డాక్టర్ ఎన్. మృదుల
ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకుంటున్నారు డాక్టర్ ఎన్. మృదుల. హైదరాబాద్, బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు అసోసియేట్ ప్రొఫెసర్. ఉపాధ్యాయురాలిగా 34 ఏళ్లలో ఆమె దగ్గర పదివేల మంది విద్యార్థులు తెలుగు నేర్చుకున్నారు. తనను బోధనరంగం వైపు నడిపించింది సికింద్రాబాద్, ప్యాట్నీలోని తాను చదువుకున్న స్కూలు, ఆ స్కూల్ తెలుగు టీచర్ భువనేశ్వరి గారేనన్నారు డాక్టర్ మృదుల. అంటే ఈ బెస్ట్ టీచర్ మెచ్చుకున్న తన బెస్ట్ టీచర్ భువనేశ్వరి.
అంతా ఆ టీచర్ ప్రభావమే..
‘భువనేశ్వరి టీచర్ పద్యంలోని ప్రతి పదానికి అర్థం చెప్పడంతో పాటు, దానికి వ్యుత్పత్తి, ఆ పదాన్ని ప్రయోగించడం వెనుక కవి ఉద్దేశం చెప్పేవారు. కవితలు, కథలు రాయించేవారు. సభా నిర్వహణ చేయించేవారు. ఆమె ప్రభావంతోనే తెలుగు భాష మీద మక్కువ పెరిగింది. ఆ ప్రోత్సాహమే ఇప్పటికీ మయూఖ, తరుణి మ్యాగజైన్‌లలో కాలమిస్టుగా వ్యాసాలు రాయిస్తోంది. పాఠం చెప్పడంలో కూడా ఆమె బాటనే అనుసరిస్తున్నాను’ అంటారు మృదుల.
నిత్యం విద్యార్థినే!
‘నా విద్యార్థులకు నేను అసైన్‌మెంట్‌లు ఇచ్చినప్పుడు వాళ్లు కచ్చితంగా గడువులోపే పూర్తి చేయాలని కోరుకుంటాను. అలాగే అధికారుల నుంచి మాకు వచ్చే అసైన్‌మెంట్‌లను కూడా గడువులోపు పూర్తి చేసేదాన్ని. పనిని శ్రద్ధగా అంకితభావంతో చేయాలనుకుంటాను. మా కుటుంబంలో టీచర్‌లు లేరు. నేను టీచింగ్‌లోకి వచ్చినందుకు అమ్మానాన్న చాలా సంతోషించారు. కోవిడ్‌లో ఆన్‌లైన్ క్లాసులు చెప్పడానికి సాంకేతికపరంగా అవసరమైన సహాయం మా పిల్లలు చేసేవాళ్లు. కోవిడ్ తర్వాత కూడా అవసరాన్ని బట్టి ఆన్‌లైన్ క్లాసులను కొనసాగించాను. క్లాసులో పూర్తి కాని పాఠాలను ఇంటికి వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో చెప్తున్నాను. టీచర్‌గా ‘బెస్ట్ ఆన్‌లైన టీచర్, బెస్ట్ హెచ్‌ఓడీ, బెస్ట్ ఫ్యాకల్టీ’ గౌరవాలందాయి. ఉపాధ్యాయురాలిగా ప్రభుత్వం నుంచి పురస్కారం అందుకోవడం ఇదే మొదటిసారి’’ అని తన ఉపాధ్యాయ ప్రస్థానాన్ని వివరించారు డాక్టర్ మృదుల. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె ‘ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’నందుకోనున్నారు.
సీతమ్మబడి..
మా స్కూల్ పేరు ‘పరోపకారి బాలికోన్నత పాఠశాల’. సీతమ్మ అనే మహిళ కట్టించిన స్కూల్ కావడంతో సీతమ్మబడి అంటారు. కవితలు రాయడంతోపాటు స్కూల్లో జరిగే సభలు, సమావేశాల్లో చురుగ్గా ఉండేదాన్ని. చక్కటి తెలుగుతో వక్తలను వేదిక మీదక ఆహ్వానించేదాన్ని. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఆకాశవాణిలోని యువవాణి కార్యక్రమంలో ప్రయోక్తగా ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాను. అనౌన్స్‌మెంట్‌లు, వ్యాసాలు కధానికలు చదవడం... ఇలా కలం, గళం కలిసి కొనసాగాయి. ఇక బోధనరంగంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజూ ఇష్టమైన రోజుగానే గడిచింది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment