యారోస్లావా మహుచిక్
ఉక్రయిన్ పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. కాని ఆ దేశం నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న క్రీడాకారులు పతకాలు గెలిచి యుద్ధాన్ని చిన్నబుచ్చుతూనే ఉన్నారు. హైజంప్‌లో బంగారు పతకం సాధించిన యారోస్లావా ఏ క్షణంలో ఏ వార్త వినవలసి వస్తుందో అన్న ఆందోళనలో కూడా లక్ష్యాన్ని తప్పలేదు. యుద్ధం ఆమెకు సలాం చేసింది.
యుద్ధం చేసిన గాయంతో ఇంకా ఆ దేశం కన్నీరు కారుస్తూనే ఉంది. బాంబులు, బుల్లెట్లు చిందించిన రక్తంతోనే అక్కడి ప్రజలు ఇప్పటికీ సూర్యోదయాన్ని చూస్తున్నారు. రష్యా దురాక్రమణతో ఉక్రెయిన్ ధ్వంసమయ్యి రెండేళ్లు దాటింది. కాని ఆ దేశ క్రీడాకారుల మనోబలాన్ని మాత్రం యుద్ధం దెబ్బతీయలేకపోయింది. మీరు మాపై తుపాకులు ఎక్కుపెట్టి యుద్ధం చేస్తే.. మేం బంగారు పతకాలతో శాంతి సందేశాన్ని అందిస్తామంటూ ప్రపంచానికి సగర్వంగా చాటి చెబుతున్నారు ఉక్రెయిన్ క్రీడాకారులు. హై జంప్‌లో బంగారు పతకం సాధించిన 22 యేళ్ల యారోస్లావా మహుచిక్ వారిలో ఒకరు.
నిలువనీడ లేకపోయినా...
ప్రశాంతంగా సాగుతున్న యారోస్లావా జీవితాన్ని యుద్ధం ఆందోళనలో పడేసింది. నిత్యం దూసుకొచ్చే క్షిపణులు ఆమెకు రెండున్నరేళ్లుగా నిలువ నీడలేకుండా చేశాయి. తూర్పు ఉక్రెయిన్ లోని సొంతూరు ని్రపో నుంచి బయటపడి వివిధ దేశాల్లో తలదాచుకుంది. తల్లీతండ్రి అక్క అప్పుడప్పుడూ తనను కలిసేందుకు వచ్చేవారు. వారిని చూశాక ఆమె మనసు మరింత కకావికలమయ్యేది. వారు వెళ్లిపోయాక ఏ క్షణాన ఏ వార్త వినాల్సిందోనన్న భయం ఆమెను వెంటాడేది. ఇంట్లో ఉన్నపుడు పక్కన బాంబులు పడుతుంటే ‘నాన్నా బేస్‌మెంట్‌లోకి వెళ్దామా అంటే.. ఇంకా భయపడి పారిపోవడంలో అర్థం లేదు. నాలాగే ఎంతోమంది ్రపాణాల మీద ఆశలు వదిలేసుకునే బతుకుతున్నారు తల్లీ’ అన్న తండ్రి మాటలు వద్దంటున్నా గుర్తుకువచ్చేవి. యుద్ధం ఆమెను వెంటాడుతూనే ఉండేది. నేలకొరుగుతున్న దేశ సైనికులు..రోడ్డున పడుతున్న ఉక్రెయిన్ ప్రజలు కళ్ల ముందు కదులుతూనే ఉన్నారు. వాటి మధ్యే ఆమె శిక్షణ కొనసాగిస్తూ వచ్చింది.
విషాదగీతాలు మరిచేలా...
స్లీపింగ్ బ్యాగ్, యోగా మ్యాట్‌ను ఎప్పుడూ తనతో తెచ్చుకునే మహుచిక్ ఆట విరామ సమయంలో స్డేడియంలో విశ్రాంతి తీసుకుంటూ ఆకాశంలోకి చూస్తూ దేశం గురించే ఆలోచించేది. యుద్ధ విషాద గీతాలు మరుగున పడేలా ప్రజల్లో చైతన్యం నింపేలా దేశానికి పతకం అందించాలని కలలు కనేది. హైజంప్ మ్యాచ్‌లో ప్రత్యర్థితో తలపడే సమయంలోనూ ఆమె మనసునిండా యుద్ధ దృశ్యాలే. చివరకు ఆమె పోరాట స్ఫూర్తి గెలిచింది. ఎంతటి భీకర యుద్ధమైనా ఆశలను, ఆశయాలను తుడిచిపెట్టేయలేదని నిరూపించింది. వ్యక్తిగత హోదాలో దేశానికి ఆమె సాధించి పెట్టిన తొలి గోల్డ్‌మెడల్ ఉక్రెయిన్ ప్రజల భవిష్యత్తుకు నిజంగా ఓ ఆశాకిరణమే. యారోస్లావా మహుచిక్ ఒక్కరే కాదు.. పారిస్ ఒలంపిక్స్‌లో పతకాలు సాధిస్తున్న ఇతర ఉక్రెయిన్ క్రీడాకారులు యుద్ధం కారణంగా నిస్సత్తువగా మారిన ఆ దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇంతకాలం యుద్ధం కారణంగా రక్తంతో తడిసిన దేశంలో పతకాల సుమాలు పూయిస్తున్నారు.
ఒలింపిక్స్ జరుగుతున్నా...
‘‘ఒలింపిక్ క్రీడలు శాంతి సందేశాలు. కానీ రష్యా ఇలాంటి క్రీడలు జరుగుతున్న సమయంలోనూ మా దేశంపై దాడులు ఆపకపోగా మరింత ఉధృతం చేసింది. చిన్నపిల్లల ఆసుపత్రిపై క్షిపణు లు కురిపించడంలోని క్రౌర్యం మాటలకందనిది’’ అంది యారోస్లావా మహుచిక్.
Comments
Please login to add a commentAdd a comment