ఇండియాలో తగ్గుతోన్న పొదుపు రేటు.. ప్రపంచంలో నాలుగో స్థానంలో భారత్
సాక్షి, అమరావతి: భారతీయులు పొదుపు తగ్గించుకొని ఖర్చులు చేయడానికే మొగ్గు చూపుతున్నారు. కొంతకాలంగా దేశీయ పొదుపు రేటు తగ్గుతూ వస్తోంది. అంతర్జాతీయంగా పొదుపు రేటులో 2,3 స్థానాల్లో నిలుస్తూ వచి్చన భారత్ ఇప్పుడు నాలుగో స్థానానికి దిగజారిపోయింది. 2023–24 సంవత్సరానికి దేశ జీడీపీలో పొదుపు రేటు 30.2 శాతానికి పడిపోయింది. 2023–24కి సంబంధించి దేశ జీడీపీ రూ.173.82 లక్షల కోట్లుగా ఉంటే అందులో పొదుపు మొత్తం రూ.52.49 లక్షల కోట్లుగా ఉంది.
అంతకుముందు ఏడాది 31.2%గా ఉన్న పొదుపు రేటు ఈ ఏడాది 1% పడిపోయింది. 2011–12లో దేశ పొదుపు రేటు అత్యధికంగా 34%గా నమోదైంది. అప్పటినుంచి పొదుపు రేటు క్రమేపి తగ్గుతూ ఇప్పుడు 30%కి చేరింది. రానున్న కాలంలో ఈ పొదుపు రేటు మరింత తగ్గే అవకాశం ఉందని ఆర్థిక వేత్తల అంచనా.
కానీ అంతర్జాతీయ సగటు పొదుపు రేటు 28.2%తో పోలిస్తే ఇండియా పొదుపు రేటు అధికంగానే ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. చైనా ఆ దేశ జీడీపీ రేటులో 46.6% పొదుపుతో ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలిచింది. అమెరికాలో మాత్రం పొదుపు రేటు18.1%గా ఉంది.7 దేశాలు మాత్రమే 20% కంటే అధిక పొదుపు రేటును కలిగి ఉన్నాయి.
పొదుపు ఖాతాలు పెరుగుతున్నాయి..
పొదుపు రేటు తగ్గుతున్నా పొదుపు ఖాతాలు పెరుగుతున్నాయి. 18 ఏళ్లు నిండిన వారిలో 80% మందికి ఏదో ఒక ఆర్థిక ఖాతాను కలిగి ఉన్నట్లు ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. 2011లో ఈ సంఖ్య 50%గా ఉంటే అది ఇప్పుడు 80%కు పెరిగినట్లు పేర్కొంది. ప్రస్తుత మన దేశ జనాభాలో 18 ఏళ్లు నిండిన వారు 96.88 కోట్లుగా ఉన్నట్లు అంచనా. దీని ప్రకారం చూస్తే 77.5 కోట్ల మంది పొదుపునకు సంబంధించి ఏదో ఒక ఖాతాను కలిగి ఉన్నారు.
మూడేళ్లుగా బ్యాంక్ డిపాజిట్లలో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను తగ్గిస్తూ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, పీపీఎఫ్ వంటి ఇతర పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. 2021లో 47.6 శాతంగా ఉన్న బ్యాంకు డిపాజిట్ల పొదుపు 2023 నాటికి 45.2%కు పడిపోయింది. ఇదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పొదుపు శాతం 7.6% నుంచి 8.4%కు పెరిగినట్లు ఎస్‌బీఐ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment