
అమెరికాలో ఖలిస్తానీల దుశ్చర్య!
గోడలపై భారత వ్యతిరేక రాతలు
తీవ్రంగా ఖండించిన హిందూ సంఘాలు
ఆలయాన్ని అపవిత్రం చేశారు: బీఏపీఎస్
న్యూయార్క్/న్యూఢిల్లీ: అమెరికాలో హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దుండగులు రెచ్చిపోతున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ బెర్నార్డినో కౌంటీలో ఉన్న చినో హిల్స్‌లోని ప్రఖ్యాత స్వామి నారాయణ్ మందిరంపై శనివారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. ఆలయ గోడలపై భారత వ్యతిరేక రాతలు రాశారు. గ్రాఫిటీ రాతలతో అందవిహీనంగా మార్చే ప్రయత్నం చేశారు.
ఇది ఖలిస్తానీల పనేనని భావిస్తున్నారు. చినో హిల్స్ లాస్ ఏంజెలెస్ కౌంటీకి సరిహద్దులోనే ఉంది. ఆలయాన్ని అపవిత్రం చేశారని బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్) ఆవేదన వెలిబుచ్చింది. ‘‘ఆలయాలపై విద్వేషాన్ని హిందూ సమాజం గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ విద్వేషాల వ్యాప్తిని చినో హిల్స్, దక్షిణ కాలిఫోర్నియాలోని హిందువులు కలసికట్టుగా అడ్డుకుంటారు’’ అని ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ఈ ఘటనపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి దుండగులను కఠినంగా శిక్షించాలని ఎఫ్‌బీఐని, దాని డైరెక్టర్ కాశ్ పటేల్‌ను కోరింది.
ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అమెరికా ప్రభుత్వానికి కోవలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా (కోహ్న) విజ్ఞప్తి చేసింది. ‘‘అమెరికాలో హిందువులపై ద్వేషభావం లేదని మీడియా, మేధావులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. లాస్ ఏంజెలెస్‌లో ఖలిస్తాన్ రెఫరెండం పేరిట కొందరు డ్రామాలుడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో స్వామి నారాయణ్‌పై ఆలయంపై దాడి ఆశ్చర్యం కలిగించలేదు’’ అని పేర్కొంది. కొన్నేళ్లలో అమెరికాలో 10 హిందూ ఆలయాలపై దాడులు జరిగాయని ఆవేదన వెలిబుచ్చింది. గతేడాది కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో, న్యూయార్క్‌లోని మెల్‌వీల్లేలో ఆలయాలపై దాడులు జరిగాయి. ‘హిందూస్ గో బ్యాక్’ అంటూ ఆలయాల గోడలపై రాతలు రాశారు.
భారత్ ఖండన
స్వామి నారాయణ్ ఆలయంపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైశ్వాల్ ఆదివారం డిమాండ్ చేశారు. అమెరికాలోని హిందూ దేవాలయాలకు తగిన రక్షణ కల్పించాలని కోరారు. స్వామి నారాయణ్ ఆలయాన్ని అపవిత్రం చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆలయాలపై అసహనం, విద్వేష చర్యలు అంగీకారయోగ్యం కాదని పేర్కొంది. దుండగులపై అమెరికా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దాడిని యోగా గురు రాందేవ్ ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment