గుగా బురద జల్లుతున్నారు. ఇకనైనా పాలకులు, క్రీడా అధికారులు కళ్ళు తెరవాలి. దీర్ఘ కాలం సస్పెన్షన్ కొనసాగితే అంతర్జాతీయ పోటీలకు ఆహ్వానాలు తగ్గుతాయి. ప్రపంచ సంఘం నుంచి ఆర్థిక సహకారమూ తగ్గుతుంది. ఆటగాళ్ళ కెరీర్ దెబ్బ తింటుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని, సంక్షోభ పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలి. అలాకాక ప్రభుత్వం ఇప్పటికీ మౌనం వీడకపోతే కష్టమే! దేశప్రతిష్ఠ కన్నా దేశంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే ముఖ్యమని భావిస్తే అది మహా పాపమే! -
బోరిస్ పతనావస్థకు అసలు కారణాలివే!
‘అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి బురదలోకి లాగింద’ని నానుడి. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఇది అక్షరాలా సరిపోతుంది. ఒక సాధారణ స్థాయి నుంచి రాజకీయాల్లోకొచ్చి ప్రధాని పీఠం వరకూ వెళ్లిన జాన్సన్ నిరుడు జూలైలో ఆ పదవి పోగొట్టుకోవటమే కాదు... గతవారం ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయక తప్పలేదు. తాజాగా సభాహక్కుల సంఘంతో అబద్ధాల కోరుగా ముద్రేయించుకున్నారు. ఎంపీగా తప్పుకున్నారు గనుక సరిపోయిందిగానీ, లేకుంటే ఆయన మూణ్ణెల్లపాటు దిగువ సభ నుంచి సస్పెండయ్యేవారు. ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుత స్థానాల్లో ఉండేవారు నిజాయితీతో మెలగకపోతే, విశ్వసనీయతను ప్రాణప్రదంగా భావించకపోతే ఏ గతి పడుతుందో చెప్పడానికి జాన్సన్ ప్రస్థానం ఒక ఉదాహరణ. మనకు జాన్సన్ చేసింది పెద్ద తప్పు అనిపించకపోవచ్చు. కానీ బ్రిటన్‌లో అది చెల్లుబాటు కాదు. కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న కాలంలో జాన్సన్ తన మిత్ర బృందాలతో విందుల్లో మునిగారన్నది ప్రధాన ఆరోపణ. ఆ కాలంలో దేశమంతా లాక్ డౌన్ అమల్లో వుంది. ప్రధానిగా 2020 మార్చి 23న లాక్డౌన్ విధించింది ఆయనే. మరో నాలుగు రోజులకు కరోనా వాతపడ్డారు కూడా. లాక్డౌన్ వల్ల దిగజారిన ఆర్థిక పరిస్థి తులతో, కరోనా తీవ్రతతో జనం అల్లాడుతుంటే ఆ సమయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలు చెలరేగాయి. కనీసం అప్పుడైనా ఆయన మేల్కొనివుంటే వేరేగా ఉండేది. కానీ విందులు జరగడం అబద్ధమని ఒకసారి, జరిగినా నిబంధనలు ఉల్లంఘించలేదని మరోసారి బొంకారు. పైగా పార్టీలోని తన వ్యతిరేకులనూ, దర్యాప్తు చేస్తున్న సభా హక్కుల సంఘాన్నీ భ్రష్టుపట్టించే ప్రయత్నం చేశారు. లండన్ మేయర్‌గా ఉన్నకాలంలో జాన్సన్ ఓసారి అమెరికా వెళ్లారు. ఆయన్ను చూసిన ఒక పౌరుడు జాన్సన్‌ను దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ దూకుడుగా ప్రచారం చేసుకుంటున్న ట్రంప్‌గా పొరబడ్డారట. ఇలా పొరబడిన పౌరుడెవరోగానీ ఇద్దరిలోనూ పోలికలు న్నాయన్నది వాస్తవం. భౌతికమైన పోలికల మాట అటుంచి తమకొచ్చిన అవకాశాన్ని దుర్వినియో గపర్చటంలో ఇద్దరూ ఇద్దరే. తోచినట్టు మాట్లాడటం, ఇష్టానుసారం వ్యవహరించటం ఇద్దరిలోనూ ఉంది. అమెరికాలో ట్రంప్‌ను దించటానికి ఎన్నికల వరకూ జనం వేచిచూడాల్సి వచ్చింది. కానీ పార్టీ గేటు వ్యవహారం గుప్పుమన్నాక జాన్సన్‌ను సొంత పార్టీయే దించేసింది. నిజానికి పార్టీ గేటు వ్యవహారం ప్రధానిగా జాన్సన్ వరసబెట్టి చేసిన నిర్వాకాలకు పరాకాష్ట. ఒక చట్ట ఉల్లంఘనలో పోలీసులు తనకు జరిమానా విధించారని నిరుడు ఏప్రిల్‌లో ఆయనే స్వయంగా ప్రకటించారు. ప్రధాని స్థాయి నేత జరిమానా చెల్లించవలసి రావటం దేశ చరిత్రలో అదే తొలిసారి. అయినా అందుకుగల కారణమేమిటో ఆయన చెప్పలేదు. ఈలోగా తన అధికారిక నివాసాన్ని విలాసవంతంగా మార్చడానికి చట్టవిరుద్ధంగా భారీ మొత్తం ఖర్చు చేశారన్న ఆరోపణలొచ్చాయి. ఇది చాల దన్నట్టు అత్యాచార ఆరోపణల్లో జాన్సన్‌కు సన్నిహితుడిగా ఉండే ఎంపీ అరెస్టయ్యాడు. ఆయన మిత్రబృందంలోని మరో మాజీ ఎంపీకి బాలుడిపై లైంగిక దాడి చేశారన్న ఆరోపణ రుజువై శిక్షపడింది. ఆ తర్వాత ‘పార్టీ గేట్’ గుప్పుమంది. పర్యవసానంగా వరస సర్వేల్లో జాన్సన్ రేటు పడిపోయింది. ఆయనపై జనం ఆగ్రహావేశాలతో ఉన్నట్టు వెల్లడైంది. దాంతో 40 శాతం మంది పార్టీ ఎంపీలు జాన్సన్‌ను పదవి నుంచి తప్పించాలని నిశ్చయించుకున్నారు. అయినా పార్టీలో అవిశ్వాసం నుంచి గట్టెక్కారు. కానీ మాజీ ఎంపీపై ఉన్న కేసు గురించి తెలిసినా ఆయన్ను నెత్తినబెట్టుకున్నారన్న నిజాన్ని పార్టీ సభ్యులు సహించలేకపోయారు. అది తప్పేనని జాన్సన్ అంగీకరించినా లాభం లేక పోయింది. అంతవరకూ మద్దతుదార్లుగా ఉన్న అప్పటి ఆర్థికమంత్రి, ప్రస్తుత ప్రధాని రిషి సునాక్, ఆరోగ్యమంత్రి సాజిద్ జావేద్ వంటివారు నిరుడు జూలైలో తమ పదవులకు రాజీనామా చేశారు. పలువురు మంత్రులు సైతం వారి బాట పట్టడంతో జాన్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా సభాసంఘం అభిశంసన కన్సర్వేటివ్ పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది వేచిచూడాలి. వచ్చే సోమవారం ఆ నివేదికపై జరిగే చర్చ సందర్భంగా పార్టీలో లుకలుకలు బయటపడక తప్పదు. నివేదికకు వ్యతిరేకంగా ఓటేయొద్దని పార్టీ ఎంపీలను బోరిస్ జాన్సన్ కోరు తున్నా, తన తప్పులకు మాత్రం పశ్చాత్తాపం ప్రకటించడం లేదు. సరిగదా ఇదంతా ప్రతీకార రాజకీ యాల పర్యవసానమని చెప్పుకొస్తున్నారు. కనీసం ఈ క్షణంలోనైనా పశ్చాత్తాప పడని నేతను ఎవ రైనా క్షమించగలరా? కన్సర్వేటివ్ పార్టీలో జాన్సన్ ఎదిగిన క్రమం అసాధారణమైనది. పాత్రికే యుడిగా ఉంటూ పార్టీలోకొచ్చిన జాన్సన్ 2008 నుంచి 2016 వరకూ రెండుసార్లు లండన్ మేయర్‌గా ఉన్నారు. పరిస్థితులు కలిసొచ్చి థెరిస్సా మే ప్రధాని పదవి నుంచి తప్పుకున్నాక 2019లో ఆ పదవి చేజిక్కించుకున్నారు. అదే సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి అఖండ విజయాన్నందించారు. 1987 తర్వాత అంత పెద్ద మెజారిటీతో కన్సర్వేటివ్‌లు నెగ్గటం అదే తొలిసారి. ఒంటరి తల్లుల సమస్య మొదలుకొని స్వలింగ సంపర్కం, బ్రిటన్ వలసవాదం, బ్రెగ్జిట్ వరకూ సమయానుకూలంగా అభిప్రాయాలు మార్చుకుంటూ వచ్చిన జాన్సన్ వంటివారిని కన్స ర్వేటివ్ పార్టీ నెత్తినపెట్టుకోవటం మొదటినుంచీ విశ్లేషకుల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. పోతూ పోతూ జాన్సన్ అంటించిన బురద నుంచి ఆ పార్టీ ఏనాటికైనా బయటపడగలదా అన్నది సందేహమే. -
ఈ బెదిరింపుల వెనుక..!
‘‘అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున దానెక్కిన బారని గుర్రము, గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ’’ అన్నాడు శతకకారుడైన బద్దెన. అవసరానికి ఉపయోగపడని చుట్టాన్నీ, పూజించినా కోర్కెలు తీర్చని దేవుడినీ, యుద్ధంలో తానెక్కినప్పుడు పరుగెత్తని గుర్రాన్నీ వెంటనే వదిలేయాలని దాని అర్థం. అటువంటి అక్కరకు రాని ఒక చుట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాలుగేళ్ల కింద వదిలించుకున్నారు. అలా వదిలించుకోవడం ఆయనకు బొత్తిగా నచ్చలేదు. కోపం తన్నుకొస్తున్నది. ఉక్రోషం లావాలా ఉప్పొంగుతున్నది. కళ్లెర్రబారుతున్నాయి. తనను వదిలించు కున్న ప్రజలకు శాపనార్థాలు పెడుతున్నారు. తనను ఓడించిన నాయకుడిపై బెదిరింపులకు దిగుతున్నారు. మధ్యేమధ్యే శోకం సమర్పయామి... వెక్కివెక్కి ఏడుస్తున్నారు. ఓదార్పు కోసం పొరుగు రాష్ట్రాల నుంచి సెలబ్రిటీలను బతిమాలి పిలిపించుకుంటున్నారు. ‘యే దిల్ మాంగే సింపతీ’ అంటూ ఊరేగుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గతంలో ఓదార్పు యాత్ర చేశారు. బాధలో ఉన్న వారిని ఓదార్చ డానికి ఆయన ఈ యాత్రను చేపట్టారు. ఈ నాయకుడు మాత్రం తనను ఓదార్చండని యాత్రలు చేస్తున్నారు. ఇదీ ఇద్దరు నాయ కుల ఫిలాసఫీల్లో ఉన్న మౌలికమైన తేడా! ‘నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకే గోవిందా’ అంటారు. అలాగైంది ఆయన పరిస్థితి ఇప్పుడు. ఆయన మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారు. కష్టాలన్నీ కట్టగట్టుకొని తన మీద దాడి చేస్తున్నాయని జనం నమ్మి తనను ఓదార్చాలి. తాను అధికారంలో ఉండగా చేసిన అవినీతి, అక్రమాలకు రాజ్యాంగ బద్ధమైన ఇమ్యూనిటీ ఉండాలని ఆయన గట్టిగా నమ్ముతారు. కర్ణునికి కవచ కుండలాలెంత సహజమో, బాబుకు అవినీతి ఇమ్యూనిటీ అంత సహజమనీ మూడు దశాబ్దాలుగా యెల్లో మీడియా ప్రచారం చేసిపెట్టింది. ఈ ముప్పయ్యేళ్లలో ఎన్ని ఆరోపణలు కోర్టు మెట్లెక్కినా, బదిలీ లేని ‘స్టే’షన్ మాస్టర్లా తాను పాతుకొనిపోలేదా? విచారణ జరగకుండా ఇరవైకి పైగా స్టేలు విజయవంతంగా తెచ్చుకోలేదా? ఇప్పుడేమైంది. తాను నగ్నంగా దొరికిపోయే కేసులో సుప్రీంకోర్టు స్టేను తొలగించ డమేమిటి? కలికాలం కాకపోతే!... ఇదీ బాబు అండ్ కో భావజాలం. రాష్ట్ర విభజన వెంటనే జరిగిన ఎన్నికల్లో మోదీ గాలి ఆసరాగా యెల్లో తెరచాప ఎత్తిపట్టి బాబు అధికారంలోకి వచ్చారు. ఫార్టీ ఇయర్స్ అనుభవజ్ఞుడు కనుక క్లిష్ట పరిస్థితుల్లో ఉపయోగపడతాడేమోనని కూడా కొందరు వయోధిక ఓటర్లు ఆలోచించి ఉండవచ్చు. నిజానికి అప్పుడు చంద్రబాబుకు లభించిన అవకాశం ఓ అద్భుతం. నవ్యాంధ్రను తీర్చిదిద్దడానికి లభించిన దివ్యమైన అవకాశం. సద్బుద్ధితో ఆలోచించి ఉంటే పాత పాపాలను కడిగేసుకోగలిగేవారు. ఆయన చంద్రబాబు కనుక అలా జరగలేదు! ‘‘ఎలుక తోలు తెచ్చి యేడాది ఉతికినా, నలుపు నలుపే గాని తెలుపు గాదు, కొయ్యబొమ్మ తెచ్చి కొట్టిన పలుకునా, విశ్వదాభిరామ వినురవేమ!’’ అన్నారు. స్వభావం మారకపోగా విశ్వరూపం దాల్చింది. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలనే మేనేజ్ మెంట్ పాఠాన్ని బాబు పదేపదే వల్లెవేసేవారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని సొంత అవకాశంగా మలుచు కునేటందుకు ఒక అవినీతి క్రతువును ఆరంభించారు. అప్పటి ప్రతిపక్షం ఆ క్రతువు ఖరీదు ఆరు లక్షల కోట్లు ఉండవచ్చని ఉజ్జాయింపు అంచనా వేసింది. గ్రామస్థాయిల్లోనూ జన్మభూమి కమిటీల పేరుతో అవినీతి పిండారీ ముఠాలను ఎగదోశారు. ఆ అయిదేళ్లలో అవినీతి సెగ తగలని మనిషే లేడంటే అతి శయోక్తి కాదు. జనం కీలెరిగి వాతపెట్టారు. ఎన్నికల సమ యానికి ఉప్పెనలా విరుచుకుపడి అక్కరకు రాని చుట్టాన్ని తరిమికొట్టారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కొత్త ప్రభుత్వం బాబు అవినీతి పురాణంపై ఓ కేబినెట్ సబ్‌కమిటీని వేసింది. ఆ సబ్ కమిటీ అవినీతి తాలూకు నివ్వెరపోయే నిజాలను రూఢి పరుస్తూ ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. నివేదిక ఆధారంగా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. బాబు ప్రభుత్వం అవినీతి విశ్వరూపానికిసంబంధించిన అనేక ఆధారాలను ‘సిట్’ సంపాదించగలిగింది. బ్రహ్మరాక్షసి లాంటి అవినీతిని తవ్వి తీయాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగాలని ప్రభుత్వానికి ‘సిట్’ సూచించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈలోగా చంద్రబాబు రంగంలోకి దిగిపోయారు. నాటి ప్రభుత్వంలో భాగస్వాములు కాని ఇద్దరు వ్యక్తుల చేత హైకోర్టులో పిటిషన్ వేయించారు. ఈ పిటిషన్ వేయడానికి వారికి ఎటువంటి అర్హత (లోకస్ స్టాండై) లేదనే న్యాయ నిపుణులు భావించారు. అయినప్పటికీ హైకోర్టులో ‘సిట్’ దర్యాప్తుపై స్టే మంజూరైంది. అదీ చంద్ర బాబు ప్రత్యేకత. దుర్యోధనుడికి జలస్తంభన విద్య వచ్చట. ఆ విద్య వలన ఆయన నీటిలో ఎంతసేపైనా మునిగి ఉండగలడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులందరూ చనిపోయిన తర్వాత మిగిలిన ఒక్క దుర్యోధనుడు ఓ మడుగులో దూరి దాక్కుంటాడు. రణశేషం ఉండకూడదు కనుక పాండవులు మడుగు వద్దకు చేరుకొని తిట్ల దండకం అందుకుంటారు. అభిమానధనుడైన దుర్యోధనుడు ఆ తిట్లు భరించలేక బయటకొచ్చి యుద్ధం చేస్తాడు. ఆ జలస్తంభన విద్య లాంటి న్యాయస్తంభన (స్టే ఆర్డర్) విద్య చంద్రబాబుకు తెలుసునని అభిజ్ఞవర్గాలు బలంగా నమ్ముతాయి. ఈ విద్య తెలిసినందున ఆయన దాని మాటున ఎంతకాలమైనా దాక్కో గలరు. దుర్యోధనుడి మాదిరిగా అభిమానధనం, గోంగూర ధనం వంటి సెంటిమెంట్లేవీ ఆయనకు లేవు. అందువల్ల కేసును ఎదుర్కోవాలని ఎవరెంత కవ్వించినా ఆయన చలించరు. ‘స్టే’షన్ మాస్టర్‌గానే ఉండిపోతారు. ఈవిధంగా ఇప్పటికి ఇరవై రెండు పర్యాయాలు ఆయనలాగే ఉండిపోయారు. కానీ ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు ఇప్పుడేదో తేడా కొట్టడంతో బాబు కలవరపడిపోతున్నారు. ‘సిట్’ దర్యాప్తుపై హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేయడమేమిటి? దర్యాప్తు జరిగితే..? కేంద్ర సంస్థలు కూడా రంగంలోకి దిగితే ఏం చేయాలి? ఇప్పుడెవరికి చెప్పుకోవాలి? మార్గదర్శి లాంటి తన గురువు పరిస్థితే బాగాలేదు. ఆయన మంచం దిగనంటున్నారు. ఆపన్న హస్తం కోసం ఆయనే ఎదురుచూస్తున్నారు. కృష్ణపరమాత్ముడు పరమపదించారన్న వార్త విన్నప్పటి అర్జునుడి పరిస్థితి బాబుగారిది. ‘‘మన సారథి, మన సచివుడు, మన వియ్యము, మన సఖుండు, మన బాంధవుడున్, మన విభుడు, గురుడు, దేవర, మనలను దిగనాడి చనియె మనుజాధీశా!’’ అని ధర్మ రాజు ముందు అర్జునుడు మొరపెట్టుకున్నాడట! ఇప్పుడు తానెవరి ముందు మొరపెట్టుకోవాలి? అకాల వర్షాలు ఆయన కంటికి ఒక సంక్షోభంలా కనిపించాయి. అవకాశాలు వెతుక్కో వడానికి గోదావరి జిల్లాలకు బయల్దేరారు. సుప్రీంకోర్టు స్టే తొలగించిన రోజు. మీడియా ముందు ఆయన మొరపెట్టుకున్నారు. దాంతోపాటు గర్జనలకూ, గాండ్రింపులకూ, బెదిరింపులకూ కూడా పాల్పడ్డారు. ఆయన ఆవేశానికి ఎదురుగా వున్నవారు మ్రాన్పడిపోయారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారానికి సంబంధించి బాగా వైరలైన ఒక వీడియో చాలామందికి గుర్తుండే ఉంటుంది. అందులో పవన్ ఉన్నట్టుండి వీరావేశంతో చేసిన ఆంగిక వాచికాభినయాలకు పక్కనున్న కాకినాడ అభ్యర్థి జడుసుకుంటాడు. బిత్తరచూపులతో సదరు అభ్యర్థి ప్రదర్శించిన మూకాభినయం చార్లీ చాప్లిన్‌ను గుర్తుకు తెస్తుంది. మొన్నటి సమావేశంలో చంద్రబాబు ఎదురుగా ఉన్నవాళ్లలో కూడా పదిమందైనా చాప్లిన్లు ఉండి ఉంటారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ చంద్ర బాబు బెదిరింపులకు దిగారు. బహుశా ఏ రాజకీయ నాయ కుడూ తన ప్రత్యర్థిని ఉద్దేశించి ఇలాంటి బెదిరింపులు చేసి ఉండరు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని పరోక్షంగా ప్రస్తా విస్తూ ‘‘అతనికి మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. చరిత్రలో ఏ నాయకుడికీ జరగని ట్రీట్మెంట్ ఇతనికి ఉంటుంది. అతిగా ప్రవర్తించే వారికి ఇలాంటి ఎండింగే ఉంటుంది. దానికి అతను సిద్ధంగా ఉండాలి. అతనే కాదు. అతని పార్టీ వాళ్లు కూడా ఇలాంటి ట్రీట్మెంట్కు రెడీ కావాలి’’ – ఇదీ ఆయన బెదిరింపు. దీని తాత్పర్యమేమిటో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఆయ నపై ఉన్నది. మిజరబుల్ ట్రీట్మెంట్ అంటే? ఏం చేస్తారు? నిస్పృహతో విసిరిన ఆఖరి బాణమా? ఏమైనా కుట్రనా? ఇది కోడ్ లాంగ్వేజా?... ఆయనే విడమర్చి చెప్పాలి. ఈ పర్యటనలో బాబు ఉపయోగిస్తున్న అన్ పార్లమెంటరీ భాషను ఇక్కడ ప్రస్తావించడం లేదు. జనం నవ్వుకునేలా గొప్పలు చెప్పుకోవడం గురించి కూడా ఒకే ఒక అంశాన్ని ప్రస్తావించుకుందాము. ‘తమ్ముళ్లూ! నేనే గనుక అధికారంలో ఉంటే మీ ధాన్యం తడిసే ఉండేదా?’ అని ప్రశ్నించారు. వెంటనే జనంలో ఓ గొంతు ‘మీరుంటే అసలు వర్షం పడితేగా?’ అని వినిపించింది. తనకు నచ్చని కామెంట్లను ఆయన పట్టించుకోరు. తన ధోరణి తనదే! ‘సముద్ర తీరంలో నిలబడి తుపాన్లను కంట్రోల్ చేస్తున్నాను, తుపాకులతో వర్షం కురిపించాను’... వగైరా వ్యాఖ్యానాలు చేసిన మానసిక స్థితిలోంచే.. ‘నేనుంటే మీ ధాన్యం తడిసేది కాద’న్న వ్యాఖ్యానం వెలువడి ఉంటుంది. జనానికి కొంత కాలక్షేపం. బాబు అవినీతి దర్యాప్తుపై ఉన్న స్టేను సుప్రీంకోర్టు తొలగించిన తర్వాత ఆయన కూటమికి మరో పిడుగు లాంటి వార్త. రాజధాని ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన యాభైవేల మంది పేద ప్రజలకు సెంటు భూమి చొప్పున ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి రెండేళ్లుగా బాబు కూటమి చేయని ప్రయత్నం లేదు. పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలిస్తే ‘సామాజిక సమతౌల్యత’ దెబ్బతింటుందని కోర్టుకు వెళ్లారు. అదొక గంభీరమైన పదం మాత్రమే! ఆ ముసుగు పదాన్ని తొలగిస్తే పేద ప్రజల పట్ల అదొక భయంకరమైన అస్పృశ్య భావన. తమ పక్కన పేదవారు నివసిస్తే మైలపడి పోతామనే పెత్తందారీ తనపు కొవ్వెక్కిన అహంకారం. ఈ మనో వికారానికి ముసుగు కప్పి సాంకేతిక కారణాలు జోడిస్తూ చేసిన అభ్యంతరాలను ప్రభుత్వ న్యాయవాది బలంగా తిప్పికొట్టారు. ఈ తీర్పు వచ్చిన రోజు కూడా చంద్రబాబువి ఆగ్రహా వేశాలే! కొంత తటస్థంగా ఉండే మీడియాను కూడా ఈసారి బెదిరించారు. తాను కోరుకున్నట్లు ప్రసారాలు చేయని రెండు చానల్స్‌ను నిషేధిస్తానని బ్లాక్‌మెయిలింగ్‌కు దిగజారారు. ఆ రెండు చానల్స్‌ను పేరుపెట్టి మరీ హెచ్చరించారు. ‘సాక్షి’ సంగతి సరేసరి. దాన్ని ముందే నిషేధిస్తారట! మీడియా మొత్తం ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ–5 మాదిరిగా ఉండాలి. లేదంటే తన ఆగ్రహానికి గురికాక తప్పదనే సందేశాన్ని ఆయన బహిరంగంగా పంపిస్తున్నారు. రాజకీయంగా చిట్టచివరి జారుడు మెట్టు మీదకు చేరుకోవడంతో ఆయన నిస్పృహ మాటల్లో స్పష్టంగా బయటపడుతున్నది. పేదలకు ఇళ్లస్థలాలు రాజధానిలో ఇవ్వకూడదనీ, పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనీ, పేద పిల్లలకు ఇంగ్లిషు చదువులొద్దనీ, అవి తమ పిల్లలకు మాత్రమే పరిమితం కావాలనీ హూంకరిస్తున్న పెత్తందారీతనంపై సాధారణ ప్రజలు మండిపడుతున్నారు. తమ పిల్లలు కూడా పెద్దవారితో సమా నంగా నాణ్యమైన చదువులు చదవాలనీ, వైద్యరంగం అభివృద్ధితో పెరుగుతున్న ఆయుఃప్రమాణాలు తమకూ వర్తించాలనీ, తమ శ్రమకు లాభదాయకమైన విలువ, గౌరవం లభించాలనీ పేద ప్రజలు కోరుకుంటున్నారు. బలహీనవర్గాలు, మహిళలు సాధికారతను కోరుకుంటున్నారు. సామాజిక, రాజకీయ రంగాల్లో తగిన వాటానూ, గౌరవప్రదమైన స్థానాన్నీ అభిలషి స్తున్నారు. ఇవన్నీ న్యాయమైన కోర్కెలు. రాజ్యాంగం ఇచ్చిన హామీలే. కానీ ఇన్నాళ్లు ఈ సామాజిక న్యాయం తమకు దక్కకుండా చేసిన పెత్తందారి తోడేళ్లెవరో జనం గుర్తించగలుగు తున్నారు. తమకు అండగా నిలబడుతున్నవాళ్లెవరో ప్రజలకు తేటతెల్లమవుతున్నది. రాజధానిలో పేద ప్రజలకు ఇళ్ల పట్టాల సమస్యే ఒక లిట్మస్ టెస్ట్. ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లంతా పెత్తందారీ తొత్తులే! వాడు ఎర్రజెండా ముసుగేసుకున్నా సరే! ఎవరేమిటనే సంగతి జనానికి స్పష్టంగా తెలిసిపోయిందన్న ఉక్రోషమే ‘బాబు అండ్ కో’లో బుసకొడుతున్నది. వచ్చే ఎన్ని కల్లో పాత ఫలితాలే పునరావృతమయ్యే పరిస్థితి విస్పష్టంగా కనిపిస్తున్నది. అందుకే ఈ నిస్పృహ. అందుకే ఈ బెదిరింపులు. - వర్ధెళ్లి మురళి, Vardhelli1959@gmail.com -
వ్యధార్థ జీవుల యథార్థ కవి
శ్రీశ్రీ 20వ శతాబ్ది ద్వితీయార్ధంలో నాటి కాలపు సామాజికార్థిక రాజకీయ అంశాలను, ఆకలి పేదరికపు కోరల్లో నలుగుతున్న వ్యధార్థ జీవితాలను కవిత్వీకరించాడు. దేశీయంగా జాతీయ ఉద్యమాన్ని నడుపుతున్న గాంధీ ప్రభావంతో, అంతర్జాతీయంగా మార్క్సిస్ట్ సైద్ధాంతిక ప్రభావంతో సాహిత్య సృజన చేశాడు. ఈ విధంగా శ్రీశ్రీపై జాతీయ ఉద్యమ ప్రభావం దాన్ని నడిపిస్తున్న గాంధీ ప్రభావం, ప్రపంచ పవనంగా వీస్తున్న మార్క్సిస్ట్ దృక్ప థాలతో శ్రీశ్రీ కవిత్వం ముందుకు సాగిందని నేను భావిస్తున్నాను. గాంధీ స్వాతంత్య్రోద్యమ తాత్విక పునాదిపై కవిత్వమే కాదు.. నాటికలు, వ్యాసాలు, కవితలు, వ్యాఖ్యానాలు, అనువా దాలు, ఇంటర్వ్యూలు, ఇలా వివిధ ప్రక్రియల్లో రచనా వ్యాసంగం చేశాడు. ‘మహాసంకల్పం’ కవిత ద్వారా గాంధీ సైద్ధాంతిక భూమికను వ్యక్తం చేస్తూ.. ‘ఇదిగో నా స్వాతంత్య్ర స్వప్నం.. జన సందోహం కరిగి ఒకే వ్యక్తిగా రూపుధరిస్తే/ ఇదేం చిత్ర మని చూశాను ఒక పెద్ద కాంస్య విగ్రహానికి ప్రాణం వచ్చినట్టుగా/ ఒక మేఘం గగనపథం దిగి మానవుడై నిలిచినట్టుగా.. ఒకే ఒక్క మానవ మూర్తి నా కళ్ళ ముందు కనిపించాడు... అతని బాధ్యత వహిస్తామని అందరూ హామీ ఇవ్వండి.. అంటూ గాంధీ తాత్వికతకు బావుటా పట్టాడు. మహాత్ముడి ఆదర్శాల వెలుగులో దేశ ప్రజలు పయనించాలని కాంక్షిస్తూ ఈ రచన చేశాడు. మహా త్ముడి నిర్యాణం తర్వాత శ్రీశ్రీ రాసిన ‘సంభ వామి యుగేయుగే’ వంటి రచన తెలుగులోనే కాదు, మరే ప్రాంతీయ భాషలోనూ రాలేదని ప్రముఖ పాత్రికేయులు నార్ల చిరంజీవి వ్యాఖ్యానించారు. ఓ మహాత్మా ఓ మహర్షీ/ ఏది చీకటి ఏది వెలుతురు ఏది జీవితమేది మృత్యువు/ ఏది పుణ్యం ఏది పాపం/ ఏది నరకం ఏది నాకం.. అంటూ రాసిన ‘ఓ మహాత్మా’ కవితా ఖండిక ప్రజల నాలుకలపై నిలిచి ఉంది. స్వభావరీత్యా శ్రీశ్రీ పసిపాప లాంటి వాడుగా కనిపిస్తాడు. ప్రతిదానికీ స్పందించే లక్షణం ఉంటుంది. ‘అభిప్రాయాల కోసం బాధల్ని లక్ష్యపెట్టని వాళ్లు మాలోకి వస్తారు. అభిప్రాయాలు మార్చుకొని సుఖాల్ని కామించే వాళ్లు మీలోకి వస్తారు’– అని సాహిత్య లోకాన్ని రెండుగా విభజించి ఒక స్పష్టమైన గీత గీసి ప్రజాశిబిరం, ప్రజా వ్యతిరేక శిబిరంగా విడ గొట్టాడు. స్వాతంత్య్రానంతరం ధనిక పేదల మధ్య పెరిగిన అంతరాలు ఆకలి జీవుల, అన్నార్తుల హాహాకారాలను ‘పేదలు’ కవితలో వ్యక్తపరుస్తాడు. ‘ఉద్యోగం ఇవ్వని చదువు/ నిలకడ లేని బతుకు వ్యాపకాలు/ స్వరాజ్య దుఃస్థితిని చూపుతున్నాయి’ అంటాడు. చెదిరి పోయిన కలల్ని ‘బాటసారి’ కవితలో కూటి కోసం, కూలి కోసం, పట్టణంలో బ్రతుకు దామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలు దేరిన బాటసారికి ఎదురైన సంక్షోభాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతాడు. గాంధీ గ్రామ స్వరా జ్యంపై అపార నమ్మకం ఉన్న శ్రీశ్రీ గ్రామీణ జీవితంలో ముసురుతున్న రోదనలకు అక్షర రూపం ఇచ్చాడు. అయితే ఇటీవల దళిత సాహితీవేత్తలు శ్రీశ్రీ సాహిత్యం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నట్టు నేను భావిస్తున్నాను. సమస్త కార్మిక, కర్షక, అభా గ్యుల, అన్నార్తుల అనాధల, వ్యధార్థజీవుల, యథార్థ బతుకుల్ని తన సాహిత్యంలో చూపిన శ్రీశ్రీని మన క్యాంపులోనే పెట్టుకోవాలి. అవతలి పక్షాలకు అప్పజెప్పి మనం బల హీనులం కాకూడదు. తెలుగు సాహిత్యంలో జాషువాని, శ్రీశ్రీని రెండు కళ్ళుగా స్వీకరించాల్సిన సందర్భం. తద్వారానే సామాజిక పరివర్తనకు మార్గదర్శకులమవుతాం. ఇది నేటి చారిత్రక అవసరం. సామాజిక సంస్కరణ లేకుండా భారతదేశ అభివృద్ధిని కాంక్షించలేము. ఈ సామాజిక లక్ష్యానికి ఒక సాంస్కృతిక కార్యాచరణను ప్రకటించిన వాళ్లు శ్రీశ్రీ, జాషువా. – డొక్కా మాణిక్య వరప్రసాద్, వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ విప్, మాజీ మంత్రి (నేడు శ్రీశ్రీ జయంతి) -
మోదీ మనోధర్మ వాణి ‘మన్ కీ బాత్’
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం ప్రజాస్వామ్య విధానం. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన భారతదేశంలో ఈ విధానం ఈనాటిది కాదు. అదే çపరంపరను అనుసరిస్తూ మొదలైన ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం విజయవంతం కావడంలోని రహస్యం అదే. రేడియో ద్వారా ప్రజలతో సంభాషిస్తూ, దేశాభివృద్ధిలో వారందరినీ భాగస్వాముల్ని చేస్తూ, దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో 2014 అక్టోబర్ 3న ప్రధానమంత్రి ఈ కార్యక్రమం ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా దేశంలోని సామాన్యుల అసామాన్య గాథలను ఇందులో ప్రస్తావిస్తుండటం దేశ పౌరులపై లోతైన ప్రభావం చూపిందనడంలో సందేహం లేదు. ప్రధానమంత్రిగా కాకుండా... స్నేహితుడిగా, సంరక్షకుడిగా, సన్నిహితుడిగా... వివిధ సందర్భాల్లో, వివిధ పాత్రల్లో ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ‘మన్ కీ బాత్’ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి నెలా చివరి ఆదివారం వచ్చే ఈ కార్యక్రమం ఈ రోజు వందో ఎపిసోడ్ పూర్తి చేసుకోనుండటం చరిత్రాత్మకం! ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. అందుకే... ప్రజల భాగస్వామ్యంతో జరిగే ఏ పనికైనా ప్రజాస్వామ్యంలో అదే స్థాయిలో గౌరవ మర్యాదలు, ఆదరణ లభిస్తాయి. తమ సంక్షేమం, మంచి చెడ్డల గురించి ఆలోచించి, సమయానుగుణంగా మార్గదర్శనం చేసే వ్యక్తిని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుంటారు. భారతదేశంలో ఈ సంప్రదాయం ఈనాటిది కాదు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలను భాగ స్వామ్యం చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. చోళుల కాలంలో తమిళనాడులోని ఉత్తర మెరూర్లో గ్రామసభ, మన పక్కనున్న కర్ణాటకలోని బీదర్ జిల్లాల్లో బసవేశ్వరుడి ‘అనుభవ మండపం’ వంటివి పురాతన కాలం నుంచే దేశంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థకు అద్దం పడతాయి. అందుకే ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన భారతదేశంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ జరిగే కార్య క్రమాలు విజయవంతం అయ్యాయి. సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతున్న 21వ శతాబ్దంలోనూ ఇదే ప్రజాస్వామ్య పద్ధతిని అవలంబిస్తూ... రేడియో ద్వారా నిరంతరం ప్రజలతో సంభాషించడం, తద్వారా వారందరినీ భాగ స్వామ్యం చేస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో 2014 అక్టోబర్ 3న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ను ప్రారంభించారు. ప్రతినెలా చివరి ఆదివారం గ్రామాల్లో, విద్యాసంస్థల్లో, వీధుల్లో, ప్రభుత్వ ఆఫీసుల్లో, పార్టీ కార్యాలయాల్లో... ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకొస్తున్న ‘మన్ కీ బాత్’ వందో ఎపిసోడ్ పూర్తి చేసుకోనుండటం చరిత్రాత్మకమే. మీ మాట.. నా నోట! దేశ ప్రజల శక్తిసామర్థ్యాలు, సాహసం, శౌర్యం, ఆత్మవిశ్వాసం, స్ఫూర్తి దాయక గాథల గురించి చర్చిస్తూనే... ప్రజాసమస్యలు, సవాళ్లను ప్రస్తావిస్తూ వారిని చైతన్య పరచడం, ఆ సమస్యలపై వారిని పోరాటానికి సిద్ధం చేయడం... దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ పనిని ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి స్వయంగా నిరంతరాయంగా చేస్తుండటమే ప్రజల్లో ఈ కార్యక్రమం పట్ల ఆదరణకు కారణం. ‘మన్ కీ బాత్’ అనేది మీది, నాది, మనందరి మనసులోని మాట. ప్రధాని వాక్కు ద్వారా దేశం మొత్తానికి తెలియజెప్పబడుతున్న ‘మన మాట’. ‘గొంతు నాదే కానీ భావన మీ అందరిదీ’ అని ప్రధాని కూడా తరచుగా చెబుతుంటారు. అందుకే ప్రధాని మాటలు, దేశంలోని 90 శాతం ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటాయి. మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న అద్భుతమైన కార్యక్రమా లను, అక్కడి సామాన్యుల అసామాన్యమైన ఆలోచనను గుర్తుచేస్తూ... దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపడం; కరోనా రూపంలో ‘తాత్కాలిక గ్రహణం’ పట్టిన సమయంలో ‘జాగ్రత్తగా ఉండండి, మేమున్నాం’ అనే భరోసా ఇవ్వడం...వంటి ఎన్నో సానుకూలమైన మార్పులకు వేదిక ఈ ‘మన్ కీ బాత్’. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని మాట్లాడిన మాటల గురించి.. తర్వాతి రోజు పేపర్లలో, టీవీ ఛానళ్లలో చర్చ జరగడం ద్వారా ఎందరో సాధారణ వ్యక్తుల అసాధారణ ప్రతిభ ప్రపంచానికి పరిచయమైంది. ప్రధానమంత్రికి కోట్ల సంఖ్యలో ఉత్తరాలు వస్తాయి. వాటిలోని అంశాలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ, ప్రజలు తమ అభిప్రాయాలను దేశ ప్రజలతో పంచుకునేలా ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులు రాసిన లేఖలను కూడా వీలున్నప్పుడు చదువుతూ, నేరుగా వారితో మాట్లాడిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఓ ప్రధానమంత్రిగా కాకుండా... స్నేహితుడిగా, సంరక్షకుడిగా, సన్నిహితుడిగా... వివిధ సందర్భాల్లో వివిధ పాత్రల్లో ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ‘మన్ కీ బాత్’ కార్యక్రమం కొనసాగుతోంది. అందుకే ప్రజలు ప్రధానిని గుండెల్లో పెట్టుకున్నారు. ప్రధానినైనా.. మీలో ఒకడినే! ఓ రకంగా చెప్పాలంటే ‘మన్ కీ బాత్’... భారతదేశపు నెలవారీ సమీక్షగా భావించవచ్చు. ఇందులో ప్రజలు, వారి సమస్యలు, పరిష్కారాలు, సమా జాభివృద్ధి కోసం అక్కడక్కడ వ్యక్తులు చేస్తున్న మహోతన్నమైన పనులు పేర్కొంటూనే... కేంద్రప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు, సంక్షేమ కార్య క్రమాలను వివరిస్తూ వీటి ద్వారా లబ్ధి పొందేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తున్నారు. స్వచ్ఛ భారత్, సెల్ఫీ విత్ డాక్టర్ (కరోనా సమయంలో), జల సంరక్షణ, అవినీతి రహిత, మత్తుపదార్థాల ప్రభావం లేని భారత్ నిర్మాణంతో పాటుగా కుంభమేళా, ఇంక్రెడిబుల్ ఇండియా, ఫిట్ ఇండియా, బేటీ బచావో – బేటీ పఢావో, యోగా, ఖాదీకి ప్రోత్సాహం వంటి ఎన్నో విషయాలను చర్చిస్తున్నారు. గత ఎనిమిదేళ్లలో ఖాదీ రంగం ఉత్పత్తి 191 శాతం, కొనుగోళ్లు 332 శాతం పెరగడం, స్వచ్ఛందంగా ఎల్పీజీ సబ్సిడీని వదులుకోవడం, కరోనా సమయంలో నిబంధనలను పాటించడం వంటివి... ప్రధాని మోదీ మాటలను ప్రజలు విశ్వసించి భాగస్వాములు అవుతున్నారని చెప్పేందుకు నిదర్శనం. అందుకే చాలా కేంద్ర ప్రభుత్వ విభాగాలు తమ మంత్రిత్వ శాఖలో జరుగుతున్న పురోగతిని, కొత్త పథకాలను మోదీ నోటి ద్వారా నేరుగా యావద్దేశానికి అందించాలని ప్రయత్నిస్తుంటాయి. యాడ్ ఏజెన్సీలను పెట్టుకుని ప్రచారం చేసినదానికంటే... ‘మన్ కీ బాత్’ ద్వారా ప్రజలకు నేరుగా పథకాల గురించి చేరుతుండటమే ఇందుకు కారణం. భారతదేశంలోని ప్రజల కోసం వివిధ భాషల్లో, మాండలికాల్లో ప్రసారం కావడంతో పాటు ఇంగ్లిష్ సహా 11 అంతర్జాతీయ భాషల్లోనూ ఇది ప్రసారం అవుతోంది. విదేశాల్లో ఉంటున్న భారతీయులకు కూడా... దేశంలో ఈ నెలరోజుల్లో ఏం జరిగింది? భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే అంశాలపై స్పష్టత లభిస్తోంది. భారతదేశంలో సామాజిక పరమైన విప్లవం తీసుకురావడంలో ఈ కార్యక్రమం విజయవంతం అయిందనే చెప్పాలి. ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్’ సంస్థ చేసిన ఓ స్టడీ ప్రకారం... సమాజంలోని ప్రతి వర్గంపై, ప్రతి రంగంపై ఇది స్పష్టమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా గ్రామాల్లో, యువత, స్వయం సహాయక బృందాలపై ఈ ప్రభావం కనబడుతోంది. తద్వారా గ్రామీణాభివృద్ధి పథకాల సద్వినియోగం, అమృత్ సరోవర్ మిషన్ వంటి వాటిలో ప్రజల భాగస్వామ్యం పెరిగింది. రాజకీయాలకు అతీతంగా, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత ఉన్నతస్థితికి తీసుకెళ్లేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ద్వారా జరుగుతున్న ప్రయత్నంలో ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రజలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి పథంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. ఇదే ప్రజాస్వామ్యం గొప్పదనం. -జి.కిషన్ రెడ్డి, వ్యాసకర్త కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి ‘మన్ కీ బాత్’ రాజకీయాలకు తావులేనిది.. భారతదేశ సుసంపన్న వారసత్వం, యోగా, ధ్యానం వైపు నేను బాల్యంలోనే ఆకర్షితుడనయ్యాను. అలా నా 18 ఏళ్ల వయసులో సత్య– జ్ఞానాన్వేషణలో హిమాలయాలకు వెళ్లాను. సుదీర్ఘ కాలం సంచారిగా కొనసాగిన సమయంలో జీవితంలోని విభిన్న కోణాలను దర్శించే అవకాశం లభించింది. ఇందులో భాగంగా చాలా కాలం సాధుసంతుల సత్సంగంలో గడపగలగడం నా అదృష్టం. ఎందరో మహనీయులు, యోగులు సమాజ సంస్కరణకే తమ జీవితాలను అంకితం చేయడం చూశాను. వారి బోధనలతో సమాజం స్వీయశక్తిని ఎలా గుర్తించగలదో గ్రహించాను. సాధుసంతుల కరుణా తత్పరత నా ఆరాధ్య గురుదేవునితోపాటు గొప్ప యోగులందరి నుంచీ నేను కూడా ఇదంతా నేర్చుకున్నాను. ఈ నేపథ్యంలో మన ప్రధాని నరేంద్ర మోదీని చూసినప్పుడు, ఆయన నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమ ప్రసంగం వింటూ, ఆయా అంశాలపై స్పందించే వేళ మన సాధుసంతులు ప్రబోధించే ‘కరుణా తత్పరత’ను ఆయన కూడా అనుసరిస్తున్నట్లు తోస్తుంది. ఈ కార్యక్రమం మొదలైన రోజున నేను యాదృచ్ఛికంగా విన్నప్పటికీ, అదొక అలవాటుగా మారింది. ఎందుకంటే– ‘మన్ కీ బాత్’ ప్రధానంగా రాజకీయాలకు తావులేనిది.. అంతేగాక దేశం, సమాజం, సంస్కృతి, యోగా, సమాజంలోని శ్రమజీవుల విజయాలను మాత్రమే అది ప్రస్తావిస్తుంది. నేను ఈ ప్రసంగం వినడం ప్రారంభించినపుడు– అసలు ‘మన్ కీ బాత్’ వల్ల ప్రయో జనం ఏమిటనే ఆసక్తి నాలో ఉదయించింది. అయితే, ఈ రేడియో కార్యక్రమం ప్రధాని మోదీ శ్రీకారం చుట్టిన ఒక వినూత్న ప్రయోగమనే వాస్త వాన్ని నేను గుర్తించాను. అయినప్పటికీ– ఈ కొత్తదనం, ఆసక్తి, రాజ కీయరహిత స్వభావం ఈ వేదికపై కొనసాగడం సాధ్యమేనా అని కించిత్ సందేహం కూడా కలిగింది. కానీ, అశేష ప్రజా దరణతో ఈ కార్యక్రమం నేడు 100వ భాగం పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆ భయాలన్నీ నిరాధారమని నిరూపిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నా సందేహాలను పటాపంచలు చేశారని చెప్పడానికి నేనెంత మాత్రం సంకోచించను. మనసుతో మనసు సంభాషణ ప్రధానమంత్రి చొరవతో ప్రపంచం అంత ర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం యోగాభ్యాసానికి విశ్వగురువైన భారతదేశానికి గర్వకారణం. ఈ సందర్భంగా 2022 సెప్టెంబరు నెలలో ‘మ¯Œ కీ బాత్’ కార్యక్రమం అంశం నాకు గుర్తుకొస్తోంది. ఆనాటి ప్రసంగంలో భాగంగా సూరత్ నగరానికి చెందిన బాలిక ‘అన్వి’ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. పుట్టుకతోనే గుండె జబ్బుతో బాధపడుతూ వచ్చిన ఆ చిన్నారికి ‘ఓపెన్ హార్ట్ సర్జరీ’ చేశారు. ఆ తర్వాత ఆత్మ స్థై్థర్యంతో, యోగాభ్యాసంతో ఆ బాలిక సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకుంది. యోగాభ్యాసంలో అనేక పతకాలు కూడా సాధించడాన్ని ప్రధాని ఉదాహరించారు. అటవీ విధ్వంసాన్ని నిలువ రిస్తూ, నక్సలైట్లను ఎదుర్కొన్న జార్ఖండ్ వీరవనిత ‘జమునా తుడు’ కథను ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ ద్వారా పంచుకున్నారు. బిహార్‌లోని ముజ ఫర్పూర్లో ‘రైతు పిన్ని’గా ప్రసిద్ధురాలైన రాజ కుమారి దేవి కథను కూడా ఆయన ప్రస్తావించారు. గుజరాత్ వాస్తవ్యురాలైన దివ్యాంగురాలు ముక్తాబెన్ పంకజ్‌కుమార్ డాగ్లీ కథను కూడా ప్రజ లతో పంచుకున్నారు. పట్టుదారం వడకడంలో గిరిజన మహిళలకు శిక్షణ ఇస్తున్న ఒడిషా మహిళ కున్ని దేవూరి గురించి కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకున్నాం. అదేవిధంగా మారు మూల ప్రాంతాల్లో గర్భిణులకు ప్రసవ సమయంలో అండగా నిలిచే పద్మశ్రీ సూలగిత్తి నరసమ్మ గురించి కూడా పౌరులు తెలుసు కున్నారు. సిద్దగంగ మఠానికి చెందిన డాక్టర్ శ్రీ శ్రీ శివకుమార్ స్వామీజీ రచనల గురించి తెలుసుకునే అవకాశం కూడా లభించింది. ఈ తరహాలో ‘మన్ కీ బాత్’ ద్వారా ఎన్నో స్ఫూర్తిదాయక గాథలు మనకు చేరాయి. సామాన్యులతో విస్తృత స్థాయిలో మమేక మవుతూ ప్రధాని ఆత్మీయ అనుబంధం ఏర్పరచు కున్నారు. కాబట్టే ఆయన నిర్వహించే ప్రతి కార్య క్రమంలోనూ మీ కుటుంబ పెద్ద లేదా సంరక్షకుడు స్వయంగా మీతో మాట్లాడుతున్నట్లు మీరు భావిస్తారు. మనసుతో మనసు సంభాషణే ‘మ¯Œ కీ బాత్’ అన్నది నా నిశ్చితాభిప్రాయం. -శ్రీ ఎం. వ్యాసకర్త ఆధ్యాత్మిక గురువు, ‘పద్మభూషణ్’ పురస్కార గ్రహీత -
ఇది విశ్వసనీయత విజయం!
భోజరాజు ముఖం చూస్తే ఎవరికైనా కవిత్వం వచ్చేస్తుందట! రాజుగారికి వందిమాగధులు చేసిన పొగడ్త అలా సాహిత్యంలో నిలబడిపోయింది. అలాంటి ప్రయత్నమే మన ఎల్లో మీడియా చేసింది. మన బాబుగారు చిటికేస్తే అభివృద్ధి పరుగెత్తుకొస్తుందట! బాబుగారి ఇంట్లో తోక ఊపుకుంటూ ఆయన వెంట తిరిగే బొచ్చుకుక్క పేరే అభివృద్ధి అన్నట్టుగా మన మీడియా ప్రచారంలో పెట్టింది. ఏకపక్ష మీడియా ఏం చెప్పినా చెల్లు బాటవు తుందన్న ధీమా. ప్రజల ఇంగితం మీద చిన్నచూపు. చంద్రబాబు అనే కొయ్యగుర్రాన్ని చెక్కడానికి ఎల్లో మీడియా ఎన్ని కోతలు కోసింది? భారత రాష్ట్రపతిగా అబ్దుల్ కలామ్‌ను బాబే ఎంపిక చేశారు. ప్రధాని పదవి చేపట్టే అవ కాశాన్ని చంద్రబాబు తృణప్రాయంగా తృణీకరించి దేవెగౌడను ఆ స్థానంలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత గుజ్రాల్‌ను కూడా! హైదరాబాద్‌ను చంద్రబాబే నిర్మించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సృష్టికర్త ఆయనే! ఇటువంటి అతిశయోక్తులను ఎంతగా ప్రచా రంలో పెట్టారంటే చివరకు చంద్రబాబు కూడా వాటిని నిజ మనుకునే భ్రాంతిలోకి జారుకున్నారు. ఎల్లో మీడియా దెబ్బకు ఈ లేటు వయసులో పాపం చంద్రబాబు ఆ భ్రాంతిలోనే మరింత కూరుకుపోతున్నారు. జనం నవ్వుకుంటున్నారన్న స్పృహ కూడా ఆయనకు ఉండటం లేదు. ‘తమ్ముళ్లూ! మీ కోసరం నేను సెల్‌ఫోన్ కని పెట్టాను. మీకోసరం కంప్యూటర్ను తయారు చేశాను. దాంతో మీరు దర్జాగా బతికేస్తున్నారు. ఐటీ ఉద్యోగాలు చేసేవాళ్లంతా నాకు రాయల్టీ చెల్లించాల’ని కూడా కలవరిస్తున్నారు. ‘నేను నిర్మించిన హైదరాబాద్ అభివృద్ధిని చూస్తే గర్వంగా ఉన్నది. ఇంతకంటే గొప్పగా నేను కట్టించిన అమరావతి మహానగరాన్ని జగన్మోహన్రెడ్డి కూల్చేస్తున్నాడు.’ – ఇలా ఎక్కడికి వెళ్లినా ఈ తరహా ప్రసంగాలే చేస్తున్నారు. తక్షణమే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ పలవరింతలు మరింత ముదిరే అవకాశ మున్నది. ‘ఎవరక్కడ? నా కోహినూరు వజ్రాన్ని ఎవరో ఎత్తు కెళ్లారు... అయ్యో! నా నెమలి సింహాసనం కనిపించడం లేదు...’ వగైరా సంభాషణల్లోకి దిగకముందే ఆయనను ఎల్లో భ్రాంతి నుంచి బయటపడేయవలసిన అవసరం ఉన్నది. చంద్రబాబు పేరుతో ఎల్లో మీడియా కట్టుకుంటూ వస్తున్న పేకమేడలు ఒకదాని వెంట ఒకటి కుప్పకూలుతున్నాయి. ప్రశస్తమైన పంచకళ్యాణిగా ఎల్లో మీడియా చాటింపు వేసిన అశ్వం కదల్లేని కొయ్య గుర్రమని తేలడానికి ఎంతో సమయం పట్టలేదు. ములాయంసింగ్ యాదవ్ సలహాపైనే రాష్ట్రపతి అభ్యర్థిగా అబ్దుల్ కలామ్‌ను వాజ్‌పేయి ఎంపిక చేశారని బీజేపీ నాయకులు బహిరంగంగానే ప్రకటించారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ప్రధాని పదవికి అన్ని పార్టీలూ ఏకాభిప్రాయంగా జ్యోతిబసు పేరును ముందుకు తెచ్చాయి. అయితే సీపీఎం అందుకు తిరస్కరించింది. ఫలితంగా రెండో ఛాయిస్‌గా దేవెగౌడను ఎంపిక చేశారు. సీపీఎం నిర్ణయాన్ని ఒక ‘చారిత్రక తప్పిదం’గా ఆ తర్వాత కాలంలో జ్యోతిబసు అభివర్ణించారు. భారత రాజకీయ పరిభాషలో ఈ మాట ఒక కొత్త∙పదబంధంగా చేరిపోయింది. ఈ వ్యవహారంలో ఇంత కథ నడిస్తే మన ఎల్లో మీడియా మాత్రం చంద్రబాబే ప్రధాని పదవిని తిరస్కరించారని ప్రచారంలో పెట్టింది. చంద్రబాబు ఈ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. ప్రధాని పదవిని తీసుకోవద్దనీ, రాష్ట్రానికే నీ సేవలు అవసరమున్నాయనీ తన కుమారుడు లోకేశ్ ఇచ్చిన సలహా మేరకు తిరస్కరించినట్టు బాబు చెప్పుకొచ్చారు. అప్పుడు లోకేశ్‌బాబు వయసు పద మూడు సంవత్సరాలు. నిజమే చినబాబు బాలమేధావే, ఇప్పటికీ! హైదరాబాద్ ఐటీ అభివృద్ధిలో చంద్రబాబు పోషించినది నిజానికి నెగెటివ్ పాత్ర. కేంద్రంలో అప్పుడున్న పీవీ నరసింహారావు ప్రభుత్వం ఐటీలో హైదరాబాద్ ముందడుగు వేయ డానికి అవసరమైన పూర్వరంగాన్ని సిద్ధం చేసింది. తనకూ, తన వాళ్లకూ లబ్ధి చేకూర్చుకోవడం కోసం ఇన్సైడర్ ట్రేడింగ్‌కూ, రియల్ వ్యాపారానికీ పూనుకోవడంతో ‘సైబర్ టవర్స్’ నిర్మాణంలో జాప్యం జరిగింది. దాంతో బెంగళూరు ముందడుగు వేయగలిగింది. చేసిన ద్రోహానికి నిందించాల్సింది పోయి ఆయనకు వీరతాడు వేసి కూర్చోబెట్టాం. ఎల్లో మీడియా పోషించిన పాత్రే అందుకు కారణం. వైఎస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధినీ, కేసీఆర్ హయాంలో జరుగుతున్న అభివృద్ధినీ కూడా తన ఖాతాలోనే వేసుకోవడానికి ఆయన ఏమాత్రం సంకోచించడం లేదు. చివరికి తెలంగాణ వాళ్లకు వరి అన్నం తినడం కూడా తామే నేర్పించామంటూ వదరుబోతుతనాన్ని ప్రదర్శించడం కూడా మొదలుపెట్టారు. కనీస చారిత్రక పరి జ్ఞానం లేక పోవడం వల్ల పట్టిన దౌర్భాగ్యం ఇది. ఇటువంటి దౌర్భాగ్యానికి విజనరీ అనే ముసుగేసి, ఎల్లో మీడియా తెలుగు రాష్ట్రాల ప్రజలను వంచనకు గురిచేసింది. ఈ రెండు రోజులూ విశాఖలో జరిగిన ఇన్వె స్టర్ల సమ్మిట్‌ను చూసి బాబు కోటరీ, ఎల్లో మీడియా అధినేతలూ ఏమనుకుంటున్నారో... ఎలా ఉన్నారో? కడుపునిండా భోంచే శారో లేదో? కంటి నిండా కునుకు తీశారో లేదో? ... ఇటువంటి సంశయాలు జనసామాన్యంలో తలెత్తుతున్నాయి. సహజం. వారి ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి! ఏమంటిరి.. ఏమంటిరి? పారిశ్రామికవేత్తలు చంద్రబాబు ముఖం చూసి పరుగెత్తు కొస్తారా? జగన్మోహన్రెడ్డిని చూస్తే పారిపోతారా? అరే భాయ్! జర దేఖో... నిన్నటి విశాఖ సభా వేదికను మరొక్కసారి రివైండ్ చేసి చూసుకోండి. అటువంటి దృశ్యాలను చూసి తట్టుకోవడం కొంచెం కష్టమే. అసలే గుండెపోటు ఉదంతాలు బాగా పెరిగిపోతున్నాయి. అయినా దిటవు చేసుకొని చూడాలి. టాప్ మోస్ట్ బిజినెస్ హౌసెస్ ఆఫ్ ఇండియా, స్వయంగా వాటి అధిపతులు వరుసగా కూర్చున్న దృశ్యం అది. అభివృద్ధి పాలిటి అట్లకాడగా మీరు ప్రచారం చేసే చంద్రబాబు నిర్వహించినప్పుడు ఈ టాప్ సీఈఓలు ఎందుకు రాలేదు? చంద్రబాబు ఓ ఈవెంట్ మేనేజర్ అని అందరికీ తెలుసు కనుక. ఆయన చేస్తున్నది ఒక నాటక్‌బాజీ వ్యవహారమని తెలుసు కనుక! మరి జగన్మోహన్రెడ్డి పిలిస్తే ఎందుకు వచ్చారు? ఆయన రూపంలో నిలబడి ఉన్నది ఒక నిలువెత్తు విశ్వస నీయతగా వారు గుర్తించారు కనుక. వస్తే వచ్చారు. జగన్ మోహన్‌రెడ్డిని అంతగా పొగడాలా? వాస్తవాలు చెబుతున్నా మనుకున్నారే తప్ప ఇక్కడ కొన్ని ప్రాణాలు పిసుక్కు చస్తాయని వారికి తెలియదు కనుక! వైఎస్ జగన్ దక్షత, దార్శనికత గల నాయకుడు కనుకనే సులభతర వాణిజ్యంలో ఏపీకి మొదటి ర్యాంకు దక్కిందని భారత వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ ప్రశంసించారు. ముఖస్తుతి కోసం మాట్లాడవలసిన అగత్యం అంబానీకి లేదనే సంగతి అందరికీ తెలిసిందే. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ వాటి ఆధారంగా అభివృద్ధి ప్రణా ళికను రచించడం జగన్ ప్రత్యేకతగా కరణ్ అదానీ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల స్వర్గధామంగా జగన్ మార్చారని నవీన్ జిందాల్ కొనియాడారు. సంక్షుభిత పరి స్థితులను సమర్థంగా ఎదుర్కొన్న నాయకుడని కియా మోటార్స్‌కు చెందిన కబ్ డాంగ్లీ వ్యాఖ్యానించారు. దాల్మియా భారత్ గ్రూప్ ఎండీ పునీత్ దాల్మియా మాట్లాడుతూ ‘జే ఫర్ జగన్, జే ఫర్ జోష్’ అంటూ అభినందించారు. ఇంతమంది దిగ్గజాలను ఇక్కడికి రప్పించిన జగన్ సమర్థతను చూసి ఈ నేలతల్లి బిడ్డగా గర్వపడుతున్నానని జీఎమ్ఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు చెప్పారు. పారిశ్రామికవేత్తల ప్రశంసల్లో ఇవి కొన్ని మాత్రమే. జాతీయస్థాయిలో జగన్మోహన్రెడ్డి సంపాదించుకున్న విశ్వసనీయత ప్రచారం చేసుకోవడం వల్ల వచ్చింది కాదు. ఈవెంట్ మేనేజ్మెంట్లతో నిలబెట్టుకున్న నమ్మకం కాదిది. గడిచిన నలభై ఐదు మాసాలుగా అహరహం శ్రమించిన ఫలితం. సోనియా ప్రభ దుర్నిరీక్ష్యంగా ఉన్న రోజుల్లోనే ఇచ్చిన మాటకోసం ఒక యువకుడు ఆమెను ధిక్కరించినప్పుడే జాతీయ స్థాయిలో కొన్ని వేల జతల కళ్లు ఇటువైపు తిరిగాయి. దేశంలోనే అత్యంత ప్రమాదకర కూటమిగా పేరున్న ఎల్లో సిండికేట్‌ను పిండికొట్టి ఒంటిచేత్తో అపూర్వ విజయం అందు కున్నప్పుడు మరికొన్ని వేల జతల కళ్లు జత కలిశాయి. ఆ కళ్లు మరింత విప్పార్చి చూడటం మొదలైంది. అధికారంలోకి వచ్చీ రాగానే శిథిలమైపోతున్న ప్రభుత్వ విద్యారంగంలోని బూజును దులపడం మొదలుపెట్టాడు. కొందరు చాదస్తం అన్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా అని ముఖం చిట్లించారు. ప్రతి పేదబిడ్డ నాణ్యమైన చదువు ఆంగ్ల మాధ్యమంలో చదవాలని అభిలషించాడు. తానే స్వయంగా పిల్లల బట్టలు, బూట్లు, బెల్టు, పుస్తకాల నాణ్యతను ఎంపిక చేశాడు. ఉచితంగా పిల్లలకు అందజేయించాడు. పిల్లలను బడికి పంపినందుకు పారితోషికంగా అమ్మ ఒడి నింపుతున్నాడు. వైద్య రంగంలోనూ అంతే! ‘నాడు–నేడు’ కార్యక్రమంతో రూపురేఖలు మార్చాడు. దశాబ్దాలుగా ఉన్న ఖాళీలను భర్తీ చేశాడు. ప్రతి ఊరికీ ప్రతి ఇంటికీ వైద్యం అందే ఏర్పాటు చేశాడు. గ్రామ గ్రామాన సెక్రటేరియట్లు ఏర్పాటు చేశాడు. ఇంటింటికీ సంక్షేమాన్ని చేరవేర్చే వలంటీర్లు నియామకమయ్యారు. ఊరూరా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కొమ్ములు తిరిగిన రాజకీయవేత్తలకు స్టోరీ బిగినింగ్ అర్థం కాలేదు. ఫ్లాప్ బొమ్మే అనుకున్నారు. ఆనందపడ్డారు. ప్రభుత్వ వైద్యరంగం మౌలిక వసతులు లేక కుప్పకూలి ఉన్న దశలో కోవిడ్ సంక్షోభం ఆవరించింది. యుద్ధరంగంలో నిలబడిన సైన్యాధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వ్యవహరించారు. సంక్షోభం ముగిసేలోగానే ఇంకో పెను సంక్షోభం వచ్చినా ఎదుర్కోగల స్థాయిలో మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేయగలిగాడు. సంక్షోభం తీవ్రంగా ఉన్నవేళ కోవిడ్‌తో సహజీవనం నేర్చు కోవలసిందేనని నిర్భయంగా ప్రకటించినప్పుడు చాలామంది నివ్వెర పోయారు. క్రమంగా అనేకమంది ప్రముఖులు, మేధా వులు అంతర్జాతీయ స్థాయిలో ఈ గొంతుతో శ్రుతి కలిపారు. అదే నిజమైంది. జగన్మోహన్రెడ్డి దార్శనికత బయటకు తెలి యడం మొదలైంది. మూడేళ్లు దాటేసరికి క్రమంగా జగన్మోహన్రెడ్డి పరిపాలన బయట ప్రపంచానికి అర్థం కావడం మొదలైంది. భారత రాజ్యాంగ లక్ష్యాలను చిత్తశుద్ధితో అమలుచేయడానికి పూనుకున్నాడని అర్థమైంది. ప్రపంచ మానవాళికి తక్షణా వసరమైన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా పయ నిస్తున్నామని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది. ఒక్క రూపాయి లంచం లేకుండా లక్షల కోట్ల రూపాయలను నేరుగా ప్రజల చేతికి ప్రభుత్వం నగదు బదిలీ చేసింది. ఇలా చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రతిపక్షం, ఎల్లో మీడియా గగ్గోలు పెట్టాయి. కానీ, ఇదే రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించింది. జీఎస్డీపీ వృద్ధి రేటులో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టింది కూడా ఇదే! పరిపాలనా విభాగాల్లో అలసత్వానికి తావులేకుండా నిత్యం సమీక్షించి సమాయత్తం చేయడంతోబాటు ఎస్ఓపీ ప్రమాణాలను ఏర్పాటు చేసుకోవడం ఉపయోగపడింది. డెలి వరీ మెకానిజంలో పేరుకుపోయిన మకిలి తొలగిపోయింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మూడేళ్లు వరసగా మొదటి ర్యాంకు రావడంతో ప్రతిష్ఠ పెరిగింది. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినట్టు ఏపీలో పేదలకు, పెత్తందార్లకు మధ్యన యుద్ధం జరుగుతున్నది. పేద ప్రజలకు విద్య, ఉద్యోగ రంగాల్లో, రాజకీయ సామాజిక రంగాల్లో సమానావకాశాలు లభించాలంటే, వారు దీటుగా పోటీ పడాలంటే ప్రభుత్వం చేయూత అవసరమని జగన్ ప్రభుత్వం భావించింది. బలహీనవర్గాలతోపాటు మహిళల సాధికారతకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. దీన్ని సహజంగానే ఫ్యూడల్ భావజాలం కలిగిన పెత్తందార్లు అడ్డుకుంటారు. అందుకే అక్కడ యుద్ధం జరుగుతున్నది. ఫ్యూడల్ భావ జాలాన్ని శాశ్వతంగా సమాధి చేయకుండా పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా వేళ్లూనుకోలేదు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, పాలనా సంస్కరణల్లో జగన్ ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధిని నిశితంగా గమనిస్తున్నారు కనుకనే విశాఖ సదస్సుకు పారిశ్రా మిక దిగ్గజాలు స్వయంగా హాజరయ్యారు. గడచిన నాలుగేళ్లుగా నిర్విరామంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి శ్రమకు ఫలితం ఇది. లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రం తలుపు తట్టబోతున్నాయి. -వర్ధెళ్లి మురళి, vardhelli959@gmail.com -
ఈసీపై ఎన్నదగిన తీర్పు
ఎన్నికలు సజావుగా జరిగేలా చూడటం, వాటికి విశ్వసనీయత కల్పించటం ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు అత్యంత కీలకం. ఈ కర్తవ్యనిర్వహణలో తలమునకలు కావాల్సిన ఎన్నికల సంఘం(ఈసీ) స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆ పని పూర్తిచేస్తున్నదన్న అభిప్రాయం ప్రజల్లో కలిగిస్తే విశ్వస నీయత దానంతటదే ఏర్పడుతుంది. అందుకే ఎన్నికల సంఘం కూర్పు విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఏకగ్రీవంగా వెలువరించిన తీర్పు హర్షించదగ్గది. ఈ తీర్పు ప్రకారం ఇకపై ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండే త్రిసభ్య కమిటీ ఎన్నికల కమిషనర్ల నియామకాలను ఖరారు చేయాల్సివుంటుంది. ఇంతవరకూ అనుసరిస్తున్న విధానం వేరు. కేంద్ర పాలకుల ఇష్టారాజ్యంగా ఆ నియమాకాలుంటున్నాయి. ఎన్నికల సంఘం విధులు, అధికారాల విషయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు స్పష్టమైన అభిప్రా యాలున్నాయి. విస్తృతాధికారాలుండే ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాలని, అందుకు అనుగుణమైన అధికారాలు దానికుండాలని రాజ్యాంగ నిర్ణాయక సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల నిర్వహణ, నియంత్రణ, అవసరమైన మార్గదర్శకాల ఖరారు కోసం ఎన్నికల సంఘం ఉండాలని రాజ్యాంగంలోని 324 అధికరణ మొదలుకొని 329వ అధికరణ వరకూ నిర్దేశిస్తున్నాయి. అయితే ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్లను ఏవిధంగా ఎంపిక చేయాలన్న అంశంలో రాజ్యాంగం ఏమీ చెప్పలేదు. ఈ అధికరణలపై రాజ్యాంగ నిర్ణాయక సభలో చర్చ జరిగి నప్పుడు ఎంపిక ప్రక్రియను పార్లమెంటుకే విడిచిపెట్టాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. నిర్దిష్టంగా ఉండే నిబంధనలకే తూట్లుపొడవటం అలవాటైన దేశంలో స్పష్టత కొరవడితే చెప్పేదేముంది? ఇది సహజంగానే అధికారంలో ఉండేవారికి వరమైంది. తమకు అనుకూలురైనవారిని ఆ సంఘంలో నియమించటం ఒక సంప్రదాయంగా స్థిరపడింది. అందువల్లే ఎన్నికలు ముంచుకొచ్చినపుడల్లా అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధాలు రివాజుగా మారాయి. ఎన్నికలు ప్రకటించటం దగ్గర్నుంచి ఎన్నికల తేదీల ఖరారు, ఎన్నికల నిర్వహణ వరకూ అన్నీ వివాదాస్పదమే అవుతున్నాయి. పార దర్శకత లోపించటమే ఇందుకు కారణం. గడువు పూర్తయిన రెండు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి మాత్రమే ఎన్నికల ప్రకటన వెలువరించి, మరో రాష్ట్రం గురించి మౌనం పాటించారన్న విమర్శలు ఒకపక్క... ప్రచారసభల్లో అవతలి పార్టీ నేతలు ఏం మాట్లాడినా మౌనంవహిస్తూ తమపై మాత్రం దూకుడుగా చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు మరోపక్క తరచు ఈసీ ఎదుర్కొనాల్సివస్తోంది. కొన్ని సందర్భాల్లో అదిచ్చే వివరణలు అసంబద్ధంగా ఉండటం కూడా కనబడుతూనే ఉంది. కేంద్రంలోని పాలకపక్షం తన విధేయులను ఎన్నికల సంఘంలో నియమించటం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని విపక్షాలు ఆరోపించటం కూడా మామూలే. యూపీఏ పాలనలో ప్రధానంగా బీజేపీనుంచి ఇలాంటి ఆరోపణలు వినిపిస్తే ఇప్పుడు బీజేపీయేతర పక్షాలు ఆ పాత్ర పోషిస్తున్నాయి. ఎవరు అధికారంలోకొచ్చినా కమిషనర్ల ఎంపిక ప్రక్రియ మార్చాలన్న ఆలోచనకే దూరంగా ఉంటున్నారు. కొత్త చట్టం తీసుకొస్తే అది తమకే గుదిబండవుతుందని, తమ పాచికలు పారవని భావిస్తున్నారు. వాస్తవానికి జస్టిస్ ఏపీ షా నేతృత్వంలోని 20వ లా కమిషన్ ఎన్నికల సంఘం కూర్పు, ఎన్నికల సంస్కరణల గురించి లోతుగా పరిశీలించి నివేదిక ఇచ్చింది. కమిషనర్ల ఎంపికకు ఒక ప్రత్యేక కమిటీ ఉండాలని సూచించింది. కానీ ఇంతవరకూ దాని ఊసే లేదు. ఎన్నికల సంఘం తటస్థ పాత్ర పోషిస్తున్నదని పార్టీలకు పూర్తి నమ్మకం కుదిరినప్పుడే ఆ ఎన్ని కలపై ప్రజానీకంలో కూడా విశ్వసనీయత ఏర్పడుతుంది. ఆరోపణలు, ప్రత్యారోపణలకు అవకాశం ఉండదు. ఎన్నికల సంఘం తాను సర్వస్వతంత్రంగా, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నానన్న భరోసా అందరిలోనూ కలగజేస్తే మెజారిటీ ప్రజానీకం నిర్భయంగా ఓటేయగలుగుతారు. మొదట్లో ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఒక్కరే ఎన్నికల సంఘానికి ప్రాతినిధ్యంవహిస్తే 1987 నాటి రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో అప్పటి సీఈసీ ఆర్వీఎస్ పేరిశాస్త్రి వ్యవహరించిన తీరుతో ఆందో ళనపడ్డ నాటి ప్రధాని రాజీవ్ గాంధీ 1989 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈసీని ఇద్దరు సభ్యుల కమి షన్‌గా మార్చారు. కానీ ఎన్నికల అనంతరం వీపీ సింగ్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం దాన్ని తిరగదోడింది. ఆ తర్వాత పదవి కోల్పోయిన కమిషనర్ ధనోవా సుప్రీంకోర్టుకెళ్లినా లాభం లేక పోయింది. తదనంతరకాలంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం అప్పటి సీఈసీ శేషన్ దూకుడు చూసి కీడు శంకించి త్రిసభ్య కమిషన్‌గా దాన్ని మార్చింది. కొత్తగా ఎంఎస్ గిల్, జీవీజీ కృష్ణ మూర్తిలను తీసుకుంది. ఎన్నికల సంఘం చట్టాన్ని సవరించి ముగ్గురికీ ఒకే రకమైన అధికారాలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదా కల్పించారు. అయితే అంతా మారినట్టేనా? లేదని ఇన్ని దశాబ్దాల అనుభవాలు పదే పదే నిరూపించాయి. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఈసీకి నిందలు తప్పటం లేదు. నిర్ణయ ప్రక్రియలో పారదర్శకత కూడా అంతంతమాత్రం. సుప్రీంకోర్టు చెప్పడానికి ముందే ప్రభుత్వాలు దీన్ని గ్రహిస్తే బాగుండేది. కమిషనర్ల ఎంపిక ప్రక్రియపై కొత్త చట్టం తీసుకు రావాలని, అంతవరకూ తమ మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని తాజాగా ధర్మాసనం ప్రకటిం చింది. ఈ తీర్పు స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చట్టం తీసుకొస్తుందని, ఇకపై ఎన్నికల సంఘం తటస్థత విషయంలో అనుమానాలకూ, అపోహలకూ ఆస్కారం ఉండదని ఆశించాలి. -
వినాశ కాలే విపరీత బుద్ధిః
రక్తబీజుడు అనే అసురుని వృత్తాంతం మన పురాణాల్లో ఉన్నది. ఈ కథను చాలామంది వినే ఉంటారు. ఆ రాక్షసుడు అతిభయంకరంగా తపస్సు చేసి బ్రహ్మదేవుడిని వశపరచుకొని దారుణమైన ఒక వరాన్ని సంపాదించుకున్నాడు. వాడి ఒంటి నుంచి రాలే ఒక్కో రక్తపు బొట్టులోంచి ఒక్కో రక్తబీజుడు పుట్టుకొస్తాడు. అలా పుట్టుకొచ్చిన జూనియర్ రక్తబీజులు కార్చే ప్రతి రక్తపు బొట్టులోంచి ఒక్కో సబ్‌జూనియర్ రక్తబీజుడు ఉద్భవిస్తాడు. ఆ విధంగా ఒక్క నెత్తురు చుక్క నుంచే వేలమందితో కూడిన సైన్యాన్ని సృష్టించుకోగల వరాన్ని పొందడంతో వాడు చెలరేగి పోయాడు. అతడి దాష్టీకానికి, దోపిడీకి అతల సుతల సురాతల భూతలాది చతుర్దశ లోకాలూ గజగజ వణికిపోయాయి. దేవతలు హడలిపోయి పాహి... పాహి అంటూ పరుగులు తీశారు. చివరికి సర్వశక్తి స్వరూపిణి పార్వతీదేవి కాళీమాత అవతారాన్ని ఎత్తవలసి వచ్చింది. దైత్యుని దునుమాడి ఆ తల్లి లోకాలను కాపాడుకున్నదని దేవీ మహత్యం కథ ద్వారా మనకు తెలుస్తున్నది. మహాకాళి తొమ్మిది ఛాయల్లో ఒకరు మన బెజవాడ కనకదుర్గమ్మ. అమ్మవారు కొండ మీద వేంచేసి ఉండగా కొండ కింద రక్తబీజుని అంశతో కూడిన రాజకీయాలు నేటికీ జరుగు తుండటం ఒక విషాదం. సాక్షాత్తూ అమ్మవారి సమక్షంలో క్షుద్రపూజలు కూడా చేసి రక్తబీజుని వారసత్వాన్ని ఈ ‘అంశాం’ కురాలు ఘనంగా చాటుకున్నాయి. మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పట్టాలు తప్పకుండా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్‌తో కూడిన పటిష్టమైన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు స్వతంత్రమైన మూడు స్తంభాలుగా వ్యవహరించాలని భావించారు. మీడియాను నాలుగో స్తంభంగా గౌరవించారు. ఎలక్షన్ కమిషన్, విజిలెన్స్ కమిషన్ వగైరాలను స్వతంత్ర సంస్థలుగా రూపొందించారు. రాజకీయ నాయకత్వం వ్యవస్థల మీద దండయాత్ర చేసి నియంతృత్వంలోకి దేశాన్ని మళ్లించకుండా పలు చర్యలను తీసుకున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వ్యవస్థల మీదకు రాజకీయ నాయకత్వం జరుపుతున్న దండయాత్రలపై పలుమార్లు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. బహిరంగ దండయాత్రలు కాకుండా చాపకింద నీరు మాదిరిగా వ్యవస్థల్లోకి పాక్కుంటూ వాటిని తనకు అనుకూలంగా మార్చుకునే విద్యలో పీహెచ్డీ చేసిన రాజకీయ నాయకుడు ఈ దేశంలో చంద్రబాబు ఒక్కడే. ఈ పాకుడు కళతోనే ముప్పయ్యేళ్లుగా ఆయన రాజకీయాల్లో కొనసాగగలుగుతున్నారు. రక్తబీజుడు వెదజల్లే నెత్తురులోంచి సైన్యాన్ని తయారుచేసుకున్నట్టు ఈయన వివిధ వ్యవస్థల్లో తన సైన్యాన్ని తయారుచేసుకున్నాడు. అందుకోసం ఏం వెద జల్లాడనేది రహస్యం. మీడియా అధిపతులను వ్యాపార మిత్రులుగా, ఆశ్రిత పెట్టుబడిదారులుగా మార్చుకొని, వారిచేత జేజేలు కొట్టించుకొని ఒక నాయకునిగా వ్యవహారంలోకి వచ్చాడు. ఈ మీడియా భజన కార్యక్రమం శ్రుతి మించడంతో అది ఎల్లో మీడియాగా ఏనాడో అప్రతిష్ఠను మూటకట్టుకున్నది. న్యాయ వ్యవహారాల్లో ఎలా నెగ్గుకు రావాలో చంద్ర బాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని ఏ తెలుగువాడిని అడిగినా టక్కున చెప్పేస్తాడు. బెంచ్ హంటింగ్, నాట్ బిఫోర్ వంటి కోర్టు పదజాలం చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే ప్రజల్లోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు స్థాపించుకున్నాడనీ, దాని జెండాను, ఎన్నికల గుర్తును తానే డిజైన్ చేసుకున్నాడనీ నాటి తెలుగు ప్రజలకు తెలుసు. తెలుగుదేశం పార్టీలో ఆశ్రయం కోరుతూ ఒక శరణార్థి మాదిరిగా చంద్రబాబు ప్రవేశించాడని కూడా ప్రజలకు తెలుసు. అయినప్పటికీ ఆ పార్టీపై దురాక్రమణ చేసి హైకోర్టు ద్వారా దానికి న్యాయ ముద్రను వేయించుకున్న బాబు లాఘవం గురించి కూడా ప్రజలకు తెలుసు. ఎన్ని కేసులు వచ్చినా దర్యాప్తు జరక్కుండా స్టేలు తెచ్చుకోగల చాకచక్యం గురించి కూడా తెలుసు. రాజకీయ ప్రత్యర్థుల మీద శూన్యంలోంచి అభియోగాలు సృష్టించి పకడ్బందీగా కేసులు నడపగల దిట్ట అని కూడా తెలుసు. కీలకమైన అనేక పబ్లిక్ విభాగాల్లో, దర్యాప్తు సంస్థల్లో తనకు అనుకూలమైన మానవ వనరులను గుప్పిట్లో పెట్టుకోవడంలో ఈయన ప్రావీణ్యం సంపాదించినట్టు ఇప్పటికే రుజువైంది. సీబీఐ, ఐటీ, విజిలెన్స్ వగైరా విభాగాల్లోని కొందరు వ్యక్తులు గతంలో చంద్రబాబు ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించారని చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా వ్యవహరించిన ఒక అధికారి చంద్రబాబు అవసరాలకు అనుగుణంగా ఎముకలు మెడలో వేసుకొని మరీ వ్యవహరించిన తీరు తెలిసిన విషయమే. బాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన అధికారి పచ్చ కండువాను బహిరంగంగా కప్పుకోవడం మాత్రమే మిగిలింది. ఆయన అప్రకటిత తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడన్న ఆరోపణలున్నాయి. ఇటువంటి చంద్రబాబుకు రామోజీ వంటి మీడియా అధిపతులు తోడుగా నిలబడి గడిచిన పాతిక ముప్పయ్యేళ్లుగా ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుపుతున్న అత్యాచారాల కథలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. రామోజీ గొంతెమ్మ కోర్కెలకు తలొగ్గనందువల్లనే, అక్రమాలకు సహకరించనందువల్లనే చంద్రబాబుతో కలిసి వెన్నుపోటు పొడిచారని ఎన్టీ రామారావు స్వయంగా ఆరోపించారు. హైదరాబాద్ శివార్లలో ఫిలిం సిటీ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడంలో రామోజీ అనేక అక్రమాలకు పాల్పడ్డారనేందుకు సాక్ష్యాలున్నాయి. ఈ అక్రమాలకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తోడ్పాటు పూర్తిగా ఉన్నది. అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరం. కానీ రామోజీ వాటిని యథేచ్ఛగా కొనుగోలు చేసి చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారు. ‘నాలా’ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారు, ఫిలిం సిటీలో ఇటువంటి అక్రమ నిర్మాణాలు 147 ఉన్నాయని ప్రభుత్వ అధికారులే లెక్క తేల్చారు. 600 మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కింద రాష్ట్ర ప్రభుత్వం పంచిపెట్టిన 16 ఎకరాల భూమిని కూడా రామోజీ తన కబ్జాలోనే ఉంచుకున్నారు. ఆ స్థలాన్ని అప్పగించాలని పలుమార్లు సీపీఎం ఆధ్వర్యంలో పేద ప్రజలు ప్రదర్శనగా వెళ్లారు. వారిని తరిమికొడుతున్నాడే తప్ప వారి భూమిని వారికి ఇప్పటికీ అప్పగించడం లేదు. తన ఫైవ్‌స్టార్ ఫిలిం సిటీ పక్కన పేదల ఇళ్లేమిటనే అసహ్య భావనతోనే రామోజీ వారిని తరిమేస్తున్నాడని అనుకోవాలి. ఈ అపూర్వ సహోదరుల భావసారూప్యత చూడండి. అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే సామాజిక సమతౌల్యత దెబ్బతింటుందని కోర్టుకే వెళ్లిన చంద్రబాబు.. ఫిలిం సిటీ చేరువలో పేదల ఇళ్లుంటే గ్లామర్ దెబ్బతింటుందని ప్రభుత్వం ఇచ్చిన భూమిలోకి లబ్ధిదారులు రాకుండా తరిమేస్తున్న వ్యక్తి రామోజీ.. ఇద్దరి ఐడియాలజీ పెత్తందారివర్గ ప్రయోజనాలే అని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలవా? ఇద్దరూ పేద ప్రజల సాధికారత బద్ధవిరోధులే అని చెప్పడానికి ఎన్ని దుష్టాంతాలు కావాలి? ప్రభుత్వ స్కూళ్లను బాగుచేస్తుంటే, ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తుంటే వీరూ, వీరి అనుబంధ ఎల్లో మీడియా సంయుక్తంగా కళ్లల్లో నిప్పులు పోసుకోలేదా? పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు చెబుతుంటే గగ్గోలు పెట్టలేదా? ఇప్పటికీ పెట్టడం లేదా? రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టాన్ని రామోజీ బాహాటంగా ఉల్లంఘించిన విషయం ప్రజలకు తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా ఆయన 2,600 కోట్ల రూపాయల డిపాజిట్లను వసూలు చేశారు. ఈ నేరానికి రెండేళ్ల జైలు, రెట్టింపు సొమ్ము అంటే రూ. 5,200 కోట్ల జరిమానా పడాలి. కానీ రిలయన్స్ దగ్గర అప్పుచేసి ఆ సొమ్ము తిరిగి చెల్లించాను కనుక కేసు తూచ్ అంటున్నారు రామోజీ. దొంగతనం బయటపడిన తర్వాత ఆ దొంగసొత్తును వెనక్కు ఇచ్చేస్తే శిక్ష ఉండదా? భారత శిక్షాస్మృతిలో అటువంటి వెసులుబాటు ఏమైనా ఉన్నదా? చంద్రబాబు అండ్ కో లోని కీలక సభ్యులంతా ఇటువంటి గురువింద గింజలే. ఈ గింజలన్నీ కలిసి ఇప్పుడొక ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. ఈ ముఠాలోని కమెండోల్లాంటి కీలక సభ్యులను ముందుజాగ్రత్త కోసం చంద్రబాబు ఎప్పుడో బీజేపీలో చేర్పించారు. తమ ప్రయోజనాల కోసం ఏ గడ్డి కరిచేందుకైనా, ఏ జెండా మోసేందుకైనా ఏమాత్రం సిగ్గుపడని షార్ప్ షూటర్స్ వీళ్లంతా. చంద్రబాబుకు అనుకూలంగా జాతీయస్థాయిలో వ్యవస్థలను మేనేజ్ చేసే కార్యక్రమంలో వీళ్లంతా ఇప్పుడు బిజీగా మారిపోయారు. నిత్య అసత్య వ్రత కథనాలతో ఎల్లో మీడియా విరుచుకుపడుతున్నది. వ్యవస్థల్లో ప్రవేశపెట్టిన డమ్మీ రక్తబీజులంతా ఏకకాలంలో ఒకే రాగం తీస్తున్నారు. విషయం సుస్పష్టం. సాఫ్ సీదా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా చెప్పినట్టు ఇప్పుడక్కడ వర్గపోరు జరుగుతున్నది. పేదల అనుకూల విధానాలను జగన్ ప్రభుత్వం ప్రబలంగా అమలు చేస్తున్నది. పెత్తందారీవర్గ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ఈ వర్గానికి నాయకత్వం వహిస్తున్న బాబు–రామోజీ ముఠా స్వార్థ ప్రయోజనాలకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ట్రెజర్ హంట్ స్వప్నం కరిగిపోతున్నది. రాజధాని పేరుతో తలకెత్తుకున్న లక్షల కోట్ల వ్యాపారం చెదిరిపోతున్నది. భూములపై పెట్టుబడి పెట్టిన వారిలో అసహనం పెరుగుతున్నది. ఎన్నికల దాకా ఆగేంత ఓపిక లేదు. ఎన్నికల్లో గెలుస్తామన్న ఆశ లేదు. కోట్ల రూపా యలు తగలేసి మూడు నెలలకోసారి నిపుణుల చేత చేయించుకుంటున్న సర్వేలు వెక్కిరిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అంతో ఇంతో ఓట్ల శాతం పెరగాలి. గత ఎన్నికల్లో టీడీపీకి 39 శాతం ఓట్లు వచ్చాయి. ఫిబ్రవరి మొదటివారంలో వచ్చిన సర్వే ఫలితాలు కరకట్ట అతిథిగృహం గుండెల్లో డైనమైట్లను పేల్చాయి. తెలుగుదేశం పార్టీకి మద్దతు దారుణంగా 26 శాతానికి పడిపోయిందని సర్వేలో వెల్లడైంది. గడిచిన మూడు నెలల్లో ఐదు శాతం పతనం. ఈ స్థాయి పతన దశలో వున్న పార్టీ బతికి బట్టగట్టి ఏడాది లోపల ఎన్నికలకు సమాయత్తం కావడం అసాధ్యం. ఈ సర్వే ఫలితాలను ఎంత రహస్యంగా ఉంచుదామనుకున్నా కుదరలేదు. పార్టీ శ్రేణుల్లో చాలామందికి తెలుసు. మిత్రపక్షాలకూ తెలుసు. మన బలాన్ని బట్టే కదా పొత్తు కుదుర్చుకునేవారు బేరమాడేది. ఈపాటికే బయల్దేరవలసిన పవన్ కల్యాణ్ వారాహి రథం ఎందుకో బయల్దేరలేదు. ఎల్లో ముఠాకు కవి హృదయం అర్థమైంది. కడుపుమంట పుట్టుకొచ్చింది. పవన్ కల్యాణ్‌కు కేసీఆర్ వెయ్యి కోట్లతో బేరం పెట్టారని బ్లాక్ మెయిలింగ్‌కు దిగింది. ఐననూ కదలిక లేదు. బహుశా ఇప్పటికే కుదిరిన ఒప్పందాన్ని తిరగరాయాల్సి రావచ్చు. లోకేశం బాబు శనివారం నాడు ఎన్టీఆర్ బావకు నర్మగర్భంగా ఆహ్వానం పలి కాడు. ఇదొక విశేషం. లోకేశం బావ కారణంగానే ఎన్టీఆర్ బావ తెలుగుదేశం పార్టీకి దూరమయ్యాడనేది బహిరంగ రహస్యం. తెలుగుదేశం పార్టీని ఇప్పుడున్న స్థితి నుంచి పైకి లేపడానికి ఎన్టీఆర్, పవన్ కల్యాణ్‌లే కాదు... అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వంటి క్రేన్లను ఉపయోగించినా ఫలితముండదు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై కట్టుకథల ప్రచారం చాలాకాలం నుంచి జరుగుతున్నదే. ప్రభుత్వం జనరంజక కార్యక్రమాలను అమలుచేస్తున్న ప్రతి సందర్భంలోనూ మీడియా దృష్టి మళ్లించేందుకు ఏదో ఒక రభసను సృష్టించే ప్రయత్నాలను కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రారంభించింది. నవంబర్ సర్వే ఫలితాల తర్వాత వేగాన్ని మరింత పెంచింది. ఫిబ్రవరి ఫలితాలతో పార్టీ పెద్దలతోపాటు మీడియా పెద్దలు కూడా విచక్షణ కోల్పోయారు. అనపర్తిలో, గన్నవరంలో గోక్కోవడం ఈ విచక్షణా రాహిత్యంలో భాగమే. ఎన్ని అసత్యాలు రాసేందుకైనా, ప్రసారం చేసేందుకైనా వెనుకాడేది లేదన్నట్టుగా ఎల్లో మీడియా రెచ్చిపోతున్నది. తానే రెచ్చగొట్టి సవాల్ చేసి, గన్నవరం వెళ్లిన పట్టాభిని పోలీసులు కొట్టినట్టుగా ఈనాడు బ్యానర్ వార్తలను వండేయడం క్షుద్రవిద్యకు పరాకాష్ట. ఇందుకోసం రెండేళ్ల కిందటి ఫోటోలను ఈనాడు నిస్సిగ్గుగా వాడేసింది. నడిరోడ్డు మీద గుడ్డలూడదీసుకొని పత్రికారంగ మాన మర్యాదలను మంటగలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రతిష్ఠను మసకబరచడానికి ఎంత దారుణానికైనా దిగజారేందుకు తెలుగుదేశం, ఎల్లోమీడియాలు సిద్ధంగా ఉన్నాయని ఇటీవలి పరిణామాలన్నీ నిరూపిస్తున్నాయి. 2019లో జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును ఎల్లో మీడియా పలురకాల మలుపులు తిప్పుతున్న తీరు పెద్ద ఆశ్చ ర్యాన్ని కలిగించడం లేదు. ఎందుకంటే గతంలో వైఎస్ జగన్‌పై దాఖలైన తప్పుడు కేసుల దర్యాప్తు సందర్భంగా కూడా కొందరు దర్యాప్తు అధికారులతో కలిసి ఈ ముఠా ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. శుక్రవారం నాడు సీబీఐ అధికారులను కలిసిన సంద ర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైఎస్ అవినాశ్‌రెడ్డి చెప్పిన మాటలు గమనించదగ్గవి. కేసు దర్యాప్తు ఫ్యాక్ట్స్ టార్గెట్‌గా కాకుండా పర్సన్ టార్గెట్‌గా జరగడం సరికాదని అవినాశ్ అన్నారు. ఎవరినో ఇరికించే ఉద్దేశంతోనే దర్యాప్తు జరుగు తున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రాథమిక సాక్ష్యాలను, వాస్త వాలను విస్మరిస్తూ దర్యాప్తు జరుగుతున్నదని ఇంగిత జ్ఞానానికి కూడా అవగతమవుతున్నది. ఈ కేసులో నిందితుడుగా వున్న సునీల్ యాదవ్ అనే వ్యక్తి బెయిల్ పిటీషన్ వేసుకుంటే దాని మీద సీబీఐ కౌంటర్ వేసింది. ఆ కౌంటర్లోకి అవినాశ్‌రెడ్డి పేరును లాక్కొచ్చింది. తెల్లారి ఎల్లో మీడియాలో ‘అవినాశ్ ఇంట్లో సునీల్’, ‘అవినాశ్‌రెడ్డే’ వంటి పతాక శీర్షికలతో మసాలా వార్తలు వచ్చాయి. అవి చదివినవారు హత్య వెనుక అవినాశ్‌రెడ్డి హస్తముందని అనుకోవాలి. హత్య జరిగిన రోజు రాత్రి సునీల్ యాదవ్ అనే వ్యక్తి అవినాశ్ ఇంట్లో ఉన్నాడని గూగుల్ చెప్పిందట. గూగుల్ చెప్పింది గనుక అదే నిజమని అఫిడవిట్లో సీబీఐ పేర్కొన్నది. కానీ, ఆరోజు రాత్రి మూడు గంటలపాటు తానూ సునీల్ యాదవ్, నందిక అనే ఆస్పత్రి వద్ద కలిసే ఉన్నామని భరత్ యాదవ్ అనే విలేకరి చెప్పిన విషయాన్ని, ఇచ్చిన వీడియో సాక్ష్యాన్ని సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదు. వివేకా రాసినట్టు చెబుతున్న లేఖ హత్యాస్థలంలో ఆయన పీఏ కృష్ణారెడ్డి దాచి పెట్టాడు. పొద్దున అక్కడికి వచ్చిన అవినాశ్‌కు గానీ, పోలీసులకు గానీ వెంటనే ఆ లేఖను ఇచ్చి ఉన్నట్లయితే అది హత్య అనే విషయం వెంటనే తెలిసి ఉండేది. లేఖను ఎవరికీ ఇవ్వొద్దని వివేకా అల్లుడు ఎందుకు ఆదేశించినట్టు? వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడం వారి కుటుంబంలో పెద్ద వివాదానికి కారణమైంది. రెండో కుటుంబానికి ఆస్తిలో వాటా ఇవ్వడానికి వివేకా నిర్ణయించారన్నది కూడా రహస్యమేమీ కాదు. ఈ నిర్ణయాన్ని మొదటి భార్య, కూతురు, అల్లుడు రాజశేఖరరెడ్డి, అల్లుని సోదరుడు శివ ప్రకాశ్‌రెడ్డి (వీరు వివేకా మొదటిభార్య సోదరులు) వ్యతి రేకిస్తున్నారు. కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి చాలాకాలంగా వివేకాకు సన్నిహితులు. ఆ కారణంగా ఆయన మొదటి కుటుంబ సభ్యులతో కూడా వారికి సాన్నిహిత్యం ఉన్నది. కేసు దర్యాప్తులో ఈ ప్రాసంగిక కోణం కనిపించడం లేదేమన్న అనుమానం సాధారణ ప్రజల్లో కూడా ఉన్నది. ఏమైనా సీబీఐ దర్యాప్తు జరుగుతున్నది. న్యాయస్థానం విచారణ పూర్తి చేయవలసి ఉన్నది. ఈలోగానే ఎల్లో మీడియా నిత్యం తీర్పులు రాసేయడం, వారికి దర్యాప్తు అధికారుల నుంచి లీకులు అందడం విలువల పతనానికి పరాకాష్ట. ప్రజా కోర్టులో వైఎస్ జగన్‌ను గెలవ లేమన్న భీతితోనే ఈ కూటమి ఉన్మాదపూరితంగా వ్యవహరిస్తున్నదని అనుకోవాలి. -వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కులజాడ్యానికి కళ్లెం!
భారత్‌లో శతాబ్దాలుగా వేళ్లూనుకున్న ‘కులం’ ఖండాంతరాలు దాటిందని, అది తమ దేశంలో ప్రవేశించి ఏపుగా ఎదుగుతున్నదని అమెరికా నగరాల్లో ఒకటైన సియాటల్ నగర కౌన్సిల్ గుర్తించింది. కుల వివక్షను శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ మంగళవారం ఆర్డినెన్సు జారీచేసింది. దీని ప్రకారం ఉపాధి, హౌసింగ్, రీటెయిల్, ప్రజా రవాణా తదితర రంగాల్లో కుల వివక్ష ప్రదర్శించినట్టు తేలితే శిక్షలుంటాయి. అంతక్రితం మాటేమోగానీ సాఫ్ట్వేర్ రంగంలో అవకాశాలు రావటం మొదల య్యాక మన దేశంనుంచి దళితులు పెద్ద సంఖ్యలో అమెరికాకు వెళ్లటం మొదలైంది. ఆ తర్వాతే కుల వివక్ష గురించిన ఆరోపణలు వెల్లువెత్తాయి. అదంతా నిజం కాదని, హిందూమతాన్ని కించపరచటం కోసం ఈ ప్రచారం చేస్తున్నారని ఆక్రోశించేవారూ లేకపోలేదు. ఈ సందర్భంలో అసాధారణ ప్రతిభావంతుడైన శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు సంబంధించిన ఒక ఉదంతాన్ని గుర్తు తెచ్చుకోవాలి. జర్మనీలో హిట్లర్ అధికారం పీఠం ఎక్కడానికి నెలముందు.. అంటే 1932 డిసెంబర్లో ఆయన అమెరికా వచ్చేశాడు. అయితే తాను ఒక యూదుగా ఇన్నేళ్లూ జర్మనీలో చవిచూసిన వివక్షే అక్కడి ఆఫ్రికన్ అమెరికన్లు కూడా ఎదుర్కొనటం చూసి నిర్ఘాంతపోయాడు. వివక్ష ఎదుర్కొనటంలో ఆయనకున్న అనుభవమే అమెరికాలో దాన్ని గుర్తించేలా చేసింది. బహుశా మన దేశంనుంచి వెళ్లిన దళితులు, ఇతర అట్టడుగు కులాలవారూ అలాంటి కారణం చేతనే కుల వివక్ష గురించి ఆరోపణలు చేసే పరిస్థితి ఏర్పడివుండొచ్చు. కాలిఫోర్నియాలోని ఈక్విటీ లాబ్స్ సంస్థ 2018లో ఒక నివేదిక వెలువరించింది. దాని ప్రకారం 67 శాతంమంది దళితులు పని ప్రదేశాల్లో తమను అనుచితంగా చూస్తున్నారని ఆరోపించారు. కులం కారణంగా దాడులు, దుర్భాషలు ఎదుర్కొన్నామని 25 శాతంమంది చెప్పారు. తమ కులాన్ని ఎత్తిచూపుతారని నిరంతరం భయపడుతుంటామని 50 శాతంమంది దళితులు తెలియజేశారు. 1,500మందిని సర్వే చేసి ఈ నివేదిక రూపొందించారు. సిస్కో సిస్టమ్స్ సంస్థలో కుల వివక్ష కారణంగా తనకు న్యాయబద్ధంగా రావలసిన పదోన్నతులనూ, వేతన పెంపునూ అడ్డుకున్నారని రెండేళ్లక్రితం ఒక యువతి కోర్టుకెక్కటం అందరికీ తెలుసు. ఆధిపత్య కులా నికి చెందిన ఇద్దరు మేనేజర్లు తనను అనేకరకాలుగా వేధించారని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత కొన్ని విశ్వవిద్యాలయాలు, యాపిల్ సంస్థ, డెమాక్రటిక్ పార్టీ వంటివి తమ వివక్ష వ్యతిరేక విధానంలో కుల వివక్షను కూడా చేర్చాయి. ఈ పరిణామాలన్నీ అమెరికాలో కులవివక్ష పెరగటాన్నీ, దాన్ని అరికట్టే ప్రయత్నాలనూ పట్టిచూపుతున్నాయి. ఒక్క అమెరికా అనేమిటి...మన దేశ పౌరులు, మరి కొన్ని దక్షిణాసియా దేశాల పౌరులు వెళ్లిన ప్రతి దేశంలోనూ కులవివక్ష ఆరోపణలు తరచు వినబడు తూనే ఉన్నాయి. ఏ దేశానికైనా పోవాలంటే ఎన్నో అవరోధాలుంటాయి. ముఖ్యంగా అమెరికా వెళ్లేందుకు వీసా రావాలంటే సవాలక్ష ప్రశ్నలకు జవాబివ్వాలి. ఇక ఆ గడ్డపై అడుగుపెట్టాక ఎదుర్కొనాల్సిన తనిఖీల గురించి చెప్పనవసరం లేదు. అయితే ఈ క్రమంలో ఎక్కడా కనబడనిదీ, ఎవరికీ దొరకనిదీ కుల తత్వం. మన దేశంలో ఈ కులతత్వం కనబడని చోటంటూ ఉండదు. ఇదొక నిచ్చెనమెట్ల వ్యవస్థ. ప్రతి కులమూ వివక్షను ఎదుర్కొంటూనే తాను అణచడానికి కింద మరో కులం ఉందని తృప్తిపడు తుంటుంది. కింది కులాల శ్రమను దోచుకోవటానికి పనికొస్తుంది గనుక రాచరిక, భూస్వామ్య వ్యవస్థలు ఆ కుల వ్యవస్థను చెక్కుచెదరకుండా కాపాడాయి. ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ పాలకులు ‘విభజించు పాలించు’ అనే తమ సిద్ధాంతానికి అక్కరకొస్తుందని గ్రహించి దీని జోలికి పోలేదు. నిజానికి వలసపోయిన భారతీయుల్లోని కుల వివక్షను గుర్తించి దాన్ని కూకటివేళ్లతో పెకిలించటానికి రెండు దశాబ్దాలనాడే దళిత సంఘాల నాయకులు, మేధావులు గట్టి ప్రయత్నం చేశారు. జాత్యహంకారానికి వ్యతిరేకంగా 2001లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ సదస్సులో కుల వివక్షను కూడా జాతివివక్షతో సమానంగా పరిగణించాలని వారు డిమాండ్ చేశారు. కానీ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని అడ్డుకో గలిగింది. అమెరికాలోని భారతీయులనూ, భారతీయ అమెరికన్లనూ ‘ఆదర్శనీయ మైనారిటీ’గా అభివర్ణి స్తుంటారు. ఎందుకంటే ఇతర దేశాలనుంచి అక్కడికి వలసవచ్చినవారితో పోలిస్తే ఈ ‘ఆదర్శనీయ మైనారిటీ’లో ఉన్నత చదువులు చదువుకునేవారూ, ఉన్నత స్థానాల్లో స్థిరపడినవారూ, రెండు చేతలా సంపాదించేవారూ, క్రమం తప్పకుండా ఆరోగ్య బీమా తీసుకునే స్తోమత గలవారూ అధికం. అనేక బహుళజాతి సంస్థల సారథులు భారతీయులే. ‘స్టెమ్’(సైన్సు, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమే టిక్స్) విభాగాల్లో ఇతర గ్రూపులతో పోలిస్తే వీరి హవా ఎక్కువ. ఈమధ్యకాలంలో రాజకీయాల్లో సైతం సత్తా చాటే స్థితికి చేరుకున్నారు. అయితే అంతా బాగానే ఉందిగానీ... ఎవరూ వేలెత్తి చూపక ముందే అమెరికాలోని హిందూ మత సంస్థలు మేల్కొని కులవివక్షను రూపుమాపేందుకు తగిన కార్యాచరణకు పూనుకొనివుంటే ఈ ప్రతిష్ట మరింత ఇనుమడించేది. అందుకు బదులు బుకాయింపులే వారి ఆయుధాలయ్యాయి. ఎంతకాలం ఈ నాటకం రక్తికడుతుంది? ఇవాళ సియాటల్ ఆలోచించినట్టే రేపన్నరోజున మరిన్ని నగరాలు, రాష్ట్రాలు కూడా చర్యలు తీసుకోవచ్చు. వేరే దేశాలకూ విస్తరించవచ్చు. వివక్ష ఉన్నచోటల్లా ఎవరి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా దానికి ప్రతిఘటన సాగుతూనే ఉంటుంది. పరిణతితో ఆలోచిస్తేనే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. -
మూకస్వామ్యం!
చూడబోతే ఇది నిషేధాల రుతువులా కనబడుతోంది. కర్ణాటకలో హఠాత్తుగా తెరపైకొచ్చిన హిజాబ్, హలాల్ వివాదాలు రగిల్చిన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఈలోగా ఢిల్లీ పరిధిలో బీజేపీ నేతృత్వంలోని తూర్పు, దక్షిణ ఢిల్లీ నగర పాలక సంస్థల మేయర్లు ఈ నెల 2 నుంచి 11 వరకూ జరిగే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాంసం దుకాణాలు మూసివేయాలంటూ పిలుపు నిచ్చారు. ఈ ఇద్దరు మేయర్లూ తమ తమ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లకు లేఖలు రాశారు. అధికారికంగా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులేవీ లేకపోయినా ఆ నగర పాలక సంస్థల పరిధుల్లో చాలా మాంసం దుకాణాలు మూసివేశారంటేనే సాధారణ దుకాణదారుల్లో ఎంతగా భయం రాజ్య మేలుతున్నదో అర్థమవుతుంది. దేశ రాజధానిగా ఉన్న ఒక మహా నగరంలో ఇలాంటి పరిస్థితు లుండటం సరికాదన్న కనీస ఆలోచన కూడా మన నేతలకు కొరవడుతోంది. మన దేశంలో పుట్టుక చాలా అంశాలను నిర్ణయిస్తుంది. ఏ మతంలో, ఏ కులంలో పుట్టారు.. ఏ జెండర్ వగైరా అంశాల ఆధారంగా ఎవరెలా నడుచుకోవాలో, ఎలాంటి వస్త్రధారణ అవసరమో ముందుగానే నిర్దేశితమవుతాయి. అలాగే ఆహారపు అలవాట్లు కూడా! రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ 2016లో వెల్లడించిన అంశాల ప్రకారం మన దేశంలో మెజారిటీ జనాభా మాంసాహార ప్రియులు. ఆసక్తి కరమైన అంశమేమంటే ఉత్తరాది రాష్ట్రాల్లో రాజస్థాన్, హరియాణా, గుజరాత్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో శాకాహార ప్రియుల శాతం కాస్త ఎక్కువగా ఉంటే దక్షిణాది రాష్ట్రాలన్నిటా పూర్తిగా మాంసాహార ప్రియులదే ఆధిక్యత. మొత్తంగా దేశంలో 71 శాతం మంది పైగా మాంసాహారాన్ని భుజిస్తుంటే... దాదాపు 29 శాతం మంది శాకాహారులు. ఆహారపుటలవాట్ల ఆధారంగా వ్యక్తుల ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. మాంసాహారంలో లభించే ప్రొటీన్లు కొన్ని శాకాహారులకు అందుబాటులో ఉండే అవకాశం లేదని ఆహార నిపుణులు చెబుతారు. వారికోసం కొన్ని ప్రత్యామ్నా యాలు సూచిస్తారు. కొన్నిచోట్ల శాకాహారులుగా ముద్రపడిన కులాలకు చెందినవారు వేరే ప్రాంతాల్లో మాంసాహారులుగా ఉండటం కూడా కనబడుతుంది. ఏడేళ్ల క్రితం మహారాష్ట్రలో బీజేపీ –శివసేన ప్రభుత్వం ఉన్నప్పుడు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మూడు రోజులపాటు మాంసం అమ్మరాదని నిషేధం విధించింది. జైనుల పండుగ పర్యూషణ్ సందర్భంగా ఈ నిషేధం తెచ్చినట్లు ప్రకటించింది. అప్పట్లో ఈ ఉత్తర్వును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సంద ర్భంగా బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి ఈ నిషేధంలో చేపల విక్రయాన్ని ఎందుకు చేర్చలేదని ప్రశ్నించినప్పుడు.. అది నీటిలోనుంచి బయటకు తీసిన వెంటనే చనిపోతుంది గనుక దాన్ని వధించడమనే ప్రశ్నే తలెత్తదని జవాబిచ్చి అడ్వొకేట్ జనరల్ నవ్వుల పాలయ్యారు. ఇష్టపడిన ఆహారాన్ని తినడం, సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం, నచ్చిన మతాన్ని అనుస రించడం లేదా మతాతీతంగా ఉండాలనుకోవడం, నచ్చిన వ్యాపారం చేసుకోవడం రాజ్యాంగం ఈ దేశ పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కుల్లో కొన్ని. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జైనుల పండుగ సందర్భంగా మాంసం విక్రయాన్ని నియంత్రిస్తూ ఇచ్చిన ఆదేశాల చెల్లుబాటును 2008లో ధ్రువీకరిస్తూనే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనార్హం. ‘ఎవరు ఏం తినాలనేది వ్యక్తుల ఇష్టానిష్టాలనుబట్టి ఆధారపడి ఉంటుంది. అది పూర్తిగా పౌరుల వ్యక్తిగత గోప్యతకూ, వారి జీవించే హక్కుకూ రక్షణ కల్పిస్తున్న రాజ్యాంగంలోని 21వ అధికరణ పరిధిలోకొస్తుంది’ అని స్పష్టం చేసింది. ఈ హక్కును ఉల్లంఘిస్తున్నామనిగానీ, తమ చర్య ద్వారా మెజారిటీ జనాభా ఆహారపు అలవాట్లను నియంత్రిస్తున్నామనిగానీ ఢిల్లీ మేయర్లకూ, అక్కడి బీజేపీ నాయకులకూ తోచకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారణ పౌరుల హక్కులను గుర్తించి, గౌరవించడమే ఏ పరిణత ప్రజాస్వామ్య వ్యవస్థకైనా గీటురాయి. కేవలం అయిదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించడమే ప్రజాస్వామ్యం అను కునే పాలకులున్న వ్యవస్థ బనానా రిపబ్లిక్‌గానే మిగిలిపోతుంది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు ఉల్లి, వెల్లుల్లి వంటివి కూడా తినబోరని, అలాంటి పరిస్థితుల్లో మాంసం బహిరంగ విక్రయం వారి మనోభావాలను దెబ్బతీస్తుందని మేయర్లు వాదించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 2015లో ముంబై హైకోర్టు మాంసం విక్రయాల నియంత్రణపై తీర్పునిస్తూ ‘జైన మత సోదర, సోదరీ మణులతో సంఘీభావం ప్రకటించడం వేరు... ప్రజానీకానికి మార్కెట్లో మాంసం దొరక్కుండా చర్యలు తీసుకోవడం, వారికి నచ్చిన ఆహారం అందుబాటులో లేకుండా చేయడం వేరు’ అని చెప్పింది. పౌరులు స్వచ్ఛందంగా ఏ పనైనా చేయడం స్వాగతించదగ్గది. కానీ వారితో బలవంతంగా అమలు చేయించాలని చూడటం వివాదాలకూ, అనవసర భయాందోళనలకూ దారితీస్తుంది. ఏం చదవాలో, ఎలా ఆలోచించాలో, ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయాలో, ఎటువంటి దుస్తులు ధరించాలో నిర్దేశించడంతో మొదలుపెట్టి వంటింట్లో ఏం వండాలో కూడా నిర్ణయించే స్థాయికి మన నేతలు చేరడం దురదృష్టకరమైన స్థితి. ఢిల్లీలో కేవలం మందబలం ఆధారంగా ప్రస్తుతం అనధికారికంగా అమలవుతున్న నిషేధాలను పాలనాధికార వ్యవస్థ గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోవడం సరికాదు. నిజానిజాలేమిటో ప్రజల ముందుంచాలి. ఇవి అనధికారికమైనవేనని తేల్చి చెప్పాలి. కనీసం న్యాయస్థానాలైనా జోక్యం చేసుకుని బాధ్యులైనవారిపై చర్యలకు ఆదేశించాలి. మూకస్వామ్యం చేటు తెస్తుందని అందరూ గుర్తించాలి. -
నేపాల్‌తో మళ్లీ సాన్నిహిత్యం
భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా దేశంలో మూడు రోజులు పర్యటించారు. రెండేళ్ల క్రితం సరిహద్దుల విషయంలో వివాదం తలెత్తాక అప్పటికే అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. వాటిని మళ్లీ సరిచేసుకోవడమే దేవ్బా తాజా పర్యటన ఆంతర్యం. నిరుడు జూలైలో అయిదోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక దేవ్బా జరిపిన మొదటి విదేశీ పర్యటన ఇది. ఇరుగు పొరుగు అన్నాక సమస్యలు తలెత్తడం, అవి విభేదాలుగా పరిణమించడం వింతేమీ కాదు. శతాబ్దాలుగా భారత్, నేపాల్ దేశాల మధ్యా సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలున్నాయి. అందుకే అప్పుడప్పుడు పొరపొచ్చాలు ఏర్పడినా, మరో దేశం ఆ సమస్యలను స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని చూసినా ఇరు దేశాలూ ఎప్పటికప్పుడు సంయమనం పాటించి లోటుపాట్లు సరిదిద్దుకుంటున్నాయి. తిరిగి ఒక్కటవుతున్నాయి. దేవ్‌బాకు ముందున్న ప్రధాని కేపీ ఓలి చైనా ప్రభావంతో మన దేశంతో తగాదాకు దిగారు. పర్యవసానంగా ఇరు దేశాల సంబంధాలూ దెబ్బతిన్నాయి. ఆ తర్వాత వచ్చిన దేవ్బా ఆ సంబంధాలను తిరిగి మామూలు స్థితికి తెచ్చేందుకు కృషి చేశారు. దానిలో భాగంగానే ఆయన భారత్ పర్యటనకొచ్చారు. నేపాల్‌కు ఇది ఎన్నికల సంవత్సరం కూడా. కనుక రెండు దేశాల మధ్య తలెత్తిన సరిహద్దు వివాదం సమస్య ఆ ఎన్నికల్లో ప్రముఖంగా ప్రస్తావనకు రావడం ఖాయం. ఉత్తరాఖండ్‌లో భాగంగా ఉన్న లింపియాధుర, కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలను నేపాల్ 2020లో తన మ్యాప్‌లో భాగంగా చూపింది. దానికి సంబంధించిన బిల్లుకు అక్కడి పార్లమెంటులో ఆమోద ముద్ర పడింది. రాబోయే ఎన్నికల్లో దేవ్‌బాను దెబ్బతీయడానికి మాజీ ప్రధాని ఓలి శర్మ, ఇతరులు గట్టిగానే ప్రయత్నిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరగా ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో ఈ వివాద పరిష్కారానికి ఒక యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలి. బిహార్‌లోని జయనగర్ నుంచి నేపాల్‌లోని కుర్తా వరకూ నడిచే రైలుకు ఇరు దేశాల ప్రధానులు పచ్చజెండా ఊపారు. 35 కిలోమీటర్ల నిడివిగల ఈ మార్గంలో ఇరు దేశాల మధ్యా ప్రారంభమైన తొలి బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ ఇది. దీన్ని మరింత దూరం పొడిగించడానికి మన దేశం సాయపడ బోతోంది. అలాగే మన దేశం నిర్మించిన విద్యుత్ కారిడార్‌ను కూడా లాంఛనంగా దేవ్‌బాకు అప్పగించారు. ఈ కారిడార్ వల్ల అక్కడి ఈశాన్య ప్రాంత మారుమూల పల్లెలకు సైతం నేపాల్ విద్యుత్ సదుపాయం అందించగలుగుతుంది. ఇవిగాక నేపాల్‌లో విద్యుదు త్పత్తి ప్రాజెక్టులను ఉమ్మడిగా అభివృద్ధి చేయడంతో సహా మరెన్నో ఒప్పందాలపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. మన దేశంతో నేపాల్ క్రమేపీ సన్నిహితమవుతున్న తీరును చైనా గమనిస్తూనే ఉంది. దేవ్బా మన దేశం రావడానికి మూడు రోజుల ముందు నేపాల్‌లో చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ పర్య టించారు. ఒక్క మన దేశంతో మాత్రమే కాదు... అమెరికాతో కూడా నేపాల్ దగ్గరవుతుండటాన్ని దృష్టిలో ఉంచుకునే వాంగ్ యీ హుటాహుటీన ఈ పర్యటనకొచ్చారు. నేపాల్‌లో రోడ్లు, విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఒక సంస్థ ద్వారా తాను అందించదల్చుకున్న సాయం అంగీకారమో కాదో మార్చి 28 లోగా చెప్పాలని అమెరికా గడువు విధించింది. 50 కోట్ల డాలర్ల విలువైన ఆ గ్రాంటు స్వీకరించడానికి నేపాల్ కొంత సందేహించింది. అయితే దీన్ని అంగీకరించకపోతే నేపాల్‌తో తన ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించుకుంటానని అమెరికా హెచ్చరించడంతో గడువుకు ఒక్కరోజు ముందు నేపాల్ పార్లమెంటు ఆ గ్రాంటు తీసుకోవడానికి ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితిలో నేపాల్ ఓటువేసింది. దీనికి కూడా అమెరికా ఒత్తిడే కారణం. చిత్రమేమంటే ఈ రెండు అంశాల్లోనూ ప్రచండ నాయకత్వంలోని మావోయిస్టు సెంటర్, మాధవ్ నేపాల్ ఆధ్వర్యంలోని యూనిఫైడ్ సోషలిస్టులు ప్రభుత్వానికి మద్దతునిచ్చాయి. చైనాకు అత్యంత సన్నిహితమని ముద్ర ఉన్న మాజీ ప్రధాని శర్మ ఓలి నాయకత్వంలోని యూనిఫైడ్ మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీ సైతం తటస్థంగా ఉండిపోయింది. ఈ పరిణామాలతోపాటు భారత్‌లో దేవ్బా పర్యటించడాన్ని కూడా చైనా జీర్ణించుకోలేకపోయింది. నెహ్రూ ఏలుబడిలో దక్షిణాసియా దేశాలతో మన సంబంధాలు సక్రమంగా ఉండటం లేదని నిపుణులు విమర్శించేవారు. ముఖ్యంగా నేపాల్‌తో సంబంధాల విషయంలో మనం పెద్దన్న పోకడలకు పోతే ఆ దేశం చైనాను ఆశ్రయించే అవకాశం ఉన్నదని హెచ్చరించేవారు. చిత్రమేమంటే అనంతరకాలంలో కేంద్రంలో ఏ పార్టీ అధికా రంలో ఉన్నా ఈ విషయంలో దిద్దుబాటు చర్యలు అంతంతమాత్రమే. అందువల్లే నేపాల్‌కు చైనా సన్నిహితం కాగలిగింది. వేలాదిమంది నేపాలీ విద్యార్థులకు తమ దేశంలోని విద్యాసంస్థల్లో చవగ్గా చదువుకునే అవకాశం కల్పించింది. నేపాల్‌లో మాండరిన్ భాష నేర్పించడానికి పలు కేంద్రాలను ప్రారంభించింది. ఇప్పటికైతే నేపాల్ కమ్యూనిస్టు పార్టీలు భారత్, అమెరికాలతో దేవ్బా ప్రభుత్వ సంబంధాలపై నోరెత్తడంలేదు. అయితే ఈ ఏడాది చివరిలో జరగబోయే ఎన్నికలనాటికి అమెరికా మాటెలా ఉన్నా భారత్ వ్యతిరేకతను రెచ్చగొట్టి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తాయి. కనుక సరిహద్దు అంశంలోనైనా, మరే ఇతర విషయంలోనైనా మన దేశం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో, సామరస్యపూర్వకంగా వ్యవహరించడం అవసరం. ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి దేవ్బా తాజా పర్యటన దోహదపడితే ఇరు దేశాల సంబంధాలూ మరింత మెరుగుపడతాయి. -
ఇమ్రాన్ వింత నిర్ణయం
గత కొంతకాలంగా రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎట్టకేలకు పదవినుంచి నిష్క్రమించారు. పోతూ పోతూ అమెరికాపై పెద్ద బండ పడేశారు. తనను పదవీచ్యుతుణ్ణి చేయడానికి ‘ఒక పెద్ద దేశం’ కుట్ర పన్నుతున్నదంటూ గత కొన్ని రోజులుగా చెబుతూ వస్తున్న ఇమ్రాన్.. సొంత పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్(పీటీఐ) ఎంపీల సమావేశంలో అమెరికా పేరు చెప్పడంతోపాటు ఆ ప్రభుత్వంలో దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల సహాయమంత్రిగా ఉంటున్న డోనాల్డ్ లూ ఇందులో ప్రధాన పాత్ర పోషించారని తేటతెల్లం చేశారు. ఈ కుట్ర సిద్ధాంతం మాటెలా ఉన్నా దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడల్లా అమెరికా పేరే వినిపించడం పాకిస్తాన్ పౌరు లకు అలవాటైపోయింది. గతంలో మాదిరే ఇప్పుడు కూడా నిజానిజాలేమిటో వెల్లడయ్యే అవకాశాలు లేవు. సైన్యానికీ, తనకూ సంబంధాలు చెడిన సంగతి బహిరంగ రహస్యమే అయినా ఇమ్రాన్ ఆ మాటెత్తడం లేదు. అటు సైన్యం కూడా ఇలాంటి తెలివే ప్రదర్శిస్తోంది. తమకూ, రాజకీయాలకూ సంబంధం లేదంటున్నది. నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా తొలగించడానికి ఇమ్రాన్‌ను ముందుపెట్టి 2018లో సైన్యం ఆడిన డ్రామా ఎవరూ మరిచిపోరు. ఆయన పార్టీ స్థాపనలోనూ, ఆయన సాగించిన ఉద్యమాల్లోనూ సైన్యం ప్రమేయం గురించీ, ఆఖరికి ఎన్నికల్లో రిగ్గింగ్ నడిపించి ఆయన ప్రధాని అయ్యేందుకు తోడ్పడిన వైనం గురించీ తెలియవారెవరూ లేరు. అయితే ఇద్దరిమధ్యా సంబంధాలు ఎందుకు బెడిసికొట్టాయో వెల్లడికావడానికి మరికొంతకాలం పడుతుంది. కానీ ఈ మొత్తం వ్యవహారంలో ఇమ్రాన్ పోషించిన పాత్రే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆఖరి బంతి వరకూ పోరాడతానని ఆయన ప్రగల్భాలు పలికారు. అందరినీ నమ్మిస్తూ వచ్చారు. తీరా చివరి నిమిషంలో కాడి పడేశారు. జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం ఖాన్ సూరి సాయంతో కావలసినంత గందరగోళం సృష్టించి, అటు తర్వాత దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీని కలిసి అసెంబ్లీని రద్దు చేయించారు. తాను సూచించిన వ్యక్తే ఆపద్ధర్మ ప్రధాని అయ్యేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనాల్సిన నాయకుడి సత్తా ఏపాటిదో తేలకుండా ఆయన చేసిన సిఫార్సును దేశాధ్యక్షుడు ఎలా ఆమోదించారన్నది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. దేశ విభజన పూర్తయి ఒక దేశంగా ఆవిర్భవించినప్పటినుంచీ పాకిస్తాన్‌ను సంక్షోభాలు చుట్టు ముడుతూనే ఉన్నాయి. అక్కడి రాజ్యాంగం దేశాన్ని మత రాజ్యంగా ప్రకటించటంలోనే ఈ సంక్షోభ పరంపరకు బీజాలున్నాయి. మెజారిటీ పౌరుల్లో ఉండే మత విశ్వాసాలను సొమ్ము చేసుకోవడానికి రాజకీయ పక్షాలు ఒకటిని మించి మరొకటి పోటీ పడే క్రమంలో వ్యవస్థలన్నీ అవినీతిలో కూరుకు పోయాయి. నిస్తేజంగా తయారయ్యాయి. దీన్ని సైన్యం తెలివిగా ఉపయోగించుకుంది. దేశాన్ని ఉద్ధరించడానికే పుట్టినట్టు దేశ ప్రజలను నమ్మించి రేషన్ పంపిణీ మొదలుకొని అన్నిటిలోనూ తన ప్రమేయం ఉండేలా చూసుకుని రాజకీయ వ్యవస్థపై పట్టు బిగించింది. ఏ ప్రభుత్వాన్నీ పూర్తి కాలం అధికారంలో కొనసాగనీయకుండా చూడటం, సాధ్యపడకపోతే సైనిక కుట్రలో ప్రభుత్వాలను కూల్చడం, అధికారాన్ని హస్తగతం చేసుకోవడం దానికి రివాజు. ఇన్ని దశాబ్దాలుగా అలవాటైన ప్రాణం ఇప్పుడు అందుకు భిన్నంగా తటస్థత పాటించిందని ఎవరూ నమ్మరు. కానీ ఆ మాట ఇమ్రాన్ ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారో అనూహ్యం. ఒకపక్క విపక్షాల అవిశ్వాసాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడంపై పార్లమెంటులో గొడవ సాగుతుండగా మాయమైన ఇమ్రాన్.. ఆ తర్వాత టీవీల్లో ప్రత్యక్షమై విపక్షాల అవిశ్వాసం ఓడిపోయిందనీ, అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేశాననీ, త్వరలో ఎన్నికలుంటాయనీ ప్రకటించడంతో వ్యవస్థలన్నీ నవ్వులపాలయ్యాయి. ఎటూ పదవి పోవడం ఖాయమనుకున్నప్పుడు హుందాగా అవిశ్వాసాన్ని ఎదుర్కొని ఉంటే ఇమ్రాన్‌కు కొద్దో గొప్పో గౌరవం దక్కేది. కానీ ఆయన రాకలోనే అప్రజాస్వామికత దాగి ఉన్నప్పుడు నిష్క్రమణ అందుకు భిన్నంగా ఉంటుందనుకోవడం దురాశ. ఇమ్రాన్ రాకపోకల మాటెలా ఉన్నా ఉక్రెయిన్ విషయంలో ఎవరి ఒత్తిళ్లకూ లొంగక స్వతం త్రంగా నిర్ణయం తీసుకుందని పదవి ఊడే వేళయిందని గ్రహించాక రెండు సందర్భాల్లో ఆయన భారత్‌ను కొనియాడటం గమనించదగ్గది. ఇది తమ సైన్యం అనుసరిస్తున్న వైఖరిపై ఎత్తిపొడుపు. తాను రష్యాను సమర్థించగా, సైన్యం మాత్రం అమెరికా అనుకూల వైఖరి తీసుకోవడాన్ని తట్టుకోలేక అది ఒత్తిళ్లకు తలొగ్గిందని చెప్పడానికి ఆయన భారత్‌ను ప్రశంసించారు. ఇమ్రాన్ వచ్చేనాటికే పాకిస్తాన్ రూపాయి సంక్షోభంలో చిక్కుకుంది. కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యలోటు నానాటికీ పెరు గుతూ పోయాయి. చైనా ఆపన్న హస్తం అందిస్తుందని ఆశించినా మత ఛాందసవాదం ఉన్నకొద్దీ వెర్రితలలు వేస్తున్న తీరుతో అది వెనకడుగేసింది. పైగా దానికి చెల్లించాల్సిన బకాయిలపై వడ్డీలే భయపెట్టేంతగా పెరిగాయి. మొదటినుంచీ వెనకుండి ఇమ్రాన్‌ను నడిపించి ఆర్థిక సంక్షోభానికి కారణమైన సైన్యం ఇప్పుడు ఆయన్ను బలిపశువును చేసిందన్న ఆరోపణలూ ఉన్నాయి. పాకిస్తాన్ పరిణామాలపై అక్కడి సుప్రీంకోర్టు ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఆ తీర్పు ఎలా ఉన్నా వ్యవస్థలను ఆడిస్తున్న సైన్యం తీరు మారనంతవరకూ.. ప్రజలు చైతన్యవంతులు కానంతవరకూ పాకిస్తాన్ వ్యథ తీరదు. అది ఒక సంక్షోభం నుంచి మరో సంక్షోభానికి నిత్యం పయనిస్తూనే ఉంటుంది. ఎప్పటికీ విఫలరాజ్యంగానే మిగులుతుంది. -
గీత రాత మారేనా?
చిత్రకళ అనాది కళ. చరిత్రకు పూర్వయుగంలోనే మానవాళికి పట్టుబడిన ఆదిమ కళ. మాటలెరుగని తొలి మానవులు ఎరిగిన ఏకైక భావప్రకటన సాధనం చిత్రకళ. గీతల నుంచి పరిణామం చెందిన తర్వాతే రాతలు రాయడం మొదలైంది. గీతలతో చుట్టూ కనిపించే జంతుజాలాన్ని, పరిసరాలను చిత్రించే దశ నుంచి చిత్రలిపి ‘క్యూనిఫామ్’ దశకు చేరుకోవడానికి దశాబ్దాలో శతాబ్దాలో కాదు, ఏకంగా సహస్రాబ్దాల కాలం పట్టింది. ఆదిమ చిత్రకళ క్రీస్తుపూర్వం 30 వేల ఏళ్ల నాడే మొదలైతే, క్రీస్తుపూర్వం 3,400 ఏళ్ల నాటికి గాని తొలినాటి లిపి రూపుదిద్దుకోలేదు. దాదాపు అప్పటి నుంచే భాషల పుట్టుక మొదలైంది. నానా భాషలూ, వాటికి రకరకాల లిపులూ వచ్చాయి. మనిషి మాటలూ రాతలూ నేర్చిన నాటి నుంచి నాగరికత పరిణామ క్రమంలో వేగం పెరిగింది. ముందొచ్చిన గీతల కంటే వెనకొచ్చిన రాతలే వాడి అనేంతగా పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. నాగరికతల వికాసం మొదలైన నాటి నుంచి పారిశ్రామిక విప్లవ కాలం వరకు, ఆ తర్వాత నేటి అత్యాధునిక కాలం వరకు ప్రపంచవ్యాప్తంగా చిత్రకళలో అనేకానేక మార్పులు వచ్చాయి. మన దేశంలో ఆదిమ చిత్రకళ క్రీస్తుపూర్వం 5,500 ఏళ్ల నాడే మొదలైంది. మధ్యప్రదేశ్‌లోని భీమ్‌బేట్కా గుహల్లోని చిత్రాలే ఇందుకు నిదర్శనం. సింధులోయ నాగరికత నాటి శిథిలాల్లో నైరూప్య చిత్రకళ ఆనవాళ్లూ ఉన్నాయి. క్రీస్తుపూర్వం రెండో శతాబ్ది నుంచి క్రీస్తుశకం ఒకటో శతాబ్ది కాలానికి చెందిన అజంతా గుహల్లోని చిత్రకళ ఆనాటి బౌద్ధ ప్రాభవానికి అద్దంపడుతుంది. మొఘల్ పరిపాలన కాలం వరకు దేశం నలు చెరగులా మధ్యయుగాల చిత్రకళ వివిధ రీతుల్లో అభివృద్ధి చెందింది. మొఘల్ పాలన అంతమయ్యాక డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ కంపెనీలు దేశంలోకి అడుగుపెట్టాక మన దేశంలో ఆధునిక చిత్రకళ మొదలైంది. బ్రిటిష్ హయాంలోనే మన దేశంలో చిత్రకళా అధ్యయన కేంద్రాలు ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో శాస్త్ర సాంకేతిక అధ్యయన కేంద్రాల అభివృద్ధితో పోల్చుకుంటే, కళా అధ్యయన కేంద్రాల అభివృద్ధి నామమాత్రమే! ఇక చిత్రకళపై తెలుగులో వచ్చిన పుస్తకాల సంఖ్యను వేళ్ల మీద లెక్కించవచ్చు. తొలి తెలుగు కార్టూనిస్టు తలిశెట్టి రామారావు ‘చిత్రలేఖనము’ పేరిట 1918లో రాసిన పుస్తకమే బహుశ తెలుగులో వచ్చిన తొలి ఆధునిక చిత్రకళా గ్రంథం. స్వాతంత్య్రా నికి ముందు కళాభిరుచి గల కొందరు బ్రిటిష్ దొరలు ఎందరో భారతీయ చిత్రకారులను ప్రోత్సహించారు. ఆనాటి సంస్థానాలు సైతం చిత్రకళకు ఊతమిచ్చాయి. ఆధునిక భారతీయ చిత్రకారుల్లో అగ్రగణ్యుడైన రాజా రవివర్మ ట్రావెన్కోర్ సంస్థానాధీశుని ప్రోత్సాహంతో రాణించాడు. ఇద్దరు తెలుగు గురువుల వద్ద, బ్రిటిష్ చిత్రకారుడు థియోడార్ జెన్సన్ వద్ద రవివర్మ తైలవర్ణ చిత్రకళను నేర్చుకున్నాడు. ఆధునిక భారతీయ చిత్రకారుల్లో రవివర్మ అగ్రగణ్యుడే గానీ, ఆద్యుడు కాదు. ఇప్పటి వరకు దొరుకుతున్న ఆధారాల ప్రకారం తెలుగువాడైన బ్రహ్మస్వామిని తొలి ఆధునిక భారతీయ చిత్రకారుడిగా చెప్పుకోవచ్చు. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన బ్రహ్మయ్య గీసిన చిత్రాలు ఫ్రాన్స్ జాతీయ గ్రంథాలయం వెబ్సైట్లో కనిపిస్తాయి. ఆధునిక కాలానికి చెందిన మన తెలుగు చిత్రకారుల గురించి చెప్పుకుంటే కూల్డ్రే దొర ప్రోత్సాహంతోనే తొలితరం ఆధునిక చిత్రకారుల్లో ఒకరైన దామెర్ల రామారావు రాణించారు. దామెర్ల మిత్రుడు వరదా వెంకటరత్నం కూడా కూల్డ్రే ప్రోత్సాహంతోనే చిత్రకళలో రాణించారు. మశూచి బారినపడి దామెర్ల పిన్నవయసులోనే మరణించ డంతో రాజమండ్రిలో ‘రామారావు ఆర్ట్ గ్యాలరీ’ని ఏర్పాటు చేసినది వరదా వెంకటరత్నమే! గడచిన శతాబ్దిలో పలువురు తెలుగు చిత్రకారులు భారతీయ చిత్రకళను సుసంపన్నం చేశారు. అప్పట్లో ‘భారతి’ వంటి పత్రికలు చిత్రకళకు కూడా సముచిత ప్రాధాన్యమిచ్చేవి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న చిత్రకళాకారులు తెలుగునాట చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నా, వారి నైపుణ్యాన్ని, ప్రత్యేకతను బేరీజువేసి పాఠకులకు విశదీకరించగల కళావిమర్శకులే మనకు అరుదైపోయారు. తెలుగునాట వివిధ విశ్వవిద్యాలయాల్లో బీఎఫ్ఏ, ఎంఎఫ్ఏ కోర్సులు నిర్వహి స్తున్నా, ఏటా ఈ డిగ్రీలు తీసుకుని బయటకు వచ్చేవారిలో కనీసం ఒకరిద్దరయినా చిత్రకళా విమర్శ కులుగా తయారు కాలేకపోవడం విచారకరం. ప్రపంచంలోని ఉత్తమ చిత్రకళా విద్యాల యాల్లో తొలి ముప్పయి స్థానాల్లోనైనా మన దేశానికి చెందిన ఏ చిత్రకళా విద్యాలయానికీ చోటులేక పోవడం మరో విషాదం. చిత్రకళపై మనదేశంలో ఇంగ్లిష్ మ్యాగజైన్లు కొద్ది సంఖ్యలో వస్తున్నాయి. తెలుగు సహా ప్రాంతీయ భాషల్లో పూర్తిగా చిత్రకళకు పత్రికలేవీ లేవు. ఒకవేళ వచ్చినా, అవి మనుగడ సాగించగల పరిస్థితులూ లేవు. మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏటా ‘చిత్రసంతె’ జరుగుతుంది. ‘కరోనా’ వల్ల దీనికి రెండేళ్లు అంతరాయం కలిగినా, ఈసారి యథావిధిగా జరిగింది. వారం కిందట జరిగిన ‘చిత్రసంతె’లో దేశం నలుమూలల నుంచి వచ్చిన చిత్రకారులు పాల్గొన్నారు. కర్ణాటక చిత్రకళా పరిషత్ నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాన్ని మిగిలిన రాష్ట్రాలూ నిర్వహిస్తే బాగుంటుంది. ఏటా దేశంలోని వివిధ నగరాల్లో పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లే, ‘చిత్రసంతె’ వంటి కార్యక్రమాన్ని కనీసం దేశంలోని ముఖ్య నగరాల్లో నిర్వహించేటట్లయితే వర్ధమాన చిత్రకారులకు కొంతైనా ప్రోత్సాహకరంగా ఉంటుంది. గీత రాత మారుతుంది. -
పిల్లి వచ్చే... ‘వెలుగు’ భద్రం!
నూరు ఎలుకల్ని భోంచేసిన పిల్లి తీర్థయాత్రలకు బయల్దేరిందట! రైతన్నపై మోయలేని కరెంటు భారాన్ని మోపినందుకు నిరసనగా ఊరేగిన జనంపై కాల్పులు జరిపి మూడు నిండు ప్రాణాలు బలిగొన్నారు. వారే ఇప్పుడు లాంతర్లు పట్టుకొని తిరుగుతున్నారు. గురువుకు నామం పెట్టి అతని సర్వస్వాన్ని దోచుకొని పోయిన ఆషాఢభూతి (పంచతంత్రం కథ) గురుపూజోత్సవం జరిపితే ఎట్లా వుంటుంది? ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణ మైన ‘‘నమ్మకద్రోహులు, ఔరంగజేబులు’’ ఇప్పుడాయన ఆద ర్శాలకు స్తోత్ర కైవారాలు సమర్పిస్తుంటే అట్లానే ఉంటున్నది. ఇప్పుడు లాంతర్లు పట్టుకొని తిరుగుతున్నవారి చేతులకు రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ఎవ్వరిదా రక్తం? ఎక్కడిదా రక్తం? చంద్రబాబు పోలీసులు పేల్చిన తుపాకీ తూటాలు నవయువకుడైన కామ్రేడ్ విష్ణువర్ధన్ రెడ్డి దేహాన్ని చీల్చినప్పుడు స్రవించిన రక్తధార. ఇంకా వెచ్చగా వున్నది. చంద్రబాబు బందూకులకు బరిగీసి ఎదురొడ్డి నిలబడి నప్పుడు ప్రజాసంఘాల నేత కామ్రేడ్ రామకృష్ణ చిందించిన రక్తపు చారికలు. ఇంకా తడారలేదు. కాంగ్రెస్ కార్యకర్త బాలాస్వామి తనువు నుంచి పిండేసిన మండే నెత్తురు. ఇంకా చల్లారనే లేదు. ‘‘అమరుల రుధిర ధారలురా, ఆరని అగ్నిజ్వాలలురా, నాల్కలు చాచే నాగులురా, అవి అంతం చూసే ఆగునురా’’ అన్నాడొక కవి. ఇప్పుడు ఊరేగుతున్న బషీర్‌బాగ్ హంతకుల చేతుల కంటిన నెత్తుటి మరకలు ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారి చేతుల్లోని గుడ్డి లాంతర్లను ఆ మరకలు వెక్కిరిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబుకు తనదైన ఒక ఫిలాసఫీ ఉండేది. ఆ ఫిలాసఫీని ఆయన బహిరంగంగా ప్రకటించుకున్నారు. ఒక పుస్తకాన్ని కూడా అచ్చేసి పంచుకున్నారు. ఆ ఫిలాసఫీ ఆధారంగా చంద్ర బాబుకు ప్రపంచ బ్యాంకు జీతగాడు అనే బిరుదును కూడా కమ్యూనిస్టు పార్టీలు ప్రసాదించాయి. వ్యవసాయం దండగ అనేది ఆ ఫిలాసఫీలో ఒక భాగం. అందుకు తగ్గట్టుగానే ఆయన రైతు వ్యతిరేక విధానాలను అవలంబించేవారు. వ్యవసాయంలో బతుకులను ఈదలేక పెద్దఎత్తున రైతులు ఆ రంగం నుంచి తప్పుకోవాలి. రెక్కలమ్ముకోవడం తప్ప మరే గత్యంతరమూ లేని రిజర్వు లేబర్‌గా వారు పట్టణ మార్కెట్లలో నిలబడి పోవాలి. పారిశ్రామికులకు, వ్యాపారులకు చీప్‌లేబర్ సుల భంగా దొరకాలి. ఇదీ ధ్యేయం. ఆ విధానానికి అనుగుణంగా వ్యవసాయ రంగంపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోయలేనంతగా మోపారు. సమయానికి బిల్లులు చెల్లించలేకపోతే స్టార్టర్లను, మోటర్లను విద్యుత్ సిబ్బంది ఎత్తుకెళ్లేవారు. ఇంటి తలుపుల్ని తీసుకొనిపోయిన ఉదాహరణలు కోకొల్లలు. రైతులపై దొంగ కేసులు బనాయిం చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అవమాన భారాలు తట్టు కోలేక ఎందరో రైతులు ఆత్మహత్యల బాటను ఎంచుకున్నారు. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలన్న డిమాండ్ ముందుకు వచ్చినప్పుడు ఆయన తీవ్రంగా వ్యతిరేకిం చారు. అలా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకొనే రోజులు వస్తాయని ఎగతాళి చేసేవారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఛార్జీల భారానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఒక ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనను శాంతిభద్రతల సమస్యగా పరిగణించాలని చంద్రబాబు ప్రభుత్వం ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రదర్శన బషీర్‌బాగ్ ప్రాంతాన్ని చేరుకునేసరికి పోలీసు బల గాలు అడ్డగించాయి. హెచ్చరికలు లేకుండానే వారి తుపాకులు గర్జించాయి. చురుగ్గా ఉన్న కార్యకర్తలపై పోలీసులు గురి చూసి మరీ కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. జలియన్ వాలాబాగ్ మారణకాండకు కారకుడైన జనరల్ డయ్యర్ లాంటివాడు మాత్రమే చేయగలిగిన అమానుషకాండ ఇది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. మొన్నటి ఎన్నికల్లో సంభవించిన ఓటమిని ఆ పార్టీ నిభాయించుకోలేక పోతున్నది. ప్రపంచంలోనే అతి పెద్దదయిన ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌ను ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించింది. ప్రమోటర్ల పాలిటి కల్పతరువులాంటి ప్రాజెక్టది. అందులోని కుంభకోణానికి ఇప్పుడు అడ్డుకట్ట పడింది. తెలుగుదేశం పెద్దలకు కాళ్లూ చేతులూ ఆడటం లేదు. మనసు మనసులో ఉండటం లేదు. న్యాయాన్యాయ విచికిత్సతో పనిలేదు. ధర్మాధర్మ విచక్షణ జాన్తా నై. తక్షణ కర్తవ్యం అధికారంలోకి రావడం. రియల్ ఎస్టేట్ వెంచర్‌ను తాము ఉద్దేశించిన విధంగా పిండుకోవాలి. ఇందుకు ఏకైక మార్గం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గద్దెదించి తాము అధికారంలోకి రావడం. అలా జరగాలంటే దానికి రెండు ఆప్షన్లున్నాయి. ఒకటి: ఏదో అద్భుతం జరిగి దేవుడు ప్రత్యక్షమైతే వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించి తమను ఎక్కించాలని కోరుకోవడం. ఇదంత సులభం కాదు. రెండోది: ఎన్ని మాయోపాయాలైనా ప్రయోగించి ప్రభుత్వ వ్యతిరేకతను సృష్టించాలి. వచ్చే ఎన్నికల్లో గెలవాలి. ఒక అబద్ధాన్ని వందసార్లు వల్లెవేస్తే అదే నిజమై కూర్చుంటుందన్న గోబెల్స్ ప్రాపగాండా సూత్రాన్ని ఆ పార్టీ బాగా వంట పట్టించుకున్నది. రియల్ ఎస్టేట్ వెంచర్లో రైతు సెంటిమెంట్‌ను రంగరించింది. రక్త కన్నీరు నాటకాన్నీ, రైతుబిడ్డ సినిమానూ ఏకకాలంలో ప్రదర్శించింది. అనుకున్నంతగా రక్తి కట్టలేదు. రోజుకో బట్టను కాల్చి అధికార పార్టీ మీద వేయడం అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలో దానికో కరెంటు తీగ దొరికింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల నుంచి విద్యుత్ ఛార్జీలు పెరుగు తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు పొరుగు రాష్ట్రాలతో సహా అనేక రాష్ట్రాల్లో ఈ నెల నుంచి ఛార్జీలు పెరుగు తున్నాయి. ఆ పెంపు మా దగ్గరే తక్కువని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. తప్పనిసరి పరిస్థితుల్లో రూ. 1,400 కోట్లను మాత్రమే పెంచు తున్నామనీ, మరో 700 కోట్లు ట్రూఅప్ భారమనీ, ఈ రెండు భారాలూ చంద్రబాబు పాప ఫలితాలనీ ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు. కనీసం అరడజనుసార్లు సుదీర్ఘమైన వివరణలు ఇచ్చారు. వారి వాదాన్ని బలపరిచే గణాంకాలను కూడా విడుదల చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ మీడియా ఇందులోని లోతుపాతులపై తార్కికంగా చర్చించే పరిస్థితి లేదు. యురేకా! కరెంటు తీగ దొరికింది. పట్టండి లాంతర్లు.. ఎత్తండి గొంతులు అన్నదొక్కటే ప్రస్తుతం తెలుగుదేశం క్యాంప్ వ్యూహం. వీలైతే విష్ణువర్ధన్ రెడ్డినీ, రామకృష్ణనూ మరిచిపోయి కమ్యూనిస్టులూ, బాలా స్వామిని మరిచిపోయి కాంగ్రెస్ వారూ తమతో కలిసి ఈ పోరాటంలో పాల్గొనాలని బహుశా నేడో రేపో తెలుగుదేశం పార్టీ ఒక పిలుపును కూడా ఇవ్వవచ్చు. మన దగ్గర జరిగే విద్యుదుత్పత్తిలో థర్మల్‌దే పెద్ద వాటా. ఇది బొగ్గు ఆధారిత ఉత్పత్తి. మార్కెట్లో బొగ్గు ధరలు గడిచిన కొన్నేళ్లుగా పెరుగుతున్నాయి. ఏడెనిమిదేళ్ల కిందట ఒక టన్ను విదేశీ బొగ్గు 7 వేల రూపాయలకు దొరికేది. ఇప్పుడది రూ. 18 వేల పైమాటే. దీనివల్ల ఉత్పత్తి ఖర్చు పెరిగింది. మనం ఉత్పత్తి చేసుకున్న లేదా కొనుగోలు చేసిన థర్మల్, హైడల్ మాత్రమే సరిపోదు. సంప్రదాయేతర ఇంధనాన్ని ప్రోత్సహించడానికి సౌర, గాలిమరల విద్యుత్తును కూడా కొంతమేర కొనుగోలు చేయాలి. ఇందుకోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ సోలార్, విండ్ ప్లాంట్లతో కొనుగోలు ఒప్పందాలను చేసుకున్నది. ఈ ఒప్పందాలను పీపీఏ (పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు)లు అంటున్నారు. ఈ పీపీఏలలో బాబు ప్రభుత్వం ఒక మతలబు చేసింది. అప్పటికి మార్కెట్లో ఉన్న ధర కంటే రెట్టింపు ధరకు పీపీఏలు కుదుర్చుకున్నది. ఈ రెట్టింపు ధరను పాతికేళ్లపాటు భరించాలి. ఒప్పందం కుదుర్చుకున్నది కూడా సెకీ (ఎస్ఈసీఐ) లాంటి ప్రభుత్వ సంస్థతో కాదు. ప్రైవేట్ సంస్థలతో. ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చేవిధంగా ఒప్పందం చేసుకున్నా రంటే గూడుపుఠాణీ ఉన్నట్టే కదా! ఈ పొరపాటును సరిదిద్ద డానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఒప్పందం ప్రకారం యూనిట్‌కు రూ. 4.88 కాకుండా మార్కెట్ ధర ప్రకారం యూనిట్‌కు రూ. 2.43 చెల్లిస్తామని ప్రతిపాదించింది. ప్రైవేట్ వాళ్లు వచ్చే లాభాన్ని ఎందుకు వదులుకుంటారు! వాళ్లు కోర్టుకెక్కారు. ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ఆమేరకే చెల్లింపులు చేయాలని కోర్టు చెప్పింది. ఫలితంగా విద్యుత్ పంపిణీ చేసే సంస్థలైన డిస్కమ్‌లపై 7,866 కోట్ల రూపాయల భారం పడింది. నిరంతరం విద్యుత్ సరఫరా (24గీ7) చేయడం కోసం బహిరంగ మార్కెట్లో యూనిట్‌కు ఐదు రూపాయల చొప్పున చెల్లించవలసిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అట్లాగే వ్యవసాయ రంగానికి పగటి పూటే తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందజేస్తామన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ అంశాన్ని సమీక్షించడం జరి గింది. ఒకవేళ అవసరమైనంత విద్యుత్ అందుబాటులో ఉన్నా కూడా తొమ్మిది గంటలపాటు పగటిపూట నిరంతరాయంగా సరఫరా చేయడానికి అవసరమైన ఫీడర్లు వగైరాలతో కూడిన మౌలిక వ్యవస్థ అందుబాటులో లేని విషయం బయటపడింది. రైతుకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తానని చెప్పడమే తప్ప అందుకు అవసరమైన మౌలిక వసతిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టిపెట్టలేదు. ఒక నిర్ణీత కాలపరిమితిని నిర్ణయించుకొని ఈ రంగంపై వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.1,700 కోట్లు ఖర్చు చేసింది. ఈరకంగా వేలకోట్ల భారం పడినప్పటికీ అందులో రూ.1,400 కోట్లను మాత్రమే వినియోగ దారునికి బదిలీ చేశామన్నది డిస్కమ్‌ల వాదన. ట్రూఅప్ ఛార్జీల పేరుతో మరో 700 కోట్ల పద్దు ఉన్నది. దీన్ని సర్దుబాటు ఛార్జీలు అంటారు. రాబోయే ఏడాదికి సంబంధించి విద్యుత్ పంపిణీ సంస్థలు ముందస్తు అంచనాలు వేసుకుంటాయి. తమ పరిధిలో వివిధ రంగాల వారీగా ఎంత మేరకు విద్యుత్ డిమాండ్ ఉండవచ్చును? దాన్ని ఎక్కడెక్కడి నుంచి (థర్మల్, హైడల్, గ్యాస్, విండ్, సోలార్) ఎంతమేరకు సమీకరించుకోవాలి? ఎంతమేరకు ఖర్చవుతుంది. సరఫరా – పంపిణీ వ్యయమెంత ఉండవచ్చును? ఏ కేటగిరీకి ఎంత రేటుకు విద్యుత్‌ను సరఫరా చేయాలి? వగైరా లెక్కలతో వార్షిక ఆదాయ–వ్యయ నివేదికల (ఏఆర్ఆర్)ను విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) రూపొందిస్తాయి. వాటిని విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పిస్తాయి. నివేదికలను అధ్యయనం చేసిన తర్వాత కొన్ని మార్పుచేర్పులతో గానీ, యథాతథంగా గానీ చార్జీలను నిర్ణయిస్తూ మండలి (ఈఆర్సీ) ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఏడాది గడిచిన తర్వాత చూసినప్పుడు ఆదాయ వ్యయాలు అంచనాల మేరకు ఉండవచ్చు లేదా వ్యయం పెరగ వచ్చు. అట్లా ఖర్చు పెరిగినప్పుడు ట్రూ అప్ పేరుతో పెరిగిన ఖర్చును వినియోగదారులకు బదిలీ చేసి సర్దుబాటు చేస్తారు. ఒకవేళ ఖర్చు తగ్గినట్టయితే ట్రూ డౌన్ పేరుతో తగ్గిన మేరకు వినియోగదారులకు జమ చేయాలి. ఇప్పుడు ట్రూ అప్ పేరుతో 700 కోట్లను ఏపీఈఆర్సి వినియోగదారులపై వేసింది. ఈ ట్రూ అప్ ఛార్జీల జన్మ వృత్తాంతాన్ని ఒకసారి పరిశీలించాలి. 2014 నుంచి 19 మధ్యకాలంలో చంద్ర బాబు ప్రభుత్వం రూ. 3,977 కోట్ల ట్రూ అప్ క్లెయిమ్‌లను పరిష్కరించకుండా వదిలివేసింది. ప్రభుత్వ రంగంలోని జెన్కో ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేసి అధిక ధరలకు ప్రైవేట్ వాళ్ల నుంచి కొనుగోలు చేయించింది. దీంతో విద్యుత్ వ్యయం పెరిగి డిస్కమ్‌ల నడ్డి విరిగినట్లయింది. ఈఆర్సీ నిర్దేశించిన సబ్సిడీని కూడా చంద్ర బాబు ప్రభుత్వం భరించలేదు. ఫలితంగా వర్కింగ్ క్యాపిటల్ కోసం భారీగా రుణాలు తీసుకోవలసి వచ్చింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చేనాటికి డిస్కమ్‌ల అప్పులు 29,703 కోట్లు. ఆయన దిగిపోయే నాటికి 68,596 కోట్లకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వ హామీ లేకుండా తీసుకున్న అప్పులు కూడా మూడు రెట్లు పెరిగాయి. డిస్కమ్‌లు తీవ్ర సంక్షోభంలోకి కూరుకునిపోయాయి. బాబు వాటి పుట్టి ముంచారు. ఇప్పుడు వాటిని గట్టెక్కించడానికి కొంతమేరకు ట్రూఅప్ అవసరమైందని ప్రభుత్వం చెబుతున్నది. చంద్రబాబు ఐదేళ్లపాటు విద్యుత్ చార్జీలు పెంచకుండా, ట్రూఅప్ ఛార్జీలు వేయకుండా మేనేజ్ చేయగలిగారని తెలుగు దేశం పార్టీ వారు చెపుతున్నారు. చంద్రబాబు ఛార్జీలు పెంచ లేదన్నది తప్పు. ఆయన పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో పదమూడుసార్లు ఛార్జీలు పెంచారు. ఇందులో ఎక్కువసార్లు గృహవినియోగంపైనే భారం మోపారు. కొన్ని సార్లు మాత్రమే గృహ వినియోగదారుల జోలికి పోకుండా పారిశ్రామిక – వాణిజ్య వర్గాల ఛార్జీలు పెంచారు. చివరిసారి అధికారంలో ఉన్నప్పుడు ట్రూఅప్ ఛార్జీలు వేయకుండా ఎందుకున్నారనే ప్రశ్నకు ఒక ఆసక్తికరమైన సమాధానం వినబడుతున్నది. చంద్రబాబు తొలి విడత ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల నుంచే విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే ఉద్దేశంతో ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలోనే విద్యుత్ బోర్డు ట్రాన్స్‌కో–జెన్‌కోలుగా ముక్కలైంది. వీటిని పూర్తిగా ప్రైవేటీ కరించే కర్తవ్యాన్ని ఆయన తొమ్మిదేళ్లకాలంలో చేయలేక పోయారు. కానీ ఆ కోర్కె మిగిలే ఉన్నది. వాటిని నిండా మునిగేలా సంక్షోభంలోకి నెట్టివేసి ఆ తర్వాత కారుచౌక బేరంతో ప్రైవేట్‌కు కట్టబెట్టే ఆలోచనతోనే చంద్రబాబు పట్టించుకోకుండా వదిలేశారని వామపక్ష విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు ఫిలాసఫీని అర్థం చేసుకున్న వారికి ఈ వాదనలో నిజమున్నదనే అభిప్రాయం కలుగుతుంది. విద్యుత్ రంగ సంస్కరణల క్రమంలో లక్షలాది రైతు కుటుంబాలను ‘షాక్’కు గురిచేసిన పాలకుడు చంద్రబాబు. అంతంతమాత్రపు వ్యవసాయంలో కరెంటు బిల్లుల కల్లోలం రేపిన రోజులు ఆయన హయాంలోనివే. బషీర్‌బాగ్ రక్తపు మరకల చేతుల్లో జెండాలు పట్టుకొని ఉద్యమాలు చేస్తే జనం హర్షించరు. తెలుగుదేశం పార్టీ ‘నలభయ్యో వార్షికోత్సవాలు’ ఈ వారమే హైదరాబాద్‌లో జరిగాయి. ఎన్టీఆర్ ఆదర్శాల బాటలో పయనిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రకటన ఎటువంటి వ్యాఖ్యానం అవసరం లేని ఒక పెద్ద జోక్. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాల్సిందేనని మరొక్కసారి డిమాండ్ చేశారు. ఆయన మాటల్లోనే చంద్రబాబు రాష్ట్రపతులను ఎంపిక చేసిన వ్యక్తి. ప్రధానులను ఎన్నిక చేయడంలో చక్రం తిప్పిన వాడు. ఒక్క భారతరత్న అవార్డును ఎన్టీఆర్‌కు ఇప్పించలేక పోయాడా అన్న అనుమానం సభికుల్లో పొడసూపకుండా ఉంటుందా? ఈ సభలో చంద్రబాబు చేసిన అతి ముఖ్యమైన రాజకీయ ప్రకటన ఒకటుంది. వచ్చే ఎన్నికల్లో 40 శాతం టిక్కెట్లను యువతకే కేటాయిస్తారట. ఈ ప్రకటన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోకి సరైన అర్థంలోనే వెళ్లింది. 40 శాతం టిక్కెట్లు యువతకు ఇస్తారు. ఇంకో 40 శాతం పొత్తుల పేర్లతో ఇతర పార్టీలకు ఇస్తారు. పాత కాపులకు మిగిలేది 20 శాతం మాత్రమే. ఎన్నికల్లో గెలిచినా, గెలవకపోయినా లోకేశ్‌బాబు నాయకత్వాన్ని వ్యతిరేకించేవారు పార్టీలో ఇరవైశాతం మాత్రమే మిగులుతారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
సాహసోపేత నిర్ణయం
అస్సాం, మేఘాలయ మధ్య సరిహద్దు ప్రాంతాల ఒప్పందం కుదిరిన నాలుగు రోజుల్లోనే ‘ఈశాన్యం’ నుంచి మరో మంచి కబురు వినబడింది. అస్సాం, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో దశాబ్దాలుగా అమల్లో ఉంటున్న సాయుధ దళాల (ప్రత్యేకాధికారాల) చట్టాన్ని చాలా ప్రాంతాల్లో ఉపసంహరించుకుంటున్నారు. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావలసి ఉంది. అస్సాంలో మొత్తం 23 జిల్లాల్లో ఈ చట్టాన్ని పూర్తిగా, ఒక జిల్లాలో పాక్షికంగా ఉపసంహరించు కుంటున్నారు. గత డిసెంబర్లో సైన్యం ఒక వాహనంపై గురిచూసి కాల్పులు జరిపిన ఉదంతంలో 14 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయాక ఈ చట్టం అమలు నిలిపేయాలంటూ ఉద్యమించిన నాగాలాండ్‌లో మూడు జిల్లాల్లో పూర్తిగా, నాలుగు జిల్లాల్లో పాక్షికంగా ఉపసంహరిస్తున్నారు. తరచి చూస్తే ఇక్కడ 25 శాతం ప్రాంతం మాత్రమే ఆ చట్టం నుంచి విముక్తి పొందుతుంది. మణిపూర్‌లో ఆరు జిల్లాల్లో పాక్షికంగా తొలగిస్తున్నారు. కొండ ప్రాంత జిల్లాలన్నీ ఈ చట్టం నీడలోనే ఉంటాయి. బయటినుంచి చూసేవారికి ఒక చట్టం అమలును పూర్తిగానో, పాక్షికంగానో తొలగించడం పెద్ద విశేషంగా అనిపించకపోవచ్చు. కానీ ఆ రాష్ట్రాల పౌరులకు మాత్రం ఇది ఊహకందని అసాధారణ పరిణామం. వారికిది అరవైయ్యేళ్లుగా గుండెల మీది కుంపటి. హక్కుల సంఘాల నేతలు భిన్న సందర్భాల్లో చెప్పినట్టు ఈ చట్టం మృత్యువు పడగనీడ లాంటిది. ఆ పరిధిలో జీవించేవారు ఎవరైనా చిత్రహింసలు అనుభవించాల్సి రావొచ్చు. ఏ పౌరుడి దగ్గరైనా ఆయుధాలున్నాయని లేదా మిలి టెంట్లు తలదాచుకుని ఉండొచ్చని సాయుధ దళాలకు ‘సహేతుక మైన సంశయం’ వస్తే వారెంట్ అవసరం లేకుండానే అరెస్టు చేయొచ్చు. ప్రమాదకర వ్యక్తిగా అనుమానిస్తే కాల్చి చంపొచ్చు. సైన్యా నికి మాత్రమే కాదు... ఆ మాదిరి విధులు నిర్వర్తించే పోలీసులకు సైతం ఈ అధికారాలన్నీ ఉంటాయి. చట్టంలోని సెక్షన్ 3 కింద ఒక ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించిన మరుక్షణం నుంచి ఈ అపరిమిత అధికారాలు దఖలు పడతాయి. అందుకే దీన్ని స్వాతంత్య్రానంతరం తీసు కొచ్చిన అత్యంత కఠినమైన చట్టంగా అభివర్ణిస్తారు. కల్లోలిత ప్రాంతాల్లో నకిలీ ఎన్కౌంటర్లు, మహిళలపై అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయని తరచు ఆరోపణలు రివాజు. ఇదెంతవరకూ వచ్చిందంటే 2004లో మణిపూర్‌లో తంగజం మనోరమ చాను అనే మహిళను అరెస్టుచేసి చంపేశా రని ఆగ్రహించిన మహిళలు సైనికులు బస చేసిన భవనం ముందు వివస్త్రలుగా నిరసనకు దిగారు. ఈ చట్టం రద్దు కోసమే మణిపూర్‌కు చెందిన ఇరోం షర్మిల పదహారేళ్లపాటు నిరాహార దీక్ష చేశారు. సుప్రీంకోర్టులో 2012లో బూటకపు ఎన్కౌంటర్లపై పిటిషన్ దాఖలైన తర్వాతే చట్టం ఎంత కఠినమైనదో దేశమంతటికీ అర్థమైందని చెప్పాలి. 1979 మే మొదలుకొని 2012 వరకూ జరిగిన నకిలీ ఎన్కౌంటర్లలో తమ ఆప్తులు 1,528 మంది బలయ్యారని ఆ పిటిషన్ దాఖలు చేసిన వివిధ కుటుంబాలవారు ఆరోపించారు. వీరంతా మణిపూర్‌కు చెందినవారు. ఇందులో వాస్తవాలు నిర్ధారిం చేందుకు సర్వోన్నత న్యాయస్థానం ఆరు ఉదంతాలను ఎంపికచేసి వాటిపై క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలంటూ ఒక కమిషన్‌ను నియమించింది. ప్రాథమిక సాక్ష్యాధారాలను పరిశీలించాక ఆ ఉదం తాల్లో మరణించినవారు అమాయకులేనని కమిషన్ నిర్ధారించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ సంతోష్ హెగ్డే నేతృత్వంలో మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జేఎం లింగ్డో, మాజీ ఐపీఎస్ అధికారి ఏకే సింగ్ అందులో సభ్యులు. సాయుధ దళాల చట్టంకింద విధులు నిర్వర్తిస్తుం డగా ఇవి చోటుచేసుకున్నాయి గనుక, తమపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లు కొట్టేయాలని 350 మంది జవాన్లు ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శత్రువులని అనుమానం కలిగినంత మాత్రాన, ఆరోపణలొచ్చినంత మాత్రాన పౌరులను కాల్చిచంపడమంటే ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో పడినట్టేనని 2016లో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అధికారంలోకొచ్చాక చట్టాన్ని రద్దుచేస్తామని లేదా సరళీకరిస్తామని చెప్పిన యూపీఏ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసింది. చట్టం రద్దు తక్షణావసరమని కమిషన్ సిఫార్సు చేసింది. అన్ని వర్గాలనుంచీ మద్దతు లభించినా సైన్యం కాదనడంతో యూపీఏ వెనకడుగేసింది. తొలుత 2015లో త్రిపురలో మాణిక్ సర్కార్ నేతృత్వంలోని సీపీఎం ప్రభుత్వం ఈ చట్టం అమలు నిలిపేసి చరిత్ర సృష్టించగా, తాజాగా మూడు రాష్ట్రాల్లో గణనీయమైన ప్రాంతాల్లో చట్టం ఉపసంహరించి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తాము ఉపసంహరించాలనుకుంటున్నా సైన్యం వినడం లేదని యూపీఏ ఏలుబడిలో కేంద్ర హోంమంత్రిగా ఉన్న చిదంబరం సిగ్గు విడిచి చెప్పడం ఎవరూ మరిచిపోరు. సంకల్పశుద్ధి ఉంటే, ఆత్మవిశ్వాసం ఉంటే అన్ని పక్షాలనూ ఒప్పించడం అసాధ్యమేమీ కాదని కేంద్రం నిరూపించింది. చట్టాన్ని పౌరులు గౌరవించాలంటే ఆ చట్టం పౌరులపట్ల బాధ్యతాయుతంగా మెలగాలి. ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు అన్నిచోట్లా ప్రధాన మిలిటెంట్ బృందాల ప్రభావం మునుపటితో పోలిస్తే దాదాపు లేనట్టే. పైగా అవన్నీ కేంద్రంతో భిన్న సందర్భాల్లో శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఒకటి రెండు సంస్థలు ఉనికి చాటుకుంటున్నా వాటికి ప్రజాదరణ లేదు. ఈశాన్యంలో ఇతరచోట్లా, జమ్మూ, కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో సైతం సమీప భవిష్యత్తులో ఈ చట్టం రద్దుకు అనువైన పరిస్థితులు ఏర్పడ తాయనీ, ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటుందనీ ఆశించాలి. -
జవాబుదారీతనం ఏదీ?
నేరగాళ్లను సత్వరం పట్టుకునేందుకు, నేరాలను సమర్థంగా అరికడుతుందని చెబుతూ మొన్న సోమవారం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన నేర శిక్షాస్మృతి(గుర్తింపు) బిల్లుకు సహజం గానే తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఈ బిల్లు రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులను బేఖాతరు చేస్తున్నదని విపక్షాలు ఆరోపించడంతో బిల్లు ప్రవేశానికి ఓటింగ్ నిర్వహించాల్సివచ్చింది. ప్రభుత్వానికి మెజారిటీ ఉంది గనుక బిల్లు సభాప్రవేశం చేసింది. సమాజంలో నేరాలు పెరుగుతూ పోవడం, నేరగాళ్లు తప్పించుకు తిరగడం ఆందోళనకరమే. అందులో సందేహం లేదు. దేశానికి కొత్త కొత్త రూపాల్లో సవాళ్లు ఎదురవుతున్నప్పుడు కఠిన చట్టాలు అవసరమే కావొచ్చు. కానీ తగిన చట్టాలు లేకనే పరిస్థితులు దిగజారుతున్నాయని ఎవరైనా భావిస్తే పొరపాటు. దర్యాప్తు విభాగాల పని తీరు నాసిరకంగా ఉండటం, ఆ విభాగాలపై రాజకీయ పరమైన ఒత్తిళ్లుండటం అందుకు కారణాలు. మరోపక్క చట్టాల ప్రకటిత లక్ష్యాలను గాలికొదిలి ప్రభుత్వాలు వాటిని దుర్వినియోగం చేసిన సందర్భాలు కోకొల్లలు. నేర పరిశోధనలో ఆధునిక సాంకేతికతలను వినియోగించుకోవడానికి, సత్వరం నేరాల గుట్టు వెలికితీయడానికి తాజా బిల్లులో నిబంధనలు రూపొందించామని ప్రభుత్వం అంటోంది. ఇప్పటికే అమల్లో ఉన్న 1920 నాటి ఖైదీల గుర్తింపు చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ఈ బిల్లు ప్రవేశపెట్టారు. అయితే నేరాలను అరికట్టేందుకు తీసుకొచ్చే బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు చట్టసభల్లో ప్రభుత్వాలు చేసే గంభీరమైన ఉపన్యాసాలకూ, ఆ బిల్లుల్లో పొందుపరిచే వాస్తవాంశాలకూ తరచుగా సంబంధం ఉండదు. చట్టాలు దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నా మని ప్రతిసారీ ప్రభుత్వాలు చెబుతాయి. ఈ విషయంలో ఈ దేశ పౌరులకు కావలసినంత అనుభవం ఉంది. ఇందిరాగాంధీ హయాంలో 1980లో వచ్చిన జాతీయ భద్రతా చట్టం(నాసా), 1985లో రాజీవ్‌గాంధీ హయాంలో తెచ్చిన ఉగ్రవాద, విచ్ఛిన్నకర కార్యకలాపాల నిరోధక చట్టం(టాడా), 2002లో వాజపేయి హయాంలో ఎన్డీఏ సర్కారు తీసుకొచ్చిన ఉగ్రవాద నిరోధక చట్టం(పోటా) ఇందుకు ఉదాహరణలు. టాడా దుర్వినియోగంపై తీవ్ర ఆరోపణలు రావడంతో దాన్ని పునరుద్ధరించరాదని 1995లో అప్పటి పీవీ ప్రభుత్వం నిర్ణయించింది. 2004లో యూపీఏ సర్కారు పోటా చట్టాన్ని రద్దు చేసింది. వీటిన్నిటికన్నా ముందే 1967లో ఇందిర ప్రభుత్వం తీసు కొచ్చిన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) 2012లో మన్మోహన్సింగ్ ప్రభుత్వం, ఆ తర్వాత 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన సవరణలతో మరింత పదును తేలి ప్రస్తుతం అమలవుతోంది. ఈ చట్టాలన్నీ నేరగాళ్లని భావించినవారిని దీర్ఘకాలం జైళ్లలో ఉంచేందుకు తోడ్పడ్డాయి. వేలాదిమంది అమాయకులు జైళ్ల పాలయ్యారని విమర్శలు వెల్లువెత్తగా, కఠినశిక్షల మాట అటుంచి అత్యధిక కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. రాజకీయ అసమ్మతిని అణచి వేసేందుకూ, ప్రజలను భయపెట్టేందుకూ ప్రభుత్వాలు ఈ చట్టాలు తెస్తున్నాయని బిల్లులపై చర్చ జరిగినప్పుడల్లా విపక్షాలు విమర్శించేవి. 1967లో యూఏపీఏపై వాజపేయి విమర్శ ఇక్కడ ప్రస్తావనార్హం. దేశ ప్రజల్లో నమ్మకం కోల్పోయిన గుప్పెడుమంది ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారని ఆయన విమర్శించారు. భీమా కోరెగావ్ కేసులో అదే చట్టంకింద అరెస్టయి మూడేళ్లుగా జైళ్లలో మగ్గు తున్న మేధావులు, రచయితల పరిస్థితి చూస్తే చట్టాల అమలు ఎలా ఉంటున్నదో అర్థమవుతుంది. నేర శిక్షాస్మృతి బిల్లు చట్టమైతే శిక్షపడిన ఖైదీలనుంచి మాత్రమేకాక అరెస్టయినవారి నుంచి, ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నవారి నుంచి, ‘ఇతరుల నుంచి’ భౌతిక, జీవసంబంధ నమూ నాలు సేకరించవచ్చు. ‘ఇతరుల’ కింద ఎవరినైనా చేర్చవచ్చు. అంటే లాకప్‌లోకి వెళ్లాల్సివచ్చిన ప్రతి ఒక్కరి నుంచీ నమూనాలు సేకరించే అధికారం ప్రభుత్వాలకు దఖలు పడుతుంది. ఈ ‘నమూనాల’ పరిధిలోకొచ్చేవి ఏమిటన్న వివరణ లేదు. ప్రస్తుత చట్టంలో వేలి ముద్రలు, కాలి ముద్రలు మాత్రమే తీసుకోవచ్చు. ఆ నిబంధన కూడా శిక్ష పడినవారికే వర్తిస్తుంది. జీవసంబంధ నమూనాలంటే రక్తం, జుట్టు, డీఎన్ఏ, ఐరిస్ వగైరాలు ఏమైనా ఉండొచ్చు. పైగా ఈ సేకరణకు ప్రస్తుతం మేజిస్ట్రేట్ అనుమతి అవసరం అవుతుండగా... తాజా బిల్లు చట్టమైతే రాష్ట్ర ప్రభుత్వాధి కారి అనుమతి సరిపోతుంది. ఏం సేకరించాలో హెడ్ కానిస్టేబుల్ స్థాయి అధికారి నిర్ణయిస్తారు. సేకరణను ప్రతిఘటిస్తే మూడునెలల జైలుశిక్షను ప్రతిపాదించారు. న్యాయవ్యవస్థ అదుపూ, అజ మాయిషీ ఉన్న చట్టాలే దుర్వినియోగమవుతున్న ఉదంతాలు కోకొల్లలుగా కనబడుతుండగా... ఆమాత్రం రక్షణ కూడా లేని చట్టాలు చివరకు ఎటు దారితీస్తాయో సులభంగా గ్రహించవచ్చు. పైగా సేకరించిన నమూనాలు దుర్వినియోగం కావన్న గ్యారెంటీ ఏమీ లేదు. అసలు మైనర్ల నుంచి ఇలా సేకరించవచ్చునా అన్న వివరణ లేదు. మన దేశంలో డేటా పరిరక్షణ గాల్లో దీపంగా ఉన్న వర్త మానంలో సేకరించిన నమూనాలు దారి తప్పితే? జవాబుదారీతనం నిర్ణయించకుండా, బాధ్యులకు శిక్షేమిటో చెప్పకుండా వదిలేస్తే పౌరుల గోప్యత ఏం కావాలి? వారికి లభించే ఉపశమన మేమిటి? నేరాలను అరికట్టాల్సిందే. సమాజంలో అశాంతి సృష్టించే శక్తుల ఆటకట్టాల్సిందే. కానీ ఆ పేరు మీద తీసుకొచ్చే చట్టాల్లో స్పష్టత లోపిస్తే, ప్రభుత్వాలకు జవాబుదారీతనం లేకుంటే అది అంతిమంగా నియంతృత్వానికి దారితీస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు శరాఘాతమవుతుంది. -
ప్రమాదకర పోకడలు
ఇది భగత్ సింగ్ బలిదానం చేసిన మాసం. తమకు కంటి నిండా కునుకు లేకుండా చేసినందుకు కక్ష బూని 23 ఏళ్ల చిరుప్రాయంలోనే ఈ వీరుణ్ణి పరాయి పాలకులు చిదిమేశారు. మరణశిక్ష కోసం ఎదురుచూస్తూ జైల్లో గడిపినప్పుడు దేశంలో సాగుతున్న మత ఘర్షణల సంగతి విని ఆయన ఎంతో ఆవేదనతో చెప్పిన మాటలు ఇప్పటికీ అందరూ స్మరించుకోదగ్గవి. ‘వర్తమాన స్థితిగతులను చూస్తుంటే ఈ దేశం ఏమైపోతుందోనన్న ఆవేదన కలుగుతోంది. నా కళ్ల వెంట రక్తాశ్రువులు స్రవిస్తున్నాయి’ అని ఆయన అన్నాడు. మన ఇల్లు, మన చదువు మనకు వివేకం నేర్పించలేనప్పుడు కనీసం భగత్ సింగ్ వంటి నిష్కళంక దేశభక్తుల పలుకులైనా స్ఫురణకు రావాలి. కానీ ఇతరత్రా రోజుల మాట అటుంచి ఆయన బలిదానం చేసిన మాసంలోనైనా కొందరికి యుక్తాయుక్త విచక్షణ ఉండటం లేదని కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. కర్ణాటకలో ఆలయ పరిసరాల్లో అన్య మతస్తుల దుకాణాలుండటానికి వీల్లేదని హిందూత్వ సంఘాలు వీరంగం వేస్తుంటే... కేరళలో ఒక దేవస్థానం బోర్డు హైందవేతర మహిళన్న కారణంతో ఒక భరతనాట్య కళాకారిణి ప్రదర్శనను అడ్డుకుంది. దుకాణదారులను మతం ప్రాతిపదికన దూరంపెట్టే పోకడల్లో తాము జోక్యం చేసుకోలేమని సాక్షాత్తూ ప్రభుత్వమే కర్ణాటక అసెంబ్లీలో భగత్‌సింగ్ వర్ధంతి రోజున ప్రకటించింది. ఆ మర్నాటినుంచి హిందూత్వ సంస్థలు మరింతగా రెచ్చిపోయాయి. దక్షిణ కన్నడ జిల్లాలో మొదలైన ఈ తంతు రాష్ట్రమంతా విస్తరిస్తోంది. కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సర్కారుంది. అక్షరాస్యతలో ఆ రాష్ట్రం అగ్రభాగాన ఉంది. కానీ మత వివక్ష మాత్రం అక్కడ రాజ్య మేలుతోంది! ఈ దేశ చరిత్ర తిరగేస్తే తమ తమ మత విశ్వాసాలు ఏమైనప్పటికీ సాధారణ పౌరు లంతా సామరస్యంతో, సుహృద్భావంతో మెలగడం కనబడుతుంది. ఒకరి పండుగల్లో మరొకరు పాల్గొనడం, ఊరేగింపులు, ఉత్సవాల్లో భాగస్తులు కావడం దర్శనమిస్తుంది. ఈ ఆచరణలో నుంచే మన రాజ్యాంగంలోని సెక్యులర్ భావనలు మొగ్గతొడిగాయి. రాజ్యాంగ నిర్ణాయక సభలోని సభ్యుల్లో అత్యధికులు అన్ని ఒత్తిళ్లనూ అధిగమించి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు ప్రాతిపదికగా ఈ రాజ్యాంగాన్ని రూపొందించారు. కానీ రాజకీయ పక్షాల నాయకులు, పాలకుల్లో కొందరు దీనికి తూట్లు పొడిచే దురాలోచన చేస్తున్నారు. అన్య మతస్తులపై లేనిపోని నిందలు మోపి, పరమత విద్వేషాలను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను విడదీసి తమ అధికారం శాశ్వతం చేసుకోవాలని కలగంటున్నారు. ఇది ఆందోళన కలిగించే పరిణామం. కర్ణాటకలో హిజాబ్ వివాదం రేపి నెల్నాళ్లు దాటింది. ఆ వివాదం పర్యవసానంగా వేలాదిమంది ముస్లిం బాలికల చదువులు ఆగిపోయాయి. వార్షిక పరీక్షలు రాద్దామనుకునే సమయానికి ఈ అనవసర వివాదాన్ని సృష్టించడం వల్ల వారికి ఏడాది చదువూ వృధా అయింది. తమ చర్యలు బేటీ పఢావో, బేటీ బచావో స్ఫూర్తికి విరుద్ధమైనవని కూడా అక్కడి పాలకులకు తోచలేదు. ఆ వివాదం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఇప్పుడు చిరు వ్యాపారులను మత ప్రాతిపదికన వేరు చేసి కొందరికి అవకాశాలు నిరాకరిస్తున్నారు. కర్ణాటకలో మార్చి మొదలుకొని మే నెల వరకూ వివిధ ఆలయాల్లో జాతరలు జరుగుతాయి. ఇందులో వేలాదిమంది భక్తులు పాల్గొంటారు. అలాంటి సమ యాల్లో వివిధ రకాల వస్తువులు అమ్మి లాభపడదామని ఎవరైనా ఆశిస్తారు. కానీ చాలా ఆలయాలు ముస్లిం దుకాణదారులకు డిపాజిట్లు వెనక్కిస్తున్నాయి. హిందూత్వ సంస్థల ఒత్తిళ్లతో ఇలా చేయక తప్పడం లేదని ఆలయ నిర్వాహకులు తమకు చెబుతున్నారని ముస్లింలు అంటుండగా, వారు స్వచ్ఛందంగా డిపాజిట్లు వెనక్కి తీసుకుంటున్నారని ఆలయాల బాధ్యులు చెబుతున్నారు. ఇలాంటి భయానక వాతావరణానికి దోహదపడినందుకు కాస్తయినా సిగ్గుపడాలన్న ఇంగిత జ్ఞానం పాలకు లకు లేదు. ఈ మతిమాలిన ఆలోచనలపై సొంత పార్టీలోనే అసమ్మతి స్వరాలు వినబడటం బీజేపీలో కనిపిస్తున్న సరికొత్త పోకడ. ముస్లిం దుకాణదారులపై నిషేధం విధించడం పిచ్చితనమని పార్టీ సీనియర్ నాయకుడు హెచ్ విశ్వనాథ్, పార్టీ శాసనసభ్యుడు అనిల్ బెనకే విమర్శించారు. దేశంలో ఇంకా ప్రజాస్వామ్య స్ఫూర్తి అంతో ఇంతో మిగిలి ఉన్నదని ఇలాంటి స్వరాలు భరోసా ఇస్తాయి. మన దేశ పౌరులు కోట్లాదిమంది తమ మత విశ్వాసాలు ఏమైనప్పటికీ ప్రపంచ దేశాల్లో స్వేచ్ఛగా వ్యాపార వ్యవహారాలు సాగిస్తున్నారు. చదువులు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారు. అసంబద్ధ ఆలోచనలు చేసేవారికి ఈ వాస్తవాలు కూడా అర్థమ వుతున్నట్టు లేదు. కేరళలో భరతనాట్య కళాకారిణి మాన్సియా జన్మతహా ముస్లిం. భరతనాట్యంలో మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ చేసిన మాన్సియా ఆ విశ్వవిద్యాలయానికే టాపర్‌గా నిలిచారు. ఆమె, ఆమె సోదరి భరతనాట్యాన్ని అభ్యసించడం ద్వారా మత విరుద్ధమైన పోకడలు పోతున్నారని ముస్లిం మత పెద్దలు ఆగ్రహించి చాన్నాళ్ల క్రితమే ఆ కుటుంబాన్ని వెలివేశారు. ఇన్నాళ్లకు హిందూ ఛాందసులు కూడా అదే బాటలో ఆమెకు అవకాశాన్ని నిరాకరించారు. తాను హిందువును పెళ్లాడిన వైనాన్నీ,ప్రస్తుతం హేతువాదిగా ఉంటున్న వాస్తవాన్నీ చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ‘మతములన్నియు మాసిపోవును.. జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును’ అన్నాడు మహా కవి గురజాడ. కానీ కాలం గడుస్తున్నకొద్దీ మన అజ్ఞానం ఊడలు వేస్తున్న ధోరణులు కనబడు తున్నాయి. ఇది ప్రమాదకరం. -
‘ఈశాన్యం’లో సామరస్యం
సరిహద్దుల విషయంలో తరచు సంఘర్షించుకుంటున్న ఈశాన్య రాష్ట్రాలన్నిటికీ ఆదర్శంగా అస్సాం, మేఘాలయ మంగళవారం ఒక ఒప్పందానికొచ్చాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వా శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా మంగళవారం ఈ ఒప్పందంపై సంతకాలు చేయడం ద్వారా అర్ధ శతాబ్దిగా ఇరు రాష్ట్రాల మధ్యా సాగుతున్న సుదీర్ఘ వివాదానికి తెరదించారు. రాష్ట్రాల మధ్య సరిహద్దులపై వివాదా లుండటం ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన సమస్య కాదు. కానీ ఈశాన్య రాష్ట్రాల్లో అవి తరచు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఏళ్ల తరబడి సహాయ శిబిరాల్లో సాధారణ పౌరులు తలదాచు కోవడం అక్కడ కనబడుతుంది. అస్సాం–నాగాలాండ్ మధ్య 2014 ఆగస్టులో దాదాపు పక్షం రోజులపాటు ఘర్షణలు చెలరేగి 14 మంది చనిపోగా, అనేకమంది ఆచూకీ లేకుండా పోయారు. గృహదహనాలు సైతం చోటుచేసుకున్నాయి. 1985లో అయితే ఆ రెండు రాష్ట్రాల పోలీసులూ పరస్పరం కాల్పులు జరుపుకోవడంతో వందమంది వరకూ మరణించారు. ఉద్రిక్తతలున్నప్పుడు సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంప్రదింపులు జరుపుకోవడం, పరిస్థితులు అదుపు తప్ప కుండా చూడటంలాంటివి చేయకపోవడం వల్ల సమస్యలు మరింత జటిలమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అస్సాం, మేఘాలయ ఒక అవగాహనకు రావడం హర్షించదగ్గ పరిణామం. అస్సాం నుంచి కొన్ని ఇతర రాష్ట్రాల మాదిరే మేఘాలయ కూడా 1972లో విడివడి కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. రెండింటిమధ్యా 885 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అయితే అప్పర్ తారాబరి, గజంగ్ రిజర్వ్ ఫారెస్టు, బోక్లాపారా, లాంగ్‌పీ, నాంగ్వా తదితర 12 ప్రాంతాల్లో నిర్ణ యించిన సరిహద్దులు వివాదాస్పదమయ్యాయి. తమకు న్యాయబద్ధంగా చెందాల్సిన ప్రాంతాలను అస్సాంలోనే ఉంచారన్నది మేఘాలయ ఆరోపణ. ఈ కారణంగానే అది అస్సాం పునర్విభజన చట్టం 1972ని సవాల్ చేస్తూ న్యాయస్థానానికి ఎక్కింది. అటు అస్సాం సైతం మేఘాలయ కోరు తున్న స్థానాలు బ్రిటిష్ కాలంనుంచే తమ ప్రాంత అధీనంలో ఉండేవని వాదిస్తూ వస్తోంది. అస్సాంకు కేవలం మేఘాలయతో మాత్రమే కాదు... నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం లతో కూడా సరిహద్దు వివాదాలున్నాయి. ఆ వివాదాలు అనేకసార్లు హింసకు దారితీశాయి. ఇంత క్రితం ఈశాన్య రాష్ట్రాలను ఏలే ముఖ్యమంత్రుల్లో చాలామంది కాంగ్రెస్ వారే అయినా, కేంద్రంలో ఆ పార్టీ నేతృత్వంలోనే చాన్నాళ్లు కేంద్ర ప్రభుత్వాలు కొనసాగినా వివాదాల పరిష్కారానికి అవి ఏమాత్రం తోడ్పడలేదు. పరిస్థితులు అదుపు తప్పినప్పుడు ఉద్రిక్త ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగా లను దించడం, ఉద్యమించే పౌరులపై అణచివేత చర్యలు ప్రయోగించడం మినహా చేసిందేమీ లేదు. అందువల్లే గత యాభైయ్యేళ్లుగా సరిహద్దు సమస్యలు సజీవంగా ఉంటున్నాయి. చొరవ, పట్టుదల, చిత్తశుద్ధి, ఓపిక ఉండాలేగానీ పరిష్కారం కాని సమస్యలంటూ ఉండవు. ఎక్కడో ఒకచోట ప్రారంభిస్తే వివాదాలపై అన్ని పక్షాలకూ అవగాహన ఏర్పడుతుంది. ఇచ్చిపుచ్చు కునే విశాల దృక్ప థాన్ని ప్రదర్శిస్తే, స్వరాష్ట్రంలో ఆందోళన చెందుతున్నవారిని ఒప్పించగలిగితే సమస్యలు పటాపంచ లవుతాయి. కానీ ఆ చొరవేది? ఈశాన్య రాష్ట్రాలు భౌగోళికంగా చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ వంటి దేశాలతో సరిహద్దులను పంచుకుంటాయి. మిలిటెంట్ సంస్థలు ఆ దేశాల సరిహద్దుల వద్ద ఆశ్రయం పొందుతూ ఈశాన్య రాష్ట్రాల్లో తరచూ దాడులకు దిగడం రివాజు. ప్రభుత్వాలు తమ సమ యాన్నంతా శాంతిభద్రతలకే వెచ్చించే పరిస్థితులుండటం మంచిది కాదు. అందుకే ఆలస్యంగానైనా అస్సాం, మేఘాలయ రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదరడం సంతోషించదగ్గది. అయితే ఇప్పుడు కుదిరిన ఒప్పందంతోనే అస్సాం, మేఘాలయ మధ్య ఉన్న వివాదాలన్నీ సమసిపోతాయని భావించలేం. మొత్తం 12 అంశాలకు సంబంధించి వివాదాలుంటే ఇప్పుడు ఆరింటి విషయంలో ఒప్పందం కుదిరింది. రాజీ కుదిరిన ప్రాంతాలు మొత్తం సరిహద్దులో 70 శాతం. మిగిలిన 30 శాతంలో 36 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఉంది. అయితే ఈ విషయమై అస్సాంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించినప్పుడు దాదాపు అన్ని పార్టీలూ ప్రభుత్వ ముసా యిదాపై వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ‘ఇచ్చిపుచ్చుకునే’ పేరుతో మేఘాలయకు ఉదారంగా ఇస్తున్నదే ఎక్కువనీ, ఆ రాష్ట్రం మాత్రం బెట్టు చేస్తున్నదనీ ఆ పార్టీలు విమర్శించాయి. అయితే అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు ఒకటి గుర్తుంచుకోవాలి. సమస్యను నాన్చుతూ పోవడం వల్ల అవి మరింత జటిలమవుతాయి. ఏళ్లు గడిచేకొద్దీ కొరకరాని కొయ్యలుగా మారతాయి. ఒకపక్క బ్రహ్మపుత్ర నది ఏటా ఉగ్రరూపం దాలుస్తూ జనావాసాలను ముంచెత్తుతుంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈనాటికీ మౌలిక సదుపాయాలు అంతంతమాత్రమే. అక్కడ తగినన్ని పరిశ్రమలు లేవు. యువకులకు ఉపాధి అవకాశాలు కూడా తక్కువ. ఆ ప్రాంత అభివృద్ధికంటూ చేసే వ్యయంలో సామాన్యులకు దక్కేది స్వల్పమే. ఈ పరిస్థితులు ఎల్లకాలం ఇలాగే ఉండటం మంచిది కాదు. ఇప్పుడు కుదిరిన ఒప్పందం ఎలాంటి అడ్డంకులూ లేకుండా సవ్యంగా సాగిపోవాలనీ, ఇతర అంశాలపై కూడా సాధ్యమైనంత త్వరగా రెండు రాష్ట్రాలూ అంగీకారానికి రావాలనీ ఆశించాలి. నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరం సైతం సరిహద్దు వివాదాల పరిష్కారానికి ఇదే మార్గంలో కృషి చేస్తే ఈశాన్యం ప్రశాంతంగా మనుగడ సాగించగలదు. -
చైనా నేర్వాల్సిన పాఠం
భారత్–చైనాల మధ్య వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఏర్పడిన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతుండగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ శుక్రవారం మన దేశం వచ్చారు. అయితే ఎప్పుడూ ఉండే హడావుడి ఈ సారి కనబడకపోవడం, ప్రభుత్వం సైతం ఆయన రాకకు పెద్దగా ప్రాధాన్యతనివ్వకపోవడం గమనించదగ్గ పరిణామం. సాధారణంగా ఇలాంటి పర్యటనలకు వారం పదిరోజుల ముందునుంచే మీడియాలో కథనాలు వెలువడతాయి. ఇరుదేశాల మధ్యా రెండున్నరేళ్లుగా ఉద్రిక్తతలు ఉన్నందువల్ల చర్చల ఫలితాలపై అందరిలో ఆసక్తి ఏర్పడు తుంది. ఈమధ్యే భారత్–చైనాల మధ్య సైనికాధికారుల స్థాయిలో సంప్రదింపులు జరిగినా ఎలాంటి పురోగతీ లేదు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర అనంతర పరిణామాల విషయంలో యాదృచ్ఛికం గానే కావొచ్చు.. మన దేశమూ, చైనా దాదాపు ఒకే రకమైన అడుగులు వేశాయి. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంతోపాటు భద్రతామండలి, ఇతర అంతర్జాతీయ సంస్థల్లో రష్యాను అభిశంసించే తీర్మానాలపై జరిగిన ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. మన దేశమైతే ‘ఉక్రెయిన్ పౌరుల తరలింపు, వారికి అందాల్సిన మానవతా సాయం’పై భద్రతా మండలిలో రష్యా ప్రతిపాదించిన తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు కూడా దూరంగా ఉంది. భారత్ – చైనాల ఆచరణలోని సామ్యాన్ని గమనించి ఇరు దేశాలూ భవిష్యత్తులో దగ్గర కావొచ్చని కొందరు భావించారు. అయితే మన నిర్ణయాలకు స్వీయ ప్రయోజనాలే గీటురాయి. రష్యాతో ఉన్న దౌత్య సంబంధాలు, ఇంధనం, రక్షణ తదితర అంశాల్లో ఆ దేశం అందిస్తున్న సహాయ సహకారాలు మన నిర్ణయాలను ప్రభావితం చేశాయి. చైనా తీరు వేరు. చైనా, రష్యాలు రెండూ గత కొన్నేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాయి. ఇక ఉక్రెయిన్‌లో రష్యా పెట్టిన కుంపటి వెనక చైనా పాత్ర ఉన్నదన్న సంశయం చాలామందిలో ఉండనే ఉంది. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో 2020 ఏప్రిల్‌లో అయిదు చోట్ల చైనా దళాలు ఎల్ఏసీని అతిక్రమిం చడం మనకు ఊహించని పరిణామం. అక్కడ గస్తీ తిరుగుతున్న మన జవాన్లపై అకారణంగా దాడి చేయడం, 21 మంది ప్రాణాలు తీయడం విషాదకర ఘటన. సరిహద్దు సమస్యలున్నా మూడు దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్యా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ సుహృద్భావ వాతా వరణాన్ని ఉన్నట్టుండి దెబ్బతీసింది చైనాయే. వాస్తవానికి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించు కునే ప్రయత్నం చేస్తూనే.. వాణిజ్య రంగంలో సహకరించుకుందామని, ఆర్థికంగా లాభపడదామని చైనా కోరినప్పుడు మన దేశం హృదయపూర్వకంగా స్వాగతించింది. రెండు దేశాల మధ్యా ఎన్నో ఒప్పందాలు కుదిరాయి. సహజంగానే వీటివల్ల అత్యధికంగా లాభపడింది ఆ దేశమే. సరిహద్దు ఘర్షణల తర్వాత ఆ దేశం సరుకులు బహిష్కరించాలన్న పిలుపులు వినబడినా, మన ప్రభుత్వం చైనా యాప్‌లు కొన్నింటిని నిషేధించినా 2020–21 మధ్య ఎగుమతులు, దిగుమతుల్లో వృద్ధి నమోదైంది. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చైనా సరుకులపై అధిక సుంకాలు వేసినా దిగుమతులపై దాని ప్రభావం పెద్దగా పడలేదు. అంతక్రితం మన దేశం నుంచి చైనాకు 5.3 శాతంగా ఉన్న ఎగుమతులు 2020–21 మధ్య 7.3 శాతానికి ఎగబాకగా.. మన దిగుమతుల్లో చైనా వాటా అంతక్రితం కన్నా 3 శాతం పెరిగి 16.6 శాతానికి చేరింది. చైనాలో పరిశ్రమల సంఖ్య ఎక్కువ. పైగా కరోనా మహమ్మారి విసిరిన పంజాతో ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల లాక్డౌన్లు అమలై తయారీ రంగ పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. కరోనా నుంచి అందరికన్నా ముందు తేరుకున్న చైనా యధాప్రకారం ఉత్పాదక రంగాన్ని పరుగులెత్తించింది. కనుక మన దేశం కూడా దానిపై ఆధారపడక తప్పలేదు. ఎల్ఏసీ వివాదం అనంతరం ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయ్యాక నిరుడు ఫిబ్రవరిలో గాల్వాన్, ప్యాంగాంగ్ సో, స్పంగూర్ సో ప్రాంతాల నుంచి ఇరు దేశాల సైన్యాలు వెనక్కి తగ్గాయి. ఆ ప్రాంతాల్లో గస్తీ తిరొగద్దని నిర్ణయిం చాయి. సైనికాధికారుల మధ్య అనంతర కాలంలో జరిగిన చర్చలు మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా లేవు. పైగా కుదిరిన అవగాహనకు భిన్నంగా డెస్పాంగ్‌లో 900 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా తన అధీనంలోకి తీసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ తర్వాత అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవచ్చని చైనా ఆశిస్తున్నట్టు కనబడుతోంది. భారత్‌తో మళ్లీ ‘సాధారణ సంబంధాలు’ పునరుద్ధరించుకోవాలని తహతహలాడుతోంది. అయితే అదంతా గతం. సరిహద్దుల స్థితిగతులే దేశాల మధ్య స్నేహ సంబంధాలను నిగ్గు తేలుస్తాయని జైశంకర్ ఆమధ్య తేల్చి చెప్పారు. వచ్చే జూన్‌లో చైనాలో బ్రిక్స్ దేశాల సదస్సు, ఆ తర్వాత భారత్, రష్యా, చైనాల శిఖరాగ్ర సదస్సు జరగాల్సి ఉంది. ఈ రెండింటిలో మన దేశం పాల్గొనడం అంతర్జాతీయంగా రష్యా, చైనాలకు ఎంతో అవసరం. వాటిల్లో పాల్గొనవద్దని అమెరికా, పాశ్చాత్య దేశాలు ఎటూ మన దేశంపై ఒత్తిళ్లు తీసుకొస్తాయి. ఆ అంశంలో అంతిమంగా మన నిర్ణయం ఏమిటన్న సంగతలా ఉంచి, ముందుగా ఎల్ఏసీలో చైనా దుందుడుకు పోకడలు విడనాడవలసి ఉంటుంది. వాంగ్ యీ ఈ విషయంలో ఏం హామీ ఇచ్చారో, ఎలాంటి ప్రతిపాదన తెచ్చారో చూడాల్సి ఉంది. అది త్వరలో జరిగే తదుపరి సైనికాధికారుల స్థాయి సమావేశంలో ప్రతిఫలిస్తుంది. ఒకసారంటూ సుహృద్భావ సంబంధాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తే వాటిని పునరుద్ధరించడం అంత సులభం కాదని చైనా గుర్తించకతప్పదు. -
బెంగాల్‌పై నెత్తుటి మరక
పశ్చిమబెంగాల్లో మరోసారి రక్త చరిత్ర పునరావృతమైంది. ఈనెల 21 రాత్రి అక్కడి బీర్భూమ్ జిల్లాలోని రామ్‌పూర్‌హట్‌లో సాయుధులైన వందమంది దుండగులు చెలరేగి, ఇళ్లకు నిప్పంటించి ఎనిమిది నిండు ప్రాణాలు బలిగొన్నారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రాణాలతో ఉన్నవారు బతుకు జీవుడా అనుకుంటూ ఆ గ్రామం వదిలిపోయారు. దారుణాతి దారుణ హింస పశ్చిమ బెంగాల్‌కు కొత్తగాదు. ఎవరు అధికారంలో ఉన్నా ఇది తప్పడం లేదు. అక్కడ పార్టీల్లో ఏర్పడే అంతర్గత కలహాలు, పార్టీల మధ్య రాజుకునే ఆధిపత్య సమరాలు తరచూ హింసకు దారితీస్తున్నాయి. ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. నాటు బాంబుల వాడకం రివాజైంది. ముఖ్యంగా బీర్భూమ్ జిల్లా అందుకు పెట్టింది పేరు. గ్రామంపై దుండగులు విరుచుకుపడ్డారన్న భయాందోళనలతో ఇళ్లలో తలదాచుకున్నవారిని బయటకు లాగి గొడ్డళ్లతో తీవ్రంగా గాయపరిచి, ఆ తర్వాత వారిని లోపలికి నెట్టి, ఆ ఇళ్లకు నిప్పంటించారని వస్తున్న కథనాలు వింటే ఒళ్లు గగుర్పొడు స్తుంది. అసలు అక్కడ అధికార యంత్రాంగం సక్రమంగా పనిచేస్తోందా... శాంతిభద్రతల పరిరక్షణ తన ప్రాథమిక కర్తవ్యమన్న సంగతి దానికి గుర్తుందా అన్న సంశయం కలుగుతుంది. హోంశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న తృణమూల్ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ గ్రామానికి వెళ్లారు. బాధిత కుటుంబాలతో మాట్లాడాక ఆమె ఆదేశించడంతో స్థానిక తృణమూల్ నాయకుడు అనారుల్ హుస్సేన్‌ను అదుపులోనికి తీసుకున్నారు. మారణకాండ సంగతి తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్న కారణంతో ప్రస్తుతానికి అతన్ని అదుపులోనికి తీసుకున్నారు. దీనికి సూత్ర ధారి కూడా అతగాడేనా అన్నది మున్ముందు తేలాల్సి ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం తాపీ పనిచేసుకుని బతుకీడ్చిన హుస్సేన్ ఇప్పుడు ఖరీదైన మోటార్ బైక్‌లు, కార్లు, ఐఫోన్లతో... కళ్లు చెదిరే రెండంతస్తుల భవంతితో దర్జాగా ఉన్నాడంటే ఆ ప్రాంతంలో ఇన్నాళ్లుగా ఏం జరుగుతున్నదో ఊహించడం కష్టమేమీ కాదు. తృణమూల్ అంతర్గత కలహాల పర్యవసానంగా అంతకుముందు రోజు ఒక నాయకుడు హత్యకు గురికాగా, అందుకు ప్రతీకారంగా ఈ మారణకాండ జరిగింది. హత్య సంగతి తెలిసినా ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉన్నదన్న ఆలోచన పోలీసులకు కలగలేదు. పైగా రాత్రి 9.35కు ఈ రాక్షసకాండ సంగతి తెలిస్తే పది గంటల ప్రాంతంలోగానీ పోలీసులు అక్కడికి చేరుకోలేదు. పోలీస్ స్టేషన్ అక్కడికి కేవలం కిలోమీటర్ దూరంలో ఉంది. అంతేకాదు... స్వయంగా మమతా బెనర్జీ ఆదేశించేవరకూ ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోనికి తీసుకోలేదంటే వారి నిర్వాకమేమిటో అర్థమవుతుంది. జనరంజక విధానాలతో, మెరుగైన హామీలతో ప్రజల మనసులు గెల్చుకుని అధికారంలోకి రావాలని విపక్షాలు ఆలోచించడం లేదు. ప్రజానుకూల విధానాలు, సంక్షేమ, అభివృద్ధి పథకాలతో మాత్రమే తిరిగి గద్దెనెక్కడం సాధ్యమవుతుందని పాలకులు ఆలోచించడం లేదు. నయానో భయానో ప్రజల్ని గుప్పెట్లో పెట్టుకునే స్థానిక పెత్తందార్ల అండతో గెలుపు శాశ్వతం చేసుకోవచ్చు నని భావించే ధోరణులు పుట్టుకొస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో అదే సమస్య. ఇంతక్రితం పాలించినవారితో విసుగెత్తి తృణమూల్‌ను గెలిపిస్తే గొర్రెలు తినేవాడు పోయి బర్రెలు మింగేవాడు వచ్చిన తీరుగా అక్కడ పల్లెల్లో కొత్త పెత్తందార్ల హవా మొదలైంది. తమకెదురు తిరిగినవారిని నక్సలైట్ల పేరుమీదనో, మరే ఇతర పార్టీ పేరుమీదనో కేసుల్లో ఇరికించడం సర్వసాధారణంగా మారింది. స్థానికంగా దొరికే వనరులను దోచుకుంటున్న క్రమంలో పంపకాల్లో తేడా రావడం వల్లనో, ఆ దోపిడీని ప్రశ్నించడం వల్లనో కక్షలు బయల్దేరుతున్నాయి. అధికారంలో ఉన్నవారికి ఆగ్రహం కలుగుతుందన్న కారణంతో పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. గతంలో లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉన్నప్పుడు సరిగ్గా ఇదే తరహాలో ఆధిపత్య పోరు నడిచేది. అది తరచూ హింసాకాండకు దారితీసేది. దీన్నంతటినీ సమూలంగా మారుస్తానని, పల్లెసీమలు ప్రశాంతంగా మనుగడ సాగించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చి మమత అధికారంలోకి వచ్చారు. కానీ జరిగింది వేరు. పల్లెటూళ్లలో గూండాల ప్రాబల్యం పెరిగింది. సాధారణ పౌరుల బతుకులు పెనం మీంచి పొయ్యిలో పడిన తీరుగా మారాయి. ఇప్పుడంతా అయ్యాక ఈ విషాద ఘటనకు కారకులని భావిస్తున్నవారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. చట్టవిరుద్ధంగా ఉన్న ఆయుధాలను పదిరోజుల్లోగా స్వాధీనం చేసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో అన్నిచోట్లా గాలింపు మొదలైంది. గ్రామం విడిచి వెళ్లిపోయినవారు వెనక్కొస్తున్నారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన కలకత్తా హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఇప్పటికే రాష్ట్రం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అన్ని వివరాలనూ సీబీఐకి అప్పగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. కానీ అంతటితో ఆగకూడదు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ దారుణ విషాద ఘటన మరెక్కడా పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలకు ఉపక్రమించాలి. మారుమూల ప్రాంతాలవరకూ విస్తరించి ఉండే పోలీసు, నిఘా వ్యవస్థల మొద్దు నిద్రను వదిలిం చేలా సమూల ప్రక్షాళన చేయాలి. హింసకు పాల్పడేవారికి రాజకీయ ప్రాపకం లభించబోదన్న సందేశం వెళ్లాలి. ఇలాంటి ఉదంతాలు తన పాలనకు మచ్చ తీసుకురావడమే కాదు... అంతర్జాతీయంగా మన దేశానికి అప్రదిష్ట తెస్తాయని మమత గుర్తించాలి. -
మార్పు ఎందుకు మహాశయా?
దేనికైనా సమయం, సందర్భం ఉండాలి. అదీ కాకుంటే, అత్యవసరమైనా ఉండాలి. అవేవీ లేకుండా సాధారణ అంశాలలో అవసరం లేని మార్పులు చేసి, వాటిని అసాధారణ చర్చనీయాంశాలుగా మార్చడం ఇటీవల ప్రబలుతున్న పాలకుల, పాలనా సంస్థల వైఖరి. దానికి తాజా ఉదాహరణ – పట్టభద్రులయ్యాక వృత్తి బాధ్యతలు చేపట్టే ముందు వైద్యులు చేసే శపథాన్ని మార్చాలంటూ జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) చేసిన సూచన. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా వైద్యవృత్తిలోకి వచ్చేవారందరూ ఆనవాయితీగా చేసే హిప్పోక్రేట్స్ శపథాన్ని మన దేశంలో ఆయుర్వేద వైద్య శిఖామణి చరకుడు పేర్కొన్న మాటలతో మార్చాలన్న హఠాత్ సూచన వివాదాస్పదమైంది. ఇకపై కళాశాలల్లో తెల్లకోటు వేసుకొని వృత్తిలోకి వచ్చే వైద్య విద్యార్థులు సర్వసాధారణ ‘హిప్పోక్రేట్స్ ప్రమాణా’నికి బదులుగా ఎన్ఎంసీ వెబ్‌సైట్‌లోని ‘మహర్షి చరకుడి శపథం’ చేయాల్సి ఉంటుంది. దేశంలోని వైద్య కళాశాలలతో ఈ ఫిబ్రవరి 7 నాటి సమావేశంలో ఎన్ఎంసీ ఈ సంగతి చెప్పడంతో తేనెతుట్టె కదిలినట్టయింది. వైద్య విద్య, విధానాలను నియంత్రించడానికి దేశంలోని ‘భారతీయ వైద్య మండలి’ స్థానంలో రెండేళ్ళ క్రితం 2020లో ఎన్ఎంసీని పెట్టారు. పాలకుల ఆశీస్సులతో పుట్టుకొచ్చిన ఈ కొత్త నియంత్రణ వ్యవస్థ వారి భావధారను ప్రవచిస్తూ, ప్రచారంలో పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ శపథంలో మార్పు కూడా భాగమని విమర్శలు వస్తున్నాయి. 3 లక్షలకు పైగా సభ్యులున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ మార్పును వ్యతిరేకించింది. ఇది వైద్యవిద్యను సైతం కాషాయీకరించే ప్రయత్నమని రాజకీయ వాదులు ఆరోపిస్తున్నారు. నిజానికి, ప్రస్తుతం ప్రపంచమంతటా వైద్యులు చేస్తున్న శపథానికీ ఓ చరిత్ర ఉంది. అది ప్రపంచ వైద్యచరిత్రలో ప్రముఖుడిగా భావించే క్రీస్తుపూర్వం 4 – 5 శతాబ్దాలకు చెందిన గ్రీకు వైద్యశిఖామణి హిప్పోక్రేట్స్ తన వైద్యగ్రంథంలో పేర్కొన్న మాటలని భావన. అయితే, అది ఆయన వ్యక్తిగతంగా రాసినది కాకపోవచ్చనే వాదనా ఉంది. ఎవరిదైనప్పటికీ వైద్యంలో నైతిక విలువలపై ప్రాచీన భావవ్యక్తీకరణ అదేననీ, నేటికీ దానికి ప్రాధాన్యం ఉందనీ పాశ్చాత్య ప్రపంచం భావిస్తుంటుంది. రోగి గోప్యతను కాపాడడం, చెడు చేయకపోవడం లాంటి విలువలను ప్రస్తావించే ప్రమాణం అది. ‘రోగి స్వస్థత కోసమే తప్ప, అతనికి నష్టం కలిగించడానికి వైద్యాన్ని వాడను. అడిగినా సరే ఎవరికీ విషమివ్వను. ఎవరి గడపతొక్కినా, అస్వస్థులకు సాయపడేందుకే ప్రయత్నిస్తాను. ఉద్దేశ పూర్వకంగా ఎవరికీ హాని చేయను. ఏ రోగిని కలిసినా, ఆ వ్యక్తి గోప్యతకు భిన్నంగా వివరాలు బయటపెట్టను’ అని సాగుతుంది ఆ శపథం. నైతికత రీత్యా ఆ భావనలన్నీ ఎవరికైనా, ఎప్పటికైనా అనుసరణీయాలే. ఇంకా చెప్పాలంటే, ప్రతిపాదిత ‘చరక శపథం’లోనూ ఇలాంటి మాటలే ఉన్నాయి. ప్రాచీన భారతీయ వైద్యానికి ప్రాతిపదిక ‘చరక సంహిత’లో ఔషధ చికిత్స చరకుడు చెబితే, క్రీ.శ. 4వ శతాబ్దపు శుశ్రుతుడు శస్త్రచికిత్సా విధానాన్ని వివరించాడు. గ్రీకు విధానాల కన్నా మన ఆయుర్వేద పద్ధతులే మెరుగైనవనీ ఓ వాదన. ఆ తులనాత్మక చర్చలోకి వెళ్ళకుండా, చరక సంహితలో భావాలు చూస్తే – వాటికీ, హిప్పోక్రేట్స్ మాటలకూ సారంలో ఆట్టే తేడా లేదు. మంచి మాటలు పేర్కొన్నది హిప్పోక్రేట్స్ అయితేనేం? చరకుడు అయితేనేం? అది గ్రహించకుండా, అందులో ఏం తప్పుందని ఇప్పుడీ మార్పు చేస్తున్నట్టు? ఏ సంకేతాలివ్వడానికి చేస్తున్నట్టు? ప్రపంచమంతటా అక్షరమక్షరం ఒకేలా వైద్య శపథం లేకున్నా, స్ఫూర్తి మాత్రం రోగి గోప్యత, ఆరోగ్య పరిరక్షణే! అమెరికన్, బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్లకూ హిప్పోక్రేట్స్ మాటలే ప్రాతిపదిక. ప్రపంచ మెడికల్ అసోసియేషన్ సైతం 1949లో అంతర్జాతీయ వైద్య నైతిక సూత్రావళిని చేపట్టింది. కాలగతిలో మార్పులు చేసుకుంటూ, నిరుడు మే నెలలో వైద్య ప్రపంచంతో పాటు మొత్తం సమాజానికి ఆధునిక అంతర్జాతీయ సూత్రావళి ప్రతిపాదననూ ప్రచురించింది. మన దగ్గర వైద్యకళాశాలల్లో చేయించే శపథంలోని మాటల్లో ఎడనెడ మార్పులున్నా ‘వైద్యో నారాయణో హరిః’ అనే భావనలో మార్పు లేదు. సాక్షాత్తూ దైవంగా భావించే ఆ ప్రాణదాతల నైతికతలో మార్పు లేదు. వరుస కరోనా వేవ్‌లలో పోరాడుతున్న వైద్యప్రపంచంలో ఇప్పుడీ కొత్త రచ్చ అవసరమా? వైద్య శపథాన్ని మారిస్తే వచ్చే ప్రత్యేక లాభమేమిటో అర్థం కాదు. ప్రభువుల మనసెరిగి ప్రవర్తించడానికో, మనసు చూరగొనడానికో మార్చాలనుకొంటే అంత కన్నా అవివేకమూ లేదు. అయితే, పాలకవర్గాలు సాగిస్తున్న పచ్చి కాషాయీకరణకు ఇది పరాకాష్ఠ అనేది ఆధార రహిత ఆరోపణ అని సంప్రదాయవాదుల మాట. ‘ఎయిమ్స్’ లాంటిచోట వార్షిక స్నాతకోత్సవంలో అనేక ఏళ్ళుగా చరక శపథమే చేస్తున్నారంటున్నారు. అలాగే అనుకున్నా, ఊరంతా ఒక దారి అయితే, ఉలిపికట్టెది ఒక దారిగా ప్రపంచ పోకడకు భిన్నంగా తీసుకుంటున్న హఠాన్నిర్ణయానికి సహేతుకత ఏమిటో అర్థం కాదు. ఆర్థిక సరళీకరణతో ప్రపంచమంతా కుగ్రామంగా మారిన రోజుల్లో ఈ వైద్య శపథంలో మాత్రం అందరి బాట కాదనే అత్యవసరం ఏమొచ్చింది? ఆ మాటకొస్తే ఏ ప్రమాణం చేశామన్నదాని కన్నా, దాన్ని ఏ మేరకు పాటిస్తున్నాం, అలాంటి వైద్య, ఆరోగ్య రంగానికి బడ్జెట్లలో ఏ మాత్రం తోడ్పాటునిస్తున్నాం అన్నది కీలకం. పాలకులు చూడాల్సింది ఆ ప్రజా సంక్షేమం. అవి చేస్తామని శపథాలు చేసి గద్దెనెక్కి, తీరా ఆ చేతలు వదిలేసి, ఈ చిన్న మాటలు పట్టు కొంటే ఎలా? ఈ కరోనా కష్టకాలంలో పట్టించుకోవాల్సింది – ఆ శపథాలనే కానీ, ఈ శపథాలను కాదు! -
నోళ్లు తెరిచిన జైళ్లు
క్రిమినల్ కేసుల్లో అసలైన దోషులను గుర్తించి శిక్షించడానికీ, అమాయకులకు న్యాయం అందించేం దుకూ న్యాయస్థానాలు సాగించే సుదీర్ఘ విచారణల పర్యవసానంగా జైళ్లు కిక్కిరిసి ఉంటున్నాయని మానవ హక్కుల సంఘాలు మాత్రమే కాదు... సుప్రీంకోర్టు సైతం అనేక సందర్భాల్లో చెప్పింది. కానీ ఈ పోకడ ఉన్నకొద్దీ ఉగ్రరూపం దాలుస్తున్నదని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పదేళ్లక్రితం వరకూ మొత్తం ఖైదీల్లో విచారణ ఖైదీల శాతం సగటున అత్యధికంగా 65 వరకూ ఉండగా, ఇప్పుడది 76 శాతానికి పెరిగిందని ఆ గణాంకాలు వివరిస్తున్నాయి. లెక్కకుమించి ఖైదీలను జైళ్లలో కుక్కితే సంస్కరణాలయాలు కావలసిన ఆ కారాగారాలు కాస్తా పశువుల కొట్టాలుగా మారతాయనీ, సరికొత్త నేరగాళ్లు పుట్టుకొచ్చేందుకు అవి దోహదపడతాయనీ పాలకులు గుర్తించకపోవడం విచారకరం. ఒకపక్క కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా విలయం సృష్టిస్తోంది. పర్యవసానంగా అన్ని విభాగాల పనితీరూ కుంటుబడింది. అవి పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి అనువైన పరిస్థితులు ఇంకా ఏర్పడలేదు. న్యాయవ్యవస్థ సైతం అనివార్యంగా సమస్యలను ఎదుర్కొనక తప్పడం లేదు. సహజం గానే జైళ్లపై దీని ప్రభావం పడుతోంది. శిక్ష పూర్తయి జైలు నుంచి విడుదలయ్యేవారితో పోలిస్తే కొత్తగా కేసుల్లో ఇరుక్కుని జైలుపాలవుతున్న వారి సంఖ్య 2020 తర్వాత తీవ్రంగా పెరిగిందని జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ)లోని గణాంకాల ఆధారంగా ‘ఇండియా జస్టిస్ రిపోర్టు’ నివేదిక నిర్ధారించింది. దాని ప్రకారం ఢిల్లీ జైళ్లలో 2019లో విచారణ ఖైదీలు 82 శాతం ఉండగా, మరుసటి సంవత్సరానికి అది 90.7 శాతమైంది. జమ్మూ కశ్మీర్లో 83.4 శాతం నుంచి 90.5 శాతానికి పెరిగింది. అంతక్రితం ఎంతో కొంత మెరుగ్గా ఉన్న పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్ లలో విచారణలో ఉన్న ఖైదీల శాతం గణనీయంగా పెరిగింది. పంజాబ్‌లో 2019లో విచారణ ఖైదీలు 66 శాతం ఉండగా, అది కాస్తా 85 శాతమైంది. హరియాణాలో 64.4 నుంచి 82 శాతానికి, మధ్యప్రదేశ్‌లో 54.2 నుంచి 70 శాతానికి పెరిగింది. నిజానికి ఈ గణాంకాలన్నీ 2020 నాటి లెక్కలు. ఆ సంవత్సరం న్యాయస్థానాలు సైతం సరిగా పనిచేసే పరిస్థితులు లేకపోవడం వల్ల విచారణలు మందగించాయి. ఆ తర్వాతైనా పెద్దగా మెరుగుపడింది లేదు గనుక ఈ సంఖ్య ఇంకా పెరిగి ఉండొచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ విచారణలు జరపడం వల్ల కొంత ప్రయోజనం కనబడిన మాట వాస్తవమే. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 188 అమలు చేయడంతో కేసుల సంఖ్య అపారంగా పెరిగింది. 2019తో పోలిస్తే 2020లో అదనంగా 16,43,690 కేసులు నమోదయ్యాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో వాస్తవంగా శిక్షార్హమైన వారెందరో, అమాయకులెవరో తేల్చడం న్యాయ వ్యవస్థకు తలకుమించిన పని. పరిమితికి మించి ఖైదీలుండటం వల్ల సాధారణ పరిస్థితుల్లోనే జైళ్లలో ఎన్నో సమస్యలేర్పడ తాయి. కరోనా వంటి మహమ్మారి విరుచుకుపడినప్పుడు ఆ సమస్యలు మరింత ఉగ్రరూపం దాల్చడంలో ఆశ్చర్యంలేదు. ఏళ్ల తరబడి విచారణలు కొనసాగుతుండటం వల్ల 200 శాతానికి మించి ఖైదీలున్న జైళ్లు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటిచోట కరోనాను అరికట్టేందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం సాధ్యమేనా? కారాగారాల్లో కరోనా విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నా మని ప్రభుత్వాలు చెబుతూనే వచ్చాయి. క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి, కొత్తగా వచ్చిన ఖైదీలను కొన్ని రోజులపాటు అక్కడ ఉంచటం, జైలు మాన్యువల్ అమలును ఆపి, విజిటర్స్ రాకుండా కట్టడి చేయడం అందులో కొన్ని. కానీ ఖైదీల మానవ హక్కులు ఆవిరికావడం మినహా వీటి వల్ల కలిగే ప్రయోజనం శూన్యం. న్యాయవాదులుగానీ, వారి బంధువులుగానీ నేరుగా ఖైదీలను కలిసే అవకాశాలు తగ్గిపోయాయి. లాకప్ డెత్‌లు, అసహజ మరణాల విషయంలో అంతకుముం దున్న జవాబుదారీతనం కూడా అడుగంటింది. కనుకనే 2020లో లాకప్ డెత్‌లు ఏడు శాతం పెరగ్గా, ఆత్మహత్యలు, ప్రమాదాలు, హత్యలు వంటి అసహజ మరణాలు 18.1 శాతం హెచ్చయ్యాయి. తగినన్ని అధికారాలున్న స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఆరా తీస్తే మన జైళ్లలో ఎంతటి దారుణమైన పరిస్థితులున్నాయో వెల్లడవుతుంది. దేశమంతా లాక్డౌన్ అమలైన కాలంలో సర్వోన్నత న్యాయస్థానం ఒక ముఖ్యమైన సూచన చేసింది. రాష్ట్రాల్లో అత్యున్నత స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి, ఖైదీల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నది దాని సారాంశం. అందువల్ల విడుదలైనవారి శాతం అంతకుముందుతో పోలిస్తే మెరుగైంది. కానీ ఆరోగ్యపరమైన కారణాలు, పెద్ద వయసు, జండర్ వంటి ప్రాతిపదికలు కాక, ఖైదీల విడుదలను పాలనాపరమైన వ్యవహారంగా కమిటీలు పరిగణించడంవల్ల పెద్దగా ప్రయోజనం కలగలేదు. పరిమితికి మించి ఖైదీలుండటం, అదే సమయంలో తగినంతగా సిబ్బంది లేకపోవడం జైళ్లలో అవినీతికి, అమానవీయతకు, ఇతర వైపరీత్యాలకూ దారితీస్తోంది. జైళ్లు సంస్కర ణాలయాలని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నా అందులో చిత్రహింసలు విడదీయరాని భాగమని ‘డిసిప్లిన్ అండ్ పనిష్: ద బర్త్ ఆఫ్ ద ప్రిజన్’ పుస్తకంలో మైఖేల్ ఫాకల్ట్ అంటాడు. మనిషిలో అమానవీయతను పెంచి, నేర ప్రవృత్తికి అలవాటు చేసే జైళ్ల స్థితిగతులను చక్కదిద్దడానికి సిబ్బందిని పెంచడం, పటిష్టమైన పర్యవేక్షణ ఉండేలా చూడటం, జవాబుదారీతనాన్ని పునఃప్రతిష్టించడం కీలకం. వీటిపై న్యాయస్థానాలు, ప్రభుత్వాలు దృష్టి సారించడం తక్షణావసరం. -
సోదరుడు దోస్తోవ్స్కీ
‘‘అమ్మా, నా బంగారం! నిజానికి మనం అంతా అందరికీ బాధ్యులమే. కానీ ఈ సత్యం మానవాళి గుర్తించటం లేదు. గుర్తించిననాడు భూమి స్వర్గంగా మారిపోతుంది.’’ (కరమజోవ్ సోదరులు)తెలుగు సాహిత్యం వరకూ గతేడాది చివర్లో ఒక అద్భుతం సంభవించింది. అది రష్యన్ మహానవల ‘బ్రదర్స్ కరమజోవ్’కు తెలుగు అనువాదం రావడం! ఆ నవల సృష్టికర్త, ఈ పదాన్ని దాని అక్షరమక్షరంతో నిజం చేసిన ఫ్యోదర్ దోస్తోవ్స్కీ (1821–1881) ద్విశతాబ్ది జయంతి కూడా గతేడాదే(నవంబర్ 11) కావడం మరో విశేషం. ఆ సందర్భాన్ని ఉత్సవం చేయడం కోసమే ‘రష్యన్ సాహిత్యాభిమాన వేదిక’ ఈ బృహత్ కార్యానికి పూనిక వహించింది. తొమ్మిది వందల పేజీల ఈ నవలను ‘సాహితి’ ప్రచురించింది. దీని అనువాదకురాలు అరుణా ప్రసాద్ ఒక జీవితకాలానికి సరిపడా ప్రేమకు అర్హురాలు! ఇంత ఊరించిన తర్వాత దీన్ని చదవడానికి పాఠకుడు ఆతృత పడితే దెబ్బతినొచ్చు. మొత్తంగా పుస్తకంలో ఏం ఉందో(‘పితృహత్య’) మొదటే తెలిసిపోతుంది. కాబట్టి, ఆ క్షణంలో ఏం మాట్లాడుకుంటున్నారో అదే ముఖ్యం. రంగస్థలంపై పాత్రలు వచ్చి, అంతరంగాన్ని ‘ఏకపాత్రాభినయం’లా ఎలా ఆవిష్కరించుకుంటాయో ఇవీ అలాగే చేసినట్టుగా తోస్తుంది. కానీ ఆలోచిస్తే అంత అవాస్తవం ఏమీ అనిపించదు. ఒక ఉద్వేగంలోకి వెళ్లిన మనిషి ఎలా వదరుతాడో ఇక్కడా అంతే! అయితే సంభాషణల్లో జీవితపు మౌలిక ప్రశ్నల్ని ఎలా వెతుక్కుంటారన్నది ముఖ్యం. ఎన్ని చిత్తవృత్తులు, ఎన్ని వృత్తాంతాలు, ఎన్ని ఒప్పుకోళ్లు, ఎన్ని వేడుకోళ్లు! ఇందులో ప్రతి ఒక్కరూ ‘పాపం’ చేసినట్టే ఉంటారు. దానికి తగిన ‘శిక్ష’ అనుభవిస్తూనే ఉంటారు. అల్పులు, ఉన్మత్తులు, మొరటు మనుషులు, ఏ పెద్దరికమూ నిలుపుకోలేని హాస్యగాళ్లు... అసలు ‘నీచుడు’ అనుకునేవాడిలోనూ అత్యంత సున్నితపు పొరలు ఉంటాయని తెలుస్తున్నప్పుడు ఆనంద బాష్పాలు కారుతాయి. తను చచ్చేంత డబ్బు అవసరంలో ఉన్నా, ఆ డబ్బు కోసం అవసరమైతే తండ్రినే చంపేంత కోపంగా ఉన్నా, అదే డబ్బు అడిగితే తనకు కాత్యా ఇస్తుందని తెలిసినా, ఆమెను కాదని గృషెంకాను ప్రేమిస్తున్నప్పడు, కాత్యాను ఆ డబ్బు అడగలేకపోయానని ద్మిత్రీ విచారణలో చెప్పడం మానవాంతరంగపు లోతుకు అద్దం. ఇంతే లోతైన మరో ఘట్టం– ‘ఎల్డర్’ జోసిమా దగ్గర తన తప్పును ఒప్పుకున్న ‘రహస్య అతిథి’... ఆయన ముందు నైతికంగా తగ్గిపోయానని భావించి తిరిగి ఆయననే చంపాలనుకోవడం! మన మూలమూలలా ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ, రచయిత ఎంత సూక్ష్మాంశాల దగ్గరికి వెళ్తాడంటే ఇంత సున్నితమైన నవల మరొకటి ఉందా అనిపిస్తుంది. ఒకే అమ్మాయి (గృషెంకా) కోసం తండ్రీ కొడుకులు ఫ్యోద్ర్, ద్మిత్రీ పోటీ పడటం; ఒకే అమ్మాయి(కాత్యా) కోసం అన్నాదమ్ములు ద్మిత్రీ, ఇవాన్ బరిలో ఉన్నట్టనిపించడం... జీవితపు చేదు వాస్తవం. ఇందులో ముగ్గురు సోదరులైన ద్మిత్రీ ఒక మృగంలానూ, ఇవాన్ మేధావిలానూ, అల్యోషా ఆధ్యాత్మిక జీవిగానూ కనబడతారు. అయితే దోస్తోవ్స్కీకి మృగాల పట్ల తక్కువ అభిప్రాయం లేదు. ‘మృగాలెప్పుడూ, ఎన్నటికీ మానవుడంత క్రూరంగా ఉండజాలవు’. బహు గొంతులు, సూక్ష్మంలోనూ సూక్ష్మం దోస్తోవ్స్కీని అనితర సాధ్యమైన రచయితగా నిలబెడతాయి. ప్రతి పాత్రలోనూ రచయిత ఎంతగా పరకాయ ప్రవేశం చేస్తాడంటే, అదింక ఇంకోలా మాట్లాడే వీలున్నట్టు కనబడదు. చిన్న పాత్రలైన గ్రిగొరీ, మేడమ్ హోలకోవ్, లిజి, కొల్యాకు కూడా ఇది వర్తిస్తుంది. ఆఖరికి, తుంటరి పిల్లాడు ఇల్యూష గుండుసూదిని గుచ్చిన రొట్టెను విసరడంతో తిని చనిపోయిన కుక్క జుట్చ్‌కా కూడా ఒక ‘వ్యక్తి’గా దర్శనమిస్తుంది. అదే మథనంతో మరణానికి చేరువైన ఇల్యూషా కూడా అంతే నొప్పి పుట్టిస్తాడు. జీవితాన్ని చివరికంటా శోధించి, అందులోని సర్వ వికారాల్నీ తడుముతూ కూడా అది ప్రేమకు అర్హమైనదే అని చాటడం దోస్తోవ్స్కీ లక్ష్యం! అందుకే దేవుడి సృష్టిలోని సకల దుర్మార్గాలనూ పరిపరి విధాలుగా ఇవాన్ ఎత్తి చూపినప్పుడు కూడా దానికి స్పందనగా– తనను నిర్బంధించిన మహా ధర్మాధికారి పెదవులను క్రీస్తు ముద్దాడిన కథనాన్ని పునర్జీవిస్తూ – అల్యోషా, అన్న పెదవుల మీద ముద్దు పెట్టుకుంటాడు. ఆధ్యాత్మిక రాజ్యస్థాపన ద్వారానే నిజమైన సోదర భావం నెలకొంటుందని దోస్తోవ్స్కీ విశ్వాసం. అరెస్టయ్యి, గంటలకొద్దీ సాగిన విచారణ తర్వాత, అలసటతో నిద్రపోయినప్పుడు... తనకు తలగడ పెట్టే దయ చూపినవారెవరని ద్మిత్రీ కదిలిపోతాడు. అదెవరో రచయిత చెప్పడు. కానీ ఎంతటి నిరాశలోనైనా ఒక దయగల చేయి ఎప్పటికీ ఉంటుందని చాటుతాడు. ‘అటువంటి ఒక్క జ్ఞాపకం ఉన్నా అది కూడా మనను కాపాడటానికి ఉపయోగపడుతుంది’ అని ముగింపులో వీడ్కోలు చెబుతూ పిల్లలకు అల్యోషా చెప్పేది ఇందుకే. అసలు హంతకుడు ఎవరో బయటపడేప్పటికి ఈ నవల కాస్తా సస్పెన్స్ థ్రిల్లర్ రూపు తీసుకుంటుంది. కానీ దీని విస్తృతి రీత్యా ఆ వర్గానికి పరిమితం చేయడం దీన్ని సరైన అంచనా కట్టకపోవడమే అవుతుంది. ఇది సమస్త మానవాళి పశ్చాత్తాపాల చరిత్ర! జీవన మధువును నింపుకోవడానికి ప్రతి ఒక్కరూ పడే తహతహ. పాపభీతితో కుమిలిపోయే ఎందరో జీవన్మృతుల వ్యథ. 1880లో ఈ నవల వచ్చిన 4 నెలలకు దోస్తోవ్స్కీ మరణించాడు (ఈ ఫిబ్రవరి 9న 140వ వర్ధంతి.) ఆ లెక్కన ఇది ఒక మహారచయిత చివరి వీలునామా కూడా! ‘అద్భుతాలను’ ఆశిస్తాడు మనిషి. కానీ అద్భుతం వల్ల కాక మామూలుతనం వల్ల దాని విలువ పెరగాలి. ఈ పుస్తకం ఎంత మామూలుదంటే, ఆ మామూలుతనమే అద్భుతంగా తోస్తుంది. -
కప్పల తక్కెడ!
భిన్న ధ్రువాలు కలవవు అని సాధారణ సూత్రం. కానీ, సిద్ధాంతాలకు తిలోదకాలిస్తే, రాజకీయాలలో ఎవరైనా ఎవరితోనైనా కలిసిపోవచ్చని మరోసారి రుజువైంది. అధికారమే పరమావధిగా అన్ని తేడాలూ పక్కన పెట్టేస్తే, అందరూ కలసి ఏక ధ్రువ రాజకీయం చేయదలిస్తే ఏమవుతుంది? ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో అదే అయ్యింది! మేఘాలయలోని కాంగ్రెస్‌లో మిగిలిన అయిదుగురు ఎమ్మెల్యేలూ మంగళవారం నాడు బీజేపీ సమర్థిస్తున్న ‘మేఘాలయ డెమోక్రాటిక్ అలయన్స్’ (ఎండీఏ)లో చేరారు. దీంతో, ఒకప్పుడు 17 మంది ఎమ్మెల్యేలతో ఆ రాష్ట్ర అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఇప్పుడక్కడ ఖాళీ అయిపోయింది. ఆ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఒక్కటే అసెంబ్లీలో ప్రతిపక్షం జాగాలో మిగిలింది. స్థానిక కారణాలు ఏమైనా, బద్ధ శత్రువులనుకున్న కాంగ్రెస్, బీజేపీలు కలసిన విచిత్రమైన పరిస్థితి. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) సారథ్యంలోని అధికార కూటమిలో చేరామే తప్ప, కాంగ్రెస్‌లోనే ఉన్నామని కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకురాలైన అంపరీన్ లింగ్డో అంటున్నారు. సైద్ధాంతిక బద్ధవిరోధి బీజేపీ సమర్థిస్తున్న ఆ కూటమి ప్రభుత్వంలో చేరడానికి సరైన కారణం కాంగ్రెస్ నేతల వద్ద కనిపించదు. పైకి మాత్రం ప్రజాప్రయోజనాల రీత్యా, రాష్ట్రాన్ని కలసికట్టుగా ముందుకు తీసుకుపోవడానికి వీలుగా ప్రభుత్వానికి చేదోడుగా నిలిచేందుకే ఈ పని చేశామంటున్నారు. ఆ మాటే మంగళవారం నాటి ప్రభుత్వ సమర్థన లేఖలో రాసిచ్చారు. కానీ, అధికారమే పరమావధి అయిన రోజుల్లో ప్రతిపక్ష స్థానంలోని పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళి, విరోధి పంచన ఉన్న అధికార కూటమిలో ఎందుకు కలిసి ఉంటారో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. మేఘాలయ అసెంబ్లీలో మొత్తం 60 మంది సభ్యులుంటారు. గడచిన 2018 ఎన్నికలలో కాంగ్రెస్ 21 స్థానాల్లో గెలిచింది. తర్వాత ఆ సంఖ్య 17కు తగ్గింది. అసెంబ్లీలో ఆ పార్టీయే ప్రతిపక్షం. కానీ, తర్వాత ఆ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా సహా 12 మంది ఎమ్మెల్యేలు గత నవంబర్‌లో టీఎంసీలోకి ఫిరాయించారు. అలా అప్పటి నుంచి కాంగ్రెస్‌లో అయిదుగురే మిగిలారు. తాజాగా కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకురాలైన అంపరీన్ లింగ్డో సహా అయిదుగురూ తమ ప్రతిపక్ష పాత్రకు గుడ్‌బై చెప్పేశారు. అధికార కూటమికి జై కొట్టేశారు. గత నవంబర్ నాటి ఫిరాయింపులే ఓ పెద్ద ఎదురుదెబ్బ అనుకుంటే, ఇప్పుడు మిగిలిన కొద్దిమందీ అధికార కూటమిలో చేరడంతో ఈ ఈశాన్య రాష్ట్రంలో కాంగ్రెస్ పుట్టి మునిగింది. అయితే, ఈ పరిణామం మరీ అనూహ్యమేమీ కాదు. సాక్షాత్తూ కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకురాలే పార్టీని వీడి, ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సారథ్యంలోని ఎన్పీపీలో చేరతారని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. కాంగ్రెస్‌ను వీడి, ఎన్పీపీలో చేరిన భర్త బాటలోనే ఆమె కూడా వెళతారన్న మాట బయటకొచ్చింది. ఆమె మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తూ వచ్చారు. కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన తాను అర్ధరాత్రి దొంగలాగా పారిపోననీ, ఈ పర్యాయం ఇక్కడే కొనసాగుతాననీ, తర్వాత సంగతి తర్వాతనీ చెబుతూ వచ్చారు. తీరా వారం తిరగక ముందే సహచరులతో సహా వెళ్ళి, అధికార కూటమిలో కలిసిపోయారు. సాంకేతికంగా మాత్రం తాము కాంగ్రెస్ పార్టీనే అంటున్నారు. మేఘాలయాలో పార్టీలో మిగిలిన పెద్ద పేర్లయిన ఆమె, ఆమె సహచర ఎమ్మెల్యే సాక్మీ కూడా ప్లేటు తిప్పడంతో కాంగ్రెస్ కుండ ఖాళీ అయింది. ‘ఈ కాలమాన పరిస్థితుల్లో మమ్మల్ని మేమే కాపాడుకోవాలి. మేము అయిదుగురం ఒకరి నొకరం రక్షించుకుంటున్నాం’ అన్నది అంపరీన్ మాట. అధికారానికి దూరంగా ఉన్నవేళ అనేక రాజకీయ, ఆర్థిక అనివార్యతలు ఆమెనూ, ఆమె సహచరులనూ తాజా నిర్ణయం వైపు నెట్టాయని పరిశీలకుల ఉవాచ. చూపరులకే కాదు, రెండువైపులా పార్టీ పెద్దలకూ ఈ తాజా పరిణామం కొంత ఇబ్బందికరమే. ‘సింహం, లేడీపిల్ల ఒకేచోట, ఒకేసారి నీళ్ళెలా తాగుతాయి’ అని మేఘాలయ బీజేపీ ఛీఫ్ మాట. ‘ఇది దిగ్భ్రాంతికరం’ అన్నది రాష్ట్ర కాంగ్రెస్ ఛీఫ్ వ్యాఖ్య. నిజానికి, చరిత్ర చూస్తే ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కలిసి అడుగులేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చూసినదే. కాకపోతే, ఈసారి కొంత ఎక్కువ రచ్చ జరుగుతోంది. సిద్ధాంతాలకు తిలోదకాలివ్వడంలో అన్ని పార్టీలదీ ఒకే తంతు. అందరికీ అధికారమే పరమా వధి. అవకాశవాద రాజకీయాల వేళ పొరుగునే ఉన్న మిజోరమ్‌లో సైతం చక్మా స్వయంప్రతిపత్తి జిల్లా కౌన్సిల్లో అధికారం కోసం కాంగ్రెస్‌తో బీజేపీ చేతులు కలిపింది. మేఘాలయలో నైతికత గురించి మాట్లాడుతూ వచ్చిన తృణమూల్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని మరీ, రాష్ట్రంలో కాస్తంత పట్టు చిక్కించుకుంది. వచ్చే ఫిబ్రవరిలో నాగాలాండ్, త్రిపురలతో పాటు సరిహద్దు రాష్ట్రం మేఘాలయలోనూ ఎన్నికలు. ఒకప్పుడు తాము పాలించిన రాష్ట్రాల్లో అధికారానికి దూరమయ్యాక కాంగ్రెస్ చిక్కుల్లో పడింది. ఫిరాయింపులు పెరుగుతున్నాయి. తాజాగా ఎన్నికలు జరుగుతున్న గోవా, మణిపూర్ లాంటి చోట్ల పార్టీ మారబోమంటూ అభ్యర్థులతో ముందే ఒట్టు వేయించుకొంటున్న విచిత్ర పరిస్థితి. ఎవరు ఎటువైపు అయినా గెంతేసే ఈ కప్పల తక్కెడ సంస్కృతి ప్రజాస్వామ్యానికి శోభస్కరం కాదు. ప్రతిపక్షాలు అధికారం కోసం బాధ్యత విస్మరించినా, ప్రజా శ్రేయస్సంటూ ప్రతిపక్షమే లేకుండా పాలన చేద్దామని అధికారపక్షం అనుకున్నా చరిత్ర క్షమించదు! -
పసిమనసుల్లో విషబీజం!
బేటీ పఢావో, బేటీ బచావో అని చెబుతున్న దేశంలో ఒక ఆడపిల్ల తను చదువుకుంటున్న చోటుకు స్వేచ్ఛగా వెళ్ళలేకపోవడం ఎంత దురదృష్టం? తోటి విద్యార్థిని ఒంటరిగా కాలేజీలోకి వెళుతుంటే, వెనకాల గుంపుగా వెంటబడి వేధింపుగా నినాదాలు చేయడం ఎంత ఘోరం? విద్యాబుద్ధులు నేర్పా ల్సిన ప్రదేశం విద్వేషానికి ఆలవాలమైతే, ఎంత బాధాకరం? అవును... అదుపు తప్పిన భావోద్వే గాలు, అల్లరి మూకలు రాళ్ళు రువ్వడాలు, తల పగిలి రక్తం ఓడిన టీచర్లు, జాతీయజెండా స్తంభం పైకెక్కి కాషాయ ధ్వజం ఎగరేసే తుంటరితనాలు, శివ మొగ్గలో రాళ్ళదాడులు, లాఠీఛార్జీ, దావణగెరెలో బాష్పవాయు ప్రయోగం... కలత రేపుతున్న కర్ణాటక దృశ్యాలివి. ఉడుపిలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆరుగురు ముస్లిమ్ విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడాన్ని అధికారులు తప్పుబట్టడంతో కోస్తా కర్ణాటకలో మొదలైన వివాదం దేశవ్యాప్తమైంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ గురువారం జరగనున్న వేళ రాజకీయ అంశంగానూ మారింది. పరపురుషుల ముందు తల, ఛాతీని కప్పి ఉంచేలా వస్త్రాన్ని వేసుకొనే ‘హిజాబ్’ ధారణ కొత్తదేమీ కాదు. దానిపై విద్యార్థుల్లో వివాదమే కొత్త. కాలేజీకి హిజాబ్‌తో వస్తామని పట్టుబడుతున్న స్టూడెంట్లను క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ) వెనక ఉండి నడిపిస్తోందని ఒక ఆరోపణ. వారికి వ్యతిరేకంగా తోటి విద్యార్థులతో కాషాయ తలపాగాలు, శాలువాలు ధరింపజేయడం వెనుక ఏబీవీపీ లాంటి సంఘ్ పరివార్ శక్తులున్నాయని ప్రత్యారోపణ. ఆరోపణల్లో నిజానిజాలెలా ఉన్నా, స్థానికంగా ఆ విద్యాసంస్థ స్థాయిలో పరిష్కారం కావాల్సిన అంశం ఇంత పెద్దది కావడంలో కర్ణాటకలోని బీజేపీ సర్కారు తప్పూ కనిపిస్తూనే ఉంది. కర్ణాటక విద్యా చట్టం–1983లోని 133(2)వ సెక్షన్ కింద ఈ నెల మొదట్లో బొమ్మై ప్రభుత్వం విద్యాసంస్థల్లో హిజాబ్‌ను నిషేధిస్తూ ఆదేశాలిచ్చింది. ‘సమానత్వానికీ, సమగ్రతకూ, పౌర శాంతిభద్రతలకూ భంగం కలిగించే దుస్తులు ధరించరాదు’ అని పేర్కొంది. హిజాబ్ ధారణ అనేది సమానత్వం, శాంతి భద్రతలకు ఏ రకంగా భంగకరం అంటే జవాబివ్వడం కష్టమే. పైపెచ్చు, రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కు, విద్యాహక్కు, మతస్వాతంత్య్ర హక్కులకు ఈ ఆదేశాలు విరుద్ధమనిపిస్తాయి. పిల్లల హిజాబ్ ధారణ చిన్న విషయమనిపించినా అనేక కోణాలున్నాయి. ఈ వస్త్రధారణ ఛాంద సవాదమని నిరసించేవాళ్ళూ, ఇష్టపూర్వకంగా ధరిస్తుంటే అది స్వీయ నిర్ణయ హక్కు అనేవారూ – ఇద్దరూ ఉన్నారు. అలాగే, హిజాబ్ ధారణ రాజ్యాంగపరమైన హక్కు అవునా, కాదా? దాన్ని అడ్డుకోవడం మహిళల స్వీయనిర్ణయ హక్కుకూ, వ్యక్తిగత గోప్యతకూ భంగకరమా? అవతలి వారికి ఇబ్బంది కలగని రీతిలో ఎవరి సంప్రదాయాన్ని వారు అనుసరించకూడదా? ఇలా ఎన్నో ప్రశ్నలు. అందుకే, ఇది కేవలం రిట్ పిటిషన్ వేసిన ఆరుగురు విద్యార్థినుల అంశంగా కోర్టు చూడట్లేదు. హిజాబ్ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలని కర్ణాటక హైకోర్ట్ బుధవారం నిర్ణయించింది. అదే సమయంలో ఎలాంటి వ్యాఖ్యలూ చేయకుండా, కేసు వేసిన విద్యార్థినుల పక్షాన మధ్యంతర ఉపశమన ఉత్తర్వులేమీ ఇవ్వకుండా జాగ్రత్త పడింది. ఇప్పటికే హిజాబ్‌ను సమర్థిస్తూ, 2017 నాటి కేరళ హైకోర్ట్ తీర్పు, 2018 బాంబే హైకోర్ట్ తీర్పు లాంటివి ఉన్నా, తొందరపడకూడదనుకుంది. 65 మెడికల్ కాలేజీలు, 250 ఇంజనీరింగ్ కాలేజీలతో విద్యాకేంద్రంగా, వేలమందిని విదేశాలకు పంపిన సాఫ్ట్వేర్ కూడలిగా వినుతి కెక్కిన కర్ణాటకలో కోస్తాప్రాంతం సున్నితం. అక్కడ ముస్లిమ్, క్రైస్తవ వ్యతిరేక ప్రచారాస్త్రం చేపట్టిన బీజేపీ తనకు అనుకూలంగా మెజారిటీ వర్గాన్ని ఏకం చేయాలని భావిస్తోంది. ఆ అజెండాకు తాజా పరిణామాలు తోడ్పడవచ్చు. కానీ, దాని పర్యవసానాలే దారుణం కావచ్చు. విద్యాపరంగా చూస్తే, ఇప్పటికే దేశంలో 57 శాతం మంది ఆడపిల్లలు మధ్యలో చదువు మానేస్తున్నారు. ముస్లిమ్ యువతులైతే 21.9 శాతం మంది చదువుకే దూరంగా ఉన్నారనీ లెక్క. కరోనాతో 24 కోట్ల మంది పిల్లల చదువుపై ప్రభావం పడిందని పార్లమెంటరీ స్థాయీ సంఘమే తేల్చింది. ఇప్పుడీ అనవసర వివాదాలతో ఒక మతం ఆడపిల్లలు పూర్తిగా చదువుకే దూరమయ్యే ప్రమాదమూ ఉంది. అదే జరిగితే ‘బేటీ పఢావో’ ఎవరో అన్నట్టు ‘బేటీ హఠావో’ అయిపోతుంది. ఇప్పటికే రెండేళ్ళుగా కరోనా కాలంతో చదువులు దెబ్బతిన్నాయి. భౌతిక తరగతులకు దూరమై, విద్యార్థులు మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ప్రవర్తన ధోరణులూ మారాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడీ వివాదం అగ్నికి ఆజ్యం. ఘర్షణలతో ఇచ్చిన 3 రోజుల సెలవుల తర్వాతైనా కాలేజీలు తెరవాల్సి ఉంది. రెండు నెలల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. వివాదం ఇలాగే కొనసాగితే దెబ్బతినేది విద్యార్థులు, వారి చదువులు. సామాజికంగా చూస్తే, సున్నితమైన ఈ వ్యవహారంలోకి రాజకీయ పార్టీలు చొరబడడం, రాజకీయ లబ్ధికి గేలం వేయడం అవాంఛనీయం. హిజాబ్ వేసుకొమ్మని బలవంతం చేయడమే కాదు... వద్దని నిషేధించడమూ కచ్చితంగా అణచివేతే! సామరస్యాన్ని చెడగొట్టి, మత విద్వేషాగ్నిని రగిలించే ఏ చర్యలనూ సమర్థించలేం. విద్వేషం వల్ల జరిగేది నష్టమేనన్నది తరతరాలుగా యుద్ధభూమి నేర్పిన పాఠం. మరి, పాఠాలు చెప్పాల్సిన బడినే వైమనస్యాల యుద్ధ క్షేత్రంగా మార్చేస్తుంటే ఏమనాలి? పసిమనసుల్లో కులమతాల విద్వేషపు విషబీజం నాటితే, అది మొత్తం జాతికే నష్టం. శతాబ్దాల సామరస్య పునాదిపై నిలిచిన లౌకికవాద ప్రజాస్వామ్య భారతావనిలో ఆ ప్రయత్నం ఎవరు చేసినా... అక్షరాలా వారే అసలు దేశద్రోహులు! -
పిల్లలు కాదు... పిడుగులు!
ఒకసారి జరిగితే అదృష్టం అనవచ్చు. రెండోసారీ అయితే అనుకోని అద్భుతం లెమ్మనవచ్చు. అదే పదే పదే విజేతగా నిలుస్తుంటే – అది ప్రతిభా సామర్థ్యాలకు ప్రతీక కాక మరేమిటి?! క్రికెట్లో 2000, 2008, 2012, 2018 తర్వాత మరోసారి అండర్ –19 ప్రపంచ కప్‌ను భారత్ ఖాతాలో జమ చేసిన కుర్రాళ్ళ ప్రతిభ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. భారత క్రికెట్ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తోంది. వెస్టిండీస్ గడ్డపై శనివారం జరిగిన అండర్–19 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, మన యువ ఆటగాళ్ళు సృష్టించిన చరిత్ర అలాంటిది. ప్రతిభను గుర్తించి, ప్రోత్సహిస్తే యువతరం దేశానికి పేరుప్రతిష్ఠలు తీసుకురాగలదనడానికి ఈ తాజా విజయం ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణ. అప్పట్లో 1983లో భారత్ సీనియర్ల బృందం తొలిసారి క్రికెట్ ప్రపంచ కప్ సాధించినప్పుడు ఆటగాళ్ళకు ఉదారంగా బహూకరించేందుకు క్రికెట్ బోర్డు దగ్గర నిధులు లేవంటే క్రికెట్ వీరాభిమాని గానకోకిల లతా మంగేష్కర్ తన విభావరితో రూ. 20 లక్షల వసూలుకు సహకరించారు. యాదృచ్ఛికంగా ఆమె తుది ఘడియల వేళ ఇప్పుడీ యువ జట్టు ఈ ప్రపంచ కప్‌తో ఆమెకు అంతిమ బహుమతి ఇచ్చినట్టయింది. ఈ యువ కిశోర బృందం సాధించిన ఈ విజయం ఒకటికి రెండు విధాలుగా చిరస్మరణీ యమైనది. అండర్–19 క్రికెట్లో ఇప్పటి వరకు జరిగిన 14 ప్రపంచ కప్ పోటీలలో భారత్‌కు ఇది అయిదో ప్రపంచ కప్. అలా అత్యధిక పర్యాయాలు ఆ ఘనత సాధించిన జట్టుగా భారత్ రికార్డు కెక్కింది. ఇక రెండోది – కోచ్ హృశీకేశ్ కనిత్కర్ మార్గదర్శనంలో అనేక అవాంతరాల్ని తట్టుకొని, వయసుకు మించిన పరిణతితో ఈ జట్టు నిలిచి, గెలిచిన తీరు. ఒక సందర్భంలో క్రికెట్ శిబిరంలో కరోనా కలకలం రేపి, ఆరుగురు అనారోగ్యం పాలయ్యారు. రెండు మ్యాచ్‌లకు గాను కనాకష్టంగా 11 మంది ప్లేయర్లే ఫిట్నెస్తో మిగిలారు. అయినా సరే ఈ పిన్న వయస్కులు మానసిక స్థైర్యం చూపి, బరిలో పోరాడిన తీరు ప్రేరణనిచ్చే అంశం. సాక్షాత్తూ కరోనా బారిన పడి కోలుకొని మరీ ఉద్విగ్నభరితమైన రీతిలో సెంచరీ కొట్టాడు కెప్టెన్ యశ్ ధుల్. అతని సారథ్యంలోని ఈ జట్టులో లోయర్ ఆర్డర్ ఆటగాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ పోరాటతత్త్వం నిండినవారే. బ్యాటింగ్, పేస్, స్పిన్ బౌలింగ్ – ఇలా అన్ని విభాగాల్లో సత్తా చూపి, ప్రత్యర్థి జట్లను తిప్పలు పెట్టిన బృందం ఇది. నిజానికి, ఈ టోర్నీలో అగ్రశ్రేణి పరుగుల వీరులు, వికెట్ పడగొట్టిన యోధుల జాబితా తీస్తే – అందులో భారత ఓపెనర్ రఘువంశీ పేరొక్కటే కనిపిస్తుంది. అయితేనేం, కలసికట్టుగా ఆడిన విధానం, విజయాలు సాధించిన వైనం టోర్నీలో భారత్‌ను అప్రతిహతంగా నిలిపింది. ఆతిథ్య దేశమైన వెస్టిండీస్‌లో ఆది నుంచి మన జట్టు దూకుడు చూపుతూనే వచ్చింది. ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగితే కనిష్ఠంగా 45 పరుగుల తేడాతో, రెండోసారి బ్యాటింగ్‌కు వచ్చి లక్ష్యసాధన చేయాల్సి వస్తే కనీసం 4 వికెట్ల తేడాతో విజయాలు సాధించింది. తమ లాగే అజేయంగా ఫైనల్‌కు దూసుకువచ్చిన ఇంగ్లండ్‌ను ఫైనల్లో మొదట బౌలింగ్‌తో ఇరుకున పెట్టింది. చివరకు 189 పరుగులకు ఆలౌటై ఇంగ్లండ్ పరువు దక్కించుకుంది. లక్ష్య ఛేదనలో భారత యువ జట్టు ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంది. మ్యాచ్ ఎటైనా మొగ్గే స్థితిలోనూ బెసగకుండా, కరోనా నుంచి కోలుకున్న ఇద్దరి (నిశాంత్ సింధు, షేక్ రషీద్) హాఫ్ సెంచరీలతో జట్టు గెల్చింది. వైస్ కెప్టెనైన మన గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ తన ప్రతిభతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం మరింత సంతోషకరం. ఆస్ట్రేలియాపై సెమీఫైనల్లోనూ కెప్టెన్‌తో కలసి మనోడు రెండొందల పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం చిరస్మరణీయం. గతంలో అంబటి రాయుడు, ఈ మధ్య మహమ్మద్ సిరాజ్ లాంటి తెలుగువారు క్రికెట్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తీరును ఇది గుర్తుతెస్తోంది. అతి సామాన్య స్థాయి నుంచి వచ్చినా ప్రతిభకు తోడుగా పట్టుదలను ఇంధనంగా చేసుకుంటే, ఎంతటి ఉన్నత శిఖరాలకు చేరుకోగలరో కళ్ళెదుట కనిపిస్తూ, స్ఫూర్తినిస్తోంది. మునుపు అండర్–19 క్రికెట్ జట్టుకు సారథులుగా దేశానికి వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన మహమ్మద్ కైఫ్, విరాట్ కోహ్లీ, ఉన్ముక్త్ చాంద్, పృథ్వీ షాల వరుసలో ఇప్పుడు యశ్ ధుల్ చేరాడు. ఆ మునుపటి సారథుల లాగానే రాబోయే రోజుల్లో యశ్‌ను కూడా సీనియర్ జట్టులో చూడడం ఖాయం. ఒక్క యశే కాదు... ఈ కుర్రాళ్ళలో పలువురు గతంలో యువరాజ్ సింగ్, రిషభ్ పంథ్లా సీనియర్ల జట్టుకు ఎదిగి, అక్కడ మెరిసే సత్తా ఉన్నవారే. రేపు వీరే భారత క్రికెట్‌కు కొండంత అండ. మొత్తం మీద, భారత సీనియర్ క్రికెట్ జట్టు సరిగ్గా 1000వ వన్డే ఇంటర్నేషనల్ ఆడి గెలవడానికి ఒక్క రోజు ముందు పిల్లలు కొత్త ఆశలు మోసులెత్తేలా చేశారు. అయితే, నేషనల్ క్రికెట్ అకాడెమీ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నట్టు ‘ఇది క్రికెటర్లుగా వారి సుదీర్ఘ ప్రయాణానికి ఆరంభం మాత్రమే’. ఇలాంటి ప్రతిభావంతులనూ, దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన మట్టిలో మాణిక్యాలను గుర్తించి, అవసరమైన చేయూతనివ్వడమే ప్రభుత్వాలు, వ్యవస్థలు చేయాల్సిన పని. క్రికెట్ బోర్డ్ ఎంతో కొంత ఆ పని చేయబట్టే, ఇప్పుడీ ఘనత సాధ్యమైంది. దాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలి. ఆటగాళ్ళకు తదుపరి మార్గదర్శనం చేయాలి. అది జరిగినప్పుడే ఏ రంగంలోనైనా నవ భారత నిర్మాణమవుతుంది. ఆ సుందర స్వప్నం సాకారం కావడానికి పాలకులు ఆలసించకుండా తమ వంతు కృషి చేయాల్సిన అమృతకాలం ఇదే! -
కోకిల వెళ్లిపోయింది!
వసంతంలో కోకిల గొంతు సవరించుకుంటుంది. పంచమ శ్రుతిలో తన స్వరమాధుర్యాన్ని జనాలకు అయాచితంగానే పంచిపెడుతుంది. ఇది ప్రకృతి ధర్మం. కానీ, వసంత పంచమితో పాటూ ఆ గాన కోకిల వెళ్ళిపోయింది. ఎంత చేటుకాలం ఇది! ఎంత పాడుకాలం ఇది! మాయదారి మహమ్మారి ఇప్పటికే ఎందరెందరినో గద్దలా తన్నుకుపోయింది. మనసులకు మారాకులు వెయ్యనివ్వని ఆశ రాలుకాలం ఇది. కోకిలను పోగొట్టుకున్న అశేష సంగీతాభిమానులకు అకాల బాష్పవర్షాకాలం ఇది. ‘కరోనా‘ కరాళకాలం మొన్నటికి మొన్న మన గానగంధర్వుడిని గల్లంతు చేసింది. అభిమానులు ఆ విషాదం నుంచి తేరుకుంటూ ఉన్నారనేలోగానే, మిగిలి ఉన్న గాన కోకిలనూ ఇప్పుడు తీసుకుపోయింది. వసంత పంచమి మరునాటి ఉదయమే అస్తమించిన గానకోకిల లతామంగేష్కర్ భారతీయ సినీసంగీత సామ్రాజ్యానికి మకుటంలేని మహారాణి. స్వతంత్ర భారతదేశంలో పుట్టిన వారిలో ఆమె స్వరఝరిలో తడిసి తరించనివారంటూ ఎవరూ ఉండరు. ఇది అతిశయోక్తి కాదు. స్వభావోక్తి మాత్రమే! ఆమె స్వరప్రస్థానం భారతదేశ స్వాతంత్య్ర ప్రస్థానంతో పాటే సాగింది. ఇన్నేళ్లలోనూ స్వాతంత్య్ర భారతం ఎన్నో ఎగుడుదిగుళ్లను చవిచూసింది గాని, లతా గాత్రం మాత్రం ఏనాడూ చెక్కుచెదరలేదు. వన్నెతరగని ఆమె స్వరమాధుర్యం దాదాపు ఏడున్నర దశాబ్దాలుగా కొన్నితరాల శ్రోతలను సేదదీర్చింది, ఊరడించింది, ఉర్రూతలూపి ఓలలాడించింది. లతా పాట ఎల్లలులేని పిల్లతెమ్మెర. ఆమె అభిమానుల్లో దేశాధినేతలు మొదలుకొని అమిత సామాన్యుల వరకు కోట్లమంది ఉన్నారు. లతా పాట గలగలల సెలయేరు. ఆమె అభిమానుల్లో ఉద్దండ పండితులూ ఉన్నారు, పరమ పామరులూ ఉన్నారు. లతా పాట జోలలూపే ఉయ్యాల. ఆమె అభిమానుల్లో పసిపిల్లలూ ఉన్నారు, పండు ముదు సళ్లూ ఉన్నారు. లతా పాట ఒక అమృత« దార. అక్షరాలా ఆబాలగోపాలాన్నీ అలరించిన అద్భుత గానమాధుర్యం ఆమెది. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో లతా మంగేష్కర్ ఒక హిమవత్ శిఖరం. సినీ సంగీత రంగంలో రాణించాలనుకునే ఔత్సాహిక గాయనీగాయకులకు ఆమె ఒక అత్యున్నత ప్రమాణం. ఆమెతో గొంతు కలిపితే చాలు, తమ జన్మ చరితార్థమైనట్లే అనుకునే యువ గాయకులు ఎందరో! ఆమె స్థాయిలో పదోవంతును అందుకోగలిగినా చాలు, తమ కెరీర్‌కు తిరుగుండదని భావించే కొత్తతరం గాయనీమణులు ఎందరో! ఆమె పాటలకు స్వరకల్పన చేసే అవకాశం దొరకడమంటే నవ తరం సంగీత దర్శకులకు అదొక హోదాచిహ్నం! ఎంచుకున్న రంగంలో అత్యున్నత శిఖరానికి చేరు కోవడం అంత ఆషామాషీ పని కాదు. ఒకసారి చేరుకున్నాక, కడవరకు ఆ స్థానాన్ని పదిలంగా కాపాడుకోవడం మరెంతటి కఠోరదీక్షతో సాధించిన ఘనత అయి ఉండాలి! ఆ ఘనత కారణంగానే దేశంలోని అత్యున్నత సత్కారమైన ‘భారతరత్న’ సహా అసంఖ్యాకమైన అవార్డులు, బిరుదులు, రాజ్యసభ సభ్యత్వం వంటి గౌరవ పదవులు ఆమెను కోరి మరీ వరించాయి. రాజ్యసభలో కొన సాగిన ఆరేళ్లూ రూపాయి వేతనమైనా తీసుకోకుండా సేవలందించిన అరుదైన వ్యక్తిత్వం ఆమెది. పదమూడేళ్ల పసిప్రాయంలోనే తండ్రిని కోల్పోయి, కుటుంబ భారాన్ని నెత్తికెత్తుకున్న ఒక సాదాసీదా అమ్మాయి అంచెలంచెలుగా ఎదిగి, ఎవరూ అందుకోలేనంత స్థానానికి చేరుకోవడం దాదాపు ఊహాతీతం. సినిమాను తలపించే లతా జీవితంలో ఇది వాస్తవం. తొలినాళ్లలో ఆర్థిక కష్టాలతో సతమతమవుతూనే, సంగీత సాధన కొనసాగించేది. సినీ అవకాశాల కోసం ప్రయత్నించే తొలినాళ్లలో ‘పీల గొంతు’ అనే పెదవి విరుపులతో తిరస్కారాలనూ ఎదుర్కొంది. తిరస్కారాలకు చిన్నబుచ్చుకుని అక్కడితోనే ఆగిపోయి ఉంటే, ఆమె లతా అయ్యేదే కాదు. పట్టువదలని దీక్షతో ముందుకు సాగడం వల్లనే ఆమె రుతువులకు అతీతమైన ‘గానకోకిల’ కాగలిగింది. మాతృభాష మరాఠీ, హిందీ పాటలకే పరిమితమై ఉంటే, లతా మంగేష్కర్‌కు ఇంతటి ప్రఖ్యాతి దక్కేది కాదు. ఆమె మన తెలుగు సహా అనేక భారతీయ భాషల్లో పాటలు పాడింది. అందుకే, దేశవ్యాప్తంగా మారుమూల పల్లెల్లోనూ ఆమెకు అభిమానులు ఉన్నారు. అత్యధిక సంఖ్యలో సినిమా పాటలు పాడిన గాయనిగా 1974లోనే గిన్నిస్ రికార్డు సాధించిన ఘనత ఆమెకే దక్కింది. అప్పటికే ఆమె వివిధ భాషల్లో పాతికవేల పైగా పాటలు పాడింది. శతాధిక సంగీత దర్శకుల స్వరకల్పనలకు తన గాత్రంతో ప్రాణం పోసింది. నాలుగు తరాల గాయకులతో గొంతు కలిపింది. ఐదు చిత్రాలకు సంగీతం అందించడమే కాక, 4 చిత్రాలను నిర్మించింది. తన సుదీర్ఘ ప్రస్థానంలో ఆమె అందుకోని విజయాల్లేవు. ఆమె గొంతు పలకని భావోద్వేగాలు లేవు. ఆమె గాత్రంలో ఒదగని సంగతులు లేవు. భారతదేశంలో లతా భాషాతీతంగా ప్రతి ఇంటి అభిమాన గాయని. అందుకే, ఆమె మరణవార్త యావత్ దేశాన్ని్న విషాదసాగరంలో ముంచేసింది. ఆమె మరణవార్త వెలువడిన మరునిమిషం నుంచే సామాజిక మాధ్యమాల్లో సంతాప సందేశాల ప్రవాహం మొదలైంది. ఆమె జ్ఞాపకాలను తలచుకుంటూ అభిమానులు ఆమె పాటల వీడియోలతో పెట్టిన పోస్టులతో సామాజిక మాధ్య మాలు హోరెత్తిపోవడం మొదలైంది. లతానే ప్రేరణగా తీసుకుని, ఆమె స్ఫూర్తితోనే సినీసంగీత రంగంలోకి అడుగుపెట్టిన సంగీత కళాకారులంతా ఆమె మరణవార్తకు కన్నీరు మున్నీరయిన దృశ్యా లను టీవీల్లో చూసిన అభిమానులూ కన్నీటి పర్యంతమయ్యారు. భారతీయ సినీ సంగీతరంగంలో ఎందరో గాయనీమణులు ఉన్నా, లతా మంగేష్కర్ది ఒక అత్యున్నత ప్రత్యేకస్థానం. ఇప్పుడది ఖాళీ అయిపోయింది. దానినెవరూ ఎప్పటికీ భర్తీ చేయలేరు! -
పురోగతికి ఇది బూస్టర్ బడ్జెట్
ఆర్థిక సంక్షోభ సమయంలోనూ బడ్జెట్లోని ఉద్దీపనల ప్రణాళికల లక్ష్యాన్ని కూడా మించి భారత్ గత రెండేళ్లుగా సత్ఫలితాలను పొందగలుగుతోందంటే కారణం– దేశాన్ని నడిపిస్తున్నవారి దృఢత్వం. బడ్జెట్‌పై ఎవరెన్ని విమర్శలు చేసినా, లెక్కల ఎక్కువ తక్కువల నుంచి నిరాశాపూరితమైన అర్థతాత్ప ర్యాలను ఎత్తి చూపినా, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రానున్న పాతికేళ్లలో భారత్ వందేళ్ల స్వాతంత్య్ర గమనాన్ని అభివృద్ధిపథంలోకి వేగవంతం చేసే భవిష్యత్ ప్రణాళికే ఈ బడ్జెట్. కరోనా ప్రభావ పర్యవసానాల నుంచి దేశాన్ని ముందుగానే భద్రతా వలయంలోకి తప్పిం చడం, అభివృద్ధిని కుంటపడ నివ్వని విధంగా స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం అనే రెండు అంశాలపై తాజా కేంద్ర బడ్జెట్ చక్కని సమతుల్యతను పాటిం చింది. కరోనా తన అనూహ్యమైన ఉత్పరివర్తనలతో ప్రపంచ దేశా లతో పాటు భారత్‌నీ లాక్డౌన్లోకి నెట్టేసిన నేపథ్యంలో మిగతా దేశాల మాదిరిగానే మనమూ ఈ విపత్తువంటి పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు అనుగుణంగా రెండు వార్షిక బడ్జెట్లకు, మధ్యమధ్య కొన్ని చిన్నతరహా బడ్జెట్లకు రూపకల్పన చేసుకున్నాం. సహజంగానే ఈ అత్యయిక స్థితిలో సంపన్న దేశాలు తమ బడ్జెట్లలో భారీ ఉద్దీపన ప్రణాళికలను ఏర్పరచుకున్నాయి. భారత్ కూడా అదే బాటలో ఆర్థికపరమైన స్థిర నిర్ణయాలకు మొగ్గు చూపింది. రెండేళ్లు గడిచినా నెమ్మదించని కరోనా... సంపన్న దేశా లను సైతం అప్పుల పాలు చేసింది. యావత్ ప్రపంచ పురోగతి మార్గాలు మూసుకుపోయాయి. ద్రవ్యోల్బణం ఆయా దేశాలను వరదలా ముంచెత్తింది. అదే సమయంలో భారత్... ప్రపంచం లోనే అతి వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఈ ఏడాది 9.2 శాతం స్థూల జాతీయోత్పత్తిని సాధించే దిశగా పయని స్తోంది. కఠినమైన ఈ ఆర్థిక సంక్షోభ సమయంలోనూ బడ్జెట్ లోని ఉద్దీపనల ప్రణాళికల లక్ష్యాన్ని మించి కూడా సత్ఫలితా లను భారత్ పొందగలుగుతోందంటే కారణం... దేశాన్ని నడిపి స్తున్నవారి దృఢత్వం, వారి తిరుగులేని అధినాయక ఆర్థిక దిశా నిర్దేశకత్వమే! గత రెండేళ్లుగా భారత్ అనుసరిస్తూ వస్తున్న చురుకైన విధానాల రూపకల్పన, వస్తు సేవల సరఫరాలను పెంపొందిం చేలా తీసుకువచ్చిన సంస్కరణలు వర్తమాన ఆర్థిక స్థితికి పటిష్ఠ మైన పునాదిని అందించాయి. 2047 నాటికి వందేళ్ల స్వాతంత్య్రం వైపు భారతదేశాన్ని తీసుకెళ్లే పాతికేళ్ల ‘అమృత కాల’ జవ, జీవనయాన మార్గాన్ని సుగమం చేశాయి. ఆర్థిక అవ రోధాలను, అంతరాయాలను వినూత్న ఆవిష్కరణలతో నెగ్గుకు వచ్చేందుకు భారత ప్రధాని దర్శించిన ‘ఆత్మనిర్భర భారత్’ ప్రపంచ దేశాలకు కూడా దారి చూపగలిగినంతటి శక్తిమంత మైనది. ఈ దార్శనికతకు కొనసాగింపుగానే భారత సమ్మిళిత, స్థిరాభివృద్ధి కోసం 2022–23 బడ్జెట్‌కు సూత్రకల్పన జరిగింది. ఇందులో భావి భారత నిర్మాణానికి పునాది స్తంభాలుగా కనిపి స్తున్న కొన్ని ముఖ్యాంశాలను నేను ఇక్కడ ప్రస్తావించదలిచాను. ఒక పార్టీ నాయకుడిగా కాక, ప్రజాహితాన్ని ఆశించే ఒక పరిశీల కుడిగా బడ్జెట్లోనే నేను నాలుగు అంశాలను తరచి చూశాను. మొదటిది – మూలధన వ్యయం. భారతదేశ మధ్యకాలిక వృద్ధిని ప్రగతిపథంలో పైపైకి పురోగమింపజేసే శక్తి.. నిరంత రాయంగా కొనసాగే స్థిరత్వమే. ఆ స్థిరత్వాన్ని కల్పించే మౌలిక సదుపాయాల వ్యయానికి గత ఏడాది బడ్జెట్లో జరిగిన భారీ కేటాయింపులు తాజా బడ్జెట్లో గణనీయంగా అపూర్వ రీతిలో రూ. 7.5 లక్షల కోట్లు అయి, 35.4 శాతం పెరిగాయి. ఇదే ఊపులో గతిశక్తి బృహత్ ప్రణాళికలో ఒక భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించే 1.5 ట్రిలియన్ డాలర్ల జాతీయ మౌలిక సదుపాయాల వ్యవస్థకు ఈ బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చింది. అనుసంధాన పరిధిలోకి వచ్చే విద్య, రక్షణ, వాణిజ్య రంగాలపైన కూడా గతిశక్తి సానుకూల ప్రభావం, ప్రయోజనం ఉంటాయి. రెండవది – డిజిటైజేషన్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంభ వించగల మార్పులు, పరిణామాలకు అనుగుణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ విధానాన్ని పునఃపరిశీలించుకునేందుకు అవసర మైన ముఖ్యమైన పనిని తాజా బడ్జెట్ నిర్దేశించుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థను డిజిటల్ కరెన్సీతో బలోపేతం చేసే ఈ అద్భుతమైన ఆలోచన మోదీ ప్రగతిశీల భావజాలం నుంచి ఆవిర్భవించిందే! దీంతో భారత్ ప్రపంచంలోనే డిజిటల్ కరెన్సీ కలిగిన అతి పెద్ద దేశాలలో ఒకటిగా అవతరించినట్లయింది. పెట్టుబడిదారుల ప్రయోజనాలకు డిజిటల్ కరెన్సీ గట్టి రక్షణను ఇస్తుంది. ఆన్లైన్ మోసాల నుంచి భద్రతనిస్తుంది. మనీ లాండరింగ్‌ను నిరోధిస్తుంది. మూడవది – పన్ను ఆదాయాల రాబడిని పెంచే నిర్ణ యాలు. గడిచిన ఏడాదిలో ప్రతినెలా కూడా వస్తుసేవల పన్ను వసూళ్లు (జీఎస్టీ) రికార్డు స్థాయిలో ఉంటున్నాయి. ఒక్క జనవరిలోనే మునుపెన్నడూ లేనంత అత్యధికంగా వసూళ్లు రూ. 1.4 లక్షల కోట్లకు చేరుకున్నాయి! ఫలితంగా ద్రవ్యోల్బణం నెమ్మదిగానే అయినా కచ్చితంగా దారికి వస్తుంది. నాల్గవది, వ్యక్తులను ఆర్థికంగా శక్తిమంతులను చేయడం. వారికి సాధికారతను కలిగించడం. నిర్ణయాధికార బలాన్ని చేకూర్చడం. బడ్జెట్లోని సామాజిక రక్షణను పునర్వచించిన విలక్షణమైన గుణం ఇది. పి.ఎం. ఆవాస్ యోజన, పి.ఎం. కిసాన్ సమ్మాన్ నిధి వంటి కీలకమైన పథకాలకు బడ్జెట్లో కేటాయింపులు స్పష్టమైన వ్యత్యాసంతో పెరిగాయి. అత్యంత ప్రజావశ్యక ‘హర్ ఘర్ నల్ సే జల్’ పథకం కింద 3 కోట్ల 50 లక్షల ఇళ్లకు తాగు నీటిని అందించేందుకు కేంద్ర 60 వేల కోట్ల రూపాయలను ప్రత్యేకించింది. దేశంలో వివిధ ప్రాంతాలను కలిపే విధంగా 25 వేల కి.మీ. జాతీయ రహదారుల నిర్మా ణానికి ప్రాధాన్యం ఇచ్చింది. ‘ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సా హాక’ ప్రణాళికతో 60 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పించ బోతోంది. మహమ్మారి నీడ పడిన ప్రతి రంగానికి, ప్రతి విభా గానికి వెలుగును ప్రసరింపజేసేందుకు ఉద్దేశించిన ఈ బడ్జెట్... రైతులకు నేరుగా కూ. 2.37 లక్షల కోట్ల కనీస మద్దతు ధరను చెల్లించబోతోంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభి వృద్ధి కోసం ప్రస్తుతం ఉన్న అత్యవసర రుణ సహాయ వ్యవస్థను పరిపుష్టం చేసి, ఆ పరిశ్రమల పనితీరును వేగవంతం చేసే పథ కాన్ని ప్రవేశపెట్టనుంది. అంకుర సంస్థలకు పన్ను మినహా యింపులను విస్తృతం చేస్తోంది. ఎవరెన్ని విమర్శలు చేసినా, లెక్కల ఎక్కువ తక్కువల నుంచి నిరాశాపూరితమైన అర్థతాత్పర్యాలను ఎత్తి చూపినా, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో.. రానున్న పాతికేళ్లలో భారత్ వందేళ్ల స్వాతంత్య్ర గమనాన్ని అభివృద్ధి పథంలోకి వేగవంతం చేసే సమీప భవిష్యత్ ప్రణాళికే ఈ బడ్జెట్. ముందే చెప్పినట్లు కరోనా ప్రభావాల నుంచి జాతికి రక్షణ వలయాన్ని ఏర్పరుస్తూ, అదే సమయంలో స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని సాధించేలా ఒక చక్కటి సమతుల్యాన్ని పాటిస్తూ రూపొందిన బడ్జెట్ ఇది. ప్రపంచ దేశాలలో భారత్ మహాశక్తిగా ఎదిగే పరివర్తన క్రమాన్ని మోదీ పాలనలోనే దేశ ప్రజల చూడబోతున్నారు. ఈ పరివర్తన.. మౌలిక సదుపాయాలు, డిజిటైజేషన్, మూలధన పెట్టుబడులు, వాణిజ్య స్నేహశీలతల చక్రాలపై, ఇంకా.. కోటీ ముప్పై లక్షల మంది ప్రజల స్ఫూర్తి సామర్థ్యాలపై సాగబోతోందని బడ్జెట్ సారాంశం తెలియ జేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పాలన వ్యవహారశైలిలోని దృఢత్వం, భావిభారత లక్ష్యాలపై పట్టు, భారత్ ఎంత గడ్డు స్థితినైనా ఎదుర్కోగలదని ఆయన ఇస్తున్న ధీమా, అర్థంలేని విమర్శలతో విలువైన చట్టసభల సమయాన్ని, ప్రజాధనాన్ని వృ«థా పరిచే ప్రతిపక్షాల కుటిలయత్నాలకు గట్టి సమాధానం బడ్జెట్లో ప్రతిఫలించాయి. జ్యోతిరాదిత్య సింధియా కేంద్ర మంత్రి –బీజేపీ నాయకుడు -
డిజిటల్ ఆదాయ స్వప్నం
నిజాలెంత నిష్ఠూరంగా ఉన్నా, కనీసం కలలైనా కమ్మగా ఉండాలంటారు. నిరుద్యోగం పెరిగి, మధ్య, దిగువ మధ్యతరగతి నడ్డి విరిగిన కరోనా కష్టకాలంలో... తాజా కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం చూపిన భవిష్యత్ డిజిటల్ చిత్రం రకరకాల రంగులీనుతోంది. కాగితంతో పని లేకుండా డిజిటల్ ఉపకరణం సాయంతో ప్రసంగాన్ని చదువుతూ డిజిటల్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి విద్య, వైద్యం, వ్యవసాయం, ఆర్థికం.. అన్ని రంగాలనూ డిజిటల్ బాట పట్టించే ప్రతిపాదనలు చేశారు. కొత్తగా వర్చ్యువల్ డిజిటల్ కరెన్సీ తెస్తామంటూ ‘డిజిటల్ భారతావని’ని అరచేతిలో చూపారు. క్రిప్టో మార్కెట్ పెరుగుతున్న నేపథ్యంలో వర్చ్యువల్ డిజిటల్ ఆస్తుల (వీడీఏల) లావాదేవీలపై 30 శాతం పన్ను ప్రతిపాదించారు. తద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం చర్చంతా వీడీఏలతో జనం గడించే ఆదాయంపై 30 శాతం పన్ను వేయడం మీదే! కొన్నేళ్ళుగా దేశంలో క్రిప్టో పరిశ్రమ ప్రాచుర్యానికి ఈ ప్రతిపాదన ఓ తార్కాణం. ఇటీవల వీడీఏలపై వాణిజ్యం భారీయెత్తున సాగుతుండడాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఒక వీడీఏను బదలాయించి నందుకు చెల్లింపులు కూడా అలాంటి మరో వీడీఏ రూపంలోనే సాగేలా మార్కెట్ ఆవిర్భవించడాన్ని గమనించింది. వెరసి, ఈ డిజిటల్ ఆస్తుల వ్యవహారం పన్ను రాబడికి వనరు అని గ్రహించింది. అందుకే, బడ్జెట్లో వీడీఏల లావాదేవీలపై 30 శాతం మేర పన్ను వేసింది. అలాంటి అమ్మకాలు ఒక నియమిత పరిమితి దాటితే, 1 శాతం మేర టీడీఎస్ (మూలం దగ్గరే పన్ను మినహాయింపు) కూడా విధించింది. ఇలా క్రిప్టో కరెన్సీలు, నాన్ ఫంజిబుల్ టోకెన్ల (ఎన్ఎఫ్టీ) వ్యాపారంలో లాభాలు రానున్న ఏప్రిల్ 1 నుంచి దేశంలోకెల్లా అత్యధిక పన్ను శ్లాబ్‌లోకి వస్తున్నాయి. డిజిటల్ కరెన్సీలకు ఆమోదముద్ర కోరుతున్నవారికి ఇది తీపి, చేదు అనుభూతుల సమ్మిశ్రమం. క్రిప్టో లాంటి డిజిటల్ ఆస్తులకు అధికారికంగా గుర్తింపు ఉన్నదీ, లేనిదీ తేల్చకుండానే ప్రభుత్వం పన్ను విధింపునకు దిగడం గమ్మల్తైన విషయమే. 2018లో రిజర్వ్ బ్యాంక్ క్రిప్టో కరెన్సీల ట్రేడింగ్‌ను నిషేధించడం, ఆ తర్వాత రెండేళ్ళకు సుప్రీమ్ కోర్ట్ ఆ నిషేధాన్ని ఎత్తేయడం తెలిసిందే. అది జరిగీ మరో రెండేళ్ళవుతున్నా కేంద్రం ఈ క్రిప్టోలపై ఒక కచ్చితమైన విధాన నిర్ణయానికి రాలేకపోవడం విడ్డూరం. లాటరీ, జూదం, ఇతర గేమింగ్ల లాంటి స్పెక్యులేషన్ కార్యకలాపాలతో సమానంగా 30 శాతం భారీ పన్ను క్రిప్టో వ్యాపారాన్ని నిరుత్సాహపరచడానికేనని కొందరి అభిప్రాయం. అది కొంత నిజమే. లాభాలకు పన్ను కట్టినా, డిజిటల్ ఆస్తుల బదలాయింపులో నష్టాలు ఎదురైతే మాత్రం ఇతర ఆదాయంతో దాన్ని సమం చేస్తూ లెక్కలు చూపడానికి లేదన్న నిబంధన అందుకు నిదర్శనం. అయితే, అసలంటూ పన్ను విధింపు ద్వారా పరోక్షంగా డిజిటల్ ఆస్తుల్ని గుర్తిస్తున్నట్టు సర్కారు సంకేతాలిచ్చిందని ఇంకొందరు నిపుణుల మాట. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన మన దేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించాలని ప్రభుత్వం కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. ఈ తాజా చర్యలు అందులో భాగమే. మోదీ సర్కార్ 2016లో చేసిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి తగ్గట్లే ఇప్పుడు కొత్త డిజిటల్ కరెన్సీ ప్రతిపాదన తెచ్చింది. పొరుగున ఉన్న చైనా డిజిటల్ యువాన్ తేవడంపై మల్లగుల్లాలు పడు తుండగానే, రిజర్వ్ బ్యాంక్ సారథ్యంలో డిజిటల్ రూపీ తేనున్నట్టు మనం ప్రకటించడం పెద్ద విషయమే. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్, మైనింగ్లను నిషేధించిన చైనా ఈ నెలలో శీతకాలపు ఒలింపిక్స్ నాటికి డిజిటల్ యువాన్ తేవాలని ప్రయత్నిస్తోంది. బ్రిటన్ కూడా డిజిటల్ కరెన్సీ తేవాలనుకుం టోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నోట డిజిటల్ రూపీ మాట క్రిప్టో కరెన్సీ వ్యాపారులకు హర్షమే. నిజానికి, మన దేశంలో దాదాపు 1.5 నుంచి 2 కోట్ల మంది క్రిప్టో ఇన్వెస్టర్లున్నారని అంచనా. వారి మొత్తం క్రిప్టో ఆస్తుల విలువ రూ. 40 వేల కోట్లని లెక్క. కరోనా దెబ్బతో ఖజానాకు ఆదాయం తగ్గుతున్నవేళ, జనం ఎగబడుతున్న క్రిప్టో పరిశ్రమ కొత్త పన్ను రాబడి కోసం ప్రభుత్వానికి పాడి ఆవులా కనిపించింది. అందుకే, బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టింది. మొదటి నుంచీ క్రిప్టో పరిశ్రమ పట్ల సదభిప్రాయం లేని సర్కారు తెలివిగా బడ్జెట్లో క్రిప్టో కరెన్సీ అనే పదం వాడలేదు. డిజిటల్ ఆస్తులు అనే ప్రస్తావిస్తూ వచ్చింది. ఇంతకీ, క్రిప్టో తదితర ఆస్తుల్ని అధికారికంగా ఏ మేరకు గుర్తిస్తున్నదీ, వాటి చట్టబద్ధత ఎంత అన్నదీ ప్రభుత్వమే వివరించాలి. తీవ్రవాద సంస్థల చేతిలో క్రిప్టో కరెన్సీ దుర్వినియోగమయ్యే ప్రమాదానికి నివారణ చర్యలనూ ఆలోచించాలి. రోజురోజుకూ పెరుగుతున్న డిజిటల్ కరెన్సీల మార్కెట్లో ప్రధాన వాటా కోసం డిజిటల్ రూపీ ఆలోచన బాగుంది. కానీ, ఇవాళ్టికీ దేశంలో సగానికి సగం మందికి డిజిటల్ నగదు లావాదేవీలు తెలియని చోట, కొత్తగా తెచ్చే అధికారిక డిజిటల్ రూపీ ప్రయోజనాలను పరిచయం చేసే బాధ్యత చేపట్టాలి. ఇక, క్రిప్టోతో ఈ డిజిటల్ రూపీ ఏ మేరకు పోటీపడుతుందన్నది మరో ప్రశ్న. రెండూ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ మీద ఆధారపడినా, క్రిప్టోలో లాగా ఇక్కడ ఇన్వెస్టర్ల వివరాలు అజ్ఞాతంగా ఉండడం కుదరదు. ఒక్కమాటలో పరిశ్రమలో అగ్రభాగంలో నిలవడానికి డిజిటల్ రూపీ ఇంకా చాలా దూరమే ప్రయాణించాలి. క్రిప్టో ట్రేడింగ్‌పై పూర్తి నిషేధానికీ, ఇటు నియంత్రణలకూ మధ్యేమార్గంలో ప్రభుత్వం రెండు వ్యవస్థలూ సామరస్యంగా కొనసాగే చర్య చేపడుతుందేమో వేచి చూడాలి. అది ఎంత త్వరగా స్పష్టతనిస్తే అమాయక ఇన్వెస్టర్లకు అంత మేలు! -
తెలుసుకోవాల్సిన నిజం!
ఇజ్రాయెలీ సైబర్ నిఘా సాఫ్ట్వేర్ ‘పెగసస్’ వ్యవహారం పీటముడిగా మారుతోంది. రోజుకో కొత్త కథనం బయటకొస్తూ, పాలకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేంద్రం తనకు వ్యతిరేకమని భావిస్తున్న జర్నలిస్టులు, పౌరహక్కుల నేతలు, రాజకీయవాదులపై నిఘా కోసం ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిం చిందనే వాదనకు ప్రసిద్ధ ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక జనవరి చివరలో ప్రచురించిన తాజా కథనం తోడైంది. ఆ కథనం రాసిన పరిశోధనాత్మక జర్నలిస్టుతో ‘ది వైర్’ జరిపిన తాజా వీడియో ఇంటర్వ్యూ మరో సంచలనమైంది. ఒకేసారి 50 ఫోన్లపై నిఘాకు వీలుగా భారత్ ఆ నిఘావేర్‌ను కొన్నదన్నది ఆ జర్నలిస్టు మాట. వ్యక్తుల ప్రైవసీకి భంగకరంగా ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించినట్లు ప్రభుత్వం అధికారికంగా ఒప్పుకోలేదన్న మాటే కానీ, బయటపడుతున్న కథనాలు ఆ చేదు నిజాన్నే చెబుతు న్నాయి. పెగసస్‌పై సుప్రీమ్ కోర్టే రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్వీ రవీంద్రన్ సారథ్యంలో ముగ్గురు నిపుణుల బృందంతో స్వతంత్ర దర్యాప్తు సాగిస్తున్నవేళ బయటకొచ్చిన ఈ అంశాలు దిగ్భ్రాంతికరం. పార్లమెంటులో కానీ, సర్వోన్నత న్యాయస్థానంలో కానీ మన పాలకులు నోరు విప్పి అవునని కానీ, కాదని కానీ చెప్పలేదన్నమాటే కానీ, అంతర్జాతీయ వేదికలు పెగసస్ దుర్వినియోగాన్ని నెత్తీ నోరూ కొట్టుకొని చెబుతూనే ఉన్నాయి. తప్పు జరిగిందనే వేలెత్తి చూపుతున్నాయి. పెగసస్ నిఘా బారిన పడిన 50 వేల పైచిలుకు మందిలో 300 మంది భారతీయులేనని ఓ అంతర్జాతీయ జర్నలి స్టుల కన్సార్టియమ్ గత జూలైలోనే చెప్పింది. ఇలా ఆరోపణలు వస్తున్నా సరే జాతీయ భద్రతను సాకుగా చూపి, పాలకులు దర్యాప్తు జరపకపోవడం సరి కాదని సుప్రీమ్ కోర్టే చెప్పాల్సి వచ్చింది. పెదవి విప్పని ప్రభుత్వ ప్రవర్తనతో చివరకు స్వతంత్ర విచారణకూ ఆదేశించాల్సి వచ్చింది. అది ఓ పక్క సాగుతుండగానే, నిరుడు డిసెంబర్లో అమెరికన్ ఫోరెన్సిక్ దర్యాప్తు సంస్థ ఆర్సెనెల్ కన్సల్టింగ్ మరో సంగతి వెల్లడించింది. బీమా కోరేగావ్ కేసులో ఉద్యమకారుడు రోనా విల్సన్‌ను జైలులో పెట్టిన వ్యవహారమూ పెగసస్ పుణ్యమే అని బయట పెట్టింది. విల్సన్ మొబైల్ ఫోన్‌పైన కనీసం 49 సార్లు దాడి జరిగిందనీ, ఆయన కంప్యూటర్లో, ఆయన సహ నిందితుడైన సురేంద్ర గాడ్లింగ్ కంప్యూటర్లోనూ వైరస్‌ను ప్రవేశపెట్టారనీ తేల్చింది. నెల తిరిగిందో, లేదో ఇçప్పుడు న్యూయార్క్ టైమ్స్ జనవరి 28 నాటి కథనం సంచలనమైంది. ఇజ్రాయెల్‌కు చెందిన ‘ఎన్ఎస్ఓ గ్రూపు’ ఈ ‘పెగసస్’ నిఘావేర్‌ను ఎలా రూపొందించిందీ, ప్రపంచవ్యాప్తంగా ప్రయో జనాల్ని కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ ఎలా వాడుకున్నదీ ఆ పరిశోధనాత్మక కథనం వివరించింది. నిజానికి, తీవ్రవాదులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాదార్ల కోసం ఉద్దేశించిన నిఘా సాఫ్ట్ వేర్ అది. కానీ, దాన్ని ప్రతిపక్షాల పైన, ఓ కన్నేసి ఉంచే జర్నలిస్టుల పైన వాడేందుకు వీలుగా ఇజ్రా యెల్ అమ్మజూపింది. ఆ రకంగా పాలస్తీనా విషయంలో సుదీర్ఘకాలంగా తమను వ్యతిరేకిస్తున్న దేశాలను సైతం తమ వైపు తిప్పుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ అమ్మకాన్ని తాయిలంగా చూపింది. 2020 ఆగస్టులో ఇజ్రాయెల్‌కూ, పొరుగున ఉన్న అరబ్ దేశాలకూ మధ్య ‘అబ్రహమ్ శాంతి ఒప్పందాలు’ కుదరడానికీ ఇదే కారణమట. అలాగే, పాలస్తీనా విషయంలో ఏళ్ళ తరబడి ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించిన భారత్ సైతం ఇటీవల చెట్టపట్టాలేసుకోవడానికీ ఇదే కారణమని ఆరోపణ. ఇజ్రాయెల్‌ను సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీయే. 2017 జూలై నాటి ఆ పర్యటనలో భారత్, ఇజ్రాయెల్‌ల మధ్య కుదిరిన 200 కోట్ల డాలర్ల మేర ‘అత్యాధునిక ఆయుధాలు, నిఘా పరికరాల’ ఒప్పందంలో ఈ ‘పెగసస్’ నిఘా సాఫ్ట్వేర్ కొనుగోలు సైతం భాగమనేది ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం. ఆ తర్వాతే అనేక ఏళ్ళ పాలస్తీనా అనుకూల విధానాన్ని భారత్ మార్చేసుకుందనీ, 2019లో ఐరాస ఆర్థిక, సామాజిక మండలిలో పాలస్తీనా మానవ హక్కుల సంఘానికి పరిశీలక హోదా నిరాకరిస్తూ, ఇజ్రాయెల్ వైపు ఓటు వేసిందనీ వాదన. అలాగే, ప్రభుత్వ విమర్శకుల నోళ్ళు మూయించడం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మెక్సికోలలో పెగసస్‌ను వాడారట. అమెరికా తన నిఘాసంస్థ ‘ఎఫ్‌బీఐ’లో సైతం ఆ సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించి చూసిందట కానీ, దేశంలో వాడలేదట. ఒకప్పుడు ఫోన్ వాడేవారిని ఆకర్షించి, వారు క్లిక్ చేసే మోసకారి లింకుల రూపంలో జొరబడేవారు. ఇప్పుడూ లింకులు నొక్కడం లాంటివేవీ అవసరం లేకుండానే లక్షిత వ్యక్తిపై నిఘా పెట్టడం, కంప్యూటర్లలో కొత్త లెటర్లు జొప్పించడం కొత్త పెగసస్ పద్ధతి. అంటే బీమా కోరేగావ్ సహా అనేక కేసుల్లో మావోయిస్టు పథకరచన అంటూ పాలకులు చూపిస్తున్న ఆధారాల విశ్వసనీయత ప్రశ్నార్హమైనదే. అసలు ప్రభుత్వాలకే పెగసస్‌ను విక్రయిస్తుంటామని ఎన్ఎస్ఓ చెబుతోంది. అందుకే, పౌరస్వేచ్ఛకూ, ప్రాథమిక హక్కులకూ భంగం కలిగించేలా పాలకులు అనుసరిస్తున్న ఈ దొడ్డిదారి సంగతి తేలాల్సిందే. న్యూయార్క్ టైమ్స్ సహా తాజా కథనాల సమాచారాన్నీ సుప్రీమ్ స్వతంత్ర విచారణ బృందం పరిగణనలోకి తీసుకోవాలి. అసలు కథేమిటో అధికారికంగా నిగ్గుదేల్చాలి. కంటిలో నలుసుగా మారిన వకీళ్ళు, పౌర ఉద్యమకారులు, జర్నలిస్టులతో సహా పలువురి మొబైల్ ఫోన్లనూ, ఇతర పరికరాలనూ పెగసస్ తోనో, లేదంటే మరేదైనా నిఘావేర్తోనో పాలకులు ఇనెఫెక్ట్ చేసిందీ, లేనిదీ వెల్లడి కావాలి. దీనిపై పట్టుబడుతున్న ప్రతిపక్షాలే కాదు... పౌరసమాజం... యావద్దేశం తెలుసుకోవాలను కుంటున్నది అదే. మరి, పాలకులు తెలుసుకోనిస్తారా? సచ్ఛీలతను నిరూపించుకుంటారా? -
సరస్వతీ నమస్తుభ్యం!
కోవిడ్ మహమ్మారి సాగించిన ఆర్థిక విధ్వంసంపై రకరకాల కథనాలు వస్తున్నాయి. అధ్యయనాలు వెల్లడవుతున్నాయి. సమస్త జీవన రంగాల్లోని ఏ పాయనూ అది వదిలిపెట్టలేదు. మెజారిటీ ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. ఆక్స్‌ఫామ్ అధ్యయనం ప్రకారం మన దేశంలో 84 శాతం మంది ప్రజలు నష్టపోయారు. వారిలో పేదవాళ్లు మరింత ఎక్కువ నష్టపోయారు. బాగా బలిసినవాళ్లు తెగ బలిశారు. దేశంలోని సూపర్ రిచ్ కుబేరుల సంపద కేవలం ఇరవై మాసాల్లో రెట్టింపయ్యింది. వీళ్లంతా అల్లావుద్దీన్లయితే కోవిడ్ వాళ్ల చేతుల్లో వండర్ ల్యాంప్‌గా మారింది. 2020 మార్చిలో ఈ నూరుగురు కుబేర పుత్రుల ఉమ్మడి సంపద విలువ 23 లక్షల కోట్లు. నవంబర్ 21 నాటికి అది 53 లక్షల కోట్లకు లాంగ్‌జంప్ చేసింది. దేశ జీడీపీలో ఇది రమారమి మూడో వంతు. ఆక్స్‌ఫామ్ లెక్క ప్రకారమే అదే సమయంలో దేశంలో 4.6 కోట్లమంది దుర్భర దారిద్య్రంలోకి జారిపోయారు. కోవిడ్ వచ్చిన మొదటి సంవత్సరం ఉపాధి హామీ పథకంలో 11 కోట్లమందికి పైగా నమోదయ్యారు. అంతకుముందు సంవ త్సరంలో పోలిస్తే ఇది 4 కోట్లు ఎక్కువ. ఈ సంవత్సరం ఈ సంఖ్య మరింత పెరుగుతుందట. సుప్రసిద్ధ ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ ఈ పరిణామాలపై ఒక ఆసక్తికరమైన పోలికను తీసుకొచ్చారు. 1940ల నాటి దారుణమైన బెంగాల్ క్షామం రోజుల్లో నిరుపేదలను ఎవరూ పట్టించుకోలేదు. అట్లాగే ఇప్పటి కోవిడ్ పరిణామాల్లో కూడా అత్యంత నిరుపేదలు అతి దారుణంగా దెబ్బతిన్నారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం, నేటి భారత ప్రభుత్వం నిరుపేదల విష యంలో ఒకేరకంగా వ్యవహరించాయన్నారు. తనతో మాట్లాడిన సందర్భంలో అమర్త్యసేన్ ఈ వ్యాఖ్యలు చేశారని సీఎన్‌బీసీ న్యూస్ యాంకర్ మిథాలీ ముఖర్జీ ఒక వ్యాసంలో వెల్లడించారు. మొదటి లాక్డౌన్ సమయంలో మండుటెండల్లో నడిరోడ్లపై నెత్తురోడుతూ కదిలిన కోట్లాది మాంసపు ముద్దల మహాప్రస్థాన దైన్యాన్ని ఈ దేశం స్వయంగా వీక్షించింది కూడా! ‘ఊరు మీద ఊరు పడ్డా కరణం మీద కాకి వాలదు’ అనే సామెత ఉండేది. అదేవిధంగా ఏ సంక్షోభం ముంచుకొచ్చినా ఐశ్వర్యవంతుణ్ణి ఏమీ చేయలేదు. దరిద్ర నారాయణుడిని మాత్రం ఏ మహమ్మారీ వదిలిపెట్టదు. అతడు రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం లాగా వెంటాడుతూనే ఉంటుంది. కోవిడ్ వల్ల ఎక్కువగా దెబ్బతిన్న రంగాల్లో ప్రముఖమైనది విద్యారంగం. ఈ రంగంలో కూడా అతి ఎక్కువగా నష్టపోయినవారు పేదింటి బిడ్డలే. ఇప్పటికే మన విద్యావ్యవస్థలో ప్రమాణాల రీత్యా ధనిక – పేద అంతరం కొనసాగుతూ వస్తున్నది. ఈ రెండేళ్లలో అంతరం మరింత విస్తరించింది. వసతులున్న పిల్లలు ఆన్లైన్ ద్వారా అంతో ఇంతో మేకప్ చేసుకోగలిగారు. ఏ ఆదరువూ లేని పిల్లలు చదువులకు దూరమై డ్రాపవుట్ అంచున నిలబడ్డారు. భారత రాజ్యాంగం ఈ దేశ ప్రజలందరినీ సమస్కంధు లుగా, సమాన వాటాదారులుగా ప్రకటించినప్పటికీ ఇంకా ఇన్ని కోట్లమంది ప్రజలు నిస్సహాయులుగా నిరుపేదలుగా మిగిలి పోవడానికి కారణం ఏమిటి? అందరికీ సమాన స్థాయిలో నాణ్యమైన విద్యను అందివ్వలేకపోవడమే అందుకు కారణమని విద్యావేత్తలు, ఆర్థిక నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలు ఇప్పుడు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పేదరికంపై విజయం సాధించ గలిగే ధనుర్బాణాలను విద్యారంగమే సమకూర్చుతుందని అందరూ అంగీకరిస్తున్నారు. విద్యారంగం మీద జీడీపీలో కనీసం 6 శాతం ఖర్చుపెడితే తప్ప ప్రజలందరికీ నాణ్యమైన విద్యను అందించలేమని జాతీయ విద్యావిధానంపై వెలువడిన కమిటీ రిపోర్టులన్నీ నొక్కి చెప్పాయి. ఆ లెక్కన గడిచిన బడ్జెట్లో కనీసం 10 లక్షల కోట్లయినా విద్యారంగం పద్దులో పెట్టాలి. కానీ కేంద్రం 99 వేల కోట్లను మాత్రమే కేటా యించింది. వాంఛిత కేటాయింపులో ఇది కేవలం పది శాతం. ఇందులో కూడా వాస్తవానికి ఎంత ఖర్చు చేశారో తెలియాలంటే సవరించిన అంచనాలు రావాలి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధిం చిన దగ్గర్నుంచీ విద్యారంగానికి చేసిన బడ్జెట్ కేటాయింపుల కథాకమామీషు ఇదే మాదిరిగా ఉన్నది. తొలిరోజుల్లో విద్యాగంధం ఉన్న కుటుంబాల్లోని పిల్లలు తల్లిదండ్రుల శ్రద్ధ వలన సహజంగానే ముందడుగు వేశారు. వీరికి తోడుగా బడి చదువుతోపాటు ట్యూషన్లు చెప్పించుకునే స్థోమత కలిగిన వాళ్లు మాత్రమే స్కూల్ ఫైనల్ గడప దాటేవాళ్లు. నిరక్షరాస్య కుటుంబాల్లోని పేద పిల్లలు మాత్రం ఆ గడపకు ఆవలనే డ్రాపవుట్లుగా మిగిలిపోయేవారు. ఆర్థిక సంస్కరణలు, గ్లోబలైజేషన్ల తర్వాత ఈ సామాజిక దుర్నీతి మరింత క్రూరంగా తయారైంది. ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకు వెళ్లగలిగిన పిల్లలు ముందడుగు వేశారు. ప్రభుత్వ స్కూళ్లను ఉద్దేశపూర్వకంగా పాడుపెట్టారు. తొలిదశ ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యే నాటికే ఉమ్మడి రాష్ట్ర పాలనా పగ్గాలను తస్కరించిన చంద్రబాబు నాయకత్వంలో ఈ సామాజిక విధ్వంసం యథేచ్ఛగా సాగిపోయింది. పేద పిల్లలు వెళ్లగలిగే ప్రభుత్వ బడుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దేశంలోని మరే రాష్ట్రంలో కూడా ప్రభుత్వ బడులను ఈ స్థాయిలో నిర్లక్ష్యం చేయలేదు. ఇదే సమయంలో ఐటీ విప్లవం ఇబ్బడి ముబ్బడిగా ఉపాధి అవకాశాలను సృష్టించింది. ఇంగ్లిష్ మీడియంలో చదువు కొనుక్కోలేకపోయిన యువతరం ఆ అవకాశాలను అంది పుచ్చుకోవడంలో విఫలమైంది. పేదవర్గాల్లోని ఒక తరం కలలు విద్యావ్యాపారం రథచక్రాల కింద నలిగిపోయాయి. పేదవర్గాల ప్రజలు నాణ్యమైన విద్యకు మూడు దశాబ్దాల పాటు దూరం కావడానికి కారణమైన బాధ్యుల్లో ఒకటో నెంబర్ ముద్దాయిగా చంద్రబాబునే నిలబెట్టవలసి వస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ ఆయన విద్యారంగం పట్ల తన పాత విధానాలనే కొనసాగించారు. 2019 సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని ఘోరంగా ఓడించి అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సరిగ్గా చెప్పాలంటే ఆయన విప్లవ శంఖం పూరించారు. విద్యార్జనలో పెరిగిన ధనిక – పేద అంతరాలు, సామాజిక– ఆర్థిక హోదాల ప్రాతిపదికపై పిల్లలు వేర్వేరు బడుల్లో చదవడానికి దారితీసిన పరిస్థితులపై అధ్యయనం చేశారు. ఈ దుష్పరిణామాలను పరిహరించి కుల మత ప్రాంత లింగ వివక్ష లేకుండా, ధనిక పేద తారతమ్యం లేకుండా పిల్లలంతా ఒక్కటిగా కలివిడిగా చదువుకునే ఒక ప్రణాళికను ఏపీ ముఖ్యమంత్రి తయారు చేసుకున్నారు. వెంటనే దాన్ని దశల వారీగా అమలుచేసే కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యారంగంలో ముఖ్యమంత్రి చేపట్టిన విప్లవాత్మక సంస్కరణల్లో మొదటిది – ‘అమ్మ ఒడి’ పిల్లల్ని స్కూలుకు/ కాలేజీకి పంపించే ప్రతి అర్హురాలైన తల్లికి ఏటా పదిహేను వేల రూపాయలను ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇస్తున్నది. దీనివల్ల రెండు ప్రయోజనాలు కలుగుతున్నాయి. పేదరికం కారణంగా పిల్లల్ని బడికి పంపించలేని దుఃస్థితి తొలగిపోవడం మొదటిది. రెండవది మహిళా సాధికారతకు సంబంధించిన అంశం. అమ్మ చేతిలో డబ్బున్న కారణంగా పిల్లల చదువుకు సంబంధించిన కీలక నిర్ణయాధికారం ఆమెకే ఉంటుంది. సంస్కరణల్లో రెండో ముఖ్యాంశం 16 వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన ‘నాడు–నేడు’ అనే బృహత్తర కార్యక్రమం. కేవలం టాయిలెట్ వసతి లేని కారణంగా ఆడపిల్లలు చదువులు మానేసే దౌర్భాగ్య పరిస్థితి మొన్నటిదాకా మన విద్యావ్యవస్థలో రాజ్యమేలింది. పెచ్చు లూడుతున్న సీలింగ్, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న గది గోడలు, విరిగిన కుర్చీలు – బెంచీలు, పగుళ్లుబారిన ఫ్లోరింగ్, కాంపౌండ్ వాల్ లేక పశువులకు ఆవాసంగా మారిన ఆవరణ, పిచ్చిమొక్కలతో విషపురుగుల విహారం, శిథిలాలయాలకు రాలేక సెలవులతో నెట్టుకొచ్చే పంతుళ్లూ... ఇది మొన్నటివరకు ప్రభుత్వ బడి దృశ్యం. ఇప్పుడు కళ్లతో చూస్తే తప్ప నమ్మలేనంతగా ఆధునిక హంగులతో ముస్తాబవుతున్నాయి. ఇప్పటికే 16 వేల స్కూళ్లు కార్పొరేట్‌కు దీటుగా సింగారించు కున్నాయి. ఇప్పుడు పేద పిల్లల్నే కాదు స్థితిమంతుల పిల్లల్ని కూడా అవి రా రమ్మని పిలుస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు యూనిఫామ్, షూ, బెల్ట్, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ ‘జగనన్న విద్యా కానుక’ పేరుతో లభిస్తున్నాయి. ఇంగ్లిష్ మాధ్యమం సులభంగా అర్థమయ్యే విధంగా రెండు భాషల్లో ఉండే పాఠ్య పుస్తకాలు ఇస్తున్నారు. ‘జగనన్న గోరుముద్ద’ పేరుతో పౌష్టికాహారాన్ని నిత్యం 40 లక్షలమందికి అందజేస్తున్నారు. నాణ్యమైన సీబీఎస్ మూల్యాంకన విధానాన్ని కూడా దశల వారీగా ప్రవేశ పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల అధ్యయనం తర్వాత ప్రకటించిన ‘నూతన విద్యావిధానం–2020’లో పొందుపర్చిన అంశాల్లో అనేకం ఏడాది ముందుగానే ఆంధ్రప్రదేశ్‌లో ప్రకటించడం ఒక విశేషం. నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ‘నీతి ఆయోగ్’ ప్రశంసించింది. పేద కుటుంబాల జీవితాల్లో గేమ్ ఛేంజర్ లాంటి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రాథమిక స్థాయి నుంచే అమలుచేయడం ప్రారంభించారు. వైఎస్ జగన్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయానికి తొలిదశలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. కానీ, పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వం నిర్ణయం వెనుక దృఢంగా నిలవడంతో రాజకీయ ప్రతిపక్షాలు జడుసుకొని నోరు మూసు కున్నాయే తప్ప కుట్రలను మాత్రం ఆపలేదు. ప్రభుత్వం చేపట్టిన పలురకాల చర్యల వలన స్థోమత కలిగిన పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు. అన్నివర్గాల పిల్లలూ కలిసి మెలిసి చదువుకోవడం వల్ల సమాజం పట్ల అవగాహన పెరుగుతుంది. దేశ సమగ్రత బలపడుతుంది. పేదరిక నిర్మూలనకు, కులమత తారతమ్యాలను అంతం చేయడానికి ఉపయోగపడే ఈ నాణ్యమైన విద్యాయజ్ఞాన్ని పూర్తిచేయడం అంత సులభసాధ్యమైనదేమీ కాదు. యాగ భంగానికి మారీచ సుబాహులు పొంచివున్నారు. కుల మతాలకు అతీతంగా పేదవర్గాల ప్రజలందరూ యాజ్ఞికునికి అండగా నిలబడవలసిన తరుణమిది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంగ్లిషు మీడియాన్ని ప్రకటించడమే గాక సర్కారు బళ్ల రూపురేఖల్ని మార్చే కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది. ఇక స్పందించవలసినది కేంద్ర ప్రభుత్వమే! విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ ఆర్థిక వనరులన్నీ కేంద్రం గుప్పెట్లోనే ఉన్నాయి. నూతన విద్యావిధాన ప్రకటన అభిలషించినట్లుగా 6 శాతం జీడీపీని విద్యా పద్దు కింద ఈ బడ్జెట్లో కేటాయిస్తారో లేదో చూడాలి. విద్యారంగానికి ఆయా దేశాలు చేస్తున్న కేటాయింపుల జాబితాను చూస్తే బాధ కలుగుతుంది. 198 దేశాలున్న జాబితాలో మనది 144వ స్థానం. ప్రపంచం మొత్తంలో ఉన్న పేదల్లో సగంమంది మన దేశంలోనే ఉన్నారు. వీరిని పేదరికం నుంచి బయటపడేసే బ్రహ్మాస్త్రం నాణ్యమైన విద్య. అందువల్ల అన్ని దేశాల కంటే ఎక్కువ కేటాయింపులు చేయవలసిన అవసరం మన దేశంలో ఉన్నది. కనీసం ఈ రంగంలో ప్రగతిబాటలో పయనిస్తున్న రాష్ట్రాలకైనా ప్రోత్సాహకాలను ప్రకటించడం అత్యవసరం. ఈ దేశ ప్రత్యేక అవసరాల దృష్ట్యా, కోవిడ్ మహమ్మారి కలిగించిన విపరి ణామాల దృష్ట్యా ఈ బడ్జెట్లో విద్యారంగానికి పెద్దయెత్తున కేటాయింపులుంటాయని ఆశిద్దాం. ఈ ఆశ నెరవేరినట్లయితే ఈ దేశ పేదింటి బిడ్డలు ప్రభుత్వాన్ని సరస్వతీ దేవిగా భావించి, పూజిస్తారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అసంతృప్తి జాడలు
నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పకడ్బందీ విధాన రూపకల్పన కొరవడితే పర్యవసానాలెలా ఉంటాయో నాలుగు రోజులుగా ఆగ్రహంతో రగులుతున్న ఉత్తరప్రదేశ్, బిహార్ యువత నిరూపిస్తున్నారు. త్వరలో కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలి. యువ జనాభా అధికంగా ఉన్న ఆ రెండు రాష్ట్రాల్లోనూ చోటుచేసుకుంటున్న ఘటనలను విపక్షాల కుట్రగా కొట్టిపారేయడం లేదా యాదృచ్ఛికంగా తలెత్తిన సమస్యగా భావించడం సులభం. కానీ నిరుద్యోగ భారతంలో అంతర్లీనంగా గూడుకట్టుకుంటున్న అసంతృప్తిని ఆ ఉదంతాలు వెల్లడిస్తున్నాయని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆగ్రహోదగ్రులైన యువత బిహార్‌లోని గయలో ఒక ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టగా... ఆ రాష్ట్రంలోని సమస్తీ పూర్, బక్సార్, భోజ్‌పూర్, ముజఫర్‌పూర్, పట్నా తదితర నగరాల్లో వేలాదిమంది యువకులు ధర్నా చేశారు. రైల్వే ఆస్తుల్ని ధ్వంసం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ తదితరచోట్ల రైలు పట్టాలపై ధర్నాలు జరిగాయి. రిపబ్లిక్ డే రోజున అక్కడి ప్రయాగ్‌రాజ్‌లో యువకులున్న హాస్టళ్లపై పోలీసులు దాడికి దిగారు. ఉద్యమ మూలాలు గమనిస్తే యువత ఆగ్రహానికి కారణం అర్థమవుతుంది. రైల్వే శాఖలో సాంకేతికేతర విభాగాల సిబ్బంది నియామకాల కోసం ఎప్పుడో 2019 మార్చిలో 35,281 పోస్టుల కోసం ఒక నోటిఫికేషన్ వెలువడింది. ఈ ప్రవేశ పరీక్షకు కోటి 25 లక్షలమంది దరఖాస్తు చేసు కున్నారు. కరోనా విజృంభణతో చాలా ఆలస్యంగా సంబంధిత పరీక్షను ఆన్లైన్లో నిరుడు నిర్వ హించారు. ఈ నెల 14న విడుదల చేసిన ఫలితాల్లో ఏడు లక్షలమంది అర్హులుగా తేలారు. అంటే ఒక్కో పోస్టుకు 20 మంది పోటీ పడాలి. కానీ తొలుత నోటిఫికేషన్లో చెప్పినదానికి భిన్నంగా వచ్చే నెల 14, 18 తేదీల్లో మరో అర్హత పరీక్ష నిర్వహించబోతున్నట్టు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. ఆ పరీక్షలో ఒక్కో పోస్టుకు 8 మందిని ఎంపిక చేసి వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తామన్నారు. ఇదే అభ్యర్థులకు ఆగ్రహం కలిగించింది. నోటిఫికేషన్లో కేవలం ఒక్క అర్హత పరీక్ష ఉంటుందని ప్రక టించి, ఇప్పుడు దాన్నెలా మారుస్తారని యువత నిలదీసింది. దానికితోడు పరీక్షల్లో గోల్మాల్ జరిగిందన్న వదంతులు వ్యాపించాయి. వారి అభ్యంతరాలు మీడియాలో ప్రముఖంగా రాకపోయి ఉండొచ్చుగానీ... పక్షం రోజులుగా ట్విటర్, ఫేస్బుక్ తదితర మాధ్యమాల్లో అవి హోరెత్తు తున్నాయి. అర్హులుగా తేలినవారికి తక్షణం ఇంటర్వ్యూలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఆ పోస్టులకు టెన్త్, ఇంటర్ అర్హతలుగా ప్రకటించి, పట్టభద్రులకు ఎందుకు చోటిచ్చారని ప్రశ్నిం చారు. రెండేళ్లపాటు నిద్రాహారాలు మాని చదువుకున్నామని, కోచింగ్ కేంద్రాల కోసం వేలకు వేలు ఖర్చుపెట్టామని మొరపెట్టుకున్నారు. కానీ నిలువెల్లా కళ్లున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయింది. కనీసం రైల్వే మంత్రిత్వ శాఖలోని బాధ్యులైనా ఈ సమస్యపై దృష్టి పెట్టలేక పోయారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు రెండో పరీక్షను ఇప్పుడు తాత్కాలికంగా నిలిపే శారు. అభ్యంతరాల పరిశీలనకు కమిటీ ఏర్పాటైంది. దేశంలో వాస్తవ పరిస్థితులేమిటో ప్రభుత్వ పత్రాల్లో కనబడకపోవచ్చు... అంతా సవ్యంగానే ఉన్నదని అధికారపక్షం పదే పదే చెబుతూ ఉండొచ్చు. కానీ క్షేత్ర స్థాయి వాస్తవాలు వేరుగా ఉన్నాయని భారతీయ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం(సీఎంఐఈ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉద్యోగిత రేటు డిసెంబర్ 2016లో 43 శాతం ఉంటే 2021 డిసెంబర్ నాటికి అది 37 శాతానికి పడిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో అది 32.8 శాతం మించి లేదు. పైగా అనేకులు క్రమబద్ధంగా జీతా లొచ్చే ఉద్యోగాలు కోల్పోయి, రోజు కూలీలుగా మారారు. ప్రభుత్వ ఉద్యోగాలు రోజురోజుకూ కుంచించుకుపోతున్నాయి. రిటైరవుతున్నవారి సంఖ్యకు అనుగుణంగా నియామకాలు ఉండటం లేదు. ఇప్పటికీ ఉద్యో గాలివ్వడంలో అగ్రభాగంలో ఉన్న రైల్వే శాఖలో పదేళ్లక్రితంతో పోలిస్తే సుమారు అయిదు లక్షల ఉద్యోగాలు మాయమయ్యాయి. దానికితోడు పబ్లిక్ రంగ సంస్థలు క్రమేపీ ప్రైవేటు పరమవుతున్నాయి. అక్కడా ఉద్యోగావకాశాలు పెద్దగా ఉండటం లేదు. ఉన్నా ప్రభుత్వో ద్యోగంతో పోలిస్తే అక్కడ ఉద్యోగ భద్రత తక్కువ. ఇది చాలదన్నట్టు లేబర్ కోడ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిరుడు తీసుకొచ్చిన 3 చట్టాలు అమల్లోకొస్తే ఆ భద్రత మరింత దిగజారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో యువతలో ప్రభుత్వోద్యోగం సంపాదించాలన్న ఆత్రుత పెరగడంలో ఆశ్చర్యం లేదు. అది వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నదన్న అభిప్రాయం కలిగితే ఇక చెప్పేదేముంది? కోర్కెల సాధన కోసం హింసామార్గం అవలంబించడం ఎంతమాత్రమూ సమర్థనీయం కాదు. కానీ ఇందుకు దారితీసిన కారణాలేమిటో పాలకులు సానుభూతితో అర్థం చేసుకోవాలి. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రభుత్వ గణాంకాలు ఏం ఊదరగొడుతున్నా, తయారీ రంగ పరిశ్రమలు ఊపందు కోనిదే ఉద్యోగావకాశాలు పెరగవు. రోజు కూలీలుగా బతుకీడుస్తున్న యువతకు భద్రత కలిగిన, గౌరవప్రదమైన ఉపాధి దొరకనిదే వారిలోని అసంతృప్తీ, ఆగ్రహమూ చల్లారవు. కనుక ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం తన విధానాలను పదునెక్కించాలి. వచ్చే బడ్జెట్లో నికరమైన పథకాలకు చోటీయాలి. ప్రసంగాలతో పొద్దుపుచ్చి, ఎన్నికల్లో ఇతరేతర భావోద్వేగాలను రెచ్చగొడితే నాలుగు ఓట్లు రాలవచ్చేమోగానీ... సమస్యలు మాయం కావని గ్రహించాలి. -
నిద్రపోనివ్వని నిజాలు!
కొన్ని నిజాలు అంతే! కూర్చోనివ్వవు, నిలుచోనివ్వవు. కంటి నిండా కునుకుపట్టనివ్వవు. దేశంలోని నిజమైన పరిస్థితి మనసుకు తెలుసు కాబట్టే కావచ్చు, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు కూడా నిద్ర పట్టడం లేదట. ఆ మాట ఆయన ఇటీవల ప్రజలతో ప్రత్యక్ష ప్రసారంలో బాహాటంగా చెప్పారు. అధికారంలోకి వచ్చేనాటికే ఒకవైపున భారీ కరెంటు ఖాతా లోటు, ఇప్పుడు కరోనా వేళ ప్రపంచ వ్యాప్త ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలతో దేశానికి ఆర్థిక కష్టాలు అలా ఉన్నాయని ఆయన మాట. కొద్ది రోజుల క్రితమే... ఈ నెలలోనే భారత్ కన్నా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితే బాగుందని బీరాలు పలికారాయన. తీరా ఇప్పుడిలా భావోద్వేగంతో బేలతనం చూపడం విచిత్రం. నిద్ర పట్టడం లేదంటూనే అసలు నిజాలను ఇమ్రాన్ దాస్తున్నారు. ప్రపంచంలోనే ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న దేశాల్లో అర్జెంటీనా, టర్కీ, బ్రెజిల్ తర్వాత 4వదైన పాక్ గురించి ప్రపంచంలోనే చౌకయిన దేశాల్లో తమది ఒకటనడం హాస్యాస్పదమే. ఇప్పటికే 500 కోట్ల డాలర్ల మేర వాణిజ్య లోటు ఆ దేశాన్ని పీడిస్తోంది. తాజాగా సుకుక్ బాండ్ ద్వారా 100 కోట్ల డాలర్ల మేర అప్పు చేసింది. అదీ... రికార్డు 7.95 శాతం వడ్డీకి! అంతేకాక, అప్పు కోసం ఏకంగా లాహోర్ – ఇస్లామాబాద్ మోటార్ మార్గంలోని కొంత భాగాన్ని కుదువ పెట్టడానికీ ఒప్పుకుంది. అదీ వాస్తవ పరిస్థితి. అస్తుబిస్తయిన ఆర్థిక పరిస్థితికి ప్రభుత్వ రంగంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం లాంటి జాడ్యాలు తోడయ్యాయి. ‘ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్’ మంగళవారం వెల్లడించిన ‘అవినీతి భావనాత్మక సూచిక’ (సీపీఐ) తాజా లెక్కలే అందుకు సాక్ష్యం. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే గత ఏడాది పాకిస్తాన్ మరింత అవినీతిలో కూరుకుపోయింది. 180 దేశాల ఈ లెక్కల్లో 2020లో 124వ స్థానంలో ఉన్న పాక్ ఇప్పుడు 16 స్థానాలు మరింత దిగజారి, 140వ స్థానంలో నిలిచిందన్న తాజా వార్త నిష్ఠురసత్యం. నవాజ్ షరీఫ్ ఏలుబడిలో (అప్పటి ర్యాంకు 117) కన్నా దిగజారడం గమనార్హం. స్వచ్ఛమైన పాలన అందిస్తానంటూ 2018లో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఇమేజ్‌కు ఇది పెద్ద దెబ్బే. తెస్తానన్న ‘నయా పాకిస్తాన్’ ఇదేనా అని ప్రశ్నిస్తుంటే, జవాబివ్వలేని పరిస్థితి వచ్చిపడింది. 86 శాతం దేశాల్లో గత పదేళ్ళలో అవినీతి స్థాయి దాదాపు యథాతథంగా ఉండగా, పాక్‌కే ఈ దుర్గతి ఎందుకు పట్టినట్టు? చట్టబద్ధ పాలన లేకపోవడం, హస్తగతం చేసుకున్న అధికారం లాంటివి పాక్ దిగజారుడుకు కారణమట! ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆర్థిక వేదిక, మేధావుల లాంటి వివిధ వర్గాల నుంచి సేకరించిన డేటాతో ఇచ్చే ర్యాంకు గనక దీన్ని కాకిలెక్క అనుకోలేం. గతంలో ఇదే సూచికను చూపి, అప్పటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టిన సంగతి ఇమ్రాన్ మర్చిపోయినా, సోషల్ మీడియా పోస్టులు మర్చిపోనివ్వడం లేదు. గత 20 ఏళ్ళ రికార్డుల్ని బద్దలుకొట్టి, ఆసియా – పసిఫిక్ ప్రాంతంలో 5వ అత్యంత అవినీతి దేశంగా పాక్ పేరుమోసేలా చేశారని విమర్శిస్తున్నాయి. మరోపక్క అవినీతి ఆరోపణలతో లండన్‌లో తలదాచుకున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వైపు సైన్యం మొగ్గుతున్నట్టు వార్త. దేశ రాజకీయాల్లో అవసరం ఉందనీ, స్వదేశానికి తిరిగొచ్చేయమనీ షరీఫ్‌కు సైన్యం కబురంపినట్టు కథనం. నిజానికి, సైన్యం, సైనిక గూఢచారి సంస్థ (ఐఎస్ఐ)ల దయాదాక్షిణ్యాల మీదే ఇమ్రాన్ సర్కార్ నడుస్తోందనేది లోకవిదితం. పాకిస్తానీ సైన్యం రిగ్గింగ్ వల్లనే 2018 నాటి ఎన్నికలలో ఇమ్రాన్ అధికారం చేజిక్కించుకున్నారనీ, సైన్యం చేతిలో ఆయన ఓ ‘కీలుబొమ్మ’ అనీ ప్రతిపక్షాల వాదన. అయితే, ఐఎస్ఐ కొత్త డైరెక్టర్ జనరల్ నియామకంపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌కూ, ఆ దేశ సైన్యాధ్యక్షుడు జనరల్ బజ్వాకూ మధ్య బంధం బెడిసింది. ఈ ఏడాది నవంబర్ ఆఖరులో పదవీకాలం పూర్తయ్యాక, రావాల్సిన కొత్త సైనిక వారసుణ్ణి కాదని ప్రస్తుత ఐఎస్ఐ అధినేతనే కొనసాగించాలన్నది ఇమ్రాన్ భావించడంతో ఇబ్బంది తలెత్తిందని కథనం. ఇమ్రాన్ పదవీ కాలంలో మునుపెన్నడూ లేనంతటి ద్రవ్యోల్బణంతో దేశం చిక్కుల్లో ఉంది. ధరలు వంటనూనె 130 శాతం, పెట్రోలు 55 శాతం పెరిగాయి. పాకిస్తానీ రూపాయి విలువేమో 44 శాతం పడిపోయింది. మూడేళ్ళ క్రితం రూ. 122కే డాలరైతే, ఇప్పుడు రూ. 176 పెట్టాల్సి వస్తోంది. క్రితంనెలలో ద్రవ్యోల్బణ రేటు 12.3 శాతమై, గత 21 నెలల్లోకెల్లా పతాక స్థాయికి చేరింది. అధికారిక నివాసాన్ని వదులుకొని, అద్దెకివ్వడం లాంటి కంటితుడుపుతో ఇమ్రాన్ దీనికి అడ్డుకట్ట వేయలేరు. అదేమంటే, నిరాశాపూర్వక కథనాలిస్తున్నాయంటూ ఆయన తప్పంతా మీడియాపై నెట్టేస్తుండడం విచిత్రం. అందుకే పత్రికా రచనా స్వేచ్ఛ సూచిలో పాక్‌కు 145వ స్థానమే దక్కడం వింతేమీ కాదు. నిజానికి, దశాబ్దాలుగా పాక్ వైఖరి ప్రస్తుత సంక్షోభానికి కారణం – సైన్యంపై అతిగా ఖర్చు, దూరదృష్టి లేకుండా భారీగా అప్పులు తేవడం, పెట్టుబడుల నిర్వహణలో అసమర్థత లాంటి తప్పులెన్నో. దానికిప్పుడు కరోనా కాటు తోడైంది. ఏమైనా, అవినీతి రహిత పాలన అందిస్తానని వచ్చి, మూడేళ్ళ పైచిలుకులో ప్రతిపక్షాలతో ‘అవినీతి సమ్రాట్’ అనిపించుకొనే దశకు అప్రతిష్ఠ పాలవడం ఎవరికైనా నిద్ర పట్టనివ్వని పరిస్థితే! దాని నుంచి బయటపడాలంటే – భారత్‌తో పోలికలు మానేసి, పాలనలో ప్రక్షాళన చర్యలు చేపట్టడం, తీవ్రవాద ప్రోత్సాహక చర్యలను వదిలేయడమే మార్గం. లేదంటే, ఇప్పటికే పదవీ గండం పొంచి ఉన్న ఇమ్రాన్ వచ్చే ఎన్నికల దాకా అధికారం నిలుపుకోగలిగినా, ప్రతిపక్షాలన్నీ దగ్గరవుతూ, తీవ్రవాదులు విజృంభిస్తూ, సైన్యం శత్రువుగా మారుతున్న వేళ మళ్ళీ గెలవడం కష్టమే! -
అద్భుత ఘట్టం
‘రాశి చక్రగతులలో/ రాత్రిందివాల పరిణామాలలో/ బ్రహ్మాండ గోళాల పరిభ్రమణాలలో/ కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన/ పరమాణువు సంకల్పంలో/ప్రభవం పొందిన’ మానవాళి తన జైత్రయాత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకోదగిన క్షణాలను నమోదు చేసుకుంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతోపాటు యూరప్, కెనడా అంతరిక్ష సంస్థలు అహరహం శ్రమించి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను మొన్న సోమవారం అనుకున్న సమయానికి, అనుకున్న రీతిలో, నిర్దేశించిన కక్ష్యలో ప్రవేశపెట్టి ప్రపంచాన్ని అబ్బురపరిచాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా వేలాదిమంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు సమష్టిగా కృషి చేసి సాధించిన అద్భుత విజయమిది. గత నెల 25న క్రిస్మస్‌నాడు అంతరిక్ష యాత్ర ప్రారంభించి, 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఈ టెలిస్కోప్ కోసం ప్రయోగించిన అంతరిక్ష నౌకకు వేయి కోట్ల డాలర్లు (సమారు రూ. 75,000 కోట్లు) వెచ్చించారు. అంతరిక్షంలో మరెక్కడయినా భూమిని పోలిన గ్రహాలున్నాయా... అక్కడ జీవరాశి ఉనికి ఉన్నదా అనే ప్రశ్నలు మానవ మస్తిష్కాన్ని చిరకాలంగా వేధిస్తున్నాయి. మన దేశంతోపాటు చైనా, గ్రీస్, రోమ్, మధ్యప్రాచ్య అరబ్ దేశాల్లో అంతరిక్షాన్ని పరిశీలించడం, అక్కడ ఏముందో తెలుసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేయడం చరిత్రలో నమోదయ్యాయి. సాధారణ దృష్టికి తారసపడని అంతరిక్ష వింతలూ విశేషాలూ ఇతరేతర పరికరాల సాయంతో తెలుసుకోవచ్చునన్న ఆశ టెలిస్కోప్‌లతో మొదలుపెట్టి రేడియో టెలిస్కోప్, ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్, గామా టెలిస్కోప్ తదితరాల ఆవిష్కరణలకు దారితీస్తే... ఇవి విశ్వంలో నిరంతరం ప్రసారమయ్యే అనేక రకాల తరంగాలను పసిగట్టి వాటి ఆధారంగా ఎక్కడెక్కడ ఏముందో, విశ్వంలో ఏం జరుగుతున్నదో గ్రహించడానికి తోడ్పడుతున్నాయి. ఇప్పుడు ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేక విధాల ప్రత్యేకతలున్నది. సుదూర తీరాల్లో మరెన్ని పాలపుంతలు దాగున్నాయో అన్వేషించటానికీ, మన సౌర కుటుంబానికి ఆవల గ్రహాల ఆచూకీ రాబట్టడానికీ, ఇప్పుడు విశ్వంలో ఆవరించి ఉన్న నక్షత్ర ధూళిలో భవిష్యత్తు నక్షత్రాలుగా రూపుదిద్దుకోగల అవకాశమున్నవి ఉన్నాయో లేదో తెలుసు కోవడానికీ అవసరమైన సమాచారాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎప్పటికప్పుడు భూమికి చేరేస్తూ ఉంటుంది. ఈ సమాచారాన్ని విశ్లేషిస్తే విశ్వం పుట్టకకు దారితీసిన పరిస్థితులేమిటో నిర్ధారణగా చెప్పడం సాధ్యమవుతుందన్నది శాస్త్రవేత్తల మాట. విశ్వాంతరాళంలో ఇప్పుడు తిరుగాడే రకరకాల టెలిస్కోప్‌లకు ప్రధాన సమస్య సూర్యకాంతి. సూర్యుడికి అటువైపు ఏముందో చూడటానికి ఆ కాంతి ప్రధాన ఆటంకం. సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తుల ప్రభావం తక్కువగా ఉండే ప్రాంతాలు అయిదున్నాయని, అక్కడికి టెలి స్కోప్లను చేరేస్తే తక్కువ ఇంధన వినియోగంతో దీర్ఘకాలం పని చేయించడం సులభమవుతుందని ఎన్నడో 1772 లోనే ఫ్రాన్స్‌కు చెందిన ఖగోళ, గణిత శాస్త్రవేత్త జోసెఫ్ లూయీ లాగ్రాంజ్ కనుక్కున్నాడు. ఆ అయిదు ప్రాంతాలనూ ఆయన పేరిటే ఎల్1, ఎల్2 వగైరాలుగా పిలుస్తున్నారు. వాటిలో ఎల్2 అనేకవిధాల ప్రయోజనకరమని మూడు దశాబ్దాలక్రితం నిర్ణయించారు. సూర్యుడు, భూమి, చంద్రుడు కాంతులు పెద్దగా విరజిమ్మని ప్రాంతమది. ఆ దట్టమైన చీకటి ప్రాంతానికి అంతరిక్ష నౌకను పంపగలిగితే అనేక ప్రయోగాలకు ఆస్కారం ఉంటుందని శాస్త్రవేత్తలు గ్రహించారు. అయితే అక్కడ గురత్వాకర్షణ శక్తి ఎప్పుడూ ఒకేలా ఉండదు. అదొక పెద్ద అవరోధం. అలాంటి చోటకు సకల హంగులతో ఉన్న టెలిస్కోప్‌ను పంపడం శక్తికి మించిన పని అని కొన్నాళ్లకే అర్థమైంది. ఎందుకంటే అక్కడుండే మైనస్ 233 డిగ్రీల ఉష్ణోగ్రతలో అందులోని పరికరాలను పనిచేయించడం అంత సులభం కాదని శాస్త్రవేత్తలు గుర్తించారు. చివరకు అనేక రకాల ప్రయోగాల తర్వాత అత్యంత శీతల ప్రదేశంలో పనిచేసే పరికరాల తయారీ ఒక కొలిక్కి వచ్చింది. ఇదంతా ఒక ఎత్తయితే, వాటన్నిటినీ అమర్చిన టెలిస్కోప్‌ను సురక్షితంగా ఎల్ 2 వద్దకు చేరేయడం మరో పెద్ద విన్యాసం. దాదాపు 350 రకాల ప్రక్రియలు పరస్పరం అనుసంధానించుకుంటూ సాగవలసిన ఈ ప్రయోగం విషయంలో చివరిదాకా శాస్త్రవేత్తలకు భయాందోళనలున్నాయి. మనిషి అంచనాకు అందని ఊహించని చిన్న లోపం చోటు చేసుకున్నా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రయోగం, మూడు దశాబ్దాల కాలం వృధా అవుతాయి. కానీ అంతా అనుకున్నట్టే పూర్తయింది. అది ఎల్2 కక్ష్యలోనే తిరుగాడటానికీ, ఎటూ జారిపోకుండా చూడటానికీ మూడు వారాలకొకసారి చిన్న చిన్న సర్దుబాట్లు చేయాల్సివస్తుంది. అంతా సవ్యంగా పూర్తయితే విశ్వరహః పేటిక తెరుచుకుని, విశ్వాంతరాళంపై మన అవగాహన కొన్ని వేల రెట్లు పెరుగుతుంది. మనిషి రోదసిలోకి ప్రవేశించి, రకరకాల అంతరిక్ష నౌకలను ప్రవేశపెట్టి ఆరు దశాబ్దాలు దాటుతోంది. అలా చూస్తే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వంటి అపురూపమైన, సంక్లిష్టమైన ప్రయోగాన్ని విజయవంతం చేయగలగడం ఖగోళ విజ్ఞాన శాస్త్ర చరిత్రలో, నిరంతర అంతరిక్ష అన్వేషణలో కీలకమైన మలుపు. ఈ ప్రయోగం మున్ముందు మరిన్ని అరుదైన అద్భుతాలను ఆవిష్కరించగలదనీ, ఈ విశ్వానికి సంబంధించి మన విజ్ఞానాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తుందనీ నిస్సం దేహంగా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న ఖగోళ శాస్త్రవేత్తలు, భౌతిక శాస్త్రవేత్తలు, భిన్న రంగాలకు చెందిన నిపుణులు ప్రశంసనీయులు. -
ఇది ఘన ‘తంత్ర’మా?
భారతావనికి 73వ గణతంత్ర దినోత్సవ ఘడియలివి. సర్వసత్తాక, సార్వభౌమాధికార దేశంగా ఈ సంతోష వేళలోనూ అనవసర వివాదాలు రాజుకోవడమే విచారకరం. ఇండియా గేట్లో సుభాష్ చంద్రబోస్ విగ్రహం, పాకిస్తాన్‌పై యుద్ధంలో గెలిపించి ప్రాణాలర్పించిన 3,483 మంది జవాన్ల గౌరవార్థం 1972లో ఇందిరా గాంధీ ఏర్పాటుచేసిన ‘అమర్ జవాన్ జ్యోతి’ని ఆ దగ్గరే కొత్తగా 2019లో మోదీ సర్కారు పెట్టిన నేషనల్ వార్ మెమోరియల్ జ్యోతిలో విలీనం చేయడం, గణతంత్ర ఉత్సవాల నుంచి మహాత్మా గాంధీకి నచ్చిన ‘ఎబైడ్ విత్ మి’ పాట తొలగింపు – ఇలా ఒకటికి మూడు ప్రభుత్వ నిర్ణయాలు జరిగాయి. వీటన్నిటి కన్నా ముందే తమ రాష్ట్రాల ప్రత్యేక శకటాలకు ఉద్దేశపూర్వకంగా రిపబ్లిక్ డే కవాతులో అనుమతి నిరాకరించారంటూ వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రతిపక్షాలు ఆరోపించాయి. వెరసి, ఈసారి ప్రతిదీ ఏదో ఒక రకంగా వివాదాస్పదమైంది. ఏటా గణతంత్ర వేడుకల ముగింపుగా జనవరి 29 సూర్యాస్తమయ వేళ సైనిక సంప్రదాయంగా బ్యాండ్ వాద్యవిన్యాసాల ‘బీటింగ్ రిట్రీట్’ ఆనవాయితీ. ఇంగ్లండ్‌లో 17వ శతాబ్దిలో మొదలైన ఈ శతాబ్దాల కాలపు వేడుక పద్ధతిని ఇప్పటికీ బ్రిటన్, అమెరికా, కెనడా, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా లాంటి పలు దేశాలతో పాటు మనమూ అనుసరిస్తున్నాం. మన దేశపు వేడుకలో మహాత్మా గాంధీకి ప్రియమైన క్రైస్తవ ప్రార్థన ‘ఎబైడ్ విత్ మి’ ఏళ్ళుగా వస్తోంది. కానీ, ఈసారి మోదీ ప్రభుత్వం ఆ పాట తీసేసి, దాని బదులు 1962 భారత – చైనా యుద్ధంలో ఓటమి తర్వాత వీరజవాన్లలో స్థైర్యం నింపుతూ, హిందీ సినీకవి ప్రదీప్ రాసిన పాపులర్ దేశభక్తి గీతం ‘యే మేరే వతన్ కే లోగోం...’ పెట్టింది. గాయని లతా మంగేష్కర్, సంగీత దర్శకుడు సి. రామచంద్రల మధ్య కొన్నేళ్ళ ప్రచ్ఛన్న యుద్ధానికి తెర దించిన ఘనత ఆ పాటదే. ప్రధాని నెహ్రూని కదిలించి, నేటికీ మనసులు కరిగించే ఆ పాట గొప్పదే. కానీ గాంధీకి ప్రియమైన ప్రార్థన మార్చి, దాన్ని పెట్టాల్సిన అత్యవసరమేంటి? ఇప్పటి దాకా మరుగునపడిన చరిత్రను జనానికి చాటి, జరిగిన లోపాన్ని సరిచేయడానికే ఈ ప్రయత్నమన్నది ప్రధాని మోదీ ఉవాచ. చరిత్రలో ప్రాధాన్యం దక్కకుండా పోయిన ఘటనలకూ, వ్యక్తులకూ తగిన గుర్తింపు తేవాల్సిందే. అందుకోసం ఇప్పటికే జనంలో జ్ఞాపకంగా మిగిలినవాటిని గుర్తులే లేకుండా చేయాలా అన్నది విమర్శ. అందరికీ ప్రేరణ అయిన కొందరిని తమ వారిగా మలుచుకొని, సంఘ్‌పరివార్ భావజాలానికి సర్వజన అంగీకారం తేవడమనే కుట్ర దీనిలో ఉందని ఆరోపిస్తున్నవారూ ఉన్నారు. ఇటీవల బంగ్లాదేశ్ ఆవిర్భావ స్వర్ణోత్సవ సందర్భంలో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీని నేటి పెద్దలు కనీసం స్మరించుకోలేదు. దానిపైనా విమర్శలు రేగాయి. ఎవరి ఘనత, ఎవరి స్థానం వారిదే. కానీ, గాంధీని కాదని లాల్ బహదూర్నీ, నెహ్రూను వద్దని పటేల్‌నూ ఇతరేతర కారణాలతో తలకెత్తుకోవడం ఎలా సమర్థనీయం? కొందరు ఆరోపిస్తున్నట్టు ఇందిరా గాంధీ హయాంలో వచ్చింది కాబట్టి అమర జ్యోతిని ఆర్పేశారన్నది నిజమే అయితే, ఆ చర్య ఏ రకంగా హర్షణీయం? స్వాతంత్య్రానంతర యుద్ధాల్లో మరణించిన జవాన్ల పేర్లున్న వార్ మెమోరియల్ సరే, అంతకు మునుపటి యుద్ధాల్లో అమరులైన 15 వేల మందికి పైగా వీరుల గౌరవం మాటేమిటి? ఇది చరిత్ర నిర్మాణమా, వినిర్మాణమా అన్న విమర్శ వినిపిస్తోంది అందుకే. కేంద్రం పెట్టాలనుకుంటున్న పాతికడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పు గ్రానైట్ విగ్రహానికి మించి సమున్నతమైనది నేతాజీ చరిత్ర. ఆ వీరుడి 125వ జయంతి వేళ గణతంత్ర ఉత్సవం మూడు రోజుల ముందుగా జనవరి 23 నుంచే జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, గాంధీ, నెహ్రూలతో విభేదాలుండి, జర్మనీ, జపాన్ల సాయంతో బ్రిటీషు పాలకులపై యుద్ధానికి దిగిన నేతాజీ నామస్మరణను కేంద్రం ఇప్పుడే ఎందుకు చేస్తోంది? నిరుడు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన పాలకపక్ష నేతలకు ఈ బెంగాలీ బిడ్డపై ప్రేమ పొంగుకు రావడంలో అంతరార్థమేంటి? ప్రతిపక్షాలపై పైచేయి కోసం చరిత్రను మార్చేందుకు పాలకపార్టీ ప్రయత్నిస్తోందని కొన్నేళ్ళుగా ఓ ఆరోపణ. ఈ నేపథ్యంలో హడావిడి నిర్ణయాల బదులు నిపుణులతో సంప్రతించాల్సింది. ప్రజాభి ప్రాయం తెలుసుకోవాల్సింది. అలా చేస్తే వివాదం ఉండేది కాదు. చివరకు ఇటు నేతాజీ, అటు కవి ప్రదీప్‌ల వారసులు తమ వారికి దక్కిన అనూహ్య గౌరవానికి సంతోషిస్తూనే, మతనిగ్రహం లేకుండా విగ్రహాలు, గాంధీని కాదని కొత్త పాట పెట్టడాలను వ్యతిరేకిస్తుండడం కొసమెరుపు. సంక్షుభిత కాలంలో పరిష్కరించాల్సిన సమస్యలెన్నో ఉండగా, ఈ వివాదాస్పద చర్యల అవసరమేంటో అర్థం కాదు. వలసవాద కాలం నాటి పద్ధతులను మార్చాలని చెబుతున్న పాలకులు ముందుగా తమలోని వలసవాద పాలక మనస్తత్వాన్ని మార్చుకొనే ప్రయత్నం చేయాలి కదా అన్న సోషల్ మీడియా ప్రశ్నకు జవాబు లేదు. ప్రపంచమంతటా పాలకులు తమకు అనుకూల కథనాలే మిగలాలనీ, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తమ హీరోలను నిలపాలనీ తాపత్రయపడడం తరతరాలుగా తెలిసిందే. కానీ, భిన్న సంస్కృతులు, విభిన్న ఆలోచనల సంగమమైన భారతావనిలో ఏకరూప అజెండాను సాధించాలనుకోవడం సరికాదు. ‘చరిత్ర అడగకు... చేస్తున్నది చూడు’ అనేది అధికారంలో ఉన్నవారి ధోరణి అయితే, అది ప్రజలకూ, దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యానికీ నష్టమే. అలా ఎవరైనా ప్రవర్తిస్తే, ఆనక వారి స్థానమేంటో కాలమే తేలుస్తుంది. ఎందుకంటే, అందరి కన్నా అతి నిరంకుశమైనది కాలం! అది వలసవాద కాలానికి ముందెప్పటి నుంచో చరిత్ర చెప్తున్న పాఠం! -
వారి మాట వినరా!?
సమస్య ఎవరిదైతే వారి గోడు కదా వినాల్సింది. వారి అభిప్రాయం కదా ఆలకించాల్సింది. ఆ పని చేయకుండానే, సమస్యను పరిష్కరిస్తున్నామంటే దానికి అర్థం ఏముంటుంది! ఆడవారి కనీస వివాహ వయస్సును 18 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళకు పెంచేందుకు ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం చూస్తే అలాగే అనిపిస్తోంది అంటున్నారు విమర్శకులు. మన దేశంలో ఆడవారి వివాహ వయస్సు బిల్లును లోతుగా అధ్యయనం చేసే బాధ్యత మీద పడ్డ 31 మంది సభ్యుల పార్లమెంటరీ కమిటీలో ఒకే ఒక్క మహిళా ఎంపీకి చోటు దక్కడంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆడవారి జీవితానికి సంబంధించిన విషయంపైనా మగవాళ్ళే కూర్చొని, మాట్లాడి నిర్ణయం తీసుకుంటారా అని మహిళా ఎంపీలే కాదు, మహిళా సంఘాలూ వేస్తున్న ప్రశ్న అర్థవంతమైనదే కాదు... సరైన రీతిలో అర్థం చేసుకోవాల్సినది కూడా!\ మగపిల్లలకు ఇప్పటికే ఉన్నట్టుగా, ఆడపిల్లలకు కూడా కనీస వివాహ వయఃపరిమితిని 21 ఏళ్ళకు పెంచడం స్త్రీ సాధికారతకు తోడ్పడే చర్య అవుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఆడపిల్లలు మరింత చదువుకోవడానికీ, సామాజిక అవగాహన పెంచుకోవడానికీ అది వీలు కల్పిస్తుందని భావిస్తోంది. అందుకు తగ్గట్టే 2006 నాటి బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని సవరించే బిల్లును ప్రభుత్వం ఇటీవలి పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ప్రవేశపెట్టింది. లోక్‌సభలో హడా విడిగా ఆమోదింపజేసింది. రాజ్యసభలో విపక్షాల ఒత్తిడితో ఆ బిల్లును కూలంకషంగా పరిశీలించి, సూచనలు ఇవ్వడం కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపాల్సి వచ్చింది. అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్ సహా 140 దేశాల్లో కనీస వివాహ వయస్సు 18 ఏళ్ళే అన్న వాదన ఒకపక్క, తీరా ఈ స్థాయీ సంఘంలోనే లైంగిక సమానత్వం లేకుండా పోవడం మరోపక్క చర్చ రేపాయి. ప్రస్తుతం మన లోక్‌సభలో 81 మంది, రాజ్యసభలో 29 మంది – మొత్తం 110 మంది మహిళా ఎంపీలున్నారు. కానీ, మహిళలకు సంబంధించిన చరిత్రాత్మక బిల్లును పరిశీలించడానికి ఏర్పాటైన పార్లమెంటరీ సంఘంలోనే స్త్రీలకు కనిష్ఠ ప్రాతినిధ్యం దక్కడం శోచనీయం. అందుకే, ఆ స్థాయీ సంఘంలో చోటు దక్కిన ఏకైక మహిళ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రాజ్యసభ సభ్యురాలు సుస్మితా దేవ్ నేరుగా ఉపరాష్ట్రపతి సచివాలయానికి లేఖ రాయాల్సి వచ్చింది. దేశంలోని స్త్రీలందరిపైనా ప్రభావం చూపే ఒక నిర్ణయం గురించి చర్చలు జరుగుతున్నప్పుడు ఆ సంఘంలో వీలైనంత ఎక్కువమంది మహిళలకు చోటివ్వాలి కదా అన్నది సుస్మిత లాంటి అనేకుల వాదన. అంతే కాదు... పార్లమెంటరీ నిబంధనల్లోని 84(3), 275 కింద ఉభయ సభల్లోని ఏ మహిళా ఎంపీ అయినా సరే వ్యక్తిగతంగా కానీ, లిఖితపూర్వకంగా కానీ ఈ ప్రతిపాదిత బిల్లుపై స్థాయీ సంఘానికి తమ అభిప్రాయాన్ని వెల్లడించే వీలు కల్పించాలని కోరుతున్నారు. స్త్రీలు – పిల్లలు – విద్య – యువతరం – క్రీడలపై నెలకొల్పిన ఆ పార్లమెంటరీ స్థాయీ సంఘం బుధవారం తొలిసారి సమావేశమవుతోంది. బీజేపీ రాజ్యసభ ఎంపీ వినయ్ సహస్రబుధే సారథ్యం లోని ఆ కమిటీలో 31 మందిలో 16 మంది బీజేపీ ఎంపీలే. ఏ పార్లమెంటరీ కమిటీకైనా తమ సభ్యు లను నామినేట్ చేసేది రాజకీయ పార్టీలే. ఒక్క టీఎంసీ మినహా పార్టీలన్నీ తమ పురుష ఎంపీలనే నామినేట్ చేయడంతో చిక్కొచ్చిపడింది. పదే పదే స్త్రీల సమస్యలు పరిశీలనకు వచ్చే ఈ మహిళా– శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధించిన కమిటీలో వీలైనంత ఎక్కువమంది మహిళలకే ప్రాతినిధ్యం కల్పించడం సమంజసం, సహజ న్యాయం కూడా! ప్రభువులు ఆ శాఖ బాధ్యతలనైతే ఓ మహిళా మంత్రి (స్మృతీ ఇరానీ)కే అప్పగించారు కానీ, స్థాయీ సంఘ సభ్యుల అంశంలో మాత్రం పార్టీలలో ఎందుకో ఆ ఆలోచన కొరవడింది. అదే ఇప్పుడు విమర్శలకు కారణమైంది. లింగ సంబంధమైన కీలక అంశంపై చర్చించే చట్టసభా సంఘంలోనే లైంగిక అసమానత్వం చోటుచేసుకోవడం విడ్డూరమే కాదు... విషాదం. కమిటీలో దాదాపు అంతా మగవాళ్ళే ఉండడం... తెలిసి జరిగినా, తెలియక జరిగినా తప్పక సరిదిద్దుకోవాల్సిన పొరపాటే. శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేదీ మొదలు డీఎంకె ఎంపీ కనిమొళి దాకా పలువురు వ్యక్తం చేసిన ఆగ్రహాన్ని ఆ కోణంలో నుంచే సర్కారు చూడాలి. అలాగే ఈ సంఘంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల స్త్రీలకు ప్రాతినిధ్యం తప్పనిసరి. ఆడపిల్లల వివాహ వయసుపై అనేక ఆందోళనలుండే గిరిజన సమాజపు వాణిని వారే వినిపించ గలరు. చిన్న వయసులో పెళ్ళిళ్ళ వల్ల ఆడపిల్లలు పౌష్టికాహార లోపానికీ, మాతృత్వ సమయంలో అనారోగ్యాలకూ గురికావడం ఎక్కువ. ఈ సాధకబాధకాలను స్త్రీలే సరిగ్గా వివరించగలరు. హిందూ, ముస్లిమ్, క్రైస్తవ, పార్సీ – ఇలా దాదాపు 7 వ్యక్తిగత చట్టాలలో సైతం యువతుల వివాహ వయసు సూత్రాలను ఈ కొత్త బిల్లుతో సవరించాల్సి వస్తుంది. ఆ మాటకొస్తే, ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావడానికే బీజేపీ చేపట్టిన ఈ డొంక తిరుగుడు బిల్లులు, సవరణలన్నీ అనే విమర్శ కూడా లేకపోలేదు. ఏమైనా, మూడు నెలల్లో తన సూచనలివ్వాల్సిన ఈ కమిటీ... సత్వరమే ఈ బిల్లుతో ప్రభావితమయ్యే భాగస్వామ్య పక్షాలందరి గోడూ వినడం, వాటికి విలువ ఇవ్వడమే అసలైన ప్రజాస్వామిక చర్య. లేదంటే, ప్రపంచానికి పోయే సూచన ఒకటే – ‘ఈ దేశంలో ఇవాళ్టికీ మగవాళ్ళే ఆడవారి హక్కులను నిర్ణయిస్తున్నారు. మహిళలు మౌనప్రేక్షకులుగా మిగిలిపోతున్నారు’. పాలకులు ఆ నిందను నిజం చేయకపోతే అదే పదివేలు! -
కవిత యువత
‘శీతకాలం కోత పెట్టగ కొరడు కట్టీ ఆకలేసీ కేకలేశానే’ అని రాశాడు శ్రీశ్రీ. ‘జయభేరి’ పేరుతో ‘మహాప్రస్థానం’లో ఉన్న ఆ కవిత రాసే సమయానికి శ్రీశ్రీకి 23 ఏళ్లు. ‘పద్దెనిమిదేళ్లు దాటేస్తున్నాను. ఇంకా ఒక మంచి కవిత రాయలేదే’ అని బాధ పడతాడు మహాకవి జాన్ మిల్టన్. అతడు తన మాగ్నమ్ ఓపస్ ‘ప్యారడైజ్ లాస్ట్’ ప్రచురించే సమయానికి అరవై ఏళ్లు రాక తప్పలేదు. ‘సర్రియలిజం’ను సాహిత్యంలో ప్రవేశపెట్టిన ఝంఝామారుత ఫ్రెంచ్ కవి ఆర్థర్ రాంబో టీనేజ్లోనే రాయవలసిందంతా రాసేసి 20వ ఏటకు రిటైర్ అయిపోయాడు. అంటే 20 తర్వాత రాయాల్సింది ఏమీ లేదని అనుకున్నాడు. 80 ఏళ్ల వరకూ జీవించిన ఇంగ్లిష్ కవి విలియమ్ వర్డ్స్‌వర్త్ లేటు వయసులో అమెరికా వెళితే కుర్రవాళ్లు అతని పద్యాలను చదవడం మొదలుపెట్టారట. వర్డ్స్‌వర్త్ వారిని ఆపి ‘ఈ మధ్య రాసినవి చదవొద్దు. నా తొలి రోజుల్లో రాసినవి చదవండి. అవే నాకు ఇష్టం’ అన్నాడట. కవిత్వానికి యువరక్తానికి గట్టి సంబంధం ఉంది. ఒంట్లో కండరాలు గట్టిపడి, నరాల్లో నెత్తురు ఉత్సాహంగా దౌడు తీస్తూ, కళ్లు చురుగ్గా చూస్తూ, గుండె సరైన కారణాలకు కొట్టుకుంటూ, స్పందించే సమయాలలో నాలుక పిడచగడుతూ ఉంటే గనక బహుశా కవిత్వమే వస్తుంది. టి.ఎస్. ఇలియట్ మాస్టర్ పీస్ ‘ది వేస్ట్ ల్యాండ్’ పాతికేళ్ల లోపలే రాసినా, జాన్ కీట్స్ అత్యుత్తమమైన కవిత్వమంతా పాతికేళ్ల లోపే రాసి మరణించినా వయసు తాలూకు తాజా స్పందన కవిత్వంలో ప్రవహించడమే కారణం. ‘నూనూగు మీసాల నూత్న యవ్వనమున శాలివాహన సప్తశతి నుడివితిని’ అని శ్రీనాథుడు రాసుకోవడం వల్లే అతడు చేసిన కవన కృషి మనకు తెలిసింది. ‘ఎమోషనల్ ఫెర్వర్ ఉన్నంత కాలం మంచి కవిత్వం వస్తుంది’ అంటాడో పాశ్చాత్య కవి. యవ్వనంలో ఉండే దూకుడు, నిలదీత, ఆగ్రహం, తిరుగుబాటు, అరాచకత్వం, బేఫర్వా, అమరత్వ అభిలాష... కవికి భావోద్వేగాల ఆవేశాన్ని ఇస్తాయి. కవిత్వం ఉబుకుతుంది. ధార అవుతుంది. స్వచ్ఛదనం దానికి సజీవత్వం ఇస్తుంది. తెలుగులో భావ, అభ్యుదయ, విప్లవ కవులు, ఆ తర్వాత స్త్రీవాద, దళిత, మైనారిటీ, బహుజన కవులు ఐతే ఆ ఉద్యమాల యవ్వనంలో లేదా తాము యవ్వనవంతులుగా ఉన్నప్పుడో రాసిన కవిత్వంలోని పదును, వాక్యం తాకి చూస్తే చీరుకునే వాదర ఆ తర్వాతి స్థిర పంక్తులలో కనిపించవు. ఈ ఒక్క గుణం చేతనే కవిత్వం ఎప్పటికప్పుడు యువ మునివేళ్లను వెతుక్కుంటూ వెళ్లి ప్రతి తరంలోనూ మరుజన్మ పొందుతూ ఉంటుంది. ‘వత్తి జేసి నూనె బోసి బతుకును వెల్గించినందుకు కొడుకు ఈ అమ్మదీపాన్ని గాలికి పెట్టి పోయిండు’ అని రాస్తాడు తగుళ్ల గోపాల్. మహబూబ్ నగర్ నుంచి కవిత్వం రాస్తున్న ఇతడు ‘దండ కడియం’ పేరుతో కవిత్వం వెలువరించాడు. ‘టేబుల్‌పై ఎన్ని కూరలున్నా మాటల్ని కలుపుకుని తిన్నప్పుడే కడుపు నిండా తిన్నట్టుంటుంది’ అంటాడు ‘నాలుగు గిన్నెల కూడలి’ కవితలో. మరో కవి పల్లిపట్టు నాగరాజు ‘దూడ మూతి వాసన’ కవితలో ‘మనలా మనుషులైతే కులం వాసనో మతం వాసనో వచ్చేదేమో కసువు తినే బిడ్డలు కదా... కవుడూ కుచ్చడం తెలీని మూగజీవాల ప్రేమ వాసన’ అని రాస్తాడు. ఇతనిది చిత్తూరు జిల్లా. ‘యాలై పూడ్సింది’ ఇతని పుస్తకం. ‘ఇవ్వాళంతా వాన కురిసింది. నువ్వు లాలనగా తాకినట్టు గాలి. నువ్వు కోపంతో తోసినట్టు వరద. నువ్వు నిదానంగా కూర్చున్నట్టు ఊరు’ అని రాస్తాడు నంద కిశోర్ తన కవిత్వ పుస్తకం ‘యథేచ్ఛ’లో. ఇతనిది వరంగల్. మొన్న ప్రకటించిన ‘సాహిత్య అకాడెమీ యువ పురస్కారం– 2021’కి తుది పోటీలో నిలిచిన ఎనిమిది పుస్తకాలూ కవిత్వానివే కావడం చూస్తే కవిత్వం యువ కవులను అంటి పెట్టుకునే ఉన్నది అనిపిస్తుంది. గత యాభై ఏళ్లలో అక్షరాస్యత తాకిన వర్గాల నుంచి, గత రెండు మూడు దశాబ్దాలలో తాగునీరు, సాగునీరు చూసిన పల్లెల నుంచి వస్తున్న ఇటీవలి కవులు తమ ప్రాంతాల, నేపథ్యాల, జీవనాల గాథలు గాఢంగా కవిత్వంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ‘ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో నిర్మితమైన ఉపగ్రహాలు అడవుల గర్భంలో దాగున్న ఖనిజాలను లొకేట్ చేస్తాయి... ఆదివాసీ నవ్వు పువ్వులను చిదిమేస్తాయి’ అని రాస్తాడు సురేంద్రదేవ్ చెల్లి తన ‘నడిచే దారి’ పుస్తకంలో. ఇతనిది యానాం. తండ హరీష్ గౌడ్, బండారి రాజ్‌కుమార్, రమేశ్ కార్తిక్ నాయక్, జాని తక్కెడ శిల... వీరంతా ఈ పురస్కారం కోసం చివరి పట్టికలో నిలిచినవారిలో ఉన్నారు. పోటాపోటీగా ఢీకొన్నారు. యువ సాహిత్యకారులను ప్రోత్సహించడానికి అకాడెమీ ‘యువ పురస్కారం’ ప్రకటించిన గత కొన్నేళ్ల నుంచి యువతీ యువకులు ఉత్సాహంగా చేయదగ్గ కృషి చేస్తున్నారన్నది వాస్తవం. చిన్న వయసులో గుర్తింపు దక్కితే పొంగిపోతున్నారన్నదీ వాస్తవం. అయితే ఆ తర్వాతి కొనసాగింపు గురించే కొందరికి చింత ఉన్నది. చిన్న వయసులో ఎక్కువ గుర్తింపు వస్తే సృజన క్షుద్బాధ తీరి ఒడ్డున కూర్చుంటారని హెచ్చరించే పెద్దలు ఉన్నారు. ఇప్పటివరకూ యువ పురస్కారం పొందిన వారు ఆ పురస్కారం పొందాక ఏ మేరకు కృషిని హెచ్చింపు చేసుకున్నారో పరిశీలించుకోవాల్సి ఉంది. పెద్ద గీత గీయాల్సి ఉంది. యువకులే భావి సాహిత్య నిర్మాతలు. ఆశలు వారిపైనే! కాకపోతే ప్రవాహాన్ని వీడ వద్దని, తెడ్డు వదల వద్దని, ఈత వచ్చేసిందని పొగడ్తల సుడిలో దూకేయవద్దని హితవు!! యువ కవులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. -
టీ–కాంగ్రెస్‌లో ‘టీఎస్ కాంగ్రెస్!’
టీ–కాంగ్రెస్‌కూ టీఎస్ కాంగ్రెస్‌కు తేడా ఏముంటుంది? వడ్ల గింజలో బియ్యం గింజ. రెండూ ఒకటే. కానీ తేడా ఉందట! ఈమధ్య ఒక కాంగ్రెస్ నాయకుడు ‘మమ్మల్ని టీ కాంగ్రెస్ అనకండి ప్లీజ్. ఇబ్బందిగా ఉంది. కావాలంటే టీఎస్ కాంగ్రెస్ అని రాసుకోండి’ అన్నారట! అలా ఎందుకంటున్నారో చెప్ప మని అడిగితే బాగా ఆలోచించండి... మీకే అర్థమవుతుందని తప్పించుకున్నాడట! తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ రక్తాన్ని బాగా ఎక్కించిన తర్వాత పాత కాంగ్రెస్ నాయకులు చాలామంది ఉక్కపోతకు గురవుతున్న సంగతి తెలిసిందే. వాళ్లకు టీ అనే శబ్దంలో తెలుగుదేశమే ధ్వనిస్తున్నదట. జగ్గారెడ్డి ఎపిసోడ్ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలి ఉన్నట్టు స్పష్టంగా వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీ అన్నాక ఓ ఇరవై ముప్ఫయ్ గ్రూపులుండటం ఆమోదయోగ్యమే కదా! రెండు వర్గాలుగా విడిపోతేనే కంగారెందుకు అనే అనుమానం సహజం. కానీ ఈ తాజా రెండు వర్గాలకు ప్రాతిపదిక ‘రక్తసంబంధం’. సెంటి మెంట్ బాగా వర్కవుట్ అవుతున్నట్టు కనిపిస్తున్నది. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావడం లేదని పాతవాళ్ల అభియోగం. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన వ్యవహార శైలిని మార్చుకోవాలనీ, లేదంటే ఆయన్నే మార్చాలని పార్టీ అధ్యక్షు రాలికి జగ్గారెడ్డి రాసిన లేఖ పెద్ద కలకలాన్నే సృష్టించింది. ఆ లేఖ మీడియాకు లీకవడం క్రమశిక్షణా రాహిత్యం కిందకే వస్తుందని క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి తేల్చారు. వివరణ కోసం జగ్గారెడ్డిని పిలుస్తామని కూడా చిన్నారెడ్డి చెప్పారు. కానీ జగ్గారెడ్డి ఏమాత్రం తగ్గలేదు. ‘కబాలి’ సినిమాలో రజనీకాంత్ ‘క... బా... లి... రా’ అని చెప్పినంత నిబ్బరంగా, ధీమాగా సమాధానం చెప్పారు. క్రమశిక్షణా కమిటీ ముందు హాజరు కావలసి వస్తే ముందుగా రేవంత్‌రెడ్డే హాజరు కావలసి ఉంటుందని జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలోని పాత కాంగ్రెస్ నాయకులందరికీ అధిష్ఠానం వైఖరి స్పష్టంగా తెలుసు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోనే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోరాడాలని ఢిల్లీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వంతో ముఖ్యంగా రాహుల్‌తో చంద్ర బాబుకు తెరచాటు అనుబంధాలు బలంగా ఉన్నాయనే సంగతి కూడా తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పైన తప్పుడు కేసులు పెట్టే సమయంలో కుదిరిన సఖ్యత క్రమంగా గట్టిపడుతూ వచ్చింది. మొన్నటి సాధారణ ఎన్నికల్లోనూ, అంతకుముందు జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మాటసాయం, ‘మూట’సాయం చంద్రబాబు బాగానే చేశారని వెల్లడైంది. ఆయన ప్రభావం వల్లనైతేమీ, మరే ఇతర కారణం వల్లనైతేమీ రేవంత్ నాయకత్వాన్ని మార్చే ఉద్దేశం హైకమాండ్‌కు లేదని చెబుతారు. ఈ విషయాలు తెలిసిన తర్వాత కూడా జగ్గారెడ్డి ధిక్కార స్వరానికి కారణమేమిటి? ఆయనిప్పుడు పాడిన పాట ఒంటరి పాటగానే మిగులుతుందా? భవిష్యత్తులో బృందగానంగా మారుతుందా? అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నది? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకారం ఇంకా రెండేళ్ల కంటే కొంచెం తక్కువ సమయమే వున్నది. కానీ షెడ్యూల్ కంటే ముందే కేసీఆర్ ఎన్నికలకు వెళ్తారనే అంచనాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ఈ సంవత్సరం రెండో అర్ధభాగం నుంచే ఎన్నికల మోడ్‌లోకి తెలంగాణ వెళ్లవచ్చు. దేశంలో ఉన్న రెండు ప్రధాన జాతీయ పార్టీలు తెలంగాణపై ఆశలు పెంచు కున్నాయి. కేసీఆర్‌కు ఇది రెండో ఇన్నింగ్స్ కనుక అంతో ఇంతో నెగెటివ్ ఓటు ఉండే అవకాశం ఉందనీ, దాన్ని సానుకూలంగా మార్చుకోవాలనీ అవి భావిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పునాదులు ఇంకా పదిలంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దేశవ్యాప్తంగా ఉన్న నిరుత్సాహకర వాతావరణంలో తెలంగాణ గెలుపు ఆ పార్టీకి సంజీవనిగా తోడ్పడుతుంది. భారతీయ జనతా పార్టీకి కర్ణాటక తర్వాత మరో స్థావరం దక్షిణాదిలో ఇంతవరకూ దొరకలేదు. ఏపీ, కేరళ, తమిళ నాడులతో పోలిస్తే ఆ పార్టీ పలుకుబడి తెలంగాణలోనే ఎక్కువ. ఒక సంపూర్ణ జాతీయ పార్టీగా పూర్వపు కాంగ్రెస్ స్థాయిని అందుకోవాలంటే తెలంగాణను గెలుచుకోవలసిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు వాటి వ్యూహాలను రూపొందిస్తున్నాయి. రెండు నెలలకోమారు సర్వేలు చేసి ప్రజల నాడిని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. రెండు పార్టీల సర్వే ల్లోనూ ఫలితాలు దాదాపుగా ఒకే మాదిరిగా వస్తున్నాయట. రాష్ట్రంలో ఏకైక పెద్దపార్టీగా టీఆర్ఎస్ సుమారు 40 శాతం ఓటు బ్యాంకుతో స్థిరంగా కొనసాగుతున్నది. జాతీయ పార్టీల అంచనా ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ ఓటు 38 శాతం కంటే తగ్గదు. 42 శాతం మించి పెరగదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 25 నుంచి 27 శాతం మంది, బీజేపీకి 13 నుంచి 15 శాతం మంది ఓట్లేస్తారని ఆ పార్టీలు ఒక నిర్ధారణకు వచ్చినట్టు కనిపిస్తున్నది. ఈ మూడు ప్రధాన పార్టీలకు ఓట్లేసేవారు మొత్తం ఓటర్లలో 80 శాతం మంది. ఇతర పార్టీలకూ, ఇండిపెండెంట్లకూ కలిపి ఐదారు శాతం ఓట్లు పడ్డా మిగిలిన పద్నాలుగు, పదిహేను శాతం మంది ఇప్పటికీ తటస్థంగానే మిగిలిపోయారు. ఈ బెంచి మార్కు నుంచిరెండు జాతీయ పార్టీలు వాటి కార్యాచరణను సిద్ధం చేసు కుంటున్నాయి. కుమ్ములాటలు లేకుండా పార్టీ శ్రేణులను ఏకతాటిపై నడిపినట్లయితే, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడినట్లయితే ఎన్నికల నాటికి తమ పార్టీ పుంజుకొని మంచి ఫలితాలు సాధించగలుగుతుందని కాంగ్రెస్ భావిస్తున్నది. కాంగ్రెస్ కంటే బీజేపీ ముందున్నది ఇంకా పెద్ద టాస్క్. యథాతథంగా చూస్తే అధికార పీఠానికి కాంగ్రెస్ కంటే బీజేపీ ఇంకొంచెం ఎక్కువ దూరంలో ఉన్నది. ఈ సవాల్‌ను ఎదుర్కోవడానికీ, కాంగ్రెస్‌ను తోసిరాజని ప్రధాన పోటీదారుగా నిలవడానికీ తెరవెనుక ముమ్మర ప్రయత్నాలు బీజేపీ చేస్తున్నట్టు సమాచారం. పంజాబ్ మోడల్‌ను తెలంగాణలో అమలు చేసేందుకు కొన్ని ప్రయ త్నాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి. రైతుల ఆందోళన తర్వాత బీజేపీ మరింత బలహీనపడింది. కాంగ్రెస్ పార్టీ అంతఃకలహాలను అవకాశంగా మలుచుకొని ఒక గట్టి అలయెన్స్‌లో భాగం కాగలిగింది. కాంగ్రెస్ నుంచి కెప్టెన్ అమరీందర్‌సింగ్ చీలిక ఆ పార్టీకి శాపంగా మారింది. కెప్టెన్ నాయకత్వంలోని లోక్ కాంగ్రెస్‌తో కలిసి బీజేపీ పోటీలోకి దిగింది. ఈ ఫార్ములా తెలంగాణలో అమలుచేసే అవకాశాలపై ఇప్పటికే బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఒక రాజకీయ వ్యవహారాల నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక ఇచ్చినట్టు సమాచారం. టీ–కాంగ్రెస్ నాయ కత్వాన్ని మార్చేందుకు అధిష్ఠానం సుముఖంగా లేదనీ, అదే నాయకత్వంలో పనిచేయడానికి టీఎస్ కాంగ్రెస్ పాత నాయ కులు సిద్ధంగా లేరనీ, ఈ నేపథ్యంలో చీలిక తప్పక పోవచ్చుననీ ఆ నివేదికలో అభిప్రాయపడినట్టు తెలుస్తున్నది. ఘనమైన చరిత్ర కలిగిన పార్టీని చంద్రబాబు వంటి అవకాశవాదికి పరోక్షంగా లీజుకు ఇవ్వడం కంటే, పార్టీ స్వచ్ఛతను కాపాడుకోవడానికి కొంతకాలం వేరుగా ఉండటమే మేలన్న అభిప్రాయాన్ని కొందరు కాంగ్రెస్ నేతలు వినిపిస్తు న్నారు. ఇందుకోసం వారు తమిళనాడులో మూపనార్ చేసిన ప్రయోగాన్ని ఉదాహరిస్తున్నారు. 1996 ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ అధిష్ఠానం తమిళనాడులో అన్నాడిఎమ్‌కేతో పొత్తు కుదుర్చుకున్నది. జాతీయ స్థాయిలో ట్రబుల్ షూటర్‌గా పేరెన్నికగన్న తమిళనాడు కాంగ్రెస్ నాయకుడు జీకే మూపనార్ ఈ పొత్తును వ్యతిరేకించారు. జయలలితపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నదనీ, ఆమెతో పొత్తు వల్ల పార్టీ తుడిచి పెట్టుకుపోతుందనీ మూపనార్ వర్గం వాదించింది. అధిష్ఠానం అంగీకరించలేదు. దీనితో మూపనార్ నేతృత్వంలో మెజారిటీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ నుంచి చీలి ‘తమిళ మానిల కాంగ్రెస్’ (టీఎమ్సీ) పేరుతో వేరు కాపురం పెట్టారు. ఈ చీలిక కాంగ్రెస్‌తో డిఎమ్‌కే పొత్తు పెట్టుకొని 20 లోక్‌సభ సీట్ల్లను కేటాయించింది. తను 17 సీట్లలోనే పోటీ చేసింది. పోటీచేసిన అన్ని స్థానాలలోనూ ఈ కూటమి గెలిచింది. మెజా రిటీ అసెంబ్లీ సీట్లను తీసుకున్న డిఎమ్‌కే అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీలో కూడా 40 సీట్లను టీఎమ్సీ గెలుచు కోగలిగింది. అన్నాడిఎమ్‌కేతో కలిసి పోటీచేసిన అధికార కాంగ్రెస్‌కు ఒక్క అసెంబ్లీ సీటు కానీ, పార్లమెంట్ సీటు కానీ దక్కలేదు. అప్పుడు కేంద్రంలో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ మంత్రివర్గంలో ‘తమిళ మానిల కాంగ్రెస్’ కీలకపాత్ర పోషిం చింది. ఆరేళ్ల తర్వాత తిరిగి ఆ పార్టీ మాతృసంస్థలో విలీన మైంది. తమిళనాడు కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్న ఈ ఉదంతం ఇప్పుడు తెలంగాణా వ్యవహారాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో బీజేపీ ఆకాంక్షలకూ, టీఎస్ కాంగ్రెస్‌వాదుల అవసరాలకూ లంకె కుదిరితే కనుక అది కచ్చితంగా సత్ఫలితాలను సాధిస్తుందని మధ్యవర్తుల నమ్మిక. వారి అభిప్రాయం ప్రకారం బీజేపీతో చీలిక వర్గం జతకడితే మెజారిటీ కాంగ్రెస్ ఓట్లు వీరివైపే మొగ్గుతాయి. దాని ప్రభావంతో తటస్థుల ఓట్లను కూడా అధిక సంఖ్యలో ఆకర్షించగలుగుతారు. ఫలితంగా టీఆర్ఎస్కు గట్టి పోటీ దారుగా ఈ కూటమి నిలబడుతుంది. ఈరకమైన విశ్లేషణతో అందిన నివేదికపై బీజేపీ నాయకత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఈ వ్యవహారంలో బీజేపీ చొరవ తీసుకుంటే కాంగ్రెస్‌లో చీలిక తప్పకపోవచ్చుననే వాదన వినబడుతున్నది. ఇటువంటి ఒక రాజకీయ పొందిక ఏర్పాటు ద్వారా కేసీఆర్‌ను బలంగా ఎదుర్కోవాలని భావిస్తున్న కొందరు తటస్థ ప్రము ఖులు ఇటువైపునా అటువైపునా రాయబారులు నడుపు తున్నారు. వారు చెబుతున్న వివరాల ప్రకారం తొలిదశలో ‘ఆకర్ష్ బీజేపీ’ కార్యక్రమం ఉధృతంగా జరుగుతుంది. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి జోరుగా చేరికలుంటాయి. రెండో దశలో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ముదిరి చీలిక ఏర్పడుతుంది. తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ (చీలికవర్గం)తో అవగాహన కుదిరిన తర్వాత వారికి కూడా ఆమోదయోగ్యమైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఈటల రాజేందర్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, డికె అరుణ, విజయ శాంతి... ఇలా అనేక ఆప్షన్లు బీజేపీ దగ్గర సిద్ధంగా ఉన్నాయి. కాంగ్రెస్ వర్గానికి ఎక్కువ అసెంబ్లీ సీట్లు వదిలి, పార్లమెంట్ సీట్లు బీజేపీ ఎక్కువ తీసుకునే అంశం కూడా చర్చకు రావచ్చు. అయితే ఈ ప్రయత్నాలన్నీ కూడా ప్రాథమిక స్థాయిలో, అంచనాల స్థాయిలోనే ఉన్నాయి. కార్యరూపం దాల్చాలంటే తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక మూపనార్ ఉండాలి. ఎవరా మూపనార్? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అడుగులేద్దాం... ఆశే ఊపిరిగా
తుది మొదలు లేని నిరంతర ప్రవాహమైన కాలం అగణితం. కానీ, మానవ జిజ్ఞాస, ప్రయత్నం దేన్నీ ఊరకే వదలదు! అందుకే, ఊహా విభజన రేఖలు గీసి... సెకండ్లని, నిమిషాలని, రోజులని, వారాలని, నెలలని, సంవత్సరాలని కాలానికి కొలతలు వేస్తాడు. యుగాల పరిణామాలకు మౌన సాక్షీభూతమైన కాలాన్ని తానేదో ఒడిసిపట్టినట్టు మనిషి భ్రమిస్తాడు. ఓ యేడు సుఖం, సంతోషం ఎక్కువైతే ఆనందిస్తాడు, కష్టం, బాధ అధికమైతే దుఃఖించి, శపిస్తాడు. కాలపు తునకలన్నీ మనిషి గీసుకున్న ఊహా రేఖలని గ్రహించడు. అదే విభజన గడుల సంధి కాలంలో నిలుచున్న మనం పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త సంవత్సరానికి స్వాగతమంటున్నాం. సరే, అందులో తప్పేమీ లేదు. మంచి చెడుల గతాన్ని వదిలి, ఆశాజనక భవిష్యత్తులోకి అడుగిడే ప్రతి మలుపులో మనకో బుల్లి సమీక్ష, సత్సంకల్పం ఉండాలి. అలా ఉంటేనే ఒకింత జాగ్రత్తగా, కాస్త పద్ధతిగా, కొంచెం వ్యూహాత్మకంగా.... వీటన్నింటికీ మించి ఆనందంగా–ఆహ్లాదంగా ముందుకు సాగే ఆస్కారం ఉంటుంది. గడచిన ఏడాదిలో ఏమేమి అనుకొని ఏమేర సాధించాం? ఇంకేమి మిగిలాయి? అని ఆత్మావలోకనంతో సమీక్షించుకుంటే నష్టమేమీ లేదు. ఆశల అల్లికతో భవిష్యత్ ప్రణాళికా రచన నేరమేమి కాదు. అది ప్రతి 365 రోజులకొకమారు అయితే తప్పేంటి అన్నది హేతుబద్ధ యోచనే! 2021కి వీడ్కోలు చెబుతూ 2022 లోకి అడుగిడుతున్న శుభవేళ ఇది! కొత్త సంకల్పాలు తీసుకొని, వాటి సాధనకోసం పురోగమించాలి. దేశం యావత్తు ఓ ఆశావహ భావనతో భవితను చూస్తోంది. ప్రతి జనవరి ఒకటికీ చేసేది ఇదే అయినా.... మంచి–చెడుల గడుల పరిధి ఒక్కోమారు భిన్నంగా ఉండొచ్చు. ఏదీ తెలిసి జరుగదు. అన్నీ అధిగమించి ముందుకు సాగడం మానవనైజం. మానవేతి హాసంలోనే పెద్ద మహమ్మారిగా చెబుతున్న కరోనా సృష్టించిన విలయానికి గడచిన రెండు సంవత్సరాలు దూదిపింజల్లా కొట్టుకుపోయాయి. ఎన్నెన్ని కుటుంబాల్లో అది తీరని విషాదం నింపిందో, మరెన్ని మానవ హృదయాలను భయంతో కల్లోలపరిచిందో లెక్కే లేదు. మూడో సంవత్సరం ముంగిట్లోకి వచ్చిన మనకు... కొంచెం కష్టం, కొంచెం ఇష్టం అనిపించే సమాచారం అందుతోంది. వైరస్ కొత్త వైవిధ్యమైన ‘ఒమిక్రాన్’ వేగం వల్ల, గతవారం (22–29 డిసెంబరు) సగటున రోజూ 9 లక్షల కొత్త కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యాయి. మరోవైపు చిగురుటాశ ఏమంటే, పలు పరివర్తనాల వల్ల కొత్త వైవిధ్యమై వచ్చిన ఒమిక్రాన్ అంతగా ప్రమాదకారి కాదూ అని! భయంకర ‘మహమ్మారి’ కాస్తా ఆయా కాలాల్లో తరచూ వచ్చే సాంక్రమిక అంటు వ్యాధిలా పలుచబారిందని శాస్త్ర, వైద్యవర్గం చెప్పడం ఉన్నంతలో ఊరటనిచ్చే పరిణామం. ప్రపంచంలో ఒక బలీయ ఆర్థిక, మార్కెట్ శక్తిగా ఎదుగుతున్న భారత్ వివిధ విభాగాల్లో సాధిస్తున్న ప్రగతి, తాజా లక్ష్యాలు కొంత ఆశావహ వాతావరణం కల్పిస్తున్నాయి. పలు రంగాల్లో విజయాల సరళి కొత్త ఆశలు రేపుతోంది. విపత్తులూ కొన్ని అవకాశాలు కల్పిస్తాయనడానికి కోవిడ్–19 నిదర్శనం. టీకాల తయారీ నుంచి వైద్యారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవడం వరకు స్వావలంబనకు అరుదైన అవకాశం లభించింది. ఆ దిశలో అడుగులు పడుతున్నాయి. స్వాతంత్రానంతరం దశాబ్దాల తరబడి నిర్లక్ష్యానికి గురైన వైద్యం, విద్య వంటి కీలకాంశాలను తగిన బడ్జెట్ కేటాయింపులతో, ప్రణాళికాబద్ధంగా తీసుకువెళితే మంచి ఫలితాలకు ఆస్కారం ఉంటుంది. వైద్యం విషయంలో సర్కార్లు ఇపుడైనా, కరోనా దెబ్బతో ‘కాలికి తట్టుతగిలింది ఇక బట్టకట్టడం ఖాయం’ అనుకోవాలి. కేరళ వంటి రాష్ట్రాల్లో గ్రామీణ వైద్యం, కొత్తగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గ్రామసచివాలయ స్థాయి వరకు వైద్యారోగ్య వ్యవస్థ విస్తరిస్తూ భరోసా కల్పిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. విద్యకు సంబంధించి ఎన్నో లోపాలు, వైఫల్యాల్ని నేడు క్షీణించిన క్షేత్ర పరిస్థితులు అడుగడుగునా ఎత్తి చూపిస్తున్నాయి. ప్రాథమిక, సెంకడరీ విద్య నుంచి ఉన్నత, సాంకేతిక విద్య వరకు... తాజా జాతీయ నూతన విద్యా విధానంలో పొందుపరచిన అంశాలతో కొత్త ఆశలు పల్లవి స్తున్నాయి. ప్రభుత్వ రంగంలో అలవిమాలిన అలక్ష్యంతో, ప్రయివేటు రంగంలో ఫక్తు వ్యాపారమై కునారిల్లిన భారత విద్యారంగం పూర్వపు వైభవోజ్వల దశను పుణికి పుచ్చుకుంటుందని ఆశిద్దాం. ఏపీలో ‘నాడు–నేడు’తో సర్కారు బడుల స్వరూప స్వభావాల్నే మారుస్తున్న తీరొక వేగుచుక్క! క్రీడా రంగంలో... ఇటీవలి టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన ఏడు అథ్లెటిక్స్ పతకాలొక కొత్త ఆశారేఖ! క్రికెటొకటే క్రీడ కాదు, భారత్ కీర్తికిరీటాన్ని ధగధగలాడించే మట్టిలో మాణిక్యాలు ఆట ఆటలో ఉన్నాయని తేల్చి చెప్పే భవిష్యత్తు వైపు భారత యువతరం పరుగులు తీయాలి. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశం మనది. తగిన శిక్షణ, ఉద్యోగ, ఉపాధి, మేధోపరిణతి అవకాశాలు కల్పిస్తూ యువశక్తిని ఓ బలీయమైన మానవ వనరుగా తీర్చిదిద్దాలి. ప్రపంచం దృష్టి మనవైపు మళ్లేలా తగిన వ్యూహాలు, విధానాలు, కార్యాచరణ ఉంటే మనకిక తిరుగుండదు. ప్రపంచమంతా ఐటీ, కృత్రిమ మేధ, రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక పరిణామాలతో పురోగమిస్తున్న ఈ తరుణంలో విలువలు, నైతికత ప్రశ్నార్థకమౌతున్నాయి. గొప్ప సనాతన, ఆధ్యాత్మిక, చారిత్రక నేపథ్యం ఉన్న దేశంగా ఆధునిక శాస్త్ర–సాంకేతిక పురోగతిని మేళ విస్తూ ముందుకు వెళితే భారత్ ఒక ప్రపంచ చోదక శక్తిగా నిలిచే అవకాశాలు పుష్కలం. ఈ క్రమంలో 2022 ఓ గొప్ప మేలుమలుపు కావాలని మనమంతా ఆశిద్దాం. ఆశే మనిషికి దిక్సూచి! -
పెరుగుతోంది! పారాహుషార్!
సునామీ గురించి విన్నాం... చూశాం. కానీ కోవిడ్ సునామీ గురించి? గత వారంగా రోజూ సగటున 9 లక్షల ప్రపంచ కేసుల ట్రెండ్ చూస్తుంటే, అటు డెల్టా, ఇటు కొత్త ఒమిక్రాన్ వేరియంట్లతో రానున్న రోజుల్లో ప్రపంచ దేశాలపై కోవిడ్ కేసులు సునామీలా విరుచుకుపడే ప్రమాదం ఉందంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. భారీగా కేసులొచ్చి, ఆస్పత్రిలో చేరేవాళ్ళు, మృతులు పెరిగితే, ఇప్పటికే రెండేళ్ళుగా పరిమితికి మించి శ్రమిస్తున్న ఆరోగ్య వ్యవస్థలపై ఒత్తిడి పడే ముప్పుంది. డబ్ల్యూహెచ్ఓ బుధవారం చేసిన ఈ హెచ్చరిక ఓ పెను ప్రమాదఘంటిక. అసలే ఆరోగ్య సిబ్బంది కొరత కాగా, వారిలో అనేకులు కరోనా బారినపడడం కష్టాలను మరింత పెంచుతోంది. ప్రపంచ దేశాల్లో అంతకంతకూ పెరుగుతున్న కేసుల సంఖ్య... పండుగల వేళ మన దేశాన్ని పారాహుషార్ అంటోంది. ప్రపంచవ్యాప్తంగా గత వారంలో 11 శాతం మేర కరోనా కేసులు హెచ్చాయి. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్లలో రికార్డుస్థాయిలో కరోనా బారినపడుతున్నారు. 61.9 శాతం జనాభాకు పూర్తిగా టీకాలు వేసిన అమెరికాలో పరిస్థితే ఇలా ఉంటే, మిగతాచోట్ల ఏమిటో ఊహించుకోవచ్చు. నిజానికి, ఈ ఏడాది చివరి కల్లా ప్రతి దేశంలో 40 శాతం మందికి పూర్తిగా టీకా వేయాలనీ, కొత్త ఏడాది మధ్యకల్లా అది 70 శాతానికి చేరాలనీ భావించారు. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థలో సభ్యు లైన 194 దేశాల్లో 92 దేశాలు ఈ ఏటి 40 శాతం లక్ష్యాన్ని కూడా చేరుకోవట్లేదు. అదీ విషాదం. అతి కొద్ది ధనిక దేశాల చేతుల్లోనే టీకాలు, ఆరోగ్య పరికరాలు పోగుపడడంతో సమానత్వం అసాధ్యం. కరోనాపై పోరులో వర్ధమాన దేశాలు వెనకబడ్డాయి. కొత్త వేరియంట్లకూ సందు చిక్కింది. గత వేరియంట్ల కన్నా ఒమిక్రాన్ తక్కువ ప్రాణాంతకమని ప్రాథమిక స్టడీలు చెబుతున్నా, పెద్దయెత్తున ఆస్పత్రి పాలయ్యే ప్రమాదమైతే ఉంది. కరోనాతో ఉద్యోగులు క్వారంటైన్లో ఉంటే, వ్యాపారాలకూ దెబ్బే. ఆర్థిక రంగాన్ని దృష్టిలో పెట్టుకొనో ఏమో అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు బాధితులు 10 రోజులు ఐసొలేషన్‌లో ఉండాల్సి ఉంటే, దాన్ని తాజాగా 5 రోజులకే తగ్గిస్తున్నాయి. ఈ వివాదాస్పద నిర్ణయం ఎంతవరకు శాస్త్రీయమో చెప్పలేం. ఐసొలేషన్ రోజుల్ని తగ్గించడంతో బాధితుల నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి వేగవంతం కావచ్చని నిపుణుల అనుమానం. డాక్టర్ల మందులతో పాటు నర్సుల సేవ కీలకమైన వేళ భారత్ లాంటి చోట్ల నర్సుల కొరత ఉంది. ప్రతి వెయ్యిమందికీ ముగ్గురు నర్సులుండాలని ఆరోగ్యసంస్థ మాట. భారత్‌లో 1.7 మందే ఉన్నారు. మన దేశంలోనూ రోజుకు సగటున 8 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. సగటు కరోనా పాజిటివిటీ రేటు 0.92 శాతం. గత 24 గంటల్లో 13 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 33 రోజుల తర్వాత దేశంలో తొలిసారి కేసుల సంఖ్య 10 వేలు దాటింది. భయపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులూ వెయ్యికి చేరుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్రల్లో కేసులు పెచ్చరిల్లుతున్నాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 1.73 శాతం దాటింది. అక్కడి కేసుల్లో 46 శాతం ఒమిక్రాన్‌వే. చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో గత వారంగా కరోనా పెరగడం, ఢిల్లీ – ముంబయ్‌లలో ఇప్పటికే కరోనా థర్డ్‌వేవ్ వచ్చేసిందనీ, సామాజిక వ్యాప్తి జరుగుతోందనీ వార్తలు రావడం ఆందోళనకరం. కాగా, దేశంలోని కేస్లోడ్లో 25 శాతం కేరళ నుంచేనట. కేరళ సహా కొన్నిచోట్ల నైట్ కర్ఫ్యూ పెట్టేశారు. ముంబయ్‌లో 144 సెక్షన్ విధించారు. రోజు రోజుకూ కేసులు పెరుగుతున్న తెలంగాణలో సైతం ఆరోగ్యాధికారులు రెండో ప్రమాద హెచ్చరిక చేశారు. రానున్న 2 నుంచి 4 వారాలు అత్యంత కీలకమనీ, జాగ్రత్తలు అవసరమనీ పదేపదే గుర్తుచేస్తు్తన్నారు. పరిస్థితులు ఇలా ఉంటే, వచ్చే ఏడాది మొదట్లో 15 కోట్ల మంది ఓటర్లు పాల్గొనే యూపీ సహా వివిధ రాష్ట్రాల ఎన్నికలు, ర్యాలీలు యథావిధిగా జరగనున్నాయి. గురువారం ఎన్నికల సంఘం ఆ సంగతి తేల్చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలనీ, గుంపులకూ, ఉత్సవాలకూ దూరంగా ఉండాలనీ చెబుతున్న పాలకులు, పార్టీ నేతలు ఎన్నికల వేళ తాము ఆ పని చేయడం లేదు. ముఖానికి మాస్కు, భౌతిక దూరం లేని జనప్రదర్శనలతో అన్ని పార్టీలదీ అదే తీరు. రాత్రి వేళ కర్ఫ్యూలు, పగటిపూట ర్యాలీలు– ఇదీ నేటి ద్వంద్వ నీతి. ఢిల్లీలో రెండు రోజుల క్రితమే ఎల్లో అలర్ట్ జారీ చేసి, స్కూళ్ళు, సినిమా హాళ్ళు మూసేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పంజాబ్ ఎన్నికల ర్యాలీలు మాత్రం మానుకోదలిచినట్టు లేరు. చండీగఢ్‌లో ఆయన తాజా విజయోత్సవ ర్యాలీయే అందుకు నిదర్శనం. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మొదలు ప్రధాని, హోమ్ మంత్రి పాల్గొంటున్న ఉత్తరాది రాష్ట్రాల ర్యాలీలు సరేసరి. కుంభమేళాకు లేని అభ్యంతరం ఇప్పుడు బెంగాల్లో గంగా సాగర్ మేళాకు ఎందుకన్నది మమతా బెనర్జీ ప్రశ్న. ఇలాంటి చర్యలు సరైనవేనా అన్నది నాయకులే ఆత్మపరి శీలన చేసుకోవాలి. ప్రజారోగ్యం కన్నా పార్టీల ఎన్నికల ప్రయోజనాలే ఎక్కువ కావడం సరైనదా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే, ఈ ఏడు ఇలాగే తమిళనాడు, కేరళ, బెంగాల్ తదితర రాష్ట్రాల ఎన్నికల ర్యాలీలతో ఎన్ని రెట్లు కేసులు పెరిగాయో తెలిసిందే. ఇప్పుడు ప్రజల ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది. పైపెచ్చు, డిసెంబర్ మొదట్లో రోజూ 80 లక్షల డోసులు వేస్తే, ఇప్పుడది 60 లక్షలకు పడి పోవడం పాలకుల లోపమే. కొత్తగా రెండు కొత్త వ్యాక్సిన్లు (కోవోవ్యాక్స్, కోర్బెవ్యాక్స్) – ఓ మాత్ర (మాల్నూపిరవర్)కు అనుమతిచ్చినా, వృద్ధులకు బూస్టర్లు – టీనేజర్లకు టీకాలేస్తామంటున్నా, నేటికీ వయోజనుల్లో 63 శాతానికే 2 డోసులూ పూర్తయ్యాయని మర్చిపోతే కష్టం. -
కరుణాలయంపై కాఠిన్యమా!
నిస్సహాయులకు ఆపన్నహస్తం అందించేందుకు 71 ఏళ్ళ క్రితం ఏర్పాటైన సంస్థ అది. కష్టాల్లో ఉన్న దీనులకు కేయూతనివ్వడానికి అమృతమూర్తి మదర్ థెరెసా ఆరంభించిన కరుణాలయం అది. అలాంటి ఇంటర్నేషనల్ ట్రస్ట్ ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ (ఎంఓసీ) ఇప్పుడు వివాదాస్పద వార్తల్లో నిలవడం విషాదం. ఆపదలో ఉన్నవారిని ఆదుకొనేందుకు వీలుగా విరాళాలను స్వీకరించడానికి ‘విదేశీ విరాళాల నియంత్రణ చట్టం’ (ఎఫ్సీఆర్ఏ) కింద ఆ సుప్రసిద్ధ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీఓ)కున్న లైసెన్స్‌ను పొడిగించడానికి కేంద్ర హోమ్‌శాఖ నిరాకరించింది. అదీ సరిగ్గా క్రిస్మస్ నాడు ఆ నిర్ణయం రావడం అనేక ప్రశ్నలకు తావిచ్చింది. కోల్‌కతా కేంద్రంగా నడిచే ఈ సేవాసంస్థకు సంబంధించి ‘కొంత ప్రతికూల సమాచారం’ గుర్తించినందు వల్లే లైసెన్స్‌ను పొడిగించబోమన్నామని ప్రభుత్వ అధికారులు సోమవారమిచ్చిన వివరణ. కానీ, తమకొచ్చిన సదరు ‘ప్రతికూల సమాచారం’ ఏమిటన్నది ప్రభుత్వం పెదవి విప్పకపోవడమే విచిత్రం. పారదర్శకత లేని ఈ సర్కారీ చర్యతో నేరుగా ఆ సంస్థల్లోని 22 వేల మంది రోగులకూ, ఉద్యోగులకూ ఆహారం, ఔషధాలు కరవయ్యాయి. అందుకే, తృణమూల్ కాంగ్రెస్ మొదలు కాంగ్రెస్ సహా రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. కొన్నేళ్ళుగా ఎఫ్సీఆర్ఏ చట్టాలను కఠినతరం చేస్తూ, ఎన్జీఓలపైన ప్రభుత్వానికి బోలెడంత పెత్తనం కట్టుబెడుతూ పాలకులు చేపడుతున్న చర్యలతో పలువురికి అనేక అనుమానాలూ వస్తున్నాయి. భారతదేశాన్ని స్వగృహంగా మార్చుకున్న జన్మతః అల్బేనియన్ క్రైస్తవ సన్న్యాసిని మదర్ థెరెసా 1950లో కలకత్తా వీధుల్లో స్థాపించిన సేవాసంస్థ – ఎంఓసీ. సేవాతత్త్వంతో నోబెల్ శాంతి బహుమతి పొందిన ప్రేమజ్యోతిగా వెలిగిన ఆ ‘భారతరత్న’ం పెట్టిన ఈ సంస్థ మానవతా దృష్టితో సుదీర్ఘకాలంగా ఎందరికో సేవలందిస్తూ, అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. ఎన్నో ఏళ్ళుగా ఆ సంస్థకు విదేశీ విరాళాలు అందుతూనే ఉన్నాయి. వాటికి సంబంధించి ఏటా నివేదికలు సమర్పిస్తూనే ఉంది. ఒకవేళ ఆ సంస్థ గనక నిబంధనల్ని ఉల్లంఘిస్తే, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. తప్పు లేదు. కానీ, ముందుగా చేసిన ఆ తప్పులేమిటో, వాటి స్వభావమేమిటో కూడా ప్రభుత్వమే ప్రకటించాలి కదా! ఇప్పుడు అలా జరగకపోవడం ప్రధానంగా విమర్శకు కారణమైంది. అనాథలు, అభాగ్యులు, అంధులు, అంగవికలురు, అసహాయులైన వృద్ధులు, వరదలు – కరవు కాటకాలు – మహమ్మారి రోగాల బారిన పడ్డ వారిని కంటికి రెప్పలా కాపాడుకొనే పనిలో దాదాపు 139 దేశాల్లో ఎంఓసీ విస్తరించింది. అలాంటి సేవాసంస్థకు అశేష అభిమానులతో పాటు, బలవంతపు మత మార్పిడికీ, బాలికల అక్రమ రవాణాకూ పాల్పడుతోందని నిరాధార ఆరోపణలు చేసే సంప్రదాయవాద సంస్థల ఏజెంట్లూ అనేకులున్నారు. గుజరాత్‌లోని వడోదరాలో బాలికా కేంద్రంపై ఈ నెలలో కొందరిచ్చిన ఫిర్యాదు ఫలితమే తాజా చర్య అని లోపాయకారీగా అధికారుల మాట. ఆడిట్లో అవకతవకలని మరో మాట. అయితే, వాటిల్లో నిజం లేదని ఎంఓసీ ఖండిస్తోంది. 2016–17, 2018–19 మధ్య ఏటా రూ. 58 వేల కోట్లకు పైగా విదేశీ విరాళాలొచ్చాయని హోమ్ శాఖ డేటా. నిజానికి, గత ఏడేళ్ళలో మోదీ సర్కారు విదేశీ విరాళాల మూలాలను గుప్పెట బిగించింది. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ, కొన్ని వందల ఎన్జీఓల ఎఫ్సీఆర్ఏ లైసెన్సులను రద్దు చేసింది. ఎఫ్సీఆర్ఏలో గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం మరిన్ని మార్పులు చేసింది. ఎన్జీఓలకొచ్చే విదేశీ విరాళాలపై కత్తెర వేసేలా ప్రభుత్వానికి అదనపు అధికారాలూ వచ్చిపడ్డాయి. ఆ అధికారాన్ని అనేక మానవ హక్కుల బృందాలపై హోమ్ శాఖ ప్రయోగించడం, ఆ ఆదేశాల్లో కొన్నింటిని కోర్టులు కొట్టేయడం జరిగిన కథ. ఈ చట్టం కింద దేశంలో 22 వేలకు పైగా ఎన్జీఓలు నమోదు కాగా, వాటిలో కనీసం 10 – 15 శాతానికి మోదీ పాలనలో లైసెన్సు పొడిగింపులు దక్కబోవని నిపుణుల మాట. ‘దేశ భద్రతకూ, ప్రజా ప్రయోజనాలకూ భంగకరమైన చర్యల’కు చెక్ పెట్టడం ఈ ఎఫ్సీఆర్ఏ ఉద్దేశం. మదర్ థెరెసా పెట్టిన సంస్థ అలాంటి పనేం చేసింది? ముందుగా షోకాజ్ నోటీసులివ్వాల్సి ఉన్నా, ఈ తాజా ఘటనలోనూ అలాంటివేవీ పాటించలేదు. అందుకే, అనేక ఎన్జీఓలకు ప్రభుత్వ చర్యలకు కారణాలేమిటో కూడా తెలియని పరిస్థితి. పైపెచ్చు, ప్రభుత్వంపై విమర్శనాత్మకంగా వ్యవహరిస్తున్న పౌర స్వేచ్ఛ, మానవ హక్కుల సంస్థలపై ఇలా వేటు ఎక్కువగా పడుతోందన్నది ఓ విశ్లేషణ. ఇటీవల ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, లాయర్స్ కలెక్టివ్, గ్రీన్‌పీస్ ఇండియా, ది ఫోర్డ్ ఫౌండేషన్ లాంటి ఎన్జీఓల విదేశీ విరాళాల లైసెన్సులు సస్పెండవడమో, రద్దు కావడమో అందుకు ఉదాహరణ. ఒకపక్క దేశంలోని పలు రాష్ట్రాల్లో చర్చిలపైన దాడులు, మరోపక్క కర్ణాటకలో కొత్తగా పెట్టిన మతమార్పిడి వ్యతిరేక బిల్లు మైనారిటీల్లో ఆందోళన రేపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇలా ప్రసిద్ధ ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’పై తీసుకున్న చర్య ఎలాంటి సంకేతమిస్తుంది? ఆహారం, విద్యే కాదు... ఆక్సిజన్ నుంచి ప్లాస్మా దాకా అనేకం ప్రభుత్వమే అందరికీ అందించలేని చోట ఇలాంటి సంస్థల సేవ నిరుపమానం. చట్టం సర్వోన్నతమైనదే. కానీ, దాన్ని సాకుగా తీసుకొని, నిరూపణ కాని సమాచారంతో మానవతావాద కృషికి గండికొట్టకూడదు. అలా చేస్తే అంతకన్నా నేరం, ఘోరం మరొకటి ఉండదు. ఇప్పుడిక ప్రజల్లోని అనుమానాల్ని పాలకులే పోగొట్టాలి. పౌర సమాజ సంస్థలను ఇరుకునపెట్టడానికి ప్రభుత్వం విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని వాటంగా వాడుకుంటోందనే భావనను తొలగించాలి. ఆ బాధ్యత ప్రభుత్వానిదీ, ప్రభువులదే! -
ఎర్త్ టూ మార్స్.. వయా మూన్!
చంద్రుడిపై ఓ వెయ్యి గజాలు కొని పెట్టేస్తే బెటరేమో! అలాగే అమ్మాయి పేరు మీద అంగారకుడిపై ఓ ఎకరం కొని పెడితే పెళ్లి టైమ్‌కి పరుగులు ఉండవు మరి!! ఇక భూమ్మీద ఉన్న తల్లిదండ్రులు ఇలాంటి కబుర్లు చెప్పుకోవలసిన సమయం దగ్గర్లోనే ఉందంటున్నారు. ఎందుకంటే.. భూమ్మీద కొన్నేళ్లుపోతే నిలబడ్డానికే చోటు ఉండదు. ఈ వెధవ కాలుష్యం... గొడవలూ ఎవడు పడతాడు. శుభ్రంగా మరో గ్రహంపై సెటిలైపోతే విశ్రాంత జీవితం ప్రశాంతంగా ఉంటుందని లెక్కలు వేసుకునే కాలం వచ్చేస్తోంది. అంగారక అలియాస్ అరుణ గ్రహం లేదంటే ఇంగ్లిష్‌లో మార్స్! పేర్లేవైతేనేం...అక్కడో పెద్ద మంచుగడ్డ సైంటిస్టులకు నిద్రలేకుండా చేస్తోంది. ఆ మంచు నిధిని చూసినప్పటి నుంచి ఖగోళశాస్త్ర వేత్తలు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. పొరుగూరి కెళ్లినంత తేలిగ్గా మార్స్ వెళ్లిపోదాం సామాను సర్దుకుని రెడీగా ఉండండంటున్నారు. ఎందుకంటే అంతరిక్షంలో మనిషి మకాం వేయడం ఖాయమనే అంటున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు. మరీ ముఖ్యంగా మనిషి జీవించడానికి చంద్రుడితో పాటు.. అంగారకుడిపైనా అవకాశాలున్నాయని పరిశోధకులు టెలిస్కోప్ గుద్ది మరీ చెబుతున్నారు. భూమ్మీద ఉన్న మావయ్యని.. చందమామపై ఉన్న అత్తయ్య దగ్గరకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి అందరూ కలిసి... అంగారకుడిపై వినోదయాత్రకు బయలు దేరదాం అని ఇప్పుడెవరైనా అంటే పిచ్చి పట్టిందేమో అని భయం భయంగా చూస్తారేమోకానీ.. మరో యాభై ఏళ్ల తర్వాత అది అత్యంత సహజమైన పరిణామమవుతుందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటోంది. ఆ మధ్య చంద్రుడిపైనా, అంగారకుడిపైనా కూడా నీటి జాడలు కచ్చితంగా ఉన్నాయని తేలడం తోనే అక్కడ మనిషి జీవించడానికి అనువైన వాతావరణం ఉంటుందని ఖగోళ శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ముందుగా చంద్రుడిపై గ్రామాలు కట్టేస్తారట. ఆ గ్రామాల్లో చక్కటి ఇళ్లు నిర్మించేసి భూమి నుంచి వలస వచ్చేవారి కోసం సిద్ధంగా ఉంచుతారట. చంద్రుడిపై విస్తారంగా ఇళ్లు కట్టేశాక కాలనీ కోసం అంగారకుడిపైకి వెళ్తారట. అంగారకుడి పైనా విశాలమైన కాలనీలు నిర్మించి.. మనుషులు మకాం పెట్టడానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తారట. ఇదంతా ఎందుకంటే... ఇప్పటికే మితిమీరిన జనాభాతో భూమి కిక్కిరిసిపోతోంది. మరో యాభై ఏళ్లు దాటితే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. భూమిపై కాలు మోపడానికి కూడా ఖాళీ స్థలం ఉండకపోవచ్చు. అప్పుడు కొత్తగా పుట్టబోయే వారికి భూమ్మీద నివసించడానికి చోటే ఉండదు. అలాంటి పరిస్థితుల్లో రాబోయే తరాల భూగ్రహ వాసులు ఏం చేయాలి? దానికి సమాధానంగానే చంద్రుడు, అంగారకుడిపై దృష్టి సారించారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఆ కాలనీలు కానీ కట్టడం పూర్తయితే... భూమి నుంచి పెద్ద సంఖ్యలో జనం కొత్త గ్రహాలకు వలసపోతారన్నమాట! మరో వందేళ్లు దాటిందనుకోండి భూమిపై ఉన్న వారికి చంద్రుడిపైనా, అంగారకుడిపైనా కూడా చుట్టాలు ఉండచ్చు. భూమిపై ఉండేవారు మునుముందు తమ చుట్టాలను చూసి రావడానికి చంద్రుడిపైకి, అంగారకుడిపైకి అంతరిక్ష నౌకల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. భూమ్మీద జనాభా పెరిగిపోవడంతో పాటు.. రోజురోజుకీ పెరిగిపోతోన్న కాలుష్యం భూమిని ప్రమాదకరమైన గ్రహంగా మార్చేస్తోంది. భూమి చుట్టూరా ఉన్న వాతావరణమంతా విషమయమై పోతోంది. అంతులేని భూతాపం భూమిపై మానవ జాతి మనుగడకే సవాల్ విసురుతోంది. గాలితో పాటు భూమిలోని నీరు, అంతరిక్షం కూడా కలుషితమైపోతున్నాయి. వీటికితోడు మానవాళి వినాశనానికి దారి తీసే అణ్వాయుధాల భయమూ పెరుగుతోంది. ఏ క్షణంలో ఏ దేశం అణు బాంబును ప్రయోగిస్తుందో తెలీని ఉత్కంఠ నెలకొంది. అడిలైడ్‌లో 4వేల మంది అంతరిక్ష పరిశోధకులతో జరిగిన వార్షిక సమావేశంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ కొత్త గ్రహాలపై కాలనీల ఏర్పాటు గురించి ఆశావహ దృక్పథంతో ప్రచారం చేసింది. అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని అందులో 17 ఏళ్లుగా నివసిస్తున్నామని ఈ సమావేశంలో స్పేస్ ఏజెన్సీ చెప్పుకొచ్చింది. చంద్రుడి ఉపరితలంపై శాశ్వత ఆవాసాల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉందనే తాము భావిస్తున్నామని ఏజెన్సీకి చెందిన శాస్త్రవేత్త పియరో మెస్సినా వివరించారు. రానున్న పదేళ్లల్లో చంద్రుడిపై గ్రామం నిర్మాణానికి సంబంధించి అనువైన సమాచారాన్ని సేకరించి ప్రణాళికలు రూపొందించేందుకు మిషన్లను తయారు చేస్తున్నట్లు మెస్సినా పేర్కొన్నారు. మొత్తం మీద ‘మా పెద్దబ్బాయి భూమ్మీద పని చేస్తున్నాడు. రెండో అబ్బాయి చంద్రుడిపైనా... మా అమ్మాయి అంగారకుడిపైనా ఉద్యోగాలు చేసుకుంటున్నారు’ అని తల్లిదండ్రులు మురిసి పోయే రోజులు దూరంలో లేవన్నమాట. అప్పుడు మూడు గ్రహాలపైనా చుట్టాలుంటారు. అన్నీ బానే ఉన్నాయి కానీ... అసలు సౌర వ్యవస్థలో ప్రాణులు జీవించడానికి ఆస్కారమున్న గ్రహాలున్నాయా అని? మనిషి ఆశాజీవి కదా! అసాధ్యమన్నదే తన డిక్షనరీలో లేదనుకుంటాడు. ప్రకృతినీ తాను శాసించేయగలనని అనుకుంటూనే ఉంటాడు. సాధ్యం కాని ఎన్నో ఘనతలను ఇలాంటి ధీమాతోనే సాధించి పారేశాడు కూడా! మరయితే మనిషి వేరే గ్రహాలపై కాపురం పెట్టేస్తాడా? ఏమో... గుర్రం ఎగరావచ్చు!! -
అంకెలపై లంకెబిందె కథలు!
నిజం నిద్ర లేచేసరికి అబద్ధం దేశాన్ని చుట్టేస్తుందంటారు. మసాలా వేసి వండిన వంటకం కనుక అబద్ధపు ఘుమఘుమలు తొందరగా వ్యాపిస్తాయని ఈ సామెత ఉద్దేశం. అటువంటి అబద్ధాలు వ్యవస్థీకృత రూపం దాల్చితే? సమస్త వనరుల్ని తమ గుప్పెట పెట్టుకున్న శక్తిమంతులే ఆ వ్యవస్థ వెనుక నిర్దేశకులుగా నిలబడితే ఏమవుతుంది? – అబద్ధాలు సూపర్సోనిక్ రెక్కల్ని తొడుక్కుంటాయి. నిజాల తరంగదైర్ఘ్యాలు నిస్సహాయపు ముద్ర దాల్చవలసి ఉంటుంది. ఒకానొక చారిత్రక దుర్ముహూర్తంలో పాతికేళ్లకు పూర్వం సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవస్థీకృత అబద్ధాలకు విత్తనం పడింది. రాజకీయ వ్యవస్థలో వెన్నుపోటు అనే వినూత్న పద్ధతిలో రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్న రాజకీయ శక్తికి అసత్య ప్రచారాలను ఆక్సిజన్ మాదిరిగా ఎక్కించవలసి వచ్చింది. ఆక్సిజన్ సరఫరాదారుల్లోంచి ఆ రాజకీయ శక్తి ‘క్రోనీ క్యాపిటలిజా’న్ని ప్రోది చేసింది. ఇంతింతై చెట్టంతైన ‘క్రోనీ కేపిటలిజమ్’ ప్రజాస్వామ్య వ్యవస్థలోని అన్ని పార్శ్వాల్లోనూ తన ఊడలను దించడం ప్రారంభించింది. ఫలితంగా ఆ రాజకీయ శక్తి చుట్టూ డబ్బూ, పలుకుబడి కలిగిన ఒక ముఠా వలయం మాదిరిగా అల్లుకున్నది. సకల వనరులతోపాటు ఈ ముఠా చేతిలో ప్రజాభిప్రాయాన్ని ‘ఉత్పత్తి’ చేసే కార్ఖానాలు కూడా ఉన్నాయి. ఈ కార్ఖానాలు పందిని తయారుచేసి నందిగా బ్రాండింగ్ చేయగలవు. వినియోగదారుడు నమ్మి తీరవలసిందే! తనకు లాభసాటిగా ఉన్న రాజకీయ–ఆర్థిక–సామాజిక పొందికలో ఏ చిన్న మార్పునూ ఈ క్రోనీ ముఠా సహించలేదు. వారి కర్మఫలాన రెండున్నరయేళ్ల క్రితం రాజకీయ పొందికలో ఒక మార్పు జరిగింది. ఫాదర్ ఆఫ్ ఆంధ్రా క్రోనీ క్యాపిటలిజమ్ అధికారానికి దూరమయ్యాడు. అధికారంలోకి వచ్చిన రాజకీయ శక్తి సామాజిక–ఆర్థిక పొందికలోనూ మార్పులు చేయడం ప్రారంభించింది. నిర్భాగ్యులనూ, నిస్సహాయులనూ సాధికారం చేసే చర్యలకు ఉపక్రమించింది. ఈ పరిణామాలను క్రోనీ ముఠా ప్రాణాంతకంగా పరిగణించింది. దీనికి చెక్ చెప్పడానికి తమ చేతుల్లో ఉన్న ప్రజాభిప్రాయ ఉత్పత్తి కర్మాగారాలను మూడు షిప్టుల్లో నడపడం ప్రారంభించింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన.. జరుగుతున్నంత ప్రచారం ఈ దేశ చరిత్రలో ఎన్నడూ ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగి ఉండలేదు. ఈ ప్రచారానికి పునాదిరాళ్లు అబద్ధాలే. నందిని పందిగా, పందిని నందిగా జనం మదిలో ముద్రించడమే ఈ ప్రచార లక్ష్యం. ఇందుకోసం అన్నిరకాల మార్కెటింగ్ టెక్నిక్‌లనూ రంగంలోకి దించారు. ప్రభుత్వం మీద హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి కొంత కాలంపాటు కష్టపడ్డారు. ప్రజలు ఈ ప్రచారాన్ని నమ్మలేదు. పైగా తిప్పికొట్టారు. దాంతో అమరావతి విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని శక్తులనూ ఏకం చేయడానికి ప్రయత్నించారు. పార్టీలను ఏకం చేయగలిగారు కానీ ప్రజలను ఒప్పించ లేకపోయారు. ఇసుక దోపిడీ చేస్తున్నారని ప్రచారం మొదలు పెట్టారు. ఎమ్మెల్యేలు సైతం క్వారీల్లో చొరబడి మహిళా అధికారులపై కూడా దాడులు చేసిన ఆనాటి గాయాలు సలపడంతో తోక ముడిచారు. వరసగా ఓ అరడజన్ ప్రచారాలు బోల్తాకొట్టిన తర్వాత అప్పులు – అభివృద్ధి, పెట్టుబడులు అనే అంశాలతో కూడిన ఒక మెగా క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. మల్టీస్టారర్ షోగా దీన్ని మలిచారు. కొత్త ప్రభుత్వం వేలకోట్లు అప్పులు చేసిందనీ, ఇక అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడిందనీ, దివాళా పరిస్థితి ఏర్పడింది కనుక ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలనీ డిమాండ్ చేసేదాకా ఈ ప్రచారాన్ని నడుపుతున్నారు. ఇంత అప్పు చేసినా అభివృద్ధి జాడే రాష్ట్రంలో కన్పించడం లేదని ఊరూవాడా హోరెత్తిస్తున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియా–అనే చతురంగ బలాలను యుద్ధప్రాతిపదికపై నడిపిస్తున్నారు. ఈ దుమారంలో కొట్టుకొనిపోకుండా నిజా నిజాలను నిష్పాక్షికంగా దర్శించవలసిన అవసరం ఉన్నది. నిజాలకు నిలువుటద్దాల వంటి అంకెలన్నీ మనకు అందు బాటులోనే ఉన్నాయి. అవును. వైఎస్ జగన్ ప్రభుత్వం అప్పులు చేసిన మాట నిజం. కరోనా కాలంలో అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ది ఆరో స్థానం. తెలంగాణ ఏడో స్థానంలో ఉన్నది. ఇంతకుముందున్న ప్రభుత్వం రూ.3లక్షల కోట్లు అప్పుచేసి, మరో 60 వేల కోట్ల బకాయిల భారాన్ని తలపై మోపి, ఏటా 20 వేల కోట్లు వడ్డీలే చెల్లించాల్సిన వారసత్వాన్ని ఏపీ కొత్త ప్రభుత్వానికి వదిలేసింది. కరోనా కాలంలో ఏపీ కంటే అధికంగా అప్పులు చేసిన ఐదు రాష్ట్రాలతో సహా దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇంతటి ‘ఘనమైన’ వారసత్వ సంపద లేదు. చేసిన అప్పులతో ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఖర్చు పెట్టిన పద్దులేమిటి? చేసిన అభివృద్ధి ఎంత? సంక్షేమం మాటేమిటి? అనే విషయాలను పరిశీలించాలి. అంతకు ముందు ఏపీ పరిణా మాలపై నిపుణులైన ఆర్థికవేత్తలు, సంస్థలు, పారిశ్రామికవేత్తలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. పీఆర్ఎస్ ఇండియా అనే ఒక ప్రముఖ ఇండిపెండెంట్ సంస్థ ‘స్టేట్ ఆఫ్ స్టేట్ ఫైనాన్సెస్’ అనే పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. కరోనా కష్టకాలంలో పేదవర్గాలను ఆదుకోవడానికి ఏ రాష్ట్రం ఎంతమేరకు బడ్జెట్ కేటాయింపులు చేసిందనే అంశాన్ని ఈ నివేదిక విశ్లేషించింది. జాబితాలో 13.1 శాతం బడ్జెట్ కేటాయింపుతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నది. 7.9 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో, 4.8 శాతంతో మహారాష్ట్ర మూడోస్థానంలో ఉన్నాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రాష్ట్రాల బడ్జెట్లపై విశ్లేషణ చేసింది. సంక్షేమానికే కాకుండా అభివృద్ధికి కూడా ఏపీ ప్రభుత్వం పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నదని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వం చివరి సంవత్సరం బడ్జెట్లో మూలధన వ్యయంగా (Capital expenditure) 35 వేల కోట్లు కేటాయిస్తే రెండేళ్లు తిరిగేసరికే వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ పద్దును 45 వేల కోట్ల రూపాయలకు పెంచింది. ఇది ఆర్బీఐ లెక్క. ఉద్యోగుల జీతభత్యాల కింద చంద్రబాబు ప్రభుత్వం చివరి సంవత్సరంలో రూ. 32 వేల కోట్లు ఖర్చుచేస్తే, రెండేళ్లలో ఆ పద్దును వైఎస్ జగన్ ప్రభుత్వం రూ. 50 వేల కోట్లకు పెంచిందని ఆర్బీఐ వెల్లడించింది. సమ్మిళిత అభివృద్ధి(inclusive growth)లో ఆంధ్రప్రదేశ్‌ది దేశంలో తొలిస్థానమని ‘ఇండియా టుడే’ సర్వే (2021) తేల్చి చెప్పింది. 2003 సంవత్సరం నుంచి ప్రతియేటా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక సర్వే ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా గ్రామసీమలు సర్వతోముఖాభివృద్ధి దిశగా పయనిస్తున్నాయని ‘నీతి ఆయోగ్’ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన స్వయంగా కృష్ణాజిల్లాలోని కొన్ని గ్రామాల్లో పర్యటించి ఈ వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ఏర్పాటు విప్లవాత్మకమైన ఆలోచనగా ఆయన వ్యాఖ్యానించారు. కడప జిల్లా కొప్పర్తిలో రెండు భారీ పారిశ్రామిక పార్కుల్ని ముఖ్యమంత్రి ప్రారంభించిన సందర్భంగా ఏఐఎల్ డిక్సన్ కంపెనీ ప్రెసిడెంట్ – సీఓఓ పంకజ్ శర్మ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. గతంలో ‘రావాలి జగన్... కావాలి జగన్’ అనే నినాదం రాష్ట్రమంతటా మార్మోగితే, ఇప్పుడు ‘జగన్ వచ్చాడు..అభివృద్ధి తెచ్చాడు’ అనే నినాదం వినిపిస్తోందని వ్యాఖ్యా నించారు. కొత్త కంపెనీలు శంకుస్థాపన సమయంలో విస్తరణ కార్యక్రమాలను వివరంగా ప్రకటించడం రాష్ట్రంలో నెలకొని ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణానికి గుర్తు. ఇక్కడ ఫ్యాక్టరీని నడపలేక కియా మోటార్స్ కంపెనీ వెళ్లిపోతున్నదని మనవాళ్లు ఎంత ప్రచారం చేసినా, ఆ కంపెనీ మాత్రం రాష్ట్రంలో తన విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. సెంచురీ ప్లైవుడ్స్ తన పెట్టుబడిని నాలుగింతలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఏటీజీ టైర్స్ కూడా తన పెట్టుబడిని రెండింతలకు పెంచింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వైద్య ఆరోగ్య రంగంలో ఒక పెద్ద సామాజిక విప్లవానికి వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయాన్ని చాలామంది గుర్తించారు. ‘నాడు – నేడు’ కార్యక్రమంతోపాటు కొత్త వైద్యశాలల నిర్మాణం, ఉన్నవాటిని ఆధునీకరించడం, కొత్త సూపర్ స్పెషాలిటీల నిర్మాణం, వైఎస్ఆర్ విలేజి క్లినిక్స్ కోసం ప్రభుత్వం సుమారుగా రూ. 32 వేల కోట్లు కేటాయించింది. సగానికి పైగా ఇప్పటికే ఖర్చు చేశారు. ‘ఆరోగ్యశ్రీ’ కింద బడ్జెట్లో రెండువేల కోట్ల కేటాయింపు, 1,088 కొత్త అంబు లెన్స్‌ల ప్రారంభం... పైన చెప్పిన ఖర్చుకు అదనం. ఫలితంగా వైద్యరంగం వేగంగా తన స్వరూపాన్ని మార్చుకుంటున్నది. పేద – ధనిక, సామాజిక హోదా వంటి తారతమ్యాలు లేకుండా ప్రతి గడపకూ ‘ఫ్యామిలీ డాక్టర్’ వెళ్లే లక్ష్యం వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఒక్క సంవత్సర కాలంలోనే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లే ఔట్ పేషంట్లు, ఇన్ పేషంట్ల సంఖ్యలో 25 నుంచి 30 శాతం పెరుగుదల కనిపించింది. రెండేళ్ల కిందటి దాకా సుదూరంగా వుండే గిరిజన గూడేల్లోని మహిళలు కాన్పుకు వెళ్లాలంటే డోలీలే శరణ్యం. భగవంతునిపైనే భారం. ఇప్పుడు గర్భం దాల్చిన దగ్గర్నుంచీ క్రమం తప్పకుండా 104 వాహనం ఆమె ఇంటి ముందు ఆగి, మందులిస్తున్నది. కాన్పు సమయంలో అదే వాహనంలో తీసుకెళ్లి కాన్పు తర్వాత ఇంటికి తీసుకొచ్చి దింపుతున్నారు. గిరిజన జీవితాలలో 104 అంబు లెన్స్ పెనుమార్పును తెచ్చింది. విద్యారంగంలో ‘నాడు–నేడు’కు 16 వేల కోట్ల రూపా యలు కేటాయించారు. ఇప్పటికే తొలిదశ పూర్తయింది. ఇప్పుడు నాణ్యమైన విద్య, ఇంగ్లిష్ మీడియం విద్య ప్రతి విద్యార్థికీ ధనిక–పేద తేడా లేకుండా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ రెండేళ్లలో ఐదున్నర లక్షలమంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లు వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిపోయారు. వారు ఏటా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం వగైరాల కోసం చేసే కోట్లాది రూపాయలు తల్లిదండ్రులకు మిగిలిపోయాయి. ఈ సొమ్మును వారు మెరుగైన జీవితం కోసం ఉపయోగించుకోగలుగుతారు. మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకురూ. 3,600 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కొత్త హార్బర్లలో 10 వేల మెకనైజ్డ్ బోట్లను నిలుపుకొనే అవకాశం ఉంటుంది. ఫలితంగా మూడు లక్షల టన్నుల అదనపు మత్స్య సంపద లభిస్తుందని అంచనా ఉన్నది. ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే ఎనిమిది నుంచి పదివేల కోట్ల అదనపు ఆదాయం ప్రతియేటా మత్స్యకారులకు లభిస్తుంది. గుజరాత్ సముద్ర తీరాల్లో పొట్టకూటి కోసం శ్రమదోపిడీకి గురయ్యే పరిస్థితి నుంచి మత్స్యకారులు సగర్వంగా నిలబడే స్థితికి చేరుకుంటారు. 31 లక్షల కుటుంబాలకు నిలువనీడ కల్పించే బృహత్తర కార్యక్రమం వైఎస్సార్ – జగనన్న కాలనీల ఏర్పాటు. ఏకబిగిన ఇన్ని ఇళ్లను నిర్మించిన కార్యక్రమం దేశ చరిత్రలో మరొకటి లేదు. ప్రభుత్వం యాభైవేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న మహాయజ్ఞంలో మహిళా సాధికారత అనే సామాజిక న్యాయ సూత్రం కూడా అంతర్లీనంగా ఉన్నది. ఇళ్లన్నీ పూర్తయి అక్కడ కాలనీ జీవితం మొదలైన తర్వాత వాటి విలువ అథమపక్షం రూ. 3 లక్షల కోట్లు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తు న్నారు. ఈ ఒక్క పథకంలో మూడు లక్షల కోట్ల ఆస్తిని సృష్టించి మహిళల చేతిలో జగన్ ప్రభుత్వం ఉంచబోతున్నది. ప్రభుత్వరంగంలో విస్తారంగా ఆస్తుల కల్పన జరుగు తున్నది. రూ. 4,200 కోట్లతో గ్రామ సచివాలయాల నిర్మాణం, 2,300 కోట్లతో ఆర్బీకేల నిర్మాణం, 416 కోట్లతో బల్క్ మిల్క్ యూనిట్ భవనాల నిర్మాణం, 690 కోట్లతో వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీ భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. 13 వేల కోట్ల ఖర్చుతో రామాయపట్నం, మచిలీపట్నం, భావన పాడు ఓడరేవుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30 వేల కోట్ల ఖర్చుతో ఏర్పాటుచేసిన భారీ పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. 13,885 కొత్త ఎంఎస్ఎంఇ యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభిం చాయి. మరో 42 వేల కోట్ల పెట్టుబడులతో 72 భారీ పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. 96 వేల కోట్ల వ్యయంతో ఐదు ప్రభుత్వరంగ యూనిట్ల నిర్మాణం జరుగుతున్నది. ఈ రెండున్నరేళ్ల పరిపాలనా కాలంలో, అందులో రెండేళ్ల సమ యాన్ని 30 వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని, ఇంకెన్నో వేల కోట్ల ప్రజాధనాన్ని కోవిడ్ మహమ్మారి మింగేసిన కాలంలో స్థూలంగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి, అప్పులు, పెట్టుబడులకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇవి. ఉద్యోగాల కల్పన పెరిగింది, పనిదినాల కల్పన పెరిగింది. వలసలు తగ్గుముఖం పట్టాయి. నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందుబాటులోకి వస్తున్నది. ఆర్బీకేల ఏర్పాటు వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని మార్చివేయబోతున్నాయి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈ రెండున్నరేళ్లలో సాధించిన సమ్మిళిత అభివృద్ధితో మరే రెండున్నరేళ్ల కాలం కూడా పోటీపడలేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. అంకెలు అబద్ధం చెప్పవు! -వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
జడుపు ఒద్దు, జాగ్రత్త ముఖ్యం
దాదాపు రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రపంచమంతటికీ చెబుతున్న పాఠం! తాజా వైవిధ్యం ‘ఒమిక్రాన్’ విషయంలో పొల్లుపోని అక్షర సత్యం. వైరస్ బారినపడి భంగపోకుండా విరుగుడు కార్యాచరణకు తిరుగులేని బ్రహ్మాస్త్రం! తూర్పు దేశాల్లో వాతావరణం చూశాక, ఇక్కడ అనుసరించాల్సిన విధానం, పాటించాల్సిన జాగ్రత్తలపై అందరూ చేస్తున్న హెచ్చరిక ఇదే! ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల్ని వాయిదా వేయాలన్న అలహాబాద్ హైకోర్టు సూచనని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. ర్యాలీల్ని, సభల్ని రద్దు చేయించాలని న్యాయస్థానం ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్నీ కోరింది. వచ్చేవారం క్షేత్ర పర్యటన చేసి నిర్ణయిస్తామని ఎన్నికల ప్రధానాధికారి చెప్పారు. ఎన్నికలు వాయిదా పడ్డా ఆశ్చర్యం లేదు. రాత్రి పూట కర్ఫ్యూని యూపీ ప్రభుత్వం అప్పుడే ప్రకటించేసింది. క్రిస్టమస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి వంటి పండుగల దృష్ట్యా ఎంతో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట మార్గదర్శకాలిచ్చాయి. దేశంలో శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులతో పాటు పాలకులు, న్యాయస్థానాలు పౌరసమాజాన్ని ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తం చేస్తున్నాయి. గడచిన 24 గంటల్లో, ఈ దిశలో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. తూర్పులోని అమెరికా, ఐరోపా దేశాలలో కేసుల ఉధృతి పెరిగిన క్రమంలోనే మన దేశంలోనూ కేసుల సంఖ్య పెరగడం గడచిన రెండేళ్లుగా రివాజయింది. ఆఫ్రికాలో మొదలై అత్యంత వేగంగా నూరు దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ వ్యాప్తి అమెరికా, ఐరోపాను వణికిస్తోంది. రోజువారీ కోవిడ్ కొత్త కేసులు అమెరికాలో 2.65 లక్షలకు చేరాయి. కిందటి వారం రోజుల సగటు 1.88 లక్షల కేసులుగా నమోదయింది. ఇక బ్రిటన్ (యునైటెడ్ కింగ్డమ్)లో రోజువారీ కొత్త కేసులు 1.22 లక్షలు కాగా, కిందటి వారం సగటు 96 వేల కేసులు. ఇప్పటివరకు వచ్చిన కరోనా అన్ని వైవిధ్యాల కన్నా ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉండి, కొత్త కేసుల్లో వాటి శాతం రమారమి పెరుగుతోంది. మన దేశంలో కోవిడ్ రెండో అల ఉధృతి తీవ్రంగా ఉన్నపుడు జరిగిన భారీ నష్టం మనందరికీ గుర్తుంది. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా కేసులు సంఖ్య ఇబ్బడి–ముబ్బడిగా పెంచి, ఇపుడు మూడో అలను మనమే రేపిన వాళ్లమౌతాం! ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి అసాధారణమని, అత్యంత వేగవంతమని అన్ని అధ్య యనాలూ తేల్చాయి. ఆఫ్రికా, అమెరికా, బ్రిటన్లతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే ధృవీకరించింది. దాన్ని నిజం చేస్తూ, దేశంలో కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఢిల్లీ, మహారాష్ట్ర తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచమంతటా, ముఖ్యంగా భారత్‌లో తీవ్ర ప్రభావం చూపిన డెల్టా వైవిధ్యంతో పోలిస్తే ఒమిక్రాన్ ‘అంత ప్రమాదకారి కాదు’ అనే నివేదికలు వస్తున్నాయి. వైరస్ సోకినా, ఆస్పత్రికి వెళ్లి ఐసీయూలో ఉండాల్సిన అవసరం వచ్చేది తక్కువ కేసుల్లోనే! అలా అని నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు. ఈ ఏడాది ఆరంభంలో కోవిడ్–19 తొలి అల తీవ్రత మందగిస్తున్నపుడు ప్రజానీకం చూపిన అలసత్వానికి దేశం భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. కోవిడ్ నిబంధనల్ని పాటించ కుండా, ‘ఇంకెక్కడి కోవిడ్...?’ అని పౌరులు చూపిన విచ్చలవిడితనం, నిర్లక్ష్యం నికర ఫలితం... రెండో అల ఉధృతి! దేశం అల్లాడిపోయింది. నెల వ్యవధిలో లక్షమందిని కోల్పోయిన పాడు కాలం, కళ్ల జూశాం! ఇపుడైనా... నిర్లక్ష్యం వహిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. శరీరంలోకి జొరబడ్డ వైరస్ పరిమాణం–ఉధృతి పెరిగితే ఎవరికైనా ప్రమాదమే! అప్పటికే ఇతరేతర జబ్బులున్న వాళ్లకు ఇది అత్యంత ప్రమాదకరం. ఏ టీకా తీసుకోని వారూ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు 140 కోట్ల టీకా డోసులు ఇచ్చారు. దేశ జనాభాలో అర్హులైన (18 ఏళ్లు పైబడ్డ) వారిలో 60 శాతం మందికి రెండు డోసుల టీకాలు పడగా, మొత్తమ్మీద 89 శాతం మంది అర్హులకు కనీసం ఒక డోసైనా టీకా ఇచ్చినట్టయింది. ఈ కార్యక్రమాన్ని వేగిరపరచాలని, త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రధాని మోదీ అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. ‘జనం బతికుంటే, ఎన్నికల ర్యాలీలు, సభలు, సమావేశాలు తర్వాతైనా పెట్టుకోవచ్చు’అంటూ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ తన తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయం నూరుపాళ్లు సత్యం! అధికరణం 21 ద్వారా రాజ్యాంగం భరోసా ఇచ్చిన మనిషి జీవించే హక్కును ఉటంకిస్తూ ఆయనీ వ్యాఖ్య చేశారు. విమానాశ్రయాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్టే రాష్ట్రాల సరిహద్దుల్లో, బస్స్టేషన్లలో, రైల్వేస్టేషన్లలోనూ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ స్ఫూర్తిని కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పౌరసమాజం కూడా చిత్తశుద్దితో స్వీకరించాలి. కోవిడ్ సముచిత ప్రవర్తన (సీఏబీ) కనబరచాలి. న్యాయస్థానాలు నిర్దేశించినట్టు, ప్రభుత్వాలు ఆదేశిస్తు న్నట్టు, మనమంతా గ్రహిస్తున్నట్టు... చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం, మూతి ముసు గులు ధరించడం, భౌతిక దూరం పాటించడం విధిగా చేయాలి. పండుగలు, పబ్బాల గురించి మతాలకతీతంగా ఆలోచించాలి. ఏ పండుగలైనా ప్రజల ప్రాణాలకన్నా మిక్కిలి కాదు. సభలు, సమావేశాల్లో కోవిడ్ నిబంధనల్ని పాటించడం కష్టమౌతుంది కనుక వాటిని నిలువరించాలి. ఈ విషయం నిర్లక్ష్యం చేస్తే, న్యాయస్థానమే చెప్పినట్టు... పరిస్థితులు రెండో అల విపరిణామాల్ని మించే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త! -
ఇదేనా ప్రజాస్వామ్యం?
మరో విడత పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. అధికార–ప్రతిపక్షాల వాదోపవాదాలు... సభా మధ్యంలో నిరసనలు... అనివార్యమైన వాయిదాలు... మళ్ళీ అవే సన్నివేశాలు. డిసెంబర్ 23 వరకు జరగాల్సిన శీతకాల సమావేశాలు ఒకరోజు ముందే బుధవారమే ముగిశాయి. వెనక్కి తిరిగి చూస్తే, చట్టసభలు సాగిన తీరులో ఏమున్నది గర్వకారణం అనిపించక మానదు. సభాసమయంలో వృథానే ఎక్కువగా కనిపిస్తుంది. కీలక బిల్లులు ఆమోదం పొందినా, వాటిపై చర్చ జరగలేదనే చేదు నిజం వెక్కిరిస్తుంది. ఎవరి పాలెంతనేది పక్కనపెడితే, అధికార, ప్రతిపక్షాలు రెంటిలో తప్పు కనిపిస్తుంది. నవంబర్ 29న సభ మొదలైన రోజు నుంచే పరిస్థితి అదుపు తప్పింది. వర్షాకాల సమావేశాల్లోని ప్రవర్తన తీరుకు దండనగా 12 మంది ప్రతిపక్ష సభ్యులను మొత్తం ఈ శీతకాల సమావేశాల నుంచి బహిష్కరించడం వివాదాస్పదమైంది. దాని చట్టబద్ధతా ప్రశ్నార్థకమైంది. పలుమార్లు సభలో అంతరాయాలకూ, సభ బయట ధర్నాలకూ కారణమైంది. ఒక రకంగా ప్రతిపక్షాల్లో అనూహ్య ఐక్యతకూ దారి తీసింది. 22 రోజుల పాటు గాంధీ విగ్రహం పాదాల చెంత ప్రతిపక్ష సత్యాగ్రహం సాగింది. సామూహిక పశ్చాత్తాపం కాదు... వ్యక్తిగతంగా ఎవరికి వారు క్షమాపణలు చెబితేనే సభలోకి అనుమతిస్తామన్న అధికార పక్షం మంకుపట్టు ఆఖరి దాకా కొనసాగింది. అదీ విచిత్రం. ఈ విడతలో లోక్‌సభ, రాజ్యసభ– చెరి 18 సార్లు సమావేశమయ్యాయి. కానీ, అంతరాయాలతో లోక్‌సభలో 18 గంటల 48 నిమిషాలు వృథా. అంతరాయాలు, వాయిదాలతో రాజ్యసభలో ఏకంగా 49 గంటల 32 నిమిషాలు కృష్ణార్పణం. మొత్తం మీద లోక్‌సభ ఉత్పాదకత 77 శాతమైతే, రాజ్య సభది 43 శాతమేనని చట్టసభలపై స్వచ్ఛంద పరిశోధనా సంస్థ పీఆర్ఎస్ లెక్కేసింది. ప్రభుత్వం లెక్క మాత్రం అంతకన్నా కాస్తంత మెరుగ్గా ఉంది (లోక్‌సభ 82 శాతం, రాజ్యసభ 47 శాతం). ఏ లెక్కనైనా ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వన్నె తీసుకురాదనేది నిర్వివాదాంశం. ఈ సమావేశాల్లో 12 బిల్లులు లోక్‌సభలో, ఒక బిల్లు రాజ్యసభలో– మొత్తం 13 బిల్లుల్ని ప్రవేశ పెట్టారు. వాటిలో 11 ఉభయసభల ఆమోదం పొందాయి. అందులో అద్దె గర్భం, సహాయ పునరు త్పాదక టెక్నాలజీ (ఏఆర్టీ), నార్కోటిక్ డ్రగ్స్ లాంటి కీలక బిల్లులున్నాయి. లోక్‌సభలో మెజారిటీ ఉండడంతో వీటిని పాస్ చేయించుకోవడం పాలకపక్షానికి కష్టమేమీ కాదు. కానీ, రాజ్యసభలో ప్రతిపక్షాలదే ఇప్పటికీ స్వల్ప మెజారిటీ (ప్రతిపక్షాలు 120, ఎన్డీఏ సభ్యులు 118). అందుకే, ప్రభుత్వం వ్యూహాత్మకంగా పాత తప్పుల సాకుతో 12 మంది విపక్ష సభ్యుల్ని ఇప్పుడు సస్పెండ్ చేసి, కృత్రిమ మెజారిటీ సంపాదించి, బిల్లులను పాస్ చేయించుకుందనేది కాంగ్రెస్ ఆరోపణ. నిందారోపణలు ఏమైనా, చర్చ లేకుండా నిమిషాల వ్యవధిలోనే అనేక బిల్లులకు ఆమోద ముద్ర పడడం మటుకు నిజం. సమావేశాల మొదట్లోనే తెచ్చిన కొత్త సాగు చట్టాల ఉపసంహరణ బిల్లు మొదలు చివరలో తెర మీదకు తెచ్చిన ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు దాకా అనేకం అర్థవంతమైన చర్చ ఏమీ లేకుండా, అరగంటలో పాలకపక్షం మమ అనిపించినవే! ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు గుర్తింపు కార్డునూ – ఆధార్‌నూ అనుసంధానించడానికి వీలు కల్పించే అత్యంత కీలక ఎన్నికల చట్టం మార్పుపై చర్చించడానికి అధికార పక్షానికి సమయమే లేదా అన్నది విమర్శకుల ప్రశ్న. భిన్నాభిప్రాయాల చర్చావేదికగా నిలవడం, ఆ చర్చల్లో ప్రజోపయోగ నిర్ణయాలు తీసుకోవడం పార్లమెంట్ ప్రాథమిక లక్షణం. కానీ, బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ ప్రజాస్వామ్య వేదిక ఆ గుణాన్ని కోల్పోయినట్టు కనిపిస్తోందన్నది కొందరి విమర్శ. 17వ లోక్‌సభలోని తాజా 7వ విడత సమావేశాల్లో సగటున ప్రతి బిల్లూ లోక్‌సభలో 10 నిమిషాల్లో, రాజ్యసభలో అరగంటలో పాసైపోయాయి. చట్టసభల్లో పరిఢవిల్లాల్సిన ప్రజాస్వామ్య స్ఫూర్తిని బీజేపీ పరిహసించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నది అందుకే. బిల్లులపై భిన్నాభిప్రాయాలున్నప్పుడు వాటిని పార్లమెంటరీ కమిటీలకు పంపడం సాధారణం. ఇటీవల ఆ ధోరణి కూడా తగ్గుముఖం పడుతోంది. తాజా సమా వేశాల్లో 6 బిల్లుల్ని మాత్రం పార్లమెంటరీ కమిటీలకు నివేదించారు. ఆడపిల్లల వివాహ వయస్సును పెంచే ప్రతిపాదనపై సందేహాలు వ్యక్తమయ్యాక ఆ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపారు. ఇక, ప్రజాసమస్యలను ప్రస్తావించి పాలకపక్షాన్ని ఇరుకునపెట్టడానికి అవకాశమున్న కీలకమైన ప్రశ్నోత్తరాల సమయంలోనూ 60 శాతం సమయం వృథా తప్పలేదంటే, ప్రతిపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రంగస్థల ప్రదర్శనలా మారిపోతున్న తమ సభావ్యూహాన్ని పునరాలోచించుకోవాలి. నిజానికి, ఈసారి సభలో గట్టిగా చర్చ జరిగింది – కోవిడ్ పైన, పర్యావరణ మార్పుల పైనే! రైతుల ప్రాణాలు బలిగొన్న లఖిమ్‌పూర్ ఖేరీ ఘటన పథకం ప్రకారం జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చడంతో, కన్నకొడుకే నిందితుడైన హోమ్ శాఖ సహాయ మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు చివరి దాకా పట్టుబట్టాయి. కానీ, కీలక అంశాల చర్చకు ప్రభుత్వాన్ని ఒప్పించడమూ అంతే ముఖ్యమని గ్రహించాల్సింది. సభ్యులు భిన్నంగా ప్రవర్తించి ఉంటే సమావేశాలు మరింత మెరుగ్గా జరిగి ఉండేవి. రాజ్యసభ ఛైర్మన్ అన్న ఆ మాట నిజమే. కానీ, అందుకు పాలకపక్షం కూడా కలసి రావాలి. పట్టువిడుపులతో ప్రతిపక్షాలను కలుపుకొని పోవాలి. ఎంతైనా, ఒంటి చేతితో చప్పట్లు కొట్టలేం కదా! పాలకులు ఏకపక్ష ప్రకటనలు చేయడానికీ, అనుకున్నవాటికి రబ్బరు స్టాంపు రాజముద్రలు వేయడానికీ పార్లమెంట్ సమావేశాలతో పని ఏముంది! -
జాగ్రత్త పడాల్సిందే!
అనుకున్నంతా అయింది. నవంబర్ 24న దక్షిణాఫ్రికా అప్రమత్తం చేసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నెల తిరిగేసరికల్లా 90కి పైగా దేశాలకు విస్తరించింది. మునుపటి డెల్టా వేరియంట్ కన్నా 3 నుంచి 5 రెట్లు ఎక్కువ వేగంతో విస్తరిస్తూ, ఒకటిన్నర–రెండు రోజుల్లో కేసులు రెట్టింపయ్యే సత్తా ఉన్న ఒమిక్రాన్ అమెరికా సహా అనేక దేశాలను వణికిస్తోంది. బ్రిటన్‌లో రోజువారీ కేసులు లక్షకు చేరుకున్నాయి. పలు ఐరోపా దేశాలు మళ్ళీ షరతులు పెట్టాయి. నెదర్లాండ్స్, తాజాగా చైనాలో కోటీ 30 లక్షల మందికి ఆవాసమైన షియాన్ లాక్డౌన్ పెట్టాయి. ‘చరిత్రలో మిగతా వైరస్లన్నిటి కన్నా వేగంగా ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. త్వరలోనే ప్రపంచంలో ప్రతి దేశంలో అది ఉంటుంది. రాబోయే మూడు నెలలు ప్రపంచానికి గడ్డుకాలం’ –ప్రసిద్ధ వ్యాపార దిగ్గజం బిల్ గేట్స్ మంగళవారం చేసిన ఈ భవిష్యత్ అంచనా ట్వీట్ అలసత్వం వహిస్తున్న అందరికీ మరో మేలుకొలుపు. ఒమిక్రాన్ పూర్తి తీరుతెన్నులు, దానిపై ప్రస్తుత టీకాల సామర్థ్యం లాంటివి ఇప్పటికీ కచ్చితంగా తేలలేదు. టీకా రెండు డోసులూ వేసుకున్నవారికి సైతం ఒమిక్రాన్ బెడద తప్పట్లేదన్న డేటా మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఈ అనిశ్చితి మధ్యనే వివిధ దేశాల్లో ఒమిక్రాన్ కేసుల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేళ నలుగురూ కూడి చేసుకొనే వేడుకలను వాయిదా వేసుకోవాలన్నది ఆరోగ్య సంస్థ తాజా విజ్ఞప్తి. మన దేశంలో పండుగలకు తోడు పంజాబ్, ఉత్తర ప్రదేశ్, గోవా సహా అయిదు రాష్ట్రాల్లో రానున్న ఎన్నికలు, ర్యాలీలు ఇప్పుడే భయం పుట్టిస్తున్నాయి. భారత్‌లో మూడో వేవ్ తప్పదనీ, ఫిబ్రవరికి అది పతాక స్థాయికి చేరుతుందనీ, రోజుకు 1.5 నుంచి 1.8 లక్షల కేసుల వరకు రావచ్చనీ ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ విద్యాసాగర్ సారథ్యంలోని ‘నేషనల్ కోవిడ్19 సూపర్ మోడల్ కమిటీ’ అంచనా. ఈ పరిస్థితుల్లో కర్ణాటక, తాజాగా ఢిల్లీ సహా కొన్ని రాష్ట్రాలు సమావేశాలు, సామూహిక ఉత్సవాలపై షరతుల మొదలు నిషేధం దాకా చర్యలు మొదలుపెట్టాయి. ఒమిక్రాన్ కేసుల్లో భారత్ ఇప్పటికే 250 మార్కు దాటేసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణలు ఈ కొత్త వేరియంట్ కేసుల్లో ముందు వరుసలో ఉన్నాయన్న సమాచారంతో ప్రజలు, ప్రభుత్వాలు మరింత అప్రమత్తం కావాల్సి వచ్చింది. డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమానాలను పూర్తిగా అనుమతించాలనుకొన్నా, భారత్ సహా దాదాపు 25 దేశాలు వెనక్కి తగ్గాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అవసరాన్ని బట్టి రాత్రి కర్ఫ్యూలు, షరతులతో కూడిన అనుమతులు, కంటైన్మెంట్ జోన్లు పెట్టాలంటూ కేంద్రం మంగళవారం పారాహుషార్ సందేశం పంపిన విషయం మర్చిపోలేం. దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని మోదీ గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తుండడం గమనార్హం. ఒమిక్రాన్‌తో కోవిడ్ వ్యాపిస్తున్నా, మునుపటిలా పెద్ద సంఖ్యలో మరణాలు నమోదు కాకపోవడం ఉన్నంతలో ఊరట. అలాగని అశ్రద్ధ చేయలేం. ఒకేసారి వందలు, వేల సంఖ్యలో కరోనా బారినపడ్డ వారు ఆసుపత్రి పాలైతే, పరిస్థితి ఏమిటన్నది ఊహించడం కష్టం. ప్రస్తుతం భారత్‌లో సీనియర్ సిటిజన్ల సంఖ్య 13.8 కోట్లు. వారిలో సగం మందికి కరోనా తీవ్రంగా వచ్చినా, పరిస్థితి అతలాకుతలమవుతుంది. కరోనా దెబ్బతో రెండేళ్ళ క్రితంతో పోలిస్తే, ఇప్పుడు పౌర ఆరోగ్య వసతులు కొంత మెరుగైనమాట నిజమే కానీ, పడకల మొదలు ఆక్సిజన్ దాకా ఎందరికి సరిపోతాయన్నది చెప్పలేం. ప్రపంచానికి కరోనా పరిచయమైనప్పటి నుంచి ఇప్పటి దాకా పని ఒత్తిడితో శారీరకంగా, మానసికంగా డస్సిపోయిన వైద్య సిబ్బందికి అది మరింత భారమయ్యే ప్రమాదమూ ఉంది. మరోపక్క ప్రస్తుతం కరోనాపై అత్యంత ప్రభావశీలమైన యాంటీబాడీ కాక్టైల్ చికిత్సకయ్యే రూ. 60 వేల ఖర్చు సామాన్యులు భరించడమూ కష్టమే. ఈ పరిస్థితుల్లో అనేక దేశాలు రోగ నిరోధకశక్తిని పెంచే బూస్టర్ డోస్‌గా మూడో డోస్ మార్గం పట్టాయి. ఇజ్రాయెల్ ఏకంగా 4 డోసుల విధానం వైపు నడుస్తోంది. త్వరలో ఆ పద్ధతిని ఆచరణలో పెడితే, నాలుగు డోసుల పద్ధతి అనుసరిస్తున్న తొలి ప్రపంచ దేశం ఇజ్రాయెలే అవుతుంది. మామూలుగా టీకా వల్ల కలిగే ఇమ్యూనిటీ మూడు నెలల మొదలు ఏడాది లోపల తగ్గిపోతుందని నిపుణుల మాట. అందుకే, భారత్‌లో సైతం నిర్ణీత రెండు డోసులే కాకుండా మూడోదీ వేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఒమిక్రాన్ బెడదతో కనీసం ఫ్రంట్‌లైన్ వర్కర్లకూ, ఇతర అనారోగ్యాలున్న వారికైనా ముందుగా ఈ బూస్టర్ డోస్ వేయాలనే వాదన రోజురోజుకూ బలం పుంజుకుంటోంది. ఇప్పటికైతే బూస్టర్ డోస్‌లు, పిల్లలకు టీకాలకు సర్కార్ సుముఖంగా లేదు. మామూలు జలుబు వైరస్ నుంచి ఒమిక్రాన్ తన జన్యుద్రవ్యాన్ని తీసుకుందని ఎన్ఫెరెన్స్ సంస్థ అధ్యయనం. అలాగే, ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఒమిక్రాన్ చివరకు కోవిడ్ వ్యాధిగా కాక, సాధారణ కోవిడ్ ఫ్లూలా తయారవుతుందని ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ వైద్యుడు ప్రవీణ్ హిసారియా అంచనా. అదే నిజమైతే, ప్రపంచం నెత్తిన పాలు పోసినట్టే! ఆధునిక భారతావనిలో క్రికెట్, మతం, రాజకీయాలు మూడూ అతి పెద్ద విశ్వాసాలనుకుంటే, చివరి రెండింటితో ఉత్సవాలు, ఊరేగింపుల పుణ్యమా అని కరోనా వ్యాప్తి ఉదంతాలు గత రెండేళ్ళలో అనేకం. టీకాలు వేసుకోవడం, భౌతిక దూరం–మాస్కు ధారణ లాంటి కోవిడ్ జాగ్రత్తలతో కూడిన ప్రవర్తన– ఈ రెండే ఎన్ని వేరియం ట్లొచ్చినా శ్రీరామరక్ష అంటున్న ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మాటలే తారకమంత్రం. -
నిరుపేదల ఆశాకిరణం
విజయం ఊహించినదే అయినా, అనూహ్య మెజారిటీతో గెలుపు దక్కితే ఉండే ఉత్సాహం వేరు. చిలీ దేశపు రాజధాని శాంటియాగో వీధుల్లో ఆదివారం నాటి జనసందోహం, సంబరాలే అందుకు నిదర్శనం. చిలీకి అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా యువ నేత గ్యాబ్రియెల్ బోరిక్ భారీ విజయంతో ఆ దక్షిణ అమెరికా దేశంలో నవ శకానికి నాందీ ప్రస్తావన జరిగింది. ప్రపంచంలోనే అసమానతలు అధికంగా ఉన్న దేశాల్లో ఒకటైన ఈ లాటిన్ అమెరికా దేశంలో మాజీ విద్యార్థి నేత∙35 ఏళ్ళ బోరిక్ ‘సంక్షేమ రాజ్య’ వాగ్దానంతో అధిక సంఖ్యాకుల మనసు దోచారు. చిలీ కమ్యూనిస్టు పార్టీ సహా కొన్ని ఇతర పార్టీల సంకీర్ణ అభ్యర్థిగా ఈ వామపక్ష వాది బరిలో నిలిచారు, గెలిచారు. ఓటర్లు రెండు వర్గాలుగా కేంద్రీకృతమైన వేళ, మితవాద ప్రత్యర్థి 55 ఏళ్ళ జోస్ ఆంటోనియో కస్ట్పై యువ బోరిక్ భారీ విజయం లాటిన్ అమెరికా దేశాల్లో వామపక్ష వాదానికి మరింత బలం చేకూర్చింది. ఇంకా చెప్పాలంటే, ఈ ఏడాది వివిధ లాటిన్ అమెరికన్ దేశాల్లో జరిగిన 5 అధ్యక్ష ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలకు ఇది నాలుగో గెలుపు. ఆ రకంగానూ తాజా చిలీ ఎన్నికలు ప్రత్యేకమే. నవంబర్ 21న జరిగిన మొదటి రౌండ్ ఎన్నికలలో సంప్రదాయవాద కస్ట్కు కాస్తంత ఎక్కువ పాయింట్లు వచ్చాయి. అయితే, డిసెంబర్ 19 ఆదివారం నాటి తుది రౌండ్లో విశేష జనాదరణతో బోరిక్ తిరుగులేని ఆధిక్యం కనబరిచారు. చివరకు పోల్ అయిన ఓట్లలో 44.1 శాతం కస్ట్కు వస్తే, ఏకంగా 55.9 శాతం ఓట్లతో బోరిక్ నెగ్గారు. అలా 1973 నాటి కుట్రలో ఆత్మహత్యకు పాల్పడిన చిలీ అధినేత అలెండి తర్వాత అత్యంత ఉదారవాద అధ్యక్షుడయ్యారు. స్వలింగ సంపర్కుల వివాహాలు, గర్భనిరోధం, గర్భస్రావం లాంటి వాటికి కస్ట్ వ్యతిరేకి. ఒక దశలో మహిళా వ్యవహారాల శాఖను సైతం రద్దు చేస్తానని, ఆనక వెనక్కి తగ్గిన చరిత్ర ఆయనది. తద్విరుద్ధంగా బోరిక్ ఉదారవాది. యువకులు, పట్టణ ప్రాంత ఓటర్లు ఆయనకు జై కొట్టింది అందుకే. చివరి రౌండ్లో గ్రామీణ ఓటర్లూ ఆయన వైపే మొగ్గడంతో భారీ గెలుపు సాధ్యమైంది. ఓటేయడం స్వచ్ఛందమైన 2012 నాటి నుంచి ఎన్నడూ లేనంతగా 56 శాతం పోలింగ్ నమోదైంది. అధిక భాగం లాటిన్ అమెరికా దేశాల్లో రాజకీయాలు, తత్ఫలితంగా ఆర్థిక వ్యవస్థ – రెండూ అస్థిరమే. కానీ, చిలీ దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వంతో, నియంత జనరల్ పినోఛెట్ సైనిక పాలనలో పెట్టిన పాత కాలపు నిరంకుశ రాజ్యాంగానికే కట్టుబడింది. సామాజిక వ్యయం, సబ్సిడీల లాంటి ఊసే లేకుండా లాభసాటి వ్యాపార వాతావరణంతో సంపన్న వర్గాల స్వర్గమైంది. చివరకు 2019 అక్టోబర్ 18న మెట్రో టికెట్ రేట్లపై పన్నులు పెంచడంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. అలా మొదలై, చిలీలో అనేక నెలలుగా సాగుతున్న నిరసనలు ఆధునిక విప్లవానికి ప్రతీకలు. వెరసి, పాత రాజ్యాంగానికి పాతరేసి, సమాజంలోని విభిన్నతనూ, దశాబ్దాలుగా దూరం పెట్టబడిన అణగారిన వర్గాలనూ ప్రతిబింబించే కొత్త రాజ్యాంగం దిశగా అడుగులు పడ్డాయి. ఈ ఏడాది జూలైలో ‘చిలీ రాజ్యాంగ సభా కూటమి’ ఏర్పాటు అందులో ఓ మైలురాయి. తాజాగా దేశాధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష బోరిక్ విజయం ప్రజలు కోరుకుంటున్న మార్పుకు పడ్డ రాజముద్ర. చరిత్ర చూస్తే, అలెండి తర్వాత 1973లో వచ్చిన నియంత పినోఛెట్ ప్రభుత్వ నిరంకుశ పాలన ప్రసిద్ధం. ఆపైన 1990లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలొచ్చినా, లాభం లేకపోయింది. రాగి ఉత్పత్తిలో ప్రపంచంలోకెల్లా ముందుండే రెండు కోట్ల జనాభా చిలీలో ధనిక, పేద తేడాలు పెచ్చరిల్లాయి. ఆ తేడా పోగొట్టి, పేదల అనుకూల కార్యక్రమాలతో అభివృద్ధి పథంలో నడిపిస్తానని వామపక్ష సంకీర్ణ అభ్యర్థిగా బోరిక్ ప్రచారం చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను ఆరాధించే కోటీశ్వరుడు కస్ట్ను బహుళ జాతి సంస్థలు, మీడియా, అమెరికా బలపరిచాయి. కానీ, రైతులు, కార్మిక సంఘాలు, నిరుపేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు కలసికట్టుగా బోరిక్ వెంట నిలిచి, ప్రత్యర్థిని ఓడించాయి. కానీ, రెండేళ్ళ క్రితం జనాన్ని వీధుల్లోకి రప్పించిన అనేక అంతర్లీన సమస్యలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఆర్థిక అసమానతలు, మితిమీరిన విశ్వవిద్యాలయ ఫీజులు, నూటికి 80 మందికి నెలవారీ కనీస వేతనం (418 డాలర్ల) కన్నా తక్కువ పింఛను – ఇలా ఎన్నో. ఆర్థిక వ్యవస్థ ఆధారపడ్డ రాగి ఎగుమతులకు కొత్త రాజ్యాంగం పెట్టే కఠిన పర్యావరణ నిబంధనలతో ఇబ్బంది తలెత్తవచ్చు. కరోనా దెబ్బతో ఇప్పటికే కుటుంబాలు కుదేలయ్యాయి. వార్షిక ద్రవ్యోల్బణం ఏడేళ్ళ గరిష్ఠానికి చేరింది. అయితే, ఆర్థికంగా బాధ్యతాయుతంగా ఉంటూనే, దేశంలో సాంఘిక హక్కులను విస్తరిస్తామన్నది బోరిక్ మాట. అందుకే, వచ్చే మార్చిలో ఆయన పాలన చేపట్టాక, శ్రామిక వర్గాలకు తోడ్పడే మార్పులు వస్తాయని జనం భావిస్తున్నారు. వాగ్దాన పాలనకై యువతరం నుంచి ఒత్తిడీ తప్పదు. ఈ సమస్యలు అటుంచితే, మొత్తం మీద లాటిన్ అమెరికాలో రాజకీయాలు మలుపు తిరిగాయి. ఆ ప్రాంత ప్రజాస్వామ్యాలు రాజీ లేని భావాలతో ముందుకు సాగేందుకు యత్నిస్తున్నాయి. పెరూ, నికరాగ్వా, హోండూరస్, ఇప్పుడు చిలీ – నాలుగింటా వామపక్ష అభ్యర్థులే అధ్యక్షులయ్యారు. వచ్చే మేలో కొలంబియాలో, అక్టోబర్‌లో బ్రెజిల్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లోనూ లెఫ్ట్‌దే విజయమని సర్వేల అంచనా. వామపక్ష భావజాలానికి అక్కడి ప్రజల్లో సానుకూలత పెరుగుతున్నట్టు అర్థమవుతోంది. వెరసి, చిలీ సహా లాటిన్ అమెరికా ప్రాంతమంతా ఇప్పుడు ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించే, ప్రగతిశీల ‘నూతన సహస్రాబ్ది వామపక్షవాద’ విజృంభణను వీక్షిస్తోంది. సాదరంగా స్వాగతిస్తోంది. -
చలిపులితో పోరాటం!
దేశమంతా గజగజ వణుకుతోంది. ఉత్తరాది నుంచి దక్షిణాది దాకా డిసెంబర్ నాటికే చలి పులి చేతికి చిక్కి, జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీవ్రమైన శీతల గాలులతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తత్ఫలితంగా తలెత్తుతున్న అనారోగ్య పరిణామాలు ఆందోళన రేపుతున్నాయి. దేశరాజధానిని చలి గాలి బలంగా తాకింది. ఢిల్లీలో ఈ సీజన్‌లోకెల్లా అతి తక్కువ ఉష్ణోగ్రత (3.1 డిగ్రీలు) సోమవారం నమోదైంది. కొద్దిరోజులుగా శ్రీనగర్‌లో వరుసగా రెండు రాత్రుళ్ళు మైనస్ 6 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పడిపోయింది. రాజస్థాన్‌లోని చురూలో ఏకంగా మైనస్ 0.5 డిగ్రీలకు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో హైదరాబాద్ సహా అనేక ప్రాంతాలు చలితో గడగడలాడుతున్నాయి. శీతల, అతి శీతల గాలుల గుప్పెట్లో ఉత్తర భారతావని ఉందని భారత వాతావరణ శాఖ శనివారం ప్రకటించింది. కొద్ది రోజుల పాటు బాధలు తప్పవని హెచ్చరించింది. ఢిల్లీ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్ము – కాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్ – బాల్టిస్తాన్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లు ఇప్పటికే తీవ్రమైన చలి గాలుల్లో చిక్కుకున్నాయి. మార్గశిర, పుష్య మాసాల హేమంత ఋతువులో శీతల పవనాలు, హిమ శీకరాలు సాధారణమే. కానీ, ప్రకృతి కోపించినట్లు ఇంతలేసి చలి మాత్రం ఇటీవలి అసాధారణం. 1991 నుంచి 2019 మధ్య మూడు దశాబ్దాల్లో శీతల గాలులు విజృంభిస్తున్నాయనీ, గత రెండు దశాబ్దాల్లో 4,712 మంది చనిపోయారనీ అధికారిక లెక్క. మానవ తప్పిదాల వల్ల ఎండాకాలంలో ఎండ, వానాకాలంలో వాన, శీతకాలంలో చలి – మూడూ దుర్భరస్థాయికి ఎగబాకడం ఇప్పుడు ప్రపంచవ్యాప్త ఆందోళనకర పరిణామం. ఉష్ణోగ్రతల్లోని భారీ మార్పులు వ్యవసాయం, పశుసంపద, జీవనోపాధి, పర్యావరణం, ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్నాయి. సాక్షాత్తూ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) ఆ మాట చెప్పింది. వర్ధమాన దేశాల్లో ఏటా పెద్ద సంఖ్యలో మరణాలూ సంభవిస్తున్నాయి. ఉత్తర భారతావనిలో కొండ ప్రాంతాలు, వాటిని ఆనుకొన్న మైదానాలతో 17 రాష్ట్రాలలో ‘ప్రధానమైన శీతల గాలుల జోన్’ విస్తరించి ఉంది. దాదాపు 90.90 కోట్ల జనాభా ఈ జోన్లోనే జీవిస్తోంది. వీరిని బాధిస్తున్న శీతల గాలులపై ఎక్కడికక్కడ యాక్షన్ ప్లాన్లు సిద్ధం చేసుకొనేందుకు ‘జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ’ (ఎన్డీఎంఏ) ఈ ఏప్రిల్‌లో మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటిని ఎవరు, ఎంత వరకు ఆచరణలో పెట్టారో ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టమే. కనిష్ఠ ఉష్ణోగ్రత మైదాన ప్రాంతాల్లో 10 డిగ్రీల కన్నా తగ్గినా, పర్వత ప్రాంతాల్లో సున్నా డిగ్రీల కన్నా తగ్గినా అది ‘శీతల గాలి’ పరిస్థితి అని భారతీయ వాతావరణ శాఖ లెక్క. మరోలా చెప్పాలంటే, సాధారణ ఉష్ణోగ్రత కన్నా 4.5 నుంచి 6.4 డిగ్రీలు తగ్గితే – కోల్డ్ వేవ్. 6.4 డిగ్రీలకు మించి తగ్గితే, తీవ్రమైన కోల్డ్ వేవ్. దేశంలో అనేక చోట్ల ఇప్పుడీ పరిస్థితే ఉంది. తలదాచుకొనే గూడు, ఒంటి నిండా వస్త్రాలు లేని అధిక శాతం మందికి జీవన్మరణ సమస్యగా పరిణమించింది. అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ వైద్య సంస్థలో వైద్యం కోసం వచ్చిన రోగులు, వారి కుటుంబాలు పడకలు ఖాళీ లేక, చలిలో రోడ్డు మీద తాత్కాలిక గుడారాలు వేసుకొని, కాలక్షేపం చేస్తున్న దయనీయ దృశ్యాలు జాతీయ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. కొన్నేళ్ళుగా ప్రతి ఏటా దర్శనమిస్తున్న ఈ దృశ్యాలు ఈసారీ షరా మామూలు కావడం విషాదం. ప్రభుత్వాలు, పాలకుల పాత్ర ఇక్కడే కీలకం. తలదాచుకొనేందుకు నీడ లేని నిర్భాగ్యులను ఎముకలు కొరికే చలికి వదిలేయడం ఏ రకంగా చూసినా ధర్మం కాదు. నిజానికి, నిరాశ్రయులకు దేశంలో మరే నగరంలోనూ లేనన్ని షెల్టర్లున్నది దేశ రాజధానిలోనే! ఈసారి కూడా నిరాశ్రయులను చలి కోరల నుంచి కాపాడేందుకు ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్ నవంబర్లోనే యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించింది. మొన్న నవంబర్ 7 నుంచి వచ్చే మార్చి 15 వరకు ఆ ప్లాన్‌ను అమలులో పెడతామంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న 206 షెల్టర్లలో 7092 మందికి ఆశ్రయమిచ్చే అవకాశం ఉంది. కొత్తగా మరో 2 వేల మందికి, 250 తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేయాలని ఢిల్లీ సర్కార్ సంకల్పించింది. చాపలు, దుప్పట్లు, లాకర్లు, కాలకృత్యాలకు వసతులు – అన్నీ కల్పిస్తా మన్నారు. అయితే, క్షేత్రస్థాయిలో అనేక లోటుపాట్లున్నట్టు జాతీయ మానవ హక్కుల సంఘం సహా అనేక ఎన్జీఓల పరిశీలనలో వెల్లడైంది. నిరాశ్రయుల సంఖ్యకు తగ్గట్టు షెల్టర్లు లేవు. ఉన్నవి కూడా దయనీయావస్థలో ఉన్నాయి. అవసరార్థులకు సమీప షెల్టర్ల సమాచారం చెప్పే పరిస్థితి లేదు. తెలిసి వెళ్ళినా, రాత్రి 8 గంటల వేళకే జనంతో నిండిపోతున్నాయి. చాలామందికి జాగా లేని దుఃస్థితి. దాదాపుగా దేశంలోని ప్రతి నగరంలోనూ నిర్భాగ్యులకు ఎదురవుతున్నది ఇలాంటి నిర్లక్ష్యమే! అసలు ఇలాంటి అభాగ్యులకు నిలువ నీడ కల్పించడానికి ‘జాతీయ పట్టణప్రాంత జీవనోపాధి ప్రణాళిక – పట్టణప్రాంత నిరాశ్రయులకు ఆవాసం’ పేరిట ఓ జాతీయ ప్రణాళిక ఉంది. సుప్రీమ్ కోర్టు మార్గదర్శకాల ప్రకారమైతే, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిరాశ్రయుల కోసం గౌరవప్రదమైన, శాశ్వత షెల్టర్లను నిర్మించడం చట్టప్రకారం విధాయకం. కానీ, స్థానిక, రాష్ట్ర సర్కార్లు ఏ మేరకు చొరవ చూపుతున్నాయి? ఇప్పటికైనా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రభుత్వాలు కాగితంపై ఉన్న కేంద్రీయ విధానాన్నీ, కోర్టు మార్గదర్శకాలనూ తు.చ. తప్పక కార్యాచరణలో పెట్టాలి. అప్పుడే ఈ చలి పులి పంజా విసురు నుంచి నిర్భాగ్యులు తప్పించుకోగలుగుతారు. -
Nagaland Tragedy: నాగాలాండ్ నరమేథం
ఈశాన్య భారతంలో తిరుగుబాట్లను అణిచే పేరిట దశాబ్దాలుగా అమలవుతున్న సాయుధ బలగాల (ప్రత్యేకాధికారాల) చట్టం పౌరుల జీవితాల్లో ఎంతటి కల్లోలం సృష్టిస్తున్నదో తెలియడానికి శనివారం చోటుచేసుకున్న నాగాలాండ్ నరమేథమే తార్కాణం. ఆ రాష్ట్రంలోని మోన్ జిల్లాలో 13మంది పౌరులు, ఒక జవాను మరణించడానికి దారి తీసిన ఈ ఉదంతం అత్యంత విషాదకరమైనది. వాహ నంలోని వారిని తిరుగుబాటుదారులుగా పొరబడి కాల్పులు జరిపామని సైన్యం ఇస్తున్న సంజాయిషీ నేర తీవ్రతను తగ్గించలేదు. వారి ప్రకటన ప్రకారం నిషేధిత నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగా లాండ్ –ఖప్లాంగ్(ఎన్ఎస్సీఎన్–కే)లోని చీలిక వర్గం తిరుగుబాటుదారులు ఫలానా వాహనంలో వస్తున్నారని నిఘా సంస్థలు సమాచారం ఇచ్చాయి. దాని ఆధారంగా కాల్పులు జరిపామని సైన్యం అంటున్నది. తిరుగుబాటుదారుల గురించి అంత ఖచ్చితమైన సమాచారం అందించిన నిఘా సంస్థకూ, దాన్ని విశ్వసించిన సైన్యానికీ సమీపంలోని బొగ్గు గనిలో పనిచేస్తూ రోజూ అదే సమయా నికి వాహనంలో కూలీలు వెళ్తారన్న ఇంగితం లేకపోవడం, జాగరూకతతో వ్యవహరించాలన్న స్పృహ కొరవడటం క్షమార్హంకాదు. పద్ధతిగా అయితే ఇలాంటి దాడుల సమయంలో స్థానిక పోలీసుల సాయం తీసుకోవాలి. కానీ, అక్కడ కార్యకలాపాలు చూసే అస్సాం రైఫిల్స్‌కు కూడా చెప్పకుండా సైన్యంలోని ఒక ఎలైట్ యూనిట్ తనకు తానే నిర్ణయం తీసుకుని ఈ దాడికి పాల్పడిందని వస్తున్న కథనాలు ఆందోళనకరమైనవి. బలగాలమధ్య సమన్వయం లేదని దీన్నిబట్టి అవగతమవుతోంది. అసలు సైన్యం నిర్వహిస్తున్న ఆపరేషన్ల తీరుతెన్నులనే ఈ ఉదంతం ప్రశ్నార్థకం చేస్తున్నది. ఆ వాహనంలో నిజంగా తిరుగుబాటుదారులే వెళ్తున్నా అచ్చం వారి మాదిరే పొంచివుండి దాడి చేయాలనుకోవడం సరికాదు. గత నెలలో మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఒక కమాండింగ్ ఆఫీసర్‌నూ, మరో ఆరుగురినీ తిరుగుబాటుదారులు బలితీసుకున్ననాటినుంచీ సూత్రధారుల కోసం గాలింపు మొదలైంది. తిరుగుబాటుదారులను సజీవంగా పట్టుకుంటేనే ఆ అధికారి మరణానికి కారకులెవరో, వారి కార్యకలాపాలేమిటో తెలిసేది. అందుకు భిన్నంగా పొంచివుండి హఠాత్తుగా గుళ్ల వర్షం కురిపించడం వల్ల దేశ భద్రతకు కలిగే ప్రయోజనమేమిటి? కాస్తయినా ఆలోచించారా? వాహ నాన్ని ఆపడానికి బలగాలు ప్రయత్నించాయని, కానీ వారు ‘పారిపోయే ప్రయత్నం’ చేయడంతో అందులో తీవ్రవాదులు వెళ్తున్నారని భావించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన ప్రకటన హేతుబద్ధంగా లేదు. తీవ్రవాదులు వాహనంలో ఉండుంటే మారణాయుధాలతో దాడికి దిగరా? వాహనం ఆపనంత మాత్రాన అందులో తీవ్రవాదులే ప్రయాణిస్తున్నారన్న నిర్ధార ణకు రావడం సబబేనా? నాగాలాండ్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిన అంశాలు మరింత గుబులు పుట్టిస్తున్నాయి. ఘటన జరిగాక మృతదేహాలపై ఉన్న దుస్తులను తొలగించి, ఖాకీ దుస్తులు వేసేందుకు బలగాలు ప్రయత్నించాయని ఆ దర్యాప్తు చెబుతోంది. మరణించినవారు తీవ్రవాదులని కట్టుకథలల్లడానికి ఈ పని చేశారా అన్నది తేలాలి. ఆ రాష్ట్రంలో ఉన్నది ఎన్డీపీపీ–బీజేపీ కూటమి ప్రభుత్వం. కానీ బీజేపీ నేతలకే అక్కడ రక్షణ కరువు! ఘటనాస్థలికి బీజేపీ జెండాతో వెళ్తున్న తమ వాహనంపై కూడా బలగాలు కాల్పులు జరిపి, ఒకరి ప్రాణం తీశాయని, మరో ముగ్గురు గాయపడ్డా రని మోన్ జిల్లా బీజేపీ నేత అంటున్నారు. ఇదంతా వింటుంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే జీవిస్తున్నామా అనే సందేహం రాకమానదు తీవ్రవాదాన్ని అదుపు చేయడం, శాంతిభద్రతల్ని పరిరక్షించడం ప్రభుత్వాల కర్తవ్యం. మయ న్మార్కూ, చైనాకూ కూతవేటు దూరంలో ఉండే నాగాలాండ్ వంటిచోట అది మరింత అవసరం. కానీ కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా చట్టాలు ఉండకూడదు. రాజ్యాంగంలోని అధికరణలను సైతం అపహాస్యం చేసేలా సైన్యానికి అపరిమిత అధికారాలిస్తున్న సాయుధ బలగాల (ప్రత్యేకాధికారాల) చట్టం ఈ పోకడే పోతోంది. పర్యవసానంగా ఇది అమలవుతున్న ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడో ఒకచోట నిత్యం మానవ హక్కుల ఉల్లంఘన సాగుతూనే ఉంది. అక్రమ నిర్బం ధాలు, అత్యాచారాలు, బూటకపు ఎన్కౌంటర్లు, మనుషుల్ని మాయం చేయడం వంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మణిపూర్ ఎన్కౌంటర్ ఘటనలపై 2013లో దర్యాప్తు చేసిన జస్టిస్ సంతోష్ హెగ్డే కమిషన్ సాయుధ బలగాల చట్టం అశాంతికి కారణమవుతున్నదని తేల్చి చెప్పింది. చట్టవిరుద్ధ చర్య లకు పాల్పడిన భద్రతా బలగాలకు ఏ రక్షణా ఉండబోదని సుప్రీంకోర్టు ఒక కేసులో స్పష్టం చేసింది. జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి కమిటీ ఆ చట్టాన్ని రద్దు చేయాలని 2005లో సూచించింది. నిర్భయ ఉదం తంలో నియమించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ నివేదిక సైతం ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పింది. అయినా ఆనాటి యూపీఏ సర్కారుకు పట్టలేదు. అది జరిగితే భద్రతా బలగాల నైతిక స్థైర్యం దెబ్బ తింటుందన్నదే ప్రభుత్వాల వాదన. మరి పౌరుల నైతిక స్థైర్యం సంగతేమిటి? నాగాలాండ్ ఉదం తంలో కారకుల్ని శిక్షిస్తామని సైన్యం అంటున్నది. కేంద్రం కూడా హామీ ఇస్తోంది. మంచిదే. కానీ ఇన్ని దశాబ్దాలుగా ఎంతమందిని శిక్షించారు... లెక్కలు తీస్తారా? సాయుధ బలగాల (ప్రత్యేకాధి కారాల) చట్టం అమల్లో ఉన్నంతకాలం ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. చట్టం రద్దు చేయాలన్న నాగాలాండ్, మేఘాలయ సీఎంల తాజా డిమాండ్ ముమ్మాటికీ సబబే. ఇప్పటికైనా కేంద్రం ఆలోచించాలి. ప్రజా శ్రేయస్సుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. -
అక్షర పాలకులు
రాజ్యాలు, వైభవాలు ఉన్నాయి కదా అని పొద్దంతా విలాసాల్లో మునిగి తేలితే గొప్పేముంది? జనం పది కాలాల పాటు గుర్తుంచుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. ఇలాంటి ఆలోచనే కొందరు పాలకులకు చరిత్రలో ప్రత్యేక పేజీలను కేటాయించింది. రాచరికాలు కావచ్చు, ప్రజాస్వామిక వ్యవస్థ కావచ్చు... పాలనా దక్షత ఒక్కటే ఉంటే పాలకుడిగానే మిగిలిపోతారు. పాలనతో పాటు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమన్నా ఉంటే ప్రత్యేకంగా వెలిగిపోతారు. చరిత్రలో ఎందరో రాజులు, చక్రవర్తులు ప్రజారంజకంగా పాలించారు. కొందరు ప్రజాకంటక పాలన అందించి కాలగర్భంలో కలిసిపోయారు. చాలా కొద్దిమంది మాత్రం మంచి పాలన అందించడంతో పాటు ‘కూసింత కలాపోసన’ చేసి శభాష్ అనిపించుకున్నారు. అటువంటి సాహితీ పాలకుల్లో అగ్రగణ్యుడు శ్రీకృష్ణదేవరాయలే! ప్రజాసంక్షేమ పాలనకు పెట్టింది పేరు అయిన కృష్ణదేవరాయల హయాంలో సాహిత్యానికి పట్టం కట్టారు. ‘భువన విజయం’ పేరుతో అష్ట దిగ్గజ కవులను కొలువు తీర్చిన కృష్ణదేవరాయలు వారికి ఏమాత్రం తీసిపోకుండా తానూ పాండిత్యాన్ని ప్రదర్శించాడు. తెలుగు, కన్నడ, తుళు, తమిళ భాషలతో పాటు సంస్కృతంలోనూ రాయలు పండితుడు. సంస్కృతంలో జాంబవతీ కల్యాణం, మదాలస చరితం, రసమంజరి వంటి గ్రంథాలు రచించాడు. తెలుగులో ఆముక్త మాల్యద అను గోదాదేవి కథ అన్న అద్భుత కావ్యాన్ని జాతికి కానుకగా ఇచ్చాడు. భారత దేశపు చివరి చక్రవర్తిగా నిలిచిపోయిన మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ అద్భుతమైన సూఫీ కవి. ఉర్దూభాషా పండితుడైన బహదూర్ షా కలం పేరు జఫర్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మీర్జా గాలిబ్, ఇబ్రహీం జౌఖ్... బహదూర్ షా ఆస్థానంలోని కవులే. బ్రిటిష్ పాలకులు తనను బర్మాలో నిర్బంధించినప్పుడు, తన నిస్సహాయతను దృష్టిలో ఉంచుకుని బహదూర్ షా రాసిన ‘నా కిసీకీ ఆంఖోం కా నూర్ హూం’ అనే గజల్ ఇప్పటికీ కచ్చేరీలలో మార్మోగుతూ ఉంటుంది. బ్రిటన్ ప్రధానిగా వ్యవహరించిన విన్స్టన్ చర్చిల్ అద్భుతమైన రచయిత. సైద్ధాంతికంగా చర్చిల్‌ను ఎక్కువ మంది ఇష్టపడకపోవచ్చు; ఆయన రచనల్లోని ఆలోచనలనూ ఒప్పుకోకపోవచ్చు. కానీ ఆయన శైలిని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేరు. రెండో ప్రపంచ యుద్ధ కాలానికి సంబంధించి ఎన్నో కీలక ఘట్టాలను అక్షరబద్ధం చేసిన చర్చిల్ తిరుగులేని చమత్కారి కూడా! బ్రిటన్ను పాలించిన ప్రధానులందరిలోకీ సమర్థుడిగా పేరు తెచ్చుకున్న చర్చిల్ రచయితగా నోబెల్ బహుమతి పొందడం గమనార్హం. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సాహితీ పిపాసి. ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ను రాసిన నెహ్రూను ‘పొయట్ ఎట్ హార్ట్’ అని ప్రముఖ రచయిత అబ్బూరి వరద రాజేశ్వరరావు కీర్తించారు. ఆ ఒక్కముక్క చాలదూ... నెహ్రూ మంచి రచయిత అనడానికి! చైనాను సుదీర్ఘ కాలం పాలించిన మావో జెడాంగ్ కవులు మెచ్చిన రొమాంటిక్ పొయెట్. వియత్నాం విప్లవ యోధుడు హోచిమన్ కవిత్వం అత్యంత సహజంగా ఉంటుందని పండితులే మెచ్చుకున్నారు. భారత ప్రధానుల్లో నెహ్రూ తర్వాత పి.వి.నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయ్ సాహితీ స్రష్టలే. భావోద్వేగాలు, భావావేశాలు కలగలిసిన వాజ్‌పేయ్ కవితలు కదం తొక్కిస్తాయి. అలాగని పీవీ తక్కువ వాడేమీ కాదు. పండితులకే కొరకరాని విశ్వనాథ ‘వేయిపడగల’ను హిందీలోకి అనువదించిన మేధావి. ఒడిశా ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం ఉన్నత పదవుల్లో వెలిగిన గిరిధర్ గమాంగ్ సకల కళావల్లభుడే. గిరిజన సంగీతం గొప్పతనాన్ని యావత్ లోకానికీ చాటి చెప్పాలన్న కసితో దశాబ్దాల తరబడి కృషి చేసిన గమాంగ్ స్వతహాగా అద్భుత సంగీతకారుడు. రక రకాల గిరిజన సంగీత వాద్య పరికరాలు వాయించడంలో పండితుడు. ఒరియాలో మంచి కవి. హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన మఖ్దూమ్ మొహియుద్దీన్ నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతోపాటు, అనంతరం ఎమ్మెల్సీగానూ వ్యవహరించారు. విశ్వ విఖ్యాత రచయిత జార్జ్ బెర్నార్డ్ షా రాసిన ఓ నాటకాన్ని మఖ్దూమ్ ఉర్దూలోకి అనువదించారు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ సమక్షంలో ఈ నాటకాన్ని హైదరాబాద్‌లో ప్రదర్శించారు. నాటకం ఆద్యంతం ఆసక్తిగా వీక్షించిన రవీంద్రుడు ఆనందం పట్టలేక వేదికపైనున్న మఖ్దూమ్‌ను కౌగలించుకున్నాడు. మఖ్దూమ్ రచనలను ప్రముఖ రచయిత గజ్జెల మల్లారెడ్డి తెలుగులోకి అనువదించారు. ఒకప్పుడు మంచి సాహిత్యాన్ని అందించిన పాలకులు ఉండేవారు. ప్రపంచం అసూయతో రగిలిపోయేంత పాండిత్యాన్ని ప్రదర్శించారు. ఇçప్పుడు అటువంటి అక్షర పాలకులు లేరు. మంచి కవిత్వమో, కథో రాయడం మాట దేవుడెరుగు... నేడు పలువురు పాలకులకు మంచి పుస్తకం ఇస్తే కనీసం చదవలేని దుఃస్థితి. మళ్లీ నిరుటి మెరుపులు కొత్త వెలుగులు కాయిస్తాయనీ, నిరుడు మురిపించిన హిమసమూహాలు చల్లటి కబురందిస్తాయనీ ఆశిద్దాం. గతం వలె మళ్లీ సాహితీ కుసుమాలు వికసిస్తాయని కాంక్షిద్దాం. -
పొలిటికల్ CO2
స్కాట్లాండ్ పేరు చెప్పగానే ఎక్కువమందికి టక్కున గుర్తుకొచ్చేది స్కాచ్ మద్యం. చాలా తక్కువమందికి ఈరోజు గ్లాస్గో అనే పట్టణం పేరు గుర్తుకొస్తుంది. పుడమి తల్లి పది కాలాల పాటు పచ్చగా బతకాలని కోరుకునేవాళ్లు, అందుకోసం ఉడతాభక్తి సాయమందించేందుకు సిద్ధపడేవాళ్లు ఆ తక్కువ మందిలో ఉంటారు. మానవుడు చిరంజీవిగా వర్ధిల్లాలని ఆశ పడేవాళ్లు, విశ్వాంతరాళమంతటా విస్తరించాలని కలలు గనే వాళ్లూ ఆ తక్కువమందిలో ఉంటారు. ఆ గ్లాస్గో పట్టణంలో ఈరోజు వాతావరణ సమస్యలపై భాగస్వామ్య పక్షాల సదస్సు (కాప్) ప్రారంభమవుతున్నది. పారిశ్రామిక విప్లవం తర్వాత కర్బన ఉద్గారాలను విచ్చల విడిగా ప్రకృతిలోకి వెదజల్లుతున్నందు వలన భూమాత ఉష్ణోగ్రమవుతున్నది. ఈ పరిణామం ఇంకా కొంతకాలం కొనసాగితే ఒక మహావిలయానికి మన కువలయం బలికావచ్చును. మరో పది పన్నెండు తరాల తర్వాత మనుష్యజాతి అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ ప్రమాదాన్ని నివారించవచ్చన్న మేలుకొలుపే ‘కాప్’ సదస్సుకు ప్రాతిపదిక. ప్రమాదం అంచుకు భూగోళాన్ని నెట్టిన పాపం మాత్రం సంపన్న దేశాలదే! ఆ దేశాల్లోని బడా సంపన్నులదే! సంపద సృష్టి అనే అందమైన పేరుతో వీరు సాగించిన ప్రకృతి వేట వికృతరూపం దాల్చిన ఫలితమే – ఈ భూతాపం. జనబాహుళ్యంలో ఒక జానపద కథ ప్రచారంలో ఉన్నది. ఒక పాత్రలో తైలాన్ని తీసుకొని ఒక బాలిక వీధిగుండా వెళు తున్నదట. ఇంతలో ఆ పాత్ర జారిపడి తైలమంతా భూమిలోకి ఇంకిపోతుంది. ఇంటికి వెళితే తల్లి దండిస్తుందని ఆ బాలిక విలపిస్తున్నదట. అటుగా వెళ్తున్న కర్ణుడికి ఈ దృశ్యం కనిపించింది. ఆ బాలికను ఊరడించడంకోసం తైలం ఒలికిన ప్రదేశంలోని మట్టిని పిడికిట్లోకి తీసుకొని గట్టిగా పిండి, మళ్లీ ఆ పాత్రలో తైలం నింపాడట. అప్పుడు భూదేవి ఆగ్రహించింది. ‘ఓయీ కర్ణా! నాలో ఇంకిన చమురును పిండి నా శరీరాన్ని కష్టపెట్టావు. నీ జీవితంలోని కీలక యుద్ధ సమయంలో నీ రథచక్రం కూడా నాలో దిగబడిపోతుంది. అదే నీ చావుకు కారణమవుతుంద’ని శపించింది. పిడికెడు మట్టిని పిండితేనే అప్పుడు భూదేవి శపించింది. ఇప్పుడు భూగర్భంలోకి చొరబడి శిలాజాలను మండించి చమురు వాయువులను పిండుకుంటున్నప్పుడు, తివిరి ఇసు మున తైలమును తీస్తున్నప్పుడు, అడవుల్ని, కొండల్ని కరెన్సీ లోకి మారకం చేస్తున్నప్పుడు శపించకుండా ఉంటుందా? పలు మార్లు శపించి ఉంటుంది. ఆ శాపాలకు విమోచన మార్గాలను అన్వేషించడమే ఇప్పుడు జరుగుతున్న ‘కాప్’ సదస్సు పని! దేశాలనూ – వాటి విదేశాంగ విధానాలనూ, ప్రభుత్వా లనూ – వాటి ప్రాధాన్యాలనూ బడా సంపన్నులే నిర్దేశిస్తున్న నేపథ్యంలో ఈ ‘కాప్’ సదస్సు ఏమైనా సాధిస్తుందా లేక కాకి గోలగా మిగిలిపోతుందా అనే అనుమానాలు కూడా లేక పోలేదు. మీడియాతో సహా అనేక వ్యవస్థల మీద ‘మిగులు ధనం’ పట్టు బిగిస్తున్నది. ఫలితంగానే పర్యావరణం వంటి ప్రాణప్రదమైన అంశాల మీద జన చేతన జ్వలించడం లేదు. పర్యావరణాన్ని ధ్వంసం చేసి సంపాదించిన డబ్బు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూడా చెరబట్టిన దృశ్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా దిగజారుతున్న క్రమం మన కళ్లముందున్నది. వావిలాల గోపాలకృష్ణయ్య వరుసగా నాలుగుసార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడూ, ఆ తర్వాత కూడా ఆయనకు ఒంటి మీద ఒక ముతక ఖద్దరు లాల్చీ, పంచె, భుజం మీద ముతక కండువా, చేతిలో గుడ్డ సంచీ, అందులో కొన్ని కాగితాలు. అంతే! ఆయనలో ఏ మార్పూ రాలేదు. పైసా ఖర్చు పెట్టకున్నా జనం ఆయనకు ఓట్లే శారు. గెలిపించారు. మొదటి నాలుగు ఎన్నికల్లో సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉప్పల మల్సూర్ గెలిచారు. ఎమ్మెల్యేగా తనకొచ్చే జీతభత్యాలను పార్టీకే ఇచ్చేవారు. తన కనీస అవసరాలకోసం పార్టీ ఇచ్చే డబ్బుతోనే గడిపేవారు. (అప్పట్లో కమ్యూనిస్టు ఎమ్మెల్యేలందరికీ ఈ నియమం ఉండేది). ఇరవయ్యేళ్ల తర్వాత ఉదర పోషణార్థం ఆయన చేతనైనంతకాలం చెప్పులు కుట్టు కుంటూ గడిపారు. ఓట్లకోసం ఆయనగానీ, ఆయన పార్టీగానీ ఏనాడూ ఒక్క రూపాయి ఖర్చుపెట్టింది లేదు. మొదటి ఐదారు శాసనసభలకు సంబంధించి ఇటువంటి ఉదాహరణలు ఎన్న యినా ఇవ్వవచ్చు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పర్యటన కోసం బయల్దేరాడంటే అదొక ధనబీభత్స దృశ్యమే. అదుపు తప్పిన మదపుటేనుగు రోడ్డు మీద పడ్డట్టే! ప్రస్తుత లోక్‌సభకు ఎన్నికైన 533 మంది సభ్యుల్లో 475 మంది కోటీశ్వరులు. ఇది వారు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా నిర్ధారించిన సంఖ్య. 88 శాతం మంది కోటీశ్వరులతో నిండి వున్న మన పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నదా లేక ధనస్వామ్యా నికా? తేల్చవలసి ఉన్నది. సంఘసేవకులు, లాయర్లు, డాక్టర్లు, టీచర్లు, మేధావులు చట్టసభల్లో పలచబడుతున్నారు. వ్యాపారులు చిక్కబడుతున్నారు. ఇప్పుడు పార్లమెంట్ కానీ, అసెంబ్లీలు కానీ.. ఎక్కడైనా వ్యాపారులూ, కాంట్రాక్టర్లదే హవా! ఎందుకంటే వాళ్లు ఓట్లను కొనుగోలు చేయగలుగుతారు. అందుకని రాజకీయ పార్టీలు వారిని చేరదీస్తున్నాయి. వారి కరెన్సీ నోట్ల కట్టల నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి కర్బన ఉద్గా రాలు వెలువడుతున్నాయి. బొగ్గు పులుసు వాయువు (ఛిౌ2) దట్టంగా అలుముకుంటూ రాజకీయ వ్యవస్థకు ఊపిరాడకుండా చేస్తున్నది. క్రీస్తుశకం 1498లో వాస్కోడిగామా అనే ఐరోపా యాత్రికుడు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు. ఆ తర్వాత సరిగ్గా ఐదొందల యేళ్లకు తెలుగు నేలపై ఓటు సాధనకు నోటు మార్గాన్ని 1996లో చంద్రబాబు కనిపెట్టారు. అప్పటి నుంచి రాజకీయాల్లో వాతావరణ మార్పులు మొదలయ్యాయి. క్రమేణా పేద పార్టీలు దివాళా తీశాయి. అందులో కొన్ని ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శిస్తూ అద్దె మైకులుగా రూపాంతరం చెందాయి. సంఘసేవకులు సన్యాసం పుచ్చుకున్నారు. మేధావులు, వృత్తి నిపుణులు రాజకీయాలకు దూరమయ్యారు. 1996లో దర్శి, పాతపట్నం నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరిగాయి. అప్ప టికి ఏడాది క్రితమే అంతఃపుర కుట్ర ద్వారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. తన స్థానాన్ని పదిలపరుచుకోవడా నికి ఈ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. ఒక్కో ఓటుకు ఐదొందల రూపాయలు పంచారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతకుముందు ఎక్కడో ఒకచోట వందో, యాభయ్యో.. అదీ, నిరుపేద వర్గాలకు ఇచ్చేవారు. చంద్రబాబు మాత్రం సామ్యవాద పద్ధతిలో ధనిక – బీద తేడా లేకుండా అందరి ఓట్లనూ అధిక ధరలకు కొనుగోలు చేయడానికి శ్రీకారం చుట్టారు. 1998లో అత్తిలి స్థానానికి ఉపఎన్నిక జరి గింది. సాధారణ ఎన్నికలకు ఇంకో సంవత్సరం మాత్రమే మిగిలి ఉంది. అయినా చంద్రబాబు తేలిగ్గా తీసుకోలేదు. ఓటుకు వెయ్యి పంచారని వార్తలు వచ్చాయి. టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన దండు శివరామరాజే ఆ ఖర్చును చూసి జడుసు కున్నారట! మొదటిసారిగా ఓటుకు నాలుగంకెల ధర 1998లో పలికింది. ఆ తర్వాత ఇరవై మూడేళ్లకు ఇప్పుడు ఐదంకెల మార్కును తాకినట్టు వార్తలు వస్తున్నాయి. సెన్సెక్స్ నాలు గంకెలు దాటిన రోజునుంచి లెక్కిస్తే ఐదంకెలు తాకడానికి పదహారేళ్లు పట్టింది. హుజూరాబాద్ నుంచి వస్తున్న వార్తలు నిజమైతే వోటెక్స్కు ఈ సమయం ఇరవైమూడేళ్ళు పట్టినట్టు! ఇంచుమించుగా సెన్సెక్స్‌కు ధీటుగా ఉన్నట్టే! హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక రాజకీయ పార్టీ ఓటర్లకు ఒక్కొక్కరికి పదివేలు పంచిందని ప్రచారం జరిగింది. మొదటిదఫా ఆరువేలు, రెండోదఫా నాలుగువేల చొప్పున పంచారట. ఆ పంపకం కూడా చాలా కళాత్మకంగా ఉన్నట్టు కొందరు కొనియాడుతున్నారు. మొదటిరౌండ్ పంపకాన్ని ఒకానొక నడిజామురేయి దాటిన తర్వాత బ్రాహ్మీ ముహూ ర్తంలో ప్రారంభించి వెలుగురేకలు పరచుకొనే సుప్రభాత వేళకల్లా పూర్తిచేశారట. అంటే ముచ్చటగా మూడు గంటల్లో గరిష్ఠ స్థాయిలో ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. నాలుగైదు మాసాలపాటు ప్రచార కార్యక్రమాన్ని సాగదీసినందువల్ల రెండు ప్రధాన పార్టీలకు ఖర్చు భారీ మొత్తంలోనే అయినట్లు అంచనా లొస్తున్నాయి. అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో హుజూరా బాద్ ఖర్చు బహుశా రికార్డు సృష్టించవచ్చు. మూడోపార్టీగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ ఆలస్యంగా ప్రచారాన్ని ప్రారంభిం చింది. ఎన్నికల ఖర్చుపై కూడా పెద్దగా ధ్యాసపెట్టినట్టు కనబడలేదు. కౌంటింగ్ జరిగితే తప్ప హుజూరాబాద్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోషించిన పాత్ర ఏమిటో అర్థం కాదు. హుజూరాబాద్ ఎన్నిక ఇంత ప్రతిష్ఠాత్మకంగా ఎందుకు మారినట్టు? ఇంత పెద్ద ధనప్రవాహం ఎందుకు అవసర మైనట్టు? ఒకవేళ ఈటల రాజేందర్ పట్ల జనంలో సానుభూతి ఉన్నమాటే వాస్తవమైతే ఎన్ని డబ్బులు గుమ్మరించినా ఓడిం చడం సాధ్యం కాదు. సానుభూతి అనేది లేకపోతే – ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తాయి. పైగా మొన్న ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ఆ పథకాలన్నింటినీ మరోసారి గుర్తుచేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ఆయన ప్రసంగాన్ని వినే ఏర్పాట్లను కూడా చేశారు. ‘దళితబంధు’ పేరుతో ఒక విప్ల వాత్మక కార్యక్రమాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభిం చారు. ఇంతచేసినా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు చెమటలు పట్టినట్టు? ఎన్నికల వ్యూహాల్లో కేసీఆర్ తర్వాత అంతటి దిట్టగా పేరున్న హరీశ్‌రావు సారథ్యంలో ఒక పెద్ద సైనిక పటాలాన్ని అక్కడ ఎందుకు మోహరింపజేసినట్టు? ఓటు ధరలు ఆకాశాన్నంటుకున్నట్టు వార్తలెందుకు షికారు చేసినట్టు? మరో ఆసక్తికరమైన అంశమేమంటే అధికార పార్టీకి ధీటుగా ఈటల రాజేందర్ కూడా వ్యయ ప్రయాసలకు ఓర్చగలగడం! బీజేపీ సమకూర్చిందా? లేక సొంత వనరులా అనేది ఇంకా తేలలేదు. ఒకవేళ సొంత వనరులే అయితే షాకింగ్ న్యూసే! ఏపీలో జరుగుతున్న బద్వేల్ ఉప ఎన్నిక హుజూరాబాద్‌తో పోలిస్తే పెద్దగా ఆసక్తి కలిగించలేకపోయింది. వరుస ఓటము లతో కుదేలైన ప్రధాన ప్రతిపక్షం సంప్రదాయాన్ని ఉటంకిస్తూ ముందుగానే తప్పుకున్నది. కానీ లోపాయకారిగా బీజేపీకి అను కూలంగా పనిచేసినట్టు సాక్ష్యాధారాలతో వెల్లడైంది. మెజారిటీ పోలింగ్ స్టేషన్లలో టీడీపీవారే బీజేపీ ఏజెంట్లుగా కూర్చున్నారట. కాంగ్రెస్ పార్టీ పోటీ కేవలం సంకేతప్రాయమే. గెలుపు ఎవరిదో ముందే తెలిసినందువల్ల ఏ పార్టీ అభ్యర్థి కూడా పెద్దగా ఖర్చు చేసినట్టు కనిపించలేదు. స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీ వారు పార్టీ తరఫున ఖర్చు చేయలేదు. కానీ, అభ్యర్థులు ఖర్చు పెట్టకుండా నిరోధించగలిగారా? ఓట్ల కొనుగోలు వ్యూహాలకు చెక్ చెప్పకపోతే ప్రజా స్వామ్యానికి అర్థంలేదు. రాజకీయ వ్యవస్థలో ధనస్వామ్యం ముప్పు తొలగాలంటే కచ్చితంగా ఒక ఉద్యమం కావాలి. తమ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాధనాన్ని అడ్డ గోలుగా దోచేసి భోంచేస్తున్నారన్న అభిప్రాయం జన సామా న్యంలో ఏర్పడింది. అందుకే ఓటుకు నోటు ఇవ్వాల్సిందేనని దబాయించి మరీ అడుగుతున్నారు. హుజురాబాద్‌లో కనిపించిన దృశ్యాలవే! గ్లాస్గో సదస్సు ప్రేరణతోనైనా సరే రాజకీయ కాలుష్యంపై పోరాడేందుకు ఒక ప్రజాస్వామిక ఉద్యమ బీజం పడాలని కోరుకుందాము. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అయినా... నిఘా కళ్లు నీపైనే!
తీరు మారకుండా పేరు మారితే చేసిన పాపం కడుక్కుపోతుందా? ఇది సామాజిక మాధ్యమ వేదిక ‘ఫేస్బుక్’కు ఎదురవుతున్న అతిపెద్ద ప్రశ్న! సమాధానం చెప్పుకోవాల్సిన స్థితిలో దాని అధినేత మార్క్ జుకెర్‌బర్గ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు. కానీ, ఆయన కొత్త అవతారంతో వస్తూ.. పాత విమర్శల్ని పాతరేయ చూస్తున్నారు. గుర్రుగా తనవైపు నిఘా కళ్లతో చూస్తున్న అంతర్జాతీయ సమాజం దృష్టిని ఏమార్చాలనుకుంటున్నారు. మనుషుల్ని సామాజికంగా కలుపుతూ అద్భుతాలు సృష్టించే ఓ మహత్తర వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఫేస్బుక్ నేతృత్వంలో ఇప్పుడున్న ‘ఫేస్బుక్’ ‘వాట్సాప్’ ‘ఇన్‌స్టగ్రామ్’ వేదికలు, ఆ పేర్లతోనే ప్రస్తుతం ‘మెటా వర్స్’గా పేరుమార్చుకునే మాతృసంస్థ ఛత్రఛాయలో డిసెంబరు 1 నుంచి పనిచేస్తాయి. నేటి యువతరం భవిష్యత్ ఆశలు, అంచనాల్ని పరిగణనలోకి తీసుకొని నిజమనిపించే కృత్రిమ ప్రపంచం సృష్టి ఆ ప్రకటన సారం! యువతకు ఉద్యోగ అవకాశాల ఆశ చూపిస్తున్నారు. కొత్త ప్రాజెక్టులో పదివేల మంది ఇంజనీర్లు ఒక్క ఐరోపాలోనే పనిచేస్తారని చెప్పారు. సరే, అంతమంది సాంకేతిక నిపుణుల్ని వాడుకుంటూ, వివాదస్పదమౌతున్న తన ప్రస్తుత వేదికల్లోని ‘విషయాన్ని’ ముందు సంస్కరించు కొని, అటుపై కొత్త వేదిక కడితే బాగుంటుందని సామాజిక వేత్తలు, స్వచ్ఛంద కార్యకర్తలంటు న్నారు. పలు దేశాల స్థానిక భాషలకు చెందిన నిపుణులు వారి వేదికల్లో లేక, నిర్వహణ–నియంత్రణ లోపించి అవాంఛనీయ సమాచారం జనబాహుళ్యంలోకి విచ్ఛలవిడిగా వస్తోందనేది! ఇదంతా బహి రంగ రహస్యమవడంతోనే అమెరికాలో ఆదరణ తగ్గిందని, దాంతో ఇతర ప్రాంతాలకు విస్తరించే పథకాల్ని యాజమాన్యం రచించి, అమలుచేస్తోందనేది ఘాటైన విమర్శ. స్వీయ లాభార్జనకే పెద్ద పీటవేస్తూ, సమాజంలోకి తప్పుడు సమాచారం వరదలై పారుతున్నా, ద్వేష భావాల్ని రేపే విష యాలు పరివ్యాప్తమౌతున్నా... ఫేస్బుక్ యాజమాన్యం ఉపేక్షించడాన్ని యావత్ ప్రపంచం తప్పు బడుతోంది. ఇవి యథాలాపంగానో, యాదృచ్ఛికంగానో జరుగుతున్నవి కావని..తెలిసి నిర్వాహ కులు కళ్లు మూసుకుంటే, కొన్నిమార్లు పనిగట్టుకొని ‘నిర్వహిస్తే’ జరుగుతున్న అనర్థాలని బయటకు వెల్లడైన ఫేస్బుక్ అంతర్గత పత్రాలే చెబుతున్నాయి. ప్రపంచమే నివ్వెరపోయింది! తమ వేదికల నుంచి వచ్చే ‘విషయం’ ముఖ్యంగా పిల్లలు, కౌమారంలోని వారిపై విపరీత దుష్పభావం చూపు తోందని తెలిసినా ఫేస్బుక్ నిర్వహకులు పట్టించుకోకపోవడాన్ని విశ్వ సమాజం తప్పుబడుతోంది. ఆయా వేదికల నిర్వహణ, వాటి నుంచి వస్తున్న సమాచారం, దాని ప్రభావాలపై నిరంతర నిఘా ఉండాలని, తనిఖీలు జరగాలని, స్థానిక చట్టాల్ని ఉల్లంఘించినపుడు తగు చర్యలుండాలని ప్రపంచం నలువైపులా ఒత్తిళ్లు పెరిగాయి. ఈ సంక్షోభ సమయంలోనే జుకెర్‌బర్గ్ కొత్త ప్రాజెక్టును ప్రకటించారు. నిజమనిపించే కృత్రిమ ప్రపంచాన్ని, ఇప్పుడున్నట్టు తెరపైన చూడటం కాకుండా... ఇకపై ఎవరికి వారు నేరుగా అందులోకి ప్రవేశించి–పాల్గొనే వ్యవస్థను తాజా మెటావర్స్ కింద ఆవిష్కరించనున్నారు. రియాలిటీ హెడ్ సెట్స్, రియాలిటీ కళ్లజోళ్లు, స్మార్ట్ఫోన్లు, ఆప్‌లు... ఇలా పలు సాంకేతిక ప్రక్రియల్ని సమీకృతం చేసి దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. మెటావర్స్ అంటే, ఫేస్బుక్ ట్వీట్ ప్రకారం... ‘ఇప్పుడు సాధ్యమయ్యే దానికి మించి, సామాజిక సంబంధాల నూతన శకం. ప్రపంచ ప్రజలే ఉమ్మడిగా ఏర్పరచుకొని, ఎవరైనా స్వేచ్ఛగా పాల్గొనగలిగే ప్రాజెక్టు. కృత్రిమంగానే అయినా పరస్పరం కలుసుకోవడం, నేర్చుకోవడం, కంటెంట్‌ను ఉత్పత్తి చేయడం, ఉద్యోగ–ఉపాధి అవకాశాల్ని సృష్టించుకోవడం, ఆడుకోవడం... వంటివన్నీ ఇక్కడ సాధ్యమవుతాయి’. రానున్న దశాబ్ద కాలంలోనే వందకోట్ల మందికి మెటావర్స్ చేరువవుతుందనే విశ్వాసాన్ని జుకెర్‌బర్గ్ వ్యక్తం చేస్తున్నారు. ‘సామాజిక మాధ్యమ వేదికగానే మాకు పేరున్నా, నిజానికి మనుషుల్ని సామాజికంగా కలిపే అత్యున్నత సాంకే తికతను అందించే గుణం మా డీఎన్ఏలోనే ఉంది’ అని ఆయన సగర్వంగా చెప్పుకుంటున్నారు. అయితే, సామాజిక కార్యకర్తలడిగే పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలివ్వాల్సి ఉంటుంది. బాధ్య తతో, పారదర్శకంగా ఇచ్చే సమాధానాన్ని బట్టే, ప్రపంచం మెటావర్స్‌ని చూస్తుంది. వాస్తవాలు అంగీకరించడానికి, తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ఫేస్బుక్ ముందుకు రావాలి. ఈ వివాదాస్పద వేదికల నుంచి జరిగే తప్పిదాలన్నీ ఉద్దేశపూర్వకం అనడానికి లేదు. కొన్నిసార్లు కృత్రిమ మేథా సాంకేతికతను వాడే క్రమంలో, ఆల్గోరిథమ్స్‌ని సమగ్రంగా వాడకపోవడం, వాడిన పుడు అవీ, స్థానిక భాషాపదాల్ని, పదబంధాల్ని సరైన అర్థంలో, అన్వయంలో గుర్తించకపోవడం వంటివి తప్పిదాలకు కారణమవుతున్నాయి. పశ్చిమాసియా దేశాల్లో మతపరమైన సున్నితాంశాల్లో చిక్కులొచ్చాయి. ఫేస్బుక్ వేదికని వాడి, పనిమనుషుల విక్రయాలు–రవాణా జరగటం విమర్శలకు కారణమైంది. భారత్‌లోనూ ఫేస్బుక్ వేదిక నుంచి వచ్చే సమాచారంతో మతపరంగా, రాజకీ యంగా సమస్యలు వస్తున్నాయి. కొన్ని విషయాల్లో నిర్వాహకుల ‘చేతివాటం’ కూడా ఉన్నట్టు వెల్లడైన అంతర్గత పత్రాల్లో తేలింది. లోగడ ఫేస్బుక్లో పనిచేసి, ప్రజావేగుగా మారిన ఫ్రాన్సెస్ హెగెన్ కథనం, జర్మనీ వేదికగా పనిచేసిన పరిశోధనా సంస్థ చేసిన వెల్లడి ప్రకారం... ఫేస్బుక్ చేతులు స్వచ్ఛంగా లేవు. తీరు మారకుండా పేరు మాత్రమే మారితే, కొత్త ప్రాజెక్టులోనూ పాత సమస్య పునరావృతం ఖాయం! ఈ సత్యాన్ని జుకెర్‌బర్గ్ ఎంత వేగంగా గ్రహిస్తే అంత మంచిది! -
అలను ఆపటమా? రేపటమా?
భయపడి జాగ్రత్తలు మానేయడమా? జాగ్రత్త పడుతూ భయాన్ని వీడటమా? ఎప్పుడైనా రెండోదే అనుసరణీయం! మనం మరింత జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. కరోనా మూడో అల రాక, ఉధృతి వంటివన్నీ మనం–మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటాయని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలు, హెచ్చరికలను తీవ్రంగా పరిగణించాల్సిన తరుణమిది. సరికొత్త వైవిధ్యాలతో కోవిడ్ మళ్లీ కోరలు చాస్తోంది. ఐరోపాలో కేసుల సంఖ్య, మరణాల రేటు రమారమి పెరిగింది. రష్యాతో పాటు ఉక్రెయిన్, బ్రిటన్, రుమేనియా తదితర దేశాల్లో కరోనా కలత సృష్టిస్తోంది. రష్యాలో 24 గంటల్లో 1100 మందిపైనే మరణించడంతో అన్నీ మూసేసి, పది రోజుల వేతనంతో కూడిన సెలవును ప్రకటించారు. చైనాలో కొత్త కేసులు పెరుగుతున్న తీరుకు ఆందోళన చెందిన ప్రభుత్వం నలభై లక్షల జనాభా కలిగిన వాయవ్య ప్రావిన్స్ గన్షు రాజధాని లాన్‌జువో నగరంలో సంపూర్ణ లాక్డౌన్ విధించింది. నగరంలోకి రైళ్లు, విమానాలను పూర్తిగా నిలిపివేసింది. కోవిడ్–19 వైరస్ కొత్త వైవిధ్యం ఏవై.4.2 కేసులు భారత్‌లోనూ బయటపడ్డాయి. కర్ణాటకలో ఈ కేసుల్ని నిర్ధారించి, అధికా రికంగా ప్రకటించారు. కేసులు పెరుగుతున్నట్టు వైద్యారోగ్య నిపుణులు ప్రకటించారు. ఈ వైరస్ బారినపడ్డ వారిని గుర్తించి, ప్రాథమిక, ద్వితీయ ప్రభావితులపై పరిశోధనలకు నమూనాలను ఇప్పటికే ప్రయోగశాలలకు చేర్చారు. ఇది డెల్టా ప్లస్ రకానికి చెందిన సరికొత్త్త వైవిధ్యం. దీని ప్రభావంపై జరుగుతున్న పరిశోధన ఫలితాలను బట్టి ఇదెంత ప్రమాదకారి? వైరస్ వ్యాప్తి, వ్యాధి విస్తరణ–తీవ్రత! వంటిని నిర్ధారిస్తారు. లోగడ బి.1.617 వైవిధ్యం భారత్‌లో సృష్టించిన అలజడి కోవిడ్–19 రెండోఅల ఉధృతిలో మనమంతా కళ్లారా చూశాం! అపార ప్రాణ నష్టం జరిగింది. గత కొంతకాలంగా మొత్తమ్మీద దేశంలో కేసుల సంఖ్య తగ్గినట్టే కనిపిస్తున్నా... అక్కడక్కడ తగ్గక పోవడం, కేరళ వంటి ప్రాంతాల్లో మళ్లీ పెరగటం ఆందోళన కలిగిస్తోంది. కేరళతో పాటు పొరుగు నున్న కర్ణాటక, తమిళనాడులో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే మరింత అప్రమత్తమయ్యాయి. కేంద్రం కూడా తరచూ రాష్ట్రాలను హెచ్చరిస్తోంది. కోవిడ్ ప్రభావం తగ్గిందనే తలంపుతో అలక్ష్యం చేయొద్దని, పౌరులు కోవిడ్‌కు తగ్గ ప్రవర్తన (సిఎబి)తో కనీస జాగ్ర త్తలు పాటించాలని సూచిస్తోంది. ఒకటో అల ఉధృతి తగ్గుతున్న క్రమంలో మన నిర్లక్ష్యానికి, సర్కార్ల అలసత్వానికి తగిన మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. రెండో అలలో పెరిగిన ఉధృతి, జరిగిన ప్రాణ నష్టం అనుభవాల్ని గుణపాఠంగా గ్రహించి అప్రమత్తంగా ఉండాల్సిన సంధికాలపు సందర్భమిది. ప్రభుత్వాలు నిర్ణయాల పరంగా, వైద్య విభాగం సన్నద్ధతపరంగా, పౌరసమాజం స్వీయ నియంత్ర ణతో వ్యవహరించాలి. రాగల ప్రమాద ఆస్కారాన్ని తగ్గించాలి. ఇది మనందరి ఉమ్మడి కర్తవ్యం! అక్కడక్కడ కోవిడ్ కేసులు పెరుగుతూ, కొత్త వైవిధ్యాలు పొడచూపుతున్న ఈ సమయంలోనే ఉపఎన్నికలు, పండుగలు, ఇతర శుభకార్యాలున్నాయి. వాటిల్లో పాల్గొనేవారి సంఖ్యా పరిమితులకు మనవాళ్లెప్పుడో తిలోదకాలిచ్చారు. ఎక్కడ చూసినా, జనం ఏ బెరుకూ–జాగ్రత్తలు లేకుండా పెద్ద సంఖ్యలో గుమిగూడుతున్నారు. జనాభాలో 75 శాతానికి పైబడి మాస్కులు లేకుండానో, నామ మాత్రంగా ధరించో ఉంటున్నారని ఒక అధికారిక సర్వేనే వెల్లడించింది. భౌతిక దూరాలు పాటిం చడం, శానిటైజర్ల వినియోగం కూడా తగ్గింది. ఇప్పుడు దాదాపు ఏ కట్టడీ (లాక్‌డైన్) లేదు. ఆంధ్ర ప్రదేశ్‌లో రాత్రిపూట కర్ఫ్యూ ఇంకా అమలవుతోంది. దేశమంతా బడులు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థల్ని తెరిచారు. సినిమాలు, మాల్ సెంటర్లు, వాణిజ్యం, వర్తకం వంటి కార్యకలాపాల కేంద్రాల న్నింటినీ తెరచుకొమ్మన్నారు. విధి–నిషేధాలతో జనహితంలో కట్టడి పాటించడం ఒకవైపు, రోజు వారీ కార్యకలాపాల్ని పునరుద్ధరించి, ఆర్థిక వ్యవస్థను పరుగెత్తించడం మరోవైపు... ప్రభుత్వాలకు పరస్పర విరుద్ధ ప్రయోజనాంశాలు! పరిస్థితులు చెయిదాటి మళ్లీ కట్టడి విధించాల్సిన పరిస్థితులే వస్తే... పౌరులు, ముఖ్యంగా పేద–అల్పాదాయ వర్గాలు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా దినకూలీలు! ఇది పునరావృతం కాకుండా పౌరసమాజమే చొరవ తీసుకోవాలి. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, నిరంతర పరిశుభ్రత బాధ్యతగా భావించి, పాటించాలి. సామూహిక రోగనిరోధకతపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. బూస్టర్ డోస్‌ల అవసరం పెరుగు తోంది. వివిధ దేశాల్లో అందుకోసం ప్రత్యేక అనుమతులు ఇస్తున్నారు. వెనుకబడిన పలు దేశాల్లో ఇంకా తొలి విడత టీకా ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. ఈ అసమానతలు మంచిది కాదు. మనం వంద కోట్ల టీకాలివ్వడం ఇటీవలే పూర్తిచేసుకున్నాం. మూడో అల వచ్చినా తట్టుకునేలా ఆక్సిజన్ సరఫరా, పడకల అందుబాటు, ఇతర వైద్య వ్యవస్థల్ని రాష్ట్ర–కేంద్ర స్థాయిలో సమకూర్చుకుం టున్నాం. రెండు టీకాలు తీసుకున్న తర్వాత కొన్ని నెలలకు రోగనిరోధకత పడిపోయి వ్యాధులు ప్రబలే ప్రమాదముందని ఓ అధ్యయన నివేదిక చెబుతోంది. దానికి విరుగుడుగా అందరూ బూస్టర్ డోస్ తీసుకోవాల్సి ఉంటుందనే ప్రచారం మిన్నంటింది. కోవిడ్‌ని ఎదుర్కొనే క్రమంలో ప్రపంచ జనమంతా ఇలా నిరంతరం టీకాలు, బూస్టర్లు తీసుకుంటూనే ఉండాల్సి వస్తే, ఇదొక ఫార్మా కార్పొరేట్–పారిశ్రామిక రంగం దీర్ఘకాలిక కుట్రేమో? అన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. ఇలాంటి అరిష్టాలన్నీ అధిగమించి గట్టెక్కాలంటే పౌరుల అప్రమత్తత, జాగ్రత్తలే ప్రధానం! -
ఆ‘పరేషాన్’ కశ్మీర్!
‘‘నాకు బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ లేదు... సెక్యూరిటీ లేదు... మీ ముందు నిల్చొని మనసు విప్పి మాట్లాడుతున్నా!’’ మూడు రోజుల జమ్మూ కశ్మీర్ పర్యటనలో భాగంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సోమవారం ఓ సభలో అన్న మాటలివి. అక్కడున్న కశ్మీరీ జనం మీద నమ్మకం కనబరుస్తూ, ప్రతీకాత్మకంగా ఆయన అలా బుల్లెట్ ప్రూఫ్ కవచం అడ్డు తీసేసి తమ ప్రభుత్వ దృఢసంకల్పాన్ని వ్యక్తం చేశారు. సరిహద్దు వెంట పూంఛ్ సెక్టార్లో రక్తపాతం కొద్దిరోజులుగా ఆగని నేపథ్యంలో అమిత్ షా పర్యటన, ఆయన మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి–నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూఖ్ అబ్దుల్లా పాకిస్తాన్‌తో చర్చలు జరపాలంటూ గడచిన మూడు రోజుల్లో రెండు సార్లు సూచించారు. కానీ, పలుమార్ల పాకిస్తాన్ ద్రోహాలతో, మరీ ముఖ్యంగా పుల్వామా దాడితో కేంద్రానికి మబ్బులు వీడి, కేంద్రమంత్రి ఆ సూచనల్ని తోసిపుచ్చారు. ‘నయా కశ్మీర్’ కోసం కశ్మీరీ యువతరంతోనే మాట్లాడతానంటూ తెగేసి చెప్పడం గమనార్హం. ప్రతిపక్ష కశ్మీరీ నేతలపై విరుచుకు పడడమే కాక సోమవారం డల్ సరస్సులో మిరుమిట్లు గొలిపే దీపకాంతుల మధ్య సాంస్కృతిక ప్రదర్శనల్లో షా పాల్గొన్నారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనే భావన కలిగించేందుకు శతవిధాల ప్రయత్నించారు. షార్జాకు విమాన సర్వీసు, ఐఐటీ కొత్త ప్రాంగణం ప్రారంభోత్సవం వగైరా చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్లో అవినీతి, బంధుప్రీతి, తీవ్రవాదం నశించి, మునుపెన్నడూ లేని అభివృద్ధి జరుగుతోందని తన పర్యటనలో కశ్మీరీ యూత్ క్లబ్ సభ్యులతో నమ్మబలికారు. కానీ, కశ్మీర్లో అల్పసంఖ్యాకులైన పండిట్లు, సిక్కులు, వలస కార్మికుల ఊచకోత... పదిహేను రోజులుగా తీవ్రవాదులపై ఆగని సైనిక చర్య – క్షేత్రస్థాయి ఉద్విగ్నతను కళ్ళకు కడుతున్నాయి. భారీ భద్రతా ఏర్పాట్లతో మూన్నాళ్ళ పర్యటనకు వచ్చిన మంత్రి మాటల్లోని ధైర్యం అక్కడి సామాన్యులకు ఉంటుందా అన్నది అనుమానమే. సోమవారం సైతం పుల్వామాలో పోలీస్‌స్టేషన్‌పై జరిగిన గ్రెనేడ్ దాడి లాంటివి కశ్మీర్ నిజంగా సురక్షితమేనా, గుండెలపై చేతులేసుకొని బతికే పరిస్థితి ఉందా అని భయం రేపుతున్నాయి. హింసాకాండ, భయం కశ్మీర్‌తో పుట్టిన కవలపిల్లలు. 2019 ఆగస్టు 5న కేంద్రం రాజ్యాంగంలోని 370వ అధికరణం రద్దుతో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించింది. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. తద్వారా పరిస్థితి చక్కబడి శాంతి నెలకొంటుందని ఆశించింది. నియోజక వర్గాల పునర్విభజన తర్వాత, ఎన్నికల సంఘం ఓకే అనగానే రెండు రాష్ట్రాలకూ ఎన్నికలు పెడతామనీ చెప్పింది. కానీ, రెండేళ్ళు దాటినా పరిస్థితి అలా లేదు. పైగా, కొద్ది రోజులుగా తీవ్రవాదులు ఎంచుకొని మరీ చేస్తున్న హత్యల్లో డజను మంది సామాన్యులు, అధీన రేఖకు దగ్గరలోని రాజౌరీ– పూంఛ్ సెక్టార్లో 9 మంది దాకా సైనికులు బలయ్యారు. ఇది చొరబాటుదారులైన పాకిస్తానీ తీవ్రవాదుల పనే అన్నది అంచనా. బీహార్, యూపీల నుంచి వచ్చిన వలస కార్మికులు ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత రెండేళ్ళలో తొలిసారిగా అమిత్‌షా కశ్మీర్లో పర్యటిస్తున్నది అక్కడి పరిస్థితిని కళ్ళారా చూడడానికే అనిపిస్తుంది. షా కన్నా కొన్నాళ్ళ ముందే సాక్షాత్తూ భారత ఆర్మీ ఛీఫ్ జనరల్ ఎం.ఎం. నరవానే సైతం కశ్మీర్ పర్యటించారు. దాన్నిబట్టి విషయ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. శ్రీనగర్‌లో అనేక గంటల ఉన్నతస్థాయి సమావేశంలో భద్రతా వ్యవహారాలను షా సమీక్షించారు. మోదీకి కుడిభుజంగా, అధ్యక్షస్థానంలో లేకున్నా బీజేపీ ఎన్నికల ప్రచారాల చుక్కానిగా, కశ్మీర్‌కు కిరీటం లేని కార్యనిర్వాహకుడిగా పేరున్న షా వస్తున్నారంటే, వెయ్యి మంది యువకులను అరెస్టు చేయాల్సి వచ్చింది. భద్రతకు డ్రోన్ కెమేరాలు, స్నైపర్లు, స్పీడ్‌బోట్లను దింపాల్సి వచ్చింది. నూటికి 70 మంది 35 ఏళ్ళ లోపు వారే ఉన్న కశ్మీర్లో నిరుద్యోగ రేటు ఇప్పటికీ దేశంలోనే అత్యధికం. మరి, ఆ ప్రాంతం అభివృద్ధి పథంలో పయనిస్తోందంటే నమ్మేదెలా? అభివృద్ధి ఫలాల కోసం కర్ఫ్యూలు, ఇంటర్నెట్ అవరోధాలు, మీడియాపై ఆంక్షల లాంటి చేదు మాత్రలను సహించి, భరించాలన్న మంత్రివర్యుల మాటను అర్థం చేసుకొనేదెలా? అఫ్గాన్ తాలిబన్ల వశమైన నేపథ్యంలో కశ్మీర్లో మళ్ళీ హింస పేట్రేగడం గమనార్హం. కాబూల్‌ను కైవసం చేసుకున్న తాలిబన్లు తమకు కశ్మీర్‌ను కట్టబెట్టడంలో సాయపడతారన్న పాకిస్తానీ మంత్రి మాటనూ మర్చిపోలేం. అందుకే, పర్యటన సమయాన్ని పొడిగించుకొని, సోమవారం రాత్రి కూడా అక్కడే గడిపి, కశ్మీర్‌పై సీరియస్‌గా ఉన్నామన్న సంకేతాలిచ్చారు షా. కానీ, కశ్మీర్ భవితవ్యం ఇప్పుడు ఓ విషవలయంలో చిక్కుకుంది. తీవ్రవాదం తగ్గితే కానీ, పునర్విభజన, ఎన్నికలు సాధ్యం కావు. ఎన్నికలు జరిగితేనే కానీ, తీవ్రవాదానికి ముకుతాడు వేయడం కుదిరేలా లేదు. వెరసి, కథ మళ్ళీ మొదటికే వచ్చింది. దాన్ని మార్చాలంటే, ఎంతో చేయాలి. ముందుగా లోయలో భద్రతనూ, నిఘా విభాగాన్నీ పటిష్ఠం చేయాలి. క్షేత్రస్థాయికి దూరంగా శ్రీనగర్ సుందర రాజభవనాల్లోని గవర్నర్ వ్యవస్థ కన్నా ఎన్నికలతో జనం మనసు గెలిచిన ప్రజాపాలకులపై బాధ్యత మోపాలి. పర్యటనలు, మాటలు సరిపోవు. మాటల్లోని సంకల్పం చేతల్లో చూపాలి. ముఖ్యంగా ప్రేమ, కారుణ్యాలతో స్థానికుల మనసును గెలుచుకొని, వారిని తమతో కలుపుకొనిపోతేనే పరిస్థితుల్లో మార్పు సాధ్యం. 370 రద్దు వేళ జరగనిది అదే! లేదంటే, ఎన్నేళ్ళయినా ‘మిషన్ కశ్మీర్’ సశేషమే! -
ఎల్లలు దాటించే కళ
నిత్యం మధుర ఫలాలు తినేవాడికి పులుపు మీద మనసు పుడుతుందట. మనిషి స్వభావాన్ని అత్యంత సన్నిహితంగా చూసినవాడు మాత్రమే చెప్పగలిగే ఈ వాక్యాన్ని కవులకే కవి అయిన కాళిదాసు పదిహేను వందల సంవత్సరాల క్రితం అన్నాడట. ఈ అట ఎందుకంటే, సంస్కృతంలో దీన్ని చదివినవాళ్లు ఎంతమందో మనకు తెలియదు. తక్కువమంది అని మాత్రమే నిశ్చయంగా చెప్పగలం. ఆ కాళిదాసుకు వెయ్యి సంవత్సరాల ముందు, మనిషికి శాంతిలోని సౌఖ్యాన్ని తెలియ జేయడానికి బుద్ధ భగవానుడు చెప్పాడని చెప్పేదంతా పాళీ భాషలో ఉంది. అయినా అదంతా మనకు చేరింది. బైబిల్, ఖురాన్ తమ మూలభాషలైన హీబ్రూ, అరబిక్‌లను దాటుకొని ప్రపంచ మూలమూలలకూ వ్యాపించాయి. ఒక్కమాటలో దీనంతటికీ కారణం: అనువాదం. గ్రీకు సోక్రటీసు మనకు సన్నిహితుడే. పారశీక రూమీ కావాల్సినవాడే. గోర్కీ రష్యాలో రాస్తే ఇక్కడి పల్లెటూళ్లలో సమోవార్ల వెచ్చదనం అనుభవించాం. మావో చైనాలో ఏదో చెబితే మన పక్కనే ఉండి మనకు చెప్పాడనుకుని కార్యరంగంలోకి దూకాం. మపాసా ఫ్రాన్సులో చెప్పినదానికి మన చలం చెప్పేవాటితో పోలికలు వెతికాం. పక్కనే కన్నడ దేశంలో ఉన్న భైరప్ప ఏం రాశాడో; పొరుగున మరాఠా ప్రాంతంలో ఉన్న శరణ్ కుమార్ లింబాలే ఏం చేశాడో అనాయాసంగా తెలుసుకోగలం. బహుశా ప్రపంచంలోని సారస్వతం అంతా అనువాద రూపంలోనే బతికి ఉంది. ఈ ప్రపంచం నిలిచింది, వివేకవంతమైంది అనువాదంతోనే. ఒక భాషలోని రచనను ఇంకో భాషవాళ్లకు తెలియజేయాలని ఒక అనువాదకుడు ఎందుకు ఉవ్విళ్లూరుతాడో దానికి తనవైన కారణాలు ఉండొచ్చు. భావజాల వ్యాప్తి మొదలు తాను అనుభవించిన సంతోషాన్ని ఇంకొకరికి పంచడం దానికి ప్రేరేపకాలు కావొచ్చు. మూల భాషలోంచి లక్ష్య భాషలోకి ఎలా తేవాలో చెప్పడానికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఆ తెచ్చిన దాని పట్ల అన్నే నిరసనలూ ఉన్నాయి. పోయే గింజంతా పోగా మిగిలిన పొల్లు మాత్రమే అనువాదం అని చెప్పేంతగా. పూలనే కాదు, ఆ రాళ్లను ముఖాన కొట్టించుకోవడానికి కూడా అనువాదకుడు సిద్ధపడతాడు. పుష్కిన్ కవిత్వాన్ని అనువదించ లేమంటారు. ఆ కారణంగా ఎవరూ అనువాదానికే పూనుకోకపోతే, ఆ అమృతం తాగలేకపోయిన ఇతర భాషీయులకు సువాసన అయినా పీల్చే అవకాశం ఉండదు కదా. అయితే అనువాదకుల వల్ల కూడా లక్ష్యభాషలు వృద్ధి చెందాయి. కొత్త పదాలు పుట్టాయి. కొత్త వ్యక్తీకరణలు పరిచయం అయ్యాయి. ఒక్క మాటలో రచన ఒక కళ అయితే, అనువాదం దాదాపుగా అంతకు తగ్గని కళ. ఆ స్వీయాభిమానంతోనే, ఈ మధ్య కొందరు అనువాదకులు ‘ట్రాన్స్‌లేటర్స్ ఆన్ ద కవర్’ హ్యాష్‌ట్యాగ్‌తో ఒక ఉద్యమం చేపట్టారు. ప్రచురణ సంస్థలు రచయితల పేర్లను మాత్రమే కవర్ పేజీ మీద వేస్తున్నాయనీ, తమ పేర్లను కూడా గౌరవంగా ముఖపత్రం మీద ముద్రించాలనీ లండన్‌లోని ‘ద సొసైటీ ఆఫ్ ఆథర్స్’ ప్రచారం ప్రారంభించారు. సెప్టెంబర్ 30 నాటి అంతర్జాతీయ అనువాద దినోత్సవం దీనికి ఒక ట్రిగ్గర్‌గా పనికొచ్చింది. దానికి కొనసాగింపుగా చర్చలు జరుగుతున్నాయి. రచయితల సమూహం ప్రచురణకర్తలకు బహిరంగ లేఖ రాశారు. దానికి బలం పెరిగేలా సంతకాల సేకరణ మొదలుపెట్టారు. ఎందరో ప్రసిద్ధ అనువాదకులు సమ్మతి తెలిపారు. పదకొండు వేల మంది సభ్యులున్న అమెరికాకు చెందిన ‘ఆథర్స్ గిల్డ్’ కూడా వీరికి మద్దతుగా నిలిచింది. యాభై లక్షల రూపాయల నగదు కలిగిన ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజును రచయితతో పాటు అనువాదకులకూ 2016 నుంచి సమంగా పంచుతున్నారు. ఇది అనువాద ప్రతిభను గొప్పగా గౌరవించడమే. అయితే, 2018లో ‘ఫ్లైట్స్’ పుస్తకానికి గానూ ఈ పురస్కారం గెలుచుకున్న పోలండ్ రచయిత్రి ఓల్గా తొకార్చుక్ పేరును కవర్ మీద వేశారు గానీ, దాన్ని ఆంగ్లంలోకి అనువదించిన జెన్నిఫర్ క్రాఫ్ట్ పేరును వేయలేదు. పుస్తకం లోపల వేస్తారు; కానీ చూడగానే అనువాదం అని తెలియకుండా అదో చిన్న యుక్తి అనేది కొంత మంది ప్రచురణకర్తల వాదన. అదే సంవత్సరం సాహిత్యంలో అత్యున్నత గౌరవమైన నోబెల్ పురస్కారం కూడా పొందిన తొకార్చుక్ కూడా ముఖపత్రం మీద అనువాదకుల పేరు వేయాలన్న వాదనకు మద్దతునివ్వడం గమనార్హం. భిన్న అనువాదాల్లో వెలువడే అదృష్టం ఉన్న రచయితలు కొంతమంది ఉంటారు. అలాంట ప్పుడు అడిగినా అనువాదకుల పేరు కవర్ మీద వేయడం జరగకపోవచ్చు. కానీ వారి ప్రతిభతో నిమిత్తం లేకపోయినా అనువాదం కావడమే గొప్ప అదృష్టం అయ్యే రచయితలు మరికొందరు ఉంటారు. అలాంటప్పుడు ఆ డిమాండ్ సులువుగానే అంగీకారం పొందుతుంది. అయితే రచయిత, అనువాదకుడు సమానం అవుతారా? కచ్చితంగా కాదని ఆ సంతకాలు పెడుతున్న అనువాదకులు కూడా ఒప్పుకుంటారు. రచయితకూ అనువాదకుడికీ మధ్య ఒక గౌరవప్రదమైన దూరం ఉండాలి. అయితే, కవర్ పేజీ మీద పేరు వేయడం అనేది మరింతమందిని అనువాదంలోకి దిగేలా పురిగొల్పడానికీ, ఏదో భాషలో చీకట్లో ఉండిపోయిన అద్భుతమైన రచనను ప్రపంచానికి తెలియ జెప్పడానికి కావాల్సిన డ్రైవ్ ఇవ్వడానికీ కారణం కాగలదేమో. ‘అనువాదం గనక లేకపోతే, నేను నా దేశ సరిహద్దులకే పరిమితమయ్యేవాణ్ణి’ అన్నాడు స్పానిష్ రచయిత సెర్వాంటెజ్. కదా! అందువల్లే ఆయన ‘డాన్ కిహోటీ’ మనదాకా వచ్చాడు. ప్రపంచ ఎల్లలను చెరపడంలో రచయితల కన్నా అను వాదకుల పాత్రే ఎక్కువనే విషయంలో మాత్రం ఎవరికీ సందేహం లేదు. -
ప్రజాస్వామ్యంపై యుద్ధ ప్రకటన
రాజసభలో ఒక వేడుక. అతిథి రాజులంతా ఉచితాసనాలను అధిష్ఠించారు. అందులో ఒక రాజుగారి తల తెగిపడింది. ఉత్సవంలో రక్తపు మరకలు. ఈ ఘటనకు కారకులెవరు? దోషి ఎవరు?... బూతులు తిట్టిన శిశుపాలుడా? చక్రం తిప్పిన శ్రీకృష్ణుడా? తప్పు శిశుపాలుడిదేననీ, అతడు దండనార్హుడని,యుగయుగాలుగా తరతరాలుగా భారత సమాజం నమ్ముతూ వస్తున్నది. ఇప్పుడా కేసును తిరగదోడాలని తెలుగుదేశం పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తున్నది. ఇందుకోసం ఢిల్లీకి వెళ్లి అప్పీలు చేయ దలచుకున్నట్టు ఆ పార్టీ అధినేత చంద్రబాబు దీక్షానంతర భాషణలో భాగంగా అభిభాషించారు. అనగనగా ఒకరాజు ఉదంతం సందర్భంగా కొద్దినెలల క్రితమే ఈ తర్క మీమాంసకు ఆ పార్టీ తెరతీసింది. ఆయన రాజంటే రాజు కాదు. దొరల యందు పిట్టల దొరలు వేరయా అన్నట్టు రాజుల్లో ఆయన తేడా రాజు. శత్రువుల తరఫున పనిచేసే కోవర్టులు రహస్యంగా ఉంటారు. ఈయన బహిరంగ కోవర్టు. అదీ తేడా. అతడు శల్యుని పరంపర. అఖండ మెజారిటీతో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని బజారు భాషలో తిట్టించడం తెలుగుదేశం పార్టీ ఎత్తుగడల పంథాలో ఒక ముఖ్యమైన అంశం. ఈ కర్తవ్య నిర్వహణకోసం ‘స్పెషల్ పర్పస్ వెహికిల్’గా ‘తేడా రాజు’ను ఆ పార్టీ నియో గించింది. ఒక డజన్ దుర్భాష దండకాల తర్వాత అతడి మీద పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేశారు. తిట్టిన రాజుది తప్పు కాదు, అరెస్ట్ చేసిన పోలీసులదే తప్పని అప్పట్లో తెలుగుదేశం పార్టీ చాలా హడావుడి చేసింది. శిశుపాలోపాఖ్యానంలో కృష్ణుడిని విలన్‌గా ప్రకటించే వరకు నిద్రపోరాదని అప్పుడే చంద్రబాబు వర్గం కంకణం కట్టుకున్నది. తెలుగుదేశం పార్టీ ఎత్తుగడల్లో భాగంగా పట్టాభి అనే ఔత్సాహికుడిని అధికార ప్రతినిధిగా రంగంలోకి దించింది. ‘నా బూతే నా భవిష్యత్తు’ అన్నంత దీక్షతో ఆయన తన కెరీర్‌ను ప్రారంభించాడు. సంస్కృత భాషలో భవభూతి ఎంతటి పండి తుడో బజారు భాషలో ఈ ‘బండబూతి’ కూడా ఇంచుమించు అంతటివాడనే ఖ్యాతికోసం ఆయన తహతహలాడుతున్నాడు. టీడీపీ అవసరాలకు అచ్చుగుద్దినట్టు పట్టాభి కుదురుకున్నాడు. ‘చేపా చేపా ఎందుకు ఎండలేదు? గడ్డిమోపు అడ్డం వచ్చినది’. ఇది పాత కథ. ఆ గడ్డిపోచను పట్టుకొని కథ మూలాల్లోకి వెళితే చేప ఎందుకు ఎండలేదో కారణం తెలుస్తుంది. చీమ పుట్టలో పెట్టిన వేలు విలన్‌గా తేలుతుంది. ఇప్పుడు మన ఎల్లో చేపల్ని కూడా ప్రశ్నించుకుంటూ వెళితే బూతు రహస్యాలను కనిపెట్టవచ్చును. ‘చేపా చేపా బూతులెందుకు మాట్లాడుతు న్నావు?’ ‘ఫ్రస్ట్రేషన్’... ‘ఎందుకు?’... ‘కిక్కు లేదప్పా!’. ‘చేపా చేపా అబద్ధాలెందుకు చెబుతున్నావు?’... ‘డబుల్ ఫ్రస్ట్రేషన్’... ‘ఎందుకు?’ ... ‘కిక్కు లేదప్పా’. ఏమిటా కిక్కు?... అది గంజాయి వనం నుంచే వీచే ధన మారుతం జేబుల్లో ప్రవహిస్తున్నప్పుడు కలిగే పరవశాల కిక్కు. లేటరైట్ ముసుగులో బాక్సైట్‌ను తవ్వుతున్నప్పుడు నట్టింట్లో ధనలక్ష్మి కాలిగజ్జెలు మోగుతున్నట్టు అనుభూతినిచ్చే కిక్కు. వాడవాడనా వెలసిన బెల్టు షాపుల్లో పారిన పేదవాడి నెత్తురు అత్తరు రూపంలో హత్తుకున్నప్పుడు వెలువడే పరిమళాల కిక్కు. వగైరా వగైరాలెన్నో ఉన్నాయి ఈ కిక్కుల్లో. కానీ మొన్న మన ఎల్లో ఫిష్ చేసిన బూతు ప్రవచనంలో గంజాయి, డ్రగ్స్‌ల పలవ రింతే ఎక్కువగా ఉన్నది. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్‌లకు సంబంధించిన వృత్తాంతాన్ని ఒకసారి పరిశీలించడం అవసరం. ‘ఆంధ్రప్రదేశ్ ఈశాన్య ప్రాంతం దేశ గంజాయి రాజధానిగా మారుతున్నది’ అనే శీర్షికతో 2018 సెప్టెంబర్ 2న ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఒక పరిశోధనా కథనాన్ని ప్రచురించింది. అంతకు ముందు సంవత్సరం టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఇటువంటి కథనాన్నే వేసింది. తెలుగు పత్రికల్లో, చానల్స్‌లో పుంఖాను పుంఖాలుగా ఈ వార్తలు వచ్చాయి. చంద్రబాబు ముఖ్య మంత్రిగా పనిచేసిన 2014 – 2019 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి దేశవిదేశాలకు గంజాయి అక్రమ రవాణా పెద్దఎత్తున సాగిందని కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. శ్రీలంకలో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడిన సంఘటనపై ఆ దేశ ప్రభుత్వం విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచే ఆ సరుకు రవాణా అయినట్టుగా విచారణలో వెల్లడైంది. ఆ విషయాన్ని శ్రీలంక ప్రభుత్వం కేంద్రానికి చేరవేసింది. కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వాన్ని అప్రమత్తం చేసింది. అప్పుడే కాదు మరో రెండు మూడు సందర్భాల్లో కూడా కేంద్రం గంజాయి రవాణాపై బాబు ప్రభు త్వాన్ని హెచ్చరించింది. అయినా రాష్ట్రం పెడచెవిన పెట్టింది. అంతేకాదు, గంజాయి అక్రమ రవాణాకు కొమ్ము కాసింది. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా చేసిన అప్పటి నర్సీ పట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడుపై మొదటి నుంచి అనేక ఆరోపణలున్నాయి. గంజాయి స్మగ్లింగ్ కింగ్ అయ్యన్నేనని ఆయన మంత్రివర్గ సహచరుడు గంటా శ్రీనివాసరావు బహి రంగంగా చెప్పిన వైనం అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లోని అటవీ, కొండ ప్రాంతాల్లో కొన్ని దశాబ్దా లుగా మావోయిస్టులకు గట్టిగా పట్టుంది. వారి భౌగోళిక విభ జనలో ఈ ప్రాంతానికి ఏవోబీ (ఆంధ్రా ఒడిశా బోర్డర్)గా నామకరణం చేసుకున్నారు. వారికి కూడా ఆదాయ వనరుగా మారడంతో పెద్దఎత్తున ఇక్కడ గంజాయి సాగుకు అండగా నిలబడ్డారు. మావోయిస్టు ప్రాంతం కావడంతో రెండు రాష్ట్రాల అధికారులు కూడా ఈ సాగును ఏమీ చేయలేక పోయారు. మావోయిస్టుల వేటకు వెళ్లే కూంబింగ్ పార్టీలు కూడా గంజాయి వనాల జోలికి వెళ్లేవి కావు. అలా చేస్తే గిరిజనులు మావోయిస్టులకు మరింత దగ్గరవుతారని వారి భయం. ఇక్కడ విస్తారంగా పండించిన పంటను దేశవిదేశాలకు తరలించడానికి ఉన్నది ఒకటే దారి. ఏవోబీ నుంచి నర్సీపట్నం, రంపచోడవరం, జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్. అక్కడినుంచి అన్నివైపులకు పంపిణీ. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ రవాణా కార్యక్రమం సాఫీగా సాగి పోయేది. ‘నర్సీపట్నం – ఫార్టీ పర్సెంట్’ అనే అనధికార ఒడంబ డిక ఇందుకు కారణమని స్థానికులు చెబుతారు. ఏవోబీ నుంచి మొదటి ఎగ్జిట్ పాయింట్ (నర్సీపట్నం) దగ్గర అక్కడ వుండే వీఐపీకి సరుకులో 40 శాతం విలువచేసే సొమ్ము చెల్లిస్తే హాయిగా చేరవచ్చు. ఈ ఫార్టీ పర్సెంట్‌లో ఏ స్థాయి వరకు ఎంత శాతం చేరుకునేదో ఆ వీఐపీలకు మాత్రమే ఎరుక. నామ్‌కే వాస్తే కొన్ని కేసులను మాత్రం నమోదు చేసేవారు. ఆ కేసుల్లో పురో గతి ఏమీ ఉండదు. అప్పుడప్పుడూ కొంత సరుకు సీజ్ చేసినట్టు చూపేవారు. గంజాయి స్మగ్లింగ్, మద్యం దొంగరవాణా, డ్రగ్స్ తదితర వ్యవహారాలపై వైఎస్ జగన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ కర్తవ్య సాధనకోసం ప్రత్యేకంగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో’ (ఎస్ఈబీ)ని ఏర్పాటు చేసింది. మెరికల్లాంటి సిబ్బం దిని ఈ బృందంలో నియమించింది. స్వయంగా సీఎం ఈ బృందం పని తీరును సమీక్షిస్తున్నారు. అనతికాలంలోనే ఎస్ఈబీ అద్భుతమైన పని తీరును కనబరిచింది. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంతో పాటు, రవాణా మార్గం అంతటా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, ఇన్ఫార్మర్ల వ్యవస్థను నిర్మించుకున్నది. దాడులు, తనిఖీలను పెంచింది. ఫలితంగా కేసుల సంఖ్యలో కూడా వృద్ధి కనిపించింది. కేసులు పెరిగినా ఫరవాలేదు, కానీ ఈ దుర్వా్యపారాన్ని మాత్రం అరికట్టాలని ముఖ్యమంత్రి ఆదే శాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు గంజాయి కథలో దోషి చంద్రబాబు ప్రభుత్వం. ఆ పాపాన్ని కడిగేస్తున్నది వైఎస్ జగన్ ప్రభుత్వం. కానీ ఇక్కడ దొంగే అందరికంటే ముందుగా ‘దొంగా దొంగా’ అని అరుస్తున్నాడు. చంద్రబాబు నేతృత్వం లోని తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను చూస్తున్నవారికి ఇదే మంత పెద్ద ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. డ్రగ్స్ వ్యవహారం లోనూ అదే తంతు. గుజరాత్లో పట్టుబడిన డ్రగ్స్ రాకెట్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఒక అడ్రస్ కనిపించిందట. అది దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ఇచ్చిన ఉత్తుత్తి అడ్రస్‌గా అధికారులు తేల్చారు. ఈ డ్రగ్స్ రాకెట్‌తో ఆంధ్రప్రదేశ్‌కు ఏరకమైన సంబంధమూ లేదని సాక్షాత్తు కేంద్ర హోంశాఖ అధికారిక ప్రకటన చేసింది. కానీ మన తెలుగుదేశం పరివారానికి ఇవేమీ తలకెక్కవు. గంజాయి రవాణాపై కేంద్రం నిజంగా హెచ్చ రించినప్పుడు మౌనం పాటించిన ఈ పరివారం, ఇప్పుడు కేంద్రం అసత్యమని ఖండించిన అంశాన్ని మాత్రం నిజమే అన్నట్టుగా చాటింపు వేయిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండడం వలన తెలుగుదేశం పరివారానికి మూసుకుపోయిన దొంగ వ్యాపారాల దారుల్లో గంజాయి అక్రమ రవాణా ఒకటి. మాదక ద్రవ్యాలకు బానిసలైనవారు అవి అందనప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తారు. పిచ్చిగా మాట్లాడతారు. అటువంటి లక్షణాలు ఇప్పుడు ఎల్లో పరివార్‌లో కనిపిస్తున్నాయి. ఆరునూరైనా, నూరు ఆరైనా∙సరే, ఎంత ఖర్చయినా సరే ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలనే సంక ల్పాన్ని తెలుగుదేశం తీసుకున్నట్టు పరిణామాలను బట్టి అర్థమ వుతున్నది. రాజు భాష, పాత్రుడు భాష, పట్టాభి భాష – ఇందుకు సాక్ష్యాలు. పాలక పక్షాన్ని కవ్వించాలి. వారు రెచ్చి పోవాలి. తెలుగుదేశం వారిపై దాడులు చేయాలి. రాష్ట్రంలో రాజ్యాంగం అమలుకావడం లేదంటూ గగ్గోలుపెట్టాలి. ప్రభు త్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టించాలి. తెలుగుదేశం పరివారంలోని అన్ని విభాగాల లైన్ ప్రస్తుతానికి ఇదే. పట్టాభి బూతులు, చంద్రబాబు దీక్ష, దీక్ష ముగింపు సందర్భంగా జరిగిన సభ – ఈ వ్యూహానికి అద్దం పట్టాయి. డెబ్బయ్ రెండేళ్ల వృద్ధుడు, మధుమేహ పీడితుడైన వ్యక్తి 36 గంటలపాటు నిరాహారంగా వుండి కూడా గంటన్నర పాటు ఆవే శంతో ఊగిపోతూ ఎలా మాట్లాడగలిగారని వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఆయనే ప్రశ్నలు వేస్తారు, ఆయన్నెవరూ ప్రశ్నించకూడదు, సందేహించ కూడదు అనే నియమం కొన్ని దశాబ్దాలుగా అమల్లో వుంది. కనుక సజ్జల ప్రశ్నకు సమాధానం దొరికే ఛాన్స్ లేదు. ఈ సభలో చినబాబు వీరంగం చూసి తరించవలసినదే. పనిలో పనిగా మంగళగిరి లోని ఒక మండలంలో తాను ఐదుగురు ఎంపీ టీసీలను గెలిపించిన విషయాన్ని చినబాబు చాటుకున్నారు. అదే ఊపులో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మంగళగిరి సీటును గెలిచి మీకు కానుకగా అర్పిస్తానని తండ్రిగారికి హామీ ఇచ్చారు. ఈ వీరాలాపన వింటుంటే భలే ముచ్చటేసింది. ఇదే సభలో ఒక నాయకురాలు నాగమ్మ మాట్లాడుతూ ‘మీరు ఒక రెండు నిమిషాలు మాకు అనుమతివ్వండి. ఏం చేస్తామో చూపిస్తామ’ని సవాల్ విసిరారు. ‘టైమ్ మీరు చెబుతారా, నన్ను చెప్పమం టారా?, ప్లేస్ మీరు చెబుతారా, నన్ను చెప్పమంటారా? కొట్టుకో వడానికి మేం రెడీ’ అని కేశినేని నాని సవాల్ విసిరారు. నాని విసిరిన సవాల్ పార్టీలోని తన వ్యతిరేకులకా, వైసీపీ వారికా అనేది అర్థంకాక సభికులు అయోమయానికి గురయ్యారు. చివరగా మాట్లాడిన చంద్రబాబు ఈ రాజ్యాంగ వ్యవస్థ మీద దాదాపు యుద్ధ ప్రకటనే చేశారు. తన నలభై మూడేళ్ల రాజకీయ అనుభవాన్ని కూడా ఆయన పక్కన పెట్టేశారు. స్థానిక ఎన్నికలపై విషాన్ని వెళ్లగక్కారు. ‘థూ... ఇవి ఎన్నికలా’ అని ఈసడించుకున్నారు. తన జేబులోని మనిషి ఎన్నికల కమిష నర్గా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల ఫలితాలే ఆ తర్వాత కూడా పునరావృతమయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించే ఇంగితాన్ని కూడా ఆయన కోల్పోయారు. ముందుగా మాట్లాడిన తన వారసుడు తాను ఐదు ఎంపీటీసీలను గెలిపించిన విషయాన్ని చెప్పుకుంటుంటే ఆనందించిన వ్యక్తి, ఈ విధంగా మాట్లాడట మేమిటి? ఎన్నికల్లో తాను గెలవలేననే నిర్ధారణకు వచ్చారా? గెలవకపోయినా గద్దె కావాలని తహతహలాడుతున్నారా? అందుకోసమే వీధి పోరాటాలకు సిద్ధమవుతున్నారా? చివర్లో ‘కార్యకర్తలారా! మీరు పోరాడండి’ అని పిలుపునిచ్చింది అందు కేనా? కేసులు వస్తే నేను చూసుకుంటానని చెప్పడంలోని అర్థమేమిటి? తాను న్యాయవ్యవస్థను మేనేజ్ చేయగలడని కార్యకర్తలు అనుకోవాలా? ఇది న్యాయ వ్యవస్థను అవమా నించడం కాదా? ఎన్నికలను తూర్పారబట్టి తిట్లకూ, ఘర్షణ లకూ వీరతాళ్లు వేయడం దేనికి సంకేతం? రాజ్యాంగ వ్యవస్థ లను అవహేళన చేస్తున్నారా? ఇటువంటి మనోవికారంతో బయల్దేరి రాష్ట్రపతికీ, కేంద్ర పెద్దలకు ఏమని విజ్ఞప్తి చేస్తారు? వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని మీరు రద్దుచేయక పోతే వీధి పోరాటాల ద్వారా నేనే రద్దు చేయిస్తానని చెబుతారా? ఈ వైఖరి రాజ్యాంగ వ్యవస్థలపై యుద్ధ ప్రకటన కాదా? ఆ ప్రభుత్వాన్ని అత్యవసరంగా తప్పించవలసినంత భయంకరమైన ఒత్తిడి ఆయన మీద ఏమైనా ఉన్నదా? గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా రాకెట్ అంతా అంతర్జాతీయ మాఫియా ముఠాల కనుసన్నల్లో జరుగుతుంది. చంద్రబాబు హయాంలో సాఫీగా సాగిన గంజాయి కదలికలు ఇప్పుడు కష్టసాధ్యంగా పరిణ మించాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం హయాంలో జరిగిన అక్రమ రవాణాపై కేంద్రం దర్యాప్తు జరిపితే చాలా సందేహాలకు సమాధానాలు లభిస్తాయి. -వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
వేడి పెంచే లాబీ క్రీ(నీ)డలా?
వాతావరణ మార్పులకు కారణమౌతున్న భూతాపోన్నతి నియంత్రించే లక్ష్యసాధనలో బాధ్యత కలిగిన దేశాలు వెనుకంజలో ఉన్నాయి. ముఖ్యంగా పెట్రోలియం, బొగ్గు, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాల వినియోగం నుంచి సౌర, పవన విద్యుత్తు వంటి పునర్వినియోగ ఇంధనాల (ఆర్ఈ) వైపు మళ్లే మార్పు లక్ష్యించిన స్థాయిలో లేదు. పైగా శిలాజ ఇంధన ఉత్పత్తి–వినియోగం పెరిగి, పరిస్థితి విషమిస్తోంది. మూన్నాలుగు రోజులుగా శిలాజ ఇంధన ఉత్పత్తిపై భారత్‌లో జరుగుతున్న పరిణామాలూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఇంధనాల వల్లే కర్భన ఉద్గారాలు పెరిగి, భూమి అసాధారణంగా వేడెక్కుతోంది. శతాబ్ది అంతానికి 2 డిగ్రీల సెల్సియస్‌ను మించి భూతాపోన్నతి పెరక్కుండా నిలువరించటంలో వీటి నియంత్రణే కీలకం. 2030 నాటికి 1.5 డిగ్రీల మించి పెరుగనీయవద్దన్నది లక్ష్యం. ఇప్పటికే 1.1 డిగ్రీల పెరిగింది. ఈ విషయంలో ‘పారిస్ ఒప్పంద’ లక్ష్యాలే ఫలితమిచ్చేలా లేవని, వాటిని సవరించి మరింత కటువుగా కొత్త లక్ష్యాలు ఏర్పరచుకోవాల్సిన అవసరముందని వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి నియమించిన ‘అంతర్ ప్రభుత్వాల వేదిక’ (ఐపీసీసీ) నివేదించింది. వాస్తవంలో, గడువు లోపల పాత లక్ష్యాలు సాధించడం కూడా ఇపుడు దుస్సాధ్యంగా కనిపిస్తోంది. ‘దేశీయంగా ఖరారైన మా కట్టుబాట్లివి’ (ఎన్డీసీ) అని, ఎవరికి వారిచ్చిన హామీలు సాధించే శ్రద్ద కూడా ఆయా ముఖ్య దేశాల్లో లోపించింది! ఒప్పందం ప్రకారం జరగాల్సిన కార్యప్రణాళిక రచనలో, వేగంగా అమలు పరచడంలో భారత్‌తో పాటు శిలాజ ఇంధనాల ఉత్పత్తి–వినియోగం అధికంగా ఉన్న దేశాలు విఫలమైనట్టు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమపు(యుఎన్ఈపీ) తాజా నివేదిక చెప్పింది. కీలకాంశాలు బయటకొచ్చిన తర్వాత గురు వారం అధికారికంగానే వెల్లడైన నివేదిక విషయాలు పర్యావరణ హితైషులకు ఆందోళన కలిగి స్తున్నాయి. 75 శాతం ప్రపంచ శిలాజ ఇంధనాల్ని ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, జర్మనీ, భారత్, ఇండొనేషియా, ఖజకిస్తాన్, మెక్సికో, నార్వే, రష్యా, సౌధీ అరేబియా, యుఏఈ, యుకె, అమెరికాలే ఉత్పత్తి చేస్తాయి. ‘హామీ ఇచ్చినట్టు తగ్గించక పోగా... వారి ఇంధన–ఉత్పత్తి ప్రణాళికల సరళి చూస్తుంటే... 2030 నాటికి 110 శాతం, 2040 నాటికి 190 శాతం అధికంగా శిలాజ ఇంధ నాల్ని ఉత్పత్తి చేసే పరిస్థితిని అంచనా వేస్తున్నాం’ అని నివేదిక చెప్పింది. భాగస్వాముల సదస్సు (కాప్–26) వచ్చే వారమే గ్లాస్గో (స్కాట్లాండ్)లో మొదలుకానున్న తరుణంలో ఇది చికాకు కలిగించేదే! భారత్‌లో పరిణామాలూ ఏమంత బాగోలేవు! ఇటీవలి బొగ్గు సంక్షోభం, విద్యుత్తు ఇతర పారిశ్రామిక అవసరాలకు బొగ్గు పెంచుకునే చర్యలు–సన్నాహాల్ని చూస్తూనే ఉన్నాం. ‘ఆత్మనిర్బర్ భారత్’లో భాగంగా బొగ్గు తవ్వకాల్ని పెంచే మౌలిక సదుపాయాల కోసం కేంద్రం యాబై వేల కోట్లు వెచ్చించనుంది. 2019–2024 మధ్య బొగ్గు ఉత్పత్తిని సుమారు 60 శాతం (730 నుంచి 1,149 టన్నులకు) పెంచే ప్రణాళికలు అమలవుతున్నాయి. భూసేకరణ అవాంతరాల్ని తొలగించే వ్యూహమూ ఇందులో భాగమే! ఇదే కాలానికి.. చమురు, సహజవాయు ఉత్పత్తి 40 శాతం పెంచా లన్నది లక్ష్యమట. లైసెన్సుల సరళీకరణ, గుర్తించిన వనరు నిక్షేపాలను సంపదగా మార్చడం, సహజవాయు రవాణా సంస్కరణల ద్వారా భారీ లక్ష్యాలు సాధించాలని యోచన! ఉత్పత్తి మౌలిక రంగంలోనో, పన్ను రాయితీల్లోనో పన్నెండు వేల కోట్లు వెచ్చించాలన్నది నిర్ణయం. పెట్రో ఉత్పత్తి పెంచి, ధరల్ని హేతుబద్దం చేయాలని ‘పెట్రో ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్)’ను భారత్ కోరింది. మరోవైపు ప్రపంచ చమురు కంపెనీల సీఈవోలతో మన ప్రధాని మోదీ సమావేశమై... దేశీయంగా చమురు, సహజవాయు ఉత్పత్తిని గణనీయంగా పెంచే ప్రణాళికలివ్వాలని కోరారు. చమురు దిగుమతుల భారం, విదేశీమారకం తరుగుదల తమకు కష్టంగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. మన చమురు అవసరాల్లో 85 శాతం, సహజవాయు అవసరాల్లో 55 శాతం దిగుమతే! కనుక దేశీయ ఉత్పత్తిపై దృష్టి. ఈ పరిణామాలన్నీ శిలాజ ఇంధన ఉత్పత్తి–వినియోగాన్ని పెంచేవే! కానీ, పారిస్‌లో మన నిర్దిష్ట హామీ (ఎన్డీసీ) ఏమిటి? 2005 బెంచి మార్కుగా, 2030 నాటికి 33–35 శాతం ఉద్గారాలను, ఆ మేర శిలాజ ఇంధన వాడకాన్నీ తగ్గిస్తామని ఒప్పందంపై సంతకం చేశాం. ప్రధాని మోదీ స్వయంగా హాజరవుతున్న కాప్–26 వేదిక నుంచి రేపేమని సమాధానమిస్తారు? మొన్న కేరళ, నిన్న ఉత్తరాఖండ్, నేడు సిక్కిం.... ఇలా అసాధారణ వర్షాల వల్ల భారీగా ప్రాణ– సంపద నష్టాల అరిష్టాలు కళ్లజూస్తూ కూడా ప్రభుత్వాలు నిద్రవీడటం లేదు. పెరిగే చమురు ధరలకు తోడు, మోయలేని కేంద్ర–రాష్ట్ర పన్ను భారంతో పౌరులు కుంగిపోతున్నారు. కార్పొరేట్ లాబీలు బలంగా పనిచేస్తున్నందునే పునర్వినియోగ ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు వాడకంలోకి రావట్లేద నేది విమర్శ. కాప్–26 సదస్సుకు రోజుల ముందు ఐపీసీసీ, యుఎన్ఈపీ వంటి నివేదికల్లోని కీలక సమాచారం బయటకు రావడంపైనా అనుమానాలున్నాయి. ఇంధనాల వినియోగ మార్పు లక్ష్య సాధన వాయిదా కోసం, ఉద్గార నియంత్రణ కాఠిన్యాల్లో సడలింపు కోసం ఒక బలమైన లాబీ యూఎన్‌పై ఒత్తిడి తెస్తున్నట్టు పర్యావరణవేత్తలు, కార్యకర్తలు అనుమానిస్తున్నారు. ఇంతటి విప త్కర పరిస్థితుల్లోనూ కార్పొరేట్లకు ఎర్ర తివాచీలు పరిస్తే, వారి లాబీయింగ్ ఒత్తిళ్లకు లొంగితే... ఆ పాపానికి నిష్కృతి లేదు, మన ప్రజాస్వామ్యానికి మనుగడ లేదు, ఈ పృథ్వికిక రక్షణ లేదు! -
ఇది ప్రకృతి పొలికేక
ప్రకృతి కోపిస్తోంది. ఆకాశానికి హఠాత్తుగా చిల్లులు పడ్డాయనిపిస్తోంది. నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వంతెనలు విరిగిపడుతున్నాయి. ఆనకట్టలు గేట్లెత్తేస్తున్నాయి. అపారమైన ఆస్తి, ప్రాణనష్టం. కొద్ది రోజులుగా భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాఖండ్, కేరళల్లో పరిస్థితి ఇదే! అనేక ఆలయాలు, తీర్థయాత్రా స్థలాలతో ‘దేవభూమి’గా పేరుపడ్డది– ఉత్తరాఖండ్. నిత్యం పర్యాటకులతో ‘దేవతల సొంత గడ్డ’గా పేరొందింది–కేరళ. రెండు రాష్ట్రాల్లో తాజా ఉత్పాతాలు చూస్తుంటే దేవతగా కొలుచుకొనే ప్రకృతి మళ్ళీ మళ్ళీ ఏదో చెప్పదలుచుకుందని అనిపిస్తోంది. అభివృద్ధి పేరిట సహజ నీటి ప్రవాహానికి అడ్డుగా నిర్మాణాలు, కర్బన ఉద్గారాలతో పర్యావరణ హాని, ఫలితంగా అనూహ్య వాతావరణ మార్పులు– అన్నీ మన తప్పును ఎత్తిచూపుతున్నాయి. చార్ధామ్, శబరిమల యాత్రలకు బ్రేకులేస్తూ, హెచ్చరిస్తున్నాయి. మానవాళి పాపానికి ప్రకృతి శాపం అనిపిస్తున్నాయి. వర్షాకాలం దాదాపు ముగిసినా, అనేక ప్రాంతాలను ఇప్పటికీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాతావరణం మారిపోతోంది. గత నెలాఖరుకే వెళ్ళిపోవాల్సిన నైరుతి ఋతుపవనాలు ఇంకా ఉన్నాయి. ఈ నెల మొదటే రావాల్సిన ఈశాన్య ఋతుపవనాలు ఇంకా రానేలేదు. ఆకస్మిక వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీ, కేరళ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్‌లలో ఇటీవల దంచికొట్టిన వర్షాలే అందుకు ఉదాహరణ. అక్టోబర్ 18న 24 గంటల్లో అనేక దశాబ్దాలుగా ఎన్నడూ లేనంత (87.9 మి.మీ) వర్షం ఢిల్లీలో కురవడం గమనార్హం. 1956 తర్వాత (అప్పట్లో 111 మి.మీ) ఢిల్లీలో ఒక్క రోజులో ఇంత వర్షం ఇదే ప్రథమం. ఒడిశాలోని బాలాసోర్, తమిళనాట కోయంబత్తూరుల్లోనూ ఈ వారం ఇలాంటి పరిస్థితే. సాధారణంగా మన దేశంలో పడమటి కనుమలు, ఈశాన్య, మధ్య భారతావనిలో అధికంగా వర్షాలు కురుస్తాయి. కానీ కొన్నేళ్ళుగా అతి తక్కువ సమయంలో అధిక వర్షపాతం, ఆకస్మిక భారీ వర్షాలు తరచూ సంభవిస్తున్నాయి. కేరళ సహా అనేక రాష్ట్రాల్లో వర్షాలు పడే తీరు మారింది. ఇది ఆలోచించాల్సిన విషయం. ఈ నెల 12 నుంచి ముంచెత్తుతున్న వాన, మెరుపు వరదల్లో కేరళలో 42 మంది, పర్వతప్రాంత ఉత్తరాఖండ్‌లో 52 మంది బలయ్యారు. కోట్లలో ఆస్తి నష్టం. సాధారణంగా అక్టోబర్ 1 – 19 మధ్య కేరళలో 192.7 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుంది. ఈశాన్య ఋతుపవనాల కాలమైన అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అంతా కలిపినా సగటున 491.6 మి.మీ. వర్షమే కురవడం ఆనవాయితీ. కానీ, ఈసారి కేవలం ఈ 19 రోజుల్లోనే 453.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. అంటే, మామూలు కన్నా 135 శాతం ఎక్కువ వర్షం కురిసిందన్న మాట. మూడు నెలల సీజన్ మొత్తంలో కురవాల్సినదానిలో 90 శాతం ఈ కొద్దిరోజుల్లో ఇప్పటికే కురిసేసింది. దీన్నిబట్టి వర్ష తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఈ కుండపోత ఇంతటితో ఆగేలా లేదు. రాగల రోజుల్లో పడమటి కనుమల్లో, తూర్పు కొండల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పవట. కేరళలోని మొత్తం 14 జిల్లాలకు గాను 11 జిల్లాలకు ఎల్లో ఎలర్ట్ ఇచ్చారు. ప్రభుత్వం అప్రమత్తమై, కొండ చరియలు విరిగిపడే ప్రమాదమున్న తూర్పు కొండల్లో జనావాసాలను ఖాళీ చేయిస్తోంది. ఈ శతాబ్దంలో ఎన్నడూ లేనంతటి వరదతో 2018లో కేరళలో కనీసం 400 మంది చనిపోయారు. పది లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అది ఇప్పటికీ మర్చిపోలేని విషాదం. వర్షజల ప్రవాహానికి 44 నదులున్నా, 2019లోనూ వరదలొచ్చిన చరిత్ర ఆ రాష్ట్రానిది. ఇక, ఈ జూలైలోనే ఉత్తరాదినీ, పశ్చిమ భారత తీరప్రాంతాలనూ వరదలు వణికించాయి. తరచూ ముంచెత్తుతున్న వరదలను సమర్థంగా ఎదుర్కోవడంలో సొంత వైఫల్యాలు వెక్కిరిస్తున్నాయి. నదీ పరివాహకాల్లో, పర్వతప్రాంతాల్లో నివాసం కేరళ, ఉత్తరాఖండ్ లాంటి చోట్ల ఎక్కువ. కేరళ ‘రూమ్ ఫర్ రివర్’ప్రాజెక్టును ఎప్పుడో ప్రకటించింది. వరద ముప్పున్న ప్రాంతాల్లోని ప్రజలకు రక్షణ కల్పిస్తూ, వరద నీటిని నిర్వహించే ఈ తరహా ప్రాజెక్టును నెదర్లాండ్స్ అమలు చేస్తోంది. 2019 మేలో ఆ దేశాన్ని సందర్శించిన కేరళ సీఎం అదే ఫక్కీలో చర్యలు చేపడతామన్నారు. ఆ ప్రాజెక్టునూ, ‘రీబిల్డ్ కేరళ’నూ అమలు చేయడంలో సర్కారు విఫలమైందని ప్రతిపక్షాల ఆరోపణ. వర్షాలు, వరదలు దేశానికి కొత్త కాదు. కానీ, ఇంత తరచుగా రావడం వెనుక మానవ తప్పిదాలు అనేకం. హిమాలయాల నుంచి పడమటి కనుమల దాకా ప్రభుత్వాల అభివృద్ధి నమూనాలే అసలు సమస్య. పర్యావరణ సంక్షోభంపై శాస్త్రీయసాక్ష్యాలను పట్టించుకోవడం లేదు. ప్రకృతికి హానికరంగా కొండలు, గుట్టల తవ్వకాలు, అడవుల నరికివేత, ఇష్టారాజ్యంగా రోడ్లు, జలవిద్యుత్కేంద్రాలు సహా అనేక నిర్మాణాలు పాలకుల తప్పులే. పడమటి కనుమల పరిరక్షణకు 2011లో మాధవ్ గాడ్గిల్ నివేదిక చేసిన సూచనల్ని పక్కన పడేశారు. గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా, తమిళనాడుల మీదుగా లక్షా 30 వేల చదరపు కి.మీ.ల ప్రాంతాన్ని సున్నితమైన పర్యావరణ ప్రాంతంగా ప్రకటించాలని గాడ్గిల్ సిఫార్సు చేశారు. ఆరు రాష్ట్రాల్లో ఏ ఒక్కటీ ఒప్పుకోలేదు. తర్వాత 2013లో కె. కస్తూరి రంగన్ మునుపటి సిఫార్సుల తీవ్రతను తగ్గించి ఇచ్చిన సూచనలకూ అదే గతి. పర్యావరణ ఉత్పాతాలను నివారించాలంటే కొన్ని నిర్బంధాలు తప్పవని ప్రజలను చైతన్యపరచ లేదు. తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం జనం డిమాండ్లకు తలొగ్గారు. కేరళ లాంటి రాష్ట్రాలు దానికి ఇప్పుడు చెల్లిస్తున్న భారీ మూల్యమే ప్రస్తుత దుఃస్థితి. దేశంలో తాజా వరద బీభత్సం మరోసారి ప్రకృతి పెట్టిన పొలికేక. ఇప్పటికైనా పెనునిద్దర వదలకపోతే మనకే నష్టం! -
మైనారిటీలపై మత విద్వేషాగ్ని
అనవసరంగా మతాన్ని లాగి, మనుషుల్ని రెచ్చగొడితే ఏమవుతుంది? బంగ్లాదేశ్‌లో అల్పసంఖ్యా కులపై జరుగుతున్న హింసాకాండలా ఉంటుంది. పవిత్ర ఇస్లామ్ మతగ్రంథాన్ని మరో మతం దేవుడి పాదాల వద్ద దుర్గాపూజ పందిళ్ళలో పెట్టారనే పుకారు ఆ దేశంలో ఆరని చిచ్చు రేపింది. వారం క్రితం అక్టోబర్ 13న ఈ పుకార్లతో బంగ్లాదేశ్‌లోని కుమిల్లా జిల్లాలో మతఘర్షణలు మొదలయ్యాయి. వంగభూమిలో దుర్గాపూజ వేళ ఈ ఘర్షణలు అనేక జిల్లాలకు, రాజధాని ఢాకాకూ పాకాయి. పదికి పైగా ఆలయాలు, 50కి పైగా విగ్రహాలు, అల్పసంఖ్యాకులకు చెందిన వందలాది ఇళ్ళు, దుకాణాలు విధ్వంసానికి, లూఠీకి గురయ్యాయి. పోలీసులు సహా పదుల మంది గాయపడ్డారు. పలువురు మరణించారు. సోషల్ మీడియా గాలివార్త ఇంతటి అనర్థం తేవడం అత్యంత విషాదం. ప్రాంతాలు, దేశాలకు అతీతంగా దక్షిణాసియాలో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సహా అనేకచోట్ల అల్పసంఖ్యాక వర్గాలే లక్ష్యంగా పెరుగుతున్న హింస, విధ్వంసాలకు ఇది తాజా తార్కాణం. ఐక్యరాజ్యసమితి (ఐరాస), ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సహా అంతర్జాతీయ వేదికలు బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులను ఖండించాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హిందువులపై దాడులకు పాల్పడినవారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలంటూ ఆ దేశ హోమ్ మంత్రిని తాజాగా ఆదేశించారు. గడచిన గురువారమే ఆమె తొలి ప్రకటన చేస్తూ, కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఆమె హెచ్చరించినా, హింసను అరికట్టడానికి బలగాలను దింపినా సరే, బంగ్లాలో పరిస్థితులు అదుపులోకి రాకపోగా, విధ్వంసం మరిన్ని ప్రాంతాలకు విస్తరించడం విడ్డూరం. కార్యక్షేత్రంలో పోలీసులు తగినంతలేరనీ, సమర్థంగా పనిచేయలేదనీ, నేతలు చూసీచూడనట్టున్నారనీ వార్త. అసలీ విధ్వంసం మునుపెన్నడో పథకం వేసుకొని, బెంగాలీ హిందువుల పెద్ద పండుగ దసరా వేళ చేశారనీ కథనం. ఇదే సందుగా ‘బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యతా మండలి’ అనే ప్రముఖ సంస్థ తాలూకు వాళ్ళమని నమ్మేలా చేస్తూ, అజ్ఞాత వ్యక్తులు రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారు. ‘బంగ్లాదేశ్ హిందూ యూనిటీ కౌన్సిల్’ అనే దొంగపేరుతో, అనేక పాత దాడుల ఫోటోలు, వీడియోలను కొత్తవిగా ప్రచారం చేస్తున్నారు. సందట్లో సడేమియాగా దీన్ని అందిపుచ్చుకొని, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు ఈ హింసాకాండను అస్త్రంగా వాడుకోవాలని హిందూత్వపార్టీలు ప్రయత్నిస్తుండడం శోచనీయం. బంగ్లాదేశ్‌లోని షేక్ హసీనా ప్రభుత్వం సైతం మతాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మత ఛాందసవాదాన్ని నూరిపోస్తున్న మదరసాల పుణ్యమా అని ఆ దేశం ఇప్పుడు ‘జిహాదిస్తాన్’గా మారిపోయిందని రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆరోపించారు. పాకిస్తాన్ అనుకూల తీవ్రవాద సంస్థ ‘జమాతే ఇస్లామీ’ ఈ దాడుల వెనుక ఉందని వినిపిస్తోంది. ఖలీదా జియా సారథ్యంలోని ‘బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ’ సంకీర్ణ ప్రభుత్వంలో 2001 –06 మధ్య ఆ సంస్థ కూడా భాగం. దేశంలో కనీసం 10 శాతం మందిపై పట్టున్న ఈ బృందం అధికారంలోకి రాలేకున్నా, హింసనైతే ప్రేరేపించగలదు. జమాత్‌కు కళ్ళెం వేయడం కోసం షేక్ హసీనా ప్రభుత్వం మరో ఇస్లామిస్టు బృందం ‘హెఫాజతే ఇస్లామ్’ (హిమ్)తో దోస్తీ కట్టింది. దాని ఒత్తిడి మేరకే 2017లో సుప్రీంకోర్టులో న్యాయదేవత విగ్రహం తొలగించారు. మదరసా డిగ్రీని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీగా గుర్తించాల్సి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో భారత ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటన వేళ నిరసనలు, హిందువులపై హింసాకాండకూ ‘హిమ్’ కారణమట. హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ సర్కార్ తప్పు తెలుసుకొనేసరికే ఆలస్యమైంది. వెరసి, మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకొనే వికృత రాజకీయక్రీడ భారత్ నుంచి బంగ్లాదేశ్ దాకా అనేకచోట్లకు పాకింది. జమ్మూ కశ్మీర్లో తీవ్రవాదుల తూటాలకు హిందువులు, సిక్కులు... అఫ్గాన్‌లో మసీదులపై దాడులతో పదుల కొద్దీ షియాలు... బంగ్లాదేశ్ ఘర్షణల్లో హిందువులు! సమయం, సందర్భం, కారణం, కారకులు వేరైనా–ప్రతీచోటా అల్పసంఖ్యాక మతస్థులే లక్ష్యం. దక్షిణాసియాలో మైనారిటీలు అభద్రతలో మునిగిపోయారు. ఉపఖండంలోని ప్రతి దేశం ఇప్పుడొక మతావేశ భూమిగా మారుతోంది. కాశ్మీర్‌లోనూ, బంగ్లాదేశ్‌లోనూ ఛాందసవాద బృందాలకు మద్దతుగా నిలిచి, మతం ఆసరాగా విద్వేషాన్ని రగిలించాలన్న పాకిస్తాన్ ప్రయత్నం జగద్విదితం. అందుకే, మతపరంగా సజాతీయతను రుద్ది, రాజకీయ ఆధిపత్యం సాధించాలనుకొనే శక్తులను కనిపెట్టి ఉండాలి. గతంలో ఉత్తర భారతమంతటా గో సంరక్షణ పేరిట ముస్లిమ్‌ల ఊచకోత జరిగిన ఘట్టాలూ చూశాం. ఇప్పుడు కశ్మీర్లో పండిట్లతో పాటు వలస కార్మికుల ఉసురు తీస్తున్న ఉగ్రమూకల్ని చూస్తున్నాం. సాటిమనిషిని బతకనివ్వని ఛాందసం సిందూరమైతేనేం, హరితవర్ణ బంగారమైతేనేం! 2013 – 16 మధ్య కాలంలో బంగ్లాదేశ్‌లో జరిగిన దారుణమైన ఇస్లామిస్ట్ హింసాకాండను హసీనా మర్చిపోరాదు. దశాబ్దాలుగా హిందువుల సంఖ్య క్షీణించడంపైనా, మానవహక్కుల సంఘం లెక్కల్లో హిందువులపై 3700 పైగా జరిగిన దాడులపైనా ఆమె తక్షణం దృష్టి పెట్టాలి. తీవ్రవాద శక్తులపై ఉక్కుపాదం మోపితేనే, నేటి స్వర్ణోత్సవ స్వతంత్ర బంగ్లాదేశ్ సాధించిన ఆర్థిక పురోగతికి సార్థకత. భారత్ భద్రతకు సానుకూలత. తాజాగా ఢాకా విశ్వవిద్యాలయం బయట నిరసనకారుల చేతిలో ప్రముఖంగా కనిపించిన బ్యానర్లో మాట – ‘దేశంలోని మైనారిటీల భద్రతను కాపాడాలి’. అవును... అది బంగ్లాదేశ్ అయినా, భారత్ అయినా, అఫ్గాన్ అయినా ముందు చేయాల్సింది అదే! -
తూతూ మంత్రమేనా?
దేశంలోని గ్రాండ్ ఓల్డ్ పార్టీ. దశాబ్దాలు దేశాన్ని ఏలిన పార్టీ. వరుస పరాజయాల వల్ల ప్రస్తుతం ప్రభుత్వానికి ప్రతిపక్షమైన పార్టీ. ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక సంఘ ప్రతినిధులందరూ సమావేశమైతే? అదీ ఏకంగా రెండేళ్ళ పైచిలుకు తర్వాత భేటీ అయితే? పార్టీ సభ్యులే కాదు... పరిశీలకులూ అనేక కీలక నిర్ణయాల కోసం చూస్తారు. అలా చూసినప్పుడు శని వారం నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం నిరాశపరిచింది. కీలకమైన నిర్ణయాలేమీ జరగలేదు. ఏడాది తరువాతెప్పుడో, వచ్చే ఏడాది ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య పార్టీ సంస్థాగత ఎన్నికలుంటాయని మాత్రం చాలా ఉదారంగా ప్రకటించింది. పార్టీలోని అనేక లోపాలను లేవనెత్తుతూ, ఫుల్ టైమ్ అధ్యక్షుడు కావాలంటున్న 23 మంది సీనియర్ నేతల అసమ్మతి బృందం ‘జీ–23’కి కూడా పరోక్ష సమాధానాలతోనే సోనియా గాంధీ సరిపెట్టారు. వెరసి, కీలకమైన సీడబ్ల్యూసీ సైతం పార్టీ కన్నా సోనియా పరివారానికే ప్రాధాన్యమిస్తూ, పార్టీ పగ్గాలు మళ్ళీ రాహులే అందుకోవాలన్న వినతులు చేస్తూ తూతూమంత్రంగా ముగియడం ఓ విషాదం. ఆత్మ పరిశీలన అవకాశాన్ని కాంగ్రెస్ చేతులారా వదులుకొని, ‘పరివార్ బచావో వర్కింగ్ కమిటీ’ అనే బీజేపీ విమర్శకు తావిచ్చింది. పార్టీకి అత్యున్నతమైన సీడబ్ల్యూసీ 2019 ఆగస్టు తర్వాత సమావేశమవడం ఇదే తొలిసారి. ఇన్ని రోజుల తరువాతి ఈ సమావేశం సాధించినదేమిటంటే చెప్పడం కష్టం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైనప్పుడే యువనేత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని వదులుకున్నారు. అప్పటి నుంచి సోనియాయే పార్టీకి ఆపద్ధర్మ సారథి. అంటే, దేశంలోని అతి పెద్ద వయసు పార్టీకి, దాదాపు రెండున్నరేళ్ళుగా ఆపద్ధర్మ అధ్యక్షురాలే ఉన్నట్టు! ఇదో విచిత్ర పరిస్థితి. సోనియా మాత్రం ‘నేను ఫుల్‌టైమ్ ప్రెసిడెంట్‌ని’ అంటూ మొన్న సీడబ్ల్యూసీలో హూంకరించారు. ‘అందరికీ అందు బాటులో ఉండే ప్రెసిడెంట్‌ని’ గనక ఏదైనా మీడియాకు ఎక్కకుండా, తనకే నేరుగా చెప్పవచ్చంటూ జీ–23కి పరోక్షంగా చురకలేశారు. కానీ, అధ్యక్ష పీఠంలో లేకున్నా, కీలక నిర్ణయాలు తీసుకుంటూ తప్పులు చేస్తున్న సొంత కొడుకుపైనా, పంజాబ్‌లో సీఎం మార్పు లాంటి అనాలోచిత నిర్ణయం తీసుకున్న కూతురిపైనా విమర్శలు చెబితే, వినేంత సహనం సోనియాకుంటుందా అన్నది ప్రశ్న. పార్టీ పగ్గాలు చేతిలో లేకుంటేనేం... కాంగ్రెస్ పార్టీకి కిరీటంతో పాటు బాధ్యత కూడా లేని రాకుమారుడిగా రాహుల్ చలామణీ అవుతున్నారు. నిజానికి, 2014 నుంచి ఇప్పటి దాకా పార్టీకి జరిగిన అనేక నష్టాలకు కుదురులేని ఈ కుర్ర నేత బాధ్యత కూడా చాలానే ఉందనేది స్వపక్షీయుల్లోనే కొందరి భావన. రాహుల్ బరిలోకి దిగినప్పటి నుంచి ఇప్పటి దాకా వరుసగా రెండుసార్లు లోక్‌సభలో కనీసం ప్రతిపక్ష హోదాకు కావాల్సినన్ని స్థానాలనైనా కాంగ్రెస్ గెలవనేలేదు. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో పార్టీ గెలవనైతే గెలిచింది కానీ, పార్టీ పెద్ద అప్రయోజకత్వం కారణంగా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల్లో అధికారానికి దూరమైంది. ఇక, 2019 లోక్‌సభ ఎన్నికల్లో స్వయంగా రాహుల్ తమ కుటుంబానికీ, పార్టీకీ కంచుకోట లాంటి అమేథీ నుంచే ఓడిపోయారు. కనీసం ఈ ఏడాది మేలో అస్సామ్, పశ్చిమ బెంగాల్, కేరళ ఎన్నికలలోనూ రాహుల్ తన సమర్థతను చూపలేకపోయారు. పార్టీలో ‘సమూలమైన మార్పులు’ తేవాలని జీ–23 బృందం గత ఏడాది ఆగస్టులోనే సోనియాకు తొలి లేఖాస్త్రం సంధించింది అందుకే! పార్టీకి కంచుకోటగా మిగిలిన పంజాబ్‌లో సైతం సీఎం మార్పుతో సంక్షోభం తెచ్చింది – తల్లి చాటు బిడ్డలే. జీ–23 మరో లేఖాస్త్రం విసిరి, పత్రికా సమావేశం పెట్టి మరీ తమది ‘జీ హుజూర్’ బృందం కాదని తొడగొట్టారంటే పరిస్థితి ఎంతదాకా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో తప్పనిసరై భేటీ అయిన సీడబ్ల్యూసీ కాంగ్రెస్ పతనావస్థకు కారణాలు విశ్లేషించుకొని, దిద్దుబాటు చర్యలు చేపడితే బాగుండేది. ఆ పని చేయలేదు. పూర్తికాలం అధ్యక్షురాలినని చెప్పుకోవడానికి సోనియాకు ఇంత కాలం ఎందుకు పట్టిందో అర్థం కాదు. పంజాబ్ తదితర రాష్ట్రాల్లో సమస్యలు తలెత్తినప్పుడల్లా కన్నబిడ్డల్ని పరిష్కారం కోసం పంపి, పార్టీలో నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారనే ప్రశ్నలు తలెత్తేలా చేశారామె. ఇప్పుడిక తప్పక తానే అధినేత్రినని ఆమె నోరు విప్పాల్సి వచ్చింది. ఆ మేరకు అస్మదీయులకు మేళం కొట్టి, అసమ్మతీయుల నోటికి తాళం వేశారు. సంస్థాగతంగానూ, నిర్ణయాలు తీసుకోవడంలోనూ ప్రజాస్వామ్యం కాంగ్రెస్ ప్రత్యేకత. వారసుల మోజులో పడి పోగొట్టుకున్న ఆ పాత సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికీ, పార్టీలో పునరుత్తేజం తేవడానికీ ఇది కీలక సందర్భం. ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించాలంటే, చురుకైన ప్రతిపక్షం అవసరం. పైపెచ్చు, యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్‌లలో వచ్చే ఏడాదే ఎన్నికలున్నాయి. మరి, కాంగ్రెస్, దానికి వారసులమని భావిస్తున్న గాంధీ పరివారం ఇప్పటికైనా మారతాయా? స్తబ్ధతను పోగొట్టుకొని, సరైన కార్యాచరణలోకి దిగుతాయా? కరోనాలో వైఫల్యం, రైతుల ఆందోళన, లఖింపూర్ ఖేడీ లాంటి ఘటనలు అనుకూలించినా, బీజేపీకి బలమైన ప్రత్యర్థిననే నమ్మకం జనంలో తేగలిగితేనే కాంగ్రెస్‌కు ఓట్లు వస్తాయని మర్చిపోకూడదు. అధినేత్రిని తానే అన్న సోనియా ప్రకటన రాహుల్, ప్రియాంకలకు రిలీఫ్. యూపీ, పంజాబ్ లాంటి చోట్ల ఫలితాలెలా ఉన్నా ఆ భారం వారు మోయక్కరలేదు. అయితే పార్టీలోనైనా, ప్రభుత్వంలోనైనా అధికారం చేతిలో ఉండాలనుకోవడంలో తప్పు లేదు. బాధ్యతల బాదరబందీ లేని అధికారాన్ని ఆశిస్తేనే పెద్ద చిక్కు! -
పతన హాస్యం
‘ఫుల్లుమూను నైటటా.. జాసుమిన్ను వైటటా.. మూను కన్న మొల్ల కన్న నీదు మోము బ్రైటటా.. టా! టా! టా!’ అంటాడు గిరీశం ‘కన్యాశుల్కం’లో. ‘నేను వట్టి తెలివితక్కువ వాడిననా నీ అనుమానం’ అని కాంతం కథల్లో భర్త అంటే అందుకు కాంతం ‘అహహ అనుమానమేమీ లేదు.. గట్టి నమ్మకమే’ అంటుంది. ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ధారబోశాను’ అని శ్రీశ్రీ రాస్తే జరుక్శాస్త్రి పేరడీగా ‘నేను సైతం కిళ్లీ కొట్లో పాతబాకీలెగరగొట్టాను’ అని రాశాడు. ‘నవ్వవు జంతువుల్.. నరుడు నవ్వును’ అంటాడో కవి. నవ్వు మానవ ప్రవృత్తి. సకల జీవజాలం నుంచి మనిషిని వేరు చేయగల ఒకే ఒక స్పందనాగుణం– నవ్వు. ‘నాకు గనక సెన్సాఫ్ హ్యూమర్ లేకపోతే నేనెప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉందును’ అన్నారు గాంధీజీ. ఓ పెద్దాయన ‘ఏ మేన్ ఈజ్ నాట్ పూర్ ఇఫ్ హి కెన్ స్టిల్ హీ లాఫ్’ అన్నాడు. ‘నవ్వుకు చోటు దొరకనంత సేపు అది ఎంత పెద్ద గది అయినా ఇరుకే’ అని ఇంగ్లిష్ వ్యాఖ్య. బతకడానికి నవ్వు అవసరం అని సామాన్యుడేమిటి చక్రవర్తి కూడా అనుకున్నాడు. అందుకే విదూషకుణ్ణి ఆస్థానంలో పెట్టుకున్నాడు. తెనాలి రామలింగడు, బీర్బల్ తమ చక్రవర్తులను ఏమో కాని నేటికీ ఆబాలగోపాలాన్ని నవ్విస్తున్నారు. మనుషులు నిత్య జీవితంలో పరాచికాలతో నవ్వుతారు. వెక్కిరించి నవ్వుతారు. తప్పులకు, అబద్ధాలకు నవ్వుతారు. అవివేకులను, మందబుద్ధులను, అతి తెలివిగల వారిని చూసి నవ్వుతారు. అధికారంలో ఉన్నవారిని ఏమీ అనలేక గేలి చేసి నవ్వుతారు. చాలక పుస్తకాలు చదివి, నాటకాలు చూసి, సినిమాలకు వెళ్లి కూడా నవ్వుతారు. అయినా కూడా గౌరవం పొందే విషయంలో హాస్యానిది ద్వితీయ స్థానమే. గంభీరంగా ఉండే అధికారినీ, గంభీరమైన ఉపన్యాసకుణ్ణీ గౌరవించినట్టుగా హాస్యం మిళితం చేసేవారిని గౌరవించరు. సాహిత్యంలో గొప్ప రచనలన్నీ గంభీరమైన విషయాలవే. హాస్యం రాస్తే ‘హాస్య రచయిత’. గంభీరమైన విషయాలు రాస్తే ‘రచయిత’. అతి తక్కువ మందే హాస్యంతో గంభీరమైన విషయాలు రాసి గౌరవం పొందారు. తెలుగులో తొలి వచన సాధకులలో ఒకౖరైన వీరేశలింగం నవ్విస్తూ తొడపాశం పెట్టే శిల్పంలో తెలుగువారిని స్మిత వచనా సముద్రంలోకి ప్రవేశ పెట్టారు. మొక్కపాటి నరసింహశాస్త్రి, మునిమాణిక్యం నరసింహారావు, భమిడిపాటి కామేశ్వరరావు ‘హాస్యత్రయం’ అనిపించుకున్నారు. చిలకమర్తి ప్రహసనాలు, పానుగంటి ‘సాక్షి’ వ్యాసాలు క్లాసిక్స్. ఆ తర్వాతి రోజుల్లో ముళ్లపూడి వెంకటరమణ ‘బుడుగు’, పురాణం ‘ఇల్లాలి ముచ్చట్లు’, నండూరి పార్థసారథి ‘రాంబాబు డైరీ’... ఈ హాస్యధారను బలంగా ముందుకు తీసుకెళ్లాయి. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, తెలిదేవర భానుమూర్తి తదితరులు మాండలిక రచనతో హాస్యం ఎంత నేటివ్ రుచిగా ఉంటుందో చూపించగలిగారు. అయితే ఆది నుంచి స్త్రీకి హాస్యం ‘అదుపు చేయబడినది’. నవ్వుకు ప్రధాన వాటాదారు పురుషుడే. స్త్రీ కాదు. ద్రౌపది కాలం నుంచి స్త్రీ నవ్వుకు అపఖ్యాతి, అపసవ్య వర్తనను ఆపాదిస్తూ వచ్చారు. నవ్వే, నవ్వించే స్త్రీలు నేటికీ తక్కువ. ఇలాంటి సంఘ అంకుశాలను కూడా ధిక్కరించి స్త్రీలు రాశారు. భానుమతి ‘అత్తగారి కథలు’, రంగనాయకమ్మ ‘స్వీట్‌హోమ్’ నవ్వించాయి. పొత్తూరి విజయలక్ష్మి, మృణాళిని, సోమరాజు సుశీల... పాఠకులను తమ ఫిక్స్డ్ ఖాతాల్లో వేసుకోగలిగారు. కాని నవ్వించడం ఏమాత్రం జోక్ కాదు. ఆరోగ్యకరమైన హాస్యంతో నవ్వించడం కొద్దిమందికే చేతనవుతుంది. సమాజంలో కానీ, రచనల్లో కానీ చాలామటుకు హాస్యం స్త్రీలను, బలహీనులను, వెనుకబడినవారిని దూషించడం వల్ల గేలి చేయడం వల్ల పుడుతూ ఉంటుంది. ఆస్తిత్వ రాజకీయ ఉద్యమాల వల్ల కలిగిన చైతన్యం ఇప్పుడు ఇవేవీ చేయడానికి వీల్లేని సంస్కారాన్ని ఇస్తున్నాయి. ఈ సంస్కార పరిధిలో ఉంటూ హాయిగా నవ్వుకోగల హాస్యాన్ని పుట్టించడం నవ్వు మీద సాముగా మారింది. ఈ సమయంలోనే నేటి తరం ఎటువంటి హాస్యానికి సామీప్యంలో ఉన్నదీ గమనించుకోవాలి. నిత్య ఒత్తిడి వల్ల పాఠకులు ప్రేక్షకులుగా మారి చదవడానికి బదులు చూడటానికి ఇష్టపడుతున్న సమయంలో హాస్యం వ్యాపార వనరుగా మారింది. అభినవ విదూషకులు పుట్టుకొచ్చారు. నిత్యం ప్రతి చానల్లో గంటో అరగంటో హాస్య కార్యక్రమం ఉంటోంది. అయితే అది ఎటువంటి హాస్యం? స్త్రీల రూపాలను, ఎదుటివారి ఆకారాలను పదే పదే హీనపరచడమే హాస్యంగా ఉంది. తెలుపు నలుపులను, పొడవు పొట్టిలను, భాషా యాసలను హీనపరచడమే హాస్యంగా ఉంది. ‘ఒరే దరిద్రుడా’ అనేది హాస్య సంబోధన. దరిద్రుడంటే పేదవాడు. పేదవాడు ఎవరికి హాస్య వస్తువు? ఎందుకు హాస్య వస్తువు? సమాజం లైంగిక అపక్రియల్లో మునిగినట్టుగా వాటి చుట్టూ అల్లిన హాస్యానికి రేటింగులు వస్తున్నాయి. మాటలతో సాగే రతిని హాస్యం అంటున్నారు. ఇవి ఇళ్లల్లో ఉండి చూస్తున్న పిల్లలకూ, యువతీ యువకులకూ ఏం నేర్పిస్తున్నాయి? ఆరోగ్యకరమైన హాస్యాన్ని అలవర్చుకోని పిల్లలు తమక్కావాల్సిన హాస్యాన్ని వెతుక్కోవడంలో ఎదుటివారి దుఃఖానికి హేతువు అవుతారు. బాధించడాన్ని ‘ఎంజాయ్’ చేస్తారు. సత్యానికి, హేతువుకు, వాదనకు నిలబడలేక ‘ముఖాన్నో, మూతినో’ కామెంటు చేసి పారిపోతారు. సాంస్కృతిక దాడి చేస్తారు. ఉన్నతమైన విషయాన్ని కూడా పతనానికి తెచ్చి నవ్వుదామనుకుంటారు. పతన హాస్యపు ప్రతిఫలనం ఇది. ఇప్పుడు చలామణిలో ఉన్నదానిని అపహాస్యం అనడానికి కూడా లేదు. ఇది దుర్మార్గ హాస్యం! -
పులోకేశి ఘోషయాత్ర!
దుష్ట సంకల్పంతో కౌరవులు చేసిన ఘోషయాత్ర గుర్తుకొస్తున్నది. మాయాజూదంలో ఓడిపోయిన తర్వాత పాండవులు అరణ్యవాసం చేస్తుంటారు. ద్వైతవనమనే నిర్జనారణ్యంలో వారు అష్టకష్టాలు పడుతున్నారనే మాట ఆనోటా ఈనోటా కౌరవుల చెవిన పడుతుంది. కర్ణపేయంగా తోచిన ఈ కబురు విని సంతోషిస్తారు. పాండవులు నివసించే ప్రాంతానికి వెళ్లి, వారి ఎదుట తమ అష్టఐశ్వర్యాలను ప్రదర్శిస్తే వారు మరింత కుళ్లికుళ్లి చస్తారని శకుని మామ సలహా ఇస్తాడు. ‘భళారే మామా’ అంటాడు దుర్యోధనుడు. ఐతే మందీమార్బలాన్ని తరలించు కొని వెళ్లాలంటే రాజుగారైన ధృతరాష్ట్రుని అనుమతి కావాలి. అప్పట్లో రాజుల ప్రధాన ఆదాయ వనరు పశుసంపదే. అర ణ్యాల్లో అక్కడక్కడా ఆలమందలుండేవి. గోపాలకులు రక్షణగా ఉండేవాళ్లు. ఆలమందల్ని, వాటి సంతాన వృద్ధి లెక్కల్నీ తనిఖీ చేసుకోవడానికి రాజ్యాధికారులో, రాజకుమారులో తరచుగా వెళ్లడం ఒక ఆనవాయితీ. పాండవులు నివసిస్తున్న ద్వైతవనం చేరువలో కూడా కురు రాజ్యానికి ఒక ఆలమంద ఉన్నది. దాని తనిఖీకి వెళ్లదలచుకున్నామని ధృతరాష్ట్రుని అనుమతి కోరతారు. గోవుల పరిశీలనకు వెళ్లే యాత్ర కనుక ‘ఘోషయాత్ర’ అనే అర్థం ఉన్నది. స్వయంగా యువరాజులవారు బయల్దేరినప్పుడు కొన్ని వందలమంది భటులను రక్షణకోసం తీసుకొనిపోవడం ఒక సంప్రదాయం. కానీ ఈసారి మాత్రం ఒక మహా సామ్రాజ్యంపై దండయాత్రకు వెళ్లినట్టుగా సమీకరణ జరిగింది. రథ గజతురగ పదాతి దళాలతో కూడిన వేలాదిమంది సైనికులు బయల్దేరారు. అంతఃపుర కాంతలూ, దాసదాసీ జనం, నర్తకీమణులు, గాయకులు, విడిది భవ నాలు నిర్మించడానికి శిల్పులూ తదితరులంతా పయనమ య్యారు. పాండవుల కుటీరానికి చేరువలోనే విడిది భవనాల నిర్మాణానికి ఉపక్రమించారు. ఇది తమ ప్రాంతమంటూ గంధర్వులు వారిని అడ్డుకుంటారు. గంధర్వ సేనల ధాటికి కౌరవసేన చెల్లాచెదురవుతుంది. సోదరులతో సహా దుర్యోధనుడు గంధర్వ రాజు చిత్రసేనుడికి బందీలుగా చిక్కుతారు. విషయం తెలుసు కున్న ధర్మరాజు తన నలుగురు సోదరులను దుర్యోధనుడి రక్షణకోసం పంపిస్తాడు. పాండు కుమారులు గంధర్వ సేనను ఓడించి చిత్రసేనుడి చెర నుంచి దాయాదుల్ని విడిపిస్తారు. సిగ్గుతో, అవమానభారంతో దించిన తలలు ఎత్తకుండానే కౌర వులు ఇంటి దారి పడతారు. ఇది అందరికీ తెలిసిన కథే. కానీ ఈ కథలోని నీతిని గురించి మాత్రం తప్పక తెలుసుకోవాలి. కడు పులో దుష్ట సంకల్పాన్ని పెట్టుకొని పైకి మాత్రం పరిశీలన యాత్ర, పరామర్శ యాత్ర, పలకరింపు యాత్ర అనే మారు పేర్లతో దొంగయాత్రలు చేస్తే భంగపాటు తప్పదు. ఒక సమర్థుడైన రాజకీయ నాయకునిగా గుర్తింపు పొందడా నికి చాలాకాలంగా లోకేశ్‌బాబు తంటాలుపడుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత అదృష్టవశాత్తు అధికారం దక్కడంతో చంద్ర బాబు అన్ని జాగ్రత్తలూ తీసుకుని లోకేశ్‌బాబును నిలబెట్టే ప్రయత్నాలు చేశారు. పార్టీ మొత్తాన్ని ఆయన గుప్పెట్లో పెట్టారు. అధికారులంతా ఆయన మాట వినేలా ఏర్పాట్లు జరి గాయి. సీనియర్ మోస్ట్ మంత్రులున్న శాఖల్లో కూడా మంత్రు లకంటే లోకేశ్‌బాబు ప్రభే ఎక్కువగా వెలిగింది. అయినప్పటికీ రాజధాని ప్రాంతంలో పోటీచేసి, కోట్లు గుమ్మరించినా ఆయన ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఆయన నాయకత్వం పట్ల నమ్మకం పూర్తిగా సన్నగిల్లింది. భవిష్యత్తులో పార్టీ పగ్గాలు స్వీకరించడానికి ఆయన పనికిరారనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో బలంగా ఉన్నది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కార్యకర్తలు ఈమేరకు తమ మనోభావాలను చంద్రబాబుకు తెలియజేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మీడియా అండదండలు పూర్తిగా ఉన్నప్పటికీ, ధనబలం ఉన్నప్పటికీ, చంద్రబాబు ఆశీస్సులు వందశాతం ఉన్నప్పటికీ లోకేశ్‌బాబు నెగ్గుకురాలేకపోవడంపై తీవ్రస్థాయిలోనే అంతర్మ థనం జరిగిందని వినికిడి. మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓటమికంటే తనయుని ఓటమే చంద్రబాబును ఎక్కువగా బాధించిందట. ఆంతరంగికులు, సలహాదారుల సూచన మేరకు లోకేశ్‌బాబుకు తర్ఫీదును ఇచ్చేందుకు కన్సల్టెంట్లను నియమించారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. తన స్వీయ చేష్టల వల్ల నైతేనేమి, రాజకీయ ప్రత్యర్థుల ప్రచారం ఫలితంగానైతేనేమీ, ఆహార విహార వాచిక ఆహార్యాది అలవాట్ల వల్లనైతేనేమీ ఆయ నకు ‘పప్పు’ అనే ముద్ర పడింది. రాజకీయాల్లో ‘సమర్థత’ అనే మాటకు పూర్తి వ్యతిరేక అర్థం ఈ ఇమేజ్ వల్ల వస్తుంది. జాతీయ స్థాయిలో రాహుల్‌గాంధీ కూడా ఇదే ఇమేజ్ వల్ల ఎదగలేక పోయారు. బర్మాకు వెళ్లి బౌద్ధ సన్యాసుల శిక్షణలో భావాతీత ధ్యానాన్ని అభ్యాసం చేసి వచ్చారట. కానీ, ఎందుకో ఫలితం మాత్రం కలుగలేదు. పిండికొద్దీ రొట్టే కదా! ఈరకమైన జాతీయ, అంతర్జాతీయ అనుభవాలను రంగరించి లోకేశ్‌బాబుకు సిలబస్‌ను తయారుచేశారట. ఇప్పుడా యన జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో ఉండట్లేదట. కొండాపూర్‌లోని సొంత ఫామ్‌హౌస్‌లో ఎక్కువగా ఉంటున్నారట. ఫామ్‌హౌస్ అనగానే అదేదో సిటీకి దూరంగా ఉండే వ్యవసాయ క్షేత్రం అనుకోవద్దు. ‘హార్ట్ ఆఫ్ ద ఐటీ సిటీ’గా పేరున్న కొండాపూర్ లోని పన్నెండెకరాల స్థలంలో ఉన్న లగ్జరీ హౌస్. ఈమధ్య వేలం పాటలో ఎకరం 50 కోట్లు పలికిన కోకాపేట భూముల కంటే కొండాపూర్ భూముల ఖరీదు చాలా ఎక్కువ. ఈ లెక్కన కొంచెం అటూఇటు వెయ్యికోట్లు ఖరీదు చేసే పర్ణశాలలో ఆయనకు థియరీ క్లాసులు చెబుతున్నారు. నెలకోసారి మాత్రం ప్రాక్టికల్స్ కోసం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తుంటారు. శిక్షణలో భాగంగా ఆయన శరీర బరువు కొంచెం తగ్గింది. గడ్డం కొంచెం పెరిగింది. ఉపన్యాసాల్లో ఏకాగ్రత చెదరకుండా ఉండడం, వివిధ విష యాల పట్ల ప్రాథమిక అవగాహన ఏర్పరచడం, భాషలో తప్పులు దొర్లకుండా చూడటం అనే మూడు అంశాలపై కన్స ల్టెంట్లు కుస్తీలు పడుతున్నారు. లోకేశ్‌బాబు బ్రాండ్ ఇమేజ్ను మార్చడమే ఇప్పుడు కన్సల్టెంట్లు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఛాలెంజ్. ఇందుకోసం వాళ్లీ మధ్యన ఒక చిట్కాను కనిపెట్టారు. ప్రాక్టికల్స్ కోసం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ ఏమాత్రం మిస్సవ కుండా ఆయన ఒక డైలాగ్‌ను వాడుతున్నారు. ‘నన్ను చూసి ఈ ప్రభుత్వం భయపడుతున్నది. నేనంటే ఎందుకంత భయం?..’ ఏకకాలంలో కనుబొమలెగరేస్తూ ఈ వాక్యాల్ని ఆయన చూడ కుండా చదువుతున్నారు. లోకేశ్‌బాబును చూసి ప్రభుత్వం భయ పడటమేమిటి? అనే కామన్సెన్స్ ప్రశ్న ఇక్కడ అనవసరం. ఏదో తెలుగు సినిమాలో నాజర్‌ను ఉద్దేశించి బ్రహ్మానందం ఒక సెటైర్ వేస్తాడు. ‘వీళ్ల ఇంటిపేరు పిల్లి. దాన్నెటూ మార్చుకోలేరు. అందుకని పేర్ల వెనక సింహా, సింహా అని తగిలించుకుంటారు’. ఆ కథలో అదొక చిట్కా. ఈ కథలో కన్సల్టెంట్లు కనిపెట్టిన చిట్కా ఇది. అంతే!ప్రాక్టికల్స్ కోసం రెండురోజుల కింద లోకేశ్‌బాబు ఆంధ్రప్రదేశ్‌లో చేసిన పర్యటన ఒకసారి పరిశీలిద్దాం. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ఫిబ్రవరి నెలలో అనూష అనే యువతి హత్యకు గురైంది. ఏడు నెలలు గడిచిన తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమం పెట్టుకున్నారు. ఏడు నెలల తర్వాత పరామర్శ ఏమిటి? ఇక్కడ పరామర్శ అనేది ఒక సాకు. మనసులో ఉన్న సంకల్పం వేరు. ఫామ్‌హౌస్ శిక్షణలో నేర్చు కున్న ‘పోరాట పటిమ’ను ప్రాక్టికల్‌గా ఆంధ్రప్రదేశ్ వీధుల్లో ప్రదర్శించాలి. ఈ ప్రదర్శనకు సంబంధించిన ఆదేశాలు అధినేత నుంచి ముందుగానే పార్టీ శ్రేణులకు చేరుకున్నాయి. ఆరుగురు మాజీమంత్రులు, ఐదుగురు మాజీ ఎంపీలు, ఐదుగురు ప్రస్తుత ఎమ్మెల్యేలు, 21 మంది మాజీ ఎమ్మెల్యేలు, మూడు వేలమంది పార్టీ కార్యకర్తలు ఈ స్ట్రీట్ ప్లేలో పాల్గొనేలా కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. రోజంతా ఎల్లో మీడియా ఈ కార్యక్రమానికే అంకితమయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. వీధి భాగోతం మాటున విధ్వంసం జరిగే అవకాశముందని పోలీసులకు కొంత ఆల స్యంగా ఉప్పందినట్లుంది. చివర్లో కొంతమంది నాయకులను గృహనిర్బంధంలో ఉంచారు. వీధి భాగోతాన్ని అడ్డుకున్నారు. షరా మామూలుగా ‘ఈ ప్రభుత్వానికి నేనంటే భయం’ అంటూ లోకేశ్‌బాబు ప్రెస్‌మీట్ పెట్టుకున్నారు. కార్యక్రమ నిర్వాహకులు ఆశించిన ఫలితం నెరవేరలేదు. దక్షిణ భారత చరిత్రలో దండ యాత్రల స్పెషలిస్టుగా పేరొందిన చాళుక్య చక్రవర్తి రెండో పులకేశి స్థాయి బిల్డప్‌ను వారు ఆశించారు. తమిళ కమెడియన్ వడివేలు టైటిల్ రోల్ పోషించిన ‘హింసించే రాజు 23వ పులకేశి’ స్థాయి ఇమేజ్ మాత్రమే దక్కింది. అనేక లింకులతో అల్లిన ఇనుప గొలుసు బలమెంత? అత్యంత బలహీనమైన లింకుకు ఉండే బలమెంతో ఆ గొలుసు బలం కూడా అంతే! ఇది సైన్స్ సూత్రం. ఇది సామాజిక, రాజకీయ, యుద్ధతంత్ర సూత్రం కూడా! జగద్విజేతలందరూ కూడా ఈ సూత్రాన్ని పాటించే విజేతలయ్యారు. బలమైన శత్రువును ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఆ శత్రువు బలహీన తలను వెతికి పట్టుకోవాలి. మనం బలహీనంగా ఉన్నప్పుడు ఈ జాగ్రత్త మరింత అవసరం. లోకేశ్‌బాబు ఎదుర్కోవాలని భావి స్తున్న శత్రువు వైఎస్ జగన్మోహన్రెడ్డి. అత్యంత బలీయమైన శక్తి. శత్రుదుర్భేద్య దుర్గం ఆయన ప్రభుత్వం. లోకేశ్‌బాబు దుర్బలుడు. అటువంటప్పుడు యుద్ధవ్యూహం ఎలా ఉండాలి? దాడికోసం లోకేశ్‌బాబు ఎంపిక చేసుకున్న లింకేమిటి? మహిళల రక్షణ. వైఎస్ జగన్ ప్రభుత్వ గొలుసులో ఇది బలమైన లింకు. మహిళల రక్షణ, సాధికారత, బలహీన వర్గాల సాధికారత, సంక్షేమం, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అంశాల్లో ప్రభుత్వం వంక తేరిపార చూసే అవకాశమే లేదు. ఈ ఏడు రంగాల్లోనూ అభివృద్ధి బెంచి మార్కులను ఈ ప్రభుత్వం ఇప్పటికే నిర్ధారించింది. ఈ రంగాల మీద కత్తి దూయడానికి పూనుకోవడం ఆత్మహత్యా సదృశం కాదా? మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాని ట్రాక్ రికార్డు పరమ దరిద్రంగా ఉన్న రంగాల్లో మహిళల రక్షణ, సాధికారత అగ్ర స్థానంలో ఉన్నాయి. తాము ఎంపిక చేసుకున్న ముద్దుల రాజ ధాని నీడలోనే చెలరేగిన కాల్‌మనీ సెక్స్ రాకెట్ ఒక హేయమైన అధ్యాయం. మహిళా గౌరవాన్ని మంటగలిపిన దుర్మార్గపు చర్య. అప్పుల ఊబిలోకి దింపి వేధింపులు, లైంగిక దాడులకు పాల్ప డిన ఈ నికృష్ట చర్య వెనుక పాలక పార్టీ పెద్దల పాత్ర ఉండడం విషాదాల్లోకెల్లా విషాదం. వందలాది అత్యాచారం ఘటనల్లో కేసులు రిజిస్టర్ చేయడానికి కూడా పోలీసు యంత్రాంగం మొరాయించిన అరాచక పాలన. మహిళా తాసిల్దార్ మీద పాలక పార్టీ ఎమ్మెల్యే పబ్లిగ్గా దాడిచేస్తేనే నో కేస్. నో పోలీస్. ముఖ్య మంత్రి స్వయంగా జోక్యం చేసుకొని కేసు లేకుండా సర్దుబాటు చేశారు. బాధితులు పెద్దఎత్తున ఆందోళన చేస్తేనే అప్పట్లో కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం. ఈ కేసుల కోసమే దిశ పోలీస్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆపదలో ఉన్న మహిళ వెంటనే పోలీస్ రక్షణ కోరే విధంగా దిశ యాప్‌ను రూపొందించింది. ఇప్పటికే 45 లక్షలమంది మహిళలు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. జిల్లాకొకటి చొప్పున 13 దిశ కోర్టులు ఏర్పాటయ్యాయి. ఇందుకోసం 13 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ప్రభుత్వం నియమించింది. 148 మంది దోషు లకు ఇప్పటికే శిక్షలు కూడా పడ్డాయి. మహిళలపై లైంగిక దాడు లకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తుకాలం 2019 నాటికి సగటున 200 రోజులకు పైగా ఉండేది. ఇప్పుడది 42 రోజులకు తగ్గింది. మూడు వారాల్లోనే దోషులకు శిక్ష పడేలా రూపొం దించిన దిశ బిల్లు కేంద్రం ఆమోదం కోసం ఎదురుచూస్తున్నది. ఆమోదం లభించగానే చట్టం రూపుదాల్చుతుంది. ఇంకా చట్టం కాని ఈ చట్టం ప్రకారం ఎందుకు శిక్షించడంలేదంటూ లోకేశ్ బాబు దిశ బిల్లు ప్రతులను తగలబెట్టారు. పౌర హక్కులను హరించే నల్ల బిల్లుల, నల్ల చట్టాల తాలూకు ప్రతులను తగు లబెట్టడం గతంలో చూశాము. ప్రగతిశీలమైన బిల్లు ప్రతులను, అదీ అమలుచేయాలని తామే డిమాండ్ చేస్తున్న బిల్లు ప్రతులను తగలబెట్టడం ఇక్కడే చూస్తున్నాము. వారి మేధస్సు చిరకాలం వర్ధిల్లు గాక! -వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పురిటి బిడ్డ పురోగమనం!
రైతాంగ పోరాటం దేశంలో కొత్త రూపు సంతరించుకుంటోంది. దేశ రాజధాని, పరిసరాలను దాటి విస్తరించే సన్నాహాల్లో ఉంది. ఏడాది కింద కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ (అనుబంధ అంశాల) చట్టాలకు వ్యతిరేకంగా మొదలైన ఈ ఉద్యమం, ఇప్పటికే పలు ఆటుపోట్లను చవిచూసింది. దేశంలో ఎక్కడికక్కడ నిరసించినా... ఢిల్లీని చుట్టుముట్టి ఓ ఆందోళన నిరవధికంగా సాగుతోంది. ఏకరీతిన నవమాసాలు గర్భస్థ స్థితిలో ఢిల్లీ, శివార్లకే పరిమితమైన శైశవ దశ నుంచి... ఆందోళన తాజాగా గడపదాటుతోంది. మహాపంచాయతీల రూపంలో అడుగు బయటకు వేసింది. వారం కిందటి ముజఫర్‌నగర్ (ఉత్తర్‌ప్రదేశ్), నిన్నా ఇవాళ్టి కర్నల్(హర్యానా) రైతు ఆందోళనలు సంకేతం. వారం కింద, మితిమీరిన పోలీసు లాఠీ దెబ్బకు ఒకరు మరణించి, పదిమంది రైతులు గాయపడ్డ దాష్టీకాన్ని నిరసించిన ఆందోళన, హర్యానా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ కేంద్రంలో రోజురోజుకు బలపడుతోంది. వివిధ రాష్ట్రాలకు, జిల్లా కేంద్రాలకు విస్తరించే రైతు ఉద్యమ కార్యాచరణ ఐక్య పోరాట వేదిక, ఇతర రైతు సంఘాల వ్యూహాల్లో రూపుదిద్దుకుంటోంది. పాలకపక్షమైన భారతీయ జనతాపార్టీ, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఈ పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నాయి. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికినా... ఉద్యమాన్ని నిరాఘాటంగా సాగించిన రైతు సంఘాలు, ఇంతకాలం వ్యూహాత్మకంగా రాజకీయ పక్షాలను దూరం పెట్టాయి. తమ వేదికలనెక్కనివ్వలేదు! అందుకే, ఎంతో విశ్వసనీయత పొంది ప్రపంచ దృష్టిని ఆకర్షించిందీ ఉద్యమం. కానీ, ఉత్తరాది వివిధ రాష్ట్రాలు ఎన్నికలకు సమాయత్తమౌతున్న ప్రస్తుత తరుణంలో... ఆయా పార్టీలు రైతాంగ ఉద్యమాంశాన్ని ఇప్పుడు తమ ప్రచారాస్త్రంగా మలచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. చిత్రమేమంటే, పాలకపక్షం బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అనుబంధ రైతు విభాగమైన భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) కూడా దేశవ్యాప్త నిరస నల కార్యాచరణ ప్రారంభించింది. రైతు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర దక్కాలని, చట్టబద్దత కావా లని కోరుతూ, మచ్చుకి 500 జిల్లా కేంద్రాల్లో బుధవారం నిరసన ప్రదర్శనలకు శ్రీకారం చుట్టింది. ఇది వ్యూహాత్మక చర్య అన్నది ప్రత్యర్థుల వాదన! ఒక మహాఉద్యమం నుంచి, మూడు చట్టాలు ఎత్తివేయాల్సిందేననే తమ ప్రధాన డిమాండ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించే ఎత్తుగడ అని, ఇన్నాళ్లు రైతు సంఘలెన్నింటినో ఏకీకృతం చేసిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) అంటోంది. వారు సెప్టెంబరు 27న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చి ఉన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి, మరోవైపు నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై ఒత్తిడి పెరుగుతోంది. రైతు సంఘ నాయకులు, కేంద్ర ప్రభుత్వం... ఇరువురితో సంప్రదింపులు జరిపి, నివేదిక ఇచ్చేందుకు సుప్రీంకోర్టే ఏర్పాటు చేసిన సంఘ సభ్యుడొకరు, సుప్రీం ప్రధాన న్యాయ మూర్తికి తాజాగా లేఖ రాసి సంచలనం సృష్టించారు. తామిచ్చిన నివేదికను బయటపెట్టాలని, ప్రతిష్టంభనను తొలగించి, సమస్యను పరిష్కరించేట్టు కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరారు. న్యాయ స్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి. తగిన సంప్రదింపులు లేకుండా, తమ ప్రయోజనాలకు వ్యతి రేకంగా తెచ్చిన ఆ మూడు చట్టాలను ఎత్తివేయాల్సిందేనని రైతాంగం పట్టుబట్టడంతో పోరాటం తీవ్రరూపం దాల్చినపుడు, గత జనవరిలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. చట్టాల అమలును పక్కనపెట్టమని కేంద్రాన్ని ఆదేశించింది. చట్టాలను మాత్రం ఎత్తివేసేది లేదని కేంద్రం భీష్మించి, ప్రతిష్టంభన ఏర్పడటంతో సుప్రీం ఒక కమిటీని నియమించి రెండు మాసాల్లో నివేదిక ఇవ్వాలంది. మార్చి 19న సీల్డు కవర్లో ఆ కమిటీ ఇచ్చిన సమగ్ర నివేదికను సుప్రీం ఇంతవరకు విప్పలేదు. చట్టాలు రైతు వ్యతిరేకమైనందున వాటిని పూర్తిగా ఎత్తివేయాలనేది ఒక వాదనైతే, అంత అవసరం లేదు సవరిస్తే చాలనేది మరోవాదన. మెజారిటీ రైతు సంఘాలు చట్టాలను ఎత్తివేయాలనే కోరుతున్నాయి. భారత్ కిసాన్ సంఘ్ మాత్రం, ఆ మేరకు సవరిస్తే చాలంటోంది. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదనేది పాలకపక్షపు అనుకూల రైతు సంఘం వాదన. రైతుకు గిట్టుబాటు ధర (ఆర్పీ) లభించాలని, శాస్త్రీయంగా దాన్ని ఖరారు చేసి, వ్యవసాయో త్పత్తుల్ని ప్రభుత్వమే కొనుగోలు చేసే ప్రక్రియకు చట్టబద్ధత తీసుకురావాలని ఈ సంఘం కోరు తోంది. ప్రభుత్వమైనా, ప్రయివేటు వ్యాపారులైనా... రైతు ఉత్పత్తుల్ని ముందే ఖరారు చేసిన గిట్టు బాటు ధరకు తగ్గి కొనుగోలు చేయడాన్ని నేరంగా పరిగణించి, ఆ మేర శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తోంది. పెరిగే పెట్టుబడి వ్యయాన్ని, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని సదరు గిట్టుబాటు ధర ఖరారు చేయాలనే వాదన సముచితం. అది లేక, దేశానికి అన్నం పెట్టే రైతు నానాయాతన అనుభవించాల్సి వస్తోంది. రైతు ఆదాయం రెట్టింపేమో కానీ, ఉత్పత్తి వ్యయంలో 40, 50 శాతం కూడా లభించక రైతు అప్పుల్లో పడి కునారిల్లుతున్నాడు. తమనీ దుస్థితికి తెచ్చిన పాలకపక్షాల పట్ల ఆగ్రహమే కాకుండా తమ శ్రమశక్తిని దోచుకోజూస్తున్న కార్పొరేట్లపై కోపం కూడా రైతు ఉద్యమానికి కొత్త ఊపిరులు పోస్తోంది. కేంద్రం, అది తెచ్చిన కొత్త చట్టాలే ఊతంగా... వ్యవసాయోత్పత్తులతో పాటు, వాటి నిల్వ, మార్కెటింగ్ రంగాల్లోకి పెద్ద ఎత్తున చొచ్చుకు వస్తున్న కార్పొరేట్ శక్తులనూ రైతు ఉద్యమాలు లక్ష్యం చేసుకుంటున్నాయి. మద్దతు పెరగటంతో బలోపేతమౌతున్నాయి. రేపటి పరిస్థితేమిటో వేచి చూడాల్సిందే! -
వ్యూహంతోనే ఉపశమనం
అసాధారణ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తాయి. నదులు, వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. అక్కడక్కడ వరద ప్రమాద పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి. పంటలు నష్టపోయే ప్రమాదముంది. ముఖ్యంగా తెలంగాణలో పరిస్థితి తీవ్రం. ప్రకృతి విపత్తుల నుంచి పౌరులకు భద్రత కల్పించడానికి, పంటల్ని కాపాడటానికి సంప్రదాయ విధానాలు పనికిరావడం లేదు. ప్రత్యేక ప్రణాళిక–చర్యలు అత్యవసరమని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ముందు జాగ్రత్తలు, సహాయక పనులు, నష్ట నివారణ–నష్టం అంచనా, విపత్తు అనంతర చర్యలు, నష్టపరిహారాలివ్వడం... ఇలా అన్నీ సమన్వయంతో చేపడితే గాని పౌర సమాజానికి విముక్తి లేదు. నిరుటి వర్షతీవ్రతకు నష్టపోయిన వారికి పరిహారాల చెల్లింపు కేసును విచారిస్తూ, కౌంటర్ దాఖలు చేయనందుకు కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు మంద లించింది. ‘మా బాధ్యత కాదు’ అంటే ఎలా? అని కేంద్ర వ్యవసాయ శాఖను తప్పుబట్టింది. తదు పరి విచారణ బుధవారం జరుగనుంది. ఇవి ప్రకృతిపరమైన సాధారణ వర్షాలు కావని, ‘వాతావ రణ మార్పు’ (క్లైమెట్ చేంజ్) ఫలితంగా తలెత్తిన అసాధారణ పరిణామాలని తెలుస్తూనే ఉంది. గత సంవత్సరం ఇదే సమయానికి, ఈ సంవత్సరం జూన్‌లో కురిసిన వర్షాలే ఇందుకొక సంకేతం! ఇవేం అనూహ్యంగా కురుస్తున్న ఆకస్మిక వర్షాలు కాదు. రాగల ఆరు మాసాల పరిస్థితుల్ని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ముందుగానే చెప్పింది. ప్రతి తుఫాను, అల్పపీడనం గురించి సమా చారం తగినంత ముందే వెల్లడిస్తోంది. అల్పపీడనానికి ఉపరితల ద్రోణి తోడవడం వల్ల ఇప్పుడు వర్షతీవ్రత ఎక్కువైంది. ప్రభుత్వాల వైపు నుంచి ముందస్తు పక్కా ప్రణాళిక, సన్నద్దత లేకపోవడం లోపమే! జిల్లాలకు జిల్లాలే నీట మునిగి, పెద్దఎత్తున పంట, ఆస్తుల నష్టాలు చోటుచేసుకుంటు న్నాయి. ఉత్తర తెలంగాణ అయిదు జిల్లాల్లో ప్రమాద హెచ్చరికలు (రెడ్ అలర్ట్)జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ గోదావరి, ఇతర తీర జిల్లాల్లో వర్షం ఎక్కువ పడింది. కాకినాడ, పరిసరాల్లో సోమవారం కొన్ని గంటల్లోనే 12 సెంటిమీటర్ల వర్షం కురిసి హడలెత్తించింది. వరంగల్ పరిధి నడికుడలో ఏకంగా 38.8 సె.మీ వర్షం కురిసింది. లోగడ రోజంతా కురిసిన వర్షం, ఇప్పుడు గంట లోనే పడిపోతోంది. వాతావరణ మార్పుల వల్ల భూతాపోన్నతి పెరిగి, అతి వేడి వల్ల అల్పపీడనాలు పెరుగుతున్నాయి. అవి ఎక్కడున్న తేమను, గాలుల్ని లాఘవంగా లాగుతున్నాయి. ఫలితంగా జరిగే ‘మేఘ విచ్ఛిత్తి‘ (క్లౌడ్ బరస్ట్) కుంభవృష్టికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు ఇప్పటికే నిండి, భూగర్భజల మట్టాలు పైకి చేరాయి. భూమి తడిగా ఉంది. అందుకే, చిన్న వర్షం వచ్చినా నదులు, వాగులు, వంకలు, చెరు వులు పొంగి పారే పరిస్థితి. వరదల వల్ల భూక్షయం, భూసార క్షయం జరుగుతోంది. మరోపక్క గ్రామాలకు గ్రామాలు నీట మునగటం వల్ల పనులుండవు. కరోనాతో దెబ్బతిన్న దిన కూలీ కుటుంబాలకు ఇది అదనపు కష్టం! ఒక్కసారిగా వేడి–తడి వాతావరణ మార్పుల వల్ల వైరస్ క్రియాశీలంగా మారి, జబ్బులు ప్రబలే ప్రమాదం ఉంది. పైగా కరోనా కాలం అయినందున పౌరులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. వైద్య వ్యవస్థల్ని సర్కారు సమాయత్తపరచాలి. వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాల జనాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వస్తే, అందుకు అవసరమైన వ్యవస్థ, వనరులున్నాయా? అన్నది పెద్ద ప్రశ్న! సిరిసిల్లాతో సహా పాత కరీనంగర్ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలపై ప్రస్తుతం దృష్టి సారించారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీయెంయే)తో రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం నెరపాల్సిన సందర్భమిది. విపత్తు ఎదుర్కొ నేలా, ఎవరికి వారు భద్రతా చర్యల్ని పాటించే ‘పౌరరక్షణ’లో ప్రజలందరికీ శిక్షణ ఇప్పించాల్సి ఉండింది. కానీ, అదెందుకో సవ్యంగా జరుగటం లేదు. మొత్తంగా ఇది ఒకరోజు వ్యవహారం కాదు. శాశ్వత ప్రాతిపదికన కార్యాచరణకు ఓ వ్యూహ రచన ఉండాలి. ఐఎండీ క్యాలెండర్ ప్రకారం... ముందస్తు చర్యలు, వార్నింగ్ తర్వాత ఆపత్కాలం అనుసరించాల్సిన వ్యూహం, విపత్తు వేళ నిర్దిష్ట సహాయక చర్యలు, అనంతర దిద్దుబాటు కార్యక్రమాలు, నష్టం శాస్త్రీయ అంచనా–నష్టపరిహార చర్యలు, భవిష్యత్తులో విపత్తు తీవ్రత నివారణకు ప్రణాళిక.... ఇలా షట్సూత్ర కార్యాచరణ ప్రభు త్వాలకు తక్షణావసరం. అతివృష్టి–అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి నష్టాల్ని తగ్గించేందుకు పంటల వ్యూహం ఉండాలి. పరిస్థితుల్ని తట్టుకునే పంటల్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి. నష్టాల అంచనాకు శాస్త్రీయ విధానం పాటించాలి. వర్షాన్ని, వాతావరణాన్ని గణించే వ్యవస్థను మండలస్థాయి వరకు విస్తరించాలి. అన్నిస్థాయిల్లో పౌర భాగస్వామ్యంతో జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. దొంగలు పడ్డ ఆరునెల్లకి కుక్కలు మొరిగినట్టు రెండు, మూడు సీజన్లు దాటాక అధ్యయన బృందాలు రావటం, అప్పటికి పరిస్థితులు పూర్తిగా మారి ఉండటం, చాలా అశాస్త్రీయం! ఎమ్మెల్యేలో, మరో రాజకీయ నాయకులో పంటనష్టాల్ని అంచనా వేయడం తప్పు. ఏపీ అనుసరిస్తున్న ఉచిత పంటల భీమా, సీఎం నిర్దేశించినట్టు... కనీసం తదుపరి సీజన్ నాటికి పరిహారం అందే వ్యవస్థ ఎంతో ఆదర్శం. దీన్ని దేశమంతటికీ విస్తరించాలి. వాతావరణ మార్పుతో తలెత్తిన కొత్త సమస్యలకు సరి కొత్త సమాధానాలు, పరిష్కారాలు వెతుక్కుంటేనే ప్రకృతి విపత్తుల నుంచి పౌర సమాజానికి రక్ష! -
జపాన్‌లో అస్థిరత
వెనకవుండి సలహాలు, సూచనలు అందిస్తూ అధినేత విజయపథంలో పయనించడానికి తోడ్పడటం వేరు...తానే నాయకుడై పాలించడం వేరు. నిరుడు సెప్టెంబర్ 16న జపాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన యొషిహిడే సుగా తొందరలోనే ఈ తత్వాన్ని బోధపరుచుకుని ఆ పదవికి గుడ్ బై చెప్పారు. పర్యవసానంగా పట్టుమని ఏడాది కాకముందే ఆయన వారసుడి ఎంపిక కోసం అధికార లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ(ఎల్డీపీ) అన్వేషణ ప్రారంభించక తప్పలేదు. జపాన్‌కు రాజకీయ అస్థిరత కొత్తగాదు. 2006–12 మధ్య ఆ దేశం ఆరుగురు ప్రధానులను చూసింది. అందులో షింజో అబే కూడా ఒకరు. కానీ 2012లో రెండోసారి అధికారంలోకొచ్చాక అబే తీరు మారింది. అయిదేళ్లపాటు సుస్థిర పాలన అందించడమేకాక, 2017లో మరోసారి మంచి మెజారిటీతో అధికారంలోకొచ్చి మూడేళ్లు పాలించారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో నిరుడు తప్పుకున్నారు. ఆయన వారసు డిగా వచ్చిన సుగాపై అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే, తెరవెనకుండి షింజో అబేను విజయపథంలో నడిపించింది ఆయనే. అబే తీసుకున్న ప్రతి విధాన నిర్ణయం వెనకా ఆయ నదే కీలకపాత్ర. కేబినెట్ రూపురేఖలు నిర్ణయించటంలో, దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దటంలో, విదేశాంగ విధానం రూపకల్పనలో, పర్యాటక రంగాన్ని పరుగులెత్తించడంలో సుగా ప్రమేయ ముంది. అస్థిర ప్రభుత్వాలతో, ఆర్థిక ఒడిదుడుకులతో, వరస విపత్తులతో కుంగిపోయిన జపాన్‌కు ఈ నిర్ణయాలు జవసత్వాలిచ్చాయి. సమస్యలు ముంచుకొచ్చినప్పుడు ప్రజాదరణ దండిగా ఉన్న రాజకీయ నేత స్పందించే తీరుకూ, ఒక ఉన్నతాధికారి ఆలోచించే తీరుకూ వ్యత్యాసముంటుంది. అది తన సొంత ఆలోచనైనా, ఎవరి సలహాల పర్యవసానమైనా దాన్ని అందరితో ఒప్పించడంలో, ముందుకు నడిపించడంలో, ఆ నిర్ణయం సమర్థవంతంగా అమలు చేయడంలో, మెరుగైన ఫలితాలు రాబట్టడంలో రాజకీయ నాయ కుడి శైలి భిన్నంగా ఉంటుంది. ఉన్నతాధికారిగా అబే తరఫున అన్నీ చక్కబెట్టి, ఆయనకు పేరుప్రఖ్యా తులు రావడంలో ప్రధాన పాత్ర పోషించిన సుగా నేరుగా పాలనా పగ్గాలు చేపట్టాక వైఫల్యాలను మూటగట్టుకోవడంలోని సూక్ష్మం ఇదే. వాస్తవానికి రెండు శిబిరాలుగా చీలిన పాలక పార్టీలో సుగా అందరివాడుగా నిరూపించుకోగలిగారు. పార్టీ ఎంపీలు 151 మందిలో అబే వర్గానికి చెందిన 96 మంది, ఆర్థికమంత్రి తారో అసో అనుకూలురైన 55 మంది ఆయనకు అండదండలందించారు. ఈ రెండు వర్గాలకూ సుగా తన కేబినెట్లో సమాన ప్రాతినిధ్యమిచ్చి, అన్నిటా వారి సలహాలు తీసుకు న్నారు. ఎవరినీ నొప్పించకుండా పనిచేశారు. ప్రధాని పదవికి తామే అర్హులమని భావించే నేతలు ఎల్డీపీలో అరడజనుమంది వరకూ ఉన్నారు. కానీ కరోనా విలయంతోపాటు, ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వక తప్పని పరిస్థితులు ముంచుకొస్తుండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాజకీ యంగా దెబ్బతింటామేమోనన్న భయాందోళనలు వారందరిలోనూ ఉన్నాయి. అందుకే అబేను విజయపథంలో నిలిపిన సుగావైపే ఇరుపక్షాలూ అప్పట్లో మొగ్గుచూపాయి. ప్రధానిగా వచ్చిన సుగా తనకంటూ సొంత ఎజెండా ఉన్నదని నిరూపించుకోలేకపోయారు. అంతక్రితం అబే అమలు చేసిన విధానాలు తనవే కావొచ్చుగానీ, వాటి లోటుపాట్లను సరిదిద్దకుండా కొనసాగిస్తుండటం, కరోనా కట్టడిలో వైఫల్యాలు ఎదుర్కొనడం, వ్యాక్సిన్లు అందరికీ అందించలేక పోవడం సుగా ప్రతిష్టను బాగా దెబ్బతీశాయి. లాక్డౌన్ల కారణంగా ఆర్థిక సంక్షోభం తలెత్తినా, సాధారణ ప్రజానీకాన్ని ఆదుకొనడానికి పకడ్బందీ ప్రణాళికలు కొరవడ్డాయి. ఇప్పటికీ కొన్ని నగ రాలు కొవిడ్ ఎమర్జెన్సీలో కాలం గడుపుతున్నాయి. కరోనా రోగులను చేర్చుకునేది లేదంటూ ఆసు పత్రులు వెనక్కి పంపిన ఉదంతాలు జనంలో ఆగ్రహాన్ని రగిల్చాయి. ఇలాంటి స్థితిలో ఒలింపిక్స్ నిర్వహించడమేమిటన్న ప్రశ్నలు అందరిలో తలెత్తాయి. ఏతావాతా అధికార పగ్గాలు చేపట్టేనాటికి 70 శాతం రేటింగ్ ఉన్న సుగా ప్రస్తుతం 26 శాతానికి దిగజారారు. ఒకప్పుడు తెరవెనక సలహాలిచ్చిన అనుభవమున్న నేత... ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందోనన్న సందేహంలో పడ్డారు. తీసుకున్న నిర్ణయంలోని మంచిచెడ్డలను ప్రజలకు సమర్థవంతంగా చెప్పి ఒప్పించే నేర్పు ఆయనకు లేదు. దాని కితోడు వచ్చే నెలతో ప్రస్తుత సభ కాలపరిమితి ముగుస్తోంది. నవంబర్‌లోగా ఎన్నికల నిర్వహణ తప్పనిసరి.అటు ఎన్నికల్లో పార్టీకి సారథ్యం వహించటం, ఇటు పాలనాపరంగా లోటుపాట్లు సరి దిద్దటం తనకు కత్తి మీద సాము అవుతుందని సుగా సరిగానే గ్రహించారు. దాదాపు 13 కోట్ల జనాభాగల జపాన్‌లో జనం నిరాశానిస్పృహలకు లోనయ్యారు. ఎల్డీపీ జాతీయవాద పార్టీయే అయినా వారిని సమ్మోహన పరిచి, ఒప్పించి మెప్పించగల మంత్రదండమేదీ దాని దగ్గర లేదు. విపక్షం బలహీనంగా ఉండటమే ప్రస్తుతానికి ఆ పార్టీకున్న ఏకైక బలం. ఈ నెలా ఖరులోగా కొత్త సారథిని ఎన్నుకోవటం, వారి సారథ్యంలో ఎన్నికలకు వెళ్లటం ఒకరకంగా ఎల్డీపీకి అగ్ని పరీక్ష. చైనా, దక్షిణ కొరియాలతో సంబంధాలు, రక్షణ రంగాన్ని పటిష్టం చేయడం, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది, నిరుద్యోగిత తగ్గించటం వంటి అంశాల్లో ఏమేం చేయదల్చుకున్నదీ కొత్త ప్రధాని ప్రజలకు వివరించాల్సి వుంటుంది. పరిణత ప్రజాస్వామ్యం ఉన్న జపాన్‌లో జాగ్రత్తగా అడుగులేయకపోతే ఎంతటి నేత అయినా, పార్టీ అయినా పల్టీలు కొట్టడం ఖాయమని సుగా ఉదంతం నిరూపించింది. కొత్తగా వచ్చే నేత ఎలాంటివారైనా దీన్ని విస్మరించటం అంత తేలిక కాదు. -
అద్దెకిస్తాం! అమ్మేస్తాం!!
బహుశా ఇది కనివిని ఎరుగని విషయం. ఇంకా చెప్పాలంటే, ఊహకైనా అందని అంశం. సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రి (పీఎం) అధికారిక నివాస భవనాన్ని అద్దెకిస్తామని ఓ ప్రభుత్వం ప్రకటించడం ఎక్కడైనా విన్నారా? కార్ల మొదలు పాడి గేదెల దాకా ప్రభుత్వమే అమ్మేయడం ఎక్కడైనా కన్నారా? అవి ఇప్పుడు మన సోదరదేశం పాకిస్తాన్లో చోటుచేసుకున్నాయి. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్‌లోని తన అధికారిక నివాస భవనాన్ని ఇప్పుడు విందు వినోదాలు, వివిధ విద్యా, సాంస్కృతిక, ఫ్యాషన్ ప్రదర్శనలకు అద్దెకు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆ రకంగా వచ్చే డబ్బు కొంతలో కొంతయినా ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలను తగ్గిస్తే అదే పదివేలని భావిస్తున్నారు. కానీ, అధికారిక నివాసాలకు వచ్చే కిరాయి డబ్బులతో పాకిస్తాన్ ఆర్థిక కష్టాలు తీరతాయా అన్నది ప్రశ్న. ఇమ్రాన్ సారథ్యంలోని పాలక ‘పాకిస్తాన్ తెహరీక్–ఎ–ఇన్సాఫ్’ (పీటీఐ) సర్కార్ 2019 ఆగస్టులోనే అధికారిక నివాసాన్ని విశ్వవిద్యాలయంగా మార్చాలని భావించింది. అప్పట్లోనే అలాగే, వివిధ రాష్ట్రాల గవర్నర్లు సైతం అధికారిక నివాసాలలో కాకుండా, మామూలు ఇళ్ళలో ఉంటూ ఖర్చు తగ్గిస్తామన్నారు. అధికారిక నివాసాన్ని వదిలేసి, మరో ఇంటికి ఆ ఏడాదే ఆయన మారిపోయారు. పీఎం నివాసాన్ని నిర్వహించడానికి ఏటా రూ. 47 కోట్లు ఖర్చవుతాయి. దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వేళ ఆ ఇల్లు ఖాళీ చేస్తే, ఖర్చు కలిసొస్తు్తందన్నది ఆలోచన. అంతకు ముందు 2018 సెప్టెంబర్‌లోనూ ఇమ్రాన్ ఇలాంటి పనే చేశారు. అంతకు ముందు ప్రధాని నవాజ్ షరీఫ్ పీఎం నివాసంలో పెట్టుకున్న ఎనిమిది పాడిగేదెల్ని రూ. 23 లక్షలకు అమ్మేశారు. గత వారమేమో 61 లగ్జరీ కార్లు అమ్మేసి, రూ. 20 కోట్లు ఆర్జించారు. ఇంకా 102 కార్లు, నాలుగు హెలికాప్టర్లను వేలం వేయాలని ప్లాన్. వీటి వల్ల కలిసొచ్చిన ఖర్చు, చేతికొచ్చిన సొమ్మెంతో కానీ, నెగిటివ్‌గానో, పాజిటివ్‌గానో ఇమ్రాన్‌కు ప్రచారమైతే దక్కింది. ఇవన్నీ పొదుపు చర్యలని పాలకులంటే, వట్టి జిమ్మిక్కులన్నది ప్రతిపక్ష వాదన. వర్ధమాన దేశమైన పాక్ కొండంత అప్పుల్లో ఉంది. అప్పుల ఊబి నుంచి బయటపడేయడం కోసం సాక్షాత్తూ ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి’ సంస్థ (ఐఎంఎఫ్) ఇచ్చిన ప్యాకేజీలో ఆ దేశం ఇప్పటికే భాగం. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు, నిరుడు మొదలైన కరోనా ఆ దేశం నడ్డి విరిచింది. పంచదార, గోదుమల మొదలు టమోటాలు, ఉల్లిపాయలు, మాంసం, కోడిగుడ్లు – నిత్యావసరాల ధరలన్నీ ఆకాశాన్ని అంటాయి. ఒకదశలో అక్కడ డజను కోడిగుడ్లు రూ. 200 నుంచి 240 దాకా పలికాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజా సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టడానికి తగినంత డబ్బు లేదని మూడేళ్ళ క్రితం ప్రధానమంత్రిగా ఎన్నికైనప్పుడే ఇమ్రాన్ ఖాన్ కుండబద్దలు కొట్టారు. కానీ, పేరుకున్న అప్పులలో ఓ పంటి కిందకు కూడా రాని తాజా పొదుపు చర్యలు ఆ దేశ ఆర్థిక దురవస్థకు మచ్చుతునకలు. అంతర్జాతీయ సమాజంలో మర్యాదను తగ్గించే మరకలు. అసమర్థ నాయకత్వం, అవినీతి, అనవసరమైన యుద్ధ ప్రియత్వం, అంతకంతకూ పెరుగుతున్న జనాభా, ఆర్థిక రంగంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, పెంచిపోషిస్తున్న తీవ్రవాదం లాంటివన్నీ పాకిస్తాన్ ప్రస్తుత దుఃస్థితికి కారణాల్లో కొన్ని. వాటిని సరిదిద్దుకోకుండా, అప్పుల కోసం చైనాతో దోస్తీ కడుతూ, అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లకు తానాతందానా అంటూ, భారత్‌తో కయ్యానికి దిగుతూ... పాకిస్తాన్ మరింత ఊబిలోకి దిగబడిపోతుండడమే విచిత్రం. గాయం ఒకచోటైతే, మందు మరొకచోట రాయడమంటే ఇదే! పాకిస్తాన్‌ను దిగువ మధ్యతరగతి ఆదాయ దేశంగా 2008 నుంచి వర్గీకరించారు. ఉపఖండంలో అత్యధిక జనాభా పెరుగుదల రేటున్నదీ పాక్‌లోనే! అలాగే, ప్రపంచంలోకెల్లా అధిక జనాభా ఉన్న దేశాల్లో అయిదో స్థానమూ పాక్‌దే. 1951 నుంచి 2017 మధ్య కాలంలో పాక్ జనాభా ఆరు రెట్లు పెరిగింది. 3.4 కోట్ల నుంచి 20.8 కోట్లు అయింది. జనాభా పెరుగుదలను అరికట్టి, సరైన చర్యలు తీసుకోకపోతే 2017 నుంచి 2050 మధ్య జనాభా ఏకంగా 84 శాతం మేర పెరుగుతుందని ఊహ. అదే సమయంలో ఆర్థిక వృద్ధి ఏమో కనాకష్టం. కనీసం మరో నాలుగైదేళ్ళ పాటు పరిస్థితి దయనీయంగా ఉంటుందని అంచనా. విద్య, ఉపాధిలోనే కాదు... చివరకు మహిళలకు విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారాల్లోనూ పాక్ వెనుకబడి ఉంది. ఉన్నంతలో సేవారంగాల్లో ఉపాధి దొరుకుతోంది కానీ, పారిశ్రామిక, వస్తూత్పత్తి రంగాలు బలహీనమే. ఇవన్నీ పాక్‌ను పట్టిపీడిస్తున్న పెను సమస్యలు. అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ళలో ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ వీటిని చక్కదిద్దడంలో సఫలం కాలేదు. అందుకు సరైన ప్రయత్నమూ చేసినట్టు కనిపించలేదు. చివరకు, ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్’ (ఎఫ్ఏటీఎఫ్) దేశాల ‘గ్రే లిస్టు’ నుంచైనా ఆ దేశం బయట పడనే లేదు. ఇలా చక్కదిద్దుకోవాల్సినవి చాలా ఉంటే, అద్దెలు, అమ్మకాల కంటితుడుపు చర్యలతో ఏం లాభం? మొత్తం మీద క్రికెట్ కెప్టెన్సీ కన్నా దేశనాయకత్వం కష్టమని 1992లో పాక్‌కు ఏకైక క్రికెట్ వరల్డ్ కప్ సాధించి పెట్టిన సారథి ఇమ్రాన్‌కు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఆర్థికంగా దేశం గాడిన పడాలంటే ప్రచారం కోసం చేసే ప్రతీకాత్మక చర్యలు చాలవని ఇప్పటికైనా ఆయన తెలుసుకోవాలి. తీసుకోవాల్సిన అసలు చర్యలు, చేపట్టాల్సిన ఆర్థిక వ్యూహాలు, మార్చుకోవాల్సిన రాజకీయ వైఖరుల మీద ఇప్పటికైనా దృష్టి పెడితే పాకిస్తాన్‌కు మంచిది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు కావస్తున్నా దాయాది దేశం ఇలా మిగలడం మాత్రం ఇప్పటికీ సోదరభావం ఉన్నవారికి విచారకరమే. -
ఆటలంటే మాటలా!
దేశ ప్రజల్లో ఆశలు పెంచిన మేటి బాక్సర్ మేరీకోం టోక్యో ఒలింపిక్స్ నుంచి ఒట్టి చేతులతో నిష్క్రమించారు. మూడింట రెండు రౌండ్లు నెగ్గి కూడా, ఓడి ప్రీ–క్వార్టర్ ఫైనల్స్ నుంచే ఆమె వెనుదిరగడంతో దేశం నివ్వెరపోయింది. క్రీడాసక్తులైన ఔత్సాహికులు కొందరి ఉవాచ ఏమంటే... ‘కోట్ల మంది భారతీయుల ఆశల్ని మేరీ కోమ్ వమ్ము చేసి, నిరాశపరిచారు’అని. బహుశా కొన్ని చానళ్లూ, పత్రికలూ తమ పతాకశీర్షికల్ని ఇలా రాస్తాయేమో! కానీ, ఇక్కడో విషయం గమనించాలి. 130 కోట్ల జనాభా దేశం ఒక క్రీడాకారిణిపై అంతగా ఆశలు పెట్టుకోవడం తప్పా? బాక్సింగ్ వంటి క్రీడలో... ఇప్పటికే ఆరుమార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నలుగురు పిల్లల తల్లి, వారి ఆశల్ని ఇంకా... నెరవేర్చలేకపోవడం ఆమె తప్పా? ఆలోచించదగిందే! ఆటల్లో గెలుపోటములు సహజం. ఎంత గొప్ప క్రీడాకారులైనా అన్నిమార్లూ గెలవలేరు. క్రీడలు పతకాల కోసం కాదు, క్రీడాస్ఫూర్తి కోసం! మనం ఏ మేరకు క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహిస్తున్నాం? క్రీడలకు మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? క్రీడా రంగాన్ని అట్టడుగు స్థాయి నుంచి ఎంతమేర శాస్త్రీయ పంథాలో అభివృద్ధి పరు స్తున్నాం? ఇవీ మన ముందున్న ప్రశ్నలు. వీటికి సమాధానం కావాలి. ప్రతిసారి ఒలంపిక్స్ ముందు పెద్ద ఎత్తున ఆశలతో బృందాల్ని పంపడం, తీరా పోటీలు ముగిశాక... ఆశించిన స్థాయిలో పతకాలు రాలేదని నిరాశపడటం. ఇది మనకు రివాజయింది! వాస్తవిక పరిస్థితుల్ని అంగీకరించే ఆత్మపరిశీలన ఎప్పుడూ జరుగదు. నేల చదును పరుచకుండా, యోగ్యమైన విత్తనాలు చల్లకుండా, శ్రద్ధాసక్తులతో సాగు చేయకుండా పంట దిగుబడి ఆశించినట్టు ఉంటుంది క్రీడల్లో మన వ్యవహారం. ప్రభుత్వాలు, ప్రయివేటు సంస్థల ప్రోత్సాహంతో ఈసారి కొంత ఆశాజనకం అనిపించినా.... ప్రతికూలాంశాలు ఇప్పుడే తలెత్తాయి. కోవిడ్‌వల్ల తగినంత శిక్షణ లభించక, స్పర్ధకు అవకాశంలేక, క్రీడాకారుల్లో మానసిక దృఢత్వం కొరవడి ప్రతిభ పూర్తిస్థాయి రాణించని స్థితి నెలకొంది. లండన్ 2012 ఒలింపిక్స్‌లో ఆరు పతకాలు నెగ్గిన భారత్, ఇనుమడించిన ఉత్సాహం, గంపెడా శలతో వెళ్లి రియో 2016 ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో సరిపెట్టుకుంది. ఈ ‘ఒకడుగు ముందుకి, రెండడుగులు వెనక్కి’ పరిస్థితి క్రీడల్లో మనకు మొదట్నించీ ఉంది! కిందిస్థాయి నుంచి క్రీడా నైపుణ్యాల వృద్ధి, ఆరోగ్యకరమైన స్పర్ధ వాతావరణం, అంతర్జాతీయ పోటీని తట్టుకునే సన్నద్ధత లేమి ఇందుకు కారణం. వ్యక్తిగతంగా అసాధారణ ప్రతిభ చూపి, ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ వేదికల్లో పతకాలు నెగ్గిన వారికి ప్రభుత్వాలు ప్రోత్సాహకాలివ్వడం, ఇతరుల్లో స్ఫూర్తి నింపడం మెచ్చతగిందే! కానీ, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నగదుగా, కోట్లాది రూపాయలు విలువచేసే భూముల్ని అకాడమీల పేరిట అప్పగించడం సముచితమా? దానికి బదులు క్రీడలకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యత కల్పించి, నిధులిచ్చి మౌలిక సదుపాయాలు పెంచాలి. ఆటల్లో అగ్రభాగాన ఉండే ఎన్నో దేశాల్లో ఇలా వ్యక్తిగత నగదు బహుమతులుండవు. మనం కూడా క్రీడా ప్రాంగణాలు, క్రీడా హాస్టళ్లు, క్రీడా సామగ్రితోనూ గట్టి వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలి. పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల స్థాయిలో నిర్బంధ క్రీడా విధానాన్ని అమలు చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల్ని ప్రోత్సహించాలి. విద్యా, ఉపాధి అవకాశాల్లో క్రీడాకారులకు తగు నిష్పత్తిలో రిజర్వేషన్ కల్పించాలి. దేశంలో క్రికెట్ కున్న ప్రజాదరణతో ఇతర మొత్తం క్రీడలకున్న ప్రాధాన్యత కూడా సరితూగదు. అన్ని క్రీడాంశాల్లో తగిన వసతులు, వనరులు, స్పర్ధ, ప్రోత్సాహకాల్ని పెంచాలి. మొక్కగా ఉన్నపుడు చేస్తేనే క్రీడల్లో నైపుణ్యం పెరుగుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలను మనవాళ్లు అందుకోగలుగుతారు. ఈసారి 117 మంది క్రీడాకారులతో, 228 మంది అతి పెద్ద బృందం టోక్యో వెళ్లింది. షూటింగ్, విలువిద్య, కుస్తీలు, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, హాకీ వంటి అంశాల్లో గంపెడాశలతోనే వెళ్లి ప్రతిభను పరీక్షించుకుంటున్నారు. రియో ఒలింపిక్స్ తర్వాత... ప్రత్యేక శ్రద్ధతో ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీం’(టాప్స్), ‘ఖేలో ఇండియా’ వంటివి పెట్టి కేంద్ర ప్రభుత్వం, ‘జేఎస్‌డబ్ల్యూ’తో జిందాల్, ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్... ఇలా ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలు కూడా మంచి ప్రోత్సాహ మిచ్చాయి. ఆశలు పెరిగాయి. ఫలితాలే ఆశించినట్టు లేవు! 68,000 జనాభా కలిగిన చిన్న దేశం బెర్మడా, ఫిజీ వంటివి కూడా బంగారు పతకాలతో జాబితాకెక్కాయి. తొలిరోజు మీరాబాయి అందించిన రజతమే భారత్‌ను జాబితాలో నిలిపింది. తర్వాత ఇంకేమీ రాలే! మన క్రీడాకారులపై ఒత్తిడి కూడా ప్రతికూలంగా పనిచేస్తోంది. లండన్ ఒలింపిక్ పతక విజేత గగన్ నరంగ్ (షూటింగ్) అన్నట్టుగా ఆటను ఆస్వాదించడం, పోటీని తట్టుకోవడమే కాదు విమర్శల్ని ఎదుర్కోవడంలోనూ యువ ఆటగాళ్లు రాటు తేలాలి. ఒలింపిక్ వేదికల్లో కెమెరాలు, ఆటగాళ్ల గుండె కొట్టుకునే పల్స్‌రేట్‌ను కొలుస్తున్నపుడు, మనవాళ్లు ఎంతో ఒత్తిడికి గురవుతున్నట్టు నమోదవుతోంది. వాటిని అధిగమిస్తేనే అసలైన క్రీడాస్ఫూర్తి! క్రీడల్ని ప్రోత్సహించడంలో హరియాణా, పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాల సరసన మిగతా రాష్ట్రాలూ చేరాలి. ఈశాన్యభారత్‌లోని చిన్న రాష్ట్రమే అయినా మణిపూర్ క్రీడలకు పెట్టింది పేరు. ‘మణిపూర్‌లో గుడ్డిగా రాయి విసిరితే, అది ఓ క్రీడాకారునికి తగులుతుంద’ని నానుడి. గ్రామీణ స్థాయి నుంచి అంత పకడ్బందీగా ఆటలు ఆడుతారు కనుకే ప్రస్తుత ఒలింపిక్ జట్టులో మణిపురీలు ఐదుగురున్నారు. ఇప్పటికి మనకు లభించిన ఒకే ఒక పతకం ఆ రాష్ట్ర చలువే! ఆ స్ఫూర్తే దేశవ్యాప్తమవ్వాలి! -
అతి అణచివేతతో తిరుగుబాటు తీవ్రం
ఆదివాసీల ఆత్మీయనేస్తం ఫాదర్ స్టాన్‌స్వామి (84) నిర్బంధంలో చనిపోవడం పలువుర్ని చలింపజేసింది. ఇది మామూలు మరణం కాదని, వ్యవస్థ చేసిన హత్యగా హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులంటున్నారు. ‘మిట్టమధ్యాహ్నమే కమ్మిన కారుచీకటి’గా న్యాయకోవిదులే అభివర్ణిస్తున్నారు. ఈ మర ణాన్ని, ప్రపంచ స్థాయిలో ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం, ఐరోపా సమాజ ప్రతినిధి... ఇలా పలువురు ఖండించారు. ప్రశ్నించే గొంతుల్ని, నిరసించే బృందాలను, అసమ్మతి స్వరాలను సాక్ష్యం లేని అభియోగాలతో నిర్బంధించేందుకు ‘ఉపా’ చట్టం ఒక అస్త్రం కావడం దారుణం, అమానుషం. విచారణే మొదలు కాని కేసులో, న్యాయ ప్రక్రియే మరణశిక్ష అయింది. ఆధారాల్లేని అభియోగాలు ఎదుర్కొంటున్న ఓ హక్కుల కార్యకర్త... వృద్ధాప్యానికి, వ్యాధులకు, కడకు బెయిల్ నిరాకరణకు బలై నిర్బంధంలోనే అసహజ మరణం పొందారు. దీనికి బాధ్యులె వరు? నేరుగా జవాబు రాకపోగా... లోపభూయిష్టమైన మన నేర– న్యాయ నిర్వహణ (క్రిమినల్ జస్టిస్) ప్రక్రియపైనే ఇది సందేహాలను రేకెత్తిస్తోంది. నిర్హేతుక నిబంధనలున్న ‘చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)’ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. రాజ్యం–పోలీసు అపవిత్ర బంధం ఎల్లలు దాటి, ‘అసమ్మతి’ని అణచివేస్తున్న దాష్టీ కాన్ని ఎత్తిచూపుతోంది. రాజ్యాంగ స్ఫూర్తిని కాదని వక్రగతిన సాగే చట్టం అమలును ఉపేక్షిస్తున్న న్యాయవ్యవస్థ దౌర్బల్యాన్ని తెరకెక్కి స్తోంది. ఇదిక్కడితో ఆగకూడదు. జరిగే దురాగతాలకు బాధ్యులెవరో తేలాలి. అందుకు, పౌరసమాజం చేతనతో, ఈ అరిష్టాలకు మూలాలు వెతికి పట్టుకోవాల్సిన, అడ్డుకోవాల్సిన సమయం వచ్చింది. ఆదివా సీల ఆత్మీయనేస్తం ఫాదర్ స్టాన్‌స్వామి (84) నిర్బంధంలో చని పోవడం పలువుర్ని చలింపజేసింది. వృద్ధాప్యం, పార్కిన్సన్ వ్యాధి, కోవిడ్ అనంతర సమస్యలు.... పలుమార్లు బెయిల్ కోరి నిరాకరణకు గురైన దురవస్థ! ఇది మామూలు మరణం కాదని, వ్యవస్థ చేసిన హత్యగా హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులంటున్నారు. ‘మిట్టమధ్యాహ్నమే కమ్మిన కారుచీకటి’గా న్యాయకోవిదులే అభి వర్ణిస్తున్నారు. ఈ మరణాన్ని, ప్రపంచ స్థాయిలో ఐక్యరాజ్యసమితి (యూఎన్) మానవహక్కుల విభాగం, ఐరోపా సమాజ (ఈయూ) ప్రతినిధి... ఇలా పలువురు ఖండించారు. దేశంలోని పది రాజకీయ (వి)పక్షాలు, బాధ్యులపై చర్య తీసుకోవాలని, భీమా–కోరేగావ్ నింది తులతో పాటు రాజకీయ కారణాలతో నిర్బంధంలో ఉన్న వారందరినీ బెయిల్‌పై విడుదల చేయాలని రాష్ట్రపతిని కోరారు. ఇదే కేసు సహ నిందితులు జైళ్లోనే ఒక రోజు నిరాహారదీక్ష చేశారు. ఇంతటి స్పంద నలు రేకెత్తించిన ఈ ఘటనను కేవలం ఒక హక్కుల కార్యకర్త మరణంగానే చూడకూడదు. ప్రజావిశ్వాసం కోల్పోతూ... రాజకీయ, పాలన, న్యాయ వ్యవస్థలు రోజురోజుకూ క్షయమవుతున్న దుస్థితికి నిలువెత్తు నిదర్శనంగా చూడాలి. సంబంధం లేని కేసులో.... కోరేగావ్ తానెప్పుడూ వెళ్లలేదని, తనకీ కేసుతో సంబంధమే లేదని రోమన్ కాథలిక్ పూజారి స్టాన్ స్వామీ మొదట్నుంచీ చెప్పారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐజీ) పథకం ప్రకారం తనను ఇరికించిన తీరుకు ఆశ్చర్యపోలేదు. అరెస్టుకు ముందు విడుదల చేసిన వీడియో కథనం ప్రకారం, ఆయనకీ విషయంలో స్పష్టత ఉంది. ‘ప్రశ్నించిన వారి గొంతు దేశమంతటా నొక్కుతున్నారు. నాకొక్కడికే జరుగుతు న్నది కాదిది. సంతోషం, ఈ ప్రక్రియలో నేను భాగమయ్యాను. ఎందు కంటే, నేను మౌన ప్రేక్షకుడిని కాదు. ఈ ఆటలో భాగమైన వాణ్ణే! ... తగు మూల్యం చెల్లించడానికి నేను సిద్ధమే!’ అన్నారు ధీమాగా! కానీ, ప్రాణాలనే ఇచ్చి మూల్యం చెల్లించాల్సి రావడం దురదృష్టకరం. 2018 జనవరి 1 భీమా–కోరేగావ్ అల్లర్ల వెనుక మావోయిస్టులున్నారని, వారిని హింసకు ప్రేరేపించిన ప్రసంగాలు 2017 డిసెంబరు 31 ఎల్గార్ పరిషత్ సమావేశంలో జరిగాయనేది కేసు. మరికొందరు ఒకరితో ఒకరు మాటాడుకుంటూ కుట్రపన్నారనేది ఆరోపణ. విప్లవకవి, హక్కుల యోధుడు వరవరరావుతో పాటు మొత్తం 17 మంది కవులు, న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు, ఇతర మేధావుల్ని ఈ కేసులో అరెస్టు చేశారు. నిషేధిత మావోయిస్టులతో చేతులు కలిపి, ప్రభు త్వాన్ని కూల్చే విశాల కుట్ర పన్నారనేది ప్రధాన అభియోగం. ‘మావో యిస్టు సిద్దాంతాలను నేను ఒప్పుకోను, వ్యతిరేకిస్తాను’ అని బహి రంగంగా ప్రకటించే వ్యక్తికి, వారితో ‘కుట్ర’ సంబంధాలు అంట గట్టడంలోనే అభియోగమెంత బలహీనమో తేలిపోయింది. బెయిల్ వినతి వచ్చినపుడు, నమ్మదగ్గ సాక్ష్యాలను బట్టే న్యాయస్థానాలు నిర్ణయం తీసుకుంటాయి. ఈ కేసులో ఇప్పటివరకు అభియోగ పత్రాన్ని ఖరారు చేసి విచారణ ప్రారంభించలేదు. ఇక స్వామిపై వచ్చిన అభియోగాలకు ఆధారమని, ఆయన ల్యాప్‌టాప్‌లోని పత్రా లను చూపిస్తున్నారు. మరో నిందితుడు సురేంద్ర గాడ్లింగ్ కంప్యూటర్ రెండేళ్లుగా దురుపయోగమౌతోందని, ‘మాల్వేర్’ ద్వారా అందులోకి డాక్యుమెంట్లు పంపేందుకు గల ఆస్కారాన్ని అమెరికాకు చెందిన డిజి టల్ ఫోరెన్సిక్ సంస్థ నిరూపించింది. అదే, స్టాన్‌స్వామీ ల్యాప్‌టాప్ తోనూ జరిగే ఆస్కారం ఉంది. ఎందుకంటే, అరెస్టుకు ముందు రెండు సార్లు ఆయన గదిలో సోదాలు జరిపి, ల్యాప్‌టాప్, మొబైల్ తది తరాల్ని దర్యాప్తు బృందం స్వాధీనపరచుకుంది. నిర్దిష్ట ఆరోపణ లున్నా, దీనిపై విచారణే జరుగలేదు, ఇది నమ్మదగ్గ సాక్ష్యం కాదు. ఇంతటి కాఠిన్యం యాధృచ్ఛికమా? న్యాయ కస్టడీలో, మొదట చికిత్సకు నిరాకరించినా, ‘వారిచ్చే చిన్న మాత్రల కన్నా, నా వ్యాధి తీవ్రతే హెచ్చుగా ఉంది, ఏమో నేను చచ్చి పోతానేమో?’ అని ఒక దశలో సందేహించిన స్వామీ, చివరకు ఆస్పత్రిలో చేరడానికి అంగీకరించారు. మూడు దశాబ్దాలకు పైగా జార్ఖండ్‌లోని ఆదివాసీల హక్కుల కోసం స్టాన్‌స్వామి పోరాడు తున్నారు. గిరిజనుల అటవీ–భూమి హక్కుల కోసం, యువత అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా పోరాటాలకు ‘బగీచా’ను స్థాపించారు. 3000 మంది యువకులను మావోయిస్టులుగా ముద్రవేసి, అక్ర మంగా జైళ్లలో కుక్కడాన్ని నిరసిస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశారు. అరెస్టయిన 97 శాతం మందికి మావోయిస్టులతో ఏ సంబంధం లేదని, 96 శాతం యువత కుటుంబ నెలసరి ఆధాయం రూ. 5 వేల లోపని నిర్ధారించారు. నిష్కారణంగా జైళ్లో మగ్గి, విలువైన జీవిత కాలాన్ని, కొన్నిసార్లు జీవితాల్ని కోల్పోతున్నారని స్వామి తరచూ బాధపడేవారు. ఈ సుదీర్ఘ పోరాట క్రమమే పాలకులకు, వారితో అంటకాగుతున్న కార్పొరేట్ శక్తులకు కంటగింపైంది. యథే చ్చగా సహజవనరుల్ని, ప్రకృతి సంపదను కొల్లగొట్టే తమకు... పోరా టాలు అవరోధంగా, స్వామీ ఒక అడ్డంకిగా కనిపించారు. కుంటి జిల్లా ‘ముండే’ ఆదివాసీల భూహక్కుల కోసం సాగిన ‘పథల్ గాడీ’ ఉద్య మాన్ని అణచివేసేందుకు, 20 మందిపై రాజద్రోహం కేసు పెట్టారు. అందులో స్టాన్‌స్వామీ ఒకరు. రాజ్యాంగ రక్షణకు, దానికి లోబడి శాంతియుతంగా పోరాడుతున్న వ్యక్తిని వ్యవస్థ హతమార్చింది. పరి వర్తన కేంద్రాలు, సంస్కరణాలయాలు అని చెప్పుకునే మన జైళ్లలో... ఇంతటి కాఠిన్యం బయటి వారూహించరు. 84 ఏళ్ల వయసులో, పార్కిన్సన్ వ్యాధివల్ల ‘గ్లాసు పట్టుకొని నీళ్లు తాగలేకపోతున్నాను స్ట్రానో, సిప్పరో ఇప్పించండి’ అంటే, మూడు వారాలు జాప్యం చేసిన కర్కశత్వం చరిత్రలో నిలుస్తుంది. ప్రత్యేక కోర్టు జడ్జి బెయిల్ నిరా కరిస్తూ, ‘స్వామి వ్యక్తిగత స్వేచ్ఛ కన్నా సమాజ ఉమ్మడి ప్రయోజనాలే ప్రాధాన్యమైనవి’ అన్నారు నిష్కర్షగా! ఈ నెల 6న ముంబాయి హైకోర్టు ముందు బెయిల్ పిటిషన్ విచారణ ఉన్నపుడు... ఒకరోజు ముందు, 5ననే స్టాన్, ఏ బెయిలూ అవసరం లేని లోకాలకు వెళ్లి పోయారు. 2016–19 నాలుగేళ్లలో 2.2 శాతం కేసుల్లోనే నేర నిరూపణ జరిగి శిక్షలు పడ్డాయి. అందుకే, ‘ఉపా’ చట్టం పాలకుల చేతిలో దురుప యోగమౌతోంది. ప్రశ్నించే గొంతుల్ని, నిరసించే బృందాలను, అస మ్మతి స్వరాలను సాక్ష్యం లేని అభియోగాలతో నిర్బంధించేందుకు ఇదొక అస్త్రం. అరెస్టు చేయడం, బెయిల్ నిరాకరించడం, గిట్టని వారిని పాలకులు కోరుకున్నంత కాలం నిర్బంధంలోనే ఉంచడం రివాజ యింది. గొంతెత్తే ఇతరులకు, ఇది ముందస్తు హెచ్చరికగానూ పని కొస్తోంది. ఇదివరకటి నల్లచట్టాలు ‘టాడా’ ‘పోటా’ల దారిలోనే ‘ఉపా’ కూడా అటకెక్కాల్సిన సమయం వచ్చింది. అణచివేత ఎంత అధికంగా ఉంటే, అనులోమ నిష్పత్తిలోనే తిరుగుబాటు తీవ్రత ఉంటుందని రాజ్యం గ్రహించాలి. దిలీప్ రెడ్డి ఈమెయిల్ : dileepreddy@sakshi.com -
‘సుప్రీం’ స్ఫూర్తికి విరుద్ధం
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులకూ, చట్టసభలకూ ఎనలేని ప్రాధాన్యత వుంటుంది. దేశ రాజధాని కావటం వల్ల కావొచ్చు... ఢిల్లీకి సంబంధించినంతవరకూ అక్కడి అసెంబ్లీకి మొదటి నుంచీ పరిమితమైన అధికారాలే వున్నాయి. పేరుకు ముఖ్యమంత్రి, మంత్రులు వున్నా, దానికి పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి లేదు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గత కొన్నేళ్లుగా ప్రశ్నిస్తూనే వున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)గా వున్నవారితో ఆయనకు భిన్న సందర్భాల్లో ఘర్షణలు కూడా తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు మరింత కోతపెడుతూ కేంద్ర ప్రభుత్వం మొన్న సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుపై సహజంగానే ఆగ్రహావేశాలు రగుల్కొ న్నాయి. దీనిపై పాలక ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఉద్యమం ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వ జాతీయ రాజధాని ప్రాంత చట్టం,1991ని సవరిస్తూ తీసుకొచ్చిన ఈ బిల్లు ప్రకారం ఇకపై అక్కడ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరే. పాలనాపరమైన ఏ చర్య తీసుకోవటానికైనా అక్కడి ప్రభుత్వం ఎల్జీని సంప్రదించాలి. ఈ బిల్లు చట్టమైతే అసెంబ్లీ, దానికి సంబంధించిన కమిటీలు రాజధాని ప్రాంతంలో రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన లేదా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటం సాధ్య పడదు. మూడేళ్లక్రితం ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కూ, ఎల్జీకీ మధ్య వివాదం తలెత్తినప్పుడు అధికారాల విభజనకు సంబంధించి సమగ్ర చట్టం తీసుకురావాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఆ ప్రకారమే తాము తాజా సవరణలు తెస్తున్నామని బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. అయితే ఈ బిల్లు సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తికి అనుగుణంగా వుందని చెప్పటానికి లేదు. 1992లో ఢిల్లీకి ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తూ 69వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఆ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన 239ఏఏ అధికరణ ప్రకారం తనకు సర్వాధికారాలూ వున్నాయని ఎల్జీ వాదన. ఢిల్లీ హైకోర్టు ఆయన వాదనను అంగీకరించింది. తాము తీసుకుంటున్న వివిధ నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లపై ఎల్జీ ఎటూ తేల్చకుండా అవరోధాలు సృష్టిస్తున్నారని కేజ్రీవాల్ సర్కారు వాదించగా, పాలనాపరంగా ఆయనే సర్వాధికారి అని, ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా ఆయన సమ్మతి అవసరమని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. కానీ సుప్రీంకోర్టు ఇందుకు భిన్నమైన తీర్పునిచ్చింది. ఎల్జీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసు కోవటానికి లేదని, ఆయన మంత్రి మండలి సలహాలు, సూచనలమేరకు పనిచేయాలని స్పష్టం చేసింది. అయితే ఇందుకొక మెలిక పెట్టింది. ఏ నిర్ణయాన్నయినా రాజ్యాంగదత్తమైన అధికారాలతో వ్యతిరేకించేందుకు ఎల్జీకి హక్కుందని, తుది నిర్ణయం కోసం ఆయన రాష్ట్రపతికి నివే దించవచ్చునని తెలిపింది. అదే సమయంలో ఈ నిర్ణయాధికారాన్ని యాంత్రికంగా ఉపయో గించరాదని వివరించింది. 239ఏఏ అధికరణ ప్రకారం ప్రజా భద్రత, పోలీసు, భూ సంబంధ అంశాలు మినహా మిగిలిన విషయాల్లో చట్టాలు చేసేందుకు ఢిల్లీ అసెంబ్లీకి అధికారాలున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సున్నితమైన అంశాలు ఇమిడివున్నవీ, ప్రభుత్వ స్తోమతకు మించి ఆర్థిక భారం పడేవీ, కేంద్రంతో లేదా పొరుగు రాష్ట్రాలతో రాజకీయ సమస్యలకు తావిచ్చేవీ ఎల్జీ రాష్ట్రపతికి నివేదించవచ్చు. కానీ ఆ తీర్పు ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి లభించిన పరిమిత ఉపశ మనాన్ని కాస్తా తాజా సవరణ బిల్లు హరిస్తోంది. కొందరు విశ్లేషకులు చెబుతున్నట్టు అది చట్టమైతే ఢిల్లీ ప్రతిపత్తి మున్సిపాలిటీకన్నా మిన్నగా ఏమీ వుండదు. ఢిల్లీకి 1956కు ముందు పనిచేసిన ఇద్దరు ముఖ్యమంత్రుల మాటేమోగానీ... 1993లో అక్కడ మళ్లీ అసెంబ్లీని పునరుద్ధరించినప్పటినుంచీ తగినన్ని అధికారాలివ్వాలన్న డిమాండ్ పదే పదే వస్తూనేవుంది. బీజేపీ సీనియర్ నేత మదన్‌లాల్ ఖురానా, ఆ తర్వాత అదే పార్టీకి చెందిన సాహిబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్ వంటివారు సీఎంలుగా పనిచేసినప్పుడు మాత్రమే కాదు...కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ సైతం ఎన్నికైన ప్రజా ప్రతినిధులను చిన్నచూపు చూస్తున్నారని, తాము నామమాత్రం అవుతున్నామని ఆరోపించేవారు. అయితే తమ పార్టీకి చెందిన ప్రభుత్వాలే కేంద్రంలో అధికారంలో వుండటం వల్ల చివరకు ఎప్పుడూ వారిదే పైచేయి అయ్యేది. కానీ ప్రస్తుత ముఖ్య మంత్రి కేజ్రీవాల్ పరిస్థితి వేరు. ఆయనకు వర్తమానంలో సరేసరి... యూపీఏ పాలనాకాలంలోనూ కష్టాలు తప్పలేదు. బస్తీల్లో క్లినిక్‌ల ఏర్పాటు మొదలుకొని టీచర్ పోస్టుల భర్తీ, వారి పదోన్నతులు, కాంట్రాక్టు టీచర్ల క్రమబద్ధీకరణ వరకూ అనేక అంశాలు ఎల్జీ వద్ద దీర్ఘకాలం పెండింగ్‌లో పడ్డాయి. ఢిల్లీకున్న ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని అధికారాలు కేంద్రం వద్దనే వుండాలనుకోవటంలో తప్పేమీ లేదు. కానీ టీచర్ల నియామకం, బస్తీ క్లినిక్‌ల వంటి ప్రజానుకూల అంశాల్లో సైతం ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోరాదనటం... అందుకు తమ ఆమోదముద్ర అవసరమనటం అప్రజా స్వామికం. తమను గెలిపిస్తే ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తామని బీజేపీ గతంలో వాగ్దానం చేసింది. అది నెరవేర్చకపోగా వున్న అధికారాలను కూడా హరించటం సరైంది కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి తగిన అధికారాలివ్వాలి. ఆ నిర్ణయాల్లో తప్పొప్పులుంటే ఎటూ జనం ప్రశ్ని స్తారు. వాటి రాజ్యాంగబద్ధతను న్యాయస్థానాలు తేలుస్తాయి. అంతేతప్ప ఆ ప్రభుత్వాలను నామ మాత్రావశిష్టం చేయటం ఎంతమాత్రం భావ్యం కాదు. -
చైనా సైబర్ పడగ!
సైబర్ దాడుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో అపకీర్తి మూటగట్టుకున్న చైనా నిరుడు అక్టోబర్‌లో మన విద్యుత్ గ్రిడ్లపై తన ప్రతాపం చూపిందన్న కథనం సహజంగానే అందరినీ కలవరపెట్టింది. అమెరికాలోని ‘న్యూయార్క్ టైమ్స్’ వెలువరించిన కథనంపై చైనా ఆగ్రహోదగ్రం కావటం, ఆ దాడిలో మనకు ఎలాంటి నష్టమూ కలగలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించటం ఈ కథనంపై కొంత అయోమయాన్ని సృష్టించాయి. అయితే దాడి జరిగిన మాట వాస్తవం. దాని పర్యవసానంగా నిరుడు అక్టోబర్ 12న ముంబై విద్యుత్ గ్రిడ్ దాదాపు రెండు గంటలపాటు విఫలం కావటం, విద్యుత్ సరఫరా నిలిచిపోవటం, రైళ్లు ఆగిపోవటం, ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్సలో వున్న వేలాదిమంది రోగులు ఇబ్బందులెదుర్కొనటం వగైరాలు నిజం. ఇది చైనా సైబర్ దుండగుల పని కాకపోతే ఎవరు చేసివుంటారన్నది మున్ముందు వెల్లడయ్యే అవకాశం వుంది. అయితే ఈ దాడి జరిగిన సమయం చూస్తే సహజంగానే చైనాపై అనుమానాలు తలెత్తుతాయి. అప్పటికి లద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలున్నాయి. నిరుడు మే నెలలో కల్నల్ సంతోష్‌బాబుతోసహా మన జవాన్లు 21మందిని చైనా సైనికులు కొట్టి చంపారు. ఆ తర్వాత మన ప్రభుత్వం భద్రతా కార ణాలరీత్యా దాదాపు వంద చైనా యాప్‌లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. వీటన్నిటికీ ప్రతీ కారంగానే చైనాకు చెందిన దుండగులు సైబర్ దాడులకు పాల్పడ్డారని, భారత్‌ను బెదిరించటమే ఈ దాడుల లక్ష్యమని ‘రికార్డెడ్ ఫ్యూచర్’ అనే అమెరికన్ సంస్థను ఉటంకిస్తూ ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం చెబుతోంది. భూగోళంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా కన్నుమూసి తెరిచేంతలో ఏ సమాచారాన్నయినా చేర్చగల సామర్థ్యం, దేన్నయినా నియంత్రించగల శక్తి సైబర్ ప్రపంచంలో వుంది. కానీ ఇంత వెసులుబాటులోనూ నిత్యం పెను ప్రమాదాలు పొంచివుంటాయి. దాన్ని దుర్వినియోగం చేసే చిల్లర నేరగాళ్ల సంగతలావుంచి పకడ్బందీ భద్రత వుందనుకునే కీలక వ్యవస్థల్లోకి చొరబడగల హ్యాకర్లు కూడా వుంటారు. దాదాపు నాలుగేళ్లక్రితం ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లోని లక్షలాదిమంది వ్యక్తుల, సంస్థల కంప్యూటర్లు హ్యాక్ చేసిన సైబర్ దుండగులు వాటిల్లోని విలువైన సమాచారాన్ని గుప్పెట్లో పెట్టుకుని దాన్ని వెనక్కివ్వాలంటే బిట్ కాయిన్ల రూపంలో 300 డాలర్ల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత దాదాపు 50,000 డాలర్లు వారికి ముట్టాయి కూడా. ఆ హ్యాకింగ్ వల్ల మన దేశంతోపాటు బ్రిటన్, జర్మనీ, అమెరికా, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, స్వీడన్, చైనా తదితర దేశాల్లో ఐటీ, కమ్యూనికేషన్లు, విద్యుత్, గ్యాస్ పంపిణీ సహా భిన్న రంగాలు స్తంభించిపోయాయి. బ్రిటన్‌లో శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. సాధారణ రోగులకు వైద్య సలహాలివ్వటం కూడా డాక్టర్లకు అసాధ్యమైంది. నిరుడు మన వ్యవస్థలపై ఈ మాదిరి దాడే జరిగింది. డేటాలోకి దుండగులు చొరబడటంగానీ, దాన్ని దొంగిలించటం గానీ జరగలేదని కేంద్రం చెబుతోంది. అయితే ముంబై మహానగరంలో నిరుడు జరిగిన విద్యుత్ అంతరాయానికీ, దీనికీ సంబంధం వున్నదో లేదో చెప్పలేదు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మాత్రం సైబర్ విద్రోహం కారణంగానే ఈ అంతరాయం కలిగివుండొచ్చని అంటున్నారు. ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం ప్రకారం చైనా మాల్వేర్ మన దేశంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థల్లోకి చొరబడింది. అందులో హైవోల్టేజ్ విద్యుత్ పంపిణీ సబ్ స్టేషన్లతోపాటు, బొగ్గు ఆథారిత విద్యుదుత్పాదన కేంద్రం కూడా వుంది. ఇలా మొత్తం 12 భారతీయ సంస్థలకు చెందిన 21 ఐపీ అడ్రస్‌లపై హ్యాకర్లు దాడిచేసి వాటికి సంబంధించిన కంప్యూటర్లలోకి మాల్వేర్ను చొప్పించారంటున్నది. చైనా అధికార వ్యవస్థకు చెందిన ‘రెడ్ ఇకో’ ఈ నేరానికి పాల్పడిందని ఆ కథనం సారాంశం. మన దేశంలో కీలకమైన వ్యవస్థలకు సైబర్ దుండగులనుంచి మప్పు వాటిల్లకుండా నిరంతరం నిఘావుంచే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్సాన్స్ టీం (సెర్ట్–ఇన్)కు తమ దర్యాప్తులో వెల్లడైన అంశాలను అందజేశామని ‘రికార్డెడ్ ఫ్యూచర్’ సంస్థ చెబుతున్నది కనుక దీనిపై మున్ముందు నిజాలు వెల్లడవుతాయని భావించాలి. హ్యాకర్లు చేసిన ప్రయత్నాలు చిన్నవేమీ కాదు. కేవలం అయిదు రోజుల వ్యవధిలో 40,300 సార్లు ఐటీ, బ్యాంకింగ్ వ్యవస్థలపై ఈ ప్రయత్నాలు జరిగాయంటున్నారు. ఆఖరికి కరోనా టీకాలు రూపొందించిన సీరమ్ ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్‌లపై కూడా దుండగులు కన్నేశారని సమాచారం. ఈ దాడులకు మూలమైన డొమైన్లు చైనాలోని గాంగ్డంగ్, హెనాన్ ప్రావిన్స్‌లలో వున్నాయని ‘న్యూయార్క్ టైమ్స్’ చెబుతోంది. గతంలో దేశాల మధ్య ఘర్షణలు నివారించకపోతే అణుయుద్ధం సంభవిస్తుందన్న భయాందోళనలుండేవి. ఇప్పుడు అంత అవసరం లేదు. ప్రత్యర్థి దేశాన్ని స్తంభింపజేసి, ఊపిరాడకుండా చేయటానికి సైబర్ దాడికి పాల్పడితే చాలు. ఇందులో చైనా మాత్రమే కాదు...అమెరికా, రష్యాలు కూడా ఆరితేరాయి. భిన్న సందర్భాల్లో ఆ దేశాలపైనా ఆరో పణలొచ్చాయి. ఇవాళ ఐటీతో ముడిపడని రంగమంటూ దేశంలో లేదు. కనుక అందులో అడు గడుగునా ఎదురయ్యే ఉపద్రవాలను ఎదుర్కొనడానికి అనువైన రీతిలో మన నిఘా సంస్థలు న్నప్పుడే ఆ వ్యవస్థలన్నిటినీ కాపాడుకోగలం. ఈ విషయంలో మన ప్రభుత్వాలు మరింత శ్రద్ధ పెట్టకతప్పదు. -
శశికళతో ఎవరికి చేటు?
రాజకీయ పార్టీ స్థాపిస్తానన్న సూపర్ స్టార్ రజనీకాంత్ వెనకడుగేయటంతో రెట్టింపు ఉత్సాహంతో వున్న డీఎంకేకు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత సహచరురాలు శశికళ ఆగమనం ఇబ్బంది కలిగించివుండాలి. తమిళనాడు అసెంబ్లీకి మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అయిదు దశాబ్దాలుగా ప్రతి ఎన్నికల సీజన్లోనూ జనాకర్షణ వున్న నేతలనూ, వారి సమ్మోహన ప్రసంగాలనూ వింటూ, మంత్రించినట్టు వారిని అనుసరిస్తూ వెళ్లటమే అలవాటైన తమిళనాడు... తొలిసారి ఆ స్థాయి నాయకులెవరూ లేని ఎన్నికల రణరంగాన్ని చూడబోతోంది. ఉన్నంతలో డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్‌కే ఈసారి అవకాశం వుండొచ్చని రాజకీయ విశ్లేషణలు వెలువడ్డాయి. కానీ నాలుగేళ్ల జైలు జీవితం తర్వాత రాష్ట్రంలో అడుగుపెట్టిన శశికళకు వచ్చిన స్పందన చూశాక అలా చెప్పినవారిలో పునరాలోచన కలిగే అవకాశం వుంది. తమిళనాట ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రభుత్వమే కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పళని స్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం అందరి అంచనాలకూ భిన్నంగా సమష్టిగా పనిచేస్తున్నారు. బీజేపీ అధినేతల ఆశీస్సులతోనే ఇదంతా సాగుతున్నదన్న విమర్శలొస్తున్న మాట వాస్తవమే అయినా పాలనాపరంగా ఆ ప్రభుత్వంపై పెద్దగా ఫిర్యాదులేమీ లేవు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షం డీఎంకే కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్, ఎంఎంకే వంటి పక్షాలతో కలిసి కూటమి కట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అన్నాడీఎంకేతో వున్న పీఎంకే, ఎంజేకేలు కూడా త్వరలో డీఎంకే కూటమివైపు రావొచ్చునన్న అభిప్రాయం వుంది. అసలు ఇన్ని పార్టీలను కూటమిలో చేర్చుకుని, సీట్ల పంపకాల్లో అందరినీ సంతృప్తిపరచటం డీఎంకేకు సాధ్యమేనా అన్న సంగతలావుంచితే... ఆ పరిస్థితి నిజంగా ఎదురైతే కేవలం భారతీయ జనతాపార్టీ తోడుతో అన్నాడీఎంకే ఆ కూటమిని ఎంతవరకూ ఎదుర్కొన గలదన్న ప్రశ్న కూడా వుంది. ఇలాంటì సమయంలో శశికళ రంగప్రవేశం చేసి ఈ సంక్లిష్టతను మరింత పెంచారు. శశికళకు ఘన స్వాగతం లభించిందనడంలో సందేహం లేదు. అయితే ఆ వచ్చినవారంతా ఆమె మద్దతుదార్లేనని చెప్పటం తొందరపాటే అవుతుంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆమెలో మునుపటి ఆత్మవిశ్వాసం వుందా లేదా అని స్వయంగా చూడటం కోసం కూడా వారిలో చాలామంది వచ్చివుండొచ్చు. జయలలిత మరణానంతరం శశికళ ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ఆమె జీవించివుండగా తాత్కాలికంగా సీఎం బాధ్యతలు చూడటానికి నియమించిన పన్నీరుసెల్వం శశికళకు ఎదురుతిరిగారు. ఆమెను జయలలిత వారసురాలిగా ప్రకటించి, సీఎంగా రావాలంటూ తీర్మానించిన అన్నాడీఎంకే లెజిస్లేచర్ పార్టీతో గొంతు కలిపిన కొన్ని గంటలకే ఆయన ధోరణి మారింది. ఆ తర్వాతైనా సీఎం కావాలనుకున్న శశికళకు అవాంతారాలు ఎదురై చివరకు పళని స్వామికి ఆ పదవి కట్టబెట్టక తప్పలేదు. తీరా ఆమె జైలుకెళ్లాక పళనిస్వామి కూడా ఎదురుతిరిగి ఆమెను పార్టీ సెక్రటరీ జనరల్ పదవినుంచి తొలగించటంతోపాటు... పార్టీనుంచే బహిష్కరించారు. ఇదంతా చాలదన్నట్టు ఆయన పన్నీరు సెల్వంతో చేతులు కలిపారు. తనను పదవినుంచి తొల గించటం, పార్టీ నుంచి బహిష్కరించటం చెల్లదని శశికళ ఇప్పటికే కోర్టుకెక్కారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు శశికళ వంటి నేత లేకపోతే డీఎంకేకు దీటైన పోటీ ఇవ్వటం సాధ్యం కాదని ఆమె సమీప బంధువు టీటీవీ దినకరన్ ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. మరోపక్క ఆరెస్సెస్ సిద్ధాంతకర్తగా పేరున్న గురుమూర్తి ఆమెతో అన్నా డీఎంకే రాజీపడి, సముచిత స్థానం కల్పిస్తే మరోసారి ఆ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ఇటీవల చెప్పటం గమనించదగ్గది. అవినీతి కేసులో శిక్ష పడిన శశికళకు వుండే ఆదరణ విషయంలో ఇన్నాళ్లూ అన్నాడీఎంకే శ్రేణుల్లో సంశయం వుండేది. మొన్న ఆమెకు లభించిన స్వాగతం చూశాక అలాంటివారిలో పునరాలోచనైతే ఏర్పడు తుంది. అలాగని పళనిస్వామి, పన్నీరుసెల్వంలకు శశికళను ఆహ్వానించటం ప్రాణాంతకం. ఆమె రావడమంటూ జరిగితే పార్టీలో వారికి చోటుండే అవకాశం వుండదు. ఆమె చేరాక పార్టీ నెగ్గినా వారిద్దరినీ కాదని దినకరన్నో, మరొకరినో ఆమె తెరపైకి తీసుకొస్తారు. తమిళనాడును పాలించిన వారిపై అవినీతి ఆరోపణలు రావటం కొత్తగాదు. గతంలో కరుణా నిధి ప్రభుత్వాన్ని ఆ కారణం చూపే కేంద్రంలో అధికారంలో వున్న అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. ఆ తర్వాత జయలలితపైనా అటువంటి ఆరోపణలే వచ్చాయి. కింది కోర్టుల్లో శిక్షపడిన సందర్భాలు రెండుసార్లున్నా ఉన్నత న్యాయస్థానాలు ఆమెను నిర్దోషిగా తేల్చాయి. అటు తర్వాత ఆమె భారీ మెజారిటీతో అధికారంలోకొచ్చారు. తమిళనాడు రాజకీయాలు విలక్షణ మైనవి. అక్కడ ద్రవిడ పార్టీలకు మాత్రమే జనం పెద్ద పీట వేస్తారు. ద్రవిడ పార్టీలైనా కూటములుగా వస్తేనే వారి ఆదరణ లభిస్తుంది. జాతీయ పార్టీలకు కొద్దో గొప్పో అక్కడ చోటు దొరకాలంటే ద్రవిడ పార్టీలతో చెలిమి చేయాల్సిందే. డీఎంకే లెక్కలు ఫలించి అత్యధిక ద్రవిడ పార్టీలు దాని ఆధ్వర్యం లోని కూటమి వెనక చేరితే అన్నాడీఎంకే దాన్ని ఎదుర్కొనగలదా అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఏతావాతా ఇంతవరకూ ప్రధాన పక్షాలుగా వుంటున్న డీఎంకే, అన్నాడీఎంకేల భవితవ్యాన్ని రాబోయే ఎన్నికలు తేల్చేయబోతున్నాయి. ఆ పార్టీల్లో ఎవరు మిగులుతారో, ఎవరు కనుమరుగవు తారో నిర్ణయించబోతున్నాయి. -
తీరు మారని చైనా
నిరుడు ఏప్రిల్‌లో గాల్వాన్ లోయలో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను అతిక్రమించి మన భూభాగంలోకి ప్రవేశించినప్పటినుంచీ చైనా ఎడతెగకుండా లడాయి కొనసాగిస్తోంది. 3,440 కిలోమీటర్ల ఎల్ఓసీ పొడవునా వేర్వేరుచోట్ల వేర్వేరు సందర్భాల్లో ఒక పథకం ప్రకారం తన దళాలతో అతిక్రమ ణలు చేయించటానికి ప్రయత్నించి ఉద్రిక్తతలను పెంచుతోంది. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వాన్ లోయలో నిరుడు జూన్‌లో అకారణంగా మన జవాన్లపై రాళ్లు కర్రలతో దాడిచేసి 20మంది సైనికుల ఉసురుతీసింది. 45 సంవత్సరాల్లో ఎల్ఓసీలో నెత్తురొలకటం అదే ప్రథమం. ఆ తర్వాత అంత క్రితంవరకూ మన సైనికుల నియంత్రణలో వున్న డెస్పాంగ్, హాట్ స్ప్రింగ్స్ తదితరచోట్ల ఆక్రమ ణలకు దిగి అక్కడ మన జవాన్లు గస్తీ తిరగటానికి వీల్లేదంటూ పేచీ పెట్టింది. సైనిక కమాండర్ల స్థాయిలో ఇప్పటికి తొమ్మిదిసార్లు రెండు పక్షాలమధ్యా చర్చలు జరిగినా చెప్పుకోదగ్గ పురోగతి లేదు. బలగాల మోహరింపు, ఉద్రిక్తతలు పెరగటం వంటివి ఆగలేదు. ఈలోగా కొత్త కొత్త ప్రాంతాల్లో చైనా గాల్వాన్‌లోయ తరహా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా సిక్కింలో గతవారం ఇదే పునరావృతమైంది. అక్కడ కూడా చైనా సైనికులు మన భూభాగంలోకి వచ్చే ప్రయత్నం చేస్తే మన జవాన్లు అడ్డగించారు. మొత్తమ్మీద మన భూభాగంలోకి చొచ్చుకొచ్చి, మన జవాన్లను రెచ్చగొట్టి దాడి చేయటమో, మానటమో నిర్ణయించుకోక తప్పని స్థితిలోకి మనల్ని నెడుతోంది. ఎల్ఓసీలో యధా తథ స్థితిని నెలకొల్పాలంటే అక్కడ సైనిక దళాలను మోహరించటం, మన భూభాగాన్ని వెనక్కి తీసుకొనే ప్రయత్నం చేయటం తప్ప మనకు మార్గాంతరంలేని స్థితిని సృష్టించింది. ఇదంతా పద్ధతి ప్రకారం చేస్తోంది. అందుకే గత తొమ్మిది దఫాలుగా చర్చలు విఫలమవుతూ వస్తున్నాయి. చొర బాటు ప్రాంతం నుంచి వెనక్కెళ్లి, యధాతథ స్థితి పునరుద్ధరణకు సహకరించమని మన దేశం కోరటం... కాదు, ఆ ప్రాంతంలో మోహరించిన దళాలను మీరే వెనక్కి తీసుకోమని చైనా చెప్పటం రివాజుగా మారింది. సిక్కింలో తాజాగా జరిగిన తంతు ఆ పరంపరలో భాగమే. సాధారణంగా ఇరుగు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలు ముదిరినప్పుడు రెండు పక్కలా సైన్యాలు మోహరించి తలపడతాయి. ఎదుటివారి భూభాగంలోకి ప్రవేశించి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తాయి. కానీ ఎల్ఓసీ పొడవునా పరిమిత ప్రాంతాల్లో అక్కడక్కడ తమ సైన్యంతో చడీచప్పుడూ లేకుండా చొరబాట్లు చేయించి, అక్కడినుంచి కదలకపోవటమనే కొత్త ఎత్తుగడకు చైనా తెరతీసిందని గత ఏడాది అనుభవం చెబుతోంది. అలా ప్రవేశించినచోట శిబిరాలు నిర్మించటం, అక్కడ సైనికుల్ని వుంచటం రివాజైంది. తాను సన్నిహితం చేసుకోవాలనుకుంటున్న నేపాల్ విషయంలోనూ చైనాది ఇదే ఎత్తుగడ. నిరుడు తమ భూభాగంలో కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకున్న చైనాను ఏం చేయలేక అది నిస్సహాయంగా వుండి పోయింది. మన అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సుబాన్సిరి జిల్లాలో ఒక చిన్న గ్రామాన్నే అది సృష్టించింది. అక్కడ 120 ఆవాసాలతో రెండువేలమంది జనాన్ని పోగేసింది. ఈ క్రమంలో అది ఏ మర్యాదలూ పాటించటం లేదు. అరుణాచల్‌లోని చుశాల్ గ్రామానికి సమీపం లోనే మన భూభాగంలో చైనా సైనికులు శిబిరాలు వేసుకుని, బంకర్లు ఏర్పాటు చేసుకున్నారని తూర్పు లద్దాఖ్ కౌన్సిలర్ ఒకరు ఇటీవలే చెప్పారు. దక్షిణ చైనా సముద్రం ప్రాంతంలో అమెరికా సైనిక విమానమో, మరొకటో గగనతలంలో కనిపిస్తే రెచ్చిపోయి ప్రకటనలు చేసే చైనా భారత్ విషయంలో మాత్రం చడీచప్పుడూ లేకుండా వుండిపోతుంది. ఎల్ఏసీలో చైనా ఏదో ఒక చేష్టకు పాల్పడినప్పుడల్లా మనవైపు నుంచి ప్రకటనలు వెలువడుతున్నాయి. ఆక్రమణదారులకు సరైన గుణపాఠం చెబుతామన్న హెచ్చరికలుంటున్నాయి. కానీ అందులో చైనా ప్రస్తావన వుండదు. చైనా కూడా ఆ హెచ్చరికలు తమనుద్దేశించినవే అన్న అభిప్రాయం ప్రపంచానికి కలగనీయదు. తనను కానట్టు వుండిపోతుంది. దాని చెప్పుచేతల్లో పనిచేసే ‘గ్లోబల్ టైమ్స్’ అనే పత్రిక మాత్రం తననే హెచ్చరించినంతగా బాధపడుతూ భారత్‌కు జవాబిస్తుంటుంది. 1962నాటి భంగపాటు గుర్తులేదా అంటూ ఎత్తిపొడుస్తుంది. ఇరుగు పొరుగు అన్నాక సమస్యలొస్తుంటాయి. వాటి పరిష్కారం కోసం ప్రయత్నాలూ జరుగుతుంటాయి. అయితే రెండు పక్షాల్లోనూ చిత్తశుద్ధి వున్నప్పుడే ఎంతో కొంత ఫలితం వుంటుంది. ఒక నిర్దిష్ట ప్రాంతంలో అయిదారు నెలలక్రితం ఎలాంటి పరిస్థితి వుందో, ప్రస్తుతం ఎలావుందో చెప్పే ఉపగ్రహ ఛాయాచిత్రాలు సాక్ష్యాధారాలుగా చూపిస్తున్నా చైనా మాత్రం తన మంకుపట్టు మానటం లేదు సరిగదా... కొత్త కొత్త ప్రాంతాల్లో అదే మాదిరి ఎత్తుగడలకు పాల్పడుతోంది. శాంతి కేవలం ఒక పక్షం మాత్రమే కోరుకుంటే ఏర్పడేది కాదు. వివాదంలో భాగస్వాములైన రెండు పక్షాలూ అందుకు సిద్ధపడాలి. చైనా పోకడలు చూస్తుంటే అందుకు సిద్ధపడుతున్న దాఖలా లేదు. వచ్చే జూలైలో చైనా కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలు జరుగు తున్నాయి. అందుకోసం భారీయెత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. అటు పార్టీ, ఇటు ప్రభుత్వం కూడా అందులో తలమునకలై వున్నాయి. తన హయాంలో కమ్యూనిస్టు పార్టీ, చైనా కూడా సమర్థవంతంగా వున్నాయన్న అభిప్రాయం శ్రేణుల్లో కలగజేయటం అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అవసరం కాబట్టే ఆయన దూకుడుగా వున్నట్టు కనబడుతున్నారని ఆసియాలో ఆధిపత్యాన్ని స్థిరపరుచు కుంటున్నామన్న భావన కలగజేయటానికి ప్రయత్నిస్తున్నారని కొందరు నిపుణుల అంచనా. ఆ తర్వాత చైనా వైఖరి సడలే అవకాశం వున్నదని వారి విశ్లేషణ. వాటి సంగతలా వుంచితే చైనా పోకడలను ప్రపంచానికి తెలియజెప్పటానికి, ఇలాంటి ఘర్షణాత్మక పోకడల వల్ల సమస్యలేర్పడతాయని నేరుగా చెప్పటానికి అంతర్జాతీయ వేదికల ద్వారా మన దేశం ప్రయత్నించాలి. -
పౌర స్వేచ్ఛకు పట్టం
యుక్త వయసొచ్చిన జంట కలిసి జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు అందులో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదంటూ బుధవారం అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షించదగ్గది. ఈ తీర్పు ద్వారా పౌర స్వేచ్ఛకు మరోసారి ఉన్నత న్యాయస్థానం పట్టం కట్టింది. ప్రత్యేక వివాహ చట్టంలోని 30 రోజుల నోటీసు గడువు నిబంధన తప్పనిసరి కాదని, ఐచ్ఛికం మాత్రమేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. తమకిచ్చే నోటీసును ప్రచురించటం అవసరమో కాదో ఆ జంట తెలిపితే దాని ప్రకారం వ్యవహరించాలని వివరించింది. నోటీసు బహిరంగపరచటం వల్ల పెళ్లాడే జంట విష యంలో అన్యుల జోక్యం ఎక్కువైందని ధర్మాసనం భావించింది. మన దేశంలో వివిధ మతాలవారికి వేర్వేరు వివాహ చట్టాలున్నాయి. అయితే కుల, మతాల్లో విశ్వాసం లేనివారికీ లేదా వేర్వేరు మతా లకు చెందిన జంటలకు, తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లాడదల్చుకున్నవారికి వర్తించే విధంగా 1954లో ప్రత్యేక వివాహ చట్టం అమల్లోకొచ్చింది. ద్రవిడ ఉద్యమం జోరుగా వున్న సమ యంలో వివాహ సంబంధమైన ఆచారాలు, సంప్రదాయాలు పాటించకుండా బహిరంగ వేదికలపై కేవలం దండలు మార్చుకుని అనేక జంటలు ఒక్కటయ్యాయి. అలాంటి దంపతుల మధ్య కాలం గడిచాక విభేదాలు రావటం, మహిళ జీవితం అనిశ్చితిలో పడటం పర్యవసానంగా ఇలాంటి చట్టం వుండటం అవసరమని ప్రభుత్వం భావించింది. అయితే ప్రత్యేక వివాహ చట్టం నిస్సహాయులైన మహిళలకు తోడ్పడినా, దానివల్ల కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. పెళ్లాడదల్చుకున్నవారు దర ఖాస్తు ఇచ్చాక వివాహ నమోదు అధికారి 30 రోజుల నోటీసు ఇవ్వాలని, ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వాటిని పరిగణనలోకి తీసుకున్నాక మాత్రమే వివాహాన్ని నమోదు చేసుకుని జంటకు ధ్రువీకరణ పత్రం అందజేయాలని ఆ నిబంధన నిర్దేశిస్తోంది. ఆచరణలో ఇది అనేక సమస్యల్ని సృష్టిస్తోంది. అంతవరకూ తమ తమ తల్లిదండ్రుల వద్ద వుండే జంట సహజంగానే నోటీసు పంప టానికి ఆ చిరునామాలు ఇవ్వాల్సివుంటుంది. దాని కాపీ నోటీసు బోర్డులో కూడా పెడతారు. ఇంటి కొచ్చే నోటీసును తల్లిదండ్రుల కంటబడకుండా చేయటం సాధ్యమవుతున్నా, రిజిస్ట్రేషన్ ఆఫీసు వద్ద ప్రదర్శించే నోటీసుతో జంటకు తిప్పలొచ్చిపడుతున్నాయి. ఛాందసవాదులు ఆ నోటీసుల్లో వున్న చిరునామాలు చూసి నేరుగా అక్కడికి పోయి సమాచారం ఇవ్వటం లేదా ఫోన్ చేసి చెప్పటం రివాజ వుతోంది. దాంతో ఇరు కుటుంబాలవారూ యువతీయువకుల్ని నిర్బంధంలో వుంచుతున్నారు. ఛాందసవాదుల వేధింపులు సరేసరి. పైగా నిబంధన ప్రకారం పెళ్లికి ముగ్గురు సాక్షులుండాలి. వివా హంపై 30 రోజుల్లో అభ్యంతరాలు వ్యక్తమైన పక్షంలో వారొచ్చి వాంగ్మూలం ఇవ్వాలి. దీంతో సాక్షు లుగా వుండటానికి అనేకులు సంశయిస్తారు. హైకోర్టు తీర్పు పర్యవసానంగా నోటీసు నిబంధన తమకు సమ్మతం కాదని తెలియజేస్తే వివాహ నమోదు అధికారి ఇతరత్రా గుర్తింపు పత్రాల ఆధా రంగా వారి వివాహాన్ని నమోదు చేయాల్సివుంటుంది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో విలువైనది. నిరుడు నవంబర్ 24న ఇదే కోర్టు యుక్తవయసొచ్చినవారికి తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ వుంటుందని, అందులో జోక్యం చేసుకోవటం రాజ్యాంగంలోని 21వ అధికరణను ఉల్లంఘించటమే నని స్పష్టం చేసింది. సరిగ్గా అదే రోజు ‘పెళ్లి కోసం మతం మార్చుకోవటాన్ని’ నిరోధిస్తూ యూపీ ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకొచ్చింది. భిన్న మతాలకు చెందిన జంటలో ఎవరో ఒకరు అవతలివారి మతానికి మారుతున్నట్టు ప్రకటించటం, అందుకు అనుగుణంగా తమ పేరు మార్చుకోవటం రివాజు అవుతున్నందున ఆర్డినెన్సు అవసరమైందని ప్రభుత్వం తెలిపింది. మతాంతర వివాహాలను నిరో ధించే ఉద్దేశంతోనే దాన్ని తీసుకొచ్చారని స్పష్టమవుతూనే వుంది. ఇప్పుడు ప్రత్యేక వివాహ చట్టం విషయంలో ఇచ్చిన తీర్పు ప్రేమికుల జంటకుండే రాజ్యాంగపరమైన హక్కును మరోసారి తేటతెల్లం చేసింది. ఆర్డినెన్సు వచ్చాక యూపీలో మతాంతర వివాహం చేసుకునే జంటలకు వేధింపులు ఎక్కు వయ్యాయి. మూడేళ్లక్రితం పెళ్లి చేసుకున్న జంటలను సైతం పోలీసులు అరెస్టు చేసి జైళ్లకు పంపారు. ఆర్డినెన్సు ప్రకారం నేరం రుజువైతే పదేళ్లవరకూ జైలు శిక్ష పడుతుంది. వాస్తవానికి మతాంతర, కులాంతర వివాహాలు చేసుకునే జంటలు మన దేశంలో చాలా స్వల్పం. ఆ కొద్దిమందికీ కూడా ప్రత్యేక వివాహ చట్టం నిబంధనలు అవరోధంగా వున్నాయని, వాటి కార ణంగా ఆ జంటలు వేధింపులు ఎదుర్కొనవలసి వస్తున్నదని 2012లో లా కమిషన్ నివేదిక తెలి పింది. వివాహంతో ఒక్కటవుదామనుకునే వారిపై ఎటూ కుటుంబాల ఒత్తిడి వుంటుంది. తల్లిదండ్రుల్లో అత్యధికులు తాము ఎంపిక చేసినవారినే పిల్లలు జీవిత భాగస్వాములుగా అంగీకరించాలని ఆశిస్తారు. అందుకు అంగీకరించని పిల్లలపై వారి ఆగ్రహావేశాలూ సర్వసాధారణమే. కానీ బల వంతంగా తాము అనుకున్నవారితో పెళ్లి జరిపించటానికి ప్రయత్నించటం... కక్షలకు పోయి హతమార్చేందుకు వెనకాడకపోవటం ఇటీవల పెరిగింది. పిల్లల చర్యతో తమ పరువు పోయిందని ఆ తల్లిదండ్రులు భావించటమే కారణం. ఇది ఆందోళక కలిగించే ధోరణి. ఇది చాలదన్నట్టు అందులో తలదూర్చాలని యూపీ సర్కారుతోపాటు మరికొన్ని బీజేపీ ప్రభుత్వాలు నిర్ణయించటం దారుణం. యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఆర్డినెన్సులపై ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో యుక్తవయసొచ్చిన జంట వివాహ నిర్ణయంలో రాజ్యం లేదా రాజ్యేతర శక్తుల జోక్యం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వటం మెచ్చదగ్గది. రెండేళ్లక్రితం కేరళకు చెందిన హదియా కేసులో సుప్రీంకోర్టు సైతం ఇటువంటి తీర్పే ఇచ్చింది. ఒక అంశంలో న్యాయస్థానాలు పదే పదే íß తబోధ చేయాల్సిరావటం, బాధ్యతగల ప్రభుత్వాలే వాటిని పెడచెవిన పెడుతుండటం విచారకరం. -
పండుగ అందరిదీ కావాలి
ఒకరూ ఇద్దరూ కాదు... ఎటుచూసినా బాధాసర్పదష్టులే కనిపిస్తున్నప్పుడు, జీవితంపై ఒక రకమైన అనిశ్చితి అలుముకున్నప్పుడు, చుట్టూ చీకట్లు ఆవరించినప్పుడు సమష్టిలో సేద తీరాలనుకోవటం మనిషి లక్షణం. అందుకు పండుగను మించిన శుభ సందర్భం మరేముంటుంది? అందునా సంక్రాంతి తెలుగింట పెద్ద పండుగ. పట్టణమంతా పల్లెకు తరలే సందర్భం. సరిగ్గా పంటలు చేతికందే సమయం కనుక ఇతర పండుగల కన్నా ఎప్పుడూ ఇది రెట్టింపు కాంతులీనుతుంది. పల్లె పల్లెనా పంటల పరిమళాలు, ప్రతి ముంగిటా రంగవల్లుల సొబగులు, వాటిల్లో గొబ్బెమ్మలు, తెల్లార కుండా రంగురంగుల వస్త్రధారణతో ముస్తాబై సూర్యుడితోపాటే అందరినీ పలకరించటానికొచ్చే గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు అందరినీ సమ్మోహనపరుస్తాయి. ఇంట్లో అమ్మ చేసే పిండివంటలు, నాన్న కొనిపెట్టిన కొత్త బట్టలు, దూరప్రాంతాలనుంచి తరలివచ్చే బంధుగణం పిల్లలకు ప్రీతిపాత్రమైతే...ఈ పెద్ద పండుగనాడు రకరకాల దానాలతో తరించాలని పెద్దలు భావి స్తుంటారు. మకరరాశిలో వుండే శ్రవణ నక్షత్రానికి శని అధిపతి గనుక అతణ్ణి శాంతింపజేయడానికి నువ్వులు దానమిస్తారు. ధనుర్మాసంలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించి క్రమేపీ ఉత్తరాభిముఖుడై కదులుతూ కర్కాటక రాశికి చేరతాడు. ఈ ఆరునెలలకాలాన్ని ఉత్తరాయణమంటారు. ఈ ఆర్నెల్లూ దేవతలకు పగలు కనుక ఆ సమయంలో వారు మేల్కొనివుండి కోర్కెలు నెరవేరుస్తారన్న విశ్వాసం సనాతన సంప్రదాయం పాటించేవారికుంటుంది. అందుకే దీన్ని దేవయానం అని, పుణ్యకాలమని కూడా అంటారు. భీష్ముడు కూడా ఉత్తరాయణ పుణ్య ఘడియల కోసమే అంపశయ్యపై వేచి చూశాడు. దక్షిణాయనం పితృదేవతలు సంచరించే కాలం. ఇది నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ నింపు తుందని... సంక్రాంతితో ఈ పితృయానం ముగిసి వారు తమ తమ స్థానాలకు వెళ్తారని భావిస్తారు. అందుకే వారినుద్దేశించి కృతజ్ఞతాపూర్వక తర్పణాలు వదులుతారు. అందుకే ఇది ‘పెద్దల పండుగ’ కూడా. సంక్రాంతితో మొదలయ్యే ఉత్తరాయణంలో సూర్యుడు తేజోమయమూర్తిగా రూపుదిద్దుకోవ టంతో ప్రకృతి ఉత్సాహం, ఉల్లాసం నింపుకుంటుందంటారు. తమ సంపదకూ, సుఖసంతోషాలకూ కారణమైన భూమికి, తోటి రైతులకూ, పాలేర్లకూ, కూలీలకూ, పశుపక్ష్యాదులకూ రైతులు కృతజ్ఞ తలు చెప్పుకునేదీ ఈ సంక్రాంతినాడే. ఇంకా నింగితో సయ్యాటలాడే గాలిపటాల సందడి, కోడి పందేలు, ఎడ్ల పరుగుల పోటీ, గొర్రెపొటేళ్ల పోటీలు... అన్నిటికీ సంక్రాంతే సందర్భం. ఇతర పండగ లన్నీ చాంద్రమానం ప్రకారం జరుపుకుంటే, సంక్రాంతిని సూర్యగమనం ఆధారంగా జరుపుకోవటం మరో విశిష్టత. మానవాళికి స్థిర వ్యవసాయం అలవాటైన కాలం నుంచే సూర్యుణ్ణి ఆరాధించే సంప్రదాయం అన్నిచోట్లా అలవడింది. ఇది ఇప్పటి అర్థంలో ఒక దేశానికో, ప్రాంతానికో పరిమితమైనది కాదు... భూగోళం నలుచెరగులా విస్తరించిన అఖండ విశ్వాసమే. సూర్యుణ్ణి జగత్సాక్షిగా, కర్మసాక్షిగా భావిం చటం అన్నిచోట్లా మనిషికి పరంపరగా వస్తున్న సంప్రదాయం. ఈ జగత్తుకంతటికీ ఆదిత్యుడే మూల కారకుడని ఆదిత్యహృదయం అంటుంది. భూమ్మీద వుండే సమస్త జీవజాలం, భూ లోపలి పొరల్లో లభ్యమయ్యే రకరకాల ఖనిజాలు, ఇంధనాలు... అన్నీ సూర్యుడులో సంభవించే వివిధ మార్పుల పర్యవసానంగా ఏర్పడినవే. సూర్యుడి గమనంలో ఏర్పడే మార్పులు వేడిమిని, శీతగాలుల్ని, వర్షపా తాన్ని నిర్ణయిస్తాయి. అందువల్లే పర్షియన్లు, గ్రీకులు, యూరొపియన్లు, ఈజిప్షియన్లు, మెక్సికన్లు కూడా సూర్యారాధన చేసేవారు. వారూ తొలి పంటను సూర్యుడికి నివేదించేవారు. అన్ని ఖండాల్లోని ప్రాచీన సమాజాల్లోనూ ఇప్పుడు మనం జరుపుకునే సంక్రాంతి తరహాలోనే రకరకాల వేడుకలతో పండగ జరిపేవారు. గాలి పటాలను ఎగరేయటమూ ఇంతే. సూర్యుడి సుముఖానికి వెళ్లి ప్రణమి ల్లడానికి ఇదొక ప్రతీక. ఇవన్నీ మానవాళిలో వుండే విశ్వాసాల అఖండతనూ, వారి మధ్య సాంస్కృ తిక సారూప్యతనూ వెల్లడిస్తాయి. ఉగ్రరూపంతో విరుచుకుపడిన కరోనా మహమ్మారితో భూగోళమంతా ఏడాదికాలంగా తలపడుతోంది. ఈ పోరు ముగిసిట్టేనా లేక ఇది మరింత తీవ్రమయ్యే ప్రమాదముందా అనేది తేల డానికింకా సమయం పడుతుంది. ఉన్న కొలువులు పోయినవారూ, కొలువులున్నా వేతనాల కోతతో విలవిల్లాడేవారూ, తమ బంధువులో, మిత్రులో కరోనా కాటుతో కనుమరుగయ్యారన్న వేదనతో విషాదంలో మునిగినవారూ, వ్యాపారాలు సజావుగా నడవని వారూ, అనుకున్నవన్నీ తలకిందు లయ్యాయని బాధపడేవారూ... ఇలా ఎటుచూసినా ఈ కరోనా మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. అగ్రరాజ్యమైనా, పడుతూ లేస్తూ సాగే బడుగు దేశమైనా కాస్త హెచ్చుతగ్గులతో ప్రపంచ పౌరుల బాధలన్నీ ఒక్కటే. ప్రకృతి పగబట్టి కరువు విలయతాండవం చేయటమో, అకాలవర్షాలు ముంచెత్తి పంట నష్టానికి దారితీయడమో రివాజుగా సాగుతోంది. దానికితోడు ప్రభు త్వాల విధానాలతో విత్తనాలు మొదలుకొని పురుగుమందుల వరకూ అన్నిటి ధరలూ ఆకాశాన్నంటి వ్యవసాయం భారమవుతోంది. ఇవన్నీ రైతులను అప్పుల ఊబిలోకి దించుతున్నాయి. కొత్తగా వచ్చిన సాగు చట్టాల వల్ల తమకు మరింత ముప్పు ముంచుకురాబోతున్నదని శంకించిన వేలాది మంది రైతులు దేశ రాజధాని సరిహద్దుల్లో రెండు నెలలుగా బైఠాయించారు. ఆ చట్టాల రద్దు తప్ప తమకేదీ సమ్మతం కాదంటున్నారు. మొత్తమ్మీద దేశవ్యాప్తంగా చూస్తే ఒక విధమైన నిరాశానిస్పృ హలే వ్యాపించాయి. బతుకుబండి మళ్లీ ఎప్పుడు పట్టాలెక్కుతుందోనన్న ఆందోళన అందరిలోనూ వుంది. ఇలాంటి సమయంలో ఒక పలకరింపు, ఒక ఓదార్పు సాంత్వననిస్తాయి. అందరిలోనూ మనం ఒంటరికామన్న భరోసానిస్తాయి. సంక్రాంతి వంటి పెద్ద పండుగ ఇందుకొక సందర్భం కావాలని, అందరిలోనూ కొత్త ఉత్తేజాన్నీ, ఉత్సాహాన్నీ నింపాలని మనసారా కోరుకుందాం. -
నిర్లక్ష్యమే నిప్పంటించింది
మొక్కుబడి తనిఖీలు, ముఖస్తుతి నివేదికలు మహారాష్ట్రలోని ప్రభుత్వాసుపత్రిలో శనివారం పదిమంది పసివాళ్ల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాయి. వారంతా నవజాత శిశువులు. ఇంకా పూర్తిగా కళ్లు తెరవకుండానే కన్నుమూసిన అభాగ్యులు. తక్కువ బరువుతో పుట్టిన శిశువులకూ, నెలలు నిండాకుండా పుట్టినవారికీ ప్రత్యేక వైద్యం అందించేందుకు ఉద్దేశించిన యూనిట్లో హఠాత్తుగా నిప్పురవ్వ రాజుకుని వీరందరి ప్రాణాలూ తీసింది. ఇందులో ముగ్గురు అగ్నికీలల్లో దహనమైపోగా, మరో ఏడుగురు ఆ గదిలో దట్టంగా వ్యాపించిన పొగ కారణంగా ఊపిరాడక మరణించారు. ఈ శిశువుల్లో పుట్టి 24 గంటలు కూడా గడవనివారు మొదలుకొని మూడు నెలల వయసువారి వరకూ వున్నారు. ముగ్గురు శిశువులు తీవ్రంగా గాయపడ్డారు. అదృష్టవశాత్తూ మరో ఏడుగురు శిశువులను కాపాడగలిగారు. ఆ రాష్ట్రంలోని భండారా జిల్లా ప్రధానాసుపత్రిలో అర్థరాత్రి జరిగిన ఈ విషాదం ఆసుపత్రుల నిర్వహణ తీరును ప్రశ్నార్థకం చేస్తోంది. దేశంలో ప్రభుత్వాసు పత్రులన్నిటా నిర్ణీతకాలంలో తనిఖీలుంటాయి. వైద్య చికిత్సకు ఉపయోగపడే ఉపకరణాల్లో చాలా భాగం విద్యుత్ ఆధారంగా పనిచేస్తాయి. కనుక వాటి పనితీరును, విద్యుత్ ఉపకరణాల నాణ్యత వగైరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి, సరిచేస్తుండాలి. వాస్తవానికి మొన్న సెప్టెంబర్‌లో అలాంటి తనిఖీ జరిగినట్టు, అంతా సవ్యంగానే వున్నట్టు రికార్డులు కూడా చెబుతున్నాయి. కానీ మూడు నెలలు గడిచేసరికి ఆ ఉపకరణాలే కాటేశాయి. అర్థరాత్రి 1.30 గంటల సమయంలో ప్రమాదం జరిగిన సమయానికి ఆ ప్రత్యేక వార్డులో వైద్యులుగానీ, నర్సులుగానీ లేకుండా పోయారు. స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు దాటుతున్నా మన ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పరమ నాసిరకంగా వుంటున్నాయి. పౌరులు మంచి ఆరోగ్యంతో వుంటే కుటుంబాలు సుఖ సంతోషాలతో విలసిల్లుతాయి. ఉత్పాదకత పెరుగుతుంది. సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. వీటివల్ల ఆర్థిక వ్యవస్థకు జరిగే మేలు అంతా ఇంతా కాదు. కానీ మన దేశంలో ప్రజారోగ్యరంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. సామాజిక, ఆర్థిక, వ్యవస్థీకృత వివక్షలతో మెజారిటీ పౌరులకు నాణ్యమైన వైద్యం అందకుండా పోతోంది. ఎంతో కొంత మెరుగైన వైద్య సేవలు లభిస్తాయన్న రాష్ట్రాల్లో సైతం ఆ సౌకర్యాలు సమాన స్థాయిలో లేవు. ఫలితంగా అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు ఆదరా బాదరాగా నగరాలకో, పట్టణాలకో పరుగెత్తడం తప్పనిసరవుతోంది. ప్రైవేటు వైద్య రంగం ఎటూ సామాన్యులకు అందుబాటులో వుండదు. ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్లో తగినంతమంది వైద్య సిబ్బంది లేకపోవటం, సౌకర్యాలు కొరవడటం రివాజుగా మారింది. ప్రభుత్వాలు అసలు చేయడం లేదని కాదు. కానీ అవి ఏమాత్రం చాలటం లేదు. మన స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో మొత్తంగా ఆరోగ్య సేవలకు చేస్తున్న వ్యయం 4 శాతం. అందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా దాదాపు ఒకటిన్నర శాతంగా వుండగా మిగిలిందంతా ప్రజానీకం చేస్తున్న ఖర్చే. వారు అప్పో సప్పో చేసి తెచ్చిన డబ్బును వైద్యానికి వెచ్చిస్తున్నారు. గత్యంతరం లేని స్థితిలో వున్నవారు మాత్రం ప్రభుత్వా సుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు భండారా జిల్లా ఆసుపత్రిలో మంచి ఉపకరణాలే వున్నాయి. నవజాత శిశువుల ఆరోగ్యం సంరక్షణ కోసం అక్కడ ప్రత్యేక యూనిట్ కూడా వుంది. కానీ ఆచరణలోకొచ్చేసరికి ఏమైంది? ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో ఆ ఆసుపత్రిని ఆశ్రయించిన నిరుపేదలు కోలుకోలేని విషాదంలో చిక్కుకున్నారు. ఐసీయూలో చేర్చిన నవజాత శిశువులు వైద్యుల నిరంతర పర్యవేక్షణలో వుండటం వల్ల త్వరలోనే పూర్తిగా కోలుకొని మళ్లీ తమ పొత్తిళ్లలోకి చేరతారని తల్లులంతా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన వేళ ఆసుపత్రి సిబ్బంది వారికి ఈ పిడుగులాంటి వార్త చెప్పారు. మెరుగైన వైద్య ఉపకరణాలు వుంటేనే సరిపోదు, వాటి నిర్వహణ కూడా మెరుగ్గా వుండాలి. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో లోపాలు తలెత్తినప్పుడు వెనువెంటనే సరఫరా నిలిచిపోయే వ్యవస్థ, అలారంవంటివి వుండాలి. సిబ్బంది నిరంతర పర్యవేక్షణ వుండాలి. భండారా జిల్లా ఆసుపత్రిలో ఇవి గల్లంతయ్యాయి. అలాగే భారీ భవంతుల్లో, ప్రత్యేకించి ఆసు పత్రుల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలున్నాయి. ఆసుపత్రుల్లో ఉపయోగించే ఆక్సిజెన్ సిలెండర్లు ఏసీ యంత్రాలకు బాగా దూరంగా వుంచాలన్న నియమం వుంది. షార్ట్ సర్క్యూట్ ఏర్పడి, ఏసీ యంత్రంలో నిప్పురవ్వ రాజుకుని ఇంత ప్రమాదానికి కారణమైందని చెబుతున్నారు. దీన్నిబట్టి చూస్తే సెప్టెంబర్‌లో ఆ ఆసుపత్రిలో జరిగిన భద్రతా ఆడిటింగ్ మొక్కుబడిగా ముగిసిందని అర్థమవుతుంది. యూనిట్ నుంచి పొగ లొస్తున్నాయని ఒక నర్స్ గమనించి చెప్పేవరకూ ఎవరికీ తెలియలేదు. ఆ తర్వాతైనా అగ్నిమాపక సిబ్బంది రంగ ప్రవేశం చేసేవరకూ ప్రమాదంలో చిక్కుకున్నవారి దగ్గరకు ఎవరూ వెళ్లలేక పోయారు. ప్రమాదాలు జరిగినప్పుడల్లా వేస్తున్న కమిటీలు చురుగ్గా కదిలి వెనువెంటనే కారణాలు రాబట్టగలిగితే, బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటే మిగిలినవారికి హెచ్చరికగా వుంటుంది. ఆసుపత్రి యాజమాన్యాలు, సిబ్బందిపైన మాత్రమే కాదు... బిల్డర్‌తో మొదలుపెట్టి అనుమతు లిచ్చిన స్థానిక సంస్థల అధికారులు, ఆడిటింగ్ జరిపే అధికారులు వగైరాల వరకూ అందరిపైనా చర్యలుండాలి. అప్పుడే అన్ని స్థాయిల్లో అందరూ సమర్థవంతంగా పనిచేస్తారు. ప్రపంచంలో ఏటా జరిగే అయిదు తీవ్ర అగ్ని ప్రమాదాల్లో ఒకటి మన దేశంలో సంభవిస్తున్నదని మూడేళ్లక్రితం వెలువడిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. అందువల్లే కఠినంగా వ్యవహరించటం అవసరం. కరోనా మహమ్మారి వంటి ప్రమాదకర రోగాలు పౌరుల్ని చుట్టుముడుతున్న వర్తమానంలో ఆసు పత్రుల్లో తీసుకునే భద్రతా చర్యల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. -
‘సుప్రీం’ సూచన శిరోధార్యం
సకాలంలో సమస్యపై దృష్టిపెట్టి పరిష్కరించటానికి పూనుకోనట్టయితే అది జటిలంగా మారుతుంది. అనవసర భావోద్వేగాలు పెరిగి పరిష్కారానికి అవరోధమవుతాయి. సాగు చట్టాలకు వ్యతి రేకంగా న్యూఢిల్లీ సరిహద్దుల్లో గత రెండు నెలలుగా రైతులు ఆందోళన సాగిస్తున్నారు. ఇప్పటికి ఎనిమిది దఫాలు కేంద్రం చర్చలు జరిపింది. ఈ నెల 15న మరో దఫా చర్చించబోతున్నారు. ఇంతవరకూ జరిగిన చర్చల సరళి చూస్తుంటే ఈసారైనా పరిష్కారం లభిస్తుందా అన్న సందేహం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యమకారులను ఆ ప్రాంతాలనుంచి పంపించేందుకు చర్యలు తీసుకోమని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సోమవారం సుప్రీంకోర్టు కేంద్రానికి విలువైన సూచన చేసింది. ఆందోళన చేస్తున్న రైతులతో ఒప్పందానికొచ్చేవరకూ వాటి అమలును నిలిపేయాలని సలహా ఇచ్చింది. ఈలోగా చర్చలు జరపడానికి తామే ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నది. ఎలా చూసినా ఇది ఆచరణాత్మకమైనది. వాస్తవానికి ప్రభుత్వాలు చేసే చట్టాలకు రాజ్యాంగబద్ధత వుందో లేదో చెప్పటం న్యాయస్థానాల బాధ్యత. అయితే ప్రస్తుత పరిస్థితులు భిన్నమైనవి. రైతుల ఆందోళన వల్ల ప్రజా రవాణాకు, సరుకు రవాణాకు అంతరాయం ఏర్పడింది. ముడి సరుకు ఆగిపోవటంతో ఉత్పత్తి నిలిచిపోయిందని, తయారైన సరుకు తరలించటం అసాధ్యమవుతున్నదని పారిశ్రామికవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. రాజస్తాన్ వైపున్న సరిహద్దు పరిసరాల్లోని గ్రామస్తులు ఉద్యమకారులపై కారాలుమిరియాలు నూరుతున్నారు. వారికి నిత్యావసరాలు అందకుండా అవరోధాలు కలిగిస్తున్నారు. ఇవన్నీ ప్రమా దకరమైన పరిణామాలు. ఈ సమయంలో కూడా న్యాయస్థానాలు మౌనంగా వుండటం సాధ్యమా? చట్టాలను రద్దు చేయాలని రైతులు పట్టుబడుతుంటే ఆ ప్రశ్నేలేదని కేంద్రం అంటోంది. పైగా న్యాయ స్థానాల్లో వాటిని సవాలు చేసుకోవచ్చని చెబుతోంది. అటు రైతులు అందుకు ససేమిరా అంటు న్నారు. ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రసంగించాల్సిన బహిరంగ సభాస్థలి వేదికనూ, హెలీప్యాడ్‌నూ ధ్వంసం చేశారు. అక్కడా, పంజాబ్‌లోనూ బీజేపీ కార్యక్రమాలను ఉద్యమకారులు అడ్డుకున్నారు. ఈ పరిస్థితుల్ని సకాలంలో చక్కదిద్దటం ఎంతో అవసరం. లేనట్టయితే సమాజంలో తీవ్ర అశాంతి ఏర్పడుతుంది. కొట్లాటలకు, ఘర్షణలకు దారితీస్తుంది. అయినా పాలకులు దిద్దుబాటు చర్యలు ఎందుకు తీసుకోవటం లేదో అనూహ్యం. బహుశా దీన్ని గమనించే సుప్రీంకోర్టు ధర్మాసనం చట్టాల అమలును ఆపుతారా, మమ్మల్నే ఆ పని చేయమంటారా అని ప్రశ్నించింది. ఏదైనా జరిగితే అందరం బాధ్యులం కావాల్సివస్తుందని హెచ్చరించింది. ఉద్యమంతో వ్యవహరిస్తున్న తీరుపై తమకు తీవ్ర అసంతృప్తి వున్నట్టు తెలిపింది. కేవలం పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని రైతులు మాత్రమే చట్టాలను వ్యతిరేకిస్తున్నట్టు కేంద్రం చెబుతున్న మాటల్ని కూడా ధర్మాసనం విశ్వసించినట్టు కనబడటం లేదు. చట్టాలు తీసుకురావటానికి ముందు ఎలాంటి సంప్రదింపుల ప్రక్రియ అనుసరించారో తెలియదు గానీ అనేక రాష్ట్రాలు వీటిని కాదంటున్నాయని కూడా అటార్నీ జనరల్‌ను ఉద్దేశించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే అనడం గమనించదగ్గది. ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవటం, వాటిపై ప్రజల్లో వ్యతిరేకత రావటం సర్వ సాధారణం. అటువంటప్పుడు ఆందోళన చేస్తున్నవారితో చర్చించటం, ఆ నిర్ణయాలకు దారితీసిన పరిస్థితుల గురించి వారికి నచ్చజెప్పటం కూడా మామూలే. సుప్రీంకోర్టు లోగడ రైతుల ఆందోళన గురించి అడిగినప్పుడు వారితో చర్చిస్తున్నామని కేంద్రం తెలిపింది. చర్చలైతే జరుగుతున్నాయి. కానీ పరిష్కారం కనుచూపు మేరలో కనబడటం లేదు. సాగు చట్టాల రద్దు ఒక్కటే తమ ఏకైక డిమాండని రైతులు చెబుతున్నది వాస్తవమే అయినా, వారిలో భయాందోళనలు కలిగిస్తున్న అంశాలు ఏ రకంగా అర్థరహితమైనవో చెప్పగలగాలి. ఆర్డినెన్సులు తెచ్చేముందు... వాటి స్థానంలో చట్టాలు చేసేముందు రైతులందరితో చర్చించామని కేంద్రం అంటున్నది. కానీ ఆ చర్చల్లో కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) వంటి ప్రాథమిక అంశాన్నయినా ఎవరూ కేంద్రం దృష్టికి తీసుకురాలేదా అన్న సంశయం కలుగు తుంది. అలాగే ఈ చట్టాల వల్ల మండీలతో సంబంధం లేకుండా రైతులు తమకు నచ్చినచోట సాగు ఉత్పత్తులను అమ్ముకోవచ్చునని చెప్పే మాట కూడా రైతులు నమ్మకపోవటానికి కారణం బిహార్ వంటిచోట్ల వున్న అధ్వాన్న స్థితే. అక్కడ ఎంఎస్పీ కన్నా తక్కువ ధరకు రైతులు తెగనమ్ముకోవాల్సి వస్తున్నదని ఉద్యమకారులు చెబుతున్నారు. సాగు చట్టాలపై రైతుల్లో వున్నవి అపోహలే కావొచ్చు. కానీ వాటిని పోగొట్టడానికి ప్రయత్నించే బదులు అసలు చట్టాలు రద్దు చేసేదే లేదని చెప్పటం వల్ల రైతుల ఆందోళన సమసిపోతుందా? కనుకనే ఈ విషయంలో ప్రతిష్టకు పోవొద్దు. సుప్రీంకోర్టు సూచించిన విధంగా సాగు చట్టాల అమ లును కొంతకాలంపాటు నిలిపివేయటమే మంచిదేమో ఆలోచించాలి. అలా చేయటం వల్ల రైతులు తమ ఆందోళన విరమించి స్వస్థలాలకు వెళ్తారు. ఉద్రిక్తతలు ఉపశమిస్తాయి. ఆ చట్టాలను వివిధ జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి మెరుగైన ఫలితాలు వస్తున్నాయని చూపగలిగితే రైతుల్లో కూడా పునరాలోచన కలగవచ్చు. ఢిల్లీలో వున్న శీతల వాతావరణం ఇప్పటికే రైతుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ముఖ్యంగా న్యూమోనియా కేసులు పెరుగుతున్నాయి. ఉద్యమాన్ని నిర్వహిస్తున్న భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) చెబుతున్న లెక్కల్ని బట్టి ఇప్పటికి 47మంది అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈ స్థితిని గమనించే వృద్ధులు, మహిళలు, పిల్లల ఆరోగ్యంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. కనుక ఇరుపక్షాలూ పట్టువిడుపులతో వ్యవహరించటం, ఒక పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించటం అన్నివిధాలా శ్రేయస్కరం.