కారులో అమెరికా టూ హైదరాబాద్‌: ప్రత్యేక ఇంటర్వ్యూ | Sakshi interview with Dr RAJESH KADAKIA And DR DARSHANA | Sakshi
Sakshi News home page

కారులో అమెరికా టూ హైదరాబాద్‌: ప్రత్యేక ఇంటర్వ్యూ

Published Thu, Jun 14 2018 4:53 PM | Last Updated on Fri, Jun 15 2018 11:00 AM

Sakshi interview with Dr RAJESH KADAKIA And DR DARSHANA

సికింద్రాబాద్‌లోని స్వగృహం వద్ద భార్య దర్శనతో రాజేశ్‌ కడాకియా

గొప్ప కుటుంబంలో జన్మించడం అంటే డబ్బున్న కుటుంబంలో పుట్టడం కాదని, ఇష్టమైన పని కోసం అవసరమైతే ఎంతకైనా తెగించాలని నిరూపించారు డా. రాజేశ్‌ కడాకియా. తాను చదువుకునే గాంధీ కాలేజీలో సమస్య ఉందని తెలుసుకుని తాతయ్యతో పొట్లాడి రెండున్నర కోట్ల రూపాయలతో గాంధీ ఆసుపత్రిలో ఐసీయూ కట్టించారాయన. యువకుడిగా ఉన్న సమయంలో తనకిష్టమైన ఆఫ్‌ రోడ్‌ రేసులో జాతీయ స్థాయిలో చాంపియన్‌గా నిలిచి అప్పటి ప్రధాని ఇంధిరాగాంధీ చేతుల మీదుగా బహుమతిని అందుకున్నారు. గుండెకు స్టంట్‌ పడ్డా, హై-బీపీ, డయాబెటిస్‌ వంటి సమస్యలు ఉన్నా వెరవక భార్యతో కలసి కారులో విహరిస్తూ సొంతవూరికి చేరాలనే ఆకాంక్ష రాజేశ్‌ కడాకియా, దర్శన దంపతులను గమ్యం చేరేలా చేసింది.

63 ఏళ్ల వయసులో అమెరికా నుంచి హైదరాబాద్‌కు 37000 కిలో మీటర్లు కారులో వచ్చిన  డా. రాజేశ్‌ కడాకియా, డా. దర్శనలతో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ  

ప్రశ్న : సుదీర్ఘ ప్రయాణంలో మీకు నచ్చిన ప్రదేశం
రాజేశ్‌ : అమెరికా, ఫ్రాన్స్‌, బెల్జియం, జర్మనీ, డెన్మార్క్‌, నెదర్లాండ్‌, స్వీడన్‌, ఫిన్‌లాండ్‌, రష్యా, కజకిస్తాన్‌, మంగోలియా, చైనా, టిబెట్‌లలో తిరిగినా నేపాల్‌ బోర్డర్‌ దగ్గరకు రాగానే ప్రాణం లేచివచ్చినట్టయింది. నేపాల్‌ బోర్డర్‌కు చేరుకునే సమయానికి భారీ వర్షం కురుస్తోంది. అప్పటికే కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఫోన్‌లో చార్జింగ్‌ అయిపోవడంతో జీపీఎస్‌ కూడా పనిచేయడం లేదు. కిలోమీటర్ల మేర లారీలు నిలిచిపోయాయి. గమ్యం ఎక్కడుందో కూడా తెలియక రోడ్డు మీద కారులోనే ఇద్దరం 2 గంటలు కునుకు తీశాం. నేపాల్‌-భారత్‌ బోర్డర్‌లో 'భారత్‌ మే ఆప్‌ కా స్వాగత్‌ హై'.. అనే బోర్డు చూడగానే ఒక్కసారిగా ఆనందానికి అవధులు లేవు. అందుకే మా జర్నీలో భారత్‌లోకి ప్రవేశించడం మరువలేని ఘట్టం.

ప్రశ్న : పెద్ద వయసులో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కదా.. రిస్క్‌ అనిపించలేదా?
రాజేశ్‌ : నాకిప్పుడు 63 ఏళ్లు, డయాబెటిక్‌ పేషెంట్‌ని, గుండెకు ఓ స్టంట్‌ కూడా వేశారు. హై బ్లెడ్‌ ప్రెషర్ సమస్య కూడా ఉంది. ఆరోగ్య సమస్యలున్న వారు.. వయసు మళ్లిన వారు జీవితంలో ఇంకా ఏమీ చేయలేమని బాధపడుతుంటారు. అలాంటి వారికి మా ట్రిప్‌ స్పూర్తినిస్తుందని అనుకుంటున్నా. అంతలోనే పక్కనే ఉన్న భార్య దర్శన 'అయ్యో ప్రజల్లోకి తప్పుడు మెసేజ్‌ పోతుంది కదా' అన్నారు. అలాంటి వారిని ఇలా ట్రిప్‌లకు వెళ్లమని సలహా ఇవ్వడం నా ఉద్దేశం కాదు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే వారు మానసికంగా ధైర్యంగా ఉండాలి. అప్పుడే శరీరం కూడా అన్ని రకాలుగా సహకరిస్తుంది. గుండెకు చిన్న స్టంట్‌ పడినంత మాత్రాన ఏదో కోల్పోయామని జీవితాంతం కుంగిపోకూడదు.

ప్రశ్న : యాత్రకు బ్రేక్‌ ఇవ్వాలని ఎప్పుడైనా అనిపించిందా ?
రాజేశ్‌ : మౌంట్‌ ఎవరెస్ట్‌ గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆక్సిజన్‌ అందకపోవడంతో దర్శన తీవ్ర చాలా ఇబ్బంది పడింది. దీంతో వెంటనే ఎవరెస్ట్‌ కిందకి దిగి ఆసుపత్రికి తీసుకువెళ్లాను. రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని తిరిగి యాత్ర ఆరంభించాం. దర్శనకి ఆరోగ్య సమస్య రావడంతో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్దామని అన్నాను. తన వల్ల ఈ యాత్రకు బ్రేక్‌ పడకూడదని, ఎలాగైనా కొనసాగించాల్సిందేనని  ఆమె పట్టుబట్టింది.

ప్రశ్న : ఇంత లాంగ్‌ జర్నీ ఎందుకు ప్లాన్‌ చేశారు?
రాజేశ్‌ : మా అమ్మను కలవడానికి. విమానంలో వచ్చి వెళ్లిపోవొచ్చు. కానీ నా సతీమణితో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తూ పుట్టిన దేశానికి రావాలనుకున్నా. అందుకే 8 నెలల పాటూ అన్ని రకాల పర్మిషన్లు తీసుకొని యాత్రను ప్రారంభించాం.  

ప్రశ్న : ఈ ట్రిప్‌ కోసం ఎవరి దగ్గరైనా సహాయం తీసుకున్నారా.. ముఖ్య ఉద్దేశ్యం ఏంటి ?
రాజేశ్‌ : స్పాన్సర్స్‌లేరు, మెకానిక్‌లు లేరు, రోడ్డుపైన ఏమైనా అయితే కనీసం ఎవరైనా సహాయం చేస్తారో లేదో కూడా తెలియదు. 60 రోజుల్లో మూడు ఖండాలు, 18 దేశాల గుండా మా ప్రయాణం సాగింది. ఇద్దరు 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఇంత సాహసం చేశారంటే, మనం ఏమీ చేయలేమా? అని ఈ ట్రిప్‌ గురించి చదివిన యువతకు వారి వారి రంగాల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో స్పూర్తినిస్తే మాకు అది చాలు.

ప్రశ్న : ఈ ట్రిప్‌ ప్రారంభించినప్పుడు ఎవరెవరికి చెప్పారు..
రాజేశ్‌ : ఆస్తులున్నాయి.. పిల్లలున్నారు, మనవళ్లున్నారు.. ఈ టైమ్‌లో ఈ ట్రిప్‌ అవసరమా అని చాలా మంది వారించారు. ఏదో ఒక రోజు నేను చనిపోవాల్సిందే. ఏదో గుర్తింపు కోసమో లేక పేరు కోసమో మేం ఈ ట్రిప్‌ను ప్లాన్‌ చేయలేదు (పక్కనే ఉన్న దర్శన.. ఎక్కడ వద్దంటారేమోనని ఈ ట్రిప్‌ ప్రారంభించినప్పుడు కనీసం ఆయన సోదరుడికి కూడా ఈ విషయం చెప్పలేదు). కేవలం మా ఆసక్తి మీదే ఈ యాత్ర చేశాం. ఎంత కష్టమైనా మీకిష్టమైన, మీరు చేయాలనుకున్న పని చేయండి. అందులో సంతృప్తి ఉంటుంది.

ప్రశ్న : మిగతా దేశాల్లో మీరు బాగా గమనించింది.
రాజేశ్‌ : చైనా చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మనకు స్వాతంత్ర్యం ఉచితంగా రాలేదు. ఎన్నో పోరాటాలు చేసి ‍సాధించుకున్నాం. ఇంగ్లీషు మాట్లాడే 450 మిలియన్ల యువత మన దగ్గర ఉంది. ప్రపంచంలో మరెక్కడా ఇంత యువశక్తి లేదు. దర్శన కల్పించుకుని.. చైనా వంటి దేశం ఎన్నో వస్తువులను కాపీ కొడుతూ మార్కెట్‌లోకి విడుదల చేసి అభివృద్ధిలో దూసుకుపోతోంది. మన సొంత పరిజ్ఞానంతో తయారు చేసిన మరిన్ని వస్తువులను మార్కెట్‌లోకి విడుదల చేయాలి.

ప్రశ్న : ఈ ప్రయాణంలో మన దేశ ఆనవాళ్లు ఎక్కడైనా కనిపించాయా? 
రాజేశ్‌ : వివిధ దేశాల్లో మన దేశ సంపదను ప్రదర్శనకు పెట్టి డబ్బు సంపాదిస్తున్నారు. సెయింట్స్ పీటర్స్‌ బర్గ్‌, లండన్‌లలో మన దేశానికి చెందిన చారిత్రక సంపదను మ్యూజియంలో ఉంచి వాటిని చూడటానికి డబ్బు వసూలు చేస్తున్నారు. వెల కట్టలేని ఎన్నో విలువైన వస్తువులు భారత్‌ నుంచి విదేశాలకు చేరాయి. వాటిని డబ్బు పెట్టి చూస్తే చాలా బాధ అనిపించింది. వాటిని తిరిగి భారత్‌కు తెప్పించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.

ప్రశ్న : ట్రాఫిక్‌ విషయంలో అధికారుల తప్పిదాలు ఏమైనా గమనించారా ?
రాజేశ్‌ : భారత్‌-నేపాల్‌ బోర్డర్‌లో ట్రక్కులు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. రెండు అడుగులు ముందుకు పోతూ ఇంజిన్‌ ఆఫ్‌ చేస్తూ తిరిగి ఆన్‌ చేయడం ఇలా గంటలపాటూ ఈ ప్రక్రియ కొనసాగింది. అంత పెద్ద ట్రక్కు ఆన్‌ చేస్తూ కొద్ది దూరానికే ఆఫ్‌ చేస్తూ వెళితే డీజిల్‌కు ఎంతో డబ్బు వృథా అవుతుంది. ఇలాంటి ఘటనలు పెట్రో దిగుమతులు పెరగడానికి కారణం అవుతున్నాయి. వీటిని అరికట్టాలి. సమస్య ఎక్కడుందో కనుగొనాలి.

ప్రశ్న : కాలుష్యంపై భారత్‌లో మీరు గమనించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా ?
రాజేశ్‌ : భారీ వాహనాల వచ్చే పొగ రోడ్డు పైన నడిచేవారి మొహంపైకి వెళుతోంది. అలా కాకుండా యూనివర్సిటీల్లో ఉన్న మెరికల్లాంటి విద్యార్థులను పిలిపించి.. సమస్యలకు పరిష్కారం కనుక్కొవొచ్చు. ట్రక్కుల నుంచి పొగ పక్కన నుంచి కాకుండా పైనుంచి వచ్చేలా మరో డిజైన్‌ని తయారు చేస్తే బావుంటుంది. దీని వల్ల 50 శాతం ఊపిరితిత్తుల సమస్యలు తగ్గిపోతాయి. 

ప్రశ్న : జర్నీలో ఆయా దేశాల స్థానిక పోలీసులతో ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా ?
రాజేశ్‌ : రష్యా నుంచి చైనాలోకి వెళ్లే సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు. కారుతో రావాల్సిన అవసరం ఏముంది అంటూ పోలీసులు మాపై ప్రశ్నల వర్షం కురిపించారు. డ్రగ్స్‌ తీసుకువచ్చామేమోననే అనుమానంతో మాతో పాటు కారును కూడా సోదా చేశారు. చివరకు మెడిసిన్స్‌ని కూడా ఒక్కో ట్యాబ్లెట్‌ తీసి అందులో డ్రగ్స్‌ ఉన్నాయేమోనని చెక్‌ చేశారు.

ప్రశ్న : ఒక్కో దేశంలో ఒక్కో రకంగా నిబంధనలు ఉంటాయి కదా.. ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా ?​ 
రాజేశ్‌ : మేం ప్రయాణించిన దేశాల్లో ఓ చోట లెఫ్ట్‌ హ్యాండ్‌ డ్రైవ్‌ ఉంటే మరో దేశంలో రైట్‌ హ్యాండ్‌ డ్రైవ్‌ ఉండేది. లెఫ్ట్‌ హ్యాండ్‌ డ్రైవ్‌ ఉన్న దేశాల్లో రైట్‌ హ్యాండ్‌ డ్రైవ్‌ వాహనాన్ని నడపడంతో చాలా ఇబ్బందులుపడ్డాం. కొన్ని సందర్భాల్లో ఓవర్‌టేక్‌ చేస్తుంటే ఎదురుగా వాహనం వస్తుందని పక్క సీట్లో కూర్చున్న తాను చెప్పేదాన్ని అని  దర్శన చెప్పారు.

ప్రశ్న : 37000 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కడైనా ప్రమాదం జరిగిందా ?
రాజేశ్‌ : చైనాలో మా కారు గుర్రాన్ని ఢీ కొట్టడంతో బంపర్‌ వంగిపోయింది. కారు రేడియేటర్‌ పాడైంది. దాంతో దాదాపు 18 రోజులు పాటు చైనాలోనే గడపాల్సివచ్చింది.

ప్రశ్న : ట్రాఫిక్‌ రూల్స్‌ ఎక్కడ బాగున్నాయి ?
రాజేశ్‌ : యూరప్‌, అమెరికాల్లో ట్రాఫిక్‌ రూల్స్‌ బాగున్నాయి. 

ప్రశ్న : ఇద్దరూ డ్రైవ్‌ చేశారా ?
రాజేశ్‌ : దాదాపు 36,000 కిలోమీటర్లు నేను డ్రైవ్‌ చేస్తే, దర్శన 1000 కిలోమీటర్లు కారు నడిపింది.

ప్రశ్న : హైదరాబాద్‌తో ఉన్న అనుబంధం?
రాజేశ్‌ : సికింద్రాబాద్‌లోనే పుట్టా, ఇక్కడే చదివా. సరోజ, సరస్వతి టీచర్‌ల దగ్గర చదువుకున్నా (పక్కనే ఉన్న దర్శన ఏప్పుడూ వాళ్ల టీచర్లను గుర్తు చేసుకుంటూ ఉంటారు). గాంధీ మెడికల్‌ కాలేజీలో జనరల్‌ సర్జరీలో ఎంఎస్‌ చేస్తుండగా ఐసీయూ వార్డు కోసం గాంధీ ఆసుపత్రిలో సమ్మె జరిగింది. ఐసీయూ వార్డు లేకపోవడంతో.. ఆ సమయంలో మా తాతయ్యకు విషయం చెప్పా. గొడవ చేసి మరీ మా తాతకు చెందిన ట్రస్ట్‌ నుంచి రూ. 2.5 కోట్లతో గాంధీ ఆసుపత్రిలో ఐసీయూ కట్టించేలా చేశా.

ప్రశ్న : భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు
రాజేశ్‌ : ఉక్రెయిన్‌, సిరియా, ఇరాన్‌, ఇరాక్‌, పాకిస్థాన్‌లలో పరిస్థితులు బాగాలేవు. అందుకే ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఉత్తరం వైపు నుంచి రావాలని దారిని ఎంచుకున్నాము. మిలటరీ వారితో సమస్యలు తలెత్తకుండా ముందుగానే అన్ని అనుమతులు తీసుకుని జాగ్రత్త పడ్డాం.

ప్రశ్న : మీ తదుపరి కార్యచరణ
రాజేశ్‌ : రెండు నెలలుగా జర్నీలోనే ఉన్నాం. యాత్రను విజయవంతంగా పూర్తి చేశాం. మళ్లీ తిరిగి వెళ్లాలి. అక్కడ మా ఆసుపత్రి ఉంది. దాంట్లో పని చేసే స్టాఫ్‌ మా కోసం ఎదురు చూస్తున్నారు. మమ్మల్ని నమ్ముకుని వారి కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. తిరిగి విధుల్లో చేరాలి. 

‘ఒక దేశ గమనాన్ని శాసించే బలం యువతకు మాత్రమే ఉంది. భారతదేశానికి దిశా నిర్ధేశం చేయగలిగేది యువతే. ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థలను కలిగిన దేశాల్లో భారత్‌ ఒకటి. మరింత కష్టపడితే టాప్‌కు చేరుకుంటాం. అంతేకాకుండా భారతదేశాన్ని ప్రేమించే ఇండియన్స్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఉన్నత విద్యను అభ్యసించి, మంచి నైపుణ్యం ఉన్న యువత మన దేశానికి ఉన్న బలం. చైనా లాంటి దేశస్తులకు ఈ అవకాశం లేదు. ఎందుకంటే ఇంగ్లీష్‌ భాషపై మనకున్నంత పట్టువారికి లేదు.

అమెరికాలో ఎన్నో ప్రతిష్టాత్మక కంపెనీలకు సీఈఓలుగా భారతీయులున్నారు. అమెరికాలో ‘భారతీయులంతా ఓ రూమ్‌లోకొస్తే ఆ గది ఐక్యూ టాప్‌కి చేరుతుంది’ అనే ఓ నానుడి ఉంది. కాలుష్యం, అవినీతి వంటి సమస్యలు ఎప్పుడూ ఉండేవే. ఓ సమాజం ముందడుగు వేసే సమయంలో సమస్యలు సర్వసాధారణం. అమెరికా వంటి దేశంలో కూడా అవినీతి ఉంది. వీటన్నింటిని ఓ కంట కనిపెడుతూనే కష్టపడేతత్వాన్ని మాత్రం ఏ రంగం​లోనైనా యువత మరువకూడదు’ అని  డా. రాజేశ్‌ కడాకియా పేర్కొన్నారు. - శ్రీమన్‌ రెడ్డి

చదవండి : కారులో అమెరికా టూ హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement