
లిఫ్ట్ ప్రమాదంలో సిరిసిల్ల కమాండెంట్ మృతి
తండ్రి మృతదేహాన్ని చూసి విలవిల్లాడిన కూతురు
కలెక్టర్, ఎస్పీ నివాళి
సంతాపం తెలిపిన కేంద్ర మంత్రి బండి, మాజీ మంత్రి కేటీఆర్
సిరిసిల్ల/సిరిసిల్లక్రైం: ‘లే నాన్న.. అమ్మా.. చెల్లి వచ్చాం.. ఒక్కసారి చూడండి నాన్న.. మీరే మా ధైర్యం.. ఇలా వెళ్లి పోతే ఎలా.. మీకు ఎన్ని గాయాలు అయ్యాయి.. నాన్న పడిపోతుంటే.. మీరంతా ఉండి ఏం చేస్తున్నారు..!! అంటూ.. సిరిసిల్లలో ప్రమాదవ శాత్తు మృతిచెందిన 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం(61)(Police Commandant Gangaram) కూతురు డాక్టర్ గౌతమి కన్నీరు కార్చుతూ విలవిలాడిపోయారు. వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావునగర్‌లో రమేశ్ ఇంట్లో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అద్దెకు ఉంటారు. చంద్రశేఖర్‌రెడ్డి కూతురు ఇటీవల మరణించారు.
అతన్ని ఓదార్చేందుకు వారి ఇంటికి వెళ్లిన తోట గంగారాం తిరిగి వస్తుండగా.. లోపల లిఫ్ట్ లేకుండానే గేటు ఓపెన్ కావడంతో అందులో ప్రమాదశాత్తు పడిపోయాడు. మూడో అంతస్తు నుంచి గంగారాం పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది తాళ్ల సాయంతో గంగారాంను బయటకు తీయగా అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. లిఫ్ట్ నిర్వహణ లోపమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు సిద్దిపేటకు చెందిన లిఫ్ట్ నిర్మాణ సంస్థ ప్రతినిధిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పోలీస్ బెటాలియన్‌లో..
సిరిసిల్ల శివారులోని సర్ధాపూర్ 17వ పోలీస్ బెటాలియన్‌లో కమాండెంట్ మృతదేహాన్ని ఉంచి పలువురు నివాళులు అర్పించారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా బెటాలియన్‌కు చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. అంతకు ముందు రాత్రి ఎస్పీ గిటే మహేశ్ బాబా సాహేబ్, ఏఎస్పీ చంద్రయ్య గంగారాం మృతదేహాన్ని పరిశీలించి నివాలి అర్పించారు. గతంలో హైదరాబాద్ సచివాలయం ఛీప్ సెక్యూరిటీ ఆఫీస్(సీఎస్‌వో) గా గంగారాం పని చేశారని, ఆయన మృతిపట్ల సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కె.తారక రామారావు సంతాపం తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్‌కుమార్ పోలీస్ కమాండెంట్ మృతిపై సంతాపం ప్రకటించారు. బెటాలియన్ పోలీస్ సిబ్బంది కన్నీటి నివాళి మధ్య గంగారాం మృతదేహాన్ని స్వగ్రామం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులంకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment