భార్య దర్శనతో రాజేశ్ కడాకియా
సాక్షి, వెబ్ డెస్క్ : భార్యాభర్తలిద్దరూ కష్టపడి చదివారు. జీవితంలో సెట్ అయ్యారు. డాక్టర్లుగా వైద్య వృత్తికి అంకితం అయ్యారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా తీరికలేనంత బిజీగా జీవితం గడిచిపోయింది. డాక్టర్లుగా ప్రజలకు ఇద్దరూ ఎంత సేవ చేసినా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఏదో తెలీని వెలితి వారిని వెంటాడేది.
తాము కోల్పోయిన సంతోషాలను, ఆనందాలను తిరిగి పొందేందుకు ఆరు పదుల వయసులో ఈ జంట భారీ అడ్వెంచర్ ట్రిప్‌కు శ్రీకారం చుట్టింది. న్యూయర్క్‌లోని ముక్తా ఆశ్రమం నుంచి హైదరాబాద్‌లోని ఇంటి వరకూ కారులో ప్రయాణించాలని నిర్ణయించారు. 37 ఏళ్ల వైవాహిక జీవితంలో కోల్పోయిన ఎన్నో మధుర క్షణాలను వడ్డీతో సహా కలిపి మూడు నెలల్లో 37 వేల కిలోమీటర్ల ప్రయాణంలో సంపాదించారు.
హైదరాబాద్‌కు చెందిన డా. రాజేశ్ కడాకియా, డా. దర్శనలు వృత్తి రీత్యా అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. 63 ఏళ్ల రాజేశ్ కడాకియా(ఎండీ, ఎఫ్‌ఏసీఈపీ) ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మెడిసిన్, జనరల్ సర్జన్‌లో పట్టా పొందారు. అనంతరం లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ నుంచి ఎఫ్‌ఆర్‌సీఎస్-1 పూర్తి చేశారు. ఎల్‌ఆర్‌సీపీ అండ్ ఎమ్‌ఆర్‌సీఎస్‌లో అడిషనల్ డిగ్రీలు కూడా పొందారు. 1987 నుంచి ఫిజీషియన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
అమెరికన్ బోర్డ్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్, అమెరికన్ బోర్డ్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ అండ్ హోలిస్టిక్ మెడిసిన్‌లో దౌత్యవేత్తగా కూడా వ్యవహరిస్తున్నారు. డాక్టర్ దర్శన కడాకియా(60) (ఎండీ, ఎఫ్‌సీసీపీ) యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి మెడిసిన్ పట్టాను అందుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి రెసిడెన్సీ అండ్ పల్‌మోనరీ మెడిసిన్‌లో ఫెలోషిప్ చేశారు. అమెరికన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల దౌత్యవేత్తగా కొనసాగుతున్నారు.
రాజేశ్ యువకుడిగా ఉన్నప్పుడే కారుల్లో తెగచక్కర్లు కొట్టేవారు. పలు రేసుల్లోనూ పాల్గొన్నారు. అడ్వెంచర్ ట్రిప్పులంటే ఆయనకు మక్కువ. 1981లో భారతీయ కార్లతో జరిపిన పోటీల్లో జాతీయస్థాయిలో ఆఫ్ రోడ్ చాంపియన్‌గా కూడా నిలిచి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా అవార్డును కూడా అందుకున్నారు.
దర్శనకు కూడా ట్రావెలింగ్ అంటే పిచ్చి. వీరిద్దరికి వివాహం జరిగిన తర్వాత రాజేశ్, దర్శన్‌లు డాక్టర్లుగా బిజీబిజీ జీవితంలో నిమగ్నమైపోయారు. కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా సమయం ఉండేది కాదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 37 ఏళ్ల పాటు వైద్యవృత్తిలో నిబద్ధతతో పని చేశారు. డాక్టర్లుగా ఉన్నత శిఖరాలను చేరుకున్నారు. కానీ, వ్యక్తిగత జీవితాన్ని మిస్సవుతున్నామనే ఆలోచన వారిని మెదడుని తొలిచేది. దీంతో భార్యతో కలసి అడ్వెంచర్ ట్రిప్‌కు వెళ్లాలని రాజేశ్ భారీ ప్రణాళికను రూపొందించారు.
ఏకంగా అమెరికా నుంచి భారత్‌కు రోడ్డు మార్గం ద్వారా కారులో వెళ్లాలని నిర్ణయించారు. అయితే ఇది ఆషామాషీ వ్యవహారం కాదని వారికి తెలుసు. ఎన్నో అనుమతులు తీసుకోవాలి. ఒక్కో దేశంలో ఒక్కో వాతావరణం ప్రయాణించాల్సి ఉంటుంది. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొవాల్సివుంటుంది. అయినా దేనికి వెరవకుండా ఆరు పదుల వయసులో 'హోమ్ రన్' పేరుతో కాలిఫోర్నియా నుంచి హైదరాబాద్(రాజేశ్ తల్లి కోకిలాబెన్ కడాకియా(85) సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్నారు)కు బయలుదేరారు.
ఈ ఏడాది మార్చి 28న కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్‌లోని స్వామి ముక్తానంద ఆశ్రమానికి వెళ్లారు. అక్కడి నుంచి విమానంలో కారును పారిస్‌కు పంపారు. తిరిగి ఏప్రిల్ 12న పారిస్‌లో కారును తీసుకుని ప్రయాణం ప్రారంభించారు. అమెరికా, ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, డెన్మార్క్, నెదర్లాండ్, స్వీడన్, ఫిన్‌లాండ్, రష్యా, కజకిస్తాన్, తిరిగి రష్యా, మంగోలియా, చైనా, టిబెట్, నేపాల్‌ల మీదుగా రోడ్డు మార్గంలో భారత్‌కు చేరుకున్నారు.
ప్రస్తుతం ఇండోర్ నుంచి ముంబై మార్గంలో ఉన్నారు. 37 వేల కిలోమీటర్లు ప్రయాణించి జూన్ 12న హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ సాహసయాత్ర వారిద్దరిని దాదాపు మూడు నెలలపాటూ కలిసుండేలా చేసింది. అత్యధిక ఉష్ణోగ్రత, -14 డిగ్రీల చలిలోనూ వీరి ప్రయాణం సాగింది. ‘టయోటా ల్యాండ్ క్రూజర్ రైట్ హ్యాండ్ డ్రైవ్’ డీజిల్ కారును అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది యాత్రకు వినియోగించారు. ప్రతి రంగంలోను విజయం సాధించొచ్చనే స్పూర్తిని యువతలో నింపేందుకే హోమ్ రన్ పేరిట ఈ యాత్ర చేస్తున్నట్లు రాజేశ్ తెలిపారు. మనిషి తలుచుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదని అన్నారు. ఈ నెల 12న రాజేశ్, దర్శనలు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
- శ్రీమన్ రెడ్డి, భరత్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment