‘మహిళలు ఐఏయస్ కావడం కష్టం’ అనుకునే ఆ రోజుల్లో తొలి ప్రయత్నంలోనే ఐఏయస్ సాధించింది. ‘ఎంత పెద్ద ఉద్యోగమైనా సరే, ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపడనప్పుడు ఆ ఉద్యోగం చేయడం వృథా’ అనుకొని ఉద్యోగాన్ని వదులుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చింది అరుణారాయ్. గ్రామీణ మహిళలతో కలిసి పోయి ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసింది. తాజా విషయానికి వస్తే... తన జ్ఞాపకాలను ‘ది పర్సనల్ ఈజ్ పొలిటికల్’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చింది. ఈ సందర్భంగా ఆమె ఉద్యమ ప్రయాణం గురించి...
మనం పుట్టి, పెరిగిన వాతావరణం ఏదో రకంగా బలమైన ప్రభావం చూపుతుంది. కాలం కంటే కాస్త ముందుగా ఆలోచించే కుటుంబంలో చెన్నైలో పుట్టి పెరిగింది అరుణ. ‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’లో పోస్ట్–గ్రాడ్యుయేషన్ చేసింది.
‘మహిళలు ఐఏఎస్‌కు సెలెక్ట్ కాలేరు’ అని బలంగా అనుకునే కాలంలో తొలి ప్రయత్నంలోనే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్ష రాసి ఎంపికైంది. సబ్–డివిజనల్ మెజిస్ట్రేట్ నుంచి ‘లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ దిల్లీ’ సెక్రెటరీ వరకు ఎన్నో పదవులు నిర్వహించినప్పటికీ తనలో ఏదో అసంతృప్తి ఉండేది. వ్యవస్థీకృతమైన అవినీతికి సంబంధించిన అసంతృప్తి అది. ఈ అసంతృప్తులు తారస్థాయికి చేరి ఉద్యోగానికి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఉద్యోగానికి ఆరు నెలలు సెలవు పెట్టి భర్త సంజిత్ రాయ్ నిర్వహిస్తున్న సోషల్ వర్క్ రిసెర్చ్ సెంటర్(బేర్‌ఫుట్ కాలేజీ)లో చేరింది. రాజస్థాన్‌లోని తిలోనియ గ్రామంలో ఉన్న ‘బేర్‌ఫుట్ కాలేజీ’లో పనిచేయడం అరుణకు ఎంతో సంతృప్తి ఇచ్చింది. ఉద్యోగానికి రాజీనామా చేసి సేవాపథంలోకి వచ్చింది.
గ్రామాల్లో విద్యుత్ సరఫరా, తాగు నీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం... మొదలైనవి లేని కాలం అది. కిలోమీటర్‌ల కొద్దీ దూరం నడవాల్సి వచ్చేది. అయితే ఈ అసౌకర్యాలేవీ ఎప్పుడూ అరుణకు కష్టంగా అనిపించలేదు. మహిళలు ఒక బృందంగా ఏర్పడి గ్రామ అభివృద్ధికి పాటుపడేలా కృషి చేసింది. కెన్యాలో జరిగే అంతర్జాతీయ మహిళా సదస్సుకు ఆహ్వానం అందినప్పటికీ అక్కడికి వెళ్లకపోగా దానికి ప్రత్యామ్నాయంగా రాజస్థాన్‌లో మహిళా మేళ (మహిళల పండగ) నిర్వహించింది. కెన్యాలో జరిగే అంతర్జాతీయ మహిళా సదస్సుకు, ఈ స్థానిక సదస్సుకు తేడా ఏమిటంటే... మొదటి దానిలో మధ్యతరగతి, ఆ పై తరగతి విద్యాధికులైన మహిళలే ఎక్కువగా పాల్గొనే సదస్సు. ఇక రెండోది పూర్తిగా గ్రామీణ మహిళలు, శ్రామిక మహిళల కోసం నిర్వహించిన సదస్సు. ఈ తరహా పండగ జరగడం దేశంలో మొదటిసారి.
‘మహిళ మేళ’ ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక–రాజకీయ చర్చలకు వేదిక అయింది. మహిళలపై జరిగే హింసను నిరోధించడానికి జరిగిన తొలి బహిరంగ చర్చావేదిక అయింది. ఉన్నత ఉద్యోగాన్ని వదిలి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన అరుణారాయ్ బాల్య వివాహాలకు, మూఢనమ్మకాలకు, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడింది. ‘మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్’ ఆర్గనైజేషన్ ద్వారా సోషల్ యాక్టివిస్ట్‌గా మరింత క్రియాశీలంగా పనిచేయడం ్రపారంభించింది.
స్థూలంగా చెప్పాలంటే... అరుణా రాయ్ అంటే ఒక నామం కాదు. అనేకానేక ఉద్యమాల సమాహారం. సమాజహితాన్ని కోరుకునే వారికి స్ఫూర్తిదాయక ఉత్తేజం.
పేద మహిళల కోసం...
‘జ్ఞానం యొక్క ఉద్దేశం జ్ఞానం కాదు. కార్యాచరణ’ అంటాడు అరిస్టాటిల్. జ్ఞానం అనేది బుర్రలో భద్రపరుచుకొని మురిసిపోవడానికి కాదు. ఆ జ్ఞాన ఫలాలను ఆచరణలోకి, పదిమంది ఉపయోగంలోకి తీసుకురావడం ముఖ్యం. విశ్వవిద్యాలయాల నుంచి మారు మూల పల్లెల వరకు జ్ఞానమార్గంలో పయనించిన అరుణా రాయ్ ఆ జ్ఞానాన్ని పేద మహిళల సంక్షేమం, చైతన్యం కోసం వినియోగించింది. ఉద్యోగ, ఉద్యమ జ్ఞాపకాల ‘ది పర్సనల్ ఈజ్ పొలిటికల్’ ఆమె వ్యక్తిగతం కాదు. సామాజికం. ఉద్యమ బాటలో పయనించడానికి ఉపకరించే ఇంధనం.
Comments
Please login to add a commentAdd a comment