
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్
అమరావతి: భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్ మరణం పట్ల మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటన్నారు. పదేళ్లపాటు దేశ ప్రధానిగా గొప్ప సేవలందించారని ప్రశంసించారు. ఆర్బీఐ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా ఆర్థిక సంస్కరణలతో దేశ పురోభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు.
రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా, ఆర్థికశాఖ ప్రధాన సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం చైర్మన్‌గా, ప్రధాని సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్‌గా ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ సింగ్ గొప్ప మేధావి అని కొనియాడారు.
దేశంలో పేదరికాన్ని పారదోలేందు కు డాక్టర్ మన్మోహన్ సింగ్ అసమాన సేవలందించారని, ఆయన కలకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్నారు. ఏ బాధ్యత నిర్వహించినాం ప్రతి చోటా తనదైన ముద్ర కనబరిచారని గుర్తు చేశారు. ఆయన దార్శనికత ఎప్పటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. మన్మోహన్‌సింగ్ మృతితో దేశం ఒక మహా నాయకుడిని కోల్పోయిందన్న వైఎస్ జగన్, ఆయన మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
విశిష్ట నాయకుడు: మోదీ
మన్మోహన్ సింగ్ మృతికి జాతి యావత్తు నివాళులర్పిస్తోంది. విజ్ఞానం, వినయం కలిగిన అత్యంత విశిష్ట నాయకులలో ఒకరిని దేశం కోల్పోయింది. నిరాడంబరత కలిగిన వ్యక్తిగా ఆయన గౌరవనీయమైన ఆర్థికవేత్తగా ఎదిగారు. ఆర్థిక మంత్రితోపాటు ఎన్నో ప్రభుత్వం పదవుల్లో సేవలందించారు. ఆర్థిక విధానాల్లో తనదంటూ గట్టి ముద్ర వేశారు. మన ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఎనలేని కృషి చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ నా సానుభూతి.
చదవండి: ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడు
భరతమాత గొప్ప బిడ్డ: రాష్ట్రపతి ముర్ము
భరతమాత గొప్ప బిడ్డల్లో మన్మోహన్ ఒకరు. భారత ఆర్థిక సంస్కరణలకు ఆయన సేవలు మర్చిపోలేనివి. దేశానికి ఆయన సేవలు అమూల్యం. మచ్చలేని రాజకీయ నేత. మనందరికీ తీరని నష్టం.
ఆర్థిక సంస్కరణలకు బాటలు: ధన్‌ఖడ్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులు. దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను ఆయన సమూలంగా మార్చేశారు.
ముందుచూపున్న నేత: ఖర్గే
మన్మోహన్ సింగ్ ముందు చూపున్న నేతను కోల్పోయాం. అసమానమైన పాండిత్యమున్న ఆర్థికవేత్త, దేశ అభివృద్ధి, సంక్షేమం, సమ్మిళిత విధానాలకు దారితీసే ఆయన విధానాలు ఎప్పటికీ గౌరవించబడతాయి. చరిత్రలో మీకు తగు స్థానం దక్కుతుంది.
అరుదైన నేత: ప్రియాంకాగాంధీ
రాజకీయాల్లో సర్దార్ మన్మోహన్ సింగ్ మాదిరిగా గౌరవం పొందేవారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. ఆయన నిజాయతీ మనందరికీ స్ఫూర్తిదాయకం. నమ్మిన వాటికి ఎన్ని అడ్డంకులెదురైనా కట్టుబడి ఉండే అరుదైన నేత.
మార్గదర్శిని కోల్పోయా: రాహుల్
మాజీ ప్రధాని మన్మోహన్ మృతితో గొప్ప మార్గదర్శిని కోల్పోయా. మన్మోహన్ జీ తన అపారమైన విజ్ఞానం, వివేచనతో దేశాన్ని ముందుకు నడిపించారు. ఆయన వినయం, ఆర్థిక శాస్త్రంపై లోతైన అవగాహన స్ఫూర్తిగా నిలుస్తాయి.
దార్శనికత కలిగిన ఆర్థికవేత్త: శరద్ పవార్
మన్మోహన్ మరణ వార్త విని ఎంతో విచారంలో మునిగిపోయాను. ఆయన కన్నుమూతతో దేశం గొప్ప ఆర్థిక వేత్తను, దార్శనికత కలిగిన
సంస్కరణవాది, ప్రపంచ నాయకుడిని కోల్పోయింది.
దిగ్భ్రాంతి కలిగించింది: మమత
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హఠాన్మరణం వార్త విని షాక్‌కు గురయ్యాను. ఆయన విజ్ఞానం అపారం. దేశం ఆయన నాయకత్వాన్ని
కోల్పోయింది. నేను ఆయన ఆప్యాయతను కోల్పోయాను.
తరతరాలకు స్ఫూర్తి: నడ్డా
మన్మోహన్ దార్శనికత కలిగిన నేత. దేశ రాజకీయాల్లో అగ్రగణ్యుడు. సుదీర్ఘ కాలం ప్రజా సేవలో కొనసాగిన ఆయన అణగారిన వర్గాల సంక్షేమం తరఫున నిలిచారు. పార్టీలతో ప్రమేయం లేకుండా ఆయన నాయకత్వం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆయన వారసత్వం దేశ నిర్మాణ సాధనలో తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది.