
సాక్షి, హైదరాబాద్ : అవినీతికి, జాప్యానికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు జరిగేలా జూన్ నుంచి నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. రిజిస్ట్రేషన్లకు టైం స్లాట్ విధానాన్ని తీసుకువస్తున్నామని.. ఇరుపక్షాలు ఆ సమయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తే చాలని పేర్కొన్నారు. తొలుత ఐదు మండలాల్లో, అనంతరం 30 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా కొత్త విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త విధానంలోని లోటుపాట్లను గుర్తించి, పొరపాట్లకు ఆస్కారం లేకుండా మార్పులు చేర్పులు చేయాలని.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఇక ‘ధరణి’వెబ్‌సైట్ అందరికీ అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. బుధవారం రిజిస్ట్రేషన్ల అంశంపై ప్రగతి భవన్‌లో మంత్రులు తుమ్మల, జూపల్లి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, సీనియర్ అధికారులు, ఐఎల్‌ఎఫ్‌ఎస్ సర్వీసు ప్రొవైడర్ల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా నూతన రిజిస్ట్రేషన్ల విధానాన్ని ఖరారు చేశారు.
స్లాట్ ప్రకారం రిజిస్ట్రేషన్
భూములు విక్రయిస్తున్న వారు, కొంటున్న వారు ఒక్క సారి మాత్రమే రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తే సరిపోయేలా.. పాస్‌బుక్కులు, రిజిస్ట్రేషన్ కాగితాలు కొరియర్లో నేరుగా ఇంటికే వచ్చేలా నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని ఖరారు చేశారు. ‘‘భూమిని అమ్మేవారు, కొనేవారు ముందుగా సబ్ రిజిస్ట్రార్ అపాయింట్‌మెంట్ కోరాలి. వారికి స్లాట్ కేటాయిస్తారు. ఆ స్లాట్ ప్రకారం ఇచ్చిన తేదీ, సమయానికి ఇద్దరూ కార్యాలయానికి చేరుకోవాలి. తమ సేల్‌డీడ్‌ను, పాసు పుస్తకాలను సమర్పించాలి. సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తారు. అమ్మినవారి పాస్ బుక్కు నుంచి రిజిస్ట్రేషన్ జరిగిన భూమిని తీసేస్తారు. కొన్నవారి పాస్ పుస్తకంలో దానిని జమ చేస్తారు. కొత్తగా భూములు కొనేవారైతే కొత్త పాస్ పుస్తకంలో నమోదు చేస్తారు. అదే రోజు పాస్ పుస్తకాన్ని తహసీల్దార్‌కు పంపుతారు. ఎమ్మార్వో వెంటనే ఆ వివరాలను నమోదు చేసుకుని, సంతకం చేస్తారు. తర్వాత తహసీల్దార్ తన కార్యాలయంలోనే ఉండే ఐటీ అధికారికి ఈ వివరాలు అందచేస్తారు. ఐటీ అధికారి ఈ వివరాలను నమోదు చేసి, ధరణి వెబ్‌సైట్‌కు అప్‌లోడ్ చేస్తారు. అనంతరం సదరు పాస్ పుస్తకాన్ని తిరిగి సబ్ రిజిస్ట్రార్‌కు పంపుతారు. సబ్‌రిజిస్ట్రార్ ఎవరి పాస్ పుస్తకాన్ని వారికి, సేల్‌డీడ్‌ను భూమిని కొన్నవారికి కొరియర్ ద్వారా పంపుతారు..’’అని సమావేశంలో ముఖ్యమంత్రి వివరించారు.
అందరికీ అందుబాటులో భూముల డేటా
జూన్ నుంచి ప్రతీ మండలంలో రిజిస్ట్రేషన్లు జరగాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయని, అవి లేని 443 మండలాల్లో తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగిస్తున్నామని తెలిపారు. వారికి ఇప్పటికే ఒక దఫా శిక్షణ కూడా ఇచ్చామని, మరో విడత శిక్షణ ఇస్తామని చెప్పారు. భూరికార్డుల ప్రక్షాళన డేటాను ఉపయోగించి ‘ధరణి’వెబ్‌సైట్‌ను రూపొందించాలని, ప్రతీ మండల కేంద్రంలో ఉండే ఐటీæ అధికారి తన మండలంలో ఏ రోజు జరిగే మార్పులను అదే రోజు అప్‌డేట్ చేస్తారని తెలిపారు. ఇలా ధరణి వెబ్‌సైట్ నిరంతరం అప్‌డేట్ అవుతూనే ఉంటుందని.. అందులో భూములకు సంబంధించిన అన్ని వివరాలు అందరికీ అందుబాటులో ఉంటాయని చెప్పారు. దీంతో పూర్తి పారదర్శకత వస్తుందన్నారు.
మే 7 నుంచి పైలట్ ప్రాజెక్టు..
ధరణి వెబ్‌సైట్ నిర్వహణకు సంబంధించి మే 7వ తేదీ నుంచి ఐదు మండలాల్లో.. మే 19 నుంచి గ్రామీణ జిల్లాకొక మండలం చొప్పున 30 మండలాల్లో పైలట్ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఆయా చోట్ల ధరణి వెబ్‌సైట్ నిర్వహణలో వచ్చే ఇబ్బందులను అధ్యయనం చేసి, పరిష్కారాలను సిద్ధం చేస్తారు. ఈ మేరకు మార్పులు, చేర్పులతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల వివరాలతో ‘ధరణి’వెబ్‌సైట్‌ను నిర్వహిస్తారు. ఈ వెబ్‌సైట్ నిర్వహణ కోసం సర్వీసు ప్రొవైడర్లతో ఈ నెల 20న ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది.
మొదటి విడతలో ఐదు మండలాలు
మొదటి విడతలో మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్, సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్, రంగారెడ్డి జిల్లా కొత్తూరు, కామారెడ్డి జిల్లా సదాశివనగర్, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలాల్లో పైలట్ ప్రాజెక్టును చేపడతారు.
రెండో విడత మండలాలు..
రెండో విడతలో చేర్యాల (సిద్దిపేట), మానకొండూరు (కరీంనగర్), మేడిపల్లి (మేడ్చల్), నిర్మల్ రూరల్ (నిర్మల్), బాల్కొండ (నిజామాబాద్), ఎల్లారెడ్డి (కామారెడ్డి), ఆసిఫాబాద్ (ఆసిఫాబాద్), నెన్నెల(మంచిర్యాల), అంతర్గాం (పెద్దపల్లి), ఇల్లంతకుంట (సిరిసిల్ల), రాయికల్ (జగిత్యాల), రామచంద్రాపురం(సంగారెడ్డి), రామాయంపేట (మెదక్), మొగుళ్లపల్లి (భూపాలపల్లి), కేసముద్రం (మహబూబాబాద్), నర్సంపేట (వరంగల్ రూరల్), హసన్‌పర్తి (వరంగల్ అర్బన్), రఘునాథపల్లి (జనగామ), ముదిగొండ(ఖమ్మం), పాల్వంచ రూరల్ (కొత్తగూడెం), చివ్వెంల (సూర్యాపేట), కట్టంగూర్ (నల్లగొండ), తుర్కపల్లి(యాదాద్రి), బిజినేపల్లి (నాగర్‌కర్నూల్), పెబ్బేరు (వనపర్తి), ఐజ (గద్వాల), దేవరకద్ర (మహబూబ్‌నగర్), శేరిలింగంపల్లి (రంగారెడ్డి), నవాబ్‌పేట (వికారాబాద్), గుడిహత్నూర్ (ఆదిలాబాద్) మండలాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment