కాలాన్ని గెలిచినవాడు | Sakshi Editorial On Time that who wins | Sakshi
Sakshi News home page

కాలాన్ని గెలిచినవాడు

Published Mon, Nov 6 2023 5:43 AM | Last Updated on Mon, Nov 6 2023 5:43 AM

Sakshi Editorial On Time that who wins

గతం అనేది ఎక్కడుంది? గతంలో జీవించిన మనుషులు కాలపు పొరల్లో ఎక్కడ చిక్కుకుని ఉన్నారు? గత సంఘటనలు ఏ కాలగర్భంలో వెచ్చగా దాగి ఉన్నాయి? గతం తాలూకు ఆలంబన అంటూ లేకపోతే మనిషికి వర్తమానంలో ఉన్నదేమిటి? గతం అనేది మనిషి యావజ్జీవితపు ధ్రువపత్రం. కానీ గతాన్ని వర్తమానంలోకి లాగే మంత్రదండం ఎక్కడుంది? జ్ఞాపకం ద్వారా మాత్రమే గతాన్ని చైతన్యవంతం చేయగలం. కానీ ఆ జ్ఞాపకం స్వచ్ఛందంగా మనసులోకి దూకాలి. అలా దూకాలంటే ఇంద్రియాలను ఏదో కదిలించాలి. అది ‘బలమైనదే’ కానక్కరలేదు.బలంగా ముద్ర వేసినదైతే చాలు.

అనుకోకుండా ఒక చలికాలం పూట వెచ్చదనం కోసం అమ్మ ఇచ్చిన టీ కప్పులో ‘మడలీన్ ’ అనే చిన్న గుండ్రపాటి కేకును అద్దుకోగానే, ఆ మొదటి రుచి అంగిలికి తాకగానే, ఎప్పుడో చిన్నతనంలో తాము నివసించిన ‘కోంబ్రే’లో అనుభవించిన అదే రుచి మార్సెల్‌ ప్రూస్ట్‌కు చప్పున గుర్తొస్తుంది. ఆ వెనువెంటనే బాల్యంలో తిరగాడిన ఆ ఊరు, ఆ మనుషుల తాలూకు జ్ఞాపకాలు జలజలా రాలుతాయి. ఇక కాలంలో వెనక్కి ఈదుకుంటూ వాళ్ల కుటుంబీకుల పుట్టుపూర్వోత్తరాలు ఏకధారగా వల్లెవేయడానికి కూర్చుంటాడు.

అలా గతాన్ని స్వగతంగా మార్చుకోవడం ద్వారా ఇరవయ్యో శతాబ్దపు అత్యంత విస్తారమైన ఆత్మకథాత్మక నవలారాజం ‘ఇన్  సెర్చ్‌ ఆఫ్‌ లాస్ట్‌ టైమ్‌’ సాహిత్యలోకానికి అందింది. సుమారు నాలుగు వేల పేజీలున్న ఈ నవల 1913 నుంచి 1927 మధ్య ఏడు భాగాలుగా ప్రచురితమైంది. ఏ రచయితకైనా గతమే పెట్టుబడి. కానీ ప్రత్యేకించి ఆ గతంలో జీవిత పరమార్థాన్ని అన్వేషించడంలోనే ప్రూస్ట్‌ రచనా వైభవం దాగివుంది. కాలం అనే విధ్వంసక శక్తిని కళ అనే సాధనంతో ఆయన ఎదుర్కొన్నాడు. కాలంలో కలిసిపోయిన వారిని సాహిత్యం ఊతంగా సజీవ మూర్తులుగా నిలబెట్టాడు.

సమకాలీన ఫ్రెంచ్‌ సమాజపు రీతులు, బాధలు, భయాలు, తపనలు,  ఒంటరితనాలు, సరదాలు, సంతోషాలు, నిర్దయలు, క్షమలు, ఇంకా ఆయన సంక్లిష్ట లైంగికేచ్ఛలు అన్నీ అక్షరాల్లోకి తెచ్చాడు. కిటికీలోంచి సముద్రం మీద కనబడే సూర్యోదయాన్ని చూస్తూ అనుభవించే తన్మయత్వంలా రాతను మలిచాడు. చరిత్రకారుడు, తాత్వికుడు, మానసిక శాస్త్రజ్ఞుడు, రాజకీయాంశాల వ్యాఖ్యాత, ఇంకా ‘పర్వర్టు’, ఇంకా ఒక కవి– ఇలా ఆరుగురు ప్రూస్టులు ఇందులో కనబడతారంటారు ఆడమ్‌ గోప్నిక్‌. సంగీతం, సాహిత్యం, యుద్ధం, సమాజం, పెయింటింగ్, శృంగారం, కళలు, అసూయ, ఫ్యాషన్లు– ఇలా ప్రూస్ట్‌ అభిప్రాయానికి చిక్కకుండా మిగిలిపోయేది ఏదీ ఉండదు.

‘తన జీవితపు మెటీరియల్‌ను ఇంత బాగా ఏ రచయితా వాడుకోలేదు’ అంటారు టెన్నెస్సీ విలియమ్స్‌. ‘ఒక రచయిత ఒకసారి చదివితే పూర్తయ్యేట్టయితే ఆ రచయిత పెద్దగా ఏమీ చెప్పనట్టు! హోమర్‌లాగా జీవితకాలం వెంటతెచ్చుకోగలిగే రచయిత ప్రూస్ట్‌’ అంటారు డేనియల్‌ మెండెల్‌సన్ . కలిగిన ఫ్రెంచ్‌–యూదు కుటుంబంలో పుట్టాడు మార్సెల్‌ ప్రూస్ట్‌ (10 జూలై 1871– 18 నవంబర్‌ 1922). ఐఫిల్‌ టవర్‌ను నిర్మించిన ఇంజినీర్‌ గుస్తావ్‌ ఐఫిల్‌... ప్రూస్టులకు సన్నిహితుడు. తొమ్మిదో ఏట నుంచే ప్రూస్టుకు ఉబ్బసంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలుండేవి. ప్యారిస్‌ ఉన్నత సమాజంలో ముందు కలియ తిరిగినప్పటికీ రానురానూ ఏకాంతంలోకి వెళ్లిపోయాడు.

బయటి నుంచి వచ్చే పెద్ద శబ్దాలను కూడా భరించేవాడు కాదు. హైపర్‌ సెన్సిటివ్‌. అందుకే పగలు పడుకొని రాత్రుళ్లు రాయడం అలవాటు చేసుకున్నాడు. ‘నిశాచర సరస్వతి!’. కల్పనతో కూడిన తన ఆత్మకథలోని మొదటి భాగమైన ‘స్వాన్స్ వే’ను ఎవరూ ప్రచురించడానికి ముందుకు రాలేదు.  దాంతో సొంత డబ్బుతో అచ్చు వేయించుకున్నాడు. దాన్ని తిరస్కరించినవారిలో అప్పటి ప్రఖ్యాత రచయిత ఆంద్రే గిదె కూడా ఒకరు. ‘నా జీవితంలో నేను చేసిన అత్యంత పెద్ద తప్పిదం’ అని ఆయన తర్వాత పశ్చాత్తాపపడ్డారు.

తన మృత్యువు సమీపంలో ఉందని ప్రూస్ట్‌కు తెలుసు. తన రచన ఎక్కడ పూర్తవ్వదో అనే ఆందోళన ఉండేది. నాలుగు భాగాలు ప్రూస్ట్‌ బతికి ఉన్నప్పుడే వచ్చాయి. ఆయన రాసుకున్న డ్రాఫ్టుల ఆధారంగా తర్వాతి మూడు భాగాలు ఆయన తమ్ముడు రాబర్ట్‌ ప్రూస్ట్, రచయిత జాక్వెస్‌ రివియేరీ సంపాదకులుగా వచ్చాయి. ఇందులో ఐదో భాగం అయిన ‘ద ప్రిజనర్‌’ సరిగ్గా నూరేళ్ల కింద 1923లో వచ్చింది. ఇది అనారోగ్యంతో ప్రూస్ట్‌ చనిపోయాక విడుదలైన మొదటి భాగం. ఇప్పుడు ఆంగ్లంలో ప్రామాణిక అనువాదంగా పరిగణిస్తున్నది బ్రిటిషర్‌ అయిన సి.కె.స్కాట్‌ మాంక్రీఫ్‌ చేసినది.

ఆయన పెట్టిన పేరు ‘రిమెంబ్రన్స్ ఆఫ్‌ థింగ్స్‌ పాస్ట్‌’. చాలా ఏళ్లు ఈ పేరుతోనే వ్యాప్తిలో ఉన్నప్పటికీ, ఈ అనువాదానికి తర్వాత మెరుగులు దిద్దినవారిలో ఒకరైన డి.జె.ఎన్ రైట్‌ నవల పేరును ‘ఇన్  సెర్చ్‌ ఆఫ్‌ లాస్ట్‌ టైమ్‌’గా మార్చారు. ఈ శీర్షికే ప్రూస్ట్‌ మానసిక ప్రపంచానికి దగ్గరగా ఉండి, స్థిరపడిపోయింది. ప్రూస్ట్‌ ఇల్లియర్స్‌ అనే చోట తన చిన్నతనం గడిపాడు. దాని ఆధారంగానే ‘కోంబ్రీ’ని సృష్టించాడు.

1971లో ప్రూస్ట్‌ శతాబ్ది సందర్భంగా దానికి ‘ఇల్లియర్స్‌–కోంబ్రీ’గా నామకరణం చేసి రచయిత పట్ల గౌరవం చాటుకున్నారు. జీవితం లోంచి సాహిత్యంలోకి వచ్చిన పేరు, మళ్లీ సాహిత్యం లోంచి జీవితంలోకి వచ్చింది. ఒక కొత్త మనిషిని అర్థం చేసుకోవడానికి పాత్రికేయులు ‘ప్రూస్ట్‌ ప్రశ్నావళి’(ప్రూస్ట్‌ క్వశ్చనెయిర్‌) అని అడుగుతుంటారు. మన జీవితానికి దగ్గరగా వెళ్లాలంటే– నేనెవరు? ఈ జీవితంతో ఏం చేసుకోవాలి? అనే ప్రశ్నలను అన్వేషిస్తూ జీవిత సాగరాన్ని అన్వేషించిన ప్రూస్టియన్ ప్రపంచంలోకి వెళ్లాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement