
భారత మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ (RIP Manmohan Singh) అస్తమయంతో యావద్దేశం దిగ్బ్రాంతికి లోనైంది. ఆర్థికమంత్రి, ప్రధానమంత్రి, ఇలా పలు హోదాల్లో దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ అనేకమంది రాజకీయ నేతలు, ఆర్థికవేత్తలు నివాళులర్పిస్తున్నారు.

సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన భారత్ ప్రధానిగా, ఆర్థిక సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్ పేరొందారు. పదేళ్ల పాటు మన్మోహస్ సింగ్ భారత దేశ ప్రధానిగా పనిచేసినప్పటికీ.. ఆయన కుటుంబం గురించి ప్రజలకు అంతగా తెలియదనే చెప్పాలి. మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కుమార్తెలు వారి సంబంధిత రంగాలలో విశేషమైన విజయాలు సాధించారు.
92 ఏళ్ల వయసులో ఆయన ఆకస్మిక మరణం ప్రధానంగా ఆయన భార్య గురు శరణ్ కౌర్‌కి తీరని లోటు. ప్రశాంతమైన,గాంభీర్యంగా ఉండే ఆయన ప్రవర్తనతో మనందరికీ తెలిసిన వ్యక్తి అయితే, ఆయన వెనుకున్న నిజమైన శక్తి అతని భార్య గురుశరణ్ కౌర్. ఆయన వెన్నంటే వుంటూ, ఆయన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర ఆమెదే. పదవిలో 2019లో, మన్మోహన్ సింగ్‌కు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినపుడు ఆమె భర్తను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆయన ఆరోగ్యం కోసం గురుద్వారాలో ప్రార్థనలు చేశారు. అంతేకాదు మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా ఉన్న సమయంలోమన్మోహన్ సింగ్ భోజనాన్ని స్వయంగా తయారు చేసి ప్యాక్ చేసి పంపేవారట.
Wow !! So beautifully rendered this soulful Kirtan by Mrs.Gursharan Kaur, w/o Dr. Manmohan Singh ( former Prime Minister of India) pic.twitter.com/0HPVtxfzA0
— Indu Kumari (@InduKumari1) November 5, 2023
డా. మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్ (GursharanKaur) ఎవరు?
మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్ 1937, సెప్టెంబర్ 13; జలంధర్‌లో జన్మించారు. యాదృచ్చింగా మన్మోహన్ కూడా సెప్టెంబరు (1932, సెప్టెంబర్26) లోనే పుట్టారు. తండ్రి, సర్దార్ చత్తర్ సింగ్ కోహ్లీ, బర్మా-షెల్‌లో ఇంజనీర్. ఏడుగురు తోబుట్టువులలో ఈమె చిన్నది. 1958లో మన్మోహన్ సింగ్ , గురుశరణ్ కౌర్ వివాహం జరిగింది.
మన్మోహన్ సింగ్ భార్య 2009లో ఫ్యాషన్ మ్యాగజీన్ వోగ్‌లో దర్శనమిచ్చారు. G-20 సమ్మిట్ సందర్భంగా ఏకైక ప్రథమ మహిళ. తన జట్టుకు రంగు వేసుకోకుండా, సహజత్వాన్ని మోసుకెళ్లిన మహిళగా వోగ్ ఆమెను గౌరవించింది. కౌర్ మంచి గాయని కూడా జలంధర్ రేడియోలో కూడా ఆమె కీర్తలను పాడారు. మన్మోహన్ సింగ్ లాగానే, గురుశరణ్ కౌర్ కూడా మృదుస్వభావి.
చెక్కు చెదరని మారుతి
గురుశరణ్ కౌర్ మన్మోహన్ సింగ్‌తో నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. పెళ్లి అయిన కొత్తలో తమ వివాహబంధానికి గుర్తుగా కొనుక్కున్న మారుతి-800ని ఇప్పటికీ ఆమె వాడతారు. అయితే వీరిది ప్రేమ వివాహమా, కాదా అనేదానిపై స్పష్టత లేదు. కానీ వీరి సుదీర్ఘ ఆదర్శ దాంపత్యం ఒక ప్రేమ కావ్యం లాంటిదే.
ముగ్గురు కుమార్తెలు
మన్మోహన్ సింగ్, కౌర్ దంపతులకు కుమార్తెలు ముగ్గరు. వారు ఉపిందర్ సింగ్, అమృత్ సింగ్, దమన్ సింగ్.
పెద్ద కుమార్తె ఉపిందర్ సింగ్ ప్రఖ్యాత చరిత్రకారురాలు. ఆమె అశోక విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ డీన్. గతంలో ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్ర విభాగం హెడ్‌గా పనిచేశారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, మాంట్రియల్‌లోని మెక్‌గిల్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి. ఆమె ప్రాచీన భారతీయ చరిత్ర, పురావస్తు శాస్త్రం, పొలిటికల్ ఐడియాస్పై విస్తృతంగా పరిశోధన జరిపారు. ఆమె రచనలలో ఎ హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ అండ్ ఎర్లీ మెడీవల్ ఇండియా, పొలిటికల్ వయొలెన్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా వంటి పుస్తకాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి.
రెండో కుమార్తె అమృత్ సింగ్ ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది. స్టాన్‌ఫోర్డ్ లా స్కూల్‌లో ప్రాక్టీస్ ఆఫ్ లా ప్రొఫెసర్.రూల్ ఆఫ్ లా ఇంపాక్ట్ ల్యాబ్‌కు వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. యేల్ లా స్కూల్, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీల నుంచి డిగ్రీలను పొందారు. హింస, ఏకపక్ష నిర్బంధ పద్ధతులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికపై సైతం ఆమె తన గళం వినిపించారు.
ఇక చిన్న కుమార్తె దమన్ సింగ్ మంచి రచయిత్రి . లోతైన వ్యక్తిగత, విశ్లేషణాత్మక రచనలకు ప్రసిద్ధి చెందిన నిష్ణాత రైటర్. దమన్ సింగ్ తన తల్లిదండ్రుల జీవితాలలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రతిబింబిస్తూ.. స్ట్రిక్ట్లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్ అనే పుస్తకాన్ని కూడా రాశారు. ది సేక్రేడ్ గ్రోవ్, నైన్ బై నైన్ సహా ఆమె ఇతర పుస్తకాలు కథకురాలిగా ఉన్నారు. దమన్ సింగ్ పుస్తకాలు, రచనలు ఆమె బహుముఖ ప్రజ్ఞను ప్రతిబింబిస్తాయి. ఆమె భర్త అశోక్ పట్నాయక్ 1983 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి.