
లండన్: 1960ల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘డాక్టర్ కిల్‌డేర్’ టీవీ సీరియల్‌తో అందరికీ సుపరిచితుడైన రిచర్డ్ చాంబర్లీన్(90) కన్నుమూశారు. వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన హవాయ్‌లోని వైమనలో శనివారం రాత్రి గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచినట్లు సన్నిహితులు తెలిపారు. 91వ ఏట అడుగు పెట్టడానికి కొన్ని గంటల ముందే ఈ విషాదం చోటుచేసుకుందన్నారు.
‘షొగున్, ది థోర్న్ బర్డ్స్’ సీరియళ్లలో ప్రధాన పాత్రలు పోషించి ‘కింగ్ ఆఫ్ ది మినీ సిరీస్’గా చాంబర్లీన్ మన్ననలు అందుకున్నారు. 1934లో కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో జన్మించిన ఈయన డాక్టర్ కిల్‌డేర్ సీరియల్‌లోని డాక్టర్ జేమ్స్ కిల్‌డేర్ పాత్రతో 1961లో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. 1980ల్లో షొగున్ సిరీస్‌లో ఖైదీగాను, అనంతరం థోర్న్ బర్డ్స్‌లో క్రైస్తవ గురువుగా పోషించిన పాత్రలు ఆయన్ను తిరుగులేని స్థాయికి చేర్చాయి.
అప్పట్లో అమెరికాలో 60 శాతం మంది టీవీ వీక్షకులు థోర్న్ బర్డ్స్ సీరియల్‌నే చూడటం ఓ రికార్డు. ఇది ఏకంగా 16 ఎమ్మీ నామినేషన్లు పొందింది. స్వలింగ సంపర్కుడైన చాంబర్లీన్.. ఆ విషయాన్ని 70 ఏళ్ల వయస్సులో ‘షట్టర్డ్ లవ్’ పేరుతో విడుదల చేసిన ఆత్మకథలో మొదటిసారిగా అంగీకరించారు. నటుడు, దర్శకుడు మార్టిన్ రబెట్‌తో 30 ఏళ్లపాటు బంధం కొనసాగించారు. 2010లో వీరిద్దరూ విడిపోయారు.