న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కలిచివేసిన కథువా బాలిక హత్యాచారానికి సంబంధించి బలమైన ఆధారాలు లభ్యమయ్యాయి. చిన్నారి శరీర భాగాలు, దుస్తుల నుంచి సేకరించిన రక్త నమూనాలు, నిందితుల డీఎన్‌ఏతో సరితూగాయని ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్(డీఎఫ్‌ఎల్) నివేదికలో వెల్లడైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పేర్కొంది. దీంతో చార్జిషీట్‌లో పేర్కొన్న ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లైందని, కోర్టు విచారణలోనూ ఇవే అంశాలు కీలకం కానున్నాయని సిట్ అధికారులు అన్నారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 28న జరగనుంది.
చిన్నారిపై అకృత్యం జరిగింది ఆలయంలోనే!: కథువా ఉదంతంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన వేళ ఘటన జరిగిన ప్రదేశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ‘జరిగింది ఆలయంలో కాదంటూ’ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంకూడా సాగింది. అయితే ప్రాధమిక దశలోనే ఆలయం నుంచి సేకరించిన రక్తనమూనాలు, వెంట్రుకలు.. ఇటీవల అరెస్టైన నిందితుల డీఎన్‌ఏతో సరితూగాయని ఫోనెన్సిక్ నివేదికలో తేలింది.
హత్య తర్వాత దుస్తులు ఉతికారు!: రోజుల పాటు చిన్నారికి నరకం చూపించి, హత్యచేసిన తర్వాత సంబంధిత ఆధారాలను చెరిపేసేందుకు నిందితులు యత్నించారు. ‘హత్య తర్వాత బాధితురాలి దుస్తులు ఉతికారు, తల నుంచి పాదాల దాకా తుడిచేశారు. దీంతో ఆధారాలను నిర్ధారించడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆలయంలో లభించిన రక్తనమూనాలు, వెంటుక్రలు ఎవరివనేవి తేల్చలేకపోయాం. ఆ తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ (డీఎఫ్‌ఎల్) సహాయాన్ని తీసుకున్నాం. అత్యాధునిక విశ్లేషణా పద్ధతులను అవలంబించే డీఎఫ్‌ఎల్.. మృతురాలి శరీరభాగాలు, ఒంటిపై లభించిన రక్తపు నమూనాలను విశ్లేషించి, వాటిని నిందితుల డీఎన్‌ఏతో సరిపోల్చగా దాదాపు ఖచ్చితమైన ఆధారాలు లభించినట్లైంది’’ అని సిట్ అధికారులు పేర్కొన్నారు. కథువా నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దేశంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కూడా నిరసనలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment