నిన్నటి చరిత్ర... నేటి సాహస యాత్ర
రాజులు రాచరికాలు అంతరించినా... ఆ జ్ఞాపకాలు తలచుకోవడం, వాటిని గుర్తు చేసే ప్రదేశాలను సందర్శించడం ఇచ్చే అనుభూతిని మాటల్లో వర్ణించలేం. అలాంటి అనుభూతిని కోరుకునేవారికి, చిన్నపాటి సాహసయాత్ర చేయాలనుకునే వారికి కోయిలకొండ... ఓ చక్కని గమ్యం. - ఓ మధు
అలనాటి గిరిదుర్గాలలో ఒకటయిన కోవెలకొండ కాలక్రమంగా కోయిలకొండ, కీలగుట్టగా మారింది. స్థానికులకు కూడా అంతగా పరిచయం లేని పురాతనకోట కోయిలకొండ కోట. కాసింత నిగూడంగా ఉండే ఈ చోటు చేరుకోవటం కూడా సాహసమే.
చరిత్రకు భాష్యం... నిర్మానుష్యం...
చాలా తక్కువ ప్రాచుర్యంలో ఉన్న ఈ కోట మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంది. ఈ కోటను కృష్ణదేవరాయల కాలంలో వడ్డేరాజులు నిర్మించారని, ఆ తర్వాత వెలమరాజుల ఆధీనంలో కొనసాగిందని, ఆ తర్వాత కాలంలో కుతుబ్‌షాహి సుల్తాన్‌ల వశం అయినట్లు చరిత్ర. దక్కన్ సుల్తాన్‌ల కాలంలో పన్ను వసూలు చేసే కేంద్రంగా ఉన్న ఈ కోట నేడు చాలా మందికి తెలియని చోటే. అడవిలో, కొండమీద ఉండే ఈ కోట చాలా వరకూ నిర్మానుష్యంగానే ఉంటుందని చెప్పవచ్చు. కోయిలకొండ గ్రామానికి దక్షిణంగా ఉండే ఈ కోటకు ఆటోలు, ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. ఈ కోట ట్రెక్కింగ్ అంటే ఇష్టపడేవాళ్లకు బాగా నచ్చే ప్రదేశం.
గతం వైపు స్వాగతించే హనుమాన్..
ఆంజనేయుడి బొమ్మ చెక్కి ఉన్న కొండ కనిపిస్తే కోటలోకి దారి కనిపించినట్లే. పొదలు, జారుడు బండలతో, ఎత్తై రాళ్లతో మలిచినమెట్లు కోటలో వాతావరణం ఇలా సాహసయాత్రకు కావలసిన అన్ని హంగులతో ఉంటుంది. కోటలో మొదటి పెద్ద ముఖ ద్వారాన్ని దాటుకుని వెళితే మరో నాలుగు ద్వారాలు అలా మొత్తం 7 ద్వారాలు దాటి వస్తే కోటపై భాగానికి చేరుకుంటారు.. పైకి ఎక్కి చూస్తే, కొండల మధ్య కోవెల, కోట నిర్మించడానికి కారణం అక్కడి ప్రకృతి రమణీయత, శత్రుదుర్భేద్యమైన సహజ పరిసరాలే అని అర్థమవుతుంది.. దూరంగా కనిపించే రిజర్వాయర్ నీరు, చుట్టూ అడవి, కొండగాలి ట్రెక్కింగ్ చేసే వారికి కావలసిన అందమైన బహుమతి దొరికినట్లే అనిపిస్తుంది. రాళ్లను పేర్చుతూ నిర్మించిన కోట గోడలు నాటి నిర్మాణశైలి పటిష్టతకు ప్రతీకగా కనిపిస్తాయి. గతంలో కోటకు వెళ్లిన వారి సహాయంతో ఇక్కడి వెళ్లటం ఉత్తమం. ఈ క్లిష్టమైన కోటలో మసీదు కొలను, అనేక ఆలయాలున్నాయి. దగ్గరలో వీరభద్రస్వామి, రాముని ఆలయాలను దర్శించుకోవడానికి భక్తులు వస్తుం టారు. ఇక కోటలో మొహరం పండుగ విశేషంగా జరుపుతారు. స్థానికులు మతభేదం లేకుండా పాల్గొంటారు.
ఇలా వెళ్లండి...
హైదరాబాద్‌కి దాదాపు 125 కి.మీ దూరంలో ఉన్న ఈ కోటను చేరుకోవడానికి ముందుగా ఎన్‌హెచ్.7 పై మహబూబ్‌నగర్‌కు బస్సు, రైలు మార్గాల ద్వారా చేరుకోవాలి. అక్కడి నుంచి ప్రైవేటు, ఆర్టీసీ వాహనాల ద్వారా కోయిలకొండ గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. కోట చూసాక సమయం చిక్కితే పెద్దవాగుపై నిర్మించిన కోయిల్‌సాగర్ డ్యామ్‌ని చూసి రావడం మరచిపోవద్దు.