
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. తనపై బాపట్ల పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పోసాని పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. BNS 35(3) సెక్షన్‌ను ఫాలో కావాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.
కాగా, పోసానిని సీఐడీ పోలీసులు నిన్న (బుధవారం) రాత్రి( గుంటూరులో ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరు పరిచారు. ఈ సందర్భంగా పోసాని అనారోగ్య సమస్యల గురించి విన్నవించుకున్నారు. బెయిల్ రాకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులకు సంబంధించి తనకు ఎటువంటి పాపం తెలియదని, తానేం చేయలేదని న్యాయమూర్తి ఎదుట బోరున విలపించారు.
నిజం మాట్లాడినందుకు తన మీద కక్ష కట్టి ఇలాంటి అన్యాయమైన కేసులు పెట్టారని విన్నవించారు. తల్లి మీద, పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నానని తనకే పాపమూ తెలియదని న్యాయమూర్తిని వేడుకొన్నారు. బెయిల్ ఇవ్వాలని కోరారు. వయసు మీదపడడంతో కూర్చోలేక పోతున్నానని చెప్పుకొచ్చారు. పోలీసులు ఎక్కడినుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదని, ఇప్పటికే కొన్ని వందల మైళ్లు ప్రయాణం చేయించారని, ఎందుకు నన్ను తిప్పుతున్నారో అర్థం కావడం లేదని, ఇలా చేస్తే తాను ఎక్కువ రోజులు బతకనని మొరపెట్టుకున్నారు.
టీడీపీలోకి రమ్మంటే రానందుకు లోకేశ్ తనను వేధిస్తున్నారని, నంది అవార్డుల ప్రకటనలో పక్షపాతాన్ని ఎత్తిచూపడంతో కక్ష కట్టారని తెలిపారు. అన్నీ నిజాలే చెబుతున్నానని నార్కో ఎనాలసిస్ టెస్టుకూ సిద్ధమన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇన్ని కేసులు కడతారా అని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment