Time
-
చై-శోభితల మనసు బంగారం.. ఎంత మంచి పని చేశారో! (ఫోటోలు)
-
కాలాన్ని మంచి చేసుకోవాలి!
కాలం మనల్ని వెక్కిరిస్తూ ముందుకు పరిగెత్తుతూంటుంది. మనం దానితోపాటు నడవలేం. దాన్ని ఆపలేం. దాని వెంట పరిగెత్తనూలేం. చేయగలిగిందల్లా దాన్ని వీలైనంత ‘మంచి’ చేసుకోవడమే. అంటే దాన్ని సరిగ్గా వాడుకోవడమే. దాని వేగాన్ని తగ్గించలేక పోయినా దాని విలువను గుర్తించడం మన చేతుల్లోనే ఉందని తెలుసుకోవాలి.‘నాకు సమయం లేదు’ అనీ, ‘రోజులు గడిచిపోతున్నాయి. చాలా చెయ్యాలనుకున్నా. ఏమీ చెయ్యలేకపోయా’ అనీ, ‘ఉన్న సమయమంతా ఇంకొకళ్ల కోసమే అయిపోతోంది. ఇక నా కోసం ఏం చేసుకోడానికైనా టైం ఏదీ’ అనీ, ‘ఇల్లు, ఆఫీసు... ఈ రెండిటితోనే సరిపోతుంది. ఇంకేమీ చెయ్యలేను బాబూ’... ఇలాంటి మాటలు ఎంత తరచుగా వింటామో! ఈ మాటలు చాలా మంచి ‘సాకులు’. అవి కఠోర వాస్తవాలని మనల్ని మనం మభ్యపెట్టుకోవచ్చుగానీ నిజానికి అవి మనం ‘మనకు నచ్చిన పని చెయ్యకుండా, మనం చెయ్యాల్సిన పని చెయ్యకుండా’ తప్పించుకోడానికి కల్పించుకునే సాకులే. కాలం అందరికీ ఒకటే. ఎవరికైనా రోజులో ఉన్నవి ఇరవై నాలుగ్గంటలే. కొందరు రోజుకు పది పనులు అవలీలగా చేసేస్తారు; మరికొందరు ఒకటిన్నర పనితో సరిపెట్టుకుంటారు. ఈ తేడాకు కారణం మరొకరిపై తోసేయడం సుళువు. దానికి మనం ఎంతవరకు కారణమో ఆలోచించడం నేర్పు. ఇప్పటి ఆడవాళ్లకు అవసరమైంది ఈ నేర్పే. ‘సుళువు’లు చాలా ఏళ్లగానే వాడుకుంటున్నాం. ఇక మన నేర్పును చూపించే వేళ ఆసన్నమైంది. కొంత వెనక్కి వెళ్లి చూస్తే– మనలో మంచి చిత్రకారిణి ఉంది; పాటగత్తె ఉంది; సమాజ సేవకురాలు ఉంది; రచయిత్రి ఉంది; నృత్యకారిణి వుంది; నాయకురాలు ఉంది; వ్యాపారవేత్త ఉంది; దానికి పదును పెట్టాలన్న కోరికా ఉంది. కానీ లేనిదల్లా ఆ పదును పెట్టడానికి సమయమే. ఎందుకంటే వీటితో పాటే ‘నువ్వు ఏదైనా చెయ్యి కానీ నీ ఇంటి బాధ్యతలు పూర్తి చేశాకే’ అని తర్జని చూపించే కుటుంబమూ ఉంది. ‘ఆవిడ అంత పేరు తెచ్చుకుందంటే ఇల్లొదిలి తిరిగింది కాబట్టేగా’ అని మూతి విరిచే సమాజమూ ఉంది. ఇప్పుడు ఆ కుటుంబాన్నీ, సమాజాన్నీ నోటితో కాకపోయినా నొసలుతో వెక్కిరించే చైతన్యం ఎంతో కొంత మనకు అబ్బింది. అయినా అనుకున్నంతగా, మన సామర్థ్యానికి తగినంతగా సాధించలేకపోతున్నాం. ప్రతి పనినీ ‘వాయిదాలు’ వేస్తాం. వాయిదా వేయడానికి కనిపించినన్ని కారణాలు, ఉపయోగించేంత తెలివి తేటలు, పని చెయ్యడానికే వెచ్చిస్తే ఎంత బాగుంటుంది! అలా కూర్చునీ, కూర్చునీ ‘వయసైపోతోంది. ఏం సాధించాను ఈ జీవితంలో?’ అని నిస్పృహగా ప్రశ్నించుకుంటున్నాం. ‘నాలో ఎంతో ప్రతిభ ఉంది. ఏమీ ప్రతిభ లేని వాళ్లు ముందుకు వెళ్లిపోతున్నారు. నేనింకా వెనకబడే ఉన్నాను’ అని వాపోతున్నాం. గుర్తింపు కోసం, అవార్డుల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం, బిరుదుల కోసం తహతహలాడటం మానుకోలేకపోతున్నాం. మన మానసిక సంతృప్తి వల్ల లభించే ‘విజయం’ మరే వేదికల వల్లా రాదని గుర్తించలేక పోతున్నాం. ఆ సంతృప్తిని సాధించే సమయం కూడా మన వద్ద ఉండటం లేదు. ఎందువల్ల? కాలాన్ని వాడుకోవడం చేతకాకపోవడం వల్ల; కాలం పట్ల భయమే తప్ప గౌరవం, ఇష్టం లేకపోవడం వల్ల. ఏం జరుగుతోందో అర్థమయ్యాక దాన్ని తట్టుకునేందుకూ లేదా అధిగమించేందుకూ ఏం చెయ్యాలో కూడా ఆలోచించాలి. మనం రోజులో ఎంత సమయం ఎలా వృథా చేస్తున్నామో తెలుసుకోవాలి. వంట చెయ్యడం, ఇంటి పనులు, పిల్లల పనులు చెయ్యడం కాదు వృథా చెయ్యడమంటే. సమయం వృథా చెయ్యడమంటే కాలాన్ని అగౌరవ పరచడం. అది ఎలా చేస్తున్నాం? ఇతరుల గురించి ఆలోచించడం; ఇతరుల పట్ల ఈర‡్ష్యను పెంచి పోషించడం; ఇతరుల జీవితాల్లో ఎన్ని లొసుగులున్నాయో వాకబు చెయ్యడం; మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో సామాజిక మాధ్యమాల్లో వెతుక్కోవడం; మనల్ని ఎంతమంది మెచ్చుకుంటున్నారో తెలుసుకుని గంటల తరబడి ఆనందించడం; ఎంతమంది తిడుతున్నారో తెలుసుకుని కుంగిపోవడం; లేదా శాపనార్థాలు పెట్టుకోవడం; మనకిష్టం లేని వాళ్లను ఎలా భ్రష్టు పట్టించాలో పన్నాగాలు వేయడం; అస్మదీయులతో బృందాలను ఏర్పరచుకుని వారితో పేరంటాలు, పండగలు చేసు కోవడం; మనకు ఉత్తరోత్తరా పనికి వచ్చే వాళ్లతో స్నేహాల కోసం ప్రయత్నించడం; మనల్ని బాధపెట్టిన వాళ్ల గురించి, మనకు నచ్చని వాళ్ల గురించి గంటల తరబడి ఫోన్లలో సంభాషణలు చేయడం; మన బాధ ప్రపంచపు బాధ అనుకుని అందరికీ మన గోడు, మనకు జరిగిన అన్యాయాలనూ వినిపించుకోవడం; ఈ ప్రపంచానికి మనల్ని అవమానించడం మినహా మరో పని లేదనే భ్రమలో జీవించడం. ఇదంతా ఇప్పటి మధ్య వయస్కుల తరం కాలాన్ని గడిపే వైనం. మరి ‘కాలం’ బాధపడదూ? మనకు మేలు చెయ్యాలని ఉన్నా ఎందుకులే ఈ మొహాలకు అని మొహం చాటేయదూ? తాము పుట్టడమే ఈ లోకానికి మహోపకారమనుకునే అహంభావుల కోసం తనెందుకు ఆగాలని అనుకోదూ? కనక, మన జీవితాలను బాగుపరచుకోడానికి గొప్ప అవకాశం ఇచ్చే అనంతమైన కాలాన్ని కొత్త సంవత్సరం నుంచి అయినా ఒక్క చిటికెడు, దోసెడు గౌరవిద్దాం.డా‘‘ మృణాళిని వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి, ఆచార్యులు -
ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. డీఎస్టీ రద్దు
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసగా సంచలన ప్రకటనలు చేస్తున్నారు. అధ్యక్ష భవనంలోకి అడుగుపెట్టకముందే.. తాను ఏం చేయబోతున్నాననే విషయాలను వరుసగా ప్రకటిస్తున్నారాయన. ఈ క్రమంలో వంద ఏళ్లుగా అమెరికన్లు పాటిస్తున్న డేలైట్ సేవింగ్ టైం(DST) విధానానికి ముగింపు పలకబోతున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ పెట్టారు.‘రిపబ్లికన్ పార్టీ డే లైట్ సేవింగ్ టైమ్‌ను రద్దు చేయనుంది. ఈ పద్ధతిని అనుసరించడం ఎంతో అసౌకర్యంగా ఉంది. దీనివల్ల అమెరికన్లపై చాలా భారం పడుతుంది’ అని రాసుకొచ్చారు. డేలైట్ సేవింగ్ టైం అంటే.. వసంతకాలంలో ఒక గంట ముందుకు, శరధ్రుతువులో ఒక గంట వెనక్కి గడియారంలో సమయాలను మార్చుకోవడం. అయితే, ఈ పద్ధతికి కాలం చెల్లిందని, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదన్నది చాలామంది అభిప్రాయం.ఎనర్జీ సేవింగ్.. అంటే పగటికాంతిని సాయంత్ర వేళల్లో సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ఈ విధానం పాటిస్తున్నారు. అయితే ఈ విధానం వల్ల పనులకు అవాంతరాలు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా నిద్రపై ప్రభావం పడుతుందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.1784లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ తొలిసారిగా డేలైట్ సేవింగ్ టైం ప్రతిపాదన చేశారు. అయితే.. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో తొలిసారి ఈ డే లైట్ సేవింగ్ టైమ్‌ను అమెరికన్లు పాటించారు. యుద్ధం ముగిశాక.. ఈ విధానం పాటించడం మానేశారు. అయితే తిరిగి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ విధానం మళ్లీ అమెరికాలో ఆచరణలోకి వచ్చింది. యూనిఫామ్ టైం యాక్ట్ 1966 కింద.. ఈ విధానం శాశ్వతంగా మారిపోయింది. అయితే హవాయ్,ఆరిజోనా మాత్రం ఈ విధానం పాటించడం లేదు. అయితే ఈ విధానాన్ని మూర్ఖపు విధానంగా పేర్కొంటూ.. సెనేటర్ మార్కో రుబియో 2022లో సన్‌షైన్ ప్రొటెక్షన్ అనే బిల్లును తెచ్చారు. బిల్లు సెనేట్‌లో పాసైనప్పటికీ.. హౌజ్‌లో మాత్రం ఆమోదం దక్కించుకోలేకపోయింది. దీంతో.. బైడెన్ దాకా ఆ బిల్లు వెళ్లలేకపోయింది. ప్రస్తుతం ట్రంప్ కార్యవర్గంలో రుబియో స్టేట్ సెక్రటరీగా ఉండడం గమనార్హం.ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలాంటి ట్రంప్ అనుచరగణం కూడా ఈ విధానానికి వ్యతిరేకంగా ఉంది. మరోవైపు.. డీఎస్టీ ద్వారా ఆర్థిక భారం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.ప్రస్తుతం అమెరికన్లు ప్రతీ ఏటా మార్చి-నవంబర్ మధ్య డేలైట్ టైం ను.. నవంబర్-మార్చి మధ్య స్టాండర్డ్ టైంను ఫాలో అవుతున్నారు. ట్రంప్ నిర్ణయం అమల్లోకి వస్తే.. కాలాన్ని మార్చుకునే ఈ వందేళ్ల ఆనవాయితీకి పుల్‌స్టాప్ పడుతుంది. అమెరికా మాత్రమే కాదు.. యూరప్ సహా ప్రపంచంలోని మూడింట దేశాలు ఈ పద్ధతిని అవలంభిస్తున్నాయి. -
మలి సంధ్యా... మరో వసంతమే!
‘‘పండుటాకులము మిగిలితిమి.. ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి’’ అని భర్త పదవీ విరమణ రోజు భార్య పాడుతున్నట్లుగా ఓ సినీ గీతిక సాగుతుంది. పాటలోని భావమూ మనకు భారంగా అనిపిస్తుంది, కానీ ప్రస్తుత ప్రపంచ ధోరణికి ఆ వాక్యాలు సరిపోవని అనిపిస్తుంది. వృద్ధులు పండుటాకులు కాదు. అనుభవంతో మన ముందు నిలిచే నిండైన అమృత భాండాలు.ప్రతి మనిషి జీవిత దశని రెండు ప్రధాన అంగాలుగా విభజించుకోవచ్చు. మొదటిది ఉద్యోగబాధ్యతలు నిర్వర్తిస్తూ భార్యాబిడ్డలతో కాలాన్ని గడపడం. రెండోది.. బాధ్యతలను పూర్తిచేసి, ఉద్యోగవిరమణ తర్వాత లేదా ఆరు పదులు నిండాక గడిపే కాలం. వీటిలో మొదటి దశకే ప్రాధాన్యం ఉందని, రెండో దశ పనికిరానిదని భావించడం ఏమాత్రం సమంజసం కాదు.ప్రతి జీవన దశలోనూ మనిషికి ప్రత్యేకమైన విషయాలపై శ్రద్ధ కనబరచవలసి ఉంటుంది. అదే విధంగా వృద్ధాప్యంలోనూ కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తే, మలిసంజెలో వెల్లివిరిసే కాంతులు వారికి మనోహరంగానే అగుపిస్తాయి.యవ్వనంలో పటుత్వం, బిగువు జీవులకు సహజ గుణం. వయసు పెరుగుతున్న కొద్దీ బిగువు సడలుతూ ఉంటుంది. అది శరీరానికుండే సహజ లక్షణం. గడచిపోయిన కాలం ఒక అనుభవాల సుమహారంలా పరిమళిస్తూ ఉంటుంది. ఎంతో విలువైన అనుభవాలు, అవి నేర్పిన పాఠాలను యువతరానికి నేర్పడాన్ని మించిన ఆనందం ఏముంటుంది? ప్రతి అనుభవం ఎంతో విలువైనది. ఎన్నో కష్టాలను, దుఃఖాలను దాటుకుని తెచ్చుకున్న విజయాలను పంచుకుని భావితరాలను తీర్చిదిద్దగలిగింది విశ్రాంత జీవనం గడిపి మలి సంజలో కాలం గడిపే అనుభవ సంపన్నులే. వారి అనుభవాల చేవను ఏ వ్యక్తిత్వ వికాస గ్రంథాలూ అందించలేవు. అనుభవైక వేద్యమైన వారి జీవనగమనాన్ని కొడుకులతో, మనవళ్ళతో పంచుకుంటూ గడపడం ఆహ్లాదకరమైన విషయం.దేశంలోని, ప్రపంచంలోని రకరకాల ప్రదేశాలు చూసే అవకాశం కేవలం విశ్రాంత జీవనంలోనే ఎవరికైనా సాధ్యమవుతుంది. ఉద్యోగంలో లేదా వేరే వ్యాపకంలో ఉండే పని ఒత్తిడివల్ల కొత్త ప్రదేశాలు చూసే సౌలభ్యం తక్కువగానే ఉంటుంది. ఆ విధంగా కొత్త కొత్తవిహారాల్లో సందర్శించే ప్రదేశాలు, అక్కడి వారి ఆహారపు అలవాట్లు, ప్రత్యేకమైన అభిరుచులు తిలకించి ఆనందం పొందడం ద్వారా వృద్ధుల మనసు మరింతగా ఉత్తేజితమవుతుంది. మరింతగా వాళ్ళను చిన్నవాళ్ళను చేసి ఆనంద సంభరితుల్ని చేస్తుందనడం అతిశయోక్తి కాదు.వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమే. మదిలో మెదిలే భావాలకు అనుగుణంగా మన జీవన నావ సాగుతూ ఉంటుంది. నేను ఎన్నటికీ నవ యువకుడినే అన్న భావం మదిలో నింపుకుంటే ఆనందం సముద్ర తరంగాల్లా ఉరకలు వేస్తూనే ఉంటుంది. మనం సాధించిన విజయాలూ మన జ్ఞాపకాల పందిరిలోంచి పరిమళించే మల్లికల్లా తొంగి చూస్తూ ఉత్సాహానికి ఊపిరులూదుతూనే ఉంటాయి.వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటివృద్ధాప్యం శాపం కాదు... ఆస్వాదిస్తే అణువణువూ ఆనందమే! ప్రతి జీవీ తమ జీవితంలో వృద్ధాప్యాన్ని ఎదుర్కొనక తప్పదు. అయితే ఈ వృద్ధాప్యాన్ని శాపంగా కాకుండా వరంగా భావించి ఆస్వాదిస్తే వృద్ధాప్యంలో కూడా హాయిగా సమయాన్ని అనుభవించవచ్చు. వృద్ధాప్యాన్ని బాధామయమని భావించకుండా, మన కోసం మనం జీవించే అద్భుత అవకాశంగా భావించిన నాడు వృద్ధాప్యం ఏమాత్రం బాధించదు. పెద్దవయసులో గుర్తుపెట్టుకోవలసింది మన వయసును కాదు.. గడిపే ప్రతి క్షణం తీసుకువచ్చే ఆనందాన్ని మాత్రమే..!! యవ్వనం కొంగ్రొత్త భోగాల సారం.. వృద్ధాప్యం అనుభవాల మణిహారం..!! -
ఇంటి డెసిషన్.. ఇంత ఫాస్టా?
ఇల్లు కొనే ముందు సవాలక్ష ఎంక్వైరీలు, చర్చలు, లాభనష్టాల బేరీజులు... ఇలా చాంతాడంత లిస్టే ఉంటుంది. కానీ, నేటి యువతరం గృహ కొనుగోలు నిర్ణయాన్ని చిటికేసినంత ఈజీగా తీసేసుకుంటున్నారు. నాణ్యత, ప్రాంతం, వసతులు నచ్చితే చాలు ధర గురించి ఆలోచించకుండా ముందుకెళ్లిపోతున్నారు. మూడేళ్ల క్రితం వరకు ఇంటి కొనుగోలు నిర్ణయానికి 33 రోజుల సమయం పడితే.. ఈ ఆర్థిక సంవత్సరం అర్ధ వార్షికం(హెచ్1) నాటికి కేవలం 26 రోజుల్లోనే డెసిషన్ తీసుకుంటున్నారు. - సాక్షి, సిటీబ్యూరో మనదేశంలో అత్యంత ప్రాధాన్య పెట్టుబడి స్థిరాస్తి రంగమే. ప్రాపర్టీ అన్వేషకులు కొనుగోలుదారులుగా మారేందుకు పట్టే సమయంపై ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్ అధ్యయనం చేసి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 2019, 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ కొనుగోలు సమయం కేవలం 25 రోజులుగా ఉంది. 2021 కోవిడ్ మహమ్మారి సమయంలో గరిష్టంగా 33 రోజుల సమయం పట్టింది.వేగానికి కారణమిదే... ఆర్థికంగా సన్నద్ధమయ్యాకే ప్రాపర్టీలను కొనేందుకు ముందుకొస్తున్నారు. కొన్నేళ్లుగా మార్కెట్లో బ్రాండెడ్ డెవలపర్ల నుంచి గృహాల విక్రయాలు పెరిగాయి. నిర్మాణంలో నాణ్యత, గడువులోగా పూర్తి చేస్తారనే విశ్వాసం ఆయా సంస్థలపై ఉండటంతో కొనుగోలుదారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.రూ.3 కోట్లయినా చిటికెలో నిర్ణయం.. సాధారణంగా గృహ కొనుగోలులో ధరకే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ, యువ కస్టమర్లు ధర గురించి పట్టించుకోవట్లేదు. రూ.3 కోట్ల ధర ఉన్న అల్ట్రా లగ్జరీ గృహాల ఎంపికకు అతి తక్కువగా, కేవలం 15 రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటున్నారు. రూ.1–3 కోట్ల ధర ఉన్న ఇళ్లకు 27 రోజులు, రూ.50 లక్షల నుంచి రూ.కోటి రేటు ఉన్న యూనిట్ల కొనుగోలుకు ఏకంగా 30 రోజులు సమయం తీసుకుంటున్నారు.డిమాండ్‌తో వేగంగా నిర్ణయం కోవిడ్ తర్వాతి నుంచి విశాలైన గృహాలు, హైఎండ్ ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. ఈ విభాగంలో ఇళ్లు వేగంగా అమ్ముడవుతున్న కారణంగా కస్టమర్లు కొనుగోలు నిర్ణయాన్ని వేగంగా తీసుకుంటున్నారు. – ప్రశాంత్‌రావు, డైరెక్టర్, పౌలోమీ ఎస్టేట్స్ -
సమయం.. సుధారసమయం..
కాలం భగవత్స్వరూపం. ప్రాణుల్ని, జగత్తునూ నడిపించేదీ, హరించేదీ కాలమే. సృష్టి, స్థితి, వినాశం అనే ప్రధానమైన కార్యాలకు సాక్షీభూతంగా నిలిచేదీ కాలమే. అత్యంత బలవత్తరమైన కాలప్రభావాన్ని ఎవరూ అతిక్రమించలేరు. ఏ భౌతిక సాధనాలూ, ఆధ్యాత్మిక సాధనలూ కాలాన్ని బంధించలేవు. ‘‘పారే నదిలో ఈ క్షణం తాకిన నీటిని మరుక్షణం ఎలాగైతే తాకలేమో అలాగే గతించిన కాలాన్ని పట్టుకోలేం. అందుచేత కాలమహిమను ప్రతి ఒక్కరూ గుర్తించండి’’ అంటాడు చాణుక్యుడు. చాణుక్యుని వాక్యాలు ఎంతో అర్థవంతమైనవి.జీవితంలో ప్రతిక్షణం వెలకట్టలేనిదే. గడిచిపోయిన క్షణం మళ్ళీ తిరిగిరాదు. అందుకే, కాలాన్ని విధిగా పాటించడం, లేదా సమయపాలనకు కట్టుపడడం అనేది ప్రతివారికీ అత్యంత ముఖ్యమైన విధి. సమయపాలనకు సంబంధించి రకరకాల నిర్వచనాలు మనకు నిత్యమూ కనబడుతూ ఉంటాయి. సమయానికి మనం అనుకున్న పనిలో, విహితమైన తీరులో, ఏకాగ్ర చిత్తంతో నిమగ్నం కావడాన్నే సమయపాలన అని చెప్పుకోవచ్చు.ఏదైనా పనికోసం మనం సమయాన్ని కేటాయిస్తే, అది మనకు ఆ కార్య పరిపూర్ణతకు ఉపకరించి, సంతృప్తిని కలిగిస్తుంది. ఏదైనా ఉన్నతమైనలక్ష్యాన్ని సాధించడంకోసం సమయాన్ని కేటాయిస్తే, అది మనలో మేధాశక్తినీ పెంచడమే గాక, వ్యక్తిత్వాన్ని శిఖరాగ్రానికీ చేరుస్తుంది. అమేయమైన సారాన్ని నింపుకున్న పుస్తకాలను గానీ, గ్రంథాలను గానీ చదవడానికి సమయాన్ని కేటాయిస్తే, మనలో మనోవికాసం పెంపొందుతుంది. ఎప్పుడూ ఏదో ఒక పనిలోనే నిమగ్నం కాకుండా, ఒకింత నవ్వుకోవడానికి సమయాన్ని కేటాయిస్తే , అది మన జీవితాన్ని ఆహ్లాదమయం చేస్తుంది.కొంత సమయాన్ని పక్కవాడికి సహాయం చేయడానికి కేటాయిస్తే, అది మనకు ఆత్మానందాన్ని కలిగిస్తుంది. దైనందిన జీవితంలో వ్యాయామానికి సమయాన్ని కేటాయిస్తే, అది మనకు ఆరోగ్యప్రదాయినియై సంతసాన్ని కలిగిస్తుంది. సమయం విలువ ప్రతివారూ గుర్తెరగడం అత్యంత ముఖ్యమైన విషయం. ప్రత్యేకించి, పిల్లలకు సమయానికి తగినట్లుగా పనులు అలవాటు చేయడం తల్లితండ్రుల బాధ్యత. ముఖ్యంగా ఉదయాన నిద్రలేవడం నుంచీ, రాత్రి పడుకునే వరకు, వాళ్ళు ఏ సమయానికి ఏం చేయాలో తెలియజెప్పడం తప్పనిసరిగా చేయాలి. ముందు కొంత బద్ధకించినా, కొన్ని రోజులకు సమయం ప్రకారం పనులు చేయడం వారికి అలవాటుగా మారుతుంది. జీవితానికి ఉత్తమ బాటను పరుస్తుంది.‘‘ క్షణము గడిచిన దాని వెన్కకు మరల్పసాధ్యమే మానవున కిలాచక్రమందు‘ అంటారు శ్రీ జాషువ మహాకవి. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వవిఖ్యాతి గడించిన మహనీయులందరూ ఏరంగానికి చెందిన వారైనా కాలం విలువ బాగా తెలిసిన వారే సమయాన్ని సద్వినియోగపరచుకున్నవారే . కాలం అనేది మనం ఆపితే ఆగదు . కాబట్టి ఏ సమయంలో ఏపని చెయ్యాలో ఆ సమయం లో ఆపని చేస్తే సమయం సద్వినియోగపరిచినట్లే.ప్రపంచంలో గొప్పవాళ్ళయిన వ్యక్తులందరూ కాలం విలువ తెలిసిన వాళ్ళే. ప్రతీ క్షణాన్నీ సద్వినియోగం చేసినవాళ్ళే. స్వామి వివేకానంద యువతకు ఇచ్చిన సందేశం ఎంతో ప్రభాసమానంగా ఉంటుంది. ‘‘యువతీయువకుల్లారా.. మీరంతా మేల్కొనండి. లక్ష్య సాధనకోసం శ్రమించే క్రమంలో ప్రతి క్షణాన్నీ సద్వినియోగపరచండి. మీరు మండే నిప్పు కణికలు అని గమనించండి. మిమ్మల్ని వెనుకకు నెట్టే ఒకే ఒక్క గుణం సోమరితనం. కాబట్టి కాలం విలువ ఎరిగినవారై, బద్దకాన్ని వదలండి.’’ అంటూ పలికిన సందేశం అత్యంత విలువైనది. సమయం విలువను కాల రాచే మహమ్మారి లాంటి జాడ్యం సోమరితనం. సాధారణంగా మనసు సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటాయి . పరీక్షలొస్తున్నాయి చదవడం వెంటనే ఆరంభించమని బుద్ధి చెబుతుంది . ఏమీ ఫరవాలేదు, పరీక్షలు బాగా దగ్గరకొచ్చాక చదవొచ్చని మనస్సు చెబుతుంది. మనం మనస్సు పలికిన మాటే వింటాం. బుద్ధి చెప్పింది ఏమాత్రం వినం. అందుకే ఎంతో అనర్థం జరుగుతోంది. కాలాన్ని ఉపయోగించుకుని తగిన రీతిలోసార్థకత్వాన్ని సాధించడం కష్టమైన పని ఏమాత్రం కాదు.జగత్ప్రసిద్ధమైన ఆపిల్ కంపెనీ సహవ్యవస్థాపకుడైన స్టీవ్ జాబ్స్ మాట్లాడుతూ, ‘‘నీ సమయం ఎంతో విలువైనది. ఆ సమయాన్ని వినియోగించి నీ జీవితాన్ని స్వర్గమయం చేసుకో. కాలాన్ని వ్యర్థం చేసుకుని, ఇంకొకరి జీవితంలో నీవు బతకకు’’ అంటారు. ఇందులో ఎంతో సందేశం ఉంది. కాలం విలువ తెలుసుకుని, ప్రగతినిసాధిస్తూ, ముందుకు సాగమని, ఇంకొకరితో తనను పోల్చుకోకుండా ధరిత్రిలో మరొక కొత్త చరిత్రను లిఖించమనే ప్రబోధమూ ఈ మాటల్లో దాగి ఉంది. – వెంకట్ గరికపాటి వ్యాఖ్యాన విశారద‘‘ప్రపంచంలో అతి విలువైన వస్తువులు రెండు.. మొదటిది సహనం, రెండోది కాలం.’’ అంటారు లియో టాల్స్టాయా. సృష్టిలో మనకు లభించే అత్యంత విలువైన సంపద కాలమే. కానీ అత్యంత దయనీయంగా నిత్యమూ మనం వృథా చేసేదీ కాలాన్నే..!!‘‘సమయం ప్రధానమైన విషయాల్లో ఒకటి కాదు. సమయమే అత్యంత ప్రశస్తమైన సంపద’’ అని యువత గ్రహిస్తే, వారి భవిత బంగరుబాట కావడం కష్టమైన విషయమేమీ కాదు. కాలానికి గాలం వేయడం కష్టమే. కానీ, దాని విలువను తెలుసుకుని, విహితమైన ఆలోచనకు ఆలవాలం చేసి, సద్వినియోగపరచిన ప్రతివ్యక్తీ చేయగలిగేది సుగతితో, ప్రగతితో కూడిన మహేంద్రజాలమే. -
మన దేశంలోనూ టైమ్ బ్యాంక్
విశాఖపట్నానికి చెందిన సత్యమూర్తి విద్యాశాఖలో ఉన్నతాధికారిగా పనిచేశారు. తన ఇద్దరు పిల్లలను అమెరికా పంపించి బాగా చదివించారు. ఉన్నతోద్యోగాల్లో వారు అక్కడే సెటిల్ అయ్యారు. ఏడాదికి ఓసారి భార్యతో కలిసి అమెరికాలోని కొడుకుల వద్దకు వెళ్లి కొద్దిరోజులుండి రావడం ఆయనకు అలవాటు. అయితే, ఏడాది క్రితం భార్య చనిపోవడంతో ఇక్కడ ఒంటరైపోయారు. తమ వద్దకు వచ్చేయమని కొడుకులు కోరుతున్నా ఆయన ఒప్పుకోవడం లేదు. తాను టైమ్ బ్యాంక్‌లో కొంత సమయం దాచుకున్నానని, తనకు అవసరం వచ్చినప్పుడు తనను చూసుకునేందుకు మనుషులు వస్తారని చెప్పడంతో కొడుకులు ఆశ్చర్యపోయారు. విలువైన నగలు, డాక్యుమెంట్లను లాకర్లో దాచుకున్నట్టు బ్యాంకులో టైమును కూడా దాచుకోవచ్చా..అలాంటి అవకాశం కూడా ఉందా!! సాక్షి, అమరావతి: ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. జీవితాలు అపార్ట్మెంట్లలో బందీ అయ్యాయి. ఇది ఒంటరిగా ఉన్న వృద్ధులకు పెద్ద సవాలుగా మారింది. విదేశాల్లోనో లేక మరో దూర ప్రాంతంలోనో ఉండటంతో తల్లిదండ్రులను చూసుకోలేని నిస్సహాయ స్థితిలో పిల్లలు ఉన్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకో లేక ఇంటి వద్దే కొన్ని పనులు చేసిపెట్టేందుకో ఓ వయసు దాటాక ప్రతి ఒక్కరికీ మరొకరి సాయం తప్పనిసరైంది. ఇలాంటి అవసరాలు ఉన్న వారిని చూసుకునేందుకు రోటరీ సంస్థ ‘టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ పేరుతో సామాజిక కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ని అందుబాటులోకి తెచ్చి కుటుంబ అవసరాల అంతరాన్ని తగ్గించడానికి కృషి చేస్తోంది.ఏమిటీ టైమ్ బ్యాంక్.. అరవై ఏళ్లు దాటి ఆరోగ్యవంతమైన వ్యక్తి టైమ్ బ్యాంక్ సభ్యుడిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన సమయంలో సహాయం చేయడం ద్వారా వారి సమయాన్ని కొంత ఇతరులకు వెచ్చించవచ్చు. ఇలా ఎన్ని గంటలు వెచి్చస్తే అన్ని గంటలు సదరు సమయం కేటాయించిన వ్యక్తి పేరుపై అతని ఖాతాలో ఆ సమయం జమ అవుతుంది. దానిని వారు అవసరమైన సమయంలో ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ సభ్యులకు ఆరోగ్యం బాగాలేనప్పుడు లేదా ఇతర అవసరాలు ఉన్నపుడు ఇంకో సభ్యుడు వీరికి సాయం చేస్తారు. ఇందులో సభ్యులు.. సేవ కోరేవారి మధ్య డబ్బు లావాదేవీ ఉండదు. ఉదాహరణకు, ఒక సభ్యుడు వారానికి నాలుగు గంటలు మరొకరికి సేవ చేస్తున్నట్టయితే, అతను నెలకు 16 గంటలు సంపాదిస్తాడు లేదా ఆదా చేస్తాడు. ఇలా సంవత్సరానికి 192 గంటలు లేదా 8 రోజులు అతని/ఆమె ఖాతాలో జమ అవుతాయి. ఈ సమయాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత విడతల వారీగా లేదా ఒకేసారి తన అవసరాల కోసం ఖర్చు చేసుకోవచ్చు. దీనికోసం సదరు బ్యాంకులో నమోదు చేసుకుంటే మరో సభ్యుడు లేదా సభ్యురాలు వచ్చి సేవలందిస్తారు. సరళంగా చెప్పాలంటే టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజి్రస్టేషన్ అనేది జీరో బ్యాలెన్స్‌తో బ్యాంక్ ఖాతాను తెరవడం లాంటిది. పెద్దలకు సేవ చేయడం ద్వారా డబ్బుకు బదులు సమయాన్ని జమ చేసుకుంటారు. వారి అవసరాల సమయంలో వారి డిపాజిట్ సమయానికి సమానమైన సమయాన్ని విత్‌డ్రా చేసుకుంటారు. ప్రపంచంలో 34 దేశాల్లో అమలు స్విట్జర్లాండ్‌లో మొదలైన టైమ్ బ్యాంక్ కాన్సెప్‌్టను ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 34 దేశాలు అమలు చేస్తున్నాయి. ఇందులో యూకే, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, స్పెయిన్, గ్రీస్, సింగపూర్, తైవాన్, సెనెగల్, అర్జెంటీనా, ఇజ్రాయెల్ తదితర దేశాల్లో 300కు పైగా ఈ తరహా బ్యాంకులు ఉన్నాయి. ఒక్క అమెరికాలోనే 40 రాష్ట్రాల ప్రభుత్వాలు టైమ్ బ్యాంక్‌ను అమలు చేస్తున్నాయంటే వీటి ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలోనూ ఈ తరహా కాన్సెప్ట్ అవసరమని 2018లో జాతీయ మానవ హక్కుల సంఘం కేంద్రానికి సూచించింది. అయితే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటే 2019లో టైమ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రస్తుతం 50 వేల మంది వలంటీర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతోపాటు సామాజిక సేవల్లో ముందుండే రోటరీ క్లబ్ కూడా టైమ్ బ్యాంక్‌ను ప్రారంభించగా, ఇందులో 5 వేల మంది వరకు సభ్యులుగా చేరారు. 2012లో స్విట్జర్లాండ్‌లో ప్రారంభండబ్బుతో అవసరం లేకుండా ‘మనిíÙకి మనిషి సాయం’ అందించే వినూత్న విధానానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం నాంది పలికింది. స్విస్ ప్రభుత్వం వృద్ధులకు ప్రత్యేకంగా పెన్షన్ అందిస్తోంది. అయితే, తమకు డబ్బు కంటే సాయం చేసేవారు అవసరమని, చాలా సందర్భాల్లో ఏ పనీ చేసుకోలేకపోతున్నామని అక్కడి వృద్ధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న తమతో మాట్లాడేందుకు మనిíÙని తోడు ఇవ్వాల్సిందిగా కోరారు. దీనిపై స్పందించిన అక్కడి ఫెడరల్ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసి అధ్యయనం చేసింది. దేశంలో వృద్ధుల్లో అత్యధికులు ఒంటరి జీవితాలు గడుపుతున్నారని, వారు డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, మనిషి సాయం కోరుతున్నట్టు గుర్తించారు. దాంతో ఇంట్లో ఉండే ఒంటరి వృద్ధులకు సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2012లో ‘టైమ్ బ్యాంక్’ను అక్కడి ప్రభుత్వం ప్రారంభించి ‘టైమ్ ఈజ్ మనీ’ కాన్సెప్‌్టను వర్తింపజేస్తోంది. ఈ కాన్సెప్ట్‌ని కచ్చితంగా ఆచరించడంలో స్విట్జర్లాండ్ ముందడుగు వేసింది. ఆ దేశంలో పౌరులు తమ సమయాన్ని బ్యాంకుల్లో ‘పొదుపు’ చేసేలా ప్రోత్సహించింది. ఆరోగ్యంగా ఉన్నవారు ఎవరైనా సరే అక్కడి ప్రభుత్వ వెబ్సైట్లో వలంటీర్‌గా రిజిస్టర్ చేసుకుంటే వారిని అవసరం ఉన్నవారికి అలాట్ చేస్తారు. అలా వారు తోటపని, ఇంటి పని, బయటకి తీసుకెళ్లడం, కబుర్లు చెప్పడం, వృద్ధులు చెప్పే మాటలు వినడం, ఆస్పత్రికి తీసుకెళ్లడం వంటి పనుల్లో సాయంగా ఉంటారు. వీరు ఎన్ని గంటలు కేటాయించారో అంత సమయం సాయం చేసిన వ్యక్తి అకౌంట్లో జమ చేయడం ప్రారంభించారు. -
వయనాడ్ విలయం: మేజర్ సీతాషెల్కేకు హ్యాట్సాఫ్! (ఫొటోలు)
-
కాలానికి కళ్లెం!
‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి చేరేందుకు ఎవరైనా, ఎంతటివారైనా సమయాన్ని నమ్ముకోవాల్సిందే. అందుకే దేనికోసం దేనిని విడిచి పెట్టాలో, ఏ కాలంలో ఏ పని చేయాలో తెలిసి మెలగడం ఉత్తమం’ అంటారు పెద్దలు. మరి ఉరుకుల పరుగుల జీవితంలో సమయాన్ని ఎలా ఒడిసిపట్టుకోవాలి? ఎలా సద్వినియోగం చేసుకోవాలి?‘గడచిపోయినట్టి క్షణము తిరిగిరాదు, కాలమూరకెపుడు గడపబోకు, దీపమున్నయపుడే దిద్దుకోవలెనిల్లు’ అన్నారు ప్రముఖ రచయిత నార్ల చిరంజీవి. ‘కాలః పచతి భూతాని, కాలం సంహరతే ప్రజాః , కాలః సుప్తేషు జాగర్తి, కాలోహి దురతిక్రమః’ అన్నాడు చాణక్యుడు. ‘కాలం అనేది భగవత్స్వరూపం. ప్రాణుల్ని, జగత్తునూ నడిపించేది, హరించేది కూడా కాలమే! సృష్టి, స్థితి, వినాశాలు చేయగలిగేది కాలం. బలవత్తరమైన కాల ప్రభావాన్ని ఎవరూ అతిక్రమించలేరు. ఏ భౌతిక సాధనాలూ, ఏ ఆధ్యాత్మిక శక్తియుక్తులూ కాలాన్ని బంధించలేవు. పారే నదిలో ఈ క్షణం తాకిన నీటిని మరుక్షణం ఎలాగైతే తాకలేమో.. అదే విధంగా గడిచిపోయిన సమయాన్ని ఆపలేం. పట్టుకోలేం. అందుకే కాలమహిమను గ్రహించి నడుచుకోవాలి’ అనేదే చాణక్యుడి మాటల్లోని పరమార్థం.ఈ భూమి మీద ప్రతి జీవికి రోజులో 24 గంటలే ఉంటాయి. దానిలో ఏ మార్పు లేదు. అయితే వాటిని వాడుకోవడంలోనే విజయం, అపజయం దాగి ఉంటుంది. అందుకే మనం సమయాన్ని ఎప్పుడు? దేనికి? కేటాయిస్తున్నాం అనేది ముఖ్యం. నిద్రపోవాల్సిన సమయంలో సెల్‌ఫోన్ వాడితే.. ఆరోగ్యం పాడవుతుంది. చదువుకోవాల్సిన సమయాన్ని జల్సాలకు వాడితే జీవితమే నాశనమవుతుంది. ఇలా అవసరాన్ని, అనవసరాన్ని గుర్తించకపోతే.. కోల్పోయిన వాటిని కొలమానాలతో కొలవడానికి తప్ప మరో సమయం మిగలదు.కాలచక్రంలో పరుగులు తీసే మనిషికి.. కాలాన్ని అంచనా వెయ్యడం.. కాలానికి తగ్గట్టుగా నడుచుకోవడం తెలిసుండాలి. మనం ప్రతిదానికి ‘సమయం రావాలి’ అంటుంటాం. వాదనకో, మాటవరసకో ‘నాకూ టైమ్ వస్తుంది’ అని కూడా ఇతరులతో చెబుతుంటాం. ప్రతి కార్యానికి సమయంతో ప్రణాళిక వేస్తూ శుభకార్యాలను నిర్వహిస్తుంటాం. అంతటి ముఖ్యమైన సమయాన్ని.. ముందుగానే కేటాయించుకుని.. పనులు పూర్తిచేసుకోవడం మరింత ముఖ్యం. చేసే ఏ పని అయినా విజయం సాధించాలంటే తప్పనిసరిగా సమయపాలన, క్రమశిక్షణ అవసరం. సమయం వృథా కాకూడదంటే.. ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలి? అనేది ముందే ఆలోచించుకోవాలి. చేసే పని పాజిటివ్ కోణంలో చేస్తే తిరిగి ఆ పని చేయాల్సిన అవసరం రాదు. అప్పుడే ఆ పనికి.. ఆ సమయానికి సరైన ఫలితం దక్కుతుంది.అనుకున్న పని ఎంత టైమ్‌లో పూర్తి అవుతుందో ముందే ఓ అంచనా ఉండాలి. ఆ టైమ్ అనుకున్న పనికి అనుకూలంగా ఉంటుందో లేదో కూడా గమనించుకోవాలి. ఆ తరువాతే మొదలుపెట్టిన పనిని పూర్తి చేయాలి. ఇలాంటి ప్రణాళికతో కూడిన ఆలోచన వల్ల సమయం వృథా కాకుండా ఉంటుంది. రోజువారీ పనుల్లో కూడా సమయ నిర్వహణ అవసరం. అలాగే ముందు వెనుక అనే ప్రాధాన్యం కూడా ముఖ్యమే. అలా సమయాన్ని పనులవారీగా.. రోజుల వారీగా లెక్కేసుకుని చేసుకుంటే.. ప్రాధాన్యాన్ని బట్టి.. అనుకున్న సమయం కంటే తక్కువ సమయంలోనే ఆ పనులు పూర్తి అవుతాయి. ముందుగా ముఖ్యమైన పనులను గడువులోగా పూర్తి చేసుకునేలా ప్రణాళిక రచించుకోవాలి. ఇలా చేయడంతో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతంగా మిగిలిన పనులనూ అనుకున్న సమయంలో పూర్తి చేయగలుగుతాం.సమయపాలనకై గురుబోధన..ఒక రోజు ఒక గురువు తన శిష్యులకు సమయాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పాలనుకుంటాడు. అందుకే శిష్యులకు ఓ పరీక్ష పెడతాడు. ‘శిష్యులారా! నేను మీకో పరీక్ష పెట్టబోతున్నాను.. నా దగ్గర ఒక ప్రత్యేకమైన బొక్కెన (బకెట్ లాంటిది) ఉంది. అందులో నీళ్లు పోస్తే అది దానికదే ఓ చిన్న రంధ్రాన్ని సృష్టించుకుంటుంది. దానివల్ల కొంత నీరు అందులోంచి బయటికి వెళ్లిపోతుంది. మీరు ఒకవేళ ఆ రంధ్రాన్ని మూయాలని ప్రయత్నిస్తే.. అది మరిన్ని రంధ్రాలను దానికదే సృష్టించుకుంటుంది. అప్పుడు నీళ్లన్నీ వృథాగా పోతాయి. కాబట్టి దాన్ని అలాగే ఉపయోగించుకోవడం మంచిది. ఈ బొక్కెన సామర్థ్యం 10 సేర్లు. నాకు ఏడు సేర్ల నీళ్లు కావాలి. అక్కడో బావి ఉంది. ఈ ప్రత్యేకమైన బొక్కెన తీసుకుని వెళ్లి.. మూడు నిమిషాల్లో.. ఏడు సేర్ల నీళ్లు తీసుకురండి.మూడు నిమిషాల్లోపు ఎవరైతే తెస్తారో.. వాళ్లకు నేను మంచి బహుమతి ఇస్తాను’ అంటాడు గురువు. వెంటనే మొదటి శిష్యుడు బొక్కెన తీసుకుని బావి దగ్గరకు వేగంగా వెళ్తాడు. తొందర తొందరగా ఆ బావిలోంచి నీళ్లు తోడి.. ఆ బొక్కెనలో పోస్తాడు. సుమారు ఎనిమిది సేర్లు నిండగానే ఆ బొక్కెనతో పరుగెత్తుకుని వస్తాడు. కాకపోతే పరుగుపెట్టడంతో అందులో మూడు సేర్లు మాత్రమే మిగులుతాయి. మిగిలిన నాలుగు సేర్ల కోసం మళ్లీ వెళ్తాడు. చివరిగా ఏడు సేర్ల నీళ్లు తీసుకుని రావడానికి అతడికి ఆరు నిమిషాల సమయం పడుతుంది. రెండో శిష్యుడు.. గురువు చెప్పిన మాటలు లెక్క చేయకుండా.. ఆ బొక్కెనకి ఉన్న చిన్న రంధ్రాన్ని మట్టితో మూస్తాడు. అప్పుడు గురువు చెప్పినట్లుగానే ఆ బొక్కెనకి మరిన్ని రంధ్రాలు ఏర్పడి.. ఎక్కువ నీరు వృథా అయిపోతుంది. దాంతో అతడు ఏడు సేర్ల నీళ్లు తీసుకుని రావడానికి పది నిమిషాల సమయం పడుతుంది.అనంతరం మూడో శిష్యుడు బొక్కెన పట్టుకుని బావి దగ్గరకు వెళ్లి.. నీళ్లు నింపి.. బయలుదేరతాడు. అయితే మార్గం మధ్యలో సమయం ఉందిలే అని అలసత్వం వహించి.. ఓ చెట్టు దగ్గర కూర్చుంటాడు. కాసేపు విశ్రాంతి తీసుకుని.. నిదానంగా బయలుదేరతాడు. దాంతో ఇతడికి ఏడు సేర్ల నీళ్లు తీసుకుని రావడానికి తొమ్మిది నిమిషాలు పడుతుంది. చివరిగా నాలుగో శిష్యుడు.. పరుగెత్తకుండా చాలా మామూలుగా ఆ బావి దగ్గరకు వెళ్లి.. బొక్కెన నిండా నీళ్లు నింపుతాడు. ఆ రంధ్రాన్ని మూసే ప్రయత్నం చెయ్యకుండా.. మధ్యలో ఎక్కడా ఆగకుండా.. ఏడు సేర్ల నీళ్లు.. కేవలం రెండు నిమిషాల ఏడు సెకన్లలో తెచ్చేస్తాడు. దాంతో అంతా ఆశ్చర్యపోతారు.మాటిచ్చినట్లుగానే గురువు అతడికి బహుమతిచ్చి మెచ్చుకుంటాడు. గెలిచిన వ్యక్తిని ఉదహరిస్తూ.. మిగిలిన శిష్యులతో గురువు ఇలా అంటాడు. ‘మొదటి వాడు.. తొందరపాటుకు ప్రతీక. నీళ్లు తేవడానికి తొందరగా పరుగుతీశాడు. నిండా నింపకుండా తప్పుగా అంచనా వేశాడు. ఆ తొందరపాటు వల్ల నీళ్లన్నీ బయటపడి.. అతడి పని రెండింతలు పెరిగింది. అందుకే విఫలమయ్యాడు. రెండవ వాడు తెలివి తక్కువ తనానికి ప్రతిరూపం. అనుభవంతో నేను ముందే హెచ్చరించినా పట్టనట్లుగా.. ఆ చిన్న రంధ్రాన్ని మూసేశాడు. సొంత ప్రయత్నాలు చేసి చివరికి విఫలమయ్యాడు. ఇక మూడవ వాడు సోమరితనానికి ప్రతిబింబం.సమయం ఉందనే అలసత్వాన్ని ప్రదర్శించి.. బద్ధకంతో మధ్యలో కాసేపు ఆగిపోయాడు. దాంతో రంధ్రంలోంచి నీళ్లు మరింత ఎక్కువగా కారిపోయాయి. అతడి సోమరితనమే అతడి పనిని రెట్టింపు చేసింది. చివరిగా నాలుగవ శిష్యుడు.. సమయపాలనకు సరైన ఉదాహరణ. సమాయాన్ని ఎలా కాపాడుకోవాలో తెలిసిన వ్యక్తి. ముందుచూపుతో పాటు నిదానం, తెలుసుకున్న దాన్ని గుర్తుంచుకుని పాటించడం లాంటివన్నీ తెలిసిన మనిషి. అందుకే ఈ పరీక్షలో నెగ్గాడు’ అంటూ వివరించాడు.సోమరితనం, తొందరపాటుతనం, అనుభవజ్ఞుల మాటను పెడచెవిన పెట్టడం మంచివి కాదని చెప్పడంతో పాటు సమయపాలనపై సరైన అవగాహన కలిగుండాలనేది ఈ కథ నీతి!బ్రేక్స్ పడాల్సిందే..‘నిజానికి గత కొన్నేళ్లుగా ఫోన్ వాడకం పెరిగాకే సమయం విలువ తెలియకుండా పోతోంది’ అనేది కాదనలేని నిజం. నెట్టింట సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్, మీమ్స్, ట్రోల్స్ అంటూ.. నిత్యం ఫోన్ లోనే ఉండిపోవడంతో బయటి ప్రపంచంలోని సమయం తెలియకుండానే గడచిపోతోంది. అందుకే సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించుకోవాలి. అలాగే అçనవసరమైన బాతాఖానీలకు కాస్త దూరంగా ఉండాలి. ఏ విషయంలో ఏ కారణంగా సమయం వృథా అవుతుంది? అనేది ఎప్పటికప్పుడు గుర్తించుకోవాలి. ఆ విషయం మీద కూడా దృష్టి పెట్టాలి.అలవాటు చేసుకుందాం..సమయ నిర్వహణ అనేది మరింత ఉత్సాహంగా పని చెయ్యడానికి, ఒత్తిడి తగ్గించుకోవడానికి, లక్ష్యాలను సమర్థవంతంగా చేరుకోవడానికి సహాయపడే కీలక నైపుణ్యం. అందుకే రోజూ లేవగానే 10 లేదా 15 నిమిషాలు.. ఆ రోజు చేయాల్సిన పనులకు సంబంధించి ప్రణాళిక వేసుకోవాలి. రోజులో పూర్తి చేయాల్సిన పనులు.. తిరగాల్సిన ప్రాంతాలు ఇలా అన్నింటినీ ఒక జాబితాగా చేసుకోవడంతో పాటు.. ఏ పనికి ఎంత సమయం కేటాయించొచ్చో.. కేటాయించాలో రాసుకోవాలి. దాంతో చేయాల్సిన వాటిపై ఓ క్లారిటీ వస్తుంది. అయితే రాసుకునే పాయింట్స్‌లో కేవలం వృత్తిపరమైన పనుల గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత పనుల గురించి కూడా నోట్ చేసుకోవాలి.వాటికీ వీటికీ తేడా తెలియడం కోసం రంగు స్కెచ్‌లు లేదా పెన్నులు వాడుతుండాలి. లేదంటే అండర్ లైన్ చేసి.. హైలైట్ చేసుకోవాలి. దాంతో మనం వేసుకున్న ప్రణాళికలో ముఖ్యమైన పనులను గుర్తించడం ఈజీ అవుతుంది. ఇప్పుడు నోట్స్‌లో రాసుకోవడం కంటే.. స్మార్ట్‌ఫోన్ యాప్స్‌లో నోట్ చేసుకునే పద్ధతి పెరిగింది కాబట్టి.. అలా నోట్ చేసుకున్న యాప్‌ని ఫోన్ ఓపెన్ చెయ్యగానే కనిపించేలా పెట్టుకోవాలి. ఒకవేళ పుస్తకంలో పెన్ తో రాసుకుంటే.. దాన్ని వీలైనంత అందుబాటులోనే ఉంచుకోవాలి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం.. మనం ప్రణాళికలో రాసుకున్న అంశం పూర్తిచేసిన తర్వాత.. పూర్తి అయినట్లుగా టిక్ చేసుకోవాలి.అలా చేయడం వల్ల మనసులో ‘సాధించాం’ అన్న ఆనందం కలుగుతుంది. ఇక మిగిలిన వాటిని పూర్తి చేయాలన్న ఉత్సాహమూ పెరుగుతుంది. అందుకే ప్రణాళికను సిద్ధం చేసుకోవడమే కాక ఆ ప్రణాళికల్లో రాసుకున్న పాయింట్స్ పూర్తికాగానే.. అయిపోయింది అన్నట్లుగా టిక్ చేయడమూ అలవాటు చేసుకోవాలి. దానివల్ల బాధ్యత కూడా పెరుగుతుంది. ఇదే మనకు క్రమశిక్షణ నేర్పిస్తుంది.నో చెప్పు లేదా తప్పించుకో..నిజానికి మనకు ఇష్టంలేని కూరో, చారో తినాల్సి వచ్చినప్పుడు వెంటనే నో అంటాం.. ఏ మాత్రం మొహమాటపడకుండా! అదే సమయం వృథా అయ్యే పని విషయంలో మాత్రం మొహమాటంతో నో అనలేం. కానీ నో చెప్పడం నేర్చుకోవాలి. అనవసరమైన పార్టీలకు.. అనవసరమైన సమావేశాలకు ఆహ్వానించినప్పుడు నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. అది రాకుంటే.. ఏదొక కారణం చెప్పి.. తప్పించుకునేందుకు ట్రై చెయ్యాలి. ఆ సమయం మిగిలితే రిలాక్స్డ్గా ఉండటానికి ప్రయత్నించాలి. దాంతో మానసిక ఒత్తిడి, అలజడి తగ్గుతాయి.స్విస్ టైమ్ బ్యాంక్ – కాలానికి తూకంస్విస్ బ్యాంక్‌లో ప్రపంచ కుబేరులంతా డబ్బు దాచుకుంటారని తెలుసు. కానీ స్విస్ టైమ్ బ్యాంక్ గురించి తెలుసా? ‘టైమ్ దాచుకోవడం ఏంటీ కొత్తగా? సమయాన్ని కూడా డబ్బు దాచుకున్నట్లుగా దాచుకోవచ్చా?’అనే సందేహాలు వచ్చేశాయి కదా! అవును.. డబ్బును డిపాజిట్ చేసుకున్నట్టే స్విస్ టైమ్ బ్యాంక్‌లో టైమ్‌నీ డిపాజిట్ చేసుకోవచ్చు. అంటే యవ్వనంలోని మన శక్తిని, ఓపికను వృద్ధాప్యం నాటికి దాచుకోవడం అన్నమాట. స్విట్జర్లండ్లో ఈ టైమ్ బ్యాంక్ ఓ ప్రభుత్వ స్కీమ్. ప్రపంచం మొత్తం తలతిప్పి చూసే ఆలోచన ఇది. ఈ స్కీమ్ అక్కడి వృద్ధాప్యానికి.. నిస్సహాయతకు చేయూత. అక్కడ ప్రజలు ఈ స్కీమ్‌లో స్వచ్ఛందంగా చేరొచ్చు. ఓపిక, సహనం, స్నేహభావం ఉంటే చాలు ఎవరైనా ఈ స్కీమ్‌కి అర్హులే.ఒంటరిగా ఉండే వృద్ధులకు.. ప్రమాదాలకు గురైన వ్యక్తులకు సేవ చేసి.. ఆ సేవ చేసిన సమయాన్ని బ్యాంక్‌లో నమోదు చేసుకుంటే.. వారికి అలాంటి సేవలు అవసరమైనప్పుడు.. మరొకరితో ఆ సేవలను అందిస్తూ ఆసరాగా నిలుస్తుంది ప్రభుత్వం. అక్కడివారు చాలా మంది ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూనే.. ఈ స్కీమ్‌లో చేరి.. తమ వృద్ధాప్యానికి పెన్షన్ మాదిరి.. సమయాన్ని సేవ్ చేసుంటున్నారు. సెలవు దినాల్లో, ఖాళీ సమయాల్లో టైమ్ వేస్ట్ చేసుకోకుండా.. ఈ స్కీమ్ మెంబర్‌గా.. అవసరం ఉన్న వారి ఇంటికి వెళ్లి వారికి సేవ చేస్తున్నారు.దాంతో వృద్ధులు, ఒంటిరి జీవితంతో బాధపడేవారు.. కాస్త ఊరట పొందుతున్నారు. అలాగే సేవ చేసేవారికి కూడా రేపటి రోజు మీద ఓ భరోసా ఏర్పడుతోంది. అనుకోకుండా ఏ ప్రమాదానికి గురైనా, అనారోగ్యం బారిన పడినా.. ఈ స్కీమ్‌లో భాగంగా.. ముందే ఇందులో సమయాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటే.. మరొక స్కీమ్ మెంబర్ సాయం పొందొచ్చు. ఈ స్కీమ్‌లో చేరినవారి అకౌంట్, కార్డ్ వివరాలన్నీ లెక్కపత్రాలతో స్పష్టంగా ఉంటాయి. ఎంత సమయం సేవ చేశారు? తిరిగి ఎంత సమయం వాడుకున్నారు? లాంటి అన్ని వివరాలు నమోదై ఉంటాయి. మనం ఎంత ఎక్కువ సమయం ఇతరులకు సేవ చేస్తామో.. తిరిగి మనం అంత సేవను పొందొచ్చన్నమాట. భలే ఉంది కదా..! దీని వల్ల సేవాభావం పెరుగుతుంది.రేపటి రోజు పై ధీమా ఏర్పాడుతుంది. వృద్ధాప్యంలో ఎవరి మీదా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. నిర్లక్ష్యానికి గురయ్యే ప్రమాదమూ ఉండదు. ఇలాంటి స్కీమ్స్ మన భారత్ లాంటి దేశాలకు చాలా అవసరం. ఇది భవిష్యత్ మీద ఓ భద్రతనిస్తుంది. టైమ్ వేస్ట్ చేయడం తగ్గుతుంది. ఎవరికి వారు తమ వృద్ధాప్యానికి సరిపడా సమయాన్ని దాచుకునే పనిలోపడతారు. పనికిమాలిన వాదనలు, వాగ్వాదాలు.. అహంభావాలు.. అన్నీ తగ్గుతాయి. ప్రేమగుణం అలవడుతుంది. సమయం అనేది తిరిగి రాకపోయినా.. సమయాన్ని దాచుకునే అవకాశం దొరికినట్లు అవుతుంది. మానవసంబంధాలు మరింత బలపడతాయి. దీనిపై మన ప్రభుత్వాలూ శ్రద్ధ పెడతాయని ఆశిద్దాం! -
రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎన్నికలు జరుగు తున్న 17 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పెంచింది. ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయాన్ని పెంచాలంటూ పలు రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బుధవారం జారీ చేసిన ఆదేశాల్లో వెల్లడించింది. ఒక గంట పాటు అదనపు సమయం ఇస్తున్నట్టు తెలిపింది. సవరించిన సమయం ప్రకారం.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వివరించింది. రాష్ట్రంలోని 12 లోక్‌సభ స్థానాల పరిధిలో పూర్తిగా.. మిగతా 5 లోక్‌సభ సీట్ల పరిధిలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే ఈ సమయం పెంపు ఉంటుందని ప్రకటించింది.పోలింగ్ సమయం పెరిగే ఎంపీ స్థానాలివీకరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ (ఎస్సీ), నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాలుకొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో సమయం పెంచిన స్థానాలివే.. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలోని ఖానాపూర్ (ఎ స్టీ), ఆదిలాబాద్, బోథ్(ఎస్టీ), నిర్మల్, ముథోల్. పెద్దపల్లి లోక్‌సభ స్థానంలోని ధర్మపురి (ఎస్సీ), రామగుండం, పెద్దపల్లి. వరంగల్ లోక్‌సభ స్థానంలోని స్టేషన్ ఘన్పూర్ (ఎస్సీ), పాలకుర్తి, పరకాల, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, వర్థన్నపేట్. మహబూబాబాద్ లోక్‌సభ స్థానంలోని డోర్నకల్ (ఎస్టీ), మహబూబాబాద్ (ఎస్టీ), నర్సంపేట్. ఖమ్మం లోక్‌సభ స్థానంలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా (ఎస్టీ), సత్తుపల్లి (ఎస్సీ). -
తెలంగాణలో పోలింగ్ సమయం పెంచిన ఈసీ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పెంచింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం ఉంటుందని బుధవారం ప్రకటించింది. ఎండలు దంచికొడుతున్న కారణంగా పోలింగ్ సమయాన్ని పెంచాలని ఆయా రాజకీయ పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. రాజకీయ పార్టీల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం..కు పోలింగ్ సమయాన్ని సాయంత్రం ఆరు గంటల వరకు ఏడు గంటలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.కాగా, తెలంగాణకు నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే 13న రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు ఒకే దఫా ఎన్నికలు జరుగుతాయి. ఎంపీ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. తెలంగాణతో పాటు ఏపీలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఈ ఫేజ్‌లోనే ఎన్నికలు జరుగుతాయి.తెలంగాణలో లోక్‌సభ బరిలో మొత్తం 525 మంది ఉన్నారు. ై సికింద్రాబాద్‌లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది పోటీ చేస్తున్నారు. 285 మంది స్వతంత్రుల అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
SRH Vs MI: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్: మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ మ్యాచ్ దృష్ట్యా నగరంలో మెట్రో రైళ్ల సమయం పొడిగించారు. ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు ముంబై ఇండియన్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. బుధవారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ మార్గంలో మెట్రో రైలు సమయం పొడిగించారు. ఇవాళ మెట్రో రైళ్లు నిర్ణీత సమయానికి మించి నడుస్తాయన్నారు. నాగోల్, ఉప్పల్ స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేషన్లలో చివరి రైళ్లు రాత్రి 12:15 గంటలకు బయల్దేరి 1:10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటుందని మెట్రో అధికారులు వెల్లడించారు. -
ఆగ్రా మెట్రో ప్రత్యేకతలివే..
ఆగ్రాలోని తాజ్ మహల్‌ను చూసేందుకు వెళ్లేవారు ఇకపై అక్కడి మెట్రోలో సిటీనంతా చుట్టేయచ్చు. ఆగ్రాలో మెట్రో సేవలు గురువారం(2024, మార్చి, 7) నుంచి ప్రారంభం కానున్నాయి. డిజిటల్ మాధ్యమం ద్వారా ఆగ్రా మెట్రోను బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ జెండా ఊపి మెట్రో ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆగ్రా మెట్రో రైలు తాజ్ ఈస్ట్ గేట్ నుండి మంకమేశ్వర్ మెట్రో స్టేషన్ వరకు నడుస్తుంది. దీని దూరం ఆరు కిలోమీటర్లు. ప్రస్తుతానికి ఆరు స్టేషన్లలో మెట్రో నడుస్తుంది. మార్చి 7 నుంచి సామాన్య ప్రజలు మెట్రోలో ప్రయాణించవచ్చు. ఆగ్రా మెట్రో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రాకపోకలు సాగించనుంది. ఆగ్రా మెట్రో ప్రత్యేకతలివే.. #WATCH | West Bengal: Prime Minister Narendra Modi flags off metro railway services from Kavi Subhash Metro, Majerhat Metro, Kochi Metro, Agra Metro, Meerut-RRTS section, Pune Metro, Esplanade Metro- Kolkata. pic.twitter.com/2s8mNCjUiX — ANI (@ANI) March 6, 2024 ఆగ్రా మెట్రో గంటకు 90 కి.మీ వేగంతో నడుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో స్టేషన్లను పర్యవేక్షిస్తారు. ప్రయాణికులెవరైనా 20 నిమిషాల కంటే ఎక్కువసేపు స్టేషన్లో నిలబడితే అలారం మోగుతుంది. మొదటి దశ 6 మెట్రో స్టేషన్లు.. తాజ్ ఈస్ట్ గేట్, కెప్టెన్ శుభమ్ గుప్తా మెట్రో స్టేషన్, ఫతేబాద్ రోడ్, తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్ మంకమేశ్వర్ టెంపుల్ ఒక మెట్రో స్టేషన్ మధ్య ప్రయాణానికి రూ.10, చివరి స్టేషన్‌ను రూ.60గా చార్జీలను నిర్ణయించారు. ఒక కోచ్‌లో 60 సీట్లు ఉంటాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రోలో రాకపోకలు సాగించవచ్చు. -
రిపబ్లిక్ డే 2024: ఈసారి థీమ్ ఏంటంటే..
భారతదేశం జనవరి 26న (శుక్రవారం) 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఈ నేపధ్యంలో గణతంత్ర దినోత్సవ చరిత్ర, పరేడ్, థీమ్ తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా అన్నారు ‘రాజ్యాంగం కేవలం న్యాయవాదులు సమర్పించిన పత్రం కాదు. ఇది దేశ ప్రజల జీవితాలను నడిపే వాహనం. దీని స్ఫూర్తి ఎల్లప్పటికీ నిలచి ఉంటుంది’ అని అన్నారు. 1950లో భారత రాజ్యాంగానికి ఆమోదం లభించింది. నేడు మనం భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని చేసుకునేందుకు సిద్ధమవుతున్నాం. గణతంత్ర దినోత్సవాలలో భారతదేశ గొప్పదనాన్ని, సాంస్కృతిక వారసత్వం, దేశ పురోగతి, విజయాలను గుర్తుచేసుకోనున్నాం. ఢిల్లీలో జరిగే పరేడ్‌లో భారత సైనిక, నౌకాదళ, వైమానిక దళాల సత్తాను చాటే ప్రదర్శనలను మనం చూడబోతున్నాం. రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్, బీటింగ్ ది రిట్రీట్ వేడుకలు ఇప్పటికే అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లో జరిగాయి. భారతదేశ రాజ్యాంగానికి 1950, జనవరి 26న ఆమోదం లభించింది. దీనికి గుర్తుగా ప్రతియేటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. భారతదేశానికి 1947లో బ్రిటిష్‌వారి నుండి స్వాతంత్ర్యం లభించినప్పటికీ, 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దీంతో భారత్ ఒక సార్వభౌమ అధికారం కలిగిన గణతంత్ర దేశంగా గుర్తింపు పొందింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నాయకత్వం వహించారు. ప్రతీయేటా జరిగే గణతంత్ర దినోత్సవం.. ప్రజాస్వామ్యబద్ధంగా తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే భారతీయ పౌరుల శక్తిని గుర్తుచేస్తుంది. ప్రతీ సంవత్సరం దేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరుగుతుంటాయి. ఆ రోజు రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం సైనిక, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. గణతంత్ర దినోత్సవం నాడు భారత రాష్ట్రపతి దేశంలోని అర్హులైన పౌరులకు పద్మ అవార్డులను అందిస్తారు. వీర సైనికులకు పరమవీర చక్ర, అశోక్ చక్ర ప్రదానం చేస్తారు. రిపబ్లిక్ డే పరేడ్ ప్రత్యక్ష ప్రసారాలు దేశ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ ధీమ్ ‘వీక్షిత్ భారత్’,‘భారత్ - లోక్తంత్ర కి మాతృక’. ఇది ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దేశంగా భారతదేశ పాత్రను నొక్కి చెబుతుంది. జనవరి 26.. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఇవి 90 నిమిషాల పాటు జరుగుతాయి. ఈ ఏడాది వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరుకానున్నారు. -
నిర్మొహమాట గుణ సంపన్నులు!
నిజం అని తాము నమ్మిన దానిని భారతీయులు ఒక అద్భుతమైన విధానంలో వ్యక్తపరుస్తారు. ఏమాత్రం సంకోచం లేకుండా అనువుకాని వేళనైనా చొరవ చేసుకుని వచ్చి తటాలున పేలుతారు. అలా మాట్లాడ్డం వల్ల ఎవర్నయినా తక్కువ చేస్తున్నామా అనే ఆలోచనా వారిలో కనిపించదు. పైపూతలేం ఉండవు. అది కొన్నిసార్లు బాధాకరంగా ఉన్నప్పటికీ దాదాపుగా అదే ఎల్లప్పుడూ ఒక బాధా నివారిణిగా పనికొస్తుంది. కేవలం మన దేశంలో మాత్రమే ముక్కూమొహం తెలియనివారు కూడా రాత్రి పొద్దు పోయాక ఫోన్ చేసి, వాళ్ల మనసులో ఉన్నదానిని మీ ముఖానికేసి కొడతారు. అటువంటి ప్రవర్తనతో అందరికీ తాము వేడుక అవుతున్నామని తెలిసినా లెక్కచేయరు. వాళ్లు అలా ఎందుకు చేస్తారంటే, వాళ్లకు అలా చేయాలనిపించింది కనుక! రాత్రి బాగా పొద్దుపోయాక ఒక్క ఉదుటున ఉలికిపాటుగా మోగిన ఫోన్‌ని – అవతల ఏం ఉపద్రవం ముంచుకొచ్చిందో ఊహించలేను కనుక – క్షణమైనా ఆలస్యం చేయకుండా చేతికి అందుకున్నాను. మామూలుగా నైతే ఆ ఫోన్ మోగిన సమయం, ఆ మాట తీరు ఠప్పున నా చేత ఫోన్ పెట్టిపడేసేలా చేసి ఉండేవి. ‘‘నేను మిమ్మల్నొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను’’ అని అంటూనే... నా మాటకు చోటు ఇవ్వకుండా, ‘‘నేను మీ కాలమ్‌ని క్రమం తప్పకుండా చదివే పాఠకుడిని. మీరెప్పుడూ కూడా ప్రతిదాన్నీ విమర్శిస్తూనే ఉండటం గమనించాను. మెచ్చుకోవడానికి అసలు మీకేమీ కనిపించదా?’’ అని అవతలి వ్యక్తి! ముక్కు మీద గుద్దినట్లున్న ఆ మొద్దుబారిన ప్రశ్న ఒక్కసారిగా నన్ను తత్తరపాటుకు గురిచేసింది. ఏం చెప్పాలో తెలియలేదు. ఒకటి మాత్రం తెలుస్తూనే ఉంది. అతడు నన్ను బోనులో నిలబెట్టాడు. నా తరఫు వాదనను నేను చెప్పాలి. ఫోన్ పెట్టేసి తప్పించు కోవచ్చు. అలా చేయాలని నేను అనుకున్న సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. కానీ అది ప్రశ్నకు సమాధానం అవదు. అంతేకాదు, సంభాషణ నుండి ఉత్పన్నం అవవలసిన తక్కిన సందేహాలు అర్ధంతరంగానే వ్యక్తం కాకుండా పోతాయి. ‘‘విమర్శించడమే వివేకం అన్నట్లుగా రాస్తారు మీరు. విమర్శనాత్మకంగా ఉండటం అన్నది పాఠకులకు నచ్చే, పాఠకులకు మిమ్మల్ని నచ్చేలా చేసే విషయమే కావచ్చు. అందులో సందేహం లేదు. కానీ అందువల్ల మీరెప్పుడూ ప్రతికూలతలకు మాత్రమే ప్రఖ్యాతిగాంచిన వారవుతారు. అసలు మీకు నచ్చే విషయాలే ఉండవా? వాటి మాటేమిటి? మీరు ప్రశంసించాలనుకున్న వాటి సంగతేమిటి? వాటి గురించి రాయడం ద్వారా మీకొక గుర్తింపును మీరెందుకు కోరుకోరు? ఏదో ఒకదానినైనా సమర్థించండి. ప్రతి దానినీ విమర్శిస్తూ పోకండి’’ అంటోంది ఆ గొంతు. వారి పేరేమిటో చెప్పారు కానీ, ప్చ్... గుర్తుకు రావడం లేదు. నన్ను నేను సమర్థించుకోవటానికి దారులు వెతికే పనిలో పడ్డాను. నేను ప్రతికూలమైన వ్యక్తిని కాదని అతడిని సానుకూల పరి చేందుకు ప్రయత్నించాను. కానీ అతడు కొన్ని క్షణాల పాటు మాత్రమే నాకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వగలిగాడు. ‘‘నేను చెబుతాను ఏం రాయాలో’’ అన్నాడతను. అతడి స్వరంలోని అలజడి కాస్త నెమ్మదించింది. అంతకు ముందున్న అసహనం స్థానంలో ప్రశాంత చిత్తం ప్రతిఫలించింది. ‘‘మీకొక చిన్న సలహా ఇస్తాను. భారతదేశంలో మీకు నచ్చే వాటి గురించి మీరెందుకు రాయ కూడదు? ఆదివారం ఉదయం నేను మీ కాలమ్ చదివి సంతోషంగా, సంతృప్తికరంగా ఉండేందుకు అందులో నాకు మూడు మంచి కార ణాలు చూపించండి. కానీ మీరేం చేస్తున్నారో తెలుసా? పూర్తి భిన్న మైన అనుభూతులను నాకు కలిగిస్తున్నారు’’ అన్నాడు. ఫోన్ పెట్టేశాను. అతడి మాటలు నన్ను అయోమయంలోకి నెట్టేసినా, అతడితో సంభాషణ ఆశ్చర్యకరంగా నాకు సంతోషాన్ని కలుగజేసింది. మొదటిగా చెప్పాలంటే – అతడి వాదనను నేను అంగీ కరించనప్పటికీ, అతడి వైపు నుంచి అది నిజమే కావచ్చు. నాకున్న విమర్శించే హక్కును – అవసరమైతే దుడుకుగా, అదే సమయంలో దాడి చేసినట్లు కాకుండా – నేను వదులుకునే ప్రశ్నే లేనప్పటికీ అప్పు డప్పుడు ప్రశంసించడం, మెచ్చుకోవడం కూడా అవసరమేనని నేను ఒప్పుకుంటాను. మరీ ముఖ్యంగా నేను చెప్పవలసింది, ఇదే విధమైన సంభాషణ మునుపు కూడా అనేకసార్లు నా అనుభవంలోకి వచ్చింది. అయినప్పటికీ, గతంలో ఎప్పుడూ కూడా నేను ఈ విషయమై గమనింపుతో లేననీ, కనీసం అర్థం చేసుకునే ప్రయత్నమైనా చేయలేదనీ నా కళ్లు తెరుచుకున్నాయి. ఇప్పుడది వచ్చి నేరుగా నా ముఖానికే తగిలిన అభిప్రాయం కాబట్టి బహుశా నేను దాన్నుంచి తప్పించుకునే అవ కాశమే లేదు. నిజం అని తాము నమ్మిన దానిని భారతీయులు ఒక అద్భు తమైన విధానంలో వ్యక్తపరుస్తారు. ఏమాత్రం సంకోచం లేకుండా అనువుకాని వేళనైనా చొరవ చేసుకుని వచ్చి తటాలున పేలుతారు. అందులో నమ్మదగనిదేం ఉండదు. అలాగే, ఎవర్న యినా తక్కువ చేస్తున్నామా అనే ఆలోచనా వారిలో కనిపించదు. పైపూతలేం ఉండవు. మన సులో ఏదుంటే అది, చేర్పులేమీ చేయనట్లుగా స్వచ్ఛంగా ఉంటుంది. అది కొన్నిసార్లు బాధాక రంగా ఉన్నప్పటికీ దాదాపుగా అదే ఎల్లప్పుడూ ఒక బాధా నివారిణిగా పనికొస్తుంది. ‘ఊరియా హీప్’ (చార్లెస్ డికెన్స్ నవల ‘డేవిడ్ కాపర్ఫీల్డ్’లో వినయాన్ని నటించే కపటి పాత్ర)కు దీటుగా మనం కలిగి ఉన్న సమాన కపట సామర్థ్యాన్ని అది పోగొడుతుంది. నిజానికి మరే ఇతర దేశంలోనూ ఇంతటి అద్భుతమైన గుణం ఉన్నట్లు కనిపించదు. బ్రిటిష్‌వాళ్లు మరీ ఉదాసీనంగా ఉంటారు. ఫ్రెంచి వాళ్లు లొడలొడా మాట్లాడుతారు. జర్మనీ దేశస్థులు ఎక్కువ న్యాయ బద్ధంగా పోతారు. ఇటాలియన్లు గడబిడ మనుషులు. అమెరికన్లకు పెద్దగా ఏం తెలియదు. సత్యంలా కనిపించేది ఏదైనా చైనీయుల్ని భయపెడుతుంది. కేవలం మన దేశంలో మాత్రమే ముక్కూమొహం తెలియనివారు మాటల కవాతు చేస్తారు. రాత్రిళ్లు పొద్దు పోయాక ఫోన్ చేసి, వాళ్ల మనసులో ఉన్నదానిని మీ ముఖానికేసి కొడతారు. అంతేకాదు... వాళ్ల వ్యాఖ్య వాళ్ల వ్యక్తిగతం అనీ, అర్ధరాత్రి కూడా దాటేసిందనీ, లేదా ఎవరైనా వింటూ ఉంటారనే నిజాలను కూడా వారు గ్రహించని స్థితిలో ఉంటారు. అటువంటి ప్రవర్తనతో అందరికీ తాము వేడుక అవుతున్నా మని తెలిసినా లెక్కచేయరు. వాళ్లు అలా ఎందుకు చేస్తారంటే, వాళ్లకు అలా చేయాలనిపించింది కనుక! వారిని అలా చేయించే ఉద్వేగం కనీస మర్యాదల్ని, సౌమ్యగుణాన్ని, చివరికి అవకాశం లేకపోవడాన్ని కూడా పట్టించుకోనివ్వదు. అలా తన్నుకొచ్చేస్తుందంతే! కనుక, ఈ ఉదయం... ఇంతకుముందు నేను సరిగా ఆలోచించని నాలో ఉండవలసిన గుణం గురించి నాలో ఆలోచన రేకెత్తించిన నా నడిరేయి సంభాషణకర్తను అభినందించాలని అనుకుంటున్నాను. మీలాంటి వాళ్లే సర్, ఒక మనిషిలో విమర్శించనందువల్ల కలిగే స్వీయ ఆమోదాన్ని, ఆత్మసంతృప్తిని కదిలిస్తారు. మీ కాల్ నాకు గొప్ప ప్రయోజనం కలిగించింది. ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
Phone Addiction: మీ సమయమంతా ఫోన్‌కే పోయిందా?
కాలం తిరిగి రాదు. కాలం విలువైనది. తెలుసు మనకు. కాని డిజిటల్ చొరబాటు పెరిగాక సమయమంతా ఫోన్‌కే పోయిందా? ఒక ఇంట్లో భార్య 3 గంటలు, భర్త 3 గంటలు, పిల్లలు చెరి 3 గంటలు ఫోన్ వాడితే రోజులో 12 విలువైన గంటలు నాశనమైపోతాయి. 2023లో మీ కుటుంబం మొత్తం కనీసం 180 రోజులు ఫోన్లో వృథా చేసింది. 2024లో మీ సమయం మీరు పొందగలరా? ఏదో సినిమాలో ‘నేనొక వంద రూపాయల అవినీతి చేస్తే తప్పేంటి?’ అని విలన్ అంటే, ‘అలా వంద రూపాయల అవినీతి కోటి మంది చేస్తే చిన్న తప్పు అవుతుందా?’ అని హీరో ప్రశ్నిస్తాడు. సేమ్. ‘ఇంట్లో కాసేపు ఫోన్ చూస్తే తప్పేంటి?’ అని తల్లో, తండ్రో, కొడుకో, కూతురో అనుకోవచ్చు. ‘మీ అందరూ కలిసి చాలా టైమ్ వేస్ట్ చేయడం తప్పే’ అని సమాధానం చెప్పాల్సి వస్తుంది. టైమ్‌ను సద్వినియోగం చేస్తే చాలా పనులు అవుతాయి. దుర్వినియోగం చేస్తే చాలా నష్టాలు తప్పక జరుగుతాయి. ఇటీవల చాలా స్కూళ్లల్లో పిల్లలు సరిగ్గా ఎగ్జామ్స్ రాయడం లేదని టీచర్లు మొత్తుకుంటున్నారు. దానికి కారణం పిల్లలు ఎగ్జామ్స్‌కు చదవడానికి కూచుని ఫోన్లు చూస్తున్నారని అర్థమవుతోంది. కరోనా వల్ల జరిగిన చాలా నష్టాల్లో పిల్లలకు ఫోన్లు అలవాటు కావడం ఒకటి. వాళ్లు ఫోన్లకు అడిక్ట్ అవడం వారి భవిష్యత్తునే ప్రభావితం చేస్తోంది. పిల్లల్ని ఫోన్లు చూడొద్దని చెప్పే నైతిక హక్కు తల్లిదండ్రులకు ఎప్పుడు వస్తుంది? వాళ్లు ఫోన్లు చూడనప్పుడు. కాని తల్లిదండ్రులు పిల్లల కంటే ఎక్కువగా ఫోన్లకు అలవాటు పడి ఉన్నారు. మానసిక, శారీరక, కౌటుంబిక, ఆర్థిక, అనుబంధ జీవనాలన్నింటికీ ఈ ఫోన్ వల్ల వృథా అవుతున్న సమయం చావు దెబ్బ తీస్తోంది. ఫోన్ ఎందుకు? కాల్స్ మాట్లాడేందుకు. ఏ మనిషికైనా రోజులో ఐదారు కాల్స్ మాట్లాడే అవసరం ఉంటుంది. ఉద్యోగాల్లో వృత్తిగతమైన కాల్స్ ఆఫీస్ టైమ్ కిందకే వస్తాయి. కాని ప్రయివేట్ టైమ్‌లో ఫోన్లు– అవసరమైనవి మాత్రమే తీసుకుంటే ఐదారు మించవు. మరి ఫోన్లకు ఇవాళ ఎలా వాడుతున్నారు? ఫోనులోని ఏవేవి మీ సమయాన్ని తీసుకుంటున్నాయి? 1. వాట్సాప్, 2.యూట్యూబ్, 3. రీల్స్ 4. ఫేస్బుక్, 5. ఓటీటీ యాప్స్ 6. ‘ఎక్స్’(ట్విటర్) 7.ఇన్‌స్టా ఇప్పుడు 2023లో వీటి ద్వారా నిజంగా మీరు పొందిన జ్ఞానం ఎంత? ప్రయోజనం ఎంత? లాభం ఎంత? ఆలోచించండి. వీటిని చూడటం వల్ల ఆర్థికంగా ఏమైనా ఉపయోగం జరిగిందా? ఆరోగ్య పరంగా ఏదైనా ఉపయోగం జరిగిందా? ఉద్యోగాలు వచ్చాయా? ప్రమోషన్లు సమకూరాయా? పిల్లలకు ర్యాంకులు వచ్చాయా? కెరీర్, విద్య కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తే సరే. లేకుండా ఊరికే కాలక్షేపం కోసం ఫోన్‌ను స్క్రోల్ చేస్తూ రోజులు దొర్లించేస్తే ఏం సాధించినట్టు? ‘తేనెలో భార్యాభర్తల ఫొటో కూరితే వారు అన్యోన్యంగా ఉంటారు’, ‘షూటింగ్ మధ్యలో హీరో హీరోయిన్‌తో ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు’, ‘మా హోమ్టూర్కు రెడీయా?’... ఇలాంటి వీడియోలు, పిచ్చి నృత్యాల రీల్స్... వీటితో సమయం వృధా అయిపోతోంది ఫోన్ వల్ల. క్రైమ్, సస్పెన్స్, హారర్ వెబ్ సిరీస్‌లు బింజ్వాచ్ చేస్తే సమయం మొత్తం వృథా. గేమ్స్‌లో కూరుకు పోతే, ఫోన్లో బెట్టింగ్‌లకు అలవాటు పడితే, ఆన్లైన్ ట్రేడింగ్‌కు అడిక్ట్ అయితే, పోర్న్ వీడియోలు వదల్లేకపోతే... సమయం వృథా, వృథా, వృథా. పుస్తకం మనం ఎంచుకుని చదివేది. ఫోన్ అదేం చూపాలనుకుంటే అది చూపేది. కుటుంబం మొత్తం కలిసి ఏదైనా రెస్టరెంట్‌కు వెళితే కుటుంబ సభ్యులు నలుగురూ ఫోన్లు చూసుకుంటూ కూచుని ఉంటే కనుక అది ఏ మాత్రం కమ్యూనికేషన్ ఉన్న కుటుంబం కాదు. ప్రతి ఒక్కరూ సంబంధం లేని కంటెంట్‌తో కమ్యూనికేషన్లో ఉన్నట్టు. కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం, వ్యాయామానికి ఇవ్వాల్సిన సమయం, స్నేహితులను పరామర్శించుకోవడానికి ఇవ్వాల్సిన సమయం, డాక్యుమెంట్స్ చక్కదిద్దుకోవాల్సిన సమయం, బ్యాంకు లావాదేవీలు.. పాలసీలు సరి చేసుకోవాల్సిన సమయం, సంపాదన మెరుగు పర్చుకోవాల్సిన సమయం, డబ్బు ఆదా కోసం వెచ్చించాల్సిన సమయం, పిల్లల్ని చదివించాల్సిన సమయం, భార్యాభర్తలు కలిసి మాట్లాడుకోవాల్సిన సమయం మొత్తం ఫోన్ల వల్ల, సోషల్ మీడియా వల్ల 2023లో ఎంత వృథా అయ్యిందో ఆలోచిస్తే 2024ను సరిగ్గా ఆహ్వానించగలుగుతారు. 2024వ సంవత్సరం విలువైన కాలాన్ని వెంటబెట్టుకుని వస్తోంది. సద్వినియోగం చేసుకోండి. -
సమయం.. సరిపోవట్లే! రోజుకు 28గంటలు ఉంటే బాగుండు!
సాక్షి, మహబూబ్‌నగర్: ‘ప్రచారంలో అటు తిరిగి ఇటు వచ్చే లోగా రోజు గడిచిపోతుంది. ఏ రోజు అనుకున్న పనులు ఆ రోజు అవట్లేదు. సమయం సరిపోవడం లేదు. పోలింగ్ సమయమేమో దగ్గరపడుతోంది. రోజుకు 28గంటలు ఉంటే బాగుండు.’ ఇటీవల ఓ నాయకుడు తన అనుచరుల వద్ద చేసిన వ్యాఖ్య ఇది. ఈ ఒకట్రెండు రోజులు చెమటోడ్చి కష్టపడితే ఐదేళ్ల పాటు హాయిగా వీఐపీ హోదాలో దర్జాగా ఉండవచ్చు. శాసనసభలో ప్రధాన ప్రాత వహిస్తూ అధికార దర్పంతో హాయిగా బతకవచ్చు. కాలం కలిసి వస్తే మంత్రి పదవి రావొచ్చు. అలాంటి రాజకీయ జీవితం కోసం అభ్యర్థులు ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఓవైపు ఉష్ణోగ్రతలు పడిపోయి గ్రామాలన్నీ మంచుదప్పటి పరచుకుని ఉంటే.. అభ్యర్థులు చలిని సైతం లెక్క చేయకుండా తెల్లవారుజామునే ప్రచారం మొదలుపెడుతున్నారు. ఉదయం ఇంటి నుంచి బయల్దేరి రాత్రికి ఎప్పుడో తిరిగొస్తున్నారు. అభ్యర్థుల దినచర్య అత్యంత బిజీ షెడ్యూల్‌తో ప్రారంభమవుతోంది. అలసట, విశ్రాంతి అనే పదాలకు చోటులేకుండా ముందుకు సాగుతున్నారు. సహాయకుల పరిస్థితి అంతే.. ఒక్క నిమిషం కూడా వృథా కాకుండా అభ్యర్థులు తమ షెడ్యూల్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. కేవలం నిద్రించే సమయం తప్ప మిగతా సమయాన్ని మొత్తం ప్రచార పర్వానికే అంకితం చేస్తున్నారు. కాలంతో పరుగెడుతూ ఎన్నికల కుస్తీ పడుతున్నారు. బిజీ షెడ్యూల్‌తో అభ్యర్థులకు నెలరోజుల నుంచి కంటినిండ నిద్ర కరువైంది. గ్రామీణ ప్రజలు ఉదయమే వ్యవసాయ పనులకు వెళ్తుండటంతో వారిని కలిసేందుకు వీలైనంత త్వరగా ఇంటి నుంచి బయల్దేరుతున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వేలాది మందిని ప్రత్యక్షంగా పలకరిస్తున్నారు. ఈ సమయంలో వారి వ్యక్తిగత సహాయకుల పాత్ర కీలకమవుతుంది. నిర్దేశించుకున్న పనులను నిర్ణీత సమయానికి గుర్తు చేయడం, అందరినీ సయన్వయం చేయడం వంటి బాధ్యతలు వీరు నిర్వరిస్తున్నారు. అలా అభ్యర్థులకు సహకారం అందిస్తూ సమయాభావ సమస్యను ఎదుర్కొంటున్నారు. నెలరోజులుగా జనంలోనే.. అభ్యర్థుల ఇళ్ల వద్ద నిత్యం జనంతో కోలహలం కనిపిస్తోంది. ఉదయం నుంచే వందలాది మంది నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీల అభ్యర్థులతో మాట్లాడేందుకు క్యూ కడుతున్నారు. దీంతో నిద్రలేచింది మొదలు ప్రచారతంతు ప్రారంభమవుతోంది. కిందిస్థాయి నేతలతో మాట్లాడుతూ గ్రామాలు, మండలాల్లో పరిస్థితిపై ఆరా తీసేందుకు కొంత సయమం కేటాయించాల్సి వస్తోంది. రోజు ఏదో ఒక చోటకు వెళ్లడం దిన చర్యలో తప్పనిసరిగా మారింది. నియోజకవర్గం మొత్తం చుట్టి రావడమే లక్ష్యంగా రోజువారీ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాలకు రాకపోకల సమయంలోనూ ముఖ్యనేతలతో ఎప్పటికప్పుడు పరిస్థితులపై చర్చిస్తున్నారు. అలాగే ప్రత్యర్థి పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించేందుకు స్థానిక లీడర్ల సాయంతో కొంత సమయం కేటాయిస్తున్నారు. నియోజకవర్గానికి ఎవరైనా ముఖ్యనేతలు వస్తే జనసమీకరణ తదితర ఏర్పాట్లు చూసుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం రోజులో ఎంతో కొంత సమయం కేటాయిస్తున్నారు. దిన చర్య ఇలా.. ► ఉదయం 5గంటలకు మేల్కొనడం ► 5నుంచి 6గంటల వరకు కాలకృత్యాలు తీర్చుకోవడం ► 6నుంచి 7లోగా స్నానం, టిఫిన్ చేయడం ► 7నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు గ్రామాల్లో ప్రచారం, రోడ్ షోలు, చేరికలు, సభలు, ప్రెస్మీట్లు నిర్వహించడం ► 2నుంచి 4గంటల మధ్య మధ్నాహ్న భోజనం చేయడం ► సాయంత్రం 4నుంచి రాత్రి 10గంటల వరకు సభలు, సమావేశాలు, ర్యాలీల్లో పాల్గొనడం ► రాత్రి 10గంటలకు రాత్రి భోజనం తర్వాత ముఖ్యులతో మాటామంతి ► రేపటి దిన చర్య కోసం ప్లాన్ వేసుకోవడం ఆ రోజు అన్ని పనులు పూర్తయితే నిద్రకు ఉపక్రమించడం. ఈ తతంగం ముగిసే వరకు రాత్రి 12నుంచి 2గంటలు దాటుతోంది. ఒక్కోసారి ముఖ్యనేతల బహిరంగ సభలు ఉంటే తెల్లవారుజాము వరకు మేల్కొనే ఉంటున్నారు. -
పారిస్ ఒప్పందానికి చిల్లు? భయపెడుతున్న భూతాపం!
ప్రపంచ మానవాళిముందున్న అతిపెద్ద సవాల్ రోజురోజుకు పెరిగిపోతున్న భూతాపం. దీనిని నియంత్రించే లక్ష్యంతో 2015లో 200 దేశాలు పారిస్ వాతావరణ ఒప్పందాన్ని చేసుకున్నాయి. దీని ప్రకారం అధిక ఉష్ణోగ్రతల నియంత్రణకు ఈ దేశాలన్నీ తగిన చర్యలు చేపట్టాలి. ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను పూర్వపారిశ్రామిక స్థాయిలకంటే రెండు డిగ్రీల సెంట్రీగ్రేడ్‌ల కన్నా తక్కువకు నియంత్రించాలి. అప్పుడే విపత్కర వాతావరణ ప్రభావాలను గణనీయంగా తగ్గించవచ్చని పారిస్ ఒప్పందంలో తీర్మానించారు. అయితే ఇది విఫలమయినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2023 నవంబరు 17న నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆరోజు భూ ఉపరితల ఉష్ణోగ్రత పూర్వపారిశ్రామిక స్థాయిలకంటే రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా నమోదయ్యింది. ఇప్పటివరకూ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలలో ఇదే రికార్డుగా నిలిచింది. ఇది అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్జాతీయంగా పెరిగిన గాలి ఉష్ణోగ్రత, సముద్ర ఉష్ణోగ్రత, అంటార్కిటిక్ సముద్రపు మంచు విస్తీర్ణం మొదలైనవి భూతాపం పెరగడానికి కారణాలుగా నిలుస్తున్నాయి. గత జూలైలోనూ భూ ఉపరితల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైంది. సెప్టెంబర్ నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే 1.5సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్నాయని మరో నివేదిక పేర్కొంది. భూతాపం నియంత్రణకు అన్ని దేశాలు శిలాజ ఇంధన సబ్సిడీలను తొలగించడం, అటవీ రక్షణ పెంపుదల, మొక్కల ఆధారిత ఆహారాలవైపు మళ్లడం, కొత్త బొగ్గు ప్రాజెక్టులను ఎత్తివేయడం, చమురు, గ్యాస్ వినియోగాన్ని దశలవారీగా తగ్గించడానికి ప్రయత్నాలను తప్పనిసరిగా చేయాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. ప్రపంచ దేశాలు ఉష్ణోగ్రతలను లక్ష్యం మేరకు నియంత్రించలేకపోతే అత్యంత దారుణమైన పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ మేరకు పెరిగితే సముద్ర మట్టాలు 10 సెంటీమీటర్లు పెరిగి, చాలా ప్రాంతాలు నీట మునిగిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పరిమితం చేయగలిగితే కనీసం కోటి మందిని ఈ ముప్పు నుంచి బయటపడేయచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: భారతీయలు పాక్‌లో వ్యాపారం చేయవచ్చా? -
19 అగ్నిపర్వతాలు ఏకకాలంలో పేలాయా? గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ చెబుతున్న వాస్తవం ఏమిటి?
అగ్ని పర్వతం... ఈ మాట వినిగానే భగభగ మండే అగ్నికీలల మధ్య నుంచి ఉబికివచ్చే లావా గుర్తుకువస్తుంది. అగ్ని పర్వత విస్ఫోటనం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మరి ప్రపంచవ్యాప్తంగా డజనుకుపైగా అగ్ని పర్వతాలు ఒకే సమయంలో బద్దలయ్యాయని తెలిస్తే.. అది ఊహకు కూడా అందదు. అవును.. ఇది నిజం.. ప్రపంచవ్యాప్తంగా ఒకే సమయంలో 19 అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందాయి. తాజాగా మరో మూడు కొత్త విస్ఫోటనాలు ఈ జాబితాలో చేరాయి. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు తెలియజేశారు. స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూట్కు చెందిన గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ నూతన విస్ఫోటనాలను ట్రాక్ చేస్తుంది. గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ తాజాగా విస్ఫోటనం చెందుతున్న అగ్నిపర్వతాల జాబితాను అప్డేట్ చేసింది. ఈ జాబితా విడుదల అనంతరం పలువురు సోషల్ మీడియాలో తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు. ఇటలీ, ఐస్లాండ్, జపాన్, మెక్సికో, రష్యా, ఫిలిప్పీన్స్ దేశాలలో ఒకేసారి అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అగ్నిపర్వతాలు నిరంతరం విస్ఫోటనం చెందుతుంటాయి. ఇది సాధారణమేనని అగ్నిపర్వత శాస్త్రవేత్త, సైన్స్ జర్నలిస్ట్ రాబిన్ జార్జ్ ఆండ్రూస్ ఎక్స్(ట్విట్టర్) మాధ్యమంలో తెలిపారు. ప్రస్తుతం పేలుతున్న అగ్నిపర్వతాల సంఖ్య సాధారణమేనని గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ డైరెక్టర్ బెన్ ఆండ్రూస్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం 46 విస్ఫోటనాలు కొనసాగుతున్నాయని, గత 30 సంవత్సరాలలో ఇదేవిధంగా నిరంతరం 40 నుంచి 50 విస్ఫోటనాలు జరిగాయన్నారు. 1991 నుండి ప్రతి సంవత్సరం 56 నుంచి 88 వరకూ అగ్నిపర్వత విస్ఫోటనలు జరిగాయి. 2022లో ఈ సంఖ్య 85గా ఉందని బెన్ ఆండ్రూస్ పేర్కొన్నారు. ఈ పేలుళ్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయని ఆయన అన్నారు. గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ అందించిన తాజా అప్డేట్లో జపనీస్ ద్వీపం ఐవో జిమాలోని నీటి అడుగున ఉన్న అగ్నిపర్వతం, ఐస్లాండ్లోని ఫాగ్రాడల్స్‌ఫ్జల్, రష్యాలోని క్లూచెవ్స్కోయ్లు చేరాయి. జపనీస్ అగ్నిపర్వత దీవులలోని నీటి అడుగునవున్న అగ్నిపర్వతం అక్టోబరు 30న విస్ఫోటనం చెందింది. దీని శిలాద్రవం నీటి ఉపరితలాన్ని ఛేదించి, కొత్త ద్వీపాన్ని సృష్టించింది. జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ)తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్‌లో ప్రతి రెండు నిమిషాలకు ఇవో జిమా వద్ద అగ్నిపర్వత ప్రకంపనలు నమోదయ్యాయి. రష్యాలోని క్లూచెవ్స్కాయా సోప్కా అగ్నిపర్వతం ఇటీవలే విస్ఫోటనం చెందింది. సమయంలో సముద్ర మట్టానికి 8 మైళ్ల ఎత్తుకు బూడిద ఎగజిమ్మింది. ఈ నేపధ్యంలో భద్రత దృష్ట్యా పలు పాఠశాలలను మూసివేశారు. కాగా ఫాగ్రాడల్స్‌ఫ్జల్ అగ్నిపర్వతం ఇంకా పూర్తిగా విస్ఫోటనం చెందలేదు. అయితే విస్పోటనానికి సంబంధించిన సంకేతాలు వెలువడుతున్నందున స్థానిక అధికారులు గ్రిండవిక్ పట్టణాన్ని ఖాళీ చేయించారు. అగ్ని పర్వతం ఎలా ఏర్పడుతుంది? అగ్ని పర్వతం అంటే భూమి ఉపరితలంపై ఏర్పడిన ఒక చిల్లు లేదా ఒత్తిడి కారణంగా ఏర్పడిన ఒక పగులు. దీని నుంచి వేడి మేగ్మా, బూడిద, వివిధ వాయువులు బయటకు వెలువడుతాయి. సాధారణంగా భూమిలోని టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొన్న చోట అగ్ని పర్వతాలు ఏర్పడతాయి. అట్లాంటిక్ మహాసముద్రం నడిబొడ్డులో ఇటువంటి ప్రదేశం ఉంది. దానిని మిడ్ అట్లాంటిక్ రిడ్జి అని అంటారు. ఇది రెండు టెక్టోనిక్ ప్లేట్లు దూరంగా జరగడం వల్ల ఏర్పడింది. అగ్ని పర్వతాలు ఏర్పడడానికి టెక్టోనిక్ ప్లేట్లు కదలిక ఒక్కటే కారణం కాదు. భూమి కింది భాగంలోని టెక్టోనిక్ ప్లేట్లు సాగిపోయి, పల్చబడటం కారణంగానూ అగ్ని పర్వతాలు ఏర్పడతాయి. తూర్పు ఆఫ్రికాలో ఉన్న తూర్పు ఆఫ్రికా రిప్ట్, ఉత్తర అమెరికాలో ఉన్న రియో గ్రేండి రిఫ్ట్ ఈ విధమైన అగ్ని పర్వతాలకు ఉదాహరణలు. అగ్ని పర్వతంలో ఏముంటాయి? మాగ్మా చాంబర్: ఇది భూమిలోని అట్టడుగున లావాతో, గ్యాస్ , బూడిదలతో నిండిపోయి ఉంటుంది. సిల్: పర్వతంలోని లోపలి పొరల్లోకి లావాని తీసుకెళుతుంది. డైక్: పైప్ లోని ఒక బ్రాంచ్. ఇది సిల్ వరకు లావాను చేరుస్తుంది. లావా లేయర్స్: ఇవి పర్వతంలో బూడిదతో నిండి ఉంటాయి. వీటి నుంచే బూడిద వెలువడుతుంది. అగ్ని పర్వతం పేలినప్పుడు ఈ లేయర్లలోని లావా బయటకు ఎగజిమ్ముతుంది. పారసైటిక్ కోన్: పర్వతం రగులుతున్నదశలో దీనిద్వారా లావా వెలువడి బయటకు వస్తుంది. లావా ఫ్లో: కోన్ నుంచి బయటకు లావా వెలువడుతుంది. వెంట్: ఇది పర్వతపు ముఖద్వారం. ఇది బయటకు లావాను, బూడిదను విడుదల చేసే భాగం. క్రేటర్: పర్వతం కొనలో ఏర్పడిన గొయ్యి భాగం. యాష్ క్లౌడ్: పర్వతం పేలడానికి ముందుగా వెలువడే బూడిద మేఘం. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీకి థాయ్ రెస్క్యూ బృందాలు -
కాలాన్ని గెలిచినవాడు
గతం అనేది ఎక్కడుంది? గతంలో జీవించిన మనుషులు కాలపు పొరల్లో ఎక్కడ చిక్కుకుని ఉన్నారు? గత సంఘటనలు ఏ కాలగర్భంలో వెచ్చగా దాగి ఉన్నాయి? గతం తాలూకు ఆలంబన అంటూ లేకపోతే మనిషికి వర్తమానంలో ఉన్నదేమిటి? గతం అనేది మనిషి యావజ్జీవితపు ధ్రువపత్రం. కానీ గతాన్ని వర్తమానంలోకి లాగే మంత్రదండం ఎక్కడుంది? జ్ఞాపకం ద్వారా మాత్రమే గతాన్ని చైతన్యవంతం చేయగలం. కానీ ఆ జ్ఞాపకం స్వచ్ఛందంగా మనసులోకి దూకాలి. అలా దూకాలంటే ఇంద్రియాలను ఏదో కదిలించాలి. అది ‘బలమైనదే’ కానక్కరలేదు.బలంగా ముద్ర వేసినదైతే చాలు. అనుకోకుండా ఒక చలికాలం పూట వెచ్చదనం కోసం అమ్మ ఇచ్చిన టీ కప్పులో ‘మడలీన్ ’ అనే చిన్న గుండ్రపాటి కేకును అద్దుకోగానే, ఆ మొదటి రుచి అంగిలికి తాకగానే, ఎప్పుడో చిన్నతనంలో తాము నివసించిన ‘కోంబ్రే’లో అనుభవించిన అదే రుచి మార్సెల్ ప్రూస్ట్‌కు చప్పున గుర్తొస్తుంది. ఆ వెనువెంటనే బాల్యంలో తిరగాడిన ఆ ఊరు, ఆ మనుషుల తాలూకు జ్ఞాపకాలు జలజలా రాలుతాయి. ఇక కాలంలో వెనక్కి ఈదుకుంటూ వాళ్ల కుటుంబీకుల పుట్టుపూర్వోత్తరాలు ఏకధారగా వల్లెవేయడానికి కూర్చుంటాడు. అలా గతాన్ని స్వగతంగా మార్చుకోవడం ద్వారా ఇరవయ్యో శతాబ్దపు అత్యంత విస్తారమైన ఆత్మకథాత్మక నవలారాజం ‘ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ టైమ్’ సాహిత్యలోకానికి అందింది. సుమారు నాలుగు వేల పేజీలున్న ఈ నవల 1913 నుంచి 1927 మధ్య ఏడు భాగాలుగా ప్రచురితమైంది. ఏ రచయితకైనా గతమే పెట్టుబడి. కానీ ప్రత్యేకించి ఆ గతంలో జీవిత పరమార్థాన్ని అన్వేషించడంలోనే ప్రూస్ట్ రచనా వైభవం దాగివుంది. కాలం అనే విధ్వంసక శక్తిని కళ అనే సాధనంతో ఆయన ఎదుర్కొన్నాడు. కాలంలో కలిసిపోయిన వారిని సాహిత్యం ఊతంగా సజీవ మూర్తులుగా నిలబెట్టాడు. సమకాలీన ఫ్రెంచ్ సమాజపు రీతులు, బాధలు, భయాలు, తపనలు, ఒంటరితనాలు, సరదాలు, సంతోషాలు, నిర్దయలు, క్షమలు, ఇంకా ఆయన సంక్లిష్ట లైంగికేచ్ఛలు అన్నీ అక్షరాల్లోకి తెచ్చాడు. కిటికీలోంచి సముద్రం మీద కనబడే సూర్యోదయాన్ని చూస్తూ అనుభవించే తన్మయత్వంలా రాతను మలిచాడు. చరిత్రకారుడు, తాత్వికుడు, మానసిక శాస్త్రజ్ఞుడు, రాజకీయాంశాల వ్యాఖ్యాత, ఇంకా ‘పర్వర్టు’, ఇంకా ఒక కవి– ఇలా ఆరుగురు ప్రూస్టులు ఇందులో కనబడతారంటారు ఆడమ్ గోప్నిక్. సంగీతం, సాహిత్యం, యుద్ధం, సమాజం, పెయింటింగ్, శృంగారం, కళలు, అసూయ, ఫ్యాషన్లు– ఇలా ప్రూస్ట్ అభిప్రాయానికి చిక్కకుండా మిగిలిపోయేది ఏదీ ఉండదు. ‘తన జీవితపు మెటీరియల్‌ను ఇంత బాగా ఏ రచయితా వాడుకోలేదు’ అంటారు టెన్నెస్సీ విలియమ్స్. ‘ఒక రచయిత ఒకసారి చదివితే పూర్తయ్యేట్టయితే ఆ రచయిత పెద్దగా ఏమీ చెప్పనట్టు! హోమర్లాగా జీవితకాలం వెంటతెచ్చుకోగలిగే రచయిత ప్రూస్ట్’ అంటారు డేనియల్ మెండెల్సన్ . కలిగిన ఫ్రెంచ్–యూదు కుటుంబంలో పుట్టాడు మార్సెల్ ప్రూస్ట్ (10 జూలై 1871– 18 నవంబర్ 1922). ఐఫిల్ టవర్‌ను నిర్మించిన ఇంజినీర్ గుస్తావ్ ఐఫిల్... ప్రూస్టులకు సన్నిహితుడు. తొమ్మిదో ఏట నుంచే ప్రూస్టుకు ఉబ్బసంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలుండేవి. ప్యారిస్ ఉన్నత సమాజంలో ముందు కలియ తిరిగినప్పటికీ రానురానూ ఏకాంతంలోకి వెళ్లిపోయాడు. బయటి నుంచి వచ్చే పెద్ద శబ్దాలను కూడా భరించేవాడు కాదు. హైపర్ సెన్సిటివ్. అందుకే పగలు పడుకొని రాత్రుళ్లు రాయడం అలవాటు చేసుకున్నాడు. ‘నిశాచర సరస్వతి!’. కల్పనతో కూడిన తన ఆత్మకథలోని మొదటి భాగమైన ‘స్వాన్స్ వే’ను ఎవరూ ప్రచురించడానికి ముందుకు రాలేదు. దాంతో సొంత డబ్బుతో అచ్చు వేయించుకున్నాడు. దాన్ని తిరస్కరించినవారిలో అప్పటి ప్రఖ్యాత రచయిత ఆంద్రే గిదె కూడా ఒకరు. ‘నా జీవితంలో నేను చేసిన అత్యంత పెద్ద తప్పిదం’ అని ఆయన తర్వాత పశ్చాత్తాపపడ్డారు. తన మృత్యువు సమీపంలో ఉందని ప్రూస్ట్‌కు తెలుసు. తన రచన ఎక్కడ పూర్తవ్వదో అనే ఆందోళన ఉండేది. నాలుగు భాగాలు ప్రూస్ట్ బతికి ఉన్నప్పుడే వచ్చాయి. ఆయన రాసుకున్న డ్రాఫ్టుల ఆధారంగా తర్వాతి మూడు భాగాలు ఆయన తమ్ముడు రాబర్ట్ ప్రూస్ట్, రచయిత జాక్వెస్ రివియేరీ సంపాదకులుగా వచ్చాయి. ఇందులో ఐదో భాగం అయిన ‘ద ప్రిజనర్’ సరిగ్గా నూరేళ్ల కింద 1923లో వచ్చింది. ఇది అనారోగ్యంతో ప్రూస్ట్ చనిపోయాక విడుదలైన మొదటి భాగం. ఇప్పుడు ఆంగ్లంలో ప్రామాణిక అనువాదంగా పరిగణిస్తున్నది బ్రిటిషర్ అయిన సి.కె.స్కాట్ మాంక్రీఫ్ చేసినది. ఆయన పెట్టిన పేరు ‘రిమెంబ్రన్స్ ఆఫ్ థింగ్స్ పాస్ట్’. చాలా ఏళ్లు ఈ పేరుతోనే వ్యాప్తిలో ఉన్నప్పటికీ, ఈ అనువాదానికి తర్వాత మెరుగులు దిద్దినవారిలో ఒకరైన డి.జె.ఎన్ రైట్ నవల పేరును ‘ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ టైమ్’గా మార్చారు. ఈ శీర్షికే ప్రూస్ట్ మానసిక ప్రపంచానికి దగ్గరగా ఉండి, స్థిరపడిపోయింది. ప్రూస్ట్ ఇల్లియర్స్ అనే చోట తన చిన్నతనం గడిపాడు. దాని ఆధారంగానే ‘కోంబ్రీ’ని సృష్టించాడు. 1971లో ప్రూస్ట్ శతాబ్ది సందర్భంగా దానికి ‘ఇల్లియర్స్–కోంబ్రీ’గా నామకరణం చేసి రచయిత పట్ల గౌరవం చాటుకున్నారు. జీవితం లోంచి సాహిత్యంలోకి వచ్చిన పేరు, మళ్లీ సాహిత్యం లోంచి జీవితంలోకి వచ్చింది. ఒక కొత్త మనిషిని అర్థం చేసుకోవడానికి పాత్రికేయులు ‘ప్రూస్ట్ ప్రశ్నావళి’(ప్రూస్ట్ క్వశ్చనెయిర్) అని అడుగుతుంటారు. మన జీవితానికి దగ్గరగా వెళ్లాలంటే– నేనెవరు? ఈ జీవితంతో ఏం చేసుకోవాలి? అనే ప్రశ్నలను అన్వేషిస్తూ జీవిత సాగరాన్ని అన్వేషించిన ప్రూస్టియన్ ప్రపంచంలోకి వెళ్లాలి. -
ఎదుగుదల వాయిదా!
బాపట్లకు చెందిన చిట్టిబాబు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. వయసు 40 దాటడంతో ఆరోగ్యంపై దృష్టిపెట్టాలనుకున్నాడు. ‘రేపటి నుంచి మార్నింగ్ వాక్ చేయాలి’.. అని నిర్ణయం తీసుకుని ఉదయం 5 గంటలకు అలారం పెట్టుకున్నాడు. తెల్లారింది.. అలారం మోగడం మొదలైంది. నిద్రమత్తులోనే చిట్టిబాబు అలారాన్ని ఆపి.. ఈ రోజు గురువారం.. అటూఇటు కాకుండా ఈ రోజే మొదలెట్టాలా? సోమవారం నుంచైతే ఓ క్రమపద్ధతిలో ఉంటుంది కదా అనుకుని.. వచ్చే సోమవారానికి వాయిదా వేసుకుని మళ్లీ ముసుగుతన్నాడు. సోమవారం ఉదయాన్నే అలారం మోగడంతో భారంగా నిద్రలేచాడు. వాకింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో అతడి మెదడులో తళుక్కున ఓ ఆలోచన మెదిలింది..ఎటూ మూడు రోజుల్లో ఈ నెల ముగిసిపోతుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వాకింగ్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందబ్బా.. అని ఆలోచించాడు. తన ఆలోచన కరక్టే అనిపించింది. ఒకటో తేదీ అయితే లెక్కించుకోడానికి కూడా సులువుగా, అనువుగా ఉంటుందనుకుంటూ.. వాకింగ్‌కు వెళ్లే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఒకటో తేదీ కూడా రానే వచి్చంది.. ఆ రోజు బుధవారం. మరీ వారం మధ్యలో ఎందుకు? సోమవారం నుంచి నడుద్దాంలే.. అని వాయిదా వేశాడు. మళ్లీ సోమవారం రాగానే.. ఆపై సోమవారానికి వాయిదా. ఇలా రెండేళ్లుగా వాయిదాల పరంపర కొనసాగుతూనే ఉంది గానీ.. మార్నింగ్ వాక్కు మాత్రం అడుగు ముందుకు పడలేదు. వాకింగ్ మొదలెడదామనుకున్న రోజు రాగానే ఏదో ఒక కారణాన్ని వెతుక్కోవడం.. ఆ సాకుతో వాయిదా వేసుకుని, ఆ క్షణానికి హమ్మయ్యా.. అని ఊపిరిపీల్చుకోవడం పరిపాటిగా మారింది. – తమనంపల్లి రాజేశ్వరరావు, ఏపీ సెంట్రల్ డెస్క్ ఒక్క చిట్టిబాబు విషయంలోనే కాదు.. దాదాపు అందరి జీవితంలోనూ ఏదో ఒక సందర్భంలో ఇలాంటి వాయిదా ఘటనలు ఉండే ఉంటాయి. ఒక్కసారి ఈ వాయిదా సంస్కృతికి అలవాటు పడితే.. మన ఎదుగుదలను, అభివృద్ధిని వాయిదా వేసుకున్నట్టే లెక్క. విలువైన కాలాన్ని హరించి వేస్తుంది. వాయిదా వేయడం.. ఆ సమయానికి ఎంతో రిలీఫ్‌నిస్తుంది. చేయాల్సిన పనిని ‘తర్వాత చేద్దాంలే..’ అనుకోవడం ఆ క్షణానికి ప్రశాంతతనిస్తుంది. కానీ ఆ వాయిదా తాలూకు పర్యావసానం నష్టాన్ని కలిగించినప్పుడు తల పట్టుకుని కుమిలిపోతుంటారు. ఇలా డిప్రెషన్లోకి వెళ్లిపోయే ప్రమాదమూ లేకపోలేదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చూద్దాంలే.. చేద్దాంలే.. అనేవి జీవితాన్ని వెనక్కి లాగే విషయాలని, వీటి నుంచి ఎంత త్వరగా బయటపడగలిగితే అంత మంచిదంటున్నారు. మనం ఇలా ఆలోచిస్తే.. మెదడు అలా ఆదేశిస్తుంది.. సాధారణంగా మనకు ఒత్తిడి కలిగించేవాటిని వాయిదా వేయమని మెదడు చెబుతుంది. పరీక్షల కోసం చదవడం, ఉదయాన్నే లేచి నడవడం వంటివి మానసికంగా భారంగా ఉండే పనులు. ఎక్కువగా ఇలాంటి వాటినే వాయిదా వేయాలని మెదడు చెబుతూ ఉంటుంది. ఇలాంటి వారిలో ఎక్కువ మంది డిప్రెషన్, మానసిక ఆందోళనల బారిన పడే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫోన్లో మునక నుంచి బయటి కొద్దాం.. ఏ పనినైనా అనుకున్న సమయానికి పూర్తిచేయాలంటే ఫోన్‌కు దూరంగా ఉండటం మంచిది. ఫోన్ అనేది మనకు తెలియకుండానే సమయాన్ని హరిస్తుంది. మనలో అంతులేని బద్దకానికి కారణమవుతుంది. ఫోన్ చేతిలో ఉందంటే చాలు.. ఇక ఏపనైనా ‘ఆ చేయొచ్చులే..’ అనిపించే నీరసం, ‘ఇప్పుడే చేయాలా..’ అనేంత బద్దకం, ‘చేయలేక చస్తున్నా..’ అనుకునేంత నిస్తేజం మనల్ని ఆవహించేస్తాయి. అందుకే ఫోన్‌కు దూరంగా ఉంటే ఈ వాయిదా అలవాటు నుంచి బయటపడే అవకాశం ఉంది. అందరిలో ఉండే లక్షణమే గానీ.. పనులు వాయిదా వేయడం అనేది టైం మేనేజ్మెంట్ సమస్య అని చాలామంది అనుకుంటారు. వాస్తవానికి ఇది ఎమోషనల్ రెగ్యులేషన్ సమస్య. ఏదైనా ఒక పని మనలో ఒత్తిడిని కలిగిస్తే.. మెదడులోని దానికి సంబంధించిన భాగం ఆ పనిని వాయిదా వేయాలని ప్రేరేపిస్తుంది. దీంతో మనం ఆ పనిని వాయిదా వేస్తాం. అందుకే వాయిదా వేయడాన్ని ఓ డిఫెన్స్ మెకానిజంగా పరిగణించవచ్చు. ఇది అందరిలో ఉండే లక్షణమే గానీ, ఇది క్రానిక్‌గా మారినప్పుడు మాత్రం సైకాలజిస్టులను సంప్రదించాల్సి ఉంటుంది. కాగి్నటివ్ బిహేవియర్ థెరపీ, మైండ్ ఫుల్నెస్ ట్రైనింగ్, బిహేవియర్ షేపింగ్, ఎపిసోడిక్ ఫ్యూచర్ థింకింగ్ వంటి పద్ధతులు ఉపయోగించి వాయిదా వేసే లక్షణాన్ని సైకాలజిస్టులు తగ్గిస్తారు. – బి.కృష్ణ, సైకాలజిస్ట్ మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ పనులు వాయిదా వేయడం అనేది మెదడులోని లింబిక్ సిస్టం, ప్రీ ఫ్రొంటల్ కార్తెక్స్ మధ్య ఘర్షణతో సంభవిస్తుందని న్యూరో సైన్స్ చెప్తుంది. ఈ లక్షణం విద్యార్థుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌లో 81 శాతం మంది పనులు వాయిదా వేస్తున్నారని ఒక సర్వేలో తేలింది. పనులు వాయిదా వేయడానికి కొన్ని మానసిక కారణాలున్నాయి. మోటివేషన్ లేకపోవడం, ఓటమి భయం, ఒత్తిడి, స్వీయ విమర్శలు తదితరాలు ఓ వ్యక్తి పనులు వాయిదా వేయడానికి కారణమవుతాయి. వాయిదా లక్షణం మహిళల కంటే పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వాయిదా వేసే లక్షణం దైనందిక జీవితానికి ఇబ్బంది కలిగించే స్థాయికి చేరుకుంటే మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది. – బి.అనితజ్యోతి, సైకాలజిస్ట్ ‘వాయిదా’పై నిపుణులు ఏమంటున్నారంటే.. ఒక పనిని వాయిదా వేయడానికి ముఖ్య కారణం ఆ పని చేయడానికి ఆసక్తి లేకపోవడంతో పాటు ఉత్సాహ లేమిని కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. మనం ఇంతకు ముందు చెప్పుకొన్నట్టు ఆ పని మనకు ఒత్తిడి కలిగించేది, లేదా మానసికంగా భారంగా అనిపించేదై ఉంటుంది. ఒక పనిని ఒక్కసారి వాయిదా వేశామంటే.. మళ్లీ మళ్లీ వాయిదా వేసేందుకే మన మెదడు మొగ్గు చూపుతుంది. బద్దకం, సోమరితనం కూడా ఈ వాయిదా పరంపరకు ప్రధాన కారకంగా నిలుస్తున్నాయి. అసలు ఎలాంటి కారణం లేకుండా కూడా పనులు వాయిదా వేస్తూ అదో రకమైన మానసిక ఆనందాన్ని పొందుతుంటాం. చాలా కోల్పోతున్నాం వాయిదా వేసిన పనిని పూర్తిచేయలేక దాని తాలూకు నష్టాన్ని మూటగట్టుకుంటాం. వాయిదాల వల్ల తరచూ ఇలానే జరగడంతో ఆందోళన, భయానికి లోనవుతాం. మనమీద మనకు నమ్మకం సన్నగిలి.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాం. ఇది మన నిద్రను ప్రభావితం చేస్తుంది. మనకు నిద్రలేని రాత్రులను మిగులుస్తుంది. ఫలితంగా మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది.. ఇలా అధిగమిద్దాం.. ఒక పనిని చేయడంలో హాయిని అనుభవించాలి గానీ.. ఒత్తిడిని దరిచేరనీయ కూడదు. ఈ వాయిదా వేయడం అనే దాన్ని మన ఎదుగుదలను నియంత్రించే రుగ్మతగా భావిస్తూ.. దాని బారిన పడకుండా ఉండాలంటూ మనసుకు ఆదేశాలిచ్చుకుంటూ.. మనసును పూర్తిగా మన నియంత్రణలో ఉంచుకోవాలి. ఏదన్నా పని మొదలెట్టామంటే.. దానికి అంకితమైపోవాలి. అది పూర్తయిందాకా వెనకడుగు వేయకూడదు. వాయిదా సంస్కృతి అనేది మన ఉన్నతిని, ఎదుగుదలను నిలువరించే ఓ సోమరిపోతు. ఈ జీవన పరుగు పందెంలో తోటివారితో పాటు మన అడుగుల్ని ముందుకు పడనీయకుండా అనుక్షణం వెనక్కి లాగుతూ.. మనల్ని ఓ మాయా ప్రపంచంలోని నిష్క్రియా స్థితికి తీసుకెళ్లే ఓ మత్తుమందు. దీని విషయంలో మనం అప్రమత్తంగా, అనుక్షణం జాగరూకతతో ఉండాలి. పనిని విభజించుకోవాలి. ఓ టైం టేబుల్ వేసుకుని ఆ సమయానికి ఎట్టి పరిస్థితుల్లో ఆ పనిని పూర్తిచేసి తీరాలి. ఒక సామెత చెప్పినట్టు.. రేపు మనం చేయాలనుకుంటున్న పనిని ఈ రోజే.. ఈ రోజు ఏం చేయాల్సి ఉందో దానిని ఇప్పుడే చేసెయ్యాలి. పోషకాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా యోగా లేదా వ్యాయామం, ధ్యానం చేయాలి. -
తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ ఘనత: దిగ్గజ కంపెనీల ప్లేస్ ఎక్కడ?
TIME World100 Best Companies List Infosys ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ టైమ్ ప్రపంచంలోని 100 అత్యుత్తమ కంపెనీల లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది. అంతేకాదు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ సంస్థ ఇన్ఫోసిస్ మాత్రమే కావడం విశేషం. ప్రపంచ దిగ్గజ కంపెనీలకు ధీటుగా 64 వ స్థానంలో ఇన్ఫీ తనప్రత్యేకతను చాటుకుంది. అలాగే ప్రపంచంలోని తొలి మూడు ప్రొఫెషనల్ సేవల కంపెనీలలో ఒకటిగా కూడా ఇన్ఫోసి నిలిచింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్న కంపెనీల ర్యాంకింగ్‌లో మొత్తం 750 కంపెనీలను పేర్కొన్నాయి. అయితే ఇన్ఫోసిస్‌తో పాటు, మరో ఏడు భారతీయ కంపెనీలు 750 కంపెనీలున్న టైమ్ జాబితాలో ప్లేస్ దక్కించుకున్నాయి. టైమ్ మ్యాగజైన్ , ఆన్లైన్ డేటా ప్లాట్‌ఫారమ్ స్టాటిస్టా సంకలనం చేసిన 2023 ప్రపంచ అత్యుత్తమ కంపెనీల టాప్ 100 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ కంపెనీ ఇన్ఫోసిస్. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్, యాపిల్, ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృసంస్థ) మెటా లాంటి టెక్ కంపెనీలు టాప్‌లో ఉన్నాయి. రాబడి వృద్ధి, ఉద్యోగుల సంతృప్తి సర్వేలు , పర్యావరణ హిత విధానాలు, సామాజిక , కార్పొరేట్ గవర్నెన్స్ (ESG, లేదా సుస్థిరత) డేటా ఆధారంగా ఆ ర్యాంకింగ్‌లను కేటాయించారు. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించిన తయారీదారులు, వినియోగ వస్తువుల కంపెలు, ఫాస్ట్ మూవింగ్ టెక్ ర్యాంకింగ్లున్నాయి. Infosys has been featured in TIME World’s Best Companies 2023 list. We are among the top 3 global professional services firm and the only brand from India in the Top 100 global rankings: https://t.co/Mvg9lRFxDV pic.twitter.com/dN6n0p76ZA — Infosys (@Infosys) September 14, 2023 టెక్ కంపెనీలు బాగా పనిచేశాయి. ఎందుకంటే వాటి కార్బన్ ఉద్గారాలు విమానయాన సంస్థలు, హోటళ్లు లేదా పెద్ద తయారీదారులు వంటి ముఖ్యమైన భౌతిక పాదముద్రలు కలిగిన ఇతర రకాల కంపెనీల కంటే చాలా తక్కువగా ఉన్నాయని టైమ్ పేర్కొంది. వారి ఉద్యోగులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇది కూడా వారు కూడా మంచి ర్యాంక్‌ను పొందడానికి కారణం. ఉద్యోగుల ర్యాంకింగ్‌లలో తొలి నాలుగు కంపెనీలు అత్యధిక మార్కులు పొందాయి. గత మూడేళ్లలో గణనీయ మైన లాభాలను పోస్ట్ చేసారు. వారు సామాజిక పాలన సూత్రాలకు కట్టుబడి ఉన్నారు. అలాగే ఉద్గారాలను తగ్గించడంతో కృషి, వారి వారి బోర్డులలో ఎక్కువ మంది మహిళలను నియమించడం వంటివి దోహద పడ్డాయని తెలిపింది. ఇక ఈ జాబితాలో విప్రో లిమిటెడ్ 174వ స్థానంలో, మహీంద్రా గ్రూప్ 210వ స్థానంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 248వ స్థానంలో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ 262వ స్థానంలో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 418వ స్థానంలో, WNS గ్లోబల్ సర్వీసెస్ 596వ స్థానంలో, ఐటీసీ లిమిటెడ్ 596వ స్థానంలో నిలిచాయి. -
మనోళ్ల ‘హెల్త్ కవర్’ అంతంతే..!
సాక్షి, హైదరాబాద్: జీవిత బీమా, హెల్త్ కవర్–ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా కవరేజీ వంటి విషయాల్లో భారతీయులు అంత చురుకుగా వ్యవహరించడం లేదనే అభిప్రాయం ఉంది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో జీవిత బీమా, సరైన ఆరోగ్య రక్షణలు లేనివారు రూ. 20 వేల కోట్లకు పైగానే కరోనా సంబంధిత ఆరోగ్య సమస్యలపై చికిత్స కోసం వ్యయం చేయాల్సి వచ్చిదనే అనధికార అంచనాలున్నాయి. కరోనా కేసులు ఉధృతంగా ఉన్న రోజుల్లో ఎదురైన పరిస్థితుల కారణంగా మధ్య, దిగువ, పేద వర్గాల ప్రజలకు చెందిన వారు తీవ్రమైన ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్న ఉదంతాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి అనంతర పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి అని 46 శాతం మంది భావిస్తున్నారు. ఇప్పుడు పెరుగుతున్న వైద్యఖర్చులకు ఈ హెల్త్ పాలసీలు ఉపయోగపడతాయని 43 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఇదీ అధ్యయనం... తాజాగా భారతీయ టెక్–ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ–అక్నో అధ్యయనంలో వివిధ అంశాలు వెల్లడయ్యాయి. 68 శాతం మందికి రూ.10 లక్షలలోపే ఆరోగ్య బీమా కవరేజీ ఉందని, వారిలోనూ 27 శాతం మందికి మెడికల్ కవర్ రూ. 5 లక్షలలోపే ఉన్నట్టుగా ఇది స్పష్టం చేసింది. దేశంలోని ఆరు మెట్రో నగరాల్లోని 28–55 ఏళ్ల మధ్య వయసున్న వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ సంస్థ నివేదికను సిద్ధం చేసింది. అన్లిమిటెడ్ కవరేజీ, కన్జుమబుల్స్, రూమ్‌రెంట్ క్యాపింగ్ వంటి వాటిపై పాలసీ హోల్డర్లకు అంతగా అవగాహన ఉండటం లేదన్న విషయం నివేదికలో వెల్లడైంది. -
ఆ రోజే రాఖీ పండుగ ఎందుకు? భద్రకాలం అంటే..?
ప్రతి ఏడాది రాఖీ పండుగ చక్కగా జరుపుకునేవాళ్లం. కానీ ఈసారి మాత్రం ఎప్పుడు జరుపుకోవాలనే కన్ఫ్యూజన్ తలెత్తింది. అసలు ఏ రోజు ఈ పండుగ జరుపుకోవాలనేది ఒకటే గందరగోళం. కొందరూ ఆ రోజుని మరొకరు వేరొకటి ఇలా చెప్పుకుంటూ పోతున్నారు. అసలు ఎందుకి గందరగోళం వచ్చిందో, ఎప్పుడూ రాఖీ కట్టాలో తదితర విషయాలు చూద్దాం!. ఈ నెల 30న పౌర్ణమి ఘడియలు ఉన్నా.. హిందూ క్యాలెండర్ ప్రకారం రాఖీ 31 తేదీల్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు. అయితే 30న పౌర్ణమి ఘడియలు ఉన్నా రాత్రి 9.10 నిమిషాల వరకు భద్ర కాలం ఉందని ఈ సమయంలో రాఖీ కడితే తోబుట్టువులకు దోషమని పండితులు చెబుతున్నారు. అందుకే 31న ఉదయం 6.30 నుంచి 9.45 లోపు రాఖీ కట్టుకోవాలి. అలాగే 10.50 నుంచి 11.50 లోపు మధ్యాహ్నం 12.30 నుంచి 2.45 వరకు, సాయంత్రం 3.45 నుంచి 6 గంటల వరకు కట్టుకోవచ్చని ఇవి పండుగను జరుపుకునే శుభ ఘడియలని పండితులు వెల్లడించారు. కాబట్టి ఈ విషయాలు తెలుసుకుని మీ సోదరులకు మేలు జరగాలని కోరుకుంటూ పండగను సంతోషంగా జరుపుకోండి. ఇంతకీ భద్రకాలం అంటే..?? భద్రకాలం గురించి తెలియాలంటే పురాణాల్లోకి వెళ్లాలి. లంకాధిపతి రావణాసురుడు గురించి అందరికీ తెలిసిందే. ఈయన సోదరి భద్ర(శూర్పణఖ). ఈమె తన అన్నగారైన రావణుడికి పౌర్ణమి అనుకుని రక్షాబంధనాన్ని తప్పు సమయంలో కట్టింది. పౌర్ణమి రాకముందే చతుర్థశి రోజే ఈమె రక్షాబంధనం కట్టిన కారణంగానే రావణుడికి రాముడి చేతిలో మరణం సంభవించిందని చెప్పేవారు కూడా ఉన్నారు. మొత్తానికి పౌర్ణమికి ముందు ఉండే చెడు కాలాన్ని భద్రకాలం అని అభివర్ణిస్తున్నారు. అందువల్ల ఈ సమయంలో ఎవ్వరూ పొరపాటున కూడా తమ అన్నదమ్ముళ్ళకు రాఖీ కట్టకూడదు. ఇక పోతే మనం సౌరమానం ప్రకారమే పండుగలు జరుపుకుంటాం. సూర్యోదయం మొదలైన తర్వాత ఉన్న తిథినే ప్రధానంగా తీసుకుంటాం. బుధవారం ఉదయం చతుర్ధశి తిథి ఉంది. ఉదయం 10.30 నిమిషాల నుంచి పౌర్ణమి తిథి వస్తుంది. అందువల్ల బుధవారం చేసుకోము. గురువారం ఉదయం 9.45 నిమిషాల వరకు ఉండటంతో ఇక ఆరోజునే రాఖీపండుగ పరిగణించి జరుపుకుంటున్నాం. రక్ష కోసం కడుతున్నాం కాబట్టి అన్నా చెల్లెళ్ల ఇరువురికి మంచి జరిగేలా మంచి టైంలోనే కట్టుకుందా. మంచి సత్సంబంధాలనే కొనసాగిద్దాం. (చదవండి: రాఖీ పౌర్ణమి ఎప్పుడు ? బుధవారమా? గురువారమా?) -
టాక్స్ రిఫండ్స్: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త!
Income tax refund: ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ITRలు) దాఖలు చేసిన తర్వాత టాక్స్ రిఫండ్స్ విషయంలో ఆదాయపన్ను కీలక నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించిన యావరేజ్ ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించాలని ఆదాయపు పన్ను శాఖ యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న 16 రోజుల నుంచి 10 రోజులకు తగ్గింపుపై పన్ను శాఖ ఆలోచిస్తోంది. అంతేకాదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కొత్త టైమ్‌లైన్‌ను అమలు చేయాలని భావిస్తున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. కాగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి పెనాల్టీ లేకుండా ఐటీఆర్ ఫైల్ చేసేందుకు గడువుజూలై 31, 2023తో ముగిసిన సంగతి తెలిసిందే. తాజా లెక్కల ప్రకారం చాలామంది ఇప్పటికే ఐటీఆర్ ఫైల్ చేసిన పన్ను చెల్లింపుదారులు టాక్స్ రిఫండ్స్ దాదాపు అందుకున్నారు. అయితే మరికొంతమంది మాత్రం టాక్స్ రిఫండ్ కోసం ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది.వార్షిక ITRను ఫైల్ చేసేటప్పుడు అసెస్సీ ఉపయోగించే ఎంపికపై ఆధారపడి, రీఫండ్ ఎలక్ట్రానిక్ మోడ్ అంటే ఖాతాకు నేరుగా క్రెడిట్ లేదా రీఫండ్ చెక్ ద్వారా గానీ చెల్లిస్తారు. ఈ రీఫండ్ ప్రాసెస్‌ను సంబంధిత పోర్టల్‌లో చెక్ చేసుకోవచ్చు. రీఫండ్ ఆలస్యం అయితే ఏమి చేయాలి? ప్రతిస్పందన కోరుతూ ఆదాయపు పన్ను శాఖ నుండి ఏదైనా కమ్యూనికేషన్ వచ్చిందా లేదా అని ఈమెయిల్లో చెక్ చేసుకోవాలి ఒక వేళా అలాంటి ఇమెయిల్ ఎదైనా వస్తే వీలైనంత త్వరగా ప్రతిస్పందించడం చాలా ముఖ్యం. ఒకవేళ ITR స్టేటస్ రీఫండ్ గడువు ముగిసినట్లు చూపితే, 90 రోజుల చెల్లుబాటు వ్యవధిలోపు చెల్లింపు కోసం వాపసు సమర్పించబడలేదని అర్థం.ఈ సందర్బంగా టాక్స్‌పేయర్ రీఫండ్ రీ-ఇష్యూ రిక్వెస్ట్ పంపవచ్చు. రీఫండ్ స్టేటస్‌పై చాలా క్వెరీలువస్తున్నాయని, ఇ-ఫైలింగ్ తర్వాత తిరిగి చెల్లించాల్సిన పన్ను చెల్లింపుదారులకు చెల్లింపును వేగవంతం లోకి ఇది మంచి చర్య అని క్లియర్ ఫౌండర్సీఈవో అర్చిత్ గుప్తా అన్నారు. ఈఏడాది పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు సకాలంలో దాఖలు చేశారని (31 జూలై 2023 వరకు 6.77 కోట్ల ఐటీఆర్‌లు) అందువల్ల వాపసులను త్వరగా ప్రాసెస్ చేస్తారనే అంచనా ఉందన్నారు. -
కాలం కార్ఖానా
కాలం ఒక కార్ఖానా. మనం నేల మీద పడిన క్షణం నుంచి కాలం కార్ఖానాలో మన కోసం ఉత్పత్తి మొదలైపోతుంది. ఆ ఉత్పత్తులలో మనకు కావలసిన రకరకాల ఆహార్యాలు, ఆలోచనలు, రుచులు, అభిరుచులు, అలవాట్లే కాదు; వాటిని నియంత్రించే హద్దులూ ఏర్పడిపోతాయి. పుట్టిన మరుక్షణం నుంచి కాలం మనకు తెలియకుండానే మనతో కలసి నడుస్తుంది, మనల్ని నడుపుతుంది. కానీ మనం ఆ సంగతి గుర్తించం, మనల్ని మనమే నడుపుకుంటున్నామనుకుంటాం. అంతా మన ప్రయోజకత్వమేననుకుని విర్రవీగుతాం. కాలాన్ని కేలండర్‌గా మార్చి గోడకూ; గడి యారంగా మార్చి మణికట్టుకూ బంధించామనుకుంటాం. కానీ గుప్పిట్లో నీళ్ళు వేళ్ళ సందుల్లోంచి జారిపోయినట్టుగా కాలం కూడా ఏ బంధనాలకూ లొంగకుండా జారుకుంటూనే ఉంటుందన్న వాస్తవం మన తెలివిని నిరంతరం వెక్కిరిస్తూనే ఉంటుంది. కాలంలో ఒకానొకనాడు మనిషి నగ్నత్వాన్నే ఒంటికి చుట్టుకున్నాడు. తర్వాత తర్వాత ఒళ్ళంతా వస్త్రంతో కప్పుకోవడమే సంస్కారంగా, నాగరికతగా మారింది. మొన్నటికి మొన్న, తగినంత తిండికీ, చాలినంత ఆచ్ఛాదనకూ నోచుకోని ఈ దేశంలోని కోట్లాది నిరుపేదల బతుకు టద్దంగా మారుతూ మోకాళ్ళు దాటని అంగవస్త్రాన్ని మొలకు చుట్టుకోవడం ఆదర్శం కాదు, అవసరమనుకున్నాడు మహాత్మా గాంధీ. ఆ తర్వాత స్త్రీ పురుష వస్త్రధారణ అనేకానేక మార్పుల మలుపులు తిరుగుతూ ఒంటినిండా కప్పుకోవడమనేది ‘అనాగరికం’గా మారి గాంధీగారి అంగవస్త్రంలా మోకాళ్ళు దాటని షార్ట్స్ ధరించడం అతి నవీనమైన పోకడగా మారింది. కాలం చేసే చిత్రాలు అలా ఉంటాయి. అది మన పట్టు తప్పించుకుంటూ ముందుకే కాదు, వెనక్కీ, పక్కలకీ కూడా పరుగులెడుతూ మనతో ఆడుకోగలదు. కాలం అఖండంగా ఉంటూనే నిన్న, నేడు, రేపు రూపంలో ఖండితంగానూ ఉంటుంది. కానీ మన ఊహాపోహలకు, జీవనగమనానికి మేకులు దిగేసి వర్తమానమనే కట్టుకొయ్యకు బంధించి ఉంచుతుంది. కవి ఎంత క్రాంతదర్శి అయినా ఆ మేకుబందీ నుంచి పూర్తిగా తప్పుకోలేడు. రేపటి కాలంలో పోస్ట్ మ్యాన్ ఆరోవేలుగా మారబోతున్నాడని తెలిసి ఉంటే దేవరకొండ బాలగంగాధర తిలక్ ప్రసిద్ధ కవిత ‘తపాలా బంట్రోతు’ ఏ రూపం దిద్దుకొని ఉండేదో! ‘దేశాంతరగతుడైన ప్రియుడి వార్త’ మొబైల్ రూపంలో అరచేతి దూరంలో ఉన్న ఈ రోజున, ఏ అమ్మాయీ ‘పద్దెని మిదేళ్ళ పడుచుదనాన్ని భద్రంగా దాచి పళ్లెరంలో పెట్టి ప్రాణనాథుడి కందించా’లనే ఆశతో, ‘చూపులు తుమ్మెద బారులు కట్టి’ పోస్ట్ మ్యాన్ కోసం ఎదురుచూడాల్సిన అవసరమే లేదు. చిరునవ్వుతోనే కబురు లేదని చెప్పి వెళ్లిపోతున్న తపాలా బంట్రోతు వెనుక ఆ కళ్ళు ‘విచ్చిన రెండు కల్హార సరస్సులు’ కావలసిన అవసరమూ లేదు. అలాగని ప్రియుడి వార్త కోసం పడుచు దనం పడే ఆరాటం కాలభేదాలకు అతీతంగా నిత్యనూతనమూ అవుతుంది కనుక ఒక అపురూప భావస్పందన కలిగించే కవితగా అది భవిష్యత్తులోకి తన అస్తిత్వాన్ని పొడిగించుకుంటూనే ఉంటుంది. మరోపక్క గతకాలపు చరిత్ర శకలంగానూ మారుతుంది. గతంపై మసక తెర కప్పి మాయ చేయడం కాల స్వభావాలలో ఒకటి. మన పాదముద్రలు గతంలోకి వ్యాపించి ఉన్నాయన్న ఎరుక తప్పి, మన నడక వర్తమానంలోనే మొదలైందని అపోహ పడతాం. నేడు మన కళ్ళముందు ఉన్నవే నిత్యాసత్యాలు కావనీ, మొదటి నుంచీ ఈ ప్రపంచం ఇలాగే లేదనీ కొంత తెలిసినా కొంత తెలియనట్టే భ్రమావలయంలో గడుపుతూ ఉంటాం. ఎన్నో రకాల నియంతృత్వాలను దాటి ప్రజాస్వామ్యంలోకి వచ్చామనీ, అది కూడా ఇంకా ప్రయోగ దశలోనే ఉంది తప్ప పూర్తిగా పాదుకోలేదనీ, నేటి మన అనేకానేక సమస్యలు, సంక్షోభాల మూలాలు గతంలో ఉన్నాయనీ, వాటి పరిష్కారాల వెతుకులాటలో వందలు, వేల సంవత్సరాల గతంలోకి మన చూపుల నిడివి పెంచుకోవాలనే ఊహ రాకుండా మన బుద్ధికి కాలం దడి కడుతుంది. వర్తమానాన్ని ఒక మత్తుమందులా అలవాటు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వాఙ్మయ పరిణామ క్రమాన్నే కనుక చూస్తే, క్రతు సంబంధమైన తంతు నుంచి మూకాభినయమూ, దాని నుంచి నాట్యమూ, నాట్యం నుంచి నాటకమూ ఎలా అభివృద్ధి చెందాయో; క్రతు సందర్భ గానం నుంచే పాట పుట్టి కావ్యస్థాయికి ఎలా పెరిగిందో; అనేకమంది అజ్ఞాతకర్తలు కలిగిన మౌఖిక సంప్రదాయం నుంచి, ఏక కర్తృకమైన లేఖన సంప్రదాయానికి వాఙ్మయం ఎలా పరివర్తన చెందిందో చెప్పే ఆసక్తికరమైన అధ్యయనాలు ఈరోజున అందు బాటులో ఉన్నాయి. అయినాసరే, నాట్యం, నాటకం, పాట, పద్యం, వచనపద్యం, గద్యం, కథ, నవల వంటి వివిధ ప్రక్రియలను పరస్పర సంబంధం లేని భిన్న రూపాలుగా విడదీసి చూడడాన్ని కాలం మనకు అలవాటు చేసింది. మౌఖిక సంప్రదాయానికి, అనేక కర్తృకానికి చెందినవాటిని కూడా లిఖిత సంప్రదాయం నుంచీ, ఒక్కరే రచించారన్న భావన నుంచీ చూడడం కూడా కాలం మప్పిన అలవాటే. కాలం పోయే చిత్రగతులు మనిషిని మొదటినుంచీ తికమకపెడుతూ ఆలోచనకు లోనుచేస్తూనే ఉన్నాయి. మహాభారత కథకుడు కాలానికి చెప్పిన భాష్యంలో అసాధారణమైన లోచూపు కనిపించి ఆశ్చర్యచకితం చేస్తుంది. భూత, భవిష్యత్, వర్తమానాలకు చెందిన అన్ని భావాలూ కాలనిర్మితాలేనంటాడు. భావాలు మనిషివే కనుక మనిషీ కాలనిర్మితుడే నన్నమాట. కాలం గురించిన తెలివిడితోనే దాని మాయాజాలం నుంచి ఏ కొంచెమైనా తప్పించుకోగలం. -
తల్లిదండ్రులుగా..అదే పిల్లలకు ఇవ్వగల అత్యంత విలువైన కానుక!
పిల్లలకు మీ సమయాన్ని ఇస్తున్నారా? పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగల అత్యంత విలువైన కానుక ఏదైనా ఉందంటే అది కేవలం సమయం మాత్రమే. సమయం ఎందుకు విలువైనది అని అంటే, గడిచిన క్షణం అయినా తిరిగి రాదు. అందువల్ల వారితో విలువైన, నాణ్యమైన సమయాన్ని గడిపి, వారికి మంచి జ్ఞాపకాలను మిగల్చండి. వారితో గడిపేందుకు ఏమేం చేయవచ్చో చూద్దాం... మనం పిల్లలతో కలిసి చదవడం, పనిపాటలు చేయడం నుంచి ఆటలు ఆడటం వరకు..వారితో మీ బంధం బలపడడానికి, అనుబంధాలు అల్లుకోవడానికి తోడ్పడతాయి. పుస్తక పఠనం పిల్లలతో బంధాన్ని పెంచుకోవడానికి, వారి భాషానైపుణ్యాలను పెంపొందించడానికి పుస్తకపఠనం గొప్ప మార్గం. వయస్సుకి తగినవి, మీ పిల్లలు ఆనందిస్తారని మీరు భావించే పుస్తకాలను ఎంచుకుని వాటిని పిల్లలతో కలిసి బిగ్గరగా చదవవచ్చు లేదా వాళ్లే చదివి మీకు వినిపించేలా చేయవచ్చు. ఒకవేళ పుస్తకాలు లేకపోతే తెలుగు లేదా ఇంగ్లిష్ వార్తాపత్రికలు చదవడంతో దినచర్య ప్రారంభించడం మంచిది. కలిసి ఆటలు ఆడటం మీ పిల్లల సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఆటలు ఆడటం ఒక ఆహ్లాదకరమైన మార్గం. బోర్డ్ గేమ్‌లు, కార్డ్గేమ్లు, అవుట్డోర్ గేమ్‌లు వంటి అనేకరకాల ఇండోర్ లేదా ఓట్‌డోర్ గేమ్స్ పిల్లలతో ఆడచ్చు. చెస్, స్నేక్స్ అండ్ లేడర్స్ (పాముపటం), అష్టాచెమ్మా, పచ్చీస్ వంటివి పిల్లలతో కలిసి ఆడటం వల్ల వారిలో క్రీడానైపుణ్యాలు పెంపొందుతాయి. విహారయాత్రలకు వెళ్లడం పిల్లలు కొత్త విషయాలను అనుభూతించడానికి, వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఔటింగ్‌లకు వెళ్లడం గొప్పమార్గం. పార్క్, జూపార్క్, మ్యూజియం లేదా ఇంకేదైనా చూపించడానికి వారిని అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్లడం ద్వారా వారితో ఎక్కువ సమయం గడపవచ్చు. కళానైపుణ్యాన్ని పెంపొందించడం కళలు పిల్లలు తమను తాము నిరూపించుకోవడానికి, తమ నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కళలు ఒక ఆహ్లాదకరమైన చక్కటి మార్గం. మీరు మీ పిల్లలకు క్రేయాన్లు, మార్కర్లు, పెయింట్, క్లే వంటి ఆర్ట్ సామాగ్రిని సమకూర్చి, వాటితో వారు ఏమేం చేయాలనుకుంటున్నారో చెప్పించి, వాటిని తయారు చేసేందుకు వారితో కలిసి పనిచేయండి. వారికి కావలసిన వాటిని వారే తయారు చేసుకునేలా వారిని ప్రోత్సహించండి. గార్డెనింగ్ పిల్లలు ప్రకృతి, బాధ్యత గురించి తెలుసుకోవడానికి గార్డెనింగ్‌ని మించిన మంచి మార్గం మరోటి లేదని చెప్పొచ్చు. పిల్లలతో కలిసి మీ పెరట్లో కొన్నిమొక్కలు నాటవచ్చు. లేదా మీ డాబాపై కొన్ని కుండీలు ఏర్పాటు చేసి వాటిలో కూడా నాటవచ్చు. వాటికి రోజూ నీళ్లు పోయడం, అవి ఎలా పెరుగుతున్నాయో వారితో కలిసి చూడడం గొప్ప అనుభూతినిస్తుంది. మాట్లాడటం... మాట్లాడనివ్వటం పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి వారితో మాట్లాడటం, వారు చెప్పే కబుర్లు ఆసక్తిగా వినడం. వారి రోజువారి స్నేహితులు, వారి ఆసక్తులు, వారి కలల గురించి వారిని అడగండి. వారు చెప్పేది వినండి. అవసరం అయితే వారికి మీ మద్దతును, సహకారాన్ని అందించడం. కలిసి వంట చేయడం ఉదయం పూట చేసే బ్రేక్‌ఫాస్ట్ నుంచి, మధ్యాన్నం వారు తినే లంచ్ వరకు వారికి ఇష్టమైన వాటిని లేదా మీ ఇంట్లో ఉన్న వాటితో టిఫిన్లు, స్నాక్స్, లంచ్ ప్రిపేర్ చేయడంలో వారి సాయం తీసుకోవడం మంచి పద్ధతి. అంటే తప్పనిసరిగా వారు మీకు హెల్ప్ చేయాలని కాదు... ఆసక్తి ఉంటే వారే సాయం చేయడానికి వచ్చేలా చేసుకోగలిగితే చాలు. ఇది రోజూ కుదరకపోవచ్చు కానీ కనీసం వారికి సెలవురోజుల్లో అయినా సరే, కలిసి వంట చేసుకునే అలవాటు చేయడం మంచిది. వాకింగ్ లేదా సైక్లింగ్‌కు తీసుకెళ్లడం పిల్లలు పది పన్నెండేళ్లలోపు వారైతే వారిని మీతో కలిసి రోజూ వాకింగ్‌కు లేదా సైక్లింగ్‌కు తీసుకెళ్లండి. వారు శారీరకంగా చురుగ్గా ఉండేందుకు, మానసికంగా మీకు దగ్గరయ్యేందుకు మార్నింగ్ వాక్ మంచి మార్గం. అలా చేయడం ద్వారా వారు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. స్వచ్ఛంద సేవలో... పిల్లలు ఇతరులకు సహాయం చేయడం, ప్రపంచంలో మార్పు తీసుకురావడం గురించి తెలుసుకోవడానికి వాలంటీరింగ్ ఒక గొప్ప మార్గం. మీరు స్థానికంగా ఉండే ఆశ్రమాల్లో లేదా ఇతర సంస్థలో స్వచ్ఛందంగా సేవ చేయవచ్చు. (చదవండి: ఎలక్ట్రానిక్ వ్యర్థం ఏదైనా..అతడి చేతిలో శిల్పంగా మారాల్సిందే!) -
20 ఏళ్లపాటు వారానికో ఫొటో.. వయసొచ్చాక.. ‘సొగసు చూడతరమా’
సోషల్ మీడియాలో అద్భుతమైన ఫొటోలు, వీడియోలు షేర్ అవుతుంటాయి. తాజాగా ఒక డచ్ డైరెక్టర్ షేర్ చేసిన వీడియో అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. ఆ డైరెక్టర్ పేరు ఫ్రాన్స్ హాఫ్‌మెస్టర్. ఆయన ఒక టైమ్‌లాప్స్ వీడియో రూపొందించారు. ఈ వీడియో కోసం ఆయన 20 ఏళ్ల పాటు ప్రతీవారం తమ కుమార్తెకు ఫొటోతీస్తూ వచ్చారు. ఆ ఫొటోలన్నింటినీ ఇప్పుడు టైమ్‌లాప్స్ వీడియోగా రూపొందించారు. దీనిలో అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. 2 నిముషాల 18 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో అతని కుమార్తె చిన్నప్పటి నుంచి ఎలా రూపాంతరం చెందుతూ వచ్చి, నేడు అందమైన అమ్మాయిగా ఎలా మారిందో కనిపిస్తుంది. బాల్యం నుంచి నేటి వరకూ ఆమె ముఖంలో చోటుచేసుకున్న మార్పులను ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఈ ఫొటోలలో ఆమె స్టయిల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. డైరెక్టర్ ఫ్రాన్స్ హాఫ్‌మెస్టర్ ఈ వీడియోను సోషల్ మీడియా సైట్ రెడిట్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు ఆ తండ్రి కృషిని అభినందిస్తున్నారు. ఒక యూజర్... ఈ టైమ్ లాప్స్ వీడియోను ఆ అమ్మాయి చూసి తెగ మురిసిపోయి ఉంటుందన్నారు. ట్విట్టర్లో ఈ వీడియో @TansuYegen పేరుతో షేర్ అయ్యింది. ఈ వీడియోను ఇప్పటివరకూ ఒక మిలియన్‌మంది వీక్షించగా, 26 వేలకుపైగా లైక్స్ వచ్చాయి. ఇది కూడా చదవండి: ఇంటికి పేడ రాస్తే పిడుగు పడదట..! వింత గ్రామంలో విచిత్ర నమ్మకం! The father filmed his daughter's photo every week until she turned 20. 📸 pic.twitter.com/MNmOpEx0sk — Tansu YEĞEN (@TansuYegen) August 7, 2023 -
ఎక్కడికైనా 'లేటే'..టైంకి వచ్చిందే లే!: ఇదేమైనా డిజార్డరా!
కొందరూ ఎక్కడకి వెళ్లలన్నా.. 'లేటే'. టైంకి రావడం అన్నది వారి డిక్షనరీలోనే లేదు అన్నట్లు ఉంటుంది వారి వ్యవహారం. ఇక వాళ్లకి లేట్ కామర్స్ అనే ముద్ర కూడా ఉంటుంది. పాపం వాళ్లు రావాలనుకున్నా.. రాలేరు. ఎందువల్లో గానీ వాళ్లకు తెలియకుండానే 'ఆలస్యం' అనేది వారి వెనుకే ఉందన్నట్లు ఉంటుంది వారి స్థితి. చూసేవాళ్లకు కూడా వాళ్లకి ఏమైనా జబ్బా? ఎందికిలా ప్రతిసారి లేటు అని విసుక్కుంటారు. అసలు ఇదేమైన వ్యాధా? మరేదైనానా.. వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..ఇలాంటి స్థితిని 'సమయ అంధత్వం' అంటున్నారు. దీన్ని సమయపాలన లోపం లేదా సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని విధానం అని అంటున్నారు. అంతేగాదు దీన్ని వైద్య పరిభాషలో 'శ్రద్ధ లేకపోవడం' లేదా 'హైపర్ యాక్టివిటీ' డిజార్డర్‌గా పేర్కొన్నారు. ఒకరకంగా మానసిక ఆరోగ్య సమస్యలాంటిదేనని చెబుతున్నారు. వారికి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన లేకపోవడం, దీనికి శ్రద్ధ అనేది అస్సలు ఉండకపోవడం కారణంగానే వాళ్లు ఇలా దేనికైనా..లేటుగానే వస్తారని అన్నారు. ఆఫీస్ దగ్గర నుంచి వారు నిత్యం చేసే ప్రతిపనికి ఇలాంటి వ్యక్తులు ఆలస్యంగానే వెళ్తుంటారని పేర్కొన్నారు. దీంతో వీరు తరుచుగా వ్యక్తుల నిర్లక్ష్యానికి గురవ్వుతారు. స్నేహితులు, బంధువులు కూడా ఇలాంటి వ్యక్తులను దూరంగా ఉంచుతారు. ఇంటా, బయట వీరికి గౌరవం అనేదే ఉండదు. పాపం దీంతో వారు కూడా కాస్త అసహనానికి గురవ్వుతారు. అందుకోసం అని ఎంతలా ప్రయత్నించినా..చివరికి ఆలస్యమే అవ్వుతుంది. ఇలాంటి వ్యక్తులను ముందుగా 'లేటు' అనే పదాన్ని తొలగించుకోవాలని బలంగా అనుకోవాలి. అన్నిట్లకంటే ముందు ఆరోగ్య పరంగా హెల్తీగా ఉండాలి. సమయానికి నిద్రపోవాలి.. ఆ తర్వాత పని అని ఫిక్స్ అవ్వాలి. ఇందకోసం కొద్దిగా సాంకేతికతను వాడుకుంటూ సునాయాసంగా ఆ సమస్యను తొలగించుకోవచ్చు. అలారం పెట్టుకోవడం, ముఖ్యమైన అపాయింట్మెంట్లు, వెళ్లాల్సిన ప్రాంతాల గురించి వివరాలను ఓ పుస్తకంలో లేదా మొబైల్లోని రిమైండర్స్‌లో పొందుపరుచుకోవాలి. రోజు ఉదయం లేవగానే చేయాల్సినవి ఆ బుక్‌లో చూసుకుని తదనంతరం కార్యక్రమాలను ప్రారంభించాలి. యోగా వంటి వాటితో మనసుని ఎల్లప్పుడూ ఆహ్లాదంగా ఉంచుకోవాలి. ఏ పని పెండింగ్‌లో ఉండకుండా ప్రయత్నిస్తూ ఉంటే క్రమంగా ఆలస్యం అనే సమస్యను తేలిగ్గా జయించొచ్చు. అలాగే ఇలాంటి మానసిక సమస్యకు కొన్ని మాత్రలు కూడా ఉన్నాయని, వాటిని వైద్యుని పర్యవేక్షలో..వారి సలహాలు సూచనలు మేరకు వాడితే సాధ్యమైనంత తొందరగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: అలా చేయడం డైటింగ్ కాదు..ఈటింగ్ డిజార్డర్! అదోక మానసిక సమస్య) -
నడక చైర్‌లోని పసివాడు.. పైకప్పు కూలిపోయేంతలో.. వైరల్ వీడియో!
ఇంటర్నెట్లో ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియో కంబోడియాకు చెందినది. ఒక మహిళ తమ ఇంటి పైకప్పు కూలిపోతున్న సమయంలో తన పిల్లవాడిని ఎలా కాపాడిందనేది ఈ వీడియోలో ఉంది. కొన్ని సెకెన్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెటిజన్లను కన్నుతిప్పుకోనీయకుండా చేస్తోంది. ఫాక్స్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన రాజధాని నోమ్ పెన్హ్‌లో చోటుచేసుకుంది. వీడియో ఉన్న కంటెంట్ ప్రకారం పిప్‌సర్ అనే మహిళ ఒక పిల్లవాడిని ఎత్తుకుని కనిపిస్తుంది. గదిలో ముగ్గురు చిన్నపిల్లలు ఉంటారు. ఆ తల్లికి ఏదో శబ్ధం వినిపించగానే ఇద్దరు పిల్లలతో సహా బయటకు పరిగెడుతుంది. అయితే ఇంకో పిల్లాడు అక్కడే నడక చైర్లో ఉంటాడు. ప్రమాదాన్ని గ్రహించిన ఆమె ఆ నడకచైర్‌లో ఉన్న పిల్లవాడిని కూడా లాక్కుని బయటకు వచ్చేస్తుంది. ఇంతలో ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోతుంది. ఆ తల్లి నడకచైర్‌లో ఉన్న పిల్లవాడిని కాపాడటంలో ఒక్క క్షణం జాప్యం చేసినా, ఆ పసిపిల్లవాడు ప్రమాదం బారిన పడేవాడని వీడియో చూస్తే తెలుస్తుంది. ఈ ప్రమాదంలో పిల్లవాడిన కాపాడిన ఆ తల్లి ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ ఇంటిపై కప్పు మా మీద పడితే మేం చనిపోయేవాళ్లం. అందుకే మేము పరుగుపరుగున వచ్చేశాం అని తెలిపారు. ఇంటి యజమాని మీడియాతో మాట్లాడుతూ ఇంటి నిర్మాణం జరిగినప్పుడు వాటర్ ప్రూఫింగ్ సరిగా జరగలేదని, ఇప్పుడు కుర్తుస్తున్న భారీ వర్షాలకు ఇంటిపైకప్పు కుంగిపోయి, పడిపోయిందని తెలిపారు. నిర్మాణం సరిగా లేకపోవడం వలనే ఇలా జరిగిందన్నారు. అందుకే ఎవరైనా ఇంటిని కొనుగోలు చేసేముందు అన్ని అంశాలు సమగ్రంగా పరిశీలించుకోవాలని సూచించారు. ఇది కూడా చదవండి: భారత్, పాక్‌లను కలిపిన కేంబ్రిడ్జ్ స్నేహం.. గత 31 ఏళ్లుగా.. The #ceiling of a residence in Phnom Penh, #Cambodia, #collapsed in the living room. Luckily, the #mother inside the house acted quickly, picking up one child with one hand and holding a school bicycle having another child with the other. All her children were saved in the end. pic.twitter.com/aK9wXVsTvW — Warm Talking (@Warm_Talking) July 18, 2023 -
రోడ్డుపై సడన్‌గా విగ్రహంలా మారిన మహిళ.. టైమ్ ట్రావెల్ చేస్తున్నదంటూ..
సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో పలు వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా వైరల్‌గా మారిన ఒక వీడియోలో రోడ్డుపై నడుస్తున్న మహిళ ఉన్నట్టుండి విగ్రహంలా మారిపోయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇది టైమ్ ట్రావెల్ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియో మొదట్లో చూసినప్పుడు ఏమీ తేడా కనిపించదు. ముందుగా ఒక మహళ రోడ్డుమీద వెళుతున్న దృశ్యం కనిపిస్తుంది. అయితే ఆమె ఉన్నట్టుండి ఆగిపోతుంది. కొద్ది సెకెన్ల తరువాత ఆమె తిరిగి నడుస్తుంది. ఆ కాసేపట్లో జరిగినదానిని చూసి జనం అవాక్కవుతున్నారు. ఈ వీడియోను తొలుత టిక్‌టాక్‌లో షేర్ చేశారు. రోడ్డుపై నడుస్తున్న ఆమె సడన్‌గా ఆగిపోయే సరికి ఆమె ఒక బొమ్మలా కనిపించింది. ఈ వీడియోను రికార్డు చేసిన వ్యక్తి ‘ఆమె ఒక్కసారిగా ఎందుకలా ఆగిపోయింది? కొద్దసేపటికి తిరిగి ఎందుకు నడిచింది? అని ప్రశ్నిస్తున్నారు. టిక్‌టాక్‌లో వైరల్ అయిన ఈ వీడియోను ఇప్పటి వరకూ 4.8 మిలియన్లకుపైగా నెటిజన్లు వీక్షించారు. 4,60 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. వేలసంఖ్యలో నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ట్విట్టర్, ఫేస్బుక్ ప్లాట్పారంలలోనూ షేర్ అయ్యింది. ఒక యూజర్ ఈ వీడియోపై కామెంట్ చేస్తూ ‘వైఫై చెడిపోయింది. ఒక సెకెను పాటు డిస్కనెక్ట్ అయ్యింది’అని పేర్కొన్నారు. కాగా గతంలోనూ ఇటువంటి టైమ్ ట్రావెల్ వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. అయితే అవేవీ నిర్థారణ కాలేదు. ఇది కూడా చదవండి: ‘పెళ్లిళ్లే నా ఆరోగ్య రహస్యం’..ఐదో పెళ్లి చేసుకున్న 90 ఏళ్ల వరుని స్టేట్మెంట్ Internet Attempts To Get To Bottom Of Viral Video In Which Woman Appears Literally Frozen In Time pic.twitter.com/0i8y9oqol6 — Know Your Meme (@knowyourmeme) July 17, 2023 -
కొత్త జంట ఎన్ని రోజులకు విడాకులు తీసుకోవచ్చు?.. కొద్దిమందికే తెలిసిన సంగతిది!
కాలం మారిపోయింది. ఇప్పుడు పెళ్లయిన కొద్ది రోజులకే కొత్త జంటలు విడాకులు తీసుకుంటున్నాయి. అలాగే చాలామంది విడాకులు ఎన్ని రోజులలో తీసుకోవచ్చనే విషయాన్ని తరచూ గూగుల్‌లో వెదుకుతున్నారు. దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో పెళ్లి అనేది మరపురాని అనుభవం అని చెబుతుంటారు. దీనిని తీయనైన గుర్తుగానూ అభివర్ణిస్తుంటారు. అయితే ఇప్పుడు దీనికి భిన్నమైన తీరు చాలాచోట్ల కనిపిస్తోంది. గతంలో పెళ్లయ్యాక తన భాగస్వామితో జీవితాంతం గడపాలని భావించేవారు. అయితే దీనికి భిన్నంగా ఇటీవలి కాలంలో పలువురు భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు చెలరేగుతున్నాయి. ఇవి విడాకుల వరకూ దారితీస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కోర్టు మెట్లు ఎక్కుతున్న కొత్త జంటల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లేనప్పుడు వారు విడాకులు తీసుకోవచ్చు. ఇందుకు కోర్టులో విడాకుల ప్రక్రియ అనేది ఉంటుంది. భార్యాభర్తలు తాము ఇక కలసి ఉండలేమని నిర్ణయించుకున్నప్పుడు న్యాయ వ్యవస్థను ఆశ్రయించి వారు ఒకరికి ఒకరు విడిపోవచ్చు. అయితే భార్యాభర్తలు తమ మధ్య వచ్చే వివాదాల కారణంగా మాత్రమే విడిపోవనవసరం లేదు. అభిప్రాయాలు, అభిరుచులు కలవనప్పుడు పరస్పర సమ్మతితో భార్యాభర్తలిద్దరూ విడాకులు తీసుకోవచ్చు. చట్ట ప్రకారం భార్యాభర్తలు విడాకులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పెళ్లయిన నెల రోజుల వ్యవధిలోనే కొత్త జంట విడాకులు తీసుకోవాలంటే వారు ఏం చేయాలనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. ఇటువంటి పరిస్థితులలో కొత్తజంట విడాకుల కోసం కనీసం ఏడాది కాలం వెయిట్ చేయాల్సి వస్తుందని చాలా మంది చెబుతుంటారు. అయితే కోత్తజంట తమ మధ్య సయోధ్య కుదరనప్పుడు పెళ్లయిన వారం రోజుల తరువాత కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చట్టం చెబుతోంది. అయితే కోర్టు వారికి విడాకులు మంజూరు చేసేందుకు 6 మాసాల గడువు ఇస్తుంది. ఈలోపు వారు కలసివుండాలని నిర్ణయించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని కోర్టు భావిస్తుంది. హిందూ వివాహ చట్టం 1955 ఏమి చెబుతున్నదంటే.. విడాకులు, న్యాయపరంగా విడిపోవడం అనేవి రెండూ హిందూ వివాహ చట్టం 1955 కిందకు వస్తాయి. వేర్వేరు సెక్షన్లలో రెండింటికి సంబంధించి నిబంధనలను రూపొందించారు. సెక్షన్ 13లో విడాకుల గురించి తెలియజేయగా, సెక్షన్ 10లో న్యాయపరంగా విడిపోవడానికి సంబంధించిన నిబంధనలు కనిపిస్తాయి. పెళ్లయిన జంటలు న్యాయపరంగా విడిపోవాలనుకున్నప్పుడు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. అప్పుడువారు విడివిడిగా జీవించడానికి కోర్టు అనుమతినిస్తుంది. ఈలోపు ఆ జంట తమ వైవాహిక జీవితం గురించి మరోసారి ఆలోచించి, మంచి నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇది కూడా చదవండి: చికిత్సకు వచ్చిన బాధితునితో నర్సు రిలేషన్..ఆమెకు ఊహించని షాక్! -
ఆర్థిక సంక్షోభం నుంచి పాకిస్తాన్ బయటపడుతుందా?
ఇస్లామాబాద్: గత కొంత కాలంగా ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ ఈ పరిస్థితుల్లో నుంచి బయట పడటానికి కొంత సమయం పడుతుందన్నారు పాకిస్తాన్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్. గతంలోనూ ఇదే పరిస్థితి... కరాచీ వాణిజ్య మండలి పరిశ్రమ నిర్వహించిన ఓ సమావేశంలో పాకిస్తాన్ ఆర్ధిక మంత్రి ఇషాక్ దార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం చేయడానికి అనుసరిస్తున్న విధానాలను, భవిష్యత్తు కార్యాచరణను వివరించే ప్రయత్నం చేశారు ఇషాక్ దార్. ఆయన మాట్లాడుతూ.. 1998, 2013 లో మనం ఇంతకంటే ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాం. కానీ కొంత కాలానికి ఆ సంక్షోభం నుంచి బయటపడ్డాము. పడి లేచిన ఆర్ధిక వ్యవస్థ... 2017 సమయానికి పాకిస్తాన్ ఆర్ధికంగా అత్యుత్తమ స్థాయికి చేరుకుంది. కానీ ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ అస్థిరత కారణంగా ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ పతనావస్థకు చేరుకుంది. ఇటువంటి సంక్షోభాలకు తక్షణ పరిష్కారం అంటూ ఉండదు. తేరుకోవడానికి కొంత వ్యవధి పడుతుంది. తొందర్లోనే మనం ఈ దుస్థితి నుండి బయటపడి ఆర్ధికంగా నిలదొక్కుకుంటామన్నారు ఇషాక్ దార్. నూతన కార్యాచరణ.. కఠినమైన సంస్కరణలు తీసుకొచ్చి సమిష్టిగా సవాళ్ళను ఎదుర్కొంటే పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిలో పడుతుంది. ఇప్పటికే ఈ కార్యాచరణను కూడా మొదలుపెట్టాము. విదేశీ చెల్లింపులకే మా మొదటి ప్రాధాన్యత. వ్యవసాయ రంగంలోనూ ఐటీ రంగంలోనూ విప్లవాత్మక మార్పులను తీసుకురానున్నాము కాబట్టి త్వరితగతినే కుదురుకుంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ఇది కూడా చదవండి: బీజేపీ ప్రధాని కాదు, భారత దేశ ప్రధాని -
రైల్వే మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్
ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న సంఘటనలో జరిగిన ప్రాణ నష్టానికి బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలకు రాజకీయం చేయడానికిది సరైన సమయం కాదంటూ సున్నితంగా హెచ్చరించారు కేంద్ర మంత్రి. రైల్వే శాఖ వైఫల్యం... ఒడిశా రాష్ట్రంలో బాలాసోర్ సమీపంలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడం వెనుక సాంకేతిక లోపమే ప్రధాన కారణమని, ఈ ప్రమాదం జరిగిన కొద్దీ సేపటికి డౌన్ లేన్ లో వస్తున్న మరో రైలు బెంగుళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని చేరవేయడంలోనూ రైల్వే శాఖ విఫలమైందని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ కారణాలను ఎత్తిచూపుతూ కేంద్ర రైల్వే మంత్రి జరిగిన తప్పిదానికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యతగా రాజీనామా చెయ్... దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ... గతంలోనూ ఒకేసారి ఇదే విధంగా లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో ప్రమాదం జరిగితే అందుకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి వెంటనే రాజీనామా చేశారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రికి ఏమాత్రం నైతికత ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమయం సందర్భం లేదా... రైల్వే మంత్రి స్పందిస్తూ... రైలు ప్రమాదంలో ఊహించని స్థాయిలో ప్రాణ నష్టం జరిగింది. ఎన్నో కుటుంబాలు చెల్లా చెదురయ్యాయి. ఇది వారి జీవితాలను పునరుద్ధరించాల్సిన సమయం. మేము పూర్తి పారదర్శకతతో ఆ పనుల్లో ఉన్నాము. రాజకీయం చేయడానికిది తగిన సమయం కాదని అన్నారు. ఇది కూడా చదవండి: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అండగా సోను సూద్ -
భూమి మీద సరే.. చంద్రుడిపై టైం, తేదీలను ఎలా లెక్కిస్తారు?
పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే దాకా అంతా టైమ్ ప్రకారం జరగాల్సిందే. వాచీలోనో, ఫోన్లోనో టైమ్ చూసుకుంటూ జీవితాన్ని పరుగెత్తించాల్సిందే. మనం అనుకున్నదేదైనా జరగకుంటే ‘టైం’ బాగోలేదని వాపోవడమే. ఇది సరేగానీ.. భూమిపై ఒక్కో దేశానికి ఒక్కో టైమ్ జోన్ ఉంటుంది. ఇండియాకు పగలు అయితే.. అమెరికాకు రాత్రి అవుతుంది. మరి అంతరిక్షంలో ఏ టైమ్, తేదీ పాటించాలి? చంద్రుడిపై సమయం, తేదీలను లెక్కించేదెలా? ఇలాంటి సందేహాలు ఎప్పుడైనా వచ్చాయా.. వీటికి సమాధానాలేమిటో తెలుసుకుందామా.. అప్పట్లో చుక్కలను చూస్తూ.. మానవ నాగరికత అభివృద్ధి మొదలైన తొలి నాళ్లలో అంతరిక్షంలోని నక్షత్రాలు, సూర్య, చంద్రుల స్థితి ఆధారంగా సమయాన్ని లెక్కించేవారు. తర్వాతి కాలంలో గడియారాలతో సమ యాన్ని లెక్కించడం మొదలైంది. పగలు, రాత్రి సమయాల్లో తేడాకు అనుగుణంగా.. భూమిని వివిధ టైమ్ జోన్లుగా విభజించి, ఆయా ప్రాంతాల్లో వేర్వేరు సమయాలను వినియోగిస్తున్నారు. మనుషులు భూమికే పరిమితమైనంత కాలం ఇది బాగానే ఉంది. కానీ అంతరిక్ష ప్రయోగాలు, స్పేస్‌లోకి మను షులు వెళ్లిరావడం, భవిష్య త్తులో చంద్రుడు, అంగారకుడిపైకి వెళ్లేందుకు ప్రయోగాలు వంటి వాటితో.. ఏ ‘టైమ్’ను అనుసరించాలనే తిప్పలు మొదలయ్యాయి.\ ఇప్పుడు స్పేస్‌లో వాడుతున్నది ఏ ‘టైమ్’? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ ఎస్) భూమి చుట్టూ రోజుకు 16 సార్లు తిరుగుతుంది. ఈ సమయంలో పదహారు సార్లు సూర్యోదయం, సూర్యాస్తమయం అవుతాయి. ఒక్కో సమయంలో ఒక్కో దేశంపై ఉంటుంది. మరి టైమ్ ఎలా!?.. దీని కోసం ‘యూనివర్సల్ టైమ్ (యూటీ)’ను పాటిస్తున్నారు. - భూమ్మీద టైమ్ జోన్లను ఏర్పాటు చేసు కున్నప్పుడు బ్రిటన్‌లోని గ్రీన్ విచ్ ప్రాంతాన్ని మూలంగా తీసుకున్నారు. అక్కడ మొదలయ్యే మొదటి టైమ్ జోన్‌ను ‘గ్రీన్విచ్ మీన్ టైమ్ (జీఎంటీ)’గా వ్యవహరిస్తారు. ప్రస్తుతానికి దీనినే ‘యూనివర్సల్ టైమ్’గా పాటిస్తున్నారు. - అయితే ఈ ‘యూటీ’ కేవలం భూమి చుట్టూ ఉన్న స్పేస్ వరకే.. చంద్రుడిపై, అంగారకుడిపై టైమ్‌ను లెక్కించేందుకు ప్రపంచ దేశాల మధ్య ప్రస్తుతం ఎలాంటి ఒప్పందాలూ లేవు. స్పేస్ ప్రయోగాలకు.. ‘ఎంఈటీ’.. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి వాటిని లాంచ్ చేసిన క్షణం నుంచి.. ఎంతెంత సమయం గడిచిన కొద్దీ ఏమేం జరిగిందనేది కీలకమైన అంశం. ఈ క్రమంలోనే స్పేస్ ప్రయోగాల్లో ప్రత్యేకంగా ‘మిషన్ ఎలాప్స్‌డ్ టైమ్ (ఎంఈటీ)’ని వాడుతారు. అంటే ఒక రాకెట్ లాంచ్ అయినప్పటి నుంచీ టైమ్ లెక్కించడం మొదలుపెడతారు. దీనినే ‘టీ ప్లస్ టైమ్’గా చూపిస్తారు. - ఉదాహరణకు ఒక చంద్రుడి వద్దకు కృత్రిమ ఉపగ్రహాన్ని పంపి, 2రోజుల 5 గంటల పది నిమి షాలు అయితే.. ఆ శాటిలైట్‌కు సంబంధించిన టైమ్‌ను ‘టీ+ 2డేస్ 5 హవర్స్ 10 మినట్స్’గా లెక్కిస్తారు. ఈ విధానాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చంద్రుడిపైకి మానవ సహిత ప్రయోగాలు చేపట్టినప్పటి నుంచీ వాడుతున్నారు. అప్పట్లో దీనిని ‘గ్రౌండ్ ఎలాప్స్‌డ్ టైమ్ (జీఈటీ)’గా పిలిచారు. తర్వాత ఎంఈటీగా మార్చారు. చంద్రుడిపై ఇలా లెక్కిస్తే సరి అంటూ.. - స్పేస్ ప్రయోగాల వరకు సరేగానీ.. చంద్రుడిపై నివాసం ఏర్పర్చు కున్నాక అక్కడ ‘టైమ్’ ఎలాగనే సందేహాలు మొదలయ్యాయి. భూమ్మీదిలా పగలు, రాత్రి కలిపి ఒక రోజుగా లెక్కిద్దామంటే కష్టం. - సాధారణంగా సూర్యోదయం నుంచి అస్తమయం వరకు పగలు.. అప్పటి నుంచి మళ్లీ సూర్యోదయం వరకు రాత్రి. ఈ లెక్కన చంద్రుడిపై సుమారు 15 రోజులు పగలు, మరో 15 రోజులు రాత్రి ఉంటాయి (భూమ్మీది సమయం ప్రకారం). అంటే చంద్రుడిపై ఒక రోజు (మూన్ డే) అంటే.. మనకు నెల రోజులు అన్నమాట. - ఈ సమస్యను అధిగమించడానికి, భూమ్మీది సమయానికి సులువుగా అనుసంధానం చేయగలగడానికి ఒక ప్రతిపాదన ఉంది. చంద్రుడిపై సెకన్లు, నిమిషాలు, గంటలను యథాతథంగా లెక్కిస్తూనే.. రోజు (24 గంటల సమయం)ను మాత్రం ఒక సైకిల్‌గా పిలవాలని, 30 సైకిల్స్ కలిస్తే ఒక పూర్తి మూన్డేగా పరిగణించాలని ఆలోచన. అంటే మనకు ఒక నెల ఒక మూన్డే.. మనకు ఒక రోజు ఒక మూన్ సైకిల్‌గా లెక్కించొచ్చు. దీన్ని ఇంకా అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. -సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ప్రభాస్ కి ఎంతమాత్రం కలిసిరాని 2022 ..!
-
టీటీడీ కీలక నిర్ణయాలు.. బ్రేక్ దర్శన సమయంలో మార్పు
-
మంచి మాట: కాలం మహత్తరం శక్తిమంతం
భగవంతుని సృష్టిలో అంతర్భాగమైన కాలానికి ఉన్న శక్తి అద్భుతమైనది, అమోఘమైనది. కష్ట సుఖాలని, మంచి–చెడులని, కలతలని, కన్నీళ్ళని ఇలా అన్నిటిని తనలో లీనం చేసుకుంటూ, వాటి తాలూకు జ్ఞాపకాలని మాత్రమే మిగులుస్తూ, కాలచక్రం గిర్రున తిరిగిపోతుంటుంది.. మన కళ్ళ ఎదుటే ఎంతోమంది మృత్యు ఒడిలోకి జారిపోతున్న వారిని చూస్తున్నా, ఆ దుఖాన్ని అనుభవిస్తున్నా, ఆ క్షణంలో ఎంతో విరక్తిని కల్గించి, కాలక్రమేణా ఆ దుఃఖభారాన్ని మరపింపచేసి, మన జీవితమే శాశ్వతమన్నంతగా మనసు మరల్చి మాయ చేస్తుంది. ఇంతకన్నా విచిత్రం ఏముంటుంది కనుక. ఇంతటి మహత్తరమైన, శక్తిమంతమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. ప్రయోగించే విధానాన్నిబట్టి కాలం అర్థం మారిపోతుంటుంది. ఏదో ఆలా కాలక్షేపం చేస్తున్నామండీ అని పెద్దలు అంటుంటారు. అంటే ‘రోజులు గడుపుతున్నాము’ అని అర్థం. ఏదైనా విచిత్ర సంఘటన కళ్ళబడితే ‘కలికాలం’,’పిదపకాలం’ అంటుంటారు. పురాణ పఠనం చేస్తుంటే దాన్ని ‘సత్కాలక్షేపం’ అంటుంటారు. ఇలా అర్థాలు ఎన్ని మారినా, కాలప్రభావంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. కాలం గడపటం అంటే ‘పొద్దుపుచ్చటం’ అని మాత్రమే కాదు. నిజానికి సద్వినియోగం చేసుకున్నా,దుర్వినియోగం చేసుకున్నా కాలం మాత్రం ఎవరికోసమూ ఆగదు. ఆటపాటలతో బాల్యం గడచిపోతుంది. అది సహజం. ఆశలు, ఆశయసాధనాలు, వివాహం, సంతానం, ఇలా ప్రౌఢ, యుక్తవయస్సులు గడచిపోతాయి. అది అప్పటికవసరం. ఇక మిగిలేది బాధ్యతలు తీరిన జీవితం, అలసిపోయిన శరీరం. మొదటి మూడు దశలలోనూ గిర్రున తిరిగిన కాలం, నాల్గవ దశలో, వయసు మీద పడేసరికి కొంత భారంగా గడుస్తున్నట్టనిపిస్తుంది. ఇంటి పెద్దగా ఎన్నో బాధ్యతలతో తలమునకలై, జీవనపోరాట ప్రవాహంలో కొట్టుకుపోతూ, ఒక్కసారిగా విశ్రాంతి లభించటంతో కాలం స్తంభించినట్టుగా భావిస్తాం. కాని ఆలోచిస్తే ఈ విశ్రాంతి పెద్దలకు ఒక వరమనే చెప్పవచ్చు. ఎందుకంటే, నిబద్ధతతో కూడిన లక్ష్యసాధన, ఏ వయసు వారినైనా కాలాన్ని సద్వినియోగపరచుకునేలా చేస్తుంది. సక్రమంగా ఉపయోగించుకోలేక పోతే, సమయం వృథా అయిపోయి, జీవితం నిస్సారం గా తయారవుతుంది. వయస్సులో ఉన్నవారు తమ ఆశయసిద్ధి కోసం అవిరామంగా కృషి చేయాలి. వయసు మీరిన వారు తమకు వయసు నేర్పిన పాఠాలు, అనుభవాలు భావితరాలకు పంచవచ్చు. తమలోని మరుగుపడిపోయిన కళలను, సృజనాత్మక శక్తిని వెలికి తీసే అవకాశం పొందవచ్చు. చక్కని గ్రంథ పఠనం చేసుకోవచ్చు. వృద్ధాశ్రమాలకి వెళ్లి, అక్కడి వారి యోగక్షేమాలని విచారిస్తూ, వారి అనుభవాలను పంచుకుంటూ, తగిన సలహాలు, సూచనలు అందించవచ్చు. ఎదుటివారికి చేతనైనంత సహాయం చేస్తూ, హాయిగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే కాస్త వయసు మీరాక, వీటికన్నిటికీ కాలాన్ని సక్రమంగా ఉపయోగించాలంటే శారీరక ఆరోగ్యం చాలా ముఖ్యం. కాబట్టి యోగసాధన జీవితంలో ఒక భాగం కావాలి. యోగసాధన శారీరక, మానసిక రుగ్మతలని దూరం చేస్తుంది. ఏ ఋతువులో ఆ పువ్వు పూస్తుంది. ఆ కాయ కాస్తుంది. సకల జీవరాసులు, కాలానికి అనుగుణంగా తమ తమ జీవనశైలిని మార్చుకుంటూ, కాలానికి కట్టుబడి జీవిస్తాయి. కాలాన్ని సద్వినియోగపరచుకోవటంలో తన మేధస్సును మరింత చక్కగా ఉపయోగించుకోవాలి కదా. కర్మసిద్ధాంతం ప్రకారం జరగాల్సిందేదో అదే జరుగుతుందిలే అని వదిలి వేయకుండా మానవ ప్రయత్నం చేయాలి. భూత భవిష్యత్ ప్రభావాలని రంగరించుకుంటూ జీర్ణించుకుంటూ మెరుగులు దిద్దుకుంటూ సాగాలి. ‘గతాన్ని తలచుకుని వగచవద్దు.. భవిష్యత్ గురించి భయపడవద్దు... వర్తమానంలో జీవించు’ అంటారు పెద్దలు. మనసుని కలచి వేసే సంఘటనలు, మధుర స్మృతులు– రెండూ ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటాయి. అయితే ఆ సంఘటనల వల్ల కలిగిన గాయం మనకు నేర్పుతున్న పాఠాలు ఏమిటి అని తరచి చూసుకోవాలి. దానిద్వారా మనల్ని మనం సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాని దాని గురించి అతిగా వ్యధపడ కూడదు.అలాగే మనసుని సంతోషపెట్టే సంఘటనలను తలచుకోవడం వల్ల మానసిక ఉత్సాహం ఇనుమడిస్తుంది. ఉదాహరణకి బాల్యస్మృతులు ఇంచుమించు అందరికీ ఆనందం కలిగించేవే. ఇక భవిష్యత్తు గురించి కలలు కనడం తప్పు కాదు కానీ అంతకే పరిమితమైపోకుండా, ఆ కలని సాకారం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి. – అడవి అన్నపూర్ణ -
గడియారంలో మొదటి సెకన్‌కు లేటెందుకు?
ఎప్పుడైనా మీరు చేతి వాచీ వైపో, గోడ గడియారంవైపో తదేకంగా చూసినప్పుడు.. అందులో సెకన్ల ముల్లు మొదట మెల్లగా కదిలి, తర్వాత స్పీడెత్తుకోవడం గమనించారా? ఈ విషయాన్ని ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదంటారా? పోనీ ఇప్పుడు ట్రై చేస్తారా?.. డిజిటల్‌వి కాకుండా ముళ్లుండే గడియారంవైపు చూసినప్పుడు.. అందులో సెకన్ల ముల్లు తొలి సెకన్ పాటు మెల్లగా కదిలినట్టు అనిపిస్తుంది. తర్వాతి సెకన్ నుంచి మామూలుగానే ముందుకెళ్తుంది. కాస్త గ్యాప్‌తో ఎన్నిసార్లు మార్చి మార్చి చూసినా దాదాపు ఇలాగే అనిపిస్తుంటుంది. యూట్యూబ్‌లో అసాప్‌సైన్స్ అనే చానల్ నడిపే సైన్స్ నిపుణుడు దీనికి కారణాలను వివరించారు. మెదడు ప్రాసెస్ చేసే తీరు వల్లే.. గడియారాన్ని చూసినప్పుడు మొదటి సెకన్ ఎక్కువ సేపు ఉన్నట్టు అనిపించడం వెనుక సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. సాధారణంగా మన కళ్లు రెండు రకాలుగా కదులుతుంటాయి.ఒకటి స్మూత్ పర్సూ్యట్, రెండోది సెక్కాడ్. ►స్మూత్ పర్సూ్యట్ విధానంలో కళ్లు చాలా మెల్లగా కదులుతూ గమనిస్తుంటాయి. ఉదాహరణకు మనకు కాస్త దూరంలో కారో, బైకో కదులుతూ ఉంటే.. కళ్లు దానికి అనుగుణంగా కదులుతూ చూస్తుంటాయి. ఈ విధానంలో కంటి నుంచి అందిన సమాచారాన్ని మెదడు వెంటవెంటనే ప్రాసెస్ చేస్తుంటుంది. మనం గడియారంలోకి చూసినప్పుడు.. రెండో సెకన్ నుంచి సెకన్ల ముల్లు అలా కదులుతూ ఉండటాన్ని గమనించడం కూడా ‘పర్సూ్యట్’ కిందకే వస్తుంది. ►సెక్కాడ్ విధానం అంటే.. ఏదైనా ఒకచోటి నుంచి మరో చోటికి వేగంగా, వెంటనే దృష్టి మళ్లించడం. ఇలా చేసినప్పుడు తొలుత చూస్తున్న దృశ్యం, చివరిగా దృష్టిని ఆపిన దృశ్యం మాత్రమే క్లియర్‌గా కనిపిస్తాయి. మధ్యలో ఉన్నదంతా చూచాయగానే అనిపిస్తుంది. ఉదాహరణకు మీకు దూరంగా ఉన్న ఏదైనా భవనాన్ని చూస్తున్నారు. పక్కన ఏదో చప్పుడైతే ఒక్కసారిగా అటువైపు చూశారనుకోండి. ఆ భవనానికి, ఈ చప్పుడు వచ్చిన చోటికి మధ్య దృశ్యాలేవీ పెద్దగా ఆనవు. కంటి నుంచి అందే సమాచారాన్ని మెదడు అంత వేగంగా, వెంటనే ప్రాసెస్ చేయలేకపోవడమే దీనికి కారణం. ►మనం గడియారం వైపు చూసినప్పుడు తొలి దృష్టి సెక్కాడ్ మోడ్‌లోనే ఉంటుంది. అప్పటికే కదులుతూ ఉన్న ముల్లు ఆగి, మళ్లీ కదులుతున్న సమయంలో.. మెదడు ఆ దృశ్యాన్ని ప్రాసెస్ చేయడానికి సమయం తీసుకుంటుంది. అంతకుముందు చూస్తూ ఉన్న దృశ్యం నుంచి గడియారం వైపు దృష్టిని మరల్చిన సమయాన్ని కూడా కలిపేస్తుంది. దీనితో తొలి సెకన్ గడిచేందుకు ఎక్కువసేపు పట్టినట్టు అనిపిస్తుంది. ఆ వెంటనే మన దృష్టి స్మూత్ పర్సూ్యట్లోకి వచ్చేస్తుంది కాబట్టి.. మిగతా సెకన్లు మామూలుగానే గడిచిపోతుంటాయి. -
AP: సమయానికి రాకపోతే ‘సెలవే’
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయ ఆర్థిక శాఖ అధికారులు, ఉద్యోగులు నిర్ణీత సమ యంలోగా కార్యాలయానికి రావాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్–19 తరువాత ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, అందువల్ల సచివాలయ ఆర్థిక శాఖలో పనిచేసే అధికారులు, ఉద్యోగులందరూ పని దినాల్లో ఉదయం 10 గంటలకల్లా కార్యాలయానికి రావాలని, సాయంత్రం 5.30 గంటల వరకు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలోగా రాని అధికారులకు, ఉద్యోగులకు ఆ రోజు సెలవుగా పరిగణిస్తామని తెలిపారు. ఆయన ఆదేశాలు ఇవీ.. చదవండి: విశాఖలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే.. ►ఉదయం 10 నుంచి 10.10 గంటల్లోపు తప్పనిసరిగా విధులకు హాజరవడం తోపాటు పనిచేయడం ప్రారంభించాలి ►ఉదయం 10.10 నుంచి 11 గంటల్లోపు ఆలస్యంగా హాజరుకు నెలలో మూడు సార్లు మాత్రమే అనుమతి. ►ఒక పూట హాజరును ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరిగణిస్తారు ►ఉదయం 11 గంటల తరువాత వచ్చి మధ్యాహ్నం 1 గంటలోపే వెళ్లిపోయినా లేదా నిర్ణీత సమయంలోగా వచ్చి మధ్యా హ్నం 1 గంటకన్నా ముందే వెళ్లిపోయినా ఒక పూట సెలవుగా పరిగణిస్తారు ►మధ్యాహ్నం 1 గంట తరువాత హాజరైతే ఆ రోజు సెలవుగా లేదా గైర్హాజరుగా పరిగణిస్తారు ►ఉదయం 10 గంటలకు హాజరై సాయంత్రం 5.30 తరువాత కార్యాలయం నుంచి వెళ్తే పూర్తి రోజు హాజరైనట్లు ►ఉద్యోగులు ముందుగా అనుమతి తీసుకోకుండా సెలవు పెట్టడంవల్ల పని వాతావరణం దెబ్బతింటోంది. ఇక నుంచి సెలవుకు ముందుగా అనుమతి తీసుకోవాల్సిందే. అనుమతి తీసుకోకుండా సెలవు పెడితే అనధికార గైర్హాజరుగా పరిగణిస్తారు. ఒక పూట సెలవు కోసం ముందస్తు సమాచారం ఇవ్వాలి. ►అధికారులు, ఉద్యోగులందరూ పనివేళ లను కచ్చితంగా పాటించాలి. క్రమశిక్షణను, పని వాతావరణాన్ని నెలకొల్పాలి. లేదంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని రావత్ స్పష్టం చేశారు. ►కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. -
‘పిల్’లతో కాలహరణం: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా ప్రయోజన వ్యాజ్యా (పిల్)ల వల్ల వాస్తవ కేసుల నుంచి కోర్టు దృష్టి మళ్లుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. సోమవారం కర్ణాటకలోని కర్వార్ పోర్టు విస్తరణకు పర్యావరణ అనుమతులపై పెండింగ్‌లో ఉన్న కేసులో జస్టిస్ ఎన్వీ రమణ ఈ మేరకు వ్యాఖ్యానించారు. పిల్స్ కోర్టు సమయం తీసుకోకుంటే వాస్తవ కేసులకు సమయం కేటాయించొచ్చని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల బోర్డులు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఎన్ఐఓఎస్లు ఈ ఏడాది నిర్వహించే 10, 12 తరగతుల పరీక్షలను భౌతికంగా నిర్వహించరాదంటూ హక్కుల కార్యకర్త శ్రీవాస్తవ దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అనుమతించింది. జస్టిస్ ఏఎం ఖని్వల్కర్తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారిస్తుందని సీజేఐ పేర్కొన్నారు. -
టైమ్ బ్యాంక్లొస్తున్నాయ్.. ఓ 4 ‘గంటలు’వెనకేసుకుందాం!
సాక్షి, సెంట్రల్‌డెస్క్: ప్రస్తుతం ప్రపంచమంతా డబ్బు కోసం పరుగులు పెడుతోంది. ఎవరిని కదిలించినా.. ‘ఎంతో కొంత వెనకేసుకోవాలి కదరా’ అనే మాటే వినబడుతోంది. కానీ అసలు ప్రపంచంలో డబ్బే అవసరం లేకుండా పనులు జరిగిపోతే. మనకు వచ్చే పనులను వేరే వాళ్లకు చేసిపెట్టి.. మనకు అవసరమున్న పనులను అవి వచ్చే వాళ్లతో చేయించుకుంటే. ఈ పనులన్నింటినీ వాటికయ్యే సమయం ప్రకారం లెక్కిస్తే. ఇదేదో బాగుంది కదా! దీన్నే టైమ్ బ్యాంకు విధానం అంటారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. అసలు ఏంటీ విధానం, ఎలా నడుస్తుంది, ఎన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చింది, మన దేశంలో పరిస్థితేంటి.. తెలుసుకుందాం. మీరో కంప్యూటర్ హార్ట్‌వేర్ ఇంజనీర్. మీ ఇంట్లో గార్డెనింగ్ పని చేయాల్సి ఉంది. ఆ పని చేసే వ్యక్తిని పిలిచారు. అతను వచ్చి ఆ పని చేసేశాడు. సుమారు 2 గంటల సమయం పట్టింది. ఆ సమయం ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాలో డిపాజిట్ అయిపోతుంది. ఆ తర్వాత కొన్నిరోజులకు వేరే ఎవరి ఇంట్లోనో షార్ట్ సర్క్యూట్ వల్ల కంప్యూటర్ పాడైతే మీరు వెళ్లి బాగు చేశారు. రిపేర్‌కు దాదాపు 4 గంటలు పట్టింది. ఈ సమయం మీ బ్యాంకు ఖాతాలో చేరిపోతుంది. ఇంతకుముందు మీరు చేయించుకున్న రెండు గంటల పని పోనూ ఇంకో రెండు గంటలు మిగులుతుంది. ఈ సమయాన్ని మీరు వేరే పనులకు వాడుకోవచ్చు. ఇలా మీకు వచ్చిన పనులు చేస్తూ, వాటికి పట్టే సమయాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తుండటం.. మీకు కావాల్సిన పనులకు ఆ సమయాన్ని వాడుకోవడం.. డబ్బు అవసరమే లేకుండా పనులన్నీ జరిగిపోవడం.. ఇదే టైమ్ బ్యాంకు విధానం. ఇప్పుడు చాలా దేశాల్లో వాడుకలోకి వస్తున్న సరికొత్త విధానం. ఎక్కడ పుట్టింది ఈ ఐడియా? ప్రజలు తాము చేసే పనులను డబ్బుకు బదులు సమయంతో కొలిచే ఈ కొత్త విధానానికి అమెరికాకు చెందిన ఎడ్గర్ ఎస్. కాన్ అనే వ్యక్తి సృష్టికర్త. ప్రస్తుతం ఇతను అమెరికాలో టైమ్ బ్యాంకులకు సీఈవో. ఈ పద్ధతిలో ఎవరైనా ఒక గంటపాటు తమకు వచ్చిన పనిని అవసరమైన వారికి చేశారనుకోండి.. అతనికి ఓ గంట టైమ్ క్రెడిట్ ఇస్తారు. అలా పని చేసిన మొదటి వ్యక్తికి ఇంకేదైనా పని అవసరమైనప్పుడు ఆ పని చేయగలిని వాళ్లు వచ్చి ఆ గంట చేసి వెళ్తారు. ఇలా టైమ్‌ను క్రెడిట్ చేసుకోవడం, డెబిట్ చేయడం, అవసరమైన పనులకు వ్యక్తులను పంపడం లాంటివి చూసుకునేందుకే టైమ్ బ్యాంకులు ఉంటాయి. ఎన్ని దేశాల్లో నడుస్తోంది? ప్రస్తుతం ఓ ప్రణాళికాబద్ధంగా టైమ్ బ్యాంకులు 30కి పైగా దేశాల్లో నడుస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా లాంటి పెద్ద దేశాలూ ఈ టైమ్ బ్యాంకులను నడిపిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ టైమ్ బ్యాంకుల ద్వారా 40 లక్షల గంటల పని జరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. ప్రాంతాలు, దేశాల వరకే పరిమితమైన ఈ టైమ్ బ్యాంకుల సరిహద్దులను చెరిపేసేందుకు టైమ్ రిపబ్లిక్ 2013లో తొలి గ్లోబల్ టైమ్ బ్యాంకును కూడా ప్రారంభించింది. స్విట్జర్లాండ్‌లో వృద్ధుల కోసం.. స్విట్జర్లాండ్‌లో ఈ టైమ్ బ్యాంక్‌ను వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమం లాగా ప్రారంభించారు. ఇందులో చేరిన ప్రతి వ్యక్తికీ సామాజిక భద్రత అకౌంట్ ఒకటి, టైమ్ బ్యాంకు కార్డు ఒకటి ఇస్తారు. ఎవరైనా ఎప్పుడైన సాయం అవసరమైతే తమ టైమ్‌ను వాడుకోవచ్చు. ఆ వ్యక్తి కోరే పని చేసే వలంటీర్‌ను ఎంపిక చేసి బ్యాంకు వాళ్లు పంపుతారు. సామాజికంగా కలిసిమెలిసి ఉండే వాళ్లకు, కొత్త పరిచయాలు కోరుకునే వాళ్లకు ఈ టైమ్ బ్యాంకింగ్ ఉత్సాహాన్నిస్తుంది. ఎందుకంటే స్విట్జర్లాండ్‌లో టైమ్ బ్యాంక్ క్లబ్లో చేరిన సభ్యులతో బ్యాంకులు ఎప్పటికప్పుడు సమావేశాలు, పార్టీలను ఏర్పాటు చేస్తున్నాయి. మన దేశంలో ఏంటి పరిస్థితి? స్విట్జర్లాండ్‌లో అమలు చేస్తున్న పథకాన్ని దేశంలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖకు జాతీయ మానవ హక్కుల కమిషన్ సూచించింది. దేశంలో దాదాపు కోటిన్నర మంది వృద్ధులు ఒంటరిగా జీవిస్తున్నారు. వీళ్లలో ఏదోరకంగా సేవలు పొందుతున్న వాళ్లు కేవలం 20 లక్షల మంది మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్లు ఏపనినైనా తమకుతాముగా చేసుకోవాల్సిందే. మరో 30 ఏళ్లలో దేశంలో 60 ఏళ్ల పైబడిన వాళ్లు మొత్తం జనాభాలో 20 శాతం అవుతారు. ప్రస్తుత సమాజంలో చిన్న కుటుంబాలు పెరగడం, సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తుండటంతో వృద్ధులు ఒంటరిగా గడపాల్సిన సందర్భాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టైమ్ బ్యాంకుల ద్వారా యువకులు ముందుకొచ్చి వృద్ధుల అవసరాలు తీర్చడం, వాళ్ల ఒంటరితనాన్ని పోగొట్టడం, అందుకు యువకులు వెచ్చించిన సమయాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం, ఆ తర్వాత తమ వృద్ధాప్యంలో ఆ సమయాన్ని వాడుకునే వెసులుబాటు పొందడం వంటివి సమస్యలకు పరిష్కారం చూపిస్తాయని కొందరు నిపుణులు అంటున్నారు. లోపాలేమైనా ఉన్నాయా? టైమ్ బ్యాంకులు ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉన్నాయి. కాబట్టి సర్వీసులు పొందే, అందించే వెసులుబాటు చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఈ సర్వీసుల్లో సాంకేతికతను చాలా తక్కువగా వాడుతున్నారు. అంటే టైమ్ బ్యాంక్ యాప్ లాంటివి ఇంకా అందుబాటులోకి రాలేదు. పైగా కొన్ని పనులకు విలువ ఎక్కువగా ఉంటుంది. కొన్నింటికి తక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒక సమస్యే. అయితే ఒకవేళ ఎవరి పనికైనా మిగతా వాళ్ల పనులతో పోలిస్తే ఎక్కువ విలువ ఉంటుందని, ఎక్కువ డబ్బులు వస్తాయని అనుకుంటే అలాంటి వాళ్లు సమయానికి బదులు డబ్బును కోరే వెసులుబాటును ఈ బ్యాంకుల్లో ఇస్తూ సమస్యను పరిష్కరిస్తున్నారు. పేద దేశాల్లో సాధ్యమా? ఇలాంటి టైమ్ బ్యాంకు విధానం ధనిక దేశాల్లోనే కుదురుతాయని కొందరు నిపుణులు అంటున్నారు. అలాంటి దేశాల్లో ప్రజలకు తిండి, చదువు కోసం పెద్దగా ఆందోళన ఉండదని, కాబట్టి వాళ్లు ఇలాంటి పనులకు ముందుకొచ్చే అవకాశం ఎక్కువని చెబుతున్నారు. పైగా ధనిక దేశాల్లో ఇలాంటి పనులు చేసేవాళ్లకు అక్కడి ప్రభుత్వాలు కావాల్సిన సదుపాయాలు, డబ్బులు కూడా అందించే అవకాశం ఉంటుందన్నారు. కానీ పేద, మధ్య తరగతి దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉండదని, ఆ దేశాల్లో తిండి కోసమే ప్రజలు ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుందని, పిల్లల చదువులకు డబ్బులు అవసరమవుతాయని చెబుతున్నారు. కాబట్టి ఆ దేశాల ప్రజలు ఈ కొత్త విధానానికి ఇష్టపడరని అంటున్నారు. -
మద్యం ప్రియుల్లో ‘నయా’ జోష్ .. తాగండి.. ఊగండి..! కానీ
సాక్షి, పెద్దపల్లి (కరీంనగర్): మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. డిసెంబర్ 31 సందర్భంగా మద్యం షాపులకు ఆంక్షలను ఎత్తివేసింది. పైగా అర్ధరాత్రి వరకు మద్యంషాపులు తెరిచి ఉంచవచ్చని, బార్లు ఒంటిగంట వరకూ నిర్వహించుకోవచ్చని పేర్కొంది. ఈవెంట్లు కూడా చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ కావడంతో మద్యంప్రియుల్లో జోష్ నెలకొంది. జిల్లావ్యాప్తంగా 77 మద్యం షాపులు ఉన్నాయి. గోదావరిఖని, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌లో బార్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఒక్కషాప్ నుంచి రూ.రెండు లక్షల నుంచి రూ.నాలుగు లక్షల వరకు అమ్మకాలు జరుగుతాయి. శుభకార్యాలు ఉంటే మరింత పెరుగుతాయి. అయితే డిసెంబర్ 31 అంటేనే యువతలో తెలియని జోష్ ఉంటుంది. మద్యంతో విందులు చేసుకుంటూ సరదాగా గడుపుతారు. దీనిని సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేసింది. సాధారణ రోజుల్లో రాత్రి 10 గంటల వరకే వైన్స్‌షాపులు మూసివేయాలి. కానీ.. ఈ 31న మాత్రం అర్ధరాత్రి వరకూ తెరిచి ఉంటే వెసులుబాటు కల్పించింది. ఈవెంట్లు నిర్వహించుకునేవారు మాత్రం ఎక్సైజ్ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. బయటకొస్తే తాట తీస్తారు.. డిసెంబర్ 31 సందర్భంగా మద్యంషాపులపై ఆంక్షలు ఎత్తేసిన ప్రభుత్వం పోలీసులకు మాత్రం కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా గుంపులు, గుంపులుగా కనిపించినా.. తాగి బయటకొచ్చినా పోలీసులు వదలరు. ఎక్కడికక్కడ డ్రంకెన్‌డ్రైవ్ చేపట్టనున్నారు. ఒకవేళ మద్యం తాగి పోలీసులకు చిక్కితే మాత్రం కటకటాల్లోకి పంపించనున్నారు. ఎవరి ఇళ్లలో వారే పార్టీ చేసుకోవాలని, బయటకొస్తే మాత్రం తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే జోరందుకున్న అమ్మకాలు డిసెంబర్ 31 నేపథ్యంలో జిల్లాలో ఇప్పటికే మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. వైన్స్‌షాపులు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటాయని తెలిసినా.. పోలీసులతో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ మద్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే తనిఖీలు చేపడతామని, ఎవరు పట్టుబడినా.. జరిమానాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు పాటించాలి నిబంధనలు అందరూ పాటించాలి. ఎవరి ఇళ్లలో వారే సెలబ్రేషన్ చేసుకోవాలి. బయటకు రావొద్దు. జనజీవనానికి ఆటంకం కలిగించొద్దు. అర్ధరాత్రి 12గంటల వరకు మద్యం తీసుకెళ్లొచ్చు. అయితే అప్పటికే తాగి ఉండరాదు. ఎక్కడికక్కడ డ్రంకెన్‌డ్రైవ్ ఉంటుంది. అందులో పట్టుబడితే జైలుకు పంపిస్తాం. ఇందులో అనుమానం లేదు. – ఇంద్రసేనారెడ్డి, సీఐ, సుల్తానాబాద్ చదవండి: సాక్షి ఎఫెక్ట్: విష్ణువర్ధన్ వైద్యానికి భరోసా -
సమయమే సంపద
కాలం ఎంతో విలువైనది. ఎవరికోసం ఆగనిది. బిరబిరమంటూ సాగిపోయే ఉధృతమైన నదీ ప్రవాహానికి మానవ మేధాశక్తితో ఆనకట్ట వేయవచ్చు. కానీ, నిరవధికంగా సాగిపోయే కాలప్రవాహానికి మాత్రం ఎవ్వరూ అడ్డుకట్ట వేయలేరన్నది వాస్తవమే కదా..!! కాలం మనకు ఉచితంగా లభిస్తుంది. కానీ కాలం విలువను వెలకట్టలేమన్నది జగమెరిగిన సత్యం. సకల ప్రాణుల్ని, సమస్త జగత్తునూ నడిపించేదీ, హరించేదీ కాలమే. సృష్టి, స్థితి, వినాశం అనే ప్రధానమైన కార్యాలకు సాక్షీభూతంగా నిలిచేదీ కాలమే. అత్యంత బలవత్తరమైన కాలప్రభావాన్ని ఎవరూ అతిక్రమించలేరు. ఏ భౌతిక సాధనాలూ, ఆధ్యాత్మిక సాధనలూ కాలాన్ని బంధించలేవు. ‘‘పారే నది లో ఈ క్షణం తాకిన నీటిని మరుక్షణం ఎలాగైతే తాకలేమో అలాగే గతించిన కాలాన్ని పట్టుకోలేం. అందుచేత కాలమహిమను గుర్తించండి’’ అన్న చాణుక్యుని వాక్యాలు ఎంతో అర్థవంతమైనవి. జీవితంలో ప్రతిక్షణం వెలకట్టలేనిదే. గడిచిపోయిన క్షణం తిరిగిరాదు. అందుకే, కాలాన్ని విధి గా పాటించడం లేదా సమయపాలనకు కట్టుపడడం అనేది ప్రతివారికీ అత్యంత ముఖ్యమైన విధి. సమయపాలనకు సంబంధించి రకరకాల నిర్వచనాలు మనకు నిత్యమూ కనబడుతూ ఉంటాయి. సమయానికి మనం అనుకున్న పనిలో, విహితమైన తీరులో, ఏకాగ్ర చిత్తంతో నిమగ్నం కావడాన్నే సమయపాలన అని చెప్పుకోవచ్చు. ఏదైనా పనికోసం మనం సమయాన్ని కేటాయిస్తే, అది మనకు ఆ కార్య పరిపూర్ణతకు ఉపకరించి, సంతృప్తిని కలిగిస్తుంది. ఏదైనా ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడంకోసం సమయాన్ని కేటాయిస్తే, అది మనలో మేధాశక్తినీ పెంచడమే గాక, వ్యక్తిత్వాన్ని శిఖరాగ్రానికీ చేరుస్తుంది. అమేయమైన సారాన్ని నింపుకున్న పుస్తకాలను గానీ, గ్రంథాలను గానీ చదవడానికి సమయాన్ని కేటాయిస్తే, మనలో మనోవికాసం పెంపొందుతుంది. ఎప్పుడూ ఏదో ఒక పనిలోనే నిమగ్నం కాకుండా, ఒకింత నవ్వుకోవడానికి సమయాన్ని కేటాయిస్తే, అది మన జీవితాన్ని ఆహ్లాదమయం చేస్తుంది. కొంత సమయాన్ని పక్కవాడికి సహాయం చేయడానికి కేటాయిస్తే, అది మనకు ఆత్మానందాన్ని కలిగిస్తుంది. దైనందిన జీవితంలో వ్యాయామానికి సమయాన్ని కేటాయిస్తే, అది మనకు ఆరోగ్యప్రదాయినియై సంతసాన్ని కలిగిస్తుంది. సమయం విలువ ప్రతివారూ గుర్తెరగడం అత్యంత ముఖ్యం. ప్రత్యేకించి, పిల్లలకు సమయానికి తగినట్లుగా పనులు అలవాటు చేయడం తల్లితండ్రుల బాధ్యత. ముఖ్యంగా ఉదయాన నిద్రలేవడం నుంచీ, రాత్రి పడుకునే వరకు, వాళ్ళు ఏ సమయానికి ఏం చేయాలో తెలియజెప్పడం తప్పనిసరిగా చేయాలి. ముందు కొంత బద్ధకించినా, కొన్ని రోజులకు సమయం ప్రకారం పనులు చేయడం వారికి అలవాటుగా మారుతుంది. జీవితానికి ఉత్తమ బాటను పరుస్తుంది. ‘‘ క్షణము గడిచిన దాని వెన్కకు మరల్ప సాధ్యమే మానవున కిలాచక్రమందు’ అంటాడు గుర్రం జాషువ. ఒక్క మాటలో చె ప్పాలంటే విశ్వవిఖ్యాతి గడించిన మహనీయులందరూ ఏ రంగానికి చెందిన వారైనా కాలం విలువ బాగా తెలిసిన వారే సమయాన్ని సద్వినియోగపరచుకున్నవారే. కాలం అనేది మనం ఆపితే ఆగదు. కాబట్టి ఏ సమయంలో ఏ పని చెయ్యాలో ఆ సమయంలో ఆ పని చేస్తే సమయం సద్వినియోగపరిచినట్లే. ప్రపంచంలో గొప్పవాళ్ళయిన వ్యక్తులందరూ కాలం విలువ తెలిసిన వాళ్ళే. ప్రతీ క్షణాన్నీ సద్వినియోగం చేసినవాళ్ళే. అందువల్లనే, ఆది శంకరాచార్యులు, ఏసుక్రీస్తు, వివేకానందస్వామి మొదలైన మహాపురుషులు చిన్నవయస్సులోనే శరీరాన్ని చాలించినప్పటికీ, తాము జీవించి ఉన్న స్వల్పమైన సమయంలోనే అద్వితీయమైన, అప్రతిహతమైన విజయాలను సాధించగలిగారు. ‘‘యువతీ యువకుల్లారా.. మీరంతా మేల్కొనండి. లక్ష్యసాధనకోసం శ్రమించే క్రమంలో ప్రతి క్షణాన్నీ సద్వినియోగపరచండి. మీరు మండే నిప్పు కణికలు అని గమనించండి. కాబట్టి కాలం విలువ ఎరిగినవారై, బద్ధకాన్ని వదలండి.’’ అంటూ స్వామి వివేకానంద ఇచ్చిన సందేశం ఎంతో విలువైనది. సమయం విలువను కాల రాచే మహమ్మారిలాంటి జాడ్యం సోమరితనం. సాధారణంగా మనసు సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటాయి. పరీక్షలొస్తున్నాయి చదవడం వెంటనే ఆరంభించమని బుద్ధి చెబుతుంది. ఏమీ ఫరవాలేదు, పరీక్షలు బాగా దగ్గరకొచ్చాక చదవొచ్చని మనస్సు చెబుతుంది. మనం మనస్సు పలికిన మాటే వింటాం. బుద్ధి చెప్పింది వినం. అందుకే ఎంతో అనర్థం జరుగుతోంది. ప్రతి వ్యక్తీ, తన మనసును అదుపులో ఉంచుకుంటే సోమరితనాన్ని జయించి, కాలాన్ని ఉపయోగించుకుని తగిన రీతిలో సార్థకత్వాన్ని సాధించడం కష్టమైన పని కాదు. జగత్ప్రసిద్ధమైన ఆపిల్ కంపెనీ సహవ్యవస్థాపకుడైన స్టీవ్ జాబ్స్ మాట్లాడుతూ, ‘‘నీ సమయం ఎంతో విలువైనది. ఆ సమయాన్ని వినియోగించి నీ జీవితాన్ని స్వర్గమయం చేసుకో. కాలాన్ని వ్యర్థం చేసుకుని, ఇంకొకరి జీవితంలో నీవు బతకకు’’ అంటారు. కాలం విలువ తెలుసుకుని, ప్రగతిని సాధిస్తూ, ముందుకు సాగమని, ఇంకొకరితో తనను పోల్చుకోకుండా ధరిత్రిలో మరొక కొత్త చరిత్రను లిఖించమనే ప్రబోధమూ ఈ మాటల్లో దాగి ఉంది. ‘‘ప్రపంచంలో అతి విలువైన వస్తువులు రెండు.. మొదటిది సహనం, రెండోది కాలం.’’ అంటారు లియో టాల్‌స్టాయ్. సృష్టిలో మనకు లభించే అత్యంత విలువైన సంపద కాలమే. కానీ అత్యంత దయనీయంగా నిత్యమూ మనం వృథా చేసేదీ కాలాన్నే..!! ‘‘సమయం ప్రధానమైన విషయాల్లో ఒకటి కాదు. సమయమే అత్యంత ప్రశస్తమైన సంపద’’ అని యువత గ్రహిస్తే, వారి భవిత బంగరు బాట కావడం కష్టమేమీ కాదు. కాలాన్ని సద్వినియోగపరచిన ప్రతి వ్యక్తీ చేయగలిగేది మహేంద్రజాలమే. సమయం విలువను కాల రాచే మహమ్మారిలాంటి జాడ్యం సోమరితనం. సాధారణంగా మనసు సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటాయి. పరీక్షలొస్తున్నాయి చదవడం వెంటనే ఆరంభించమని బుద్ధి చెబుతుంది. ఏమీ ఫరవాలేదు, పరీక్షలు బాగా దగ్గరకొచ్చాక చదవొచ్చని మనస్సు చెబుతుంది. మనం మనస్సు పలికిన మాటే వింటాం. బుద్ధి చెప్పింది ఏ మాత్రం వినం. అందుకే ఎంతో అనర్థం జరుగుతోంది. ప్రతి వ్యక్తీ, తన మనసును అదుపులో ఉంచుకుంటే సోమరితనాన్ని జయించి, కాలాన్ని ఉపయోగించుకుని తగిన రీతిలో సార్థకత్వాన్ని సాధించడం కష్టమైన పని ఏమాత్రం కాదు. –వ్యాఖ్యాన విశారద, వెంకట్ గరికపాటి -
మీకు నచ్చిన సమయానికే ఈ-మెయిల్‌ను ఇలా సెండ్ చేయండి...!
నేటి టెక్నాలజీ యుగంలో ఉత్తర ప్రత్యుత్తరాలను పంపడానికి జీ-మెయిల్, యాహూ, వంటి మెయిల్ ప్రొవైడర్స్‌పై కచ్చితంగా ఆధారపడాల్సి ఉంటుంది. కంప్యూటర్ వచ్చిన తొలినాళ్లలో ఆర్కూట్ వంటి ఈ-మెయిల్ సేవలు అందుబాటులో ఉండేవి. కాలక్రమేణా ఆర్కూట్ స్థానంలో యాహూ, గూగుల్ వంటి సంస్థలు తమ సొంత మెయిల్ సర్వీస్‌లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చాయి. ప్రస్తుతం మనలో చాలా మంది జీమెయిల్ సర్వీస్‌లనే ఎక్కువగా వాడుతుంటాం. మొదట్లో జీ-మెయిల్ షెడ్యూల్డ్ సమయానికి పంపే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతో బూమ్‌ర్యాంగ్ వంటి థర్డ్‌పార్టీ మెయిల్ యాప్స్‌ను ఉపయోగించి యూజర్లు అనుకున్న సమయానికి మెయిల్స్‌ను పంపేవారు. జీ-మెయిల్ తన యూజర్ల కోసం షెడ్యూల్డ్ ఈ-మెయిల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఫలానా సంస్థలకు లేదా కార్యాలయాలకు మీకు నచ్చిన సమయానికి ఈ-మెయిల్స్‌ను ఇలా పంపండి. చదవండి: Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌లో ఈ కొత్త ఫీచర్ గమనించారా..! బ్రౌజర్నుపయోగించి జీ-మెయిల్ నుంచి ఇలా మెయిల్ సెండ్ చేయండి. మీ జీమెయిల్ అకౌంట్లో లాగిన్ అవ్వండి. ముందుగా కంపోస్ మెయిల్‌ను సెలక్ట్చేసి మీ సమాచారాన్ని, రెసిపెంట్ మెయిల్ అడ్రస్‌ను టైప్ చేయండి. తరువాత సెండ్ ఆప్షన్ పక్కనే ఉన్న డ్రాప్ డౌన్ ట్రయాంగిల్ సింబల్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తరువాత మీకు ‘షెడ్యూల్డ్ సెండ్ ఆప్షన్’ మీకు కన్పిస్తోంది. దానిపై క్లిక్ చేస్తే మీకు ఫలానా సమయంలో మెయిల్స్ వెళ్లే ఆప్షన్‌ను జీమెయిల్ డిఫాల్ట్‌గా చూపిస్తుంది. ఒక వేళ డిఫాల్ట్ సమయానికి కాకుండా మీకు నచ్చిన సమయం కోసం పిక్ అండ్ డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మీకు నచ్చిన సమయాన్ని ఎంచుకోవాలి. మీ మెయిల్ షెడ్యూల్ అయ్యిందని జీ-మెయిల్ డ్రాఫ్ట్‌లో సేవ్ అయి ఉంటుంది. ఒక వేళ మెయిల్లో ఏవైనా పొరపాట్లు వచ్చినా తిరిగి మెయిల్‌ను సేవ్ చేసుకునే సౌకర్యం మీకు ఉంటుంది. ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ నుంచి ఇలా మెయిల్ సెండ్ చేయండి..! మీ ఫోన్ లేదా టాబ్లెట్‌లో జీమెయిల్ యాప్‌ను సెలక్ట్ చేయండి. కింద కన్పించే కంపోస్ అప్షన్‌పై క్లిక్ చేయండి. మెయిల్ కంపోస్ చేసిన తరువాత పక్కనే ఉన్న త్రీడాట్స్‌పై క్లిక్ చేయండి. త్రీడాట్స్‌ను ఎంపిక చేసిన వెంటనే మీకు షెడ్యూల్ టై అనే ఆప్షన్ మీకు కన్పిస్తోంది. దానిపై క్లిక్ చేసి పైనా చెప్పిన విధంగా మీ ఈ-మెయిల్‌ను షెడ్యూల్ చేసుకోండి. (చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్...!) -
118 ఏళ్ల కింద.. టైమ్ ఎలా సెట్ చేశారు?
టైం.. మన జీవితంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. చూసుకోవడానికే కాదు.. ఏది మాట్లాడినా.. దీన్ని ప్రస్తావించకుండా ఉండలేము కూడా.. అందుకే.. వాడి టైం మొదలైందిరా.. అన్నా.. వీడి టైం బ్యాడ్ నడుస్తోంది రా అన్నా.. ఏదైనా టైం కలసి రావాలి అన్నా.. ప్రతి విషయంలోనూ దానికున్న ప్రాధాన్యతే వేరు.. మరి అలాంటి ‘టైం’ను ఎప్పుడు సెట్ చేశారు? నిజానికి భూమి తిరుగుతున్న కొద్దీ ఒక్కో ప్రాంతంలో సూర్యోదయం అవుతూ వస్తుంది. అలా దేశాలు దాటుతున్న కొద్దీ.. కొన్నిచోట్ల అప్పుడే తెల్లవారుతుంటే, మరికొన్ని చోట్ల మధ్యాహ్నం, ఇంకొన్ని చోట్ల సాయంత్రం, రాత్రి అవుతుంటాయి. అంటే ఒక్కో చోట ఒక్కో టైం.. తొలినాళ్లలో ఇదంతా పెద్ద గందరగోళంగా ఉండేది.. సరిగ్గా చెప్పాలంటే.. 118 ఏళ్ల కింద ఈ ‘టైం జోన్ల’ను నిర్ధారించి, ఇబ్బందులను సెట్ చేశారు. అందుకే ఆ స్టోరీతోపాటు మరికొన్ని డిఫరెంటు సంగతులనూ తెలుసుకుందామా.. మొదట్లో ఎక్కడి టైం అక్కడే మొదట్లో ప్రపంచవ్యాప్తంగా సమయం విషయంగా తీవ్ర గందరగోళం ఉండేది. ఎక్కడికక్కడ స్థానికంగానే.. పగలు సూర్యోదయం, అస్తమయం, సూర్యుడి నీడ కదలికలతో.. రాత్రిపూట చంద్రుడు, నక్షత్రాల ఆధారంగా సమయాన్ని లెక్కించేవారు. అప్పట్లో వేగవంతమైన రవాణా లేదు. ఒకచోటి నుంచి మరో చోటికి వెళ్లేందుకు ఎక్కువసేపు పట్టడంతో.. సమయాల్లో తేడా తెలిసేది కాదు. వేగవంతమైన రవాణా వచ్చాక సమయం విషయంగా ఇబ్బందులు పెరిగిపోయాయి. కెనడా ఇంజనీర్ ఆలోచనతో.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికక్కడ వేర్వేరు సమయాల సమస్యను తొలగించేందుకు కెనడాకు చెందిన ఇంజనీర్ సర్ శాండ్ఫోర్డ్ ఫ్లెమింగ్ ఓ ప్రతిపాదన చేశాడు. భూమి అంతటినీ గంటకో టైం జోన్ వచ్చేలా.. 24 టైం జోన్లుగా విభజించాలని సూచించాడు. ప్రతి 15 డిగ్రీల రేఖాంశం వద్ద ఒక టైం జోన్ పెడితే సరిపోతుందన్నాడు. ►శాండ్ఫోర్డ్ సూచనతో 1884లో ఇంగ్లండ్‌లోని గ్రీన్విచ్ ఆధారం గా (జీరో డిగ్రీగా) తీసుకుని 24 టైం జోన్లను నిర్ధారించారు. దీనిని గ్రీన్విచ్ మీన్ టైం (జీఎంటీ)గా పేర్కొంటారు. తర్వాత 1967లో మరింత స్పష్టంగా, కచ్చితమైన అణు గడియారాలతో కూడిన ‘ది కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం (యూటీసీ)’ మొదలైంది. టైం జోన్లన్నింటినీ.. యూటీసీ ప్లస్, మైనస్ (బేస్ టైంజోన్‌కు ముందు, వెనుక ఉన్న ప్రాంతాలు)గా లింక్ చేసి చెప్తారు. మన టైం ఎప్పుడొచ్చింది? వైశాల్యం పరంగా ప్రపంచంలోనే ఏడో పెద్ద దేశం ఇండియా. బ్రిటిష్ వారి హయాంలో బాంబే, కలకత్తా, మద్రాస్.. మూడు టైంజోన్లు పాటించేవారు. అయితే 1906లో దేశంలో ఎక్కువ ప్రాంతాల మధ్య సమతుల్యత వచ్చేలా ఒకే ‘ఇండియన్ స్టాండర్డ్ టైం (ఐఎస్టీ)’ని అమల్లోకి తెచ్చారు. మన సమయం ‘యూటీసీ+ 5.30’ గంటలుగా ఉంటుంది. ►మన దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో ముందే సూర్యోదయం అవు తుంది. అందువల్ల అస్సాం టీ తోటల్లో పనుల కోసం సమయాన్ని గంట ముందు కు జరిపి.. ‘టీ గార్డెన్ టైం’గా పాటిస్తుంటారు. ►ఇండియా టైంజోన్లోనే శ్రీలంక మన సమ యాన్నే పాటిస్తుంది. నేపాల్ తమకో ప్రత్యేకత ఉండా లంటూ.. 15 నిమిషాలు ముందుండే ‘యూటీసీ+5.45’ టైంజోన్‌ను వాడుతోంది. చైనాలో టైం గోల! ప్రపంచంలో వైశాల్యంలో నాలుగో పెద్ద దేశం చైనా ‘బీజింగ్’ పట్టణం కేంద్రంగా ఒకే టైం జోన్ పాటిస్తుంది. దీనితో ఇప్పటికీ గందరగోళమే. బీజింగ్ చైనాలో తూర్పు కొసన .. క్సింజియాంగ్ వంటి ప్రాంతాలు పడమర చివరన ఉంటాయి. ఒకే టైం పాటించడంతో బీజింగ్‌లో ఉదయం 9 గంటలకు ఆఫీసుకు వెళితే.. క్సింజియాంగ్‌లో పొద్దున ఆరు గంటలకే బయలుదేరాల్సి ఉంటుంది. ►ప్రపంచంలో అతిపెద్ద దేశం అయిన రష్యాలో అయితే తూర్పు, పడమర చివర్లలోని ప్రాంతాల మధ్య తేడా పది గంటలకుపైనే ఉంటుంది. కానీ అక్కడ వేర్వేరు టైంజోన్లు పాటిస్తుండటంతో ఇబ్బంది కాస్త తక్కువగా ఉంది. ►ఇక 1940లో అయితే స్పానిష్ నియంత ఫ్రాంకో కేవలం హిట్లర్‌కు సంఘీభావం తెలిపేందుకు తమ దేశ టైం జోన్‌ను జీఎంటీ నుంచి జర్మనీ పాటించే సెంట్రల్ యూరోపియన్ టైంకు మార్చేశారు. గౌరవం కోసం ఒకరు.. పొదుపు కోసం మరొకరు ►ప్రపంచంలో రెండు దేశాలు ఇటీవల తమ సమయాన్ని మార్చేసుకున్నాయి. తమ సమయాన్ని అరగంట ముందుకు జరిపేసుకున్నాయి. అందులో ఒకటి ఉత్తర కొరియా, మరొకటి వెనెజువెలా. ►ఉత్తర కొరియా వాస్తవానికి ‘యూటీసీ+8.30’ టైం జోన్లో ఉంటుంది. వందేళ్ల కింద తమ ఆక్రమణలో ఉన్న కొరియా టైంజోన్‌ను జపాన్ ‘యూటీసీ+9.00’కు మార్చేసింది. 2015లో ఉత్తర కొరియా తమ ఆత్మగౌరవం కోసమంటూ.. సమయాన్ని అర గంట ముందుకు జరుపుకొని, పాత టైంజోన్‌కు మారింది. తర్వాత ఉత్తర, దక్షిణ కొరియాల్లో ఏకత్వం పేరిట ‘యూటీసీ+9.00’కి మార్చారు. ►విద్యుత్ పొదుపు కోసం వెనెజువెలా తమ దేశంలో టైమ్‌ను అరగంట పెంచి ‘యూటీసీ+4.30 నుంచి యూటీసీ+4.00’ టైంజోన్‌కు మారింది. దీనివల్ల పొద్దున లేటుగా నిద్రలేస్తారని, సాయంత్రం ఆలస్యంగా ఇళ్లకు వెళ్తారని.. విద్యుత్ బల్బులు, ఉపకరణాల వినియోగం తగ్గుతుందని ఇలా చేసింది. – సాక్షి సెంట్రల్ డెస్క్ చదవండి: ఆఫ్రికాలో దొరికిన అరుదైన మూడో అతిపెద్ద వజ్రం -
అక్కడ సమయానికి వడ్డీ కూడా ఇస్తారు.. ఎలాగంటే!
స్విట్జర్లాండ్‌కి ప్రపంచ పటంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇటీవలి కరోనా కాలంలో కూడా ఆ దేశంలో ఒక్క కేసు కూడా రాకుండా జాగ్రత్తపడ్డారు. అన్ని విషయాలలోనూ కొత్తగా ఆలోచిస్తారు ఆ దేశీయులు. ఏ ఆసరా లేని వృద్ధుల గురించి ఒక కొత్త పథకం ప్రవేశపెట్టారు. అదే ‘టైమ్ బ్యాంక్ ’ స్కీమ్. ఒంటరిగా, కుటుంబ సభ్యుల సహకారం లేకుండా నివసిస్తున్న సీనియర్ సిటిజెన్లకు అండగా నిలబడటానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. స్విట్జర్లాండ్‌లో ఒక పాఠశాల దగ్గర 67 సంవత్సరాల ఒంటరి మహిళ ఉండేవారు. ఆవిడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసి రిటైరయ్యారు. తనకొచ్చే పెన్షన్‌తో ఆవిడ హాయిగా కాలం గడపవచ్చు. కాని ఆమె ఖాళీగా కూర్చోవటానికి ఇష్టపడలేదు. తనకంటె 20 సంవత్సరాలు ఎక్కువ వయసున్న ఒక వృద్ధురాలికి సేవ చేసే పనిలో కుదిరారు. డబ్బు కోసం పనిచేయవలసిన అవసరం లేదు ఆమెకకు. తన సమయాన్ని టైమ్ బ్యాంకులో దాచుకోవటానికి పనిచేశారు. అక్కడే మొదలు.. టైమ్ బ్యాంక్‌ను స్విట్జర్లాండ్‌లోని ప్రభుత్వ సామాజిక భద్రతా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసింది. అక్కడి ప్రజలు యవ్వనంలో, ఆరోగ్యంగా ఉన్నప్పుడు... నిస్సహాయులైన వృద్ధులకు సేవలందిస్తూ, సమయాన్ని దాచుకొని, తిరిగి వారికి అవసరంలో ఉన్నప్పుడు ఉపయోగించుకోవచ్చు, ఇందుకోసం వారు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. చక్కగా మాట్లాడే సంభాషణ నైపుణ్యం ఉండాలి. ప్రతిరోజు వారి సేవలను కోరుకునే వారికి కావలసిన సేవలు అందించగలిగే స్థితిలో ఉండాలి. వారి సేవాకాలాన్ని వారి వ్యక్తిగత ఖాతాలో ‘సామాజిక భద్రత మంత్రిత్వశాఖ’ జమ చేస్తుంది. అలా ఆ 67 సంవత్సరాల మహిళ వారానికి రెండు రోజులు రెండు గంటల చొప్పున వృద్ధులకు సేవలు అందించటానికి వెళ్లేవారు. వారి గదుల్ని శుభ్రం చేయటం, వారికి కావలసిన సరుకులు తేవటం, వారికి ఎండలో స్నానం చేయటానికి సహకరించటం వంటి పనులకు సహాయపడేవారు.. కొద్దిసేపు వారితో సరదాగా ముచ్చటించటానికి సమయం కేటాయించేవారు. వారు దరఖాస్తులో చేసుకున్న ఒప్పందం ప్రకారం. సంవత్సరం తర్వాత ‘టైమ్ బ్యాంక్’ వారు ఆమె సేవాకాలాన్ని లెక్కించి, ‘టైమ్ బ్యాంక్ కార్డు’ జారీ చేసింది. ఆమెకు ఇతరుల సహాయం అవసరం ఉన్నపుడు తన కార్డును ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఉంది. బ్యాంకులో డబ్బులు దాచుకుంటే వడ్డీ వచ్చినట్లుగానే, ఖాతాలో ఉన్న సమయాన్ని వడ్డీతో సహా తిరిగి వాడుకోవచ్చు. దరఖాస్తును పరిశీలించి, టైమ్ బ్యాంక్ ఒక వాలంటీర్‌ను ఆమె ఇంటికి గానీ, ఆస్పత్రికి గానీ పంపుతారు. ఒక టీచర్ తన అనుభవాన్ని, ‘‘ఒకరోజు నేను స్కూల్లో ఉన్నపుడు నాకు పిలుపు వచ్చింది. నేను అక్కడకు వెళ్లాను. ఆవిడ... తాను కిటికీ శుభ్రం చేస్తుంటే స్టూల్ మీద నుంచి జారిపడ్డానని చెప్పింది. నేను వెంటనే స్కూల్‌కి సెలవు పెట్టి, ఆవిడను ఆసుపత్రికి తీసుకువెళ్లాను. ఆవిడకు మడమ దగ్గర ఫ్రాక్చర్ అయ్యిందనీ, కొంతకాలం పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలనీ చెప్పారు డాక్టర్. నేను కొన్ని రోజుల పాటు ఆవిడ ఇంటి దగ్గర ఉండటానికి సిద్ధపడ్డాను. అయితే ఆవిడ నన్ను దిగులుపడద్దని, అప్పటికే తాను టైమ్ బ్యాంక్‌కి దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. ఆసుపత్రిలో చేరిన రెండు గంటలకే, ఆవిడకు సేవలందించడానికి టైమ్ బ్యాంక్ వారు వాలంటీర్లను పంపారు. నెల రోజుల పాటు ఆ వాలంటీర్ ఆమె యోగక్షేమాలు చూసుకున్నారు. ఆమెకు ఇష్టమైన వంటకాలు తయారు చేసి పెట్టారు. మనసుకు ఉల్లాసం కలిగించేలా కబుర్లు చెప్పారు. సకాలంలో మంచి సేవలు అందటం వల్ల, త్వరగా కోలుకుని, తిరిగి తన పనులు తాను చేసుకోవటం మొదలుపెట్టారామె. తాను ఇంత ఆరోగ్యంగా ఉండటానికి టైమ్ బ్యాంక్‌లో మరింత కాలాన్ని నమోదు చేసుకుంటానంది ఆవిడ’’ అని చెప్పారు. రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన టైమ్ బ్యాంకు సేవలను ఇప్పుడు స్విట్జర్లాండ్‌లో అందరూ ఆనందంగా వినియోగించుకోవటం సర్వసాధారణమైపోయింది. ఈ పద్ధతి వల్ల ఆ దేశంలో బీమా ఖర్చులు బాగా తగ్గాయి. అనేక సామాజిక సమస్యలు కూడా పరిష్కారమవుతున్నాయి. ఆ దేశప్రజలు ఈ విధానాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించారు. అక్కడ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ఆ దేశ పౌరులలో సగం మంది పౌరులు టైమ్ బ్యాంకు విధులలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రభుత్వం ఈ విధానాన్ని చట్టబద్ధం చేసింది. ప్రస్తుతం ఆసియా దేశాల్లో ఒంటరి గూటి వృద్ధ పక్షుల సంఖ్య బాగా పెరిగిపోతుండటం వల్ల వారి సంక్షేమం ఒక సామాజిక సమస్యగా మారుతోంది. అన్ని దేశాల వారు స్విట్జర్లాండ్ ‘టైమ్ బ్యాంక్ ‘ విధానం గురించి ఆలోచన చేసి, టైమ్ బ్యాంకు విధానాన్ని ప్రవేశపెట్టి, చట్టబద్ధం చేస్తే మంచిదేమో. ఆలోచించాల్సిన విషయమే. టైమ్ బ్యాంకు... ఈ పేరు వినగానే ఇది ఏమిటి అనిపిస్తుంది. మన దగ్గరున్న డబ్బులు మనీ బ్యాంకులో వేస్తాం. ఆ బ్యాంకుల గురించి అందరికీ తెలుసు. అలాగే మనం చేసిన పని సమయాన్ని టైమ్ బ్యాంకులో వేస్తాం. అదే టైమ్‌బ్యాంక్. ఆ టైమ్‌ను, తను కదలలేని పరిస్థితుల్లో వినియోగించుకోవచ్చు. వినటానికి ఈ మాట కొత్తగా అనిపిస్తోందా. ఇది నిజం. స్విట్జర్లాండ్‌లో ఇప్పుడు అందరూ బాగా వినియోగించుకుంటున్న ఏకైక బ్యాంకు టైమ్ బ్యాంక్. -
పట్టు దొరకడానికే పద్యం
అబ్దుల్ కలాంగారు విద్యార్థులతో మాట్లాడుతూ –‘‘నువ్వు ఒక కళాకారుడివి కావాలా, శాస్త్రవేత్తవి కావాలా, ఆధ్యాత్మికవేత్తవి కావాలా, ఆదర్శ రైతువి కావాలా... నీ ఇష్టం... నువ్వే నిర్ణయించుకో’–అంటారు. విద్యార్థులు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఈ దేశ చరిత్రలో మీ పేరుమీద ఒక పేజీ చేరాలంటే.. మీకు జీవితం, కాలం విలువ తెలిసి ఉండాలి. చాలా మంది ఏదో ఒక బలహీనతకు ఆకర్షితులై వశపడిపోతారు. దాన్ని తట్టుకుని నిలబడి నిగ్రహంతో చదువుకోవడం విద్యార్థి దశలోనే ఎక్కువ సాధ్యపడుతుంది. ఆ తరువాత కాలంలో చదువుకుందామన్నా ఆ అవకాశం ఇంత సులభసాధ్యంగా మాత్రం ఉండదు. అన్నివేళలా కనిపెట్టుకుని ఉండే తల్లి, నీ అవసరాలు తీర్చే తండ్రి, ఇంటిపట్టున నీ చదువు సాఫీగా సాగేలా ఎన్నో సర్దుబాట్లు, నీ అభ్యున్నతిని కోరి నీకు నిత్యం అందుబాటులో ఉండే నీ గురువులు...ఇంత అనుకూలమైన స్థితి జీవితంలో మళ్ళీ రాదు. దీన్ని ఎవడు బాగా సద్వినియోగం చేసుకుంటాడో వాడు బాగా వృద్ధిలోకి వస్తాడు. అందుకే వాంఙ్మయాన్ని ఛందోబద్ధం చేసారు. దేనిని ఎక్కువకాలం జ్ఞాపకం ఉంచుకోనవసరం లేదో దానిని వచనంగా చెబుతారు. ఏది జీవితాంతం జ్ఞాపకంలో ఉండాలో దానిని ఛందస్సులో రాస్తారు. మత్తేభం, శార్దూలం, కందం, సీసం... ఇలా రాసిన పద్యాలు ధారణాయోగ్యాలయి ఉంటాయి. అవి చదివితే అలా గుర్తుండిపోతాయి. అందుకూ ఛందస్సున్నది. నీకు జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఆ విద్య నీకు అక్కరకు వస్తుంది... అంతేతప్ప పుస్తకం గూట్లో ఉండి బుర్రలో లేకపోతే సమస్యలను తట్టుకోగలిగిన నైతిక మార్గదర్శనం, శక్తి నీకు ఉండదు. అందుకే అంది వచ్చిన కాలాన్ని వదులుకోకూడదు. దక్షిణ భారత దేశంలో ప్రఖ్యాతి వహించిన అరబిందో ఒకానొకనాడు అండమాన్ కారాగారంలో ఉన్నారు. శరీరాన్ని పూర్తిగా చాపుకుని పడుకోవడానికి కూడా చాలని గది. మంచినీళ్లు కావాలంటే... చువ్వల్లోంచి చేతులు పూర్తిగా చాపితే అందీ అందని చోట ఒక కుండ, ఒక గ్లాస్...పొరబాటున చేతినుంచి గ్లాస్ జారి పడిపోతే..ఇక ఆరోజుకు అంతే..కారాగారాన్ని శుభ్రపరిచే వ్యక్తి రోజుకు ఒకసారి అటువైపు వస్తాడు. కుండతో నీళ్ళు పెట్టి, అన్నం కంచం లోనికి తోసేసి వెళ్ళిపోతాడు. చాలామంది ఆ పరిస్థితులను తట్టుకోలేక మరణించేవారు. అలా పోయినవారి శరీరాల్ని పట్టుకు వెళ్ళి పక్కనే ఉన్న సముద్రంలోకి విసిరేసేవారు.... అరబిందో అన్నీ చూస్తుండేవారు. కానీ ఆయన మాత్రం...కాలం ప్రశాంతంగా లభించిందని, ఆ నరకకూపంలో కూర్చునే భగవద్గీత అంతా చదివి–వ్యాఖ్యానాలు తయారు చేసి... విడుదలయిన తరువాత తన సిద్ధాంతాలతో ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందారు. జవహర్ లాల్ నెహ్రూ గారిని కారాగారంలో ఉంచితే ...కాలాన్ని వృథా చేసుకోకూడదని అద్భుతమైన గ్రంథాలు రాసారు. అప్పటివరకు సామాన్యులుగా ఉన్నవారు, మన కళ్ళెదుటే మహాత్ములుగా మారడాన్ని చూస్తుంటాం. వారు చెప్పేదీ వింటూంటాం. మనసుకు ఎక్కనప్పుడు, ఎక్కించుకోనప్పుడు విని ఏం ప్రయోజనం !!! ఇన్ని గంటలకు లేస్తాను, రేపు ఈ పని చేస్తాను..అనుకుంటావు...కానీ లేవవు, చేయవు. నీవు చేయవలసిన పని గురించి నీకే ప్రణాళిక లేకపోతే రేపు ఏ ఉన్నత ఉద్యోగం పొందగలవు, దేశానికి లేదా నీవు పనిచేసే సంస్థకు ఏ ప్రణాళికలు రచించగలవు ??? మహాత్ముల జీవితాలగురించి ఎంత చదివారని కాదు, ఎంత విన్నారని కాదు, ఎంతగా ప్రేరణ పొందారు, దాన్ని సఫలీకృతం చేసుకోవడానికి కాలాన్ని ఎంతగా సద్వినియోగం చేసుకున్నారన్న దాని మీదే మీ విద్యార్థుల బంగారు భవిత ఆధారపడి ఉంది. -
సూర్య గడియారం.. సమయం చూసేదెలా?
సాక్షి, అన్నవరం: హిందువులతో పూజించబడుతున్న ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. ఆయన లేనిదే మానవ మనుగడ లేదన్నది జగమెరిగిన సత్యం. అటువంటి సూర్యభగవానుడు కొలువైన క్షేత్రాలు అతి తక్కువ. రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిన కూడా సూర్యభగవానుడు నిత్యం పూజలందుకుంటున్నాడు. విష్ణు పంచాయతనం కలిగిన సత్యదేవుని ఆలయం దిగువన యంత్రాలయంలో ఆగ్నేయంలో సూర్యభగవానుడు కొలువు తీరారు. అంతే కాదు సూర్యకిరణాల ఆధారంగా కచ్చితమైన సమయం తెలిపే సూర్యగడియారం కూడా రత్నగిరిపై దశాబ్దాల క్రితమే ఏర్పాటు చేశారు. సూర్య కిరణాల ఆధారంగా.. సత్యదేవుని ఆలయానికి ఈశాన్యభాగాన, స్వామి వారి నిత్య కల్యాణ మండపం వద్ద గల సూర్యగడియారం (సన్డయిల్)లో సూర్యకాంతి ఆధారంగా కచ్చితమైన సమయం తెలుసుకోవచ్చు. ఖగోళ శాస్త్రాన్ని అనుసరించి సూర్యగమనం ఆధారం ఈ గడియారాన్ని 1943లో అప్పటి ఆలయ ధర్మకర్త ఇనుగంటి వేంకట రాజగోపాల రామసూర్యప్రకాశరావు కోరిక మేరకు ఖగోళ, జ్యోతిష శాస్త్రాలలో నిష్ణాతుడైన రాజమహేంద్రవరానికి చెందిన పిడమర్తి కృష్ణమూర్తి శాస్త్రి నిర్మించారు. నిర్మాణం ఇలా.. 12 అడుగుల పొడవు, ఎనిమిది అడుగుల వెడల్పు కలిగిన గ్రానైట్ పలకపై త్రికోణం ఆకారంలో తూర్పునకు అభిముఖంగా మరో చిన్న పలక అమర్చారు. సూర్యకాంతి ఆ చిన్న పలక మీద పడి దాని నీడ పెద్ద పలకపై పడుతుంది. అలా నీడ పడే చోట అర్ధచంద్రాకారంగా గడియారంలో ఉన్నట్టుగా అంకెలు ఉంటాయి. ఆ నీడ పడిన అంకెలకు ఆయా నెలలు, తేదీలు అనుసరించి కొంత సమయాన్ని కలపడం లేదా తీసివేయడం చేయాలి. అలా చేయడం వల్ల మనకి కచ్చితమైన సమయం తెలుస్తుంది. ఎప్పుడు కలపాలి, ఎప్పుడు తీసివేయాలనే దానిపై అక్కడ గల సూచనల పట్టికలో వివరంగా లిఖించబడి ఉన్నాయి. ఉదాహరణకు ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం ఆ పలక నీడ 10–20 అంకెల మధ్య పడితే అక్కడ ఉన్న పట్టిక ప్రకారం ఆ తేదీకి పది నిమిషాలు కలపాలి. అంటే అప్పుడు సమయం 10.30 అయినట్టు. విశేషమేమిటంటే ఈ సమయం కచ్చితంగా ఇండియన్ స్టాండర్డ్ టైమ్‌కు సరిపోతుంది. నిర్వహణ పట్టించుకోని దేవస్థానం ఎంతో విశిష్టత కలిగిన ఈ సూర్యగడియారం ఆలనా పాలనా లేకపోవడంతో సమయం ఎలా తెలుసుకోవాలో తెలియక భక్తులు ఏదో నిర్మాణాన్ని చూసినట్టు చూసి వెళ్లిపోతున్నారు తప్ప, ఆ గడియారంలో సమయం తెలుసుకునే విధానం తెలుసుకోలేక నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ గడియారంలో సమయం చూసుకునేందుకు అక్కడ పలక మీద వేసిన అంకెలు, సూచనల పట్టికలోని సూచనలు, ప్లస్, మైనస్ గుర్తులు అరిగిపోయి స్పష్టంగా కనిపించడం లేదు. దేవస్థానం అధికారులు మళ్లీ స్పష్టంగా రాయించాలి. అదే విదంగా ఈ సూర్య గడియారం ప్రాముఖ్యతను భక్తులకు వివరించేందుకు అక్కడొక గైడ్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు. -
‘రోజా’ సమయం చెప్పింది మనమే..
సాక్షి సిటీబ్యూరో: రంజాన్ మాసం అంటేనే గుర్తుకొచ్చేది ఉపవాస దీక్ష. నెలరోజుల పాటు నిష్టగక్షీ దీక్ష చేసి రంజాన్ పండుగ జరుపుకుంటారు. అయితే దీక్షా కాలంలో సహెర్, ఇఫ్తార్ సమయాలు ముందుగానే నిర్ణయిస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పుడైతే ఏ సమయంలో సహర్, ఏ సమయంలో ఇఫ్తార్ అనేది కేలెండర్లు ముద్రిస్తున్నారు. వందల సంవత్సరాలనుంచి ఈ దీక్షను ముస్లింలు పాటిస్తున్నారు. మరి ఇంత టెక్నాలజీ లేని కాలంలో ఎలా పాటించేవారో అనే విషయం ఆసక్తికరం. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మహ్మద్ అబ్దుల్ హసే ఈ సమయానికి సంబంధించిన పట్టికను రూపొందించారు. దీనిని ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్నారు. అనేక సంవత్సరాల క్రితం సహర్– ఇఫ్తార్ సమయాలు సరిగా తెలియకపోవడంతో వివిధ ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సహర్, ఇఫ్తార్ çసమయ నిర్ధారణ లేకపోవడంతో ఇబ్బందులు పడేవారు. ఈ విషయాన్ని గ్రహించిన ఉస్మానియా ధార్మిక విభాగం ఉపవాస దీక్షకు సంబంధించిన పట్టికు రూపొందించాలని నిర్ణయించారు. ఉస్మానియాలో రూపొందించిన మీయారుల్ అవుకాత్ ( సమయ నిర్ధారణ ) పుస్తకం అధారంగానే నేటికీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాల్లో ఉపవాసాల సమయం నిర్ధారిస్తారు. పదేళ్లపాటు వివరాల సేకరణ భూమి చుట్టూ చంద్రుడు తిరిగే సమయం, సూర్యుడి చుట్టూ భూమి తిరిగే రోజులు, సమయంతో పాట వివిధ కాలల్లో సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాలను వివిధ దేశాలకు వెళ్లి అక్కడి సమయాలను దాదాపు పదేళ్లపాటు సేకరించారు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మహ్మద్ అబ్దుల్ హసే. ఈ వివరాలను క్రోడీకరించి తొలసారిగా 1930లో ఉపవాసదీక్షకు సంబంధించిన కేలెండర్‌ను రూపొందించారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉపవాసాల సమయం నిర్ధారణ కోసం 290 పేజీలతో ఉపవాస సమయ పట్టికను తయారు చేశారు. పుస్తాకాన్ని మియారుల్ అవుకాత్ అంటారు. నేటికీ ఉస్మానియా అనువాద విభాగంలో ఇది ఉంది. ఇప్పటికీ ఈ పుస్తకం అధారంగానే ప్రపంచ వ్యాప్తంగా ఉనవాస సమయాలు ఆయా దేశాల్లో నిర్ధారిస్తారు. అబ్దుల్ వాసే రూపొందిన మియారుల్ అవుకాత్ అధారంగా 1938 నుంచి ఉపవాస పట్టిక తయారు చేయడం ప్రాంభించారు. గతంలోఉపవాస ప్రారంభ, విరమణ సమయాల్లో ప్రజలకు తెలపడానికి తూటాలు పెల్చివారు. 1970 నుంచి ప్రచురణ... 1970 నుంచి ఉపవాస దీక్షకు సంబంధించిన కేలెండర్‌ను ప్రచురించడం మొదలుపెట్టారు. అప్పటినుంచీ దానికి ఆదరణ రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. దిన, వార, మాస పత్రికల్లో రంజాన్ మాసానికి ముందే ఉపవాస పట్టికను ప్రచురించే వారు. 1994 నుంచి అన్ని హంగులతో మల్టీ కలర్లో ప్రింట్ చేస్తున్నారు. ప్రస్తుతం చెత్త బజార్ మార్కెట్లోనే ప్రచురించి రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటకలకు తీసుకెళుతారు. ఈ సంవత్సరం దాదాపు 5 రకాల మోడళ్లలో 10 కోట్ల కార్డులో ప్రచురించారు. -
సమయాన్నీ దాచుకోవచ్చు తెలుసా?
సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ : బ్యాంక్..అంటే వెంటనే మనకు గుర్తుకొచ్చేది ధనాన్ని రుణంగా తీసుకోవడం, రుణాలు ఇవ్వడం. అవి బ్యాంక్ ప్రాథమిక కార్యకలాపాలని మనకు తెలిసిందే. మరి సమయాన్ని రుణంగా తీసుకునే బ్యాంకులు ఉన్నాయని మీకు తెలుసా? ఏంటి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా..అయితే స్విట్జర్లాండ్‌లో బాగా పాపులర్ అయిన ఈ ‘టైం బ్యాంక్’ గురించి తెలుసుకోవలసిందే. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి వసంతమహేష్ చదువుకోవడానికి స్విట్జర్లాండ్ వెళ్లాడు. కాలేజ్ దగ్గరే ఓ ఇంట్లో గది అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇంటి యజమానురాలి పేరు క్రిస్టీనా (67). ఇంట్లో ఆవిడొక్కరే ఉంటారు. క్రిస్టీనా సెకండరీ స్కూల్లో టీచర్‌గా పనిచేసి రిటైర్ అయ్యింది. ఆమెకు పింఛన్ వస్తోంది. స్విట్జర్లాండ్‌లో పింఛన్ ఎక్కువగానే ఉంటుంది. ఈ నెల పింఛను ఖర్చయిపోకుండానే మరుసటి నెల పింఛను వచ్చి చేరుతుంటుంది. అయినాగానీ క్రిస్టీనా..ఆ దగ్గర్లోనే పనికి వెళ్లొస్తుంటుంది! ఆమె చేసే పని ఓ వృద్ధుడు (87)కి సేవలు అందించడం. అది చూసిన ఆ మహేష్ ఆమెను ‘‘డబ్బు కోసమేనా పెద్దమ్మా..పనికి వెళ్లొస్తున్నారు..’’అని అడిగాడు. దానికి ఆమె బదులిస్తూ..‘‘డబ్బు కోసం కాదు. నా సమయాన్ని ‘టైమ్ బ్యాంక్ ’లో జమ చేసుకోడానికి పనికి వెళ్తున్నాను. నేను పెద్దదాన్ని అయ్యాక, మరీ కదల్లేని పరిస్థితి వచ్చినప్పుడు ఆ టైమ్‌ని తీసి వాడుకుంటాను’’అని ఆమె బదులిస్తూ ‘టైం బ్యాంక్’ గురించి మహేష్‌కు వివరించింది. టైం బ్యాంక్ పథకం గురించి పూర్తిగా తెలుసుకున్న మహేష్ తన ఫేస్బుక్ పేజీలో స్నేహితులతో టైం బ్యాంక్ గురించి వివరించాడు. దరఖాస్తు ఎలా చెయ్యాలి? స్విట్జర్లాండ్‌లో ఉన్న ఏ దేశ పౌరుడైనా సరే దీనికి దరఖాస్తు చేసుకునేలా అక్కడి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దరఖాస్తులకు సంబంధించి స్విట్జర్లాండ్ ప్రభుత్వం కొన్ని ప్రత్యేక యాప్‌లను కూడా రూపొందించింది. వీటిలో దరఖాస్తుదారుడి వివరాలు (పేరు, వయసు, ఎన్ని గంటలు పని చెయ్యాలని అనుకుంటున్నారు తదితర అంశాలు) పేర్కొనాల్సి ఉంటుంది. దరఖాస్తు నింపి దానిని సబ్మిట్ చేసిన అనంతరం స్థానికంగా ఉన్న బ్యాంకు అధికారి వద్దకు ఆ వివరాలు వెళతాయి. అధికారి పరిశీలన అనంతరం దరఖాస్తుదారుడి ఫోన్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. అందులో ఎవరి వద్దకు వెళ్లాలి, వారి వివరాలు అన్ని తెలియపరుస్తారు. దరఖాస్తులో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏడాది కాలపరిమితి తర్వాత ఈ పని గంటలన్నిటినీ కలిపి దరఖాస్తుదారుడికి ఒక కార్డు ఇస్తుంది టైం బ్యాంక్. కూడబెట్టుకున్న టైంకి వడ్డీ కూడా ఇస్తుంది. ఆ కార్డును ఉపయోగించి, తనకు ఎప్పుడు సేవలు అవసరమైతే అప్పుడు ఇంకొకరి దగ్గర్నుంచి సేవలను పొందవచ్చు. దరఖాస్తుదారుడి అకౌంట్‌ను పరిశీలించి, బ్యాంక్ సిబ్బందే వలంటీర్లను పంపుతారు. ఆ సేవలు చేయడానికి వచ్చేవారికి సేవ చేయించుకునే వ్యక్తులు డబ్బులు చెల్లించనక్కర్లేదు. వాళ్లకూ ఒక అకౌంట్ ఉంటుంది కదా.. ఆ అకౌంట్లో వాళ్ల టైమ్ జమ అవుతుంది. తమ వృద్ధాప్యంలో వాళ్లు ఆ టైమ్‌ని ‘విత్‌డ్రా’ చేసుకోవచ్చు. ఏమిటీ ఈ టైం బ్యాంక్? ‘టైం బ్యాంక్‘ అనేది స్విస్ ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ అభివృద్ధి చేసిన వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమం. యవ్వనంలో ఉన్నవారు పెద్దవాళ్లకు సేవలు చేస్తే, వీళ్లు పెద్దవాళ్లయ్యాక సేవలు పొందడానికి వీలు కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకానికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తులు తాము యవ్వనంలో ఉన్నప్పుడు వృద్ధుల గురించి శ్రద్ధ తీసుకునే సమయాన్ని టైంబ్యాంక్ లో దాచిపెడతారు. దాన్ని వారు వృద్ధులు, అనారోగ్యం పాలైనప్పుడు వాడుకొంటారు. టైం బ్యాంక్‌లో చేరే దరఖాస్తుదారులు (వ్యక్తులు) ప్రతిరోజు వారు తమ విరామ సమయాన్ని..సహాయం అవసరమైన వృద్ధులను చూసుకోవడానికి కేటాయిస్తారు. వారి సేవా గంటలు సామాజిక భద్రతా వ్యవస్థలోని వ్యక్తిగత ఖాతాల్లో టైం బ్యాంక్ జమచేస్తుంది. అలా నిర్దిష్ట కాల పరిమితి ముగిసిన తరువాత టైం బ్యాంక్ దరఖాస్తుదారుడి పనిగంటలను లెక్కించి అతడికి ‘టైం బ్యాంక్ కార్డు‘ను జారీ చేస్తుంది. అది అవసరమైనప్పుడు అతడు ఆ బ్యాంక్ నుంచి ‘టైం బ్యాంక్ కార్డు‘ను ‘టైం అండ్ వడ్డీ‘ తో ఉపసంహరించుకొని ఉపయోగించవచ్చు. సమాచారం పరిశీలన తర్వాత, ‘టైం బ్యాంక్‘ స్వచ్ఛంద సేవకులను దరఖాస్తుదారుడికి ఆసుపత్రి పనులు లేదా ఇంటి పనులు చేయడానికి నియమిస్తుంది. ఇందులో చేరడానికి అర్హతలు ఏంటి? టైం బ్యాంక్‌లో చేరాలంటే దీనికి కొన్ని ప్రత్యేక అర్హతలు కలిగి ఉండాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. అందులో ముఖ్యంగా ఈ టైం బ్యాంక్‌లో జాయిన్ అయ్యేవారు.. ►ఆరోగ్యంగా ఉండాలి ►చక్కగా మాట్లాడగలిగే నేర్పు ఉండాలి ►వృద్ధులపై ప్రేమతో ప్రవర్తించాలి ఇలా రోజుకు ఎన్ని గంటల పాటు సేవలు అందిస్తారో, అన్ని గంటల్నీ టైం బ్యాంకులోని తమ వ్యక్తిగత ఖాతాలో జమ చేసుకునే సౌలభ్యాన్ని అక్కడి ప్రభుత్వం కల్పించింది. ఎవరికి లాభం? అయితే ఈ తరహా టైం బ్యాంకుల వల్ల ఎవరికి లాభం అనే అంశాలను పరిశీలిస్తే ఇది దరఖాస్తుదారుడికి, సేవలు అందుకునే వారికి ఇద్దరికీ ఉపయోగం అని చెప్పవచ్చు. చాలామంది స్విస్ పౌరులు ఈ రకమైన ఓల్డ్–ఏజ్ పెన్షన్లను బలపరుస్తున్నారు. స్విస్ పెన్షన్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. స్విస్ యువకుల్లో సగం మంది ఈ తరహా వృద్ధుల సంరక్షణ సేవలో పాల్గొనాలని కోరుకొంటున్నారు. వృద్ధాప్యం కోసం సమయాన్ని ఇలా కూడబెట్టుకోవడం స్విట్జర్లాండ్‌లో ఇప్పుడు సర్వసాధారణం. టైం బ్యాంక్ వల్ల ప్రభుత్వానికి పింఛన్ భారం కూడా గణనీయంగా తగ్గిపోయింది. అలాగే కొన్ని సామాజిక సమస్యలకు కూడా టైం బ్యాంక్ చక్కటి పరిష్కారం అయ్యింది. స్విస్ పెన్షన్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సర్వే ప్రకారం..స్విటర్లాండ్లోని యువతీయువకుల్లో సగం మందికి పైగా వృద్ధాప్య సేవల్లో పాల్పంచుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. టైం బ్యాంక్‌ని మరింత ప్రోత్సహించేందుకు ఉన్న అవకాశాలను స్విస్ ప్రభుత్వం కూడా పరిశీలిస్తోంది. ఇందుకుగాను కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు ఈ పథకాన్ని అప్పగించి మరింత విస్తరించడానికి చర్యలు తీసుకుంటుంది. -
మేల్కొని ఉండండి
గడిచిపోయిన కాలం క్షణమైనా తిరిగి రాదు. కానీ అనంతత్వంలో మేలుకొన్నవారికి, కాలం కదలకుండా స్థిరమై నిలిచిపోతుంది! కాలం పరమేశ్వర స్వరూపం అంటారు. అందుకే కాబోలు. తనలో తాను లయమైపోతుంది. కాలానికి ఉన్న గొప్ప గుణం గాయాలను మాన్పడం. అదేంటి, గాయాలు చేయడం కూడా కదా అంటారా? అవును. గాయాలు అవుతాయి. కానీ, వాటిని చేసేది కాలం కాదు. మనం, మనలోని కోరికలు. 2018 ఎందరికో ఎన్నో తీపి, చేదు జ్ఞాపకాలు, సుఖం, సంతోషం, బాధ, దుఃఖం వంటి అనుభూతులను మిగిల్చి ఉంటుంది. కొందరికి పదవీ యోగం, కొందరికి పదవీ‘వియోగం’, కొందరికి కాసుల పంట, ఇంకొందరికి కాసుల తంట. కొన్ని జననాలు, మరెన్నో మరణాలు. ఈ ఏడాది కాలం కొందరికి కల్యాణ యోగం కలిగించితే, ఇంకొకరి కాపురంలో కలతలు రేపి ఉండవచ్చు. కొందరు వాహనాలు కొనుక్కుని ఉంటే, ఇంకొందరు తామెంతో ఆశపడి కొనుక్కున్న వాహనాలను, ఇతర ఆస్తులను అయినకాడికి అమ్మేసుకుని ఉండవచ్చు. కొందరికి ఏళ్ల తరబడి ఉన్న గండాలనుంచి గట్టెక్కించి ఉంటే, ఇంకొందరిని సుడిగండంలోకి నెట్టి ఉండవచ్చు. ఈ కాలం కలకాలం ఇలాగే నిలిచిపోనీ అని కొందరు కోరుకుంటే, ‘అబ్బబ్బ.. చేటుకాలం దాపురించిందిరా నాయనా! తొందరగా గడిచి పోతే బాగుండు’ అని మరికొందరు దండాలు పెట్టుకుంటూ ఉండచ్చు. మనం ఏమనుకుంటేనేం, ఎన్ననుకుంటేనేం.. గడిచిపోయిన కాలం క్షణమైనా తిరిగి రాదు. రాలేదు. అది సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడికి కూడా సాధ్యం కాదు. ఈ విషయాన్ని ఎరుకలో ఉంచుకుని, అప్రమత్తంగా ఉండటం అవసరం. ఇంతవరకు కోట్ల సంవత్సరాలు వచ్చిపోయాయి. లెక్కలేనన్ని సంఘటనలు జరిగిపోయాయి, లెక్కించలేనంతమంది మానవులు వచ్చి, వెళ్లిపోయారు. ఈ రోజు ఇప్పుడు.. ఇక్కడ మనం ఉన్నాం. ఏదో ఒకరోజు మనమూ వెళ్లిపోతాం.. ఒకసారి మేలుకోండి! గాఢంగా నిద్రపోతున్నవారు పండుగ జరుపుకోలేరు. కాలం ఎవరికోసమూ ఆగదని అంటారు. కాని, అనంతత్వంలో మేలుకొన్నవానికి, కాలం కదలకుండా స్థిరమై నిలిచిపోతుంది. రాబోయే నూతన సంవత్సరం కొత్త కలలు కనండి. అయితే, కొత్తగా ఆలోచించాలంటే పాతవాటిని మరచిపోవాలి. అప్పుడే కొత్తదనంచ దాని మంచీ చెడ్డా తెలుస్తాయి. కొత్త సంవత్సరంలో తీసుకునే నిర్ణయాలు ఆచరణయోగ్యంగా, నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా విజయాలు వరిస్తాయి. కొత్త కలలను నెరవేర్చుకునేందుకు నిర్విరామంగా శ్రమ చేయండి. – డి.వి.ఆర్. -
ప్రశ్నోత్తరాల సమయం లేదా?
సాక్షి బెంగళూరు: విధాన పరిషత్తులో ప్రశ్నోత్తరాల సమయం తీసివేయడంతో ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. సభ ఆరంభంలోనే ప్రశ్నోత్తరాల సమయం లేకపోవడం ఏంటని బీజేపీ సభ్యులు అరుణ్‌శాహపుర అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేవిధంగా రఘునాథ్ మల్కాపుర కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జేడీఎస్ సభ్యులు శరవణ, భుజేగౌడ స్పందిస్తూ మల్కాపుర వ్యాఖ్యలను ఖండించారు. ప్రభుత్వాన్ని అనవసరంగా విమర్శించరాదని సూచించారు. ఈసందర్భంగా సభాపతి బసవరాజు హొరట్టె కల్పించుకుని మాట్లాడారు. పరిషత్తు సజావుగా సాగడానికి సహకరించాలని కోరారు. సభాపతి అనుమతి లేకుండా ఎవరూ మాట్లాడకూడదన్నారు. ప్రశ్నోత్తరాల సమయం ఉంటే సభ్యులు ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. అయితే ప్రశ్నోత్తరాల సమయం లేకపోవడంతో సమావేశం నడిచేందుకు సహకరించాలని కోరారు. కాగా ప్రశ్నోత్తరాల సమయం లేదనే విషయం ముందే తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. సమయం లేకపోవడంతో ప్రశ్నోత్తరాలు తొలగించారని సభాపతి బసవరాజు హొరట్టె స్పష్టం చేశారు. అయితే రానున్న రోజుల్లో ప్రశ్నోత్తరాల సమయం తప్పకుండా నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం ప్రతిపక్ష నాయకుడు కోటా శ్రీనివాస్ పూజారి మాట్లాడుతూ సభ్యుల ఆధారంగా సమావేశం జరగాలన్నారు. అనంతరం మంత్రి యూటీ ఖాదర్ మాట్లాడుతూ ప్రశ్నోత్తరాల సమయం ఉండాలని తాను కూడా ఒప్పుకుంటున్నానన్నారు. అయితే అనివార్య కారణాల రీత్యా ప్రశ్నోత్తరాల గంట లేదన్నారు. ప్రభుత్వం, అధికారుల చేతకాని తనం వల్లే ప్రశ్నోత్తరాల గంట తీసివేశారని సభాపతి బసవరాజు హొరట్టె విమర్శించారు. అనుచరులకు ప్రవేశం బంద్ విధాన పరిషత్తు సభ్యుల గన్మెన్లు, అనుచరులు, వ్యక్తిగత కార్యదర్శులకు ప్రవేశం లేదని సభాపతి బసవరాజు హొరట్టె హెచ్చరించారు. ఈమేరకు విధాన పరిషత్తు ద్వారం వద్ద మార్షల్స్‌ను నియమించారు. వారి సభ్యులను తప్ప ఎవరినీ లోపలికి అనుమతించలేదు. సభాపతి ఆదేశాలు అని చెప్పుకొచ్చారు. దీంతో గన్మెన్లు, అనుచరులు బయటే ఉండిపోయారు. ఈసందర్భంగా కొత్త సభ్యులను సభాపతి పరిచయం చేశారు. -
భూముల రిజిస్ట్రేషన్లకు ఇక టైం స్లాట్!
సాక్షి, హైదరాబాద్ : అవినీతికి, జాప్యానికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు జరిగేలా జూన్ నుంచి నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. రిజిస్ట్రేషన్లకు టైం స్లాట్ విధానాన్ని తీసుకువస్తున్నామని.. ఇరుపక్షాలు ఆ సమయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తే చాలని పేర్కొన్నారు. తొలుత ఐదు మండలాల్లో, అనంతరం 30 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా కొత్త విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త విధానంలోని లోటుపాట్లను గుర్తించి, పొరపాట్లకు ఆస్కారం లేకుండా మార్పులు చేర్పులు చేయాలని.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఇక ‘ధరణి’వెబ్సైట్ అందరికీ అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. బుధవారం రిజిస్ట్రేషన్ల అంశంపై ప్రగతి భవన్లో మంత్రులు తుమ్మల, జూపల్లి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, సీనియర్ అధికారులు, ఐఎల్ఎఫ్ఎస్ సర్వీసు ప్రొవైడర్ల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా నూతన రిజిస్ట్రేషన్ల విధానాన్ని ఖరారు చేశారు. స్లాట్ ప్రకారం రిజిస్ట్రేషన్ భూములు విక్రయిస్తున్న వారు, కొంటున్న వారు ఒక్క సారి మాత్రమే రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తే సరిపోయేలా.. పాస్‌బుక్కులు, రిజిస్ట్రేషన్ కాగితాలు కొరియర్లో నేరుగా ఇంటికే వచ్చేలా నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని ఖరారు చేశారు. ‘‘భూమిని అమ్మేవారు, కొనేవారు ముందుగా సబ్ రిజిస్ట్రార్ అపాయింట్మెంట్ కోరాలి. వారికి స్లాట్ కేటాయిస్తారు. ఆ స్లాట్ ప్రకారం ఇచ్చిన తేదీ, సమయానికి ఇద్దరూ కార్యాలయానికి చేరుకోవాలి. తమ సేల్‌డీడ్‌ను, పాసు పుస్తకాలను సమర్పించాలి. సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తారు. అమ్మినవారి పాస్ బుక్కు నుంచి రిజిస్ట్రేషన్ జరిగిన భూమిని తీసేస్తారు. కొన్నవారి పాస్ పుస్తకంలో దానిని జమ చేస్తారు. కొత్తగా భూములు కొనేవారైతే కొత్త పాస్ పుస్తకంలో నమోదు చేస్తారు. అదే రోజు పాస్ పుస్తకాన్ని తహసీల్దార్‌కు పంపుతారు. ఎమ్మార్వో వెంటనే ఆ వివరాలను నమోదు చేసుకుని, సంతకం చేస్తారు. తర్వాత తహసీల్దార్ తన కార్యాలయంలోనే ఉండే ఐటీ అధికారికి ఈ వివరాలు అందచేస్తారు. ఐటీ అధికారి ఈ వివరాలను నమోదు చేసి, ధరణి వెబ్‌సైట్‌కు అప్లోడ్ చేస్తారు. అనంతరం సదరు పాస్ పుస్తకాన్ని తిరిగి సబ్ రిజిస్ట్రార్‌కు పంపుతారు. సబ్‌రిజిస్ట్రార్ ఎవరి పాస్ పుస్తకాన్ని వారికి, సేల్‌డీడ్‌ను భూమిని కొన్నవారికి కొరియర్ ద్వారా పంపుతారు..’’అని సమావేశంలో ముఖ్యమంత్రి వివరించారు. అందరికీ అందుబాటులో భూముల డేటా జూన్ నుంచి ప్రతీ మండలంలో రిజిస్ట్రేషన్లు జరగాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయని, అవి లేని 443 మండలాల్లో తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగిస్తున్నామని తెలిపారు. వారికి ఇప్పటికే ఒక దఫా శిక్షణ కూడా ఇచ్చామని, మరో విడత శిక్షణ ఇస్తామని చెప్పారు. భూరికార్డుల ప్రక్షాళన డేటాను ఉపయోగించి ‘ధరణి’వెబ్‌సైట్‌ను రూపొందించాలని, ప్రతీ మండల కేంద్రంలో ఉండే ఐటీæ అధికారి తన మండలంలో ఏ రోజు జరిగే మార్పులను అదే రోజు అప్డేట్ చేస్తారని తెలిపారు. ఇలా ధరణి వెబ్సైట్ నిరంతరం అప్డేట్ అవుతూనే ఉంటుందని.. అందులో భూములకు సంబంధించిన అన్ని వివరాలు అందరికీ అందుబాటులో ఉంటాయని చెప్పారు. దీంతో పూర్తి పారదర్శకత వస్తుందన్నారు. మే 7 నుంచి పైలట్ ప్రాజెక్టు.. ధరణి వెబ్సైట్ నిర్వహణకు సంబంధించి మే 7వ తేదీ నుంచి ఐదు మండలాల్లో.. మే 19 నుంచి గ్రామీణ జిల్లాకొక మండలం చొప్పున 30 మండలాల్లో పైలట్ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఆయా చోట్ల ధరణి వెబ్సైట్ నిర్వహణలో వచ్చే ఇబ్బందులను అధ్యయనం చేసి, పరిష్కారాలను సిద్ధం చేస్తారు. ఈ మేరకు మార్పులు, చేర్పులతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల వివరాలతో ‘ధరణి’వెబ్‌సైట్‌ను నిర్వహిస్తారు. ఈ వెబ్సైట్ నిర్వహణ కోసం సర్వీసు ప్రొవైడర్లతో ఈ నెల 20న ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. మొదటి విడతలో ఐదు మండలాలు మొదటి విడతలో మేడ్చల్ జిల్లా ఘట్కేసర్, సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్, రంగారెడ్డి జిల్లా కొత్తూరు, కామారెడ్డి జిల్లా సదాశివనగర్, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలాల్లో పైలట్ ప్రాజెక్టును చేపడతారు. రెండో విడత మండలాలు.. రెండో విడతలో చేర్యాల (సిద్దిపేట), మానకొండూరు (కరీంనగర్), మేడిపల్లి (మేడ్చల్), నిర్మల్ రూరల్ (నిర్మల్), బాల్కొండ (నిజామాబాద్), ఎల్లారెడ్డి (కామారెడ్డి), ఆసిఫాబాద్ (ఆసిఫాబాద్), నెన్నెల(మంచిర్యాల), అంతర్గాం (పెద్దపల్లి), ఇల్లంతకుంట (సిరిసిల్ల), రాయికల్ (జగిత్యాల), రామచంద్రాపురం(సంగారెడ్డి), రామాయంపేట (మెదక్), మొగుళ్లపల్లి (భూపాలపల్లి), కేసముద్రం (మహబూబాబాద్), నర్సంపేట (వరంగల్ రూరల్), హసన్‌పర్తి (వరంగల్ అర్బన్), రఘునాథపల్లి (జనగామ), ముదిగొండ(ఖమ్మం), పాల్వంచ రూరల్ (కొత్తగూడెం), చివ్వెంల (సూర్యాపేట), కట్టంగూర్ (నల్లగొండ), తుర్కపల్లి(యాదాద్రి), బిజినేపల్లి (నాగర్‌కర్నూల్), పెబ్బేరు (వనపర్తి), ఐజ (గద్వాల), దేవరకద్ర (మహబూబ్‌నగర్), శేరిలింగంపల్లి (రంగారెడ్డి), నవాబ్‌పేట (వికారాబాద్), గుడిహత్నూర్ (ఆదిలాబాద్) మండలాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తారు. -
ట్రంప్ ఫేక్ న్యూస్ అవార్డులు.. విజేతలెవరో తెలుసా?
వాషింగ్టన్: ముందుగా వెల్లడించినట్టే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఫేక్ న్యూస్ అవార్డులు’ ప్రకటించారు. ప్రముఖ దినపత్రిక ‘ద న్యూయార్క్ టైమ్స్’కు ఫేక్ న్యూస్ అవార్డు ప్రకటించారు. అలాగే, ఏబీసీ న్యూస్, సీఎన్ఎన్, టైమ్, ద వాషింగ్టన్ పోస్ట్ తదితర మీడియా సంస్థలను కూడా విజేతలుగా ప్రకటించారు. ఇలా ట్రంప్ తనదైన శైలిలో అవార్డులు ప్రకటిస్తూ.. ఆ వివరాలు జీవోపీ.కామ్‌లో పొందుపరిచారు. దీని గురించి ట్వీట్ చేసిన వెంటనే ఆ వెబ్సైట్ క్రాష్ అయింది. పాత్రికేయ రంగంలో తాను గౌరవించే ఎంతో గొప్పమంది జర్నలిస్టులు ఉన్నారు కానీ, మీడియా ఇప్పుడు అవినీతి, కపటబుద్ధితో కథనాలు రాస్తున్నదని ట్రంప్ మరో ట్వీట్లో మండిపడ్డారు. ‘2017లో పక్షపాతబుద్ధితో ఏమాత్రం పారదర్శకత లేకుండా అథమస్థాయిలో బూటకపు కథనాలు వెలువడ్డాయి. అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా 90శాతం ప్రతికూల కథనాలు వెలువడ్డాయి’అని జీవోపీ.కామ్ వెబ్సైట్ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రాత్మక విజయం సందర్భంగా.. దేశ ఆర్థిక వ్యవస్థ ఇక కోలుకోలేదంటూ పాల్ క్రుగ్మన్ రాసిన కథనానికిగాను ’ద న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు ఫేక్ అవార్డుల్లో ప్రథమ బహుమతి ప్రకటించగా.. తప్పుడు కథనాలతో మార్కెట్‌ను దెబ్బతీసినందుకు ఏసీబీ న్యూస్‌కు (బ్రియాన్ రాస్ కథనానికి) దిత్వీయ బహుమతిని, వీకీలీక్స్ పత్రాల యాక్సెస్ ట్రంప్‌కు, ఆయన తనయుడికి ఉందంటూ కథనం ప్రసారంచేసినందుకు సీఎన్ఎన్కు తృతీయ బహుమతిని ట్రంప్ ప్రకటించారు. ఒవల్ కార్యాలయంలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అర్ధవిగ్రహాన్ని తొలగించారని కథనం ప్రచురించినందుకు ‘టైమ్’ మ్యాగజీన్‌కు నాలుగో స్థానం కట్టబెట్టగా.. ఫ్లోరిడాలోని పెన్సాకోలాలో ట్రంప్ నిర్వహించిన భారీ ర్యాలీలో జనం లేరంటూ ప్రచురించిన ‘ద వాషింగ్టన్ పోస్ట్’కి చివరిస్థానం కేటాయించారు. తన హయాంలో మీడియా కపటబుద్ధితో వ్యవహరిస్తూ నిజాలను ప్రజలకు తెలియజేయడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
మీకోసం ఓ అరగంట
సెల్ఫ్ చెక్ మహిళ నిర్వహించే బాధ్యతలను లిస్ట్ రాస్తే దానికి అంతం ఉండకపోవచ్చు. రెండు చేతులతో లెక్కకు మించిన బాధ్యతలన్నీ నిర్వర్తిస్తుంటుంది. ఈ క్రమంలో నిర్లక్ష్యానికి లోనయ్యేది ఆరోగ్యమే. రోజుకు ఓ అరగంట టైమ్ తన కోసం కేటాయించుకోవడాన్ని కూడా మర్చిపోతుంటుంది. మరి మీరేం చేస్తున్నారు? 1. అన్ని పనులతోపాటు మీ ఎక్సర్సైజ్కు సమయాన్ని కేటాయిస్తున్నారు. ఎ. అవును బి. కాదు 2. వయసు, ఎత్తు, బరువుతోపాటుగా మీ వయసు, ఎత్తుకు ఉండాల్సిన బరువు ఎంతో మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 3. దేహం ఫ్లెక్సిబుల్‌గా ఉండడానికి, దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉండడం కోసం రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తున్నారు. ఎ. అవును బి. కాదు 4. ఏరోబిక్స్, జిమ్, యోగా క్లాసులకు వెళ్లడానికి సాధ్యం కానప్పుడు ఇంటి మెట్లనే వ్యాయామకేంద్రంగా చేసుకుంటారు. రోజుకు ఐదారుసార్లు మెట్లెక్కి దిగి 20 పుష్అప్స్ చేస్తే పూర్తి వ్యాయామం చేసినట్లే. ఎ. అవును బి. కాదు 5. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే స్ట్రెస్ రిలేటెడ్ హెడేక్ రాదని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 6. రోజూ ఐదారు నిమిషాల సేపు క్రమబద్ధంగా ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకుని నిదానంగా వదలడం ద్వారా శ్వాసకోశ వ్యవస్థ పని తీరును మెరుగుపరుచుకుంటున్నారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’లు ఐదు దాటితే ఆరోగ్యాన్ని పట్టించుకుంటున్నారనే అనుకోవాలి. దీనిని కొనసాగించండి. ‘బి’లు ఎక్కువైతే... ఈ ధోరణి అంత మంచిది కాదని గుర్తించండి. వార్ధక్యంలో వచ్చే సమస్యలకు దూరంగా ఉండడానికి ముప్ఫయ్ల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. -
రెండేళ్ల కాలపరిమితికే మద్యం దుకాణాల కేటాయింపు
- మద్య నిషేధ, ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ ‡ - ఆన్లైన్లో 106 దరఖాస్తులు కాకినాడ క్రైం : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మద్యం పాలసీ ప్రకారం రెండేళ్ల కాల పరిమితికి లోబడే మద్యం దుకాణాలు కేటాయిస్తూ ఏపీ ఎక్సైజ్‌శాఖ కమిషనర్ జీవో విడుదల చేసినట్టు మద్య నిషేధ, ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ బి.అరుణారావు వెల్లడించారు. మంగళవారం ఆయన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మార్చి 24వ తేదీన జిల్లాలో ఉన్న 545 మద్యం దుకాణాల్లో 154 దుకాణాలకు 27 నెలలు, 391 దుకాణాలకు 24 నెలల కాలపరిమితికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. వీటిని రెండేళ్ల కాలపరిమితికి మార్చుతూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయన్నారు. వ్యాపారుల నుంచి ఇప్పటి వరకు లైసెన్సుల సొమ్ము చలానా రూపంలో మాత్రమే స్వీకరించేవారమని, మారిన నిబంధనల మేరకు డీడీల రూపంలో స్వీకరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 407 దుకాణాలకు నోటీసులివ్వగా 298 మంది దుకాణాలను వేరే ప్రదేశానికి మార్చుకున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభించే 109 మద్యం దుకాణాలతో పాటూ గతంలో మిగిలిపోయిన 46 దుకాణాలను కలిపి 155 షాపులకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నామన్నారు. మిగతా 390 దుకాణాలకు జూలై 1వ తేదీ నుంచి రెండేళ్ల కాలపరిమితికి లైసెన్సులు జారీ చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం యూనిట్ల పరిధిలోని దుకాణాలకు మంగళవారం నాటికి 106 దరఖాస్తులు ఆన్లైన్లో వచ్చాయని తెలిపారు. ఇందులో కాకినాడలో 28, అమలాపురం 30, రాజమహేంద్రవరం 48 వచ్చినట్టు తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు గడువు మార్చి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉందన్నారు. మార్చి 31వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులోని జీ కన్వెన్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వ్యాపారులకు లైసెన్సుల జారీకి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభుకుమార్, అమలాపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏడుకొండలు పాల్గొన్నారు. -
'పార్టీ సభ్యుల సంఖ్య ఆధారంగా సమయం'
హైదరాబాద్: శాసనసభలో ప్రభుత్వం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తున్నదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సభలో సమయం ఇవ్వలేదని డిప్యూటీ స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. మహిళగా డిప్యూటీ స్పీకర్‌ను గౌరవించాలని సూచించారు. సభలో ప్రభుత్వ ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకుంటుందని స్పష్టం చేశారు. సభలో ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు మంగళవారం నాడు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సమయం ఇవ్వలేదని విపక్ష సభ్యులు సభలో బుధవారం ఉదయం ప్రస్తావించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. పద్దులపై మాట్లాడేందుకు ప్రతి సభ్యునికి డిప్యూటీ స్పీకర్ అవకాశమిచ్చారని, పార్టీ సభ్యుల సంఖ్య ఆధారంగా సమయం కేటాయించామని, అన్ని విషయాల్లో ప్రతిపక్షాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. -
‘పది’ పరీక్షల వేళ ముందస్తు గందరగోళం
అదే సమయంలో సమ్మేటివ్–3 పరీక్షలు 14 నుంచి ప్రారంభం ß సిలబస్ పూర్తి కాకుండానే నిర్వహణ విద్యార్థులు నష్టపోతారని తల్లిదండ్రులు ఆందోళన లక్షలాది మంది విద్యార్థులు రాసే తుది పరీక్షల నిర్వహణపై గందరగోళం చోటు చేసుకుంటుంది. పరీక్షల నిర్వహణలో రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణా మండలి(ఎస్సీఈఆర్టీ)కి ముందస్తు ప్రణాళిక లేక పోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక వైపు పది పరీక్షలు.. మరో వైపు ప్రాథమి, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు(ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు) సమ్మేటివ్–3 పరీక్షలు ఒకే సమయంలో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎస్సీఈఆర్టీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో గందరగోళం చోటు చేసుకుంది. – రాయవరం కీలకమైన రెండు పరీక్షలను ఒకేసారి నిర్వహించడం వలన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. ఫిబ్రవరి నెలాఖరు నాటికి ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యార్థులకు సంబంధించిన సిలబస్‌ను పూర్తి చేయాలి. కొన్ని పాఠశాలలు సిలబస్ పూర్తి చేయడంలో వెనుకబడి ఉన్నాయి. మార్చి మొదటి వారం కల్లా సిలబస్ పూర్తవుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. సిలబస్ పూర్తయిన అనంతరం రివిజ¯ŒSకు అవకాశం లేకుండా వెంటనే పరీక్షలు నిర్వహించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కనీసం పక్షం రోజులు రివిజ¯ŒS లేకుండా పరీక్షలు నిర్వహిస్తే అంతిమంగా విద్యార్థులు నష్టపోతారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి 14 నుంచి సమ్మేటివ్–3, మార్చి 17 నుంచి పది పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఒకవైపు ఇప్పటికే ఉన్నత పాఠశాలల అంతా పది పబ్లిక్ పరీక్షల నిర్వహణ విధుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను కూడా పది పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా నియమిస్తారు. వీరంతా పది పరీక్షలకు వెళితే అరకొరగా ఉన్న ఉపాధ్యాయులతో సమ్మేటివ్–3 పరీక్షలను పక్కాగా నిర్వహించడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల రాక అనుమానమే.. ఒకవైపు సమ్మేటివ్ పరీక్షలు పూర్తి కాగానే వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. పిల్లల పరీక్షలు పూర్తికాగానే సెలవుల మూడ్‌లోకి వెళ్లిపోతారు. అలాంటప్పుడు ప్రత్యేక శిక్షణకు ఎంతమంది వస్తారు? ఇది ఆచరణ సాధ్యమా?కాదా? అనేది ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా తొలుత ఏదైనా జిల్లాలో ప్రయోగాత్మక పరిశీలన జరిపి వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో ముందస్తు పరీక్షలు, అనంతరం ప్రత్యేక శిక్షణకు చర్యలు తీసుకుంటే బాగుండేదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. పరీక్షల షెడ్యూల్ ఇదీ ఈ నెల 14 నుంచి 17 వరకు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. పది పరీక్షలు మాత్రం ఈ నెల 17న ప్రారంభమై ఏప్రిల్ ఒకటో తేదీతో ముగుస్తాయి. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 22 వరకు వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. జిల్లా వ్యాప్తంగా 3.80 లక్షల మంది విద్యార్థులు సమ్మేటివ్–3 పరీక్షలు రాయనున్నారు. ఆరు నుంచి 9తరగతుల విద్యార్థులకు పరీక్ష పేపర్లను ఏరోజుకారోజు ఎమ్మార్సీ కేంద్రం నుంచి సరఫరా చేస్తారు. 8వ తరగతి పరీక్ష పేపర్లు మాత్రం మండల స్థాయిలో మూల్యాంకనం చేపడతారు. -
పగబట్టిన కల
భయాలు పాకుతాయి. శబ్దం చెయ్యకుండా, మనకు తెలియకుండా ఒళ్లంతా పాకుతాయి. ఈ భయాలకు ఒక పుట్ట ఉంటుంది. మనసు అన్న కీకారణ్యంలో ఈ పుట్టను మనం పెంచుకుంటాం. ఈ పుట్టను తవ్వితే... తవ్వుతూ పోతే... ఇంకో జన్మే కనబడొచ్చు! ధైర్యం ఉంటే, మనోబలం ఉంటే... ఆ పుట్టను ఈ జన్మలోనే ధ్వంసం చెయ్యొచ్చు. గడియారం టంగ్ ...టంగ్... టంగ్... మని మోగడంతో టైమ్ చూశాడు చైతన్య(పేరు మార్చడమైంది). రాత్రి పదకొండు. చైతన్య తన చేతికున్న తాయెత్తును మూడుసార్లు మణికట్టు చుట్టూ కుడివైపుగా తిప్పాడు. మంచం కోళ్లు నాలిగింటికి పసుపు రాసి ఉన్నదా లేదా అని జాగ్రత్తగా పరిశీలించాడు. సాయంత్రమే మంచం చుట్టూ మంత్రించిన ఇసుక పోయించాడు. కిటికీ గట్టిగా మూసి ఉందా లేదా అని చెక్ చేశాడు. తలుపు కిందుగా టవల్ పరిచి కింద ఉన్న గ్యాప్‌ని పూర్తిగా మూసివేశాడు. ‘హమ్మయ్య!’ అనుకుంటూ మంచం మీదకు చేరి పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు. రెండు, మూడు పేజీలు తిప్పి విసుగ్గా అనిపించి పక్కన పడేశాడు. కాసేపు తిరుగుతున్న ఫ్యాన్‌కేసి చూశాడు. మెల్లగా కళ్లు మూతలు పడుతున్నాయి. సమయం గడుస్తోంది. బెడ్రూమ్ కిటికీని ఎవరో అతి మెల్లగా తీస్తున్నట్టున్నారు. అది శబ్దం లేకుండా కొద్దిగా తెరుచుకుంది. ఆ కిటికీ అద్దం వెనక వైపు ఒక ఆకారం... మసక మసకగా అటూ ఇటూ కదలాడుతోంది. కాసేపటికి... కొద్దిగా తెరుచుకున్న కిటికీ గుండా ఆ ఆకారం తల లోపలికి పెట్టింది. మెల్లగా లోపలికి పూర్తిగా వచ్చేసింది. డిమ్‌లైట్ వెలుతురులో ఆ ఆకారం నల్లగా, అక్కడ అక్కడ చారలుగా కనిపిస్తోంది. ఆ ఆకారం మెల్లగా మంచం దగ్గరకు చేరుకుంది. అంతెత్తున లేచి చైతన్యను చూసింది. కాసేపు చూసి మళ్లీ తన యధాస్థానానికి కిందకు దిగింది. మంచం చుట్టూ తిరిగింది. ఒకటి, రెండు, మూడు, నాలుగు సార్లు తిరుగుతూనే ఉంది. మంచంతో సహ ఆ ఆకారం చైతన్యను పూర్తిగా చుట్టేసింది. చైతన్యకు ఊపిరి ఆడటం లేదు. ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఒళ్లంతా చెమట్లు పట్టేశాయి. ఎటూ కదల్లేకుండా ఉన్నాడు. అరిచి పిలుద్దామంటే గొంతు పెగలడం లేదు. బలవంతంగా కళ్లు చిట్లించి ఆ చీకట్లోకి చూశాడు. అంతెత్తున పడగ విప్పి కోరలు చాస్తూ... తననే చూస్తోంది.. కోబ్రా! బ్లాక్ కోబ్రా!!! భయం.. భయం.. ‘‘రాత్రిళ్లు నిద్రపోయి కనీసం ఏడాది అవుతోంది. రోజూ ఆ పాము కలే! అది నన్ను కాటేస్తోంది. నిద్రపోదామంటే చచ్చిపోతానేమో అనే భయం. మెలకువ ఉండలేక, నిద్రపోలేక నరకయాతన అనుభవిస్తున్నాను..’’ చైతన్య చెబుతున్నదంతా విన్న సైకాలజిస్ట్ ‘‘పాము కలలతో భయపడటాన్ని అఫిడోఫోబియా అంటారు. ఈ జబ్బుకు మీ జీవితంలో ఉన్న అభద్రత కూడా కారణం అయ్యుంటుంది. కొన్ని రోజులు స్లీపింగ్ పిల్స్ వేసుకొని చూడండి. మరికొన్ని మందులు కూడా రాసిస్తాను, వాడండి..’’ అని చెప్పారు. డాక్టర్ చెప్పినట్టుగా చేశాడు. అయినా పాము కల రావడం మాత్రం తగ్గలేదు. ‘‘పాము కోరికలకు చిహ్నం అంటారురా! బహుశా నీకు కోరికలు ఎక్కువై ఉంటాయి’’ ఆటపట్టించాడు ఫ్రెండ్ వీరేష్!‘‘గుడికి వెళ్లి నాగేంద్రుడికి అభిషేకాలు చేయించరా! ఇలాంటి కలలు రావు’’ చెప్పింది తల్లి.ఎవరేది చెప్పినా అన్నీ పాటిస్తూనే ఉన్నాడు. మంత్రాలు వేయించాడు. తాయెత్తు కట్టించాడు.కానీ, ప్రయోజనం లేదు. చీకటి పడుతోందంటే భయం. కనురెప్పవాలుతుందంటే భయం. ఆ పాము వల్ల తను నిద్రలోనే చచ్చిపోతానని భయం. రాత్రి నిద్ర ఉండటం లేదు, ఈ దిగులుతో పగలు తిండి సయించడం లేదు. చిక్కిశల్యమయ్యాడు. పగలంతా నిద్రమత్తుగా ఉంటోంది. దీంతో ఆఫీసులో సరిగా పని చేయలేకపోతున్నాడు., చేసే పనిలో తప్పులు దొర్లుతున్నాయి. పై అధికారుల నుంచి చివాట్లు, మెమోలు... ఫలితంగా ఉద్యోగం కోల్పోయాడు. రిగ్రెషన్ థెరపీ! స్నేహితుల సూచన మేరకు రిగ్రెషన్ థెరపీకి వచ్చాడు చైతన్య. తన సమస్య అంతా వివరించాడు. ఈ మూలాలు మీ ఈ జీవితంలోనో, మీ గత జన్మలోనో ఉండి ఉంటాయి దర్శించండి అన్నారు థెరపిస్ట్.వారి సూచనల మేరకు కళ్లు మూసుకొని ధాన్యముద్రలో ఉండిపోయాడు చైతన్య. థెరపి మొదలైంది. ‘‘మీకు తరచూ కనిపించే పామును గుర్తు తెచ్చుకోండి. ఆ పాము రూపం ఎలా ఉందో చెప్పండి. పాము తో పాటు మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి..’’ ఈ విధంగా కౌన్సెలర్ సూచనలు అందుతున్నాయి చైతన్యకు.తను ఉన్న దశ నుంచి వెనక్కి ప్రయాణిస్తున్నాడు. ఆ ప్రయాణంలో ఎదురైన సంఘటనలను కౌన్సెలర్ కు వివరిస్తున్నాడు. చదువు, బాల్యం, అమ్మ గర్భంలో ఉన్న విధానం.. అన్నీ చెబుతున్నాడు. అటు నుంచి గత జన్మకు చేరుకున్నాడు. ‘‘నేనో అడవిలో పరిగెడుతున్నా ను..’’ చైతన్య ఉద్విగ్నంగా చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘ఎటువైపు పరిగెడితే అటు పాము ఎదురవుతోంది. నేను ఆ పాముల నుంచి తప్పించుకోవడానికి భయంతో పరుగెత్తి.. పరుగెత్తి అలసిపోతున్నాను. చివరకు ఓ గూడెం చేరుకున్నాను. అక్కడ వారంతా భయంతో పరుగులు తీస్తున్నారు. నేను అక్కడే ఆగిపోయాను. ‘పాము వస్తోంది. మింగేస్తది. పారిపో.. పారిపో..’ అక్కడున్నవారు నన్ను కేకలేస్తున్నారు. పేద్ద పాము.. ఆ గూడెంలోని వారిని వరుసగా మింగేస్తుందట. వారంతా పారిపోతున్నారు. నేను భయంతో ఇంకా వేగంగా పరిగెడుతున్నాను..’’ చెబుతున్నాడు చైతన్య. చెబుతూనే ఏడుస్తున్నాడు. మాయమైన భయాలు కాసేపటికి కౌన్సెలర్ సూచనలు చైతన్యకు అందడం మొదలయ్యాయి.‘‘భయపడకండి. పరిగెత్తడం మాని, ఒక్కసారి వెనక్కి తిరగండి. ఆ పామును దగ్గరగా చూడండి. దాని కళ్లలోకి కళ్లు పెట్టి చూడండి. మీ భయం మెల్లగా దూరమైపోతోంది. ఆ పాముతో చెప్పండి.. మిమ్మల్ని స్నేహంగా చూడమనండి.. మీ చేత్తో ఆ పామును తాకండి. మిమ్మల్ని అదేం చేయదు. శివుడి మెడలో హారంలా మీకు స్నేహంగా మారిపోతుంది. మీ చుట్టూ ఉన్న అభద్రత దేనికి సంబంధించిందో పరిశీలించండి. ఆ భయం తాలూకు భావాలను తుడిచేయండి’’ కౌన్సెలర్ చెబుతున్న విధంగా చే స్తున్నాడు చైతన్య. కాసేపటికి చైతన్యలో అలజడి తగ్గింది. అది గమనించిన కౌన్సెలర్ భవిష్యత్తును దర్శించమని చెప్పాడు. 1...2...3...4....5... రోజులు, నెలలు, సంవత్సరాలు.. ముందు ప్రయాణించి తన భవిష్యత్తును చూసుకుంటున్నాడు చైతన్య. ఆ భవిష్యత్తులో తనకు ఎలాంటి భయాలు లేవు. ఉద్యోగం చేస్తూ, కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు. అనిర్వచనీయమైన ఆ ఆనందంతోనే కళ్లు తెరిచాడు చైతన్య. తెరుచుకున్న కిటికీ ‘‘అమ్మా! ఎందుకు కిటికీ మూసేస్తున్నావ్’’ తన రూమ్‌లో కిటికీ మూసేస్తున్న తల్లిని అడిగాడు నాగరాజు.‘‘చీకటి చేరకుండా ఉండటానికి...’’ కొడుకు భయానికి కారణం కిటికీయే అని భావిస్తున్న తల్లి వద్దకు వెళ్లాడు చైతన్య. ‘‘అమ్మా! కిటికీ... గది లోపలికి వెలుతురును మోసుకొస్తుంది. చల్లని గాలి వచ్చేలా చేస్తుంది. మూసేస్తే.. చీకటి చేరుతుంది..’’ అంటూ కిటికీని పూర్తిగా తెరుస్తున్న కొడుకును ఆశ్చర్యపోయింది చైతన్య తల్లి. కిటికీ నుంచి వీచిన చల్లని గాలి ఆ ఇంటిలో, వారి మనసుల్లో ఆహ్లాదాన్ని నింపింది. పీడకల నుంచి పరిణతి నెపోలియన్ –2 కి ఎప్పుడూ ఒక కల వెంటాడేదట. తన గుండెల మీద ఎక్కి ఎవరో నొక్కుతున్నట్టు విలవిల్లాడిపోయే కల. తనను ఎవరో ఉరి తీస్తున్నట్టు గొంతు పెగలక విపరీతమైన బాధ అనుభవించేవాడట. ఈ కల ద్వారా తను ఖైదీలను ఎంతగా హింసిస్తున్నదీ గ్రహించాడు. ఉరివేయడం రద్దు చేసి, ఖైదీల ప్రవర్తనలోనూ మార్పు వచ్చేందుకు కృషి చేశాడట. కలలు–అవగాహన గత జన్మలలోని భయాలు, అపరాధ భావనలు, అభద్రత.. కలల రూపంలో మనల్ని వెంటాడుతుంటాయి. ఎల్తైన శిఖరం నుంచి లోయలోకి పడిపోతున్నట్టు, అగ్నిప్రమాదంలో చిక్కుకున్నట్టు, పరీక్ష తప్పినట్టు, క్రూరమైన జంతువులు వెంటాడుతున్నట్టు...భయపెడుతుంటాయి. వాటిని రిగ్రెషన్ థెరపీలో చూసినప్పుడు జీవితం పట్ల అవగాహన కలుగుతుంది. ఎక్కడ గిల్ట్ పడింది. ఎక్కడ భయం ఏర్పడింది, అభద్రతకు దారితీసిన విధం... అన్నీ స్పష్టంగా తెలుస్తాయి. ఫలితంగా ఆ పీడ కలల నుంచి విముక్తి పొందుతారు. – డాక్టర్ హరికుమార్, జనరల్ సర్జన్,ఫ్యూచర్‌లైఫ్ థెరపిస్ట్, హైదరాబాద్ జ్ఞాపకాల అలలు ..కలలు గత జన్మ తాలూకు జ్ఞాపకాలకు ఉండే శక్తి, వాటిని హీలింగ్ చేసే ప్రక్రియల గురించి బ్రియాన్ వీజ్ ‘మిరాకిల్స్ హాపెన్’ద్వారా వివరించారు. కొలంబియా యూనివర్శిటీ సైకియాట్రీ విభాగానికి హెడ్‌గా పనిచేసిన బ్రియాన్ గత జన్మ జ్ఞాపకాలు ఈ జన్మకు ఎలా మోసుకువస్తామో, వాటి నుంచి ఎలా బయటపడాలో వివరించారు. గమనిక : ‘పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ’ అంతర్జాతీయంగా ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇస్తోంది. అయితే ఈ ప్రక్రియకు విస్తృతమైన ఆమోదం లభించకపోయినా.. థెరపీ ప్రయోజనాలపై ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఇవి కొన్ని. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
సన్నిధానంకు జీవిత సాఫల్య పురస్కారం
రాజమహేంద్రవరం కల్చరల్ : ప్రాణహిత కవి, బ్రౌనుమందిరం వ్యవస్థాపకుడు సన్నిధానం నరసింహశర్మ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. సాహితీ, గ్రంథాలయ రంగాల్లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా నవీన్‌జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖపట్టణంలోని ద్వారకా గ్రంథాలయంలో ఈ పురస్కారం అందించారు. నగర ప్రముఖుడు గణపతిరాజు వెంకటపతిరాజు తన తండ్రి దివంగత గణపతిరాజు అచ్యుత రామరాజు పేరిట ఈæపురస్కారాన్ని సన్నిధానంకు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పాల్గొన్నారు. -
ఎంసెట్ ‘తీన్’మార్
హాజరైన 1,499 మంది విద్యార్థులు ప్రతి సెంటర్లో పోలీసు బందోబస్తు చివరి నిమిషంలో ఉరకలు పరుగులు ఖమ్మం: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశం కోసం తెలంగాణ ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన ఎంసెట్–3 జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. నగరంలోని మొత్తం నాలుగు కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 2,172 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 1,499 మంది హాజరయ్యారని, 673 మంది గైర్హాజరయ్యారని జిల్లా కోఆర్డినేటర్ పుష్పలత వివరించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. నిమిషం నిబంధన ఉండటంతో అభ్యర్థులు ఉదయం 9 గంటల వరకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంతో ఎంసెట్–2 రదై్దన నేపథ్యంలో ఎంసెట్–3కి భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖమ్మం డీఎస్పీ సురేష్‌కుమార్ నేతృత్వంలో పోలీసులు బందోబస్తును కఠినతరం చేశారు. పరీక్ష కేంద్రం వద్ద పోలీసు పహారా ఏర్పాటు చేసి ప్రతి వ్యక్తిని తనిఖీ చేసి లోనికి పంపించారు. పరీక్ష నిర్వహణ తీరును జేఎన్టీయూ అధికారులతో పాటు జిల్లా కోఆర్డినేటర్ పర్యవేక్షించారు. – ఖమ్మంలోని ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల–1 సెంటర్‌కు 550 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 386 మంది హాజరయ్యారు. 164 మంది గైర్హాజరయ్యారు. – ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల–2 సెంటర్‌కు 550 మంది గాను 391 మంది హాజరయ్యారు. 159 మంది గైర్హాజరయ్యారు. – ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సెంటర్లో 675 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 452 మంది మాత్రమే రాశారు. 223 మంది పరీక్షకు హాజరుకాలేదు. – యూనివర్సిటీ పీజీ కళాశాల సెంటర్లో 397 మందికి 270 హాజరుకాగా 127 మంది గైర్హాజరయ్యారు. – పలువురు అభ్యర్థులు ఉరకలు పరుగులు తీస్తూ కనిపించారు. పరీక్ష కేంద్రాల విషయంలో కొందరు అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. ఇల్లెందు పట్టణానికి చెందిన లావణ్య అనే అభ్యర్థిని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల అనుకొని, యూనివర్సిటీ కళాశాలకు వెళ్లింది. తీరా హాల్‌టికెట్ చూసే సరికి పొరపాటును గుర్తించింది. తిరిగి తనకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి రాబోయే సరికి అప్పటికే ఆలస్యం కావడంతో అనుమతించలేదు. – హాల్‌టికెట్ల డౌన్లోడింగ్, అటెస్టేషన్ కోసం పలువురు విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. – తల్లిదండ్రులు దగ్గరుండి పిల్లలకు దైర్యంనూరి పోసి పరీక్ష హాల్‌కు పంపించారు. పరీక్ష పూర్తయ్యే వరకు అక్కడే ఉండి తిరిగి వారిని తోడ్కొని వెళ్లారు. -
సమయ పాలనకు సరైన పరిష్కారం
– అన్ని కార్యాలయాల్లో బయోమెట్రిక్ డివైజ్‌లు – పంచాయతీల్లోనూ సత్వర ఏర్పాటుకు ఆదేశం – అన్ని శాఖల అధికారులకు జేసీ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ డివైజ్‌లు ఏర్పాటు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి శనివారం ఆయన తన చాంబర్లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు ఏఏ శాఖల్లో బయోమెట్రిక్ ఏర్పాటు చేసుకున్నారు, ఇంకా ఎన్నిటికి అవసరం, గ్రామ పంచాయతీల్లో బయోమెట్రిక్ సిస్టమ్ అమలుతీరు తదితర అంశాలపై సమీక్షించారు. మొదటి విడత కింద 339 పంచాయతీల్లో బయోమెట్రిక్ డివైజ్‌లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నా ఇంతవరకు మూడు డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయాలు, 18 పంచాయతీల్లో మాత్రమే ప్రక్రియ పూర్తికావడంపై అసంతప్తి వ్యక్తం చేశారు. 60 బయోమెట్రì క్ డివైజ్‌లు సరఫరా అయినప్పటికి 21 మాత్రమే ఏర్పాటు చేయడం తగదన్నారు. గ్రామ స్థాయిలో పనిచేసే ఉద్యోగులందరు గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసే మిషన్‌లో బయోమెట్రిక్ ఇవ్వాలన్నారు. సత్వరం అన్ని పంచాయతీల్లో వీటిని ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. పాలన పాదర్శకంగా ఉండటానికి, ప్రతి ఒక్కరు సమయపాలన పాటించడానికి ఇవి అత్యవసరమని తెలిపారు. ఇంతవరకు బయోమెట్రిక్ డివైజ్‌లు ఏర్పాటు చేసుకోని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో సత్వరం ఏర్పాటు చేసి అమలు చేయాలన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు బయోమెట్రిక్‌లు ఏర్పాటు చేసుకున్నామని ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఎంలు ఇక్కడే బయోమెట్రిక్‌లు ఇస్తారని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ తెలిపారు. అన్ని మండల సమాఖ్యల్లో ఏర్పాటు చేశామని, డీఆర్డీఏ సిబ్బంది ఇందులో వేలిముద్రలు ఇస్తారని పీడీ రామకష్ణ తెలిపారు. పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 148 బయోమెట్రిక్ డివైజ్‌లను ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. అన్ని శాఖల కార్యాలయాల్లో బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేసుకునే విధంగా అన్ని శాఖలతో సమన్వయం చేయాలని జేడీఏను ఆదేశించారు. సమావేశంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
69 ఏళ్ళ తర్వాత బస్సొచ్చింది!
ఉత్తరాఖండ్ః స్వతంత్రం వచ్చి ఆరవై ఏళ్ళు దాటిపోయినా ఇప్పటివరకూ ఆ గ్రామానికి రోడ్డు మార్గమే లేదు. ఊళ్ళోకి చేరాలంటే కొండలు గుట్లలు ఎక్కి వెళ్ళాల్సిందే. అక్కడ పుట్టి పెరిగి ముసలివారు కూడ అయిపోయిన వారు ఉన్నారేకానీ.. వారు ఒక్కసారైనా బస్సు ఎక్కేందుకే నోచుకోలేదట. అయితే వారి సుదీర్ఘ నిరీక్షణకు ఇప్పుడు తెరపడింది. 69 ఏళ్ళ తర్వాత ఆ గ్రామానికి బస్సొచ్చింది. ఉత్తరాఖండ్ మారుమూల గ్రామమైన సిల్పదా ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. ఏళ్ళ తరబడి చూసిన ఎదురు చూపులు ఫలించి గ్రామంలోకి 69 ఏళ్ళ తర్వాత బస్సు రావడంతో ఆనందంలో మునిగితేలుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంతో అక్కడి వారి కలలు నెరవేరాయి. పథకంలో భాగంగా గ్రామానికి రోడ్డు మార్గం వేయడంతో బస్సులు కూడ వచ్చే అవకాశం ఏర్పడింది. జిల్లా కేంద్రమైన చమోలీ, సిల్పదా గ్రామాలు దగ్గర్లోనే ఉన్నా... సిల్పదాకు ఇప్పటివరకూ రోడ్డు మార్గం లేకపోవడంతో బస్సు వచ్చే అవకాశమే లేకుండా పోయింది. దాంతో 69 ఏళ్ళ పాటు అక్కడి ప్రజలు ఎదురు చూపులతోనే కాలం వెళ్ళదీయాల్పి వచ్చింది. ఎన్నోసార్లు గ్రామప్రజలు పలు ప్రభుత్వాలకు అర్జీలు పెట్టినా ఫలితం లేకపోయింది. తమ గ్రామానికి రోడ్డుమార్గం, బస్సు సౌకర్యం కల్పించాలంటూ అనేకసార్లు ఆందోళనలు కూడ నిర్వహించిన దాఖలాలు లేకపోలేదు. ఇటీవలే సిల్పదా గ్రామంలో కేంద్ర ప్రభుత్వం రోడ్డు నిర్మాణం చేపట్టి అక్కడ సమకూరిన నిధులతో విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో తొలిసారి గ్రామంలోకి బస్సు వస్తుండటంతో స్థానికంగా పండుగ వాతావరణం కనిపించింది. పట్టలేని ఆనందంలో ఉన్నప్రజలు సంప్రదాయ నృత్యాలు, ఆటపాటలతో ఆనందంలో తేలియాడుతున్నారు. -
తప్పదు.. టైంకు రావాలి
♦ ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ ♦ పైలట్ ప్రాజెక్టుగా బషీరాబాద్ మండలం బషీరాబాద్ : ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులంతా టైంకు ఆఫీసుకు రావాల్సిందే. సాయంత్రం ఇంటికి సైతం పనిగంటలు ముగిశాకే వెళ్లాలి. ఉద్యోగులు సమయపాలన పాటించేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విధులు నిర్వహించనున్నారు. జిల్లాలో మొదటిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని నిర్ణయించిన అధికారులు పెలైట్ ప్రాజెక్టుగా బషీరాబాద్ మండలాన్ని ఎంపిక చేశారు. -
యాప్ కాఫీ
రోజూ ఉదయాన్నే ఒకే టైమ్‌కు నిద్ర లేవాలంటే ఏం చేస్తాం.. అలారంలో టైమ్ సెట్ చేసి పెట్టుకుంటాం. మరి రోజూ అదే టైమ్‌కి చేతిలోకి కాఫీ రావాలంటే..? అలాగే కాఫీ పెట్టుకోవాల్సిన టైమ్‌లో మీరు ఎక్కడో బయట ఉన్నా సరే.. ఇంటికొచ్చే సరికి కాఫీ రెడీగా ఉండాలంటే..? ఇదెలా సాధ్యం అనుకునేవారికి.. పెద్ద షాక్ ఇచ్చేందుకే వచ్చాడు ‘మిస్టర్ కాఫీ’.. దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ టెక్నాలజీతో తయారు చేశారు. ఈ మిస్టర్ కాఫీ పనితీరు గురించి వింటే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. మీ ఫోన్లో వైఫై ఉంటే చాలు. ఆఫీస్, సినిమా థియేటర్.. ఇలా ఎక్కడున్నా ఇంటికెళ్లే ఏడు నిమిషాల ముందు మీ ఫోన్లో ఒక్క బటన్ నొక్కితే చాలు.. ఇంట్లో కాఫీ రెడీ అయిపోతుంది. ఇంకేముంది వెళ్లగానే వేడి వేడి కాఫీని లాగించేయొచ్చు. అంతేకాదు.. ఇంట్లో ఉండి కూడా ఒక్కోసారి కాఫీ పెట్టుకోవాలంటే బద్దకిస్తుంటాం. కానీ ఈ మిస్టర్ కాఫీకి ఒక్కసారి టైమ్ సెట్ చేస్తే చాలు.. వారం రోజులపాటు అదే టైమ్‌కు కాఫీ ఆటోమెటిక్‌గా రెడీ అయిపోతుంది. -
భారత మార్కెట్ లోకి పెబెల్
నాలుగు మోడళ్ల ఆవిష్కరణ అమెజాన్‌తో జట్టు న్యూఢిల్లీ: స్మార్ట్‌వాచ్‌ల తయారీ సంస్థ పెబెల్ దేశీ వేరబుల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. సంస్థ తాజాగా నాలుగు స్మార్ట్‌వాచ్ మోడళ్లను మార్కెట్లో ఆవిష్కరించింది. క్లాసిక్, టైమ్, టైమ్ స్టీల్, టైమ్ రౌండ్ అనే వీటి ధరలు రూ.5,999-రూ.15,999 శ్రేణిలో ఉన్నాయి. వీటి విక్రయాల కోసం సంస్థ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కొత్త స్మార్ట్‌వాచ్‌లు ఆండ్రాయిడ్, ఐఫోన్ స్మార్ట్ఫోన్లలో పనిచేస్తాయని సంస్థ తెలిపింది. -
డిన్నర్ సమయంలో ఒకే..!
స్మార్ట్ ఫోన్ల ఒరవడి పెరిగిన తర్వాత ప్రతి విషయం జనాన్ని భయపెడుతున్నాయి. ఫోన్ ఎక్కువగా మాట్లాడితే క్యాన్సర్లు వస్తాయని, బుద్ధిమాంద్యం సంక్రమిస్తుందంటూ కొందరు వైద్య పరమైన సమస్యలను వెల్లడిస్తుంటే... మరి కొందరు ఫోన్ మాట్లాడేందుకు, టెక్ట్స్ సంభాషణలకు కొన్ని సమయాలు మాత్రమే అనుకూలం అని చెప్తుంటారు. అయితే ఫోన్ సంభాషణలకు, టెక్స్ ఛాటింగ్ కు రాత్రి భోజన సమయం మంచిదేనంటున్నారు తాజా అధ్యయనకారులు. రాత్రి భోజన సమయంలో ఫోన్ మాట్లాడ్డం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవని పరిశోధకులు చెప్తున్నారు. బంధువులు, చుట్టాలనుంచి కాల్స్ వచ్చినా, సామాజిక మాధ్యమాల్లో ఛాటింగ్ చేసినా ఎటువంటి సమస్యలు ఉండవని చెప్తున్నారు. ముఖ్యంగా భోజనం చేస్తుండగా ఫోన్ వాడకం మంచిది కాదనే విషయంపై పరిశోధనలు నిర్వహించిన మిచిగన్ యూనివర్శిటీ పరిశోధక విద్యార్థి మోసర్.. భోజనం చేస్తూ కాండీక్రష్ వంటి గేమ్స్ ఆడటం, ఫేస్ బుక్ లో వచ్చిన వీడియోలు చూడటం వంటివి భిన్నమైనా... ఛాటింగ్, కాల్స్ వంటివి సమస్యలు తెస్తాయన్నది బూటకం అని తేల్చి చెప్పారు. ప్రపంచంలో ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లోని సుమారు 8 నుంచి 88 ఏళ్ళ మధ్య వయసున్న 1,163 మంది పై పరిశోధనలు నిర్వహించారు. భోజన సమయంలో మొబైల్ వాడేవారి ఆలోచనలపై సర్వే నిర్వహించారు. వారు పనిచేసే రంగాన్నిబట్టి వారి ఆలోచనా విధానం ఆధారపడి ఉండటాన్ని గమనించారు. సామాజిక మాధ్యమాలను వినియోగించడంలో ఎక్కువ సమయం పట్టొచ్చని, భోజన సమయంలో మెసేజింగ్, ఫోన్ కాల్స్ చేయడంవల్ల పెద్దగా నష్టం ఉండదని తేల్చి చెప్పారు. చిన్నపిల్లలు ఎక్కువగా వారి మిత్రులతో సంభాషిస్తుంటారని, అదీ పగటి సమయంలోనే ఎక్కువగా ఉంటుందని సర్వేల్లో గమనించిన అధ్యయనకారులు... ముఖ్యంగా రాత్రి భోజన సమయంలో మధ్య వయస్కులే ఎక్కువగా ఫోన్ వినియోగిస్తున్నట్లు గమనించారు. దీంతో వారికి పెద్దగా నష్టం కలగదని తెలుసుకున్నారు. సాధారణంగా భోజన సమయంలో వార్తా పత్రికలు, పుస్తకాలు చదవడం, టీవీలు చూడటం పై ఎన్నో ఏళ్ళక్రితమే పరిశోధనలు జరిగాయని, ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ల ట్రెండ్ కొత్త సవాలుగా మారిందని సహ పరిశోధకురాలు, ప్రొఫెసర్ సరితా ఛోయెనెబెక్ తెలిపారు. ఫోన్ వాడే సమయంలో అర్జెంట్ కాల్స్ ను, మెయిల్స్ ను కూడ పట్టించుకుంటారో లేదో చెప్పలేమన్నారు. అయితే స్మార్ట్ ఫోన్ అభివృద్ధి పరిచేవారు మాత్రం పరికరాల్లో మరింత విజిబులిటీ పెంచాలని పరిశోధకులు సూచిస్తున్నారు. -
మోదీని అధిగమించిన ప్రియాంకా చోప్రా
న్యూయార్క్ః బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరైన ప్రియాంకా చోప్రా ఆన్ లైన్ పోల్ లో ప్రధాని మోదీని దాటేశారు. టైమ్ మ్యాగజిన్ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో ఒక శాతం అధిక ఓట్లను సాధించి భారత్ ప్రధానినే మించిపోయారు. ప్రపంచంలోని వందమంది మోస్ట్ ఎఫెక్టివ్ పర్సన్స్ ను ప్రచురించే టైమ్స్ పత్రిక నిర్వహించిన పోల్ లో ప్రధాని మోదీకంటే ముందంజలో ఉన్నారు. టైమ్స్ మ్యాగజిన్ ప్రతి సంవత్సరం ఆన్ లైన్ పోల్ నిర్వహిస్తుంటుంది. ఇదే నేపథ్యంలో ఈసారి నిర్వహించిన పోల్ లో ప్రభావవంతమైన ప్రముఖులు వందమందిలో ప్రియాంకా చోప్రా భారత ప్రధాని మోదీని మించిపోయారు. దీంతోపాటు డెమొక్రెటిక్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి బెర్నీ శాండర్స్ కూడ ఈసారి ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ తో పాటు అధ్యక్షుడు బారాక్ ఒబామా, మయన్మార్ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీతో పాటు పాకిస్తాన్ కార్యకర్త మలాలాను కూడ మూడు రెట్ల ఓట్లతో అధిగమించినట్లు టైమ్స్ తెలిపింది. అత్యంత ప్రభావవంతమైన వందమంది వ్యక్తుల జాబితాకోసం మ్యాగజిన్ ఏప్రిల్ 13 బుధవారం రాత్రి ఆన్ లైన్ పోల్ నిర్వహించింది. ఏప్రిల్ 21న దీనికి సంబంధించిన జాబితా వెలువడనుంది. అయితే అమెరికాలో ప్రసిద్ధి చెందిన టీవీ సీరియల్ 'క్యాంటికోగా' లో నటించి తన పాత్రతో మెప్పించిన ప్రియాంకా చోప్రా మోదీకి వచ్చిన 0.7 ఓట్ల కంటే ఒక శాతం అధికంగా 0.8 ఓట్లను పొంది ముందు వరుసలో నిలిచింది. అలాగే 1 శాతం ఓట్లను పొందిన క్లింటన్ కన్నా శాండర్స్ 3.3 శాతం అధిక ఓట్లను సాధించారు. ఇకపోతే శాండర్స్ తర్వాత సౌత్ కొరియన్ బాయ్ బ్యాండ్ బిగ్ బ్యాంగ్ రెండో స్థానంలో నిలవగా అత్యధిక వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి ప్రజల దృష్టిలో ముందు కనిపిస్తున్న ట్రంప్ మాత్రం 0.6 శాతం ఓట్ల ను సాధించి ఆన్ లైన్ పోల్‌లో పూర్తిగా వెనుకబడ్డారు. -
మహిళలకు ప్రత్యేక అవకాశం!
న్యూఢిల్లీ: మహిళలకు ఎంఫిల్, పీహెచ్ డీ చేసేందుకు ఎక్కువ సమయం ఇవ్వాలంటూ గతవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేసిన సిఫార్సులపై యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజిసి) స్పందించింది. మహిళలకు, వికలాంగ అభ్యర్థులకు కొంత అధిక సమయాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది. మహిళలతోపాటు... 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు ఎంఫిల్ పేపర్లు పూర్తి చేసేందుకు ఓ సంవత్సరం అదనంగానూ, అలాగే పీహెచ్ డీ థీసిస్ సమర్పించేందుకు రెండేళ్ళు ఎక్కువ సమయం వినియోగించుకునేందుకు యూజీసీ ప్రత్యేక అవకాశం కల్పించింది. అంతేకాక ఈ రెండు డిగ్రీలు పూర్తి చేసే సమయంలో మహిళలందరూ మెటర్నిటీ, ఛైల్డ్ కేర్ సెలవును 240 రోజులపాటు వినియోగించుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. అలాగే వికలాంగులు, మహిళలు వారి అధ్యయనం సమయంలో వివాహం లేదా కుటుంబ సంబంధిత కారణాలతో తమ పరిశోధనా డేటాను నిబంధనల ప్రకారం బదిలీ చేసుకొనే అవకాశాన్ని కూడా కల్పించింది. మరో ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా యూజీసీ తీసుకుంది. జూలై 11, 2009 ఎంఫిల్, పీహెచ్ డీ ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులకు డిగ్రీలను అందించే విషయంలోనూ, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా తత్సమానమైన పోస్టుల నియామకాల విషయంలోనూ.. ప్రత్యేక అవకాశాలను కల్పించింది. షరతులకు లోబడి నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (NET) విషయంలోనూ మినహాయింపును ఇచ్చింది. అలాగే రెగ్యులర్ రీతిలో పీహెచ్ డీ చేసే స్కాలర్ల థీసిస్ ను కనీసం ఇద్దరు ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్స్ పరిశీలించి వుండాలి. ఓపెన్ పీహెచ్డీ లో అభ్యర్థులు తమ పరిశోధనా పత్రాలను కనీసం రెండు గుర్తింపు పొందిన జర్నల్స్ లో ప్రచురించి ఉండాలని, దీనికితోడు పీహెచ్డీ పనికి ఆధారంగా కనీసం రెండు సమావేశాలు, సెమినార్ల లో తమ అధ్యయనాలను సమర్పించి ఉండాలని చెప్పారు. -
నీరు ఎంత కావాలో ఈ బాటిల్ చెప్తుంది
-
సౌదీ చరిత్రలో ఇదే మొదటిసారి...
సౌదీ అరేబియా చరిత్రలోనే మొట్టమొదటిసారి మహిళలకు ఓటు హక్కు కల్పించడంతోపాటు, పోటీకి అనుమతించారు. దీంతో ఈ ఎన్నికల్లో మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో మహిళలకు ఓటు హక్కును చివరిగా కల్పించిన దేశాల్లో ఒకటిగా సౌదీ నిలిచింది. ప్రస్తుతం మొత్తం 284 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికలకు బరిలో 5,938 పురుషులతోపాటు.. 978 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. అయితే కనీసం మహిళలు ఒంటరిగా కారు కూడా నడపకూడదన్న నిబంధనలు ఉన్న ఈ దేశంలో... ఎన్నికల వేళ కొన్ని షరతులను సడలించి కారులో పోలింగ్ కేంద్రాలకు వెళ్ళే అవకాశాన్ని కల్పించారు. సంప్రదాయాలకు పెట్టింది పేరుగా ఉన్న ఈ దేశంలో ప్రస్తుత ఎన్నికలు మహిళా హక్కులకు ఓ ప్రత్యేక మైలు రాయిగా నిలిచాయి. అయితే ఎన్నికల ప్రచారానికి వెళ్ళే స్త్రీలు ఒంటరిగా వెళ్ళే అవకాశం లేదు. ప్రచార సమయంలో ఓ పురుషుడి ప్రాతినిధ్యంలో కేవలం తెర వెనుక ఉండి మాత్రమే మహిళా అభ్యర్థులు ప్రచారం చేసే అవకాశం కల్పించారు. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించిన ఈ శుభ సందర్భంలోనూ... పురుష ఓటర్ల రిజిస్ట్రేషన్లు 1.35 మిలియన్లకు దాటి ఉండగా... కేవలం లక్షా 30 వేల మంది మహిళలు మాత్రమే ఓట్లు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో సాల్మా అల్ రషిద్ తొలి ఓటును రిజిస్టర్ చేసుకున్న మహిళగా గుర్తింపు పొందారు. ఇది నిజంగా మంచి మార్పు అని, మహిళా ప్రాతినిధ్యం నిర్థారించుకోడానికి ఇదో మంచి మార్గమని ఆమె అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం మున్సిపల్ కౌన్సిల్ కు జరుగుతున్న ఎన్నికల్లో అధికారాలు తక్కువే అయినా మహిళలకు మాత్రం ఇదో మైలురాయి అని ఆమె వ్యాఖ్యానించారు. కాగా ఈ సంప్రదాయ సమాజానికి అనుగుణంగా స్త్రీలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓ ప్రత్యేక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. అసలు సౌదీ రాజ్యంలో ఎన్నికలు జరగడమే అరుదుగా ఉంటుంది. ఇప్పడు జరిగిన ఈ ఎన్నికలతో కలిపి చరిత్రలో ఇక్కడ మొత్తం మూడుసార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయి. నలభై ఏళ్ళ పాటు (1965 నుంచి 2005 వరకు) ఇక్కడ ఎన్నికలే నిర్వహించలేదు. కాగా మాజీ రాజు అబ్దుల్లా నిర్ణయం ఇప్పటి ఈ ఎన్నికలకు దారి తీసింది. ఇక్కడి మహిళలు కూడా ఎన్నికల్లో పాల్గొనాలన్నది ఆయన ఆశయం. కింగ్ అబ్దుల్లా సంస్కరణలు ప్రకటించడంలో భాగంగా సౌదీ మహిళలు మంచి స్థానాల్లో ఉంటే సరైన అభిప్రాయాలను, సలహాలను వ్యక్తం చేయగలరని అప్పట్లో ఆయన అభిప్రాయపడ్డారు. తర్వాత జనవరిలో ఆయన మరణించే ముందు దేశంలోని ప్రధాన అడ్వైజరీ కౌన్సిల్.. షౌరాలో 30 మంది మహిళలను నియమించారు కూడా. ఇప్పడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 2,100 కౌన్సిల్ సీట్లు అందుబాటులో ఉండగా.. మిగిలిన 1,050 సీట్లకు రాజు అనుమతితో నియమిస్తారు. కాగా శనివారం తర్వాత ఎప్పుడైనా ఎన్నికల ఫలితాలు తెలిసే అవకాశం ఉంది. -
షాకిచ్చి లేపుతుంది!
భలే బుర్ర అలారం కేకేస్తుంది గానీ, షాకిస్తుందేంటి అనుకుంటున్నారా? సాధారణంగా అలారం సెట్ చేసుకున్న టైముకి ఓ కేక వేసి మనల్ని నిద్ర లేపుతుంది. కుంభకర్ణుడి కజిన్ బ్రదర్స అయితే ఆ కేకకి లేవరు. దాంతో అది కేక మీద కేక వేసి విసిగిస్తూనే ఉంటుంది. అయినా లేవాలనిపించలేదో... స్నూజ్ బటన్ మీద ఒక నొక్కు నొక్కితే అది చప్పున నోరు మూసేస్తుంది. మనం మళ్లీ నిద్రను కంటిన్యూ చేసేయొచ్చు. కానీ పంతొమ్మిదేళ్ల సంకల్ప్సిన్హా తయారు చేసిన అలారం దగ్గర ఈ పప్పులేమీ ఉడకవు. యూపీలోని శారదా వర్సిటీలో ఆటో మొబైల్ ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువు తోన్న సంకల్ప్... ఓ అలారం తయారు చేశాడు. అది మహా మొండిఘటం. నిద్రపోయే ముందు మనం సెట్ చేసుకున్న టైముకి అది ఠంచనుగా కేక వేస్తుంది. కేక అంటే మరీ కర్ణకఠోరమైన కేకేం కాదులెండి. కొంచెం ఆహ్లాదభరితమైన కేకే! శ్రావ్యంగా ‘గుడ్ మార్నింగ్’ అనే పాటతో మనల్ని లేపాలని ప్రయత్నం చేస్తుంది. లేచామో సరే సరి. లేవకుండా దాని నోరు నొక్కాలని ప్రయత్నిస్తే మాత్రం అది మనకు ఓ పెద్ద జర్‌క ఇస్తుంది. ఎలా అనేగా? దాన్ని ఆపడానికి మనం స్నూజ్ బటన్ మీద చేయి వేయగానే... చిన్న షాక్ ఇస్తుంది. ఆ దెబ్బకు ఎంత మొద్దునిద్ర ముంచు కొస్తున్నా, ఉలిక్కిపడి లేవాల్సిందే. ఇందులో ఇంకో వెరైటీ సౌకర్యం కూడా ఉంది. మనకు ఎంత మోతాదులో షాక్ కావాలనుకుంటున్నామో ముందే సెట్ చేసి పెట్టుకోవచ్చు. చిన్న షాక్‌కి లేచే వాళ్లమైతే తక్కువ, మరీ మొద్దు నిద్రపోయే వాళ్లమైతే ఎక్కువ మోతాదును ఎంచు కోవాలి. గరిష్టస్థాయి షాక్ సెట్ చేసుకున్నా కూడా ఏం నష్టం లేదు. ఎందుకంటే, మనిషి శరీరానికి ఎటువంటి హానీ కలగని మేరకే ఇది షాక్ కొడుతుంది. ఆ విధంగానే దీన్ని రూపొందించానని చెబుతున్నాడు రూపకర్త సంకల్ప్. -
తృటిలో!
‘తృటిలో తప్పిన ప్రమాదం’ అనే మాటను తరచుగా వింటుంటాం, వాడుతుంటాం. ‘అతి తక్కువ సమయం’ అనేదానికి సూచనప్రాయంగా ‘తృటి’ని వాడుతుంటారు. ఏమిటీ తృటి? తామర తూడును తెంచడానికి పట్టే కాలాన్ని ‘తృటి’ అంటారు. తామర తూడు తెంచడానికి ఎంతో సమయం పట్టదు. అంత తక్కువ సమయంలో జరిగింది కాబట్టి తృటిలో అన్నమాట వాడతాం! (రెండు పరమాణువులు ఒక అణువు. మూడు అణువులు ఒక త్రసరేణువు. మూడు త్రసరేణువులు ఒక త్రుటి. దాన్నిబట్టి తృటికి అర్థం అత్యంత తక్కువ కాలం అని కూడా చెబుతుంటారు.) -
రూటర్...
మెట్రో కథలు ఏంట్రా... ఏంటి? ఏమంటావ్? నే వెళుతున్నా. వెళ్తావా? ఇక నాకు కాల్ చేయకు. రిస్క్‌లో పడేశావ్. దేవుడా.. రేయ్... పరిగెత్తి బైక్ సపోర్టింగ్ రాడ్ పట్టుకుంది. వదులు. నన్నేం చేయమంటావ్? నన్నడిగితే? విదిలించుకుని వెళ్లిపోయాడు. రొప్పుతూ ఏడుపొస్తున్నట్టుగా అవుతూ ఏం తోచనట్టుగా దిక్కులు చూస్తూ బస్టాప్‌లో కూలబడింది. రూట్ బస్సులు తిరగడానికి ఇంకా టైమ్ ఉంది. ఈలోపు వాడు కాల్ చేస్తే? ఇప్పుడు కావాలి రా అంటే? ఎందుకైనా మంచిదని సెల్ ఆఫ్ చేసింది. చేశాక దానివైపు చూసుకుంది. దరిద్రం. అంతా దీని వల్లే వచ్చింది. ఏంటమ్మా... ఏదైనా ప్రాబ్లమా? అబ్బే... ఏం లేదండీ... తెలిసిన అబ్బాయే. ఏంటో... ఈ కాలం పిల్లలు... బస్సొస్తే ఎక్కి వెళ్లిపోయింది. ఇప్పుడు బస్టాప్‌లో ఎవరూ లేరు. మధ్యాహ్నం మూడంటే పెద్దగా ఎవరూ ఉండే టైమ్ కాదది. సాయంత్రం దాకా క్లాసులున్నాయి. మాట్లాడాలని బైక్ ఎక్కి తీసుకు వచ్చింది. తీరా సంగతి చెప్పాక పారిపోయాడు. వెధవ. ఇప్పుడు ఎవడు కాపాడతాడు? ఎదురుగా పెద్ద బిల్డింగ్ మీద చాలా పెద్ద హోర్డింగ్ కనిపిస్తూ ఉంది. రూ.599కి ఒక ప్యాకేజ్ అట. రూ.999కి ఇంకో ప్యాకేజ్ అట. రూ.1199 కడితే ఇక తిరుగే లేదట. ఏమైనా చేసుకోవచ్చట. మొదట తమ్ముడు మొదలెట్టాడు. తర్వాత తను వెంటపడింది. హాల్లో అందరికీ కనిపించేలా ఉన్న కంప్యూటర్‌కి నెలకు ఆరు వందల ప్యాకేజీలో ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చింది. కొత్తల్లో అంతా బాగుంది. మెయిల్స్ చూసుకునేవారు. యూ ట్యూబ్‌లో సినిమాలు చూసుకునేవారు. చదవుకోవడానికి మెటీరియల్- తమ్ముడికి ఇంటర్ సంగతేమోగాని తనకు బి.టెక్కు చాలా అవసరమే పడింది. నాన్నకు ఫేస్బుక్ పరిచయం చేశారు. అమ్మ ఫస్ట్‌టైమ్ ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇద్దరు పిల్లల పేర్లను కలిపి పాస్‌వర్డ్‌గా పెట్టుకుంది. ఇరుగూ పొరుగూ ఫ్లాట్స్ వారికి కూడా సంతోషమే. ఇల్లంటే ఏమిటి? టూ బెడ్రూమ్స్, కిచెన్, స్విఫ్ట్ కారు, కంప్యూటర్, ఇంటర్నెట్.... కాని కాదని కాలక్రమంలో తేలింది. స్మార్ట్‌ఫోన్స్ లేకపోవడం వల్ల వచ్చిన పెద్ద వెలితి అది. తండ్రి మరీ అంత స్పీడ్ మీద ఉండే మనిషి కాదు. అలాగని ప్రతిదాన్నీ నిరోధించేవాడూ కాదు. లోటు చేయకుండా ఇంట్లో ఉన్న నలుగురికీ రెండు మూడు వేలు పెట్టి నోకియాలు తీసుకున్నాడు. బయట, ఆఫీసులో రింగ్ వస్తే జేబులో నుంచి దానిని బయటకు తీస్తే అందరూ చిత్రంగా చూడటం ఇబ్బందిగా ఉన్నా పిల్లలు దానిని భరించలేకపోతున్నారని త్వరగానే అర్థం చేసుకున్నాడు. మరీ పదిహేనువేలూ పద్దెనిమిదివేలూ పెట్టి సామ్‌సంగ్‌లు సోనీలు కాదు వేరేవి ఆలోచించండి అంటే ఆరేడు వేలకు బ్రహ్మాండమైన చైనా ఫోన్లు వచ్చాయి. కావల్సిందేమిటి? ఫేస్బుక్, వాట్సప్. అవి బాగా పని చేస్తాయి. కొత్తల్లో పిల్లలిద్దరికీ చెరి నూటేభై రూపాయలు శాంక్షన్ చేశాడు ఇంటర్నెట్ డేటా కోసం. అది ఏ మూలకు? నలుగురితో చాట్ చేస్తే నాలుగు డౌన్లోడ్లు చేస్తే చిటికెలో బేలెన్స్ అయిపోయేది. మళ్లీ డబ్బులడగాలంటే లేని కుటుంబం కాదుగాని కలిగిన కుటుంబం కూడా కాదు. పెద్ద ఇబ్బందే. రూటర్ పెట్టించండి నాన్నా అంది ఒకరోజు. మంచి విరుగుడు. వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి తెప్పిస్తే ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ మీద ఇంట్లో అందరికి వైఫై వస్తుంది. అందరి ఫోన్లూ హ్యాపీగా పని చేస్తాయి. అన్‌లిమిటెడ్‌గా నెట్ వాడుకోవచ్చు. అన్నింటికంటే మంచి విషయం ఏమిటంటే ఇంతకు ముందులా హాల్లో కూచుని ఏం చేస్తున్నా నలుగురికీ తెలిసిలా చేసే బాధ తప్పడం. ఆడపిల్ల అని ఒక బెడ్ రూమ్ ఇచ్చారు. వాడు గొడవకు దిగితే డైనింగ్ ఏరియాను ఖాళీ చేసి ప్లైవుడ్ కొట్టి వాడికో గదిలాంటిది తయారు చేశారు. సరే వీళ్లకూ మాస్టర్ బెడ్రూమ్ ఎలాగూ ఉంది. ఇప్పుడు ఇరుగూ పొరుగూ వాళ్లు నిజంగా సంతోషించారు. నలుగురి చేతుల్లో నాలుగు స్మార్ట్ఫోన్లు. నలుగురూ ఇంట్లో ఉంటారు. నలుగురూ ఫోన్లో ఉంటారు. ఇంతకు మించి ఏం కావాలి? మొదట రణ్‌బీర్ కపూర్‌ని ఇష్టపడే క్లాస్మేట్స్ అంతా వాట్సప్‌లో ఒక గ్రూప్ అయ్యారు. ఎక్కువగా అమ్మాయిల గ్రూపే. కాని అబ్బాయిలు దూరకుండా ఉంటారా? ఆ తర్వాత ఒన్ టు ఒన్ చాటింగ్ మొదలయ్యింది. తొమ్మిదికల్లా పుల్కాలు తిని పాలు తాగి ఒక ఆపిలో కాసిని అనాసముక్కలో తీసుకుని గదిలో దూరితే అమ్ములు చదువుకుంటోందని ఒకటే మురిపెం. కాని తలుపు గట్టిగా బిడాయించుకుని మూడ్ కోసం బెడ్‌లైట్ వేసుకుని ఆ నీలి వెలుతురులో గుట్టు చప్పుడు కాకుండా స్క్రీన్ మీద అక్షరాలను బ్లింక్ చేస్తూ పోతూ ఉంటే గంటలు గంటలు... డబ్బులవుతాయన్న బాధే లేదు. రూటర్ ఉందిగా. ఒకరోజు మాట మారింది. ఒక దారి నుంచి ఇంకో దారిలోకి మళ్లింది. బాగా నిద్ర పట్టి తెల్లారి ఆలస్యంగా నిద్ర లేచింది. కాలేజ్ చేరుకున్నాక క్లాసుల హడావిడిలో ఫోన్ ఎప్పుడు తీసుకున్నాడో చాటింగ్ ఎప్పుడు చూశాడో ఎప్పుడు మెయిల్ చేసుకున్నాడో తెలియదు. చాట్ చేసినవాడు ఫ్రెండే. దానిని కాపీ చేసుకున్నవాడూ ఫ్రెండే. చాట్ హిస్టరీని డిలీట్ చేయకపోవడం వల్ల దొరికిపోయింది. ఒక బెడ్ మీద లేరన్నమాటేగానీ తక్కినవన్ని జరిగాయిగా అన్నాడు మరుసటి రోజు నవ్వుతూ. హాస్యం అనుకుంది. కాదు. మెయిల్లో ఉన్నదంతా చూపించాడు. వాడు సరే... నువ్వు మరీ రెచ్చిపోయావుగా. పాదాలు చల్లగా అయిపోయాయి. గ్రూప్‌లో షేర్ చేస్తా. లేదంటే మీ నాన్నకు మెయిల్ చేస్తా. వాడి బాబుకు కూడా. కలో క్రైమ్ సినిమాయో అయితే బాగుండనిపించింది. కాని కాదు. నేను చాటింగ్‌కే చొంగ కార్చుకునే బ్యాచ్ కాదు. అసలుది కావాలి. కాల్ చేస్తా. వెళ్లిపోయాడు. కాసేపు ఏమీ అర్థం కాలేదు. గొంతు పట్టేసినట్టుగా అనిపించింది. మాటిమాటికి దప్పికేస్తున్నట్టుగా అనిపించింది. ఇదంతా ఈ క్షణంలో అబద్ధం అయిపోవాలని అనిపించింది. కాని కాదు. నిజమే. ఎదుర్కోవాలి. కూడగట్టుకుని ధైర్యం తెచ్చుకుని క్లాస్‌లో నుంచి అర్జెంట్‌గా లేవదీసి బయటకు తీసుకొచ్చి విషయం చెప్తే తన కంటే ఎక్కువగా బెంబేలు పడిపోయాడు. ఎలా... ఎలా? చాట్ చేసేటప్పుడు ఉండాలి ఈ భయం. ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. ఇద్దరూ ఉదయం లేస్తే అమ్మా నాన్నా అని చక్కగా కనిపించే పిల్లలే. పెద్దవాళ్లను విష్ చేయడం... అంకుల్ ఆంటీ అంటూ మర్యాద ఇవ్వడం... కాలేజ్‌లో కూడా మంచి పేరే ఉంది. కాని ఆ సమయంలో ఆ క్షణంలో ఏం మాట్లాడుకున్నారో తెలిస్తే అదంతా ఏం కాను? నాన్న బతుకుతాడా? తను బతుకుతుందా? పోనీ పోలీసులకు చెప్తే? హు. అదంతా చదివి ముఖాన ఊయరూ? మంచి ర్యాంక్ తెచ్చుకుని మంచి బ్రాంచ్‌లో చేరిందే... ఇప్పుడు చదువు మాన్పిస్తారా? తన్ని మూలన కూచోబెడతారా? మాటల్లో దించినవాడు పారిపోయాడు. తను మాత్రం అసలుది ఇవ్వాలట. ఇచ్చి? ఒకసారితో ఆగుతుందా... ఒకరితో ఆగుతుందా? కణతల దగ్గర నొప్పి. మెల్లగా మొదలై పెద్దగా అవుతూ. ఆత్మహత్య చాలా సులువైన పరిష్కారం అనిపించింది. అవును. అదే సరైన పరిష్కారం. తిరిగి కాలేజ్‌కు వెళ్లి లైబ్రరీ బిల్డింగ్ ఎక్కి పై నుంచి దూకేస్తే చాలు. ఈ బాధలన్నింటి నుంచి బయటపడిపోవచ్చు. నిర్ణయం తీసుకున్నాక రిలీఫ్‌గా అనిపించింది. కాని ఒక్క నిమిషమే. మళ్లీ భయం వేసింది. పోనీ ఒక్క తప్పే కదా. ఇంటికెళ్లి చెప్పేస్తే అమ్మా నాన్నా అయ్యో... అమ్ములూ అని కడుపులో పెట్టుకోరూ? జరగాల్సింది చూడరూ? కాని ధైర్యంగా ఎలా చెప్పడం. పాడు పని చేసిందే. పిడికిట్లో సెల్ నలుపుతూ కూచుని ఉంది. ఇంటికా? కాలేజ్కా? నెమ్మదిగా రూట్ బస్సులు మొదలవుతూ ఉన్నాయి. చూసింది. కాలేజ్‌కు తీసుకెళ్లే బస్సు ఇంటి మీదుగా వెళ్లే బస్సు ఒకదానికి ఒకటి తోకలా అంటుకుని వస్తూ ఉన్నాయి. లేచి నిలబడింది. - మహమ్మద్ ఖదీర్‌బాబు -
నమాజ్ వేళలు, సోమవారం 24, 2015
ఫజర్ : 4.46 జొహర్ : 12.19 అస్ : 4.45 మగ్రిబ్ : 6.36 ఇషా : 7.51 -
నమాజ్ వేళలు, శనివారం 22, 2015
ఫజర్ : 4.46 జొహర్ : 12.19 అస్ : 4.46 మగ్రిబ్ : 6.38 ఇషా : 7.52 -
నమాజ్ వేళలు, గురువారం 20, 2015
ఫజర్ : 4.45 జొహర్ : 12.20 అస్ : 4.47 మగ్రిబ్ : 6.39 ఇషా : 7.54 -
ఇచట కాలం అమ్మబడును!
‘టైమ్ ఎంతైంది?’’ అని అడిగితే- ‘‘డబ్బు ఇవ్వండి చెబుతాను’’ అని ఎవరైనా సమాధానం ఇస్తే విచిత్రంగా చూస్తాం. విచిత్రమైన విషయం ఏమిటంటే కాలాన్ని అమ్ముకున్న కాలం ఒకటి చరిత్రలో ఉంది. 1836లో జాన్ హెన్రీ విల్లీ అనే ఖగోళవేత్త గ్రీన్విచ్(ఇంగ్లండ్)లోని ఒక అబ్సర్వేటరీలో పనిచేసేవాడు. అప్పట్లో చేతి వాచ్‌లు, గోడ వాచ్‌లు లేవు కాబట్టి...‘టైమ్ ఎంతైంది?’ అనే విషయం తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉండేది. ఇలా ఆసక్తి ఉన్నవాళ్లంతా హెన్రీ విల్లీ ముందు క్యూ కట్టేవారు. అయితే వాళ్లు టైమ్ అడగ్గానే ఉచితంగా ఏంచెప్పేవాడు కాదు హెన్రీ. శుబ్బరంగా డబ్బులు వసూలు చేసేవాడు. టైమ్ తెలుసుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చేవాళ్లలో వార్షిక చందాదారులు కూడా ఉండేవాళ్లు. హెన్రీ విల్లీ టైమ్ చూసి చెప్పే ‘అబ్జర్వేటరీ క్లాక్’కి ‘అర్నాల్డ్’ అనే పేరు ఉండేది. 1856లో హెన్రీ విల్లీ చనిపోయిన తరువాత ఆయన భార్య మారియా భర్తలాగే టైమ్ చెప్పే వ్యాపారాన్ని చేపట్టింది. కూతురుతో కలిసి ఒక బండి మీద తిరుగుతూ డబ్బులకు టైమ్ చెప్పేది. ఆ తరువాత వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల టైమ్ అమ్ముకునే వ్యాపారానికి కాలం చెల్లింది. -
నమాజ్ వేళలు, బుధవారం 10, జూన్ 2015
ఫజర్ : 4.20 జొహర్ : 12.15 అస్ : 4.52 మగ్రిబ్ : 6.50 ఇషా : 8.11