కథువా రేప్ కేసులో నిందితులు
దేశం మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సిన అత్యంత అమానుషమైన దురంతంలో నేరగాళ్లకు కఠిన శిక్షలు విధిస్తూ సోమవారం పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ప్రత్యేక కోర్టు వెలువరించిన తీర్పు హర్షించదగ్గది. నిరుడు జనవరిలో జమ్మూలోని కఠువాలో అసిఫా అనే ఎనిమిదేళ్ల బాలికను అపహ రించి, అత్యాచారం జరిపి హతమార్చిన కేసులో ప్రధాన నిందితుడు సాంజీ రాం, మరో ఇద్దరు నిందితులకు యావజ్జీవ శిక్ష విధించడంతోపాటు సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిం చిన మరో ముగ్గురికి అయిదేళ్ల జైలు శిక్ష, రూ. 50,000 చొప్పున జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. సాంజీరాం కుమారుడు విశాల్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించగా, ఆయనకు సమీప బంధువైన మైనర్ బాలుడు జువెనైల్ కోర్టులో విచారణనెదుర్కొంటున్నాడు. ఆ దురంతం సాధారణమైనది కాదు. అసిఫాను దారుణంగా హింసించి మత్తు పదార్ధాన్నిచ్చి నాలుగు రోజులపాటు అత్యాచారం జరిపారు. చివరికామెను రాళ్లతో కొట్టి చంపారు.
అత్యాచారాలు, ఇతర లైంగిక నేరాలు బయటికొచ్చినప్పుడల్లా సమాజంలో ఆగ్రహావేశాలు పెల్లుబకడం రివాజే. కానీ కఠువా అత్యాచారం విషయంలో జరిగింది ఇది కాదు. ఆరోపణలెదుర్కొంటున్న నిందితులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ప్రదర్శనలు జరిగాయి. అప్పటి పీడీపీ–బీజేపీ ప్రభుత్వంలో మంత్రు లుగా ఉన్న ఇద్దరు ఆ ర్యాలీలో పాల్గొనడం మాత్రమే కాదు... ‘ఒక బాలిక మృతిపై ఇంత రాద్ధాంతం చేస్తారా?’ అంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. ఎంతమంది మహిళలు ఈ ప్రాంతంలో మరణించడం లేదంటూ ప్రశ్నించారు. చివరకు బీజేపీ కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకుని ఆ మంత్రులిద్దరితోనూ రాజీనామాలు చేయించింది. కఠువా బార్ అసోసియేషన్, హిందూ ఏక్తా మంచ్ వంటి సంస్థలు జాతీయ పతాకంతో ర్యాలీలు నిర్వహించాయి. ఇందులో స్థానిక బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు. చార్జ్‌షీటు దాఖలు చేయడానికొచ్చిన అధి కారులను అక్కడి బార్ అసోసియేషన్ అడ్డగించింది. చివరకు బాధితులు అక్కడైతే న్యాయం దక్క దని సుప్రీంకోర్టును ఆశ్రయించాక కేసు విచారణ పంజాబ్‌కు బదిలీ అయింది.
రాజకీయాలు నేరమయం అవుతున్నాయని అందరూ ఆందోళనపడుతున్నారు. కానీ కఠువా ఉదంతం విషయంలో ఇది తిరగబడింది. అక్కడ నేరం రాజకీయమయం కావడం కనిపిస్తుంది. మతపరమైన కోణంలో నిందితులకు మద్దతు పలకడం కనిపిస్తుంది. ఈ సందర్భంగా న్యాయ మూర్తి తేజ్విందర్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు గమనార్హమైనవి. నేరగాళ్లు ఈ సమాజంలో ఆటవిక రాజ్యం ఉన్నదన్న రీతిలో చెలరేగిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి నేరాల విష యంలో నిజానికి సమాజం మొత్తం ఒక్కటి కావాలి. నిందితుల నేరం రుజువు కావడానికి అవసరమైన అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని పట్టుబట్టాలి. కానీ జమ్మూలోనూ, కథువాలోనూ అక్కడి సమాజం ఏకమై నిందితులను సమర్థించింది. నేరాన్నిబట్టి, దాని తీవ్రతనుబట్టి కాకుండా బాధిత వర్గం ఎవరో, నేరగాళ్లెవరో చూసుకుని సమర్థించాలో, వ్యతిరేకించాలో నిర్ణయించుకునే ధోరణి చివరకు సమాజాన్ని ధ్వంసం చేస్తుంది. తమ ప్రాంతంలో ఉంటున్న సంచార తెగవారిలో ఒకరు తమ బంధువును కొట్టారన్న ఆగ్రహంతో ప్రధాన నిందితుడు కక్షగట్టి అసిఫాను కిడ్నాప్ చేయించి ఈ మొత్తం దురంతానికి సూత్రధారిగా మారాడు. దిక్కూమొక్కూలేని సంచార తెగవారు ఈ ఉదంతం తర్వాత ప్రాణభయంతో ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టిపోతారని, ఈ నేరం అక్కడితో సమసిపోతుందని అతగాడు భావించాడు. దీనంతటికీ ప్రార్థనా స్థలాన్ని వినియోగించుకున్నాడు.
లైంగిక నేరాలకు దోహదపడుతున్న అంశాలేమిటో సక్రమంగా అవగాహన చేసుకున్నప్పుడే సరైన పరిష్కారం సాధ్యమవుతుంది. జరుగుతున్న నేరాలపై సత్వర దర్యాప్తు మొదలుపెట్టి, వెనువెంటనే దోషులను శిక్షించే ప్రక్రియ అమలైతే అవి చాలావరకూ తగ్గుతాయి. అయితే దీంతో పాటు చేయాల్సింది చాలా ఉంది. లైంగిక నేరాలకు మూలం ఆధిపత్య ధోరణిలో ఉంది. ఆ ఆధిపత్య ధోరణిలో ఒక్క జెండర్ అంశం మాత్రమే కాదు... కుల, మతాలవంటివి బలంగా ఉన్నాయని... అణగారిన వర్గాలపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి అత్యాచారాన్ని ఆయుధంగా ఉపయోగిస్తున్నారని సామాజిక శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చెబుతున్నారు. కఠువాలో అది బాహాటంగా వెల్లడైంది. అసిఫాకు న్యాయం జరగాలని పట్టుదలతో కృషి చేసిన మహిళా న్యాయ వాది దీపికా సింగ్ రజావత్‌ను సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలంతో దూషించడం, చంపేస్తామని బెదిరించడం మాత్రమే కాదు...సాంఘిక బహిష్కరణ అమలు చేశారు. న్యాయ స్థానంలో ఆమె సహచరులు ఆమెతో మాట్లాడటం మానుకున్నారు. ఇరుగుపొరుగు, బంధువులు దీపికా సింగ్‌ను దూరం పెట్టారు.
ఆమెపై ‘జాతి వ్యతిరేకి’ ముద్ర వేశారు. ఇవన్నీ గమనించాక ఆమె కుటుంబసభ్యులు హడలెత్తి ఈ కేసు నుంచి తప్పుకోమంటూ ఒత్తిళ్లు తీసుకొచ్చారు. ఒక నిస్స హాయ సంచార తెగ బాలిక అన్యాయంగా బలైపోయిందని భావించి, మానవతా దృక్పథంతో ఈ కేసును స్వచ్ఛందంగా స్వీకరించిన ఒక మహిళా న్యాయవాది సమాజంలో ఏకాకిగా మారడం ఊహకందనిది. ఇలాంటివి లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో జరిగాయని విన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయేవారు. అది మనకు సైతం సాధారణ విషయంగా అనిపించే స్థితి ఏర్పడటం ప్రమా దకరమైంది. నిజానికి మిలిటెంట్ల ఆగడాలతో కశ్మీర్‌లో ఉండలేక అక్కడినుంచి వలస వచ్చిన కశ్మీరీ పండిట్ల కుటుంబానికి చెందినవారు దీపికాసింగ్. ఆమెను వ్యతిరేకించినవారి అభ్యంతరం అదే. అన్ని బాధలకు కారణమైనవారికి ‘ఏదో జరిగితే’ ఎందుకు పట్టించుకోవాలన్నది వారి ప్రశ్న. ఈ కేసు విచారణ ఏడాది వ్యవధిలో పూర్తయి దోషులకు శిక్షపడటం ఊరటనిస్తుంది. సహజంగానే ఈ కేసు అప్పీల్‌కు వెళ్తుంది. ఉన్నత న్యాయస్థానాల్లో సైతం ఇదే వేగంతో విచారణ కొనసాగి నేరగాళ్లకు కఠిన శిక్షలు పడాలని ఆశించాలి.
Comments
Please login to add a commentAdd a comment