
హైదరాబాద్: మన దేశంలో లక్షణాలు కనిపించకపోయినప్పటికీ లక్షల మంది దీర్ఘకాలిక వ్యాధులతో జీవిస్తున్నారు. ఈ ‘నిశబ్ధ మహమ్మారి’ గురించి హెల్త్ ఆఫ్ ది నేషన్-2025 (Health Of The nation 2025) పేరిట అపోలో హాస్పిటల్స్(Apollo Hospitals) తన ఐదవ ఎడిషన్‌ని విడుదల చేసింది. ఇందులో దేశ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు వెల్లడయ్యాయి.
"లక్షణాల కోసం ఎదురుచూడకండి.. నివారణ ఆరోగ్యాన్ని మీ ప్రాధాన్యతగా చేసుకోండి"(Don't wait for symptoms--make preventive health your priority) అనే సందేశంతో ఈ నివేదికను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఆరోగ్యాన్ని పరీక్షించి దీన్ని రూపొందించారు.
ఈ నివేదిక మూడు అత్యవసర ఆరోగ్య సవాళ్లపై దృష్టి సారించింది. కొవ్వు కాలేయ వ్యాధి, ఋతుస్రావం ఆగిన తర్వాత ఆరోగ్య క్షీణత, చిన్నారుల స్థూలకాయం రిపోర్ట్ అనే అంశాలు ఇందులో ఉన్నాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే, 26% మంది రక్తపోటు సమస్యతో, 23% మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు తేలింది. అయినప్పటికీ వారికి ఎలాంటి లక్షణాలు కనిపించట్లేదు.
2019లో 10 లక్షల మంది ఆరోగ్య పరీక్షలు చేసుకోగా 2024లో 25 లక్షల మంది హెల్త్ టెస్టులు జరుపుకున్నారు. అంటే వీరి సంఖ్య ఐదేళ్లలో దాదాపు 150% వృద్ధి చెందిదన్నమాట. ఇది ప్రజల్లో నివారణ ఆరోగ్యం పట్ల అవగాహన, ఆసక్తి పెంచుతోందని తెలియజేస్తోంది.
ఏపీ + తెలంగాణ డేటా
- 24% వ్యక్తుల్లో రక్తపోటు (హైపర్‌టెన్షన్) లక్షణాలు గుర్తించబడ్డాయి
- 82% మంది అధిక బరువు-ఊబకాయంతో బాధపడుతున్నారు
- 81% మందికి విటమిన్ D లోపం ఉంది
- దాదాపు 47% మందిలో గ్రేడ్ I ఫ్యాటీ లివర్ లక్షణాలు కనిపించాయి. ఇది మొదటి దశలో ఉండే సమస్య, మెటబాలిక్ అసమతుల్యతలకు, అధిక బరువుకు సంబంధించినది
- 27% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు, ఇది ముఖ్యంగా ఐరన్-సమృద్ధ ఆహారాల్లో లోటును సూచిస్తోంది
- 83% మంది శారీరక కార్యాచరణలో తగ్గుదల వల్ల సడలింపు (ఫ్లెక్సిబిలిటీ) లోపం ఉన్నట్లు గుర్తించబడింది.
ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన కుటుంబాలను సృష్టించేందుకు భారత్ ముందుకు రావాలి. ప్రతి ఇల్లు ఆరోగ్య కేంద్రంగా మారాలి. నివారణ ఆరోగ్య సంరక్షణ ఇకపై భవిష్యత్ ఆకాంక్ష కాదు. ఈ నివేదిక మన బాధ్యతను తెలియజేస్తోంది. ఆరోగ్య ప్రాధాన్యతను తెలియజేసే అంశాలను విద్యార్థులకు బోధించాలి. ఆరోగ్యాన్ని కూడా కుటుంబ దినచర్యల్లో భాగం చేయాలి. అప్పుడే వ్యాధుల చికిత్స నుండి ఆరోగ్య సంరక్షణకు మారగలం, రాబోయే తరాలకు దృఢమైన, ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని అందించగలం.
:::అపోలో చైర్మన్ ప్రతాప రెడ్డి
ఆరోగ్య పరీక్షలు జరిపిన వారిలో 66% మందికి కొవ్వు కాలేయం సమస్యలు ఉండగా.. వారిలో 85% మంది మద్యానికి దూరంగా ఉన్నారనే ఆసక్తికరమైన సంగతిని ఎండీ సునీతా రెడ్డి వెల్లడించారు.