vaka manjula reddy
-
Health: ఈ సమస్యలు.. కొనితెచ్చుకుంటున్నారా?
డెర్మోరెక్సియా... ఈ పదంలో డెర్మో ఉంది, కానీ ఇది చర్మ సమస్య కాదు. మానసిక సమస్య. ఒకరకంగా అనెరొక్సియా వంటిదే. సాధారణ బరువుతో ఉన్నప్పటికీ లావుగా ఉన్నామనే భ్రాంతికి లోనవుతూ సన్నబడాలనే ఆకాంక్షతో ఆహారం తినకుండా దేహాన్ని క్షీణింపచేసుకోవడమే అనెరొక్సియా. ఇక డెర్మోరెక్సియా అనేది చర్మం అందంగా, యవ్వనంగా, కాంతులీనుతూ ఉండాలనే కోరికతో విపరీతంగా క్రీములు వాడుతూ చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవడమే డెర్మోరెక్సియా. ఇటీవల మధ్య వయసు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది.ఆత్మవిశ్వాసానికి అందం కొలమానం కాదు! ‘అందం ఆత్మవిశ్వాసాన్ని పెం΄÷ందిస్తుంది’ అనే ప్రచారమే పెద్ద మాయ. సౌందర్య సాధనాల మార్కెట్ మహిళల మీద విసిరిన ఈ వల దశాబ్దాలుగా సజీవంగా ఉంది, ్రపాసంగిక అంశంగానే కొనసాగుతోంది. ఈ తరం మధ్య వయసు మహిళ ఈ మాయలో పూర్తిగా మునిగి΄ోయిందనే చె΄్పాలి. వార్ధక్య లక్షణాలను వాయిదా వేయడానికి, ముఖం మీద వార్ధక్య ఛాయలను కనిపించకుండా జాగ్రత్తపడడానికి యాంటీ ఏజింగ్ క్రీములను ఆశ్రయించడం ఎక్కువైంది. ఒక రకం క్రీము వాడుతూండగానే మరోరకం క్రీమ్ గురించి తెలిస్తే వెంటనే ఆ క్రీమ్‌కు మారి΄ోతున్నారు. వీటి కోసం ఆన్లైన్లో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. క్రమంగా ఇది కూడా ఒక మానసిక సమస్యగా పరిణమిస్తోందని చెబుతున్నారు లండన్ వైద్యులు.క్రీమ్‌ల వాడకం తగ్గాలి! లుకింగ్ యూత్‌ఫుల్, ఫ్లాలెస్ స్కిన్ కోసం, గ్లాసీ స్కిన్ కోసం అంటూ ప్రచారం చేసుకునే క్రీమ్‌లను విచక్షణ రహితంగా వాడుతూ యాక్నే, ఎగ్జిమా, డర్మటైటిస్, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. గాఢత ఎక్కువగా ఉన్న గ్లైకోలిక్ యాసిడ్, నియాసినామైడ్, రెటినాల్, సాలిసైలిక్ యాసిడ్, అల్ఫా హైడ్రాక్స్ యాసిడ్స్ చర్మానికి హాని కలిగిస్తున్నాయి. అలాగే చర్మం మీద మృతకణాలను తొలగించడానికి చేసే ఎక్స్ఫోలియేషన్ విపరీతంగా చేయడం వల్ల చర్మం మరీ సున్నితమై΄ోతోంది. కళ్లచుట్టూ ఉండే చర్మం మీద ఈ క్రీమ్‌లను దట్టంగా పట్టించడం వల్ల ఆర్బిటల్ ఏరియాలో ఉండే సన్నని సున్నితమైన రక్తనాళాలు పలుచబడి వ్యాప్తి చెందుతాయి. దాంతో కళ్ల కింద చర్మం ఉబ్బెత్తుగా మారుతుంది. డెర్మోరెక్సియాను గుర్తించే ఒక లక్షణం ఇది. డెర్మోరెక్సియాను నిర్ధారించే మరికొన్ని లక్షణాలిలా ఉంటాయి. – చర్మం దురదగా ఉండడం, మంటగా అనిపించడం, ఎండకు వెళ్తే భరించలేక΄ోవడం – తరచూ చర్మ వ్యాధి నిపుణులను కలవాల్సి రావడం, ఎన్ని రకాల చికిత్సలు తీసుకున్నప్పటికీ సంతృప్తి కలగక΄ోవడం. – చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పటికీ తరచూ అద్దంలో చూసుకుంటూ అసంతృప్తికి లోనవడం. తళతళ మెరిసే గ్లాసీ స్కిన్ కోసం చర్మం మీద ప్రయోగాలు చేయడం – షెల్ఫ్‌లో అవసరానికి మించి రకరకాల బ్యూటీ ్ర΄ోడక్ట్స్ ఉన్నాయంటే డెర్మోరెక్సియాకు దారితీస్తోందని గ్రహించాలి. మధ్య వయసు మహిళలే కాదు టీనేజ్ పిల్లల విషయంలో కూడా ఈ లక్షణం కనిపించవచ్చు. పేరెంట్స్ గమనించి పిల్లలకు జాగ్రత్తలు చె΄్పాలి.ఓసీడీగా మారకూడదు..శరీరం అందంగా కనిపించట్లేదనే అసంతృప్తి వెంటాడుతూనే ఉండడం బాడీ డిస్మార్ఫోఫోబియా అనే మానసిక వ్యాధి లక్షణం. ముఖం క్లియర్‌గా, కాంతిమంతంగా కనిపించాలనే కోరిక మంచిదే. కానీ అది అబ్సెషన్‌గా మారడం ఏ మాత్రం హర్షణీయం కాదు. ఇది ఎంత తీవ్రమవుతుందంటే... అందంగా కనిపించడానికి రకరకాల ట్రీట్మెంట్లు తీసుకోవడం, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ, ఆ ట్రీట్మెంట్లో ఎంత మంచి ఫలితం వచ్చినప్పటికీ సంతృప్తి చెందక΄ోవడం, తీవ్రమైన అసంతృప్తితో, ఎప్పుడూ అదే ఆలోచనలతో మానసిక ఒత్తిడికి లోనుకావడం వంటి పరిణామాలకు దారి తీస్తుంది. మెదడు ఇదే ఆలోచనలతో నిండి΄ోయినట్లయితే కొంతకాలానికి ఆ సమస్యకు వైద్యం చేయాల్సి వస్తుంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఆ గీతను అర్థం చేసుకోవాలి..ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు, ఆ సంభాషణ తాలూకు విషయమే ముఖ్యం. అంతే తప్ప వారి ముఖం ఎలా ఉంది అనేది పట్టించుకునే అంశం ఏ మాత్రం కాదు. అందం– ఆత్మవిశ్వాసం ఒకదానితో ఒకటి ముడివడి ఉంటాయనేది కొంతవరకే. ఆత్మవిశ్వాసానికి అందం గీటురాయి కానేకాదు. ఈ సన్నని గీతను అర్థం చేసుకోవాలి. సాధారణంగా వయసుతోపాటు దేహంలో మార్పు వస్తుంటుంది. ఆ మార్పు ప్రభావం చర్మం మీద కనిపిస్తుంటుంది. ఈ మార్పును స్వీకరించాల్సిందే. చర్మం కాంతిమంతంగా ఉండడం కోసం రసాయన క్రీములను ఆశ్రయించడం కంటే మంచి ఆహారం, వ్యాయామం, ఒత్తిడి లేని జీవనశైలి, మంచి నిద్ర ఉండేటట్లు చూసుకోవాలి. – ప్రొఫెసర్ శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై, హెచ్‌వోడీ, సైకియాట్రీ విభాగం, కాకతీయ మెడికల్ కాలేజ్ఇవి చదవండి: Lathika Sudhan: రేకులు విప్పిన కలువ.. కొలనైంది! -
Teacher's Day Special: నా బెస్ట్ టీచర్..
ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకుంటున్నారు డాక్టర్ ఎన్. మృదుల. హైదరాబాద్, బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు అసోసియేట్ ప్రొఫెసర్. ఉపాధ్యాయురాలిగా 34 ఏళ్లలో ఆమె దగ్గర పదివేల మంది విద్యార్థులు తెలుగు నేర్చుకున్నారు. తనను బోధనరంగం వైపు నడిపించింది సికింద్రాబాద్, ప్యాట్నీలోని తాను చదువుకున్న స్కూలు, ఆ స్కూల్ తెలుగు టీచర్ భువనేశ్వరి గారేనన్నారు డాక్టర్ మృదుల. అంటే ఈ బెస్ట్ టీచర్ మెచ్చుకున్న తన బెస్ట్ టీచర్ భువనేశ్వరి.అంతా ఆ టీచర్ ప్రభావమే..‘భువనేశ్వరి టీచర్ పద్యంలోని ప్రతి పదానికి అర్థం చెప్పడంతో పాటు, దానికి వ్యుత్పత్తి, ఆ పదాన్ని ప్రయోగించడం వెనుక కవి ఉద్దేశం చెప్పేవారు. కవితలు, కథలు రాయించేవారు. సభా నిర్వహణ చేయించేవారు. ఆమె ప్రభావంతోనే తెలుగు భాష మీద మక్కువ పెరిగింది. ఆ ప్రోత్సాహమే ఇప్పటికీ మయూఖ, తరుణి మ్యాగజైన్లలో కాలమిస్టుగా వ్యాసాలు రాయిస్తోంది. పాఠం చెప్పడంలో కూడా ఆమె బాటనే అనుసరిస్తున్నాను’ అంటారు మృదుల.నిత్యం విద్యార్థినే!‘నా విద్యార్థులకు నేను అసైన్మెంట్లు ఇచ్చినప్పుడు వాళ్లు కచ్చితంగా గడువులోపే పూర్తి చేయాలని కోరుకుంటాను. అలాగే అధికారుల నుంచి మాకు వచ్చే అసైన్మెంట్లను కూడా గడువులోపు పూర్తి చేసేదాన్ని. పనిని శ్రద్ధగా అంకితభావంతో చేయాలనుకుంటాను. మా కుటుంబంలో టీచర్లు లేరు. నేను టీచింగ్‌లోకి వచ్చినందుకు అమ్మానాన్న చాలా సంతోషించారు. కోవిడ్‌లో ఆన్లైన్ క్లాసులు చెప్పడానికి సాంకేతికపరంగా అవసరమైన సహాయం మా పిల్లలు చేసేవాళ్లు. కోవిడ్ తర్వాత కూడా అవసరాన్ని బట్టి ఆన్లైన్ క్లాసులను కొనసాగించాను. క్లాసులో పూర్తి కాని పాఠాలను ఇంటికి వచ్చిన తర్వాత ఆన్లైన్లో చెప్తున్నాను. టీచర్‌గా ‘బెస్ట్ ఆన్‌లైన టీచర్, బెస్ట్ హెచ్ఓడీ, బెస్ట్ ఫ్యాకల్టీ’ గౌరవాలందాయి. ఉపాధ్యాయురాలిగా ప్రభుత్వం నుంచి పురస్కారం అందుకోవడం ఇదే మొదటిసారి’’ అని తన ఉపాధ్యాయ ప్రస్థానాన్ని వివరించారు డాక్టర్ మృదుల. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె ‘ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’నందుకోనున్నారు.సీతమ్మబడి..మా స్కూల్ పేరు ‘పరోపకారి బాలికోన్నత పాఠశాల’. సీతమ్మ అనే మహిళ కట్టించిన స్కూల్ కావడంతో సీతమ్మబడి అంటారు. కవితలు రాయడంతోపాటు స్కూల్లో జరిగే సభలు, సమావేశాల్లో చురుగ్గా ఉండేదాన్ని. చక్కటి తెలుగుతో వక్తలను వేదిక మీదక ఆహ్వానించేదాన్ని. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఆకాశవాణిలోని యువవాణి కార్యక్రమంలో ప్రయోక్తగా ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాను. అనౌన్స్మెంట్లు, వ్యాసాలు కధానికలు చదవడం... ఇలా కలం, గళం కలిసి కొనసాగాయి. ఇక బోధనరంగంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజూ ఇష్టమైన రోజుగానే గడిచింది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Dr Anita Shah: ఆధ్యాత్మిక కళకూ.. ఒక చరిత్ర ఉంది!
ఆమెది హైదరాబాద్‌లో స్థిరపడిన గుజరాతీ కుటుంబం. ఆమె వృత్తీ, ప్రవృత్తీ రెండూ కళలను అధ్యయనం చేయడమే కావడం వల్ల భారతీయ చిత్రరీతుల మీద విస్తృతంగా పరిశోధన చేస్తున్నారు. మనదేశంలో విలసిల్లిన కళారూపాలు ఏయే దేశాల మ్యూజియాల్లో ఉన్నాయో తెలుసుకుని ప్రతి విషయాన్నీ గ్రంథస్తం చేస్తున్నారు. ఆమే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేసిన డాక్టర్ అనితా షా, చిత్రకళల పరిశోధకురాలు.ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ (ఐసీఓఎమ్)లో కీలక సభ్యురాలిగా ప్రపంచదేశాల్లో పర్యటిస్తూ మ్యూజియాలజీ విద్యార్థులకు గెస్ట్ ఫ్యాకల్టీగా బోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మనదేశంలో విస్తరించిన వైవిధ్యభరితమైన చిత్రకళారూపాల గురించిన సమగ్రమైన వివరాలతో ‘కలర్స్ ఆఫ్ డివోషన్’ పేరుతో ఆవిష్కరించారు. అమెరికా, ఇండియాల్లోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ చిత్రకళ మీద సదస్సులు నిర్వహిస్తున్న అనితా షా గతంలో ఆమె భర్త భరత్ షాతో కలిసి ‘త్రెడ్స్ ఆఫ్ డివోషన్’ పేరుతో రాజస్థాన్, గుజరాత్‌లోని కచ్‌లో అభివృద్ధి చెందిన ఎంబ్రాయిడరీలతో ప్రదర్శన నిర్వహించారు.రాస్తే కావ్యం... గీస్తే చిత్రం..‘‘చిత్రం అంటే సాహిత్యాన్ని కంటితో చూపించే ప్రక్రియ. నిరక్షరాస్యులకు ఒక గ్రంథసారాన్ని బొమ్మల్లో చూపించవచ్చు. చిత్రకారులు కాలానుగుణంగా మార్పులను జోడించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో దక్కనీ– హైదరాబారీ ఆర్టిస్టులు సంయుక్తంగా కృషి చేసి గోల్డెన్ కలంకారీ పెయింటింగ్స్‌కు రూపకల్పన చేశారు. ఇది పద్దెనిమిదవ శతాబ్దపు చివరి రోజుల్లో అభివృద్ధి చెందింది. కళాకారుల కళానైపుణ్యం అంతా కృష్ణుడు, గోపికల రూపాలను తీర్చిదిద్దడంలో కనిపిస్తుంది. నేను శ్రీవల్లభాచార్య వల్లభ సంప్రదాయ తత్వం పుష్టిమార్గం మీద ఎక్కువగా పని చేశాను.వల్లభాచార్య తత్వం శుద్ధ అద్వైతం, కృష్ణతత్వంతో ఉంటుంది. శైవం ప్రభావం కొన్ని చిత్రాల్లో కనిపిస్తుంది. ఇందులో తాత్విక చింతన, పురాణాల అవలోకనమే ప్రధానంగా సాగుతుంటుంది. సద్గురువుల ప్రవచనాలు, ప్రబోధాల వల్ల అనేక ఊహాచిత్రాలకు రూపం వచ్చింది. సామాన్యులకు ఆరోగ్యకరమైన, ఆచరణీయమైన దైనందిన జీవనశైలిని కూడా పౌరాణిక కథల ద్వారానే వివరించేవారు. తల్లి బిడ్డను లాలనగా నిద్రలేపడం, బిడ్డకు స్నానం చేయించి దుస్తులు ధరింపచేసి చక్కగా అలంకరించడం వంటివన్నీ కృష్ణుడు, యశోద పాత్రల ద్వారా బొమ్మల్లో రూపుదిద్దుకున్నాయి.చిత్రకళలో కృష్ణతత్వం..మన చిత్రకళ, శిల్ప కళ అన్నీ చరిత్ర, పురాణేతిహాసాల ఆధారంగానే అభివృద్ధి చెందాయి. సామాజిక మార్పులను ఇముడ్చుకుంటూ ముందుకు సాగుతుంటాయి. భాగవత పురాణాల ప్రభావం ఉత్తరాదిలో ఎక్కువ. కాబట్టి ఉత్తరాది చిత్రకళలు ఎక్కువగా కృష్ణతత్వాన్ని ప్రతిబింబిస్తుంటాయి. కృష్ణుడు ప్రతి ఇంట్లోనూ కుటుంబ సభ్యుడే. ప్రతి సంఘటనను కృష్ణుడితో అన్వయించుకుంటారు.ముస్లిం ఆర్టిస్టులు హిందూచిత్రాలు..నా తాజా రచన కలర్స్ ఆఫ్ డివోషన్ పుస్తకం వెనుక ఏడేళ్ల శ్రమ ఉంది. ఇది పాఠకుల సాంస్కృతిక, సామాజిక దృష్టి కోణాన్ని విస్తృతపరుస్తుందని చెప్పగలను. హిందూ పురాణాల ఆధారంగా చిత్రాలకు రూపకల్పన చేసిన వారిలో ముస్లిం చిత్రకారులున్నారు. ఆదిల్ షా స్వయంగా సరస్వతీ మాతను పూజించాడు. ఇలాంటి అనేక సామరస్య సహజీవన ఆధారాలు మనప్రాచీన చిత్రాల్లో దొరుకుతాయి. భారతీయ చిత్రకళలో సాంస్కృతికప్రాముఖ్యతను తెలియచేశాను.గతంలో ‘విజిటర్స్ టూ సౌత్ ఇండియన్ మ్యూజియమ్స్– మ్యూజియోలాజికల్ కాంటెక్ట్స్ అండ్ విజిటర్ స్టడీ’ పేరుతో పుస్తకం తెచ్చాను. చిత్రకళారీతులతోపాటు వాటిని చిత్రించిన వస్త్రనైపుణ్యాన్ని కూడా ప్రత్యేకంగా గుర్తించాలి. మన చిత్రకళారీతులన్నీ ఒకచోట గుదిగుచ్చి లేక΄ోవడం దురదృష్టకరం. ఒక్కొక్కటి ఒక్కోచోట ఉండడంతో ఒక సమగ్రమైన స్వరూపం రావడం లేదు. అందుకే మ్యూజియాల్లో ప్రదర్శనలో ఉన్న కళాఖండాల ఫొటోలు, వివరాలతో రచనలు చేస్తున్నాను. ఇదే నా పని’’ అని వివరించారు డా. అనితాషా. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అరుదైన ఆహ్వానం: 12 ఏళ్లు.. 15 లైబ్రరీలు..
ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం అందుకున్నఇరవై మందిలో విద్యార్థులు ఆరుగురు. వారిలో అమ్మాయి ఒకే ఒక్కరు. ఆ సరస్వతి పుత్రిక పేరు ఆకర్షణ. లైబ్రరీలు స్థాపిస్తూ సాహిత్యాన్ని సామాన్యులకు దగ్గర చేస్తున్న ఆమె అక్షరసేవకు జాతీయ స్థాయిలో అందిన గుర్తింపు ఇది. ‘‘హైదరాబాద్ హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్‌మాస్టర్ నుంచి 12వ తేదీన నాన్నకు ఫోన్ వచ్చింది. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా 15వ తేదీన ఢిల్లీలో జరిగే వేడుకలకు హాజరుకావలసిందిగా మీ అమ్మాయి ఆకర్షణకు ఆహ్వానం వచ్చిందని చెబుతూ అభినందనలు తెలియచేశారు’’ అంటూ తాను లైబ్రరీ వ్యవస్థాపకురాలిగా మారిన వివరాలను సాక్షి ఫ్యామిలీతో పంచుకున్నారు ఆకర్షణ సతీష్.కోవిడ్ వచ్చినప్పుడు..‘‘హైదరాబాద్‌లో స్థిరపడిన తమిళ కుటుంబం మాది. నాన్న సతీశ్ క్యాన్సర్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీ ఉద్యోగి. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను. పుస్తక పఠనం నా హాబీ కావడంతో వెయ్యికి పైగా పుస్తకాలతో ఇంట్లోనే నాకు సొంత లైబ్రరీ ఉంది. ఇతరుల కోసం లైబ్రరీ స్థాపించాలనే ఆలోచన కోవిడ్ సమయంలో వచ్చింది.తొలి లైబ్రరీ క్యాన్సర్ హాస్పిటల్లో..నాన్న ఉద్యోగరీత్యా క్యాన్సర్ హాస్పిటళ్లకు టచ్‌లో ఉంటారు. కోవిడ్ సమయంలో ఎమ్ఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ వాళ్లు ‘కోవిడ్ కారణంగా వంటవాళ్లు డ్యూటీకి రావడం లేదు. పేషెంట్లకు ఆహారం అందించడానికి ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేసి పెట్టవలసింది’గా కోరడంతో నాన్న వాళ్ల కోసం రోజూ భోజనం వండించి తీసుకెళ్లి ఇచ్చేవారు. నాకు స్కూల్ లేకపోవడంతో రోజూ నాన్నతోపాటు హాస్పిటల్‌కి వెళ్లేదాన్ని. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్లలో నా ఏజ్ గ్రూప్ వాళ్లతో స్నేహం ఏర్పడింది. వాళ్లు కొంతమంది చదువుకోవడానికి పుస్తకాలు తెచ్చిపెట్టమని అడిగారు. రోజూ నా పుస్తకాలు కొన్ని తీసుకెళ్లి ఇస్తూ ఉన్నప్పుడు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జయలత గారు... ‘హాస్పిటల్‌కి చికిత్స కోసం ఎప్పుడూ కొత్తవాళ్లు వస్తుంటారు. హాస్పిటల్లోనే లైబ్రరీ ఉంటే బావుంటుంది’ అన్నారు. వారి ఆలోచనే నా లైబ్రరీ ఉద్యమానికి నాంది. నా పుస్తకాలతోపాటు మా స్కూల్, అపార్ట్మెంట్ స్నేహితుల నుంచి సేకరించిన వెయ్యికి పైగా పుస్తకాలతో తొలి లైబ్రరీ అలా మొదలైంది. ఇప్పటికి 9,836 పుస్తకాలతో 15 లైబ్రరీలు ఏర్పాటు చేయగలిగాను.పదకొండు వేల పుస్తకాలు..నాలుగేళ్లలో పదకొండు వేల పుస్తకాలు సేకరించాను. అందులో రెండు వేల పుస్తకాలు ప్రధాని నరేంద్రమోదీగారిచ్చారు. ఈ ఏడాది మార్చి 18న కోయంబత్తూరులో ఆయనను కలిసే అవకాశం వచ్చింది. ఆ సందర్భంగా ఆయన 25 లైబ్రరీలు స్థాపించమని, 25 లైబ్రరీ స్థాపనకు స్వయంగా హాజరవుతానని చె΄్పారు. భారత రాష్ట్రపతి గత ఏడాది శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కి వచ్చినప్పుడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కలిశాను.అప్పుడామె ‘ప్రజల్లో రీడింగ్ హ్యాబిట్ తగ్గుతోంది, పుస్తక పఠనాన్ని ్రపోత్సహించడానికి దోహదం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కొనసాగించ’మని చెప్పి ఆమే స్వయంగా 74 పుస్తకాలిచ్చారు. ఈ ఏడాది ఢిల్లీ, కర్తవ్య పథ్‌లో జరిగిన 75వ రిపబ్లిక్ డే ఉత్సవాలకు ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరయ్యాను. ఇదే ఏడాది స్వాతంత్య్రదినోత్సవం వేడుకలకు కూడా హాజరయ్యే అవకాశం కలగడం సంతోషంగా ఉంది’’ అంటూ 25 లైబ్రరీల లక్ష్యాన్ని పూర్తి చేస్తానని చెప్పింది ఆకర్షణ సతీశ్. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఒలింపిక్స్ క్రీడాకారులు.. ఏం తినాలి! ఎంత తినాలి!!
ఒలింపిక్స్ క్రీడాకారుల ఆహారం చాలా నిశితమైన పరిశీలనతో డిజైన్ చేస్తారు. వాళ్ల ఆరోగ్యం, సంబంధిత క్రీడకు అవసరమైన మోతాదులో ΄ోషకాలు సమృద్ధిగా అందేలా ఆహారం ఉంటుంది. కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్స్ వంటి మ్యాక్రో న్యూట్రియెంట్స్, ఐరన్, క్యాల్షియం, విటమిన్ డీ, మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్స్ (సోడియం, పొటాషియం, క్లోరైడ్) వంటి మైక్రో న్యూట్రియెంట్లు అందాలి. క్రీడాకారుల డైట్లో దేహానికి ఒక రోజుకు అవసరమైన కేలరీలలో 55–65 శాతం కార్బోహైడ్రేట్ల రూపంలోనే ఉంటుంది. శ్రమను బట్టి రోజుకు 2 వేల నుంచి 10 వేల కేలరీల వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్లు దేహం బరువును బట్టి కేజీకి 1.2 నుంచి 2 గ్రాములు అందాలి. ఆరోగ్యకరమైన ఫ్యాట్ శక్తినివ్వడంతోపాటు హార్మోన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. దేహానికి అందాల్సిన కేలరీల్లో 20 నుంచి 30 శాతం ఫ్యాట్ రూపంలో ఉండాలి. మారథాన్, స్విమ్మింగ్‌కి శిక్షణ నిడివి ఎక్కువ ఉంటుంది. క్రీడను బట్టి కూడా ΄ోషకాల అవసరం మారుతుంది.ఎప్పుడు తినాలి? ఎలా తినాలి?ఆహారంతోపాటు హైడ్రేషన్, మీల్ టైమింగ్, వర్కవుట్కు రెండు – మూడు గంటల ముందు తీసుకోవాల్సిన ఆహారం, వర్కవుట్ సమయం గంటకు మించినప్పుడు మధ్యలో తీసుకోవాల్సిన తక్షణ శక్తినిచ్చే ఆహారం, వర్కవుట్ తర్వాత కండరాల పునర్నిర్మాణం కోసం తీసుకోవాల్సిన ఆహారం మోతాదులు స్పష్టంగా నిర్దేశితమై ఉంటాయి. అయితే బాడీ కం΄ోజిషన్, మెటబాలిక్ రెస్పాన్స్, ఫుడ్ ఇన్టాలరెన్స్ వ్యక్తికీ వ్యక్తికీ మారుతుంటాయి. కాబట్టి సాధారణ నియమావళిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క స్పోర్ట్స్పర్సన్కి వ్యక్తిగత డైట్ ΄్లాన్ సిద్ధం చేయాలి. అలాగే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, వీగన్ వంటి వారి వ్యక్తిగత ఆహార విశ్వాసాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.– ఐరన్: రెడ్ మీట్, ఆకు కూరలు, ధాన్యాల ద్వారా శక్తితోపాటు దేహభాగాలకు ఆక్సిజన్ సమర్థంగా అందుతుంది.– క్యాల్షియమ్: వెన్న తీయని పాలు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు ఎముకల పటుత్వానికి దోహదం చేస్తాయి. – విటమిన్–డి: కొవ్వుతో కూడిన చేపలు, తృణధాన్యాలు, సూర్యరశ్మి ద్వారా ఎముకల పటుత్వంతోపాటు వ్యాధినిరోధకత మెరుగవుతుంది. – మెగ్నీషియం: నట్స్, సీడ్స్, పొట్టుతీయని ధాన్యాలు, ఆకుకూరలు శక్తిని పెంచడంతోపాటు కండరాల సంకోచవ్యాకోచాలను సులువు చేస్తాయి. – ఎలక్ట్రోలైట్స్: పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు, స్పోర్ట్స్ డ్రింక్‌లు దేహంలో ద్రవాల స్థాయులను క్రమబద్ధీకరించడంతోపాటు కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి.హెల్దీ డైట్..వంద గ్రాములు... మనదేశానికి ఒక బంగారు పతకాన్ని దూరం చేసింది. బంగారు పతకంతోపాటు బంగారంలాంటి క్రీడాకారిణి మనోధైర్యాన్ని దెబ్బతీసింది. బరువు లెక్కలు ఇంత కచ్చితంగా పాటించే ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు తీసుకునే ఆహారం ఎలా ఉండాలనే వివరాలను అందించారు న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కోచ్ డాక్టర్ కరుణ.– డాక్టర్ కరుణ, న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్హార్మోన్ల సమతుల్యత! వీటన్నింటితోపాటు నిద్ర, ఒత్తిడి చాలా కీలకమైన పాత్ర ΄ోషిస్తాయి. క్రీడాకారిణులకు ఎనిమిది గంటల మంచినిద్ర తప్పనిసరి. నిద్రలేనప్పుడు హార్మోన్ల సమతుల్యత లోపించడం, ఒత్తిడి, బరువు మీద ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడిని ఎదుర్కోవడంలో మగవాళ్లకు మహిళలకు మధ్య తేడా ఉంటుంది. మానసికమైన ఒత్తిడి, భావోద్వేగాలు వారి సమర్థమైన ప్రదర్శన మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ పరిస్థితిని అధిగమించడానికి మెడిటేషన్, బ్రీత్ ఎక్సర్సైజ్, కృతజ్ఞత, క్షమ, పరిస్థితిని యథాతథంగా స్వీకరించడం వంటివి సాధన చేయాలి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
'నా ఎదుగుదల మూలాలు మా ఊరిలోనే..' రైతుబడి మాస్టారు!
'దేశరాజధాని నగరం న్యూఢిల్లీలోని ట్రిపుల్ఐటీ సంస్థ. ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదిక మీద దేశవిదేశీ ప్రముఖుల సమక్షంలో ప్రసంగించవలసిందిగా ఆహ్వానం అందుకున్నాడు మన తెలుగు యువకుడు. నేడు జరగనున్న ఎంటర్ ప్రెన్యూర్షిప్ సమ్మిట్–2024లో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలలో యువతకున్న వ్యాపార అవకాశాల గురించి ప్రసంగించే అవకాశాన్నందుకున్న జూలకంటి రాజేందర్‌రెడ్డి ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన ప్రస్థానాన్ని పంచుకున్నారు.' ‘‘న్యూఢిల్లీ వేదికగా అది కూడా అత్యున్నత స్థాయి విద్యాసంస్థలో ప్రసంగించే అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అంతకుముందు జాతీయ స్థాయిలో ‘ద నేషనల్ క్రియేటర్స్ అవార్డు’కు సంబంధించిన ‘మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ అగ్రి క్రియేటర్’ కేటగిరీలో 36 శాతానికి పైగా ఓట్లు సాధించి రైతుబడి చానెల్ ప్రథమస్థానంలో నిలిచింది. ఇందుకు అసలైన కార్యక్షేత్రం మా నల్గొండ జిల్లా, మాడ్గుల పల్లి మండలంలోని మాచనపల్లి గ్రామం. నా ఎదుగుదల మూలాలు మా ఊరిలోనే ఉన్నాయి. మాది వ్యవసాయ కుటుంబం. కానీ నేనెప్పుడూ పొలం పని చేయలేదు. నన్ను బాగా చదివించి మంచి ఉద్యోగం చేస్తుంటే చూడాలని కలలు కన్నారు అమ్మా నాన్న. పనుల ఒత్తిడి ఉంటే సీజన్లో కూడా నాకు పొలం పనులు కాదు కదా, పశువుల దగ్గర సహాయానికి కూడా రానిచ్చేవారు కాదు. అలాంటిది ఇప్పుడు నా కెరీర్ వ్యవసాయ భూమిలోనే వేళ్లూనుకు΄ోయింది. పలక.. పేపర్! అమ్మానాన్న కోరుకున్నట్లే చదువుకున్నాను. బీఈడీ చేసిన తర్వాత స్కూల్లో పలక మీద పిల్లలకు అక్షరాలు దిద్దించాల్సిన వాడిని, అనుకోకుండా కొత్తదారిలో అడుగుపెట్టాను. రోజూ పేపర్ చదివే అలవాటు ఉండడంతో ఓ రోజు జర్నలిజం కోర్సు ప్రవేశ పరీక్ష ప్రకటన నా కంటపడింది. ఉత్సాహం కొద్దీ పరీక్ష రాశాను. సెలెక్ట్ అయ్యాను. కానీ అక్కడ శిక్షణ పూర్తి చేయలేదు. కానీ 2008లో ఓ ప్రైవేట్ టీవీ చానెల్‌తో జర్నలిస్టుగా నా ప్రయాణం మొదలైంది. టీవీ చానెల్స్ మారుతూ కొంతకాలం హైదరాబాద్‌లో, మరికొంత కాలం జిల్లాల్లో ఉద్యోగం చేశాను. వార్తలకే పరిమితం కాకుండా ఫీచర్ స్టోరీల కోసం అన్వేషించేవాడిని. నా అన్వేషణలో కెమెరా కంటికి చిక్కిన ఓ వాస్తవం ఎంత ఆసక్తికరమైందో ఊహించగలరా!? కాకతీయుల వారసులు ఇప్పటికీ ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటే... చత్తీస్గడ్ రాష్ట్రం, జగదల్పూర్లో. ‘కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ’ అక్కడ రాజు హోదాలో ఉన్నారు. వివరాలు సేకరిస్తూ వాళ్లను వెతుక్కుంటూ వెళ్లి షూట్ చేయడంలో కలిగిన జాబ్ శాటిస్ఫాక్షన్ ఇంత అని చెప్పలేను. ఇలా ఆరేళ్లు గడిచింది, అనుకోకుండా ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ప్రింట్ మీడియాకి మారాను. అక్కడ ఆరేళ్లు పని చేశాను. ఉద్యోగం చేస్తున్నాను కానీ సంతృప్తి స్థాయి క్రమంగా తగ్గి΄ోసాగింది. ఎన్నాళ్లో... ఎన్నేళ్లో ఉద్యోగిగా నీ పయనం... అని నా ఆవేదనను ఫేస్బుక్లో రాసుకునేవాడిని. కరోనా వచ్చింది.. లాక్డౌన్ తెచ్చింది! అది 2020, ప్రపంచానికి గుర్తొచ్చేది కరోనా, లాక్డౌన్. నాకు గుర్తొచ్చే అపురూపమైన ఘట్టం రైతుబడి ఆవిర్భావం. ఆ ఏడాది జనవరిలోనే రైతుబడి మొదలుపెట్టేశాను. ఉద్యోగం మానేయాలనే నిర్ణయానికి వచ్చాను. మేలో మానేశాను. ఆశ్చర్యం ఏమిటంటే... ఉద్యోగంలో అందుకున్న జీతానికి సమానమైన రాబడిని జూన్‌లోనే చూశాను. రైతులకు ఉపయోగపడే అంశాల మీదనే ఉంటాయి నా వీడియోలన్నీ. ఒకే పంట వేస్తున్న రైతులకు రకరకాల పంటలు వేయమని మాటలతో చెప్పడం వల్ల ప్రభావితం చేయలేం. ఏకకాలంలో రకరకాల పంటలు పండిస్తున్న రైతు అనుభవాలను వారి మాటల్లో వింటే సాటి రైతులు త్వరగా ప్రభావితమవుతారు. ఇదే నా సక్సెస్ ఫార్ములా. వ్యవసాయరంగ పరిశోధకులు, అధికారుల ద్వారా కూడా కొన్ని విషయాలు చెప్పించాను. కానీ రైతులు చెప్పిన విషయాలనే సాటి రైతులు గుర్తు పెట్టుకుంటున్నారు, ఆచరణలో పెడుతున్నారు. రైతులు కొందరు వ్యవసాయ పరికరాలను సొంతంగా తయారు చేసుకుంటారు, ఉన్న పరికరాలను తమ అవసరాలకు అనుగుణంగా మలుచుకుంటూ ఉంటారు. అలాంటి వాటిని కూడా బాగా చూపించేవాడిని. పంటలను, రైతులను వెతుక్కుంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో పర్యటించాను. లక్షకు పైగా కిలోమీటర్లు ప్రయాణించాను. పదమూడు వందలకు పైగా వీడియోలు చేశాను. నా రైతుబడికి పదమూడు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లున్నారు. ఇప్పటి వరకు వన్ మ్యాన్ ఆర్మీలాగ నేనొక్కడినే పొలాలకు వెళ్లి కెమెరా ఆన్ చేసి రైతుతో మాట్లాడేవాడిని. ఆ ఫుటేజ్‌ని మా మంజుల (భార్య) ఇంట్లో ఎడిట్ చేసిచ్చేది. ఈ మధ్యనే ఒక టీమ్‌ను తయారు చేసుకున్నాను. నా విజయగాధ నేనే రాసుకున్నాను! "నాలో ఎడతెగని ఆలోచన మొదలైంది. ఎంతోమంది సక్సెస్ స్టోరీలు రాశాను. నా సక్సెస్ స్టోరీని నేను రాసుకోలేనా అనిపించింది. నాలుగు సంస్థల్లో పని చేశాను. సంస్థ పేరు నా ఇంటిపేరుగా నా పేరుకు ముందు చేరుతోంది. కానీ నా పేరే సంస్థ పేరు కాలేదా? ఆ మధనంలో నుంచి పుట్టుకొచ్చిందే రైతుబడి. రైతుబడి అనే అమృతం పుట్టడానికి ముందు నా మదిమధనంలో అనేక గరళాలు కూడా కోరలు సాచాయి. సూపర్‌మార్కెట్, ‘రైతు పంట’ పేరుతో రైతుల ఉత్పత్తుల విక్రయం, ఇన్ షాట్ తరహాలో ‘లోకల్ న్యూస్ యాప్’ పేరుతో ఓ న్యూస్ యాప్, అదే పేరుతో ఓ యూ ట్యూబ్ చానెల్... వీటిలో కొన్ని భారీ వైఫల్యాలు, మరికొన్ని పాక్షిక విజయాలనిచ్చాయి. ఆ తర్వాత మరో నాలుగు యూ ట్యూబ్ చానెళ్లు కూడా పెట్టాను. అవి విజయవంతం కాలేదు, కానీ నన్ను విజయపథంలో నడిపించే మార్గదర్శకాలయ్యాయి." – జూలకంటి రాజేందర్ రెడ్డి, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, రైతుబడి యూట్యూబ్ చానెల్ గుర్తు పడుతున్నారు! ‘నాకు గుర్తింపు వచ్చింది’ అనే పెద్ద మాట చెప్పను. కానీ ఇప్పుడు ఏ ఊరికి వెళ్లినా నన్ను గుర్తు పడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయం కోసం పని చేస్తున్న చానెళ్లలో రైతుబడి పెద్దది. ఇప్పుడు ఢిల్లీలో ప్రసంగించడానికి ట్రిపుల్ ఐటీ నుంచి ఆహ్వానం రావడానికి కారణం ఈ యూ ట్యూబ్ చానెలే. నేననుకున్నట్లే నా సంస్థపేరు నా పేరు కలిసి ‘రైతుబడి రాజేందర్’నయ్యాను. ఇది కాకుండా నేను చేరాల్సిన లక్ష్యాలు రెండున్నాయి. ఒకటి... వ్యవసాయంలో అనుభవాలు పంచుతున్న రైతుబడి తరహాలోనే మరో వేదిక ద్వారా వ్యాపార అనుభవాలను యువతకు చేర్చడం, కొత్త ఎంటర్ప్రెన్యూర్లను తయారు చేయడం. ఇప్పటికే బిజినెస్ బుక్ పేరుతో ఆ ప్రయత్నం మొదలైంది. మరొకటి వ్యవసాయ భూమిని కొనుక్కోవడం. నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాన్న ΄ోయారు. అనివార్యమైన పరిస్థితుల్లో మా పొలాన్ని అమ్ముకున్నాం. కొద్దిగానైనా వ్యవసాయభూమిని కొని మా అమ్మకు బహుమతిగా ఇవ్వాలి. రైతు కుటుంబంలో పుట్టిన వాళ్లం భూమితో బంధాన్ని తెంచుకోలేం’’ అన్నారు రాజేందర్‌రెడ్డి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇవి చదవండి: నారి వారియర్! -
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! అమెరికా బతుకమ్మ ఉయ్యాలో!!
‘‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ... ఏమేమి కాయొప్పునే గౌరమ్మ! తంగేడు పువ్వులో... తంగేడు కాయలో... ఆట చిలుకలు రెండు... పాట చిలుకలు రెండు...’’ ‘‘చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దులగుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మా ఈ వాడలోన...’’ ‘‘ఇలా ఒకటా... రెండా... లెక్కలేనన్ని బతుకమ్మ పాటలు మా నాలుకల మీద నాట్యమాడుతుంటాయి. గ్రామాల్లో గడిచిన బాల్యం జీవితాన్ని నేర్పుతుంది. తెలంగాణ గ్రామాల్లో బాల్యం బతుకమ్మ పాటల రూపంలో సమాజంలో జీవించడాన్ని నేర్పుతుంది. నిరక్షరాస్యులు కూడా ఈ పాటలను లయబద్ధంగా పాడతారు. బతుకమ్మ పాటల సాహిత్యం వాళ్ల నాలుకల మీద ఒదిగిపోయింది. తమకు తెలిసిన చిన్న చిన్న పదాలతో జీవితాన్ని అల్లేశారు గ్రామీణ మహిళలు. మా నాన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్. మా అమ్మమ్మ గారి ఊరు జగిత్యాల జిల్లా, వెలుగుమాట్ల. నా చదువు పుట్టపర్తిలో, సెలవులు అమ్మమ్మ ఊరిలో. దసరా సెలవులు వస్తున్నాయంటే సంతోషం అంతా ఇంతా కాదు. దేశమంతా దేవీ నవరాత్రులు జరుపుకుంటూ ఉంటే మేము బతుకమ్మ వేడుకలు చేసుకుంటాం. గౌరమ్మ అందరి మనసుల్లో కొలువుంటుంది, మాట, పాట, ఆట అన్నీ గౌరమ్మ కోసమే అన్నట్లు ఉంటుందీ వేడుక. ఇంత గొప్ప వేడుకకు దూరమయ్యానని అమెరికా వెళ్లిన తర్వాత కానీ తెలియలేదు. అందుకే అమెరికాలో బతుకమ్మను పేర్చాను’’ అన్నారు దీప్తి మామిడి... కాదు, కాదు, బతుకమ్మ దీప్తి. ‘‘నేను 2007లో యూఎస్‌కి వెళ్లాను. న్యూజెర్సీలో ఉండేవాళ్లం. పెళ్లయి, ఒక బిడ్డకు తల్లిని. భర్త, పాప, ప్రొఫెషన్‌తో రోజులు బిజీగా గడిచిపోయేవి. డబ్బు కూడా బాగా కనిపించేది. కొద్ది నెలల్లోనే... ఏదో మిస్సవుతున్నామనే బెంగ మొదలైంది. వ్యాక్యూమ్ ఏమిటనేది స్పష్టంగా తెలియలేదు, కానీ బాల్యం, సెలవుల్లో బతుకమ్మ వేడుక మరీ మరీ గుర్తుకు వస్తుండేది. బతుకమ్మ కోసం ఇండియాకి రావడం కుదరకపోతే నేనున్న చోటే బతుకమ్మ వేడుక చేసుకోవచ్చు కదా! అనిపించింది. అలా అక్కడున్న తెలుగువాళ్లను ఆహ్వానించి బతుకమ్మ వేడుక చేశాను. మొదటి ఏడాది పదిహేను మందికి లోపే... పదేళ్లు దాటేసరికి ఆ నంబరు ఐదారు వందలకు చేరింది. అందరికీ భోజనాలు మా ఇంట్లోనే. ఏటా ఒక పెళ్లి చేసినట్లు ఉండేది. ఇండియా నుంచి తెలంగాణ పిండివంటలను తెప్పించుకోవడం, ఆ రోజు వండుకోవాల్సినవన్నీ మా ఇంట్లోనే వండడం, ఆ వంటల కోసం దినుసులను సేకరించడం, స్నేహితులందరినీ ఆహ్వానించడం, పూలు తెచ్చుకుని ఒక్కొక్కటీ పేర్చడం... ఇలా ప్రతి ఘట్టాన్నీ ఎంజాయ్ చేసేదాన్ని. ‘ఏటా అంతంత ఖర్చు ఎందుకు’ అని స్నేహితులు అనేవాళ్లే కానీ మా వారు ఒక్కసారి కూడా అడగలేదు. నా సంతోషం కోసం చేసుకుంటున్న ఖర్చు అని అర్థం చేసుకునేవారు. ఎప్పుడూ అన్నం ఉంటుంది! యూఎస్‌లో మా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడూ అన్నం, కూరలుండేవి. మా కన్సల్టెన్సీకి వచ్చిన వాళ్లు, ముఖ్యంగా బ్యాచిలర్స్ కోసం ఈ ఏర్పాటు. మేము యూఎస్‌లో అడుగుపెట్టిన కొన్నాళ్లకే రెసిషన్ వచ్చింది. అప్పుడు పడిన ఇబ్బందులు నాకిప్పటికీ గుర్తే. అందుకే యూఎస్‌కి వచ్చిన కుర్రాళ్లు మన తెలుగింటి రుచులతో భోజనం చేస్తారు కదా! అనుకునేదాన్ని. షడ్రసోపేతమైన భోజనం అని కాదు కానీ కనీసం పప్పుచారయినా ఉండేది. ఈ అలవాటుకు బీజం పడింది కూడా అమ్మమ్మ దగ్గరే. అమ్మమ్మ పెద్ద పాత్రలో అంబలి చేయించి ఇంటి ముందు పెట్టేది. చాలామంది పొలం పనులకు వెళ్తూ దారిలో మా ఇంటి ముందాగి అంబలి తాగి, ఆవకాయ ముక్క చప్పరించుకుంటూ వెళ్లేవాళ్లు. ఆకలి తీర్చడంలో, అవసరమైన వాళ్లకు సహాయం చేయడంలో ఉండే సంతృప్తి మరి దేనిలోనూ ఉండదు. మా డ్రైవర్ ఇతర పనివాళ్ల పిల్లల చదువు కోసం ఫీజులు కట్టినప్పుడు మరొకరి జీవితానికి మనవంతు సహాయం చేస్తున్నామనే భావన సంతృప్తినిస్తుంది. అవకాశం లేనప్పుడు ఎలాగూ చేయలేం, వెసులుబాటు ఉన్నప్పుడయినా చేసి తీరాలి. మన ఎదుగుదల కోసం సమాజం నుంచి మనం తీసుకుంటాం, మనం ఎదిగిన తరవాత మరొకరి ఎదుగుదల కోసం ఆపన్న హస్తాన్ని అందించి తీరాలనేది పుట్టపర్తి స్కూల్ నేర్పించిన వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. మా అమ్మ ఫ్రెండ్ లీలా ఆంటీ కూడా బతుకమ్మ పండుగను బాగా చేసేవారు. ఆమె ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్. గునుగుపూలు వాటర్బాడీస్ని శుద్ధి చేస్తాయని చెప్తూ ఈ పండుగ వెనుక ఉన్న పర్యావరణ పరిరక్షణను వివరించేవారు. ఇవన్నీ మైండ్‌లో ఒక్కటొక్కటిగా అల్లుకుంటూ ఇలా దండ కూర్చుకున్నాయి. బతుకమ్మ దీప్తినయ్యాను! యూఎస్ జీవితం నాకు చాలా నేర్పించిందనే చెప్పాలి. అక్కడ అన్నీ ఉంటాయి కానీ ఏదో లేదనే వెలితి. రొటీన్ లైఫ్‌ని జాయ్‌ఫుల్‌గా మలుచుకోవడానికి నాకు బతుకమ్మ ఒక దారి చూపించింది. అప్పట్లో యూఎస్ ఇంతగా ఇండియనైజ్ కాలేదు. ఇప్పుడైతే న్యూజెర్సీ, డాలస్తోపాటు కొన్ని నగరాలు పూర్తిగా భారతీయలవే అన్నట్లు, తెలుగువాళ్ల ఊళ్లే అన్నట్లయిపోయాయి. మన పండుగలు ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు. నేను మొదలుపెట్టడంతో నేను బతుకమ్మ దీప్తినయ్యాను. ‘దీప్తి మామిడి’గా అమెరికాలో అడుగుపెట్టాను. మూడేళ్ల కిందట తిరిగి వచ్చేటప్పటికి నా పేరు ‘బతుకమ్మ దీప్తి’గా మారింది. బతుకమ్మ పాటకు మ్యూజిక్ మొదలైతే చాలు... ఒళ్లు పులకించిపోతుంది. పూనకం వచ్చినట్లే ఉంటుంది. మీతో మాట్లాడుతున్నా సరే... బతుకమ్మ ఫీల్ వచ్చేస్తుంది. చూడండి గూజ్బంప్స్ వచ్చేశాయి’’ అని చేతులను చూపించారు బతుకమ్మ దీప్తి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పట్టుదారంతో జీవితాన్ని అల్లుకుంది
నేనేంటి? నాకంటూ చెప్పుకోవడానికి ఏమీ లేదా? ఈ ప్రశ్నలు పావనిని వెంటాడాయి... వేధించాయి. చదువుంది... పెద్ద ఉద్యోగం చేయాలనే ఆకాంక్ష ఉంది. అబ్దుల్ కలామ్ చెప్పినట్లు పెద్ద కలలు కన్నదామె. ఆ కలలను నిజం చేసుకోవడానికి తగినట్లు శ్రమించింది కూడా. జీవితం మాత్రం... ఆమె చదవని సిలబస్‌తో పరీక్ష పెట్టింది. ఆ పరీక్షను సహనంతో ఎదుర్కొన్నది... ఉత్తీర్ణత సాధించింది. ఇక... తనను తాను నిరూపించుకోవాలనుంది. క్రియేటివిటీ ఆమెకు తోడుగా వచ్చి వెంట నిలిచింది. ఆమె ఇప్పుడు పట్టుదారంతో చక్కటి ఆభరణాలల్లుతోంది. పావని కోరెం... వరంగల్ జిల్లా, హన్మకొండలో పుట్టింది. బయో టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. ఇంకా చదవాలని, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని అనుకుంది. ఆమె ఆలోచనలకు భర్త అండగా నిలిచారు. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో కాపురం, ఉస్మానియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో చేరింది. బయో ఇన్ఫర్మాటిక్స్లో పీజీ పూర్తయింది. పోటీ పరీక్షల కోసం భార్యాభర్తలిద్దరూ కలిసి కోచింగ్కెళ్లారు. పరీక్షలకు సిద్ధమయ్యేలోపు జీవితం మరో పరీక్ష పెట్టింది. కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి చిన్న సందేహం. ఆ సందేహాన్ని నిజం చేయడానికా అన్నట్టు పుట్టగానే బిడ్డ ఏడవలేదు. నెలరోజులు హాస్పిటల్లోనే ఉంచి చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చారు. స్పెషల్ కిడ్ కావచ్చనే మరో సందేహం. క్షణక్షణం బిడ్డ సంరక్షణలోనే గడిచిపోయింది. అనుక్షణం బిడ్డ ఎదుగుదల కోసం శ్రమించింది. తల్లిగా కఠోరయజ్ఞమే చేసింది. ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీలతో బాబుని మెయిన్‌స్ట్రీమ్‌లోకి తీసుకు రాగలిగింది. ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి తాను ఆశ్రయించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నుంచి తనను తాను తీర్చిదిద్దుకుంది. తనను తాను నిరూపించుకోవాలనే తపనతో పని చేసింది. ఇప్పుడామె తన సృజనాత్మకతతో గుర్తింపు పొందుతోంది. తన జీవితంలో దశాబ్దంపా టు సాగిన కీలక పరిణామాలను ఆమె సాక్షితో పంచుకున్నారు. ఊహించని శరాఘాతం! ‘‘మా పెళ్లి 2009లో జరిగింది. బాబు ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) సమస్య ఉందని తెలిసింది. బోర్లా పడడం, పా కడం, కూర్చోవడం, నడవడం వంటివన్నీ కొంత ఆలస్యంగా చేశాడు. నార్మల్ కిడ్ చేయాల్సిన సమయానికంటే ఎంత ఆలస్యమవుతోందా అని క్యాలెండర్ చెక్ చేసుకుంటూ... కంటికి రెప్పలా కాపా డుకుంటూ వచ్చాను. ఇప్పుడు దాదాపుగా నార్మల్ కిడ్ అయ్యాడు. కానీ చిన్నప్పుడు రోజూ ఆందోళనే. బరువు తక్కువగా పుట్టడంతో ఇమ్యూనిటీ తక్కువగా ఉండేది. తరచూ జలుబు, జ్వరం వస్తుండేవి. అప్పట్లో మా వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరులో ఉద్యోగం. కర్నాటకలో ఓ చిన్న గ్రామంలో పోస్టింగ్. అక్కడ వైద్య సదుపా యాలు తక్కువ. ప్రతినిత్యం భయంభయంగా గడిచేది. రెండున్నరేళ్లకే బాబుకి హెర్నియా ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. స్టేట్ బ్యాంకుకు అనేక అనుబంధ బ్యాంకుల్ని అనుసంధానం చేయడం కూడా అప్పుడే జరిగింది. ఎస్బీఐకి మారి హైదరాబాద్‌కి వచ్చేశాం. మన ్రపా ంతానికి వచ్చిన తర్వాత నన్ను వెంటాడిన భయం వదిలిపోయింది. బాబుకి మంచి వైద్యం చేయించగలమనే ధైర్యం వచ్చింది. ట్రీట్మెంట్ థెరపీలు జరిగేకొద్దీ బాబులో మెరుగుదల స్పష్టంగా కనిపిస్తుండేది. డిప్రెషన్ నుంచి మెల్లగా బయటపడ్డాను. రోజులు ఆశాజనకంగా గడుస్తున్నప్పటికీ నాలో ఏదో వెలితి ఉండేది. సృజనతో సాంత్వన నన్ను నేను ఏదో ఒక వ్యాపకంలో నిమగ్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేదాన్ని. యూ ట్యూబ్ చూసి నేర్చుకున్న పేపర్ క్విల్లింగ్ మంచి సాంత్వననిచ్చింది. బాబుకి ఫిజియోథెరపీ చేయించే ట్రైనర్ నేను క్విల్లింగ్‌లో చేసిన పూలు, బొమ్మలను చూసి, చాలా బాగున్నాయని తీసుకెళ్లారు. వాటిని ఆ రోజే వాళ్ల హాస్టల్ స్టూడెంట్స్ కొనుక్కున్నారు. అప్పుడే మా ఫ్రెండ్ పట్టు దారంతో ఆభరణాలు తయారు చేయమని చెప్పింది. అలా నా లైఫ్ కొత్త మలుపు తీసుకుంది. హాబీగా మొదలు పెట్టిన యాక్టివిటీ కాస్తా నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చింది. తెలిసిన వాళ్ల నుంచి నా సృజనాత్మకత ఎల్లలు దాటింది. దుబాయ్, యూఎస్, యూకే, చైనా ల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఫేస్బుక్ బిజినెస్ పేజ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జస్ట్ డయల్, మీ షోలలో నా అల్లికలు విపరీతంగా అమ్ముడవుతున్నాయి. రిటర్న్ గిఫ్ట్‌లు ఇవ్వడానికి బల్క్ ఆర్డర్లు వస్తుంటాయి. అలాంటప్పుడు రాత్రంతా పని చేస్తుంటాను. ముగ్గురు అమ్మాయిలకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. మేము తయారు చేసిన ఉత్పత్తులను పికప్ బాయ్స్ వచ్చి తీసుకెళ్తారు. బాబును చూసుకుంటూ నా యాక్టివిటీని కొనసాగిస్తున్నాను. మొదట్లో అయితే మెటీరియల్ కోసం వెతుక్కుంటూ బాబును బండి మీద కూర్చోబెట్టుకుని బేగం పేట నుంచి బేగం బజార్‌కు వెళ్లేదాన్ని. ఇప్పుడైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే వస్తుంది. కానీ బాబుకు ఇంకా నా అవసరం ఉంది. నేను దగ్గరుండి చూసుకుంటే మెరుగ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడిలా కొనసాగిస్తున్నాను. నాకు నిజంగా ఆశ్యర్యమే! నా లైఫ్ జర్నీలో నాకు ఆశ్చర్యం, సంతోషం కలిగించే విషయం ఏమిటంటే... నన్ను రోల్‌మోడల్‌గా చూస్తూ నా నుంచి స్ఫూర్తి ΄ పొందుతున్న వాళ్లు ఉన్నారనే విషయం. అంతా బాగున్న వాళ్లు చాలామంది ఏమీ చేయకుండా ఉంటున్నారు. ఏదైనా సమస్య రాగానే దిగాలు పడిపోయి జీవితాన్ని నాలుగ్గోడలకు పరిమితం చేసుకునే వాళ్లున్నారు. కానీ... ‘సమస్యకు పరిష్కారం వెతుక్కుని, తనకు ఒక గుర్తింపును తెచ్చుకుంది’ అని ప్రశంసిస్తున్నారు. మా వాళ్లు మాత్రం మొదట్లో ‘నీకు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, పిల్లాడిని చూసుకుంటూ ప్రశాంతంగా ఉండు. ఇన్ని ఒత్తిడులు పెట్టుకోవద్ద’ని కోప్పడ్డారు. కానీ ఈ పని నాకు ఒత్తిడిని తగ్గిస్తోందని తెలిసి మా వాళ్లు కూడా సంతోషంగా ఉన్నారు. నేను ఎంతో సంపా దిస్తున్నానని కాదు, కానీ నేను ఎటువంటి ఉనికి లేకుండా లక్షల్లో ఒకరిలా ఉండిపోకుండా, ఈ పనివల్ల వందల్లో ఒకరిగా ఓ గుర్తింపు తెచ్చుకోగలిగాను’’ అంటున్నప్పుడు పా వని కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. – వాకా మంజులారెడ్డి , సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ప్రాణం నిలిపే రక్తపు బొట్టు
రక్తపు బొట్టు... ప్రాణాన్ని నిలబెడుతుంది. ఆ రక్తం సమయానికి అందకపోతే... ప్రాణాన్ని నిలపగలిగే డాక్టర్ కూడా అచేతనం కావాల్సిందే. శిబి చక్రవర్తిలా దేహాన్ని కోసి ఇవ్వాల్సిన పనిలేదు. కొంత రక్తాన్ని పంచి మరొక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. రక్తదానానికి మగవాళ్లతోపాటు మహిళలూ ముందుకొస్తున్నారు. మహిళలు రక్తదానం చేయరాదనే అపోహను తుడిచేస్తున్నారు. రక్తదానం చేస్తూ... సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ ఉన్న ఓ మెడికో... ఓ సోషల్ యాక్టివిస్ట్‌ల పరిచయం ఇది. నాన్న మాట... యాభై సార్లు రక్తదానం చేయాలనే సంకల్పం కూడా మా నాన్న చెప్పిన మాటే. రక్తదానం చేయగలిగింది ఇరవై నుంచి అరవై ఏళ్ల మధ్యలోనే. అరవై తర్వాత రక్తదానం చేయడానికి ఆరోగ్యరీత్యా నిబంధనలు ఒప్పుకోవు. వీటికి తోడు ఆడవాళ్లకు ప్రసవాలు, పిల్లల పెంపకంలో మరో పదేళ్లు గడిచిపోతాయి. 35 నుంచి విధిగా రక్తదానం చేస్తూ యాభై సార్లు రక్తం ఇవ్వాలనే నియమాన్ని పెట్టుకోవాలనేవారు. ఆ లక్ష్యంతోనే యాభై రక్తదానాలు పూర్తి చేశాను. ఆ తర్వాత మా అమ్మకోసం మా తమ్ముడితోపాటు నేనూ రక్తం ఇచ్చాను కానీ దానిని ఈ లెక్కలో చెప్పుకోను. అమ్మరుణం ఏమిచ్చినా తీరేది కాదు. – గొట్టిపాటి నిర్మలమ్మ, రక్తదాత మా పుట్టిల్లు నెల్లూరు నగరం (ఆంధ్రప్రదేశ్). మా చిన్నాన్న జయరామనాయుడు డాక్టర్. ‘రక్తం అంది ఉంటే ప్రాణాన్ని కాపాడగలిగేవాళ్లం’ అని అనేకసార్లు ఆవేదన చెందేవారు. ఇంట్లో అందరినీ రక్తదానం పట్ల చైతన్యవంతం చేశారాయన. దాంతో మా నాన్న నెల్లూరులో రెడ్‌క్రాస్, బ్లడ్‌బ్యాంకు స్థాపించారు. ఇంట్లో అందరం రక్తదానం చేశాం. అలా నేను తొలిసారి బ్లడ్ డొనేట్ చేసినప్పటికి నా వయసు 20. మామగారి ప్రోత్సాహం పెళ్లికి ముందు నెల్లూరులో మొదలైన రక్తదాన ఉద్యమాన్ని పెళ్లయి అత్తగారింటికి నెల్లూరు జిల్లా, కావలి పట్టణానికి వెళ్లిన తర్వాత కూడా కొనసాగించాను. నలభై ఏళ్ల కిందట కావలి రక్తదాతల్లో మహిళలు దాదాపు పదిహేను మంది ఉండేవారు. రెడ్‌క్రాస్ సమావేశాలు మా ఇంట్లోనే జరిగేవి. అనేక క్యాంపులు కూడా నిర్వహించేవాళ్లం. కాలేజ్ స్టూడెంట్స్ ఉత్సాహంగా ముందుకు వచ్చేవాళ్లు. కానీ అలా ముందుకొచ్చిన అమ్మాయిల్లో బ్లడ్ తగినంత ఉంటే కదా! వందమంది ఆడపిల్లలు వస్తే రక్తదానం చేయగలిగిన ఎలిజిబులిటీ ఉన్న వాళ్లు ఆరేడుకు మించేవాళ్లు కాదు. అండర్ వెయిట్, హిమోగ్లోబిన్ శాతం తగినంత లేకపోవడం ఎక్కువగా కనిపించేది. అరుదైన గ్రూపుల వాళ్ల నుంచి కూడా బ్లడ్ క్యాంపుల్లో సేకరించేవాళ్లం కాదు. వాళ్లకు పరీక్షలు చేసి లిస్ట్ తయారు చేసుకుని ఎమర్జెన్సీ కండిషన్లో పిలుస్తామని చెప్పేవాళ్లం. అప్పట్లో బ్యాంకుల్లేవు నా వయసు 63. ఈ వయసులో కూడా ఇంత చురుగ్గా, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానంటే అందుకు రక్తదానమే కారణం. ఇప్పుడు బ్లడ్ డొనేషన్‌కు సౌకర్యాలు బాగున్నాయి. కానీ మొదట్లో బ్యాంకులు ఉండేవి కాదు. మా మామగారు మాజీ ఎమ్మెల్యే సుబ్బానాయుడు ప్రోత్సాహంతో మా బంధువులు ముందుకొచ్చి కావలి హాస్పిటల్లో రక్తదానం కోసం ఒక గది కట్టించారు. యాక్సిడెంట్ కేస్ రాగానే హాస్పిటల్ నుంచి మాకు ఫోన్ వచ్చేది. అప్పటికప్పుడు మా డోనర్స్‌లో పేషెంట్ బ్లడ్ గ్రూపుతో మ్యాచ్ అయ్యే డోనర్ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లు వెళ్లి రక్తం ఇచ్చేవాళ్లం. బ్లడ్ డోనర్స్ అంతా ఆరోగ్యంగా, అంటువ్యాధుల పట్ల విచక్షణతో ఉండాలి. చిన్నపాటి అనారోగ్యాలు వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలన్నీ చేయించుకుని రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అవసరాన్ని బట్టి ఏడాదికి మూడు–నాలుగుసార్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా అమ్మాయి దగ్గరకు యూఎస్‌కి వెళ్లినప్పుడు అక్కడ కూడా ఓ సారి బ్లడ్ డొనేట్ చేశాను. అది అత్యవసర స్థితి కాదు, కేవలం యూఎస్‌లోనూ రక్తమిచ్చాననే సరదా కోసం చేసిన పని. మొత్తానికి అరవై ఏళ్లు నిండేలోపు యాభైసార్లు రక్తం ఇచ్చి మా నాన్న మాటను నెగ్గించాను. ఈ క్రమంలో ఎక్కువసార్లు రక్తదానం చేసిన మహిళగా గుర్తింపు వచ్చింది. గవర్నర్ అభినందించారు అప్పటి గవర్నర్ రంగరాజన్, ఆయన సతీమణి హరిప్రియా రంగరాజన్ దంపతులు 2000వ సంవత్సరంలో కావలికి వచ్చారు. ఆమె రెడ్‌క్రాస్‌లో చురుకైన సభ్యురాలు కూడా. రాజ్‌భవన్‌లో జరిగిన రెడ్‌క్రాస్ కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొన్నాను. నన్ను కావలిలో చూసి ‘ఈ పురస్కారం అందుకుంటున్న నిర్మలవి నువ్వేనా’ అని ఆత్మీయంగా పలకరించారు. మహిళలకు మార్గదర్శి అంటూ గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ జ్ఞాపకాలన్నీ నా మనసులో ఉన్నాయి కానీ జ్ఞాపికలుగా దాచుకోవాలనే ఆలోచన కూడా ఉండేది కాదు. నా జీవితం అంతా ఎదురీతలోనే గడిచింది. ఆ ఎదురీతల్లో ఇవేవీ ప్రాధాన్యతాంశాలుగా కనిపించలేదప్పట్లో. మొత్తానికి మా చిన్నాన్న, నాన్న, మామగారు అందరూ బ్లడ్ డొనేషన్ పట్ల చైతన్యవంతంగా ఉండడంతో నాకు ఇంతకాలం ఈ సర్వీస్‌లో కొనసాగడం సాధ్యమైంది. ఇది నాకు సంతోషాన్నిచ్చే కార్యక్రమం కావడంతో ఇంట్లో ఎవరూ అడ్డుచెప్పేవాళ్లు కాదు’’ అని తన రక్తదాన ప్రస్థానాన్ని వివరించారు సోషల్ యాక్టివిస్ట్ నిర్మలమ్మ. రక్తదానం చేద్దాం! – శృతి కోట, రక్తదాత, వైద్యవిద్యార్థిని నేను పద్దెనిమిదేళ్ల వయసు నుంచి బ్లడ్ డొనేట్ చేస్తున్నాను. నా హిమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షించుకుంటూ మూడు – నాలుగు నెలలకోసారి ఇచ్చేటట్లు చూసుకుంటున్నాను. ఈ మధ్య హెపటైటిస్ వ్యాక్సిన్ కారణంగా కొంత విరామం వచ్చింది. మా నాన్న సంపత్‌కుమార్ బ్లడ్ డోనర్ కావడంతో నాకు చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. రక్తదానానికి మహిళలు, మగవాళ్లు అనే తేడా పాటించక్కర్లేదు. అయితే భారతీయ మహిళల్లో రక్తహీనత ఎక్కువ మందిలో ఉంటోంది కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ రక్తదానం చేయవచ్చు. హిమోగ్లోబిన్ పన్నెండు శాతానికి తగ్గకూడదు. డయాబెటిస్, పీసీఓడీ, థైరాయిడ్ సమస్యలతోపాటు లాస్ట్ పీరియడ్‌లో రక్తస్రావం స్థాయులను దృష్టిలో ఉంచుకుని రక్తదానం చేయవచ్చు. పాలిచ్చే తల్లులు రక్తదానం చేయకూడదు. మెనోపాజ్ దశలో ఉన్న వాళ్లు డాక్టర్ సూచన మేరకు ఇవ్వవచ్చు. ఇక మహిళలు, మగవాళ్లు అందరూ రక్తదానం చేయడానికి ముందు చెక్‌లిస్ట్ ప్రకారం అన్ని పరీక్షలు చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరించుకోవాలి. ఎయిడ్స్, హెపటైటిస్, మలేరియా, సమీప గతంలో ఏవైనా ఇన్ఫెక్షన్లకు గురవడం, వ్యాక్సిన్లు వేయించుకోవడం, ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడుతూ ఉండడం వంటి కండిషన్స్‌కు స్క్రీనింగ్ జరిగిన తర్వాత మాత్రమే రక్తాన్ని సేకరిస్తారు. రక్తం ఇవ్వాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ తమ దేహ సామర్థ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. బ్లడ్ డోనార్స్ మంచి ఆహారం, తగినంత నీరు తీసుకోవడంతోపాటు, క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తుండాలి. రక్తదానం చేస్తుంటే ఎప్పటికప్పుడు కొత్త కణాలు పుట్టుకొస్తూ దేహం ఆరోగ్యంగా ఉంటుంది. ‘రక్తాన్ని ఇవ్వండి, ప్రాణాన్ని కాపాడండి’ అనేదే మెడికోగా నా సందేశం. ప్రమాదంలో గాయపడిన తొలి గంటను గోల్డెన్ అవర్ అంటాం. ఆ గంటలో వైద్య చికిత్స జరగడం ఎంత అవసరమో వైద్యానికి రక్తం అందుబాటులో ఉండడమూ అంతే అవసరం. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అవకాశాలను సృష్టించుకోవాలి!
‘డ్రీమ్ బిగ్, ఫాలో యువర్ పాషన్, వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్’... నాలుగు మాటలు. ఈ నాలుగు మాటలే వీణాగుండవెల్లిని విజేతగా నిలబెట్టాయి. ‘ఇలా ముందుకెళ్లమని నాకెవ్వరూ చెప్పలేదు. స్వీయశోధన తో తెలుసుకున్న సత్యాలివి. కొత్తతరానికి నేను చెప్పగలిగిన సూచన ఇది. నేను ఆచరించిన మార్గమే నా సందేశం’ అన్నారామె. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చేసిన వీణ ఆ తర్వాత యూఎస్ వెళ్లి శాంటాక్లారా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. యూఎస్‌లోని సిలికాన్ వ్యాలీ కేంద్రంగా ఇమాజియా సాఫ్ట్వేర్ కంపెనీని నిర్వహిస్తున్న వీణ ఇటీవల హైదరాబాద్‌కి వచ్చినప్పుడు సాంకేతిక రంగంలో విజయవంతమైన తన జర్నీని ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘యూఎస్‌లో నేను కానన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, సిస్కో సిస్టమ్స్‌లో పని చేసిన తర్వాత టెక్నాలజీ రంగంలో సొంత కంపెనీ ప్రారంభించాను. ఇంటర్నెట్ మొదలైన రోజులు, అలాగే వైటూకే క్రైసిస్ ఎదురైన రోజులు కూడా. ఆ సమస్యలను అధిగమిస్తూ ఇంటర్నెట్ ఆధారిత ఫైనాన్స్ అప్లికేషన్స్ సర్వీసులందించింది మా సంస్థ. ఈ టెక్నాలజీకి భవిష్యత్తు ఉందని నమ్మాను, నా నమ్మకమే పునాదిగా ముందుకెళ్లాను. ఒక దశ తరవాత కంపెనీ కార్యకలాపా లను విస్తరించాలనే ఉద్దేశంతో వెంచర్ క్యాపిటల్ ద్వారా ఫండ్ రైజింగ్ మొదలుపెట్టాను. మా కంపెనీ సేవల పట్ల నమ్మకం కలిగినప్పటికీ పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందడుగు వేయలేక΄ోయారు. అందుకు కారణం మహిళను కావడమే. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను కాన్ఫిడెంట్‌గా ముందుకెళ్తున్నాను. ఆ మేరకు పెట్టుబడి పెట్టేవాళ్లలో విశ్వాసం కలిగించడం కొంచెం కష్టమైందనే చెప్పాలి. కష్టం అని వదిలిన వాళ్ల వెంట సక్సెస్ రాదు. కష్టాన్ని జయించడమే విజయానికి తొలిమెట్టు. మొత్తానికి నాకున్న సాంకేతిక పరిజ్ఞానం పట్ల విశ్వాసం కలిగిన తరవాత పెట్టుబడులు పెట్టారు. కానీ ఆ తర్వాత ‘మీ కంపెనీలో మా ప్రతినిధి సీఈవో హోదాలో ఉంటారు. మీరు టెక్నాలజీ పా ర్ట్ చూసుకోండి’ అన్నారు. ఆ షరతును అంగీకరించాల్సి వచ్చింది. కానీ ఆ ప్రయత్నం విజయవంతం కాలేదు. టాప్‌లో ఉన్న మా కంపెనీ ఒడిదొడుకులకు లోనయింది. తిరిగి టాప్‌లో నిలపడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ముందుచూపు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వినియోగం ఇప్పుడు బాగా ఎక్కువైంది. మేము 2015లోప్రోడక్ట్ బిల్డ్ చేశాం. సాంకేతిక రంగానికి ఏఐని పరిచయం చేశామని చెప్పాలి. ఆ తర్వాత మూడేళ్లకు కృత్రిమ మేధ ఆధారిత ఆర్థిక సహకారాన్ని డిజిటల్‌గా అందించడం మొదలుపెట్టాం. మరో రెండేళ్లలో ఫైనాన్షియల్ డాక్యుమెంట్లను చదివి, ప్రాజెస్ చేయగలిగిన తొలి ఏఐ ఇంజన్‌ను తీసుకొచ్చాం. ఈ రంగంలో మేమిచ్చిన డైరెక్షన్‌ను ముందుచూపున్న కంపెనీలు అందుకున్నాయి. మేము ఏఐ ఆధారిత డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం. ఆర్థిక లావాదేవీలు వేగంగా జరుగుతుంటే వ్యాపా రం కూడా అంతే వేగంగా జరుగుతుంది. ఓటూసీ (ఆర్డర్ టూ కస్టమర్) ్రపా సెస్‌ని మా కంపెనీ చేస్తుంది. తొంభై దేశాల్లో, 25 భాషల్లో మా సేవలందింస్తున్నాం. భవిష్యత్తు దర్శనం విజేత కావాలంటే భవిష్యత్తును దర్శించగలగాలి. ఆలోచనను ఆచరణలో పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకూడదు. అలాగే అవకాశాలను అందిపుచ్చుకోవడమనేది పా త మాట. అవకాశాలను సృష్టించుకోవాలనేది ఈ జనరేషన్ అనుసరించాల్సిన ఫార్ములా. హెన్రీ ఫోర్డ్ ఒక ఇంజనీర్‌గా మిగిలిపోలేదు. తన ఆలోచనతో రవాణాకు యంత్రంతో నడిచే కారు అనే వాహనానికి రూపకల్పన చేసి పా రిశ్రామికవేత్త అయ్యాడు. గుర్రం మీద ప్రయాణించే కాలాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. మన ఆలోచన సమాజానికంటే ముందుండాలి. అది శతాబ్దం కావచ్చు, దశాబ్దం కావచ్చు. ఆ సమయానికి సమాజం మన ఆలోచనను స్వాగతించవచ్చు లేదా విమర్శించనూ వచ్చు. కానీ దానిని నిరూపించిన తరవాత మన వెంట నడిచి తీరుతుంది’’ అన్నారు వీణా గుండవెల్లి. ఆమె తన విజయాలనే పా ఠ్యాంశాలుగా కాలిఫోర్నియా యూనివర్సిటీలో బోధిస్తున్నారు. అల్పాదాయ వర్గాల వారికి సహాయం చేయడానికి టచ్ ఏ లైఫ్ పేరుతో ఒక ఫౌండేషన్ ద్వారా సేవలందిస్తున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ, సామాజిక ప్రయోజనం చేకూరే స్టార్టప్‌లతో ముందుకు వచ్చే యువతకు చేయూతనిస్తున్నారు. ఈ ప్రయాణంలో ఆమెను వరించిన అవార్డుల ప్రస్తావనకు ఆమె ‘ఎన్నని చెప్పాలి, అయినా ఆ లెక్క ఇప్పుడెందుకు’ అన్నారు నవ్వుతూ. – వాకా మంజులారెడ్డి -
గుస్సాడి గుండెచప్పుడు పద్మశ్రీ కనకరాజు
నెమలీకల టోపీ ధరించి కోలాహలంగా ఆడతారు. రేలా... రే... రేలా అంటూ గొంతు కలిపి పా డతారు. ప్రకృతి గురువు నేర్పిన పా ఠాలకు ఆనవాళ్లు వారు. మొన్నటి వరకు అడవి తల్లి ఒడిలో దాగిన కళారూపా లివన్నీ. నేడవి అడవి గోడలు దాటి నగరాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. దేశం ఎల్లలు కూడా దాటే వరకు గుస్సాడి ఆడాలంటున్నారు... పద్మశ్రీ కనకరాజు. కనకరాజు పేరులో ఇంటి పేరు కనక, ఆయన పేరు రాజు. ఇన్ని వివరాలు మాకక్కర్లేదు, గుస్సాడి నృత్యం చేస్తాడు, మా అందరి చేత అడుగు వేయిస్తాడు కాబట్టి ఆయన మాకు ‘గుస్సాడి రాజు’ అంటారు స్థానికులు. ఆయన పద్మశ్రీ అందుకున్నప్పటి నుంచి నాగరక ప్రపంచం ఆయన మీద దృష్టి కేంద్రీకరించింది. కనకరాజు అని ఇంటిపేరుతో కలిసి వ్యవహారంలోకి వచ్చారు. అయినప్పటికీ వారి గూడేలకు వెళ్లి కనకరాజు అని అడిగితే వెంటనే గుర్తుపట్టరు. గుస్సాడి కనకరాజు అంటే టక్కున చెప్పేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మర్హలి ఆయన ఊరు. ప్రస్తుతం కుమ్రుం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, అంతేకాదు, కుమ్రుం భీమ్ వారసులు కూడా. ఆదిలాబాద్‌లో విస్తరించిన గోంద్ తెగకు చెందిన వాళ్లందరూ భీమ్ వారసులుగా గర్వంగా భావిస్తారు. ఎనభై ఏళ్ల కనకరాజు... తండ్రి చెప్పిన మాట కోసం గుస్సాడి నృత్యం పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేశారు. గుస్సాడితో మమేకమైన తన జీవితానుభవాలను సాక్షితో పంచుకున్నారాయన. ఆట... పా ట... జీవితం! ‘‘మా ఆదివాసీల జీవనంలో ప్రకృతి, నృత్యం, గానం కలగలిసి పోయి ఉంటాయి. బిడ్డ పుడితే పా ట, పెళ్లి వేడుకకీ పా ట, అంతేకాదు... మనిషి పోయినా పా ట రూపంలో ఆ వ్యక్తితో మా అనుబంధాన్ని గుర్తు చేసుకుంటాం. దండారీ ఉత్సవాలంటే మాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. మగపిల్లలకు నృత్యం, ఆడపిల్లలకు రేలా పా ట చిన్నప్పటి నుంచే నేర్పిస్తాం. గుస్సాడి నృత్యంలో అడుగులు వేయడం ఎప్పుడు మొదలైందో నాకు గుర్తు లేదు. కానీ మా నాన్న ఒక మాట చెప్పేవారు. ‘ఈ నృత్యమే మనకు దైవం. ‘ఈ నృత్యాన్ని మరువద్దు. తరతరాలుగా మోసుకొస్తున్నాం. దీన్ని కాపా డుకుంటేనే దేవుడు మనల్ని కాపా డుతాడు’ అని చెప్పేవాడు. ఆ మాట నాలో నాటుకుపోయింది. నాకు వయసొచ్చినప్పటి నుంచి నృత్యంలో తొలి ఆటగాడిగా అడుగులు వేస్తుండేవాణ్ని. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు నివసించే రెండువేల గూడేలకూ నేను తెలిసిపోయాను. గణతంత్ర వేడుక గణతంత్ర వేడుకల్లో మా ప్రాచీన వారసత్వ కళ అయిన గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించే అవకాశం నాకు 1982లో వచ్చింది. అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి మా గుస్సాడి టోపీ పెట్టించి, గజ్జెలు కట్టించాం. ఆమె మాతో అడుగులు వేసింది. ఆ తర్వాత ఓసారి అబ్దుల్ కలామ్ కూడా మాతో అడుగులు వేశారు. హైదరాబాద్‌లో ఎన్ని ప్రదర్శనలిచ్చామో లెక్కేలేదు. ఢిల్లీలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో కూడా మా గుస్సాడిని ప్రదర్శించాం. మరో పది దఫాలు యువతతో చేయించాం. నాయన మాట మీద గుస్సాడి కోసం బతికినందుకే మా దేవుడు మెచ్చి గొప్ప వాళ్లకిచ్చే పద్మశ్రీని ఇప్పించాడనుకుంటున్నా. నెమలీకల టోపీ మా నృత్యం సాధన చేయడమే కాదు, టోపీ, దుస్తులు, గజ్జెలు అన్నీ ప్రత్యేకమే. వాటిని తయారు చేయడానికి చాలా నైపుణ్యం ఉండాలి. పెద్ద టోపీకి రెండు వేల పింఛాలుంటాయి. మా ఇళ్లలో వాటిని భద్రపరుచుకోవడం పెద్ద పని. మా ముత్తాతలు ధరించిన టోపీ ఇంకా నేను ధరిస్తూనే ఉన్నాను. కొత్తవాళ్ల కోసం టోపీలు తయారు చేస్తున్నాం. పెద్ద టోపీ, దుస్తులతోపా టు మొత్తం వేషానికి ఇరవై వేల రూపా యలవుతాయి. మా ఆదివాసీ వ్యక్తి తుకారామ్ సాబ్ కలెక్టర్ అయిన తరవాత ఈ నృత్యానికి ఇంకా కొన్ని చేర్పులు చేసి బాగా మంచిగా చేశారు. పద్మశ్రీ వచ్చిన తర్వాత ఐటీడీఏ ఆఫీసర్లు గుస్సాడి నృత్యం నేర్పించడానికి వందకు పైగా బడులు పెట్టారు. ఒక్కో బడిలో రెండు– మూడు వందల మంది నేర్చుకుంటున్నారు. నేను పెద్ద మాస్టర్ (చీఫ్ డాన్స్ మాస్టర్)ని. గుస్సాడి, రేలా పా ట నేర్పించడానికి 30 మందిని ప్రత్యేకంగా తయారు చేశాను. మరో రెండు వందల మందికి సంపూర్ణంగా శిక్షణనిచ్చాను. ఇంక మామూలుగా నేర్చుకుని ఆడే వాళ్లు ఎన్ని వేల మంది ఉన్నారో నేను ఎప్పుడూ లెక్క చెప్పుకోలేదు. అడవి తల్లికి అందరూ ఒక్కటే! మా ఆదివాసీల్లో మగపిల్లాడు ఎక్కువ, ఆడపిల్ల తక్కువనే ఆలోచనే ఉండదు. బిడ్డలంతా సమమే. పెళ్లిలో కట్నకానుకలు ఉండవు. ఆడబిడ్డ పుట్టిందని చింతపడడం మాకు తెలియదు. నాకు ఎనిమిది మంది కూతుళ్లు, ముగ్గురు కొడుకులు. బతకడానికి ఆశ్రమ పా ఠశాలలో రోజు కూలీగా పని చేస్తూ కూడా అందరికీ చదువు చెప్పించాను. తొమ్మిది– పది తరగతుల వరకు అందరూ చదువుకున్నారు. రెండో కొడుకు వెంకటేశ్ మాత్రం డిగ్రీ చదివి టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు. తరతరాలుగా అడవులకే పరిమితమైపోయిన గుస్సాడి నృత్యాన్ని నేను దేశానికి తెలియ చెప్పా ను. మీరు మన ఆట, పా టలను ఇతర దేశాలకు తీసుకెళ్లాలని నా పిల్లలు, శిష్యులకు చెబుతున్నాను’’ అని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు గుస్సాడి కనకరాజు. – వాకా మంజులారెడ్డి -
Chintala Posavva: దివ్య సంకల్పం
జీవితానికి పరీక్షలు అందరికీ ఉంటాయి. బతుకు పరీక్షాపత్రం అందరికీ ఒకలా ఉండదు. ప్రతి ఒక్కరికీ ఒక్కో పత్రాన్ని నిర్దేశిస్తుంది ఎవరి పరీక్ష వారిదే... ఎవరి ఉత్తీర్ణత వారిదే. ఆ పరీక్షలో పోశవ్వకి నూటికి నూరు మార్కులు. తన ఉత్తీర్ణతే కాదు... తనలాంటి వారి ఉత్తీర్ణత కోసం... ఆమె నిర్విరామంగా సాగిస్తున్న దివ్యమైన సేవ ఇది. ‘ఒకటే జననం... ఒకటే మరణం. ఒకటే గమనం... ఒకటే గమ్యం’ చింతల పోశవ్వ కోసం ఫోన్ చేస్తే ఆమె రింగ్‌టోన్ ఆమె జీవితలక్ష్యం ఎంత ఉన్నతంగా ఉందో చెబుతుంది. తెలంగాణ, కామారెడ్డి జిల్లా కేంద్రంలో నివసించే పోశవ్వ ఓ ధీర. జీవితం విసిరిన చాలెంజ్‌ని స్వీకరించింది. ‘అష్టావక్రుడు ఎనిమిది అవకరాలతో ఉండి కూడా ఏ మాత్రం ఆత్మస్థయిర్యం కోల్పోలేదు. పైగా రాజ్యాన్ని ఏలే చక్రవర్తికి గురువయ్యాడు. నాకున్నది ఒక్క వైకల్యమే. నేనెందుకు అనుకున్నది సాధించలేను’ అనుకుంది. ఇప్పుడామె తన కాళ్ల మీద తాను నిలబడడమే కాక, తనలాంటి వాళ్లకు ఉపాధికల్పిస్తోంది. పోరాటం చేస్తున్న వాళ్లకు ఆసరా అవుతోంది. తన జీవితాన్ని సమాజహితానికి అంకితం చేయాలనే సంకల్పంతో పని చేస్తున్న పోశవ్వ సాక్షితో తన జీవనగమనాన్ని పంచుకున్నది. నాన్న వైద్యం... నానమ్మ మొక్కు! ‘‘విధి నిర్ణయాన్ని మార్చలేమనుకుంటాను. ఎందుకంటే మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్ అయి ఉండీ నేను పోలియో బారిన పడ్డాను. ఆ తర్వాత నాన్న ఆయుర్వేద వైద్యం నేర్చుకుని నాకు వైద్యం చేశారు. నానమ్మ నన్ను గ్రామ దేవత పోచమ్మ ఒడిలో పెట్టి ‘నీ పేరే పెట్టుకుంటా, బిడ్డను బాగు చేయ’మని మొక్కింది. మెడ కింద అచేతనంగా ఉండిపోయిన నాకు ఒక కాలు మినహా మిగిలిన దేహమంతా బాగయిపోయింది. కష్టంగానైనా నాకు నేనుగా నడవగలుగుతున్నాను. నాకు జీవితంలో ఒకరి మీద ఆధారపడే పరిస్థితి రాకూడదని ఎం.ఏ., బీఈడీ చదివించారు. చదువు పూర్తయిన తర్వాత మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ స్కీమ్‌లో అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం ఎక్కువ కాలం చేయలేదు. ఫీల్డు మీదకు వెళ్లాల్సిన ఉద్యోగం అది. నేను పనిని పరిశీలించడానికి పని జరిగే ప్రదేశానికి వెళ్లి తీరాలి. నేను వెళ్లడానికి సిద్ధమైనప్పటికీ కొన్ని చోట్లకు మామూలు మనుషులు వెళ్లడం కూడా కష్టమే. ఇతర అధికారులు, ఉద్యోగులు ‘మీరు రాకపోయినా ఫర్వాలేదు’ అంటారు. అయినా ఏదో అసంతృప్తి. ఉద్యోగాన్ని అలా చేయడం నాకు నచ్చలేదు. నెలకు ముప్ఫై వేల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాను. హైదరాబాద్‌లోని ఎన్ఐఆర్డీలో సర్ఫ్, ఫినాయిల్, ఫ్లోర్ క్లీనర్, సబీనా తయారీలో శిక్షణ, చిన్న ఇండస్ట్రీతో బతుకు పుస్తకంలో కొత్త పాఠం మొదలైంది. కోవిడ్‌తో కొత్త మలుపు నేను మార్కెట్లో నిలదొక్కుకునే లోపే కోవిడ్ వచ్చింది. మా ఉత్పత్తులు అలాగే ఉండిపోయాయి. దాంతోపాటు వాటి ఉత్పత్తి సమయంలో ఎదురైన సమస్యలు కూడా నన్ను పునరాలోచనలో పడేశాయి. క్లీనింగ్ మెటీరియల్ తయారీలో నీటి వృథా ఎక్కువ, అలాగే అవి జారుడు గుణం కలిగి ఉంటాయి కాబట్టి పని చేసేటప్పుడు దివ్యాంగులకు ప్రమాదాలు పొంచి ఉన్నట్లే. అందుకే నీటితో పని లేకుండా తయారు చేసే ఉత్పత్తుల వైపు కొత్త మలుపు తీసుకున్నాను. అవే ఎకో ఫ్రెండ్లీ రాఖీలు. ఆ ప్రయత్నం నేను ఊహించనంతగా విజయవంతం అయింది. ఆ తర్వాత గోమయ గణపతి నుంచి ఇప్పుడు పదకొండు రకాల ఉత్పత్తులను చేస్తున్నాం. అందరూ దివ్యాంగులే. ఇక మీదట ఒంటరి మహిళలకు కూడా అవకాశం కల్పించాలనుకుంటున్నాను. కన్యాదాతనయ్యాను! మా జిల్లాలో ఎవరికి వీల్ చైర్ కావాలన్నా, ట్రై సైకిల్, వినికిడి సాధనాలు, పెన్షన్ అందకపోవడం వంటి సమస్యల గురించి నాకే ఫోన్ చేస్తారు. ఎన్జీవోలు, డీఆర్డీఏ అధికారులను సంప్రదించి ఆ పనులు జరిగేటట్లు చూస్తున్నాను. దివ్యాంగులకు, మామూలు వాళ్లకు కలిపి మొత్తం పన్నెండు జంటలకు పెళ్లిళ్లు చేశాను. వాళ్లలో ఇద్దరికి మాత్రం అమ్మాయి తరఫున పెళ్లి పెద్ద బాధ్యత వహించాల్సి వచ్చింది. నాకు అమ్మాయిల్లేరు, ముగ్గరబ్బాయిలు. ఈ రకంగా అవకాశం వచ్చిందని సంతోషించాను. సంకల్పం గొప్పది! నేను నా ట్రస్ట్ ద్వారా సమాజానికి అందించిన సహాయం ఎంతో గొప్ప అని చెప్పను. ఎంతో మంది ఇంకా విస్తృతంగా చేస్తున్నారు. కానీ నాకు ఉన్నంతలో నేను చేయగలుగుతున్నాను. నా లక్ష్యం గొప్పదని మాత్రం ధీమాగా చెప్పగలను. ఆదాయం కోసం పర్యావరణానికి హాని కలిగించడానికి వెనుకాడని ఈ రోజుల్లో, పర్యావరణ హితమైన మార్గంలో ఉపాధిని వెతుక్కుంటున్న మా ప్రయత్నాన్ని ఎన్నో సంస్థలతోపాటు ప్రభుత్వం కూడా గుర్తించింది. నాకు గత ఏడాది మహిళాదినోత్సవం సందర్భంగా సత్కరించింది. నా కుటుంబ పోషణకు నా భర్త ఉద్యోగం ఉంది. నా దివ్యహస్తం ట్రస్ట్ ద్వారా చేస్తున్న సర్వీస్ అంతా పర్యావరణ పరిరక్షణ, సమాజహితం, దివ్యాంగుల ప్రయోజనం కోసమే’’ అన్నారు. ‘ఉన్నది ఒకటే జననం... అంటూ... గెలుపు పొందే వరకు... అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు... గెలుపు కొరకే బతుకు’ అనేదే ఆమె తొలిమాట... మలిమాట కూడా. ఆదాయం కోసం పర్యావరణానికి హాని కలిగించడానికి వెనుకాడని ఈ రోజుల్లో, పర్యావరణ హితమైన మార్గంలో ఉపాధిని వెతుక్కుంటున్న మా ప్రయత్నాన్ని ఎన్నో సంస్థలతోపాటు ప్రభుత్వం కూడా గుర్తించింది. – వాకా మంజులారెడ్డి -
అంతరంగచిత్రం
హంస ముఖంలో ముఖం పెట్టి మురిపెంగా చూస్తున్న అమ్మాయి.నెమలి పింఛాన్ని ఆసక్తిగా చూస్తున్న బుట్టగౌను పాపాయి.ఏనుగు తొండాన్ని ఆత్మీయంగా నిమురుతున్న యువతి.ప్రకృతి... పక్షులు... సరస్సులు... పువ్వులు కళ్ల ముందే.థీమ్ ఏదయినా సరే... ఓ అమ్మాయి రూపం తప్పనిసరి.ఆర్టిస్ట్ ఆషా రాధిక బొమ్మల్లో కనిపించే ఆర్ద్రత ఇది. ఆషా రాధిక పుట్టింది, పెరిగింది, చదువు, ఉద్యోగం అంతా హైదరాబాద్‌లోనే. ఆమె బొమ్మల్లో హైదరాబాద్ సంస్కృతితోపాటు హైదరాబాద్‌లో కనిపించని జీవనశైలి కూడా ద్యోతకమవుతుంటుంది. ఆమె 24 సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్లు పెట్టారు. హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరమ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఆర్ట్ ఆఫ్ ద హార్ట్’ చిత్రలేఖన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన చిత్రకళా ప్రస్థానాన్ని ‘సాక్షిఫ్యామిలీ’తో పంచుకున్నారు. కుంచె నేర్పింది! ‘‘నాకు పెయింటింగ్ హాబీగా మారడానికి కారణం మా అమ్మనాన్న. అమ్మ ఎంబ్రాయిడరీ చేసేది. దారంతో వస్త్రం మీద ఒక రూపం తీసుకురావాలంటే గంటల సేపు పని చేయాలి. బ్రష్‌తో అయితే నిమిషంలో వచ్చేస్తుంది. అలా సరదాగా మొదలుపెట్టాను. స్కూల్లో కాంపిటీషన్లలో ప్రైజులు వస్తుంటే ఆ ఉత్సాహంతో మరికొన్ని బొమ్మలు వేసేదాన్ని. ఇక నాన్నగారు మహాసంప్రదాయవాది. ఆడపిల్లలు స్కూలుకి వెళ్లడం, ఇంటికి రావడం తప్ప ఇక దేనికీ బయటకు వెళ్లరాదన్నంత నియమం ఆయనది. ఖాళీ సమయం అంతా ఇంట్లోనే ఉండాల్సి రావడంతో పెయింటింగ్స్‌లో ప్రయోగాలతో కాలక్షేపం చేయడం అలవాటైపోయింది. అలా కుంచే నాకు గురువైంది. సెవెన్త్ క్లాస్‌లో సమ్మర్ కోచింగ్ తప్ప పెయింటింగ్స్‌లో ప్రత్యేకమైన శిక్షణ ఏదీ లేకనే చాలా బొమ్మలు వేశాను. పెద్దయిన తర్వాత టెంపూరా ఆన్ పేపర్ కళను తెలుగు యూనివర్సిటీ, పెయింటింగ్ అండ్ స్కల్ప్చర్ డిపార్ట్మెంట్ హెడ్ శ్రీనివాసాచారి గారి దగ్గర నేర్చుకున్నాను. కాన్వాస్లాగానే మైండ్ కూడా నా కుంచె గర్ల్ చైల్డ్ ప్రధానంగా జాలువారుతుంది. నేచర్, పక్షులు, పూలు ఆహ్లాదాన్నిస్తాయి. ప్రసిద్ధ చిత్రకారుల చిత్రాలను చూసినప్పుడు తప్పనిసరిగా ప్రభావితమవుతాం. అయితే అది అనుకరణ కోసం కాదు. ఒక గమనింపు మనలో ఉంటుంది. ఆ చిత్రకారుల గీతను నిశితంగా గమనిస్తుంది మన మేధ. జగదీశ్ మిట్టల్ గారి కలెక్షన్స్‌లో 14వ శతాబ్దం నాటి చిత్రాలు కూడా ఉన్నాయి. ఆ మీనియేచర్ ఆర్ట్ నా మెదడు మీద అలా ముద్రించుకుపోయింది. రామ్‌కుమార్, ప్రభాకర్ కోల్టే వేసే ఆబ్స్ట్రాక్ట్లు చాలా ఇష్టం. ఎన్ని చిత్రాలను చూసి, ఎన్నింటి నుంచి స్ఫూర్తి పొందినా మన మెదడు కాన్వాస్ మీద తనకు తానుగా ఓ కొత్త రూపాన్ని ఆవిష్కరిస్తుంది. నేను బొమ్మ వేయడానికి కాన్వాస్ ముందు కూర్చునేటప్పుడు ఫలానా రూపం రావాలనే ఆలోచన ఉండదు. కాన్వాస్లాగానే మెదడు కూడా క్లియర్‌గా ఉంటుంది. రంగులు ఒక్కొక్క లేయర్ వేస్తూ ఉంటే కొంత సేపటికి రూపం వస్తుంది. ఆ చిత్రంలో ఒక అమ్మాయి తప్పనిసరిగా ఉంటుంది. ఇక థీమ్ అంటే ‘హర్ అబ్జర్వేషన్’ అని చెప్పవచ్చు. ఒక అమ్మాయి ప్రకృతిని, తన పరిసరాలను గమనించడంతోపాటు మమేకం కావడం నా బొమ్మల్లో ఉంటుంది. ఒక అమ్మాయిగా బాల్యంలో నేను చూసినవి, ఊహించినవి, పెద్దయిన తర్వాత నా గమనింపుకు వచ్చినవి, ఒక అమ్మాయికి తల్లిగా ప్రేమానుబంధం నా బొమ్మల్లో ఆవిష్కారమవుతుంటుంది. ఇంట్లోనే ఆర్ట్ స్టూడియో ఏర్పాటు చేసుకున్నాను. నాలుగు వేల బొమ్మలు వేసి ఉంటాను. సోలో ప్రదర్శనలను గుర్తు పెట్టుకుంటాను, కానీ గ్రూప్ ప్రదర్శనల లెక్క ప్రత్యేకంగా గణనలోకి తీసుకోలేదు. అమెరికాలో నాలుగు రాష్ట్రాల్లోనూ నావి సోలో ప్రదర్శనలే. చిత్రలేఖనం పట్ల ఎంత ఇష్టం ఉన్నప్పటికీ చదువు ప్రాధాన్యం తగ్గనివ్వలేదు. ఎస్బీఐలో 1992లో ఉద్యోగంలో చేరాను. ఇప్పుడు శంకరపల్లి బ్రాంచ్ మేనేజర్ని. ‘ఆర్ట్ ఆఫ్ ద హార్ట్’లో పాల్గొన్నాను. సోలో ఎగ్జిబిషన్లు 2001 నుంచి మొదలుపెట్టాను. ఇప్పుడు 25వ ఎగ్జిబిషన్ నా చిత్రలేఖనం కెరీర్లో ఓ మైలురాయిగా నిలవాలనే ఆకాంక్షతో సిద్ధం చేస్తున్నాను’’ అని తన అంతరంగాన్ని ఆవిష్కరించారు ఆర్టిస్ట్ ఆషా రాధిక. – వాకా మంజులారెడ్డి -
ఆమె చూపిన బడిబాట
తహానున్నిసా బేగంకి బీఎస్సీ నర్సింగ్ పూర్తయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లా, మాన΄ాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో స్టాప్ నర్సుగా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత కమిషన్ ఆన్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఫారిన్ నర్సింగ్ స్కూల్స్ (సీజీఎఫ్‌ఎన్‌ఎస్) కోర్సు చేసింది. అమెరికా వెళ్లడానికి ఐల్ట్స్ కూడా మంచి స్కోర్‌తో పూర్తి చేసినా అక్కడికి వెళ్లడం కుదరకపోవడంతో ఎమ్ఎస్సీ నర్సింగ్ సైకియాట్రీ కోర్సులో చేరింది. ఏడాది పూర్తయ్యేసరికి పునరాలోచనలో పడి కుటుంబ అవసరాల కోసం గృహిణిగా ఇంటికే పరిమితం అయింది. కొడుకుకి తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజ్‌లో సీటు రావడంతో మకాం తిరుపతికి మారింది. చదువు మీదున్న ఆసక్తిని సేవా కార్యక్రమాల వైపు మళ్లించి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. సావిత్రీ పూలే అవార్డును అందుకుంది. తన సేవా ప్రస్థానం ఆమె మాటల్లోనే... అమ్మమ్మ... అమ్మ స్ఫూర్తితో... ‘‘మాది తెలంగాణలోని వనపర్తి. మా అమ్మ సైన్స్ టీచర్, నాన్న డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్‌గా లెప్రసీ విభాగంలో పని చేశారు. ఆ స్ఫూర్తితోనే నేను నర్సింగ్ కోర్సు చేశాను. సర్వీస్ మా ఇంటి వాతావరణంలోనే ఉంది. రంజాన్ మాసంలో జకాత్ ఇవ్వడంతో సరిపెట్టే వాళ్లు కాదు. రోజూ ఆకలి తీర్చేవాళ్లు. మా అమ్మమ్మ రోజూ జొన్న రొట్టెలు చేసి రెండు తీసి పక్కన పెట్టి ఆ తర్వాత మాకు తినడానికి పెట్టేది. పక్కన తీసి పెట్టిన రొట్టెలు ఆ రోజు ఆకలితో ఎవరు వస్తే వారికిచ్చేది. మా అమ్మ కూడా తన నెల జీతంలో కొంత భాగం పేద వారికి ఇవ్వడం కోసమే తీసి పక్కన పెట్టేది. అవి చూస్తూ పెరిగాను, నాకు ఉద్యోగం రాగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. ఆకాశమే హద్దు అన్నంతగా సమాజానికి వైద్యసేవ చేయాలనుకున్నాను. అక్కడి పరిస్థితుల్లో ఎంతో కాలం ఇమడలేకపోయాను. నా దృష్టికి వచ్చిన వాళ్లకి చేతనైన సహాయం చేయడంతోనే కొన్నేళ్లు జరిగిపోయాయి. తిరుపతికి వచ్చిన తర్వాత కరోనా సమయంలో నాకు ఒక దారి దొరికింది. నా అసలైన అవసరం ఎక్కడ ఉందో తెలిసింది. మా వారు డాక్టర్, కొడుకు ఎంబీబీఎస్ పూర్తి చేసి కోవిడ్ మెడికల్ ఆఫీసర్‌గా సర్విస్ మొదలు పెట్టేశాడు. వాళ్లిద్దరూ సర్వీస్ ఇస్తున్నారు. నాకు మెడికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి సర్విస్ చేస్తానంటే మా వారు, అబ్బాయి ఇద్దరూ నా ఆరోగ్యరీత్యా వద్దన్నారు. అప్పుడు నేను ఆహారం పెట్టడం అయినా చేయాలని మొదలు పెట్టాను. ఒక పూట అన్నానికి కూడా భరోసా లేని కాలనీలను చూశాను. వాళ్లకు రోజూ అన్నం పెట్టడం, ఆ పిల్లల బాగోగులు అడిగి తెలుసుకుంటూ ఉంటే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. బ్రష్, పేస్ట్, సబ్బు కూడా తెలియని బాల్యం వాళ్లది. వాళ్లకు స్కూల్లో పేరుంటుంది, కానీ వాళ్లు స్కూలుకి పోరు. తర్వాత క్లాస్‌కి ప్రమోట్ కాలేరు. ఏం చదువుతున్నారని అడిగితే ఏదో ఓ క్లాసు చెప్తారు, ఎక్కడ ఆపేశారో కూడా వాళ్లకు గుర్తుండదు. ఇంకా ఇలాంటి జీవితాలున్నాయేంటి... అని బాధ కలిగింది. ఈ స్థితిని చూసిన తర్వాత ‘వియ్ సపోర్ట్’ అంటూ చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించి పూర్తి స్థాయిలో పని మొదలు పెట్టాను. అన్నింటా రాణిస్తున్నారు! అలాంటి పిల్లలు ఈ మూడేళ్లలో ఎంతగా మారిపోయారంటే... వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో బహుమతులందుకున్నారు. త్రోబాల్, వంద మీటర్ల పరుగు, ఖోఖో వంటి ఆటల్లో ముందుంటున్నారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నృత్య ప్రదర్శన ఇచ్చారు. నా పిల్లల నంబరు ఏడాదికేడాదీ పెరుగుతోంది. ఇంకో విషయం... వీళ్లు మేడమ్, టీచర్ అనే పదాలంటేనే భయపడేవాళ్లు. ‘ఆంటీ’ అని పిలిపించుకోవడం అలవాటు చేశాం. దాంతో బాగా మాలిమి అయ్యారు. ఇంకా ఇలాంటి వారిని వెతికి మరీ బడిబాట పట్టించాలి. అదే పనిలో ఉన్నాను’’ అన్నారు తహానున్నిసా బేగం. స్నేహితులు వచ్చారు! మొదట అన్నారావు సర్కిల్ దగ్గరున్న ఎస్టీ కాలనీతో మొదలు పెట్టాను. రోజూ కాలనీకి వెళ్లడం పిల్లలందరినీ బ్రష్ చేయమని, స్నానం చేసి రమ్మని చెప్పడం నుంచి సంస్కరణ మొదలు పెట్టాను. పాఠాలను కంఠతా పట్టడం, ఆ తర్వాత చదవడం, రాయడం నేర్పించాను. ఆ తర్వాత వాళ్లు చదవగలిగిన క్లాసులో చేర్పిస్తున్నాను. ఈ యజ్ఞంలో నన్ను చూసి నా స్నేహితులు ముందుకు వచ్చి పాఠాలు చెప్తున్నారు. కొంతమంది పుస్తకాలు, బ్యాగులు సహాయం చేశారు. వీళ్లు స్కూల్ డ్రాపవుట్స్ కావడంతో ప్రభుత్వం ఇచ్చే పథకం వర్తించదు. అలాంటి పిల్లలను ఒక దారిలో పెట్టిన తరవాత టీటీడీ ఓరియెంటల్ స్కూల్లో చేర్పిస్తున్నాం. – వాకా మంజులారెడ్డి ఫొటోలు : మహమ్మద్ రఫీ, తిరుపతి -
ప్లాస్టిక్ కాలుష్యానికి చెక్ ఇంట్లోనే మొదలవ్వాలి
మీకు తెలుసా? ప్రపంచ వ్యాప్తంగా తయారవుతున్న ప్యాకింగ్ మెటీరియల్‌లో మూడింట రెండు వంతులు ఆహార పదార్థాలను ప్యాక్ చేయడానికే ఖర్చవుతోంది. ఈ ప్యాకింగ్ మెటీరియల్‌లో పేపర్, పేపర్ బోర్డ్, కార్డ్బోర్డ్, వ్యాక్స్, ఉడ్, ప్లాస్టిక్లు, మోనో కార్టన్లు... ఇంకా రకరకాలవి ఉపయోగిస్తారు. మిగిలిన అన్నిటికన్నా ప్యాకింగ్ మెటీరియల్ లో ఉపయోగించే ప్లాస్టిక్ శాతం తక్కువే. కానీ మట్టిలో కలిసిపోకుండా పల్లపు ప్రదేశాలకు కొట్టుకుపోతూన్న ప్లాస్టిక్ తోనే సమస్య. క్లైమేట్ చేంజ్, పర్యావరణానికి ఎదురవుతున్న ఇబ్బందుల మీద చర్చించిన ఐక్యరాజ్య సమితి... నదులు, సముద్రాలను ముంచెత్తుతోన్న కాలుష్యాన్ని ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభంగా పేర్కొంది. మారుతున్న జీవనశైలి, ఆర్థిక వ్యవస్థ సృష్టిస్తున్న ఈ సమస్యకు మన వంతుగా చెక్ పెట్టడం ఎంతవరకు సాధ్యమో చూద్దాం. ఫ్యామిలీ ఆడిట్ ప్యాకింగ్ మెటీరియల్‌ని తిరిగి ఉపయోగించడం పట్ల శ్రద్ధ చూపించకపోవడం కూడా ప్రధానమైన కారణం. ‘స్వీడన్ వంటి కొన్ని దేశాల్లో ఒక్కశాతం కంటే ఎక్కువ ప్యాకింగ్ మెటీరియల్ చెత్త లోకి వెళ్లదు. అంటే అక్కడ 99 శాతం మళ్లీ వాడకంలోకి వస్తోంది. అదే మనదేశంలో రీయూజ్ 22 శాతానికి మించడం లేద’ని బెంగళూరుకు చెందిన పర్యావరణవేత్త నరేశ్ హెగ్డే చెప్పా రు. ‘‘మన దేశంలో ముఖ్యంగా పెద్ద నగరాల్లో ఒక్కో కుటుంబం నుంచి ఉదయంపాలప్యాకెట్‌తో మొదలయ్యే ప్యాకింగ్ అవసరం రాత్రి పడుకునే ముందు ఇంటి బయట పెట్టే చెత్త కవర్ల వరకు సగటున రెండు నుంచి మూడు కిలోల ప్యాకింగ్ వేస్ట్ ఉత్పత్తి అవుతోంది. ఫుడ్ ఆర్డర్ల ద్వారా వచ్చే ప్యాకెట్లది సింహభాగం. ఈ సమస్య సంపన్న కుటుంబాల్లోనే ఎక్కువ. కానీ ఈ విషయంలో ప్రతి కుటుంబం ఆడిట్ చేసుకోవాలి. వ్యర్థాల ఉత్పత్తిని ఎంత మేర నిలువరించవచ్చు అని విశ్లేషించుకుని అమలు చేయాలి’’ అని చెబుతున్నారు పర్యావరణవేత్తలు. రీ యూజ్ ‘‘మనం ఇప్పుడిప్పుడు ఇళ్లలో తడిచెత్త, పొడిచెత్తలను వేరు చేయడం వరకు అలవరుచుకుంటున్నాం. ఇకపై ఈ రెండింటితోపాటు రీ యూజబుల్ మెటీరియల్‌ను వేరు చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ఒకసారి వాడిపారేయకుండా వీలైనన్ని ఎక్కువ దఫాలు వాడడం ఒక సూచన. ఇక కొన్నింటిని వాడిపారేయాల్సిందే, తిరిగి వాడడానికి వీలుకాదు. ఉదాహరణకు షాంపూ ప్యాకెట్లు, కాస్మటిక్ ఉత్పత్తులు ఈ కోవలోకి వస్తాయి. చైతన్యం ఉన్నప్పటికీ ఎలా డిస్పోజ్ చేయాలో తెలియకపోవడం ఒక కారణం. ప్లాస్టిక్‌ని సరైన విధానంలో రీ సైకిల్ చేయడం, పరిహరించడం మనకు మనంగా చేయగలిగిన పని కాదు. తయారు చేసిన కంపెనీలకే ఆ బాధ్యతను అప్పగిస్తూ ప్రభుత్వాలు చట్టాలు చేయాలని పలు సందర్భాల్లో సూచించాం. ఇదెలాగంటే... సౌందర్యసాధనాలు, షాంపూ, వాషింగ్‌పౌ డర్, క్లీనింగ్ ఉత్పత్తులను వాడేసిన తర్వాత ప్యాకెట్లను ఏ దుకాణంలో కొన్నామో అదే దుకాణంలో తిరిగి డిపాజిట్ చేయడం అన్నమాట. ఒక వస్తువు ఉత్పత్తి చేసిన కంపెనీ నుంచి కిరాణా దుకాణం వరకు సరఫరా అయినట్లే ఖాళీ ప్యాకెట్లు కూడా సప్లయ్ బ్యాక్ సిస్టమ్ ద్వారా తయారీ స్థానానికి తిరిగి చేరాలి. ఈ నియమాన్నిపాటించగలిగితే ఈ సంక్షోభానికి అడ్డుకట్ట వేయవచ్చు’’ అంటారు పర్యావరణ విశ్లేషకులు దొంతి నరసింహారెడ్డి. నిజానికి భారతీయుల జీవనశైలిలో సింగిల్ యూజ్ కంటే ముందు రీ యూజ్ ఉండేది.పాళీతో రాసే ఇంకు పెన్నుల నుంచి కాటన్ చేతి సంచీ వరకు ప్రతి వనరునీ వీలైనన్ని ఎక్కువసార్లు ఉపయోగించేవాళ్లం. యూజ్ అండ్ త్రో, సింగిల్ యూజ్ మాటలుపాశ్చాత్యదేశాల నుంచి నేర్చుకున్న అపభ్రంశమే. కానీ ఇప్పుడు ఆయా దేశాలు రీ యూజ్ వైపు మరలుతూ ఇండియాను వేలెత్తి చూపిస్తున్నాయి. మనం వీలైనంత త్వరగా మనదైన రీ యూజ్ విధానాన్ని తిరిగి మొదలుపెడదాం. ఇంటి వాతావరణాన్ని మార్చుకోగలిగితే అది పర్యావరణ సమతుల్యత సాధనలో తొలి అడుగు అవుతుంది. ప్రత్యామ్నాయాలున్నాయి! ► బర్త్‌డేపార్టీలో ధర్మాకోల్ బాల్స్, ప్లాస్టిక్ చమ్కీలను వాడుతుంటారు. అవి లేకుండా వేడుకను ఎకో ఫ్రెండ్లీగా చేసుకోవాలి. ► పెళ్ళిళ్లు ఎకో ఫ్రెండ్లీ వాతావరణంలో చేసుకోవాలి. ► ఇంట్లో ప్లాస్టిక్‌ని అవసరమైన వరకు మాత్రమే ఉపయోగించాలని, తప్పనిసరిగా రీయూజ్ చేయాలనే నియమాలను పెట్టుకోవాలి. ఆ నినాదాన్ని ఇంటి గోడ మీద రాసుకుంటే మనల్ని చూసి మరికొంత మంది ప్రభావితమవుతారు. ► పేపర్ బ్యాగ్, కాటన్ బ్యాగ్, మొక్కజొన్న పిండితో తయారవుతున్న క్యారీ బ్యాగ్‌ల వంటి ప్రత్యామ్నాయాలను వాడవచ్చు. – వాకా మంజులారెడ్డి -
మంచుఖండం మనసైన సాహసం
అంటార్కిటికా విహారం తెర మీద చూసినంత సౌకర్యంగా ఉండదు. కానీ మాటల్లో చెప్పలేనంత ఆహ్లాదంగా ఉంటుంది జర్నీ. అంటార్కిటికా గురించి తెలుసుకోవాలంటే స్వయంగా పర్యటించాల్సిందే అనుకున్నాడు హైదరాబాద్ కుర్రాడు హసన్ అరుణ్. లండన్, కింగ్స్ కాలేజ్‌లో ఎకనమిక్స్ చదువుతున్న అరుణ్ గత డిసెంబర్లో అంటార్కిటికా సాహసయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. విశేషాలను లండన్ నుంచి సాక్షితో పంచుకున్నాడు. మూడు సముద్రాల కలయిక ‘‘అంటార్కిటికా గురించి తెలుసుకోవాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఇంటర్నెట్లో ఉన్న సమాచారం నాకు సంతృప్తినివ్వలేదు. స్వయంగా ఎక్స్ప్లోర్ చేయాల్సిందే అనుకున్నాను. ఆ అడ్వెంచర్‌ని ఎంజాయ్ చేయాలని కూడా. హైదరాబాద్ నుంచి గత డిసెంబర్ 21వ తేదీ బయలుదేరి దాదాపుగా ఒక రోజంతా ప్రయాణం చేసిన తర్వాత బ్రెజిల్ లోని ‘రియో డీ జెనీరో’మీదుగా అర్జెంటీనా రాజధాని ‘బ్యూనోస్ ఎయిరిజ్’కి చేరాను. అక్కడ మూడు రోజులున్నాను. ప్రపంచం అంచు అని చెప్పే ‘ఉషుయాయియా’ ను చూశాను. అంటార్కిటికా క్రూయిజ్ అక్కడి నుంచే మొదలవుతుంది. ఉషుయాయియా నుంచి 26వ తేదీ ఉదయం క్రూయిజ్ ప్రయాణం మొదలైంది. బీగెల్ చానెల్లో సాగుతుంది క్రూయిజ్ ప్రయాణం. డ్రేక్ ప్యాసేజ్ మీదుగా ఒకటిన్నర రోజు ప్రయాణించాలి. ఈ జర్నీలో అత్యంత క్లిష్టమైన ప్రదేశం ఇదే. అట్లాంటిక్, పసిఫిక్, సదరన్ ఓషన్ ఈ మూడు సముద్రాలు కలిసే ప్రదేశం ఇది. అలలు నాలుగు మీటర్ల నుంచి పదకొండు మీటర్ల ఎత్తు లేస్తుంటాయి. సీ సిక్నెస్ వచ్చేది ఇప్పుడే. తల తిరగడం, వాంతులతో ఇబ్బంది పడతారు. సిక్నెస్ తగ్గడానికి మందులు, సీ బ్యాండేజ్ ఇస్తారు. ఈ స్థితిలో నిద్ర సమయం కూడా పెరుగుతుంది. ఉష్ణోగ్రత మైనస్ రెండు ఉంటుంది. క్రూయిజ్ లోపల ఏసీ ఉంటుంది, కాబట్టి ఇబ్బంది ఉండదు. ఓపెన్ ప్లేస్‌లో నాలుగైదు నిమిషాలకంటే ఎక్కువసేపు ఉండలేం. అలలు పైకి లేచినప్పుడు అంత భారీ క్రూయిజ్ కూడా నీటి తాకిడికి కదిలిపోతుంటుంది. అలలు ఆరు మీటర్ల ఎత్తు వస్తున్నంత వరకు ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. అంతకు మించితే మాత్రం క్రూయిజ్ ఆగాల్సిందే. లంగరు వేసి వాతావరణం నెమ్మదించిన తర్వాత కదులుతుంది. మా జర్నీలో నాలుగు మీటర్లకు మించలేదు, కాబట్టి ఆగాల్సిన అవసరం రాలేదు. నేలను పలకరిస్తూ నీటిలో ప్రయాణం వెడెల్ సీలోకి ప్రవేశించామంటే అంటార్కిటికా ఖండంలోకి అడుగుపెట్టినట్లే. వెడెల్ సీ లో దాదాపు సగం రోజు సాగుతుంది ప్రయాణం. గ్లేసియర్లు, ఐస్‌బెర్గ్‌లు, పర్వతాలు, పెంగ్విన్ కాలనీలు, వేల్స్, సీల్స్ కనిపిస్తుంటాయి. అంటార్కిటికా చేరిన తర్వాత ఆరు రోజుల పా టు రోజుకు రెండు దీవులు లేదా ద్వీపకల్పాల మీద ల్యాండ్ అవుతూ ఆరు రోజుల్లో పన్నెండింటిని కవర్ చేశాను. జనవరి రెండవ తేదీ తిరుగు ప్రయాణం. ‘బ్యూనోస్ ఎయిరిజ్’ నుంచి నేను లండన్‌కి వచ్చేశాను. రోజంతా పగలే! అంటార్కిటికాలో రోజంతా నింగికీ నేలకూ మధ్యనే గడిపినప్పటికీ ఆ వారం రోజులూ సూర్యాస్తమయాన్ని చూడలేకపోయాను. సూర్యుడు చండప్రచండంగా ఉదయించే ఉన్నాడు. ఇది అద్భుతమైన అనుభూతి. కాలుష్యం అంటే ఏమిటో తెలియని స్వచ్ఛమైన నీరు, లెక్కకు మించిన హిమనీనదాలు, గుంపుల కొద్దీ పెంగ్విన్ లు, సహజమైన దారుల్లో ట్రెకింగ్ నాకు మరిచిపోలేని జ్ఞాపకాలు. నేను అడ్వెంచర్స్ని బాగా ఇష్టపడతాను, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లో కూడా ట్రెకింగ్ చేశాను. కానీ అంటార్కిటికా ట్రెకింగ్ సహజత్వం ఒడిలో సాగిన సాహసం అనిపించింది’’. మనిషి వల్లే హాని అంటార్కిటికా గురించి ప్రయాణంలోనే ఎక్కువ తెలుసుకోగలిగాను. క్రూయిజ్‌లో మెరైన్ ఇంజనీర్లు, సైంటిస్ట్‌లు, నేచరిస్ట్లు కూడా ఉంటారు. ఒక ప్రదేశానికి వెళ్లడానికి ముందు ఆ ప్రదేశం వివరాలు, అక్కడ మెలగాల్సిన విధానం కూడా చెప్తారు . పెంగ్విన్ లకు కనీసం ఐదు మీటర్ల దూరంగా ఉండాలని, మనుషుల నుంచి వాటికి ఇన్ఫెక్షన్ సోకితే ఏకంగా వేలకొద్దీ ఉన్న కాలనీలే తుడిచిపెట్టుకుపోతాయని తెలిసింది. మనిషి ఎంత హానికారకుడో, ప్రకృతికి ఎంత పెద్ద శత్రువో మొదటిసారి తెలిసింది. వాళ్లు పర్యాటకులను ఆహ్వానిస్తూనే మంచుఖండం పర్యావరణ సమతుల్యతను పరిరక్షించుకుంటున్నారు. ఇక్కడ పర్యటించడానికి డిసెంబర్ రెండవ వారం నుంచి జనవరి మొదటి వారం వరకు అనుకూలమైన సమయం. – హసన్ అరుణ్, సాహస యాత్రికుడు -- ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
చిగురించే శుభలేఖ.. మీ ఇంటికి వచ్చిన తులసి.. ఆరోగ్యదాయిని!
ఒకప్పడు శుభలేఖ అంటే... పసుపు సుగంధాలతో అందే ఆహ్వానం. డిజిటల్ యుగంలో వాట్సాప్‌లోనే ఆహ్వానం. పెళ్లయ్యాక డిలీట్ చేయకపోతే మెమరీ చాలదు. ఆ తర్వాత ఆ పత్రిక మన మెమరీలోనూ ఉండదు. కానీ... ఈ శుభలేఖ ఎప్పటికీ నిలిచి ఉండే ఓ జ్ఞాపకం. మంచాల వారి పరిణయ ఆహ్వానం... ఏటా మనింటికి ఎన్నో పెళ్లిపత్రికలు వస్తూ ఉంటాయి. ‘అరె! నా పెళ్లిలో పట్టుపరికిణితో బుట్టబొమ్మలా తిరిగిన ఆ చిన్నమ్మాయికి పెళ్లా! కాలం ఎంత వేగంగా పరుగులు తీస్తోందో? అనుకుంటూ పెళ్లి కార్డును మురిపెంగా చూస్తాం. పెళ్లయిన తర్వాత ఆ కార్డునుపాత పేపర్లలో వేసేయడానికి మనసొప్పదు. శుభలేఖను గౌరవించాలి, ఆ జంట వైవాహిక జీవితం కలకాలం లక్షణంగా సాగాలంటే పెళ్లికార్డును అగౌరవపరచకూడదనే సెంటిమెంట్ మనది. ఈ సెంటిమెంట్‌కు కొత్త నిర్వచనం చెప్తోంది డాక్టర్ శరణ్య. ఆహ్వాన పత్రిక ముద్రించిన పేపర్‌ను తులసి గింజలను కలిపి తయారు చేయించింది. ‘‘నా పెళ్లి తర్వాత ఈ కార్డును మట్టి కుండీలో వేసి నీరు పోయండి. నాలుగు రోజుల్లో కార్డు కరిగిపోతుంది, మరో నాలుగు రోజులకు పచ్చగా జీవం పోసుకున్న తులసి మొక్క మనల్ని పలకరిస్తుంది. మీ ఇంటికి వచ్చిన తులసి, మీ ఇంటి ఆరోగ్యదాయిని. భూమాతకు కొత్త ఊపిరినిచ్చే ఆరోగ్యలక్ష్మిని చూస్తూ మీ ముఖంలో విరిసే చిరునవ్వే మాకు మీరిచ్చే ఆశీర్వాదం’’ అంటోంది. శుక్రవారమే పెళ్లి! డాక్టర్ శరణ్యది తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్. ఎంఎస్ ఆఫ్తాల్మాలజీ చేస్తోంది. ఈ నెల 24వ తేదీన పెళ్లి పీటల మీద కూర్చోనున్న శరణ్య తన వివాహాన్ని ఇలా పర్యావరణహితంగా మార్చేసింది. ఆ వివరాలను సాక్షితో పంచుకుంది. ‘‘నేచర్ ఫ్రెండ్లీ లైఫ్ స్టయిల్ నాకిష్టం. నా పెళ్లి కూడా అలాగే జరిగితే బావుణ్ణనిపించి అదే మాట నాన్నతో చెప్పాను. పెళ్లి వేదిక అలంకరణ నుంచి భోజనాల వరకు మొత్తం ప్లాస్టిక్ రహితంగా ఉండాలని కూడా అనుకున్నాం. అది పెద్ద కష్టం కాలేదు. ప్రతిదానికీ ప్రత్యామ్నాయం దొరికింది. కార్డుల కోసం చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ‘ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కార్డ్స్’ కోసం నేను ఇంటర్నెట్లో, నాన్న తన బిజినెస్ కాంటాక్ట్స్‌తో ప్రయత్నించాం. నాన్నకు తెలిసిన వాళ్ల ద్వారా అహ్మదాబాద్‌లో హ్యాండ్‌మేడ్ పేపర్ తయారీతో పాటు మనం కోరిన స్పెసిఫికేషన్లన్నీ వచ్చేటట్లు కస్టమైజ్డ్గా ప్రింట్ చేసిస్తారని తెలిసింది. మూడు నెలల ముందుగా ఆర్డర్ చేయాలి, ఈ ఎకో ఫ్రెండ్లీ ఆహ్వానపత్రికల ఆలోచన తెలిసి మా అత్తగారింట్లో కూడా అందరూ సంతోషించారు. భూమాత పరిరక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలు నా పెళ్లికార్డుతో ఇంతమందికి తెలిశాయి. దీనికి మూలకారణం మా నాన్నే. ప్లాస్టిక్ ఫ్రీ సొసైటీ కోసం చైతన్య సదస్సులు నిర్వహిస్తారు. మా చెల్లికి పక్షులంటే ఇష్టం. వేసవిలో పక్షుల కోసం ఒకపాత్రలో నీరు, గింజలు పెడుతుండేది. పక్షుల సంరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో రెండు వేల బర్డ్ ఫీడర్ బాక్సులు పంచింది. మా ముత్తాత రాజేశం గారు ఫ్రీడమ్ ఫైటర్. మా తాత శంకరయ్య కూడా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారు. అదే వారసత్వంతో నాన్న కూడా వేసవిలో నగరంలో వాటర్ ట్యాంకులతో నీటి పంపిణీ వంటి అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. బతుకమ్మ వేడుక కోసం గునుగుపువ్వు సేకరించి శుద్ధి చేసి పంచడం కూడా చాలా ఇష్టంగా చేస్తాం. మనం మన సంస్కృతికి వారసులం మాత్రమే కాదు వారధులం కూడా. ప్రతి సంప్రదాయాన్నీ ఇలా సృజనాత్మకంగా మలుచుకోగలిగితే మనం చేసిన పని మనకు ప్రత్యేకతను ఇస్తుంది. సాంస్కృతిక వారధులుగా సంతోషమూ కలుగుతుంది. పెళ్లి పత్రిక మీద దేవుడి బొమ్మలు, వధూవరుల ఫొటోలు ఉంటాయి. వాటినిపారేయలేక ఇంట్లోనే పెట్టుకుంటే దొంతర పెరిగిపోతూ ఉంటుంది. మా పెళ్లి పత్రిక మాత్రం తులసి మొక్కగా మీ కళ్ల ముందు ఉంటుంది, మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ’’ అని సంతోషంగా వివరించింది డాక్టర్ శరణ్య. – వాకా మంజులారెడ్డి -
Sunitha Krishnan: దయచేసి మారండి!
మహిళల అక్రమ రవాణా... ప్రభుత్వాలకు పెద్ద సవాల్. సమాజానికి తలవంపులు. బాధిత మహిళకు విషమ పరీక్ష. మహిళల రక్షణ ఆమె ఆకాంక్ష. తనకు తెలిసిన మార్గం పోరాటమే. పోరాటం... పోరాటం... పోరాటం. అసాంఘిక శక్తులతో పోరాటం. సామాజిక పరిస్థితులతో పోరాటం. మనసు మారితే సమాజం మారుతుంది. ఇప్పుడు ఆ మార్పు కోసం అభ్యర్థిస్తోంది. సునీతాకృష్ణన్ ‘నా బంగారు తల్లి’ సినిమా తీసి దాదాపుగా దశాబ్దమవుతోంది. మహిళలను మోసగించి అక్రమ రవాణాకు పాల్పడే దుర్మార్గాన్ని ఆ సినిమాలో కళ్లకు కట్టారు సునీతా కృష్ణన్, ఆమె భర్త రాజేశ్ టచ్‌రివర్. ప్రతి సన్నివేశమూ వాస్తవానికి అద్దం పట్టింది. సినిమా క్లైమాక్స్ దృశ్యాలు కన్నీటి పర్యంతం చేస్తాయి, మనసు ద్రవించిపోతుంది. సమాజంలో మహిళ ఎదుర్కొనే దాష్టీకాలకు మౌనంగా రోదిస్తూ బయటకు వస్తారు ప్రేక్షకులు. వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం అది. ఆ సందర్భంగా నిర్మాత సునీతా కృష్ణన్ మాట్లాడుతూ ‘‘1996లో ప్రజ్వల ఫౌండేషన్ ప్రారంభించినప్పటి నుంచి పోరాడుతున్నాను. అంతకంటే ముందు ప్రజ్వల వంటి ఫౌండేషన్ అవసరం ఉందని గ్రహించే వరకు నేను గుర్తించిన సామాజికాంశాలన్నింటి మీదా పోరాడాను. ‘స్త్రీ అంగడి సరుకు కాదు, దేహం మీద దాడి చేస్తే ఆమె మనసు ఎంతగా రోదిస్తుందో ఆలోచించండి’ అని గొంతుచించుకుని చెప్తున్నాను. నా ఉద్యమం సమాజంలో ప్రతి ఒక్కరినీ చేరాలంటే, ఏకకాలంలో ఎక్కువమందిని సెన్సిటైజ్ చేయాలంటే ప్రభావవంతమైన మాధ్యమం అవసరం అనిపించింది. అందుకే సినిమా తీశాను. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ఎవరైనా కనీసం ఒక్క క్షణమైనా ఆలోచించకపోతారా, స్త్రీ దేహాన్ని మాత్రమే కాంక్షించే మగవాళ్లకు తమ ఇళ్లలో ఉండే ఆడబిడ్డలు కళ్ల ముందు మెదలకపోతారా’ అనేది మా ఆశ. నేను యాక్టివిస్ట్‌ని, నా భర్త సినిమా దర్శకుడు కావడంతో మా ఆలోచన అనుకున్నది అనుకున్నట్లే కార్యరూపం దాల్చింది. ఎటువంటి సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా చిత్రించాం’’ అని చెప్పారామె. ఆమె సామాజిక సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2016లో పద్మశ్రీతో సత్కరించింది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు (మహిళాసాధికారత విభాగం)కు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆమె సాక్షితో పంచుకున్న అనుభవాలివి. ఎక్కడ ఉన్నా పోరాటమే! ‘‘నేను బెంగళూరులో పుట్టిన మలయాళీని. నేను పుట్టిన నెలరోజులకే మా నాన్నకు హైదరాబాద్‌కు బదిలీ అయింది. నా బాల్యం మూడేళ్లు ఇక్కడే గడిచింది. నేను మహిళల కోసం పని చేయడానికి హైదరాబాద్‌ను ఎంచుకోవడం అనుకోకుండా జరిగింది. బెంగళూరులో స్టూడెంట్‌గా నేను ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. స్త్రీ దేహం కాస్మటిక్ కంపెనీల నిబంధనల చట్రంలో ఇమడాలనే భావనను వ్యతిరేకించాను. స్త్రీ దేహం ఫలానా కొలతల్లో ఉంటేనే అందం అని ఒకరు నిర్ణయించడమేంటి, ఆ మాయలో చిక్కుకుని అమ్మాయిలు తమ దేహాన్ని నియంత్రించుకోవడానికి తంటాలు పడడం ఏమిటి? అని... స్త్రీ దేహాన్ని మార్కెట్ వస్తువుగా పరిగణించే ధోరణిని నిరసిస్తూ అందాల పోటీల నిర్వహణను అడ్డుకుని రెండు నెలలు జైల్లో ఉన్నాను. అప్పుడు నాకు ఇరవై రెండేళ్లు. నేను ఉద్యమించి జైలుకెళ్లడాన్ని మా ఇంట్లో సమ్మతించలేకపోయారు. అలా ఇల్లు వదిలి వచ్చేశాను. ఎక్కడికెళ్లాలో తెలియదు. రైల్వే స్టేషన్‌కెళ్లి కౌంటర్లో ఎటువెళ్లే రైళ్లున్నాయని అడిగాను. వాళ్లు చెప్పిన పేర్లలో ‘హైదరాబాద్’ వినిపించగానే ‘టికెట్ ఇవ్వండి’ అనేశాను. అలా హైదరాబాద్, చాదర్‌ఘాట్‌లో నివసిస్తున్న ఓ మిత్రురాలింటికి వచ్చాను. ఇక్కడ కూడా ఉద్యమించాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు మూసీ నది తీరాన్ని ‘నందనవనం’గా మార్చాలని ప్రభుత్వం అక్కడి ఇళ్లను ఖాళీ చేయించాలని నిర్ణయం తీసుకుంది. ‘పునరావాసం కల్పించిన తర్వాత మాత్రమే మా ఇళ్లను కూలగొట్టండి’ అంటూ రోడ్డెక్కాను. ఆ తర్వాత హైదరాబాద్‌లో ‘మెహబూబ్ కీ మెహందీ’లో నివసిస్తున్న వారిని తొలగించే ప్రయత్నం జరిగింది. ఆ మహిళల కోసం ఏదైనా చేయాలని పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాను. లైంగికహింస, అక్రమ రవాణాలకు గురయ్యి జైళ్లు, హోమ్‌లలో ఉన్న మహిళలను కలిశాను. వాళ్లలో చాలామంది తమ పిల్లలకు భవిష్యత్తు ఇవ్వమని కోరారు. అలా ఐదుగురు పిల్లలతో స్కూలు ప్రారంభించాను. ఆ తర్వాత పదిమంది పిల్లలతో షెల్టర్ హోమ్ పెట్టాను. అలా మొదలైన చిన్న ప్రయత్నం ఇప్పుడు పదిహేడు ట్రాన్సిషన్ సెంటర్లలో ఏడు వందల మంది పిల్లలు చదువుకునేంతగా పరిణమించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు పన్నెండు వేల మంది చదువుకుని గౌరవప్రదమైన జీవితాల్లో స్థిరపడ్డారు. ఈ ఫౌండేషన్ అవసరం ఉండకూడదు! ఆడపిల్లల అక్రమ రవాణాదారులు ఒక అమ్మాయిని తీసుకువచ్చినట్లు సమాచారం అందగానే దూకుడుగా వెళ్లిపోయేదాన్ని. అడ్డువచ్చిన వాళ్లతో బాహాబాహీకి దిగి మరీ ఆడపిల్లలను బయటకు తీసుకువచ్చేదాన్ని. అలా లెక్కలేనన్నిసార్లు నా మీద దాడులు జరిగాయి. చెవి మీద తగిలిన దెబ్బ కారణంగా వినికిడి కూడా తగ్గింది. ఆ దాడులను పట్టించుకోలేదు. కానీ నా అనుచరుడిని హత్య చేశారు. అప్పుడు నా పంథా మార్చుకుని పోలీస్, మహిళా సంక్షేమశాఖల వంటి ప్రభుత్వ వ్యవస్థలతో కలిసి పని చేయడం మొదలుపెట్టాను. ఇప్పటికి 96 వేల మంది బాలికలు, యువతులు, మహిళలను రక్షించగలిగాను. ఆ నంబరు ఇంత పెద్దదిగా ఉన్నందుకు గర్వపడడం కాదు మనం సిగ్గుపడాలి. స్త్రీల రక్షణ కోసం ప్రజ్వల ఫౌండేషన్ ప్రారంభించాను. సమాజంలో స్త్రీల అక్రమ రవాణా పూర్తిగా అంతరించిపోవాలి. నేను బతికి ఉండగానే ఈ ఫౌండేషన్‌ను మూసివేయాలనేది నా ఆకాంక్ష. సమాజంలో సున్నితత్వం పెరిగి, మంచి మార్పు రావాలని అందరం ఆశిద్దాం. – సునీతాకృష్ణన్, సామాజిక ఉద్యమకారిణి మగవాళ్లకు చెప్పాలి! నా బంగారు తల్లి సినిమాతో సమాజాన్ని ఆలోచింపచేయగలిగాను. ఆ సినిమాకి మూడు నేషనల్ అవార్డులు వచ్చాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ నాలుగు నంది అవార్డులు ప్రకటించింది. ఇప్పుడు మగవారి మీద దృష్టి పెట్టాను. ఆడవాళ్ల మీద జరిగే దాడులను, మోసాలను అరికట్టడానికి భుజబలం ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనం కంటే మగవాళ్లను చైతన్యవంతం చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చనిపించింది. అందుకే ఇప్పుడు ‘మ్యాన్ అగెనెస్ట్ డిమాండ్ (మ్యాడ్)’ నినాదంతో ముందుకు వెళ్తున్నాను. ‘మీ లైంగిక అవసరాలకు ఇతర స్త్రీలను కోరుకోవడం మానేయండి, మీలో ఈ మార్పు వస్తే స్త్రీల అక్రమ రవాణా మాఫియా దానంతట అదే అంతరించిపోతుంది’ అని అభ్యర్థిస్తున్నాను. మనిషిలో సహజంగానే సున్నితత్వం ఉంటుంది. ఆ సున్నితత్వాన్ని పురుషాహంకారంతో అణచివేయకుండా ఉంటే చాలు. మార్పు వచ్చి తీరుతుంది’’ అని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు సునీతా కృష్ణన్. ఇరవై ఆరేళ్ల తన పోరాటంలో తిరస్కారాలు తప్ప పురస్కారాలు అందలేదని, తన సొంతరాష్ట్రం కేరళలో ప్రభుత్వ పురస్కారం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో దక్కిన తొలి గౌరవం ‘వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ అని సంతోషం వ్యక్తం చేశారామె. – వాకా మంజులారెడ్డి -
సంగీతమే నా ప్రయారిటీ.. లెజెండరీ ఎస్పీ బాలు అడుగుజాడల్లో
యువ గాయని జాహ్నవి... టీవీ చూస్తూ పాట నేర్చుకుంది. టీవీలో పాడుతూ పెరిగి పెద్దదైంది. టీవీ తెర మీద మురిపించిన పాట... ఇప్పుడు సినిమా తెర వెనుక వినిపిస్తోంది. ఎస్పీ బాలు నేర్పించిన మెళకువలే పాదముద్రలు. ఇంట్లో టీవీ ఉంటే పిల్లలు మాటలు త్వరగా నేర్చుకుంటారు. ఆ ఇంటి వాతావరణంలో నేర్పని మాటలు కూడా పిల్లల నాలుక మీద అవలీలగా దొర్లిపోతుంటాయి. ఈ అమ్మాయి టీవీ చూస్తూ మాటలతోపాటు పాటలు కూడా నేర్చుకుంది. ఆటల్లో ఆటగా సీరియల్ టైటిల్ సాంగ్స్ పాడేది. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. కానీ సంగీతం దేవుడిచ్చిన వరంలా ఒంటపట్టింది. పాటల పట్ల పాపాయికి ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆమెను సంగీతం టీచర్ దగ్గరకు తీసుకెళ్లారు. ఎవరూ పెద్దగా ప్రయాస పడింది లేదు. త్వరగానే గ్రహిస్తోందని సంగీతం టీచరు కామాక్షిగారు నోటిమాటతోనే ప్రశంసాపూర్వకమైన సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఆ తర్వాత స్వరసుధ అనే మ్యూజిక్ అకాడమీలో చేరి సంగీత సాధన చేసింది. ఇదంతా జాహ్నవి వరంగల్‌లోనే. టెన్త్‌క్లాస్ తర్వాత ఇంటర్ కి జాహ్నవి హైదరాబాద్‌కు మారింది. ఆమె సంగీత ప్రపంచం మరింత విస్తృతమైంది. శ్రీనిధి, రామాచారి వంటి ప్రముఖ గురువుల దగ్గర సంగీతం నేర్చుకునే అవకాశం వచ్చింది. టీవీ రియాలిటీ షోల తో మొదలైన ఆమె సరిగమల ప్రయాణం ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో కలిసి పాడే అవకాశాన్నిచ్చింది. ఎస్పీబీ దగ్గర పాడడానికి ముందు జాహ్నవి పాటకు, ఆ తర్వాత జాహ్నవి పాటకు మధ్య స్పష్టమైన తేడా వచ్చిందని చెబుతోందీ యువగాయని. నేర్చుకున్న వారికి నేర్చుకున్నంత.. ‘‘రియాలిటీ షోలో నేను పద్యాన్ని పాడుతున్నాను. ఫైనల్ రౌండ్‌కు వెళ్లాలంటే ఆ రౌండ్ దాటాలి. అప్పుడు పద్యం పాడడంలో అనుసరించాల్సిన మెళకువ చెప్పారాయన’’ అంటూ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తనకు తొలిసారిగా నేర్పించిన సంగీతపాఠాన్ని గుర్తు చేసుకున్నది జాహ్నవి. ‘‘బాలు సర్‌తో 30కి పైగా ఎపిసోడ్లు చేశాను. పాట పాడేటప్పుడు ఆయన ఎంత కచ్చితంగా ఉంటారో ఆయన నొటేషన్ రాసుకోవడం చూసి తెలుసుకున్నాను. వేలాది పాటలు పాడిన అనుభవం ఉన్నప్పటికీ ప్రతి పాటనూ అదే ప్రారంభం అన్నంత శ్రద్ధగా ప్రిపేరవుతారు. ఒక అక్షరం పైన ‘నవ్వు’ అని రాసుకున్నారు. అలా రాసుకోవడం చూసిన తర్వాత ఆయన ఆ పాట పాడడాన్ని కూడా నిశితంగా గమనించాను. కచ్చితంగా ఆ అక్షరం రాగానే గొంతులో నవ్వును పలికించారు. ఆయన టీమ్‌లో కోరస్ పాడడం అనేది చిన్న అవకాశం కాదు. నేర్చుకునే వాళ్లకు నేర్చుకున్నంత జ్ఞానం అబ్బుతుంది. స్వరాలను పలకడంలో పాటించాల్సిన నిబంధనలను, పాట అవసరాన్ని బట్టి గొంతులో పలకాల్సిన రసాలను చెప్పేవారు. మొదట కుతూహలం కొద్దీ ఆయనను గమనించడం మొదలుపెట్టాను. అలా ఆయన చెప్పినవి కొన్ని, చూసి నేర్చుకున్నవి కొన్ని. ఒక్కొక్కటి నేర్చుకుంటున్న కొద్దీ... ఆశ్చర్యంగా నా పాటలో మార్పు నాకే స్పష్టంగా తెలియసాగింది. గాయనిగా గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యానికి స్ఫూర్తి ఎస్పీబీ సారే. పాటల పాఠాలు బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. కానీ సంగీతమే నా తొలి ప్రయారిటీ. గాయనిగా అన్ని రకాల పాటలూ పాడగలననే గుర్తింపు తెచ్చుకోవాలి. మ్యూజిక్‌లో సర్టిఫికేట్ కోర్సు చేశాను. ఇప్పుడు డిప్లమో కోర్సు చేస్తున్నాను. క్లాసికల్, మెలోడీ, జానపదం, ఫాస్ట్‌బీట్... అన్నింటినీ పాడగలిగినప్పుడే సమగ్రత వస్తుంది. ఇక గాయనిగా నాకు సంతోషాన్నిచ్చిన సందర్భాలంటే... పాడుతా తీయగా సీజన్ 16లో రన్నర్ అప్‌గా నిలవడం. అదే ప్రోగ్రామ్‌లో విన్నర్ మా చెల్లి అక్షయసాయి. అలాగే ఎస్వీబీసీలో అన్నమాచార్య కీర్తనలు పాడే అవకాశం వచ్చింది. అది కూడా అత్యంత సంతోషం కలిగించింది. ఎన్టీఆర్ బయోపిక్, అఖండ, బీమ్లానాయక్, రాధేశ్యామ్ సినిమాల్లో గొప్ప సంగీత దర్శకుల ఆధ్వర్యంలో పాడాను. స్టేజ్ ప్రోగ్రామ్‌లలో పాడాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ఎక్కువ కార్యక్రమాలు చేయలేకపోతున్నాను. బాలు గారి జయంతి సందర్భంగా నాలుగవ తేదీ ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రవీంద్రభారతిలో సంస్మరణ కార్యక్రమం జరుగుతోంది. సినీ మ్యూజిక్ యూనియన్ నిర్వహించే ఈ కార్యక్రమంలో వందమంది గాయనీగాయకులు, సంగీతకారులు పాల్గొంటున్నారు. అందులో పాట పాడడం నాకు మరువలేని జ్ఞాపకం అవుతుంది. ఆయన పాదముద్రల్లో నడిచి వచ్చిన గాయనిని. అది ఆ మహోన్నత గురువుకి నేను అందించే స్వర నివాళి’’ అని చెబుతున్నప్పుడు జాహ్నవి గొంతులో బాలుగారి పట్ల గౌరవపూర్వకమైన అభిమానం తొణికిసలాడింది. – వాకా మంజులారెడ్డి -
చట్టం ఉంది... కమిటీలేవి?
కేరళ హైకోర్టు ఈ నెల 17వ తేదీన ఓ కేసులో తీర్పునిస్తూ సినిమా రంగానికి ఒక ఆదేశం జారీ చేసింది. ఆ ఆదేశం ప్రకారం ప్రతి మూవీ ప్రొడక్షన్ హౌస్‌లోనూ తప్పనిసరిగా ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ ఉండి తీరాలి. అక్కడి సినిమారంగంలో ఉన్న మహిళల సమాఖ్య ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ చేసిన న్యాయపోరాటంలో భాగంగా ఈ ఆదేశాన్ని జారీ చేసింది హైకోర్టు. మహిళా చైతన్యం మెండుగా ఉన్న కేరళ రాష్ట్రంలో మహిళలు న్యాయపోరాటంతో సాధించుకున్న విజయం అనే చెప్పాలి. సాధికారత సాధనలో పరుగులు తీస్తున్న మహిళలు ఇంకా జెండర్ వివక్ష నుంచి తప్పించుకోవడానికి పెనుగులాడాల్సిన పరిస్థితి. లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఉంది. కానీ చట్టం అమలుకు ఇంకా ఎన్నాళ్లు? ఓ మూడున్నర దశాబ్దాల వెనక్కి, ఈ చట్టం లేని రోజుల్లోకి వెళ్తే... ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ల కేసు గుర్తుకు వచ్చి తీరుతుంది. ∙∙ రూపన్ డియోల్ బజాజ్, ఐఏఎస్ ఆఫీసర్. ఒక మహిళ ఎంత పెద్ద ఆఫీసర్ అయినప్పటికీ పితృస్వామ్య సమాజంలో కేవలం మహిళ మాత్రమేనా! అని సమాజం నివ్వెర పోయిన సంఘటన ఆమె జీవితంలో ఎదురైంది. ఐపీఎస్ ఆఫీసర్ కేపీఎస్ గిల్ నుంచి లైంగికవేధింపును ఎదుర్కోవాల్సి వచ్చిందామె. లైంగిక వేధింపుకు గురయ్యానంటూ న్యాయం చేయమంటూ మనదేశంలో చట్టాన్ని ఆశ్రయించిన తొలి మహిళాధికారి ఆమె. అత్యున్నత స్థాయి అధికారి కావడం వల్లనే ఆమె కనీసం చట్టాన్ని ఆశ్రయించడం అనే సాహసమైనా చేయగలిగారు. అంతకు ముందు ఎంతో మంది చిన్న ఉద్యోగినులు సాటి పురుష ఉద్యోగుల నుంచి వేధింపులు ఎదుర్కొంటూ కూడా నోరు మెదపడానికి ధైర్యం లేని స్థితిలో నలిగిపోయారు. నోరు విప్పిన వాళ్లకు కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలో స్త్రీలు ఎదుర్కొంటున్న ఈ వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి 2013లో ‘సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ యట్ వర్క్ ప్లేస్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్) యాక్ట్, 2013’ వచ్చింది. ఈ చట్టం ప్రకారం పదిమంది ఉద్యోగులు పని చేస్తున్న పని ప్రదేశంలో వారిలో కనీసం ఒక్క మహిళ ఉన్నా సరే... ఈ చట్టం ప్రకారం ఒక కమిటీ ఉండాలి. సంఘటిత రంగాల్లోనే కాక అసంఘటిత రంగాల్లో కూడా ఇలాంటి కమిటీల ఏర్పాటుకు చట్టాలు ఉన్నాయని, సినిమా రంగం గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇందులో తప్పనిసరి... చెబుతున్నారు ప్రముఖ న్యాయవాది పార్వతి. ∙∙∙ ఇదే విషయం మీద ప్రముఖ నటి, గతంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో క్రియాశీలకంగా బాధ్యతలు నిర్వర్తించిన జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ ‘‘మీటూ ఉద్యమ సమయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని ఒక కమిటీ వేసింది. పోలీసు ఉన్నతాధికారులు, యాక్టివిస్టులు, సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమందితో రూపొందిన కమిటీ అది. ఈ కమిటీ విస్తృతి చాలా పెద్దది. లైంగిక వేధింపుల నివారణ మాత్రమే కాదు. ఆడవాళ్లు పని చేసే చోట వాళ్లకు అనువైన వాతావరణం ఉండేటట్లు చూడడం కూడా కమిటీ బాధ్యతే. పెద్ద ఆర్టిస్టులకు సొంత కారవాన్ వంటి ఏర్పాట్లు ఉంటాయి. జూనియర్ ఆర్టిస్టులకు అలాంటివేవీ ఉండవు. వాళ్లు షూటింగ్ సెట్లో దుస్తులు మార్చుకోవడానికి గదులు, టాయిలెట్ వసతుల వంటివి ఉండేటట్లు చూడాలి. ఆడిషన్ జరిగేటప్పుడు కెమెరా ఉండి తీరాలి. ఈ చట్టం చెప్పిన నియమాలను ఒక చార్ట్ మీద రాసి ప్రొడక్షన్ హౌస్‌లో తగిలించాలి. మొత్తానికి ఉమెన్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కల్పించడం ఈ చట్టం ఉద్దేశం. అయితే మీటూ సమయంలో పెద్ద కదలిక వచ్చింది. కానీ ఆ తర్వాత కరోనా కారణంగా షూటింగ్‌లు జరగకపోవడం వంటి అనేక కారణాలతో ఈ నియమావళి ప్రాధాన్యం కొంత తగ్గిందనే చెప్పాలి. అయితే ‘మా’ నుంచి నేను ఒక మహిళగా నా దృష్టికి వచ్చిన అనేక కేసులను పరిష్కరించాను. అలాగే ఫిలిమ్ చాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా తమ దృష్టికి వచ్చిన వాటిని పరిష్కరిస్తుంటాయి’’ అన్నారు. సమాజం అభివృద్ధి చెందుతోంది. ఆలోచన స్థాయులు ఆకాశాన్ని అంటుతున్నాయి. మహిళ విషయంలో... మహిళ అయిన కారణంగా ఆమె ఎదుర్కొంటున్న వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి చట్టాలు రూపొందుతున్నాయి. అయితే మనిషి ఆలోచనలను మార్చడంలో వీటి పాత్ర పరిమితంగానే ఉంటోంది. నిజంగా మారాల్సింది మనిషి ఆలోచన. చట్టం వచ్చి దశాబ్దకాలమవుతోంది. ఇంకా కమిటీల నిర్మాణమే పూర్తిస్థాయిలో జరగలేదు. ‘అణచివేత’ అనే దురాలోచనను రూపుమాపగలిగిన సమాజం రావాలి. అది వివేచనతోనే సాధ్యం. కమిటీ ఉంటే కెమెరా ఉన్నట్లే! సర్వేలియన్స్ కెమెరా నిఘాలో ఉన్నామని తెలిస్తే మనిషి ఎంత బాధ్యతగా వ్యవహరిస్తాడో... పని ప్రదేశంలో ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతగా వ్యవహరిస్తాడు. ప్రొడక్షన్ హౌస్‌లో ఈ కమిటీ ఉంటే... అది మహిళలకు భరోసానిస్తుంది. కమిటీ ఉందనే ధైర్యం మహిళలకు ఉంటుంది, కమిటీ ఉందనే భయం మగవాళ్లలో ఉంటుంది. – జీవిత రాజశేఖర్, సీనియర్ నటి ఇంకా విస్తరించాలి! పని ప్రదేశంలో మహిళల భద్రత కోసం రూపొందిన ఈ చట్టం ఇంకా విస్తరించాల్సి ఉంది. ఆఫీసుల్లో కొంతవరకు ఉన్నాయి. సినిమా రంగం కూడా దీని అవసరాన్ని గుర్తించింది. అలాగే ఇళ్లలో పని చేసే డొమెస్టిక్ వర్కర్లు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తారు. వాళ్లు ‘లోకల్ కంప్లయింట్స్ కమిటీ’లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారులుండాలి. ఇవి ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పడలేదు. అలాగే చట్టసభల మహిళాసభ్యులు ఈ చట్టం పరిధిలోకి రావడం లేదు. వాళ్లు ఐపీసీననుసరించి పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేయాల్సిందే. ఈ చట్టాన్ని వాళ్లకు కూడా వర్తింప చేస్తూ అసెంబ్లీలో ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. – ఇ. పార్వతి, సీనియర్ న్యాయవాది – వాకా మంజులారెడ్డి -
పెద్ద అచీవ్మెంట్.. మాటల్లో చెప్పలేను: షణ్ముఖప్రియ
‘ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్లు ప్రత్యేకత ఉన్న వాళ్లే. ఫైనల్లో గెలవగలిగిన టాలెంట్ అందరిలోనూ ఉంది’ ఇది షణ్ముఖ ప్రియ జవాబు. ‘ఫైనల్లో ఎవరు గెలుస్తున్నారనుకుంటున్నార’ని ఓ వారం కిందట జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు ప్రియ ఇచ్చిన ఈ సమాధానంలో ఎంతో పరిణతి ఉంది. ‘ఈ వేదిక నుంచి ఇంటికి వెళ్తూ ఏమి తీసుకెళ్లబోతున్నార’నే ప్రశ్నకు కూడా... ‘అనేక జ్ఞాపకాలను, నేర్చుకున్న పాఠాలను’ అని స్థితప్రజ్ఞతతో బదులిచ్చింది ఈ పద్దెనిమిదేళ్ల గడుసమ్మాయి. వైజాగ్‌లో పుట్టి టీవీ తెర మీద తెలుగు ప్రేక్షకుల కళ్ల ముందే పెరిగిన షణ్ముఖ ప్రియ గొంతు ప్రతి తెలుగింటిలోనూ వినిపించింది. పదమూడేళ్లుగా ప్రతి తెలుగింటికీ ఇంటి బిడ్డగా మారిపోయింది. అంతటి ప్రేమ ఆప్యాయతలను అందుకుంటోంది. ఒక ‘సారేగమప లిటిల్స్, మరో ‘పాడుతా తీయగా’, సూపర్సాంగ్స్, ద వాయిస్ ఇండియా కిడ్స్‌తో సెలయేరులా సాగిన రాగప్రవాహం ఇండియన్ ఐడల్ 12 రియాలిటీ షో వేదికను చేరింది. ఫైనల్స్‌లో ఆరవస్థానంలో నిలిచిన షణ్ముఖప్రియ ముంబయి నుంచి సాక్షితో పంచుకున్న అనుభవాలు. ఈ షో మలుపు తిప్పింది. ‘‘నాకు చిన్నప్పటి నుంచి ఇండియన్ ఐడల్‌లో పాడాలనే కోరిక ఉండేది. ఆ లక్ష్యాన్ని చేరుకున్నాను. ఫైనల్ వరకు రావడమే పెద్ద అచీవ్మెంట్. దానిని సాధించగలిగాను. సంగీతంతో మమేకమైన నా జీవితంలో ఈ షో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ షో ద్వారా నేను ఎంతమంది సంగీతప్రియుల మనసుకు దగ్గరయ్యానో మాటల్లో చెప్పలేను. ప్రతి పాటలోనూ నా వంతుగా నూటికి నూరుశాతం ఇచ్చాను. మై లెవెల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చానని చెప్పడానికి సందేహించడం లేదు. ఇక గెలుపు ఓటముల విషయం అంటారా? ఇక్కడ గెలుపును ఆన్లైన్ ఓటింగ్ కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి నా పార్టిసిపేషన్ మాత్రమే నాకు ముఖ్యం. ఫలితం మీద నాకు ఎటువంటి అసంతృప్తి లేదు. పైగా ఈ షో నా జీవితంలో గొప్ప మలుపు కాబోతోంది. జావేద్ అక్తర్‌తోపాటు అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు నన్ను ఈ షో ద్వారానే గుర్తించారు. నన్ను అంతర్జాతీయ ప్రముఖులు జస్టిన్ బీబర్, షకీరాలతో పోల్చారు. నాకది ఎంతో సంతోషంగా ఉంది. రెండు వేలుగా ఉన్న నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా రెండు లక్షల ఎనభై వేలకు చేరింది కూడా ఇప్పుడే. ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు కూడా సైన్ చేశాను. ఇరవై పాటలతో విడుదలవుతున్న ఓ ప్రైవేట్ ఆల్బమ్ కోసం ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో నేను కూడా ఉన్నాను. నేను గెలవాలని ఇంతమంది వీక్షకులు కోరుకోవడమే పెద్ద విజయం’’ అని చెప్పింది షణ్ముఖ ప్రియ. అలాగే ఈ ఇండియన్ ఐడల్ 12 రియాలిటీ షో సందర్భంగా ప్రియ మరో ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా ప్రకటించేసింది. అదేంటంటే... ‘ఇదే నా ఆఖరి రియాలిటీ షో. ఇకపై సంగీత ప్రపంచంలో నా ప్రయాణం కొత్తదారిలో సాగుతుంది’ అని చెప్పింది. – వాకా మంజులారెడ్డి -
గ్రేట్ జర్నీ... మానస చిత్రం
గిగిల్స్... లిల్లీపుట్ ల్యాండ్ పేరు పైన రెండు బుజ్జి పాదాలు. లోపలికి వెళ్తే ఓ గదిలో పదకొండు నెలల బాబు విహాస్ పియానో ముందు కూర్చుని కీ బోర్డుని పరీక్షగా చూస్తున్నాడు. ఆ బాబు దృష్టి తన వైపు మరల్చుకోవడానికి ప్రయత్నిస్తోందామె. ఇంగ్లిష్ రైమ్ మొదలు పెట్టగానే బాబు ఆమె వైపే చూడసాగాడు. ఓ అరనిమిషం పాటు అలాగే చూసి నోరంతా తెరిచి నవ్వాడు. అప్పుడు క్లిక్ మన్నది ఆమె చేతిలోని కెమెరా. ఆమె పేరు మానస అల్లాడి. కెమెరామన్ అనే మాటను సవరిస్తూ కెమెరా పర్సన్ అనే పదాన్ని నిర్ధారించేశారు. అందుకు మహిళలు వేసిన ఓ ముందడుగే కారణం. ఫొటోగ్రాఫర్‌గా మగవాళ్లు మాత్రమే ఉన్న రోజుల్లో నిర్ధారణ అయిన పదానికి జెండర్ స్పెసిఫికేషన్‌ను తుడిచేస్తున్నారు మహిళలు. ఫొటోగ్రాఫర్‌గా మహిళలు అరుదుగానే అయినా కనిపిస్తున్నారు. వాళ్లు కూడా ఫొటో జర్నలిస్టులు. ప్రైవేట్ ఫొటోగ్రాఫర్ల విషయానికి వస్తే... ఇంకా మహిళల ప్రస్థానం ఊపందుకోలేదు. అలాంటి సమయంలో ఓ సాహసం చేసింది మానస అల్లాడి. విహాస్ను ఫొటో తీస్తున్న ఉమన్ ఫొటోగ్రాఫర్ మానస ఫొటోగ్రఫీ మీద ఇష్టంతో కోర్సు చేయడంతోపాటు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాన్ని వదిలి సొంతంగా ఫొటో స్టూడియో పెట్టింది. మరో ఐదుగురు ఫొటోగ్రాఫర్లకు, ఐదుగురు ఎడిటర్లకు ఉద్యోగం ఇచ్చింది. సొంత స్టూడియో ఆలోచనకు దారి తీసిన కారణం తనలోని తల్లి మనసేనంటోంది. తన పిల్లలను రకరకాల పోజుల్లో చూడాలని ముచ్చటపడింది. డెలివరీ అయిన ఐదో రోజున నిద్రలో నవ్వుతున్న తన బాబుని ఫొటో తీయాలనుకుంది. ఆ క్షణంలో తాను కదల్లేదు. ఫొటోలు తీయడానికి ఫొటోగ్రాఫర్లు అందుబాటులో లేరు. అలా ఆ కోరిక తీరకపోవడం వల్ల ఆ పని తానే మొదలు పెట్టింది. సొంతంగా డిజైన్ కరీంనగర్లో పుట్టి పెరిగిన మానస, ఇంజనీరింగ్ వరకు అక్కడే చదివింది. బీటెక్ పట్టాతో హైదరాబాద్‌కి వచ్చి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగంలో చేరింది. ఏడేళ్లు ఉద్యోగం ఇవ్వని సంతృప్తి మూడేళ్ల ఫొటోగ్రఫీ ఇచ్చింది. ఉద్యోగం చేస్తూనే ఒక ప్రైవేట్ ఫొటోగ్రఫీ ఇన్స్టిట్యూట్లో చేరి డిప్లమో కోర్సు చేసింది. సీనియర్ దగ్గర మెళకువలు నేర్చుకుంది. అప్పటికి స్టూడియో పెట్టే ఆలోచన లేదు. కేవలం ఇష్టంతో మాత్రమే నేర్చుకున్నది. ‘‘మా అబ్బాయి ఐదు రోజుల బిడ్డగా ఉన్నప్పుడు ఫొటో తీయడానికి బేబీ ఫొటోగ్రఫీ ప్రొఫెషనల్స్ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో చాలా నిరుత్సాహం కలిగింది. నేను లేవగలిగినప్పటి నుంచి బాబుకి నేనే ఫొటోలు తీసుకున్నాను. ప్రతినెలా పుట్టినరోజు చేస్తూ ఒక్కో నెల డ్రెస్‌కి ఒక్కో థీమ్‌తో కుట్టించి మరీ ఫొటోలు తీశాను. రెండవసారి మెటర్నిటీ లీవ్‌లో ఉన్నప్పుడు సీరియెస్‌గా ఆలోచించాను. నేనే స్టూడియో పెడతాను. బేబీ ప్రతి మూమెంట్‌ని, రకరకాల నేపథ్యాలలో కెమెరాలో దాస్తానని ఇంట్లో చెప్పాను. ఇంట్లో ఎవరూ అడ్డు చెప్పలేదు. ‘ఏ ప్రయోగం చేయాలన్నా ఇదే సరైన వయసు’ అని ప్రోత్సహించారు. ఇక నేను ఏయే థీమ్స్‌తో పిల్లల్ని ఫొటో తీయాలని ముచ్చటపడ్డానో అన్ని సెట్టింగులూ చేయించుకున్నాను. మా స్టూడియోలో ఉన్నవేవీ మార్కెట్లో రెడీమేడ్‌గా దొరికేవి కాదు. ప్రతిదీ నేనే డ్రాయింగ్ వేసి కార్పెంటర్‌కి వివరించి చేయించుకున్నాను. మొత్తం ముప్పై నేపథ్యాలతో గదులు సిద్ధమయ్యాయి. అన్నీ త్రీ డైమన్షన్ సెటప్లే. ఇండియాలో పెద్ద బేబీ ఫొటో స్టూడియో ఇదే. ఈ ఏడాది మా కరీంనగర్లో కూడా ఓ స్టూడియో పెట్టాను. పిల్లలు మాలిమి అవుతారు ఉద్యోగం చేసినప్పుడు మిగుల్చుకున్న డబ్బు పదిలక్షలతో 2017లో హైదరాబాద్, బోయిన్‌పల్లిలో స్టూడియో పెట్టాను. అప్పటికి హైదరాబాద్‌లో న్యూ బార్న్ బేబీ స్టూడియో ఉంది. కానీ మహిళలు ఈ ప్రయత్నం చేయలేదు. నాకు అడ్వాంటేజ్ ఏమిటంటే... చిన్న పిల్లలు మగవాళ్ల కంటే ఆడవాళ్లకే త్వరగా మాలిమి అవుతారు. పిల్లలతో ఓ అరగంట గడిపితే ఆ బేబీకి ఏమిష్టమో అర్థమవుతుంది. అదే సమయంలో పిల్లలకు నేను అలవాటవుతాను. ఒక్కో పిల్లలు రైమ్స్ ఇష్టపడతారు, కొందరు బొమ్మలను ఇష్టపడతారు. ఇక షూట్ చేసేటప్పుడు వాళ్లకు ఇష్టమైనవి చేస్తూ ఉండాలన్నమాట. మగవాళ్లకు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు. ఏం చేస్తే వాళ్ల ఏడుపును ఆపవచ్చనేది కూడా వెంటనే స్ఫురించదు. కాబట్టి ఈ ప్రొఫెషన్లో ముఖ్యంగా బేబీ ఫోటోగ్రఫీలో మహిళలకు మంచి అవకాశాలుంటాయి. హాబీగా నేర్చుకున్న వాళ్లు అక్కడితో ఆగిపోకుండా దీనిని ప్రొఫెషన్‌గా తీసుకోవచ్చు’’ అన్నది మానస. ఒక తొలి అడుగు మరికొన్ని అడుగులకు స్ఫూర్తి అవుతుంది. మానస ఇష్టంగా క్లిక్ మనిపించుకున్న జీవిత చిత్రమిది. ఈ దారిలో మరికొంతమంది యువతులు ఫొటోగ్రాఫర్లుగా ఎదగాలని ఆశిద్దాం. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోహనాచారి -
గ్రేట్ జర్నీ..పత్తి రైతుల కాగడా..
ఆమె ఓ ఉద్యమజ్యోతి. తాను వెలుగుతూ... పదిమందికి వెలుగులు పంచే కాగడా. ‘ఏ ఫ్రేడ్ హిస్టరీ – ద జర్నీ ఆఫ్ కాటన్ ఇన్ ఇండియా’లో వత్తిలా కాలిపోతున్న పత్తి రైతు జీవితాన్ని రాశారు. ఇంగ్లిష్ లిటరేచర్ చదివిన ఓ యువతి సామాజిక కార్యకర్తగా, మల్కా పరిరక్షకురాలిగా రూపాంతరం చెందడానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తుందా పుస్తకం. డెబ్బై ఐదేళ్లు దాటిన ఉజ్రమ్మ లైఫ్ జర్నీతోపాటు పెట్టుబడిదారుల గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ఆమె తన ఉద్యమాన్ని మౌనంగా విస్తరింపచేస్తున్న వైనం కనిపిస్తుంది. అభ్యుదయ హైదరాబాదీ ఉజ్రమ్మ హైదరాబాద్‌లో అభ్యుదయ కుటుంబంలో పుట్టారు. నానమ్మ ఉద్యమస్ఫూర్తి వల్ల తమ కుటుంబంలో ఆడపిల్లల చదువుకు మార్గం సుగమమైందని చెప్పారామె. చిన్నాన్న సజ్జత్ జహీర్ కమ్యూనిస్ట్ భావాల ప్రభావం తన మీద ఉందంటారామె. సామాజికాంశాల మీద స్పందించే తత్వం చిన్నాన్న నుంచే వచ్చిందని చెప్పే వజ్రమ్మ ఉద్యమపోరు బ్రిటిష్ కాలంలోనే మొదలైంది. విదేశాల స్పిన్నింగ్ మిల్లులు సూచించిన పత్తి వంగడంతో మనదేశంలో పంట పండించడం మొదలైననాడే ఆమె పత్తి రైతుల ఆత్మహత్యలను ఊహించగలిగారు. ఆ దోపిడీ పత్తితో ఆగదని, దానికి అనుబంధ రంగమైన చేనేతకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. కష్టం మనది... లాభం వాళ్లది ‘‘మనదేశంలో రకరకాల వాతావరణం, భౌగోళిక వైవిధ్యతల కారణంగా ప్రాంతానికి ఒక రకం పత్తి పండుతుంది. ఆ పత్తి నుంచి వచ్చే దారం, ఆ దారంతో నేసే దుస్తులలోనూ భిన్నత్వం ఉంటుంది. ఇంతటి వైవిధ్యతను కాలరాసింది ఒక్క స్పిన్నింగ్ యంత్రం. విదేశాల్లో ఏర్పాటైన వస్త్ర పరిశ్రమలకు ముడిసరుకు కావాలి. ఆ ముడిసరుకు వాళ్లు తయారు చేసుకున్న యంత్రాలకు అనుగుణంగా ఉండాలి. అందుకోసం మన రైతులకు పత్తి గింజలనిచ్చి... ‘పంట పండించండి, ఉత్పత్తిని మేమే కొంటాం’ అని చెప్పారు. అలా పత్తి గింజ వాళ్లదైంది, దారం వాళ్లదే అయింది. దారం ధరను నిర్ణయించే అధికారమూ వాళ్లదే అయింది. దాంతో చేనేత రంగం ముడిసరుకు సమస్యలో పడిపోయింది. మనది కాని వంగడం తో తెగుళ్లు ఎక్కువ. దాంతో పత్తిని పండించే రైతు బతుకుకు లాభాలు వస్తాయనే భరోసా లేదు. దారం ధర నిర్ణయించేది వాళ్లే... దాంతో చేనేత మగ్గం అంధకారంలో మగ్గిపోయింది. లాభాలు మాత్రం స్పిన్నింగ్ మిల్లులవి. లాభాలను బట్టే సమాజంలో గౌరవాల స్థాయిలో కూడా ఎంతో తేడా. పత్తి రైతు, చేనేతకారుడు ఈ విషవలయం నుంచి బయటపడి ఆర్థికంగా బలపడాలి. దేశంలో అనేక ప్రాంతాల్లో పత్తి రైతులను, చేనేత పరిశ్రమలను స్వయంగా చూశాను. చేనేతకారులు తమ ఉత్పత్తులు మార్కెట్ చేసుకోవడానికి ‘దస్తకార్ ఆంధ్ర’ రూపకల్పనలో పనిచేశాను. పదమూడేళ్లు గా మల్కా పరిరక్షణ మీద దృష్టి పెట్టాను. మల్కా అంటే ఖాదీ వంటి ఒక వస్త్ర విశేషం. ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా ఉండదు. సిరిసిల్లలో డెబ్బై కుటుంబాలు మల్కా పరిరక్షణలో పని చేస్తున్నాయి. యూరప్, యూఎస్‌లు తాము అనుసరిస్తున్న సైన్స్‌కి మోడరన్ సైన్స్ అని ఒక ముద్ర వేసుకుని, థర్డ్ వరల్డ్ కంట్రీస్‌ని తమ గుత్తాధిపత్యంలోకి తెచ్చుకోవడానికి కుట్ర పన్నాయి. మన యువతకు చెప్పేది ఒక్కటే. విదేశాల మీద ఆధారపడే పరిస్థితి నుంచి మనం బయట పడాలి. మన పత్తి నుంచి దారం తీయడానికి అధునాతన యంత్రాలను కనిపెట్టండి. మన పత్తి, మన దారం, మన నేత... వీటన్నింటికీ మనమే ధర నిర్ణయించగలిగిన వాళ్లమవుతాం’’ అంటారామె. సెలబ్రిటీల సెలబ్రిటీ ఉజ్రమ్మ నిరాడంబరంగా ఉంటారు. సెలబ్రిటీలు ఆమెతో ఫొటో తీసుకోవాలని ముచ్చటపడతారు. చేనేత అనగానే ముఖం చిట్లించే వారి చేత ‘ఐ లైక్ హ్యాండ్ వీవెన్ ఇండియన్ కాటన్’ అని స్టైలిష్‌గా పలికిస్తున్నారామె. పత్తి రైతు బతుకుకు కొరివి పెడుతున్న కంపెనీల బారి నుంచి రైతు జీవితానికి కాగడా పట్టే ప్రయత్నం చేస్తున్నారు. తన ఉద్యమానికి వారసులుగా కొత్తతరం చేనేతకారులను తయారు చేస్తున్నారు. వారి కోసం మెహిదీపట్నంలో మల్కా మార్కెటింగ్ ట్రస్ట్ ద్వారా మార్కెటింగ్ మెళకువలు నేర్పిస్తున్నారు ఉజ్రమ్మ. – వాకా మంజులారెడ్డి -
అక్కున చేర్చుకుందాం
మూడున్నర కోట్లకు పైగా వీథికుక్కలున్నాయి మనదేశంలో. పెంపుడు కుక్కలకు ఉన్నట్లు వాటి పొట్టను చూసి ఆకలి తీర్చే పెట్ పేరెంట్స్ ఎవరూ వీథి కుక్కలకు ఉండరు. వాటి ఆహారాన్ని అవి సొంతంగా సంపాదించుకుంటాయి. అది ప్రకృతి నియమం కూడా. అయితే... వాటికి ఎదురయ్యే ప్రధాన కష్టం ఆరోగ్యరక్షణ లేకపోవడమే. ‘‘ప్రతి పాణికీ జీవించే హక్కు ఉంది. వీథికుక్కలు అయినంత మాత్రాన వాటి జీవించే హక్కును కాలరాసే అధికారం మనిషికి ఉండదు. చేతనైతే వాటిని పరిరక్షించడానికి ముందుకు రండి’’ అంటున్నారు ఎన్ఆర్ఐ ఉజ్వల చింతల. ఇందుకోసం ఆమె ‘స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ ను స్థాపించి అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇండియాలోని వీథికుక్కల కోసం పని చేస్తున్నారు. మాది మహేశ్వరం ఉజ్వల చింతల 2019లో యూఎస్, ఫ్లోరిడాలో ‘స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ సంస్థను స్థాపించారు. అంతకు ముందు కొన్నేళ్లుగా ఆమె వీథి కుక్కల కోసం పని చేస్తూనే ఉన్నారు. ‘‘మాది హైదరాబాద్ సమీపంలోని మహేశ్వరం. నాన్న నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయంలోనే చదివాను. బాండింగ్ నా బలం, బలహీనత కూడా. ఇంటర్‌కి విజయవాడలోని మేరీస్టెల్లా కాలేజ్‌లో చేరిస్తే అమ్మానాన్నలకు దూరంగా ఉండలేక, మూడు నెలల్లో వెనక్కి వచ్చేశాను. డిగ్రీ హన్మకొండ, ఎంబీఏ బెంగళూరులో చేసిన తర్వాత పెళ్లితో యూఎస్ వెళ్లాల్సి వచ్చింది. యూఎస్‌లో కంప్యూటర్స్ కోర్సులు చేసి ఉద్యోగంలో చేరాను. పేరెంట్స్ మీద బెంగ తో తరచూ ఇండియాకి వస్తూనే ఉంటాను. అలా రావడమే ఈ సేవాపథంలో నడిపించింది. పాలు తాగే పిల్లల్ని విసిరేశారు 2013లో ఇండియా వచ్చినప్పుడు ఒక ఇంటి వాళ్లు చిన్న కుక్కపిల్లల్ని పాలుతాగే పిల్లలని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా బయటపడేయడం నా కంట పడింది. అప్పుడు తల్లి కుక్క పడిన ఆరాటం, ఆవేదన వర్ణించడానికి మాటలు చాలవు. మరోసారి పెళ్లిలో భోజనాల దగ్గర... పదార్థాలన్నీ పారవేస్తున్నారు. ఆ ప్లేట్ల కుప్ప మీదకు కుక్కలు ఎగబడుతున్నాయి. ఓ వ్యక్తి కర్ర తీసుకుని వాటిని విచక్షణరహితంగా కొడుతున్నాడు. అలాంటిదే మరోటి... ఓ కుక్కకు వెనుక కాళ్లు రెండూ విరిగిపోయాయి. దేహాన్ని నేల మీద ఈడ్చుకుంటూ పోతోంది. దానికి ట్రీట్మెంట్ చేయించడానికి ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు. పర్మిషన్ తీసుకుని నాతోపాటు మూడు కుక్కలను యూఎస్ తీసుకెళ్లాను. అక్కడ చికిత్స చేయించి కోలుకున్న తర్వాత పెంచుకునే వాళ్లకు దత్తత ఇచ్చాను. అప్పటి నుంచి స్ట్రే యానిమల్స్ కోసం పని చేస్తున్నాను. అమెరికాలో లడ్డూ హౌస్ హైదరాబాద్, అమీన్పూర్లో షెడ్ వేసి, ముగ్గురు ఉద్యోగులతో ఓ సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించాను. ఇప్పడు తొంభై ఉన్నాయి. నెలనెలా వాటి పోషణ, ట్రీట్మెంట్ కోసం డబ్బు పంపిస్తున్నాను. నా జీతం నుంచి కొంత భాగం, నా లడ్డూ హౌస్ రాబడితో వాటిని సంరక్షిస్తున్నాను. లడ్డూ హౌస్ బ్రాండ్ మీద నేను ఆర్గానిక్ ప్రోడక్ట్స్‌తో తినుబండారాలు తయారు చేసి, ఆదివారం ‘స్ట్రే యానిమల్స్ కోసం’ అని బోర్డు పెట్టి సేల్ చేస్తున్నాను. యూఎస్‌లో చారిటీ కోసం సేల్స్ చేసినప్పుడు... ఒక వస్తువు ధరను ఆ పదార్థానికి ఆపాదించి చూడరు, చారిటీ కోసం ధారాళంగా ఖర్చు చేస్తారు. మేము ప్రధానంగా గాయపడిన కుక్కలకు వైద్యం చేయించడం, కోలుకున్న తర్వాత పెంపకానికి ఇచ్చేయడం లేదా స్వేచ్ఛగా వదిలేయడం మీద దృష్టి పెట్టాం. ముసలితనం వల్ల ఎటూ పోలేని కుక్కలకైతే జీవితకాలపు సంరక్షణ బాధ్యత మాదే. ఇక కుక్కలకు స్టెరిలైజేషన్ వంటి కొన్ని సహకారాలను బ్లూ క్రాస్ నుంచి తీసుకుంటాం’’ అని చెప్పారు ఉజ్వల. భారతీయ సమాజాన్ని ఆమె కోరుకునేది ఒక్కటే... మనం మనుషులం, మానవీయంగా మసలుకుందాం. కుక్క అనగానే తక్కువగా చూడవద్దు. వాటి జీవితం మన అధికారం ప్రదర్శించవద్దు. మనవి ‘ప్రాణాలను హరించే చేతులు కావద్దు, రక్షించే చేతులు కావాలి’ అన్నారు. – వాకా మంజులారెడ్డి -
ఇది ధైర్యం కాదు... భయం లేకపోవడం!
ఎమ్మెస్సీ కంప్యూటర్స్, ఎకనమిక్స్‌లో ఎంఫిల్ చేసిన కవిత యాగ బుగ్గన యూఎస్‌లో సాఫ్ట్వేర్ నిపుణులుగా, ఇండియాలో డెవలప్మెంటల్ ఎకనమిస్ట్‌గా చేశారు. ట్రావెల్, ఫిక్షన్, నాన్ఫిక్షన్ రైటర్. రిషివ్యాలీ స్కూల్ ఆమెకు ప్రపంచాన్ని చదవడం నేర్పించింది. సునిశితంగా విశ్లేషించి, ప్రశ్నించగలిగిన నైపుణ్యాన్ని అలవరిచింది. ‘‘వీటన్నింటి నేపథ్యంలో నాకు తెలిసిందేమిటంటే... ఆధ్యాత్మికత అంటే జీవితాన్ని నిస్సారంగా గడపడం కాదు, సమాజం నుంచి దూరంగా వెళ్లిపోవడమూ కాదు. సమాజంలో జీవిస్తూ, వృత్తి ఉద్యోగాలలో కరుణపూరితంగా వ్యవహరించగలగడం’ అంటారామె. ఆ నీటిలో విషం లేదు! కవిత విస్తృతంగా పర్యటనలు చేస్తారు. అవి సాహసానికి లోతైన నిర్వచనాన్ని తెలియచేస్తుంటాయి. అవన్నీ జీవితాలను అర్థం చేసుకోవడానికే అయి ఉంటాయి. మూఢనమ్మకాలను తుడిచేయడానికి సాహసాలు చేశారు. మన్సరోవర్ సమీపంలోని రాక్షస్‌తాల్ ను స్థానికులు విషపు నీటి మడుగు అంటారు. రావణాసురుడు ఆ మడుగు దగ్గర తపస్సు చేసిన కారణంగా అవి విషపూరితమయ్యాయనే కథనంతో ఆ సరస్సు సామాజిక బహిష్కరణుకు గురైంది. కవిత తన పర్యటన సందర్భంగా ఆ నీటిని తాగి ‘నేను తాగాను, ఏమైంది’ అని ప్రశ్నించారు. కొంచెం ఉప్పగా ఉన్న కారణంగా ఆ నీటిని తాగవద్దు అని చెప్పడానికి ఇంత పెద్ద ట్యాగ్ తగిలించడం ఏమిటనేది ఆమె ప్రశ్న. అందరూ తీర్పరులే! ప్రయాణం అంటే ప్రదేశాలను చూసే వ్యాపకం కాదు, జీవితాలను చదివే సాధనం అంటారు కవిత. గుంటూరు జిల్లాలోని స్టూవర్ట్‌పురం మీదుగా ఎంతోమంది ఎన్నోసార్లు ప్రయాణించి ఉంటారు. స్టేషన్ పేరు విని ఆ పేరు రావడానికి కారణాలు తెలుసుకుని, ఆ గ్రామాన్ని ఏర్పాటు చేయడానికి దారి తీసిన పరిస్థితులను అన్వేషించారు కవిత. కులవ్యవస్థ మన సమాజంలో అభివృద్ధి నిరోధకంగా ఉన్న పెద్ద అడ్డంకి. అయితే ఏకంగా ఒక సామాజిక వర్గం మొత్తాన్ని దొంగలుగా ముద్ర వేయడాన్ని తీవ్రంగా నిరసించారామె. ‘‘ఒక వ్యక్తి గుణగణాలు ఆ వ్యక్తికే పరిమితం. ఒక వ్యక్తి దుర్గుణాలను ఆ కుటుంబం మొత్తానికి ఆపాదించడమే పెద్ద తప్పు, అలాంటిది ఆ కులమంతటికీ ఆపాదించడం ఏమిటి? సంస్కరణ పేరుతో వారిని బలవంతం గా ఒకచోటకు తరలించి, ఇక్కడే నివసించాలనే నిర్దేశించడం శిక్షార్హమైన నేరం’’ అంటారు కవిత. మన సమాజంలో అగ్రవర్ణాలుగా చలామణిలో ఉన్న వాళ్ల విషయంలో ఇలాగే చేసేవారా... అంటూ అప్పటి బ్రిటిష్ పాలకుల విధానాన్ని నిరసించారు. తన ప్రయాణ పరిశోధనలన్నింటినీ అక్షరబద్ధం చేస్తారామె. మన సమాజంలో ఉన్న పెద్ద అవలక్షణం... ఇతరుల జీవితానికి ప్రతి ఒక్కరూ తీర్పరులుగా మారిపోవడమే అంటారు కవిత. పాశ్చాత్య జీవనశైలిని మన జీవితాల్లోకి స్వాగతించినంత బేషరతుగా వారి ఆలోచన ధోరణిని అలవరుచుకోవడం లేదంటారామె. హిందూ, రివర్ టీత్, తెహల్కా, జాగరీ లిట్ వంటి వార్తాపత్రికలు, ఫిక్షన్– నాన్ ఫిక్షన్ జర్నల్స్‌లో ప్రచురితమైన రచనల్లో ఆమె తెలుగు నేల మీద విస్తరించిన బ్రిటిష్ కాలనీ బిట్రగుంటను కూడా ప్రస్తావించారు. చైనా పాలనలో టిబెట్ వాసుల అసంతృప్తినీ, నేపాల్‌లోని హమ్లా వ్యాలీ ప్రజల పేదరికాన్నీ రాశారు. అసలైన తాత్వికత శ్రీలంక, నేపాల్, టిబెట్, లెబనాన్, రుమేనియా, ఇటలీ, ఫ్రాన్స్, యూకే, యూఎస్, కెనడా,స్పెయిన్, చైనా, జపాన్, కాంబోడియా, మయన్మార్, థాయ్‌ల్యాండ్, టాంజానియావంటి అనేక దేశాల్లో పర్యటించిన కవిత అసలైన తాత్విక జీవనం సాగిస్తున్నది సంచార జాతులేనంటారు. ‘‘ఆదివాసీలు, అందులోనూ సంచార జాతుల ఫిలాసఫీ చాలా గొప్పది. ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, అందుకే ఈర్ష్య, అసూయ, వైషమ్యాలు ఉండవు. జీవితాన్ని యథాతథంగా స్వీకరిస్తారు. అడవుల్లో జీవించే వాళ్లు ప్రకృతి ఏమి ఇస్తే దాంతోనే జీవితం అనుకుంటారు, ప్రకృతికి హాని కలిగించరు. ప్రభుత్వాలు అడవి మీద ఆధిపత్యాన్ని హస్తగతం చేసుకోవడంతో వారి జీవితాల్లో ఒడిదొడుకులు మొదలయ్యాయ’’ంటారు కవిత. మగవాళ్లు సాహసించని ప్రదేశాలకు కూడా ఆమె చొరవగా వెళ్లిపోతారు, అక్కడి విషయాలను అంతే ధైర్యంగా రాస్తారు. అదే విషయాన్ని ఆమె ‘ఇది ధైర్యం కాదు, భయం లేకపోవడం’ అంటారు. జీవితం పట్ల ఆందోళన, భయం లేనప్పుడు ఏదీ భయపెట్టద’ని రిషీవ్యాలీ స్కూల్ నేర్పించిన ఫిలాసఫీని మరోసారి గుర్తు చేశారు. – వాకా మంజులారెడ్డి