Adventure Travel
-
10 మంది మహిళా సైనికులు సముద్రంలో 7 రోజులు
మనం నేల మీద మన రోజువారీ వ్యవహారాలు చూసుకుంటూ ఉండగా ఇటీవల నీటి మీద ఒక సాహసం జరిగింది. బంగాళాఖాతంలో పది మంది మహిళా ఆర్మీ ఆఫీసర్లు ఒక్క పురుషుడి తోడు కూడా లేకుండా చిన్న యాట్ (తెరచాపతో నడిచే చిన్న పడవ)లో చెన్నై నుంచి విశాఖపట్నంకు తిరిగి విశాఖపట్నం నుంచి చెన్నైకు 7 రోజుల్లో సాహస యాత్ర చేశారు. ఫిబ్రవరి 15న చెన్నైలో బయలుదేరిన ఈ యాత్ర ఫిబ్రవరి 23న ముగిసింది. ‘నిజానికి మా యాత్ర 4 రోజుల్లో ముగుస్తుంది అనుకున్నాం. కాని సముద్రం లెక్క సముద్రానికి ఉంటుంది. అలలు, గాలులు మనం ఎప్పుడు గమ్యం చేరాలో నిర్దేశిస్తాయి. అందుకే 7 రోజులు పట్టింది’ అంది ఈ బృందానికి కెప్టెన్‌గా వ్యవహరించిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముక్త శ్రీ గౌతమ్. ‘ఆర్మీ అడ్వంచర్ వింగ్’ ఆధ్వర్యంలో ‘ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సెయిలింగ్ అసోసియేషన్’ నిర్వహణలో ఈ సాహస యాత్ర జరిగింది. ఈ యాత్రలో ఆర్మీ నుంచి ఎంపిక చేసిన 10 మంది మహిళా ఆఫీసర్లను ఎంపిక చేశారు. కెప్టెన్ ముక్త శ్రీ గౌతమ్ కాకుండా మేజర్ సంజనా మిట్టల్, మేజర్ అర్పితా ద్వివేది, కెప్టెన్ మాళవికా రావత్, కెప్టెన్ శుభమ్ సోలంకి, మేజర్ ప్రియా సంవాల్, మేజర్ ప్రియా దాస్, కెప్టెన్ జ్యోతి సింగ్, మేజర్ రష్మిల్, కెప్టెన్ సోనాల్ గోయల్ ఉన్నారు. ‘నేటి మహిళలు స్త్రీల పట్ల మన దేశంలో ఉన్న మూస అభిప్రాయాలను బద్దలు కొడుతున్నారు. వారు ధైర్యానికి కొత్త ప్రమాణాలు లిఖిస్తున్నారు’ అని చెన్నైలో జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. నిజమే. ఈ పదిమంది అలాంటి ధైర్యం చూపారు. ‘మాలో ఎక్కువమందికి ఇదే తొలి నౌకాయానం. కాని మాలో ఏదైనా సాహసం చేయాలన్న కోరిక ఎక్కువ. అందుకే ఈ యాత్రకు సై అన్నాం. మాకు 25 రోజులు ముంబైలోని మార్వెలో శిక్షణ ఇచ్చారు. అక్కడ పడవల గురించి, నౌకాయానం గురించి, సముద్రపు అలల గురించి తెలియ చేశారు. ఆ తర్వాత చెన్నైలో మేము ఏ యాట్ మీద అయితే ప్రయాణించాలో దాని మీద 10 రోజుల శిక్షణ ఇచ్చారు. కాని తీరంలో శిక్షణ వేరు. నిజమైన సముద్ర ప్రయాణం వేరు అని యాత్ర మొదలయ్యాక అర్థమైంది’ అంటారు ఈ బృంద సభ్యులు. చెన్నైలో ఫిబ్రవరి 15న బయలుదేరిన ఈ బృందం 330 నాటికల్ మైళ్లు (611 కి.మీ) ప్రయాణించి 54 గంటల్లో ఫిబ్రవరి 17న విశాఖ చేరుకుంది. అక్కడ యాట్‌ను ఒకసారి చెక్ చేసుకుని తిరిగి 18న బయలుదేరి 23న చెన్నై చేరుకున్నారు. వచ్చే సమయం కన్నా వెళ్లే సమయం ఎక్కువ పట్టింది. ‘కాకినాడ–కృష్ణపట్నం మధ్యలో ఉండే నూనె బావులను, చేపల వలల్ని తప్పించుకునేందుకు మేము బాగా సముద్రం లోపలికి వెళ్లాం. మా యాత్రలో ఒక పౌర్ణమి రాత్రి ఉంది. ఆ రాత్రంతా తీవ్రంగా ఉన్న సముద్ర అలలపై ప్రయాణం సవాలుగా మారింది’ అంది మేజర్ ముక్త. ఆమెది రాజస్థాన్. సముద్రమే లేని ప్రాంతం నుంచి సముద్రాన్ని ఈ యాత్రతో గెలిచింది. అయితే ఇదంతా సులభం కాదు. 44 అడుగుల పొడవు మాత్రమే ఉండే ఈ యాట్‌లో 150 చదరపు అడుగుల కేబిన్ ఉంటుంది. ఈ కేబిన్‌లోనే కిచెన్, టాయిలెట్లు, రెస్ట్ ప్లేస్ ఉంటాయి. పనిని బృందాలుగా విభజించుకుని ఒక బృందం డ్యూటీ దిగితే మరో బృందం డ్యూటీ ఎక్కితే డ్యూటీ దిగిన బృందం నిద్రకు ఉపక్రమించవచ్చు. కానీ అలల తాకిడికి కదిలే యాట్‌లో నిద్ర అంత సులభం కాదు. అయినా బృంద సభ్యులు లెక్క చేయలేదు. ‘మా యాత్రలో పెద్ద పెద్ద సముద్ర తాబేళ్లు చూశాం. ఒక డాల్ఫిన్ల గుంపు మా వెనుక చాలాసేపు వచ్చింది. అద్భుతం’ అంటారు మేజర్ ప్రియా దాస్. భారత నేవీ, తీర ప్రాంత గస్తీ దళాలు వీరి యాత్ర సాగినంత మేర వీరి యాట్‌ను ట్రాక్ చేస్తూ సాంకేతిక సహకారాన్ని అందించాయి. ‘నేను కేన్వాస్ మీద ప్రతిసారీ నీలి రంగును చిత్రించేదాన్ని. ఈ యాత్రతో జీవితకాలపు నీలిమను నేను గుండెల్లో నింపుకున్నాను’ అంది ప్రియా దాస్. స్త్రీలు నౌకాయానంలో రాణించాలని, సెయిలింగ్ క్రీడలో భాగస్వామ్యం తీసుకోవాలని వారికి సందేశం ఇవ్వడానికి ఈ యాత్ర చేశారు వీరంతా. 7500 కిలోమీటర్ల మేర తీరం ఉన్న మన దేశంలో నౌకాయానం వల్ల స్త్రీలు ఎంతో ఉపాధి పొందవచ్చు అని ఆలోచిస్తే ఈ సాహస యాత్ర పూర్తిగా విజయవంతమైనట్టే. -
అందుకే ఇన్ని సాహసాలు చేస్తున్నాను: సవితారెడ్డి
‘‘జీవితంలో ఏదీ అసాధ్యం కాదు. అన్నీ సుసాధ్యమే. నూటికి నూరుపాళ్లు అనుకున్నది సాధించవచ్చు. నీ కలను నిజం చేసుకోవడానికి నీవే శ్రమించాలి. లక్ష్యాన్ని చేరే వరకు నీ ప్రయత్నాన్ని ఆపవద్దు. అప్పుడు విజయం నీదై తీరుతుంది. అనారోగ్యం నిన్ను చూసి పారిపోతుంది. ఇందుకు అసలైన నిర్వచనం ఈ సాహసి జీవితం. ‘‘సాహసం చేయకపోతే జీవితంలో అనేక అనుభవాలకు, ఆనందాలకూ దూరంగా ఉండిపోతాం. అందుకే సాహసించాల్సిందే’’ అంటున్న ఈ సాహసి పేరు సవితారెడ్డి. ఆమె ఫ్యాషన్ డిజైనర్, అడ్వెంచరస్ టూరిస్ట్. హైదరాబాద్ కొంపల్లిలో ఉంటారు. మసాబ్ ట్యాంకు నుంచి రాజేంద్రనగర్, హెచ్‌సీయూ, నార్సింగి, రోడ్ నంబర్ 45 నుంచి ఐకియా, ఖాజాగూడల్లో ఉదయం పూట జనసంచారం తక్కువగా ఉన్న సమయంలో విశాలమైన రోడ్ల మీద సైక్లింగ్ చేస్తూ కనిపిస్తారు. ఈమె గత ఏడాది రెండు కాళ్లకు సర్జరీ చేయించుకున్నారు. ఫిట్నెస్ను తిరిగి సాధించుకోవడానికి సైక్లింగ్ ప్రాక్టీస్ చేస్తూ కశ్మీర్‌లోని ‘గ్రేట్ లేక్స్ ఆఫ్ కశ్మీర్’ట్రెకింగ్ టూర్‌కి సిద్ధమవుతున్నారు. మహిళకు సెలవేది? ఒక సామాన్యమైన కుటుంబం లో మహిళ జీవితం ఎలా ఉంటుంది? పిల్లల స్కూళ్లకు, కాలేజ్‌లకు సెలవులుంటాయి. భర్త ఆఫీస్‌కి సెలవులుంటాయి. తనకు మాత్రం సెలవు ఉండదు. తనకంటూ ఒక ఆటవిడుపు ఉండాలని కోరుకున్నా సరే సాధ్యపడదు. ఆ మహిళ గృహిణి అయినా ఉద్యోగి అయినా, ఎంటర్ప్రెన్యూర్ అయినా సరే... ఈ కుటుంబచిత్రమ్లో పెద్ద తేడా ఏమీ ఉండదు. మహిళలు ఆ రొటీన్ నుంచి బయటకు వచ్చి కొద్దిగా రెక్కలు తగిలించుకోవాలంటారు సవిత. ఈ విషయంలో హైదరాబాద్ మహిళ ఓ అడుగు ముందుకేసిందని కూడా అన్నారామె. మహిళ తన సంతోషం కోసం ఇంకా ఇంకా గొంతు విప్పాలనేదే నా కోరిక. అందుకే ఇన్ని సాహసాలు చేస్తున్నాను. మరింత మందిని ప్రోత్సహిస్తున్నానని చెప్పారు సవిత. దేశమంతా పెరిగాను! సవిత తండ్రి ఎయిర్‌ఫోర్స్ అధికారి కావడంతో ఆమె బాల్యం దేశంలోని అనేక ప్రదేశాల్లో సాగింది. దాదాపుగా ముప్పై ఏళ్ల కిందట ఫ్యాషన్ డిజైనింగ్ ఒక కోర్సు రూపంలో యూనివర్సిటీ కరిక్యులమ్‌లో చేరిన తొలి రోజుల్లో, ఏ మాత్రం ఉపాధికి భరోసా కల్పించలేని ఆ కోర్సులో చేరాలనుకోవడమే పెద్ద సాహసం. అలాంటి రోజుల్లో ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశారామె. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో సొంతంగా తన పేరుతోనే ఫ్యాషన్ డిజైనింగ్ యూనిట్ ప్రారంభించారు. ‘‘పాతికేళ్ల పాటు చాలా సీరియెస్‌గా ఫ్యాషన్ ఇండస్ట్రీ కోసం పని చేశాను. నా యూనిట్ చూసుకుంటూ మధ్యలో కార్ ర్యాలీలు, ట్రెక్కింగులతో జీవితాన్ని సంతోషంగా గడిపాననే చెప్పాలి. 2017లో ఎవరెస్ట్ బేస్ క్యాంపు అధిరోహించాను. అయితే అన్ని రోజులూ ఒకేరకంగా ఉండవు కదా! ఆ తర్వాతి ఏడాది కాళ్లు నాకు పరీక్ష పెట్టాయి. మాల్ అలైన్మెంట్ సమస్యతో బౌడ్ లెగ్స్గా మారిపోయాయి. ట్రెకింగ్ కాదు కదా మామూలుగా నడవడం కూడా కష్టమైంది. ఆ క్షణంలో నేను రిస్క్ తీసుకోవడానికే సిద్ధమయ్యాను. హై టిబియల్ ఆస్టియోటమీ సర్జరీ చేయించుకున్నాను. మోకాళ్ల నుంచి మడమల మధ్య ఉండే ఎముకను వంపు తీసి సరిచేసి ప్లేట్ అమర్చి స్క్రూలతో బిగిస్తారన్నమాట. గత ఏడాది ఆగస్టులో ఒక కాలికి, నవంబరులో మరో కాలికి సర్జరీ అయింది. కొంతకాలం వీల్ చెయిర్‌కి పరిమితమయ్యాను. తర్వాత వాకర్‌తో రోజులు గడిచాయి. ఇక ఇప్పుడు నా ఫిట్‌నెస్‌ని తిరిగి తెచ్చుకోవాలి. అందుకే ఈ సైక్లింగ్. వారంలో మూడు రోజులు సైక్లింగ్ రోజుకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు, మరో మూడు రోజులు గంటపాటు వాకింగ్... ఇదీ ఇప్పుడు నా రొటీన్. ఈ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో కశ్మీర్లో ట్రెకింగ్‌కి సిద్ధమవుతున్నాను’’ అని చెప్పారు సవిత. ఇంత సాహసం అవసరమా? ‘‘నలభై ఎనిమిదేళ్ల వయసులో ఆ సర్జరీ అవసరమా, మందులతో రోజులు వెళ్లదీయవచ్చు కదా’ అని అడిగే వాళ్లకు నేను చెప్పే సమాధానం ‘అవసరమే’ అని. ఏ వయసులోనైనా మనిషి జీవితం తన చేతుల్లోనే ఉండాలి. అనారోగ్యం కారణంగా మరొకరి మీద ఆధారపడే పరిస్థితిలోకి జారిపోకూడదు. పైగా నలభై ఎనిమిది అంటే... అభిరుచులను కట్టిపెట్టి జీవితాన్ని నిస్సారంగా గడిపే వయసు కాదు. నాకు ఇష్టమైన కార్ ర్యాలీ, ట్రెకింగ్ వంటివేవీ చేయలేనప్పుడు, భారంగా అడుగులేసుకుంటూ రోజులు గడిపే జీవితం నాకు అవసరమా... అనేది నా ప్రశ్న. అందుకే ఈ సర్జరీలో సక్సెస్ రేట్ ఫిఫ్టీ– ఫిఫ్టీ అని తెలిసినప్పటికీ నేను రిస్క్ తీసుకోవడానికే సిద్ధపడ్డాను. మనం అనుకున్నట్లు జీవించడానికి అనారోగ్యాన్ని అధిగమించడానికి మొదట మానసికంగా సిద్ధం కావాలి. ఇప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా, ఫిట్‌గా ఉన్నాను. నా డిజైనింగ్ స్టూడియోని నడుపుకుంటున్నాను. నా ట్రెకింగ్ ఇంటరెస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోగలను కూడా’’ అని ఆత్మవిశ్వాసంతో కూడిన నవ్వుతో చెప్పారు సవిత. – వాకా మంజులారెడ్డి -
గ్రేట్ జర్నీ.. సోలోగా.. ధైర్యంగా
‘ఆకాశమే మన హద్దు... అవకాశాలను వదలద్దు’ ఇదేదో పర్సనాలిటీ డెవలప్మెంట్ నినాదంలా అనిపిస్తోంది. కానీ ఈ అడ్వంచరస్ ఉమన్ గురుదీపక్ కౌర్‌ను చూస్తే ఇలాంటి మరెన్నో స్ఫూర్తివచనాలు చెప్పాలనిపిస్తుంది. 73 ఏళ్ల వయసులో ఆమె సొంతంగా కారు నడుపుకుంటూ ఒంటరిగా కొత్త ప్రదేశాలను చూడడానికి వెళ్తుంటారు. సోలో ట్రావెలర్, సోలో ఉమెన్ ట్రావెలర్... ఇవేవీ గురుదీపక్కు సరిపోకపోవచ్చు. సీనియర్ సోలో అడ్వెంచరస్ ట్రావెలర్ అనాల్సిందే. ఆమె మాత్రం ‘వయసు ఒక సంఖ్య మాత్రమే. మన ఉత్సాహానికి వయసు అడ్డుకట్ట వేయలేదు. బాధ్యతలు కొంత వరకు వేగాన్ని అదుపు చేస్తుంటాయి. కానీ నాకు బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు ఫ్రీ బర్డ్ని. కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లు నా చేత ప్రయాణం చేయిస్తున్నది... ప్రపంచాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఒక్కటే’’ అంటారు. మూడు రోజుల రైలు ప్రయాణం జీవితంలో పరిస్థితులే తన చేత ఒంటరి ప్రయాణాలు చేయించాయంటారు గురుదీపక్ కౌర్. ‘‘నాన్న మిలటరీ పర్సన్, బదిలీలుంటాయి. పన్నెండేళ్ల వయసు నుంచి ప్రయాణం అంటే మా వస్తువులు మేమే ప్యాక్ చేసుకుని సిద్ధం అయ్యేవాళ్లం. ‘ప్యాకింగ్, మూవింగ్, మీటింగ్ న్యూ పీపుల్’ ఇదే మా లైఫ్. ఇక ఒంటరి ప్రయాణాలు పెళ్లి తర్వాత మొదలయ్యాయి. నా భర్త కూడా మిలటరీ పర్సనే. పెళ్లయిన తర్వాత రెండో ఏడాదిలో ఆయనకు కర్నాటక, బెల్గామ్‌లో పోస్టింగ్ వచ్చింది. చండీగర్ నుంచి రెండు నెలల బాబుతో, ఎనిమిది పెద్ద పెద్ద చెక్క పెట్టెలతో బెల్గామ్‌కు ప్రయాణమయ్యాను. అప్పట్లో విమానాలు ఇంత ఎక్కువగా ఉండేవి కావు. రైల్లో మూడు రోజుల ప్రయాణం. అది నా తొలి ఒంటరి ప్రయాణం మాత్రమే కాదు, సాహసోపేతమైన ప్రయాణం కూడా. కారులో షికారు గురుదీపక్ కౌర్ తొలి సోలో ఇంటర్నేషనల్ టూర్ 1994లో చేశారు. యూఎస్‌కు ఒంటరిగా వెళ్లడం మాత్రమే కాదు, స్థానికంగా ప్రదేశాలను చూడడానికి రైల్లో ఒంటరిగానే ప్రయాణించారు. ఇదంతా బాగానే ఉంది. కానీ సొంతంగా కారు నడుపుకుంటూ ప్రయాణించడం 2013లో మొదలైంది. సాంత్రో కారులో చండీగర్ నుంచి బెంగళూరుకు బయలుదేరారు గురుదీపక్ కౌర్. ఢిల్లీ, అజ్మీర్, ఉదయ్‌పూర్, అహ్మదాబాద్, ముంబయి మీదుగా బెంగళూరు చేరారు. ఆ తర్వాత ఏడాది ఉత్తరాఖండ్‌కు కారు తీశారు. కొండలు, లోయల మధ్య మెలికలు తిరిగిన రోడ్డు మీద కారు నడుపుతూ తాను చూడదలుచుకున్న ప్రదేశాలను చుట్టి వచ్చారు. ప్రమాదం తప్పింది దేహం అలసటగా ఉన్నప్పుడు ట్రిప్ మొదలు పెట్టవద్దని చెబుతారు కౌర్. దేహం ఫిట్‌గా ఉందా నీరసంగా ఉందా అనేది ఎవరికి వాళ్లకు తెలుస్తుంది. దేహం అలసటకు మానసిక అలసట కూడా తోడైతే... ఇక వాహనం నడప కూడదని చెబుతూ మూడేళ్ల కిందట తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పారామె. ‘‘ముంబయికి వెళ్లినప్పుడు కారు నడుపుతూ తీవ్రమైన అలసటతో రోడ్డు పక్కన కారాపి కొన్ని క్షణాలపాటు స్టీరింగ్ మీద తల వాల్చాను. మెలకువ వచ్చేసరికి కారు కదులుతోంది. అప్పటికే చెట్ల పొదల్లోకి వచ్చేసింది. వెంటనే అప్రమత్తమై బ్రేక్ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది’’. ఇల్లు అపురూపమే... ‘‘ప్రతి మహిళకూ నేను చెప్పేది ఒక్కటే. ఇల్లు, కుటుంబం బాధ్యతలు ఎలాగూ ఉంటాయి. బాధ్యతల పట్ల బాధ్యతరహితంగా ఉండవద్దు. బాధ్యతలతోపాటు మీకూ కొంత సమయం కేటాయించుకోండి. మీకంటూ సొంతంగా కొంత డబ్బు ఉంచుకోండి. ఏడాదిలో కొన్ని రోజులు మీరు మీరుగా జీవించండి. ఆ తర్వాత తిరిగి మీ బాధ్యతల వలయంలోకి వచ్చి పడినప్పటికీ అప్పుడు ఆ బాధ్యత బరువుగా అనిపించదు. మానసికంగా ఒత్తిడిని కలిగించదు. మనకు ఇల్లు అపురూపమైనదే, అలాగే ప్రపంచం అందమైనది. ఆ అందానికి కూడా మన జీవితంలో స్థానం కల్పించాలనే విషయాన్ని మర్చిపోవద్దు’’ అంటారు గురుదీపక్ కౌర్. -
Ponmudi: కేరళ బంగారం.. పొన్ ముడి
కశ్మీరు లోయ... కన్యాకుమారి చెంతకు వచ్చినట్లుంది. సముద్రం అంటే ఏమిటో ఎరుగని కశ్మీర్ పశ్చిమ కనుమలను ఆసరాగా చేసుకుంటూ అరేబియా తీరం వెంబడే దక్షిణాదికి నడిచి వచ్చినట్లు ఉంటుంది పొన్ముడి. పొన్ముడి అంటే బంగారు శిఖరం అని అర్థం. ఇక్కడి వాతావరణాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించిన వాళ్లు ఈ ప్రదేశాన్ని కశ్మీర్‌తో పోలుస్తారు. కేరళలోని ఈ హిల్స్టేషన్లో ఏడాదంతా ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉంటాయి. పర్వత శిఖరాలను తాకుతూ ప్రయాణించే మబ్బులను దక్షిణాదిలో చూడాలంటే ఈ పొన్ముడిలోనే సాధ్యం. ఈ కేరళ కాశ్మీరం ఆ రాష్ట్ర రాజధాని త్రివేండ్రం నగరానికి డెబ్బై కిలోమీటర్ల దూరాన ఉంది. జ్ఞాపకంగా ఓ రాయి త్రివేండ్రం నుంచి మొదలైన రోడ్డు ప్రయాణంలో నగరాన్ని వదిలినప్పటి నుంచి పశ్చిమ కనుమల పచ్చదనం ఆహ్వానిస్తుంది. రోడ్డు మలుపులు తిరుగుతూ ఉంటుంది. కొంతసేపటికి ఏ దిక్కుగా ప్రయాణిస్తున్నామో కూడా అర్థం కాదు. ఈ మధ్యలో కల్లేరు నది పలకరిస్తుంది. ఈ నదిలో రాళ్లు నీటి ప్రవాహానికి అరిగిపోయి నునుపుదేలి ఉంటాయి. బాగా నునుపుదేలిన ఒక రాయిని వెంట తెచ్చుకుంటే పొన్ ముడి టూర్ జ్ఞాపకంగా ఉంటుంది. పొన్ ముడి శిఖరం మీద నిలబడి ఆత్మప్రదక్షిణం చేసుకుంటే ప్రకృతి విజయం కనువిందు చేస్తుంది. గ్లోబల్ వార్మింగ్‌లు, సునామీలు ఎన్ని విపత్తులు వచ్చినా ప్రకృతి తిరిగి చిగురించడం మానదు. అదే ప్రకృతి సాధించే విజయం. ఇక పొన్ ముడి టూర్లో తీరాల్సిన అద్భుతం అందమైన సూర్యోదయం. పశ్చిమ కోన వరయాడు అంటే నీలగిరి థార్. నీలగిరి థార్ ఉండే ఎల్తైన ప్రదేశమే వరయాడు మొట్ట. ఇది మూడు వేల ఐదు వందల అడుగుల ఎత్తు ఉంటుంది. కల్లేరు నదికి పొన్ ముడి పర్వత శిఖరానికి మధ్యలో వరయాడు మొట్ట వస్తుంది. ఇది పదమూడు శిఖరాల సమూహం. ఇందులో సెకండ్ హయ్యస్ట్ వరయాడు మొట్ట. సౌత్ ఇండియాలో అడ్వంచరస్ ట్రెక్కింగ్ పాయింట్. ట్రెకింగ్ మొదలైన అరగంటకే ఉచ్ఛ్వాశ నిశ్వాసల వేగం పెరుగుతుంది, శబ్దం స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ట్రెకింగ్‌కి రెండు నెలలు ముందు బుక్ చేసుకోవాలి. జంతుప్రేమికులు, పక్షి ప్రేమికులు వాళ్ల ఆసక్తిని బట్టి వరయాడు మొట్ట, సీతతీర్థం మీదుగా పొన్ ముడి చేరుకోవచ్చు. ట్రావెల్ టిప్ ట్రెకింగ్‌కి వెళ్లే వాళ్లు షూస్ పట్ల ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి. పాదానికి, మడమకు అదనపు ఒత్తిడి కలగకుండా సౌకర్యంగా ఉండాలి. అలాగే ట్రెకింగ్ మొదలు పెట్టేటప్పుడు సాక్స్ ధరించడానికి ముందు పాదానికి, వేళ్ల సందుల్లో టాల్కమ్ పౌడర్ చల్లాలి. ఇలా చేయడం వల్ల రోజంతా షూస్‌తోనే ఉన్నప్పటికీ పాదాలు తాజాగా ఉంటాయి. చెమటతో చిరాకు కలగదు. వరయాడు మొట్టకు పర్యాటకుల ట్రెకింగ్ -
అందరం మనమే ఆనందం మనదే
ఇంట్లో ఉన్నది చాలు కాసింత ఊపిరి పీల్చుకుందాం పద అని బయలుదేరారు ఇండోర్ స్త్రీలు. అక్కడి ‘అడ్వంచరస్ ఉమెన్ గ్రూప్’ కోవిడ్ వల్ల గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉంది. ఇప్పుడు కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూనే దీపావళి వేళ పండగ పర్యటనకు బయలుదేరారు. ఇండోర్ వ్యాపారవేత్త శ్రేష్టా గోయల్ ఈ గ్రూప్‌ను నడుపుతారు. స్త్రీలను విహారాలు, పర్యటనలు, యాత్రలు చేసేందుకు ప్రోత్సహిస్తుంటారు. సెప్టెంబర్ 20, 2020న ఇండోర్‌లో ఒక ఈవెంట్ జరిగింది. దానిని ఆర్గనైజ్ చేసింది ఆ నగరంలో ఉన్న ‘అడ్వంచరస్ ఉమెన్ గ్రూప్’. దాని స్థాపకురాలు శ్రేష్టా గోయల్. ఆ ఈవెంట్ పేరు ‘డ్రైవింగ్ ఈజ్ మై పేషన్’. ఇండియాలో కార్లున్న లక్షలాది ఇళ్లల్లో స్త్రీలకు ఆ ఇళ్లలోని వంట గదులో, వరండాలో అప్పజెబుతుంటారు డ్రైవింగ్ చేయడానికి కారు మాత్రం ఇవ్వరు. ఎంత ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్నా కారులో కూచోబెట్టి ఊరికో, ఉద్యోగానికో తీసుకెళ్లి దింపుతారు కాని స్టీరింగ్ అప్పజెప్పరు. అయితే ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక సర్వేల ప్రకారం పురుషుల కంటే స్త్రీలే సేఫ్ డ్రైవర్లని తేలింది. అయినా సరే స్త్రీలకు కారు డ్రైవింగ్ ఇంకా నిరాకరింపబడే విషయంగానే ఉంది. అందుకే శ్రేష్టా ఈ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేసింది. 10 రోజులు 200 మంది సెప్టెంబర్ 10 నుంచి 30వ తేదీ వరకూ దేశంలోని ఐదారు రాష్ట్రాలు, కేరళతో సహా కార్లు డ్రైవ్ చేసే స్త్రీలు వారు గృహిణులు, ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు వచ్చి ఇండోర్‌లో తమ వాహనాలతో తిరిగారు. ‘డ్రైవింగ్ ఈజ్ మై పేషన్’ అని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇండోర్‌లో, మధ్యప్రదేశ్‌లో, ఇతరరాష్ట్రాలలో వివిధ శాఖలలో పని చేస్తున్న స్త్రీలు.. ముఖ్యంగా కారు డ్రైవ్ చేసుకుంటూ ఆఫీసుకు వచ్చే ఉద్యోగులు స్త్రీలను ఉత్సాహపరచడానికి వీడియోలు విడుదల చేశారు. ‘జీవితంలో ముందుకు వెళ్లాలంటే వాహనాన్ని నడపడం తెలియాలి. ఈ స్కిల్ స్త్రీలకు చాలా ముఖ్యం. కారు నడపడం లగ్జరీ కాదు. అవసరం. పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఒంటరి కారు ప్రయాణాలు చేయగలరు. అడ్వంచర్లు చేయగలరు. నేనైతే కారులో జైపూర్ నుంచి బద్రీనాథ్‌కు, మంగళూరు నుంచి కేరళకు కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాను. రాక్ ది రోడ్స్’ అంటూ ఇండోర్ ఎయిర్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ అర్యామా సన్యాల్ ఒక వీడియో విడుదల చేశారు. ‘డ్రైవింగ్ చేస్తే ఫోకస్ తెలుస్తుంది. వాహనాన్నే కాదు జీవితాన్ని కంట్రోల్ చేయడం కూడా తెలుస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది’ అని కర్ణాటక రాష్ట్రమహిళా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం అధ్యక్షురాలు శిఖ ఒక వీడియో విడుదల చేశారు. మొత్తంగా ఈ ఈవెంట్ విజయవంతమైంది. స్త్రీలు తమ డ్రైవింగ్ అనుభవాలు పంచుకుని స్త్రీలను ఉత్సాహపరిచారు. దీని కారకులలో ముఖ్యురాలు శ్రేష్టా గోయల్. అడ్వెం‘టూర్’ ఇండోర్‌లో ఒక ఫార్మాసూటికల్ కంపెనీ సి.ఇ.ఓ అయిన శ్రేష్టా గోయల్ తనకు అత్యంత ఇష్టమైన విషయం తన జిప్సీని డ్రైవ్ చేయడమే అని చెప్పుకుంటారు.‘జీవితమే ఒక సాహసం. ప్రయాణాల ద్వారా ఆ సాహసాన్ని కొనసాగించాలి’ అని చెబుతారామె. అందుకనే ఇండోర్‌లో ఆమె ‘అడ్వంచరస్ ఉమెన్ గ్రూప్’ అనే సంస్థను స్థాపించారు. కాళ్లకు చక్రాలున్నాయని నమ్మే స్త్రీలు ఈ గ్రూప్‌లో సభ్యులు. ఇంటికి, ఉపాధికి సమయం ఇస్తూనే తమదంటూ జీవితాన్ని లోకం చూడటం ద్వారా గడపడానికి ఇష్టపడే స్త్రీలు ఈ గ్రూప్ ద్వారా ఒక చోట చేరారు. ‘మేము పర్యటించడమే కాదు పర్యటించమని స్త్రీలకు స్ఫూర్తినిస్తాం’ అంటారు వాళ్లు. ఈ టూర్లను అడ్వెంటూర్లని అంటారు. రెండు మూడు నెలలకోసారి వీరో పర్యటనను ప్లాన్ చేస్తారు. ‘అందరం మనమే ఆనందం మనదే’ అన్నట్టు తిరుగుతారు. నదులు, పర్వతాలు, అడవులు వీరి పర్యటనా స్థానాలు. అడపాదడపా ఇంటికి వచ్చే బంధువులు, వెళ్లే బంధువులు పిండివంటలు ఇంటి అలంకరణలు... ఈ పని ఎలాగూ తప్పదు. దానికి సిద్ధమయ్యే ముందు ఈ లాక్డౌన్ ఇచ్చిన వొత్తిడి నుంచి తప్పించుకోవడానికి ఒక విహారం అవసరం అని అక్టోబర్ 9న ‘అడ్వంచరస్ ఉమెన్ గ్రూప్’ సభ్యులు ఇండోర్ నుంచి కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూనే ఒకరోజు విహారానికి బయలుదేరారు. యాభైకిలోమీటర్ల చుట్టుపక్కల ప్రాంతాలు చూసి వచ్చారు. చాలా బాగా అనిపించింది’ అంది శ్రేష్టా గోయల్. ఇండోర్‌లోనే కాదు దేశంలోని ప్రతి చిన్న పట్టణంలో ఇలాంటి బృందాలు అవసరం అనిపిస్తుంది వీరిని చూస్తుంటే. -
ఈ బస్సు ఎక్కాలంటే రూ.15 లక్షలు కట్టాలి!
న్యూఢిల్లీ: భారత దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి యునైటెడ్ కింగ్డమ్ రాజధాని లండన్ వరకు బస్సు ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా అనిపిస్తోన్న ఈ సాహస యాత్రకు శ్రీకారం చుట్టింది అడ్వెంచర్స్ ఓవర్‌ల్యాండ్. గురుగ్రామ్‌కు చెందిన ఈ ట్రావెల్ కంపెనీ ఢిల్లీ నుంచి లండన్‌కు బస్సు నడపనున్నట్లు ఆగస్టు 15న ఒక ప్రకటన విడుదల చేసింది. 18 దేశాల గుండా బస్సు ప్రయాణం సాగనున్నట్లు తెలిపింది. 70 రోజుల పాటు 20 వేల కి.మీ ప్రయాణించనుంది. మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, చైనా, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జెర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల గుండా బస్సు వెళుతుంది. 20 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్రత్యేక బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఓ గైడ్, హెల్పర్ ఉంటారు. (వైరల్ : అందుకే అవంటే మాకు ప్రాణం!) ఈ ప్రయాణానికి వెళ్లాలనుకునేవారికి వీసా ఏర్పాట్లు కూడా సదరు కంపెనీయే చేసి పెడుతుండటం విశేషం. అయితే కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇంకా రిజిస్ట్రేషన్ మొదలు పెట్టలేదని అడ్వెంచర్స్ ఓవర్‌ల్యాండ్ సహ వ్యవస్థాపకుడు తుషార్ అగర్వాల్ పేర్కొన్నారు. అన్ని దేశాల్లో కరోనా ఉధృతి తగ్గిన తర్వాత దీన్ని చేపడతామని తెలిపారు. ప్రయాణికులకు మార్గమధ్యలో స్టార్ హోటళ్లలోనే బస కల్పిస్తామంటున్నారు. ఏ దేశంలో ఉన్నా భారతీయ వంటకాలు ఉండేట్లు చూసుకుంటామని పేర్కొన్నారు. ఇన్ని విశేషాలున్న ఈ బస్సు ప్రయాణం వచ్చే ఏడాది మేలో ప్రారంభం కానుంది. మీరు కూడా ఈ ట్రిప్ వేయాలనుకుంటే రూ.15 లక్షలు టికెట్ రుసుముగా చెల్లించాల్సిందే. (ర్యాప్ స్టార్ పాడు పని : 24 ఏళ్ల జైలు) -
రజనీకాంత్ సాహసయాత్ర
-
మోదీ వర్సెస్ వైల్డ్
డెహ్రాడూన్: ప్రముఖ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్(45) ప్రధాని మోదీతో కలిసి ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్పెట్ జాతీయ పార్కులో సాహసయాత్ర చేపట్టారు. బెంగాల్ పులులు, మొసళ్లు, విషసర్పాల మధ్య ఎలా మనుగడ సాగించాలో గ్రిల్స్ మోదీకి వివరించారు. ఈ సందర్భంగా తన బాల్యం, ఎదుర్కొన్న కష్టాలు, రాజకీయ జీవితంపై పలు ఆసక్తికర అంశాలను ప్రధాని ఆయనతో పంచుకున్నారు. ప్రకృతిలో మమేకమై ఎలా జీవించాలో వివరించారు. పులుల అడుగుజాడల్ని చూసుకుంటూ వీరిద్దరూ హిమాలయాల్లోని ఓ నదిని తెప్పపై దాటారు. ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో భాగంగా చిత్రీకరించిన ఈ సాహస యాత్ర సోమవారం డిస్కవరీ గ్రూప్ ఛానళ్లలో ప్రపంచవ్యాప్తంగా 180కిపైగా దేశాల్లో ప్రసారమైంది. ఈ సందర్భంగా మోదీ, గ్రీల్స్ మధ్య సాగిన ఆసక్తికర సంభాషణ ఇదే.. ► బేర్ గ్రిల్స్: జిమ్ కార్పెట్ ఫేమస్ కదా సార్? మోదీ: అవును ఇది ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం. వృక్షాలపై అధ్యయనం చేయాలనకునేవారికి ఇక్కడుండే వందలాది రకాల చెట్లు ఉపయోగపడతాయి. పర్వతాలు, నదులతో పాటు అడవి జంతువులు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. భారత్ భిన్నత్వంలో ఏకత్వం సాధించిన దేశం. 100 భాషలు, 1,600 యాసలు ఇక్కడ ఉన్నాయంటే భారత్‌లో ఏ స్థాయిలో భిన్నత్వం ఉందో మీరే అర్థం చేసుకోండి. ► ఈ ప్రాంతం ప్రమాదకరమని భావిస్తున్నారా? ప్రకృతిని మనమెప్పుడూ ప్రమాదకరంగా భావించకూడదు. ప్రకృతితో పోరాడితే అన్ని సమస్యలే ఎదురవుతాయి. అదే ప్రకృతికి అనుగుణంగా కలిసిజీవిస్తే క్రూరమృగాలు కూడా సహకరిస్తాయి. ► మోదీజీ.. చిన్నప్పుడు మీరు మంచి స్టూడేంటా? మంచి స్టూడేంటా? కాదా? అని అంటే చెప్పలేను. ► ఇప్పుడు మీరు స్టైలిష్ దుస్తులు ధరిస్తున్నారు. చిన్నప్పుడూ ఇంతేనా? చిన్నప్పుడు నేను సామాన్యంగానే జీవించా. మురికి బట్టలే వేసుకున్నా. కానీ స్కూలుకు వెళ్లేటప్పుడు మాత్రం శుభ్రమైన యూనిఫాంను వేసుకెళ్లేవాడిని. అందుకోసం నిప్పు కణికలను ఓ రాగి చెంబులో వేసి యూనిఫాంను ఇస్త్రీ చేసుకునే వాడిని. స్కూలు అయిపోయాక పాకెట్ మనీ కోసం నాన్నతో కలిసి రైల్వేస్టేషన్ దగ్గర టీ అమ్మేవాడిని. అలా రైల్వేలు నా జీవితంలో కీలకపాత్ర పోషించాయి. మా ప్రాంతంలో మంచు కురిశాక దానిపై ఉప్పులాంటి పొర ఏర్పడేది. దాన్ని జాగ్రత్తగా సేకరించి దాచి పెట్టుకునేవాళ్లం. స్నానం సమయంలో ఆ ఇసుకనే వాడేవాళ్లం. వేడి నీటిలో ఈ ఇసుక వేసి బట్టలను ఉతికేవాళ్లం. ► మీరు చిన్నప్పుడు హిమాలయాలకు వెళ్లారట? అప్పుడు నా వయసు 17–18 సంవత్సరాలు ఉంటుంది. నేను ఇళ్లు వదిలేశా. ప్రపంచాన్ని చూడాలనుకున్నా. హిమాలయాలకు వెళ్లగానే అక్కడి ప్రకృతి నచ్చింది. అక్కడే రుషులను కలుసుకున్నాను. అక్కడి మనుషుల మధ్య గడపడం అద్భుతమైన అనుభవం. అప్పటి శక్తే నన్ను ఇంకా నడిపిస్తోంది. నేను కలుసుకున్న రుషులంతా చాలా నిరాడంబరంగా ఉన్నారు. వాళ్లు ఒక్క కార్బన్ వ్యర్థాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఈ సందర్భంగా మా నాన్న గురించి చెప్పాలి. మా ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా వర్షాలు పడినప్పుడు మా నాన్న 25–30 పోస్ట్‌కార్డులు కొనేవారు. మా ప్రాంతంలో వర్షం పడిందని బంధువులందరికీ లేఖలు రాసేవారు. ఈ అనవసర ఖర్చు ఎందుకని మేం గోల చేసేవాళ్లం. అప్పట్లో నేనూ ఆశ్చర్యపోయేవాడ్ని. ప్రకృతి పట్ల ఆయనకున్న అభిమానం అలాంటిది. ఆ విలువ ఏంటో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. అనంతరం వారిద్దరూ కలిసి ఎత్తుగా ఉన్న గడ్డి ప్రాంతాన్ని దాటి నదీతీరానికి చేరుకున్నారు. ► మీరు ప్రధాని కావాలని ఎప్పుడు అనుకున్నారు? నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు పనిచేశా. అది నాకు కొత్త ప్రయాణం. ఆ తర్వాత ఈ పని(ప్రధాని బాధ్యతలు) చేపట్టాలని దేశం ఆదేశించింది. అందుకే ఐదేళ్లుగా పనిచేస్తున్నా. ఈ కాలంలో అభివృద్ధిపైనే నేను దృష్టి సారించాను. ప్రజల కలల్ని నా కలలుగా చేసుకుని పనిచేశా. ప్రజల కలల సాకారంతోనే నాకు సంతృప్తి లభిస్తుంది. 18 సంవత్సరాల తర్వాత మొదటిసారి నేను సెలవు తీసుకున్నా. ► ప్రధాని హోదా మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టిందా? మోదీ: నా మెదడు ఎప్పుడూ హోదా గురించి ఆలోచించదు. అలాంటివాటికి నేను అతీతుడ్ని. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రధానిగా ఉన్నా, నా మెదడు కేవలం పనిగురించే ఆలోచిస్తూ ఉంటుంది. పదవి అనేది నా ఆలోచనల్లోకి కూడా రాదు. ► చిన్నప్పుడు మీరు మొసలిని ఇంటికి తీసుకెళ్లారట.. అసలేం జరిగింది? ఓ అదా.. నేను రోజూ చెరువులో స్నానం చేసేవాడిని. అక్కడ కనిపించిన ఓ మొసలి పిల్లను ఇంటికి పట్టుకెళ్లా. దీంతో మా అమ్మ ‘తల్లీబిడ్డలను వేరుచేయడం తప్పు. దాన్ని మనం పెంచుకోకూడదు. వెళ్లి వదిలేసి రా’ అని చెప్పింది. ప్రకృతిని చూసి మనమెప్పుడూ భయపడకూడదు. అలా భయపడితేనే సమస్యలు ఉత్పన్నమవుతాయి. ► భారీ ర్యాలీల్లో పాల్గొనేటప్పుడు ఎదురయ్యే ఆందోళనను ఎలా ఎదుర్కొంటారు? నా సమస్య ఏంటంటే నేనెప్పుడూ అలాంటి భయాన్ని ఎదుర్కోలేదు. కాబట్టి భయం గురించి ప్రజలకు చెప్పలేను. నా స్వభావం చాలా సానుకూలమైనది. నేను ప్రతీదాంట్లో మంచినే చూస్తా. అనుకున్నపని జరగకపోతే బాధపడను. ► మీరు యువతకిచ్చే సందేశం ఏమిటి? నేను యువతకు చెప్పేదొకటే. జీవితాన్ని ముక్కలు ముక్కలుగా చూడొద్దు. జీవితాన్ని సంపూర్ణంగా చూస్తే అందులో ఎత్తుపల్లాలు ఉంటాయి. మనం కిందపడ్డా బాధపడకూడదు. తిరిగి పైకిలేవడానికి అక్కడే దారి మొదలవుతుంది. అనంతరం మోదీ, గ్రిల్స్ కలిసి నదిని దాటారు. ప్రధానిని టార్పాలిన్‌తో చేసిన తెప్పలో ఎక్కించిన గ్రిల్స్ దాన్ని తోసుకుంటూ నదిని దాటారు. ఈ సందర్భంగా వర్షం కురవడంతో మోదీ, గ్రిల్స్ తడిసిపోయారు. దీంతో ఇద్దరూ కరివేపాకులు కలిపిన టీని తాగారు. ► ప్రకృతి పరిరక్షణ అంటే మీకు ఇష్టమా..? మేం ఇండియాలో ప్రతీ చెట్టును దేవుడిగా భావిస్తాం. ఇక్కడ ‘తులసీ వివాహం’ అని సంప్రదా యం ఉంది. ఇందులో భగవంతుడిని, తులసి మొక్కకు ఏడాదికోసారి పెళ్లి చేస్తాం. అలా తుల సీదళాన్ని మా కుటుంబంలో భాగం చేసుకుంటాం. భూమిని కాపాడుకోవడమన్నది మన బాధ్య త. మన సుఖం కోసం ప్రకృతిని దోచుకుంటున్నాం. ► స్వచ్ఛ భారత్ కోసం ఏం చేయాలంటారు? బయటివారి వల్ల స్వచ్ఛభారత్ సాధ్యం కాదు. భారత్‌లో ఉండేవారి స్వభావం వల్లే దేశం క్లీన్ అవుతుంది. వ్యక్తిగత శుభ్రత అన్నది భారతీయ సంస్కృతిలోనే ఓ భాగం. ఇప్పుడు సామాజిక పరిశుభ్రత అలవర్చుకోవాలి. ఈ విషయంలో మహాత్మాగాంధీ చాలా కృషి చేశారు. ► చంపడం నా స్వభావానికి విరుద్ధం ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి ఓ కత్తి, తాడు, కర్ర సాయంతో బల్లెం తయారుచేశారు. పులులు తాము వేటాడే జంతువును సమీపించేవరకూ నక్కి ఉండి ఒక్కసారిగా దాడిచేస్తాయని గ్రిల్స్ తెలిపారు. పులి సమీపిస్తే ఇలా దాడిచేయాలంటూ బల్లెం వాడే పద్ధతిని చూపించారు. దీంతో మోదీ స్పందిస్తూ..‘చంపడం నా స్వభావానికి విరుద్ధం. ఈ ఆయుధాన్ని మీరే తీసుకోండి’ అని చెప్పారు. దీంతో గ్రిల్స్ దాన్ని తీసుకోబోతుండగా..‘పర్లేదు. మీకోసం నేను దీన్ని తీసుకుంటా’ అని చెప్పారు. ఈ సందర్భంగా గ్రిల్స్ స్పందిస్తూ..‘సార్ ఒకవేళ ఇప్పుడు పులి వస్తే మీరెంత వేగంగా పరిగెత్తగలరు?’ అని ప్రశ్నించారు. దీంతో మోదీ..‘మీరు చెప్పండి’ అని అడిగారు. దీంతో గ్రిల్స్ ‘నేను మీకంటే వేగంగా పరిగెత్తగలను’ అని జవాబిచ్చారు. వెంటనే మోదీ ‘అవునా!’ అంటూ తేరిపారా చూశారు. మోదీ మాటకు గ్రిల్స్ స్పందిస్తూ..‘ఇది పేలని జోక్ సార్. నేను మిమ్మల్ని వదిలి వెళతానా?’ అంటూ వ్యాఖ్యానించారు. బేర్‌తో కలసి తెప్పపై నదిని దాటుతున్న ప్రధాని -
కారులో అమెరికా టూ హైదరాబాద్: ప్రత్యేక ఇంటర్వ్యూ
గొప్ప కుటుంబంలో జన్మించడం అంటే డబ్బున్న కుటుంబంలో పుట్టడం కాదని, ఇష్టమైన పని కోసం అవసరమైతే ఎంతకైనా తెగించాలని నిరూపించారు డా. రాజేశ్ కడాకియా. తాను చదువుకునే గాంధీ కాలేజీలో సమస్య ఉందని తెలుసుకుని తాతయ్యతో పొట్లాడి రెండున్నర కోట్ల రూపాయలతో గాంధీ ఆసుపత్రిలో ఐసీయూ కట్టించారాయన. యువకుడిగా ఉన్న సమయంలో తనకిష్టమైన ఆఫ్ రోడ్ రేసులో జాతీయ స్థాయిలో చాంపియన్‌గా నిలిచి అప్పటి ప్రధాని ఇంధిరాగాంధీ చేతుల మీదుగా బహుమతిని అందుకున్నారు. గుండెకు స్టంట్ పడ్డా, హై-బీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నా వెరవక భార్యతో కలసి కారులో విహరిస్తూ సొంతవూరికి చేరాలనే ఆకాంక్ష రాజేశ్ కడాకియా, దర్శన దంపతులను గమ్యం చేరేలా చేసింది. 63 ఏళ్ల వయసులో అమెరికా నుంచి హైదరాబాద్‌కు 37000 కిలో మీటర్లు కారులో వచ్చిన డా. రాజేశ్ కడాకియా, డా. దర్శనలతో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రశ్న : సుదీర్ఘ ప్రయాణంలో మీకు నచ్చిన ప్రదేశం రాజేశ్ : అమెరికా, ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, డెన్మార్క్, నెదర్లాండ్, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా, కజకిస్తాన్, మంగోలియా, చైనా, టిబెట్లలో తిరిగినా నేపాల్ బోర్డర్ దగ్గరకు రాగానే ప్రాణం లేచివచ్చినట్టయింది. నేపాల్ బోర్డర్‌కు చేరుకునే సమయానికి భారీ వర్షం కురుస్తోంది. అప్పటికే కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఫోన్లో చార్జింగ్ అయిపోవడంతో జీపీఎస్ కూడా పనిచేయడం లేదు. కిలోమీటర్ల మేర లారీలు నిలిచిపోయాయి. గమ్యం ఎక్కడుందో కూడా తెలియక రోడ్డు మీద కారులోనే ఇద్దరం 2 గంటలు కునుకు తీశాం. నేపాల్-భారత్ బోర్డర్లో 'భారత్ మే ఆప్ కా స్వాగత్ హై'.. అనే బోర్డు చూడగానే ఒక్కసారిగా ఆనందానికి అవధులు లేవు. అందుకే మా జర్నీలో భారత్‌లోకి ప్రవేశించడం మరువలేని ఘట్టం. ప్రశ్న : పెద్ద వయసులో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కదా.. రిస్క్ అనిపించలేదా? రాజేశ్ : నాకిప్పుడు 63 ఏళ్లు, డయాబెటిక్ పేషెంట్‌ని, గుండెకు ఓ స్టంట్ కూడా వేశారు. హై బ్లెడ్ ప్రెషర్ సమస్య కూడా ఉంది. ఆరోగ్య సమస్యలున్న వారు.. వయసు మళ్లిన వారు జీవితంలో ఇంకా ఏమీ చేయలేమని బాధపడుతుంటారు. అలాంటి వారికి మా ట్రిప్ స్పూర్తినిస్తుందని అనుకుంటున్నా. అంతలోనే పక్కనే ఉన్న భార్య దర్శన 'అయ్యో ప్రజల్లోకి తప్పుడు మెసేజ్ పోతుంది కదా' అన్నారు. అలాంటి వారిని ఇలా ట్రిప్‌లకు వెళ్లమని సలహా ఇవ్వడం నా ఉద్దేశం కాదు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే వారు మానసికంగా ధైర్యంగా ఉండాలి. అప్పుడే శరీరం కూడా అన్ని రకాలుగా సహకరిస్తుంది. గుండెకు చిన్న స్టంట్ పడినంత మాత్రాన ఏదో కోల్పోయామని జీవితాంతం కుంగిపోకూడదు. ప్రశ్న : యాత్రకు బ్రేక్ ఇవ్వాలని ఎప్పుడైనా అనిపించిందా ? రాజేశ్ : మౌంట్ ఎవరెస్ట్ గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆక్సిజన్ అందకపోవడంతో దర్శన తీవ్ర చాలా ఇబ్బంది పడింది. దీంతో వెంటనే ఎవరెస్ట్ కిందకి దిగి ఆసుపత్రికి తీసుకువెళ్లాను. రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని తిరిగి యాత్ర ఆరంభించాం. దర్శనకి ఆరోగ్య సమస్య రావడంతో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్దామని అన్నాను. తన వల్ల ఈ యాత్రకు బ్రేక్ పడకూడదని, ఎలాగైనా కొనసాగించాల్సిందేనని ఆమె పట్టుబట్టింది. ప్రశ్న : ఇంత లాంగ్ జర్నీ ఎందుకు ప్లాన్ చేశారు? రాజేశ్ : మా అమ్మను కలవడానికి. విమానంలో వచ్చి వెళ్లిపోవొచ్చు. కానీ నా సతీమణితో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తూ పుట్టిన దేశానికి రావాలనుకున్నా. అందుకే 8 నెలల పాటూ అన్ని రకాల పర్మిషన్లు తీసుకొని యాత్రను ప్రారంభించాం. ప్రశ్న : ఈ ట్రిప్ కోసం ఎవరి దగ్గరైనా సహాయం తీసుకున్నారా.. ముఖ్య ఉద్దేశ్యం ఏంటి ? రాజేశ్ : స్పాన్సర్స్లేరు, మెకానిక్‌లు లేరు, రోడ్డుపైన ఏమైనా అయితే కనీసం ఎవరైనా సహాయం చేస్తారో లేదో కూడా తెలియదు. 60 రోజుల్లో మూడు ఖండాలు, 18 దేశాల గుండా మా ప్రయాణం సాగింది. ఇద్దరు 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఇంత సాహసం చేశారంటే, మనం ఏమీ చేయలేమా? అని ఈ ట్రిప్ గురించి చదివిన యువతకు వారి వారి రంగాల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో స్పూర్తినిస్తే మాకు అది చాలు. ప్రశ్న : ఈ ట్రిప్ ప్రారంభించినప్పుడు ఎవరెవరికి చెప్పారు.. రాజేశ్ : ఆస్తులున్నాయి.. పిల్లలున్నారు, మనవళ్లున్నారు.. ఈ టైమ్‌లో ఈ ట్రిప్ అవసరమా అని చాలా మంది వారించారు. ఏదో ఒక రోజు నేను చనిపోవాల్సిందే. ఏదో గుర్తింపు కోసమో లేక పేరు కోసమో మేం ఈ ట్రిప్‌ను ప్లాన్ చేయలేదు (పక్కనే ఉన్న దర్శన.. ఎక్కడ వద్దంటారేమోనని ఈ ట్రిప్ ప్రారంభించినప్పుడు కనీసం ఆయన సోదరుడికి కూడా ఈ విషయం చెప్పలేదు). కేవలం మా ఆసక్తి మీదే ఈ యాత్ర చేశాం. ఎంత కష్టమైనా మీకిష్టమైన, మీరు చేయాలనుకున్న పని చేయండి. అందులో సంతృప్తి ఉంటుంది. ప్రశ్న : మిగతా దేశాల్లో మీరు బాగా గమనించింది. రాజేశ్ : చైనా చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మనకు స్వాతంత్ర్యం ఉచితంగా రాలేదు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నాం. ఇంగ్లీషు మాట్లాడే 450 మిలియన్ల యువత మన దగ్గర ఉంది. ప్రపంచంలో మరెక్కడా ఇంత యువశక్తి లేదు. దర్శన కల్పించుకుని.. చైనా వంటి దేశం ఎన్నో వస్తువులను కాపీ కొడుతూ మార్కెట్లోకి విడుదల చేసి అభివృద్ధిలో దూసుకుపోతోంది. మన సొంత పరిజ్ఞానంతో తయారు చేసిన మరిన్ని వస్తువులను మార్కెట్లోకి విడుదల చేయాలి. ప్రశ్న : ఈ ప్రయాణంలో మన దేశ ఆనవాళ్లు ఎక్కడైనా కనిపించాయా? రాజేశ్ : వివిధ దేశాల్లో మన దేశ సంపదను ప్రదర్శనకు పెట్టి డబ్బు సంపాదిస్తున్నారు. సెయింట్స్ పీటర్స్ బర్గ్, లండన్లలో మన దేశానికి చెందిన చారిత్రక సంపదను మ్యూజియంలో ఉంచి వాటిని చూడటానికి డబ్బు వసూలు చేస్తున్నారు. వెల కట్టలేని ఎన్నో విలువైన వస్తువులు భారత్ నుంచి విదేశాలకు చేరాయి. వాటిని డబ్బు పెట్టి చూస్తే చాలా బాధ అనిపించింది. వాటిని తిరిగి భారత్‌కు తెప్పించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ప్రశ్న : ట్రాఫిక్ విషయంలో అధికారుల తప్పిదాలు ఏమైనా గమనించారా ? రాజేశ్ : భారత్-నేపాల్ బోర్డర్లో ట్రక్కులు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. రెండు అడుగులు ముందుకు పోతూ ఇంజిన్ ఆఫ్ చేస్తూ తిరిగి ఆన్ చేయడం ఇలా గంటలపాటూ ఈ ప్రక్రియ కొనసాగింది. అంత పెద్ద ట్రక్కు ఆన్ చేస్తూ కొద్ది దూరానికే ఆఫ్ చేస్తూ వెళితే డీజిల్‌కు ఎంతో డబ్బు వృథా అవుతుంది. ఇలాంటి ఘటనలు పెట్రో దిగుమతులు పెరగడానికి కారణం అవుతున్నాయి. వీటిని అరికట్టాలి. సమస్య ఎక్కడుందో కనుగొనాలి. ప్రశ్న : కాలుష్యంపై భారత్‌లో మీరు గమనించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా ? రాజేశ్ : భారీ వాహనాల వచ్చే పొగ రోడ్డు పైన నడిచేవారి మొహంపైకి వెళుతోంది. అలా కాకుండా యూనివర్సిటీల్లో ఉన్న మెరికల్లాంటి విద్యార్థులను పిలిపించి.. సమస్యలకు పరిష్కారం కనుక్కొవొచ్చు. ట్రక్కుల నుంచి పొగ పక్కన నుంచి కాకుండా పైనుంచి వచ్చేలా మరో డిజైన్ని తయారు చేస్తే బావుంటుంది. దీని వల్ల 50 శాతం ఊపిరితిత్తుల సమస్యలు తగ్గిపోతాయి. ప్రశ్న : జర్నీలో ఆయా దేశాల స్థానిక పోలీసులతో ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా ? రాజేశ్ : రష్యా నుంచి చైనాలోకి వెళ్లే సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు. కారుతో రావాల్సిన అవసరం ఏముంది అంటూ పోలీసులు మాపై ప్రశ్నల వర్షం కురిపించారు. డ్రగ్స్ తీసుకువచ్చామేమోననే అనుమానంతో మాతో పాటు కారును కూడా సోదా చేశారు. చివరకు మెడిసిన్స్‌ని కూడా ఒక్కో ట్యాబ్లెట్ తీసి అందులో డ్రగ్స్ ఉన్నాయేమోనని చెక్ చేశారు. ప్రశ్న : ఒక్కో దేశంలో ఒక్కో రకంగా నిబంధనలు ఉంటాయి కదా.. ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా ? రాజేశ్ : మేం ప్రయాణించిన దేశాల్లో ఓ చోట లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఉంటే మరో దేశంలో రైట్ హ్యాండ్ డ్రైవ్ ఉండేది. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఉన్న దేశాల్లో రైట్ హ్యాండ్ డ్రైవ్ వాహనాన్ని నడపడంతో చాలా ఇబ్బందులుపడ్డాం. కొన్ని సందర్భాల్లో ఓవర్టేక్ చేస్తుంటే ఎదురుగా వాహనం వస్తుందని పక్క సీట్లో కూర్చున్న తాను చెప్పేదాన్ని అని దర్శన చెప్పారు. ప్రశ్న : 37000 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కడైనా ప్రమాదం జరిగిందా ? రాజేశ్ : చైనాలో మా కారు గుర్రాన్ని ఢీ కొట్టడంతో బంపర్ వంగిపోయింది. కారు రేడియేటర్ పాడైంది. దాంతో దాదాపు 18 రోజులు పాటు చైనాలోనే గడపాల్సివచ్చింది. ప్రశ్న : ట్రాఫిక్ రూల్స్ ఎక్కడ బాగున్నాయి ? రాజేశ్ : యూరప్, అమెరికాల్లో ట్రాఫిక్ రూల్స్ బాగున్నాయి. ప్రశ్న : ఇద్దరూ డ్రైవ్ చేశారా ? రాజేశ్ : దాదాపు 36,000 కిలోమీటర్లు నేను డ్రైవ్ చేస్తే, దర్శన 1000 కిలోమీటర్లు కారు నడిపింది. ప్రశ్న : హైదరాబాద్‌తో ఉన్న అనుబంధం? రాజేశ్ : సికింద్రాబాద్‌లోనే పుట్టా, ఇక్కడే చదివా. సరోజ, సరస్వతి టీచర్ల దగ్గర చదువుకున్నా (పక్కనే ఉన్న దర్శన ఏప్పుడూ వాళ్ల టీచర్లను గుర్తు చేసుకుంటూ ఉంటారు). గాంధీ మెడికల్ కాలేజీలో జనరల్ సర్జరీలో ఎంఎస్ చేస్తుండగా ఐసీయూ వార్డు కోసం గాంధీ ఆసుపత్రిలో సమ్మె జరిగింది. ఐసీయూ వార్డు లేకపోవడంతో.. ఆ సమయంలో మా తాతయ్యకు విషయం చెప్పా. గొడవ చేసి మరీ మా తాతకు చెందిన ట్రస్ట్ నుంచి రూ. 2.5 కోట్లతో గాంధీ ఆసుపత్రిలో ఐసీయూ కట్టించేలా చేశా. ప్రశ్న : భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు రాజేశ్ : ఉక్రెయిన్, సిరియా, ఇరాన్, ఇరాక్, పాకిస్థాన్లలో పరిస్థితులు బాగాలేవు. అందుకే ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఉత్తరం వైపు నుంచి రావాలని దారిని ఎంచుకున్నాము. మిలటరీ వారితో సమస్యలు తలెత్తకుండా ముందుగానే అన్ని అనుమతులు తీసుకుని జాగ్రత్త పడ్డాం. ప్రశ్న : మీ తదుపరి కార్యచరణ రాజేశ్ : రెండు నెలలుగా జర్నీలోనే ఉన్నాం. యాత్రను విజయవంతంగా పూర్తి చేశాం. మళ్లీ తిరిగి వెళ్లాలి. అక్కడ మా ఆసుపత్రి ఉంది. దాంట్లో పని చేసే స్టాఫ్ మా కోసం ఎదురు చూస్తున్నారు. మమ్మల్ని నమ్ముకుని వారి కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. తిరిగి విధుల్లో చేరాలి. ‘ఒక దేశ గమనాన్ని శాసించే బలం యువతకు మాత్రమే ఉంది. భారతదేశానికి దిశా నిర్ధేశం చేయగలిగేది యువతే. ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థలను కలిగిన దేశాల్లో భారత్ ఒకటి. మరింత కష్టపడితే టాప్కు చేరుకుంటాం. అంతేకాకుండా భారతదేశాన్ని ప్రేమించే ఇండియన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఉన్నత విద్యను అభ్యసించి, మంచి నైపుణ్యం ఉన్న యువత మన దేశానికి ఉన్న బలం. చైనా లాంటి దేశస్తులకు ఈ అవకాశం లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ భాషపై మనకున్నంత పట్టువారికి లేదు. అమెరికాలో ఎన్నో ప్రతిష్టాత్మక కంపెనీలకు సీఈఓలుగా భారతీయులున్నారు. అమెరికాలో ‘భారతీయులంతా ఓ రూమ్లోకొస్తే ఆ గది ఐక్యూ టాప్‌కి చేరుతుంది’ అనే ఓ నానుడి ఉంది. కాలుష్యం, అవినీతి వంటి సమస్యలు ఎప్పుడూ ఉండేవే. ఓ సమాజం ముందడుగు వేసే సమయంలో సమస్యలు సర్వసాధారణం. అమెరికా వంటి దేశంలో కూడా అవినీతి ఉంది. వీటన్నింటిని ఓ కంట కనిపెడుతూనే కష్టపడేతత్వాన్ని మాత్రం ఏ రంగంలోనైనా యువత మరువకూడదు’ అని డా. రాజేశ్ కడాకియా పేర్కొన్నారు. - శ్రీమన్ రెడ్డి చదవండి : కారులో అమెరికా టూ హైదరాబాద్ -
కారులో అమెరికా టూ హైదరాబాద్
సాక్షి, వెబ్ డెస్క్ : భార్యాభర్తలిద్దరూ కష్టపడి చదివారు. జీవితంలో సెట్ అయ్యారు. డాక్టర్లుగా వైద్య వృత్తికి అంకితం అయ్యారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా తీరికలేనంత బిజీగా జీవితం గడిచిపోయింది. డాక్టర్లుగా ప్రజలకు ఇద్దరూ ఎంత సేవ చేసినా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఏదో తెలీని వెలితి వారిని వెంటాడేది. తాము కోల్పోయిన సంతోషాలను, ఆనందాలను తిరిగి పొందేందుకు ఆరు పదుల వయసులో ఈ జంట భారీ అడ్వెంచర్ ట్రిప్‌కు శ్రీకారం చుట్టింది. న్యూయర్క్‌లోని ముక్తా ఆశ్రమం నుంచి హైదరాబాద్‌లోని ఇంటి వరకూ కారులో ప్రయాణించాలని నిర్ణయించారు. 37 ఏళ్ల వైవాహిక జీవితంలో కోల్పోయిన ఎన్నో మధుర క్షణాలను వడ్డీతో సహా కలిపి మూడు నెలల్లో 37 వేల కిలోమీటర్ల ప్రయాణంలో సంపాదించారు. హైదరాబాద్‌కు చెందిన డా. రాజేశ్ కడాకియా, డా. దర్శనలు వృత్తి రీత్యా అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. 63 ఏళ్ల రాజేశ్ కడాకియా(ఎండీ, ఎఫ్ఏసీఈపీ) ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మెడిసిన్, జనరల్ సర్జన్లో పట్టా పొందారు. అనంతరం లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ నుంచి ఎఫ్ఆర్సీఎస్-1 పూర్తి చేశారు. ఎల్ఆర్సీపీ అండ్ ఎమ్ఆర్సీఎస్లో అడిషనల్ డిగ్రీలు కూడా పొందారు. 1987 నుంచి ఫిజీషియన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అమెరికన్ బోర్డ్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్, అమెరికన్ బోర్డ్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ అండ్ హోలిస్టిక్ మెడిసిన్‌లో దౌత్యవేత్తగా కూడా వ్యవహరిస్తున్నారు. డాక్టర్ దర్శన కడాకియా(60) (ఎండీ, ఎఫ్‌సీసీపీ) యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి మెడిసిన్ పట్టాను అందుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి రెసిడెన్సీ అండ్ పల్మోనరీ మెడిసిన్‌లో ఫెలోషిప్ చేశారు. అమెరికన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల దౌత్యవేత్తగా కొనసాగుతున్నారు. రాజేశ్ యువకుడిగా ఉన్నప్పుడే కారుల్లో తెగచక్కర్లు కొట్టేవారు. పలు రేసుల్లోనూ పాల్గొన్నారు. అడ్వెంచర్ ట్రిప్పులంటే ఆయనకు మక్కువ. 1981లో భారతీయ కార్లతో జరిపిన పోటీల్లో జాతీయస్థాయిలో ఆఫ్ రోడ్ చాంపియన్‌గా కూడా నిలిచి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా అవార్డును కూడా అందుకున్నారు. దర్శనకు కూడా ట్రావెలింగ్ అంటే పిచ్చి. వీరిద్దరికి వివాహం జరిగిన తర్వాత రాజేశ్, దర్శన్‌లు డాక్టర్లుగా బిజీబిజీ జీవితంలో నిమగ్నమైపోయారు. కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా సమయం ఉండేది కాదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 37 ఏళ్ల పాటు వైద్యవృత్తిలో నిబద్ధతతో పని చేశారు. డాక్టర్లుగా ఉన్నత శిఖరాలను చేరుకున్నారు. కానీ, వ్యక్తిగత జీవితాన్ని మిస్సవుతున్నామనే ఆలోచన వారిని మెదడుని తొలిచేది. దీంతో భార్యతో కలసి అడ్వెంచర్ ట్రిప్‌కు వెళ్లాలని రాజేశ్ భారీ ప్రణాళికను రూపొందించారు. ఏకంగా అమెరికా నుంచి భారత్‌కు రోడ్డు మార్గం ద్వారా కారులో వెళ్లాలని నిర్ణయించారు. అయితే ఇది ఆషామాషీ వ్యవహారం కాదని వారికి తెలుసు. ఎన్నో అనుమతులు తీసుకోవాలి. ఒక్కో దేశంలో ఒక్కో వాతావరణం ప్రయాణించాల్సి ఉంటుంది. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొవాల్సివుంటుంది. అయినా దేనికి వెరవకుండా ఆరు పదుల వయసులో 'హోమ్ రన్' పేరుతో కాలిఫోర్నియా నుంచి హైదరాబాద్(రాజేశ్ తల్లి కోకిలాబెన్ కడాకియా(85) సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్నారు)కు బయలుదేరారు. ఈ ఏడాది మార్చి 28న కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్‌లోని స్వామి ముక్తానంద ఆశ్రమానికి వెళ్లారు. అక్కడి నుంచి విమానంలో కారును పారిస్‌కు పంపారు. తిరిగి ఏప్రిల్ 12న పారిస్‌లో కారును తీసుకుని ప్రయాణం ప్రారంభించారు. అమెరికా, ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, డెన్మార్క్, నెదర్లాండ్, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా, కజకిస్తాన్, తిరిగి రష్యా, మంగోలియా, చైనా, టిబెట్, నేపాల్‌ల మీదుగా రోడ్డు మార్గంలో భారత్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం ఇండోర్ నుంచి ముంబై మార్గంలో ఉన్నారు. 37 వేల కిలోమీటర్లు ప్రయాణించి జూన్ 12న హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ సాహసయాత్ర వారిద్దరిని దాదాపు మూడు నెలలపాటూ కలిసుండేలా చేసింది. అత్యధిక ఉష్ణోగ్రత, -14 డిగ్రీల చలిలోనూ వీరి ప్రయాణం సాగింది. ‘టయోటా ల్యాండ్ క్రూజర్ రైట్ హ్యాండ్ డ్రైవ్’ డీజిల్ కారును అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది యాత్రకు వినియోగించారు. ప్రతి రంగంలోను విజయం సాధించొచ్చనే స్పూర్తిని యువతలో నింపేందుకే హోమ్ రన్ పేరిట ఈ యాత్ర చేస్తున్నట్లు రాజేశ్ తెలిపారు. మనిషి తలుచుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదని అన్నారు. ఈ నెల 12న రాజేశ్, దర్శనలు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. - శ్రీమన్ రెడ్డి, భరత్ కుమార్ -
ఫిబ్రవరిలో తల్లీకూతుళ్ల సాహసయాత్ర
సాక్షి, బెంగళూరు: నగరానికి చెందిన తల్లీకూతుళ్లు అయిన కెప్టెన్ దీపికా మాబెన్, కూతురు అమె మెహతా మహిళాసాధికారత పై జాగృతం క ల్పించడానికి వినూత్న పంథాను ఎంచుకున్నారు. వచ్చే ఫిబ్రవరి చివరి వారం నుంచి 80 రోజుల పాటు 21 దేశాల మీదుగా 50వేల కిలోమీటర్లు ప్రయాణం చేయనున్నట్లు బుధవారం ఇక్కడ తెలిపారు. రెండు సీ ట్లు, ఒక ఇంజన్ కలిగిన మోటర్ గ్లైడర్ విమానం ద్వారా ఈ యాత్ర చేపడతామని చెప్పారు. అన్ని అనుమతులు రావడానికి కనీసం మూడు నెలలు పడుతుందని, అందువల్లే ఫిబ్రవరి వరకూ వేచి ఉన్నట్లు చెప్పారు. -
21వేల కిమీ, 14 దేశాల మీదుగా...
సాక్షి,అహ్మదాబాద్: 14 దేశాల మీదుగా...21వేల కిలోమీటర్లు...ఒంటెలు, బస్సులు, ట్యాక్సీలు...ట్రైన్లు ఇది ఓ గుజరాతీ యువకుడి సాహస ప్రయాణం. లండన్ నుంచి భారత్‌కు వచ్చిన ద్రుపద్ మిస్త్రీ వండర్ జర్నీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. డిజైన్ కన్సల్టెంట్‌గా లండన్‌లో ఉన్న ద్రుపద్ భారత్‌లో సెటిలవ్వాలని భావించాడు. అయితే ఈ ప్రయాణం మరుపురానిదిగా, సాహసవంతంగా ఉంటేనే కిక్కిస్తుందని నిర్ణయించుకున్నారు. తన ప్రయాణం కోసం ప్రజారవాణానే ఆశ్రయించాలని తీర్మానించుకున్నారు. ఇద్దరు స్నేహితులు రౌల్, వనెటియాలతో కలిసి తన జర్నీ స్టార్ట్ చేశాడు. ఆరోగ్య కారణాలతో స్నేహితుల్లో ఒకరు మార్గమధ్యంలో తప్పుకున్నారు. ఇక మే 25న వీసాలు, రైలు టిక్కెట్లతో ఈ ముగ్గురు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి 14 దేశాల మీదుగా 21 వేల కిలోమీటర్లను కేవలం ప్రజా రవాణా ద్వారానే దాటి వచ్చారు. డిజైనర్ తన ఆలోచనా దృక్పథాన్నివిస్తృతం చేసుకునేందుకు వివిధ దేశాల మీదుగా ప్రయాణించడం అవసరమని తన వినూత్న ప్రయాణాన్ని వివరిస్తూ మిస్ర్తీ చెబుతారు. ఏ దేశం మిమ్నల్ని ఎక్కువగా ఆకట్టుకుందని అంటే సెర్బియాలోని బైకాల్ సరస్స అందాలు తనను ఆకట్టుకున్నాయని చెప్పారు.తమ ప్రయాణంలో భిన్నమైన వ్యక్తులు కలిసినా టిబెటన్లను తాను ఎక్కువగా ఇష్టపడ్డానన్నారు. తమ యాత్రలో భాగంగా స్ధానికులతో కలిసి పలు జుగల్బందీలో తాము పాలుపంచుకున్నామని, తామంతా సంగీత ప్రియులమని చెప్పారు. తాను శరద్ ప్లేయర్‌ను కాగా, రౌల్ ఫ్లూటిస్ట్ అని తమ అభిరుచులు పంచుకున్నారు మిస్త్రీ. తమ ప్రయాణమంతా సాఫీగా సాగలేదని మంగోలియా-చైనా సరిహద్దు దాటే క్రమంలో చైనా అధికారులు తమను అడ్డుకుని ప్రశ్నించారని గుర్తుచేసుకున్నారు. డోక్లాం అంశంపై భారత్,చైనా మధ్య ఉద్రిక్తత నెలకొన్న సమయంలో ఇది చోటుచేసుకుందని చెప్పారు.బోర్డర్ దాటే వారంతా స్ధానికులు కావడం, తాను భారత్ పాస్‌పోర్ట్ కలిగిఉండటంతో చైనా అధికారులు తనను ఓ గదిలోకి తీసుకెళ్లి 20 నిమిషాలు కూర్చోపెట్టారని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారని, తన లగేజ్‌ను స్కాన్ చేశారని తెలిపారు. 30 నిమిషాల ఇంటరాగేషన్ అనంతరం వారు తమతో సెల్ఫీలు తీసుకుని ముందుకు వెళ్లేందుకు అనుమతించారని చెప్పారు. ఇక భారత్‌లో అడుగుపెట్టే ముందు టిబెట్ మిస్త్రీ బృందం ఆఖరి మజిలీ. టిబెట్‌లో విదేశీ టూరిస్ట్‌లపై చైనా పలు ఆంక్షలు విధించింది. టూరిస్టులు స్ధానికులతో రాజకీయాలు మాట్లాడటానికి అనుమతించారు. ప్రజా రవాణాను ఉపయోగించడానికి వీల్లేదు.ప్రజా రవాణాకు వాడే వాహనాల్లో కెమెరాలు అమరుస్తారు. ఇక ఒకప్పుడు సుందర ప్రశాంత టిబెట్‌లో ఇప్పుడు ట్రాఫిక్ జామ్‌లు నెలకొన్నాయని తన అనుభవాలను మిస్త్రీ గుర్తుచేసుకున్నారు.ఇక 40 రోజుల సాహస యాత్ర అనంతరం తన సొంత పట్టణం ఉదయ్‌పూర్‌కు చేరుకున్న మిస్త్రీకి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు సాదర స్వాగతం పలికారు. -
కిలిమంజోరు
►సాహసయాత్రకు సై ►మెతుకుసీమ విద్యార్థినులు సిద్ధం ►జిల్లా నుంచి తొమ్మిది మంది ఎంపిక ►త్వరలో ఆఫ్రికాకు పయనం ►కలెక్టర్ ప్రోత్సాహంతో ముందుకు ►ఆర్సీపురం కేజీబీవీలో కఠిన శిక్షణ ►పూర్ణ, ఆనంద్ స్ఫూర్తితో ముందడుగు ‘కిలిమంజారో.. చలో.. చలో... ’ అంటూ మరో సాహస యాత్రకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులు సిద్ధమవుతున్నారు. ఎవరెస్ట్‌ను అధిరోహించిన పూర్ణ, ఆనంద్‌లను స్ఫూర్తిగా తీసుకుని ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం రామచంద్రాపురం మండలం ఉస్మా¯ŒSనగర్‌లోని కేజీబీవీలో కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. ఎంతటి పర్వతాన్నైనా అధిరోహించి తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పేందుకు కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ప్రోత్సాహంతో మొత్తం 12 మంది విద్యార్థినులు ఆఫ్రికాలోని కిలిమంజారో వైపు అడుగులు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. – రామచంద్రాపురం రామచంద్రాపురం:కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతోన్న విద్యార్థినులు సాహస యాత్రకు సై అంటున్నారు. ఆఫ్రికాలో ఎత్తయిన పర్వతాల్లో కిలిమంజారో ఒకటి. ఆ పర్వతాన్ని అధిరోహించేందుకు ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలతోపాటు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలకు చెందిన విద్యార్థినులు ముందుకు వచ్చారు. ఇందుకోసం 12మంది ఎంపిక కాగా అందులో జిల్లాకు చెందిన వారు తొమ్మిది ఉండడం గమనార్హం. వీరంతా రామచంద్రాపురం మండలం ఉస్మా¯ŒSనగర్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. కలెక్టర్ రోనాల్డ్ రోస్ ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంగా కదులుతున్నారు. ఉదయం, సాయంత్రం కఠినమైన శిక్షణ పొందుతున్నారు. కిలిమంజారో ఇలా.. కిలిమంజారో పర్వతం 17వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ వాతావరణం క్షణ క్షణం మారుతూ ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రతతోపాటు బలమైన గాలులు వీస్తుంటాయి. ఆక్సిజ¯ŒS కూడా తక్కువే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదో పెద్ద సాహస యాత్ర. ఆఫ్రికాలోనే కిలిమంజారో పర్వతం చాలా పెద్దది. శిక్షణ ఇలా... రన్నింగ్, యోగా చేయిస్తారు. 30 కిలోల బరువు మోస్తూ నడిపిస్తారు. నిత్యం సూర్యనమస్కారాలు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా పర్వతారోహణ సమయంలో శ్వాస తీసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా మెలకువలు నేర్పుతారు. కలెక్టర్ ప్రోత్సాహంతో... ఈ విద్యార్థినులు ఇప్పటివరకు మన రాష్ట్రం దాటి వెళ్లలేదు. కలెక్టర్ ప్రోత్సాహంతో వీరంతా సాహస యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి అవకాశం తమకు రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నారు. లక్ష్యాన్ని ఛేదిస్తా.. పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. కలెక్టర్ ప్రోత్సాహంతో కిలిమంజారో పర్వతారోహణకు సిద్ధమయ్యా. ఇందుకోసం శిక్షణ తీసుకుంటున్నా. ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే మేము ఎందులోనూ తీసిపోమని నిరూపిస్తాం. కష్టమైన పర్వతారోహణ లక్ష్యాన్ని ఛేదిస్తా. – అనసూయ, కేజీబీవీ, అందోల్ యోగా చేస్తున్నాం.. కిలిమంజారో ఎక్కడమన్నది మామూలు విషయం కాదు. పర్వతారోహణ చేయాలంటే ప్రధానంగా శరీరం సహకరించాలి. అక్కడ శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది కాకుండా శిక్షణ తప్పదు. అందుకోసం నిత్యం యోగా నేర్చుకుంటున్నాం. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. – ఎం.బూలి, కేజీబీవీ, రామాయంపేట పూర్ణ, ఆనంద్‌లే స్ఫూర్తి.. గురుకుల పాఠశాలలో చదివి ఎవరెస్టు అధిరోహించి చరిత్ర సృష్టించిన పూర్ణ, ఆనంద్‌లే నాకు స్ఫూర్తి. వారిని చూసే నేను ఈ సాహస యాత్రకు సిద్ధమవుతున్నా. నేను కూడా 17వేల అడుగుల ఎత్తులో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి జిల్లా పేరు నిలబెడతా. – జె.మంజుల, కేజీబీవీ, పెద్దశంకరంపేట శిక్షణ బాగుంది... కిలిమంజారో పర్వతం 17వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడి వాతావరణం తట్టుకునేలా ప్రత్యేక శిక్షణ అవసరం. అందుకోసం మాకు శేఖర్‌బాబు సార్ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. లక్ష్య సాధనకు కఠినతరమైన శిక్షణ తీసుకుంటున్నాం. – జి.నర్సమ్మ, కేజీబీవీ, కొల్చారం పదిహేను రోజులుగా శిక్షణ ఇస్తున్నాం.. పదిహేను రోజులుగా విద్యార్థినులకు ఫిట్నెస్ శిక్షణ ఇస్తున్నా. విద్యార్థిననులు ఎంతో కష్టపడి వ్యాయామం చేస్తున్నారు. నేను కూడా వ్యాయామ శిక్షకురాలిగా కాకుండా వారికి గైడ్‌గా ఆఫ్రికాకు వెలుతున్నా. కిలిమంజారో విషయంలో కలెక్టర్ కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. – సీహెచ్ కమల, పీఈటీ సంతోషంగా ఉంది.. పర్వతారోహణ చేయాలన్న కోరిక నాలో ఎప్పటినుంచో ఉంది. ఆ కళను త్వరలో నిజం చే సుకోబోతున్నా. గత ఏడాది డార్జిలింగ్‌లోని ఎవరెస్టు శిఖరం ఎక్కేందుకు ఎంపికయ్యా. అందుకు భువనగిరిలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నా. భూకంపం రావడంతో ఆ పర్యటన రద్దయింది. ప్రస్తుతం కిలిమంజారో పర్వతారోహణకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. – వి.పూజ (కరీంనగర్) రాష్ట్రానికి పేరు తెస్తా... క్రీడలు, సాహస యాత్రలంటే నాకెంతో ఇష్టం. గతంలో కోకోలో జిల్లాస్థాయిలో బహుమతులు పొందా. నేడు అదే స్ఫూర్తితో పర్వతారోహణ చేసి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తా. – ఎల్.మౌనిక, రామాయంపేట (కేజీవీబీ) జిల్లాకు పేరుతీసుకొస్తా.. క్రీడలంటే నాకిష్టం. గతంలో కరాటేలో ఆరు గోల్డ్ మెడల్స్ సాధించా. ఇప్పుడు ఈ సాహస యాత్రకు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ పర్వతాన్ని ఎక్కి జిల్లాకు రాష్ట్రానికి పేరు తెస్తా. – ఈ.జ్యోతి, కేజీబీవీ వెల్దుర్తి ఆనందంగా ఉంది.. ఆఫ్రికాలోని అతి ఎత్తయిన పర్వతారోహణకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. నేనిప్పటి వరకు ఊరు విడిచి పోలేదు. అలాంటిది దేశం విడిచి మరో దేశానికి సాహస యాత్రకు వెళ్తున్నానంటే గర్వంగా ఉంది. ఇందుకోసం కఠినమైన శిక్షణ తీసుకుంటున్నా. – నాగమణి, కేజీబీవీ, జగదేవ్‌పూర్ ఆహారంలో మార్పు... పర్వతారోహణ అంటే మామూలు విషయం కాదు. దానికి ఏకాగ్రత, కఠోర శ్రమ తప్పదు. అందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాం. ఆహార అలవాట్లు కూడా మార్చుకున్నాం. ప్రత్యేక శిక్షణతో పాటు డైట్‌కు కూడా మారింది. పర్వతారోహణకు అవసరమైన శక్తికోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో నిపుణులు సూచనలిస్తున్నారు. – జె.కవిత, వెల్దుర్తి కష్టమైనా.. ఇష్టంగా.. పర్వతారోహణకు అవకాశం రావడం సంతోషంగా ఉంది. కలెక్టర్ ప్రోత్సాహంతో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాం. విద్యతోపాటు శిక్షణ సమయంలో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. కష్టమైనా ఇష్టంగా చేసి లక్ష్యాన్ని సాధిస్తాం. – జి.రమ్య, వర్గల్ -
నిన్నటి చరిత్ర... నేటి సాహస యాత్ర
రాజులు రాచరికాలు అంతరించినా... ఆ జ్ఞాపకాలు తలచుకోవడం, వాటిని గుర్తు చేసే ప్రదేశాలను సందర్శించడం ఇచ్చే అనుభూతిని మాటల్లో వర్ణించలేం. అలాంటి అనుభూతిని కోరుకునేవారికి, చిన్నపాటి సాహసయాత్ర చేయాలనుకునే వారికి కోయిలకొండ... ఓ చక్కని గమ్యం. - ఓ మధు అలనాటి గిరిదుర్గాలలో ఒకటయిన కోవెలకొండ కాలక్రమంగా కోయిలకొండ, కీలగుట్టగా మారింది. స్థానికులకు కూడా అంతగా పరిచయం లేని పురాతనకోట కోయిలకొండ కోట. కాసింత నిగూడంగా ఉండే ఈ చోటు చేరుకోవటం కూడా సాహసమే. చరిత్రకు భాష్యం... నిర్మానుష్యం... చాలా తక్కువ ప్రాచుర్యంలో ఉన్న ఈ కోట మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంది. ఈ కోటను కృష్ణదేవరాయల కాలంలో వడ్డేరాజులు నిర్మించారని, ఆ తర్వాత వెలమరాజుల ఆధీనంలో కొనసాగిందని, ఆ తర్వాత కాలంలో కుతుబ్షాహి సుల్తాన్ల వశం అయినట్లు చరిత్ర. దక్కన్ సుల్తాన్ల కాలంలో పన్ను వసూలు చేసే కేంద్రంగా ఉన్న ఈ కోట నేడు చాలా మందికి తెలియని చోటే. అడవిలో, కొండమీద ఉండే ఈ కోట చాలా వరకూ నిర్మానుష్యంగానే ఉంటుందని చెప్పవచ్చు. కోయిలకొండ గ్రామానికి దక్షిణంగా ఉండే ఈ కోటకు ఆటోలు, ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. ఈ కోట ట్రెక్కింగ్ అంటే ఇష్టపడేవాళ్లకు బాగా నచ్చే ప్రదేశం. గతం వైపు స్వాగతించే హనుమాన్.. ఆంజనేయుడి బొమ్మ చెక్కి ఉన్న కొండ కనిపిస్తే కోటలోకి దారి కనిపించినట్లే. పొదలు, జారుడు బండలతో, ఎత్తై రాళ్లతో మలిచినమెట్లు కోటలో వాతావరణం ఇలా సాహసయాత్రకు కావలసిన అన్ని హంగులతో ఉంటుంది. కోటలో మొదటి పెద్ద ముఖ ద్వారాన్ని దాటుకుని వెళితే మరో నాలుగు ద్వారాలు అలా మొత్తం 7 ద్వారాలు దాటి వస్తే కోటపై భాగానికి చేరుకుంటారు.. పైకి ఎక్కి చూస్తే, కొండల మధ్య కోవెల, కోట నిర్మించడానికి కారణం అక్కడి ప్రకృతి రమణీయత, శత్రుదుర్భేద్యమైన సహజ పరిసరాలే అని అర్థమవుతుంది.. దూరంగా కనిపించే రిజర్వాయర్ నీరు, చుట్టూ అడవి, కొండగాలి ట్రెక్కింగ్ చేసే వారికి కావలసిన అందమైన బహుమతి దొరికినట్లే అనిపిస్తుంది. రాళ్లను పేర్చుతూ నిర్మించిన కోట గోడలు నాటి నిర్మాణశైలి పటిష్టతకు ప్రతీకగా కనిపిస్తాయి. గతంలో కోటకు వెళ్లిన వారి సహాయంతో ఇక్కడి వెళ్లటం ఉత్తమం. ఈ క్లిష్టమైన కోటలో మసీదు కొలను, అనేక ఆలయాలున్నాయి. దగ్గరలో వీరభద్రస్వామి, రాముని ఆలయాలను దర్శించుకోవడానికి భక్తులు వస్తుం టారు. ఇక కోటలో మొహరం పండుగ విశేషంగా జరుపుతారు. స్థానికులు మతభేదం లేకుండా పాల్గొంటారు. ఇలా వెళ్లండి... హైదరాబాద్‌కి దాదాపు 125 కి.మీ దూరంలో ఉన్న ఈ కోటను చేరుకోవడానికి ముందుగా ఎన్‌హెచ్.7 పై మహబూబ్‌నగర్‌కు బస్సు, రైలు మార్గాల ద్వారా చేరుకోవాలి. అక్కడి నుంచి ప్రైవేటు, ఆర్టీసీ వాహనాల ద్వారా కోయిలకొండ గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. కోట చూసాక సమయం చిక్కితే పెద్దవాగుపై నిర్మించిన కోయిల్‌సాగర్ డ్యామ్‌ని చూసి రావడం మరచిపోవద్దు. -
అట్లాంటి'క్' ఇట్లాంటి హీరోలు కాదు వీళ్లు!
ఫొటోలో ఉన్న ఇద్దరి పేర్లు రాబిన్ ఊల్ఫ్, డేవీ డూప్లెసీ. తల్లీ, కుమారులు. వీరిద్దరు ఈ నెలాఖరులో దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ నుంచి బ్రెజిల్‌లోని రియో డీ జెనీరో వరకు వెళ్లాలనుకుంటున్నారు. అంటే రెండింటికి మధ్య ఉన్న అట్లాంటిక్ మహాసముద్రం దాటాలన్న మాట. అయితే విమానంలోనో.. షిప్లోనో కాదు.. పడవలో. అది కూడా తొక్కుడు పడవలో. ఈ పడవకు ఇంజన్, మోటార్ వంటివి ఏమీ ఉండవు కాబట్టి వాళ్ల కాళ్ల బలాన్ని నమ్ముకోవాల్సిందే.. ఇంతకీ ఆ రెండు ఊళ్ల మధ్య దూరం ఎంతో తెలుసా.. దాదాపు 6,450 కిలోమీటర్లు. అంత దూరం ఆ తొక్కుడు పడవలోనే వెళ్లాలన్నది వారి సంకల్పం. అంటే వీరు ఓ సాహస యాత్ర చేస్తున్నారన్న మాట.. మరి అంత కష్టపడి అక్కడికి వెళ్లాల్సిన అవసరం వారికేముందనే కదా మీ అనుమానం! జీవ జాతులు అంతరించిపోతున్నాయన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్నది వారి ఆకాంక్ష. వాటిని కాపాడుకోకుంటే మన మనుగడకూ ముప్పు తప్పదని వారు హెచ్చరించేందుకే ఈ సాహస యాత్ర. కాగా, డూప్లెసీకి సాహస యాత్రలు చేయడం కొత్తేమీ కాదు. మూడేళ్ల కింద కయాకింగ్ బోటుపై అమెరికాలోని అమెజాన్ నదిపై సాహస యాత్ర చేశాడు. ఆ సమయంలో కొందరు దుండగులు అతడిపై కాల్పులు జరపగా, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడి ఎలాగోలా బతికి బయటపడ్డాడు. ఇప్పుడు మరో సాహస యాత్రకు పూనుకున్నాడు. ఈ యాత్రలో తన తల్లి కూడా తోడు కావడం సంతోషంగా ఉందని డూప్లెసీ పేర్కొన్నాడు. ఈ యాత్రను నాలుగు నెలల్లోపు పూర్తి చేస్తానని ధీమాగా చెబుతున్నాడు. ఇటీవలే తన సాహసయాత్రలపై ‘చూసింగ్ టు లివ్’ అనే పుస్తకం కూడా రాశాడు. ఇటీవలి కాలంలో అంతరించిపోతున్న జీవజాతుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. భూ చరిత్రలో మొత్తం ఇప్పటివరకు 5 సార్లు దాదాపు అన్ని జీవులు అంతరించిపోయి మళ్లీ పునరుద్ధరణ అయ్యాయని శాస్త్రవేత్తల అంచనా. మానవ చర్యల కారణంగా జీవ జాతులు కనుమరుగవుతున్నాయన్నది నగ్న సత్యం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకో 35 ఏళ్లలో భూమి మీదున్న సగం జీవజాతులు అంతరించిపోయే ప్రమాదముంది. -
సైకిల్‌పై హైదరాబాదీ సాహసయాత్ర
హైదరాబాద్‌కు చెందిన పారా సైక్లిస్ట్ ఆదిత్య మెహతా మనాలీ నుంచి ఖర్దుంగా లా వరకు దాదాపు 500 కిలోమీటర్ల సాహస యాత్రను పూర్తి చేసుకున్నారు. మనాలీ నుంచి జాతీయ పతాకాన్ని ధరించి, ఆగస్టు 1న బయలుదేరిన ఆదిత్య సరిగా స్వాతంత్య్ర దినోత్సవం నాటికి ఖర్దుంగా లా చేరుకున్నారు. సముద్రమట్టానికి దాదాపు 13 వేల అడుగుల ఎత్తయిన మనాలీ-లేహ్ హైవేపై బలమైన ఎదురుగాలులను, వణికించే చలిని తట్టుకుంటూ ఏమాత్రం స్థైర్యం కోల్పోకుండా ఈ యాత్ర పూర్తి చేయడం విశేషం. ఈ ప్రయాణంలో ఆయన ఆగస్టు 9న లేహ్ చేరుకున్నారు.