![UNU releases global water security report](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/water.jpg.webp?itok=ELhuzEbw)
అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో నీటికష్టాలు తీవ్రం
2030 నాటికి ప్రపంచంలో నీటి కొరతను ఎదుర్కోనున్న 560 కోట్ల మంది ప్రజలు
పాకిస్తాన్, ఇథియోపియా తదితర 24 దేశాల్లో 6.42 కోట్ల మందికి
తాగడానికి గుక్కెడు మంచినీళ్లు కరువే
నీటి సంక్షోభం వల్ల పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం
ఆహార కొరతతో ఆకలి చావులు భారీఎత్తున పెరిగే ప్రమాదం
భారత్, చైనాకు తప్పని ఇబ్బందులు
యూఎన్‌యూ విడుదల చేసిన ప్రపంచ జలభద్రత నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి: ప్రపంచంలో 2030 నాటికి భారత్, చైనా సహా 113 దేశాల్లోని 560 కోట్ల (72 శాతం) మందిని నీటి కష్టాలు చుట్టుముడతాయా? పాకిస్తాన్, ఇథియోఫియా, హైతీ తదితర 24 దేశాల్లోని 6.42 కోట్ల మంది (8 శాతం) ప్రజలకు తాగడానికి పరిశుభ్రమైన గుక్కెడు తాగునీళ్లు దొరకవా? జల సంక్షోభంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడటం వల్ల ఆకలి చావులు తప్పవా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతోంది ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం(యూఎన్‌యూ) ఇటీవల విడుదల చేసిన ప్రపంచ జలభద్రత నివేదిక.
ప్రపంచ జనాభాలో సుమారు 100 కోట్ల (20 శాతం) మందికి మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉంటాయని నివేదికలో పేర్కొంది. పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా భూతాపాన్ని తగ్గించడం.. మురుగు నీటిని శుభ్రపరిచి పునర్‌వినియోగంలోకి తేవడం.. పంటల సాగులో యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడం ద్వారా జల సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఆ నివేదిక సూచించింది.
17 సుస్థిరాభివృద్ధి సూచికల జారీ
ప్రపంచంలో 195 దేశాలున్నాయి. ఇందులో 193 దేశాలకు ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉంది. నానాటికీ పెరుగుతున్న కాలుష్యం తీవ్రత, వర్షపాతంలో తగ్గుదల, తీవ్రమవుతున్న ఆహార కొరత తదితరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల అభ్యున్నతి కోసం ఐక్యరాజ్యసమితి 17 సుస్థిరాభివృద్ధి సూచికలను ప్రపంచ దేశాలకు నిర్దేశించింది.
ఇందులో ప్రధానమైనది అందరికీ సరిపడా పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచడం (మనిíÙకి రోజుకు కనీసం 50 లీటర్ల పరిశుభ్రమైన నీరు). ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ఈ లక్ష్యంపై ఐఎన్‌యూ 186 దేశాల్లో నివసిస్తున్న 778 కోట్ల ప్రజలకు 2030 నాటికి పరిశుభ్రమైన నీరు ఏ మేరకు అందుబాటులో ఉంటుందనే అంశంపై అధ్యయనం చేసింది. అందులో వెల్లడైన అంశాలతో ప్రపంచ జల భద్రత నివేదికను ఇటీవల విడుదల చేసింది.
» మురుగు నీటిని శుభ్రపరిచి పునర్ వినియోగంలోకి తేవడం, పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే జలభద్రత
» పంటల సాగులో యాజమాన్య పద్ధతుల ద్వారా సమర్థవంతంగా నీటి వినియోగం
» తద్వారా జల సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని సూచన
కాలుష్యం, వాతావరణ మార్పుల వల్లే..
ప్రపంచవ్యాప్తంగా కాలుష్య తీవ్రత నానాటికీ తీవ్రమవుతోంది. ఇది భూతాపాన్ని పెంచుతోంది. దాంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఇది ఎల్‌నినో.. లానినో పరిస్థితులకు దారితీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రుతుపవనాల గమనాన్ని ఎల్‌నినో, లానినోలు దెబ్బతీస్తున్నాయి.
వర్షం కురిస్తే కుంభవృష్టిగా కురవడం.. లేదంటే రోజుల తరబడి వర్షాలు కురవకపోవడం (డ్రై స్పెల్) వంటి అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు నీటికొరతకు ప్రధాన కారణం. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలుగా మార్చడంపై దృష్టి పెట్టకపోవడం.. భూగర్భ జలాలను ఇష్టారాజ్యంగా తోడేయడం కూడా నీటి కొరతకు దారితీస్తోంది. పంటల సాగులో యాజమాన్య పద్ధతులను పాటించకుండా ఇష్టారాజ్యంగా నీటిని వినియోగిస్తుండటం కూడా నీటి ఎద్దడికి దారితీస్తోంది.
ఆసియా–పసిఫిక్ దేశాలపై తీవ్ర సంక్షోభం
రుతుపవనాలపై అత్యధికంగా ఆధారపడేది ఆసియా–పసిఫిక్ దేశాలే. ఎల్‌నినో, లానినో ప్రభావం అత్యధికంగా పడేది ఈ దేశాలపైనే. ఇందులో అత్యధిక జనాభా ఉన్న చైనా, భారత్ ఉన్నాయి. అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల ఆసియా–పసిఫిక్ ప్రాంతంలోని 113 దేశాల్లోని 560 కోట్ల మంది ప్రజలకు నీటికష్టాలు చుట్టుముడతాయి.
పాకిస్తాన్, ఇథియోపియా, హైతీ, చాద్, లైబేరియా, మడగాస్కర్ తదితర 24 దేశాల్లోని 6.42 కోట్ల మందికి తాగడానికి పరిశుభ్రమైన గుక్కెడు నీళ్లు కూడా అందుబాటులో ఉండవు. ఫిన్‌ల్యాండ్, అమెరికా, న్యూజిలాండ్, నార్వే, యునైటెడ్ కింగ్‌డమ్, స్వీడన్, స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్, లాత్వియా తదితర దేశాల్లోని 100 కోట్ల మంది, 49 దేశాల్లోని 100 కోట్ల మంది ప్రజలకు మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment