ఆమెది హైదరాబాద్‌లో స్థిరపడిన గుజరాతీ కుటుంబం. ఆమె వృత్తీ, ప్రవృత్తీ రెండూ కళలను అధ్యయనం చేయడమే కావడం వల్ల భారతీయ చిత్రరీతుల మీద విస్తృతంగా పరిశోధన చేస్తున్నారు. మనదేశంలో విలసిల్లిన కళారూపాలు ఏయే దేశాల మ్యూజియాల్లో ఉన్నాయో తెలుసుకుని ప్రతి విషయాన్నీ గ్రంథస్తం చేస్తున్నారు. ఆమే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేసిన డాక్టర్ అనితా షా, చిత్రకళల పరిశోధకురాలు.
ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ (ఐసీఓఎమ్)లో కీలక సభ్యురాలిగా ప్రపంచదేశాల్లో పర్యటిస్తూ మ్యూజియాలజీ విద్యార్థులకు గెస్ట్ ఫ్యాకల్టీగా బోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మనదేశంలో విస్తరించిన వైవిధ్యభరితమైన చిత్రకళారూపాల గురించిన సమగ్రమైన వివరాలతో ‘కలర్స్ ఆఫ్ డివోషన్’ పేరుతో ఆవిష్కరించారు. అమెరికా, ఇండియాల్లోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ చిత్రకళ మీద సదస్సులు నిర్వహిస్తున్న అనితా షా గతంలో ఆమె భర్త భరత్ షాతో కలిసి ‘త్రెడ్స్ ఆఫ్ డివోషన్’ పేరుతో రాజస్థాన్, గుజరాత్‌లోని కచ్‌లో అభివృద్ధి చెందిన ఎంబ్రాయిడరీలతో ప్రదర్శన నిర్వహించారు.
రాస్తే కావ్యం... గీస్తే చిత్రం..
‘‘చిత్రం అంటే సాహిత్యాన్ని కంటితో చూపించే ప్రక్రియ. నిరక్షరాస్యులకు ఒక గ్రంథసారాన్ని బొమ్మల్లో చూపించవచ్చు. చిత్రకారులు కాలానుగుణంగా మార్పులను జోడించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో దక్కనీ– హైదరాబారీ ఆర్టిస్టులు సంయుక్తంగా కృషి చేసి గోల్డెన్ కలంకారీ పెయింటింగ్స్‌కు రూపకల్పన చేశారు. ఇది పద్దెనిమిదవ శతాబ్దపు చివరి రోజుల్లో అభివృద్ధి చెందింది. కళాకారుల కళానైపుణ్యం అంతా కృష్ణుడు, గోపికల రూపాలను తీర్చిదిద్దడంలో కనిపిస్తుంది. నేను శ్రీవల్లభాచార్య వల్లభ సంప్రదాయ తత్వం పుష్టిమార్గం మీద ఎక్కువగా పని చేశాను.
వల్లభాచార్య తత్వం శుద్ధ అద్వైతం, కృష్ణతత్వంతో ఉంటుంది. శైవం ప్రభావం కొన్ని చిత్రాల్లో కనిపిస్తుంది. ఇందులో తాత్విక చింతన, పురాణాల అవలోకనమే ప్రధానంగా సాగుతుంటుంది. సద్గురువుల ప్రవచనాలు, ప్రబోధాల వల్ల అనేక ఊహాచిత్రాలకు రూపం వచ్చింది. సామాన్యులకు ఆరోగ్యకరమైన, ఆచరణీయమైన దైనందిన జీవనశైలిని కూడా పౌరాణిక కథల ద్వారానే వివరించేవారు. తల్లి బిడ్డను లాలనగా నిద్రలేపడం, బిడ్డకు స్నానం చేయించి దుస్తులు ధరింపచేసి చక్కగా అలంకరించడం వంటివన్నీ కృష్ణుడు, యశోద పాత్రల ద్వారా బొమ్మల్లో రూపుదిద్దుకున్నాయి.
చిత్రకళలో కృష్ణతత్వం..
మన చిత్రకళ, శిల్ప కళ అన్నీ చరిత్ర, పురాణేతిహాసాల ఆధారంగానే అభివృద్ధి చెందాయి. సామాజిక మార్పులను ఇముడ్చుకుంటూ ముందుకు సాగుతుంటాయి. భాగవత పురాణాల ప్రభావం ఉత్తరాదిలో ఎక్కువ. కాబట్టి ఉత్తరాది చిత్రకళలు ఎక్కువగా కృష్ణతత్వాన్ని ప్రతిబింబిస్తుంటాయి. కృష్ణుడు ప్రతి ఇంట్లోనూ కుటుంబ సభ్యుడే. ప్రతి సంఘటనను కృష్ణుడితో అన్వయించుకుంటారు.
ముస్లిం ఆర్టిస్టులు హిందూచిత్రాలు..
నా తాజా రచన కలర్స్ ఆఫ్ డివోషన్ పుస్తకం వెనుక ఏడేళ్ల శ్రమ ఉంది. ఇది పాఠకుల సాంస్కృతిక, సామాజిక దృష్టి కోణాన్ని విస్తృతపరుస్తుందని చెప్పగలను. హిందూ పురాణాల ఆధారంగా చిత్రాలకు రూపకల్పన చేసిన వారిలో ముస్లిం చిత్రకారులున్నారు. ఆదిల్ షా స్వయంగా సరస్వతీ మాతను పూజించాడు. ఇలాంటి అనేక సామరస్య సహజీవన ఆధారాలు మనప్రాచీన చిత్రాల్లో దొరుకుతాయి. భారతీయ చిత్రకళలో సాంస్కృతికప్రాముఖ్యతను తెలియచేశాను.
గతంలో ‘విజిటర్స్ టూ సౌత్ ఇండియన్ మ్యూజియమ్స్– మ్యూజియోలాజికల్ కాంటెక్ట్స్ అండ్ విజిటర్ స్టడీ’ పేరుతో పుస్తకం తెచ్చాను. చిత్రకళారీతులతోపాటు వాటిని చిత్రించిన వస్త్రనైపుణ్యాన్ని కూడా ప్రత్యేకంగా గుర్తించాలి. మన చిత్రకళారీతులన్నీ ఒకచోట గుదిగుచ్చి లేక΄ోవడం దురదృష్టకరం. ఒక్కొక్కటి ఒక్కోచోట ఉండడంతో ఒక సమగ్రమైన స్వరూపం రావడం లేదు. అందుకే మ్యూజియాల్లో ప్రదర్శనలో ఉన్న కళాఖండాల ఫొటోలు, వివరాలతో రచనలు చేస్తున్నాను. ఇదే నా పని’’ అని వివరించారు డా. అనితాషా. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment