
ట్రెండ్ మార్చిన మహిళలు
2025లో మహిళల ‘సోలో ట్రావెలింగ్’ ప్రధాన ట్రెండ్
గతేడాది కంటే 7 శాతం పెరుగుతుందని అంచనా
పాప్ సంస్కృతి, రిట్రీట్ వెల్నెస్ పర్యాటకానికి ఆసక్తి
పర్యాటక శక్తి కేంద్రంగా ప్రకాశిస్తున్న ఆసియా
వీసా ప్రాసెసింగ్ ప్లాట్‌ఫామ్ నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: పర్యాటకుల అభిరుచి కొత్త పుంతలు తొక్కుతోంది. వర్తమాన జీవితంలో సంతోషానికే ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ క్రమంలోనే 2025 సంవత్సరం మహిళల సోలో ప్రయాణాలకు కేరాఫ్‌గా మారనుంది. దీనికితోడు వెల్నెస్ రిట్రీట్‌లు, పాప్ సంస్కృతి ప్రేరేపిత టూర్లపై ఆసక్తి కనిపిస్తోంది. వీసా ప్రాసెసింగ్ ప్లాట్‌ఫామ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ఈ ఏడాది అత్యంత ముఖ్యమైన ట్రెండ్‌లలో ‘సోలోగా మహిళా ప్రయాణం’ ఒకటిగా నిలుస్తోంది.
2024లో సోలో వీసాలకు దరఖాస్తు చేసిన మహిళలు 30 శాతం ఉంటే.. ఈ ఏడాది 37 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తోంది. సుమారు 25–40 ఏళ్ల మధ్య మహిళలు సోలో ట్రిప్‌లను ఉద్యమంగా చేపట్టబోతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. బాలి, థాయ్‌లాండ్, జపాన్ వంటి గమ్యస్థానాలలో సాహస యాత్రల ద్వారా తమ అన్వేషణను చేపట్టాలని భావిస్తున్నట్టు తేలింది.
పర్యాటక శక్తి కేంద్రంగా ఆసియా
ప్రపంచ ప్రయాణ రంగంలో ఆసియా ఆధిపత్యం కొనసాగుతోంది. థాయ్‌లాండ్, జపాన్, వియత్నాంతో పాటు ఇండోనేషియా 2025లో అత్యంత పర్యాటక రద్దీని ఎదుర్కోనుంది. వీసా రహిత విధానాలు, వివిధ ఎక్స్‌పోలు లక్షలాది మంది సందర్శకులను ఆకర్షించనుంది. సింగపూర్‌కు చెందిన డిస్నీ క్రూయిజ్‌కు 27 శాతానికిపైగా డిమాండ్ పెరగనుంది.
నోరూరించ రుచుల కోసం
ప్రయాణ ప్రణాళికలో ఆహారం ప్రధాన భాగంగా మారుతోంది. 2025లో వంటకాల పర్యాటకం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇటలీ ట్రఫుల్ ఫెస్టివల్, థాయ్‌లాండ్ సాంగ్‌క్రాన్ ఫుడ్ ఫెస్టివల్ వంటి ఐకానిక్ ఈవెంట్లు ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నాయి. అదే సమయంలో స్లోవేనియా, లావోస్, ఫారో దీవులు వంటి ఆఫ్‌బీట్ గమ్యస్థానాలు సాహస యాత్రల అనుభవాలను మహిళలు కోరుకుంటున్నారు.
ఆరోగ్యకర ప్రయాణం
ప్రయాణికులు తమ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలి, తైవాన్ వంటి ప్రశాంతమైన గమ్యస్థానాలలో యోగా, ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువ ప్రాంతాలను చుట్టిరావడం కంటే ఒకే ప్రాంతంలో అనుభూతులను పూర్తిగా ఆస్వాదించేలా ‘స్లో ట్రావెలింగ్’ భావనను అలవర్చుకుంటున్నారు.
మరోవైపు పాప్ సంస్కృతి ప్రయాణాన్ని ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా ఇష్టపడుతున్నారు. అభిమానులు తమకు ఇష్టమైన సినిమాలు, ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాల నుంచి ప్రేరణ పొంది టూర్లను ప్లాన్ చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment