శ్రీశ్రీ 20వ శతాబ్ది ద్వితీయార్ధంలో నాటి కాలపు సామాజికార్థిక రాజకీయ అంశాలను, ఆకలి పేదరికపు కోరల్లో నలుగుతున్న వ్యధార్థ జీవితాలను కవిత్వీకరించాడు. దేశీయంగా జాతీయ ఉద్యమాన్ని నడుపుతున్న గాంధీ ప్రభావంతో, అంతర్జాతీయంగా మార్క్సిస్ట్ సైద్ధాంతిక ప్రభావంతో సాహిత్య సృజన చేశాడు. ఈ విధంగా శ్రీశ్రీపై జాతీయ ఉద్యమ ప్రభావం దాన్ని నడిపిస్తున్న గాంధీ ప్రభావం, ప్రపంచ పవనంగా వీస్తున్న మార్క్సిస్ట్ దృక్ప థాలతో శ్రీశ్రీ కవిత్వం ముందుకు సాగిందని నేను భావిస్తున్నాను. గాంధీ స్వాతంత్య్రోద్యమ తాత్విక పునాదిపై కవిత్వమే కాదు.. నాటికలు, వ్యాసాలు, కవితలు, వ్యాఖ్యానాలు, అనువా దాలు, ఇంటర్వ్యూలు, ఇలా వివిధ ప్రక్రియల్లో రచనా వ్యాసంగం చేశాడు.
‘మహాసంకల్పం’ కవిత ద్వారా గాంధీ సైద్ధాంతిక భూమికను వ్యక్తం చేస్తూ.. ‘ఇదిగో నా స్వాతంత్య్ర స్వప్నం.. జన సందోహం కరిగి ఒకే వ్యక్తిగా రూపుధరిస్తే/ ఇదేం చిత్ర మని చూశాను ఒక పెద్ద కాంస్య విగ్రహానికి ప్రాణం వచ్చినట్టుగా/ ఒక మేఘం గగనపథం దిగి మానవుడై నిలిచినట్టుగా.. ఒకే ఒక్క మానవ మూర్తి నా కళ్ళ ముందు కనిపించాడు... అతని బాధ్యత వహిస్తామని అందరూ హామీ ఇవ్వండి.. అంటూ గాంధీ తాత్వికతకు బావుటా పట్టాడు. మహాత్ముడి ఆదర్శాల వెలుగులో దేశ ప్రజలు పయనించాలని కాంక్షిస్తూ ఈ రచన చేశాడు. మహా త్ముడి నిర్యాణం తర్వాత శ్రీశ్రీ రాసిన ‘సంభ వామి యుగేయుగే’ వంటి రచన తెలుగులోనే కాదు, మరే ప్రాంతీయ భాషలోనూ రాలేదని ప్రముఖ పాత్రికేయులు నార్ల చిరంజీవి వ్యాఖ్యానించారు. ఓ మహాత్మా ఓ మహర్షీ/ ఏది చీకటి ఏది వెలుతురు ఏది జీవితమేది మృత్యువు/ ఏది పుణ్యం ఏది పాపం/ ఏది నరకం ఏది నాకం.. అంటూ రాసిన ‘ఓ మహాత్మా’ కవితా ఖండిక ప్రజల నాలుకలపై నిలిచి ఉంది.
స్వభావరీత్యా శ్రీశ్రీ పసిపాప లాంటి వాడుగా కనిపిస్తాడు. ప్రతిదానికీ స్పందించే లక్షణం ఉంటుంది. ‘అభిప్రాయాల కోసం బాధల్ని లక్ష్యపెట్టని వాళ్లు మాలోకి వస్తారు. అభిప్రాయాలు మార్చుకొని సుఖాల్ని కామించే వాళ్లు మీలోకి వస్తారు’– అని సాహిత్య లోకాన్ని రెండుగా విభజించి ఒక స్పష్టమైన గీత గీసి ప్రజాశిబిరం, ప్రజా వ్యతిరేక శిబిరంగా విడ గొట్టాడు. స్వాతంత్య్రానంతరం ధనిక పేదల మధ్య పెరిగిన అంతరాలు ఆకలి జీవుల, అన్నార్తుల హాహాకారాలను ‘పేదలు’ కవితలో వ్యక్తపరుస్తాడు. ‘ఉద్యోగం ఇవ్వని చదువు/ నిలకడ లేని బతుకు వ్యాపకాలు/ స్వరాజ్య దుఃస్థితిని చూపుతున్నాయి’ అంటాడు. చెదిరి పోయిన కలల్ని ‘బాటసారి’ కవితలో కూటి కోసం, కూలి కోసం, పట్టణంలో బ్రతుకు దామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలు దేరిన బాటసారికి ఎదురైన సంక్షోభాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతాడు. గాంధీ గ్రామ స్వరా
జ్యంపై అపార నమ్మకం ఉన్న శ్రీశ్రీ గ్రామీణ జీవితంలో ముసురుతున్న రోదనలకు అక్షర రూపం ఇచ్చాడు.
అయితే ఇటీవల దళిత సాహితీవేత్తలు శ్రీశ్రీ సాహిత్యం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నట్టు నేను భావిస్తున్నాను. సమస్త కార్మిక, కర్షక, అభా గ్యుల, అన్నార్తుల అనాధల, వ్యధార్థజీవుల, యథార్థ బతుకుల్ని తన సాహిత్యంలో చూపిన శ్రీశ్రీని మన క్యాంపులోనే పెట్టుకోవాలి. అవతలి పక్షాలకు అప్పజెప్పి మనం బల హీనులం కాకూడదు. తెలుగు సాహిత్యంలో జాషువాని, శ్రీశ్రీని రెండు కళ్ళుగా స్వీకరించాల్సిన సందర్భం. తద్వారానే సామాజిక పరివర్తనకు మార్గదర్శకులమవుతాం. ఇది నేటి చారిత్రక అవసరం. సామాజిక సంస్కరణ లేకుండా భారతదేశ అభివృద్ధిని కాంక్షించలేము. ఈ సామాజిక లక్ష్యానికి ఒక సాంస్కృతిక కార్యాచరణను ప్రకటించిన వాళ్లు శ్రీశ్రీ, జాషువా.
– డొక్కా మాణిక్య వరప్రసాద్,
వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ విప్, మాజీ మంత్రి
(నేడు శ్రీశ్రీ జయంతి)
Comments
Please login to add a commentAdd a comment