మౌనంగా ఆయన నా వైపు చూశాడు కాని, నన్ను గుర్తుపట్టలేదు. ఆయన శరీరంలో చివరిగా మిగిలిన రెండు కన్నీటి చుక్కలు కళ్లకు అడ్డుపడి మసకబారినట్టున్నాయి. అందుకే నేను సరిగా కనపడక గుర్తురాకపోయి ఉండవచ్చు. ఎంతకాలమని మనిషి తన జ్ఞాపకాలను నిలుపుకోగలడు? ఏదో ఓ రోజు అన్నీ చెదిరి పోవాల్సిందేగా! పదిలంగా దాచుకున్న ఆయన జ్ఞాపకాలు చెదిరిపోయే సమయం వచ్చింది. అదంతా అర్థమవుతూనే ఉంది.
అంతలో ఆయన కుడి కన్ను నుంచి ఓ నీటిబొట్టు జారి, నేల రాలటం నా కంట పడింది. కంటికి అడ్డుపడిన పొర తొలగిపోయి ఇప్పుడు నేను స్పష్టంగా కనిపిస్తూ ఉండవచ్చు. నాలో కాస్త ధైర్యం వచ్చింది. ఆశ మెరిసింది. ముందుకు వంగి ఆయన వైపు చూశా. ఆనంద విషాదాలు లేని శూన్యస్థితిలో ఉన్న ఆయన నా వైపు పరికించి చూశాడు. కాని, నన్ను గుర్తుపట్టలేదు.
ఇంతకీ ఆయన గురించి చెప్పనే లేదు కదూ, ఆయన పెద్దయ్య. ఆయన పేరు ఇప్పటికీ నాకు తెలీదు. పెద్దయ్య కాబట్టి పేరుతో నాకేం పని? ఆయన గురించి చెప్పాలంటే ఓ కథ చెప్పినట్లే ఉంటుంది. ఇప్పటికి సరిగ్గా ముప్పై ఐదేళ్ల ఏళ్ళ క్రితం నాటి మాట. మొదటిసారి పెద్దయ్యని చూశాను. అప్పటికి నాకు పదేళ్ల వయసు. ఊహ తెలిసే వయసు కావడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ నాకు జ్ఞాపకమే!
నేను పుట్టింది పెద్దయ్య ఊర్లోనే! కాని, మా చిన్నప్పుడే మా నాన్న ఉద్యోగరీత్యా పట్నం వలస వెళ్లిపోయాడు. చిన్నప్పుడు ఆ ఊరుతో ఉన్న జ్ఞాపకాలేవీ గుర్తులేవు. మా నాన్న, అమ్మతో కలిసి పెద్దయ్య ఇంటికి వెళ్ళింది ఆ ఊరుతో నాకున్న మొదటి జ్ఞాపకం. మొదటిసారి పట్నం నుంచి ఆ ఊరు వెళ్ళినప్పుడు ఇంటి ముందు కోడె దూడలకు సొద్ద బువ్వ తినిపిస్తూ పెద్దయ్య కనిపించాడు.
ఎద్దులకు కడుపు నిండా తిండిపెట్టి, నీళ్లు తాగించి తీరిగ్గా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని పలకరించాడు. పెద్దయ్యకు మనుషులన్నా ఎద్దులన్నా ఒకటేనని కొన్నాళ్లకు తెలిసింది. ఇంటికి అల్లంత దూరంలో ఉన్న కొండపొలం అంటే ఆయనకు మరీ ఇష్టమని అర్థమైంది. ఆయన ఎద్దుల్ని ఇష్టపడ్డట్టే పిల్లలుగా ఉన్న మమ్మల్ని ఇష్టపడేవాడు. రాత్రి పూట మమ్మల్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని, ఎన్నో కబుర్లు చెప్పేవాడు.
ఆయన చెప్పే కబుర్లన్ని ఆ కొండపొలం గురించి, ఆయన ఎద్దుల గురించే! ఓ రోజు రాత్రి నులక మంచాల మీద పిల్లలందరం పడుకున్నాం. పెద్దయ్య కథలాంటి ఆయన అనుభవం చెప్పటం ప్రారంభించాడు. ఆ ఏడు జొన్న చేను ఇరగ్గాసింది. ఏడాది చివరి నెల కావడంతో చలి కూడా పెరిగింది. అసలే అది కొండపొలం. ఒంట్లో ఎముకల్లోకి చలి దూరి మెలిపెడుతోంది. అయినా చేనుకు కాపలా ఉండాలి. లేకపోతే అడవి పందులు గుల్ల చేస్తాయి.
రాత్రంతా మంచె మీదే జాగారం చేయాలి. ఆరోజు అమావాస్య. ఎటు చూసినా చిమ్మ చీకటి. కాస్త కునుకు తీద్దామని పెద్దయ్య నడుంవాల్చాడు. కాసేపటికే ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. పడమట చుక్క మూరెడు దిగింది. రెండు ఝాములు గడిస్తే పొద్దెక్కుతుంది. ఇక ఇబ్బంది లేదు. ఇంటికి పోవచ్చు అనుకుని చేతికర్ర పట్టుకుని ఇంటిదారి పట్టాడు పెద్దయ్య.
చలిగాలి ఒంటికి తగులుతుంటే వడివడిగా నడుస్తున్నాడు. దారిలో కాలికేదో మెత్తగా తగిలింది. కళ్ళు ఇడమర్చి చూశాడు. అది పేద్ద కొండచిలువ. దూడల్ని ఒక్క ఉదుటున మింగే కొండ చిలువ. ఆ దరి నుంచి ఈ దరి వరకు పరుచుకొని పడుకుంది. పెద్దయ్యకు ఒళ్ళు జలదరించింది. మంచె కాడ వదిలిన ఇనుప గొడ్డలి గుర్తొచ్చింది. ఒక్క ఉదుటున మంచె కాడికి పరిగెత్తి, గొడ్డలితో తిరిగొచ్చాడు. తాటిచెట్టులా ఆ రాకాసి కొండ చిలువ మెదలకుండా దారికి అడ్డంగా పడుకునే ఉంది. ధైర్యం కూడగట్టుకొని గొడ్డలి ఆకాశానికెత్తి, ఒకే ఒక్క ఏటేశాడు.
అంతే, రెండుగా తెగిన కొండచిలువ చచ్చూరుకుంది. పెద్దయ్య చెప్పే ముచ్చట్లన్నీ ఇలాగే కథల్లా ఉండేవి. ఊ కొడుతూ వినేవాళ్ళం. ఓ రోజు రాత్రి చీకట్లో పొలం పోతుంటే పెద్దయ్యకు చిన్న మేకపిల్ల దారిలో కనిపించిందట. పాపం ఎక్కడిదో ఎవరు వదిలేశారో అని బుజ్జి మేకను భుజానికెత్తుకొని నాలుగడుగులు ముందుకు వేశాడో లేదో ఆ మేక పిల్ల రెండింతలైందట! ‘ఏందబ్బా ఇది’ అని ఆలోచిస్తూ ఇంకాస్త ముందుకు కదిలాడో లేదో మేకపిల్ల కొమ్ములు తిరిగిన పోతుమేకైందట.
వెంటనే పెద్దయ్యకు విషయం అర్థమై, పోతుమేక రెండు వెనక్కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడట. ‘ఓరి భడవా! తప్పిచ్చుకున్నావ్ ఫో!’ అంటూ దెయ్యం రూపంలో ఉన్న మేక మాయమైపోయిందట! పెద్దయ్యకు భలే ధైర్యం. పొలం పోవాలంటే ఊరి చివర చింతచెట్లు దాటి వెళ్ళాలి. అర్ధరాత్రి ఆ చెట్ల మీద ఎన్నిసార్లు కొరివి దెయ్యాలు కనిపించాయో లెక్క లేదట! కొరివి దెయ్యం కనపడ్డప్పుడు దాని కళ్ళలోకి చూడకూడదు, పిలుస్తున్నా వెనక్కి తిరిగి చూడకూడదని మాకు సలహాలు చెప్పేవాడు.
పిల్లలందరం ఒకరినొకరం పట్టుకొని దుప్పట్లు కప్పుకొని నిద్ర పోయేవాళ్ళం. తెల్లారి లేస్తే పెద్దయ్య కనపడడు. పొద్దు పొడవక ముందు ఆయన పొలం పోతే, మళ్ళీ తిరిగి వచ్చేది పొద్దుగూకాకే! పంట బాగా ఏపుగా ఉంటే పగలూ రాత్రీ పొలమే ఆయన ఇల్లు. ఆయనకు పొలం, ఇల్లు, ఆ ఊరు తప్ప మరో ఊరు తెలియదు. పెద్దయ్య ఇంటికి మేము వెళ్ళటమే కాని, ఒక్కసారి కూడా ఆయన మా ఇంటికి వచ్చినట్టు గుర్తులేదు.
నాకు పెళ్లయి, పిల్లలు పుట్టినా పెద్దయ్య మా ఇంటికి రాలేదు. నాకు నలభై ఏళ్లు వచ్చాయి. ఇల్లు కట్టుకున్నా. ఒక్కసారి కూడా మా ఇంట్లో ఆయన చేయి కడగలేదు. ఓ రోజు నాకు బాగా గుర్తు. ఆ రోజు అందరం ఇంటి వద్దే ఉన్నాం. కాలింగ్ బెల్ మోగితే నేనే వెళ్ళి తలుపు తీశా. ఎదురుగా పెద్దయ్య. మల్లెపువ్వులా తెల్ల పంచె, తెల్ల చొక్కాలో మెరిసిపోతూ పెద్దయ్య. ఎప్పుడూ పొలం పనిమీద చొక్కా లేని పెద్దయ్యను అలా చూసేసరికి నన్ను నేనే నమ్మలేక పోయా. నేరుగా ఇంట్లోకి వచ్చి నాన్న కూర్చునే టేకు కుర్చీలో కూర్చున్నాడు.
మా అందరికీ ఒకటే సంతోషం. పొలంలో ఉండాల్సిన పెద్దయ్య పట్నంలో మా ఇంట్లో తేలాడు. కొట్టంలో ఎద్దుల పేడ ఎత్తుతూ కనిపించే పెద్దయ్య ఇప్పుడు మల్లెపువ్వులా మెరిసిపోతూ నవ్వుతున్నాడు. ఆశ్చర్యంతో మాకు మాటలే రాలేదు. మౌనంగా మూగమొద్దుల్లా చూస్తూ ఉన్నాం. అందుకే ఆయనే మా వైపు చూసి నవ్వుతూ నోరు విప్పాడు. ‘అవునయ్యా! రావాలనిపించింది, వచ్చాను. ఏం.. పట్నం నాకు తెలీదనుకున్నారా? ఎక్కడికైనా వెళ్ళగలను. ఎద్దులు బేరం చేసేటప్పుడు ఎంతెంత దూరం వెళ్ళేవాళ్ళమో మీకేం తెలుసు? పట్నం నాకో లెక్క కాదు. మా అయ్య నాకు కొండవాలుగా అరెకరం పొలం ఇచ్చి పోయాడు.
రెక్కలు ముక్కలు చేసుకుని ఇప్పుడు ఆరెకరాల పొలం చేశాను. ఇక చేసే ఓపిక లేదు. అందరూ పెద్దోళ్ళయ్యారు. పెళ్లిళ్లు చేసుకున్నారు. వాళ్ళ పిల్లలు కూడా పెద్దోళ్ళయ్యారు. ఇక ఎంతకాలం ఆ పొలం చుట్టూ తిరగాలి. నేనూ హాయిగా విశ్రాంతి తీసుకోవద్దూ. అందుకే అన్నీ ఎవరివి వాళ్ళకి ఒప్పచెప్పి ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు పనీ పాట లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తిరుగుతాను? అందరిళ్లకూ తిరుగుతున్నాను. మంచాన పడక ముందే తిరగాలి కదయ్యా!..’ పెద్దయ్య నవ్వుతూ చెబుతూనే ఉన్నాడు.
టేకు కుర్చీలో కాలు మీద కాలేసుకుని, తలగుడ్డ చుట్టుకుని నవ్వుతూ మాట్లాడే పెద్దయ్యను చూస్తే ఆ రోజు మాకు ఓ హీరోలా కనిపించాడు. ఆ క్షణంలో పెద్దయ్యని చూస్తే నీషే కలగన్న సూపర్‌మేన్ ఇతనే కదా అనిపించాడు. ఇంకెక్కడో ఉండే స్వర్గంతో అవసరం లేకుండా ఇక్కడే ఈ భూమినే భూతలస్వర్గంగా భావించిన పెద్దయ్య సూపర్‌మేన్ కాక మరేంటి? పెద్దయ్యకు స్వర్గ నరకాలు తెలీవు. ఆయనకు కొండపొలమే భూతలస్వర్గం.
‘శ్రమ ద్వారా జీవితాన్ని ప్రేమించడం అనేది నిగూఢ జీవిత రహస్యాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం’ అనే ఖలీల్ జిబ్రాన్ కవిత పెద్దయ్యకు అచ్చు గుద్దినట్టు సరిపోద్ది. పెద్దయ్య కూడా శ్రమించడం ద్వారానే జీవితాన్ని ప్రేమించాడు. జీవిత రహస్యాలను తెలుసుకున్నాడు. శ్రమ ఆయనకు ఆనందం. అక్షరజ్ఞానం లేని నిరక్షరాస్యుడు అయిన పెద్దయ్య ఇలా ఎలా జీవించాడు? ఇది నాకు ఎప్పుడూ అంతుచిక్కని ప్రశ్న!
అక్షరజ్ఞానం లేని ఆయన, చదువు అవసరమే పడని ఆయన, చదువులేదని ఏ రోజూ బాధపడని ఆయన, ఎలా జీవించాలో థింకర్స్ భావించినట్లే జీవించాడు. ఆయన పనిని ప్రేమించాడు. పనిలోనే ఆనందం పొందాడు. పనే ఆయన దైవం. పని ఆయన స్వర్గం. ఇంతకన్నా సంపూర్ణమైన జీవితం ఏముంటుంది ? ఆందోళన లేకుండా, అనారోగ్యం బారిన పడకుండా, అత్యాశకు పోకుండా, జంతువులను మనుషులను సమంగా ప్రేమించే సుగుణాలు అందరిలోనూ ఉంటాయా? ఆ రోజంతా పెద్దయ్య మాతోనే గడిపాడు. మమ్మల్ని నవ్వించి, నవ్వుతూ తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు.
ఇప్పుడు నేను చెబుతున్న కథంతా ఆయన స్వచ్ఛంద పని విరమణ చేసిన ఇరవై సంవత్సరాల తర్వాత, పది రోజుల క్రితం జరిగింది. ఆ రోజు పెద్దయ్యకి ఒంట్లో బాగాలేదని కబురొచ్చింది. మందు బిళ్ళే మింగని ఆయనకు సుస్తీ చేయడమా? ఆలోచిస్తుంటే కాసేపటికి విషయం తెలిసింది. తెల్లవారుజామున మంచం మీద నుంచి కింద పడటంతో పెద్దయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మెదడులో రక్తం గడ్డ కట్టిందని డాక్టర్లు చెప్పారు. పచ్చటి ప్రకృతి మధ్య పక్షిలా ఎగిరే ఆయన మనసు ఆ రోగుల మధ్య ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది.
ఎంతో గొడవ చేస్తుంటే ఇక లాభం లేదని ఆయన్ను ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికే మెదడులో నిక్షిప్తమైన జ్ఞాపకాల ప్రవాహాలకు రక్తం గడ్డలు అడ్డుతగులుతున్నాయి. పది రోజుల్లోనే అందర్నీ మర్చిపోయాడు. నన్ను గుర్తుపడతాడేమోనని ఆశపడ్డా. అదే ఆశతో ఆ రోజు ఇంటికి వెళ్లా. ఒంటరిగా ఓ గదిలో పెద్దయ్య గువ్వలా కూర్చున్నాడు. తలుపు తీసిన అలికిడికి మెల్లగా తల ఎత్తి నాకేసి చూశాడు. అంతే, మెల్లగా తలదించుకున్నాడు. ఆయన్ను అలా చూస్తానని ఎప్పుడూ ఊహించలేదు.
పొలాలనన్నీ, హలాల దున్నీ, విరామ మెరుగక పరిశ్రమించిన పెద్దయ్య శాశ్వత విశ్రాంతికి సన్నద్ధమవుతున్నాడు. ఆ గదిలోని సీలింగ్ ఫ్యాన్ మెల్లగా తిరుగుతోంది. చల్లటి గాలి నా శరీరానికి తాకింది. అదే గాలి ఆయన శరీరానికీ తాకింది. ఆయన కప్పుకున్న దుప్పటి ఇంకాస్త బిగించి పట్టుకున్నాడు. ఆ దుప్పటి మాటున ఎముకల గూడు నా ఎక్స్‌రే కళ్లకు కనిపిస్తోంది. పది రోజుల నుంచి ముద్ద బువ్వ ముట్టని ఎనభై ఏళ్ల శరీరం ఎముకల గూడులా కాకుండా ఎలా ఉంటుంది. పట్టు విడిచే సమయం వచ్చిందని నాకు తెలుస్తూనే ఉంది.
ఇవేమీ పెద్దయ్యకు తెలియదు. ఆయన ముఖంలో అలౌకిక ఆనందం కనిపిస్తోంది. కళ్ళు తడిగా ఉన్నాయి కాని, ముఖం చిరునవ్వుతో వెలిగిపోతూ ఉంది. శరీరంలోని అవయవాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు లేవు. లేకుంటే నవ్వే ముఖంలో కన్నీరు కార్చే కళ్ళు ఎలా ఉంటాయి? మౌనంగా అలానే నిలబడి ఉన్నా. ఆయన కూడా మౌనంగా అలానే కూర్చొని ఉన్నాడు. ఆ గదంతా ప్రశాంతమైన నిశ్శబ్దం. చిటుక్కుమన్నా చెవులు పగిలే నిశబ్దం.
నా పక్కనే మరికొందరు నా వయసు వాళ్ళే నిలబడి ఉన్నారు. బయట కేరింతలు కొడుతూ పిల్లలు గోల చేస్తున్నారు. నేనూ, నా వయసు వాళ్లందరం పెద్దయ్యను చూస్తూ ఉన్నాం. ఎనభై ఏళ్లపాటు పోగేసిన జ్ఞాపకాలను భద్రంగా మా చేతుల్లో పెట్టి అలౌకిక ఆలోచనల్లో మునిగి పోయాడు పెద్దయ్య.
Comments
Please login to add a commentAdd a comment