Women Power
-
ఆమె... ఒక హి‘స్టోరీ’ : ఎవరీ గోపీ సిద్ధి
ఆ అవ్వని చూస్తే కర్ణాటక వాసి అని ఎవరూ అనుకోరు. ‘ఆఫ్రికన్’ అనే అనుకుంటారు. గోపీ సిద్దీ పూర్వీకులు వందల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి ఇండియాకు తీసుకురాబడ్డారు. ఇక్కడికి వచ్చిన తరువాత స్థానిక సంస్కృతులతో కలిసిపోయినప్పటికీ, తమ మూల సంస్కృతిని కాపాడుకుంటున్నారు. సిద్దీస్ జాతి ప్రజలు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలతో పాటు తమ సంస్కృతిని తన కథల ద్వారా లోకానికి చాటుతోంది గోపి సిద్దీ.తులసికొండ (కర్నాటక) ప్రాంతానికి చెందిన కుంటగని గ్రామానికి చెందిన గోపి సన్నా సిద్దీ జనాలకు ఒక వింత. ఒక పురాగాథ. విలువైన కథల చెట్టు. గోపి సిద్దీస్ అనేది ఆఫ్రికన్ సంతతికి చెందిన ఒక ప్రత్యేక జాతి. బానిసలు, కిరాయి సైనికులుగా, నావికులుగా వీరిని భారతదేశానికి తీసుకువచ్చారు. కాలక్రమంలో వీరు స్థానిక భాషలు నేర్చుకున్నారు. ఇక్కడి సంస్కృతిలో భాగం అయ్యారు. అదే సమయంలో తమ ఆఫ్రికన్ వారసత్వ మూలాలను కాపాడుకున్నారు. సంగీతం నుంచి నృత్యరూపాల వరకు అందులో ఎన్నో ఉన్నాయి.ఈ సిద్దీలు కర్నాటక, మహారాష్ట్రలలో ఎక్కువగా కనిపిస్తారు. గోపి సిద్దీ బాల్యంలో కొత్త ప్రాంతానికి వెళితే... ‘ఆఫ్రికన్’ ‘నీగ్రో’ అని పిలిచేవారు. ‘అలా ఎందుకు పిలుస్తున్నారు?’ అని అడిగితే తమ పూర్వీకులు ఆఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చారు అని తల్లి చెబుతుండేది. ఎప్పుడూ ఏవో కథలు వినిపించే గోపి సిద్దీకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. భర్త ఆమెను వదిలేసి మూడు దశాబ్దాలు దాటింది. ఆక్రమణదారుల చెర నుంచి తన వ్యవసాయ భూమిని తిరిగి పొందాలి... ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ తన కథల పుస్తకాలను ప్రచురించాలనే ఉత్సాహం, ఉక్కు సంకల్పంలో మాత్రం మార్పు లేదు. తన పుస్తక ప్రచురణ కోసం నగలు కూడా తాకట్టు పెట్టింది.తమ జాతి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు తనలో నుంచి రచయిత్రి బయటికి రావడానికి కారణం అయ్యాయి. ‘స్వేచ్ఛ గురించి తపించే దృఢమైన వ్యక్తిత్వం గోపి సిద్దీ సొంతం. జీవితంలో ఆమె ఎన్నో పోరాటాలు చేసింది. గోపి సిద్దీ కథల్లో బాధ మాత్రమే కాదు జ్ఞానం కూడా ఉంటుంది. పర్యావరణ స్పృహ ఉంటుంది. తన తాతల కాలం నుంచి వింటూ పెరిగిన కథలు అవి. తనకు పరిచయం అయిన వారికల్లా ఆ కథలను చెబుతుంది. ఆమె శక్తిమంతమైన రచయిత్రి’ అంటుంది ‘బుడా ఫోక్లోర్’ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకు రాలైన సవితా ఉదయ్.పది సంవత్సరాల క్రితం తన ఇంట్లో పని చేయడానికి ఒక పనిమనిషిని వెదుకుతున్న సమయంలో ఉదయ్‌కు గోపీతో పరిచయం ఏర్పడింది. మారుమూల గ్రామానికి పరిమితమైన గోపి సిద్దీ జీవిత కథను తన డాక్యుమెంటరీ ద్వారా అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాడు బెంగళూరుకు చెందిన నిశాంత్ గురుమూర్తి. తన స్వచ్ఛంద సంస్థ ‘బుడా ఫోక్లోర్’ ద్వారా జానపదల కథానిలయమైన గోపి సిద్దీతో కర్ణాటక అంతటా పాఠశాల విద్యార్థులతో కథా సెషన్లు నిర్వహిస్తోంది సవితా ఉదయ్. కొంకణీ, కన్నడ భాషలలో ఆమె చెప్పే కథలకు పిల్లలు ఫిదా అవుతుంటారు.ఆ బాధ భరించలేనంత!భాషపరమైన అడ్డంకులు ఉన్నప్పటికి పట్నం పిల్లలు నా కథలను ఇష్టపడుతుంటారు. వారి అభిమానం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కథలు చెప్పడం పూర్తయిన తరువాత నన్ను ఆ΄్యాయంగా కౌగిలించుకొని వీడ్కోలు చెబుతారు. బరువెక్కిన హృదయంతో ఇంటికి వస్తాను. వారిని విడిచి ఇంటికి వస్తుంటే... ఒక్కోసారి ఆ బాధ భరించలేనంతగా ఉంటుంది. – గోపి సిద్దీ -
‘పోస్ట్’ మార్టమ్... శవాలగదిలో ఉద్యోగమా?
మనుషులు వెళ్లడానికి ఇష్టపడని ప్రదేశాలలో శ్మశానం ఒకటి అని చెబుతుంటారు. అయితే అసహజ మరణాలకు సంబంధించిన శవాలు శ్మశానానికన్నా ముందు చేరుకునే ప్రదేశం మార్చురీ. అక్కడ కొద్దిసేపు గడపాలంటేనే ఇబ్బంది పడేవాళ్లు, భయపడేవాళ్లు ఉంటారు. అలాంటిది పోస్ట్‌మార్టం గదిలో రోజూ ఉద్యోగం చేయడం అంటే ఎంతో ధైర్యం కావాలి. ఆ గుండె ధైర్యం రామ్ప్రసన్నలో ఉంది. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టమ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రామ్‌ప్రసన్న... ‘ఆడవాళ్లు ఈ ఉద్యోగం చేయడం ఏమిటి!!’ అనే లింగవివక్షతతో కూడిన మాటలు... ‘చేయడానికి నీకు ఈ ఉద్యోగమే దొరికిందా!’లాంటి వెక్కిరింపులు ఎదుర్కొన్నా... ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదు. వృత్తి జీవితంపై గౌరవాన్ని తగ్గించుకోలేదు... ఇచ్చోటనే...నిండా పాతికేళ్లు కూడా నిండని యువకుడి శవం. ‘బహుశా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండొచ్చు’ అని ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తుంది. భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న యువతి... తన పిల్లల్ని తలుచుకొని కళ్లనీళ్ల పర్యంతం అవుతున్నట్లు అనిపిస్తుంది. ‘ఇద్దరు ఆడపిల్లల పెళ్లి చేయాలి. వారి పెళ్లి చూడకుండానే వరద నన్ను మింగేసింది’... మధ్యతరగతి తండ్రి శవం అదేపనిగా రోదిస్తున్నట్లుగా ఉంటుంది. శవాలు మౌనంగా చెప్పే కథలు ఎన్నో విన్నది రామ్‌ప్రసన్న. అలా అని శ్మశాన వైరాగ్యంలాంటిది తెచ్చుకోలేదు. వృత్తిని వృత్తిలాగే ధైర్యంగా నిర్వహిస్తోంది.‘నాకు ఉద్యోగం వచ్చింది అనగానే సంతోషించిన వాళ్లు శవాల గదిలో అని చెప్పగానే నోరు తెరిచారు. ఆడపిల్లవు...అక్కడెలా చేస్తావంటూ అడిగేవాళ్లు. ఎక్కువ రోజులు ఉండలేవు. వచ్చేస్తావు అన్నవాళ్లూ ఉన్నారు. అందుకే ఆడవాళ్లు ఎవరూ రాని ఈ వృత్తిలో కొనసాగుతున్నా’ అంటుంది తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం అసిస్టెంట్ (శవపరీక్ష సహాయకురాలు)గా విధులు నిర్వర్తిస్తున్న రామ్ ప్రసన్న.ఆసుపత్రి వెనుక వైపు కాస్తంత దూరంగా ఉండే మార్చురీలోకి నిత్యం వచ్చే శవాలతోనే తన వృత్తిజీవితం ముడిపడివుంది. ఆత్మహత్యకు పాల్పడినవాళ్లు, రోడ్డు ప్రమాదాల మృతులు, నీళ్లలో కొట్టుకు వచ్చిన మృతదేహాలు... నిత్యం ఆసుపత్రికి వస్తూనే వుంటాయి. అన్నింటికీ శవపరీక్ష నివేదిక కీలకమని తెలిసిందే. సంబంధిత వైద్యుడు శవపరీక్ష చేస్తే అందుకు తగినట్టుగా మృతదేహాన్ని సిద్ధం చేయటం, వైద్యుడికి సహాయపడటం సహాయకురాలిగా రామ్‌ప్రసన్న ఉద్యోగం.భర్త ప్రోత్సాహంతో...ప్రమాదాల్లో రక్తమోడుతున్న మృతదేహాలూ, నీటిలో ఉబ్బిపోయినవీ, డీ కంపోజింగ్‌కు చేరువైనవి... చూడటమే కష్టం. నెలకు పదిహేను నుంచి ఇరవై వరకు వచ్చే ఇలాంటి మృతదేహాలను శవపరీక్షకు సిద్ధం చేయాలంటే ఎంత ధైర్యం కావాలి? సన్నగా, రివటలా ఉండే రామ్‌ప్రసన్న ఆ విధులను వస్త్రాలకు అతుకులు కుట్టినంత శ్రద్ధగా, అలవోకగా చేస్తోంది.రామ్‌ప్రసన్న దూరవిద్యలో బీఏ చేసింది. కూలి పనులకు వెళుతుండే భర్తకు తోడుగా తాను కూడా ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకుంది. డీసీహెచ్ఎస్ నుండి వెలువడిన నోటిఫికేష¯Œ లో పోస్ట్‌మార్టమ్ అసిస్టెంట్ పోస్టు కనిపించటంతో దరఖాస్తు చేసింది. ఇంటర్వ్యూ కూడా పూర్తయ్యాక తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టింగ్ ఇచ్చారు. భర్త ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండాప్రోత్సహించాడు.భయం అనిపించలేదు... ఆసక్తిగా అనిపించింది!తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి చరిత్రలో పోస్టుమార్టమ్ సహాయకులుగా ఇప్పటివరకు పురుషులే ఉండేవారు. శవపరీక్షకు ముందు మద్యం సేవించటం తప్పనిసరి అన్నట్టుగా ప్రవర్తించే వారు కొందరు. ఇలాంటి వారు మృతుల బంధువుల నుంచి మద్యానికి డబ్బులు వసూలు చేసేవారు. అలాంటి ఉద్యోగంలో ఇప్పుడు ఒక ఆడపిల్లను చూడడం చాలామందికి వింతగా ఉంది. ఆ ఆశ్చర్యం సంగతి ఎలా ఉన్నా మృతదేహాల రక్తసంబంధీకులకు ఇప్పుడు మద్యం కోసం పీడన లేదు. ‘ఈ ఉద్యోగంలోకి వచ్చాక తొలిసారి శవపరీక్షలో పాల్గొన్నాను. మరణానికి కారణాలు తెలుసుకోవటం ఆసక్తిగా అనిపించింది. భయం అనిపించలేదు. ఉద్యోగాన్ని అంకితభావంతో చేస్తున్నాను.’ అంటుంది రామ్‌ప్రసన్న. ‘మహిళలు ఇలాంటి ఉద్యోగాలు మాత్రమే చేయగలరు. ఇలాంటి ఉద్యోగాలు మాత్రమే చేయాలి’ అనే అప్రకటిత తీర్పులకు, పురుషాధిపత్య ధోరణులకు రామ్‌ప్రసన్న వృత్తిజీవితం, అంకితభావం చెంపపెట్టులాంటిది. ఈ ఉద్యోగం నాకు గర్వకారణంనేను చేస్తున్న ఉద్యోగంపై కొందరి సందేహాలు, భయాలు వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను వేరే లోకంలో ఉద్యోగం చేయడం లేదు. గ్రహాంతర జీవులు, ప్రమాదకర వ్యక్తుల మధ్య ఉద్యోగం చేయడం లేదు. నిన్నటి వరకు వాళ్లు మనలాంటి మనుషులే. మన మధ్య ఉన్న వాళ్లే. ్రపాణదీపం ఆరిపోగానే వారిని పరాయి వాళ్లుగా చూసి భయపడడం తగదు. నేను భయపడుతూ ఉద్యోగం చేయడం లేదు. గర్వంగా చేస్తున్నాను. అంకితభావంతో చేస్తున్నాను.– రామ్‌ప్రసన్న – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
13 బంగారు పతకాలు, తొలి ప్రయత్నంలోనే సివిల్స్ : ఎవరీ శ్రద్ధా
సాధించాలన్న పట్టుదల, కృషి,అచంచలమైన సంకల్ప శక్తి ఇవి ఉంటే చాలు. ఎలాంటి వారైనా తమ కలలను సాకారం చేసుకోవచ్చు. ఈవిషయాన్నే తన విజయం ద్వారా నిరూపించింది ఓ యువతి. ఒకటి కాదు రెండు ఏకంగా 13 బంగారు పతకాలను సాధించింది. CLATలలో అగ్రస్థానంలో నిలిచి, బంగారు పతకాలు సాధించడమే కాకుండా, యూపీఎస్సీలో మంచి (60) సాధించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన శ్రద్ధా గోమె సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం రండి!శ్రద్ధా గోమ్ తండ్రి రిటైర్డ్ SBI అధికారి. ఆమె తల్లి వందన గృహిణి. శ్రద్ధా చిన్నప్పటినుంచీ తెలివైన విద్యార్థిని. ఇండోర్‌లోని సెయింట్ రాఫెల్స్ హెచ్ఎస్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. 10వ తరగతి, ఇంటర్మీడియట్ అగ్రస్థానంలో నిలిచింది.తరువాత శ్రద్ధా గోమ్ న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించాలని బావించింది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT)లో టాపర్‌గా నిలిచింది. ఈ ఘనత ఆమె ప్రతిష్టాత్మకమైన నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU), బెంగుళూరు, భారతదేశంలోని అత్యుత్తమ న్యాయ కళాశాలలో ప్రవేశం పొందింది. అత్యుత్తమ ప్రతిభకు గాను అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రచేతులమీదుగా 13 బంగారు పతకాలను అందుకుంది. ఇలాంటి అవార్డులు, రివార్డుల పరంపరకొనసాగుతూనే ఉంది. (మసాబా మెచ్చిన చ్యవన ప్రాశ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా!)హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కంపెనీలో లీగల్ మేనేజర్‌గా పనిచేసింది. ముంబై, లండన్‌లో విలువైన అనుభవాన్ని పొందింది. తరువాత తన స్వస్థలమైన ఇండోర్‌కు తిరిగొచ్చి, 2021లొ సివిల్ సర్వీసెస్‌కు (సీఎస్ఈ) ప్రిపేర్ అయింది. ఇంటర్నెట్ ద్వారా స్టడీ మెటీరియల్ సమకూర్చుకుని స్వయంగా పరీక్షకు సిద్ధమైంది. మొక్కవోని దీక్షతో చదివి తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రద్ధా మంచి ఆర్టిస్ట్ కూడా. -
సవాల్ ఉంటేనే సక్సెస్... తగ్గేదేలే!
‘గృహిణిగా బోలెడన్ని బాధ్యతలు ఉంటాయి ఇంక వ్యాపారాలు ఏం చేస్తారు?’ అనుకునేవారికి ‘చేసి చూపుతాం..’ అని నిరూపిస్తోంది నేటి మహిళ. ‘ఒకప్పుడు మేం గృహిణులమే ఇప్పుడు వ్యాపారులం కూడా’ అంటున్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా, నచ్చిన పని చేస్తూ అందరూ మెచ్చేలా విజయావకాశాలను అందుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలు కలిశారు. సవాళ్ళను ఎదుర్కోవడమే తమ సక్సెస్ మంత్ర అని చెప్పారు. ఆ వివరాలు వారి మాటల్లో... – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి స్ట్రాంగ్‌గా ఉంటే.. వింటారు సివిల్ ఇంజినీరింగ్ చేశాను. నాకు ఇంటీరియర్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. దీంతో ఇంటీరియర్ అడ్వాన్స్ కోర్స్ 2018లో పూర్తి చేశాను. గేటెడ్ కమ్యూనిటీలు, సెలబ్రిటీ హౌజ్‌లు డిజైన్ చేశాను. కస్టమర్ బడ్జెట్, ఆలోచనలు తీసుకొని ప్రత్యేకంగా చేయడానికి ప్రయత్నిస్తుంటాను. ఇప్పటి వరకు 200లకు పైగా ్ర΄ాజెక్ట్స్ పూర్తి చేశాను. ఇంటీరియర్ డిజైనింగ్‌లో మహిళలు రాణించలేరు అనుకుంటారు. కానీ, నేను డామినేటింగ్‌గా ఉంటాను. స్ట్రాంగ్‌గా ఉంటే ఎవ్వరైనా మన మాట వింటారు. – అనూష మేకప్ ఒక ఆర్ట్ మేకప్ ఆర్ట్ నాకు చాలా ఇష్టమైన వర్క్. అందుకే, ప్రొఫెషనల్ కోర్స్ తీసుకొని, ముందు మా కమ్యూనిటీలోనే స్టార్ట్ చేశాను. ఇంటివద్దకే వచ్చి మేకప్ చేయించుకునేవారు. రెండేళ్ల క్రితం స్టూడియో ఏర్పాటు చేశాను. 7–8 రాష్ట్రాలలో మా స్టూడియో ద్వారా మేకప్ సర్వీస్ అందిస్తున్నాను. చాలా మంది మేకప్ అనగానే ఫౌండేషన్, కాజల్.. బ్యుటీషియన్ వర్క్ అనుకుంటారు. అలాగే మేకప్ అనేది చాలా మందికి పెళ్లి వంటి ప్రత్యేకమైన సందర్భం తప్పితే అంతగా అవసరం లేనిదిగా చూస్తారు. కానీ, పెళ్లి, వెస్టర్న్ పార్టీలు, బర్త్ డే పార్టీలు... ఇలా సందర్భానికి తగినట్టు మేకప్ స్టైల్స్ ఉన్నాయి. మేకప్ ఆర్టిస్టులకి మార్కెట్లో చాలా పెద్ద పోటటీ ఉంటుంది. కానీ, వారి నెట్‌వర్క్‌తో ప్రొఫెషనల్‌గా చేసే మేకప్‌కి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. – శ్రీలేఖ, మేకప్ సెంట్రల్ నిరూపించుకోవాలనుకుంటే సాధించగలంలక్సస్ డిజైన్ స్టూడియోస్పెషల్గా బ్రైడల్ వేర్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికీ డిజైన్ చేస్తాను. కార్పొరేట్ యూనిఫార్మ్స్, ఫస్ట్ బర్త్‌డే పార్టీలకు డ్రెస్ డిజైన్ చేస్తాను. 2013లో చెన్నైలో మొదటి బ్రాంచ్ స్టార్ట్ చేశాను. తర్వాత హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాం. సెలబ్రిటీలకు దాదాపు 50 తమిళ సినిమాలకు, 50 తెలుగు సినిమా స్టార్స్‌కి డిజైన్ చేశాను. ఫ్యాబ్రిక్ ఎంపికలో, ఉద్యోగుల విషయంలోనూ, డిజైనింగ్‌లోనూ.. ప్రతిదీ సవాల్‌గా ఉంటుంది. మనల్ని మనం నిరూపించుకోవాలనుకుంటే ఏమైనా సాధించగలం. - అమూల్య, అమూల్య అండ్ కృష్ణ కొచర్ పనిలో ప్రత్యేకత చూపాలికేక్ బేకింగ్ తయారు చేసేటప్పుడు నా చుట్టూ ఉన్నవారు ‘ఇప్పటికే మార్కెట్లో చాలామంది హోమ్ మేకర్స్ ఉన్నారు, నీవేం సక్సెస్ అవుతావు’ అన్నారు. కానీ, వారి మాటలు పట్టించుకోలేదు. నా హార్డ్ వర్క్‌నే నమ్ముకున్నాను. కస్టమైజ్డ్ కేక్స్ హాఫ్ కేజీవి కూడా తయారు చేస్తాను. ఎగ్‌లెస్ డిజర్ట్స్ కేక్స్ మా ప్రత్యేకత. మొదట మా కమ్యూనిటీలోని వారికే చేసేదాన్ని. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేయడం, ఆ తర్వాత ఒక్కో ఆర్డర్ రావడం మొదలయ్యింది. టైమ్ ప్రకారం డెలివరీ చేసేదాన్ని. ఒకసారి ఒక జంటకు వారి బేబీ షవర్‌కి బహుమతులు ఆర్డర్‌పై అందించాను. ఇటీవల వారి రెండవ బేబీ షవర్ కోసం అతిథులకు ప్రత్యేకమైన కేక్ వర్క్‌షాప్ నిర్వహించాను. దాదాపు 400 మంది కస్టమర్లు ఆర్డర్స్ ఇస్తుంటారు. ఫైనాన్స్ సబ్జెక్ట్‌లో మాస్టర్స్ చేశాను. నాదైన సొంత ఆలోచనతో స్టార్టప్ నడ΄ాలని బేకింగ్ తయారీ మొదలుపెట్టాను. సక్సెస్ అవుతుందా అనే ఆలోచన లేకుండా, ఆందోళన పడకుండా రుచికరమైన కేక్స్ తయారుచేసివ్వడంలోనే దృష్టిపెట్టాను. – రాధిక, ఆర్బేక్ హౌజ్ఇదీ చదవండి: 13 బంగారు పతకాలు, తొలి ప్రయత్నంలోనే సివిల్స్ : ఎవరీ శ్రద్ధా -
మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీలో తెలుగు శాస్త్రవేత్త
పట్టుమని 200 కుటుంబాలు నివాసమున్న గ్రామం. నగర శివారులో ఉన్నా... కాంక్రీట్ జంగిల్ పోకడలు కనిపించవు. పదో తరగతి వరకూ గ్రామంలో బేల్దారి పనులు, నగరంలో పండ్ల విక్రయంతో తల్లిదండ్రులకు చేదోడు. చిరుప్రాయం నుంచే శారీరక మార్పులతో సహ విద్యార్థుల చిన్నచూపు. వ్యక్తి వెనుక సూటిపోటి మాటలు... అవమానకర వ్యాఖ్యలు. కట్ చేస్తే.. ప్రస్తుతం స్పెయిన్ దేశంలో ఫార్మా రంగ శాస్త్రవేత్త... ట్రాన్స్ఫ్యూజన్ శస్త్రచికిత్స తర్వాత ప్రపంచ దేశాలు గుర్తించేలా మిస్ వరల్డ్ రన్నరప్.. స్ఫూర్తిదాయక జీవనంతో పలువురికి ఆదర్శం. నవంబర్‌లో మిస్ యూనివర్స్ ట్రాన్స్ విజేత దిశగా అడుగులు. ఇది అనంతపురం జిల్లాకు చెందిన ట్రాన్స్‌జెండర్ హన్నా రాథోడ్ విజయ ప్రస్థానం. చదువుతో ఆమె సాధించిన ఒక్క గెలుపు కుటుంబాన్నే కాదు.. ఏకంగా జిల్లా కీర్తిప్రతిష్టలను పెంచింది. స్ఫూర్తిదాయకమైన ఆమె జీవనం ఆమె మాటల్లోనే... అనంతపురం రూరల్ పరిధిలోని సోములదొడ్డి గ్రామం. నాన్న మల్లేష్, అమ్మ పద్మావతికి మూడో సంతానంగా పుట్టాను. ఓ అన్న, అక్క ఉన్నారు. నాకు ఆనంద్‌బాబు అని పేరుపెట్టారు. అమ్మ, నాన్న అనంతపురం నగరంలోని తాడిపత్రి బస్టాండ్‌లో పండ్ల వ్యాపారం చేసేవారు. పేదరికం కారణంగా పస్తులతో గడిపిన రోజులెన్నో చూశా. దీంతో బడికి వెళ్లే సమయంలోనే ఏ మాత్రం వీలు చిక్కినా ఊళ్లో కూలి పనులకు, అమ్మ, నాన్నతో కలసి పండ్ల వ్యాపారం చేస్తూ వచ్చా. ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు నాలో శారీరక మార్పులు గుర్తించా. సమాజానికి తెలిస్తే బయటకు గెంటేసి హేళన చేస్తారేమోనని భయపడ్డా. దీంతో ఎవరితోనూ చెప్పుకోలేదు. చిన్న కొడుకు కావడంతో మా అమ్మ నన్ను ఎంతో గారాబంతో పెంచుతూ వచ్చింది. నా వెనుక గేలి చేసేవారు సమాజంలో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న వివక్ష నన్ను చాలా భయపెట్టేది. ఇలాంటి సమయంలో కేవలం చదువు ఒక్కటే నా సమస్యకు చక్కటి పరిష్కారమని గుర్తించాను. దీంతో పట్టుదలగా చదువుకుంటూ క్లాస్‌లో టాపర్‌గా నిలుస్తూ వచ్చా. ఇంటర్ వరకూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో తెలుగు మీడియం చదివిన నేను ఆ తర్వాత అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీ–ఫార్మసీ చేశా. అక్కడ చాలా మంది స్నేహితులు ఉండేవారు. వారిలో కొందరు నా ముందు ఏమీ అనకపోయినా... నా వెనుక చెడుగా మాట్లాడుకునేవారని తెలిసి బాధపడ్డాను. జన్యుపరమైన లోపాన్ని ఎవరూ గుర్తించలేదు. గేలి చేసినా కుంగిపోలేదు. పట్టుదలతో బీ–ఫార్మసీ, ఎం–ఫార్మసీ పూర్తి చేశా. పెళ్లి ప్రయత్నాల నుంచి బయటపడి ఎం–ఫార్మసీ పూర్తి చేసిన తర్వాత విదేశాల్లో ఎంఎస్ చేయాలని అనుకున్నా. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. దీంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా రెండేళ్లు పనిచేశా. అదే సమయంలో జూనియర్ ఫార్మసీ విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం ద్వారా వచ్చిన డబ్బును దాచుకుని విదేశీ విద్యావకాశాలపై అన్వేషిస్తూ వచ్చా. ఈ లోపు అనంతపురం కలెక్టరేట్లో ఉద్యోగం వచ్చింది. ఈ విషయం తెలియగానే చాలా మంది అమ్మాయిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే పెళ్లి చేసుకుని ఆమె జీవితాన్ని నాశనం చేయకూడదని భావించిన నేను.. విదేశాలకు వెళ్లిపోతే పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడతాయనుకున్నా. అదే సమయంలో విదేశీ విద్యావకాశాలపై అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్ష రాసి మెరుగైన ఫలితాలతో స్పెయిన్‌లో ఎంఎస్ సీటు దక్కించుకున్నా. కోర్సు పూర్తి కాగానే అక్కడే బయో ఇంజినీరింగ్ సొల్యూషన్స్‌లో శాస్త్రవేత్తగా పనిచేసే అవకాశం వచ్చింది. శాస్త్రవేత్తగా స్థిరపడిన తర్వాత 2021లో ట్రాన్స్ఫ్యూజన్ ఆపరేషన్ చేయించుకుని హన్నారాథోడ్గా పేరు మార్చుకుని ఇంట్లో వారికి విషయం చెప్పా. చదువే సెలబ్రిటీని చేసింది ట్రాన్స్జెండర్ల జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు. మన వ్యక్తిత్వం చెదరకుండా కాపాడుకోవాలి. ఎలాంటి వ్యక్తికైనా ప్రతికూల కాలమంటూ ఉంటుంది. నిరాటంకంగా అవరోధాల్ని అధిగమించి విజయం సాధిస్తే ఈ సమాజమే గౌరవప్రదంగా చూస్తుంది. మనం కోరకుండానే వచ్చే జన్యుపరమైన లోపాలకు కుంగిపోరాదు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి, ధర్మాన్ని, దైవాన్ని నిందించడం కూడా పొరబాటే. అసలు ప్రతికూలతల్లో కూడా అనుకూలతను వెదికి అనుకూలంగా మలచుకునే యుక్తిని సాధించగలగాలి. అప్పుడే విజయం మన సొంతమవుతుంది. నా జీవితమే ఇందుకు నిదర్శనం. చదువే ననున్న సెలబ్రిటీని చేసింది. ఈ స్థాయికి నేను ఎదగడంలో ఎదుర్కొన్న కష్టాలు, బాధలు వివరిస్తూ తెలుగు, ఇంగ్లిష్, స్పానిష్ మూడు భాషల్లో పుస్తకం రచిస్తున్నా. త్వరలో ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకువస్తా. మిస్ వరల్డ్ పోటీల్లో ప్రతిభ గతేడాది స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో మిస్ వరల్డ్ ట్రాన్స్–2023 పోటీలు జరిగాయి. అక్కడే పనిచేస్తున్న నాకు ఈ విషయం తెలిసి భారతదేశం తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు దరఖాస్తు చేసుకున్నా. దీంతో నిర్వాహకులు అవకాశం ఇచ్చారు. ఈ పోటీలో ఏకంగా రన్నరప్‌గా నిలవడంతో నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. దీంతో సేవా కార్యక్రమాలు చేపట్టి ట్రాన్స్ సమాజంలో సమూల మార్పులు తీసుకురావాలని భావించాను. ఆ దిశగా తొలి ప్రయత్నం చేశాను. ఇందుకోసం స్పెయిన్‌లోని కొన్ని కంపెనీలతో సంప్రదింపులు కూడా జరిపాను. ట్రాన్స్ సమాజంలో దుర్భర జీవితం గడుపుతున్న వారి సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని కంపెనీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఏడాదికి సంబంధించి నవంబర్‌లో న్యూఢిల్లీలో మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కింది. ఈ పోటీల్లో పాల్గొనడానికే ఇండియాకు వచ్చా. ఇక్కడ మా ఊరి ప్రజలు నన్ను చూసి చాలా సంతోష పడ్డారు. ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించారు. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా నేనే చీఫ్ గెస్ట్. ఇంతకంటే గౌరవం ఏమి కావాలి? -
ఎట్టకేలకు ప్రియాంక బరిలోకి : ఇందిర వారసత్వాన్ని నిలుపుకుంటుందా?
కాంగ్రెస్ శ్రేణుల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. తమ ప్రియతమ నేత ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న కోరిక నెరవేరబోతోంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. కొన్నేళ్లుగా, తన సోదరుడు రాహుల్ గాంధీకి అండగా ఉంటూ పరోక్షంగా కీలక పాత్ర పోషించిన ప్రియాంక ఇక గాంధీ వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో కాంగ్రెస్ ప్రచారానికి బాధ్యత వహించిన, రాజకీయాల్లోకి అధికారిక ప్రవేశించినప్పటికీ ఎన్నికల సమరంలోకి దూకడం మాత్రం ఇదే ప్రథమం. రాహుల్ గాంధీ విజయం సాధించి (రెండు చోట్ల గెల్చిన సందర్భంగా ఇక్కడ రాజీనామా చేయాల్సి వచ్చింది) కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. పలువురు కాంగ్రెస్ పెద్ద సమక్షంలో బుధవారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ గురించి కొన్ని అంశాలను పరిశీలిద్దాం.రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ ప్రియాంక గాంధీ. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె. ఆమె ముత్తాత దివంగత జవహర్ లాల్ నెహ్రూ , దేశానికి స్వాతంత్ర ఉద్యమ నేత. దేశ తొలి ప్రధానమంత్రి. ప్రియాంక నానమ్మ ఇందిరాగాంధీ , తండ్రి రాజీవ్ గాంధీ ఇద్దరూ నెహ్రూ అడుగుజాడల్లో నడిచినవారే. ఇద్దరూ ప్రధానమంత్రులుగా దేశానికి సేవ చేసిన వారే. అంతేకాదు ఇద్దరూ పీఎంలుగా పదవిలో ఉన్నపుడే హత్యకు గురయ్యారు. 1984లో కేవలం 12 సంవత్సరాల వయస్సులో, నానమ్మ ఇందిర అంగరక్షకులచే హత్యకు గురి కావడాన్ని చూసింది., రాహుల్ గాంధీకి 14 ఏళ్లు. ఆ దుఃఖంనుంచి తేరుకోకముందే ఏడేళ్లకు తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో జరిగిన ఆత్మాహుతి దాడిలో తండ్రి, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని పొగొట్టుకుంది. అప్పటికి ప్రియాంకకు కేవలం 19 ఏళ్లు. అంత చిన్న వయసులోనే తల్లికి, సోదరుడుకి అండగా నిలబడింది. ఆ సమయంలోనే ఇందిర గాంధీ పోలికలను పుణికి పుచ్చుకున్న ప్రియాంక రాజకీయాల్లోకి వస్తుందని అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు రాజకీయ పండితులు భావించారు. కానీ అనూహ్యంగా సోనియాగాంధీ కాంగ్రెస్ పగ్గాలను పుచ్చుకున్నారు. ఇక ప్రియాంక 25 సంవత్సరాల వయస్సులో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాతో పెళ్లి తరువాత రాజకీయాలకు చాలా దూరంగా ఉంది. బిడ్డల పెంపకంలో నిమగ్నమైంది.అయితే 1990ల చివరి నాటికి, కాంగ్రెస్ కష్టాలు మొదలైనాయి. ప్రియాంక రంగంలోకి దిగినప్పటికీ ఆమె పాత్ర తెరవెనుకకు మాత్రమే పరిమితమైంది. సోదరుడు రాహుల్‌కు మద్దతు ఇస్తూ, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ పరోక్షంగా రాహుల్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ సమయంలో ఆమె ప్రదర్శించిన రాజకీయ నైపుణ్యం, ప్రజలతోసులువుగా మమేకం కావడం సీనియర్ నాయకులను, ప్రజలను ఆకట్టుకుంది. స్టార్ క్యాంపెయినర్‌గా నిలిచింది. బ్యాక్‌రూమ్ వ్యూహకర్తగా, ట్రబుల్షూటర్గా, కాంగ్రెస్‌కు టాలిస్ మాన్‌గా పేరు తెచ్చుకుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చురుగ్గా పాల్గొంది. దీంతో ముఖ్యంగా పేద ప్రజలతో ఆమెలో అలనాటి ఇందిరమ్మను చూశారు.అంతేకాదు సామాజిక సమస్యలు, ఉద్యమాల పట్ల ఆమె స్పందించిన తీరు, చూపించిన పరిణితి ప్రశంసలు దక్కించుకుంది. ముఖ్యంగా 2008లో, ఆమె తన తండ్రి ,రాజీవ్ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళినిని జైలులో కలుసుకోవడం, ఆమెతో సంభాషించడం విశేషంగా నిలిచింది. అలాగే ఇటీవలి ఎన్నికల్లో మోదీ-షా ద్వయాన్ని ఎదుర్కొని రాయబరేలీలో సోదరుడు రాహుల్‌ని, అప్పటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కిషోరీ లాల్ శర్మను గెలిపించి అమేథీని దక్కించుకుని పార్టీ ప్రతిష్టను ఇనుమడింప చేసింది. 2019లో ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గత 80 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్‌బరేలీలో ఆమె తన తల్లి స్థానంలో నిలబడతారనే అంచనాలు ఒక రేంజ్లో వ్యాపించాయి. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తారని చాలామంది ఊహించారు. కానీ అవి ఊహాగానాలుగానే మిగిలాయి. 2022లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. దీంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు వెలిశాయి. చివరికి ఇన్నాళ్లకు కేరళనుంచి ఎన్నికల సమరంలోకి దిగింది ప్రియాంక గాంధీ వాద్రా. అనేక సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య దేశాన్ని ఏలి శక్తివంతమైన మహిళగా ఖ్యాతికెక్కిన ఇందిదా గాంధీ వారసత్వాన్ని నిలుబెట్టుకుందా? ప్రజల ఆదరణను నోచుకుంటుందా? బహుళ ప్రజాదరణ నేతగా ఎదుగుతుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ప్రియాంక చదువు,కుటుంబం1972, జనవరి 12న పుట్టింది ప్రియాంక గాంధీ.మనస్తత్వశాస్త్రంలో డిగ్రీని, బౌద్ధ స్టడీస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రియాంక గాంధీ, భర్త రాబర్ట్ వాద్రాపై మనీ లాండరింగ్, వివాదాస్పద భూముల కొనుగోళ్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలని వాద్రా ఖండిచారు. అలాగే ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, గాంధీ కుటుంబ ప్రతిష్టను దిగజార్చేందుకు ఉద్దేశించినవని పార్టీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. -
ఒక్క రోజు అమ్మాయిలకు అధికారం ఇస్తే..సూపర్ సక్సెస్!
దసరా నవరాత్రుల సందర్భంగాఉత్తర ప్రదేశ్‌లో హఠాత్తుగా పది జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చారు.అందరూ హైస్కూల్ గర్ల్ స్టూడెంట్లే. ‘జనతా దర్శన్’ పేరుతో సాగే ప్రజా దర్బార్లలో పాల్గొని సమస్యలు విని పరిష్కారాలకోసం నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఉత్తుత్తికి కాదు.స్త్రీ శక్తి నిరూపణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంచాలా సీరియస్‌గా నిర్వహించిన ‘ఆడపిల్లలకు ఒక రోజు అధికారం’ కార్యక్రమంలోజిల్లా యంత్రాంగం చేతులు కట్టుకుని వారి మాట వింది.ఈ అమ్మాయిలు ఈ అనుభవంతో ఐ.ఏ.ఎస్ కావాలనే తలంపునకు వచ్చారు. ప్రతి రాష్ట్రం ఇలాంటి ప్రయత్నం చేయాలి. అమ్మాయిలు చదువుకోవడం, విదేశాలకు వెళ్లి పై చదువులు చదవడం, మగవారికి మాత్రమే సాధ్యమయ్యే ఉద్యోగాలు తామూ చేయడం చూస్తూనే ఉన్నాం. చరిత్రలో మొదటిసారి అమెరికాలో అధ్యక్షపదవికి ఒక మహిళ పోటీ పడటం వరకూ ఈ మహిళా చైతన్యం సాగింది. అయినప్పటికీ మహిళల పట్ల వివక్ష, కుటుంబాలలో మగ పిల్లాడికి దక్క ప్రాధాన్యం, చదివించే విషయంలో అబ్బాయిలకు మంచి కోర్సు అమ్మాయిలకు అప్రధానమైన కోర్సు దేశంలో సాగుతూనే ఉన్నాయి. ఇలాంటి మైండ్‌సెట్‌ని మార్చడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘శక్తి మిషన్’ అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. మహిళల స్వావలంబనే కాదు... అమ్మాయిల ఆత్మవిశ్వాసం పెంచడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇందులో మరో ముఖ్యమైన కార్యక్రమం ‘అమ్మాయిలకు ఒకరోజు అధికారం’. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మొన్నటి అక్టోబర్ 12న దాదాపు పది జిల్లాలలో ఈ కార్యక్రమం కింద ఇంటర్ లోపు చదువుతున్న అమ్మాయిలకు జిల్లా కలెక్టర్‌గా, ఎస్.పి.గా, సి.డి.ఓ. (చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా) పూర్తి అధికారాలు ఇచ్చారు. సర్వోన్నత ఉద్యోగాల్లో ఉంటే పేదవారికి, బలహీనులకు ఎలా న్యాయం చేయవచ్చో ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినులకు తెలియచేయడమే కాదు... వారు అధికారంలో ఉంటే మిగిలిన సిబ్బంది ఎలా వ్యవహరిస్తారో నిజంగా చేసి చూపించారు. ఆ విధంగా ఇదో స్ఫూర్తినిచ్చే కార్యక్రమం.కూరగాయల రేట్లు ఇవా?లక్ష్మీపూర్ ఖేరి జిల్లాకు ఎనిమిదవ తరగతి చదువుతున్న అగరిమ ధావన్ ఒకరోజు కలెక్టర్ అయ్యింది. ఆమె ఆ రోజు తన దగ్గరకు వచ్చిన ప్రజల సమస్యలు వింది. అందులో భాగంగా కూరగాయల రేట్లు పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నామన్న ఫిర్యాదు వింది. వెంటనే కింది స్థాయి అధికారులను పిలిచి ‘కూరగాయల రేట్లు ఇలా ఉంటే ఎలా? వీటిని క్రమబద్ధీకరించరా?’ అని ప్రశ్నించి వాటి అదుపునకు చర్యలు తీసుకోమంది. వెంటనే అందుకు తగిన చర్యలు మొదలయ్యాయి. జౌన్పూర్ జిల్లాకు ఇంటర్ చదువుతున్న సాజల్ గుప్తా కలెక్టర్ అయ్యింది. ప్రజాదర్బార్ లో 87 ఫిర్యాదులు ఆమె వద్దకు వచ్చాయి. వాటిలో 14 ఫిర్యాదులను అక్కడిక్కడే ఆమె పరిష్కరించింది తన అధికారాలతో. ఇక మహరాజ్ గంజ్‌కు కలెక్టర్ అయిన నిధి యాదవ్ అనే అమ్మాయి ఆ ప్రాంత వాసులకు రావాల్సిన (హైవే నిర్మాణం వల్ల) నష్టపరిహారాన్ని అప్పటికప్పుడు మంజూరయ్యేలా చేసింది. అదే జిల్లాకు ఎస్.పి.గా అధికారాలు స్వీకరించిన గోల్టీ అనే అమ్మాయి తన పరిధిలోని స్టేషన్లలో ఆడవాళ్లు ఇబ్బంది పడుతున్న కేసులను మొదటగా ఇన్వెస్టిగేట్ చేసి పరిష్కరించాలని గట్టి ఆదేశాలు ఇచ్చింది. మిర్జాపూర్, ఘాజీపూర్, షామ్లీ, శ్రావస్థి, బాందా తదితర జిల్లాలలో కూడా ఆ జిల్లాల్లో చురుగ్గా చదువుతున్న అమ్మాయిలను ఎంపిక చేసి కలెక్టర్, ఎస్.పి. బాధ్యతలు అప్పజెప్తే వారు ఒక రోజంతా అద్భుతంగా బాధ్యతలు నిర్వహించడమే కాదు... విజిట్లకు కూడా వెళ్లారు.ఒక రోజు ఆఫీసర్ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒకే ఒక్కడు’ సినిమాలో అర్జున్ ఒక్క రోజు కోసం సి.ఎం. అయినా అతని నిర్ణయాలన్నీ అమలవుతాయి. ఇక్కడ కూడా ఈ అమ్మాయిలు తీసుకున్న నిర్ణయాలు అమలయ్యాయి. అమలు అయ్యేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో కొన్ని జిల్లాల్లో తాసిల్దార్లుగా కూడా అమ్మాయిలను నియమించారు ఒకరోజు కోసం. కలెక్టర్‌గా నియమితమైన అమ్మాయి, తాసిల్దార్లుగా నియమితమైన అమ్మాయిలు కలిసి మాట్లాడుకుని ఆ రోజున తమ టేబుళ్ల మీద ఉన్న సమస్యలను చకచకా పరిష్కరించడం అందరినీ ఆకర్షించింది. ఎస్.పి.గా చేసిన అమ్మాయిలు కొందరు ఎఫ్ఐఆర్ల మీద కూడా సంతకాలు చేశారు.కలెక్టర్లమవుతాంఈ కార్యక్రమంలో పాల్గొన్న అమ్మాయిలందరూ ప్రజల సమస్యలు విన్నారు. తాము బాగా చదువుకున్న ఆ సమస్యలను పరిష్కరించే అధికార స్థానంలో వెళ్లవచ్చని గ్రహించారు. ‘మేము బాగా చదువుకుంటాం’ అని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఈ సందర్భంగా వీరందరూ కాన్వాయ్‌లలో ఆఫీసులకు చేరుకున్నారు. వీరందరూ భవిష్యత్తులో ఇంతకుమించిన బాధ్యతాయుత స్థానాల్లోకి వెళ్లాలని కోరుకుందాం. -
దేశంలోనే తొలి ట్రాన్స్ఉమెన్ డైరెక్టర్ సంయుక్త విజయన్ సక్సెస్ స్టోరీ
పొల్లాచ్చిలో పుట్టి శాన్ఫ్రాన్సిస్కోలో స్థిరపడిన ఈ ట్రాన్స్ ఉమన్ మన దేశ తొలి ట్రాన్స్ ఉమన్ డైరెక్టర్‌గా చరిత్రకు ఎక్కింది. పురుషుడిగా పుట్టి స్త్రీగా మారడానికి ఎన్ని అవస్థలు పడిందో ఆ ఘర్షణను ‘నీల నిర సూర్యన్’ పేరుతో సినిమా తీయడమే కాదు ముఖ్యపాత్ర పోషించింది. నేడు ఈ చిత్రం విడుదల సందర్భంగా సంయుక్త పరిచయం. 2016.తమిళనాడు–తిరుచ్చిలోని సొంత ఇంటికి దీపావళి పండక్కు వచ్చిన సంతోష్ అమెరికాకు తిరిగి వెళుతూ ‘అమ్మా... వచ్చే దీపావళికి నేను అమ్మాయిగా వస్తాను’ అని చెప్పాడు. తల్లి ఉలిక్కి పడలేదు. కన్నీరు కార్చలేదు. ‘నీ ఇష్టంరా. నీకెలా సంతోషంగా ఉంటే అలా చెయ్’ అంది. అమెరికాకు వెళ్లాక సంతోష్ ట్రాన్స్ ఉమన్‌గా మారడానికి అవసరమైన వైద్యం, చికిత్సలు చేయించుకున్నాడు. శనివారం వరకూ అబ్బాయి రూపంలోనే వెళ్లిన సంతోష్ సోమవారం నుంచి ‘సంయుక్త’ గా ఆఫీస్‌లో అడుగు‘పెట్టింది’. అయితే స్నేహితులు ఎటువంటి తేడా చూపించలేదు. అబ్బాయి సంతోష్‌తో ఎంత స్నేహంగా ఉన్నారో అమ్మాయి సంయుక్తతో అంత స్నేహంగా ఉన్నారు. ‘అందరి కథ ఇంత సులువుగా ఉండదు. అందుకే సినిమా తీశాను’ అంటుంది సంయుక్త.బీటెక్ గ్రాడ్యుయేట్సంయుక్త తండ్రి టైలర్. తల్లి గృహిణి. ముగ్గురు కుమారుల్లో ఒకడుగా పుట్టాడు సంతోష్. ‘అయితే నా భౌతిక రూపానికి నా మానసిక స్వభావానికి పొంతన కుదరలేదు. నాలోని స్త్రీనే నేను స్వీకరించాను. నా తల్లిదండ్రులు ఇందుకు నన్ను ఇబ్బంది పెట్టకపోయినా బయట నేను సంప్రదాయవాదుల గేలిని, అల్లరిని, అవమానాన్ని భరించాను. ట్రాన్స్పర్సన్ల జీవితం వెండి తెర మీద రావడం తక్కువ. మగవాళ్లు కొందరు ఆ పాత్రలు ధరించారు. ఇటీవల ‘తాలి’ సినిమాలో సుస్మితా సేన్ బాగా చేసింది. కాని నేను ట్రాన్స్ఉమన్గా ఉంటూ సినిమా తీయడం వల్ల మేమూ ఇండస్ట్రీలో మా కథలు చెప్పగలం అని నిరూపించదలుచు కున్నాను’ అంటుంది సంయుక్త.సినిమా అంటే తెలియకపోయినా...‘మా పొల్లాచ్చిలో రోజూ షూటింగ్‌లే. కాని ఏవీ నేను చూడలేదు. షార్ట్‌ఫిల్మ్‌లు తీయలేదు. అసిస్టెంట్‌గా పని చేయలేదు. 2020లో నేను సినిమా తీయాలనుకున్నప్పుడు స్క్రిప్ట్ ఎలా రాయాలన్న సంగతిని యూట్యూబ్ పాఠాల ద్వారా తెలుసుకున్నాను. వందల వీడియోలు చూసి రెండేళ్ల పాటు స్క్రిప్ట్ రాశాను. నా జీవితాన్ని, నావంటి వారి జీవితంలోని ఘటనలను కలిపి ‘నీల నిర సూర్యన్’ సినిమా తీశాను. అంటే నీలి రంగు సూర్యుడు అని అర్థం. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ది బ్లూ సన్‌షైన్’ పేరుతో ప్రదర్శితమవుతుంది. తమిళ విడుదల కోసం తమిళ పేరు పెట్టాను’ అని తెలిపింది సంయుక్త.సొంత డబ్బు పెట్టి...సంయుక్త అమెరికాలో అమేజాన్‌లో ఉన్నత ఉద్యోగంలో ఉంది. తన సంపాదనలోని కొంత భాగాన్ని ఈ సినిమా కోసం ఖర్చు పెట్టింది. ‘సినిమాల్లో థర్డ్ జెండర్‌ని హాస్యానికే వాడి అపచారం చేశారు. ఇక మీదైనా ట్రాన్స్పర్సన్లను మర్యాదకరమైన రీతిలో ఇన్క్లూజివ్గా చూపి చేసిన పాపాన్ని కడుక్కోవాలి సినిమావారు. పరిస్థితి ఇంకా చిన్న ఊళ్లలో మారలేదు. ఉదాహరణకు ఒక స్కూల్లో టీచర్ని పిల్లలు గౌరవిస్తారు. కాని ఆ టీచర్ ట్రాన్స్ ఉమన్ అయితే తేడా వచ్చేస్తుంది. ఈ పరిస్థితి ΄ోవాలి. నేను తీసిన సినిమా కథ మాలాంటి వాళ్ల అస్తిత్వాన్ని గౌరవించవలసిందిగా అర్థం చేసుకోమని కోరుతుంది’ అందామె.స్త్రీగా మాత్రమేసంయుక్త తనను తాను స్త్రీగా తప్ప ట్రాన్స్‌జెండర్‌గా చెప్పడానికి అంగీకరించదు. ‘నేను స్త్రీగా మారదల్చుకున్నాను. మారాను. కనుక నా ఆధార్ కార్డులో స్త్రీ అనే ఉంది. ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాల కోసం ట్రాన్స్‌జెండర్ అనే అస్తిత్వం అవసరమైతే దానిని కొందరు స్వీకరించవచ్చు. కాని నేను పూర్తిగా స్త్రీ అస్తిత్వంతో ఉండాలని కోరుకుంటాను’ అంటుంది సంయుక్త. ఆమె మంచి భరతనాట్య కళాకారిణి. చెన్నయ్‌లో ఆరంగేట్రం చేస్తే చాలామంది మెచ్చుకున్నారు. విస్మరణకు గురైన జీవితాలకు సంబంధించి ఇవాళ అనేక సినిమాలు వస్తున్నాయి. సంయుక్త విజయన్ తీసిన ‘నీల నిర సూర్యన్’ మరో ముఖ్యమైన కథను చెబుతోంది. మరిన్ని కథలు సంయుక్త నుంచి మనం చూడొచ్చు.‘మా కథలు మేము చెప్పుకోవడం ఈ దేశంలో అంత సులువు కాదు’ అంటుంది సంయుక్త విజయన్. -
ఏరియల్ ఆర్ట్ : ఆకాశమే హద్దుకళ
అథ్లెటిసిజం కలగలసి వైమానిక విన్యాసాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. చూడటానికి జిమ్నాస్ట్‌గా అనిపిస్తూనే ఆకాశంలో హరివిల్లులా మారే నృత్యప్రదర్శన ఓ అద్భుత ప్రకియగా అందరి మనసులను ఆకట్టుకుంటోంది. మహారాష్ట్ర ప్రభుత్వ క్రీడా అవార్డును గెలుచుకున్న తర్వాత, అదితి దేశ్‌పాండే ప్రజలకు వైమానిక విన్యాసాలలో శిక్షణ ఇస్తోంది. ముంబైలోని తన అకాడమీ ఫ్లై హై ఏరియల్ ఆర్ట్ గురించి దేశ్‌పాండే మాట్లాడుతూ, ‘ఒక వ్యక్తి జిమ్‌కి వెళ్లినట్లుగానే, చాలామంది ఏరియల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని.. ఆఫీసులు, స్కూళ్ల టైమ్ తర్వాత శిక్షణ కోసం క్లాసులకు రావాలని కోరుకుంటున్నారని’ చెబుతోంది. శరీర బరువులో సమతుల్యతసిల్క్ ఫ్యాబ్రిక్, హూప్స్, తాళ్లు లేదా ట్రాపెజెస్ని ఉపయోగించి గాలిలో నృత్యం చేసిన వ్యక్తులు ఉన్నారు. ఈ డ్యాన్స్ సంగీతంతో సెట్ చేసి ఉంటుంది. ప్రదర్శనలు చేయడానికి వ్యక్తుల బలం, సౌలభ్యాన్ని మిళితం చేసి దృశ్యంగా మార్చే అద్భుతమైన ప్రక్రియ ఇది. ఒక సాధారణ వ్యక్తి ఈ విన్యాసాలను చాలావరకు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా చేయడానికి తన పూర్తి బలాన్ని ఉపయోగిస్తాడు. వైమానిక స్కిల్స్ ప్రదర్శించే సమయంలో వెనుక కండరాలను ఉపయోగిస్తాడు. దీనికి శరీర బరువులో ఒక సమతుల్యతను తీసుకురావాల్సి ఉంటుంది’అని వివరిస్తుంది దేశ్‌పాండే ఎలా చేస్తారంటే...ఈ వైమానిక ప్రదర్శనలో డ్రాప్స్, రోజులు, స్పిన్‌లను అమలు చేయడానికి ముందు వ్యక్తులు తమను తాము ఫాబ్రిక్లో చుట్టుకుంటారు. ఏరియల్ రోప్ అనేది లైక్రాతో తయారు చేయబడిన వృత్తాకార ఉపకరణం. దీనిని కళాకారులు విన్యాసాలను ప్రదర్శించడానికి ఉపయోగిస్తారు. ట్రాపెజ్ అనేది తాళ్లు, తీగలతో చేసేది. ఇక్కడ ప్రదర్శనకారులు గాలిలో ఊగుతూ విన్యాసాలు చేస్తారు. స్ట్రాప్స్లో కళాకారులు సీలింగ్‌కు జోడించిన పట్టీలపై ప్రదర్శనలు చేస్తారు. అక్టోబర్‌లో ఢిల్లీలోని స్విస్ దగ్గర ప్రదర్శనస్విస్ కళాకారుడు జాసన్ బ్రూగర్, భారతీయ హులా హూప్ ప్రాక్టీషనర్ ఎష్నా కుట్టి అక్టోబర్ 2024లో న్యూ ఢిల్లీలోని స్విస్ రాయబార కార్యాలయంలో రెండు దేశాలు 75 సంవత్సరాల స్నేహాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రదర్శన ఇవ్వనున్నారు. వైమానిక కళలకు ‘ఉన్నత స్థాయి సాంకేతికత అవసరం కాబట్టి ఇది కచ్చితంగా జిమ్నాస్టిక్స్ వంటి క్రీడలతో పోల్చవచ్చు. కానీ కదలిక, సంగీతం, కోర్సు సాంకేతికత ద్వారా కళ సృష్టించడం‘ అని బ్రూగర్ చెప్పారు. ‘వేదికపై ఉన్నప్పుడు నా వ్యక్తిగత లక్ష్యం నా శరీరం ఏమి చేయగలదో చూపించడం ద్వారా ప్రజలను ఆకట్టుకోవడం‘ అంటారు. వైమానిక కళ అందరికీ అందుబాటులో ఉందా?అహ్మదాబాద్‌లోని ఏరియల్ ఆర్ట్స్ ఇండియా అకాడమీ వ్యవస్థాపకుడు మాస్టర్ ట్రైనర్ అయిన జీల్ సోనీ– ‘మా దగ్గర 55 ఏళ్ల వ్యక్తి నుండి 12 ఏళ్ల అమ్మాయి వరకు ప్రతి ఒక్కరూ ఈ ఏరియల్ ఆర్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ప్రజలు కొంచెం సాహసం చేయాలని చూస్తున్నందున జిమ్‌కి వెళ్లకుండా ఏరియల్ ఆర్ట్‌లను ఎంచుకుంటారు. పరికరాలు, మౌలిక సదు΄ాయాల విషయానికొస్తే క్రాష్ మ్యాట్లు, ప్రథమ చికిత్స, సేఫ్టీ గ్రిప్ ఎయిడ్ నుండి అన్నింటినీ అందిస్తాం’ అని చెబుతోంది.ఖర్చు ఎంతంటే..! సోని ఎనిమిది వైమానిక కళల శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించింది. ఇది పూర్తి చేయడానికి రెండు సంవత్సరాల టైమ్ పడుతుంది. ఒకటి నుండి నాలుగు స్థాయిలు వైమానిక కళలను పరిచయం చేస్తాయి. ఐదు నుండి ఎనిమిది ఋత్తిపరమైన స్థాయి లు. ప్రతి పరిచయ స్థాయి శిక్షణకు ఒకటిన్నర నెలలకు సుమారు రూ. 6,500, ప్రతి ఉన్నత స్థాయికి మూడు నెలలకు రూ. 13,500 ఖర్చు అవుతుంది. సృజనాత్మకత, శిక్షణ, కఠినమైన మనస్తత్వం కూడా ఈ కళకు చాలా ముఖ్యమైనవి. మంచి కోచ్‌తో పని చేస్తే సరైన శిక్షణ లభిస్తుంది. సర్కస్‌లు, డ్యాన్స్ షోలు లేదా థియేటర్లలో ప్రదర్శించే ఏరియల్ ఆర్టిస్టులకు రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షల వరకు చెల్లిస్తారు. ముంబై, బెంగళూరు, ఢిల్లీ, పూణేలోని స్టూడియోలు సెషన్ల సంఖ్య ఆధారంగా తరచుగా ప్యాకేజీలుగా ఉండే తరగతులను అందిస్తాయి. ప్లేస్, శిక్షణ రకం, కోచ్, కోర్సు వ్యవధి ఆధారంగా ట్రెయినింగ్ ఫీజు ఉంటుంది. -
మునుపటి కాలం కాదు ఇది, కానీ..
మునుపటి కాలం కాదు ఇది. సెలవులు, తీరిక దొరకగానే ఇంటి నాలుగు గోడలకు పరిమితం కావాలనుకోవడం లేదు మహిళలు. సోలో ట్రావెలర్స్‌గా అవుట్డోర్ థ్రిల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక కోణంలో చూస్తే....‘ఆహా... ఎంత మార్పు’ అనిపిస్తుంది. మరో కోణంలో చూస్తే అవుట్డోర్ అడ్వెంచర్లలో మహిళలకు సౌకర్యాలు, భద్రతాపరంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి..గత కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో మహిళా సాహస బృందాలు, సోలో ఉమెన్ ట్రావెలర్లు పెరిగారు. చాలామంది మహిళలు సెలవుల్లో ఇంటికి పరిమితం కావడానికి బదులు అవుట్డోర్ థ్రిల్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. మన దేశంలో పర్వతారోహణ, స్కీయింగ్, స్కూబా డైవింగ్, పారాగ్లైడింగ్... మొదలైన సాహస విభాగాల్లో శిక్షణను అందించే సంస్థల నుండి ప్రతి సంవత్సరం మహిళలు పెద్ద సంఖ్యలో శిక్షణ తీసుకుంటున్నారు. అయినప్పటికీ..మహిళల నేతృత్వంలోని అడ్వెంచర్ టూరిజం కంపెనీలు కొన్ని మాత్రమే ఉన్నాయి. టూరిజం ఇండస్ట్రీ ఉమెన్ ట్రావెలర్ల అవసరాలను పూర్తిగా తీర్చడం లేదు. మహిళా గైడ్లు, సహాయ సిబ్బంది కొరత గణనీయంగా ఉంది. ప్రస్తుతం కొన్ని కంపెనీలు మాత్రమే మహిళా గైడ్లను నియమించుకుంటున్నాయి. ‘గైడ్ అంటే పురుషులు మాత్రమే’ అనే భావనను పునర్నిర్వచించడమే కాకుండా మహిళా ప్రయాణికులకు భరోసాగా నిలుస్తున్నారు ఫిమేల్ గైడ్లు. మారుమూల ప్రాంతాలలో సౌకర్యవంతమైన వాతావరణానికి కృషి చేస్తున్నారు.మహిళా భద్రతా కోణంలో జెండర్ సెన్సివిటీ ట్రైనింగ్ అనేది కీలకంగా మారింది. ఈ శిక్షణ మేల్ గైడ్స్ ‘జెండర్ డైనిమిక్స్’ను అర్థం చేసుకోవడానికి మాత్రమే కాదు లైంగిక వేధింపులను నివారించడానికి సహాయపడుతుంది. భద్రత, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఉమెన్ ట్రావెలర్స్‌కు అవసరమయ్యే ఎక్విప్మెంట్ను రూపొందించాల్సిన బాధ్యత టూరిజం కంపెనీలపై ఉంది. శానిటరీ ప్రొడక్ట్స్, మెన్స్ట్రువల్ క్రాంప్స్ కోసం పెయిన్ రిలీఫ్ మందులు, ఆరోగ్యం, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్టాండర్డ్ మెడికల్ కిట్లు అందుబాటులోకి తేవాలి. ‘సోలో ట్రావెలర్, అవుట్ డోర్ ప్రొఫెషనల్‌గా ఎన్నోసార్లు అసౌకర్యానికి గురయ్యాను. మహిళల సాహస ప్రయాణాలలో మౌలిక సదుపాయాల తక్షణ అవసరం ఉంది’ అంటుంది మౌంటెనీర్, ఎంటర్ప్రెన్యూర్ అనూష సుబ్రమణ్యియన్.ఇలా అంటున్నారు.. ఇటీవల ఒక సంస్థ సోలో ఉమెన్ ట్రావెలర్స్ గురించి నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 29 శాతం మంది భద్రత గురించి ఆందోళన చెందారు. మరో 29 శాతం మంది శారీరక సౌకర్యం (ఫిజికల్ కంఫర్ట్), 23 శాతం మంది వెహికిల్ బ్రేక్‌డౌన్స్, 13 శాతం మంది లైంగిక వేధింపుల గురించి ఆందోళన చెందారు. ఎవరి అభిప్రాయం మాట ఎలా ఉన్నా అడ్వెంచర్ టూరిజం ఇండస్ట్రీ మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనేది అందరి నోటి నుంచి వినిపించిన మాట.ఇవి చదవండి: డ్యాన్సింగ్ సిటీ.. హిప్హాప్ స్టెప్స్.. -
Harini Amarasuriya: శ్రీలంక ప్రధాని హరిణి.. హక్కుల చుక్కాని!
శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య. ప్రధాని కావడానికి ముందు పార్లమెంట్ సభ్యురాలు. ఎంపీ కావడానికి ముందు లెక్చరర్. లెక్చరర్‌కు ముందు, లెక్చరర్ అయిన తరువాత స్త్రీవాదం, నిరుద్యోగం, లింగ వివక్ష... ఇలా ఎన్నో సామాజిక అంశాలపై హక్కుల కార్యకర్తగా తన గొంతును బలంగా వినిపించింది. సమస్యలు తెలిసిన... సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి ప్రధాని అయితే ఆ పాలన దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని చరిత్ర నిరూపించింది. ‘ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రయాణంతో శ్రీలంకలో మరో చరిత్ర మొదలుకానుంది’ అనే ఆశారేఖలు వెల్లివిరుస్తున్నాయి...కొలంబోలో పుట్టి పెరిగిన హరిణి అమరసూర్య హిందూ కాలేజ్, దిల్లీ యూనివర్శిటీలో బి.ఎ, సిడ్నీలోని మక్వరీ యూనివర్శిటీలో ఆంత్రోపాలజీ అండ్ డెవలప్మెంట్లో ఎం.ఎ, ఎడిన్‌బరో యూనివర్శిటీలో సోషల్ ఆంత్రోపాలజీలో పీహెచ్డీ చేసింది. యూత్, పాలిటిక్స్, యాక్టివిజం, జెండర్, డెవలప్మెంట్, శిశు సంరక్షణ, గ్లోబలైజేషన్ అండ్ డెవలప్మెంట్... ఇలా ఎన్నో అంశాలపై లోతైన పరిశోధన చేసింది. పుస్తకాలు రాసింది. డిగ్రీ తరువాత శ్రీలంకలోని మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ ‘నెస్ట్’తో కలిసి పనిచేసింది హరిణి. ‘నెస్ట్’ వ్యవస్థాపకురాలైన సాలీ హులుగల్లే అట్టడుగు, అణగారిన వర్గాల కోసం పనిచేసింది. ‘నెస్ట్’ ద్వారా ఎంతో మార్పు తీసుకురాగలిగింది. ఆమె ప్రభావంతో మానసిక వైద్యశాలలలో ఎంతోకాలంగా దిక్కుమొక్కు లేకుండా పడి ఉన్న దీనులు, ఎవరూ పట్టించుకోని హెచ్ఐవీ బాధితులు, అనాథ పిల్లలతో కలిసి పనిచేసింది హరిణి.చైల్డ్ ప్రొటెక్షన్, సైకలాజికల్ ప్రాక్టీషనర్‌గా ఎన్నో సంవత్సరాలు పని చేసిన తరువాత శ్రీలంక ఓపెన్ యూనివర్శిటీలో లెక్చరర్‌గా చేరింది. యాక్టివిస్ట్‌గా ఉచిత విద్య కోసం ఎన్నో ఉద్యమాలు చేసింది. ‘ఫెడరేషన్ ఆఫ్ యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్’ సభ్యురాలైన హరిణి లింగసమానత్వం నుంచి జంతుసంక్షేమం వరకు ఎన్నో అంశాలపై తన గళాన్ని వినిపించింది.ఇక రాజకీయాల విషయానికి వస్తే... 2019లో ‘నేషనల్ ఇంటలెక్చువల్ ఆర్గనైజేషన్’లో చేరిన హరిణి శ్రీలంక అధ్యక్ష ఎన్నికల సమయంలో నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్పీపీ) అభ్యర్థి అనురా కుమార దిస్సానాయకే తరఫున ప్రచారం చేసింది. 2020 శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల తరువాత ఎంపీగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టింది. ఎంపీగా తన రాజకీయ జీవితాన్ని కొనసాగించడానికి లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. అత్యున్నత పదవి విషయంలో ‘సరిౖయెన వ్యక్తి’ అనే ప్రశంస చాలా తక్కువమందికి లభిస్తుంది. ఇలాంటి వారిలో 54 సంవత్సరాల హరిణి అమరసూర్య ఒకరు. ‘ప్రధానిగా ఆమె సరిౖయెన వ్యక్తి’ అనేది ఇప్పుడు చాలామంది నోట వినిపిస్తున్న మాట.సమాజం అనే పుస్తకాన్ని చదివి..హరిణికి ఆంగ్ల సాహిత్యం అంటే చాలా ఇష్టం. ‘ఇంగ్లీష్ సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని ఉంది’ అంటూ నాన్న స్నేహితుడైన మాజీ దౌత్యవేత్త దగ్గర తన మనసులో మాట బయటపెట్టింది. మొదట ఆయన ఎగతాళిగా నవ్వినా ఆ తరువాత మాత్రం ఆంగ్ల సాహిత్యంలోని ఎంతో మంది దిగ్గజ రచయితలను పరిచయం చేశాడు. వారి రచనలు చదువుతుంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా అనిపించింది. ‘ఆంగ్ల సాహిత్యంలోకి అడుగు పెట్టిన తరువాత నా చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మొదలైంది. ఆ తరువాత కాలంలో సాహిత్య అధ్యయనం కంటే నా చుట్టూ ఉన్న సమాజాన్ని లోతుగా అధ్యయనం చేయాలనిపించింది’ అంటుంది హరిణి. పుస్తక ప్రపంచంలో కంటే సామాజిక ప్రపంచంలోనే ఆమెకు ఎక్కువ విషయాలు తెలిసాయి. నిరుద్యోగం నుంచి లింగ వివక్ష వరకు ఎన్నో సమస్యలను ప్రత్యక్షంగా చూసింది. ఆమె ఉద్యమకారిణిగా ప్రయాణంప్రారంభించడానికి, ఆ తరువాత రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ‘సమాజం’ అనే పుస్తకం ఎంతో ఉపయోగపడింది.అవును... ఆమె దిల్లీ స్టూడెంట్!‘హిందూ కళాశాల పూర్వ విద్యార్థి అయిన హరిణి శ్రీలంక ప్రధాని కావడం మా కళాశాలకు గౌరవంగా భావిస్తున్నాను. ఆమె విజయం పట్ల మేము గర్వపడుతున్నాం. హరిణి సాధించిన విజయం మా కళాశాల చరిత్రలో మరో మైలురాయి. హిందూ కళాశాలలో హరిణి గడిపిన కాలం ఆమె నాయకత్వానికి మార్గనిర్దేశం చేయడంలో సహాయపడుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు ఆ కళాశాల ప్రిన్సిపాల్ అంజు శ్రీవాస్తవ. హరిణి హిందూ కాలేజీలో 1991 నుండి 1994 వరకు చదివింది. బాలీవుడ్ దర్శకుడు నళిన్ రాజన్సింగ్ హిందూ కాలేజీలో హరిణి బ్యాచ్ మేట్.‘కాలేజీ ఉత్సవాలు, చర్చలలో హరిణి చురుగ్గా పాల్గొనేది. ఆమె ప్రధాని స్థాయికి ఎదగడం గర్వంగా ఉంది’ అంటున్నాడు నళిన్ రాజన్సింగ్.ఇవి చదవండి: మహిళల ప్రపంచకప్ టికెట్ల విక్రయం షురూ -
మనసులో కుంచె ముంచి..
కళ సామాజిక ప్రయోజనం గురించి చెప్పుకోవడానికి బోలెడు మ్యాటర్ ఉంది. ‘వ్యక్తిగతం’ మాట ఏమిటి? అనే విషయానికి వస్తే...‘కళ అద్భుత ఔషధం’ అంటున్నారు అమెరికాలోని బాల్టిమోర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్వేతారావు గార్గ్.‘ఒత్తిడిని చిత్తు చేయడానికి, ఉత్సాహాన్ని శక్తిగా చేసుకోవడానికి కళ బలమైన ఔషధంలా ఉపయోగ పడుతుంది’ అంటున్న శ్వేతారావు గార్గ్ బోధకురాలు, రచయిత్రి, ఆర్టిస్ట్. శ్వేతారావు గార్గ్ కాలేజీ రోజుల్లోకి వెళితే...‘ఒత్తిడి నుంచి బయటపడాలి’‘మనసుకు కాస్త ఉత్సాహం కావాలి’ అనుకున్నప్పుడల్లా ఆమె చేసే పని... కలాన్ని చేతిలోకి తీసుకొని తన మనసులోని భావాలను కాగితంపై పెట్టడం. లేదా కుంచె తీసుకొని రంగు రంగుల చిత్రాలు వేయడం. ఈ ఉపశమనం, ఉత్సాహాన్ని ఇచ్చే పని కళాప్రపంచంలో తనకు చోటు కల్పిస్తుందని శ్వేత ఊహించి ఉండదు.మొదట్లో తాను వేసిన చిత్రాలను ఇతరులకు చూపించేది కాదు. వాటిని రహస్యంగా దాచేది. వివిధ కారణాల వల్ల రచనలు చేయడానికి, బొమ్మలు వేయడానికి దూరమైన శ్వేత మళ్లీ కళాప్రపంచంలోకి వచ్చింది. అప్పుడు తనకు ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించింది. బొమ్మలు వేయడమే కాదు నవలలు రాసే ప్రయత్నం కూడా మొదలుపెట్టింది.రచనలు చేస్తున్న కొద్దీ, బొమ్మలు వేస్తున్న కొద్దీ తనమీద తనకు ఆత్మవిశ్వాసం పెరిగింది. ‘వీటిని రహస్యంగా దాచుకోవడం ఎందుకు! ప్రపంచానికి చూపించాలి’ అనుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ రచనలు, చిత్రాలను అధ్యయనం చేసిన శ్వేత అనుకరణ నీడల్లోకి వెళ్లకుండా తనదైన సొంత శైలిని సృష్టించుకుంది.వంటగది నుంచి పిల్లల పెంపకం వరకు మహిళల దైనందిన జీవితంలో రకరకాల ఘట్టాలను కథలుగా మలిచింది. శ్వేత కళాత్మక సాధనలో ‘స్త్రీవాదం’ అనేది ప్రధాన అంశంగా మారింది. ఆమె రచనల్లో స్త్రీ ΄ాత్రలు పరాధీనంగా, బేలగా, నిస్సహాయంగా కనిపించవు. పురుషాధిపత్య ధోరణులను సవాలు చేసేలా, స్వతంత్య్రవ్యక్తిత్వంతో కనిపిస్తాయి. నిత్య ఉత్సాహంతో శక్తిమంతంగా కనిపిస్తాయి.ఇక చిత్రకళ విషయానికి వస్తే శ్వేత ఏ ఆర్ట్ స్కూల్లోనూ పట్టా పుచ్చుకోలేదు. అయితే విన్సెంట్ వాన్ గోహ్ నుంచి అమృతా షేర్గిల్ వరకు ఎంతోమంది చిత్రకారులతో మౌనసంభాషణ చేస్తూనే ఉంటుంది. తనదైన విలక్షణ దృశ్యభాషను సృష్టించుకోవడానికి సాధన చేస్తూనే ఉంటుంది.‘కాలేజీ రోజుల నుంచి నా భావాల వ్యక్తీకరణకు కళ అనేది బలమైన మాధ్యమంగా ఉపయోగపడింది. కథ అయినా కవిత్వం అయినా చిత్రం అయినా కొత్త కోణంలో కనిపించాలనుకుంటాను’ అంటుంది శ్వేత.బోధన, పరిశోధన, కళలలో తనకు ఇష్టమైనది ఏమిటి?ఆమె మాటల్లోనే చె΄్పాలంటే... ‘అవేమీ దేనికవి ప్రత్యేకమైన ప్రపంచాలు కావు. ఉదాహరణకు నా బోధన నేను చేసే పరిశోధనపై, నా పరిశోధన నా కళపై ప్రభావితం చూపిస్తాయి. ఒకదానికొకటి ఉపకరిస్తాయి’శ్వేతారావు గార్గ్ గ్రాఫిక్ నవల ‘ది టేల్స్ ఫ్రమ్ క్యాంపస్: ఏ మిస్ గైడ్ టు కాలేజి’ క్యాంపస్ వాతావరణం కాస్తో కూస్తో పరిచయం లేని వారిని కూడా క్యాంపస్‌లోకి తీసుకువెళ్లి ప్రత్యక్ష అనుభవాన్ని సొంతం చేస్తుంది. లింగభేదం, వేధింపులు, వర్గ హక్కులు, కులవివక్ష... ఇలా ఎన్నో అంశాలపై స్టూడెంట్స్ ఆలోచనలు, అవగాహనను ఈ నవల ప్రతిబింబిస్తుంది. పదమూడు చాప్టర్లలో ప్రతి చాప్టర్ తరువాత వచ్చే ‘స్టాప్ అండ్ థింక్’ సెక్షన్ ఎన్నో విషయాలలో పునరాలోచనకు అవకాశం కల్పిస్తుంది. -
కర్రసాము.. మార్షల్ ఆర్ట్స్.. ఇప్పుడు 'హర్ ఘర్ దుర్గ'!
కోల్‌కతాలో అభయ... హైదరాబాద్‌లో దిశ... ఢిల్లీలో నిర్భయ. చెప్పుకుంటూ పోవడమేనా? వేదన నింపుకోవడమేనా? లేడి కొమ్ములు దిగబడిన పులి కళ్లల్లో భయం కూడా సాధ్యమే. శిక్షణ తీసుకుంటే రక్షణాయుధాన్ని వాడితే దుర్మార్గం ఆగుతుంది. దుష్టుడు మన చేత చిక్కి కటకటాల పాలవుతాడు.ఆపద వస్తే ఎవరు సహాయం చేస్తారా అని నిస్సహాయంగా చూడడం కాదు, తనను తాను రక్షించుకోవడానికి ‘ఆమె’ను సమాయత్తం చేయాలి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ పని చేస్తోంది. ‘హర్ ఘర్ దుర్గ’ (ప్రతి ఇంట్లో దుర్గ) అనే నినాదంతో మహిళలకు స్వీయరక్షణ ప్రచారం మొదలుపెట్టింది. అమ్మాయిలకు కరాటే, జూడోలలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఐటీఐలన్నింటిలోనూ అమ్మాయిలకు ఆత్మరక్షణ కోసం కరాటే, జూడో క్లాసులు నిర్వహించనుంది. వారంలో కనీసం రెండు గంటల సమయం శారీరక వ్యాయామం, ఆత్మరక్షణ విద్యలకు కేటాయిస్తున్నారు. ఇందుకోసం స్వచ్ఛంద సంఘాల సహకారం తీసుకోనున్నట్లు తెలియచేశాయి అధికార వర్గాలు. మనదగ్గర ఈ పని ఐదేళ్ల్ల కిందటే మొదలైంది. తెలంగాణ, నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన తగుళ్ల స్వర్ణయాదవ్ అనే యువతి కర్రసాము నేర్చుకుని, హైదరాబాద్‌లో అకాడమీ స్థాపించి బాలికలకు నేర్పిస్తోంది.కర్రసాము... మార్షల్ ఆర్ట్స్స్వర్ణ యాదవ్ ఫోక్ సింగర్. పాటలు పాడడానికి ఒంటరిగా వెళ్లాల్సి వచ్చేది. ్రపోగ్రామ్ పూర్తయిన తర్వాత ఇంటికి చేరేసరికి రాత్రి పది దాటుతుంది. తనను తాను రక్షించుకోవడానికి మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలనుకుందామె. మన దగ్గర కర్రసాము ఉందిగాని నేర్పించేవారు లేరు. తమిళనాడులో సిలంబం (కర్రసాము) ఆర్ట్ బాగా విస్తరించి ఉంది. తమిళనాడు వెళ్లి రెండేళ్ల కోర్సు చేశారు స్వర్ణ. తాను నేర్చుకుంటే సరిపోదు, వీలయినంత ఎక్కువ మంది అమ్మాయిలకు నేర్పించాలని నిర్ణయించుకుంది. హైదరాబాద్‌కి తిరిగి వచ్చిన తర్వాత 2019 నుంచి స్కూళ్లలో నేర్పించడం మొదలు పెట్టింది. ‘స్వర్ణ ఆర్ట్స్ అకాడమీ’ని 2022లో రిజిస్టర్ చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా గవర్నర్ బంగ్లాలో ప్రదర్శన ఇచ్చి ప్రశంసలు అందుకుంది. పది మందికి శిక్షణ ఇచ్చి పూర్తి స్థాయిలో శిక్షకులుగా తయారు చేసి వారి సహాయంతో యూసుఫ్‌గూడ, ఉప్పల్, పటాన్చెరు, ఎల్బీనగర్, మాదాపూర్, కూకట్‌పల్లిలో ఫ్రీ క్యాంపులు నిర్వహించింది. స్కూళ్లలో కూడా ఉచితంగా నేర్పించింది.. హైదరాబాద్ నగరంలో శిక్షణ తర్వాత తమ సర్వీస్‌ని తెలంగాణ జిల్లాలకు విస్తరించాలనుకుంటున్నట్లు చెబుతోందామె.అబ్బాయిలకు కూడా!‘‘కర్రసాముతోపాటు మనదేశీయ యుద్ధకళలన్నింటినీ మా అకాడెమీలో పరిచయం చేయాలనేది భవిష్యత్తు ఆలోచన. రాబోయే వేసవికి పంజాబ్ మార్షల్ ఆర్ట్ ‘గట్కా’ను ప్రవేశపెడుతున్నాం. స్కూళ్లలో అమ్మాయిలతోపాటు అబ్బాయిలకు కూడా నేర్పిస్తున్నాం. ఎందుకంటే ఈ జనరేషన్ అబ్బాయిల్లో దేహదారుఢ్యం తగినంతగా ఉండడం లేదు. స్మార్ట్ ఫోన్లలో మునిగిపోయి ఊబకాయులవుతున్నారు. అమ్మాయిలకు ఆత్మరక్షణ ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, అబ్బాయిల్లో ఫిట్నెస్ పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నాం’ అన్నారు స్వర్ణ యాదవ్. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Dr Anita Shah: ఆధ్యాత్మిక కళకూ.. ఒక చరిత్ర ఉంది!
ఆమెది హైదరాబాద్‌లో స్థిరపడిన గుజరాతీ కుటుంబం. ఆమె వృత్తీ, ప్రవృత్తీ రెండూ కళలను అధ్యయనం చేయడమే కావడం వల్ల భారతీయ చిత్రరీతుల మీద విస్తృతంగా పరిశోధన చేస్తున్నారు. మనదేశంలో విలసిల్లిన కళారూపాలు ఏయే దేశాల మ్యూజియాల్లో ఉన్నాయో తెలుసుకుని ప్రతి విషయాన్నీ గ్రంథస్తం చేస్తున్నారు. ఆమే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేసిన డాక్టర్ అనితా షా, చిత్రకళల పరిశోధకురాలు.ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ (ఐసీఓఎమ్)లో కీలక సభ్యురాలిగా ప్రపంచదేశాల్లో పర్యటిస్తూ మ్యూజియాలజీ విద్యార్థులకు గెస్ట్ ఫ్యాకల్టీగా బోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మనదేశంలో విస్తరించిన వైవిధ్యభరితమైన చిత్రకళారూపాల గురించిన సమగ్రమైన వివరాలతో ‘కలర్స్ ఆఫ్ డివోషన్’ పేరుతో ఆవిష్కరించారు. అమెరికా, ఇండియాల్లోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ చిత్రకళ మీద సదస్సులు నిర్వహిస్తున్న అనితా షా గతంలో ఆమె భర్త భరత్ షాతో కలిసి ‘త్రెడ్స్ ఆఫ్ డివోషన్’ పేరుతో రాజస్థాన్, గుజరాత్‌లోని కచ్‌లో అభివృద్ధి చెందిన ఎంబ్రాయిడరీలతో ప్రదర్శన నిర్వహించారు.రాస్తే కావ్యం... గీస్తే చిత్రం..‘‘చిత్రం అంటే సాహిత్యాన్ని కంటితో చూపించే ప్రక్రియ. నిరక్షరాస్యులకు ఒక గ్రంథసారాన్ని బొమ్మల్లో చూపించవచ్చు. చిత్రకారులు కాలానుగుణంగా మార్పులను జోడించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో దక్కనీ– హైదరాబారీ ఆర్టిస్టులు సంయుక్తంగా కృషి చేసి గోల్డెన్ కలంకారీ పెయింటింగ్స్‌కు రూపకల్పన చేశారు. ఇది పద్దెనిమిదవ శతాబ్దపు చివరి రోజుల్లో అభివృద్ధి చెందింది. కళాకారుల కళానైపుణ్యం అంతా కృష్ణుడు, గోపికల రూపాలను తీర్చిదిద్దడంలో కనిపిస్తుంది. నేను శ్రీవల్లభాచార్య వల్లభ సంప్రదాయ తత్వం పుష్టిమార్గం మీద ఎక్కువగా పని చేశాను.వల్లభాచార్య తత్వం శుద్ధ అద్వైతం, కృష్ణతత్వంతో ఉంటుంది. శైవం ప్రభావం కొన్ని చిత్రాల్లో కనిపిస్తుంది. ఇందులో తాత్విక చింతన, పురాణాల అవలోకనమే ప్రధానంగా సాగుతుంటుంది. సద్గురువుల ప్రవచనాలు, ప్రబోధాల వల్ల అనేక ఊహాచిత్రాలకు రూపం వచ్చింది. సామాన్యులకు ఆరోగ్యకరమైన, ఆచరణీయమైన దైనందిన జీవనశైలిని కూడా పౌరాణిక కథల ద్వారానే వివరించేవారు. తల్లి బిడ్డను లాలనగా నిద్రలేపడం, బిడ్డకు స్నానం చేయించి దుస్తులు ధరింపచేసి చక్కగా అలంకరించడం వంటివన్నీ కృష్ణుడు, యశోద పాత్రల ద్వారా బొమ్మల్లో రూపుదిద్దుకున్నాయి.చిత్రకళలో కృష్ణతత్వం..మన చిత్రకళ, శిల్ప కళ అన్నీ చరిత్ర, పురాణేతిహాసాల ఆధారంగానే అభివృద్ధి చెందాయి. సామాజిక మార్పులను ఇముడ్చుకుంటూ ముందుకు సాగుతుంటాయి. భాగవత పురాణాల ప్రభావం ఉత్తరాదిలో ఎక్కువ. కాబట్టి ఉత్తరాది చిత్రకళలు ఎక్కువగా కృష్ణతత్వాన్ని ప్రతిబింబిస్తుంటాయి. కృష్ణుడు ప్రతి ఇంట్లోనూ కుటుంబ సభ్యుడే. ప్రతి సంఘటనను కృష్ణుడితో అన్వయించుకుంటారు.ముస్లిం ఆర్టిస్టులు హిందూచిత్రాలు..నా తాజా రచన కలర్స్ ఆఫ్ డివోషన్ పుస్తకం వెనుక ఏడేళ్ల శ్రమ ఉంది. ఇది పాఠకుల సాంస్కృతిక, సామాజిక దృష్టి కోణాన్ని విస్తృతపరుస్తుందని చెప్పగలను. హిందూ పురాణాల ఆధారంగా చిత్రాలకు రూపకల్పన చేసిన వారిలో ముస్లిం చిత్రకారులున్నారు. ఆదిల్ షా స్వయంగా సరస్వతీ మాతను పూజించాడు. ఇలాంటి అనేక సామరస్య సహజీవన ఆధారాలు మనప్రాచీన చిత్రాల్లో దొరుకుతాయి. భారతీయ చిత్రకళలో సాంస్కృతికప్రాముఖ్యతను తెలియచేశాను.గతంలో ‘విజిటర్స్ టూ సౌత్ ఇండియన్ మ్యూజియమ్స్– మ్యూజియోలాజికల్ కాంటెక్ట్స్ అండ్ విజిటర్ స్టడీ’ పేరుతో పుస్తకం తెచ్చాను. చిత్రకళారీతులతోపాటు వాటిని చిత్రించిన వస్త్రనైపుణ్యాన్ని కూడా ప్రత్యేకంగా గుర్తించాలి. మన చిత్రకళారీతులన్నీ ఒకచోట గుదిగుచ్చి లేక΄ోవడం దురదృష్టకరం. ఒక్కొక్కటి ఒక్కోచోట ఉండడంతో ఒక సమగ్రమైన స్వరూపం రావడం లేదు. అందుకే మ్యూజియాల్లో ప్రదర్శనలో ఉన్న కళాఖండాల ఫొటోలు, వివరాలతో రచనలు చేస్తున్నాను. ఇదే నా పని’’ అని వివరించారు డా. అనితాషా. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
వన ఉత్పత్తులకు.. దమ్మక్క బ్రాండ్!
అడవుల జిల్లాగా పేరొందిన భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలుగా గిరిజన మహిళలు ఎదుగుతున్నారు. ఐదేళ్ల కిందట శిక్షణతో మొదలైన వారి ప్రయాణం నేడు ఈ కామర్స్ వాకిలి వరకు చేరుకుంది. వీరి విజయ గాథ...నైపుణ్య శిక్షణలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మహిళలు 2018లో హైదరాబాద్‌కు ఐటీడీఏ తరఫున వెళ్లారు. అక్కడ సబ్బులు, షాంపులు తయారు చేసే ఓ సంస్థలో మూడు నెలలు శిక్షణ తీసుకున్నారు. ఆ శిక్షణతోనే సరిపెట్టుకోకుండా అదే కంపెనీ లో మరో తొమ్మిది నెలల పాటు పనిచేసి తమ నైపుణ్యానికి మరిన్ని మెరుగులు అద్దుకున్నారు. ఇందులో పదిహేను మంది సభ్యులు కలిసి దమ్మక్క జాయింట్ లయబిలిటీ గ్రూప్‌గా ఏర్పడ్డారు. రూ. 25 లక్షలతో షాంపూ, సబ్బుల తయారీ పరిశ్రమ స్థాపించాలని నిర్ణయించుకున్నారు.అవరోధాలన్నింటినీ అధిగమిస్తూ..దమ్మక్క గ్రూప్ సభ్యుల ఉత్సాహం చూసి అప్పటి ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు బ్యాంకు అధికారులతో మాట్లాడి లోను ఇప్పించడంతో భద్రాచలంలో 2019 నవంబరులో షాంపూ తయారీ యూనిట్నుప్రారంభించారు. పనిలో చేయి తిరగడం అలవాటైన కొద్ది రోజులకే 2020 మార్చిలో కరోనా విపత్తు వచ్చి పడింది. లాక్డౌన్ లు, కరోనా భయాల వల్ల బయటకు వెళ్లి పని చేసేందుకు ఇంట్లో కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడం ఒక ఇబ్బందైతే, మరోవైపు తయారీ యూనిట్లో షాంపూ బాటిళ్లు పేరుకుపోయాయి. ఇంతలోనే ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు షాంపూ బాటిళ్లు కావాలంటూ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నుంచి ఆర్డర్ రావడంతో కొంత ఊతం లభించింది.’’ అంటూ దమ్మక్క గ్రూపు జాయింట్ సెక్రటరీ బేబీరాణి అనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.ఊపందుకున్న అమ్మకాలు..షాంపూ కొనుగోలుకు జీసీసీ నుంచి మార్కెట్ అందుబాటులో ఉండటంతో పాటు షాంపూ నాణ్యత విద్యార్థులకు నచ్చడంతో క్రమంగా దమ్మక్క యూనిట్ పనితీరు గాడిలో పడింది. 100 మిల్లీలీటర్ల షాంపూ బాటిళ్ల తయారీ 2021లో యాభైవేలు ఉండగా 2022 ముగిసే నాటికి లక్షకు చేరుకుంది. ఆ మరుసటి ఏడాది ఏకంగా రెండు లక్షల బాటిళ్ల షాంపూలు తయారు చేసి విక్రయించారు. షాంపూల తయారీలో వచ్చిన అనుభవంతో ఈ ఏడాది మొదట్లో గ్లిసరిన్ ప్రీమియం సబ్బుల తయారీనిప్రారంభించి జీసీసీ స్టోర్లలో ప్రయోగాత్మకంగా అమ్మకాలుప్రారంభించగా... తొలి దఫాలో ఐదు వేల సబ్బులు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత అమ్మకాలు ఊపందుకున్నాయి.బ్యాంక్ రుణం కూడా తీర్చేశారు!యూనిట్ ఆరంభమైన తర్వాత ఏడాదిలో కేవలం మూడు నెలలే గ్రూపు సభ్యులకు పని దొరికేది. షాంపూ, సబ్బులకు డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది వరుసగా ఎనిమిది నెలలు అంతా పని చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో బ్యాంకు రుణం కూడా తీర్చేశారు. ప్రతి సభ్యురాలికి ఖర్చులు పోను కనీసం రూ.10 వేల వరకు ఆదాయం వచ్చినట్టు గ్రూప్ ట్రెజరర్ పూనెం విజయలక్ష్మి తెలిపారు.ఈ కామర్స్ దిశగా..రాబోయే రోజుల్లో ఈ కామర్స్ వేదికగా ఈ ఉత్పత్తుల అమ్మకానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు గ్రూపు అధ్యక్షురాలు తాటి రాజసులోచన తెలిపారు. ఈ మేరకు బ్రాండ్‌నేమ్ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. అది విజయవంతం అయితే మరెందరో కొత్త వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – జక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సాక్షి, భద్రాచలంఇవి చదవండి: డ్రోన్ దీదీ.. పల్లెటూరి పైలట్! -
డ్రోన్ దీదీ.. పల్లెటూరి పైలట్!
మహిళా సాధికారతకు ఉత్తమ సాధనాలలో ఒకటిగా నిలిచింది డ్రోన్ శిక్షణ. ఢిల్లీకి ఉత్తరాన ఉన్న సింఘోలా, నైరుతి జిల్లాల్లోని 200 మంది మహిళలు శిక్షణ తీసుకొని డ్రోన్ లైసెన్స్ పొందేందుకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా గ్రామీణ మహిళలకు సాధికారిత కల్పించే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ‘నమో డ్రోన్ దీదీ’ పథకాన్ని కిందటేడాది చేపట్టింది. ఇందులో భాగంగా శిక్షణ పొందిన మహిళలు దేశ రాజధానిలో ఇటీవల కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ పొందిన డ్రోన్ దీదీలు పైలెట్ లైసెన్స్ సర్టిఫికెట్స్ పొంది, స్వయం ఉపాధి అవకాశాలను పొందుతారు. శిక్షణ పొందిన వారికి డ్రోన్లను ప్రభుత్వమే అందజేస్తుంది.స్వయం ఉపాధికి..డ్రోన్లను స్వయంగా ఉపయోగించడానికి, అద్దెకు ఇవ్వడానికి అనుమతిస్తారు. సర్వేలు, ఈవెంట్ షూట్లు, ఫొటోగ్రఫీ, వ్యవసాయంలో సీడింగ్, పురుగుమందులు చల్లడం వంటి వాటి కోసం డ్రోన్లను ఉపయోగించడమే లక్ష్యంగా ఉద్యోగావకాశాలు పొందుతారు.ఆర్థికాభివృద్ధికి..మూడేళ్ల కాలంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు 15 వేల డ్రోన్లను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వ్యవసాయంతో పాటు అదనంగా మహిళలు డ్రోన్ సంబంధిత వ్యాపారాలను చేసుకునే అనుమతి లభిస్తుంది. దీనివల్ల ఆర్థిక వృద్ధి, అభివృద్ధికి మరింతగా దోహదపడుతుంది. ఎరువులను చేతితో పిచికారీ చేసే సాంప్రదాయ పద్ధతులను డ్రోన్లతో భర్తీ చేయడం ద్వారా పురుగు మందుల వల్ల కలిగే ప్రమాదం తగ్గుతుంది. పంట దిగుబడి పెరుగుతుంది.అంతేకాదు, డ్రోన్ల వాడకంలో ఖర్చులు తగ్గి, రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. టెక్నాలజీలో ఆధునాతన శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి కృషి జరపడం అంటే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను మరింత శక్తిమంతులుగా తయారు చేయడమే.ఇవి చదవండి: Health: ఆ ఆలోచన నుంచి.. బయటపడేదెలా? -
Aishwarya Sushmita: వనితా విశేషణం..
యాక్ట్రెస్, సింగర్, మోడల్, బెల్లీ డాన్సర్, నేషనల్ లెవెల్ బాడ్మింటన్ ప్లేయర్.. ఈ విశేషణాలన్నింటి కలబోత ఐశ్వర్యా సుష్మితా! ‘బ్యాడ్ కాప్’ సిరీస్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఐశ్వర్యా సుష్మితా పుట్టింది బిహార్‌లోని దర్భంగాలో. పెరిగింది ఢిల్లీలో. నాన్న.. నారాయణ్ వర్మ, ఎస్బీఐ ఉద్యోగి. అమ్మ.. నీతా వర్మ, గృహిణి. ఐశ్వర్యా.. ఫిలాసఫీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్.ఐశ్వర్యా ఆసక్తిని గమనించి, తల్లిదండ్రులూ ఆమెను మోడలింగ్ వైపే ప్రోత్సహించారు. దాంతో ఢిల్లీ బేస్డ్ మోడలింగ్ ఏజెన్సీలో జాయిన్ అయింది ఐశ్వర్యా. అక్కడే ప్రింట్ అడ్వర్టయిజ్మెంట్స్కి మోడల్‌గా పనిచేసింది.స్కూల్ డేస్‌లో ఆమె లక్ష్యం ఐఏఎస్ కావాలని. అందుకే కాలేజీకొచ్చాక ఫిలాసఫీ సబ్జెక్ట్‌ని ఎంచుకుంది. ఆమెకు స్పోర్ట్స్ అంటే కూడా చాలా ఇష్టం. బాడ్మింటన్ ప్లేయర్‌గా జాతీయ స్థాయిలో రాణించింది. అంతేకాదు అందాల పోటీల్లోనూ పాల్గొని, 2016, ఎన్డీటీవీ గుడ్ టైమ్ కింగ్‌ఫిషర్ సూపర్మోడల్స్కీ ఎంపికైంది. ఇవన్నీ ఆమె లక్ష్యాన్ని మార్చాయి.ఆ టైమ్‌లోనే ముంబై మోడలింగ్ ఏజెన్సీల నుంచీ ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి. ముంబై వెళ్లింది. మనీశ్ మల్హోత్రా, అనితా డోంగ్రే, రేణు టాండన్, మానవ్ గంగ్వానీ, రాహుల్ ఖన్నా వంటి సూపర్ డిజైనర్స్‌కి మోడల్‌గా పని చేసింది. టీవీ కమర్షియల్స్‌లోనూ నటించింది. ఆ ఫేమే ఆమెకు ‘స్పెషల్ ఆప్స్ 1.5’ అనే వెబ్ సిరీస్‌లో అవకాశాన్నిచ్చింది.ఆ నటన ఆమెను తాజాగా ‘బ్యాడ్ కాప్’ వెబ్ సిరీస్‌లో ప్రాధాన్యమున్న పాత్రకు ప్రమోట్ చేసింది. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది.ఐశ్వర్యాకు సంబంధించి ఇంకో విశేషం, విశేషణం ఏంటంటే ఆమెకు స్పోర్ట్స్ బైక్ రైడింగ్ అంటే ప్రాణం. ఏ కొంచెం వీలు దొరికినా బైక్ రైడింగ్ చేస్తుంది. ఆమె ఫిట్నెస్ ఫ్రీక్ కూడా! రోజూ యోగా చేస్తుంది."నా పేరు విని అందరూ ఆశ్చర్యపోతారు సంబంధం లేకుండా రెండు పేర్లేంటని! ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్లు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ క్రౌన్స్ గెలుచుకున్న ఏడాదే పుట్టాను. మా పేరెంట్స్‌కి వాళ్లిద్దరంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానం కొద్దే నాకు ఆ ఇద్దరి పేర్లను కలుపుతూ ఐశ్వర్యా సుష్మితా అని పెట్టారు. అదన్నమాట నా పేరు వెనుకున్న స్టోరీ!" – ఐశ్వర్యా సుష్మితా -
Annapurni Subramaniam: నక్షత్ర విజ్ఞాన సిరి..
అంతరిక్షం అంటేనే అనేకానేక అద్భుతాలకు నెలవు. అన్నపూరణిలో అంతరిక్షంపై ఆసక్తి చిన్న వయసులోనే మొదలైంది. ఆరు బయట రాత్రి పూట ఆకాశంలో చుక్కలు చూస్తున్నప్పుడు ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అనే ఆలోచన మొదలైంది. ఆ ఆలోచన తనను కుదురుగా ఉండనివ్వలేదు. నక్షత్రమండలాల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునేలా చేసింది. నక్షత్రాలపై ఆసక్తి తనను విషయ జ్ఞానానికి మాత్రమే పరిమితం చేయలేదు. సైంటిస్ట్‌ను చేసింది.‘విజ్ఞాన శ్రీ’ అవార్డ్ అందుకున్న ఏకైక మహిళా శాస్త్రవేత్తగా ఉన్నతస్థానంలో నిలిపింది. అన్నపూరణి సుబ్రమణ్యం ప్రస్తుతం బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (ఐఐఏ) డైరెక్టర్‌గా పనిచేస్తోంది. ఈ సంస్థ భవిష్యత్ అంతరిక్ష యాత్రల కోసం అత్యాధునిక టెలిస్కోప్‌లు, పరికరాలను తయారు చేస్తుంటుంది. ఆస్ట్రోశాట్, ఆదిత్య–ఎల్1ల ఇన్స్ట్రుమెంటేషన్లో అన్నపూరణి పాలుపంచుకుంది.కేరళలోని పాలక్కాడ్ విక్టోరియా కాలేజీలో చదువుకున్న అన్నపూరణి ‘స్టడీస్ ఆఫ్ స్టార్ క్లస్టర్స్ అండ్ స్టెల్లార్ ఎవల్యూషన్’ అంశంపై హీహెచ్డీ చేసింది. పీహెచ్డీ చేస్తున్న రోజులలో కవలూర్ అబ్జర్వేటరీ (తమిళనాడు) ఆమె ప్రపంచంగా మారింది. ఏ పరికరాన్ని ఎలా వినియోగించుకోవాలో లోతుగా తెలుసుకుంది. నక్షత్ర సమూహాలకు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేసింది.‘పరిశోధన’కు కామా నే తప్ప ఫుల్స్టాప్ ఉండదు. అన్నపూరణి ఇప్పటికీ నక్షత్రమండలాలకు సంబంధించి ఏదో ఒక అంశంపై పరిశోధన చేస్తూనే ఉంటుంది. అది ఆమె హాబీ. అది ఆమె వృత్తి. ఆమె జీవనాసక్తి... జీవిక కూడా! ప్రస్తుత కాలంలో ‘స్పేస్–బేస్డ్ అస్ట్రోనమీపై యువతరం అమితమైన ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఇది శుభసూచకం. స్పేస్ సైన్స్ ఎంతోమందికి అత్యంత ఆసక్తిగా మారింది. ఈ ఆసక్తే భవిష్యత్ పరిశోధనలకు పునాదిగా మారుతుంది’ అంటుంది అన్నపూరణి సుబ్రమణ్యమ్.‘పరిశోధన’కు కామానే తప్ప ఫుల్స్టాప్ ఉండదు. అన్నపూరణి ఇప్పటికీ నక్షత్రమండలాలకు సంబంధించి ఏదో ఒక అంశంపై పరిశోధన చేస్తూనే ఉంది. అది ఆమె హాబీ. అది ఆమె వృత్తి. ఆమె జీవనాసక్తి... జీవిక కూడా! -
Akanksha Kumari: తాను.. రొటీన్ ఐటీ కాదు.. మైనింగ్ మేటి!
‘ద్వారాలు మూసే ఉన్నాయి’ అని వెనక్కి తిరిగేవారు కొందరు. ఆ ద్వారాలను తెరిచి ముందుకు వెళ్లేవారు కొందరు. ఆకాంక్ష కుమారి రెండో కోవకు చెందిన మహిళ. తొలి భారతీయ మహిళా మైనింగ్ ఇంజినీర్‌గా చరిత్ర సృష్టించింది. ఉద్యోగంలో చేరిన రోజు ఎంత ఉత్సాహం, వృత్తి నిబద్ధతతో ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ‘నో రిగ్రెట్స్.. ఫీల్ గ్రేట్’ అంటుంది. మైనింగ్ ఫీల్డ్‌లోకి రావాలనుకునే మహిళలకు ధైర్యాన్ని ఇస్తోంది.ఝార్ఖండ్‌లోని మైనింగ్ప్రాంతంలో పెరిగిన ఆకాంక్ష కుమారి బొగ్గు గనుల్లో ‘పై కప్పు కూలిపోవడం’ అనే మాటను ఎన్నోసార్లు విని ఉన్నది. మైనింగ్ ఇంజినీర్‌గా ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టిన తరువాత ‘పై కప్పు కూలిపోవడం’ అనే మాటను వినడం కాదు ప్రత్యక్షంగా చూసింది. ‘ఇది పురుషులు మాత్రమే చేసే కఠినమైన ఉద్యోగం అనుకునే వృత్తిని ఎంచుకోవడానికి కారణం ఏమిటి?’ అనే ప్రశ్నకు ఆమె స్పందన ఇది...‘బొగ్గు తవ్వకాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో పుట్టి పెరిగాను. ఇక్కడి ప్రజలు ఏ మైనింగ్ కంపెనీలో పని చేయకపోయినా వాళ్లకు మైనింగ్ గురించి చాలా విషయాలు తెలుసు. స్కూల్ హాస్టల్లో నా స్నేహితులు పై కప్పు కూలిపోవడం గురించి మాట్లాడడం నేను ఎన్నోసార్లు విన్నాను. అదెలా? ఎందుకు?’ అనేది నాకు ఆశ్చర్యంగా అనిపించేది. మైనింగ్‌కు సంబంధించి రకరకాల విషయాలు వినడం వల్ల నాకు తెలియకుండానే ఆ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే కలకు బీజం పడింది’ గతాన్ని గుర్తు చేసుకుంది ఆకాంక్ష.‘పదవ తరగతి పూర్తయిన తరువాత ఏం చేయాలి?’ అనుకున్నప్పుడు ఆటల గురించి ఆలోచించింది. తాను జాతీయస్థాయి అథ్లెట్లిక్స్‌లో కూడా పాల్గొంది. ఆటలపై దృష్టి పెట్టాలా, చదువు కొనసాగించాలా అనే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు తాను ఉన్న పరిస్థితిల్లో ఉద్యోగం అనివార్యం కావడంతో చదువుకే ్రపాధాన్యత ఇచ్చింది. ఇంటర్మీడియెట్ పూర్తి అయిన తరువాత ‘ఐటీ రంగంలో ఉద్యోగంపై దృష్టి పెట్టు’ అని కొందరు తనకు సలహా ఇచ్చారు. అయితే ‘ఐటీ’ అనేది ఆకాంక్షకు ఆసక్తికరమైన సబ్జెక్ట్ కాదు. ఆ సమయం లోనే తన మనసులో దాగిన కల బయటికి వచ్చింది. ‘కోల్ మైనింగ్ ఫీల్డ్‌లో ఉద్యోగం చేయాలి’ అని నిర్ణయించుకుంది. ఉపాధ్యాయుడైన తండ్రి, అంగన్వాడీ వర్కర్ అయిన తల్లిని ఒప్పించడం కష్టం కాలేదు.‘మా అమ్మాయి మైనింగ్ జాబ్ చేయాలనుకుంటుంది’ అని ఆకాంక్ష తండ్రి మైనింగ్ కంపెనీలో పనిచేసే తన స్నేహితుడిని సలహా అడిగితే...‘చాలా కష్టం. మధ్యతరగతికి చెందిన ఆడపిల్లలు ఈ రంగంలో పనిచేయలేరు. ఆ పనిభారం తట్టుకోవడం ఆడపిల్లలకు చాలా కష్టం’ అన్నాడు. స్నేహితుడు చెప్పిన విషయాలను కూతురితో పంచుకున్నాడు. అయినా సరే, ఆకాంక్ష వెనక్కి తగ్గలేదు. ఇంజినీరింగ్ కోర్స్ అడ్మిషన్ సమయంలో కౌన్సెలర్ ఆమెకు మైనింగ్ ఇంజినీరింగ్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. వాదోపవాదాల తరువాత ఆకాంక్ష కల నెరవేరింది. ఝార్ఖండ్, ధన్‌బాద్‌లోని బిర్సా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సింద్రీలో బీటెక్ పాసైంది. వొకేషనల్ ట్రైనింగ్‌లో భాగంగా అండర్‌గ్రౌండ్ మైన్‌లో కూడా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.‘ఇక్కడికి నిన్ను ఎవరు పంపించారు? ఎలా పంపిస్తారు? ఇక్కడ మహిళలకు సౌకర్యాలు, సదుపాయాలు లేవన్న విషయం మీ డిపార్ట్మెంట్ హెడ్‌కు తెలియదా?’ అని విసుక్కున్నాడు జనరల్ మేనేజర్. ఆ తరువాత మాత్రం గెస్ట్‌హౌజ్‌లో ఒక రూమ్ కేటాయించారు. అమ్మ, మేనత్తలతో కలిసి ఆ గదిలో ఉండేది ఆకాంక్ష. చదువు పూర్తయిన తరువాత హిందుస్థాన్ జింక్‌లో ఆకాంక్షకు ఉద్యోగం వచ్చింది. మూడు సంవత్సరాలు గనులలో పనిచేసింది. ఆ తరువాత సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్‌కు చెందిన బొగ్గు గనుల్లో పనిచేసింది. కనీస సౌకర్యాలు లేకపోయినప్పటికీ భూగర్భ గనుల్లో గరిష్ఠంగా ఆరు గంటలు పనిచేసింది.2021లో కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)లో ఆకాంక్ష చేరిన తరువాత ఇప్పటి వరకు మరో ముగ్గురు మహిళలు మాత్రమే పబ్లిక్ విభాగంలో చేరారు. అయినా సరే ఆకాంక్ష కుమారిలో ఆశాభావం తొలగిపోలేదు. మైనింగ్ ఫీల్డ్‌లో రావాలనుకుంటున్నవారికి సలహాలు ఇవ్వడం, దారి చూపడం మానడం లేదు. ‘సౌకర్యాలు లేకపోవచ్చు. శ్రమతో కూడిన ఉద్యోగం కావచ్చు. అయినా సరే చేస్తాను అనే పట్టుదల మీలో ఉంటే మైనింగ్ ఫీల్డ్‌లోకి తప్పకుండా రావచ్చు’ అంటుంది ఆకాంక్ష కుమారి. తొలి అడుగు వేసి మాత్రమే ఊరుకోలేదు. మరిన్ని అడుగుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూనే తన వంతు ప్రయత్నం చేస్తోంది ఆకాంక్ష.ఇవి చదవండి: ఈ ప్రాణం ఖరీదెంత? -
Paetongtarn Shinawatra: నా నవ్వులు పిల్లలవి!
బిలియనీర్ కూతురు అయిన పేటోంగ్ టార్న్ పదిహేడేళ్ల వయసులోనే పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 37 ఏళ్ల వయసులోనే థాయ్‌లాండ్ నూతన ప్రధానిగా ఎంపికై చరిత్ర సృష్టించింది. తన ఇద్దరు పిల్లల నవ్వుల్లోంచి బలం తెచ్చుకొని రాజకీయ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ విజయపథంలో పయనిస్తోంది...థాయ్‌లాండ్ మాజీ ప్రధాని తక్సిన్ షినవత్ర చిన్న కుమార్తె పేటోంగ్ టార్న్. తక్సిన్ మీద అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన దేశం విడిచి విదేశాల్లో ఆశ్రయం పొందుతున్నాడు. దాంతో తండ్రి స్థాపించిన ‘ప్యూ థాయ్’ పార్టీకి పేటోంగ్ టార్న్ పెద్ద దిక్కుగా మారింది. బ్యాంకాక్‌లో పుట్టి పెరిగింది పేటోంగ్ టార్న్. పొలిటికల్ సైన్స్, ఆంత్రోపాలజీ, సోషియాలజీలో పట్టా పుచ్చుకున్న పేటోంగ్ టార్న్ ఇంగ్లాండ్‌లో ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసింది. చదువులో రాణించిన పేటోంగ్ టార్న్ ఆ తరువాత వ్యాపారరంగంలో అడుగుపెట్టింది. 21 కంపెనీలతో తిరుగులేని ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకుంది.‘నేను ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాన్న రాజకీయాల్లోకి వచ్చారు’ అని చెబుతుంటుంది పేటోంగ్ టార్న్. పార్టీ నిర్వహణ, ఆ తరువాత ప్రధాన మంత్రిగా పనిచేసిన తండ్రి తక్సిన్ షినవత్రకు పిల్లలతో మాట్లాడే సమయం అతి తక్కువగా ఉండేది.‘నాకు నాన్న అంటే చాలా ఇష్టం. అయితే నాకంటూ సొంత వ్యక్తిత్వం ఉంది’ అంటున్న పేటోంగ్ టార్న్కు రాజకీయాల్లో చురుగ్గా ఉండడానికి కుటుంబ బలం అనేది ఎంత ముఖ్యమో తెలియనిది కాదు. రాజకీయ ప్రపంచం నుంచి ఇంటికి వచ్చిన తరువాత ఇద్దరు పిల్లలే తన ప్రపంచం. పేటోంగ్ టార్న్ ముద్దు పేరు ఉంగ్–ఇంగ్. గ్రామీణ ప్రజలు పేటోంగ్ టార్న్ను ప్రేమగా ఉంగ్–ఇంగ్ అని పిలుచుకునేవారు. కమర్షియల్ పైలట్ పిటాక సూక్సావత్ను పేటోంగ్ వివాహం చేసుకుంది. వీరిది అన్యోన్య దాంపత్యంగా చెబుతుంటారు. భార్యకు ఉన్న సహనాన్ని, నిర్ణయాలు తీసుకోవడంలో ప్రదర్శించే తెలివితేటలను పిటాక ప్రశంసిస్తుంటాడు.‘రాజకీయ నాయకురాలిగా మీకు ఎన్నో చికాకులు ఉంటాయి. అయినా సరే, ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు!’ అని అడిగితే ఆమె సమాధానం నవ్వు. ‘ఈ బలం నాకు నా పిల్లలు ఇచ్చారు’ అంటుంది ఆ నవ్వు మరింత పెంచుతూ!‘సోషల్లీ–లిబరల్ క్యాపిటలిస్ట్’గా తనను తాను అభివర్ణించుకునే పేటోంగ్ ముందు రాజ్యాంగాన్ని పునర్లిఖించడంతో సహా ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన కుటుంబ బలం ఉండనే ఉంది. -
తెలుగింటి.. వెలుగులు! ఇంతకూ ఎవరా అమ్మాయిలు..?
అమ్మానాన్నలు వెంట లేకుండానే... టీచర్లు తోడు లేకుండానే ఈ అమ్మాయిలు ధైర్యంగా దేశం దాటి చైనా వెళ్లారు. శాస్త్ర సాంకేతిక సదస్సులో 38 దేశాల నుంచి హాజరైన బృందాలలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. తెలుగు వారి తెలివితేటలను నిరూపించుకున్నారు. అంతర్జాతీయ ప్లాట్‌ఫారంపై అదరగొట్టారు. భావి శాస్త్రవేత్తలుగా భళా అనిపించుకున్నారు. ఎంచక్కా తిరిగి వచ్చారు. తమ అనుభవాలను సాక్షితో సంతోషంగా పంచుకున్నారు.ఇంతకూ ఎవరా అమ్మాయిలు..?ఆంధ్రప్రదేశ్, కాకినాడకు చెందిన సాయిశ్రీ శ్రుతి చిట్టూరి, లక్ష్మీ ఆశ్రిత నామ, సంజన పల్లా, వైష్ణవి వాకచర్లలకు అంతర్జాతీయ వేదికపై భారతదేశం తరఫునప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. చైనీస్ అసోషియేషన్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, చైనా ఎడ్యుకేషన్ క్యాంప్ రెగ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన యూత్ సైన్స్ టెక్నాలజీ వర్క్‌షాపులో ఈ స్టూడెంట్స్ పాల్గొన్నారు. సదస్సులో పాల్గొని ఇటీవలే తిరిగి వచ్చారు.ఆలోచనలను పంచుకున్నాం..దక్షిణాఫ్రికా, నేపాల్, ఆస్ట్రేలియా, మంగోలియా తదితర దేశాలæవిద్యార్థినుల పరిశోధన అంశాలపై ఆలోచనలు పంచుకోవడానికి మాకు మంచి అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఒకే వయస్సు వాళ్లం ఒక చోట చేరి ఎంపిక చేసుకున్న అంశాలపై విశ్లేషించుకోవడానికి ఈ సదస్సు ఉపకరించింది.– వైష్ణవి. ఎంపీసీ విద్యార్థిని, కాకినాడపురాతన జీవశాస్త్రంపై పరిశోధన..ఈ వర్క్‌షాపు ద్వారా వివిధప్రాంతాల విశిష్టత, ఆయాప్రాంతాల్లో జీవరాశుల స్వభావం, స్థితిగతులపైప్రాథమికంగా కొంత అవగాహన ఏర్పరుచుకుకో గలిగాం. భవిష్యత్తులో శాస్త్రవేత్తలం కావాలనే మా సంకల్పానికి ఈ వర్క్‌షాపు కచ్చితంగా ఉపయోగమే.– సంజన, బైపీసీ విద్యార్థిని, కాకినాడఎనిమిదో ఏడు..చైనా ఏటా ప్రపంచ స్థాయిలో 2017 నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ వర్క్‌షాపు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలు, వివిధ భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆలోచనలను పంచుకోవాలి. అలా భారతదేశం తరఫునప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారీ అమ్మాయిలు. భావి శాస్త్రవేత్తలకు దిక్సూచి: విశ్వం ఆవిర్భావం నుంచి నేటివరకూ ప్రపంచంలో చోటు చేసుకున్న మార్పులపై నిరంతరం పరిశోధనలు కొనసాగడం ఈ వర్క్‌షాపు లక్ష్యం. ఈ వర్క్‌షాపు లో ఎంపీసీ స్టూడెంట్స్ (శృతి, వైష్ణవి) ‘చేజింగ్ ద సన్’ అంశాన్ని, బైపీసీ స్టూడెంట్స్ (లక్ష్మి ఆశ్రిత, సంజన) ఫాజిల్స్ ను ఎంపిక చేసుకున్నారు. వివిధ దేశాల నుంచి ఎంపికైన వారితో తమ అభి్రపాయాలను పంచుకుని విజయ వంతంగా తిరిగి వచ్చారు. – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, కాకినాడ. ఫొటోలు: తలాటం సత్యనారాయణ -
పోస్టల్ స్టాంపులు.. యుద్ధం ముద్రలు!
మహిళలు ఇల్లు విడిచి బయట అడుగు పెడితే వింతగా చూసే కాలంలో సాహసమే వెన్నెముకగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు ఎంతోమంది మహిళలు. వారి త్యాగాల వెలుగు చరిత్రకే పరిమితమైనది కాదు, వర్తమానంలోనూ స్ఫూర్తిని ఇస్తుంటుంది. ఎంతోమంది మహిళా స్వాతంత్య్ర సమరయో«ధుల పోస్టల్ స్టాంప్స్ విడుదల అయ్యాయి. ఈ చిన్న స్టాంప్‌లు వారి త్యాగాలు, పోరాట పటిమను ప్రతిఫలిస్తాయి. పోస్టల్ స్టాంప్స్‌పై మెరిసిన కొందరు మహిళా స్వాతంత్య్ర సమరయోధుల గురించి...రుక్మిణీ లక్ష్మీపతిఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని మధురైలో పుట్టింది రుక్మిణీ. గాంధీజీ ‘హరిజన సంక్షేమ ని«ధి’ కోసం తన బంగారు నగలన్నీ విరాళంగా ఇచ్చేసింది. సహాయ నిరాకరణోద్యమం, విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో చురుగ్గా పాల్గొంది. ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించింది. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా అరెస్టయి జైలు శిక్ష అనుభవించిన తొలి మహిళగా చరిత్రలో నిలిచింది.సుభద్రా జోషిగాంధీజీ ఉపన్యాసాలతో ప్రభావితం అయిన సుభద్రా జోషి విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంది. ‘హమారా సంగ్రామ్’ పత్రికకు ఎడిటర్‌గా పనిచేసింది. సుభత్రను అరెస్ట్ చేసి లాహోర్ సెంట్రల్ జైల్‌కు తరలించారు. విడుదలయ్యాక మళ్లీ ఉద్యమంలో భాగం అయింది. సుభద్ర అంకితభావాన్ని నె్రçహూ ప్రశంసించారు.రాణి మా గైడిన్లియుబ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మొదలైన ‘హెరాక’ ఉద్యమంలో పదమూడు సంవత్సరాల వయసులోనే పాల్గొంది రాణి మా. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఆదివాసి మహిళగా చరిత్రకెక్కింది. ‘హెరాక’ ఉద్యమంతో పాటు ఎదుగుతూ వచ్చిన రాణి మా ప్రముఖ రాజకీయ నాయకురాలిగా, ఆధ్యాత్మిక గురువుగా ప్రఖ్యాతి పొందింది.బేగం హజ్రత్ మహల్తొలి తరం మహిళా స్వాతంత్య్ర సమరయోధురాలు బేగం హజ్రత్ మహల్. బేగం హజ్రత్ ఇతర సంస్థానాధీశులతో కలిసి బ్రిటిష్ వారితో యుద్ధం చేసింది. లక్నో సమీపంలో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వారిని ఓడించింది. ఆ తరువాత కాలంలో మాత్రం ఓటమికి గురైంది. బ్రిటిష్ వారికి చిక్కకుండా అడవుల్లో తలదాచుకొని పోరాడేది.కమలానెహ్రూజవహర్లాల్ నెహ్రు సతీమణి కమలా నెహ్రూ మహిళా సాధికారత కోసం గళం విప్పిన యోధురాలు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా అరెస్టై జైలుకు వెళ్లింది. ‘దేశ సేవిక’ సంఘాలను ఏర్పాటు చేసి ఎంతోమంది మహిళలు స్వాతంత్య్ర ఉద్యమంలో భాగం అయ్యేలా చేసింది.సుభద్రాకుమారి చౌహాన్సుభద్రాకుమారి చౌహాన్ కవయిత్రి, స్వాతంత్య్ర సమరయోధురాలు. సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరిన తరువాత నాగపూర్ నుంచి అరెస్ట్ అయిన మొట్టమొదటి మహిళా సత్యాగ్రహిగా చరిత్రలో నిలిచింది. మహిళలపై వివక్షతకు వ్యతిరేకంగా పోరాడింది. స్వాతత్య్ర పోరాటంలో భాగంగా ఎన్నో త్యాగాలు చేసింది.అరుణా అసఫ్ అలిభర్త అసఫ్ అలీతో పాటు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొంది అరుణ. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయింది. కాంగ్రెస్‌పార్టీ క్విట్ ఇండియా తీర్మానం చేసిన తరువాత బ్రిటిష్ వారు విరుచుకుపడ్డారు. ప్రముఖ నాయకులను అరెస్ట్ చేశారు. ఆ క్లిష్ట సమయంలో అరుణా అసఫ్ అలి కార్యకర్తలకు అండగా ఉంది. బొంబాయి గొవాలియా ట్యాంక్ మైదానంలో కాంగ్రెస్ జెండాను ఎగరేసి క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకునేలా చేసింది.దుర్గాబాయి దేశ్ముఖ్దుర్గాబాయి దేశ్‌ముఖ్ సాహసవంతురాలైన సామాజిక కార్యకర్త, చిన్నతనం నుంచే మహిళల హక్కుల కోసం పోరాడింది. మహాత్మాగాంధీ నుంచి స్ఫూర్తి పొంది స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొంది. గాంధీజీ ప్రభావంతో దుర్గాబాయి మాత్రమే కాదు ఆమె కుటుంబం మొత్తం అన్ని రకాల పాశ్చాత్య దుస్తులను విడిచిపెట్టి, ఖాదీని మాత్రమే ధరించేవారు. మద్రాస్‌లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించింది.రాజ్‌కుమారీ అమృత్ కౌర్రాజ్కుమారీ అమృత్ కౌర్ సామాజిక కార్యకర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు. గాంధీజీ కార్యదర్శిగా పని చేసిన ఆమె దండి మార్చ్‌లాంటి ఎన్నో జాతీయ ఉద్యమాలలో చురుకుగా పాల్గొంది. క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాజ్‌కుమారి ఇరవై నెలల పాటు జైల్లో గడపాల్సి వచ్చింది. రాచరిక కుటుంబంలో పుట్టినప్పటికీ మహాత్ముడి ఆశ్రమంలో సాధారణ జీవితాన్ని గడిపింది. -
అరుదైన ఆహ్వానం: 12 ఏళ్లు.. 15 లైబ్రరీలు..
ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం అందుకున్నఇరవై మందిలో విద్యార్థులు ఆరుగురు. వారిలో అమ్మాయి ఒకే ఒక్కరు. ఆ సరస్వతి పుత్రిక పేరు ఆకర్షణ. లైబ్రరీలు స్థాపిస్తూ సాహిత్యాన్ని సామాన్యులకు దగ్గర చేస్తున్న ఆమె అక్షరసేవకు జాతీయ స్థాయిలో అందిన గుర్తింపు ఇది. ‘‘హైదరాబాద్ హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్‌మాస్టర్ నుంచి 12వ తేదీన నాన్నకు ఫోన్ వచ్చింది. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా 15వ తేదీన ఢిల్లీలో జరిగే వేడుకలకు హాజరుకావలసిందిగా మీ అమ్మాయి ఆకర్షణకు ఆహ్వానం వచ్చిందని చెబుతూ అభినందనలు తెలియచేశారు’’ అంటూ తాను లైబ్రరీ వ్యవస్థాపకురాలిగా మారిన వివరాలను సాక్షి ఫ్యామిలీతో పంచుకున్నారు ఆకర్షణ సతీష్.కోవిడ్ వచ్చినప్పుడు..‘‘హైదరాబాద్‌లో స్థిరపడిన తమిళ కుటుంబం మాది. నాన్న సతీశ్ క్యాన్సర్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీ ఉద్యోగి. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను. పుస్తక పఠనం నా హాబీ కావడంతో వెయ్యికి పైగా పుస్తకాలతో ఇంట్లోనే నాకు సొంత లైబ్రరీ ఉంది. ఇతరుల కోసం లైబ్రరీ స్థాపించాలనే ఆలోచన కోవిడ్ సమయంలో వచ్చింది.తొలి లైబ్రరీ క్యాన్సర్ హాస్పిటల్లో..నాన్న ఉద్యోగరీత్యా క్యాన్సర్ హాస్పిటళ్లకు టచ్‌లో ఉంటారు. కోవిడ్ సమయంలో ఎమ్ఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ వాళ్లు ‘కోవిడ్ కారణంగా వంటవాళ్లు డ్యూటీకి రావడం లేదు. పేషెంట్లకు ఆహారం అందించడానికి ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేసి పెట్టవలసింది’గా కోరడంతో నాన్న వాళ్ల కోసం రోజూ భోజనం వండించి తీసుకెళ్లి ఇచ్చేవారు. నాకు స్కూల్ లేకపోవడంతో రోజూ నాన్నతోపాటు హాస్పిటల్‌కి వెళ్లేదాన్ని. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్లలో నా ఏజ్ గ్రూప్ వాళ్లతో స్నేహం ఏర్పడింది. వాళ్లు కొంతమంది చదువుకోవడానికి పుస్తకాలు తెచ్చిపెట్టమని అడిగారు. రోజూ నా పుస్తకాలు కొన్ని తీసుకెళ్లి ఇస్తూ ఉన్నప్పుడు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జయలత గారు... ‘హాస్పిటల్‌కి చికిత్స కోసం ఎప్పుడూ కొత్తవాళ్లు వస్తుంటారు. హాస్పిటల్లోనే లైబ్రరీ ఉంటే బావుంటుంది’ అన్నారు. వారి ఆలోచనే నా లైబ్రరీ ఉద్యమానికి నాంది. నా పుస్తకాలతోపాటు మా స్కూల్, అపార్ట్మెంట్ స్నేహితుల నుంచి సేకరించిన వెయ్యికి పైగా పుస్తకాలతో తొలి లైబ్రరీ అలా మొదలైంది. ఇప్పటికి 9,836 పుస్తకాలతో 15 లైబ్రరీలు ఏర్పాటు చేయగలిగాను.పదకొండు వేల పుస్తకాలు..నాలుగేళ్లలో పదకొండు వేల పుస్తకాలు సేకరించాను. అందులో రెండు వేల పుస్తకాలు ప్రధాని నరేంద్రమోదీగారిచ్చారు. ఈ ఏడాది మార్చి 18న కోయంబత్తూరులో ఆయనను కలిసే అవకాశం వచ్చింది. ఆ సందర్భంగా ఆయన 25 లైబ్రరీలు స్థాపించమని, 25 లైబ్రరీ స్థాపనకు స్వయంగా హాజరవుతానని చె΄్పారు. భారత రాష్ట్రపతి గత ఏడాది శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కి వచ్చినప్పుడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కలిశాను.అప్పుడామె ‘ప్రజల్లో రీడింగ్ హ్యాబిట్ తగ్గుతోంది, పుస్తక పఠనాన్ని ్రపోత్సహించడానికి దోహదం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కొనసాగించ’మని చెప్పి ఆమే స్వయంగా 74 పుస్తకాలిచ్చారు. ఈ ఏడాది ఢిల్లీ, కర్తవ్య పథ్‌లో జరిగిన 75వ రిపబ్లిక్ డే ఉత్సవాలకు ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరయ్యాను. ఇదే ఏడాది స్వాతంత్య్రదినోత్సవం వేడుకలకు కూడా హాజరయ్యే అవకాశం కలగడం సంతోషంగా ఉంది’’ అంటూ 25 లైబ్రరీల లక్ష్యాన్ని పూర్తి చేస్తానని చెప్పింది ఆకర్షణ సతీశ్. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Yaroslava Mahuchyk: యుద్ధం ఆమెకు సలాం చేసింది..
ఉక్రయిన్ పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. కాని ఆ దేశం నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న క్రీడాకారులు పతకాలు గెలిచి యుద్ధాన్ని చిన్నబుచ్చుతూనే ఉన్నారు. హైజంప్‌లో బంగారు పతకం సాధించిన యారోస్లావా ఏ క్షణంలో ఏ వార్త వినవలసి వస్తుందో అన్న ఆందోళనలో కూడా లక్ష్యాన్ని తప్పలేదు. యుద్ధం ఆమెకు సలాం చేసింది.యుద్ధం చేసిన గాయంతో ఇంకా ఆ దేశం కన్నీరు కారుస్తూనే ఉంది. బాంబులు, బుల్లెట్లు చిందించిన రక్తంతోనే అక్కడి ప్రజలు ఇప్పటికీ సూర్యోదయాన్ని చూస్తున్నారు. రష్యా దురాక్రమణతో ఉక్రెయిన్ ధ్వంసమయ్యి రెండేళ్లు దాటింది. కాని ఆ దేశ క్రీడాకారుల మనోబలాన్ని మాత్రం యుద్ధం దెబ్బతీయలేకపోయింది. మీరు మాపై తుపాకులు ఎక్కుపెట్టి యుద్ధం చేస్తే.. మేం బంగారు పతకాలతో శాంతి సందేశాన్ని అందిస్తామంటూ ప్రపంచానికి సగర్వంగా చాటి చెబుతున్నారు ఉక్రెయిన్ క్రీడాకారులు. హై జంప్‌లో బంగారు పతకం సాధించిన 22 యేళ్ల యారోస్లావా మహుచిక్ వారిలో ఒకరు.నిలువనీడ లేకపోయినా...ప్రశాంతంగా సాగుతున్న యారోస్లావా జీవితాన్ని యుద్ధం ఆందోళనలో పడేసింది. నిత్యం దూసుకొచ్చే క్షిపణులు ఆమెకు రెండున్నరేళ్లుగా నిలువ నీడలేకుండా చేశాయి. తూర్పు ఉక్రెయిన్ లోని సొంతూరు ని్రపో నుంచి బయటపడి వివిధ దేశాల్లో తలదాచుకుంది. తల్లీతండ్రి అక్క అప్పుడప్పుడూ తనను కలిసేందుకు వచ్చేవారు. వారిని చూశాక ఆమె మనసు మరింత కకావికలమయ్యేది. వారు వెళ్లిపోయాక ఏ క్షణాన ఏ వార్త వినాల్సిందోనన్న భయం ఆమెను వెంటాడేది. ఇంట్లో ఉన్నపుడు పక్కన బాంబులు పడుతుంటే ‘నాన్నా బేస్మెంట్లోకి వెళ్దామా అంటే.. ఇంకా భయపడి పారిపోవడంలో అర్థం లేదు. నాలాగే ఎంతోమంది ్రపాణాల మీద ఆశలు వదిలేసుకునే బతుకుతున్నారు తల్లీ’ అన్న తండ్రి మాటలు వద్దంటున్నా గుర్తుకువచ్చేవి. యుద్ధం ఆమెను వెంటాడుతూనే ఉండేది. నేలకొరుగుతున్న దేశ సైనికులు..రోడ్డున పడుతున్న ఉక్రెయిన్ ప్రజలు కళ్ల ముందు కదులుతూనే ఉన్నారు. వాటి మధ్యే ఆమె శిక్షణ కొనసాగిస్తూ వచ్చింది.విషాదగీతాలు మరిచేలా...స్లీపింగ్ బ్యాగ్, యోగా మ్యాట్‌ను ఎప్పుడూ తనతో తెచ్చుకునే మహుచిక్ ఆట విరామ సమయంలో స్డేడియంలో విశ్రాంతి తీసుకుంటూ ఆకాశంలోకి చూస్తూ దేశం గురించే ఆలోచించేది. యుద్ధ విషాద గీతాలు మరుగున పడేలా ప్రజల్లో చైతన్యం నింపేలా దేశానికి పతకం అందించాలని కలలు కనేది. హైజంప్ మ్యాచ్‌లో ప్రత్యర్థితో తలపడే సమయంలోనూ ఆమె మనసునిండా యుద్ధ దృశ్యాలే. చివరకు ఆమె పోరాట స్ఫూర్తి గెలిచింది. ఎంతటి భీకర యుద్ధమైనా ఆశలను, ఆశయాలను తుడిచిపెట్టేయలేదని నిరూపించింది. వ్యక్తిగత హోదాలో దేశానికి ఆమె సాధించి పెట్టిన తొలి గోల్డ్‌మెడల్ ఉక్రెయిన్ ప్రజల భవిష్యత్తుకు నిజంగా ఓ ఆశాకిరణమే. యారోస్లావా మహుచిక్ ఒక్కరే కాదు.. పారిస్ ఒలంపిక్స్‌లో పతకాలు సాధిస్తున్న ఇతర ఉక్రెయిన్ క్రీడాకారులు యుద్ధం కారణంగా నిస్సత్తువగా మారిన ఆ దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇంతకాలం యుద్ధం కారణంగా రక్తంతో తడిసిన దేశంలో పతకాల సుమాలు పూయిస్తున్నారు.ఒలింపిక్స్ జరుగుతున్నా...‘‘ఒలింపిక్ క్రీడలు శాంతి సందేశాలు. కానీ రష్యా ఇలాంటి క్రీడలు జరుగుతున్న సమయంలోనూ మా దేశంపై దాడులు ఆపకపోగా మరింత ఉధృతం చేసింది. చిన్నపిల్లల ఆసుపత్రిపై క్షిపణు లు కురిపించడంలోని క్రౌర్యం మాటలకందనిది’’ అంది యారోస్లావా మహుచిక్. -
యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.8 కోట్లు సంపాదిస్తున్న మహిళ
కొందరంతే.. తాముఅనుకున్నది సాధించేదాకా నిద్రపోరు. మంచి ఉద్యోగం, చక్కటి సంపాదన, ఆర్థికంగా బాగా ఉన్నా కూడా ఏదో చేయాలనే తపన వారిని స్థిమితంగా ఉండ నీయదు. లండన్‌కు చెందిన నీషా షా ఈ కోవకు చెందినవారే. లండన్‌లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా పనిచేస్తున్నా, ఏడాదికి రెండున్నర లక్షలకు డాలర్లకు పైగా జీతం. కానీ దాంతో సంతృప్తి దక్కలేదు. యూట్యూబర్‌గా సరికొత్త అడుగులు వేసింది. కట్ చేస్తే ఏడాదికి ఎనిమిది కోట్లు సంపాదిస్తోంది. నీషా సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం రండి.నలుగురి కోసంఆరంకెల జీతం వస్తున్నా, బ్యాంకింగ్‌లో చేస్తున్నది కార్పొరేషన్లు, సార్వభౌమ ప్రభుత్వాలకు సహాయం చేయడమే కదా, తనకున్న విజ్ఞానం ద్వారా నలుగురి ప్రయోజన కోసం ఏదైనా చేయాలనిపించింది. దీనికి తగ్గట్టు చేస్తున్న పని సంతృప్తి నివ్వలేదు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి బిజినెస్ కంటెంట్ క్రియేటర్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. 2023 జనవరిలో బ్యాంకింగ్ వృత్తిని వదిలి పూర్తిగా యూట్యూబ్నుకొనసాగించడానికి ధైర్యంగా ముందుకు సాగింది. ఒక్క ఏడాదిలోనే అనూహ్య విజయాన్నందుకుంది. View this post on Instagram A post shared by Nischa Shah (@nischa.me)2021 డిసెంబర్లో తన పేరుతోనే ఓ యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది. తనకు ఆసక్తి , పట్టు ఉన్న పర్సనల్ ఫైనాన్స్, సెల్ఫ్ డెవలప్మెంట్, బిజినెస్‌కు సంబంధించిన అంశాలపై వీడియోలు చేయడం మొదలుపెట్టింది. అలా ప్రతి వారం రెండు వీడియోలు పోస్ట్ చేసేది. బిజినెస్ విషయాలు కావడం మొదట్లో ఆశించినంత ఆదరణ లభించలేదు. వెయ్యి మంది సబ్స్క్రైబర్ల కోసం దాదాపు సంవత్సరం వేచి చూడాల్సి వచ్చింది.అయినా పట్టుదలగా ముందుకే సాగింది. ఈ క్రమంలోనే 2022 సెప్టెంబరులో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా ఆమె అనుభవాలను వివరిస్తూ చేసిన వీడియో వైరల్ అయింది. 50వేలకు పైగా సబ్స్క్రైబర్లు వచ్చారు. రూ.3 లక్షలు సంపాదించింది. అందరికంటే భిన్నంగా ఆర్థిక విషయాలపై అవగాహన కల్పింస్తూ తన అభిమానులను ఎడ్యుకేట్ చేస్తోంది. పర్సనల్ ఫైనాన్స్ గురించి సులభంగా, సరళంగా అర్థమయ్యేలా వీడియోలను షేర్ చేస్తుంది. ముఖ్యంగా "మనీ హ్యాబిట్స్ కీపింగ్ యు పూర్" నుండి "మీ తొలిపెట్టుబడి ఎలా పెట్టాలి" వరకు అంశాలపై సలహాలను అందిస్తోంది. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ పెట్టుబడి వ్యూహాలను అందిస్తుంది. ఆమె కంటెంట్ విభిన్నంగా, బిజినెస్‌లో చక్కటి సూచనలు సలహాలతో ఫాలోవర్ల మనసు దోచుకుంది. అలా 2024 మే నాటికి ఆమె సంపాదన రూ. 8 కోట్లను దాటేసింది. యూట్యూబ్ మానిటైజేషన్, కోర్సు విక్రయాలు, కార్పొరేట్ స్పీకింగ్ ఎంగేజ్మెంట్లు, బ్రాండ్స్ పార్టనర్షిప్ ఇందులో ఉన్నాయి. నచ్చిన పని చేయడంలో సంతోషం, విజయం ఉంటాయని చాటి చెప్పింది. సాధించాలన్న అభిరుచి ,పట్టుదల, టాలెంట్ ఉంటో ఆర్థికంగా ఎలా ఉన్నత శిఖరాలకు చేరవచ్చో నీషా స్టోరీ మనకు తెలియజేస్తుంది. లండన్‌కు చెందిన నీషా షా నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్ విభాగంలో డిగ్రీ , ఆ తర్వాత ఛార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) చదివారు. ఆ రోజుల్లో కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకోవడం అంటే దాదాపు 80 శాతం ఆదాయాన్ని కోల్పోవడమే. కానీ కష్టమైనా ఇష్టమైన నిర్ణయం తీసుకున్నా. ఇపుడు బ్యాంకింగ్ ఉద్యోగంలో పొందిన జీతం కంటే యూట్యూబర్‌గా ఎక్కువ సంపాదిస్తున్నాను. ఇది సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తోంది- నీషా.