
సునీతా విలియమ్స్‌కు స్పేస్ సెంటరే కుటుంబం అంటారు ఆమె ఫ్యామిలీ మెంబర్స్. ఆమెకు ఏది ఇష్టమో తమకు అదే ఇష్టం అని చెబుతారు. తండ్రి దీపక్ పాండ్యా, తల్లి ఉర్సులిన్ బోనీ పాండ్యా (Ursuline Bonnie Zalokar) వారి ముగ్గురు సంతానంలో సునీత చిన్నది. అన్నయ్య జె.థామస్‌తో పాటు అక్క దీనా ఆనంద్ ఉన్నారు. అమెరికాలోనే జన్మించిన సునీత చదువు అంతా అక్కడే సాగింది. చదువు పూర్తయ్యాక తండ్రి దీపక్ పాండ్యా (Deepak Pandya) సూచనలతో అమెరికన్ నేవీలో జాయిన్ అయ్యారు.
నేవీలో పనిచేస్తున్న సమయంలోనే మైఖేల్ జె.విలియమ్స్ (Michael J. Williams)తో పరిచయం స్నేహంగా మారింది. వివాహ బంధంతో ఒక్కటై 20 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నారు. టెక్సాస్‌లోని హ్యూస్టన్ శివారులో నివసిస్తున్నారు. ఈ జంటకు పిల్లలు లేరు. ఒక అమ్మాయిని దత్తత తీసుకోవాలని ఉందని చెప్పే సునీతకు పెంపుడు కుక్క గార్బీ అంటే చాలా ఇష్టం. గార్బీతో ఉన్న ఫొటోలను సునీత తరచు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. 2006లో మొదటిసారి తనతో పాటు భగవద్గీతను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లింది. 2012లో ఓం సింబల్ తీసుకెళ్లినట్టు చెప్పిన సునీత గణేష్ విగ్రహాన్ని ఎప్పుడూ తనకు తోడుగా తీసుకెళుతుందట. సునీత విశ్వాసాలకు విలియమ్స్ మద్దతు ఇస్తాడు.
తల్లి బోనీ పాండ్యా కూతురి గురించి వివరిస్తూ.. ‘ఆమె సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటంపై మాకు ఎలాంటి ఆందోళన లేదు. విధి నిర్వహణలో భాగంగా కష్టపడి పనిచేస్తుంది. కూతురి నుండి చాలా కాలం దూరంగా ఉండటం మొదట్లో కష్టమయ్యేది. కానీ, ఇప్పుడు అది అలవాటయ్యింది. తను తనకు ఇష్టమైనది చేస్తోంది. అలాంటప్పుడు నేను బాధపడటం అంటూ ఉండదు. తన ప్రయత్నాల్లో తను ఉన్నందుకు సంతోషంగా ఉంది. నేను ప్రత్యేకించి ఆమెకు ఎటువంటి సలహాలు ఇవ్వను. ఎందుకంటే, ఏం చేయాలో తనకే బాగా తెలుసు. అంతా సవ్యంగానే జరుగుతుంది’ అని ధీమాను వ్యక్తం చేస్తారు ఆమె తల్లి బోనీ పాండ్యా.
బాల్యం నుంచి ధైర్యం ఎక్కువ
సునీతా విలియమ్స్ (Sunita Williams) తిరిగి భూమి పైకి వస్తున్న వార్త గురించి యావత్ ప్రపంచం స్పందన ఒకటే... ‘చాలా సంతోషంగా ఉంది’ అయితే ఇండియాలోని ఆమె కజిన్ మాత్రం ‘భయంగా ఉంది’ అంటున్నాడు. ‘వీలైనంత త్వరగా ఆమె భూమి మీదికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకో నాకు భయంగా ఉంది. ఆమె చక్కని ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం’ అంటున్నాడు దినేష్ రావత్.

సుదీర్ఘమైన ప్రయాణం తరువాత భూమికి తిరిగి వస్తున్న సునీతా విలియమ్స్ ఆ తర్వాత విపరీతమైన శారీరక మార్పులను ఎదుర్కొనే అవకాశం ఉందనే ఆందోళన నేపథ్యంలో ఆయన ‘భయం’ అనే మాట వాడాడు. సునీతా విలియమ్స్ బాల్యాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘సునీత చిన్నప్పుడు మా దగ్గరికి వచ్చింది. నేను ఆమెను ఒంటె సవారీలకు తీసుకువెళ్లేవాడిని. సవారీ అయిపోయిన తరువాత కూడా దిగేది కాదు! సోమనాథ్ తీర్థయాత్రలతో పాటు దేశంలోని వివిధప్రాంతాలకు వెళ్లాం. సునీతకు చిన్నప్పటి నుంచి ధైర్యం ఎక్కువ. ఆమె తరచుగా నా చెయ్యి పట్టుకునేది. ఎందుకు ఇలా? అని అడిగితే నాన్నలా అనిపిస్తావు అని చెప్పింది’ అంటూ ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లాడు దినేష్ రావత్.
మా తరానికి స్ఫూర్తిప్రదాత
నేను స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచి సునీతా విలియమ్స్ గురించి చదువుతూ పెరిగాను. సైంటిస్ట్ (Scientist) కావాలనుకునే మహిళల సంఖ్య తక్కువగా ఉన్న రోజుల్లో కల్పనాచావ్లా భారతీయ మహిళల్లో కొత్త ఆలోచన రేకెత్తించారు. సునీతా విలియమ్స్ అంతరిక్షంలో చేసిన పరిశోధనలు స్ఫూర్తినిచ్చాయి. మనదేశంలో అంతరిక్షం, పరిశోధన రంగాలను కెరీర్ ఆప్షన్స్‌గా ఎంచుకునే యంగ్ జనరేషన్ తయారైంది. మా తరం అలా తయారైనదే.

సైంటిస్ట్‌గా సునీతా విలియమ్స్ ఒక రోల్‌మోడల్. అకుంఠిత దీక్ష, అంకితభావంతో పని చేయడం, అంతరిక్ష పరిశోధనల ద్వారా కొత్త విషయాలను ఎక్స్‌ప్లోర్ చేయడంలో ఆమెకున్న ఆసక్తి, వాటిని ఛేదించడానికి చూపించే చొరవ అమోఘం. స్టెమ్ ఫీల్డ్‌లో భవిష్యత్తు తరాలు ఆమె అడుగుజాడల్లో నడుస్తాయి. మగవాళ్ల ఆధిపత్యం కొనసాగుతున్న రంగంలో మహిళ కూడా విజయవంతంగా రాణించగలరని సునీతా విలియమ్స్ తన పరిశోధనల ద్వారా నిరూపించారు.
– శరణ్య. కె. సైంటిస్ట్, బయోటెక్నాలజీ
Comments
Please login to add a commentAdd a comment